Monday, September 2, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదహేడవ అధ్యాయం

                                                    ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదహేడవ అధ్యాయం

శ్రీద్ధవ ఉవాచ
యస్త్వయాభిహితః పూర్వం ధర్మస్త్వద్భక్తిలక్షణః
వర్ణాశమాచారవతాం సర్వేషాం ద్విపదామపి

సకల వర్ణాశ్రమ ఆచారాలు కలవారికి, ఏ ఏ వర్ణం వారు ఏ ఏ ఆశ్రమం వారు ఏ ఏ ధర్మాన్ని ఆచరిస్తే నీ యందు భక్తి కలుగుతుందో ఆ స్వరూపాన్ని చెప్పండి.

యథానుష్ఠీయమానేన త్వయి భక్తిర్నృణాం భవేత్
స్వధర్మేణారవిన్దాక్ష తన్మమాఖ్యాతుమర్హసి

పురా కిల మహాబాహో ధర్మం పరమకం ప్రభో
యత్తేన హంసరూపేణ బ్రహ్మణేऽభ్యాత్థ మాధవ

పూర్వం నీవు హంస రూపములో బ్రహ్మకు ఏ ధర్మాన్ని చెప్పావో ఆ ధర్మం ఇపుడు కాలములో కలసిపోయింది. ఇది వరకు మానవ లోకములో నీవు చెప్పిన ధర్మం లుబ్దమైపోయింది

స ఇదానీం సుమహతా కాలేనామిత్రకర్శన
న ప్రాయో భవితా మర్త్య లోకే ప్రాగనుశాసితః

వక్తా కర్తావితా నాన్యో ధర్మస్యాచ్యుత తే భువి
సభాయామపి వైరిఞ్చ్యాం యత్ర మూర్తిధరాః కలాః

ధర్మాన్ని చెప్పేవాడూ, చేసేవాడూ, కాపాడేవాడూ, నీవు తప్ప మరెవరూ లేరు.

కర్త్రావిత్రా ప్రవక్త్రా చ భవతా మధుసూదన
త్యక్తే మహీతలే దేవ వినష్టం కః ప్రవక్ష్యతి

బ్రహ్మ సభలో కూడా అన్ని కళలూ ఆకారాలు ధరించి నీవే కర్తగా రక్షకుడిగా ప్రవక్తగా అవతరించావు
నీవు భూలోకం విడిచిపెట్టి వెళితే, నీవు చెప్పిన ధర్మం నశిస్తే అది మళ్ళీ ఎవరు చెబుతారు.

తత్త్వం నః సర్వధర్మజ్ఞ ధర్మస్త్వద్భక్తిలక్షణః
యథా యస్య విధీయేత తథా వర్ణయ మే ప్రభో

ధర్మం అంటే నీ భక్తే. ఏది దేనికి ఎలా ఉంటుందో అలా దాన్ని మాకు వివరించవలసింది

శ్రీశుక ఉవాచ
ఇత్థం స్వభృత్యముఖ్యేన పృష్టః స భగవాన్హరిః
ప్రీతః క్షేమాయ మర్త్యానాం ధర్మానాహ సనాతనాన్

ఈ విధముగా తన బృత్యుడైన భక్తుడు అడిగితే, మానవుల యొక్క సనాతన ధర్మాన్ని చెప్పాడు

శ్రీభగవానువాచ
ధర్మ్య ఏష తవ ప్రశ్నో నైఃశ్రేయసకరో నృణామ్
వర్ణాశ్రమాచారవతాం తముద్ధవ నిబోధ మే

బాగా అడిగావు. మానవులందరికీ నిశ్రేయసం అందించే ఉత్తమ ప్రశ్న అడిగావు. దాన్ని తెలుసుకో

ఆదౌ కృతయుగే వర్ణో నృణాం హంస ఇతి స్మృతః
కృతకృత్యాః ప్రజా జాత్యా తస్మాత్కృతయుగం విదుః

కృత యుగములో ఈ నాలుగు వర్ణాలు లేవు. హంస అనే వర్ణం మాత్రం ఉంది.
ఆ యుగములో అందరూ చేయవలసిన వాటిని ఎపుడో చేసేశారు. కొత్తగా చెయవలసినవి అంటూ లేదు. అందుకే దాన్ని కృత యుగం అంటారు.

వేదః ప్రణవ ఏవాగ్రే ధర్మోऽహం వృషరూపధృక్
ఉపాసతే తపోనిష్ఠా హంసం మాం ముక్తకిల్బిషాః

అప్పటి వేదం కేవలం ప్రణవం. ధర్మం అంటే నేనే. వృష రూపములో ఉన్నాను.
అన్ని పాపాలు తొలగించుకున్నవారు తపోనిష్ఠులై నన్ను మాత్రం ఉపాసించేవారు.

త్రేతాముఖే మహాభాగ ప్రాణాన్మే హృదయాత్త్రయీ
విద్యా ప్రాదురభూత్తస్యా అహమాసం త్రివృన్మఖః

వేదములు త్రేతా యుగములో పుట్టాయి. నా ప్రాణముల నుండీ హృదయముల నుండీ వేదం పుట్టింది

అక్కడి నుంచీ విద్య వచ్చింది, దాని నుంచి ప్రణవం వచ్చింది (త్రివృత్), మూడు వేదాలూ, వాటిని బోధించే యజ్ఞ్యాలు వచ్చాయి. యజ్ఞ్యాలు త్రేతాయుగములో వచ్చాయి.

విప్రక్షత్రియవిట్శూద్రా ముఖబాహూరుపాదజాః
వైరాజాత్పురుషాజ్జాతా య ఆత్మాచారలక్షణాః

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ముఖ బాహు ఊరు పాదముల నుండి పుట్టారు. విరాట్ పురుషుడినుంచి పుట్టిన, ఆచారాన్ని చెప్పే ఏ ఆత్మ ఉందో

గృహాశ్రమో జఘనతో బ్రహ్మచర్యం హృదో మమ
వక్షఃస్థలాద్వనేవాసః సన్న్యాసః శిరసి స్థితః

నడుము భాగం నుండి గృహస్థాశ్రమం, హృదయం నుండి బ్రహ్మచర్యం, వక్షస్థలం నుండి వానప్రస్థం, సన్యాసం శిరస్సునుండి ఆవిర్భవించింది.

వర్ణానామాశ్రమాణాం చ జన్మభూమ్యనుసారిణీః
ఆసన్ప్రకృతయో నౄనాం నీచైర్నీచోత్తమోత్తమాః

అన్నీ నా నుంచే పుట్టాయి. అన్ని స్వభావాలూ , నీచమములూ ఉత్తమములూ నా నుండే ఏర్పడ్డాయి.

శమో దమస్తపః శౌచం సన్తోషః క్షాన్తిరార్జవమ్
మద్భక్తిశ్చ దయా సత్యం బ్రహ్మప్రకృతయస్త్విమాః

ఇవి బ్రాహ్మణులకు ఉండవలసిన లక్షణాలు
బాహ్య ఇంద్రియ నిగ్రహం, అంతర ఇంద్రియ నిగ్రహం, శౌచం, సంతోషం, ఓర్పూ, నిజాయితీ, నా యందు భక్తి, దయ, సత్యమూ, ఇవి బ్రాహ్మణ స్వభావము

తేజో బలం ధృతిః శౌర్యం తితిక్షౌదార్యముద్యమః
స్థైర్యం బ్రహ్మన్యమైశ్వర్యం క్షత్రప్రకృతయస్త్విమాః

తేజో బలం ధృతిః శౌర్యం తితిక్షౌదార్యముద్యమః, బ్రాహ్మణుల యందు ప్రీతి, ఇవి క్షత్రియులకు ఉండవలసిన లక్షణములు.

ఆస్తిక్యం దాననిష్ఠా చ అదమ్భో బ్రహ్మసేవనమ్
అతుష్టిరర్థోపచయైర్వైశ్యప్రకృతయస్త్విమాః

ఎంత సంపాదించినా తృప్తి లేకుండుటా, ఇవన్నీ వైశ్యుల లక్షణములు.

శుశ్రూషణం ద్విజగవాం దేవానాం చాప్యమాయయా
తత్ర లబ్ధేన సన్తోషః శూద్రప్రకృతయస్త్విమాః

బ్రాహ్మణులనూ గోవులనూ దేవతలనూ కపటం లేకుండా సేవించి, అలా వచ్చిన దానితో సంతోషించడం శూద్రుల లక్షణాలు

అశౌచమనృతం స్తేయం నాస్తిక్యం శుష్కవిగ్రహః
కామః క్రోధశ్చ తర్షశ్చ స భావోऽన్త్యావసాయినామ్

కామ క్రోధాదులూ నాస్తికం, ఇవన్నీ ఉండకూడని గుణాలు. ఇవన్నీ విపరీతాలు. ఇవి ఉండరాదు

అహింసా సత్యమస్తేయమకామక్రోధలోభతా
భూతప్రియహితేహా చ ధర్మోऽయం సార్వవర్ణికః

అహింస సత్యం దొంగతనం చేయకుండా ఉండుట, కామ క్రోధాదులు లేకుండుటా , భూతముల యొక్క సర్వ ప్రాణులకూ హితం కోరడం, అన్ని వర్ణాల ధర్మము.

ద్వితీయం ప్రాప్యానుపూర్వ్యాజ్జన్మోపనయనం ద్విజః
వసన్గురుకులే దాన్తో బ్రహ్మాధీయీత చాహూతః

పుట్టిన తరువాత రెండవ కర్మ ఐన ఉపనయనాన్ని బ్రాహ్మణుడు పొందాలి. తరువాత గురుకులములో ఉంటూ వేదాధయయనం చేస్తూ
హోమములు చేస్తూ,

మేఖలాజినదణ్డాక్ష బ్రహ్మసూత్రకమణ్డలూన్
జటిలోऽధౌతదద్వాసోऽరక్తపీఠః కుశాన్దధత్

వీటిని ధరించాలి. బాగా ఉతికిన బట్టలు కట్టరాదు. ఉతకని బట్టలే కట్టుకోవాలి. దర్భలు ధరించాలి.

స్నానభోజనహోమేషు జపోచ్చారే చ వాగ్యతః
న చ్ఛిన్ద్యాన్నఖరోమాణి కక్షోపస్థగతాన్యపి

స్నానమూ భోజనమూ హోమమూ జపమూ ఇలాంటి వాటిలో వాక్కుని నియమించుకుని చేయాలి.
బ్రహ్మచారి గోళ్ళనూ రోమములనూ కత్తిరించరాదు

రేతో నావకిరేజ్జాతు బ్రహ్మవ్రతధరః స్వయమ్
అవకీర్ణేऽవగాహ్యాప్సు యతాసుస్త్రిపదాం జపేత్

వీర్యమును స్రవించరాదు. బ్రహ్మ చర్య వ్రతం ఆచరించాలి. ఒకసారి రేత స్ఖలనమైతే నీటిలో మునిగి స్నానం చేసి గాయత్రీ మంత్రాన్ని జపించాలి.

అగ్న్యర్కాచార్యగోవిప్ర గురువృద్ధసురాఞ్శుచిః
సమాహిత ఉపాసీత సన్ధ్యే ద్వే యతవాగ్జపన్

అగ్నినీ సూర్యున్నీ గురువుగారినీ గోవులనూ బ్రాహ్మణులనూ గురువులనూ వృద్ధులనూ దేవతలనూ పరిశుద్ధుడై పూజిస్తూ, రెండు సంధ్యలలో సంధ్యా వందం చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో మాట్లాడరాదు (యత వాక్ - వాక్ నియమం కావాలి).

ఆచార్యం మాం విజానీయాన్నావన్మన్యేత కర్హిచిత్
న మర్త్యబుద్ధ్యాసూయేత సర్వదేవమయో గురుః

గురువును నన్నుగా చూడాలి. పొరబాటున కూడా గురువుగారిని అవమానించరాదు. గురువు యందు మర్త్య బుద్ధి ఉండరాదు. గురువంటే దేవతలందరి స్వరూపం

సాయం ప్రాతరుపానీయ భైక్ష్యం తస్మై నివేదయేత్
యచ్చాన్యదప్యనుజ్ఞాతముపయుఞ్జీత సంయతః

బ్రహ్మచారి ప్రాతః సాయంకాలం బిక్షాటన చేసి గురువుగారికి ఇచ్చి, వారు ఆజ్ఞ్య ఇస్తే నీయమం చేత భోజనం చేయాలి.

శుశ్రూషమాణ ఆచార్యం సదోపాసీత నీచవత్
యానశయ్యాసనస్థానైర్నాతిదూరే కృతాఞ్జలిః

చాలా చిన్నవాడిలాగ గురువుగారిని చేరి సేవించాలి. ఆయన వెళుతుంటే శిష్యుడు అతి దగ్గరలో ఉండి వెంబడించాలి. శయ్యలో ఆసనములో ఆయనకు దగ్గరగా చేతులు జోడించుకుని ఉండాలి.

ఏవంవృత్తో గురుకులే వసేద్భోగవివర్జితః
విద్యా సమాప్యతే యావద్బిభ్రద్వ్రతమఖణ్డితమ్

అన్ని భోగాలూ వదలి గురుకులములో ఇలా ఉండాలి. ఇలా వ్రతాన్ని ధరించి ఎంత వరకూ విద్య సమాప్తి అవుతుందో అంతవరకూ ఈ వ్రతాన్ని అవలంబించాలి.

యద్యసౌ ఛన్దసాం లోకమారోక్ష్యన్బ్రహ్మవిష్టపమ్
గురవే విన్యసేద్దేహం స్వాధ్యాయార్థం బృహద్వ్రతః

బ్రహ్మ లోకాన్ని పొందాలి అనుకున్నవాడు గురువుగారి వద్దనే ఉండి దేహావసానం వరకూ ఉండి అధ్యయనం చేస్తూ ఉండాలి.

అగ్నౌ గురావాత్మని చ సర్వభూతేషు మాం పరమ్
అపృథగ్ధీరుపసీత బ్రహ్మవర్చస్వ్యకల్మషః

అగ్ని యందూ గురువు యందూ ఆత్మ యందూ సర్వ భూతముల యందూ ఉన్న నన్ను చూడాలి, నన్ను ఆరాధించాలి. ఎలాంటి కల్మషములు లేకుండా సేవించాలి

స్త్రీణాం నిరీక్షణస్పర్శ సంలాపక్ష్వేలనాదికమ్
ప్రాణినో మిథునీభూతానగృహస్థోऽగ్రతస్త్యజేత్

స్త్రీలను  చూచుటా స్పృశించుట మాట్లాడుట పరిహాసమాడుట, ఇవన్నీ బ్రహ్మచారి చేయరాదు
జంటగా ఉన్న జంతువులను కూడా దూరముగా వదలిపెట్టాలి.

శౌచమాచమనం స్నానం సన్ధ్యోపాస్తిర్మమార్చనమ్
తీర్థసేవా జపోऽస్పృశ్యా భక్ష్యాసమ్భాష్యవర్జనమ్

తాకకూడని వాటిని తాకకుండుట, మాట్లాడకూడని వాటిని మాటలాడకుండా ఉండుట, తినకూడని వాటిని తినకుండా ఉండుట చేయాలి.ఇవి బ్రహ్మచారులే కాదు అన్ని ఆశ్రమాల వర్ణాల వారు చేయాలి.

సర్వాశ్రమప్రయుక్తోऽయం నియమః కులనన్దన
మద్భావః సర్వభూతేషు మనోవాక్కాయసంయమః

సకల ప్రాణుల యందూ నా భావన ఉండాలి. మనో వాగ్ కాయ నిగ్రహం ఉండాలి. ఇలా ఈ వ్రతాన్ని ధరించి ఉంటే ఆ బ్రాహ్మణుడు అగ్నిలా ఎదిగిపోతాడు

ఏవం బృహద్వ్రతధరో బ్రాహ్మణోऽగ్నిరివ జ్వలన్
మద్భక్తస్తీవ్రతపసా దగ్ధకర్మాశయోऽమలః

అటువంటివాడు నా భక్తుడై, తీవ్ర తపస్సుతో అన్ని పాపములూ సంస్కారములూ వాసనలూ దహించిపోయి పరిశుద్ధుడై తరువాత దానిలో తాను అనుకున్న రీతిలో

అథానన్తరమావేక్ష్యన్యథాజిజ్ఞాసితాగమః
గురవే దక్షిణాం దత్త్వా స్నాయాద్గుర్వనుమోదితః

ఏది తెలుసుకోవాలనుకుంటున్నాడో, ఏది చదువుకోవాలనుకుంటున్నాడో, ఏ ఆశ్రమములోకి వెళ్ళాలని అనుకుంటున్నాడో, గురువుగారికి దక్షిణ ఇచ్చి, స్నాతకం చేసుకుని

గృహం వనం వోపవిశేత్ప్రవ్రజేద్వా ద్విజోత్తమః
ఆశ్రమాదాశ్రమం గచ్ఛేన్నాన్యథామత్పరశ్చరేత్

కోరిక ఉంటే గృహస్థాశ్రమం. లేకుంటే వానప్రస్థాశ్రమానికి, లేకుంటే సన్యాస ఆశ్రమానికి వెళ్ళవచ్చు. ఒక ఆశ్రమం నుండి ఇంకో ఆశ్రమానికి వెళ్ళడం మంచిది

గృహార్థీ సదృశీం భార్యాముద్వహేదజుగుప్సితామ్
యవీయసీం తు వయసా యం సవర్ణామను క్రమాత్

గృహస్థాశ్రమాన్ని కోరేవాడు యోగ్యమైన, అసహ్యించుకోవడానికి వీలు లేని భార్యనూ, వయసులో చిన్నదానను పెళ్ళి చేసుకోవాలి.  తన వర్ణములో ఉన్న ఆమెనే పెళ్ళి చేసుకోవాలి

ఇజ్యాధ్యయనదానాని సర్వేషాం చ ద్విజన్మనామ్
ప్రతిగ్రహోऽధ్యాపనం చ బ్రాహ్మణస్యైవ యాజనమ్

విద్య అధ్యయనం దానం, ఇవి అందరికీ ఉంటాయి. యజ్ఞ్యమూ వేదాధ్యయనం దానం ముగ్గురూ చేయవచ్చు (బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు). కానీ దానం తీసుకొనుట, చదువు చెప్పుటా, యజ్ఞ్యం చేయుటా బ్రాహ్మణునికి మాత్రమే తగినది

ప్రతిగ్రహం మన్యమానస్తపస్తేజోయశోనుదమ్
అన్యాభ్యామేవ జీవేత శిలైర్వా దోషదృక్తయోః

దానం తీసుకుంటే తపస్సు తేజస్సునూ కీర్తినీ తొలగించివేస్తుంది.
ఇలాంటి వాటిలో దోషం ఉంది అనుకుంటే శిలా వృత్తితో జీవనం సాగించవచ్చు

బ్రాహ్మణస్య హి దేహోऽయం క్షుద్రకామాయ నేష్యతే
కృచ్ఛ్రాయ తపసే చేహ ప్రేత్యానన్తసుఖాయ చ

తక్కిన వారి శరీరములాగ బ్రాహ్మణ శరీరం క్షుద్రమైన కోరికలను అనుభవించడానికి ఏర్పడినది కాదు. ఈ లోకములో అన్ని రకములా కష్టపడడానికే, తపస్సు చేయడానికే ఏర్పడింది. అలా చేసి పరలోకములో సుఖాన్ని పొందవచ్చు.

శిలోఞ్ఛవృత్త్యా పరితుష్టచిత్తో ధర్మం మహాన్తం విరజం జుషాణః
మయ్యర్పితాత్మా గృహ ఏవ తిష్ఠన్నాతిప్రసక్తః సముపైతి శాన్తిమ్

శిలా వృత్తితో కానీ ఉంచ వృత్తితో గానీ ఎలాంటి కల్మషంలేని ధర్మాన్ని సేవిస్తూ నా యందు మనసు లగ్నం చేసి గృహస్థాశ్రమములో ఉంటూ, గృహస్థాశ్రమములో ఎక్కువ సంగం లేకుండా ఉండాలి. అలా ఉంటే నన్ను చేరుకుంటాడు.

సముద్ధరన్తి యే విప్రం సీదన్తం మత్పరాయణమ్
తానుద్ధరిష్యే న చిరాదాపద్భ్యో నౌరివార్ణవాత్

దానాదులు తీసుకోకుండా భిక్షాటన చేయకుండా శిలా వృత్తితో నన్నే సేవిస్తూ ఉంటున్న బ్రాహ్మణున్ని ఉద్ధరిస్తే అటువంటి వారిని నేను ఉద్ధరిస్తాను. సముద్రమునుండి పడవ దాటించినట్లుగా కష్టాలనుండి నేను దాటిస్తాను

సర్వాః సముద్ధరేద్రాజా పితేవ వ్యసనాత్ప్రజాః
ఆత్మానమాత్మనా ధీరో యథా గజపతిర్గజాన్

రాజైన వాడు తన ప్రజలను సంతానము వలే అన్ని రకముల భయాలనుండీ ఆపదలనుండీ కాపాడాలి.
గజపతి (గజములను పోషించేవాడు) ఏనుగులను ఎలా తమ వశములో ఉంచుకుంటాడో దీనుడైనవాడు మనసును కూడా తన అదుపులో ఉంచుకోవాలి

ఏవంవిధో నరపతిర్విమానేనార్కవర్చసా
విధూయేహాశుభం కృత్స్నమిన్ద్రేణ సహ మోదతే

రాజు తన ధర్మాన్ని ఆచరిస్తే సూర్య తేజస్సుతో విమానాన్ని అధిరోహించి అన్ని పాపాలు పోగొట్టుకొని ఇంద్రునితో కలసి స్వర్గములో ఆనందిస్తాడు

సీదన్విప్రో వణిగ్వృత్త్యా పణ్యైరేవాపదం తరేత్
ఖడ్గేన వాపదాక్రాన్తో న శ్వవృత్త్యా కథఞ్చన

బ్రాహ్మణుడికి తన వృత్తిలో జీవనం గడవకుంటే వ్యాపారం చేసి జీవనం సాగించవచ్చు
అస్త్ర విద్యను నేర్పి కూడా తన జీవనం గడుపుకోవచ్చు. ఏదైనా చేయవచ్చుగానీ బతుకు తెరువు కోసం నీచులను సేవించరాదు.

వైశ్యవృత్త్యా తు రాజన్యో జీవేన్మృగయయాపది
చరేద్వా విప్రరూపేణ న శ్వవృత్త్యా కథఞ్చన

ఆపద వస్తే రాజు వైశ్య వృత్తితోగానీ వేటతో గానీ బ్రతకవచ్చు. మరీ ఆపద వస్తే బ్రాహ్మణ వృత్తిని కూడా అనుసరించవచ్చు. నీచ సేవనం మాత్రం చేయరాదు

శూద్రవృత్తిం భజేద్వైశ్యః శూద్రః కారుకటక్రియామ్
కృచ్ఛ్రాన్ముక్తో న గర్హ్యేణ వృత్తిం లిప్సేత కర్మణా

వైశ్యుడు అవసరమైతే శూద్ర వృత్తిని చేయవచ్చు. శూద్రుడు కూడా వడ్రంగి పనులూ, ఆసనాలు తయారు చేసే పని కూడా చెయవచ్చు. కష్టం వచ్చినపుడు ఏ పని ఐనా చేయవచ్చు గానీ నింద్యమైన పని మాత్రం చేయరాదు.

వేదాధ్యాయస్వధాస్వాహా బల్యన్నాద్యైర్యథోదయమ్
దేవర్షిపితృభూతాని మద్రూపాణ్యన్వహం యజేత్

వేదాధ్యయనముతో స్వాహాకారముతో స్వధాకారముతో పూజాద్రవ్యములతో దేవతలనూ ఋషులనూ పితృదేవతలనూ నా రూపమైన ఇతర ప్రాణులనూ ఆరాధించాలి

యదృచ్ఛయోపపన్నేన శుక్లేనోపార్జితేన వా
ధనేనాపీడయన్భృత్యాన్న్యాయేనైవాహరేత్క్రతూన్

దైవ వశముతో వచ్చిన తెల్ల ధనముతో (అందరికీ తెలిసేలా ఉండే సంపాదనతో) భృత్యులను బాధించకుండా న్యాయముగా యాగం చేయాలి

కుటుమ్బేషు న సజ్జేత న ప్రమాద్యేత్కుటుమ్బ్యపి
విపశ్చిన్నశ్వరం పశ్యేదదృష్టమపి దృష్టవత్

గృహస్థుడు కూడా కుటుంబం యందు ఎక్కువ ఆసక్తి కలిగి ఉండరాదు. ఎక్కువ పొరబాట్లు చేయరాదు. పండితుడైన వాడు, ఈ శరీరాన్ని ఈ రోజుకాకుంటే రేపైనా నశించేదిగానే చూడాలి. చూచిన రీతినే చూడనిది ఐన శరీరాదుల యొక్క నశ్వరత్వాన్ని తెలుసుకోవాలి

పుత్రదారాప్తబన్ధూనాం సఙ్గమః పాన్థసఙ్గమః
అనుదేహం వియన్త్యేతే స్వప్నో నిద్రానుగో యథా

భార్యా పిల్లలూ బంధువులూ మిత్రులూ హితులూ, వీరి కలయిక, సత్రములో కలవడం వంటిది. ఒక సత్రములో పక్క పక్క గదుల్లో ఉన్నవారితో సమానం. అందరూ తెల్లవారేదాకా ఉంటారు. బాటసారులు వారి ఊరు చేరేదాకే మనతో వస్తారు. పుత్ర దారాదుల సంగమం అలాంటి సంగమమే.
కల నిద్రను అనుసరించి ఉంటుంది. దేహం ఉన్నంతవరకే వీరంతా ఉంటారు. శరీరము పోవడముతోనే అందరూ పోతారు

ఇత్థం పరిమృశన్ముక్తో గృహేష్వతిథివద్వసన్
న గృహైరనుబధ్యేత నిర్మమో నిరహఙ్కృతః

ఇలా పరిశీలించి, అన్నీ వదలిపెట్టి, తన ఇంటిలో తాను యజమానిలా గాక ఒక అతిథిలా ఉండాలి.
గృహస్థాశ్రమముతో బంధనం పెట్టుకోరాదు. మమకార అహంకారాలు లేకుండా

కర్మభిర్గృహమేధీయైరిష్ట్వా మామేవ భక్తిమాన్
తిష్ఠేద్వనం వోపవిశేత్ప్రజావాన్వా పరివ్రజేత్

గృహ మేధి ఐన కర్మలతో నన్నే పూజించాలి. భక్తితో పూజించాలి. భక్తి కలిగి నన్నే ఆరాధిస్తే ఉంటే గృహస్థాశ్రమములో ఉండాలి, లేకుంటే వాన ప్రస్థం స్వీకరించాలి.

యస్త్వాసక్తమతిర్గేహే పుత్రవిత్తైషణాతురః
స్త్రైణః కృపణధీర్మూఢో మమాహమితి బధ్యతే

ఇంటియందే బాగా కోరిక ఉండి పుత్రేషణ ధనేషణా దారేషణా ఉండి, స్త్రీవ్యామోహం కలిగి లోభ బుద్ధి ఉండిన మూర్ఖుడు నేనూ నాదీ అంటూ సంసారములో బంధించబడతాడు

అహో మే పితరౌ వృద్ధౌ భార్యా బాలాత్మజాత్మజాః
అనాథా మామృతే దీనాః కథం జీవన్తి దుఃఖితాః

ఇల్లు వదలిపెట్టి పోకుండా ఉండడానికి ఇవన్నీ సాకులుగా చెబుతాడు. భార్య తల్లీ తండ్రులూ , పిల్లలూ వీరందరనూ సాకులుగా చూపి ఇంటినే అంటిపెట్టుకు ఉంటాడు

ఏవం గృహాశయాక్షిప్త హృదయో మూఢధీరయమ్
అతృప్తస్తాననుధ్యాయన్మృతోऽన్ధం విశతే తమః

ఇలా గృహం యందు మనసు తగులుకొని తృప్తి పొందక, వారినే ధ్యానం చేస్తూ కటిక చీకటి వంటి అజ్ఞ్యానాన్నీ నరకన్నీ పొందుతారు. గృహస్థాశ్రమం యందు శ్రద్ధ తగ్గించి ఉండాలి

                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                   సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

1 comment:

  1. కాకతాళీయంగా మీ యీ‌ బ్లాగును చూచాను చాలా బాగుంది.
    నేను ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తున్నాను, పోతనగారి భాగవతం గురించి.
    వీలు వెంబడి చూడండి:‌ శ్యామలీయం భాగవతం

    ReplyDelete