Saturday, September 21, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం

                                                              ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఇరవై ఒకటవ అధ్యాయం

శ్రీభగవానువాచ
య ఏతాన్మత్పథో హిత్వా భక్తిజ్ఞానక్రియాత్మకాన్
క్షుద్రాన్కామాంశ్చలైః ప్రాణైర్జుషన్తః సంసరన్తి తే

నేను చెప్పిన భక్తి జ్ఞ్యాన కర్మ యోగాలను విడిచిపెట్టి చెడు దారిలో నడిచేవారు క్షుద్రమైన కామములను అనుభవిస్తూ సంసారములో తిరుగుతూ ఉంటారు

స్వే స్వేऽధికారే యా నిష్ఠా స గుణః పరికీర్తితః
విపర్యయస్తు దోషః స్యాదుభయోరేష నిశ్చయః

తమ తమ అధికారములో, తమ వర్ణమూ ఆశ్రమూ గుణములో ప్రవర్తించుట గుణము. ప్రవర్తించనిచో దోషము. ఆయా శాస్త్రములలో ధర్మమును అనుష్ఠించగల నిష్ఠ కావాలి. శ్రద్ధా పూర్వకమైన ప్రవృత్తి కావాలి. ధర్మాన్ని ఆచరించలేని స్థితి వచ్చిందంటే, పెద్ద ధనం పోతే ఎంత బాధపడతారో అంత బాధపడడం నిష్ఠ. ధర్మములో ఉండడం గుణము. ధర్మం తప్పడం దోషము.

శుద్ధ్యశుద్ధీ విధీయేతే సమానేష్వపి వస్తుషు
ద్రవ్యస్య విచికిత్సార్థం గుణదోషౌ శుభాశుభౌ
ధర్మార్థం వ్యవహారార్థం యాత్రార్థమితి చానఘ

వస్తువులు ఒకే రకముగా ఉన్నా ఒకే వస్తువులో కూడా అవస్థను బట్టి శుద్ధీ అశుద్ధీ ఉంటుంది. పవిత్రమైన వస్తువు కూడా కొన్ని సందర్భాలలో అపవిత్రం అవుతుంది. కాబట్టి, ఒక ద్రవ్యం యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి, ఏది మంచి ద్రవ్యము ఏది చెడు ద్రవ్యమూ , ఏది శుద్ధమూ, ఏది కాదు, ఏది స్వీకరించవచ్చు, ఏది కాదు అని నిర్ణయించడానికి నేను గుణ దోషాలను వివరించాను.
ధర్మాన్ని ఆచరించడానికి, వ్యవహరించడానికి, బతుకు తెరువు కొనసాగించడానికి వివరించాను. తన వారినీ పోషించుకోవాలి, తననూ పోషించుకోవాలి, ప్రాణ ధారణా చేయాలి. అందుకోసం, బతుకు తెరువు కోసం మంచీ చెడూ వివరించాను.

దర్శితోऽయం మయాచారో
ధర్మముద్వహతాం ధురమ్

ధర్మాన్ని ఆచరించగలవారికోసం ఇది చెప్పాను
ఇవన్నీ ఆపదలో కాదు. ఆపద లేనప్పుడు మాత్రమే. తన ఇంటిలో ఉన్నప్పుడు తన ఆచారాన్ని పూర్తిగా పాటించాలి, అందులో అర్థము రాజ సభలో ఉన్నాపుడు, అందులో సగం శూద్ర గృహములో ఉన్నపుడు, ప్రయాణములో ఉన్నప్పుడు శూద్రులమే అనుకోవాలి. ఇంటికి వచ్చి యజ్ఞ్యోపవీతం మార్చుకుని, నాలుకను దర్భతో కాల్చుకుని గాయత్రీ జపం చేసుకుని ఆ పాపాన్ని తొలగించుకోవాలి. నాస్తికులతో హేతువులతో మాట్లాడినా దర్భలతో నాలుకను కాల్చి శుద్ధి చేసుకోవాలి.

భూమ్యమ్బ్వగ్న్యనిలాకాశా భూతానాం పఞ్చధాతవః
ఆబ్రహ్మస్థావరాదీనాం శారీరా ఆత్మసంయుతాః

పంచభూతాలు ప్రతీ చోటా ఉన్నాయి. బ్రహ్మ నుండీ స్తంభం వరకూ అన్ని శరీరాలూ ఆత్మతో కలిసే ఉంటాయి.

వేదేన నామరూపాణి విషమాణి సమేష్వపి
ధాతుషూద్ధవ కల్ప్యన్త ఏతేషాం స్వార్థసిద్ధయే

అన్నిటికీ నామరూపాలను వేదమే నిర్ణ్యైంచింధి. విషమములో అదే ఉంది, సమములో అదే ఉంది
వాటి వాటి నిర్వహణ సక్రమముగా జరుగడానికి ప్రతీ దానికి ఒక నామం చెప్పడం జరిగింది

దేశకాలాదిభావానాం వస్తూనాం మమ సత్తమ
గుణదోషౌ విధీయేతే నియమార్థం హి కర్మణామ్

గుణ దోషాలు ఉండడానికి కారణం కర్మల నియమం కోసం. కర్మను త్యగించిన వారికి అవి ఉండవు.

అకృష్ణసారో దేశానామబ్రహ్మణ్యోऽసుచిర్భవేత్
కృష్ణసారోऽప్యసౌవీర కీకటాసంస్కృతేరిణమ్

కొన్ని ప్రదేశాలు, నల్ల జింక లేని ప్రదేశము, బ్రాహ్మణులు లేని ప్రదేశం, బ్రాహ్మణుల యందు ప్రీతి కలవారు లేని ప్రదేశం అశుచి ఐనది. ఏ ప్రాంతములో నల్ల జింక తిరుగదో ఏ ప్రాంతములో వైదిక ధర్మ నిష్ఠను గౌరవించే వారు ఉండరో, బ్రాహ్మణుల యందు గౌరవం కలవారు ఉండరో అది అశుచి ఐన ప్రదేశం.
ఒక వేళ ఇవి అన్నీ ఉన్నా, సంస్కరించడానికి వీలు లేని చవట భూమి ఉన్న ప్రాంతములు శుచి కావు

కర్మణ్యో గుణవాన్కాలో ద్రవ్యతః స్వత ఏవ వా
యతో నివర్తతే కర్మ స దోషోऽకర్మకః స్మృతః

కొన్ని కాలమును ద్రవ్యమును బట్టి సహజముగా పవిత్రములు పరిశుద్ధములు. వాటికి వేరే దానితో పవిత్రత అవసరం లేదు. నదీ ప్రాంతం పర్వత ప్రాంతమూ తులసి చెట్టూ మారేడు చెట్టు అశ్వద్ధ వృక్షం , వేప రావి మర్రి జువ్వు మోదుక మేడి, ఇవి ఉన్న ప్రాంతములు ఎలాంటివైనా పవిత్రములు
ఏ ప్రాంతములో కర్మలు చేయడానికి వీలు ఉండదో , కర్మ చేస్తున్నా నివృత్తి చేయబడుతుందో అది కర్మను చేయడానికి, చేసిన కర్మ ఫలితం ఇవ్వడానికి కూడా పనికి రాదు.

ద్రవ్యస్య శుద్ధ్యశుద్ధీ చ ద్రవ్యేణ వచనేన చ
సంస్కారేణాథ కాలేన మహత్వాల్పతయాథ వా

ద్రవ్యము శుద్ధి ద్రవ్యమా అశుద్ధ ద్రవ్యమా అంటే, కొన్ని ద్రవ్యాన్ని బట్టి, కొన్ని వాక్కును బట్టి, పరిశుద్ధమైన ద్రవ్యం కూడా అపరిశుద్ధమైన మాటతో అపరిశుద్ధమవుతుంది.మంచి ద్రవ్యమైనా చెడు మాటతో అపవిత్రమవుతుంది.
దాని యొక్క సంస్కారాన్ని బట్టి సమయాన్ని బట్టి అది గొప్పదా చిన్నదా కొంచెమా ఎక్కువా అన్నది నిర్ణయింపబడుతుంది

శక్త్యాశక్త్యాథ వా బుద్ధ్యా సమృద్ధ్యా చ యదాత్మనే
అఘం కుర్వన్తి హి యథా దేశావస్థానుసారతః

శక్తితో గానీ , అశక్తితో గానీ, బుద్ధితో గానీ సమృద్ధితో గానీ, ఇవి ఒక వస్తువును పరిశుద్ధి చేయడానికీ పనికి వస్తాయి, పాపం చేయడానికీ పనికి వస్తుంది. ఒకే వస్తువు దేశాన్ని బట్టి విలువ మారుతుంది, అవస్థను బట్టి మారుతుంది.

ధాన్యదార్వస్థితన్తూనాం రసతైజసచర్మణామ్
కాలవాయ్వగ్నిమృత్తోయైః పార్థివానాం యుతాయుతైః

ధాన్యమూ దారు అస్థి తంతు రస తైజసం, చర్మము, ఇవి కొన్ని కాలాన్ని బట్టి వాయువును బట్టి కొన్ని అగ్నిని బట్టీ వాటి వాటి పరిశుద్ధి ఉంటుంది. శ్మశాన గాలి తగిలినా ఆ తులసి వాడరానిది అవుతుంది. కొన్ని రసాలు ప్రసరించినా ద్రవ్యం అపవిత్రమవుతుంది. చెట్లనుంచి మద్యం తీసుకున్న వాడు, మద్యభాండం పట్టుకున్నవాడు ఎదురుగా వస్తే మన చేతిలో పూజా ద్రవ్యాన్ని పారవేయాలి.

అమేధ్యలిప్తం యద్యేన గన్ధలేపం వ్యపోహతి
భజతే ప్రకృతిం తస్య తచ్ఛౌచం తావదిష్యతే

అపవిత్రమైన దానితో పూయబడినవి,
దాని యొక్క సహజ స్థిని పొంది ఉంటే అవి పవిత్రములు. సహజ స్వరూప గుణాలతో ఉంటే పవిత్రము. తులసి సహజముగా పవిత్రమే.. మనవాక్కు వలన గానీ, చెడు వాసన సోకినా అపవిత్రం అవుతుంది

స్నానదానతపోऽవస్థా వీర్యసంస్కారకర్మభిః
మత్స్మృత్యా చాత్మనః శౌచం శుద్ధః కర్మాచరేద్ద్విజః

నా కర్మలు చేయాలంటే చేసేవాడు పవిత్రుడు కావాలి.
స్నానమూ దానమూ తపమూ అవస్థా వీర్యమూ సంస్కారమూ, చివరగా నా స్మరణతో (అపవిత్రః పవిత్రోవా...) పరిశుద్ధుడై కర్మను ఆచరించాలి.

మన్త్రస్య చ పరిజ్ఞానం కర్మశుద్ధిర్మదర్పణమ్
ధర్మః సమ్పద్యతే షడ్భిరధర్మస్తు విపర్యయః

కర్మకు శుద్ధి అంటే నాకు అర్పించడమే
ముందు మత్ర స్వరూప స్వభావాలు తెలుసుకుని, దానికి శుద్ధి జరగాలంటే నాకు అర్పించాలి.
ఇలా చేస్తేనే అది ధర్మమవుతుంది. లేకుంటే అధర్మం అవుతుంది

క్వచిద్గుణోऽపి దోషః స్యాద్దోషోऽపి విధినా గుణః
గుణదోషార్థనియమస్తద్భిదామేవ బాధతే

మనం పొరబాటుగా వ్యవహరిస్తే గుణమూ దోషం అవుతుంది. సక్రమముగా ప్రవర్తిస్తే దోషమూ గుణమవుతుంది
గుణమూ దోషమూ అన్న భేధ బుద్ధి ఉన్నవారినే అది భావిస్తుంది
పరిపూర్ణముగా పరమాత్మ బుద్ధితో ఉన్న వారికి గుణమూ దోషమూ ఉండదు. పరమాత్మాత్మకముగా జగత్తును చూచేవారికి గుణమూ దోషమూ ఉండదు.

సమానకర్మాచరణం పతితానాం న పాతకమ్
ఔత్పత్తికో గుణః సఙ్గో న శయానః పతత్యధః

నిలబడ్డవారు, ఎత్తులో కూర్చున్నవాడు పడతాడు కానీ, మొదలే పడ్డవాడు, పడుకున్నవాడు పడలేడు
గుణములూ దోషములూ అన్నవి, "నేనూ నా శరీరము, పరమాత్మను నా కర్మతో చేరుకోవాలి" అనుకున్నవారికి గుణములూ దోషములు
సర్వధర్మాన్ పరిత్యజ్య అని ప్రపతీతో నన్ను సేవించే వారికి అది వర్తించవు.
అంతేకాని ధర్మాన్ని ఆచరించడానికి బద్ధకించి వదిలేస్తే మాత్రం గుణ దోషములు వస్తాయి. శ్రమా బాధ అని కర్మను వదలిపెట్టడం త్యాగం కాదు. సర్వాత్మనా నాకు అన్నీ సమర్పిస్తే వాడికి ఏ దోషమూ గుణమూ ఉండదు

యతో యతో నివర్తేత విముచ్యేత తతస్తతః
ఏష ధర్మో నృణాం క్షేమః శోకమోహభయాపహః

దేని దేన్నుంచి మనం వెనక్కు మళ్ళామో అవి మనం వదలిపెట్టినట్లే. దాని నుండి వాడు విముక్తుడవుతాడు
పరమాత్మ యందూ అన్నీ అర్పించి భగవద్ అర్పణ బుద్ధితో పని చేయడమే, మానవులకు క్షేమాన్ని కల్పిస్తుంది. శోకాన్ని మోహాన్ని పోగొడుతుంది.

విషయేషు గుణాధ్యాసాత్పుంసః సఙ్గస్తతో భవేత్
సఙ్గాత్తత్ర భవేత్కామః కామాదేవ కలిర్నృణామ్

విషయములయందు గుణములు ఆరోపించుట (ఇది మంచిదీ ఇది చెడ్డది అనుకోవడం) దాని మీద ఆసక్తి కలుగడానికి కారణం. విషయముల యందు గుణం ఆరోపిస్తే దాని యందు మనకు సంగం కలుగుతుంది.
ఆ సంగం వలన, కామం కలుగుతుంది. కోరిక పుడుతుంది. దాని వలన అన్ని కలహాలూ వస్తాయి. ఒకే వస్తువును ఇద్దరు కోరడం వలన కలహం వస్తుంది. కలహానికి కోరిక మూలం, కోరికకు మూలం సంగం, సంగానికి మూలం వస్తువు యందు సంగాన్ని ఆరోపించడం.
కలేర్దుర్విషహః క్రోధస్తమస్తమనువర్తతే
తమసా గ్రస్యతే పుంసశ్చేతనా వ్యాపినీ ద్రుతమ్

ఈ కలహం వలనే కోపం ఏర్పడుతుంది
దానితో తమో గుణం వస్తుంది. తమో గుణం వలన పురుషుని యొక్క వివేకం హరించబడుతుంది
వివేకం పోయిన తరువాత వాడు ఉన్నా లేనివాడితో సమానమే

తయా విరహితః సాధో జన్తుః శూన్యాయ కల్పతే
తతోऽస్య స్వార్థవిభ్రంశో మూర్చ్ఛితస్య మృతస్య చ

మూర్చపోయినవాడూ మరణించిన వాడూ ఎలాంటి వాడో వీడూ అలాంటి వాడే.

విషయాభినివేశేన నాత్మానం వేద నాపరమ్
వృక్ష జీవికయా జీవన్వ్యర్థం భస్త్రేవ యః శ్వసన్

విషయముల యందు అభినివేశం ఉంచడం వలననే తానంటే ఏమిటో తెలియదు. ఇతరులంటే ఏమిటో తెలియదు.
చివరకు చెట్టులా బతుకుతాడు. తానెందుకు ఉన్నాడో ఏమి చేస్తున్నాడో ఏమి చేయాలనుకుంటున్నాడో మరచి చెట్టులా బతుకుతూ గాలి మాత్రం తీస్తూ విడుస్తూ ఉంటాడు

ఫలశ్రుతిరియం నౄణాం న శ్రేయో రోచనం పరమ్
శ్రేయోవివక్షయా ప్రోక్తం యథా భైషజ్యరోచనమ్

చెప్పిన అన్ని శాస్త్రాలలో ఈ పని చేస్తే ఈ ఫలితం వస్తుంది అని చెప్పడానికి కారణం కర్మలయందూ ధర్మమ్యందూ ఆసక్తి కలగడానికి, పరమాత్మ యందు విశ్వాసం పొందడానికి రుచి కలగాడనికి చెప్పిన మాటలే తప్ప అవే పొందాలనీ ఆ పనే చేయాలనీ కాదు.
మందు తినాలంటే ఆ మందును చెక్కరలో కలిపి మందు తినడానికి రుచి పుట్టించినట్లుగా కర్మలయందు రుచి పుట్టడానికి చెప్పిన మాటలే అవి.

ఉత్పత్త్యైవ హి కామేషు ప్రాణేషు స్వజనేషు చ
ఆసక్తమనసో మర్త్యా ఆత్మనోऽనర్థహేతుషు

పుట్టినప్పటినుంచే జీవులు కోరికలూ ప్రాణమూ తన వారి యందు ఆసక్తి కలిగే ఉంటారు. ఇవన్నీ తనకు అనర్థాన్నే కలిగిస్తాయి. వీటి యందు సహజముగా కోరిక కలిగే ఉంటాడు


నతానవిదుషః స్వార్థం భ్రామ్యతో వృజినాధ్వని
కథం యుఞ్జ్యాత్పునస్తేషు తాంస్తమో విశతో బుధః

పాప మార్గములో సంచరించేవాడికి ఏది ఉత్తమమో  ఏది ఆచరించాలో ఎలా తెలుస్తుంది. తెలియనందువలన పండితుడై కూడా అజ్ఞ్యానాన్నే పొందుతాడు

ఏవం వ్యవసితం కేచిదవిజ్ఞాయ కుబుద్ధయః
ఫలశ్రుతిం కుసుమితాం న వేదజ్ఞా వదన్తి హి

దుష్టబుద్ధులు కొందరు విషయాన్ని తెలుసుకోలేక, మనసును ఆకర్షించడానికి చెప్పే ఫలశ్రుతులను వేదం తెలిసిన వాడు చెప్పడు. అలా చెప్పడం వలన మనమే వాడికి అధర్మ మార్గాన్నీ స్వార్థాన్ని నేర్పినవారం అవుతాము.

కామినః కృపణా లుబ్ధాః పుష్పేషు ఫలబుద్ధయః
అగ్నిముగ్ధా ధూమతాన్తాః స్వం లోకం న విదన్తి తే

చెట్టుకు ఒక చిన్న పువ్వు వస్తే ఎంత పెద్ద పండు వస్తుందో అనుకుంటాము. కింశుక పుష్పం (మోదుక పువ్వు) ఎంతో పెద్దగా ఉంటుంది. కానీ దాని ఫలం చాలా చిన్నగా ఉంటుంది. ఒక చెట్టుకు పువ్వు రాగానే దాని ఫలం కోసం చూస్తాము.  ఒక పని మొదలుపెడుతూనే దాని ఫలం గురించి ఆలోచిస్తాము.
అగ్ని కావాలి కానీ పొగ వద్దు అన్నట్లుగా ఉంటుంది వీరి పరిస్థితి - అగ్నిముగ్ధా ధూమతాన్తాః .ఫలం రావాలి గానీ కష్ట పడకూడదు అని వీరి భావం. అలాంటి వారు తాము చేరవలసిన లోకాన్ని గానీ తాము ఉన్న లోకాన్ని గానీ తెలియలేరు

న తే మామఙ్గ జానన్తి హృదిస్థం య ఇదం యతః
ఉక్థశస్త్రా హ్యసుతృపో యథా నీహారచక్షుషః

అలాంటి వారు హృదయములో ఉన్న నన్ను తెలియలేరు. ఈ జగత్తు ఎక్కడినుంచి వచ్చిందో కూడా తెలియలేరు
ఎంత సేపూ నా భాగం నాకు వస్తుందాలేదా అనే ఆలోచిస్తారు. ప్రాణాలను నిలుపుకోవడానికే ప్రయత్నిస్తారు. నిరంతరం వారివి మంచు కన్నులే (కన్నులలో ఎపుడూ నీరే ఉంటుంది). అనుకున్న పని ఐనా కాకపోయినా వారికి నీరే ఉంటుంది.

తే మే మతమవిజ్ఞాయ పరోక్షం విషయాత్మకాః
హింసాయాం యది రాగః స్యాద్యజ్ఞ ఏవ న చోదనా

అలాంటి వారు నా అభిప్రాయాన్నీ సిద్ధాంతాన్ని తెలుసుకోక విషయముల యందే మనసు గలవారై, పరప్రాణుల  యందు హింసించడములో కోరిక ఉన్నవారవుతారు. వారి కొరకు యజ్ఞ్యం చెప్పబడలేదు

హింసావిహారా హ్యాలబ్ధైః పశుభిః స్వసుఖేచ్ఛయా
యజన్తే దేవతా యజ్ఞైః పితృభూతపతీన్ఖలాః

హింసయందు విహరించేవారు, తాము వధించే పశువుల యందు తమ సుఖాన్ని కోరి ప్రవర్తిస్తారు
దుష్టులూ యజ్ఞ్యం చేస్తారు.భూత ప్రేత పిశాచాలను స్వార్థపరులై ఆరాధిస్తారు

స్వప్నోపమమముం లోకమసన్తం శ్రవణప్రియమ్
ఆశిషో హృది సఙ్కల్ప్య త్యజన్త్యర్థాన్యథా వణిక్

ఈ లోకం కలవంటిది. వినడానికి మాత్రమే బాగుంటుంది. ఇదంతా లేనిదే. మనసులో ఎన్నో కోరికలు పెట్టుకుని తమకున్న కొన్నిటిని విడిచిపెడతారు, వ్యాపారస్థునిలాగ. వదిలిపెట్టినదానికి కొన్నింతలు వస్తాయనుకుని ఉన్నవి వదులుకుంటాడు - వ్యాప్రిలాగ ప్రవర్తిస్తాడు.

రజఃసత్త్వతమోనిష్ఠా రజఃసత్త్వతమోజుషః
ఉపాసత ఇన్ద్రముఖ్యాన్దేవాదీన్న యథైవ మామ్

మూడు గుణాలలో ఉంటారు, అదే మూడు గుణాలను నిరంతరం సేవిస్తూ ఉంటారు
ఇంద్రాది దేవతలను ఉపాసించినట్లు నన్ను ఉపాసించరు. క్షుద్రమైన వాటిని ఆరాధిస్తారు గానీ నన్ను ఆరాధించరు

ఇష్ట్వేహ దేవతా యజ్ఞైర్గత్వా రంస్యామహే దివి
తస్యాన్త ఇహ భూయాస్మ మహాశాలా మహాకులాః

దేవతలను యజ్ఞ్యములతో ఆరాధించి స్వర్గములో రమిద్దాము అనుకుంటారు
అలాంటి స్వర్గము ఎప్పుడూ ఉండాలి,ఇక్కడే స్వర్గం ఉండాలి అని ఎన్నో కోరికలతో ఎన్నో భవనాలతో

ఏవం పుష్పితయా వాచా వ్యాక్షిప్తమనసాం నృణామ్
మానినాం చాతిలుబ్ధానాం మద్వార్తాపి న రోచతే

ఇలాంటి 'పుష్పితమైనా వాక్కుతో కోరికల యందే మనసు లగ్నం చేసిన మానవులకు ,
అతి స్తబ్ధులూ, దురహంకారులు ఐన వారికి నామాటే నచ్చదు. నా పేరే పడదు.

వేదా బ్రహ్మాత్మవిషయాస్త్రికాణ్డవిషయా ఇమే
పరోక్షవాదా ఋషయః పరోక్షం మమ చ ప్రియమ్

వేదమనేది బ్రహ్మాత్మ విషయం. ఇది త్రికాండ విషయం. కర్మ కాండ జ్ఞ్యాన కాండ ఉపాసనా కాండ అని మూడు కాండలు ఇందులో ఉంటాయి.
ఇవన్నీ పనికిరానివే ఐనపుడు వేద పురాణములూ ఋషులూ ఇవి చెప్పడానికి కారణం ఏమిటి? ధర్మాలూ యజ్ఞ్యాలూ కథలూ చెప్పడానికి కారణం ఏమిటి? దాని వలన 'మన కోరికలు మనకు నష్టాన్నే ఇస్తాయి. ఇవన్నీ నశ్వ్రములూ, పరమాత్మ సన్నిధి ఒకటే శాశ్వతం ' అని తెలుస్తుంది. మనకు ఆ కథలో అన్నీ భోగాలూ ఐశ్వర్యాలూ కనపడినా, అది బోధించేది మాత్రం భక్తి జ్ఞ్యాన వైరాగ్యాలే.
ప్రత్యక్షముగా వైరాగ్యాన్ని బోధించవు. పరోక్షముగా బోధిస్తాయి. ఋషులెప్పుడూ పరోక్షముగా చెబుతారు. నాకు కూడా పరోక్షమే ఇష్టము. (ఉదాహరణకు సునశ్యేపుడికి విశ్వామిత్రుడు మంత్రాన్ని ఇచ్చి దాన్ని రహస్యముగా జపిస్తే దేవతలు సంతోషిస్తారు అని చెప్పాడు)

శబ్దబ్రహ్మ సుదుర్బోధం ప్రాణేన్ద్రియమనోమయమ్
అనన్తపారం గమ్భీరం దుర్విగాహ్యం సముద్రవత్

మనకు ప్రాణ ఇంద్రియ మనో మయమైన ఈ శబ్ద బ్రహ్మ సముద్రము లాగ దాని అంతం తెలుసుకోలేము. దాని లోతు తెలుసుకోలేము.

మయోపబృంహితం భూమ్నా బ్రహ్మణానన్తశక్తినా
భూతేషు ఘోషరూపేణ విసేషూర్ణేవ లక్ష్యతే

నేనే దీని వ్యాఖ్యానం చేసాను. తామరలలో దారము లాగ అన్ని భూతములలో నేను ఘోషగా (ఓంకార నాదములా) ఉంటాను.

యథోర్ణనాభిర్హృదయాదూర్ణాముద్వమతే ముఖాత్
ఆకాశాద్ఘోషవాన్ప్రాణో మనసా స్పర్శరూపిణా

ఉదరములో ఉన్న దారాన్ని సాలెపురుగు తన ముఖం నుండి బయటకు చేర్చినట్లుగా ఆకాశం నుండి ప్రాణము, స్పర్శ రూపమైన మనసుతో

ఛన్దోమయోऽమృతమయః సహస్రపదవీం ప్రభుః
ఓంకారాద్వ్యఞ్జితస్పర్శ స్వరోష్మాన్తస్థభూషితామ్

చందోమయమూ అమృతమయమైన, ఓంకారము నుంచే అన్నీ వస్తాయి
ఓంకారం నుంచే స్పర్శ (ఖ నుంచీ మా వరకూ ఉన్న వాటిని స్పర్శలు అంటారు) స్వరములు (అచ్చులకు స్వరములు అని పేరు), ఊష్మలు (శ్ ష స హలు ఊష్మలు) అంతస్థలు (య ర ల వ ...) , ఈ స్పర్శ స్వర ఊష్మా అంతస్థలు ఓంకారం నుండే వచ్చాయి

విచిత్రభాషావితతాం ఛన్దోభిశ్చతురుత్తరైః
అనన్తపారాం బృహతీం సృజత్యాక్షిపతే స్వయమ్

విచిత్రమైన బాషతో వ్యాప్త్మైన దాన్ని, అనంతపారమైన వేదాన్ని సృష్టించాను.

గాయత్ర్యుష్ణిగనుష్టుప్చ బృహతీ పఙ్క్తిరేవ చ
త్రిష్టుబ్జగత్యతిచ్ఛన్దో హ్యత్యష్ట్యతిజగద్విరాట్

ఈ ఏడూ చందస్సులు - గాయత్రీ ఉష్ణిక్ అనుష్టుప్ బృహతీ పంక్తి త్రిష్టుప్ జగత్

కిం విధత్తే కిమాచష్టే కిమనూద్య వికల్పయేత్
ఇత్యస్యా హృదయం లోకే నాన్యో మద్వేద కశ్చన

నేను ఏమి చేస్తున్నానో దేన్ని విధిస్తున్నానో దేని కోసం దేన్ని చెబుతున్నానో
ఏమి అనుకుని ఏమి చెబుతున్నానో, ఏమి అనుకుంటున్నానో ఎలా నడిపిస్తున్నానో ఎవరూ ఏదీ తెలుసుకోలేరు.
ఎవరూ దీన్ని తెలుసుకోలేరు

మాం విధత్తేऽభిధత్తే మాం వికల్ప్యాపోహ్యతే త్వహమ్
ఏతావాన్సర్వవేదార్థః శబ్ద ఆస్థాయ మాం భిదామ్
మాయామాత్రమనూద్యాన్తే ప్రతిషిధ్య ప్రసీదతి

వేదం కర్మలనూ ధర్మాలనూ కాదు, నన్నే విధిస్తుంది, నా గురించే చెబుతుంది. ఇది కావాలా అది కావాలా అని అడిగి జగత్తును తీసిపారేసి నన్ను చూపుతుంది
బ్రహ్మే నిత్యం బ్రహ్మే సత్యం మనకు ప్రాప్యమైనది బ్రహ్మే, సంసారం అంతా క్షణికం నశ్వరం దుఃక ప్రదము.
ఇదే సర్వ వేదార్థము. శబ్దం తీసుకుని రకరకా భేధాలతో అన్నీ వివరించుకుని జగత్తంతా మాయా మాత్రం అని చెప్పి, అన్ని నిషేధాలు విధిస్తుంది. అది చెప్పి నన్ను సేవించమని చెబుతుంది.
భగవంతుని చెప్పక ముందు కర్మలూ లోకములూ జగత్తునూ ఫలములనూ చెప్పడానికి కారణం అవి అన్నీ పనికి రానివనీ, భగవంతుడొక్కడే చెరదగినవాడు అని చెప్పడానికి. ఆయనను సేవిస్తే దుఃఖాలు పోతాయి.కర్మలు చేస్తే దుఃఖమే ఉంటుంది అని చెప్పడానికి చెప్పబడినవి. అలా నిషేదింపచేసి వచ్చే పాపభయాన్ని తొలగించడానికి నన్ను ముందర చూపుతారు. ఇది స్వభావము.

                                         సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                        సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment