Wednesday, February 27, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ఇత్థం పృథుమభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరమ్
పునరాహావనిర్భీతా సంస్తభ్యాత్మానమాత్మనా

ఇలా చెప్పి భూమి మళ్ళీ మాట్లాడుతోంది

సన్నియచ్ఛాభిభో మన్యుం నిబోధ శ్రావితం చ మే
సర్వతః సారమాదత్తే యథా మధుకరో బుధః

నీ కోపాన్ని కొంత శాంతింపచేయి. తెలియని వారికీ తెలిసిన వారికీ తేడా, జ్ఞ్యాని చేడులో కూడా మంచిని చూస్తాడు, చేడు వారిలో చెడును పోగొడతారు. ఉదాహరణకు తేనెటీగ ప్రతీ పూవు మీదా వాలి, మకరందాన్ని తీసుకుంటుంది గానీ పూవును పాడు చేయదు. చేడ్డ పూవూ మంచి పూవూ అని చూడకుండా అన్ని పుష్పాల మీదా వాలుతుంది. పండితుడు కూడా మంచిని మాత్రమే స్వీకరిస్తాడు. మీరు కూడా నాలో ఉన్న మంచినే స్వీకరించాలి

అస్మిన్లోకేऽథవాముష్మిన్మునిభిస్తత్త్వదర్శిభిః
దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయఃప్రసిద్ధయే
తానాతిష్ఠతి యః సమ్యగుపాయాన్పూర్వదర్శితాన్
అవరః శ్రద్ధయోపేత ఉపేయాన్విన్దతేऽఞ్జసా

లోకములో జీవులకు శ్రేయస్సు కలగడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో వాటిని ఋషులు దర్శించారు. శ్రేయస్సు కలగడానికి ఎన్నో మార్గాలను మునులు చూచారూ ప్రయోగించారు కూడా. ఇది మానవులకు శ్రేయస్సు కలగడానికి చేసారు. అలా ప్రయోగించి సఫలమయ్యారు. నీవు ఆ మార్గాన్ని అవలంబిస్తే చాలు.

తాననాదృత్య యోऽవిద్వానర్థానారభతే స్వయమ్
తస్య వ్యభిచరన్త్యర్థా ఆరబ్ధాశ్చ పునః పునః

పెద్దలు ఏర్పరచిన మార్గము కాక తెలివైన వారెవరైనా కొత్త మార్గాన్ని చూపడానికి ప్రయత్నిస్తే అనుకున్న ఫలితం రాక అప్రదిష్టపాలవుతారు. ఆలోచించగల తెలివి తప్ప ప్రయోగించగల ఓర్పుండదు వీఎరికి. ప్రజలబాగు కోసం మీ పూర్వీకులు ఏర్పరచిన మార్గాన్ని అవలంబించండి

పురా సృష్టా హ్యోషధయో బ్రహ్మణా యా విశామ్పతే
భుజ్యమానా మయా దృష్టా అసద్భిరధృతవ్రతైః

నేను పంటనివ్వలేదూ విత్తనాలని తీసుకుంటున్నానూ అని నా మీద కోప్పడుతున్నావు గానీ నీవే నాలో అనేక ఔషధులు నిక్షిప్తం చేసావు. ఎవరు ఉపయోగించడానికి నీవేర్పాటు చేసావో, వారికి కాక దుర్మార్గులకీ హింసాపరాయణులకి అందుతున్నాయి. వ్రతము లేని వారికి అందుతున్నాయి. భూమి మీద విత్తనం వేయటానికీ అన్నం తినటానికీ వ్రతం కావాలి. (పూర్వం విత్తనం వేయటానికి ఊరిబయటకు వెళ్ళీ భూమినీ నాగలినీ దేవతలనీ బ్రాహ్మణులనీ ఎద్దులనీ వరుణున్నీ పూజించి ప్రారంభించేవారు. పంట పండించడమే కాదు భోజనం చేయడం కూడా వ్రతం. బ్రతికేదీ పుట్టేదీ అన్నముతో. భోజనవ్రతం. కాళ్ళూ చేతులూ కడుకున్ని ఆచమనం చేసి హృదయములో స్వామిని ఆరాధించి, భోజనానికి అనుమతి తీసుకోవాలి, పాత్రను మూడు సార్లు ప్రోక్షించాలి, పదహారు సార్లు ఆచమనం చేయాలి భోజనం చేసే ముందు, చేసిన తరువాత ఇరవై నాలుగు సార్లు ఆచమనం చేయాలి, దాని వలన చిగుళ్ళమధ్య ఇరుక్కున్నవి పోతాయి, చేతిని పదహారు సార్లు కడుక్కోవాలి. కోపముతోనూ ఏడుస్తూ అరుస్తూ కలహిస్తూ నిందిస్తూ కాళ్ళూ చేతులూ ఒళ్ళూ ఊపుతూ, సంగీతం వింటూ భోజనం చేయకూడదు. ఆచమనం చేసి తినడం వలన అన్న నాళములో ఏమీ అడ్డురాకుండా ఉంటుంది. అన్నము సరిగ్గా లోపలకి వెళుతుంది . పొరమారకుండా ఉంటుంది. )
ఇలా వ్రతము లేకుండా తినేవారికి నేనేందుకు ఇవ్వాలి. దుర్మార్గులు భుజిస్తున్నారు. మంచి వారిగా చెప్పుకునే వారు వ్రతము లేకుండా భుజిస్తున్నారు. ధాన్యం పండిచే ముందూ, అన్నం తినే ముందూ వ్రతము లేదు. అలాంటి దుర్మార్గులు అనుభవిస్తుంటే నేను వెనక్కు లాక్కున్నాను.

అపాలితానాదృతా చ భవద్భిర్లోకపాలకైః
చోరీభూతేऽథ లోకేऽహం యజ్ఞార్థేऽగ్రసమోషధీః

భూలోకములో ఇంత దారుణం జరుగుతూ ఉంటే, నన్ను నిరాదరణ చేస్తుంటే ఈ లోకపాలకులంతా ఏమి చేస్తున్నారు? ఇలా దురుపయోగం చేసే వారికి సహకరిస్తే తరువాత తరువాత ఎవరిన భక్తులకు సదుపయోగం చేయడానికి ఏదీ ఉండదు. ఆకలి ఉన్నా లేకున్నా "తినడం నా హక్కు" అని తినడం మొదలుపెడితే నిజముగా ఆకలైనపుడు తినడానికేమీ ఉండదు.
నేను వాళ్ళ చేతా నీ చేతా ఉపేక్షించబడ్డాను. లోకములో వారంతా దొంగలయ్యారు. తరువాత మంచి వారు వచ్చి యజ్ఞ్యం చేస్తే ఉండాలని దాచిపెట్టాను.

నూనం తా వీరుధః క్షీణా మయి కాలేన భూయసా
తత్ర యోగేన దృష్టేన భవానాదాతుమర్హతి

కానీ అది కూడా ప్రమాదమే. ఒక వస్తువును చాలా కాలం దాచిపెడితే మళ్ళీ ఆ వస్తువు దాచిపెట్టిన వాడికి కూడా (ఆ రూపములో) దొరకదు. తరువాత తీసుకోదలచిన వాడు దానిని సారవంతం చేసి మరీ తీసుకోవాలి. నా విత్తనములన్నీ క్షీణించి పోయాయి, నిర్వీర్యములైపోయాయి. ఇపుడు వాటిని వీర్యవంతములు చేయాలంటే నీ యోగముతో నీవే చేయాలి.

వత్సం కల్పయ మే వీర యేనాహం వత్సలా తవ
ధోక్ష్యే క్షీరమయాన్కామాననురూపం చ దోహనమ్

నేనెట్లాగూ గోరూపములో ఉన్నాను కాబట్టి నా నుండి ఔషధులు కావాలంటే నేను పాల రూపములో ఇస్తాను. దానికి ఒక దూడ కావాలి. పాల రూపములో అన్ని కోరికలనూ స్రవింపచేస్తానూ. దానికి దూడా కావాలీ, యోగ్యుడైన పాలు పితికేవాడూ కావాలి.

దోగ్ధారం చ మహాబాహో భూతానాం భూతభావన
అన్నమీప్సితమూర్జస్వద్భగవాన్వాఞ్ఛతే యది

ఆయా ప్రాణులలో ఉత్తమైన పాలు పితికేవాడిని ఏర్పాటు చేయి. ఇష్టమున్నా, తేజోవంతమైన అన్నాన్ని కోరాలి. భోజనం చేస్తే ఓజః సహః బలం రావాలి. అలాంటి శక్తి గల అన్నాన్ని ఇస్తాను

సమాం చ కురు మాం రాజన్దేవవృష్టం యథా పయః
అపర్తావపి భద్రం తే ఉపావర్తేత మే విభో

ఎత్తువంపులుగా ఉన్న నన్ను సమానము చేయి. కురిసిన నీరు అన్ని ప్రాంతాలలోకీ సమానముగా వెళుతుంది. ఇంకిన తరువాత కొంత నీరు నిలువ ఉండేట్లు చేయి. వర్షాకలం కాని సమయములో కూడా భూమి మీద నీరు నిలువ ఉండేలా చేయి. భగవంతుని చేత వర్షించిన నీరు వర్షాకాలం కాని సమయములో కూడా మీకందరికీ అందాలి

ఇతి ప్రియం హితం వాక్యం భువ ఆదాయ భూపతిః
వత్సం కృత్వా మనుం పాణావదుహత్సకలౌషధీః

ఈ రీతిగా భూమి ప్రియమునూ హితమునూ (నచ్చేమాటనూ మంచిమాటనూ) చెప్పింది. మనువును దూడగా చేసుకుని మానవులకు కావలసిన సకల ఔషధులనూ మనువు స్వీకరించాడు

తథాపరే చ సర్వత్ర సారమాదదతే బుధాః
తతోऽన్యే చ యథాకామం దుదుహుః పృథుభావితామ్

ఎవరెవరికి ఏమేమి కావాలో వారి వారిలో ముఖ్యులని దూడగా చేసుకొని వారికి కావల్సిన వాటిని స్వీకరించారు. ఇలా పృధు చక్రవర్తి చేత ప్రసన్నము చేసుకోబడిన గోవు ఎవరెవరికి ఏమేమి కావాలో ఇచ్చింది

ఋషయో దుదుహుర్దేవీమిన్ద్రియేష్వథ సత్తమ
వత్సం బృహస్పతిం కృత్వా పయశ్ఛన్దోమయం శుచి

ఋషులు, ఇంద్రియ నిగ్రహము గల బృహస్పతిని దూడగా చేసుకుని తమకు కావలసిన చందోమయమైన పాలను తీసుకున్నారు

కృత్వా వత్సం సురగణా ఇన్ద్రం సోమమదూదుహన్
హిరణ్మయేన పాత్రేణ వీర్యమోజో బలం పయః

దేవతలు కూడా ఇంద్రున్ని దూడగా చేసుకుని సోమరసాన్ని స్వీకరించారు, బంగారు పాత్రతో వీర్యమూ ఓజస్సునూ బలమునూ పాలుగా తీసుకున్నారు

దైతేయా దానవా వత్సం ప్రహ్లాదమసురర్షభమ్
విధాయాదూదుహన్క్షీరమయఃపాత్రే సురాసవమ్

రాక్షసులూ దైత్యులూ దానవులూ ప్రహ్లాదున్ని దూడగా చేసుకుని ఇనుము పాత్రలో సురను తీసుకున్నారు

గన్ధర్వాప్సరసోऽధుక్షన్పాత్రే పద్మమయే పయః
వత్సం విశ్వావసుం కృత్వా గాన్ధర్వం మధు సౌభగమ్

గంధర్వాదులు పద్మమయమైన పాత్రలో విశ్వావసున్ని దూడగా చేసుకుని సంగీతాన్ని పాలుగా స్వీకరించారు.

వత్సేన పితరోऽర్యమ్ణా కవ్యం క్షీరమధుక్షత
ఆమపాత్రే మహాభాగాః శ్రద్ధయా శ్రాద్ధదేవతాః

పితృదేవతలు అర్య్మున్ని దూడగా చేసుకుని కవ్యాన్ని (శ్రాద్ధ భోజనం) పాలుగా స్వీకరించారు. వీరిని శ్రాద్ధ దేవతలూ అని పేరు.

ప్రకల్ప్య వత్సం కపిలం సిద్ధాః సఙ్కల్పనామయీమ్
సిద్ధిం నభసి విద్యాం చ యే చ విద్యాధరాదయః

సిద్ధులు కపిలున్ని దూడగా చేసుకుని సిద్ధిని పాలగా తీసుకున్నారు. విద్యాధరులు తమ అధిపతిని దూడగా చేసుకుని విద్యను స్వీకరించారు

అన్యే చ మాయినో మాయామన్తర్ధానాద్భుతాత్మనామ్
మయం ప్రకల్ప్య వత్సం తే దుదుహుర్ధారణామయీమ్

మాయావులు అంతర్ధాన సిద్ధిని బోధించే మాయను మయున్ని దూడగా చేసుకుని ఆ పాలు స్వీకరించారు.

యక్షరక్షాంసి భూతాని పిశాచాః పిశితాశనాః
భూతేశవత్సా దుదుహుః కపాలే క్షతజాసవమ్

యక్షులూ రాక్షసులూ భూత ప్రేత పిశాచాలు తమ అధిపతిని దూడగా  చేసుకుని వారికి కావల్సినవి స్వీకరించారు

తథాహయో దన్దశూకాః సర్పా నాగాశ్చ తక్షకమ్
విధాయ వత్సం దుదుహుర్బిలపాత్రే విషం పయః

అన్ని రకాల పాములూ (తోకతో కొట్టే పాములూ,, కరిచే పాములూ - దన్దశూకాః , మింగే పాములూ చుట్టే పాములూ - అహయః, కాటేసేవి - నాగాః, పాకేవి - సర్పాః) తక్షకున్ని దూడగా చేసుకుని విషాన్ని స్వీకరించారు. అంటే అమృతాన్ని ఇచ్చే భూమే విషాన్నిస్తుంది.

పశవో యవసం క్షీరం వత్సం కృత్వా చ గోవృషమ్
అరణ్యపాత్రే చాధుక్షన్మృగేన్ద్రేణ చ దంష్ట్రిణః

పశువులు వృషబాన్ని దూడగా చేసుకుని గడ్డిని తీసుకున్నాయి, సింహాన్ని దూడగా చేసుకుని అరణ్యమనే పాత్రలో

క్రవ్యాదాః ప్రాణినః క్రవ్యం దుదుహుః స్వే కలేవరే
సుపర్ణవత్సా విహగాశ్చరం చాచరమేవ చ

మృగాలన్నీ తమకు కావలసిన ఆహారాన్ని తీసుకున్నారు.

వటవత్సా వనస్పతయః పృథగ్రసమయం పయః
గిరయో హిమవద్వత్సా నానాధాతూన్స్వసానుషు

మర్రి చెట్టును దూడగా చేసుకుని వనస్పతులన్నీ రసమును పాలుగా స్వీకరించాయి. పర్వతాలన్నీ హిమవంతున్ని దూడగా చేసుకుని గైరికాధి ధాతువులని తీసుకున్నాయి.

సర్వే స్వముఖ్యవత్సేన స్వే స్వే పాత్రే పృథక్పయః
సర్వకామదుఘాం పృథ్వీం దుదుహుః పృథుభావితామ్

అందరూ తమలో ఎవరు ముఖ్యమో వారిని దూడగ చేసుకుని ఆ పాలను వారు తీసుకున్నారు. పృధు చక్రవర్తి చేత ప్రసన్నం చేసుకోబడిన భూమినుండి తమకు కావలసిన దాన్ని అన్ని ప్రాణులూ తీసుకున్నారు

ఏవం పృథ్వాదయః పృథ్వీమన్నాదాః స్వన్నమాత్మనః
దోహవత్సాదిభేదేన క్షీరభేదం కురూద్వహ

తినబడేదంతా అన్నమే.  తమ తమకు కావలసిన అన్నమును వారు స్వీకరించారు. పితికేవారు వేరు దూడ వేరు, దూడ మారితే పాలు మారుతున్నాయి. పితికేవారి భేధముతో దూడ భేధముతో పాలలో భేదమేర్పడింది

తతో మహీపతిః ప్రీతః సర్వకామదుఘాం పృథుః
దుహితృత్వే చకారేమాం ప్రేమ్ణా దుహితృవత్సలః

ఎవరికి కావలసినవి వారికిచ్చినందుకు పృధు చక్రవర్తికి భూమి మీద ప్రేమ కలిగింది. ఈ నాటి నుండి నిన్ను నా పుత్రికగా స్వీకరిస్తున్నాను. ఆ నాటినుండీ భూమి పృధ్వి అయ్యింది

చూర్ణయన్స్వధనుష్కోట్యా గిరికూటాని రాజరాట్
భూమణ్డలమిదం వైన్యః ప్రాయశ్చక్రే సమం విభుః

తన ధనువు యొక్క కొనతో అడ్డుగా ఉన్న పర్వతాలనూ పర్వత సమూహాలనూ చూర్ణం చేసాడు. భూమిని సమం చేసాడు

అథాస్మిన్భగవాన్వైన్యః ప్రజానాం వృత్తిదః పితా
నివాసాన్కల్పయాం చక్రే తత్ర తత్ర యథార్హతః

గ్రామాన్పురః పత్తనాని దుర్గాణి వివిధాని చ
ఘోషాన్వ్రజాన్సశిబిరానాకరాన్ఖేటఖర్వటాన్

గ్రామములూ పట్టణాలు దుర్గాలు పల్లెలూ ఏర్పాటు చేసాడు. పొలములూ వ్యవసాయ క్షేత్రములూ దున్నేవారూ కోసేవారూ

ప్రాక్పృథోరిహ నైవైషా పురగ్రామాదికల్పనా
యథాసుఖం వసన్తి స్మ తత్ర తత్రాకుతోభయాః

పృధు చక్రవర్తి కంటే ముందు ఈ వ్యవస్థ లేదు. వేరే భయమేదీ లేదు కాబట్టి ఎవరికెక్కడ నచ్చితే అక్కడ ఉండేవారు అక్కడి వనరులు ఉన్నదాకా

No comments:

Post a Comment