Monday, August 5, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై రెండవ అధ్యాయం

                                                 ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం డెబ్బై రెండవ అధ్యాయం


శ్రీశుక ఉవాచ
ఏకదా తు సభామధ్య ఆస్థితో మునిభిర్వృతః
బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైర్భ్రాతృభిశ్చ యుధిష్ఠిరః

ఒక నాడు నిండు సభలో పెద్దలూ బ్రాహ్మణులూ బంధువులూ మిత్రులూ ఉండగా అందరినీ ఉద్దేశ్యించి ధర్మరాజు అన్నాడు

ఆచార్యైః కులవృద్ధైశ్చ జ్ఞాతిసమ్బన్ధిబాన్ధవైః
శృణ్వతామేవ చైతేషామాభాష్యేదమువాచ హ

శ్రీయుధిష్ఠిర ఉవాచ
క్రతురాజేన గోవిన్ద రాజసూయేన పావనీః
యక్ష్యే విభూతీర్భవతస్తత్సమ్పాదయ నః ప్రభో

అన్ని యజ్ఞ్యాలలోకీ ఉత్తమమైనదీ, క్రతురాజం అని పేరు గాంచినదీ ఈ రాజ సూయం. ఆ యజ్ఞ్యముతో మీ విభూతులను పూజిస్తాము, దాన్ని మీరు దగ్గర ఉండి జరిపించండి

త్వత్పాదుకే అవిరతం పరి యే చరన్తి
ధ్యాయన్త్యభద్రనశనే శుచయో గృణన్తి
విన్దన్తి తే కమలనాభ భవాపవర్గమ్
ఆశాసతే యది త ఆశిష ఈశ నాన్యే

ఎవరైతే నీ పాద పద్మాలను నిరంతరం ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారికి రాబోయే దుఃఖములూ అమంగళములూ కష్టములూ తొలగిపోయి సంసారమునుండి వారు విడుదలను పొందుతారు. ఎవరు నీ నుండి మోక్షాన్ని కోరతారో వారికే సంసారములో ఆపదలు తొలగిపోతాయి

తద్దేవదేవ భవతశ్చరణారవిన్ద
సేవానుభావమిహ పశ్యతు లోక ఏషః
యే త్వాం భజన్తి న భజన్త్యుత వోభయేషాం
నిష్ఠాం ప్రదర్శయ విభో కురుసృఞ్జయానామ్

నా కోసం కాదు, మీ పాదాలను సేవించుట వలన కలిగే అభివృద్ధి ఎటువంటిదో లోకానికి తెలియనీ.
నిన్ను భజించేవారు ఎలా ఉంటారు ,  భజించని వారి ఎలా ఉంటారు, ఉదాసీనముగా ఉండేవారు ఎలా ఉంటారో కురు సంజయ రాజ్యాలకు తెలియజేయి


న బ్రహ్మణః స్వపరభేదమతిస్తవ స్యాత్
సర్వాత్మనః సమదృశః స్వసుఖానుభూతేః
సంసేవతాం సురతరోరివ తే ప్రసాదః
సేవానురూపముదయో న విపర్యయోऽత్ర

నీకు నావాడు తనవాడు పరాయివాడు అన్న భేధం ఉండదు, నీవు అందరినీ ఒకే తీరుగా చూస్తావు, ఆత్మా రామునివి. కల్ప వృక్షానికి నావాడూ పరాయివాడూ అన్న భేధం లేదు. అడిగినవారికీ ఆశ్రయించినవారికి ఇస్తుంది. నీవు కూడా నిన్ను ఆశ్రయించినవారికి అన్ని సుఖాలూ ఇస్తావు, అది నీ స్వభావము.  మీరు నా క్రతువును దగ్గర ఉండి పూర్తి చేయండి

శ్రీభగవానువాచ
సమ్యగ్వ్యవసితం రాజన్భవతా శత్రుకర్శన
కల్యాణీ యేన తే కీర్తిర్లోకాననుభవిష్యతి

మంచి నిర్ణయాన్ని తీసుకున్నావు. నీవు ఈ యాగం చేయడం వలన పరమ మంగళమైన కీర్తిన్ వ్యాపిస్తుంది.

ఋషీణాం పితృదేవానాం సుహృదామపి నః ప్రభో
సర్వేషామపి భూతానామీప్సితః క్రతురాడయమ్

ప్రపంచములో ఋషులందరికీ పితృదేవతలకూ మిత్రులకూ మా అందరికీ ఈ యాగం అభీష్టమైనది. రాజులను జయించి రాజ్యాన్ని నీ వశములో ఉంచుకుని సర్వ సంబారాలనూ దగ్గర ఉంచుకుని ఈ యాగాన్ని పూర్తి చేయి. లోకపాలకుల అంశతో పుట్టినవారు నీ తమ్ములు..వారితో ఈ యాగాన్ని పూర్తి చేయి. మనసు తన వశములో లేని వారికి వశం కాని నన్ను నీ జ్ఞ్యానముతో వినయముతో శ్రద్ధతో భక్తితో ఇంద్రియ నిగ్రహముతో ధర్మాచరణతో వశం చేసుకున్నావు. లోకపాలకులైన వారు నీ తమ్ములు. తేజస్సులో కానీ, కీర్తిలో కాని సంపదలో కానీ, పరాక్రమములో గానీ నా కంటే అధికుడు ఎవరూ లేరు. తమ విభూతులతో నన్ను గానీ నా అనుగ్రహం పొందిన నిన్ను గానీ దేవతలే తిరస్కరించలేరు. ఇంక రాజుల సంగతి వేరే చెప్పాలా. ఇలా కృష్ణుడి మాటలు విని విపారిన ముఖం కలిగిన వాడై, పరమాత్మ తేజస్సుతో ఆవేశించబడిన తన సోదరులను దిగ్విజయానికి పంపించాడు. సృంజయ  రాజులతో సహదేవున్ని దక్షిణ దిక్కుకు  పంపించాడు. పశ్చిమ దిక్కుకు నకులున్నీ ఉత్తర దిక్కుకు అర్జనున్నీ తూర్పు దిక్కుకు కైకయా భద్రకా మత్స్య రాజుల సైన్యముతో భీమున్ని పంపాడు. అలా వెళ్ళినవారు తాము వెళ్ళిన దిక్కులను తమ బలపరాక్రమములతో జయించి అక్కడ నుండి అనేకములైన సంపదలను తీసుకు వచ్చారు.
ధర్మరాజుకు చాలా గొప్ప సంపదను తెచ్చి ప్రసాదించారు.

విజిత్య నృపతీన్సర్వాన్కృత్వా చ జగతీం వశే
సమ్భృత్య సర్వసమ్భారానాహరస్వ మహాక్రతుమ్

ఏతే తే భ్రాతరో రాజంల్లోకపాలాంశసమ్భవాః
జితోऽస్మ్యాత్మవతా తేऽహం దుర్జయో యోऽకృతాత్మభిః

న కశ్చిన్మత్పరం లోకే తేజసా యశసా శ్రియా
విభూతిభిర్వాభిభవేద్దేవోऽపి కిము పార్థివః

శ్రీశుక ఉవాచ
నిశమ్య భగవద్గీతం ప్రీతః ఫుల్లముఖామ్బుజః
భ్రాతౄన్దిగ్విజయేऽయుఙ్క్త విష్ణుతేజోపబృంహితాన్

సహదేవం దక్షిణస్యామాదిశత్సహ సృఞ్జయైః
దిశి ప్రతీచ్యాం నకులముదీచ్యాం సవ్యసాచినమ్
ప్రాచ్యాం వృకోదరం మత్స్యైః కేకయైః సహ మద్రకైః

తే విజిత్య నృపాన్వీరా ఆజహ్రుర్దిగ్భ్య ఓజసా
అజాతశత్రవే భూరి ద్రవిణం నృప యక్ష్యతే

శ్రుత్వాజితం జరాసన్ధం నృపతేర్ధ్యాయతో హరిః
ఆహోపాయం తమేవాద్య ఉద్ధవో యమువాచ హ

అందరినీ గెలిచాము గానీ జరాసంధుని గెలువలేదే, ఆ ఒక్క కొరతా ఉంది అని ఆలోచిస్తూ ఉంటే, తనకు ఉద్ధవుడు ఏ ఉపాయాన్నిచెప్పాడో అది ధర్మరాజుకు చెప్పి అర్జనుడూ భీముడూ తానూ బ్రాహ్మణ వేషములో బయలుదేరాడు.అథితులను పిలిచి ఆథిత్యం ఇచ్చే సమయములో వారు బ్రాహ్మణ వేషములో వెళ్ళారు. రాజులైనా బ్రాహ్మణుల వేషములో వెళ్ళి, "రాజా మేము అర్థులమై చాలా దూరం నుంచి వచ్చాము. మేము కోరినది ఇవ్వండి. ఓర్పు ఉన్నవారు సహించలేనిది లేదు. దుర్మార్గులు చేయరానిదీలేదు. దాతలకు ఇయ్యవారానిది లేదు. అందరినీ సమానముగా చూసేవారికి శత్రువులెవ్వరు. అనిత్యమైన శరీరముతో పదిమంది ఉత్తముల చేత గానం చేయబడే నిత్యమైన కీర్తిని సమర్ధుడై కూడా సంపాదించలేకుంటే అలాటివాడు విచారించదగినవాడవుతాడు. హరిశ్చంద్రాదులు రంతివేదుడూ శిబీ బలీ పావురమూ,ఇలా చాలా మంది అనిత్యమైన శరీరముతో నిత్యమైన కీర్తిని సంపాదించారు. ఆ పని మీరు కూడా చేయాలి"

భీమసేనోऽర్జునః కృష్ణో బ్రహ్మలిన్గధరాస్త్రయః
జగ్ముర్గిరివ్రజం తాత బృహద్రథసుతో యతః

తే గత్వాతిథ్యవేలాయాం గృహేషు గృహమేధినమ్
బ్రహ్మణ్యం సమయాచేరన్రాజన్యా బ్రహ్మలిఙ్గినః

రాజన్విద్ధ్యతిథీన్ప్రాప్తానర్థినో దూరమాగతాన్
తన్నః ప్రయచ్ఛ భద్రం తే యద్వయం కామయామహే

కిం దుర్మర్షం తితిక్షూణాం కిమకార్యమసాధుభిః
కిం న దేయం వదాన్యానాం కః పరః సమదర్శినామ్

యోऽనిత్యేన శరీరేణ సతాం గేయం యశో ధ్రువమ్
నాచినోతి స్వయం కల్పః స వాచ్యః శోచ్య ఏవ సః

హరిశ్చన్ద్రో రన్తిదేవ ఉఞ్ఛవృత్తిః శిబిర్బలిః
వ్యాధః కపోతో బహవో హ్యధ్రువేణ ధ్రువం గతాః

శ్రీశుక ఉవాచ
స్వరైరాకృతిభిస్తాంస్తు ప్రకోష్ఠైర్జ్యాహతైరపి
రాజన్యబన్ధూన్విజ్ఞాయ దృష్టపూర్వానచిన్తయత్

వారు ఇంత మాట్లాడాక జరాసంధుడు వారిని పరిశీలనగా చూసి వారు బ్రాహ్మణులు కారు క్షత్రియులు అని గుర్తుపట్టాడు. భుజముల మీద ధనువుయొక్క నారి లాగి,లాగి కాయలు కాస్తాయి. ఆ గుర్తులు చూసాడు

రాజన్యబన్ధవో హ్యేతే బ్రహ్మలిఙ్గాని బిభ్రతి
దదాని భిక్షితం తేభ్య ఆత్మానమపి దుస్త్యజమ్

బలేర్ను శ్రూయతే కీర్తిర్వితతా దిక్ష్వకల్మషా
ఐశ్వర్యాద్భ్రంశితస్యాపి విప్రవ్యాజేన విష్ణునా

శ్రియం జిహీర్షతేన్ద్రస్య విష్ణవే ద్విజరూపిణే
జానన్నపి మహీమ్ప్రాదాద్వార్యమాణోऽపి దైత్యరాట్

ఇదివరకూ చాలా సార్లు చూసిన వారే అని కూడా గుర్తుపట్టాడు. వీరంతా క్షత్రియులే గానీ బ్రాహ్మణ వేషాలు ధరించారు. కావాలంటే నన్ను కూడా నేను ఇచ్చుకుంటాను, స్వయముగా వచ్చి యాచించారు. విష్ణువంతటివాదు వచ్చి యాచిస్తే తెలిసి కూడా దానమిచ్చి బలి చక్రవర్తి ఇప్పటిదాకా నిలిచి ఉన్న కీర్తిని పొందాడు. అతను విష్ణువని గురువుగారు చెప్పినా ఆ మాట మన్నించకుండా ఆయన దానం చేసాడు. క్షత్రియుడు బతికేది బ్రాహ్మణుల కోసం. వారి కోసం ప్రాణం విడిచినా గొప్ప కీర్తి వస్తుంది. వీరు అడిగింది ఇవ్వకున్నా ఈ శరీరం ఉండదు. ఎలాగూ పోయే శరీరాన్ని బ్రాహ్మణులకు దానం ఇచ్చి కీర్తిని పెంచుకోవడం ఉత్తమం. అని తలచి. బ్రాహ్మణోత్తములారా ఏమి కావాలో అడగండి, మీరు అడిగితే నా శిరస్సునుకూడా ఇస్తాను. అపుడు వారు రాజేంద్రా మేము యుద్ధం కోరి వచ్చాము. భోజనాన్ని కోరే బ్రాహ్మణులం కాము, యుద్ధాన్ని కోరే క్షత్రియులం. ఇతను భీముడూ అతను అర్జనుడు, నేను వీరిద్దరి మేనమామ కొడుకుని, నీకు శత్రువునూ, నన్ను కృష్ణుడు అంటారు. ఇలా పరిచయం చేస్తే జరాసంధుడు పెద్దగా నవ్వి, మీరంతా  బుద్ధి తక్కువ వారు. కృష్ణుడితో "నీకు యుద్ధమంటే భయం. నీతో నేను యుద్ధం చేయను. నా పై భయముతో మధురా నగరం విడిచిపెట్టి సముద్రములో దాక్కునాడు. అర్జనుడు వయసులో నాతో సమానమైనా బలములో సమానం కాదు.నాతో సరి బలుడు భీముడు.అతనితో యుద్ధం చేస్తాను" అని జరాసంధుడే గదను భీముడికి ఇచ్చి రెండవ గదను తాను తీసుకుని, నగరమునుండి వెలుపలికి వచ్చి యుద్ధం చేసారు. సమానమైన భూమిని చూచి, వజ్రముల వంటి గదలతో పరస్పరం కొట్టుకున్నారు. రెండు వజ్రాయుధాలు రాసుకుంటే ఎలాంటి ధ్వని వస్తుందో అలాంటి మినుగురులూ ప్రకాశం కనపడ్డాయి.  దంతములు గల ఏనుగులు తమ దంతములతో పరస్పరం పోరాడితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. రెండు ఏనుగులు కోట్లాడుతుంటే ఎలాంటి భీకరమైన దృశ్యం కనపడుతుందో భుజములూ వక్షస్థలమూ నడుములూ ఊరువులూ పాదములూ ఇలా గదా ఘాతముతో చూర్ణములవుతున్నాయి. మళ్ళీ కోలుకుని యుద్ధం చేస్తున్నారు. గదతో ముష్టి ఘాతాలతో కొట్టుకుటున్నారు. వజ్రాయుధ సంగర్షణ వలన వచ్చే ధ్వని కలుగుతోంది. ఒకరిని  మించిన్వారే గాని ఎవరూ తక్కువవారు ఎవరూ లేరు.

జీవతా బ్రాహ్మణార్థాయ కో న్వర్థః క్షత్రబన్ధునా
దేహేన పతమానేన నేహతా విపులం యశః

ఇత్యుదారమతిః ప్రాహ కృష్ణార్జునవృకోదరాన్
హే విప్రా వ్రియతాం కామో దదామ్యాత్మశిరోऽపి వః

శ్రీభగవానువాచ
యుద్ధం నో దేహి రాజేన్ద్ర ద్వన్ద్వశో యది మన్యసే
యుద్ధార్థినో వయం ప్రాప్తా రాజన్యా నాన్యకాఙ్క్షిణః

అసౌ వృకోదరః పార్థస్తస్య భ్రాతార్జునో హ్యయమ్
అనయోర్మాతులేయం మాం కృష్ణం జానీహి తే రిపుమ్

ఏవమావేదితో రాజా జహాసోచ్చైః స్మ మాగధః
ఆహ చామర్షితో మన్దా యుద్ధం తర్హి దదామి వః

న త్వయా భీరుణా యోత్స్యే యుధి విక్లవతేజసా
మథురాం స్వపురీం త్యక్త్వా సముద్రం శరణం గతః

అయం తు వయసాతుల్యో నాతిసత్త్వో న మే సమః
అర్జునో న భవేద్యోద్ధా భీమస్తుల్యబలో మమ

ఇత్యుక్త్వా భీమసేనాయ ప్రాదాయ మహతీం గదామ్
ద్వితీయాం స్వయమాదాయ నిర్జగామ పురాద్బహిః

తతః సమేఖలే వీరౌ సంయుక్తావితరేతరమ్
జఘ్నతుర్వజ్రకల్పాభ్యాం గదాభ్యాం రణదుర్మదౌ

మణ్డలాని విచిత్రాణి సవ్యం దక్షిణమేవ చ
చరతోః శుశుభే యుద్ధం నటయోరివ రఙ్గిణోః

తతశ్చటచటాశబ్దో వజ్రనిష్పేససన్నిభః
గదయోః క్షిప్తయో రాజన్దన్తయోరివ దన్తినోః

తే వై గదే భుజజవేన నిపాత్యమానే
అన్యోన్యతోऽంసకటిపాదకరోరుజత్రుమ్
చూర్ణీబభూవతురుపేత్య యథార్కశాఖే
సంయుధ్యతోర్ద్విరదయోరివ దీప్తమన్వ్యోః

ఇత్థం తయోః ప్రహతయోర్గదయోర్నృవీరౌ
క్రుద్ధౌ స్వముష్టిభిరయఃస్పరశైరపిష్టామ్
శబ్దస్తయోః ప్రహరతోరిభయోరివాసీన్
నిర్ఘాతవజ్రపరుషస్తలతాడనోత్థః

తయోరేవం ప్రహరతోః సమశిక్షాబలౌజసోః
నిర్విశేషమభూద్యుద్ధమక్షీణజవయోర్నృప

శత్రోర్జన్మమృతీ విద్వాఞ్జీవితం చ జరాకృతమ్
పార్థమాప్యాయయన్స్వేన తేజసాచిన్తయద్ధరిః

సఞ్చిన్త్యారీవధోపాయం భీమస్యామోఘదర్శనః
దర్శయామాస విటపం పాటయన్నివ సంజ్ఞయా

తద్విజ్ఞాయ మహాసత్త్వో భీమః ప్రహరతాం వరః
గృహీత్వా పాదయోః శత్రుం పాతయామాస భూతలే

ఏకమ్పాదం పదాక్రమ్య దోర్భ్యామన్యం ప్రగృహ్య సః
గుదతః పాటయామాస శాఖమివ మహాగజః

ఏకపాదోరువృషణ కటిపృష్ఠస్తనాంసకే
ఏకబాహ్వక్షిభ్రూకర్ణే శకలే దదృశుః ప్రజాః

హాహాకారో మహానాసీన్నిహతే మగధేశ్వరే
పూజయామాసతుర్భీమం పరిరభ్య జయాచ్యతౌ

సహదేవం తత్తనయం భగవాన్భూతభావనః
అభ్యషిఞ్చదమేయాత్మా మగధానాం పతిం ప్రభుః
మోచయామాస రాజన్యాన్సంరుద్ధా మాగధేన యే

ఎవరి బలమూ తగ్గడం లేదు. ఎవరి శక్తీ తగ్గడం లేదు. ఇరవై ఏడు రోజులు రాత్రీ పగలూ తేడాలేకుండా యుద్ధం చేసారు. భీముడు చివరకు అలసిపోయి వాడిని చంపడం నా వలన కాదు అన్నాడు.
అపుడు కృష్ణుడు "నేనే ఒకవిషయం మరచిపోయాను" అని చెప్పి వైష్ణవ తేజస్సుని భీమునిలో ఆవేశింపచేసాడు. జరాసంధుడు తన తల్లి నుండి రెండు భాగాలుగా పుడితే వాడిని అవతల పారేస్తే జరా అనే ఒక రాక్షసి చూసి రెండు భాగాలను అతికించి తన శక్తితో ప్రాణం పోసింది. తన మొదటి స్థితి( రెండు భాగాలు) కి తెస్తే అతని ప్రాణం పోతుంది. శత్రు సంహారాన్ని ఆలోచించి సఫలమైన్ జ్ఞ్యానం కలిగిన స్వామి పక్క ఉన్న మొక్కను లాగి రెండుగా చీల్చి చూపించాడు భీమునుకి. ఉపాయం తెలుసుకున్న భీముడు జరాసంధుని రెండు కాళ్ళూ పట్టుకుని, ఒక పాదాన్ని తన పాదముతో గట్టిగా వత్తిపెట్టి ఆక్రమించి రెండవ చేత్తో అతని భుజములు ఆక్రమించి పెద్ద ఏనుగు ఒక చెట్టు కొమ్మను చీల్చినట్లుగా జరాసంధుని రెండుగా చీల్చి వేసాడు. ఒక కన్ను, ఒక చేయి, ఒక చెవి, ఒక భాగం నోరు, ఒక భుజం, ఇలా అన్నీ ఒకటొకటిగా ఉన్న జరాసంధుని ప్రజలు చూచి అతను చనిపోవడం చూచి ప్రజలు హాహాకారాలు చేసారు. కృష్ణార్జునులు భీమున్ని కౌగిలించుకుని అభినందించారు.
జరాసంధుని కుమారుడైన సహదేవున్ని రాజుగా పట్టాభిషేకం చేసి జరాసంధుని చేత బంధించబడిన రాజులని విడిపించారు.

                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                   సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

No comments:

Post a Comment