Saturday, September 28, 2013

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఐదవ అధ్యాయం

                                           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వాదశ స్కంధం ఐదవ అధ్యాయం




శ్రీశుక ఉవాచ
అత్రానువర్ణ్యతేऽభీక్ష్ణం విశ్వాత్మా భగవాన్హరిః
యస్య ప్రసాదజో బ్రహ్మా రుద్రః క్రోధసముద్భవః

ఈ భాగవతములో సకల జగద్రూపుడైన శ్రీమన్నారాయణుడు వర్ణించబడతారు
ఆయనకు సంతోషం వస్తే బ్రహ్మపుట్టాడు. కోపం వస్తే శివుడు పుట్టాడు. అలాంటి పరమాత్మ కథ శ్రీమద్భాగవతములో ఉంటుంది

త్వం తు రాజన్మరిష్యేతి పశుబుద్ధిమిమాం జహి
న జాతః ప్రాగభూతోऽద్య దేహవత్త్వం న నఙ్క్ష్యసి

చనిపోతాననే జంతుబుద్ధి వదలిపెట్టు. నీవు పుట్టలేదు, పుట్టబోవు, నశించవు
దేహం కలవాడు పుట్టడు. దేహం పుడుతుంది

న భవిష్యసి భూత్వా త్వం పుత్రపౌత్రాదిరూపవాన్
బీజాఙ్కురవద్దేహాదేర్వ్యతిరిక్తో యథానలః

కొడుకూ మనవడూ అందరూ నీవే అనుకుంటే, వారి రూపములో నీవు బతికే ఉన్నావు.
వారు నీవు కాదు అనుకుంటే , నీవు పుట్టనే లేదు.
నీవు పుట్టలేదు. ఇది వరకు పుట్టిలేవు.. మరణించవు, ఇది వరకు మరణించి లేవు. బీజం నుంచి వృక్ష్మూ వృక్షము నుండి బీజమూ ఎపుడూ పుడుతూనే ఉంటుంది
అగ్ని జల వాయు సంబంధముతోనే అది పుడుతుంది
శుక్ర శోణిత అగ్ని సంయోగముతోనే దేహం పుడుతుంది. ఆత్మకు ఈ వేటితోనూ సంబంధం లేదు

స్వప్నే యథా శిరశ్ఛేదం పఞ్చత్వాద్యాత్మనః స్వయమ్
యస్మాత్పశ్యతి దేహస్య తత ఆత్మా హ్యజోऽమరః

నీవు కలగంటావు, కలలో తల నరికేశారు అని అంటావు, అది నీవే చెబుతావు
నీ కలలో తల నరికి వేయుట ఎంత అబద్ధమో నీవు చచ్చుటా అంతే అబద్దం
ఏ శరీరములో ఉండి నీవు ఆత్మను చూస్తున్నావో దానికి పుట్టుకా మరణమూ రెండూ లేవు.

ఘటే భిన్నే ఘటాకాశ ఆకాశః స్యాద్యథా పురా
ఏవం దేహే మృతే జీవో బ్రహ్మ సమ్పద్యతే పునః

కుండ అంటే ఆకాశమే. ఆకాశానికి కప్పు వేస్తే కుండ. ఒక పరిమిత భాగం చుట్టూ ఒక ఆకారం వేసి ఆకాశాన్ని కప్పి ఉంచుతున్నాము. అదే కుండ పగలగొడితే ఆకాశం ఆకాశములోనే ఉంటుంది. దేహం పోతే ఆత్మ ఆత్మలాగే ఉంటుంది. ఆకాశానికి కుండ ఎలా ఆవరణమో, ఆత్మకు ఆవరణ దేహం. దేహాన్ని వదలి జీవుడు బ్రహ్మలో చేరతాడు.

మనః సృజతి వై దేహాన్గుణాన్కర్మాణి చాత్మనః
తన్మనః సృజతే మాయా తతో జీవస్య సంసృతిః

మనస్సే దేహాలనూ కర్మలనూ గుణాలనూ ఆత్మకు సృష్టిస్తుంది. అలాంటి మనసును మాయ సృష్టిస్తుంది. మాయతో జీవునికి సంసారం ఏర్పడుతుంది

స్నేహాధిష్ఠానవర్త్యగ్ని సంయోగో యావదీయతే
తావద్దీపస్య దీపత్వమేవం దేహకృతో భవః
రజఃసత్త్వతమోవృత్త్యా జాయతేऽథ వినశ్యతి

ప్రమిదలో నూనె ఉన్నంతవరకూ వత్తి కాలుతుంది. ప్రమిద ఉన్నా, నూనె లేకుంటే వత్తి కాలదు. దేహం ఉన్నా షేహం లేకుంటే మనసు సంస్కరించదు. సంస్కృతములో నూనెకు స్నేహం అని అంటారు. ఆ నూనే సంస్కారము.
గుణత్రయముతో పుట్టి గుణ త్రయముతోనే నశిస్తారు

న తత్రాత్మా స్వయంజ్యోతిర్యో వ్యక్తావ్యక్తయోః పరః
ఆకాశ ఇవ చాధారో ధ్రువోऽనన్తోపమస్తతః

ఈ ఆత్మ స్వయం జ్యోతి. అది వ్యక్తమూ అవ్యక్తమూ కాదు. రెంటికీ అవతల ఉంటుంది. ఆకాశములా ఆధారమైనది

ఏవమాత్మానమాత్మస్థమాత్మనైవామృశ ప్రభో
బుద్ధ్యానుమానగర్భిణ్యా వాసుదేవానుచిన్తయా

ఆత్మను పరమాత్మలో ఉన్న ఆత్మలాగే భావించి అనుమాన గర్భమైన బుద్ధితో పరమాత్మనే ధ్యానిస్తూ

చోదితో విప్రవాక్యేన న త్వాం ధక్ష్యతి తక్షకః
మృత్యవో నోపధక్ష్యన్తి మృత్యూనాం మృత్యుమీశ్వరమ్

బ్రాహ్మణ శాపముతో తఖకుడు కాల్చేది నిన్ను కాదు. నీ దేహాన్ని
మృత్యువులకు మృత్యువైన పరమాత్మను మృత్యువు ఎక్కడైనా అంటుందా

అహం బ్రహ్మ పరం ధామ బ్రహ్మాహం పరమం పదమ్
ఏవం సమీక్ష్య చాత్మానమాత్మన్యాధాయ నిష్కలే

పరమాత్మ పదమే నా స్థానము
నేనే పరమాత్మ నివాసానికి వెళతాను
అని ఇలా ఆత్మ స్వరూపాన్ని తలచుకుని పరమాత్మ యందు ఆత్మలో దీన్ని ఉంచి

దశన్తం తక్షకం పాదే లేలిహానం విషాననైః
న ద్రక్ష్యసి శరీరం చ విశ్వం చ పృథగాత్మనః

అలా చేస్తే తక్షకుడు వచ్చి కరుస్తున్నా నీవు దాన్ని చూడలేవు
ఆత్మ కంటే వేరుగా ప్రపంచాన్నీ చూడలేవు, నిన్ను కరుస్తున్న పామునూ చూడలేవు
కాలిపోతున్న నీ దేహాన్నీ చూడలేవు

ఏతత్తే కథితం తాత యదాత్మా పృష్టవాన్నృప
హరేర్విశ్వాత్మనశ్చేష్టాం కిం భూయః శ్రోతుమిచ్ఛసి

(ద్వితీయ స్కంధములో) నీవు అడిగిన 'ఆత్మ అంటే ఏమిటీ అన్న దానికి సమాధానం ఇది.
నీవు ఎలా ఆత్మ గురించి అడిగావో, ఈ ఆత్మా జగత్తూ అంటే పరమాత్మ యొక్క లీల అని చెప్పాను
ఇంకా నీవు ఏమి వినాలనుకుంటున్నావో చెప్పవలసింది.


                                                    సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                    సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment