Thursday, February 14, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ప్రథమాధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ప్రథమాధ్యాయం
మైత్రేయ ఉవాచ
మనోస్తు శతరూపాయాం తిస్రః కన్యాశ్చ జజ్ఞిరే
ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిరితి విశ్రుతాః

మనువుకు శతరూప యందు ముగ్గురు పుత్రికలు 1. అకూతి 2. దేవహూతి 3. ప్రసూతి
అందులో ఆకూతిని రుచి అనే ప్రజాపతికి ఇచ్చారు

ఆకూతిం రుచయే ప్రాదాదపి భ్రాతృమతీం నృపః
పుత్రికాధర్మమాశ్రిత్య శతరూపానుమోదితః

పుత్రికా ధర్మాన్ని ఆచరించి వివాహం చేసాడు. పుత్రికా ధర్మం అంటే వివాహం తరువాత ఆ అమ్మయికి పుట్టబోయే కుమారుడు తన వంశానికి ఉద్ధారకుడు అవుతాడు. దౌహిత్రుడు వంశ ఉద్ధారకుడు అవుతాడు అని కన్యాదాన సమయములో ప్రమాణ పూర్వకముగా చేస్తారు. దీనికి అమ్మాయీ అల్లుడూ, తన భార్యా కూడా ఒప్పుకోవాలి. తనకు పుత్ర సంతానం లేకుంటే ఈ పని చేయాలి. లేదా పుత్రిక మీద పుత్రుని కంటే ఎక్కువ ప్రేమ ఉన్నా ఈ పని చేయొచ్చు. మరి మనువుకు పుత్రులు లేరా? ఉన్నారు - ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు. అయినా ఆకూతి యందు ప్రేమ ఎక్కువ. అందుకు శతరూప అనుమొదించడముతో, పుత్రుల అనుమతీ పొంది పుత్రికాధర్మాన్ని ఆశ్రయించి ఆకూతిని రుచి అనే ప్రజాపతితో వివాహం చేసాడు

ప్రజాపతిః స భగవాన్రుచిస్తస్యామజీజనత్
మిథునం బ్రహ్మవర్చస్వీ పరమేణ సమాధినా

రుచికీ ఆకూతికి కవలలు పుట్టారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఉత్తమసమాధిలో ఉత్తమ తపస్సుతో ఉత్తమ యోగముతో ఈయన కవలలకు జన్మనిచ్చాడు

యస్తయోః పురుషః సాక్షాద్విష్ణుర్యజ్ఞస్వరూపధృక్
యా స్త్రీ సా దక్షిణా భూతేరంశభూతానపాయినీ

ఆ ఇద్దరిలో అబ్బయికి పేరు యజ్ఞ్యః. ఆ రోజులలో కవలలు అంటే అబ్బాయి అమ్మాయి కలిసి పుట్టే వారు. అమ్మ నిత్యానపాయిని కాబట్టి. కృత యుగమంతా ఆడ మగ కవలలు పుడితే వారు విష్ణు లక్ష్మీ అని వ్యవహరించి, వారికి వివాహం చేసేవారు. అదే ధర్మం త్రేతా యుగం వచ్చేసరికి ఆ ధర్మాన్ని మార్చడం జరిగింది. ద్వాపర యుగం వరకూ బ్రాహ్మణులు కూడా మాన్సం తినేవారు, ఎందుకంటే వారు ఏమి తిన్న ఏమి చేసినా వారు యోగములో ఉండేవారు. అలాగే కలియుగములో కేవలం బ్రాహ్మణులే కాక శ్రాద్ధములో మాన్సము నిషేధం. ఆ పురుషునికి యజ్ఞ్యుడూ అనీ, అమ్మాయికి దక్షిణా అని పేరు. "దక్షిణ" అమ్మవారి అంశే.

ఆనిన్యే స్వగృహం పుత్ర్యాః పుత్రం వితతరోచిషమ్
స్వాయమ్భువో ముదా యుక్తో రుచిర్జగ్రాహ దక్షిణామ్

మొదలు చేసుకున్న ఒప్పందం ప్రకారం మనువు కుమారుడిని తన ఇంటికి తీసుకుని వచ్చాడు.

తాం కామయానాం భగవానువాహ యజుషాం పతిః
తుష్టాయాం తోషమాపన్నోऽ జనయద్ద్వాదశాత్మజాన్

ఒకరినొకరు ఇష్టపడి యజ్ఞ్యుడూ దక్షిణా పెళ్ళి చేసుకున్నారు. పన్నెండు మంది కుమారులు వీరికి కలిగారు

తోషః ప్రతోషః సన్తోషో భద్రః శాన్తిరిడస్పతిః
ఇధ్మః కవిర్విభుః స్వహ్నః సుదేవో రోచనో ద్విషట్

తుషితా నామ తే దేవా ఆసన్స్వాయమ్భువాన్తరే
మరీచిమిశ్రా ఋషయో యజ్ఞః సురగణేశ్వరః

తుషితా అనే దేవతలయ్యారు వీరు. తోష ప్రతోష సంతోష భద్ర శాంతి మొదలైన వారు. స్వాయంభువ మన్వంతరములో దేవతల పేరు తుషితులు. మరీచాదులు ఋషులు. పరమాత్మ అవతారం యజ్ఞ్యుడు.

ప్రియవ్రతోత్తానపాదౌ మనుపుత్రౌ మహౌజసౌ
తత్పుత్రపౌత్రనప్తౄణామనువృత్తం తదన్తరమ్

మనువు యొక్క పుత్రులు ఇద్దరు. ప్రియవ్రత ఉత్తానపాదులు.

దేవహూతిమదాత్తాత కర్దమాయాత్మజాం మనుః
తత్సమ్బన్ధి శ్రుతప్రాయం భవతా గదతో మమ

దేవహూతిని కర్దమునకు ఇచ్చి వివాహం చేసారు. నీవు అది విన్నట్లే (శ్రుతప్రాయం )

దక్షాయ బ్రహ్మపుత్రాయ ప్రసూతిం భగవాన్మనుః
ప్రాయచ్ఛద్యత్కృతః సర్గస్త్రిలోక్యాం వితతో మహాన్

ప్రసూతిని దక్షునికిచ్చి వివాహం చేసారు. ఆ దక్షప్రజాపతి సంతానమే ఇప్పుడు మూడులోకాలలో నిలిచి ఉంది. అన్ని జాతులూ, క్రిములూ, పాములూ, పక్షులూ, మొదలిన కనపడే జీవాలాన్నీ ఈయన సంతానమే. అందుకే ఎవరైన గర్భం ధరిస్తే "ప్రసూతి అయ్యిందా" అని అంటాం. ప్రసూతి దక్షుని భార్య.

యాః కర్దమసుతాః ప్రోక్తా నవ బ్రహ్మర్షిపత్నయః
తాసాం ప్రసూతిప్రసవం ప్రోచ్యమానం నిబోధ మే

కర్దముని పుత్రికలు తొమ్మిది మంది. వారి సంతానం గురించి విను

పత్నీ మరీచేస్తు కలా సుషువే కర్దమాత్మజా
కశ్యపం పూర్ణిమానం చ యయోరాపూరితం జగత్

మరీచి భార్య కలా. ఈవిడ కశ్యప ప్రజాపతిని కంది. కశ్యపుని భార్య పూర్ణిమ. వీరితో జగత్తు బాగా విస్తరించింది.

పూర్ణిమాసూత విరజం విశ్వగం చ పరన్తప
దేవకుల్యాం హరేః పాద శౌచాద్యాభూత్సరిద్దివః

పూర్ణి, విరజునికీ విశ్వౌనికీ జన్మనిచ్చింది. తరువాత పూర్ణిమకే పరమాత్మ కృపతో పరమాత్మ పాద తీర్థముతో పవిత్రురాలై ఒక నదిగా ప్రవహించింది

అత్రేః పత్న్యనసూయా త్రీఞ్జజ్ఞే సుయశసః సుతాన్
దత్తం దుర్వాససం సోమమాత్మేశబ్రహ్మసమ్భవాన్

అత్రి భార్య అనసూయ. ఆమెకు ముగ్గురు కుమారులు కలిగారు. దత్తుడూ, దుర్వాసుడూ, చంద్రుడు. విష్ణు రుద్ర బ్రహ్మాంశ సంభూతులు వీరు

విదుర ఉవాచ
అత్రేర్గృహే సురశ్రేష్ఠాః స్థిత్యుత్పత్త్యన్తహేతవః
కిఞ్చిచ్చికీర్షవో జాతా ఏతదాఖ్యాహి మే గురో

సృష్టి స్థితీ నాశం, ఈ మూటిని చేసే వారు ఏమి చేయాలనుకుని అత్రి అనసూయలకు పుట్టారు.

మైత్రేయ ఉవాచ
బ్రహ్మణా చోదితః సృష్టావత్రిర్బ్రహ్మవిదాం వరః
సహ పత్న్యా యయావృక్షం కులాద్రిం తపసి స్థితః

స్వామి అత్రి మహర్షి బ్రహ్మవిదాం వరః. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్న వారిలో అగ్రుడు. ఈయన చత్రుముఖ బ్రహ్మతో ప్రేరేపించబడి పత్నితో కలిసి కూలాద్రి పరవతం దగ్గర తపస్సు చేసాడు.

తస్మిన్ప్రసూనస్తబక పలాశాశోకకాననే
వార్భిః స్రవద్భిరుద్ఘుష్టే నిర్విన్ధ్యాయాః సమన్తతః

వింధ్య యొక్క ఉపపర్వతమైన నిర్వింధ్య దగ్గర అనేక వృక్షాలతో నదులతో జలపాతములతో పక్షులతో శొభిస్తున్నా ఆ ప్రదేశానికి వెళ్ళి

ప్రాణాయామేన సంయమ్య మనో వర్షశతం మునిః
అతిష్ఠదేకపాదేన నిర్ద్వన్ద్వోऽనిలభోజనః

చంచలమైన మనసుని ప్రాణాయామముతో వశం చేసుకుని ఒక నూరు సంవత్సరాలు ఒంటి కాలి మీద నిలబడి వాయువును మాత్రం ఆహారముగా తీసుకుని, శీత ఉష్ణ సుఖ దుఖాలని ద్వందాలని వదిలిపెట్టి తపస్సు చేసాడు

శరణం తం ప్రపద్యేऽహం య ఏవ జగదీశ్వరః
ప్రజామాత్మసమాం మహ్యం ప్రయచ్ఛత్వితి చిన్తయన్

ఎవరు జగన్నాధుడో అతనికి నమస్కారం. ఆ జగన్నాయకుడు తన వంటి సంతానాన్ని నాకు ఇవ్వాలి.

తప్యమానం త్రిభువనం ప్రాణాయామైధసాగ్నినా
నిర్గతేన మునేర్మూర్ధ్నః సమీక్ష్య ప్రభవస్త్రయః

వాయువును బాగా నిగ్రహిస్తే, ఆ వాయువు నుండి అగ్ని పుడుతుంది. ఈ ప్రాణాయామం పెంచుకుంటూ పోతున్న కొద్దీ, మూడులోకాలనూ స్థంభింపచేసే అగ్ని పుట్టింది. జగన్నాయకా అని పిలిచాడు. బ్రహ్మ విష్ణు మహేసవరులు ముగ్గురూ జగన్నాయకులే కాబట్టి

అప్సరోమునిగన్ధర్వ సిద్ధవిద్యాధరోరగైః
వితాయమానయశసస్తదాశ్రమపదం యయుః

తమ దేవతలతో భక్తులతో సేవించబడుతూ దేవతలు అత్రి ఆశ్రమానికి విచ్చేసారు. వారు ఆవిర్భవించడం వలన వచ్చిన తేజస్సుతో తపసునుండి బయటకు వచ్చి ఒంటి కాలి మీద ఉన్న వాడు కాస్తా సాష్టాంగ నమస్కారం చేసాడు

తత్ప్రాదుర్భావసంయోగ విద్యోతితమనా మునిః
ఉత్తిష్ఠన్నేకపాదేన దదర్శ విబుధర్షభాన్

ప్రణమ్య దణ్డవద్భూమావుపతస్థేऽర్హణాఞ్జలిః
వృషహంససుపర్ణస్థాన్స్వైః స్వైశ్చిహ్నైశ్చ చిహ్నితాన్

వృషభాన్ని, హంసనీ, గరుడున్నీ అధిరోహించిన వారిని, వారి వారి గుర్తుల వలన వారెవరో తెలుసుకుని. చిరునవ్వుతో చూస్తున్న వారిని చూచి

కృపావలోకేన హసద్ వదనేనోపలమ్భితాన్
తద్రోచిషా ప్రతిహతే నిమీల్య మునిరక్షిణీ

దివ్యమైన కాంతి వలన కళ్ళు మూసుకుని మనసు వారి యందే ఉంచి ఆ ముగ్గురినీ స్తోత్రం చేసారు

చేతస్తత్ప్రవణం యుఞ్జన్నస్తావీత్సంహతాఞ్జలిః
శ్లక్ష్ణయా సూక్తయా వాచా సర్వలోకగరీయసః

సర్వలోక శ్రేష్టులైన వారిని స్తోత్రం చేసాడు

అత్రిరువాచ
విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైర్
మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః
తే బ్రహ్మవిష్ణుగిరిశాః ప్రణతోऽస్మ్యహం వస్
తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః

ఒకే పరమాత్మ అయి ఉండి, మాయతో ఏర్పడిన గుణములని తీసుకుని, ఏ పనికి ఆ గుణము స్వీకరించారు. ఒకరు సృష్టినీ, ఒకరు స్థితినీ, ఒకరు లయాన్ని చేస్తున్నారు. ప్రకృతి సంబంధములైన గుణములను మీరు స్వీకరించి ఈ మూడు పనులనూ చేయడానికి వేరు వేరు శరీరం తీసుకున్న మహానుభావులారా మీకు నమస్కారం. నేను ఈ ముగ్గురిలో ఎవరిని పిలిచాను.

ఏకో మయేహ భగవాన్వివిధప్రధానైశ్
చిత్తీకృతః ప్రజననాయ కథం ను యూయమ్
అత్రాగతాస్తనుభృతాం మనసోऽపి దూరాద్
బ్రూత ప్రసీదత మహానిహ విస్మయో మే

దేవతలందరిలో ప్రధానమైన వారిని నేను ధ్యానం చేసాను. ఉత్తమ సంతాన్ని కోరి ఒకరినే ధ్యానం చేసినట్లు నాకు గుర్తు. దేహ ధారుల మనసుకి కూడా అందని దూరములో ఉంటారు మీరు. ఇలాంటి వారు నాకోసం వచ్చారు. అడుగుతున్నానని చిన్నబుచ్చుకోకండి. ఒక్కడి కోసమే ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. అలాంటిది ముగ్గురు వచ్చారు.

మైత్రేయ ఉవాచ
ఇతి తస్య వచః శ్రుత్వా త్రయస్తే విబుధర్షభాః
ప్రత్యాహుః శ్లక్ష్ణయా వాచా ప్రహస్య తమృషిం ప్రభో

చిరునవ్వు నవ్వి అత్రి మహర్షితో ఇల అన్నారు. నీలాంటి పరమ భక్తాగ్రేసుని సంకల్పం మరొకతీరుగా ఉండదు.

దేవా ఊచుః
యథా కృతస్తే సఙ్కల్పో భావ్యం తేనైవ నాన్యథా
సత్సఙ్కల్పస్య తే బ్రహ్మన్యద్వై ధ్యాయతి తే వయమ్

నీవు ఎలా సంకల్పించావో అలాగే జరుగుతుంది. ఇంకో విధముగా జరుగదు. ఈ నియమం కేవలం సత్సంకల్పానికి మాత్రమే. అలాంటి ఉత్తమ సంకల్పం కల నీవు ఎవరిని ధ్యానం చేసావో వారే వచ్చారు. నీవు తపసు చేసింది మా కోసమే.

అథాస్మదంశభూతాస్తే ఆత్మజా లోకవిశ్రుతాః
భవితారోऽఙ్గ భద్రం తే విస్రప్స్యన్తి చ తే యశః

వారితో సమానమైన సంతానం అడిగావు కాబట్టి మా ముగ్గురితో సమానమైన అంశలు నీకు కుమారులుగా పుట్టి నీ కీర్తిని విస్తరింపచేస్తారు.

ఏవం కామవరం దత్త్వా ప్రతిజగ్ముః సురేశ్వరాః
సభాజితాస్తయోః సమ్యగ్దమ్పత్యోర్మిషతోస్తతః

అతను కోరిన వార్న్నిచ్చి వారు అంతర్ధానం చెందారు

సోమోऽభూద్బ్రహ్మణోऽంశేన దత్తో విష్ణోస్తు యోగవిత్
దుర్వాసాః శఙ్కరస్యాంశో నిబోధాఙ్గిరసః ప్రజాః

సోమడు బ్రహ్మాంశతో, విష్ణు అంశతో యోగము తెలిసిన వాడైన దత్తుడు, శంకరుని అంశతో దుర్వాసుడూ పుట్టారు

దత్తుడు సామాన్యులకు అర్థం కాని రీతిలో ఉంటాడు. దత్తుడి చుట్టూ కుక్కలూ వేశ్యలూ మద్యమూ మాంసమూ ఉంటాయి. ఎనిమిది వేశ్యలంటే అష్ట సిద్ధులు. నాలుగు కుక్కలు వేదాలు.
శ్రద్ధా త్వఙ్గిరసః పత్నీ చతస్రోऽసూత కన్యకాః
సినీవాలీ కుహూ రాకా చతుర్థ్యనుమతిస్తథా

అంగీర్సుడి భార్య పేరు శ్రద్ధ. ఆమె నలుగురు పుత్రికలను ప్రసవించింది. - సినీవాలీ కుహూ రాకా చతుర్థ్యనుమతిస్తథా

తత్పుత్రావపరావాస్తాం ఖ్యాతౌ స్వారోచిషేऽన్తరే
ఉతథ్యో భగవాన్సాక్షాద్బ్రహ్మిష్ఠశ్చ బృహస్పతిః

వీరికే ఇద్దరు పుత్రులు పుట్టారు. వీరు స్వారోచిష మన్వంతరములో ప్రసిద్ధి పొందుతారు. ఉతధ్యుడు (ఈయన యోగవేత్త), బృహస్పతి.

పులస్త్యోऽజనయత్పత్న్యామగస్త్యం చ హవిర్భువి
సోऽన్యజన్మని దహ్రాగ్నిర్విశ్రవాశ్చ మహాతపాః

పులస్త్యుడి భార్య హవిర్భువు. అగస్త్యుడికి జన్మనిచ్చింది (కుంభములో పుట్టిన అగస్త్యుడు వేరు). ఈయనే తరువాతి జన్మలో హృదయములో ఉన్న అగ్ని (దహ్రాగ్ని) అయ్యాడు. అందుకే అగస్త్యునికి ఏదైనా జీర్ణించుకోగలిగిన శక్తి ఉంది. ఈయనకున్న జఠరాగ్నిలో 190వ వంతు భీమునికి ఉంది. ఆ భీమునికి వృకోదరుడని పేరు. ఈ పులస్త్యుడికే విశ్వవసుడనే పుత్రుడు కలిగాడు.

తస్య యక్షపతిర్దేవః కుబేరస్త్విడవిడాసుతః
రావణః కుమ్భకర్ణశ్చ తథాన్యస్యాం విభీషణః

విశ్వవసునికి ఇడవిడ అనే భార్యతో కలిగిన పుత్రుడు కుబేరుడు, ఇంకో భార్యతో కలిగిన కుమారుడు రావణ కుంభకర్ణ విభీషణులు. అంటే అగస్త్యుడూ విశ్వవసుడూ అన్నదమ్ములు. రావణునికి పెదనాన్న అగస్త్యుడు. ఈ ముగ్గురూ ఒకే తల్లి పిల్లలు కారు. రావణ కుంభకర్ణులు ఒక తల్లి పిల్లలు. విభీషణుడి తల్లి వేరు. పద్మపురాణములో కూడా విభీషణుడు వేరే తల్లి వల్ల పుట్టినట్లు ఉంది. విశ్వ వసునికి అష్ట భార్యలు ఖరుడూ ధూషణుడూ శూర్పణఖ, నరాంతకుడు, నికుంభుడూ కూడా ఆయన సంతానమే.

పులహస్య గతిర్భార్యా త్రీనసూత సతీ సుతాన్
కర్మశ్రేష్ఠం వరీయాంసం సహిష్ణుం చ మహామతే

పులహుని భార్య గతికి ముగ్గురు కొడుకులు కర్మ శ్రేష్ట వరీయాన్ సహిష్ణులు.

క్రతోరపి క్రియా భార్యా వాలఖిల్యానసూయత
ఋషీన్షష్టిసహస్రాణి జ్వలతో బ్రహ్మతేజసా

కర్తువు యొక్క సంతానమే వాలఖిల్యులు. ఊర్ధ్వ రేతస్కులు. అరవై వేలమంది వాలఖిల్యులు బ్రహ్మ తేజస్సు గలవారు. అంగుష్టమాత్రం ఉంటారు వీరు. మహా తేజస్సు గలవారు.

ఊర్జాయాం జజ్ఞిరే పుత్రా వసిష్ఠస్య పరన్తప
చిత్రకేతుప్రధానాస్తే సప్త బ్రహ్మర్షయోऽమలాః

వశిష్ఠుని భార్య పేరు ఊర్జ (ఊర్జా అంటే వ్యవసాయం. అసలు నీటితో పని లేకుండా చాలా తక్కువ నీటితో పండే ధాన్యం పేరు ఊర్జ. అరుంధతీ అంటారు. ఆ పేరుకు అర్థం మానసిక బాధను తొలగించేది).  వీరికి ఏడుగురు పుట్టారు. అందరూ బ్రహ్మర్షులూ పరిశుద్ధులూ..

చిత్రకేతుః సురోచిశ్చ విరజా మిత్ర ఏవ చ
ఉల్బణో వసుభృద్యానో ద్యుమాన్శక్త్యాదయోऽపరే

వీరందరూ వశిష్టుని పుత్రులు. వీరిలో శక్తి కూడా ఒకరు. శక్తి కొడుకు పరాశరుడు.

చిత్తిస్త్వథర్వణః పత్నీ లేభే పుత్రం ధృతవ్రతమ్
దధ్యఞ్చమశ్వశిరసం భృగోర్వంశం నిబోధ మే

అధర్వణ యొక్క భార్య పేరు చిత్తి. ఇతని కుమారుడు దధీచి. ఈయన అశ్వనీ దేవతలకు నారాయణ కవచముపదేశించాడు

భృగుః ఖ్యాత్యాం మహాభాగః పత్న్యాం పుత్రానజీజనత్
ధాతారం చ విధాతారం శ్రియం చ భగవత్పరామ్

ఇక బృగు వంశం. బృగు భార్య ఖ్యాతి. ఈమెకు ధాతా విధాతా అని కుమారులు, భార్గవి అని కుమార్తె. ఈమె నిత్యానపాయిని స్వామికి

ఆయతిం నియతిం చైవ సుతే మేరుస్తయోరదాత్
తాభ్యాం తయోరభవతాం మృకణ్డః ప్రాణ ఏవ చ

ఆయతి నియతీ అని ఇద్దరు ధాతా విధాతలకు భార్యలు. వారి నుండి మృకణ్డుడూ ప్రాణుడూ అనే వారు ఏర్పడ్డాడు.

మార్కణ్డేయో మృకణ్డస్య ప్రాణాద్వేదశిరా మునిః
కవిశ్చ భార్గవో యస్య భగవానుశనా సుతః

మృకణ్డుడి కుమారుడు మార్కండేయ మహర్షి. ప్రాణుడి నుండి వేదశిరుడు పుట్టాడు. ఈ వేద శిరునికే ఉశనుడూ (శుక్రాచార్యుడు) కవి భార్గవుడు అనే పుత్రులు కలిగారు.

త ఏతే మునయః క్షత్తర్లోకాన్సర్గైరభావయన్
ఏష కర్దమదౌహిత్ర సన్తానః కథితస్తవ
శృణ్వతః శ్రద్దధానస్య సద్యః పాపహరః పరః

ఇది నవ ప్రజాపతులూ వారి సృష్టి. వీరంతా కర్దమ దౌహిత్రుల (పుత్రికల) సంతానం. ఇది విన్న వారి పాపాలను పోగొడుతుంది.

ప్రసూతిం మానవీం దక్ష ఉపయేమే హ్యజాత్మజః
తస్యాం ససర్జ దుహితౄః షోడశామలలోచనాః

ప్రసూత్యి యందు దక్షుడు పదహారు మంది అమ్మాయిలను కన్నాడు.

త్రయోదశాదాద్ధర్మాయ తథైకామగ్నయే విభుః
పితృభ్య ఏకాం యుక్తేభ్యో భవాయైకాం భవచ్ఛిదే

ఆ పదహారు మందిలో పదముగ్గురిని ధర్ముడనే ఇచ్చాడు. ధర్ముడికీ మూర్తికీ కలిగిన పుర్తులు నర నారాయణులు. స్వాహా అనే అమ్మాయిని అగ్నికీ, స్వధను పితృదేవతలకూ, సతిని శంకరునికీ ఇచ్చి పెళ్ళి చేసాడు. ఇలా పదహారుమందికీ వివాహం చేసాడు

శ్రద్ధా మైత్రీ దయా శాన్తిస్తుష్టిః పుష్టిః క్రియోన్నతిః
బుద్ధిర్మేధా తితిక్షా హ్రీర్మూర్తిర్ధర్మస్య పత్నయః

ధర్ముడికీ వీరందరూ భార్యలు

శ్రద్ధాసూత శుభం మైత్రీ ప్రసాదమభయం దయా
శాన్తిః సుఖం ముదం తుష్టిః స్మయం పుష్టిరసూయత

శ్రద్ధకు మైత్రీ, దయ అనే అమ్మాయి శంతినీ, తుష్టి వల్ల పుష్టి,
(శ్రద్ధ వల్ల శుభం, మైత్రి వలన ప్రసాదం, దయ వలన అభయం కలుగుతుంది)
(శాంతి వలన సుఖం, సంతోషం ముదాన్ని, బాగా సంతోషం వస్తే గర్వం)
యోగం క్రియోన్నతిర్దర్పమర్థం బుద్ధిరసూయత
మేధా స్మృతిం తితిక్షా తు క్షేమం హ్రీః ప్రశ్రయం సుతమ్

క్రియ యొక్క సంతానం ఉన్నతి, బుద్ధి మేధనూ, తితీక్ష వలన (క్షమ) వినయం

(క్రియ యోగాన్నీ, ఉన్నతి దర్పాన్ని, బుద్ధి వలన అర్థం, మేధస్సు స్మృతినీ, తితీక్ష క్షేమం, సిగ్గు వినయాన్ని కలిగిస్తుంది. )

మూర్తిః సర్వగుణోత్పత్తిర్నరనారాయణావృషీ

అన్ని గుణాలకు మూలమైన నరనారాయణులన్ మూర్తి పొందింది.

యయోర్జన్మన్యదో విశ్వమభ్యనన్దత్సునిర్వృతమ్
మనాంసి కకుభో వాతాః ప్రసేదుః సరితోऽద్రయః

వీరు కలగగానే ప్రపంచం అంతా పరమానందాన్ని పొంది ఆ ధర్మున్నీ మూర్తినీ అభినందించారు.
బ్రహ్మాండముగా వర్షం వచ్చిందీ, అందరి మనసులూ అన్ని దిక్కులూ వాయువూ నదులూ పర్వతాలు ప్రసన్నమయ్యాయి.  దివ్య వాద్యాలు మోగాయి. పుష్ప వర్షం కురిసింది. మునులందరూ సంతోషించారు
గంధర్వులూ కిన్నెరులూ గానమూ, అప్సరసలు నాట్యం చేసారు. ప్రపంచమంతా మంగళ కరముగా ఉంది. దేవతలందరూ స్తోత్రం చేసారు

దివ్యవాద్యన్త తూర్యాణి పేతుః కుసుమవృష్టయః
మునయస్తుష్టువుస్తుష్టా జగుర్గన్ధర్వకిన్నరాః

నృత్యన్తి స్మ స్త్రియో దేవ్య ఆసీత్పరమమఙ్గలమ్
దేవా బ్రహ్మాదయః సర్వే ఉపతస్థురభిష్టవైః

దేవా ఊచుః
యో మాయయా విరచితం నిజయాత్మనీదం
ఖే రూపభేదమివ తత్ప్రతిచక్షణాయ
ఏతేన ధర్మసదనే ఋషిమూర్తినాద్య
ప్రాదుశ్చకార పురుషాయ నమః పరస్మై

తన మాయచే సృష్టించబడిన ఈ జగత్తు తనలోనే సృష్టించబడింది, ఎలా అంటే ఆకాశములో రూపము లాగ (మబ్బులు ఆకాశములో ఉంటాయి, ఇంద్రధనస్సు కనిపిస్తుంది, అవి ఆకాశములో ఉన్నట్లా లేనట్లా? ఆకాశములో కనపడేదంతా భ్రమే. ఈ జగత్తంతా వస్తుందీ పోతుందీ)  మాకు నీ రూపము చూపటానికి, యోగముతో సకల చరాచర జగత్తు యొక్క వాస్తవ స్వరూపాన్ని బోధించడానికి వచ్చారు.  అటువంటి నీకు నమస్కారం. తపసా సాధ్యతే సర్వం అని చూపించటానికి వచ్చారు. తపము అంటే ఇంద్రియ నిగ్రహం.

సోऽయం స్థితివ్యతికరోపశమాయ సృష్టాన్
సత్త్వేన నః సురగణాననుమేయతత్త్వః
దృశ్యాదదభ్రకరుణేన విలోకనేన
యచ్ఛ్రీనికేతమమలం క్షిపతారవిన్దమ్

స్థితివ్యతికరోపశమాయ - స్థితికి వ్యతికరమైన నాశాన్ని తొలగించడానికి దేవతలను ఏర్పాటు చేసావు. వారిని రక్షించడానికి సత్వగుణాన్ని స్వీకరించి అవతరించావు. నీవు అవతరించిన తరువాత నీవు చేసిన పనిని బట్టి "నీవు ఫలాన పనికి అవతరించావు" అని తెలుసుకోవడం తప్ప, ముందుగా ఎవ్వరికీ తెలియదు
అంతులేని దయ ఉన్న చూపుతోటి, అమ్మవారు ఉండే వక్షస్థలం కల్వాడవు

ఏవం సురగణైస్తాత భగవన్తావభిష్టుతౌ
లబ్ధావలోకైర్యయతురర్చితౌ గన్ధమాదనమ్

ఇలా పరమాత్మ యొక్క కటాక్షము కోసం వచ్చిన దేవతలు స్తోత్రం చేసారు. కటాక్షాన్ని పొంది వెళ్ళిపోయారు. నరనారాయణులు  కూడా గంధమాధన పర్వతానికి వెళ్ళారు

తావిమౌ వై భగవతో హరేరంశావిహాగతౌ
భారవ్యయాయ చ భువః కృష్ణౌ యదుకురూద్వహౌ

ఆ నరనారాయణుల అంశే ఇప్పుడు భూభారాన్ని తగ్గించడానికి కృష్ణార్జునులుగా వచ్చారు. కృష్ణుడికీ అర్జనునికీ వ్యాసునికీ విదురునికీ ద్రౌపతికీ ఉద్ధవునికీ కృష్ణ అనే పేరు. ఇందులో చెప్పిన ఒక కృష్ణుడు యదు వంశము వాడూ, ఇంకో కృష్ణుడు కురువంశం వాడు

స్వాహాభిమానినశ్చాగ్నేరాత్మజాంస్త్రీనజీజనత్
పావకం పవమానం చ శుచిం చ హుతభోజనమ్

అగ్ని కూడా స్వాహా అనే భార్య చే ముగ్గురు కుమారులని కంది. పావకం పవమానం శుచిం వీరే ప్రేతాగ్నులూ అంటాము.

తేభ్యోऽగ్నయః సమభవన్చత్వారింశచ్చ పఞ్చ చ
త ఏవైకోనపఞ్చాశత్సాకం పితృపితామహైః

ఈ మువ్వురి నుండి నలభై ఐదు అగ్నులు పుట్టాయి. అందుకే ప్రతీ హోమములోనూ నలభై ఐదు ఆహుతిలివ్వాలి. 45 కంటే తగ్గితే దాన్ని హోమం అనడానికి వీలు లేదు. ఆ నలభై ఐదు, మూడు ప్రేతాగ్నులు, అసలు అగ్నీ కలిపి నలభి తొమ్మిది మంది. తండ్రులు ముగ్గురూ, వారి తండ్రి (తాతలు) ఒకరు. మొత్తం నలభై తొమ్మిది అగ్నులు.

వైతానికే కర్మణి యన్ నామభిర్బ్రహ్మవాదిభిః
ఆగ్నేయ్య ఇష్టయో యజ్ఞే నిరూప్యన్తేऽగ్నయస్తు తే

హోమకర్మలలో వేదం బాగా తెలిసినవారు, ఈ పేర్లతో అగ్నికి ఆహుతి ఇస్తారు.

అగ్నిష్వాత్తా బర్హిషదః సౌమ్యాః పితర ఆజ్యపాః
సాగ్నయోऽనగ్నయస్తేషాం పత్నీ దాక్షాయణీ స్వధా

వీళ్ళే కొన్ని అగ్నులు బహిర్షదులు, కొందరు సౌమ్య. కొందరు సాగ్నులూ, కొందరు అనగ్నులూ.

తేభ్యో దధార కన్యే ద్వే వయునాం ధారిణీం స్వధా
ఉభే తే బ్రహ్మవాదిన్యౌ జ్ఞానవిజ్ఞానపారగే

పితృదేవతలకు స్వధాను ఇచ్చారు. ఈ స్వధ వయునా అనీ, ధారిణీ అని ఇద్దరు అమ్మాయిలను ప్రసవిస్తే వీరు వివాహం వదిలి బ్రహ్మవాదినులయ్యారు (సన్యాసినులయ్యారు),పరమ జ్ఞ్యానులయ్యారు.

భవస్య పత్నీ తు సతీ భవం దేవమనువ్రతా
ఆత్మనః సదృశం పుత్రం న లేభే గుణశీలతః

సతీ దేవిని శంకరునికిచ్చి వివాహం చేసారు.సతీ దేవికి తాను అనుకున్న సంతానాన్ని పొందలేకపోయింది (పుత్రుడు కలిగే వరకూ ఉండలేదు)

పితర్యప్రతిరూపే స్వే భవాయానాగసే రుషా
అప్రౌఢైవాత్మనాత్మానమజహాద్యోగసంయుతా

సంతానం ఎందుకు పొందలేదంటే ఏ దోషమూ లేని శంకరుని విషయములో తన తండ్రి అనుచితముగా, చేయకూడని విధముగా ప్రవర్తిస్తే సామాన్య స్త్రీవలే యోగముతో అగ్నిని సృష్టించుకొని యోగాగ్నితో శరీరాన్ని విడిచిపెట్టింది.

No comments:

Post a Comment