Thursday, August 29, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం

                                                            ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం

శ్రీఉద్ధవ ఉవాచ
వదన్తి కృష్ణ శ్రేయాంసి బహూని బ్రహ్మవాదినః
తేషాం వికల్పప్రాధాన్యముతాహో ఏకముఖ్యతా

జీవుడు లోకములో పొందవలసిన ఉత్తమ గతులు చాలా ఉన్నాయి (సారూప్యం సాయుజ్యం...). ఇవన్నీ దేనికై వేరా, ఒకే దాని యొక్క రూపాంతరాలా, అన్నీ ఒకటేనా

భవతోదాహృతః స్వామిన్భక్తియోగోऽనపేక్షితః
నిరస్య సర్వతః సఙ్గం యేన త్వయ్యావిశేన్మనః

కర్మ జ్ఞ్యాన భక్తి ప్రపతీ అవతార జ్ఞ్యాన మొదలైన వన్నీ మోక్షాన్నిస్తాయని అన్నారు. ఇవన్నీ కలిపి ఇస్తాయా? దేనికవి వేరు వేరుగా ఇస్తాయా. వీటన్నిటి స్వరూపం ఒకటేనా,గుణం ఒకటేనా?
సంగ రహితమైన భక్తి యోగం, అన్ని సంగాలూ తొలగించి నీ యందు మనసు నిలుపుతుంది అని చెప్పారు. మరి జ్ఞ్యాన కర్మ యోగాలు నిలుపవా?

శ్రీభగవానువాచ
కాలేన నష్టా ప్రలయే వాణీయం వేదసంజ్ఞితా
మయాదౌ బ్రహ్మణే ప్రోక్తా ధర్మో యస్యాం మదాత్మకః

నన్ను చేరడానికి కావలసిన ధర్మ సాధనముగా ఉన్న ఈ విధానాన్నే వేదం అని అన్నారు. ఇది ప్రళయకాలములో అస్తమించింది. నేను సృష్టి కాలములో బ్రహ్మకు ఉపదేశించాను. నా స్వరూపాన్ని బోధించే ధర్మం ఇందులో చెప్పబడి ఉంది

తేన ప్రోక్తా స్వపుత్రాయ మనవే పూర్వజాయ సా
తతో భృగ్వాదయోऽగృహ్ణన్సప్త బ్రహ్మమహర్షయః

నా వలన విన్న బ్రహ్మ మనువుకు చెప్పాడు. మనువు దీన్ని ఇక్ష్వాకుకు చెప్పగా, వారినుండి మరీచి అత్రి బృగువాదులు, వారి నుండి వారి పుత్రులూ. అలా మానవులూ రాక్షసులూ యక్షులూ కింపురుషులూ గంధర్వులూ సిద్ధులూ విద్యాధరులూ కిన్నెరులూ నాగులూ, ఎందరో సత్వ రజస్తమో గుణములు కలిగి ఉన్నవారు స్వీకరించారు

తేభ్యః పితృభ్యస్తత్పుత్రా దేవదానవగుహ్యకాః
మనుష్యాః సిద్ధగన్ధర్వాః సవిద్యాధరచారణాః

కిన్దేవాః కిన్నరా నాగా రక్షఃకిమ్పురుషాదయః
బహ్వ్యస్తేషాం ప్రకృతయో రజఃసత్త్వతమోభువః

యాభిర్భూతాని భిద్యన్తే భూతానాం పతయస్తథా
యథాప్రకృతి సర్వేషాం చిత్రా వాచః స్రవన్తి హి

ఇలా ఇంత మంది తీసుకున్న ఈ విద్యతో భూతములలో భేధం వచ్చింది, వారి బుద్ధులు కూడా భిన్నమయ్యాయి. రకరకాలుగా దన్ని విన్నవారు, వారు అర్థం చేసుకున్న దాన్ని వినే వారికి బోధించారు. ఇలా అది అంతా మారింది.

ఏవం ప్రకృతివైచిత్ర్యాద్భిద్యన్తే మతయో నృణామ్
పారమ్పర్యేణ కేషాఞ్చిత్పాషణ్డమతయోऽపరే

కొందరు పాఖండ మతస్తులయ్యారు. అదంతా నా మాయ. వారి బుద్ధి మోహించబడింది

మన్మాయామోహితధియః పురుషాః పురుషర్షభ
శ్రేయో వదన్త్యనేకాన్తం యథాకర్మ యథారుచి

శ్రేయస్సును, వారి వారి అభిరుచిని బట్టి మార్చి చెప్పారు. వారి వారి కర్మను బట్టి, వారి స్వభావన్ని బట్టి మార్చ్ చెప్పారు

ధర్మమేకే యశశ్చాన్యే కామం సత్యం దమం శమమ్
అన్యే వదన్తి స్వార్థం వా ఐశ్వర్యం త్యాగభోజనమ్
కేచిద్యజ్ఞం తపో దానం వ్రతాని నియమాన్యమాన్

కొందరు ధర్మాన్ని కొందరు కామాన్ని కొందరు కీర్తిని కొందరు సత్యాన్ని కొందరు దమాన్ని కొందరు శమాన్నీ, కొందరు స్వార్థమే శ్రేయస్సన్ని, కొందరు ఐశ్వర్యం శ్రేయస్సనీ
యజ్ఞ్యమూ తపమూ దానమూ నియమమూ యమమూ ఇలాంటీ వాటిని శ్రేయస్సంటారు

ఆద్యన్తవన్త ఏవైషాం లోకాః కర్మవినిర్మితాః
దుఃఖోదర్కాస్తమోనిష్ఠాః క్షుద్రా మన్దాః శుచార్పితాః

అన్ని లోకాలూ మనం ఆచరించే కర్మ వలన ఏర్పడేవే. ఈ లోకాలన్నీ దుఃఖమునకు ఫలించేవి, తమస్సులో ఉండేవి. ఉండే స్వల్పమైన ఆనందం కూడా దుఃఖములోనే ఉంటుంది

మయ్యర్పితాత్మనః సభ్య నిరపేక్షస్య సర్వతః
మయాత్మనా సుఖం యత్తత్కుతః స్యాద్విషయాత్మనామ్

నా యందే మనసు ఉంచిన వారికి అంతటా నేనే కనపడుతూ ఉంటాను కాబట్టి వారికి మాయ కలుగదు. విషయములయందే మనసు ఉంచిన వారికి నా మీద భక్తి ఎలా కలుగుతుంది. నా మీద భక్తి ఉన్నవారు పొందే ఆనందం వారు ఎలా పొందుతారు

అకిఞ్చనస్య దాన్తస్య శాన్తస్య సమచేతసః
మయా సన్తుష్టమనసః సర్వాః సుఖమయా దిశః

ఏమీ లేనివారూ, ఏమీ కావాలి అని కోరుకోనివారు, ఇంద్రియ నిగ్రహం కలవారూ, శాంతులూ, దేని యందూ ఆశ లేనివారు, సర్వత్రా సమబుద్ధి కలవారికి అంతా సుఖమే. అన్ని వైపులా ఆనందమే.

న పారమేష్ఠ్యం న మహేన్ద్రధిష్ణ్యం
న సార్వభౌమం న రసాధిపత్యమ్
న యోగసిద్ధీరపునర్భవం వా
మయ్యర్పితాత్మేచ్ఛతి మద్వినాన్యత్

ఎందుకంటే నేను తప్ప వారు దేన్నీ కోరరు. బ్రహ్మ లోకం, మహేంద్ర పదవీ చక్రవర్తిత్వం రసాతలాధిపత్యమూ, యోగమూ సిద్ధీ మోక్షమూ మరి దేన్నీ కోరరు

న తథా మే ప్రియతమ ఆత్మయోనిర్న శఙ్కరః
న చ సఙ్కర్షణో న శ్రీర్నైవాత్మా చ యథా భవాన్

నన్ను తప్ప మరి దేన్నీ వారు కోరరు. అలాంటి వారి కన్నా బ్రహ్మా సంకర్షణుడూ శివుడూ అమ్మవారూ నాకు అంత ప్రీతి పాత్రులు కారు.నన్ను మాత్రమే కోరిన వారు నాకెంత ప్రియులో,నాకు నేను కూడా నాకు అంత ప్రీతి పాత్రున్ని కాను

నిరపేక్షం మునిం శాన్తం నిర్వైరం సమదర్శనమ్
అనువ్రజామ్యహం నిత్యం పూయేయేత్యఙ్ఘ్రిరేణుభిః

ఏమీ కోరని వాడు  , మౌని , పరమశాంతుడు, ఎవరినీ ద్వేషించని వాడు, అందరిలో సమానముగా నన్ను చూసేవాడి పాద పరాగమముతో నేనే పావనమవుతా అన్న భావనతో అటువంటి వారిని నేను అనుసరిస్తూ ఉంటాను

నిష్కిఞ్చనా మయ్యనురక్తచేతసః శాన్తా మహాన్తోऽఖిలజీవవత్సలాః
కామైరనాలబ్ధధియో జుషన్తి తే యన్నైరపేక్ష్యం న విదుః సుఖం మమ

ఏదీ లేని వారు, దేని యందూ ఆశలేని వారు గుణ రహితులూ, నాయందు మాత్రమే ప్రేమ ఉన్నవారు, శాంతులూ,అన్ని ప్రాణుల యందూ వాత్సల్యం కలవారు, కోరికలతో కప్పిపుచ్చని మనసు గలవారు, అలాంటి వారు దేనినీ కోరనందువలన ఉండే సుఖం వారికి మాత్రమే తెలుసు.

బాధ్యమానోऽపి మద్భక్తో విషయైరజితేన్ద్రియః
ప్రాయః ప్రగల్భయా భక్త్యా విషయైర్నాభిభూయతే

నిరపేక్షులు పొందే ఆనందం మిగతావారికి అర్థమే కాదు.ఇంద్రియ నిగ్రహం లేకున్నా, ఇంద్రియములు బాధిస్తూ ఉన్నా, విషయాలలో ప్రవర్తిస్తూ ఉన్నా నా భక్తుడైతే అలాంటివాడిని విషయములు పూర్తిగా ఆక్రమించలేవు. సాంసారిక విషయ భోగాల యందు ప్రవర్తించాలని కోరిక ఉన్నా, వారు ఆ ప్రవృత్తే పరమార్థముగా భావించడు. పరమాత్మే నా చేత ఇలా ప్రవర్తింపచేస్తున్నాడు అని తెలుసుకుంటాడు. భగవంతుని యందు భారమూ నమ్మకం ఉన్నవారికి ఆశలూ అభిలాషలూ ఉన్నా, ఆశలు తీరకపోతే పెద్దగా బాధపడడు, తీరితే సంతోషించడు

యథాగ్నిః సుసమృద్ధార్చిః కరోత్యేధాంసి భస్మసాత్
తథా మద్విషయా భక్తిరుద్ధవైనాంసి కృత్స్నశః

బాగా ప్రజ్వరిల్లిన అగ్ని సమిధలను దగ్ధం చేసినట్లుగా, నా యందు ఉన్న భక్తి అతని పాపములను సంగ్రముగా భస్మం చేస్తుంది

న సాధయతి మాం యోగో న సాఙ్ఖ్యం ధర్మ ఉద్ధవ
న స్వాధ్యాయస్తపస్త్యాగో యథా భక్తిర్మమోర్జితా

స్వాధ్యాయమూ తపస్సూ యోగమూ సాంఖ్యమూ త్యాగమూ, ఇవేవీ భక్తి నన్ను చేర్చినట్లుగా చేర్చలేవు. నేను కేవలం భక్తితో  గ్రహించబడతాను.

భక్త్యాహమేకయా గ్రాహ్యః శ్రద్ధయాత్మా ప్రియః సతామ్
భక్తిః పునాతి మన్నిష్ఠా శ్వపాకానపి సమ్భవాత్

నేను సజ్జనులకు ప్రీతి పాత్రుడిని. నా యందు ఉండే భక్తి వాడిని పాపం చేస్తుంది. చండాలురను కూడా నా యందు ఉందే భక్తి పావనం చేస్తుంది.

ధర్మః సత్యదయోపేతో విద్యా వా తపసాన్వితా
మద్భక్త్యాపేతమాత్మానం న సమ్యక్ప్రపునాతి హి

సత్యం దయ, దానితో కూడి ఉన్న ధర్మం గానీ, తపస్సుతో కూడిన విద్య గానీ, నా భక్తి లేని వాడిని అంత బాగా పవిత్రం చేయజాలదు.

కథం వినా రోమహర్షం ద్రవతా చేతసా వినా
వినానన్దాశ్రుకలయా శుధ్యేద్భక్త్యా వినాశయః

భక్తి లేని మనసు ఎండిపోతుంది. అందులో ఆర్థ్రత ఉండదు.నా కథలూ గుణలూ వింటూ ఉంటే నా నామాలు కీర్తిస్తూ ఉంటే నా భజన చేస్తుంటే శరీరం పులకించకుండా మనసు కరగకుండా కళ్ళకు ఆనందాశ్రువులు రాకుంటే పవిత్రత ఎలా కలుగుతుంది. భక్తి లేని మనసు ఎలా శుద్ధి పొందుతుంది

వాగ్గద్గదా ద్రవతే యస్య చిత్తం రుదత్యభీక్ష్ణం హసతి క్వచిచ్చ
విలజ్జ ఉద్గాయతి నృత్యతే చ మద్భక్తియుక్తో భువనం పునాతి

నా గుణాలనీ నా నామాలనూ నా కథలనూ స్మరిస్తూ ఉంటే ఆనందముతో వాక్కూ కంఠమూ బొంగురు కావాలి. మనసు ద్రవించాలి
ఆనందముతో నవ్వుతాడు, ఏడుస్తాడు, సిగ్గు విడిచి పెద్దగా గానం చేస్తాడు, నాట్యం చేస్తాడు

యథాగ్నినా హేమ మలం జహాతి ధ్మాతం పునః స్వం భజతే చ రూపమ్
ఆత్మా చ కర్మానుశయం విధూయ మద్భక్తియోగేన భజత్యథో మామ్

లోకాన్ని పావనం చేస్తాడు
నిప్పుతో బంగారం తన మురికిని వదులుకున్నట్లుగా, కరిగిస్తే అది తన వాస్తవ స్వరూపాన్ని పొందినట్లుగా ఆత్మ కూడా కర్మ వలన పొందిన సంస్కారాన్ని తొలగించి నా భక్తితో నన్ను పొందుతాడు

యథా యథాత్మా పరిమృజ్యతేऽసౌ మత్పుణ్యగాథాశ్రవణాభిధానైః
తథా తథా పశ్యతి వస్తు సూక్ష్మం చక్షుర్యథైవాఞ్జనసమ్ప్రయుక్తమ్

పవిత్రమైన నా గాధలనూ వినడమూ చెప్పడముచే పరిశుద్ధి చేయబడతాడు. వింటున్న కొద్దీ చెబుతున్న కొద్దీ ధ్యానం చేస్తున్న కొద్దీ క్రమ క్రమముగా కాటుక పెట్టిన కన్ను అతి సూక్ష్మమైన రూపాన్ని ఎలా చూడగలదో నా భక్తితో నా కథలను విన్న మనసు పరిశుద్ధమై అతి సూక్ష్మమైన నా రూపాన్ని చూడగలదు

విషయాన్ధ్యాయతశ్చిత్తం విషయేషు విషజ్జతే
మామనుస్మరతశ్చిత్తం మయ్యేవ ప్రవిలీయతే

ఊరికే ఎపుడూ విషయాలను ధ్యానం చేస్తూ ఉంటే అక్కడే ఉంటుంది. అదే నన్ను ధ్యానం చేస్తే నా యందే ఉంటుంది.

తస్మాదసదభిధ్యానం యథా స్వప్నమనోరథమ్
హిత్వా మయి సమాధత్స్వ మనో మద్భావభావితమ్

కాబట్టి, చెడును ధ్యానం చేయకూడదు. స్వప్నములో మనం పొందాలనుకునే మనోరథాలను కూడా ధ్యానం చేయరాదు. వాటిని విడిచిపెట్టి నిరంతరం నా భావముతో భావించబడి నన్నే ధ్యానిస్తున్న మనసును నా యందు లగ్నం చేస్తే, నిరంతరం నన్నే చూస్తూ ఉంటావు

స్త్రీణాం స్త్రీసఙ్గినాం సఙ్గం త్యక్త్వా దూరత ఆత్మవాన్
క్షేమే వివిక్త ఆసీనశ్చిన్తయేన్మామతన్ద్రితః

స్త్రీ స్వరూపాన్ని ధ్యానం చేసేవారు గానీ, స్త్రీ స్వరూపాన్ని ధ్యానించేవారితో కలసి ఉండేవారితో గానీ సంగాన్ని విడిచిపెట్టి మనో నిగ్రహం కలవాడై, ఏకాంతమైన ప్రదేశములో ఉండి, ఏమరపాటు లేకుండా నన్నే ఎపుడూ ధ్యానం చేస్తూ ఉండాలి

న తథాస్య భవేత్క్లేశో బన్ధశ్చాన్యప్రసఙ్గతః
యోషిత్సఙ్గాద్యథా పుంసో యథా తత్సఙ్గిసఙ్గతః

స్త్రీ సంగం వలన కానీ, స్త్రీ సంగాన్ని కోరేవారి సంగాన్ని కానీ కలసి ఉండడం మహాప్రమాదం. మొదట ఇలాంటి కామ అభిరతిని పూర్తిగా విడిచిపెట్టాలి.

శ్రీద్ధవ ఉవాచ
యథా త్వామరవిన్దాక్ష యాదృశం వా యదాత్మకమ్
ధ్యాయేన్ముముక్షురేతన్మే ధ్యానం త్వం వక్తుమర్హసి

మిమ్ములను ఎలా ధ్యానం చేయాలి. నిన్ను ఏ రూపములో ఉన్నవాడిగా ధ్యానం చేయాలి. నీ స్వరూపం ఏమిటి ఆకారం ఏమిటి

శ్రీభగవానువాచ
సమ ఆసన ఆసీనః సమకాయో యథాసుఖమ్
హస్తావుత్సఙ్గ ఆధాయ స్వనాసాగ్రకృతేక్షణః

మొదట ఆసనం ఎత్తు పల్లాలూ లేకుండా సమానముగా ఉండాలి. కూర్చునేవాడు కూడా సమకాయుడై నిటారుగా కూర్చోవాలి.చేతులు రెండూ తొడ మీద పెట్టుకుని, దృష్టి నాసికాగ్రమున ఉంచి ప్రాణాయామం చేయాలి

ప్రాణస్య శోధయేన్మార్గం పూరకుమ్భకరేచకైః
విపర్యయేణాపి శనైరభ్యసేన్నిర్జితేన్ద్రియః

గాలిని విడుచుటా, గాలిని స్వీకరించుట, స్వీకరించిన దాన్ని ఉంచుట (రేచక పూరక కుంభక). రేచకముతో మొదలుపెట్టి పూరకముతో ఆపవచ్చు, లేక్దా పూరకముతో మొదలుపెట్టి రేచకము వరకూ చేయాలి. మెల మెల్లగా చేయాలి.
ప్రాణాయామం వలన ఇంద్రియ జయం కలుగుతుంది. వాయువు ఏ ఏ భాగము నుండి ఎలా ఎలా ప్రవర్తిస్తోందో తెలుసుకోవాలి. మనసు వాయువు యందు లంగం చేసి, అలా రోజూ అలవాటు చేస్తే దేని యందు ఉంచాలకుంటామో దాని యందు మనసు ఉంచగల గుణం అబ్బుతుంది. ఇంద్రియ మనో నిగ్రహానికి ఇది మూలం

హృద్యవిచ్ఛినమోంకారం ఘణ్టానాదం బిసోర్ణవత్
ప్రాణేనోదీర్య తత్రాథ పునః సంవేశయేత్స్వరమ్

హృదయములో అవిచ్చినముగా జరిగే, ఘంటానాదములా వినపడే  ఓంకారాన్ని ప్రాణ వాయువుతో పట్టుకోవాలి. పూరక కుంభక రేచకములతో ఓం కారమును ధ్యానం చేయగలగాలి. ప్రాణాయామం వాయువు నుండి ఓంకారానికి మరల్చి, ఆ స్వరములో ఉంచి

ఏవం ప్రణవసంయుక్తం ప్రాణమేవ సమభ్యసేత్
దశకృత్వస్త్రిషవణం మాసాదర్వాగ్జితానిలః

ఓంకారముతో కూడుకునే దానిలా ప్రాణ వాయును అభ్యసించాలి. ఒక నెలలోపు రోజూ మూడు వేళలలో పూటకు పది సార్లుగా అభ్యాసం చేస్తే మనం అపుడు వాయువును జయించిన వారమవుతాము.

హృత్పుణ్డరీకమన్తఃస్థమూర్ధ్వనాలమధోముఖమ్
ధ్యాత్వోర్ధ్వముఖమున్నిద్రమష్టపత్రం సకర్ణికమ్

హృదయములో పుండరీకం యొక్క ఆకారములాగ ఒక పద్మం ఉంటుంది. ఈ హృదయ పద్మములో నాలం పైకి ఉంటుంది, దళములు కిందకు ఉంటాయి. ఇలా ఉన్న దానిని ఊర్ధ్వ ముఖముగా, వికసించి ఉన్నటువంటి, అష్టపత్రము ఉన్నదానిగా ధ్యానం చేసి

కర్ణికాయాం న్యసేత్సూర్య సోమాగ్నీనుత్తరోత్తరమ్
వహ్నిమధ్యే స్మరేద్రూపం మమైతద్ధ్యానమఙ్గలమ్

హృదయ మధ్య భాగములో సూర్య సోమ అగ్ని, ఇలా మొదట అగ్నినీ, సోముడినీ, సూర్యుడినీ స్థాపించి,అలా ఉంచిన అగ్ని మధ్యములో నన్ను ధ్యానించాలి.
ప్రాణాయామముతో ప్రాణాన్నీ, ఇంద్రియాన్ని వశం చేసుకుని, ఓంకార యుక్త ప్రాణాయామం చేసి, కిందకు దళములూ పైకి నాలమూ ఉన్న పద్మాన్ని పైకి దళములు ఉన్న దానిగా ధ్యానం చేసి, అందులో అగ్ని సోమ సూర్య ఆకారాలు ప్రతిష్ఠ చేసి, అందులో ఉన్న అగ్నిలో నా ధ్యాన రూపాన్ని ప్రవేశింపచేసి

సమం ప్రశాన్తం సుముఖం దీర్ఘచారుచతుర్భుజమ్
సుచారుసున్దరగ్రీవం సుకపోలం శుచిస్మితమ్

చక్కని మెడా చిరునవ్వూ కంఠమూ ఉన్న నన్ను

సమానకర్ణవిన్యస్త స్ఫురన్మకరకుణ్డలమ్
హేమామ్బరం ఘనశ్యామం శ్రీవత్సశ్రీనికేతనమ్

పీతాంబరం ధరించి మేఘ శ్యామ వర్ణముతో శ్రీ వత్స శ్రీ నికేతుడనైన నన్ను, శంఖ చక్ర గదా పద్మ వనమాలతో భూషించబడిన వాడు

శఙ్ఖచక్రగదాపద్మ వనమాలావిభూషితమ్
నూపురైర్విలసత్పాదం కౌస్తుభప్రభయా యుతమ్

పాదాభరణాలతో శొభించే పాదములూ, వక్షస్థలములో కౌస్తుభ మణితో

ద్యుమత్కిరీటకటక కటిసూత్రాఙ్గదాయుతమ్
సర్వాఙ్గసున్దరం హృద్యం ప్రసాదసుముఖేక్షనమ్

కిరీటములూ కటకములూ అంగదములూ కటిసూత్రములూ, అనుగ్రహముతో ప్రసన్నమైన ముఖం గలవాడు

సుకుమారమభిధ్యాయేత్సర్వాఙ్గేషు మనో దధత్
ఇన్ద్రియాణీన్ద్రియార్థేభ్యో మనసాకృష్య తన్మనః
బుద్ధ్యా సారథినా ధీరః ప్రణయేన్మయి సర్వతః

అలా సుకుమారమైన నన్ను, నా అన్ని అవయవాలనూ ఒక్కో సారే ధ్యానం చేస్తూ సాగాలి. ఒక్కో అవయవములో మనసు నిలిపుట అభ్యసించాలి. పరమాత్మ ముఖం ధ్యానం చేస్తూ ఉంటే ముఖమే కనపడాలి. ఏ అవయవాన్ని ధ్యానం చేస్తామో ఆ ఒక్క అవయవం యందే మనసు నిలుపాలి
ఇంద్రియములను విషయముల నుండి మనసుతో లాగేసి, ఆ మనసును, సారధి ఐన బుద్ధితో నా యందు నిలపాలి
తత్సర్వవ్యాపకం చిత్తమాకృష్యైకత్ర ధారయేత్
నాన్యాని చిన్తయేద్భూయః సుస్మితం భావయేన్ముఖమ్

ఇలా అంతటా వ్యాపించి ఉండే చిత్తాన్ని లాగుకొని వచ్చి ఒకే చోట నిలపాలి. మనసు ఒకే చోట ఉంచాలి గానీ వేరే వాటిని ఆ సమయములో చింతించకూడదు. ముఖాన్ని ధ్యానం చేయదలచుకుంటే చిరునవ్వుతో ఉన్న పరమాత్మ ముఖాన్ని ధ్యానం చేయాలి
తత్ర లబ్ధపదం చిత్తమాకృష్య వ్యోమ్ని ధారయేత్
తచ్చ త్యక్త్వా మదారోహో న కిఞ్చిదపి చిన్తయేత్

అలా మనసు  ముఖం యందు నిలవడం మొదలుపెడితే, సాకారమైన నా యందు మనసు నిలుపడం పూర్తి ఐన తరువాత నిరాకారమైన నా యందు నిలుప ప్రయత్నించాలి
చివరకు దాన్ని కూడా వదలి, నాలోకే వచ్చేసి, ఏ విషయమునూ ధ్యానించకుండా ఉండాలి

ఏవం సమాహితమతిర్మామేవాత్మానమాత్మని
విచష్టే మయి సర్వాత్మన్జ్యోతిర్జ్యోతిషి సంయుతమ్

ఇలా సావధాన మనస్కుడై నాలో అన్నీ చూస్తున్నవాడు, అగ్నిలో అగ్ని చేరినట్లుగా దీపములో దీపం చేరినట్లుగా కాంతిలో కాంతి చేరినట్లుగా,

ధ్యానేనేత్థం సుతీవ్రేణ యుఞ్జతో యోగినో మనః
సంయాస్యత్యాశు నిర్వాణం ద్రవ్య జ్ఞానక్రియాభ్రమః


 ఇలా సుతీవ్రమైన ధ్యానముతో యోగులు మనసును నా యందు  లగ్నం చేస్తారు.
ద్రవ్య జ్ఞ్యాన క్రియా అనబడే సకల భ్రమలూ లీనమై నా యందే మనసు నిలుస్తుంది.


                                                      సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                     సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదమూడవ అధ్యాయం

                                                              ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదమూడవ అధ్యాయం

శ్రీభగవానువాచ
సత్త్వం రజస్తమ ఇతి గుణా బుద్ధేర్న చాత్మనః
సత్త్వేనాన్యతమౌ హన్యాత్సత్త్వం సత్త్వేన చైవ హి

ఈ గుణాలు బుద్ధికే గానీ ఆత్మకు కావు
సత్వముతో రజస్తమో గుణాలను వదిలిపెట్టాలి. తరువాత సతవాన్ని సత్వముతో వదిలిపెట్టాలి.

సత్త్వాద్ధర్మో భవేద్వృద్ధాత్పుంసో మద్భక్తిలక్షణః
సాత్త్వికోపాసయా సత్త్వం తతో ధర్మః ప్రవర్తతే

సత్వం నుండి ధర్మ వస్తుంది.ఈ ధర్మం పెరిగితే ఆ ధర్మం వలన  నా భక్తి కలుగుతుంది. సాత్విక ఉపాసనతో సత్వమూ, దాని నుండి ధర్మమూ కలుగుతుంది.

ధర్మో రజస్తమో హన్యాత్సత్త్వవృద్ధిరనుత్తమః
ఆశు నశ్యతి తన్మూలో హ్యధర్మ ఉభయే హతే

సత్వం వలన కలిగిన ధర్మముతో రజస్తమో గుణాలు నశించి,  సత్వము పెరుగుతుంది. సత్వం బాగా పెరుగుట వలన అధర్మం నశిస్తుంది

ఆగమోऽపః ప్రజా దేశః కాలః కర్మ చ జన్మ చ
ధ్యానం మన్త్రోऽథ సంస్కారో దశైతే గుణహేతవః

ఈ పదీ అన్ని గుణాలకూ కారణము

తత్తత్సాత్త్వికమేవైషాం యద్యద్వృద్ధాః ప్రచక్షతే
నిన్దన్తి తామసం తత్తద్రాజసం తదుపేక్షితమ్

వృద్ధులు చెప్పినదంతా సాత్వికం. వారు నిందించింది తామసం. వారు ఉపేక్షించినది రాజసం

సాత్త్వికాన్యేవ సేవేత పుమాన్సత్త్వవివృద్ధయే
తతో ధర్మస్తతో జ్ఞానం యావత్స్మృతిరపోహనమ్

సత్వం పెరగడానికి జీవుడు సాత్వికములనే ఉపయోగించాలి. దాని వలన ధర్మమూ, దాని వలన జ్ఞ్యానము.జ్ఞ్యానం వలన అన్ని అపోహలూ తొలగిపోతాయి.

వేణుసఙ్ఘర్షజో వహ్నిర్దగ్ధ్వా శామ్యతి తద్వనమ్
ఏవం గుణవ్యత్యయజో దేహః శామ్యతి తత్క్రియః

వెదురు బొంగుల వలన పుట్టిన అగ్ని వాటిని కాల్చి తాను కూడా చల్లారినట్లుగా గుణ వ్యతికరం వలన ఏర్పడిన దేహం వాటినీ కాల్చి తాను కూడా కాలిపోతుంది

శ్రీద్ధవ ఉవాచ
విదన్తి మర్త్యాః ప్రాయేణ విషయాన్పదమాపదామ్
తథాపి భుఞ్జతే కృష్ణ తత్కథం శ్వఖరాజవత్

మానవుడు ఆపదలు కలుగుతాయని కూడా వాటిని ఎందుకు ఆశ్రయిస్తున్నాడు
అది ఎలా? కుక్కలూ గాడిదలూ మేకలులాగ. దొంగతనముగా తింటే దెబ్బలు పడతాయని తెలిసీ అవి తప్పు చేసినట్లుగా మానవులు కూడా ఆపదలకు మూలం అని తెలిస్లి కూడా ఆ పనులు ఎందుకు చేస్తున్నారు

శ్రీభగవానువాచ
అహమిత్యన్యథాబుద్ధిః ప్రమత్తస్య యథా హృది
ఉత్సర్పతి రజో ఘోరం తతో వైకారికం మనః

సేవించే మనసూ ఇంద్రియాలూ రాజస అహంకారం నుండి పుట్టాయి. జ్ఞ్యానేంద్రియాలూ కర్మేంద్రియాలూ రాజసాహంకారం నుండే పుట్టాయి. పొరబడిన వాడికి శరీరం యందే ఆత్మ బుద్ధి ఉంటుంది.

రజోయుక్తస్య మనసః సఙ్కల్పః సవికల్పకః
తతః కామో గుణధ్యానాద్దుఃసహః స్యాద్ధి దుర్మతేః

మొదలు రజో గుణమూ,  దానితో ఉన్న మనస్సుకు వికల్పాలతో ఉన్న సంకల్పమూ, ఆ సంకల్పం వలన కామం కలుగుతుంది. గుణాలను ధ్యానం చేయడం వలన కామ కలిగుతుంది. ఆ కామం తీరేదాకా ఊరుకోలేరు

కరోతి కామవశగః కర్మాణ్యవిజితేన్ద్రియః
దుఃఖోదర్కాణి సమ్పశ్యన్రజోవేగవిమోహితః

కామానికి వశమై ఇంద్రియములను జయించలేక, వాటితో కోరికలను తీర్చుకొనే సాధనములైన పనులను చేస్తాడు. తాను చేసిన పనుల వలన దుఃఖమే కలుగుతుంది అని తెలిసి కూడా రజో తమో గుణములచేత కొట్టబడతాడు. దోష దృష్టి కలవాడై దానిలో మునిగిపోతాడు

రజస్తమోభ్యాం యదపి విద్వాన్విక్షిప్తధీః పునః
అతన్ద్రితో మనో యుఞ్జన్దోషదృష్టిర్న సజ్జతే

జ్ఞ్యాని ఉన్నవాడు అందులో ఆసక్తి కాలేడు.అందుకే పొరబాటు పడకుండా గుణాలను సేవించాలి. నా మీద మానసు ఉంచి వాటిని సేవించాలి

అప్రమత్తోऽనుయుఞ్జీత మనో మయ్యర్పయఞ్ఛనైః
అనిర్విణ్ణో యథాకాలం జితశ్వాసో జితాసనః

కలిగిన కోరికల వలన అనుభవించే వాటి ఫలితం నాకు అర్పించు
మనసును నాయందు అర్పించు మెలమెల్లగా
అలా చేస్తే మనదీ అన్న బుద్ధి తగ్గుతుంది
దేని యందూ మనసు ఉంచుకోకుండా ప్రాణాయామాలూ, ఆసన శుద్ధితో

ఏతావాన్యోగ ఆదిష్టో మచ్ఛిష్యైః సనకాదిభిః
సర్వతో మన ఆకృష్య మయ్యద్ధావేశ్యతే యథా

చేసే యోగం నాకు ఇష్టమైనది. ఇది నా శిష్యులైన సనకాదులు చెప్పారు
మనసును అన్ని విషయముల నుండీ లాగి నా యందు ఉంచాలి. అదే యోగము

శ్రీద్ధవ ఉవాచ
యదా త్వం సనకాదిభ్యో యేన రూపేణ కేశవ
యోగమాదిష్టవానేతద్రూపమిచ్ఛామి వేదితుమ్

సనకాదులకు మీరు ఏ యోగాన్ని చెప్పారో దాన్ని నాకు చెప్పాలని కోరుకుంటున్నాను

శ్రీభగవానువాచ
పుత్రా హిరణ్యగర్భస్య మానసాః సనకాదయః
పప్రచ్ఛుః పితరం సూక్ష్మాం యోగస్యైకాన్తికీమ్గతిమ్

బ్రహ్మ యొక్క పుత్రులు సనకాదులు. తండ్రిని వారు యోగమార్గాన్ని అడిగారు

సనకాదయ ఊచుః
గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రభో
కథమన్యోన్యసన్త్యాగో ముముక్షోరతితితీర్షోః

గుణములలో మనసు ఉంటుంది, మనసులో గుణాలు ఉంటాయి. మీరు గుణాల నుండి మనసును మార్చమంటారు
సంసారాన్ని దాటాలని కోరిక ఉన్నా గుణములనూ మనసునుండి వేరు చేయలేము కదా అని బ్రహ్మను అడిగితే

శ్రీభగవానువాచ
ఏవం పృష్టో మహాదేవః స్వయమ్భూర్భూతభావనః
ధ్యాయమానః ప్రశ్నబీజం నాభ్యపద్యత కర్మధీః

అలా అడుగబడిన బ్రహ్మ "ఈ ప్రశ్నకు అర్థమేమిటి,వీరికి సమాధానం ఎలా చెపాలి అని సరి ఐన సమాధానాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాడు". బ్రహ్మగారి మనసు కూడా గుణముల మీదే ఉంది.

స మామచిన్తయద్దేవః ప్రశ్నపారతితీర్షయా
తస్యాహం హంసరూపేణ సకాశమగమం తదా

ఆ విషయం తెలియుటకై ఆయన నన్ను ధ్యానం చేసాడు. అలాంటి బ్రహ్మ దగ్గరకు నేను హంస రూపములో వెళ్ళాను

దృష్ట్వా మామ్త ఉపవ్రజ్య కృత్వ పాదాభివన్దనమ్
బ్రహ్మాణమగ్రతః కృత్వా పప్రచ్ఛుః కో భవానితి

వారందరూ నన్ను చూచి పిలిచి పాదాభివందం చేసి బ్రహ్మను ముందర పెట్టుకుని సనకాదులు "నీవెవరు" అని నన్ను అడిగారు

ఇత్యహం మునిభిః పృష్టస్తత్త్వజిజ్ఞాసుభిస్తదా
యదవోచమహం తేభ్యస్తదుద్ధవ నిబోధ మే

అలాంటి వారికి నేనేమి చెప్పానో దాన్ని తెలుసుకో

వస్తునో యద్యనానాత్వ ఆత్మనః ప్రశ్న ఈదృశః
కథం ఘటేత వో విప్రా వక్తుర్వా మే క ఆశ్రయః

"నీవెవరూ" అంటున్నారు. ఉన్న వస్తువు ఒకటా వేరు వేరూఅ? ఒకటే ఐతే "నీవెవరు" అన్న ప్రశ్నే ఉండదు
ఐనా చెప్పాలంటే చెప్పే నాకూ వినే మీకూ ఆశ్రయం ఎవరు? ఒకరా వేరా?

పఞ్చాత్మకేషు భూతేషు సమానేషు చ వస్తుతః
కో భవానితి వః ప్రశ్నో వాచారమ్భో హ్యనర్థకః

అన్ని ప్రాణులూ పంచ భూతాత్మకములే కదా. అలాంటపుడు "ఎవరు నీవు" అన్న ప్రశ్నకు అర్థం అంటూ ఏదీ లేదు. 

మనసా వచసా దృష్ట్యా గృహ్యతేऽన్యైరపీన్ద్రియైః
అహమేవ న మత్తోऽన్యదితి బుధ్యధ్వమఞ్జసా

మనసుతో వాక్కుతో దృష్టితో ఇంద్రియములతో, అన్నిటితో నేను మాత్రమే గ్రహించబడతాను.
అన్నీ నన్నే గ్రహిస్తాయి.

గుణేష్వావిశతే చేతో గుణాశ్చేతసి చ ప్రజాః
జీవస్య దేహ ఉభయం గుణాశ్చేతో మదాత్మనః

నాకంటే భిన్నమైనది ఏదీ లేదని తెలుసుకోండి. గుణములలో మనసూ, మనసులో గుణములూ అందులో ప్రజలూ. నా రూప్మైన జీవుడికి దేహమూ గుణాలూ, ఈ రెండూ ఉండేవే

గుణేషు చావిశచ్చిత్తమభీక్ష్ణం గుణసేవయా
గుణాశ్చ చిత్తప్రభవా మద్రూప ఉభయం త్యజేత్

మాటి మాటికీ గుణాలనే సేవిస్తే మనసు గుణాలయందే లగ్నమై ఉంటుంది. ఈ గుణాలు మనసు నుండే పుడతాయి. కాబట్టి నా రూపాన్ని ధ్యానిస్తే ఈ రెంటినీ వదిలిపెట్టవచ్చు. 

జాగ్రత్స్వప్నః సుషుప్తం చ గుణతో బుద్ధివృత్తయః
తాసాం విలక్షణో జీవః సాక్షిత్వేన వినిశ్చితః

అన్ని గుణములూ స్వరూపములూ స్వభావములూ నా రూపముగా చూడండి.  నా కంటే వేరేది ఏదీ లేదు. నిద్ర కలలూ మెలకువా అన్నీ బుద్ధి వలన కలిగేది. రజో గుణముతో కలలూ, తమో గుణం వలన నిద్రా, సత్వ గుణముతో సుషుప్తీ కలుగుతాయి. జీవుడు ఈ మూడింటికీ వేరుగా ఉంటాడు

యర్హి సంసృతిబన్ధోऽయమాత్మనో గుణవృత్తిదః
మయి తుర్యే స్థితో జహ్యాత్త్యాగస్తద్గుణచేతసామ్

జీవుడు జరిగే దాన్ని చూస్తూ ఉంటాడు. దేనితోనూ జీవునికి సంబంధం లేదు. గుణ వృత్తుల వలనే ఆత్మకు సంసార బంధం కలుగుతుంది.కాబట్టి ఆ బుద్ధిని నాయందు ఉంచితే గుణాలూ వృత్తులూ సంసార బంధమూ ఉండదు

అహఙ్కారకృతం బన్ధమాత్మనోऽర్థవిపర్యయమ్
విద్వాన్నిర్విద్య సంసార చిన్తాం తుర్యే స్థితస్త్యజేత్

ఆత్మకు అహంకారం వలననే అర్థ విపర్యయమైన బంధం కలుగుతుంది.
పండితుడైన వాడు సంసార చింతను వదలిపెట్టి చివరి తోడు ఐన నాయందు మనసు ఉంచాలి.

యావన్నానార్థధీః పుంసో న నివర్తేత యుక్తిభిః
జాగర్త్యపి స్వపన్నజ్ఞః స్వప్నే జాగరణం యథా

నానాత్వ బుద్ధి ఉన్నంత కాలం జీవుడికి సంసారం వదలదు. కొందరు మేలుకొని ఉండే కలలు కంటూ ఉంటారు. కొందరు కలలో కూడా మేలుకొనే ఉంటారు.

అసత్త్వాదాత్మనోऽన్యేషాం భావానాం తత్కృతా భిదా
గతయో హేతవశ్చాస్య మృషా స్వప్నదృశో యథా

ఇది అసత్వం కాబట్టి ఆయా భావనలూ గుణములూ భేధములూ అన్నీ అసత్యములే

యో జాగరే బహిరనుక్షణధర్మిణోऽర్థాన్
భుఙ్క్తే సమస్తకరణైర్హృది తత్సదృక్షాన్
స్వప్నే సుషుప్త ఉపసంహరతే స ఏకః
స్మృత్యన్వయాత్త్రిగుణవృత్తిదృగిన్ద్రియేశః

జాగృత్ అవస్థలో ఉన్నపుడు ఏ ఏ విషయాలను భుజిస్తాడో, అనుభవిస్తాడో, ఆ విషయాలను అనుభవించినపుడు వాటిని అనుకున్నంత అనుభవించనందు వలన, అనుభవించగా మిగిలిన వాటిని ధ్యానం చేస్తూ ఉంటాడు. అదే కలగా వస్తుంది.
ఆ కోరిక తీరిన తరువాత హాయిగా నిదురపోతాడు. అనుభవించిన వాటి మీద తృప్తి కలగకపోతే నిద్ర పట్టదు

ఏవం విమృశ్య గుణతో మనసస్త్ర్యవస్థా
మన్మాయయా మయి కృతా ఇతి నిశ్చితార్థాః
సఞ్ఛిద్య హార్దమనుమానసదుక్తితీక్ష్ణ
జ్ఞానాసినా భజత మాఖిలసంశయాధిమ్

మొత్తం భారం భగవంతుని మీద వేసిన వాడికి కలలు రావు. ఇలా గుణములతో మనసుతో జాగ్రత్ సుషుప్తొ స్వప్న అవస్థలు తీసుకుని, ఇవన్నీ మాయ వలనే ఏర్పడినవి అని నిశ్చయించుకుని, సజ్జనుల ఉపదేశమనే తీక్షణమైన కత్తితో ఈ అజ్ఞ్యానాన్ని చేదించి నన్ను భజించండి.

ఈక్షేత విభ్రమమిదం మనసో విలాసం
దృష్టం వినష్టమతిలోలమలాతచక్రమ్
విజ్ఞానమేకమురుధేవ విభాతి మాయా
స్వప్నస్త్రిధా గుణవిసర్గకృతో వికల్పః

అసలు జ్ఞ్యానం ఒక్కటే. మాయ పలు రూపాలుగా భాసిస్తుంది. గుణ విసర్గాలతో భేధాలేర్పడతాయి. అటువంటి ప్రకృతినుండి మనసు దృష్టీ మరల్చి ఆశలు తీసినవాడై ఆత్మారాముడై ఏ కోరికలూ లేనివాడై ఉదాసీనముగా ఉండాలి

దృష్టిమ్తతః ప్రతినివర్త్య నివృత్తతృష్ణస్
తూష్ణీం భవేన్నిజసుఖానుభవో నిరీహః
సన్దృశ్యతే క్వ చ యదీదమవస్తుబుద్ధ్యా
త్యక్తం భ్రమాయ న భవేత్స్మృతిరానిపాతాత్

శరీరం వచ్చినప్పటినుంచీ తొలగిపోయేవరకూ ఉన్న వస్తువులన్నీ భ్రమ అని విడిచిపెట్టాలి.

దేహం చ నశ్వరమవస్థితముత్థితం వా
సిద్ధో న పశ్యతి యతోऽధ్యగమత్స్వరూపమ్
దైవాదపేతమథ దైవవశాదుపేతం
వాసో యథా పరికృతం మదిరామదాన్ధః

 పోయేదైనా పుట్టేదైనా శరీరం ఎపుడూ నశ్వరమే. జ్ఞ్యాన సిద్ధులు ఈ శరీరాన్ని కాక, ఈ శరీరం ఎక్కడ నుంచి వచ్చిందో దాన్ని చూస్తారు
పరమాత్మ సంకల్పముతోనే వస్తుద్ని, పోతుందీ ఈ శరీరం. జ్ఞ్యాని ఐన వాడు ఇలాంటి దేహ సంబంధాన్ని తెలియడు. బగా మద్యపానం చేసి మత్తులో ఉన్నవాడు తాను కట్టుకున్న బట్ట ఉందో ఊడిపోతుందో అని తెలియనట్లు జ్ఞ్యానికి శరీరం వస్తున్నదో పోతున్నదో తెలియదు

దేహోऽపి దైవవశగః ఖలు కర్మ యావత్
స్వారమ్భకం ప్రతిసమీక్షత ఏవ సాసుః
తం సప్రపఞ్చమధిరూఢసమాధియోగః
స్వాప్నం పునర్న భజతే ప్రతిబుద్ధవస్తుః

ఈ శరీరం కూడా కర్మ ఉన్నంతవరకూ దైవ వశముతో వస్తుంది. కర్మలు చేత ఆరంబించబడిన ఈ శరీరాన్ని శరీరి చూస్తూ ఉంటాడు. సమాధి యోగములో ఉన్నవాడు వీటిని (దేహాన్నీ దేహసంబంధాన్నీ) కోరుకోడు తెలియడు.

మయైతదుక్తం వో విప్రా గుహ్యం యత్సాఙ్ఖ్యయోగయోః
జానీత మాగతం యజ్ఞం యుష్మద్ధర్మవివక్షయా

సాంఖ్య యోగ రహస్యాన్ని నేను చెప్పాను. మీకు ధర్మం బోధించగోరి వచ్చిన యజ్ఞ్య పురుషుడిగా నన్ను తెలుసుకోండి

అహం యోగస్య సాఙ్ఖ్యస్య సత్యస్యర్తస్య తేజసః
పరాయణం ద్విజశ్రేష్ఠాః శ్రియః కీర్తేర్దమస్య చ

యోగమూ సాంఖ్యమూ సత్యమూ ఋతమూ శ్రేయస్సూ శ్రీ కీర్తి మొదలైనవాటికి నేనే ఆధారం

మాం భజన్తి గుణాః సర్వే నిర్గుణం నిరపేక్షకమ్
సుహృదం ప్రియమాత్మానం సామ్యాసఙ్గాదయోऽగుణాః

నిర్గుణుడైన, ఎటువంటి అపేక్షా లేని నన్ను అన్ని గుణాలూ సేవిస్తాయి. నేను అందరికీ ప్రియున్ని. సామ్యాలూ సంగగుణాలూ నన్ను సేవిస్తాయి

ఇతి మే ఛిన్నసన్దేహా మునయః సనకాదయః
సభాజయిత్వా పరయా భక్త్యాగృణత సంస్తవైః

ఇలా సందేహాలు తొలగిన సనకాదులు పరమభక్తితో నన్ను పూజించగా

తైరహం పూజితః సంయక్సంస్తుతః పరమర్షిభిః
ప్రత్యేయాయ స్వకం ధామ పశ్యతః పరమేష్ఠినః

బ్రహ్మ చూస్తుండగా నేను వైకుంఠానికి వెళ్ళిపోయాను

                                                        సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                        సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Tuesday, August 27, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పన్నెండవ అధ్యాయం

                                           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీభగవానువాచ
న రోధయతి మాం యోగో న సాఙ్ఖ్యం ధర్మ ఏవ చ
న స్వాధ్యాయస్తపస్త్యాగో నేష్టాపూర్తం న దక్షిణా

సత్సంగం నన్ను మీ వశములో ఉంచేట్లు ఏమీ ఉంచవు. ఒక్క సత్సంగమే నన్ను చేరే ఉపాయం
యోగం సాంఖయ్మూ ధర్మమూ స్వాధ్యాయమూ  తపమూ త్యాగమూ ఇష్టాపూర్తములూ దక్షిణా

వ్రతాని యజ్ఞశ్ఛన్దాంసి తీర్థాని నియమా యమాః
యథావరున్ధే సత్సఙ్గః సర్వసఙ్గాపహో హి మామ్

వ్రతములూ యజ్ఞ్యములూ తీర్థములూ నియమమూ యమమూ చందస్సూ ఇవన్నీ నన్ను మీ హృదయములో ఉంచలేవు. సత్సంగమే ఉంచుతుంది. అన్ని ఇతర సంగములను తొలగించేదే సత్సంగం. సజ్జనులతో ఒక సారి స్నేహము చేస్తే మరి ఇంక దేనితో సంగము ఉండదు. సత్సంగముతో వశమైనట్లు మరి దేనితోనూ వశం కాను

సత్సఙ్గేన హి దైతేయా యాతుధానా మృగాః ఖగాః
గన్ధర్వాప్సరసో నాగాః సిద్ధాశ్చారణగుహ్యకాః

ఎలాంటి యోగ్యతా లేని వారు కూడా సత్సంగముతో మోక్షాన్ని పొందారు.
రాక్షసులు గంధర్వులు మృగాలు పక్షులు అప్సరసలు నాగులు సిద్ధులు చారణులు గుహ్యకులు విద్యాధరులు వైశ్యులు స్త్రీలు శూద్రులు అంత్యజులు రజస్తమో గుణాలు కలవారు, ఆయా యుగాలలో వీరందరూ నన్ను చేరారు

విద్యాధరా మనుష్యేషు వైశ్యాః శూద్రాః స్త్రియోऽన్త్యజాః
రజస్తమఃప్రకృతయస్తస్మింస్తస్మిన్యుగే యుగే

బహవో మత్పదం ప్రాప్తాస్త్వాష్ట్రకాయాధవాదయః
వృషపర్వా బలిర్బాణో మయశ్చాథ విభీషణః

వృత్తాసురుడూ ప్రహ్లాదుడూ మొదలైన వారు సత్సంగము వలన అనదరూ నన్ను చేరారు.
వృషపర్వుడు బలి బాణుడు మయుడు విభీషణ

సుగ్రీవో హనుమానృక్షో గజో గృధ్రో వణిక్పథః
వ్యాధః కుబ్జా వ్రజే గోప్యో యజ్ఞపత్న్యస్తథాపరే

సుగ్రీవ జాంబవంత గజమూ గద్దా వ్యాపారి బోయవాడు కుబ్జ వ్రజములో గోపికలు వీరంతా మోక్షం పొందారు

తే నాధీతశ్రుతిగణా నోపాసితమహత్తమాః
అవ్రతాతప్తతపసః మత్సఙ్గాన్మాముపాగతాః

వారు వేదములను చదువుకోలేదు. పెద్దలను వారు పెద్దగా ఆరాధించలేదు. వ్రతములూ తపస్సు లేదు. కేవలం సత్సంగముతోనే నన్ను చేరారు.

కేవలేన హి భావేన గోప్యో గావో నగా మృగాః
యేऽన్యే మూఢధియో నాగాః సిద్ధా మామీయురఞ్జసా

యం న యోగేన సాఙ్ఖ్యేన దానవ్రతతపోऽధ్వరైః
వ్యాఖ్యాస్వాధ్యాయసన్న్యాసైః ప్రాప్నుయాద్యత్నవానపి

ఎంత ప్రయత్నం చేసినా యోగమూ సాంఖ్యమూ దానమూ తపస్సుతో వ్రతమూ యాగాలు ఉత్తమ వాఖ్యానాలూ స్వాధ్యాయాలూ సన్యాసాలతో నన్ను పొందలేని వారు సత్సంగముతో పొందారు

రామేణ సార్ధం మథురాం ప్రణీతే శ్వాఫల్కినా మయ్యనురక్తచిత్తాః
విగాఢభావేన న మే వియోగ తీవ్రాధయోऽన్యం దదృశుః సుఖాయ

అకౄరుడు నన్ను మధురను తీసుకు రావడానికి వస్తే నా యందే మనసు ఉంచిన గోపికలు నా మీద ప్రీతితో నా వియోగాన్ని మనసులో ఉంచుకుని అలాగే కుమిలిపోయారు గానీ, నేను లేను కదా అని మరెవరినో పొందలేదు
(నిజముగా వారు శరీర సుఖమే అభిలషించి ఉంటే ఆ సుఖం పొందడానికి వేరే ఉపాయం చూసేవారు. కానీ వారు మళ్ళీ కృష్ణుడు కనపడే దాకా కృష్ణుడినే ధ్యానం చేస్తూ ఉన్నారు. అది కలగడానికి వారికి సత్సంగమే తోత్పడింది)

తాస్తాః క్షపాః ప్రేష్ఠతమేన నీతా మయైవ వృన్దావనగోచరేణ
క్షణార్ధవత్తాః పునరఙ్గ తాసాం హీనా మయా కల్పసమా బభూవుః

అంత మంచి రాత్రులు నాతో గడిపారుం నేను నేను వారికి శ్రేష్టతమున్ని. అలా నాతో అన్ని రాత్రులూ రోజులూ అరక్షణాలల గడిపిన వారు నేను వెళ్ళిన తరువాత ఆ రాత్రులు కల్పములా దీర్ఘముగా బాధపెట్టి ఉంటాయి. ఐనా

తా నావిదన్మయ్యనుషఙ్గబద్ధ ధియః స్వమాత్మానమదస్తథేదమ్
యథా సమాధౌ మునయోऽబ్ధితోయే నద్యః ప్రవిష్టా ఇవ నామరూపే

వారికి ఇన్ని రోజులు గడిచాయి అని తెలియనేలేదు. నా అనుసంగముతో వారు బద్ధులయ్యారు. సముద్రములో ప్రవేశించిన నదులు తమ నామ రూపాలను వదులుకున్నట్లుగా నాయందు మనసు ఉంచిన గోపికలు తక్కినవాటి మొత్తాన్ని వదులుకున్నారు. తామెవరో కూడా మరచిపోయారు.
నదులు సముద్రములో ప్రవేశించినపుడు తమ పేరులు వదులుకున్నట్లు స్వామిని కలిసిన తరువాత మనకు నామమూ రూపమూ వేరేగా ఉండవు

మత్కామా రమణం జారమస్వరూపవిదోऽబలాః
బ్రహ్మ మాం పరమం ప్రాపుః సఙ్గాచ్ఛతసహస్రశః

నా మీదకోరికతోనే నేను కేవలం రమింపచేసే జారుడిగానే నా స్వరూపాన్ని తెలియక అబలులుగా నన్ను భావించి కూడా పరబ్రహ్మనైన నన్ను పొందారు.

తస్మాత్త్వముద్ధవోత్సృజ్య చోదనాం ప్రతిచోదనామ్
ప్రవృత్తిం చ నివృత్తిం చ శ్రోతవ్యం శ్రుతమేవ చ

ఉద్ధవా, వేద విహితమైన కర్మలూ విన్నదాన్ని వినవలసిన దాన్నీ ప్రవృత్తినీ నివృత్తినీ విడిచి, అన్ని ధర్మాలనూ విడిచి సర్వ దేహులకూ

మామేకమేవ శరణమాత్మానం సర్వదేహినామ్
యాహి సర్వాత్మభావేన మయా స్యా హ్యకుతోభయః

ఆత్మనైన నన్ను సర్వాత్మ భావముతో శరణు వేడు. అపుడు నాతోనే ఉంటావు. నీకు ఎలాంటి భయమూ ఉండదు

శ్రీద్ధవ ఉవాచ
సంశయః శృణ్వతో వాచం తవ యోగేశ్వరేశ్వర
న నివర్తత ఆత్మస్థో యేన భ్రామ్యతి మే మనః

నా మనసులో సన్శయం అలాగే ఉంటోంది నీవెన్ని చెప్పినా...

శ్రీభగవానువాచ
స ఏష జీవో వివరప్రసూతిః ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్టః
మనోమయం సూక్ష్మముపేత్య రూపం మాత్రా స్వరో వర్ణ ఇతి స్థవిష్ఠః

నీవు శరీరములో ఉన్నంత వరకూ ఈ సంశయం ఉంటుంది. అలా శరీరములో ప్రవేశించి మనోమయమైన రూపాన్ని పొంది, స్వర రూపములో వర్ణ రూపములో మాత్రా రూపములో స్థూలముగా సూక్ష్మముగా ఈ దహరాకాశములో ప్రవేశించిన జీవుడు

యథానలః ఖేऽనిలబన్ధురుష్మా బలేన దారుణ్యధిమథ్యమానః
అణుః ప్రజాతో హవిషా సమేధతే తథైవ మే వ్యక్తిరియం హి వాణీ

ఆకాశములో అగ్నికి వాయువు బంధువైనట్లు, అదే అగ్ని కట్టెలో బాగా మధనం చేస్తే చిన్నగా అవుతుంది. అగ్ని  ఆకాశములో ఉంటుంది. అదే అరణిలో మధిస్తే బయలుదేరుతుంది. అదే కుండములో పెద్దగా ఉంటుంది. హవిస్సు వేస్తే ఇంకా పెద్దదవుతుంది. అలాగే దహారాకాశములో ఉన్నవాడు అణువు, శరీరములోకి వచ్చిన తరువాత బృహత్ అవుతాడు. అలాగే నేను కూడా దహరాకాశములో సూక్ష్మముగా ఉంటాను, అదే వాక్కుతో వింటే కొంచెం పెద్ద అవుతాను. అదే అర్చా రూపములో చూస్తే ఇంకా పెద్ద అవుతాను, అనంతమవుతాను. నన్నే ధ్యానిస్తే ఆ భక్తి వలన ఇంకా విశ్వవ్యాపి అవుతాను. దహరాకాశములో అంతర్యామిగా ఉన్న స్వామే ధ్యానముతో కీర్తనతో శ్రవణముతో ఆవిర్భవిస్తాడు. అర్చారూపమూ, దాన్ని ధ్యానించుటచే ఇంకా విశ్వరూపుడవుతాడు.

ఏవం గదిః కర్మ గతిర్విసర్గో ఘ్రాణో రసో దృక్స్పర్శః శ్రుతిశ్చ
సఙ్కల్పవిజ్ఞానమథాభిమానః సూత్రం రజఃసత్త్వతమోవికారః

పలుకుట వెళ్ళుట గంధమూ రుచీ చూపు వదులుట రూపమూ స్పర్శ వినడం సంకల్పమూ ఆలోచనా అభిమానం, ఇవన్నీ

అయం హి జీవస్త్రివృదబ్జయోనిరవ్యక్త ఏకో వయసా స ఆద్యః
విశ్లిష్టశక్తిర్బహుధేవ భాతి బీజాని యోనిం ప్రతిపద్య యద్వత్

ఇవన్నీ సత్వ రజస్తమో గుణరూపములు, ఆయనే చతుర్ముఖ బ్రహ్మ, విరాట్ పురుషుడు, అతనే మొదటి జీవుడు. ఆ సూత్రాత్మే బహురూపములుగా మనకు భాసిస్తుంది వ్యాప్త్మైన శక్తి గలవాడై. (బీజం ఎలా రూపాన్ని పెంచుకుని వ్యాపిస్తుందో)

యస్మిన్నిదం ప్రోతమశేషమోతం పటో యథా తన్తువితానసంస్థః
య ఏష సంసారతరుః పురాణః కర్మాత్మకః పుష్పఫలే ప్రసూతే

ఈ సకల జగత్తు ఏ పరమాత్మ యందు నిలుపబడినదో. దారముల కూర్పే వస్త్రము.
ఈ సంసార వృక్షము నిత్యమూ పుష్పాలనూ ఫలాలనూ ఇస్తుంది. ఫలం నుండి మళ్ళీ బీజం. దాని నుంచీ మళ్ళీ చిగురిస్తుంది

ద్వే అస్య బీజే శతమూలస్త్రినాలః పఞ్చస్కన్ధః పఞ్చరసప్రసూతిః
దశైకశాఖో ద్విసుపర్ణనీడస్త్రివల్కలో ద్విఫలోऽర్కం ప్రవిష్టః

పుణ్య పాపములు దీనికి బీజములు, దీనికి మూలములు మాత్రం మూడు సత్వ రజస్తమో గుణములు. కొమ్మలు ఫలములూ ఐదు. జ్ఞ్యానేంద్రియములు ఐదు, కర్మేంద్రియములు ఐదు. ఇదే పది + ఒకటి - పదకొండు. పదకొండు ఇంద్రియాలు. రెండు పక్షులు. జీవాత్మా పరమాత్మ

అదన్తి చైకం ఫలమస్య గృధ్రా గ్రామేచరా ఏకమరణ్యవాసాః
హంసా య ఏకం బహురూపమిజ్యైర్మాయామయం వేద స వేద వేదమ్

సత్వ రజస్తమో గుణాలు అనే మూడు గుణాలు కాకుండా అర్థ దశార్థ పూర్ణార్థ అనే పుణ్య పాప ఫలములు తీసుకుని స్వర్గమో నరకమో ప్రవేశిస్తాము
ఇలాంటి మహా వృక్షం యొక్క ఫలాన్ని కొన్ని గ్రామములో తిరిగే పక్షులు తింటాయి (అరణ్యములో తిరిగే హంసలు తినవు)
ఎవరైతే ఇలాంటి నా మాయా మయమైన స్వరూపాన్ని తెలుసుకుంటారో పరమాత్మ ఐన నన్ను తెలుసుకుంటారు

ఏవం గురూపాసనయైకభక్త్యా విద్యాకుఠారేణ శితేన ధీరః
వివృశ్చ్య జీవాశయమప్రమత్తః సమ్పద్య చాత్మానమథ త్యజాస్త్రమ్

ఇలా గురువుగారి యొక్క ఉపాసనతో ప్రధానమైన భక్తితో, గురూపాసన విద్య అనే గొడ్డలితో ఈ వృక్షాన్ని చేదించాలి. అలా నరికిన గొడ్డలిని కూడా వదిలిపెట్టాలి
భగవంతున్ని తెలుసుకునేంతవరకే జ్ఞ్యానమును పట్టుకోవాలి. తరువాత ఆ జ్ఞ్యానాన్ని కూడా వదిలిపెట్టాలి

                                  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                  సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Sunday, August 25, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదకొండవ అధ్యాయం

                                                      ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం పదకొండవ అధ్యాయం 

శ్రీభగవానువాచ
బద్ధో ముక్త ఇతి వ్యాఖ్యా గుణతో మే న వస్తుతః
గుణస్య మాయామూలత్వాన్న మే మోక్షో న బన్ధనమ్

బంధమూ మోక్షమూ అనేది గుణాలను బట్టే గానీ ఆత్మకు ఏ బంధమూ లేదు. గుణములతో కలసి ఉంటే బంధం అనీ, గుణములు లేకుంటే మోక్షం అనీ అంటున్నాము. గుణములే మాయతో కల్పించబడినవి. ఇంక బంధమూ మోక్షమూ ఎక్కడిది

శోకమోహౌ సుఖం దుఃఖం దేహాపత్తిశ్చ మాయయా
స్వప్నో యథాత్మనః ఖ్యాతిః సంసృతిర్న తు వాస్తవీ

శొకమూ మోహమూ సుఖమూ దుఃఖమూ శరీరమూ మాయతోనే ఏర్పడుతున్నాయి. కలలో మనకు ఏవేవి వస్తాయో అవి ఎలా వాస్తవాలు కావో దేహమూ సంసారమూ కూడా వాస్తవం కాదు

విద్యావిద్యే మమ తనూ విద్ధ్యుద్ధవ శరీరిణామ్
మోక్షబన్ధకరీ ఆద్యే మాయయా మే వినిర్మితే

విద్యా అవిద్యా రెండూ నా దేహములే. ఇవే మోక్షమూ బంధమూ కలిగిస్తాయి. ఇవన్నీ నా మాయ వలన ఏర్పడినవి.

ఏకస్యైవ మమాంశస్య జీవస్యైవ మహామతే
బన్ధోऽస్యావిద్యయానాదిర్విద్యయా చ తథేతరః

ఈ జీవుడు నా అంశ. అలాంటి ఈ జీవుడికి అవిద్యతోనే బంధము. విద్యతో మోక్షము ఏర్పడతాయి.

అథ బద్ధస్య ముక్తస్య వైలక్షణ్యం వదామి తే
విరుద్ధధర్మిణోస్తాత స్థితయోరేకధర్మిణి

ఒకే ధర్మం కలవారిలో ఉండే విరుద్ధ ధర్మాలు ఎలా ఉంటాయో చెబుతాను విను

సుపర్ణావేతౌ సదృశౌ సఖాయౌ యదృచ్ఛయైతౌ కృతనీడౌ చ వృక్షే
ఏకస్తయోః ఖాదతి పిప్పలాన్నమన్యో నిరన్నోऽపి బలేన భూయాన్

(ద్వాసుపర్ణా ... కఠోరోపనిషత్తు) ఒకే చెట్టు మీద రెండు పక్షులున్నాయి మంచి రెక్కలుకలిగి ఉన్నాయి, కలిసే ఉంటాయి, ఒకే వృక్షాన్ని రెండూ ఆశ్రయించి ఉన్నాయి. ఆ రెండు పక్షులలో ఒక పక్షి, చెట్టు ఆకులు రుచిగా ఉంటాయి అని తింటుంది. అలా తిన్న పక్షి ఏడుస్తుంది. తినని పక్షి ఆనందముగా ఉంటుంది. ఈ సంసారములో కూడా రెండు పక్షులున్నాయి, జీవాత్మా పరమాత్మ. జీవుడు కర్మఫలాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తూ ఉంటాడు. పరమాత్మ ఏదీ అనుభవించక ఆనందముగా ఉంటాడు.
ఒక పక్షి పిప్పల వృక్షాన్ని తింటూ ఉంటుంది. ఏ అన్నమూ లేకున్నా రెండవ పక్షి బలముగా ఉంటుంది.

ఆత్మానమన్యం చ స వేద విద్వానపిప్పలాదో న తు పిప్పలాదః
యోऽవిద్యయా యుక్స తు నిత్యబద్ధో విద్యామయో యః స తు నిత్యముక్తః

చెట్టు యొక్క ఆకులు తినని వాడు, తానేమిటో ఇతరులేమిటో తెలుసుకుంటాడు. అవిద్యతో కూడి ఉన్నాడు నిత్యబద్ధుడు. విద్యతో కూడి ఉన్నవాడు నిత్య ముక్తుడు.

దేహస్థోऽపి న దేహస్థో విద్వాన్స్వప్నాద్యథోత్థితః
అదేహస్థోऽపి దేహస్థః కుమతిః స్వప్నదృగ్యథా

జ్ఞ్యానం ఉన్నవాడు శరీరముతో ఉన్నా లేనివాడితో సమానమే. మేలుకొన్నవాడికి స్వప్నం రానట్లు. దేహములో లేకున్నా అవిద్య ఉంటే దేహం ఉన్నట్లే, కలలు కనే వాడిలా

ఇన్ద్రియైరిన్ద్రియార్థేషు గుణైరపి గుణేషు చ
గృహ్యమాణేష్వహం కుర్యాన్న విద్వాన్యస్త్వవిక్రియః

విద్వాంసుడైన వాడు అర్థములయందు విషయములను ప్రవర్తింపచేయకూడదు. విషయములయందు ఇంద్రియములను ప్రవర్తింపచేయకూడదు. ఆయా విషయముల యందు విషయములను ప్రవర్తింపచేయకుండా ఉండాలి. మనం నిరోధించినా ఆ ఇంద్రియాలు ఊరుకోవు. విషయములో ఇంద్రియములు వెంబడిస్తున్నా వాటి వెంబడి మనసు లేకుంటే ముక్తుడు, లేకుంటే బద్ధుడు. నేను చేస్తున్నాను అనే అహంకారం ఎవరికి లేదో అలాంటి వాడికి ఆ విషయములు అనుభవిస్తున్నా వికారం కలుగదు.

దైవాధీనే శరీరేऽస్మిన్గుణభావ్యేన కర్మణా
వర్తమానోऽబుధస్తత్ర కర్తాస్మీతి నిబధ్యతే

శరీరం దైవాధీనం. గుణములు కర్మలు చేస్తున్నాయి. ఇంక మనం చేసేదేముంది. మనకే సంబంధం లేకున్నా అజ్ఞ్యానముతో నేనే చేసుకుంటున్నాను అన్న భావనతో కర్తృత్వ బుద్ధితో నేను కర్తను అని భావించి బంధించబడుతున్నాడు

ఏవం విరక్తః శయన ఆసనాటనమజ్జనే
దర్శనస్పర్శనఘ్రాణ భోజనశ్రవణాదిషు
న తథా బధ్యతే విద్వాన్తత్ర తత్రాదయన్గుణాన్

అది తెలుసుకుని, శరీరం నాదికాదు అనీ కర్తను నేను కాదు అని శయన ఆసన అటనం దర్శనం స్పర్శన ఘ్రాణ భోజన ఇలాంటి వాటిలో నేను కర్తను కాదు అనుకున్నవాడు బంధించబడడు.ఆయా ప్రదేశాలలో ఆయా గుణములను భుజింపచేస్తూ కూడా పండితుడైన వాడు బంధములో చిక్కడు

ప్రకృతిస్థోऽప్యసంసక్తో యథా ఖం సవితానిలః
వైశారద్యేక్షయాసఙ్గ శితయా ఛిన్నసంశయః
ప్రతిబుద్ధ ఇవ స్వప్నాన్నానాత్వాద్వినివర్తతే

ప్రకృతిలో ఉన్నా జీవుడు ప్రకృతిలో సంగం కలిగి ఉండడు. ఆకాశమూ వాయువూ అగ్నీ అంతటా ఉన్నా ఏదీ అటంకుండా ఉంటాయి. మనం కూడా అన్నిటిలో ఉండి కూడా ఏదీ అంటకుండా  ఉండవచ్చు.
గురు ముఖతా లభించిన విద్యతో, అసంగం అనే కత్తితో వివేక దృష్టితో అన్ని సంశయాలూ తొలగించుకుని కల నుండి మేలుకున్నవాడు తొలగిపోయినట్లు సంసారం నుండి తొలగిపోతాడు

యస్య స్యుర్వీతసఙ్కల్పాః ప్రాణేన్ద్రియర్ననోధియామ్
వృత్తయః స వినిర్ముక్తో దేహస్థోऽపి హి తద్గుణైః

ఎవరికైతే సంకల్పం లేదో, ఎవరైతే ప్రాణ ఇంద్రియ మనో బుద్ధి సంకల్పముల యందు విడిగా ఉన్నవాడు అన్నిటి నుండీ విముక్తుడవుతాడు. శరీరములో ఉన్నా శరీర ఇంద్రియ మనో బుద్ధి ప్రవృత్తికి దూరముగా ఉంటే , శరెరములో ఉన్నా లేని వాడికిందే లెక్క

యస్యాత్మా హింస్యతే హింస్రైర్యేన కిఞ్చిద్యదృచ్ఛయా
అర్చ్యతే వా క్వచిత్తత్ర న వ్యతిక్రియతే బుధః

పండితుడైన వాడు హింసా శీలమైన వాడితో హింసించబడ్డా, పూజించబడుతున్నా, నిందించబడుట అనేది మనకు కాదు అనుకున్నపుడు అలాంటి బంధాల నుండి దూరముగా ఉంటాడు. చెడు చేసినా మంచి చేసినా స్తోత్రమూ నిందా చేయకుండా ఉండాలి

న స్తువీత న నిన్దేత కుర్వతః సాధ్వసాధు వా
వదతో గుణదోషాభ్యాం వర్జితః సమదృఙ్మునిః

గుణముతో దోషముతో పని లేకుండా రెంటినుంచీ దూరముగా ఉన్నవాడు ముని. ఇది చెడూ అనీ ఇది మంచీ అనీ ఆలోచించడు

న కుర్యాన్న వదేత్కిఞ్చిన్న ధ్యాయేత్సాధ్వసాధు వా
ఆత్మారామోऽనయా వృత్త్యా విచరేజ్జడవన్మునిః

ఆత్మారాముడై ఇలాంటి వృత్తితో జడుడిలా విహరిస్తాడు.

శబ్దబ్రహ్మణి నిష్ణాతో న నిష్ణాయాత్పరే యది
శ్రమస్తస్య శ్రమఫలో హ్యధేనుమివ రక్షతః

కేవలం పుస్తకాలని చదివి పరమాత్మను తెలియలేకపోతే అలాంటి వాడు పడ్డ శ్రమకు శ్రమే ఫలితం. సంతానం కలగని ఆవును పోషిస్తే ఎలా ఫలితం ఉండదో ఇలాంటి వాడి పుస్తక జ్ఞ్యానం పనికిరాదు

గాం దుగ్ధదోహామసతీం చ భార్యాం దేహం పరాధీనమసత్ప్రజాం చ
విత్తం త్వతీర్థీకృతమఙ్గ వాచం హీనాం మయా రక్షతి దుఃఖదుఃఖీ

పాలుడిగి పోయిన భార్య దుష్టురాలైన భార్య పరాధీనమైన శరీరం దుష్ట సంతానమూ యోగ్యమైన వారికి దానం ఇవ్వబడని ధనమూ నా ప్రసంగం లేని వాక్కునూ దుఃఖాన్ని పెంచుకోవడానికే కాపాడుకుంటారు.

యస్యాం న మే పావనమఙ్గ కర్మ స్థిత్యుద్భవప్రాణనిరోధమస్య
లీలావతారేప్సితజన్మ వా స్యాద్వన్ధ్యాం గిరం తాం బిభృయాన్న ధీరః

నా విషయములో పవిత్రమైన కర్మను ఆచరించని వారు, పుట్టుకా రక్షణం ప్రళయం మొదలైన, నేను ఆయా అవతారములలో ఆచరించిన పనులనూ లీలలను జనంలనూ ఎవరు స్మరించడో అలాంటి వారిని విడిచిపెట్టాలి. భగవంతుని నామ కర్మ గుణ అవతారాలను ఏ నాలుక పలుకదో అలాంటి నాలుకను పోషించరాదు

ఏవం జిజ్ఞాసయాపోహ్య నానాత్వభ్రమమాత్మని
ఉపారమేత విరజం మనో మయ్యర్ప్య సర్వగే

ఇలా విచారించి ఆత్మలో ఉన్నభేద బుద్ధిని తొలగించి విరమించాలి. విరక్త్మైన మనసును అంతటా ఉండే నా యందు అర్పించి

యద్యనీశో ధారయితుం మనో బ్రహ్మణి నిశ్చలమ్
మయి సర్వాణి కర్మాణి నిరపేక్షః సమాచర

పరమాత్మ యందు నిశ్చలమైన మనసును ధరించలేని నాడు. ఒక వేళ చేసిన పనులను నాయందు అర్పించకుంటే వాటిని కోరికలు లేకుండా ఆచరించు

శ్రద్ధాలుర్మత్కథాః శృణ్వన్సుభద్రా లోకపావనీః
గాయన్ననుస్మరన్కర్మ జన్మ చాభినయన్ముహుః

పరమ మంగళ కరములూ సకల లోకములనూ పవిత్రం చేసే నా కథలను వింటూ గానం చేస్తూ స్మరిస్తూ నా అవతారములూ , అవతారములలో నా కర్మలనూ అభినయిస్తూ

మదర్థే ధర్మకామార్థానాచరన్మదపాశ్రయః
లభతే నిశ్చలాం భక్తిం మయ్యుద్ధవ సనాతనే

నా కోసమే ధర్మ అర్థ కామాలను ఆచరిస్తూ ఉన్నవాడు నిశ్చలమైన భక్తిని నా యందు కలిగి ఉంటాడు

సత్సఙ్గలబ్ధయా భక్త్యా మయి మాం స ఉపాసితా
స వై మే దర్శితం సద్భిరఞ్జసా విన్దతే పదమ్

సజ్జనుల కలయికతో సత్సంగం వలన లభించిన భక్తితో నన్ను వాడు ఉపాసన చేయాలి. అలాంటి వాడు నేను చూపిన నా స్థానాన్ని సులభముగా పొందుతాడు

శ్రీద్ధవ ఉవాచ
సాధుస్తవోత్తమశ్లోక మతః కీదృగ్విధః ప్రభో
భక్తిస్త్వయ్యుపయుజ్యేత కీదృశీ సద్భిరాదృతా

సాధువు అంటే ఎవరు? ఎవరిని సాధువు అనాలి. సజ్జనులందరూ నీ యందు ఉపయోగించే భక్తి ఎలా ఉండాలి

ఏతన్మే పురుషాధ్యక్ష లోకాధ్యక్ష జగత్ప్రభో
ప్రణతాయానురక్తాయ ప్రపన్నాయ చ కథ్యతామ్

దీన్ని నాకు వివరించు. నీకు వంగి ఉన్నాను, నీ మీద ప్రేమ కలిగి నిన్నే ఆశ్రయించి ఉన్నాను

త్వం బ్రహ్మ పరమం వ్యోమ పురుషః ప్రకృతేః పరః
అవతీర్నోऽసి భగవన్స్వేచ్ఛోపాత్తపృథగ్వపుః

నీవే పరబ్రహ్మవూ పరమాకాశానివి పరమ పురుషుడవు ప్రకృతి కంటే విలక్షణుడవు. నీ సంకల్ప అనుగుణముగా ఆయా శరీరములను ధరించి అవతరిస్తూ ఉన్నావు

శ్రీభగవానువాచ
కృపాలురకృతద్రోహస్తితిక్షుః సర్వదేహినామ్
సత్యసారోऽనవద్యాత్మా సమః సర్వోపకారకః

దయ కలవాడు, ఏ ప్రాణూలూ ద్రోహం చేయని వాడు, ఎదుటివారు చేసిన ద్రోహాన్ని క్షమించేవాడు సత్యమ్యందే తన బలం కలిగి ఉన్నవాడు, నిందించబడని మనసు కలవాడు, అందరికీ ఉపకారంచేసే బుద్ధి కలవాడు

కామైరహతధీర్దాన్తో మృదుః శుచిరకిఞ్చనః
అనీహో మితభుక్శాన్తః స్థిరో మచ్ఛరణో మునిః

కోరికలతో కొట్టబడని మనసు కలవాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు మెత్తని స్వభావం కలవాడు శుచి గలవాడు, ఏదీ లేనివాడు ఏదీ కోరని వాడు మితముగా భుజించేవాడు, శాంతుడు స్థిరముగా గుణరహితుడై నాయందు మాత్రమే రక్షణత్వ బుద్ధి కలవాడు

అప్రమత్తో గభీరాత్మా ధృతిమాఞ్జితషడ్గుణః
అమానీ మానదః కల్యో మైత్రః కారుణికః కవిః

త్వర పడని వాడూ, తనలో కలిగే దోషాలనూ గుణాలనూ ఎదుటివారికి తెలుపని వాడు, ధైర్యం కలవాడు కామ క్రోధాలను గెలిచినవాడు, అహంకారం లేనివాడు ఎదుటివారిని గౌరవించేవాడు, సమర్ధుడు, మైత్రి కలవాడు, దయ కలవాడు, జ్ఞ్యానం కలవాడు

ఆజ్ఞాయైవం గుణాన్దోషాన్మయాదిష్టానపి స్వకాన్
ధర్మాన్సన్త్యజ్య యః సర్వాన్మాం భజేత స తు సత్తమః

ఈ రీతిలో గుణ దోషాలను బాగా తెలుసుకుని, నేను బోధించిన తన గుణాలను తెలుసుకుని, తన ధర్మాలను విడిచిపెట్టి నన్ను మాత్రమే సేవించేవాడు సాధువు. నాయందు మనసు లగ్నం చేసి నా కోసం తన ధర్మాలనూ కూడా విడిచిపెడతాడో వాడు సాధువు.

జ్ఞాత్వాజ్ఞాత్వాథ యే వై మాం యావాన్యశ్చాస్మి యాదృశః
భజన్త్యనన్యభావేన తే మే భక్తతమా మతాః

నేనెవరూ ఎంతటి వాడినీ ఎలాంటి వాడిని, తెలుసుకుని అనన్య భావనతో ఎవరు సేవిస్తారో వారు నాకు అత్యుత్తమమైన భక్తులు

మల్లిఙ్గమద్భక్తజన దర్శనస్పర్శనార్చనమ్
పరిచర్యా స్తుతిః ప్రహ్వ గుణకర్మానుకీర్తనమ్

నా గుర్తులను గానీ నా గుర్తులు కల నా భక్త జనమును గానీ దర్శించుట, స్పృశించుట పూజించుట సేవించుట స్తోత్రం చేయుట వినయముగా వారి గుణాలనూ కర్మలనూ కీర్తించుట

మత్కథాశ్రవణే శ్రద్ధా మదనుధ్యానముద్ధవ
సర్వలాభోపహరణం దాస్యేనాత్మనివేదనమ్

నా కథలను వినడములో శ్రద్ధ కలవాడు, నన్ను ఎపుడూ ధ్యానం చేస్తూ ఉండాలి. పొందినవాటి మొత్తాన్నీ నాకు అర్పించుట, దాస్యముతో తనను తాను నాకు నివేదన చేయుట.

మజ్జన్మకర్మకథనం మమ పర్వానుమోదనమ్
గీతతాణ్డవవాదిత్ర గోష్ఠీభిర్మద్గృహోత్సవః

గానములూ వాయిద్యములూ తాండవుములూ ఇలాంటి వాటితో పండగ చేసుకొనుట.

యాత్రా బలివిధానం చ సర్వవార్షికపర్వసు
వైదికీ తాన్త్రికీ దీక్షా మదీయవ్రతధారణమ్

వార్షికపర్వలు చేసుకొనుట. వైదిక, తంత్ర దీక్షా, నా వ్రతాన్ని ధరించుట

మమార్చాస్థాపనే శ్రద్ధా స్వతః సంహత్య చోద్యమః
ఉద్యానోపవనాక్రీడ పురమన్దిరకర్మణి

నా విగ్రహాన్ని ప్రతిష్టించడములో శ్రద్ధ కలిగి ఉండుట, తనకు తానుగా ముందుకు వచ్చి ఉదయమం చేయుట, ఉద్యానాలూ ఊపవనాలూ క్రీడా పురాలూ  ఇలాంటి వాటిలో

సమ్మార్జనోపలేపాభ్యాం సేకమణ్డలవర్తనైః
గృహశుశ్రూషణం మహ్యం దాసవద్యదమాయయా

ఊడ్చుట, అలుకుట నీళ్ళు జల్లుట ముగ్గులుజల్లుట, ఇంటిలో సేవించుట, కపటం లేకుండా దాసునిలా నన్ను సేవించుట

అమానిత్వమదమ్భిత్వం కృతస్యాపరికీర్తనమ్
అపి దీపావలోకం మే నోపయుఞ్జ్యాన్నివేదితమ్

గర్వం లేకుండుట కపటం లేకుండుట, తాను చేసిన దాన్ని తానే కీర్తించుకోకుండా ఉండుట. నాకు అర్పించిన దాన్ని తాను వాడకూడదు. భగవంతునికి అర్పించిన దీపాదులను మనకోసం వాడరాదు.

యద్యదిష్టతమం లోకే యచ్చాతిప్రియమాత్మనః
తత్తన్నివేదయేన్మహ్యం తదానన్త్యాయ కల్పతే

భగవంతునికి మనకు ఏది అత్యంత ఇష్టమో దాన్ని స్వామికి నివేదన చేయాలి. అలాంటిదే మోక్షాన్ని ఇస్తుంది. మనకు ఇష్టమైన దాన్నే భగవంతునికి సమర్పించాలి.

సూర్యోऽగ్నిర్బ్రాహ్మణా గావో వైష్ణవః ఖం మరుజ్జలమ్
భూరాత్మా సర్వభూతాని భద్ర పూజాపదాని మే

సూర్యుడూ అగ్నీ బ్రాహ్మణుడూ గోవులూ వైష్ణవులూ ఆకాశం వాయువూ జలమూ భూమీ ఆత్మ సర్వ భూతములూ ఇవన్నీ నాకు మారుగా పూజించదగినవి. ఇంటిలో విగ్రహం లేకపోయినా, గుడికి వెళ్ళలేకపోయినా వీటిని పూజించవచ్చు.

సూర్యే తు విద్యయా త్రయ్యా హవిషాగ్నౌ యజేత మామ్
ఆతిథ్యేన తు విప్రాగ్ర్యే గోష్వఙ్గ యవసాదినా

సూర్యభగవానున్ని గాయత్రీ మంత్రముతో ఆరాధించాలి
అగ్నిని హవిస్సుతో
బ్రాహ్మణునికి ఆతిధ్యముతో
తృణాలు ఇచ్చి గోవులనూ
బంధువులా విష్ణుభక్తున్ని సత్కరించాలి
దహరాకాశములో ధ్యానముతో స్వామిని ఆరాధించాలి

వైష్ణవే బన్ధుసత్కృత్యా హృది ఖే ధ్యాననిష్ఠయా
వాయౌ ముఖ్యధియా తోయే ద్రవ్యైస్తోయపురఃసరైః

వాయువును ప్రాణ బుద్ధితో ఆరాధించాలి
జలమును ఇతర ద్రవ్యములతో ఆరాధించాలి
స్థండిలములో మనకు అన్ని భోగములనూ పరమాత్మ బుద్ధితో పూజించాలి

స్థణ్డిలే మన్త్రహృదయైర్భోగైరాత్మానమాత్మని
క్షేత్రజ్ఞం సర్వభూతేషు సమత్వేన యజేత మామ్

అన్ని ప్రాణులలో ఉన్న ఆత్మను సమబుద్ధితో పూజించాలి

ధిష్ణ్యేష్విత్యేషు మద్రూపం శఙ్ఖచక్రగదామ్బుజైః
యుక్తం చతుర్భుజం శాన్తం ధ్యాయన్నర్చేత్సమాహితః

నా ఆలయాలలో ఈ రూపముతో ఉన్న నన్ను సావధాన మనస్కుడై ధ్యానమూ అర్చనా చేయాలి

ఇష్టాపూర్తేన మామేవం యో యజేత సమాహితః
లభతే మయి సద్భక్తిం మత్స్మృతిః సాధుసేవయా

ఇలా నన్ను ఎవరు పూజిస్తారో వారు నాయందు భక్తిని పొందుతారు. నన్ను మరువ కుండా ఉండడానికి సజ్జనులను పూజించాలి.

ప్రాయేణ భక్తియోగేన సత్సఙ్గేన వినోద్ధవ
నోపాయో విద్యతే సమ్యక్ప్రాయణం హి సతామహమ్

సత్సంగం లేకుండా వేరే ఉపాయం నన్ను పొందడానికి లేదు.సత్పురుషులకు నేను ముఖాన్ని

అథైతత్పరమం గుహ్యం శృణ్వతో యదునన్దన
సుగోప్యమపి వక్ష్యామి త్వం మే భృత్యః సుహృత్సఖా

ఇది పరమ రహస్యము. నీవు నావాడవు కాబట్టి దాచకుండా చెబుతున్నాను.  నీవు నా నమ్మిన బంటువు స్నేహితుడవు.

                                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                 సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమధాగవతం ఏకాదశ స్కంధం పదవ అధ్యాయం

                                               ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమధాగవతం ఏకాదశ స్కంధం పదవ అధ్యాయం

అవధూత తాను పొందిన జ్ఞ్యానానికి ఇరవై నాలుగు మంది గురువులు కలరు అని బోధించాడు. ప్రపంచములో సంచరించే ప్రాణులు మనకు ఎంతటి ఆధ్యాత్మికమైన తత్వాన్ని ఉపదేశిస్తాయో తెలుసుకోవడానికి అవధూతోపాఖ్యానం ఉపకరిస్తుంది. వాటి ప్రవృత్తి మనకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో వివరిస్తాడు. అది విన్న యదుమహారాజు అందరి యందూ సమ భావం కలిగి, విన్న దాన్ని ఆచరణలో పెట్టి తరించాడు.

శ్రీభగవానువాచ
మయోదితేష్వవహితః స్వధర్మేషు మదాశ్రయః
వర్ణాశ్రమకులాచారమకామాత్మా సమాచరేత్

నేను ఎవరెవరికి వేటిని ధర్మములుగా బోధించానో వాటిని సావధానముగా విని ఆచరించాలి. అది కూడా కర్తృత్వాభిమానాన్ని వదలిపెట్టి, నేను పెట్టిన ధర్మాలను నన్ను ఆశ్రయించి వర్ణ ఆశ్ర కుల ఆచారన్ని పాటించాలి. నేను చెప్పిన వర్ణ ఆశ్ర కుల ఆచారన్ని సంగం లేకుండా ఆచరించాలి. నన్ను ఆశ్రయించి, కోరికలు లేకుండా ధర్మాలను ఆచరించాలి. ఒక ఫలితాన్ని ఆశించి ఆచరించకూడదు. ధర్మం కాబట్టి ఆచరించాలి.

అన్వీక్షేత విశుద్ధాత్మా దేహినాం విషయాత్మనామ్
గుణేషు తత్త్వధ్యానేన సర్వారమ్భవిపర్యయమ్

కోరికలను ఎందుకు విడిచిపెట్టాలి? కోరికలతో పని చేయడం మొదలుపెడితే అనుకున్న పనులన్నీ త్రలక్రిందులవుతాయి. సుఖం కలగాలని ప్రయత్నిస్తే దుఃఖం కలుగుతుంది. కలుగుతున్న దుఃఖాన్ని సుఖమనుకుని భ్రమిస్తూ ఉంటాము. విషయముల యందు మనసు ఉన్న జీవులు సత్వ రజస్తమోగుణముల యందే సత్వ బుద్ధితో అన్ని ప్రయత్నములూ విపరీత ఫలితములు ఇచ్చుటను పరిశీలించాలి.

సుప్తస్య విషయాలోకో ధ్యాయతో వా మనోరథః
నానాత్మకత్వాద్విఫలస్తథా భేదాత్మధీర్గుణైః

నిదురపోతున్నా విషయాలను మరచిపోవుటలేదు కదా. నిద్రపోతున్నా మనకు కలలు వస్తూ ఉన్నాయి. మనకు వచ్చే కలలు మన కోరికలే. మనం ఒకే విషయాన్ని ధ్యానిస్తే దాని మీద కోరిక పుడుతుంది. మనం పడుకొని ఉండి కూడా విషయములనే చూస్తుంటాము. దేన్ని ధ్యానం చేస్తే అదే కోరికగా మారి, ఏ కోరికైతే ఉందో అదే కలగా వస్తుంది. ఫలానా విషయాలనే అనుభవించాలనుకుంటున్నాను అన్న నియమాన్ని పెట్టగలమా? ఒక రసాన్నే ఒక రూపానే కోరతాము అన్న నియమం లేదు. విషయ్ములూ మనోరథములూ నానాత్మకములే. ఇవి పలురకములు కాబాట్టి కోరికలు గానీ ధ్యానం కానీ విషయ దృష్టి కానీ విఫలం అవుతుంది. ఒక దాని కన్నా వేరొకటి బాగున్నది అనడానికి కారణం ఏమిటి? వస్తువులో మార్పు లేదు. మనం దానిలో భేధాన్ని కల్పించుకున్నందు వలన భేదం కనపడుతుంది

నివృత్తం కర్మ సేవేత ప్రవృత్తం మత్పరస్త్యజేత్
జిజ్ఞాసాయాం సమ్ప్రవృత్తో నాద్రియేత్కర్మచోదనామ్

ఎలాంటి కర్మ ఆచరించాలి? నివృత్తమైన కర్మను ఆచరించాలి. ఫల సంగమును వదలి పని చేయాలి.ఒక వేళ ఫలం కావాలి అంటే ప్రవృత్తి కర్మలను నా యందు మనసు ఉంచి ఆచరించు. నా కైంకర్యముగా సకల కర్మలనూ ఆచరించు. వాస్తవమేదో తెలుసుకోవడానికి ప్రవర్తించాలి. ఇది వాస్తవమా? ఇది మనకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందా అని ఆలోచించి వేదం విధించిన కర్మ యందు ఆసక్తి ఉంచకు

యమానభీక్ష్ణం సేవేత నియమాన్మత్పరః క్వచిత్
మదభిజ్ఞం గురుం శాన్తముపాసీత మదాత్మకమ్

యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారా ధారణ సమాధి అనే అష్టాంగములు ఉన్నాయి.
యమములను తప్పక ఆచరించాలి. నియమాచరణ మాత్రం నా యందు మనసు లగ్నం చేసి ఆచరించాలి. నన్ను తెలిపే గురువును, శాంతుడైన గురువును, గుణ త్ర్యములు స్పృశించని గురువునూ, నా రూపముగానే ఆరాధించాలి. నన్ను బోధించే గురువును నా రూపముగానే ఆరాధించాలి

అమాన్యమత్సరో దక్షో నిర్మమో దృఢసౌహృదః
అసత్వరోऽర్థజిజ్ఞాసురనసూయురమోఘవాక్

అభిమానం మాత్సర్యం లేని వాడు, సమర్ధుడు, మమకారం లేని వాడు, నా యందు ప్రీతి కలవాడు, విషయం తెలుసుకోవడములో తొందర పడని వాడు. విషయాన్ని తెలుసుకోవాలనే కోరిక గలవాడు. దోషములను ఆలోచించని వాడు. (ఎదుటివారి గుణములలో దోషాన్ని ఆరోపించుట అసూయ). సత్యమైన వాక్కు గలవాడు.

జాయాపత్యగృహక్షేత్ర స్వజనద్రవిణాదిషు
ఉదాసీనః సమం పశ్యన్సర్వేష్వర్థమివాత్మనః

భార్యా సంతానమూ ఇల్లూ పొలమూ తనవారూ ధనము యందూ ఉదాసీన భావం కలిగి ఉండాలి. అన్నిటి యందూ సమభావనతో చూడాలి.

విలక్షణః స్థూలసూక్ష్మాద్దేహాదాత్మేక్షితా స్వదృక్
యథాగ్నిర్దారుణో దాహ్యాద్దాహకోऽన్యః ప్రకాశకః

తాను విలక్షణుడు కావాలి. స్థూల దేహం కంటే సూక్ష్మ దేహం కంటే ఆత్మ వేరు. రెంటి కంటే విలక్షణమైన ఆత్మను చూడగలిగిన వాడు. తనలో తాను చూడగలిగే వాడు కావాలి.
ఎలా దేహం కంటే ఆత్మ వేరు? నిప్పు పెట్టినపుడు  మంట కట్టె కన్నా వేరుగా ఉంటుంది. కాల్చేది వేరు కాల్చబడేది వేరు. వెలుతురు అనేది కాల్చబడే దానితో వస్తుందా కాలే దానితోనా? కట్టె వలన వెలుగు రాదు. కట్టెకు ఉన్న మంట వలన వెలుగు వస్తోంది. అలా అని కట్టే వెలుగు ఇస్తోంది అని చెప్పవచ్చా? కట్టే వెలుగు ఇస్తే మంట లేకున్నా వెలుగు ఇవ్వాలి. కట్టెను ఆశ్రయించి ఉన్న అగ్ని, ఆ కట్టెకన్నా విడిగా ఉండి మనకు కావలసిన వెలుగును ఇస్తోంది. అలాగే శరీరాని ఆశ్రయించి ఉన్న ఆత్మ శరీరం కంటే వేరు. ఈ ఆత్మే తనను తాను చూడగలదు గానీ శరీరం చూడలేదు. కట్టె వెలుగు ఇవ్వలేనట్లు శరీరం జ్ఞ్యానం గలది కాదు. శరీరములో ఉన్న ఆత్మే జ్ఞ్యానాధికరణం. ఆత్మ శరీరములో ఉంది కాబట్టి శరీరమే ఆత్మ అనడం సరి కాదు.

నిరోధోత్పత్త్యణుబృహన్ నానాత్వం తత్కృతాన్గుణాన్
అన్తః ప్రవిష్ట ఆధత్త ఏవం దేహగుణాన్పరః

మంట పెడితే ఒక సారి మంట చల్లారిపోతూ, ఆగిపోతూ, పెద్దగా అవుతూ, చిన్నగా అవుతూ ఉంటుంది. ఇవన్నీ అగ్ని గుణాలుకాదు, కట్టెగుణాలు. కట్టె బట్టి మంట ఆకారం ఉంటుంది. కట్టెలు చాలా ఉంటే చాలా మంటలు ఉన్నట్లు ఉంటాయి.అలాగే మనం కూడా పొట్టీ పొడుగూ లావూ సన్నమూ స్త్రీ పురుషుడు అనే భేధాలన్నీ శరీర భేదాలు గానీ ఆత్మ భేదాలు కావు.
ఆత్మ లోపల ప్రవేశించి మనకు వాటిని చూపిస్తుంది. దేహగుణాలనే ఆత్మ తనకు ఉన్నవిగా భావిస్తుంది

యోऽసౌ గుణైర్విరచితో దేహోऽయం పురుషస్య హి
సంసారస్తన్నిబన్ధోऽయం పుంసో విద్యా చ్ఛిదాత్మనః

పురుషుడి యొక్క గుణములతో కల ఈ దేహం, సంసారం అనేది దేహమ వలన ఏర్పడినదే కానీ ఆత్మ వలన ఏర్పడినది కాదు. అసలైన ఆత్మ జ్ఞ్యానస్వరూపము. జ్ఞ్యానాధికరణం. సంసారం శరీరం వలన.

తస్మాజ్జిజ్ఞాసయాత్మానమాత్మస్థం కేవలం పరమ్
సఙ్గమ్య నిరసేదేతద్వస్తుబుద్ధిం యథాక్రమమ్

కాబట్టి జింజ్యాసతో తెలియాలనే కోరికతో, శరీరములో ఆత్మ ఉన్నదనీ శరీరం ఆత్మ కాదు అని తెలుసుకుని శరీరాన్ని శరీర గుణాలనీ త్యజించాలి
ఇది వస్తు బుద్ధి. ఇలా స్పష్టముగా తెలుసుకుని

ఆచార్యోऽరణిరాద్యః స్యాదన్తేవాస్యుత్తరారణిః
తత్సన్ధానం ప్రవచనం విద్యాసన్ధిః సుఖావహః

ఇంతటి దృఢమైన జ్ఞ్యానం ఆచార్యుల వలన కలుగుతుంది. కింద ఉన్న అరణి ఆచార్యుడు. పైన ఉన్నది శిష్యుడు. పైన ఉన్న అరణితో కింద ఉన్న అరణిని మర్దనా చేయాలి. గురువుగారి వద్ద ఉన్న జ్ఞ్యానాన్ని శిష్యుడు మర్దనా చేసి తెలుసుకోవాలి. అపుడు జ్ఞ్యానాగ్ని పుడుతుంది. ఈ అగ్ని పుట్టాలంటే శిష్యుడిలో కూడా జ్ఞ్యాన పుట్టాలంటే గురువుగారు ప్రవచనం చేయాలి. గురువు గారు శిష్యునికి విద్య బోధించాలి. అలా చేయాలంటే శిష్యుడు గురువు గారి మనసులో దయను కలిగించి చెప్పకుండా ఉండలేని స్థితిని కలిగించాలి

వైశారదీ సాతివిశుద్ధబుద్ధిర్ధునోతి మాయాం గుణసమ్ప్రసూతామ్
గునాంశ్చ సన్దహ్య యదాత్మమేతత్స్వయం చ శాంయత్యసమిద్యథాగ్నిః

ఇలా గురువుగారి వలన లభిచిన ఈ జ్ఞ్యానం అతి విశుద్ధమైన బుద్ధి. ఏ దోషమూ లేనిది. సత్వ రజస్తమో గుణములచే ఏర్పడిన మాయను ఇది తొలగిస్తుంది. గుణములను దహింపచేస్తుంది. ఈ జ్ఞ్యానం ప్రకృతి గుణాలను దహింపచేసి, సమిధలైపోయిన తరువాత అగ్ని తనకు తానుగా చల్లారిపోయిన తరువాత ఆ జ్ఞ్యానం కూడా సమిధము లేని అగ్ని లాగ పోతుంది.

అథైషామ్కర్మకర్తౄణాం భోక్తౄణాం సుఖదుఃఖయోః
నానాత్వమథ నిత్యత్వం లోకకాలాగమాత్మనామ్

మనం వేటి వేటిని లోకములో భావిస్తున్నామో అలాంటి భావనలకు ఏమి కారణం? ఇది అనంతం. ఎన్నో ఉన్నాయి. లోకము వలనా కాలం వలనా ఆగమం వలనా ఏర్పడేవి.

మన్యసే సర్వభావానాం సంస్థా హ్యౌత్పత్తికీ యథా
తత్తదాకృతిభేదేన జాయతే భిద్యతే చ ధీః

సకల భావముల యొక్క పుట్టుకా స్థితీ లోకాన్ని కాలాన్ని ఆగమాన్నీ బట్టి  ఉంటుంది. మన బుద్ధి ఒక వస్తువును చూస్తే అందులో ఉన్న ఒక ఆకారాన్ని బట్టి మన బుద్ధి మారుతుంది. దేహం యొక్క భేధాన్ని బట్టి దేహిగా కనపడతాడు కానీ ఆత్మలో భేధం లేదు. ఆత్మకు దేహ సంబంధముతోనే ఇవన్నీ కలుగుతాయి

ఏవమప్యఙ్గ సర్వేషాం దేహినాం దేహయోగతః
కాలావయవతః సన్తి భావా జన్మాదయోऽసకృత్

దేహికి దేహాన్ని బట్టి అవస్థలు వస్తాయి. కాలాన్ని బట్టి దేహాలు ఏర్పడుతూ ఉంటాయి. దేహానికి ఏర్పడే అవస్థలు (బాలుడూ యువకుడూ వృద్ధుడు) కాలం బట్టే ఏర్పడతాయి. దేహాది ఉత్పత్తి కాలాన్ని బట్టి జరుగుతుంది. అలా కలిగే భేధాలను ఆత్మకు ఆపాదించి భ్రమలో పాడుతూ ఉన్నాము. ఆ భేధాలు ఆత్మకు లేవు. ఇవి మాటి మాటికీ కలుగుతూ ఉంటాయి. అనంతమైన పుట్టుకలూ మరణాలూ ఉంటాయి.

తత్రాపి కర్మణాం కర్తురస్వాతన్త్ర్యం చ లక్ష్యతే
భోక్తుశ్చ దుఃఖసుఖయోః కో న్వర్థో వివశం భజేత్

మన చేతిలో ఏదీ లేదనడానికిగా, శరీరం చేస్తోంది అనడానికి బదులు "నేను చేస్తున్నాను" అంటాం. మనమే చేస్తే మనం అనుకున్నట్లుగా చేయగలగాలి. కానీ అలా చేయలేకపోతున్నాము. మనకు ఇష్టం లేని వాటిని బలవంతముగా చేస్తున్నాము. దాని వలన హాని కలుగుతుంది. మనకు ఏ పనిలోనూ స్వాతంత్ర్యం లేదు. అంతా పారతంత్ర్యమే.
దుఃఖం కలగాలని ఎవరినా ఇష్టపూర్తిగా పనులు చేస్తారా?దుఃఖాన్ని కోరకుండా దుఃఖం కలిగించే పనులు చేయడమే పారతంత్ర్యం

న దేహినాం సుఖం కిఞ్చిద్విద్యతే విదుషామపి
తథా చ దుఃఖం మూఢానాం వృథాహఙ్కరణం పరమ్

అలాంటి సంసారములో బుద్ధి ఉన్న వారు, ప్రయోజనం కోరే వారూ ప్రవర్తిస్తారా.
ప్రపంచములైనా పండితుడైనా సరే, జ్ఞ్యాని ఐనా సరే, ఎవరికైనా దేహం అనేది ఉంటే సుఖం అనేది ఉండదు. దుఃఖమైనా సుఖమైనా ఏ  కొంచెమైనా తన ఆధీనముగా ఉండదు. అది ఎపుడు ఉంటుందో ఎపుడు పోతుందో ఎవరికీ తెలీదు. కానీ మూర్ఖులు అది అంతా తాను చేసుకున్నాను అనుకుంటాడు. పండితులు అది అంతా భగవంతుని లీల అని గ్రహిస్తారు. ఇరువురికి సుఖ దుఃఖాల అనుభవం సమానమే.

యది ప్రాప్తిం విఘాతం చ జానన్తి సుఖదుఃఖయోః
తేऽప్యద్ధా న విదుర్యోగం మృత్యుర్న ప్రభవేద్యథా

రావడమూ పోవడమూ, సుఖం కలుగుటా దుఃఖం కలుగుటా రెండూ మనకే తెలిసి ఉంటే మనం సుఖం కలిగే పనే చేస్తాము. సుఖ ప్రాప్తీ దుఃఖం విఘాతం తెలిసిన వాడు దుఃఖం రాకుండానే ప్రవర్తిస్తాడు. మనం అనుకుంటే ఏదీ ఆగదు, మనమనుకుంటే ఏదీ కలగదు.

కోऽన్వర్థః సుఖయత్యేనం కామో వా మృత్యురన్తికే
ఆఘాతం నీయమానస్య వధ్యస్యేవ న తుష్టిదః

మృత్యువు వద్దకు తీసుకు పోయే ఏ అర్థ కామాలు మనకు సుఖాన్ని ఇస్తాయి?  సంసారములో పడవేసే అర్థకామాలు సుఖాన్ని కలిగిస్తాయా? బలికి తీసుకు పోబోయే ముందు జంతువుకు పూల దండలు వేసి చక్కగా ఆహారం పెట్టి తీసుకు వెళతారు. అలాంటి అలంకారాల లాంటివే సంసారములో సుఖ దుఃఖాలు.

శ్రుతం చ దృష్టవద్దుష్టం స్పర్ధాసూయాత్యయవ్యయైః
బహ్వన్తరాయకామత్వాత్కృషివచ్చాపి నిష్ఫలమ్

తప్పించుకుందామంటే, ప్రయత్నంచేద్దామంటే నీవు చేసే ప్రయత్నాలన్ని నిష్ఫలాలే. మనం ఒక దాన్ని విన్నా చూచినా, చూచినా విన్న వస్తువులలో గుణములను ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోలేము. స్పర్థ, అతిశయం, అసూయ, వ్యయం ధ్వంసం ఖర్చూ మొదలైనవి ఉంటాయి. మనకు మనమే మనలోనే ఏర్పరచుకుని చేస్తున్నాము కానీ ఇంకొకరి ప్రమేయం లేదు, చెడుకూ మంచికీ మనమే కర్త్లం అనే భావనతో ఉంటాము. కోరుకున్న కోరికను పొందడానికి ఎన్నో విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఈ విఘ్నాలకు కారణాలు స్పర్థా అసూయ ధంసం, వ్యయం మొదలైనవి. ఉదాహరణకు గుడికి వెళ్ళే సమయానికి ఎవరైనా ఇంటికొస్తే గుడికి వెళ్ళాలి అనుకున్న మనమే గుడికి వెళ్ళడం మానుకుంటున్నాము. మనం చేస్తున్న దాని కంటే చేయబోయే దాని వలన కలిగే ఫలితం తక్కువ అని మన చుట్టూ ఉన్నవారే కల్పిస్తే మనమే ఆ పనిని మానుకుంటున్నాము. ఇంక మన స్వాతంత్ర్యమూ ఫలా కాంక్ష ఎక్కడ?

కోరిక అనేది అనేకమైన విఘ్నములు కలిగి ఉంటాయి కాబట్టి నిష్ఫలం. రైతు విత్తనం వేస్తాడు, వర్షం పడితే పంట వస్తుంది. కోతకొచ్చాక వర్షం పడితే? లేదా పంట కోసాక ఇంటిలో పెట్టగా ఇల్లు తగలబడితే? భూమి మీద విత్తు వేసిన దగ్గరనుండీ ఆ ఫలం మన ఇంటిలోకి వచ్చేంతవరకూ ఆపే విఘ్నాలు అనేకం. ఈ విఘ్నాలన్నీ ఎవరు కోరుకుంటే వస్తున్నాయి? అన్ని విఘ్నాలూ నేనే (కృష్ణుడు) పోగడతాను.

అన్తరాయైరవిహితో యది ధర్మః స్వనుష్ఠితః
తేనాపి నిర్జితం స్థానం యథా గచ్ఛతి తచ్ఛృణు

ఎలాంటి విఘ్నాలూ లేకుండా ధర్మం అనుష్ఠించినా, దాని వలన కలిగే ఉత్తమ స్థానం కూడా శాశ్వతముగా ఉండదు.

ఇష్ట్వేహ దేవతా యజ్ఞైః స్వర్లోకం యాతి యాజ్ఞికః
భుఞ్జీత దేవవత్తత్ర భోగాన్దివ్యాన్నిజార్జితాన్

తన ఇష్టమైన దేవతలకు యజ్ఞ్యం చేసి తాను స్వర్గాలకు వెళ్ళి తాను కష్టపడి సంపాదించుకున్న భోగాలను తాను అనుభవిస్తాడు.

స్వపుణ్యోపచితే శుభ్రే విమాన ఉపగీయతే
గన్ధర్వైర్విహరన్మధ్యే దేవీనాం హృద్యవేషధృక్

తన పుణ్యముతో పెరిగిన ఆయా ప్రాంతాలలో ఉత్తమ విమానాలలో గంధర్వులతో కలసి దేవతా స్త్రీలతో అందమైన వేషాలు ధరించి తిరుగుతాడు

స్త్రీభిః కామగయానేన కిఙ్కినీజాలమాలినా
క్రీడన్న వేదాత్మపాతం సురాక్రీడేషు నిర్వృతః

ఇలా విహరిస్తూ ఉంటాడు. సమయం మించిపోతోంది అన్న సంగతి తెలియడు. ఏ సుఖం కావాలని కోరుకుని కర్మలు ఆచరించామో ఆ సుఖం ఐపోగానే మళ్ళీ కిందకు వచ్చి కర్మలు ఆచరించాలి.

తావత్స మోదతే స్వర్గే యావత్పుణ్యం సమాప్యతే
క్షీణపున్యః పతత్యర్వాగనిచ్ఛన్కాలచాలితః

నీవు చేసిన పుణ్యం ముగిసే దాకా నీవు స్వర్గలోకములో ఆనందముగా ఉంటావు. ఆ పుణ్యం క్షీణించడముతో నీవు మళ్ళీ వచ్చి ఇష్టము లేకున్నా భూలోకములో పడే తీరాలి

యద్యధర్మరతః సఙ్గాదసతాం వాజితేన్ద్రియః
కామాత్మా కృపణో లుబ్ధః స్త్రైణో భూతవిహింసకః

అదే అధర్మాన్ని కోరితే, అధర్మాన్ని ఆచరించిన వాడు సంసారములో దుష్ట జనుల సావాసముతో ఇంద్రియ జయము లేకుండా కోరికలు కలిగి లుబ్దుడై స్త్రీ వ్యామోహం కలిగి సకల ప్రాణులనూ హింసించేవాడిగా

పశూనవిధినాలభ్య ప్రేతభూతగణాన్యజన్
నరకానవశో జన్తుర్గత్వా యాత్యుల్బణం తమః

పశువులను శాస్త్ర విధి తప్పి హింసించి ప్రేత భూత పిశాచాలను ఆరాధిస్తూ, తన వశములో లేకుండానే తాను నరకానికి వెళ్ళి కౄరమైన భయంకరమైన నరకాన్ని చేరతాడు

కర్మాణి దుఃఖోదర్కాణి కుర్వన్దేహేన తైః పునః
దేహమాభజతే తత్ర కిం సుఖం మర్త్యధర్మిణః

ఈ శరీరముతో దుఃఖం కలిగించే ఎన్నో పనులు చేసి, ఇక్కడా దుఃఖమే అక్కడా దుఃఖమే పొందుతాడు. ఇంక సుఖమెక్కడిది?

లోకానాం లోకపాలానాం మద్భయం కల్పజీవినామ్
బ్రహ్మణోऽపి భయం మత్తో ద్విపరార్ధపరాయుషః

నీవు అనుకున్న పని అనుకున్నట్లు చేయగలిగినా నీవు అనుకున్న సుఖం అనుకున్న రీతిలో పొందలేవు. ఒక వేళ పొందినా ఆ సుఖం పొందుతున్నపుడే దాని సమయం ముగిసి దుఃఖం కలుగుతుంది. ఇది మనుషులకే కాదు లోకములకూ లోకపాలకులకు కూడా నా భయం ఉంది. బ్రహ్మ కల్ప కాలం బతికే వారికి కూడా ఈ భయం ఉంటుంది. ద్విపరార్థం బతికే బ్రహ్మకు కూడా నా భయం తప్పదు

గుణాః సృజన్తి కర్మాణి గుణోऽనుసృజతే గుణాన్
జీవస్తు గుణసంయుక్తో భుఙ్క్తే కర్మఫలాన్యసౌ

కర్మ గుణాన్నీ, గుణం కర్మనీ సృష్టిస్తుంది. ఈ జీవుడు తాను గుణములతో కలసి కర్మ ఫలాలను అనుభవిస్తున్నాడు

యావత్స్యాద్గుణవైషమ్యం తావన్నానాత్వమాత్మనః
నానాత్వమాత్మనో యావత్పారతన్త్ర్యం తదైవ హి

సత్వ రజసత్మో గుణాల వైషమ్యాన్ని మనం చూస్తున్నంతకాలం, నానాత్వ బుద్ధి కలుగుతుంది. ఎప్పటిదాకా ఆత్మకు నానాత్వ జ్ఞ్యానముంటుందో అప్పటిదాకా ఆత్మకు పారతంత్ర్యం తప్పదు. అంతవరకూ మనం చేసేది వెట్టి చాకిరీ అవుతుంది.

యావదస్యాస్వతన్త్రత్వం తావదీశ్వరతో భయమ్
య ఏతత్సముపాసీరంస్తే ముహ్యన్తి శుచార్పితాః

ఎప్పటి వరకూ మనకు పారతంత్ర్యం ఉంటుందో అప్పటివరకూ మనకు భగవంతుని వలన భయం తప్పదు. ఇలాంటి కర్మ బంధాన్ని ఎవడు సేవిస్తాడో అలాంటి వాడు దుఃఖాన్నీ మోహాన్నీ పొందుతూ ఉంటాడు

కాల ఆత్మాగమో లోకః స్వభావో ధర్మ ఏవ చ
ఇతి మాం బహుధా ప్రాహుర్గుణవ్యతికరే సతి

కాలమూ ఆత్మ ఆగమమూ లోకమూ స్వభావమూ ధర్మమూ, ఇవన్నీ నా పేర్లే. సృష్టి జరిగినపుడు, సంసారం ప్రవర్తించినపుడు, నాకు ఇన్ని పేర్లు.

శ్రీద్ధవ ఉవాచ
గుణేషు వర్తమానోऽపి దేహజేష్వనపావృతః
గుణైర్న బధ్యతే దేహీ బధ్యతే వా కథం విభో

నీవు చెప్పినట్లుగా ప్రకృతికి సంబంధించిన, శరీరము వలన కలిగే గుణములలో ఉంటూ, వాటితో బంధించబడకుండా వాటి స్వభావాన్ని జీవుడు తెలుసుకునే ఉపాయం ఉందా? ఉంటే నాకు వివరించండి

కథం వర్తేత విహరేత్కైర్వా జ్ఞాయేత లక్షణైః
కిం భుఞ్జీతోత విసృజేచ్ఛయీతాసీత యాతి వా

ఎలా ఉండాలి ఏ లక్షణాలతో గుణములతో విహరించాలి. ఏ లక్షణాలను బట్టి మనం దీన్ని తెలుసుకోవాలి. దేన్ని మనం అనుభవించాలి. ఏమి చేయాలి ఎలా ఉండాలి దేనితో ఉండాలి దేన్ని వదలిపెట్టాలి దేన్ని అసహ్యించుకోవాలి దేన్ని తెలుసుకోవాలి ఎలా పడుకోవాలి ఎలా కూర్చోవాలీ ఎలా నడవాలి దేన్ని మానాలి?

ఏతదచ్యుత మే బ్రూహి ప్రశ్నం ప్రశ్నవిదాం వర
నిత్యబద్ధో నిత్యముక్త ఏక ఏవేతి మే భ్రమః

ఎదుటివారు అడిగిన ప్రశ్నలను తెలుసుకుని చక్కగా సమాధానం చెప్పగల మహానుభావా నాకు దీన్ని వివరించవలసినది. నిత్య ముక్తులు కానీ నిత్య బద్ధులు కానీ, ఇద్దరూ ఒకటే అనుకుంటున్నాను.  ఇద్దరూ పరతంత్రులే కదా. దీన్ని వివరించండి.

                                                సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

Saturday, August 24, 2013

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

                                           ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

శ్రీబ్రాహ్మణ ఉవాచ
పరిగ్రహో హి దుఃఖాయ యద్యత్ప్రియతమం నృణామ్
అనన్తం సుఖమాప్నోతి తద్విద్వాన్యస్త్వకిఞ్చనః

మనకు బాగా నచ్చినదీ ఇష్టమైనదీ అని చెప్పుకుని అది మన దగ్గరలేకుంటే ఎదుటివారి నుండి తీసుకుంటాము. ప్రపంచములో ఇంతకు మించిన దుఃఖం ఇంకొకటి లేదు.
ఏమీ లేనివాడు, దేనినీ కోరని వాడు పొందిన సుఖాన్ని ప్రతీ దాన్ని కోరి , ప్రతీ దాన్నీ కోరేవాడు, ఇతరుల నుండి పొందేవాడు పొందలేడు.

సామిషం కురరం జఘ్నుర్బలినోऽన్యే నిరామిషాః
తదామిషం పరిత్యజ్య స సుఖం సమవిన్దత

ఒక పక్షి ఎక్కడినుంచో చిన్న మాంస ఖండాన్ని తీసుకు వచ్చి తిందామని కూర్చోగానే అది చూసిన మిగతా పక్షులు చూచి దాని వెనక పరిగెత్తుకుని వచ్చి ఆ మాంసం కోసం బాధించసాగాయి. అది చూసి ఆ పక్షి పారిపోసాగింది. అది పారిపోయినా మిగతా పక్షులన్నీ వెంటబడ్డాయి. పొడిచి పొడిచి బాధించసాగాయి. దొరకకుండా ఏకాంతములోకి వెళ్ళి తినాలని ఈ పక్షి పరుగెత్తుతున్న కొద్దీ అవి వెంబడిస్తూ పొడుస్తూ ఉన్నాయి. చివరకు బాధ తట్టుకోలేక ఆ మాంస ఖండాన్ని వదిలేసింది. అపుడు పక్షులన్నీ ఆ మాంస ఖండం వెనుక వెళ్ళాయి, ఈ పక్షిని వదిలేసాయి. మనం కూడా ధనాన్ని పట్టుకుంటే అది మన నుంచి తీసుకునే దాక వారు మనని వెంబడిస్తూ ఉంటారు. పరిగ్రహమే దుఃఖాన్ని కలిగిస్తుంది అని కురల పక్షి మనకు చెప్పింది.

న మే మానాపమానౌ స్తో న చిన్తా గేహపుత్రిణామ్
ఆత్మక్రీడ ఆత్మరతిర్విచరామీహ బాలవత్

నాకు మానమూ అవమానము చింతా లేదు. ఇల్లు ఉంటే బాధ. భార్య ఇల్లూ సంతానమూ ఏమీ లేవు నాకు. అందుకు మానమూ అవమానము లేదు. పరమాత్మ యందే కోరిక కలిగి పరమాత్మ యందే ఆనందిస్తున్నాను. చిన్న పిల్లవానిలా తిరుగుతున్నాను.

ద్వావేవ చిన్తయా ముక్తౌ పరమానన్ద ఆప్లుతౌ
యో విముగ్ధో జడో బాలో యో గుణేభ్యః పరం గతః

ప్రపంచములో ఏ చింతా లేకుండా పరమానందాన్ని పొందగలవారు ఇద్దరే. ఏమాత్రమూ జ్ఞ్యానం లేని బాలురూ పరిపూర్ణ జ్ఞ్యానం పొంది ప్రకృతిని దాటినవారు.

క్వచిత్కుమారీ త్వాత్మానం వృణానాన్గృహమాగతాన్
స్వయం తానర్హయామాస క్వాపి యాతేషు బన్ధుషు

ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి ఉంది, యుక్త వయసుకు వచ్చింది, పెళ్ళి కుదిరింది. ఇంట్లో వారు బయటకు వెళ్ళిన సమయములో పెళ్ళి వారు ఇంటికి వచ్చారు. వారికి వండి పెట్టడానికి ఇంట్లో బియ్యం లేదు. ఆమెకు ధాన్యం కనపడింది. దాన్ని దంచాలి.

తేషామభ్యవహారార్థం శాలీన్రహసి పార్థివ
అవఘ్నన్త్యాః ప్రకోష్ఠస్థాశ్చక్రుః శఙ్ఖాః స్వనం మహత్

ఆమె వారితో వంట చేస్తా అని చెప్పి పెరట్లోకి వెళ్ళి రోటి దగ్గరకు వెళ్ళి ధాన్యం అందులో వేసి దంచుతోంది. చేతికి కంకణాలు ఉండడం వలన దంచుతుంటే ఘల్లు ఘల్లు అని చప్పుడు వస్తోంది.

సా తజ్జుగుప్సితం మత్వా మహతీ వృడితా తతః
బభఞ్జైకైకశః శఙ్ఖాన్ద్వౌ ద్వౌ పాణ్యోరశేషయత్

ఆ చప్పుడు వారు వింటే బాగోదని చెప్పి రెండు గాజులు తీసి పక్కన బెట్టింది. ఐనా చప్పుడు వచ్చింది, అలా ఇంకో రెండు తీసింది, ఐనా చప్పుడు వచ్చింది. అలా అన్ని గాజులూ తీసి చెరో చేతికి చెరో గాజూ ఉండేట్లు చూసుకుంది. అపుడు దంచేప్పుడు చప్పుడు రాలేదు. మనకు కూడ సంగముంటేనే గొడవంతా, ఏకాంతముగా ఉంటే ఏ బాధా ఉండదు.

ఉభయోరప్యభూద్ఘోషో హ్యవఘ్నన్త్యాః స్వశఙ్ఖయోః
తత్రాప్యేకం నిరభిదదేకస్మాన్నాభవద్ధ్వనిః

అన్వశిక్షమిమం తస్యా ఉపదేశమరిన్దమ
లోకాననుచరన్నేతాన్లోకతత్త్వవివిత్సయా

వాసే బహూనాం కలహో భవేద్వార్తా ద్వయోరపి
ఏక ఏవ వసేత్తస్మాత్కుమార్యా ఇవ కఙ్కణః

పది మందితో ఉంటే కలహం, ఇద్దరితో ఉంటే ముచ్చట్లు వస్తాయి, ఒక్కడూ ఉంటే ఏమీ కాదు. కన్య చేతికి కంకణం లాగా ఒక్కడూ సంచరించాలి. ఇద్దరూ కలిస్తే మౌనం ఉండదు.

మన ఏకత్ర సంయుఞ్జ్యాజ్జితశ్వాసో జితాసనః
వైరాగ్యాభ్యాసయోగేన ధ్రియమాణమతన్ద్రితః

ప్రాణాయామముతో ఆసన విజయముతో మనసును ఒక చోట ఉంచాలి. వైరాగ్యముతో అభ్యాసముతో మనసును ఏమరపాటు లేకుండా పరమాత్మ యందు ఒంటిగా ఉండి లగ్నం చేయాలి. ఇద్దరు కలసి తపస్సు చేయలేరు.

యస్మిన్మనో లబ్ధపదం యదేతచ్ఛనైః శనైర్ముఞ్చతి కర్మరేణూన్
సత్త్వేన వృద్ధేన రజస్తమశ్చ విధూయ నిర్వాణముపైత్యనిన్ధనమ్

పరమాత్మయందు మనసు లగ్నం చేస్తే మెల్ల మెల్లగా కర్మ బంధాలను విడిచిపెడతాము. సత్వాన్ని బాగా పెంచి రజస్తమాలను నశింపచేయాలి.తక్కిన గుణాలేవీ లేకపోవడముతో సత్వ గుణము కూడా చల్లారుతుంది. కట్టెలు లేని అగ్ని తనకు తాను చల్లరినట్లుగా. ఇలా ఆత్మ యందు మనసును ఉంచి వెలుపల ఏముంది లోపల ఏముంది అన్న విషయాన్ని తెలుసుకోకూడదు.

తదైవమాత్మన్యవరుద్ధచిత్తో న వేద కిఞ్చిద్బహిరన్తరం వా
యథేషుకారో నృపతిం వ్రజన్తమిషౌ గతాత్మా న దదర్శ పార్శ్వే

ఏకచార్యనికేతః స్యాదప్రమత్తో గుహాశయః
అలక్ష్యమాణ ఆచారైర్మునిరేకోऽల్పభాషణః

దానికి ఉదాహరణగా ఒక బాణం చేసేవాడు ఉన్నాడు. బాణాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. పక్కనే రాజు గారు వెళుతున్నారు. అందరూ లేచారు గానీ బాణం చేసేవాడు మాత్రంలేవలేదు. మనసు ఏకాగ్రముగా ఉంటే మన చుట్టు పక్కల ఏమున్నా మనం వాటిని చూడం. వాటికి వశం కాము. అది లేని నాడు అన్నిటినీ చూస్తాము, వశం అవుతాము. పక్క నుంచి వెళుతున్నారాజును కూడా ఏకాగ్ర మనస్కుడైన బాణం యందు మనస్సు ఉన్నవాడు చూడలేదు. ఒకే గురువును మనసులో పెట్టుకుని ప్రమాదం లేకుండా అరణ్యములో కానీ ఏకాంతములో గానీ మౌనం వహించి, లేదా వీలైనంత తక్కువ మాట్లాడుతూ, సంసారమూ ఇల్లూ అనే వ్యాపకం లేకుండా ఉండాలి.

గృహారమ్భో హి దుఃఖాయ విఫలశ్చాధ్రువాత్మనః
సర్పః పరకృతం వేశ్మ ప్రవిశ్య సుఖమేధతే

మనో నిశ్చయం లేని వాడికి ప్రతీ ప్రయత్నం వ్యర్థమవుతుంది. తనకు తాను ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేయడం వ్యర్థం. ఒకరు కట్టిన ఇంటిలో వెళ్ళి ఉండడం శ్రేష్టం. పాము చీమలు పెట్టిన పుట్టలో ఉంటుంది. తనకు తానుగా ఇల్లు కట్టుకోదు. భగవంతుడు ఇచ్చిన దానితోనే తృప్తి పొందు. నేనుగా ఒక దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే దుఃఖం కలుగుతుంది.

ఏకో నారాయణో దేవః పూర్వసృష్టం స్వమాయయా
సంహృత్య కాలకలయా కల్పాన్త ఇదమీశ్వరః
ఏక ఏవాద్వితీయోऽభూదాత్మాధారోऽఖిలాశ్రయః

పరమాత్మ ఒక్కడే తాను సృష్టించిన జగత్తును తానే ప్రళయ కాలములో సంహరిస్తాడు. అలాంటి పరమాత్మ ఒక్కడే. రెండవ వాడు లేడు. ఆయన అన్నిటికీ ఆధారమూ ఆశ్రయం.

కాలేనాత్మానుభావేన సామ్యం నీతాసు శక్తిషు
సత్త్వాదిష్వాదిపురుషః ప్రధానపురుషేశ్వరః

తన ప్రహ్బావం ఐన కాలముతో అన్ని శక్తులూ భూతములూ ఏకాత్మ్యాన్ని పొందినపుడు, సత్వాదులన్నీ సమానముగా ఐనపుడు ప్రధానపురుషుడైన పరమాత్మ, పరములకూ అపరములకూ పరమైన ఆయన పరుడు.

పరావరాణాం పరమ ఆస్తే కైవల్యసంజ్ఞితః
కేవలానుభవానన్ద సన్దోహో నిరుపాధికః

ఆయనొక్కడే ఉంటాడు. అనుభవానంద స్వరూపుడు. ఇంకో ఉపాధి ఉండదు. మనమానందం పొందాలి అంటే కావలసిన దాన్ని ఇంద్రియానికి అందిస్తేనే ఆనందం. కానీ పరమాత్మకు అలా కాదు. ఇంద్రియాలూ మనసూ బుద్ధీ లేదు. తక్కిన దానితో సంబంధం కలిగితే వచ్చే ఆనందం నిత్యం కాదు. కానీ పార్మాత్మ అలా కాదు. కేవలానంద స్వరూపుడు.

కేవలాత్మానుభావేన స్వమాయాం త్రిగుణాత్మికామ్
సఙ్క్షోభయన్సృజత్యాదౌ తయా సూత్రమరిన్దమ

తన ఆత్మానుభావముతో త్రిగుణాత్మకమైన ప్రకృతిని క్షోభింపచేస్తూ సృష్టిస్తాడు.ఆయనే బ్రహ్మ

తామాహుస్త్రిగుణవ్యక్తిం సృజన్తీం విశ్వతోముఖమ్
యస్మిన్ప్రోతమిదం విశ్వం యేన సంసరతే పుమాన్

దాన్నే ప్రకృతీ అంటారు. అది మూడు గుణాలతో కలసి ఉంటుంది. అది విశ్వతోముఖం. సకల ప్రపంచం దానితోనే కూర్చబడి ఉంటుంది.అలాంటి ప్రకృతితోనే పురుషుడు సంసారములో సంచరిస్తాడు

యథోర్ణనాభిర్హృదయాదూర్ణాం సన్తత్య వక్త్రతః
తయా విహృత్య భూయస్తాం గ్రసత్యేవం మహేశ్వరః

సాలెపురుగు తన నోటినుంచి దారాన్ని తీసి చుట్టూ గూడు కడుతుంది. చూసేవారికి ఆ సాలెపురుగు చస్తుందేమో అనిపిస్తుంది. కానీ సాలెపురుగు తాను సృష్టించిన దారాన్ని తన నోటితో తానే తిని బయటకు వస్తుంది. పరమాత్మ కూడా ప్రపంచాన్ని తానే సృష్టించి తానే మింగివేస్తాడు

యత్ర యత్ర మనో దేహీ ధారయేత్సకలం ధియా
స్నేహాద్ద్వేషాద్భయాద్వాపి యాతి తత్తత్స్వరూపతామ్

దేహి తన మనసును ఎక్కడ లగ్నం చేస్తాడో, స్నేహముతో గానీ భయముతో గానీ ద్వేషముతో గానీ మనసు ఎక్కడెక్కడ లగ్నం చేస్తాడో అలాంటి జన్మే పొందుతాడు.

కీటః పేశస్కృతం ధ్యాయన్కుడ్యాం తేన ప్రవేశితః
యాతి తత్సాత్మతాం రాజన్పూర్వరూపమసన్త్యజన్

తుమ్మెద ఒక పురుగును తీసుకుని గోడకు గల రంధ్రములో పడేసి ఆ పురుగును బయటకు రానీయకుండా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ తుమ్మెదనే చూస్తూ చూస్తూ కొన్నాళ్ళకు ఆ పురుగు కూడా ఆ తుమ్మెదగా మారిపోతుంది. మనం దేన్ని నిరంతరం ధ్యానం చేస్తామో మనకు ఆ రూపమే లభిస్తుంది. భయముతో కావొచ్చు స్నేహముతో కావొచ్చు ద్వేషముతో కావొచ్చు. జన్మాంతరం సంసారం బాధలూ అన్నీ కలిగేవి ధ్యానముతోనే. ప్రకృతిని ధ్యానిస్తే సంసారం. పరమాత్మను ధ్యానిస్తే మోక్షం వస్తుంది.

ఏవం గురుభ్య ఏతేభ్య ఏషా మే శిక్షితా మతిః
స్వాత్మోపశిక్షితాం బుద్ధిం శృణు మే వదతః ప్రభో

ఈ విధముగా నేను ఇరవై నాలుగు గురువులతో ఇలాంటి బుద్ధి బోధించబడింది.
నేను జాగ్రత్తగా వీటితోటీ నా శరీరముతోటీ నేర్చుకున్న విద్యను చెబుతాను విను

దేహో గురుర్మమ విరక్తివివేకహేతుర్
బిభ్రత్స్మ సత్త్వనిధనం సతతార్త్యుదర్కమ్
తత్త్వాన్యనేన విమృశామి యథా తథాపి
పారక్యమిత్యవసితో విచరామ్యసఙ్గః

 నా శరీరాన్ని జాగ్రత్తగా చూస్తే ఈ శరీరమే నాకు విరక్తిని కలిగిస్తుంది.
సత్వాన్ని పోగొట్టుకుని రజస్తమస్సులతో ప్రవర్స్తిస్తే నిరంతరం దుఃఖం భయం శోకం మోహం కలుగుతుంది.   రజస్తమస్సులు వదిలి సత్వాన్ని తీసుకుంటే ఆనందమే వస్తుంది. ఈ శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ దీనితో ఆయా వచ్చే తత్వములను బాగా విమర్శిస్తున్నాను. ఇలా ఆలోచించి చూస్తే నాకు ఒక విషయం అర్థమయ్యింది. ఈ శరీరం నాది కాదు అని తెలుసుకున్నాను. దీని మీద నాకు ఆసక్తి లేదు

జాయాత్మజార్థపశుభృత్యగృహాప్తవర్గాన్
పుష్నాతి యత్ప్రియచికీర్షయా వితన్వన్
స్వాన్తే సకృచ్ఛ్రమవరుద్ధధనః స దేహః
సృష్ట్వాస్య బీజమవసీదతి వృక్షధర్మః

భార్యా పుత్రులూ పశువులూ భృత్యులూ గృహములూ మిత్రులూ ఆప్తులూ, వీరందరినీ ఎవరికోసం కష్టపడి పోషిస్తున్నాడు. నా వారు ఆనందముగా ఉంటే నాకు ఆనందం అంటాడు. అలా అనే శరీరమే శాశ్వతం కాదు. ఇంక వారు శాశ్వతం ఎలా అవుతారు. చివరకు ఆ శరీరమే శ్రమనూ పాపాన్ని మూటగట్టి వెళ్ళిపోతుంది. మళ్ళి ఇంకో జన్మ వస్తుంది.ఇంకో శరీరానికి బీజం వేసి తాను వెళ్ళిపోతుంది. చెట్టు బాగా పెరుగుతుంది, నాలుగు బీజాలు వేసి తాను వెళ్ళిపోతుంది. అలాగే ఈ దేహం ఇంకో దేహాన్ని సృష్టిస్తుంది.ఈ దేహానికి లేని సంతోషం వేరే దేహానికి ఎలా ఉంటుంది

జిహ్వైకతోऽముమపకర్షతి కర్హి తర్షా
శిశ్నోऽన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్
ఘ్రాణోऽన్యతశ్చపలదృక్క్వ చ కర్మశక్తిర్
బహ్వ్యః సపత్న్య ఇవ గేహపతిం లునన్తి

మంచి రుచి కావాల్ని నాలుక, మంచి రూపం కావాలని కన్ను, చెవి మంచి పాట కావాలని, ముక్కు మంచి వాసన కావాలని, చర్మం మంచి స్పర్శ కావాలని అంటుంది. కాళ్ళు పరుగెత్తాలని, చేతులు లాగుదామనీ అంటాయి. ఇవన్నీ కలసి ఒకే సారి ఇవన్నీ కావాలి అంటే ఏమిటి పరిస్థితి. నలుగురైదుగురిని పెళ్ళి చేసుకుంటే వారంతా నా ఇంటికి రా అంటే నా ఇంటికి రా అని లాగినట్లు ఇంద్రియాలన్నీ ఇలా గోల చేస్తూ ఉంటాయి. మనని చేదిస్తూ ఉంటాయి.

సృష్ట్వా పురాణి వివిధాన్యజయాత్మశక్త్యా
వృక్షాన్సరీసృపపశూన్ఖగదన్దశూకాన్
తైస్తైరతుష్టహృదయః పురుషం విధాయ
బ్రహ్మావలోకధిషణం ముదమాప దేవః

పరమాత్మ తన మాయా శక్తితో అనేక పురాలను (శరీరాలను) ఏర్పరచాడు. పశువులనూ చెట్లనూ పురుగులనూ మత్స్యములనూ సృష్టించి, అవి తృప్తిని కలిగించకుంటే మానవ శరీరాన్ని నిర్మింప్చేసి " ఈ మానవ దేహం బాగుంది. పరమాత్మను చెందడానికి అవకాశం మానవ దేహములోనే ఉంది" అని సంకల్పించాడు. అట్టి మానవ జన్మ లభించి కూడా మోక్షం సంపాదించకపోతే బ్రహ్మ అనందం ఏమవుతుంది. ఈ మానవ జన్మ ఎన్నో జన్మల తరువాత ఎప్పుడో దొరుకుతుంది.

లబ్ధ్వా సుదుర్లభమిదం బహుసమ్భవాన్తే
మానుష్యమర్థదమనిత్యమపీహ ధీరః
తూర్ణం యతేత న పతేదనుమృత్యు యావన్
నిఃశ్రేయసాయ విషయః ఖలు సర్వతః స్యాత్

ఈ మానవ జన్మ నిత్యం కాకున్నా ప్రయోజనం కలిగిస్తుంది. మోక్షం కలిగిస్తుంది. అలాంటి దేహం పొందితే ముక్తి కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఆ దేహముతో పడిపోకూడదు. మానవ దేహములో మోక్షం సంపాదించడానికి మార్గాలు అన్ని వైపులా ఉన్నాయి. ఇలాంటి మానవ దేహం పొంది, మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ప్రయత్నించాలి.

ఏవం సఞ్జాతవైరాగ్యో విజ్ఞానాలోక ఆత్మని
విచరామి మహీమేతాం ముక్తసఙ్గోऽనహఙ్కృతః

నాయనా ఇలా నాకు వైరాగ్యం పొంది నేను విజ్ఞ్యానాన్ని పొంది ఒంటరిగా ప్రపంచం అంతా తిరుగుతూ ఉన్నాను

న హ్యేకస్మాద్గురోర్జ్ఞానం సుస్థిరం స్యాత్సుపుష్కలమ్
బ్రహ్మైతదద్వితీయం వై గీయతే బహుధర్షిభిః

ఒక్క గురువునుండే పరిపూర్ణ జ్ఞ్యానం ఎవరికీ రాదు. బ్రహ్మ అద్వితీయం అని చాలా మంది ఋషులు చెబుతారు. ఎక్కువ మంది గురువులను ఆశ్రయిస్తే రక రకాల ధర్మాలూ స్వరూపాలూ తెలిసి పరమాత్మ స్వరూపం బాగా అర్థమయ్యి పరమాత్మను పొందుతాము. అందుకు ఒకరి కన్నా ఎక్కువమంది గురువులే కావాలి. భగవద్రామానుజులకు ఐదుగురు గురువులు కలరు.

శ్రీభగవానువాచ
ఇత్యుక్త్వా స యదుం విప్రస్తమామన్త్ర్య గభీరధీః
వన్దితః స్వర్చితో రాజ్ఞా యయౌ ప్రీతో యథాగతమ్

ఇలా అతని ఆమంత్రించి ఆజ్ఞ్యను పొంది ఆ విప్రుడు నమస్కరించబడి వచ్చిన దారిలోనే వెళ్ళాడు.

అవధూతవచః శ్రుత్వా పూర్వేషాం నః స పూర్వజః
సర్వసఙ్గవినిర్ముక్తః సమచిత్తో బభూవ హ

అవధూత వాక్యాన్ని విని అన్ని సంగముల నుండీ విముక్తి పొంది సమచిత్తుడయ్యాడు.

                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                   సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఎనిమిదవ అధ్యాయం


                                                  ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఎనిమిదవ అధ్యాయం


శ్రీబ్రాహ్మణ ఉవాచ
సుఖమైన్ద్రియకం రాజన్స్వర్గే నరక ఏవ చ
దేహినాం యద్యథా దుఃఖం తస్మాన్నేచ్ఛేత తద్బుధః

మనకు ఏ ఏ ఇంద్రియముల వలన కలిగే సుఖమూ దుఃఖమూ, స్వర్గములో ఐనా నకరములో ఐనా, మన శరీరానికి ఇంద్రియాల ద్వారా కలిగే శరీరానికే గానీ ఆత్మకే కాదు. చలీ వేడీ మెత్తనా వేడీ అన్నీ దేహానికి గానీ ఆత్మకు కాదు. పండితుడైన వాడు ఈ విషయాన్ని తెలుసుకోవాలి

గ్రాసం సుమృష్టం విరసం మహాన్తం స్తోకమేవ వా
యదృచ్ఛయైవాపతితం గ్రసేదాజగరోऽక్రియః

కొద్దిగా లభించినా పెద్దగా లభించినా మంచి ఆహారం లభించినా తక్కువ లభించినా, దొరికిన దానితో దొరికినంత తృప్తి పొందాలి కానీ దొరకని దాని కోసం పరితపించకూడదని కొండచిలువ నేర్పించింది

శయీతాహాని భూరీణి నిరాహారోऽనుపక్రమః
యది నోపనయేద్గ్రాసో మహాహిరివ దిష్టభుక్

ఏమీ దొరకకుంటే చాలా రోజులు ఆహారం లేకుండానే ఉంటుంది.

ఓజఃసహోబలయుతం బిభ్రద్దేహమకర్మకమ్
శయానో వీతనిద్రశ్చ నేహేతేన్ద్రియవానపి

ఉన్నా లేకునా ఓజస్సూ సహస్సు బలం ఉన్నంతవరకూ కర్మ చేస్తాము. చేత కాకపోయినపుడు మానేస్తాము. ఎంత తిన్నా శరీరం ఒక తీరుగా ఉండదు. ఈ శరీరం ఎలాగూ పనికిరాకుండా పోతుంది.

మునిః ప్రసన్నగమ్భీరో దుర్విగాహ్యో దురత్యయః
అనన్తపారో హ్యక్షోభ్యః స్తిమితోద ఇవార్ణవః

ప్రసన్న గంభీరుడై ఎందులోనూ మునగకా దేనినీ దాటక సముద్రములా ఉండాలి ముని. సముద్రములో కొన్ని వేల నదుల జలాలు వచ్చి పడతాయి. పైనుంచి వర్ష జలం, కింద నుండి ఊట జలం వస్తుంది. ఇంత నీరు వచ్చినా అది ఉప్పొంగదు. నీరు రాకున్నా సముద్ర తగ్గదు. మనం కూడా కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఒకే తీరుగా ఉండాలి.

సమృద్ధకామో హీనో వా నారాయణపరో మునిః
నోత్సర్పేత న శుష్యేత సరిద్భిరివ సాగరః

బాగా ఉండనీ ఏమీ లేకపోనీ, పరమాత్మ యందు మనసు ఉంచి ఉండాలి. తరగనూ వద్దూ, ఎండిపోనూ వాద్దు, సముద్రము లాగ

దృష్ట్వా స్త్రియం దేవమాయాం తద్భావైరజితేన్ద్రియః
ప్రలోభితః పతత్యన్ధే తమస్యగ్నౌ పతఙ్గవత్

పరమాత్మ చేత సృష్టించబడిన పెద్ద మాయ స్త్రీ. ఆ స్త్రీ సౌంద్రయ్ విభ్రమాలను చూచి మోహపడైతే మన బ్రతుకు మిడత బ్రతుకు అవుతుంది. మిడత వెళ్ళి మంటలో పడుతుంది ఆ మంటకు ఆకర్షితురాలై.

యోషిద్ధిరణ్యాభరణామ్బరాది ద్రవ్యేషు మాయారచితేషు మూఢః
ప్రలోభితాత్మా హ్యుపభోగబుద్ధ్యా పతఙ్గవన్నశ్యతి నష్టదృష్టిః

రక రకాల మంటలు పెడితే మంటలు ఎన్ని రకాలుగా ఉంటే అంత మురిసి మిడత అందులో పడుతుంది. మంచి మంచి అలంకారములతో స్త్రీ ఎదురురాగానే, అగ్నిలో మిడత పడ్డట్టుగా స్త్రీ వ్యామోహములో పురుషుడు పడి నశిస్తున్నాడు.

స్తోకం స్తోకం గ్రసేద్గ్రాసం దేహో వర్తేత యావతా
గృహానహింసన్నాతిష్ఠేద్వృత్తిం మాధుకరీం మునిః

శరీరం బతకడానికి కావలసిన ఆహారాన్ని ఒకే సారి కాకుండా కొంచెం కొంచెం తీసుకుని బతకాలి. తేనెటీగ లాగ. తేనెటీగ అన్ని పూలలోంచి కొంచెం కొంచెం తీసుకుంటుంది. మానవుడు కూడా పదుహారు ముద్దలు తినాలి రోజూ.భిక్షాన్నాన్ని మాధుకరీ వృత్తి అంటారు.

అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలో నరః
సర్వతః సారమాదద్యాత్పుష్పేభ్య ఇవ షట్పదః

తుమ్మెద  అన్ని పూల  నుండీ సారం తీసుకుంటుంది. పండితుడు కూడా అన్ని శాస్త్రాల నుండి సారం తీసుకోవాలి. తుమ్మెదల ఇది పనికిరాదు అనుకోకుండా అన్ని శాస్త్రాలనూ చదవాలి అన్ని నీతులు తెలుసుకుని, ఏది పనికొస్తుందో దాన్నే తీసుకోవాలి.

సాయన్తనం శ్వస్తనం వా న సఙ్గృహ్ణీత భిక్షితమ్
పాణిపాత్రోదరామత్రో మక్షికేవ న సఙ్గ్రహీ

ఈగ తీసుకున్న వస్తువును నిలువ చేసుకోకునండా ఎప్పటిదప్పుడే తినేస్తుంది. దాచి దాచి తినదు. దాచుకోవడం అనే రోగముతోనే ద్వేషమూ వైరమూ హింస. నీదీ నాదీ అన్న బుద్ధి దాచుకోవడం వలననే పుడుతుంది. ఇది మనకు ఈగ నేర్పుతుంది.

సాయన్తనం శ్వస్తనం వా న సఙ్గృహ్ణీత భిక్షుకః
మక్షికా ఇవ సఙ్గృహ్ణన్సహ తేన వినశ్యతి

ఇంకో మక్షిక ఉంది. తేనెటీగ, ప్రతీ పూవు నుండీ మకరందాన్ని తీసుకు వచ్చి దచిపెడుతుంది. చివరకు అది ఇంకొకరి పాలవుతుంది. నిలువ చేయవద్దని ఈగ చెప్పింది, నిలవ చేస్తే చస్తావని తేనెటీగ చెప్పింది.

పదాపి యువతీం భిక్షుర్న స్పృశేద్దారవీమపి
స్పృశన్కరీవ బధ్యేత కరిణ్యా అఙ్గసఙ్గతః

ఏనుగును పట్టాల్ని అనుకున్నవాడు గోతి తవ్వి దాని మీద ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడితే దాన్ని తాకుదామని వచ్చి అది గోతిలో పడుతుంది. మనం కూడా గోతిలో పడడానికి కారణం స్త్రీ సంబంధమే.

నాధిగచ్ఛేత్స్త్రియం ప్రాజ్ఞః కర్హిచిన్మృత్యుమాత్మనః
బలాధికైః స హన్యేత గజైరన్యైర్గజో యథా

ఏనుగు మంకు ఇది చెబుతుంది. తనకు మృత్యువైన స్త్రీ సంబంధాన్ని బుద్ధిమంతుడు ఎవరూ కోరకూడదు. ఒకే ఆడ ఏనుగు ఉంటే దాన్ని పొందుదామని నాలుగు ఏనుగులు వస్తే, వాటిలో ఏది బలీయమో అది బలహీనమైన ఏనుగును చంపుతుంది. చనిపోయిన ఏనుగుకు స్త్రీ సంబంధమే కారణం
ఈ సంసారములో కూడ బలాఢ్యుల వలన బలహీనులు స్త్రీ కామన వలన చంపబడతారు

న దేయం నోపభోగ్యం చ లుబ్ధైర్యద్దుఃఖసఞ్చితమ్
భుఙ్క్తే తదపి తచ్చాన్యో మధుహేవార్థవిన్మధు

 పిసినారులు ఈ రెండూ చేయరు. లుబ్దసంచితాన్ని మనం తీసుకోరాదు. ఒకరు కూడ బెట్టిన దాన్ని ఇంకొకరు బలవంతముగా అనుభవిస్తారు.

సుదుఃఖోపార్జితైర్విత్తైరాశాసానాం గృహాశిషః
మధుహేవాగ్రతో భుఙ్క్తే యతిర్వై గృహమేధినామ్

అపుడు దాచి పెట్టిన వారికి అస్సలు ఉండదు. తేనెటీగ దాచిపెట్టిన తేనెను ఇతరులు లాక్కున్నట్లుగా లోభి దాచిపెడితే ఇతరుల అనుభవానికే పనికొస్తుంది కానీ తనకు పనికిరాదు

గ్రామ్యగీతం న శృణుయాద్యతిర్వనచరః క్వచిత్
శిక్షేత హరిణాద్బద్ధాన్మృగయోర్గీతమోహితాత్

గ్రామ్య గీతాలను, పిల్ల పదాలనూ వినరాదు. అడవిలో ఉండే యతులు అలాంటి పాటలు వింటే లేడిలా నశిస్తారు. లేడిని వేటాడే వారు బాణాలతో కొట్టకుండా రకరకాల సంగీత వాద్య పదార్థాలను తీఉస్కు వచ్చి సంగీత కచేరి చేస్తాడు. ఆ గాన మాధుర్యం వినడానికి అన్ని రకాల లేళ్ళు వచ్చి కూర్చుంటాయి. అవి అలా వింటున్నప్పుడు, బాగా మైమరచి ఉన్నపుడు ఈ గానాన్ని ఆపించి పెద్ద డోళ్ళతో భయంకరమైన శబ్దం చేస్తారు. అది విని లేళ్ళు గుండే పగిలి చనిపోతాయి.

నృత్యవాదిత్రగీతాని జుషన్గ్రామ్యాణి యోషితామ్
ఆసాం క్రీడనకో వశ్య ఋష్యశృఙ్గో మృగీసుతః

పాటలే వినకూడదు, పొరబాటున ఆటలసు అసలే చూడరాదు. ఆడవారి నృత్యాన్నీ గానాన్ని పొరబాటున కూడా చూడకు. అలా చేస్తే ఋష్యశృంగునిలా వలలో పడతారు.

జిహ్వయాతిప్రమాథిన్యా జనో రసవిమోహితః
మృత్యుమృచ్ఛత్యసద్బుద్ధిర్మీనస్తు బడిశైర్యథా

నాలుక రుచికి ఆశపడితే చేపలాగ చస్తారు. చేపకు బాగా ఇష్టమైన మాంస ఖండాన్ని ఎరగా పెట్టగానే దాఇకోసం ఆశపడి చావు కొని తెచ్చుకుంటుంది. జితం సర్వం జితే రసే

ఇన్ద్రియాణి జయన్త్యాశు నిరాహారా మనీషిణః
వర్జయిత్వా తు రసనం తన్నిరన్నస్య వర్ధతే

ఆహారం వదిలిన బుద్ధి మంతులే ఇంద్రియాలను గెలుస్తారు. రసనాన్ని (నాలుకని) వదిలిపెడితేనే వాడు పెరుగుతాడు. ఆహారం లేని వాడికే జ్ఞ్యానం పెరుగుతుంది.

తావజ్జితేన్ద్రియో న స్యాద్విజితాన్యేన్ద్రియః పుమాన్
న జయేద్రసనం యావజ్జితం సర్వం జితే రసే

తక్కిన ఎన్ని ఇంద్రియాలను గెలిచినా వాడు ఇంద్రియములను గెలిచినవాడు కాడు. నాలుకను గెలవనంత వరకూ ఇతర ఇంద్రియాలను గెలిచిన వాడు కాదు. నాలుకను గెలిస్తే అన్నిటినీ గెలవ వచ్చని చేప చెప్పింది

పిఙ్గలా నామ వేశ్యాసీద్విదేహనగరే పురా
తస్యా మే శిక్షితం కిఞ్చిన్నిబోధ నృపనన్దన

పింగలా అనే వేశ్య విదేహనగరములో ఉంటుంది. తన శరీరాన్ని చక్కగా అలంకరించుకుని సాయంకాలం కాగానే తన ఇంటి ద్వారం ముందు నిలబడి బాగా ధనవంతులైన విటులకోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

సా స్వైరిణ్యేకదా కాన్తం సఙ్కేత ఉపనేష్యతీ
అభూత్కాలే బహిర్ద్వారే బిభ్రతీ రూపముత్తమమ్

దారిలో వచ్చే వారందరినీ చూస్తూ వారు ఎంత ఎంత ఇవ్వగలరో విచారిస్తూ ఉంటుంది.

మార్గ ఆగచ్ఛతో వీక్ష్య పురుషాన్పురుషర్షభ
తాన్శుల్కదాన్విత్తవతః కాన్తాన్మేనేऽర్థకాముకీ

ఇంకా ధనవంతులకోసం ఆశతో నిద్ర మానుకుని ద్వారం ముందే నిలబడి లోపలకు వెళుతు బయటకు వెళుతూ ఉంటుంది. అలా

ఆగతేష్వపయాతేషు సా సఙ్కేతోపజీవినీ
అప్యన్యో విత్తవాన్కోऽపి మాముపైష్యతి భూరిదః

ఏవం దురాశయా ధ్వస్త నిద్రా ద్వార్యవలమ్బతీ
నిర్గచ్ఛన్తీ ప్రవిశతీ నిశీథం సమపద్యత

తస్యా విత్తాశయా శుష్యద్ వక్త్రాయా దీనచేతసః
నిర్వేదః పరమో జజ్ఞే చిన్తాహేతుః సుఖావహః

తస్యా నిర్విణ్ణచిత్తాయా గీతం శృణు యథా మమ
నిర్వేద ఆశాపాశానాం పురుషస్య యథా హ్యసిః

న హ్యఙ్గాజాతనిర్వేదో దేహబన్ధం జిహాసతి
యథా విజ్ఞానరహితో మనుజో మమతాం నృప

ఇలా విత్తాశతో నోరు ఎండి ముఖం వాడి, అలంకారం అంతా చెదిరిపోయింది కానీ పని కాలేదు
అపుడు ఆమెకు విరక్తి కలిగింది.

పిఙ్గలోవాచ
అహో మే మోహవితతిం పశ్యతావిజితాత్మనః
యా కాన్తాదసతః కామం కామయే యేన బాలిశా

ఆశే అన్నిటికన్నా ప్రమాద కరం. చేతిలో ఖడ్గం ఉంటే ఎలా హాని చేస్తుందో ఆశ కూడా హాని చేస్తుంది.

విజ్ఞ్యానంలేని వారు ఆశను వదలనట్లుగా శరీరం అలిస్తే ఆశ వదలదు. మనసు అలసిపోవాలి. మనసు గెలవని నా మోహాన్ని చూడండి. లేని ప్రియుని కోసం తెల్లవార్లూ ఎదురు చూసాను.


సన్తం సమీపే రమణం రతిప్రదం విత్తప్రదం నిత్యమిమం విహాయ
అకామదం దుఃఖభయాధిశోక మోహప్రదం తుచ్ఛమహం భజేऽజ్ఞా

కానీ పరం రమనీయుడూ అడగకుండానే అన్నీ ఇచ్చేవాడూ చివరకు తనను కూడా ఇచ్చేవాడూ చివరకు తనను కూడా ఇచ్చేవాడు నా హృదయములో ఉన్నాడు. అంతర్యామిగా ఉన్న ఆ ప్రియున్ని చూడక బయట ఎవడో ప్రియుడు ఉన్నాడని తెల్లవార్లూ ఎదురుచూసాను
అహో మయాత్మా పరితాపితో వృథా సాఙ్కేత్యవృత్త్యాతివిగర్హ్యవార్తయా
స్త్రైణాన్నరాద్యార్థతృషోऽనుశోచ్యాత్క్రీతేన విత్తం రతిమాత్మనేచ్ఛతీ

ధనం ఇస్తాడు సుఖం ఇస్తాడు ఆనందింపచేస్తాడు, దగ్గరే ఉన్నాడు ఈ ప్రియుడు. ఈయనను వదలి, ఏమీ ఇవ్వని వాడూ, దుఃఖాన్నీ భయాన్నీ శోకాన్నీ మోహాన్నీ ఇచ్చే తుచ్చమైన బయట ఉన్న ఈ ప్రియున్ని కోరానునేను వృధాగా మనసును బాధపెట్టాను. చూచేవారూ విన్నవారూ నిందించుకునే ఈ వేశ్యా వృత్తితో ఆత్మను పాడు చేసాను. స్త్రీ వ్యామోహము ఉన్న మానవులతో డబ్బును సంపాదించాలి అని ఆశ పడ్డాను. డబ్బుతో కొనబడి సంతోషాన్నీ సుఖాన్నీ వాడికి ఇచ్చి నేను దుఃఖాన్నే పొందుతున్నాను.
యదస్థిభిర్నిర్మితవంశవంస్య
స్థూణం త్వచా రోమనఖైః పినద్ధమ్
క్షరన్నవద్వారమగారమేతద్
విణ్మూత్రపూర్ణం మదుపైతి కాన్యా

ఇంత ఆలోచిస్తే ఏమనిపిస్తోందంటే, వెదురు బొంగులో ఎన్నో రకాల తినే పదార్థాలు ఉంటాయి. దాన్ని పగులగొట్టి అందులో ఉన్నవాటిని తేనెలో కలుపుకుని తింటారు. అందులో ఉండే పదార్థాలు ఎవరైనా తింటే తినబడతాయి, లేకపోతే అవి బయటకు రాక నశిస్తాయి. పొరబాటున ఒక బొంగు ఇంకో బొంగుతో రాజుకుంటే అగ్ని పుట్టి రెండూ కాలిపోతాయి.

అలాగే ఒక శరీరం ఇంకో శరీరముతో రాసుకుంటే కామాగ్ని పుట్టి క్రోధాగ్నీ లోభాగ్ని పుట్టి ఇరువురి నాశానికీ కారణమవుతుంది.
ఈ శరీరం కూడా వెదురు బొంగే. ఇందులో మాంసమూ రక్తమూ నఖములూ పై చర్మమూ రోమమూ, తొమ్మిది రంధ్రాలు ఉన్న ఒక ఇల్లు ఇది. ఇలాంటి దాని మీద, మల మూత్రముతో ఉండే ఈ శరీరాన్ని ఎవరైనా ఆశ్రయిస్తారా.

విదేహానాం పురే హ్యస్మిన్నహమేకైవ మూఢధీః
యాన్యమిచ్ఛన్త్యసత్యస్మాదాత్మదాత్కామమచ్యుతాత్

ఇంత పెద్ద విదేహ నగరములో నేనొక్కదానినే మూర్ఖురాలను.
తనను ఇచ్చే భగవంతున్ని విడిచిపెట్టి ప్రాకృత మానవున్ని చూచేవాడిని నేనొక్క దాన్నే.  ఇంకెవరూ లేరు.

సుహృత్ప్రేష్ఠతమో నాథ ఆత్మా చాయం శరీరిణామ్
తం విక్రీయాత్మనైవాహం రమేऽనేన యథా రమా

పరమాత్మ ఈ శరీరానికి మిత్రుడూ ప్రియుడూ నాథుడు. అలాంటి ఆత్మను అమ్మి ఈ శరీరముతో రమించాలా. మనకు రక రకాల కోరికలను ప్రసాదించే కోరికలు నిజముగా ప్రీతిని ఇస్తాయా.

కియత్ప్రియం తే వ్యభజన్కామా యే కామదా నరాః
ఆద్యన్తవన్తో భార్యాయా దేవా వా కాలవిద్రుతాః

దేవతలు భార్యనో భర్తనో ఇస్తారు. వారు ఎంత కాలం ఉంటారు. వారికీ మొదలూ చివరా ఉంది. వారూ ఆద్యంత వంతులే. దేవతలు కూడా ఆద్యంత వంతులే. వారు ఇచ్చే కోరికలు కూడా ఆద్యంతాలు ఉన్నవే

నూనం మే భగవాన్ప్రీతో విష్ణుః కేనాపి కర్మణా
నిర్వేదోऽయం దురాశాయా యన్మే జాతః సుఖావహః

నేను ఎపుడో ఎదో పుణ్యం చేసుకుని ఉంటాను. అందుకు ప్రీతి కలిగి, ఆనందం కలిగించే వైరాగ్యం నాకు కలిగించాడు. ఇలాంటి కష్టాలు నాకు మళ్ళీ కలగ కూడదు.

మైవం స్యుర్మన్దభాగ్యాయాః క్లేశా నిర్వేదహేతవః
యేనానుబన్ధం నిర్హృత్య పురుషః శమమృచ్ఛతి

 ఇలాంటి అనుబంధాన్ని విడిచిపెట్టినవారే శాంతిని పొందుతారు.
దురాశ ఉన్న వారు పడే బాధ అర్థమయ్యింది కాబట్టి ఆ పరమాత్మను నేను శరణు వేడుతున్నాను.

తేనోపకృతమాదాయ శిరసా గ్రామ్యసఙ్గతాః
త్యక్త్వా దురాశాః శరణం వ్రజామి తమధీశ్వరమ్

సన్తుష్టా శ్రద్దధత్యేతద్యథాలాభేన జీవతీ
విహరామ్యమునైవాహమాత్మనా రమణేన వై

దొరికినపుడు దొరికిన దానితో సంతోషముగా బతుకుతూ ఇంక ముందు నేను పరమాత్మ నాకు ఎంత ఇస్తే దానితోనే సంతోషిస్తూ అంతర్యామిగా ఉన్న పరమాత్మతోనే నేను రమిస్తాను. బయటవారు ఇచ్చే వాటిని నేను కోరను.

సంసారకూపే పతితం విషయైర్ముషితేక్షణమ్
గ్రస్తం కాలాహినాత్మానం కోऽన్యస్త్రాతుమధీశ్వరః

సంసార విషయములో పడి విషయాలతో ఇంద్రియాలన్నీ దొంగిలిస్తే కాలసర్పముతో మింగబడే ఇలాంటి ఆత్మను పరమాత్మ తప్ప మరెవ్వరు కాపాడతారు. 

ఆత్మైవ హ్యాత్మనో గోప్తా నిర్విద్యేత యదాఖిలాత్
అప్రమత్త ఇదం పశ్యేద్గ్రస్తం కాలాహినా జగత్


ప్రపంచమునుండి విరక్తి పొందినపుడే ఆత్మను కాపాడేది ఆత్మ, అనురక్తాన్ని పొందితే ఆత్మను ముంచేది కూడా ఆత్మే. కొంచెం తెలివి గలిగి ఈ సకల జగత్తూ కాల సర్పముతో మింగబడింది అని తెలుసుకున్నవాడు ఎలాంటి బంధాన్ని మోహాన్ని దుఃఖాన్నీ పొందడు

శ్రీబ్రాహ్మణ ఉవాచ
ఏవం వ్యవసితమతిర్దురాశాం కాన్తతర్షజామ్
ఛిత్త్వోపశమమాస్థాయ శయ్యాముపవివేశ సా

ఇలా నిర్ణ్యైంచుకుని ప్రియుని మీద ఉన్న కోరికను తెంచి పారేసి శాంతిన్ పొంది హాయిగా పడుకుంది
ఆశ ఉన్నంతవరకూ నిద్రపోలేదు. అది పోయాక హాయిగ నిద్రపోయింది.

ఆశా హి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖమ్
యథా సఞ్ఛిద్య కాన్తాశాం సుఖం సుష్వాప పిఙ్గలా

ఆశ అనేదే పరమ దుఃఖం, నైరాశ్యం పరమ సుఖం. నాకు ఏదీ వద్దు అనుకున్న వాడికి దుఃఖమే లేదు. ప్రియుని మీద ఆశ వదిలిన పింగళ హాయిగా నిద్రపోయింది.


                                                     
                                                  సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                                 సర్వం శ్రీసాయినాథార్పణమస్తు 

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఏడవ అధ్యాయం

                                     ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ఏకాదశ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీభగవానువాచ
యదాత్థ మాం మహాభాగ తచ్చికీర్షితమేవ మే
బ్రహ్మా భవో లోకపాలాః స్వర్వాసం మేऽభికాఙ్క్షిణః

నీవు నా గురించి ఏమి చెప్పవో నేను అదే చేయాలనుకుంటున్నాను
బ్రహ్మా రుద్రుడూ లోకపాలురూ మళ్ళీ నాలోకానికి నన్ను రమ్మని కోరుతున్నారు

మయా నిష్పాదితం హ్యత్ర దేవకార్యమశేషతః
యదర్థమవతీర్ణోऽహమంశేన బ్రహ్మణార్థితః

సంపూర్ణముగా నేను ఈ లోకములో దేవ కార్యాన్ని ఆచరించాను. ఏ పని గురించైతే బ్రహ్మ ప్రార్థించాడో అది నేను ఆచరించాను

కులం వై శాపనిర్దగ్ధం నఙ్క్ష్యత్యన్యోన్యవిగ్రహాత్
సముద్రః సప్తమే హ్యేనాం పురీం చ ప్లావయిష్యతి

యాదవకులం కూడా శాపముతో త్వరలోనే నాశం కాబోతోంది. పరస్పరం వారిలో వారే కలహించుకుని త్వరలోనే అంతం కాబోతోంది. ఈనాటికి ఏడవ రోజుకి సముద్ర ద్వారకా పురిని ముంచేస్తుంది

యర్హ్యేవాయం మయా త్యక్తో లోకోऽయం నష్టమఙ్గలః
భవిష్యత్యచిరాత్సాధో కలినాపి నిరాకృతః

నేను నీ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడముతోనే ఇక్కడున్న అన్ని మంగళములూ వచ్చేస్తాయి నాతోనే. నేను వెళ్ళగానే కలి పురుషుడు వస్తాడు. ఈ అన్ని శుభాలనూ నిరాకరిస్తాడు

న వస్తవ్యం త్వయైవేహ మయా త్యక్తే మహీతలే
జనోऽభద్రరుచిర్భద్ర భవిష్యతి కలౌ యుగే

నేను విడిచిపెట్టిన ఈ భూమి మీద నీవు ఉండవద్దు. కలియుగము యందు మానవులు అధర్మం యందు రుచి కలిగి ఉంటారు

త్వం తు సర్వం పరిత్యజ్య స్నేహం స్వజనబన్ధుషు
మయ్యావేశ్య మనః సంయక్సమదృగ్విచరస్వ గామ్

నీవారి యందు, నీ  బంధువులయందూ స్నేహాన్ని విడిచిపెట్టి, మనసు నాయందు లగ్నం చేసి, అంతటా నన్నే చూస్తూ భూమి అంతా పర్యటించు.

యదిదం మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః
నశ్వరం గృహ్యమాణం చ విద్ధి మాయామనోమయమ్

ఈ లోకములో మనసుతో వాక్కుతో కన్నులతో చెవులతో శరీరముతో గానీ గ్రహించబడేదంటా నశించిపోయేదే. ఈ ఒక్క విషయం గుర్తు ఉంచుకుంటే మనకు కోరిక దేనిమీదా పుట్టదు. ఇదంతా నా మాయతో ఏర్పడినది. క్షణ కాలములో నశించేది

పుంసోऽయుక్తస్య నానార్థో భ్రమః స గుణదోషభాక్
కర్మాకర్మవికర్మేతి గుణదోషధియో భిదా

యోగము లేని పురుషునికి రక రకముల భ్రమను కలిగించి గుణ దోషాలను చూపిస్తుంది. కర్మ అకర్మ వికర్మ అనే గుణ దోష బుద్ధితో ప్రవర్తించిన మానవుడు అమంగళాలనూ అశుభాలనూ పాపాలనూ మాత్రమే చేసుకుంటాడు.

తస్మాద్యుక్తేన్ద్రియగ్రామో యుక్తచిత్త ఇదమ్జగత్
ఆత్మనీక్షస్వ వితతమాత్మానం మయ్యధీశ్వరే

నీవు యోగాన్ని, మనసుని నాయందు నిలిపి ఈ ప్రపంచాన్ని నీలో చూడు.సంసారములో మనసు ఉంచు గానీ మనసులోకి సంసారమును రానివ్వకు. జగత్తును ఆత్మలో, ఆత్మను నాలో చూడు

జ్ఞానవిజ్ఞానసంయుక్త ఆత్మభూతః శరీరిణామ్
అత్మానుభవతుష్టాత్మా నాన్తరాయైర్విహన్యసే

మోక్ష జ్ఞ్యానమూ లౌకిక జ్ఞ్యానమూ, ఈ రెండు కలిగి అందరు జీవులకూ ఆత్మగా, ఆత్మానందముతోనే సంతోషింపబడిన మనసు గలవాడవై ఉంటే నీకు ఎలాంటి విఘ్నాలూ రావు. ఆత్మానుభవాన్ని మనసుతో పొంది సంతోషించిన నాడు విఘ్నములు ఉండవు.

దోషబుద్ధ్యోభయాతీతో నిషేధాన్న నివర్తతే
గుణబుద్ధ్యా చ విహితం న కరోతి యథార్భకః

ఈ ప్రపంచం అంతా దోషం అని నిషేదించడం వలన ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళలేవు. నిషేదముతో ఏదీ నివర్తించదు. శిశువుని "ఈ పని చేయకు" అంటే చేయకుండా ఉండలేడు. వేద శాస్త్ర పురాణాలు ఏది చేయమని బోధించాయో అవి మాత్రం చేయలేరు మానవులు.

సర్వభూతసుహృచ్ఛాన్తో జ్ఞానవిజ్ఞాననిశ్చయః
పశ్యన్మదాత్మకం విశ్వం న విపద్యేత వై పునః

సకల ప్రాణులతో మిత్ర భావాన్న్ పెట్టుకుని శాంతుడవై జ్ఞ్యాన విజ్ఞ్యాన నిశ్చయం కలిగి ప్రపంచం అంతా నా స్వరూపముగా ఎవడు చూస్తాడో అలాంటి వాడు ఎలాంటి బాధలనూ కష్టములనూ పొందడు

శ్రీశుక ఉవాచ
ఇత్యాదిష్టో భగవతా మహాభాగవతో నృప
ఉద్ధవః ప్రణిపత్యాహ తత్త్వం జిజ్ఞాసురచ్యుతమ్

ఇలా ఆజ్ఞ్యాపిస్తే మహా భాగవతుడైన ఉద్ధవుడు తత్వం తెలుసుకుందామని ఇలా అన్నాడు

శ్రీద్ధవ ఉవాచ
యోగేశ యోగవిన్యాస యోగాత్మన్యోగసమ్భవ
నిఃశ్రేయసాయ మే ప్రోక్తస్త్యాగః సన్న్యాసలక్షణః

అన్నిటిలో నిన్ను చూడమనీ, గుణ దోషాలను చర్చినవద్దు అని, సకల ప్రాణులతో మైత్రి సలుపమన్నారు, ఇదంతా చూస్తే సన్యాస యోగాన్ని చెప్పినట్లు ఉంది.

త్యాగోऽయం దుష్కరో భూమన్కామానాం విషయాత్మభిః
సుతరాం త్వయి సర్వాత్మన్నభక్తైరితి మే మతిః

సంసారములో ఉండి ఈ త్యాగాన్ని ఎలా చేయాలి. సంసారములో ఉండి సంసారాన్ని ఎలా వదిలిపెట్టాలి. విషయముల యందు మనసు ఉన్న వారు కామనలను విడిచిపెట్టగలరా
నీ యందు భక్తి లేని వారు కోరికలను విడిచిపెట్టుట వల్ల కాదు కదా.

సోऽహం మమాహమితి మూఢమతిర్విగాఢస్
త్వన్మాయయా విరచితాత్మని సానుబన్ధే
తత్త్వఞ్జసా నిగదితం భవతా యథాహం
సంసాధయామి భగవన్ననుశాధి భృత్యమ్

మమ, అహం, నాది నేనూ, అనే రెండిటితో మూడులై , నీ మాయ చే ఏర్పరచిన శరీరమూ శరీర సంబంధుల యందూ మమకారం ఎలా దాటుతారు. సులభముగా చేయమని దేన్ని చెప్పావో అది ఎలా చేయాలో నీ భృత్యునికి చెప్పు

సత్యస్య తే స్వదృశ ఆత్మన ఆత్మనోऽన్యం
వక్తారమీశ విబుధేష్వపి నానుచక్షే
సర్వే విమోహితధియస్తవ మాయయేమే
బ్రహ్మాదయస్తనుభృతో బహిరర్థభావాః

నీవు సత్య స్వరూపుడివి, ఆత్మ ధృక్, అలాంటి నీలాంటి సత్య భోధకుడు సకల ప్రపంచములో ఇంకొకడు ఉండడు. ఉండగా నేను చూడలేదు. ప్రపంచములో ఉన్న అందరూ నీ మాయ చేత మోహించబడేవారు, బ్రహ్మాది దేవతలందూ ప్రపంచమంతా బయటే ఉంది, అన్ని పురుషార్థాలు బయట లభిస్తాయి అని మోహపడతారు.అలాంటప్పుడు సత్యం యొక్క సత్య స్వరూపం చెప్పగలవాడవు నీవు తప్ప మరి ఇంకొకరు లేరు

తస్మాద్భవన్తమనవద్యమనన్తపారం
సర్వజ్ఞమీశ్వరమకుణ్ఠవికుణ్ఠధిష్ణ్యమ్
నిర్విణ్ణధీరహము హే వృజినాభితప్తో
నారాయణం నరసఖం శరణం ప్రపద్యే

చెప్పలేనంత ప్రభావం కల నిన్ను, సర్వజ్యుడివీ, ప్రభువువూ ఐన నీవు, మొక్కబోనటువంటి బుద్ధీ, ఎదురులేనిది నీ లోకం. విరక్తి పొందిన నేను సంసారముతో పాపముతో కష్టముతో తపించబడి ఉన్నాను.
నర సఖా నారాయణా శరణు వేడుతున్నాను

శ్రీభగవానువాచ
ప్రాయేణ మనుజా లోకే లోకతత్త్వవిచక్షణాః
సముద్ధరన్తి హ్యాత్మానమాత్మనైవాశుభాశయాత్

మానవులందరికీ తెలుసు లోకతత్వం. తనతో (ఆత్మతో) తనని ఉద్ధరించుకుంటారు. పాపం నుండీ అమంగళం నుండీ లోక తత్వం తెలుసుకున్న వారు ఉద్ధరించగలరు.

ఆత్మనో గురురాత్మైవ పురుషస్య విశేషతః
యత్ప్రత్యక్షానుమానాభ్యాం శ్రేయోऽసావనువిన్దతే

ఆత్మే గురువూ, బంధ్వూ, ఆత్మే ఉద్ధారకుడు.
చూచిన దానితో ఊహించిన దానితో మనకు ఏది శ్రేయస్సో ఏది మేలు కలిగిస్తుందో తెలుసుకోవాలి. ఈ లోకములో ఎలా నశ్వరమో పై లోకములో కూడా నశ్వరమే.

పురుషత్వే చ మాం ధీరాః సాఙ్ఖ్యయోగవిశారదాః
ఆవిస్తరాం ప్రపశ్యన్తి సర్వశక్త్యుపబృంహితమ్

సాంఖ్య యోగం తెలిసిన వారు నన్ను పురుషుడిగా తెలుసుకుంటారు. సాంఖ్య శాత్రములో నన్ను సర్వ శక్తి సంపన్నుడిగా చూస్తారు

ఏకద్విత్రిచతుస్పాదో బహుపాదస్తథాపదః
బహ్వ్యః సన్తి పురః సృష్టాస్తాసాం మే పౌరుషీ ప్రియా

నేను చాలా దేహాలను సృష్టించాను. ఒక,రెండు మూడు నాలుగు పాదాలు, అనంతమైన పాదాలు, కాళ్ళు లేనివి, ఇలా రక రకాల సృష్టిని చేసాను. అన్ని దేహాలలో నాకు నచ్చిన దేహం ఈ మానవ దేహం.

అత్ర మాం మృగయన్త్యద్ధా యుక్తా హేతుభిరీశ్వరమ్
గృహ్యమాణైర్గుణైర్లిఙ్గైరగ్రాహ్యమనుమానతః

ఇందులో ఉన్న వారే నా గురించి ఆలోచిస్తారు, వెతకడానికి ప్రయత్నిస్తారు. భగవంతుడు ఉన్నాడు, ఉంటాడు అన్న ఆలోచన కలిగేది ఒక్క మానవ దేహములోనే. కారణాలను యోచించి, కూడి విచారించగల బుద్ధి వైభవం మానవ శరీరానికే ఉంది. గుణములతో లింగములతో యోచించ వీలు లేనీ, ఎవరికీ అందనీ, ఎవరికీ అర్థం కానీ, ఎవరూ చెప్పలేని నా తత్వాన్ని, "ఇలాంటిది ఒకటుంది" అని ఊహించడానికి ఆస్కారం ఉన్న దేహం ఒక్క మానవ దేహమే. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు కాపాడతాడు అని తెలుసుకొనే దేహం మానవ దేహం. వేటికీ అందని వాడు ఒకడు ఉన్నాడు అని ఆలోచించగల తెలియగల శక్తి ఒక్క మనావ దేహానికే ఉంది. అనుమానముతో వారు దాన్ని గ్రహిస్తారు.

అత్రాప్యుదాహరన్తీమమితిహాసం పురాతనమ్
అవధూతస్య సంవాదం యదోరమితతేజసః

ఈ విషయములో ఒక ప్రాచీనమైన కథ ఉంది. అది చెబుతున్నాను. యదు మహారాజుకు ఒక అవధూతతో జరిగిన సంవాదాన్ని చెబుతున్నాను.

అవధూతం ద్వియం కఞ్చిచ్చరన్తమకుతోభయమ్
కవిం నిరీక్ష్య తరుణం యదుః పప్రచ్ఛ ధర్మవిత్

ఎక్కడా ఎలాంటి భయమూ లేక సకల ప్రపంచములో సంచరిస్తున్న అవధూతను, యువకున్ని చూచిన, ధర్మం బాగా తెలిసిన యదువు ఇలా అడిగాడు

శ్రీయదురువాచ
కుతో బుద్ధిరియం బ్రహ్మన్నకర్తుః సువిశారదా
యామాసాద్య భవాల్లోకం విద్వాంశ్చరతి బాలవత్

అన్నీ తెలిసిన మీరు కూడా చిన్న పిల్ల వాడి వలే దేనికీ అంటకుండా దేని యందూ మనసు లగ్నం కాకుండా "నేను దేనికీ కర్తను కాను" అన్న భావనతో సంచరిస్తున్నారు ఇంత చిన్న వయసులో. ఇంతటి విజ్ఞ్యానాన్ని మీకు చెప్పిన గురువులెవరు?

ప్రాయో ధర్మార్థకామేషు వివిత్సాయాం చ మానవాః
హేతునైవ సమీహన్త ఆయుషో యశసః శ్రియః

లోకములో మానవులందరూ కూడా ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలి అనుకుంటే హేతువునే తీసుకుంటారు. ఇది చేయాలి ఇది చేయకూడదు అన్న విషయాన్ని కార్య కారణ భావముతోనే తెలుసుకుంటారు

త్వం తు కల్పః కవిర్దక్షః సుభగోऽమృతభాషణః
న కర్తా నేహసే కిఞ్చిజ్జడోన్మత్తపిశాచవత్

నీవు సమర్ధుడవూ జ్ఞ్యానివీ దక్షుడవూ సుందరుడవూ, చక్కగా మాట్లాడుతున్నావు. ఇవన్నీ ఉండి కూడా ఏదీ చేయడం లేదు, ఏదీ కోరడం లేదు.
జడుడిలా ఉన్మత్తుడిలా పిశాచములా ప్రవర్తిస్తున్నావు.

జనేషు దహ్యమానేషు కామలోభదవాగ్నినా
న తప్యసేऽగ్నినా ముక్తో గఙ్గామ్భఃస్థ ఇవ ద్విపః

ఇంతమంది లోకములో కామ క్రోధ లోభ మదములతో కాలిపోతున్నారు. ఐనా గంగా ప్రవాహములో ఉన్న ఏనుగులా నీవు ఏ తాపమూ పొందుట లేదు.

త్వం హి నః పృచ్ఛతాం బ్రహ్మన్నాత్మన్యానన్దకారణమ్
బ్రూహి స్పర్శవిహీనస్య భవతః కేవలాత్మనః

ఇంత లోకమూ బాధపడుతూ ఉంటే నీవొక్కడవే ఆనందముగా ఉండడానికి కారణం ఏమిటి
నీవు కేవలాత్మవు, నీకు ఎలాంటి స్పర్శా లేదు. ఒక వస్తువును తాకినా, ఫలనా వస్తువును తాకాను అన్న భావన లేదు.

శ్రీభగవానువాచ
యదునైవం మహాభాగో బ్రహ్మణ్యేన సుమేధసా
పృష్టః సభాజితః ప్రాహ ప్రశ్రయావనతం ద్విజః

బ్రాహ్మణుల యందు భక్తి ఉన్న, మేధావి ఐన యదువు ఇలా గౌర్వముగా అడిగితే, వినయముతో వంగి ఉన్న యదువుతో అవధూత ఇలా చెబుతున్నాడు

శ్రీబ్రాహ్మణ ఉవాచ
సన్తి మే గురవో రాజన్బహవో బుద్ధ్యుపశ్రితాః
యతో బుద్ధిముపాదాయ ముక్తోऽటామీహ తాన్శృణు

ప్రపంచములో మనకు ఎన్ని రకాల గురువులున్నారో మనకు చెప్పే కథ ఇది. ప్రకృతిలో ఉన్న జీవరాశులను జాగ్రత్తగా పరిశీలిస్తే మనకు చాలా జ్ఞ్యానమూ వైరాగ్యమూ కలుగుతాయి.
"నాకు చాలా మంది గురువులున్నారు. బుద్ధితో ఆశ్రయించబడిన గుర్వులు చాలా మందే ఉన్నారు. వారినుండే బుద్ధిని పొంది నిస్పృహతో ఈ ప్రపంచములో తిరుగుతున్నాను. "

పృథివీ వాయురాకాశమాపోऽగ్నిశ్చన్ద్రమా రవిః
కపోతోऽజగరః సిన్ధుః పతఙ్గో మధుకృద్గజః

పృధ్వీఇ ఆకాశమూ వాయువూ జలమూ అగ్ని చంద్రుడు సూర్యుడు పావురమూ అజగరమూ సముద్రమూ పతంగమూ తేనెటీగా ఏనుగు

మధుహా హరిణో మీనః పిఙ్గలా కురరోऽర్భకః
కుమారీ శరకృత్సర్ప ఊర్ణనాభిః సుపేశకృత్

లేడి చేప వేశ్య పక్షీ పిల్లవాడు కన్యా బాణములను తయారు చేసేవాడు సర్పమూ సాలెపురుగూ పట్టుపురుగూ

ఏతే మే గురవో రాజన్చతుర్వింశతిరాశ్రితాః
శిక్షా వృత్తిభిరేతేషామన్వశిక్షమిహాత్మనః

ఈ ఇరవై నాలుగు మందీ నాకు గురువులూ. నేను వీరి వలన ఈ బుద్ధిని పొంది సంచరిస్తున్నాను. వీటి వృత్తులతో నాకు చక్కని విద్య అలవడింది

యతో యదనుశిక్షామి యథా వా నాహుషాత్మజ
తత్తథా పురుషవ్యాఘ్ర నిబోధ కథయామి తే

దేని నుండి ఏ విషయాన్ని తెలుసుకున్నానో దాని చెబుతాను విను.

భూతైరాక్రమ్యమాణోऽపి ధీరో దైవవశానుగైః
తద్విద్వాన్న చలేన్మార్గాదన్వశిక్షం క్షితేర్వ్రతమ్

భూమి  ఎన్ని రకాల ప్రాణులూ ఎన్ని విధాలుగా ఆక్రమించి బాధపెడుతున్నా తన స్వభావం తాను విడిచిపెట్టదు . ఎనభై నాలుగు కోట్ల జీవరాశులు యధేచ్చగా వ్యాపించి తమ స్వార్థాల కోసం ఇంతగా బాధిస్తున్న కొంచెం కూడా క్షోభపడదు. మనను ఎందరు బాధపెట్టినా చలించకుండా ఉండాలి అన్న సంగతి భూమి నాకు బోధించింది.

శశ్వత్పరార్థసర్వేహః పరార్థైకాన్తసమ్భవః
సాధుః శిక్షేత భూభృత్తో నగశిష్యః పరాత్మతామ్

పర్వతం/వృక్షం:
చెట్టు కానీ గుట్ట కానీ తమ కోసం తామెపుడూ బతకలేదు. ఎన్ని రకములుగా ఎందరు  వాడుకున్నా ఇతరులకు ఉపకారం చేయడమే ప్రథాన ఉద్దేశ్యం. పరార్థం కోసం ఈ పుట్టుక అని వారి నుండి నేను నేర్చుకున్నాను. వాటి శిష్యుడనై పరోపకారాన్ని పరార్థ తత్వాన్నీ నేర్చుకున్నాను

ప్రాణవృత్త్యైవ సన్తుష్యేన్మునిర్నైవేన్ద్రియప్రియైః
జ్ఞానం యథా న నశ్యేత నావకీర్యేత వాఙ్మనః

కేవలం ప్రాణం నిలవడానికి మాత్రమే ప్రయత్నించాలి. ఇంద్రియముల పుష్టి కోసం ప్రయత్నించకూడదు. జ్ఞ్యానాన్ని పాడు చేసే వాక్కునూ మనసునూ ఉపయోగించకూడదు.

విషయేష్వావిశన్యోగీ నానాధర్మేషు సర్వతః
గుణదోషవ్యపేతాత్మా న విషజ్జేత వాయువత్

అనేకమైన విషయాలలో ప్రవేశించి, పలు ధర్మాలలో ప్రవర్తించి గుణములూ దోషములూ అంటకుండా ఉండాలి అని నాకు వాయువు నేర్పింది. అన్నిటిలో ఉంటుంది, అన్నిటినీ పెంచుతుంది, అన్నిటికీ ఉపకారం చేస్తుంది, కానీ తాను దేనిలోనూ తగులుకోదు. వాయువు ఉంటేనే మనం బతికిన్వారం అవుతున్నాము. అందరికీ అన్ని రకములుగా వాయువుతోనే ఉపయోగం. నిరంతరం వాయువును మనం వాడుకుంటూ  ఉంటాము. మనకు కావలసిన మేలును చేస్తుంది.ఇన్ని చేసినా తనకంటూ ఏదీ కోరని తత్వాన్ని వాయువునుంచి నేను నేర్చుకున్నాను. అన్ని చేస్తూ కూడా దేని యందూ ఆస్కతి కూడదు అని వాయువు నాకు నేర్పింది.

పార్థివేష్విహ దేహేషు ప్రవిష్టస్తద్గుణాశ్రయః
గుణైర్న యుజ్యతే యోగీ గన్ధైర్వాయురివాత్మదృక్

వాయువు ఈ శరీరములో ప్రవర్తిస్తుంది. ఒక్కో వాయువుకూ ఒక్కో పేరు. హృదయములో ఉంటే ఒక పేరు, నాభిలో ఉంటే ఒక పేరు, కంఠములో ఉంటే ఒక పేరు, ఆవలిస్తే వచ్చేవాయువు ఒకటి, కళ్ళు తెరిస్తే వాయువు ఒకటి, ఇలా శరీరములో ఆయా భాగాలలో ఆయా పేర్లతో వ్యవహరించి ఉండే వాయువు. ఈకడ వ్యాపించిందో ఆ గుణాన్ని అనుసరించి ఉంటుంది కానీ ఆ గుణం ఆ వాయువుకు అంటదు. యోగి కూడా అలాగే ఉండాలి.

అన్తర్హితశ్చ స్థిరజఙ్గమేషు బ్రహ్మాత్మభావేన సమన్వయేన
వ్యాప్త్యావ్యవచ్ఛేదమసఙ్గమాత్మనో మునిర్నభస్త్వం వితతస్య భావయేత్

ఆకాశం లేని పదార్థం లేదు. స్థావర జంగమాలలో ఉంటుంది. బ్రహ్మ భావముతో ఆత్మ భావముతో ఉంటుంది. ఈ రీతిలో అంతటా అన్ని చోట్లా ఉన్నా, దేనిలోనూ ఆకాశం సంగతితో ఉండదు. మునికూడా ఈ ఆకాశ ధర్మాన్ని అవలబించాలి

తేజోऽబన్నమయైర్భావైర్మేఘాద్యైర్వాయునేరితైః
న స్పృశ్యతే నభస్తద్వత్కాలసృష్టైర్గుణైః పుమాన్

తేజస్సు జలమూ అన్నమూ పదార్థాలూ మొదలైనవన్నీ వ్యాపిస్తాయి ఆకాశములో. ఐనా ఆకాశమునకు ఏదీ అంటదు. దేనిదీ అది తాకదు. అదే రీతిలో పురుషుడు కూడా కాలం సృష్టించిన గుణములను అంటి ఉండకూడదు

స్వచ్ఛః ప్రకృతితః స్నిగ్ధో మాధుర్యస్తీర్థభూర్నృణామ్
మునిః పునాత్యపాం మిత్రమీక్షోపస్పర్శకీర్తనైః

జలము సహజముగా పరిశుద్ధము, స్నేహం కలిగి ఉంటుంది (తడుపుతుంది), తీయగా ఉంటుంది, ప్రతీ వారికీ పవిత్రమైనది. జలము అన్నిటినీ పవిత్రం చేస్తుంది. ఏది అంటినా నీరే పోగొట్టాలి. అన్నిటినీ పోగొడుతుంది కానీ దానికేదీ అంటదు. ఇలాంటిదేదీ ఎలా నీటికి లేదో, యోగి కూడా అన్ని దోషాలనూ ఇలా పోగొట్టుకోవాలి

తేజస్వీ తపసా దీప్తో దుర్ధర్షోదరభాజనః
సర్వభక్ష్యోऽపి యుక్తాత్మా నాదత్తే మలమగ్నివత్

అగ్ని అన్నిటినీ తింటుంది, కానీ అగ్నికి ఏ మలమూ అంటదు. ఏది వేసినా తింటుంది. బాధా కోరికా సంతోషం ఉండదు. యోగి ఇలాగే ఉండాలి

క్వచిచ్ఛన్నః క్వచిత్స్పష్ట ఉపాస్యః శ్రేయ ఇచ్ఛతామ్
భుఙ్క్తే సర్వత్ర దాతృణాం దహన్ప్రాగుత్తరాశుభమ్

నివురుగప్పిన నిప్పులా కొన్ని చోట్ల దాగి ఉంటుంది, కొన్ని చోట్ల స్పష్టముగా కనపడుతుంది, కొన్ని చోట్ల యజ్ఞ్య యాగాలలో మనకు మేలు చేస్తుంది. దాత ఏమిచ్చినా తింటుంది. తరువాత రాబోయే పాపాలను తొలగిస్తూ అగ్ని ఇదంతా చేస్తుంది

స్వమాయయా సృష్టమిదం సదసల్లక్షణం విభుః
ప్రవిష్ట ఈయతే తత్తత్ స్వరూపోऽగ్నిరివైధసి

యోగి కూడా అగ్నిలా ఉండాలి. అగ్ని ఎలాంటి కట్టెలో ప్రవేశించినా దగ్ధం చేస్తుంది. పరమాత్మ తాను సృష్టించిన ప్రపంచములో తాను ప్రవేశించి శుద్ధి చేసినట్లుగా సకల పదార్థాలలో అగ్ని ప్రవేశించి శుద్ధి చేస్తుంది.

విసర్గాద్యాః శ్మశానాన్తా భావా దేహస్య నాత్మనః
కలానామివ చన్ద్రస్య కాలేనావ్యక్తవర్త్మనా

చంద్రుడు: ఆయన కొన్నాళ్ళు పెరుగుతాడూ, కొన్నాళ్ళు తరుగుతాడు. కానీ తరిగేదీ పెరిగేదీ ఆయన కళలే కానీ ఆయన కాదు. అది చూచి గర్భాదానం నుంచీ శ్మశానం వరకూ ఉన్న కళలన్నీ శరీరానికే కానీ ఆత్మకు కాదు అని చంద్రుడు చెబుతాడు

కాలేన హ్యోఘవేగేన భూతానాం ప్రభవాప్యయౌ
నిత్యావపి న దృశ్యేతే ఆత్మనోऽగ్నేర్యథార్చిషామ్

అగ్ని యొక్క కాంతి జ్వాల పెరుగుతూ తరుగుతూ ఉంటుంది. అగ్ని మాత్రం అలాగే ఉంటుంది. మాహా వేగం కల కాలముతో ప్రాణులు పుడుతూ గిట్టుతూ ఉన్నా అందులో ఉన్న జీవుడు మాత్రం అలాగే ఉంటాడు

గుణైర్గుణానుపాదత్తే యథాకాలం విముఞ్చతి
న తేషు యుజ్యతే యోగీ గోభిర్గా ఇవ గోపతిః

సూర్యుడు తన కిరణములతో అంతటా వ్యాపించి ఉంటాడు. తన కిరణములతో నీటిని తీసుకుంటాడు నీటిని విడిచిపెడతాడు. ఒక కాలములో తీసుకుంటాడు ఇంకో కాలములో విడిచిపెడతాడు. ఈ సమ్యోగ వియోగాలతో ఎలాంటి సంబధం ఉండదు. అలాగే యోగికి కూడా సత్వాది గుణములతో ఎలాంటి సంబంధం ఉండదు. ఆయా సమయాలలో ఆయా గుణాలను స్వీకరిస్తాడు, విడిచిపెడతాడు. సమయానుగుణముగా తీసుకోవడం విడిచిపెట్టడం సూర్యుడు బోధిస్తున్నాడు

బుధ్యతే స్వే న భేదేన వ్యక్తిస్థ ఇవ తద్గతః
లక్ష్యతే స్థూలమతిభిరాత్మా చావస్థితోऽర్కవత్

సూర్యుడే ఆకాశములో నీటిలో అద్దములో కనపడుతున్నాడు. ఆకాశములో అంత పెద్ద సూర్యుడు అద్దములో చిన్నగా కనపడుతున్నాడు. మనం దేనిలో చూస్తున్నామో అది చిన్నది కానీ సూర్యుడు చిన్న కాదు. చూపేది సూర్యుడే. సుఖం దుఃఖం మైత్రీ ఇవన్నీ శరీరానికే గానీ ఆత్మకు కాదు. ఆత్మ సూర్యునిలా ఉంటుంది.

నాతిస్నేహః ప్రసఙ్గో వా కర్తవ్యః క్వాపి కేనచిత్
కుర్వన్విన్దేత సన్తాపం కపోత ఇవ దీనధీః

ఎక్కడ గానీ దేనితో గానీ ఎక్కువ స్నేహాన్నీ సంబంధాన్నీ ప్రీతిని పెట్టుకోరాదు అని కపోతం చెబుతుంది. పావురం తన భార్యలతో చెట్టు మీద గూడు కట్టుకుని ఉంది.

కపోతః కశ్చనారణ్యే కృతనీడో వనస్పతౌ
కపోత్యా భార్యయా సార్ధమువాస కతిచిత్సమాః

కపోతౌ స్నేహగుణిత హృదయౌ గృహధర్మిణౌ
దృష్టిం దృష్ట్యాఙ్గమఙ్గేన బుద్ధిం బుద్ధ్యా బబన్ధతుః

చూపులను చూపుతో శరీరాన్ని శరీరముతో బంధాన్ని బంధముతో ప్రేమను ప్రేమతో కలిపి

శయ్యాసనాటనస్థాన వార్తాక్రీడాశనాదికమ్
మిథునీభూయ విశ్రబ్ధౌ చేరతుర్వనరాజిషు

తినడం తిరగడం తాగడం పడుకోవడం లేవడం ఇలా అన్ని సంబంధాలతో

యం యం వాఞ్ఛతి సా రాజన్తర్పయన్త్యనుకమ్పితా
తం తం సమనయత్కామం కృచ్ఛ్రేణాప్యజితేన్ద్రియః

ఆడు పావురం ఏది కోరితే అది తీసుకు వస్తుందు. ఇలా పరస్పరం చాలా కాలం కలిసి ఉన్నాక,

కపోతీ ప్రథమం గర్భం గృహ్ణన్తీ కాల ఆగతే
అణ్డాని సుషువే నీడే స్తపత్యుః సన్నిధౌ సతీ

ఈ పావురం పిల్లలు పెట్టగా, ఆ పిల్లలతో కలసి, సుకుమారమైన రెక్కలూ కళ్ళూ మూతులతో ముద్దుగా ఉన్న పావురాలు ప్రేమను మరికాస్త పెంచాయి.

తేషు కాలే వ్యజాయన్త రచితావయవా హరేః
శక్తిభిర్దుర్విభావ్యాభిః కోమలాఙ్గతనూరుహాః

ఆ చిన్న పావురాలు కూత మొదలుపెట్టేసరికి, ఇంకా ఆనందిస్తూ మురిసిపోతూ సంతానాన్ని పెంచుకుంటూ పుత్ర వాత్సల్యాన్ని పెంచుకుంటూ

ప్రజాః పుపుషతుః ప్రీతౌ దమ్పతీ పుత్రవత్సలౌ
శృణ్వన్తౌ కూజితం తాసాం నిర్వృతౌ కలభాషితైః

వాటి మాటలు వింటూ ముద్దు మాటలతో ఆనందిస్తూ కాలం గడిపాక.

తాసాం పతత్రైః సుస్పర్శైః కూజితైర్ముగ్ధచేష్టితైః
ప్రత్యుద్గమైరదీనానాం పితరౌ ముదమాపతుః

స్నేహానుబద్ధహృదయావన్యోన్యం విష్ణుమాయయా
విమోహితౌ దీనధియౌ శిశూన్పుపుషతుః ప్రజాః

ఏకదా జగ్మతుస్తాసామన్నార్థం తౌ కుటుమ్బినౌ
పరితః కాననే తస్మిన్నర్థినౌ చేరతుశ్చిరమ్

స్నేహం బాగా పెరిగాక ఆ పావురల పిల్లలకు ఆహారం తేవడానికి వెళ్ళారు, సరిగ్గా ఆ సమయములో వల తీసుకుని ఒక వేటగాడు ఆ పిల్లలను వలలో వేసి పట్టేసాడు.

దృష్ట్వా తాన్లుబ్ధకః కశ్చిద్యదృచ్ఛాతో వనేచరః
జగృహే జాలమాతత్య చరతః స్వాలయాన్తికే

కపోతశ్చ కపోతీ చ ప్రజాపోషే సదోత్సుకౌ
గతౌ పోషణమాదాయ స్వనీడముపజగ్మతుః

కపోతీ స్వాత్మజాన్వీక్ష్య బాలకాన్జాలసమ్వృతాన్
తానభ్యధావత్క్రోశన్తీ క్రోశతో భృశదుఃఖితా

ఆహారం తీఉస్కుని ఆ రెండు పావురాలూ గూటి వద్దకు రాగా విషయం తెలుసుకున్న ఆడు పావురం దుఃఖముతో ఆ వల వద్దకు వెళ్ళి, వలలో చిక్కుంది దుఃఖముతో
పిల్లలూ భార్యా లేక మగపావురం బాధపడుతూ ఎలా బతకాలీ వీరు లేకుండా అని బాధపడుతూ

సాసకృత్స్నేహగుణితా దీనచిత్తాజమాయయా
స్వయం చాబధ్యత శిచా బద్ధాన్పశ్యన్త్యపస్మృతిః

కపోతః స్వాత్మజాన్బద్ధానాత్మనోऽప్యధికాన్ప్రియాన్
భార్యాం చాత్మసమాం దీనో విలలాపాతిదుఃఖితః

అహో మే పశ్యతాపాయమల్పపుణ్యస్య దుర్మతేః
అతృప్తస్యాకృతార్థస్య గృహస్త్రైవర్గికో హతః

అనురూపానుకూలా చ యస్య మే పతిదేవతా
శూన్యే గృహే మాం సన్త్యజ్య పుత్రైః స్వర్యాతి సాధుభిః

సోऽహం శూన్యే గృహే దీనో మృతదారో మృతప్రజః
జిజీవిషే కిమర్థం వా విధురో దుఃఖజీవితః

తాంస్తథైవావృతాన్శిగ్భిర్మృత్యుగ్రస్తాన్విచేష్టతః
స్వయం చ కృపణః శిక్షు పశ్యన్నప్యబుధోऽపతత్

తం లబ్ధ్వా లుబ్ధకః క్రూరః కపోతం గృహమేధినమ్
కపోతకాన్కపోతీం చ సిద్ధార్థః ప్రయయౌ గృహమ్

ఆలోచించకుండా,, వీరందరూ లేని కుటుంబం నాకెందుకు అని అది కూడా వలలో పోగా
వారందరినీ తీసుకుని వేటగాడు వెళ్ళిపోయాడు.

ఏవం కుటుమ్బ్యశాన్తాత్మా ద్వన్ద్వారామః పతత్రివత్
పుష్ణన్కుటుమ్బం కృపణః సానుబన్ధోऽవసీదతి

నావాళ్ళూ నేను భార్యా పిల్లలూ ఇల్లూ సంసారం అని మురిసిపోవడం అసలు మనసు బయటపడే దాకానే. ఆపద వచ్చేదాకానే అందరూ ప్రేమ గలవారు. ఇలాంటి పావురాల జీవితాన్ని జాగ్రత్తగా గమనిస్తే స్నేహం ప్రేమా బంధమూ ఆసక్తీ, మనను పతనం చేసేవిగా తెలుస్తుంది.
నా కుటుంబం నా కుటుంబం అని తెగ ప్రేమతో పోషించేవాడు కుటుంబముతో కలసి వాడు కూడా బాధపడతాడు.

యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారమపావృతమ్
గృహేషు ఖగవత్సక్తస్తమారూఢచ్యుతం విదుః

కాబట్టి ఇలాంటి మానవ జన్మను పొంది కూడా,  పశు పక్షుల్లాగ స్నేహానురాగాలకు బద్ధుడై పతనం కావడం కంటే జుగుప్సితం ఇంకోటి లేదు అని కపోతం చెబుతోంది.

                                              సర్వం శ్రీకృష్ణార్పణమస్తు
                                             సర్వం శ్రీసాయినాథార్పణమస్తు