Wednesday, February 27, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదహేడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదహేడవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ఏవం స భగవాన్వైన్యః ఖ్యాపితో గుణకర్మభిః
ఛన్దయామాస తాన్కామైః ప్రతిపూజ్యాభినన్ద్య చ

ఈ రీతిలో వేన పుత్రుడైన పృధు చక్రవర్తి చేయబోయె పనులేమిటో వంది మాగధులు స్తోత్రం చేసారు.

బ్రాహ్మణప్రముఖాన్వర్ణాన్భృత్యామాత్యపురోధసః
పౌరాన్జానపదాన్శ్రేణీః ప్రకృతీః సమపూజయత్

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా, మంత్రులూ (రాజ్య ప్రాంతములో నగరాలకు అధినాయకులు) ఆమాత్యులూ (రాజు తరువాతి వారు) సచివులూ (రాజు తరువాత నాలగవ వారు) ఈ విధముగా విభజించాడు.
పురవాసులూ జనపదవాసులూ పల్లెటూరిలో ఉండేవారు (శ్రేణీ) ప్రజలూ అందరినీ ఆదరించాడు
(శ్రేణులంటే ఉండటానికి లేక ఒక చోట గుడారాలలో ఉండేవారు. రాజు కూడా సైన్యములో కొంత మందిని శ్రేణుల్లా పంపుతారు. దాని వలన ప్రజలకు వాస్తవముగా ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి)

విదుర ఉవాచ
కస్మాద్దధార గోరూపం ధరిత్రీ బహురూపిణీ
యాం దుదోహ పృథుస్తత్ర కో వత్సో దోహనం చ కిమ్

మరి భూమి గోరూపం ధరిస్తే ఈయన పాలు పితికాడన్నారు. భూమి గోరూపం ఎందుకు ధరించింది. పాలు పితకాలంటే దూడ కావాలి కదా? ఆ దూడ ఎవరు? ఆ వచ్చిన పాలు ఏమిటి? ఒకే దూడతో అన్ని పాలు పిండారా? లేక వేరు వేరుగా ఉన్న దూడలు వచ్చాయా?

ప్రకృత్యా విషమా దేవీ కృతా తేన సమా కథమ్
తస్య మేధ్యం హయం దేవః కస్య హేతోరపాహరత్

పృధు చక్రవర్తి అశ్వమేధము చేస్తే అశ్వాన్నెందుకు ఇంద్రుడు అపహరించాడు

సనత్కుమారాద్భగవతో బ్రహ్మన్బ్రహ్మవిదుత్తమాత్
లబ్ధ్వా జ్ఞానం సవిజ్ఞానం రాజర్షిః కాం గతిం గతః

సనత్కుమారుని వలన జ్ఞ్యానం పొందిన ఈయన ఏ లోకాలకు వెళ్ళాడు

యచ్చాన్యదపి కృష్ణస్య భవాన్భగవతః ప్రభోః
శ్రవః సుశ్రవసః పుణ్యం పూర్వదేహకథాశ్రయమ్

నేను అడిగినవే కాకుండా అడగనివాటిని కూడా పరమ పవిత్రమైన స్వామి యొక్క కథను

భక్తాయ మేऽనురక్తాయ తవ చాధోక్షజస్య చ
వక్తుమర్హసి యోऽదుహ్యద్వైన్యరూపేణ గామిమామ్

నీకూ స్వామికీ ఇద్దరికీ భక్తుడనైనా, అనురక్తుడనైన నాకు చెప్పవలసింది. పృధు చక్రవర్తి ఆవునుండి అన్ని ఔషధులనూ తీసుకున్న చరిత్ర చెప్పవలసినది.

సూత ఉవాచ
చోదితో విదురేణైవం వాసుదేవకథాం ప్రతి
ప్రశస్య తం ప్రీతమనా మైత్రేయః ప్రత్యభాషత

కృష్ణ కథను బాగా అడిగావు. అని ప్రీతితో ఇలా అన్నాడు

మైత్రేయ ఉవాచ
యదాభిషిక్తః పృథురఙ్గ విప్రైరామన్త్రితో జనతాయాశ్చ పాలః
ప్రజా నిరన్నే క్షితిపృష్ఠ ఏత్య క్షుత్క్షామదేహాః పతిమభ్యవోచన్

బ్రాహ్మణులందరూ ఈయనని ప్రజాపాలకునిగా అభిషేకం చేసారు . ఆకలితో బక్క చిక్కిన దేహముతో ఉన్న ప్రజలు పరిగెత్తుకోచ్చారు ఈ విషయం తెలిసి.

వయం రాజఞ్జాఠరేణాభితప్తా యథాగ్నినా కోటరస్థేన వృక్షాః
త్వామద్య యాతాః శరణం శరణ్యం యః సాధితో వృత్తికరః పతిర్నః

మహారాజా, మేము జఠరాగ్నితో బాధపడుతున్నాము, తొర్రలో ఉన్న అగ్నితో చెట్టు బాధపడినట్లు. ఇలా ఆకలితో అలమటిస్తున్న మేము రక్షణ కోసం నిన్ను శరణు వేడాము. బ్రతుకు తెరువును నీవే చూపాలి.

తన్నో భవానీహతు రాతవేऽన్నం క్షుధార్దితానాం నరదేవదేవ
యావన్న నఙ్క్ష్యామహ ఉజ్ఝితోర్జా వార్తాపతిస్త్వం కిల లోకపాలః

అడుగుతున్న మా అందరికీ మీరు అన్నాన్ని పెట్టండి. ఉన్న బలం మొత్తం తొలగిపోయి మేము ప్రాణాలు విడువక ముందే భుక్తిని ఏర్పాటు చేయి

మైత్రేయ ఉవాచ
పృథుః ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితమ్
దీర్ఘం దధ్యౌ కురుశ్రేష్ఠ నిమిత్తం సోऽన్వపద్యత

ఇలా దయతో వారడిగిన మాట విని, ఎందుకిలా జరిగిందీ అని ఆలోచించి, కారణాన్ని అర్థం చేసుకున్నాడు

ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీతశరాసనః
సన్దధే విశిఖం భూమేః క్రుద్ధస్త్రిపురహా యథా

భూమి పంటనివ్వటం లేదు అని తెలుసుకున్నాడు. వేసిన ధాన్యం తీసుకుంటోంది గానీ పంట ఇవ్వట్లేదు. కోపించిన త్రిపురాంతకునిలా ధనస్సుని ధరించి వెంటపడ్డాడు.

ప్రవేపమానా ధరణీ నిశామ్యోదాయుధం చ తమ్
గౌః సత్యపాద్రవద్భీతా మృగీవ మృగయుద్రుతా

ఇలా తన మీదకు వస్తున్నాడని గ్రహించి వేటగాడు వెంటబడితే లేడి పారిపోతున్నట్లుగా భూమి గోరూపం ధరించి పారిపోయింది.

తామన్వధావత్తద్వైన్యః కుపితోऽత్యరుణేక్షణః
శరం ధనుషి సన్ధాయ యత్ర యత్ర పలాయతే

ఎర్రబడిన కనులతో పృధు మహారాజు బాణం ఎక్కుపెట్టి వెంటబడ్డాడు

సా దిశో విదిశో దేవీ రోదసీ చాన్తరం తయోః
ధావన్తీ తత్ర తత్రైనం దదర్శానూద్యతాయుధమ్

భూ భువర్ సువర్లోకములూ అన్ని దిక్కులూ పరిగెట్టింది

లోకే నావిన్దత త్రాణం వైన్యాన్మృత్యోరివ ప్రజాః
త్రస్తా తదా నివవృతే హృదయేన విదూయతా

ఎక్కడికి పరిగెత్తినా తన కంటే ముందే బాణం ఎక్కుపెట్టి ఉన్నాడు. ఎలా ఐతే ప్రజలు మృత్యువును తప్పించుకోలేరో తాను పృధు చక్రవర్తిని తప్పించుకోలేకపోఇంది. భయపడుతూ ఉంది. పరిగెత్తడం మానేసింది. అక్కడే నిలబడి...

ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞాపన్నవత్సల
త్రాహి మామపి భూతానాం పాలనేऽవస్థితో భవాన్

రక్షించవలసిన వాడు శిక్షించడానికి వస్తే అతని నుండి ఎక్కడికి పారిపోగలదు. ఈ విషయం తెలుసుకుని ఇలా అంది " నీకు అన్ని ధర్మములూ తెలుసు, ఆపదలు పొందినవారంటే ఎక్కువ జాలి చూపుతావు. సకల ప్రాణులనూ కాపాడతానని పట్టాభిషేకం చేసుకున్నావు"

స త్వం జిఘాంససే కస్మాద్దీనామకృతకిల్బిషామ్
అహనిష్యత్కథం యోషాం ధర్మజ్ఞ ఇతి యో మతః

నీ పరిపాలనలో ఉన్న అందరిలాగ కాపాడవలసిన దీనురాలైన ఏ తప్పు చేయని నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు. లోకములో ధర్మజ్ఞ్యుడని పేరు పొందిన నీవు స్త్రీని చంపుతావా

ప్రహరన్తి న వై స్త్రీషు కృతాగఃస్వపి జన్తవః
కిముత త్వద్విధా రాజన్కరుణా దీనవత్సలాః

ఒక వేళ తప్పు చేసినా, ధర్మం తెలిసిన వారు స్త్రీని చంపరు. సామాన్యులే తప్పు చేసినా స్త్రీలను చంపకుండా వదిలిపెడతారే నీవంటి దీన వత్సలుర గురించి వేరే చెప్పాలా.

మాం విపాట్యాజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితమ్
ఆత్మానం చ ప్రజాశ్చేమాః కథమమ్భసి ధాస్యసి

కోపముతో ఆవేశములో ఏమి చేస్తున్నావో అర్థం కావట్లేదా? నీ యోగ బలముతో నన్ను చంపితే, నీ ప్రజలూ నీవూ ఎక్కడ ఉంటారు? ఆధారం లేని వారిని నీవేమి చేస్తావు? భూమి అంటే పడవ. దాని మీదే ప్రపంచమంతా ఉంది. మరి నన్ను చంపి, నీటిలో ఉన్న వీరిని ఎలా వీరందరినీ కాపాడతావు.

పృథురువాచ
వసుధే త్వాం వధిష్యామి మచ్ఛాసనపరాఙ్ముఖీమ్
భాగం బర్హిషి యా వృఙ్క్తే న తనోతి చ నో వసు

నా ఆజ్ఞ్యను దిక్కరించావు. అదే నీవు చేసిన తప్పు. నీవు ప్రజల నుండి నీకు రావల్సిన భాగమును తీసుకుని ఊరుకుంటున్నావు. నీకు భాగమిచ్చిన వారికి నీవు భాగమిస్తున్నావా?

యవసం జగ్ధ్యనుదినం నైవ దోగ్ధ్యౌధసం పయః
తస్యామేవం హి దుష్టాయాం దణ్డో నాత్ర న శస్యతే

రోజు గడ్డైతే బాగా తింటున్నావు కానీ దూడలకి పాలివ్వటం లేదు. ఎదుటి వారి దగ్గర తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియకపోవడం తప్పు. అందుకే ఇలాంటి దుర్మార్గులను దండిస్తే అది నింద్యమైన పని కాదు.

త్వం ఖల్వోషధిబీజాని ప్రాక్సృష్టాని స్వయమ్భువా
న ముఞ్చస్యాత్మరుద్ధాని మామవజ్ఞాయ మన్దధీః

నీవు స్వయముగా పళ్ళను పండిస్తున్నావా లేదా ఇంకొకరు వేస్తే పండిస్తున్నావా. బ్రహ్మ మొదట నీయందు అన్ని ఔషధులనూ నాటాడు. వాటిని బయట్కి తేవాలి. బ్రహ్మ నీకిచ్చిన అన్ని ఔషధులనూ ప్రజలకివ్వాలి. మంద బుద్ధి గల నీవు అది నీవివ్వడం లేదు. ఇపుడు నేను రాజును.

అమూషాం క్షుత్పరీతానామార్తానాం పరిదేవితమ్
శమయిష్యామి మద్బాణైర్భిన్నాయాస్తవ మేదసా

ఆకలీ దప్పులల్తో అలమటిస్తున్న ఆర్తులైన వీరి రోదనలు విని నా బాణాలతో నిన్ను చేధించి నీ మేదస్సుతో (కొవ్వుతో) నా ప్రజలందరికీ ఆకలి తీరుస్తాను

పుమాన్యోషిదుత క్లీబ ఆత్మసమ్భావనోऽధమః
భూతేషు నిరనుక్రోశో నృపాణాం తద్వధోऽవధః

నీకు ఆడవారిని చంపకూడదని తెలుసుగానీ, నీవెలా ఉండాలో తెలియదా. స్త్రీ పురుష నపుంసకులని ఎవరి గురించి వారు చెప్పుకునే వారు అధములు. తోటి ప్రాణుల మీద జాలి లేకుండా ఉన్న వారిని చంపుట తప్పు కాదు.

త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశః శరైః
ఆత్మయోగబలేనేమా ధారయిష్యామ్యహం ప్రజాః

నీవు స్తబ్ధముగా ఉన్నావు (ఇంత మంది విత్తనాలు వేస్తున్నా స్పందన లేదు), ఇలా మాయతో ఉన్న నిన్ను బాణముతో చంపుతాను. నీవు లేకపోయినా ఈ ప్రజలు ఉంటారు. ఈ ప్రజలందరినీ నేను భరిస్తాను. నిన్ను మోస్తున్నది కూడా నేనే. అది నా యోగ ప్రభావం.

ఏవం మన్యుమయీం మూర్తిం కృతాన్తమివ బిభ్రతమ్
ప్రణతా ప్రాఞ్జలిః ప్రాహ మహీ సఞ్జాతవేపథుః

కోపమే ఆధారమా అన్నట్లు ఉన్న మూర్తిని, యముడిలా ఉన్న స్వామిని చూచి, వంగి చేతులు జోడించినదై ఒళ్ళంతా వెతుకూ మాట్లాడుతోంది

ధరోవాచ
నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానాతనవే గుణాత్మనే
నమః స్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్యక్రియాకారకవిభ్రమోర్మయే

పరమ పురుషునికి నమస్కారము. యోగమాయతో అనేకమైన శరీరములను ధరించే మహానుభావుడా, వాత్సల్యాది గుణములు కలవాడా, నీ ప్రభావముతోటే ద్రవ్య క్రియ కర్మ (ఉపకరణం ద్రవ్యమూ కర్త, కర్త యొక్క క్రియా కావాలి. వీటిలో ఏమి లేకున్నా పని కాదు ) జరుగుతాయి. నీవే ఇచ్చేవాడివి.  ఇదంతా ఒక నాటకం, విభ్రమం. అలాంటి నీకు నమస్కారము.

యేనాహమాత్మాయతనం వినిర్మితా ధాత్రా యతోऽయం గుణసర్గసఙ్గ్రహః
స ఏవ మాం హన్తుముదాయుధః స్వరాడుపస్థితోऽన్యం శరణం కమాశ్రయే

నన్ను బ్రహ్మ సృష్టించాడు, అన్ని గుణముల సృష్టి ఇక్కడినుంచి కలగాలని. ఇక్కడే ఉన్న వారు ఇక్కడే అన్నీ తీసుకుని బ్రతుకుతున్నారు. మరి నా బ్రతుకుకు ఆధారమేది? బ్రహ్మతో సకల జీవులకూ ఆధారముగా నిర్మించబడ్డాను. ఎవరు సృష్టించారో ఆ పరమాత్మే ధనుర్బాణాలతో ముందుకొచ్చాడు. ఇంకెవరిని శరణు వేడాలి? నాకు ఇంకో రక్షకుడు లేడు (అనన్య శరణత్వము)

య ఏతదాదావసృజచ్చరాచరం స్వమాయయాత్మాశ్రయయావితర్క్యయా
తయైవ సోऽయం కిల గోప్తుముద్యతః కథం ను మాం ధర్మపరో జిఘాంసతి

ఇతరులెవ్వరూ ఊహించరాని రీతిలో ఈ ప్రపంచాన్ని సృష్టించావు. ఇంత కాలమూ సృష్టించిన నీవే సంహరించాలనుకుంటున్నావు. నీవు సంకల్పించిన పనిని ఎవరు వారించగలరు. నీవేమనుకుంటున్నావో ఎవరికి తెలుసు. నీకంటే వేరుగా నన్ను కాపాడే వారు ఉన్నారా?

నూనం బతేశస్య సమీహితం జనైస్తన్మాయయా దుర్జయయాకృతాత్మభిః
న లక్ష్యతే యస్త్వకరోదకారయద్యోऽనేక ఏకః పరతశ్చ ఈశ్వరః

ఎవరు చేస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో, ఎవరు చాలారూపాలలో ఉండి, ఏకరూపములో కూడా ఉన్నారో, అవతల వైకుంఠములో ఏ మహానుభావుడిగా వేంచేసి ఉంటాడో, నీ చేత నీవే స్వయముగా ఏర్పరచుకున్న జగత్తు (ఇంద్రియాలు మనసు మొదలైన వాటితో ఉన్న జగత్తు)

సర్గాది యోऽస్యానురుణద్ధి శక్తిభిర్ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిః
తస్మై సమున్నద్ధనిరుద్ధశక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే
స వై భవానాత్మవినిర్మితం జగద్భూతేన్ద్రియాన్తఃకరణాత్మకం విభో
సంస్థాపయిష్యన్నజ మాం రసాతలాదభ్యుజ్జహారామ్భస ఆదిసూకరః
అపాముపస్థే మయి నావ్యవస్థితాః ప్రజా భవానద్య రిరక్షిషుః కిల
స వీరమూర్తిః సమభూద్ధరాధరో యో మాం పయస్యుగ్రశరో జిఘాంససి

తాను సృష్టించినదానికాధారం కావలని బ్రహ్మ నన్ను తీసుకొచ్చాడు. ఆది వరాహముగా నన్ను సముద్రపడుగు నుండి బయటకు తెచ్చింది ఎవరు? ఇపుడు చంపుతా అన్నది ఎవరు? అంతా నీరే ఉన్నప్పుడు ప్రళయకాలములో ఒక నావను ఏర్పరచావు, అందులో ప్రజాపతులని కూర్చావు.
ఈనాడు ఆ మహానుభావుడే తీస్ఖణమైన బాణములతో సంహరించబోతున్నాడు

నూనం జనైరీహితమీశ్వరాణామస్మద్విధైస్తద్గుణసర్గమాయయా
న జ్ఞాయతే మోహితచిత్తవర్త్మభిస్తేభ్యో నమో వీరయశస్కరేభ్యః

రాజైన వాడు తప్పు చేసిన వారిని శిక్షించాలి. కానీ ప్రజలకు బాగా ఉపకరించేవారిని శిక్షిస్తే ఏమొస్తుంది? ప్రజలకు ఏమేమి కావాలో మాతో చెప్పి, ఎక్కడ లోపముందో అడిగి చేయించుకోవాలి. చేయగలవారు పని చేయనపుడు దండించుట కాదు, ప్రభువైన వాడు వారితో ఆ పని చేయించుకోవాలి.
మనసు బుద్ధీ అంతా మోహించబడి, నీవాచరించే మాయా సృష్టి ఎవరికి తెలుస్తుందోవారికి నమస్కారం.

No comments:

Post a Comment