Thursday, February 21, 2013

ధృవ కృత భగవద్ స్తుతి

ధృవ కృత భగవద్ స్తుతి
ధ్రువ ఉవాచ
యోऽన్తః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం
సఞ్జీవయత్యఖిలశక్తిధరః స్వధామ్నా
అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్
ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యమ్

నీకు నీవుగా మా హృదయం లోపల చేరి నిదురిస్తున్న శక్తిని మేలుకొలిపి నీ యందు మా దృష్టిని నిలిపేట్లు చేస్తున్నావు. నిదురపోయి ఉన్న నా వాక్కును ఉజ్జీవింపచేసావు. అందరి శక్తినీ అందించేవాడివి, అందరి శ్కతీ నీవే అయిన వాడివి. కేవల వాక్కునే కాదు, చేయీ కాలూ కళ్ళూ నాలికా అన్నీ, వీటిలో ఏది కదలాలన్నా పరమాత్మ వలనే. అన్ని ఇంద్రియాలలోకీ నీవు వెళ్ళి వాటి శక్తిని ఉజీవింపచేస్తావు. అటువంటి నీకు నమస్కారం

ఏకస్త్వమేవ భగవన్నిదమాత్మశక్త్యా
మాయాఖ్యయోరుగుణయా మహదాద్యశేషమ్
సృష్ట్వానువిశ్య పురుషస్తదసద్గుణేషు
నానేవ దారుషు విభావసువద్విభాసి

నీవొక్కడవే నీ యోగ మాయ అనే శక్తితో ప్రకృతితో మహత్ తత్వాన్ని, దానితో అహంకారమునూ, దానితో ఇంద్రియాలను సృష్టించి, ప్రవేశించి, సత్ అసత్తులోనూ,ప్రకృతిలోనూ మహదహంకారములో ప్రవేశించావు. ఒక్కడివే ఉన్నా చాలా మంది ఉన్నట్లు భాసిస్తావు. కట్టె ఆకారం బట్టి మంట ఆకారం మారుతూ ఉంటే, అగ్నే పలు రకాలుగా మారుతోంది అనిపించినట్లుగా నీవు కూడా పలు రకాలుగా ఉన్నట్లు భాసిస్తావు. వాస్తవముగా నీవు ఒక్కడవే.

త్వద్దత్తయా వయునయేదమచష్ట విశ్వం
సుప్తప్రబుద్ధ ఇవ నాథ భవత్ప్రపన్నః
తస్యాపవర్గ్యశరణం తవ పాదమూలం
విస్మర్యతే కృతవిదా కథమార్తబన్ధో

పడుకుని లేచిన వాడు ఎలా చూస్తాడో నీవిచ్చిన జ్ఞ్యానముతో సకల ప్రపంచాన్ని చూస్తున్నాము. ప్రపంచం తెలియాలన్నా ప్రపంచాన్ని చూడాలన్న నీ అనుగ్రహమే కావాలి. మోక్షమూలమైనది నీ పాదం. కానీ ఈ విషయాన్ని అన్నీ తెలుసనుకునే జనులు ఎలా మరిచిపోతున్నారు

నూనం విముష్టమతయస్తవ మాయయా తే
యే త్వాం భవాప్యయవిమోక్షణమన్యహేతోః
అర్చన్తి కల్పకతరుం కుణపోపభోగ్యమ్
ఇచ్ఛన్తి యత్స్పర్శజం నిరయేऽపి న్ణామ్

పరిశుద్ధమైన బుద్ధికలిగి, బాగా పరిశీలించి మంచి బుద్ధిగా ఉంటున్న వారందరూ నీ మాయతో సంసారాన్నీ మోక్షాన్నీ ఇచ్చేవాడివి (భవాప్యయవిమోక్షణ) అయిన నీ గురించి తెలిసి కూడా మోక్షన్ని కోరక సంసారాన్ని అడుగుతున్నారు. నిన్ను సంసారం కోసం అర్చిస్తున్నారు. కల్పవృక్షాన్ని పట్టుకొని పురుగులు తినే శరీరాన్ని కోరుతున్నారు. దానికి నీ మాయే కారణం

యా నిర్వృతిస్తనుభృతాం తవ పాదపద్మ
ధ్యానాద్భవజ్జనకథాశ్రవణేన వా స్యాత్
సా బ్రహ్మణి స్వమహిమన్యపి నాథ మా భూత్
కిం త్వన్తకాసిలులితాత్పతతాం విమానాత్

శరీరధారులకు ఆనందం నీ పాద పద్మాలని ధ్యానం చేయడం వలనా, నీ భక్తుల కథలు వినడం వలనా, కలుగుతుంది. వీటి వలన కలిగే ఆనందం సంసారములో ఉండే జనులు యముని కత్తి వేటు తప్పించుకోవడములో పొందుతున్నారు. కింద పడేసే విమానాలు వద్దు నాకు

భక్తిం ముహుః ప్రవహతాం త్వయి మే ప్రసఙ్గో
భూయాదనన్త మహతామమలాశయానామ్
యేనాఞ్జసోల్బణమురువ్యసనం భవాబ్ధిం
నేష్యే భవద్గుణకథామృతపానమత్తః

ఏమి చేస్తున్నా మాట్లాడుతున్నా నీ యందే భక్తి కలగాలి. నిరంతరం నిన్ను తలచుకొనే భక్తుల సావాసం చాలు. దాని వలన పరమ తీవ్రమైన మహాకష్టాలతో నిండి ఉన్న సంసారమనే మహా సముద్రాన్ని సులభముగా దాటుతాము. నీ కథలనే మత్తులో ఉన్న మాకు ఈ సంసారములో మునుగుతున్నా కూడా, మునుగుతున్నట్లు తెలియదు.

తే న స్మరన్త్యతితరాం ప్రియమీశ మర్త్యం
యే చాన్వదః సుతసుహృద్గృహవిత్తదారాః
యే త్వబ్జనాభ భవదీయపదారవిన్ద
సౌగన్ధ్యలుబ్ధహృదయేషు కృతప్రసఙ్గాః

నిరంతరం నీయందే మనో వాక్కులూ లగ్నం చేసిన వారి పొరపాటున కూడా శరీరాన్ని, మరణ ధర్మం కలిగి ఉన్నదాన్ని స్మరించరు. శరీరాన్నే తలచనప్పుడు, శరీరం కోసం వచ్చేవారు, శరీరముతో వచ్చిన వారు, శరీరం వలన వచ్చేవారైన, భార్యా పిల్లలూ ఇల్లూ వెంట రావు. పుత్రులూ, మిత్రులూ, ఇల్లూ, విత్తం, ధార వీళ్ళంతా శరీరం వెంట తిరిగేవారు. నీ పాదారవింద మకరందాన్ని రుచి చూసిన వారు వీటిని కోరరు.

తిర్యఙ్నగద్విజసరీసృపదేవదైత్య
మర్త్యాదిభిః పరిచితం సదసద్విశేషమ్
రూపం స్థవిష్ఠమజ తే మహదాద్యనేకం
నాతః పరం పరమ వేద్మి న యత్ర వాదః

మేము ఏ ఏ ఆకారాలను  కోరతామో ఆ రూపాలలో వచ్చావు. ఆహారముగా తినే మత్స్యాదులలో, పర్వతాలుగా, నదులుగా, పక్షులుగా, సర్పాలుగా, దేవతలుగా (వామనుడు) మనుషులుగా , ఎవరెవరు ఏ ఏ ఆకారలతో నిన్ను భావిస్తారో ఆ ఆకారములలో వచ్చావు. ఇన్ని రూపాలలో ఉన్నా వీటిలో ఉన్న దోషాలు ఏవీ నీకు అంటవు. నీవు సత్ కాదూ అసత్ కాదు. అన్నింటిలో ఉంటావు కానీ దేనిలోనూ ఉండవు. మహదాదులు ఉన్నాయి గానీ అవి నిజానికి లేవు. అవి అన్నీ నీ రూపాలే. ఇంతకంటే ఎక్కువ నేను ఏదీ తెలుసుకోలేను. అక్కడిదాకే నీ వాదాలన్నీ.

కల్పాన్త ఏతదఖిలం జఠరేణ గృహ్ణన్
శేతే పుమాన్స్వదృగనన్తసఖస్తదఙ్కే
యన్నాభిసిన్ధురుహకాఞ్చనలోకపద్మ
గర్భే ద్యుమాన్భగవతే ప్రణతోऽస్మి తస్మై

ప్రళయకాలములో ఈ సకల జగత్తునీ నీ కడుపులోకి తీసుకుని, సకలప్రపంచాన్నీ నీకు నీవే చూస్తూ పడుకుంటావు. కొంతకాలానికి అలా పడుకొని ఉన్న నీ నాభి నుంచి బంగారు పద్మం పుడుతుంది. అదే లోకపద్మం. దాని మధ్యలో చతుర్ముఖ బ్రహ్మ ప్రకాశిస్తూ ఉంటారు.

త్వం నిత్యముక్తపరిశుద్ధవిబుద్ధ ఆత్మా
కూటస్థ ఆదిపురుషో భగవాంస్త్ర్యధీశః
యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా స్వదృష్ట్యా
ద్రష్టా స్థితావధిమఖో వ్యతిరిక్త ఆస్సే

స్థితావధిమఖో- పరమాత్మ జగత్తును రక్షించడానికే పుడతాడు. అధి మఖ అంటే లోక రక్షణ గురించి యజ్ఞ్యములచే ఆరాధించబడే వాడు. నీ "స్థితి" ధర్మ స్థాపన కొరకే (పరిత్రాణాయ సాధూనాం). నీవు లోకాన్ని రక్షించడానికి అవతరిస్తున్నావు. నీ చేత రక్షించబడినవారు యజ్ఞ్యముల ద్వారా నిన్ను ఆరాధిస్తున్నారు. అవతరించినా నీవు వ్యతిరిక్త . అంటే ప్రకృతి కన్నా పురుషుడికన్నా విలక్షణుడవు. కానీ వాటికన్నా వేరుగా ఉన్నట్లు కనపడతావు.

పరమాత్మ . ప్రకృతి అవ్యక్తం , పంచభూతాలలోనూ ఉంటాడు. అయినా వాటిలోని దోషాలు అంటని వాడు. కానీ జీవుడు అహంకార మమకార వశమై తనకంటని దోషాలు కూడా అంటినట్లు కష్టముల పాలవుతున్నవాడు జీవుడు. ప్రకృతికి దోషాలు అంటుతాయి. కానీ పరమాత్మకు ఈ రెంటి దోషాలూ అంటవు.
నిత్యముక్త - నిత్య ముక్తులంటే దేనిలో ఉంటాడో దాని దోషం అంటని వాడు.
పరిశుద్ధ- ఎలాంటి దోషములూ లేని వాడు. ఎలాంటి దోషాలూ లేకుండా ఎలా ఉంటాడు? కర్మవశులము కాకపోతే. పరమాత్మ కర్మవశుడు కాడు. అందుకు విశుద్ధ
విబుద్ధ - అసంకుచిత జ్ఞ్యానం కలవాడు కాడు. అనుకున్నదాన్ని అనుకున్నట్లు చేయలేకపోవడం, అలా చేయకుండా తనను తాను వారించలేకపోవడం సంకుచిత జ్ఞ్యానం. కానీ పరమాత్మ అలా కాదు.
ఈ లక్షణాలే వైకుంఠములో ఉన్నవారికి కూడా ఉంటాయి. కానీ నీవు ఆత్మవి. అన్నిటిలో ప్రవేశించి శాసితావు. ముక్తులకు అన్నీ ఉంటాయి గానీ సృష్టి స్థితి లయములు చేయలేడు. పరమాత్మ ప్రతీ దానిలో ప్రవేశించి శాసిస్తాడు.
కూటస్థుడు - వికార రహితుడు. పరమాత్మకు స్వరూప స్వభావ వికారాలు ఉండవు. జీవునికి సరూప మారదు కానీ, స్వభావము మారదు. ప్రకృతిలో స్వరూపములో వికారం ఉంటుంది గానీ స్వభావములో వికారం ఉండదు.

ఈయన ఆదిపురుషుడు - మొదటి వాడైన పురుషుడు. ఇక్కడ ఆది అంటే కారణం. అంటే సృష్టి స్థితి లయ కారకుడు. పురుషుడంటే పురములలో ఉండే వాడు. ఇక్కడ పురము అంటే శరీరం. ఆత్మకు శరీరం ఇచ్చి, ఆత్మలోనూ, శరీరములోనూ ఉండేవాడు. పరమాత్మే కారణమూ కార్యమూ

ఈయన భగవానుడు. ఆరు గుణములు కలవాడు. సత్వం రజస్సు తమస్సూ, ఆ వికారాలు ఉన్న మూడు లోకాలు, ఆ వికారలు ఉన్న ప్రకృతికీ పరమాత్మ అధిపతి

యద్బుద్ధ్యవస్థితిమఖణ్డితయా - ఏ కష్టమూ లేఖుండా ఇవన్నీ ఆయన సంకల్పములో విషయముగా భాసించిన దాన్నే ఈయన చేస్తాడు. అది కొడా అఖండితయా. మన సంకల్పం ఖండితం. మరచిపోతూ ఉంటాము , ఒక వేళ గుర్తు ఉన్నా చేయలేము. కానీ ఆయనది అఖండితమైన సంకల్పం కలవాడు. అందరూ అందరినీ మరచిపోతారేమో గానీ, పరమాత్మ ఎప్పుడూ ఎవ్వరినీ మరువడు.

స్వదృష్ట్యా -ద్రష్టా: ఈయన స్వయం ద్రష్ట. సర్వకాల సర్వ దేశ సర్వావస్థలలో సర్వ విధములైన జగత్తుకు సుఖ ప్రాప్తీ దుఃఖ నివృత్తినీ చేసేవాడు, కావలసిన దాన్ని ఇచ్చి అవసరములేని దాన్ని ఇవ్వకుండా ఉండగలిగే వాడు. రక్షణ వ్యాపార దక్ష గలవాడు.

యస్మిన్విరుద్ధగతయో హ్యనిశం పతన్తి
విద్యాదయో వివిధశక్తయ ఆనుపూర్వ్యాత్
తద్బ్రహ్మ విశ్వభవమేకమనన్తమాద్యమ్
ఆనన్దమాత్రమవికారమహం ప్రపద్యే

ఏ పరమాత్మ యందు ఈ లోకములో మనం అనుకునే పరస్పరవిరుద్ధమైన ఆలోచనలూ, వాటి వలన కలిగే వికారాలు, వాటి వలన కలిగే స్థితి స్వరూపాలన్నీ ఏ పరమాత్మ వలన తమకు తాముగా ఆవిర్భవిస్తాయో. భగవంతుడు కానిది ఏదీ లేదు అనే జ్ఞ్యానం నిన్ను చూస్తేనే కలుగుతుంది. పరమాత్మలో జ్ఞ్య్నాన శక్తాది గుణాలు ఉన్నాయి. ఇవి అన్నీ ఒకే సారి ఉన్నాయా? లేక క్రమముగా వచ్చాయా? అంటే పరమాత్మకు జ్ఞ్యానము ముందు వచ్చి బలం తరువాత వచ్చిందా? ఏ పని చేస్తున్నప్పుడు ఆయన ఆ ఒక్క పనే చేస్తున్నాడనిపిస్తుంది. అలాంటి స్వభావం మనది గానీ ఆయనది కాదు. ఒకదానికి ఒకటి విరుద్ధముగా ఉన్నవి కూడా ఆయనలో సమానముగా ఉంటాయి. ఇవన్నీ ఒక దాని వెనక ఒకటి ఉన్నట్లు కనపడతాయి గానీ ఆయనలోనే అన్ని గుణాలూ (జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు) చూడటానికి వరుసగా ఉన్నట్లు అనిపించినా, అవి అన్నీ సమానముగానే వస్తాయి. ఇదే ఆనుపూర్వ్యాత్
ఇవి ఉన్నవాడే బ్రహ్మ.

విశ్వభవమేకమనన్తమాద్యమ్- ఈయన ప్రపంచానికి కారణం.
ఆనన్దమాత్రమవికారమహం - ఇదే సత్యం జ్ఞ్యానం అనంతం బ్రహ్మ. ఆనందం వలన కలిగేది జ్ఞ్యానం. అవికారం అంటే సత్యం. సత్యం ఎప్పటికీ మారదు. అనంతం అంటే దేశ కాల వస్తు అపరిచ్చిన్నం. పరమాత్మ అనంతుడు : అన్ని కాలలలో రూపాలలో దేశాలలో ఉంటాడు.

ఇలాంటి పరమాత్మను నేను శరణు వేడుతున్నాను.

సత్యాశిషో హి భగవంస్తవ పాదపద్మమ్
ఆశీస్తథానుభజతః పురుషార్థమూర్తేః
అప్యేవమర్య భగవాన్పరిపాతి దీనాన్
వాశ్రేవ వత్సకమనుగ్రహకాతరోऽస్మాన్

అన్ని కోరికలనూ నిజం చేసేవాడు పరమాత్మ. పురుషార్థమూర్తేః - పురుషార్ధమంటే జీవుల చేత కోరబడేది. ధర్మార్థకామ మోక్షాలు కాదు పురుషార్థాలంటే , పరమాత్మే పురుషార్థం. అయినా నిన్ను తప్పించి వేరే కోరికలు అడుగుతున్నావారిని కూడా నీవు కాపాడుతున్నావు. తమకు ఏది కావాలో తెలియని దీనులు వారు. అప్పుడే ఈనిన ఆవు తన దూడను పరిపాలించినట్లుగా, అప్పుడే ప్రసవించిన ఆవు తన నాలికతో దూడ యొక్క దోషాలను పోగొడుతుందో మా అందరి దోషాలను రుచిగా స్వీకరించి మమ్మల్ని కాపాడుతున్నావు

దయ తలచాలన్న దైన్యత్వం ఉన్నవాడివి. వారందరినీ నీవు కాపాడుతున్నావు

అందరిలాగా ధృవుడికి పరమాత్మ ప్రత్యక్షం మాత్రమే కాలేదు. పరమాత్మ తత్వం కూడా ప్రత్యక్షమయ్యింది. పరమాత్మ దీనికోసమె తన స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసి కూడా పాంచజన్యం స్పృశింపచేసి తన తత్వాన్ని సాక్షాత్కరింపచేసాడు. 

No comments:

Post a Comment