Sunday, February 10, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ముప్పయ్యొకటవ అధ్యాయం - కపిల దేవహూతి సంవాదం - గర్భస్థ శిశు అవస్థ

                                              ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ముప్పయ్యొకటవ అధ్యాయం - కపిల దేవహూతి సంవాదం - గర్భస్థ శిశు అవస్థ

పుణ్యకర్మలచే మనుషులు ఉత్తమ జన్మలు పొందుతారు. పాపము చేసిన వారు దుష్టయోనులలో పుడతారు. భూమి మీదకు వచ్చేవారు మంచి కర్మలు చేస్తే మంచి జాతిలో పుడతారు. ఇక్కడ ఆచరించిన కర్మలన్నీ పూర్తిగా స్వర్గ నరకాలలో అనుభవిస్తే మళ్ళీ పుట్టే అవకాశం ఉందా? వారాచరించిన పనులలో మంచి కర్మలు మిగిలి ఉంటే మంచి జాతిలో, చెడ్డ కర్మలు మిగిలి ఉంటే చెడ్డ జాతిలో. మరి మిగిలి ఎందుకు ఉంటాయి. రాకపోకల గురించి. మిగిలిన పుణ్య శేషముతో గానీ పాప శేషముతో గానీ వస్తాడు.
అందుకే ఈ కింది మొదటి శ్లోకం కర్మణా అని మొదలవుతుంది. సృష్టి చేసేది దైవమే. అలా సృష్టించబడడానికి దైవం కారణం. మన కర్మ మన నోటితో "నేను చేస్తున్నాను" "నాదీ" అనే మాటలు అనిపిస్తుంది. చేసుకున్న కర్మ ఫలితాన్ని పూర్తిగా అనుభవించినట్ట్లు అనుభవించి వస్తాడు. కానీ శేషం ఉంటుంది.

శ్రీభగవానువాచ
కర్మణా దైవనేత్రేణ జన్తుర్దేహోపపత్తయే
స్త్రియాః ప్రవిష్ట ఉదరం పుంసో రేతఃకణాశ్రయః

చేసుకున్న కర్మల ఫలితాన్ని అనుభవించిన తరువాత, మిగిల్న శేషముతో ఇక్కడికి వస్తాడు. ఆ కర్మ కొద్దిగా మిగిలిన తరువాత ఎలా పుడతాడు. దైవం నాయకత్వం వహించిన కర్మతో. ఆయనే తీసుకు వస్తాడు, ఆయనే తీసుకుని వెళతాడు. ఎవరిని పోషించడానికి పాపం చేసామో, ఆ ధనము  యొక్క భోగం వాళ్ళకు. ఆ పాపం మనకు. మన వెనక బంధువులూ, మిత్రులూ, ధనమూ, రారు. పాప పుణ్యాలే వస్తాయి. ఇన్నీ వదిలిన వాళ్ళం పాప పుణ్యాలని వదిలిపెట్టలేమా? వదిలిపెట్టడానికి పట్టుకోవడానికీ మనమెవ్వరం. మనకు ఏది అంటించాలో ఆయనే అంటిస్తాడు. కర్మ మందే అయినా. కర్మ మన వెనక పంపించేవాడు పరమాత్మ.
అలాంటి కర్మని అనుభవించడానికి తగిన శరీరం వచ్చుటకు, మన కర్మఫలాన్ని వృద్ధిపొందేది అయిన శరీరం కూర్చుటకు, పురుషుడి రేతః కణములోనుండి స్త్రీ యొక్క ఉదరములో ప్రవేశిస్తాడు
(పుట్టిన వారందరికీ మర్ణం శరీరముతో కలిసే పుడుతుంది. మనకు కాళ్ళూ చేతులూ ఉన్నట్లే మృత్యువు పుడుతుంది. మృత్యుర్జన్నమవతాం వీరా దేహేన సహ జాయతే - దశమ స్కంధం)

కలలం త్వేకరాత్రేణ పఞ్చరాత్రేణ బుద్బుదమ్
దశాహేన తు కర్కన్ధూః పేశ్యణ్డం వా తతః పరమ్

రక్తముతో ఈ రేతస్సు కలిసి ఉండే భాగాన్ని కలిలం అంటారు. ఆ కలిలముతో ఒక రాత్రి. ఇదే ఐదు రోజులైన తరువాత నీటి బుడగలాగ ఉంటుంది. పది రోజులైతే ఒక రేగు పండులాగా (గట్టిపడుతుంది -ఘనత్వం వస్తుంది)
పది రోజుల తరువాత ఒక మాంస ఖండములాగా అవుతుంది. అదే వేరే గర్భాలలో (పక్షుల) గుడ్డుగా ఏర్పడుతుంది.

మాసేన తు శిరో ద్వాభ్యాం బాహ్వఙ్ఘ్ర్యాద్యఙ్గవిగ్రహః
నఖలోమాస్థిచర్మాణి లిఙ్గచ్ఛిద్రోద్భవస్త్రిభిః

ఒక మాసం గడిచే సరికి తలకాయ ఏర్పడుతుంది. రెండు నెలలు వచ్చేసరికి కాళ్ళూ చేతులూ ఒక ఆకారం ఏర్పడుతుంది. మూడవ నెల వచ్చిందంటే గోళ్ళూ, కేశములూ, స్త్రీ పురుష లింగములూ, ఇవన్నీ ఏర్పడతాయి

చతుర్భిర్ధాతవః సప్త పఞ్చభిః క్షుత్తృడుద్భవః
షడ్భిర్జరాయుణా వీతః కుక్షౌ భ్రామ్యతి దక్షిణే

నాలగవ నెలలో ధాతువులు ఏర్పడతాయి. ఐదవ నెల వస్తే గర్భములో పిండానికి కూడా ఆకలి దప్పీ ఏర్పడతాయి. అందుకే ఐదవ నెలలో శీమంతం చేస్తారు. ఆరవ నెలలో మావి ఏర్పడుతుంది. అది చుట్టూ కమ్ముకుని ఉంటుంది. అప్పుడు  (మావి ఏర్పడ్డ తరువాత) కడుపులో కుడి భాగములో తిరుగుతూ ఉంటుంది.

ఈ గర్భములో ఉన్న పిండమును ఋషి అన్నారు ఈ లోకములో. అంటే జీవుడయ్యాడు. ఏడవ నెలలో తాను ఇది వరకు జన్మలలో చేసిన పాప పుణ్యాలు స్మరణకు వస్తాయి. తాను ఇది వరకు చేసిన కర్మలు గుర్తుచేసుకోవడమే కాకుండా,  భగవంతుని మాయ చేతనే ప్రపంచములో జీవులకు శరీర సంబంధం ఏర్పడుతున్నదని తెలుసుకుంటాడు.

మాతుర్జగ్ధాన్నపానాద్యైరేధద్ధాతురసమ్మతే
శేతే విణ్మూత్రయోర్గర్తే స జన్తుర్జన్తుసమ్భవే

అప్పటినుంచీ తల్లి తీసుకున్న ఆహారమే గర్భములో ఉన్న శిశువు తీసుకుంటుంది. తల్లి తీసుకున్న ఆహార పానీయముల చేతనే సప్త ధాతువులూ వృద్ధి పొందుతాయి. అయినా ఇష్టము లేని చోటనే ఉంటాడు. మల మూత్రముల గోతిలో పెరుగుతూ ఉంటాడు. ఏ ప్రాణి అయినా అక్కడే పుట్టాలి (జన్తుర్జన్తుసమ్భవే) కాబట్టి. ఐతే ఆనందముగా ఉంటాడా? ఏ ప్రాణి అయినా తన వరకు మాత్రమే తాను తిని ఉండలేదు. ప్రతీ ప్రాణీ ఇంకో ప్రాణికి ఆహారము. చేతులు లేని ప్రాణులు చేతులు ఉన్నవాటికీ, కాళ్ళు లేనివి కాళ్ళు ఉన్నవాటికీ, చిన్న ప్రాణులు పెద్ద ప్రాణులకు ఆహారం. మనం తింటున్నదేదీ మనకోసం కాదు. మనం తినేదంతా మనది కాదు. ఒకరిది మనం తింటున్నాం. మనం ఆహారం తీసుకుని పెరిగే రక్త మాంసాన్ని మనం కాపాడుకుంటున్నామా? దోమలూ చీమలూ నల్లులూ, ఇవన్నిటికీ మనం ఆహారం. కడుపులో పెరిగే జంతువు కూడా, అక్కడ చాలా క్రిములు ఉంటాయి.

కృమిభిః క్షతసర్వాఙ్గః సౌకుమార్యాత్ప్రతిక్షణమ్
మూర్చ్ఛామాప్నోత్యురుక్లేశస్తత్రత్యైః క్షుధితైర్ముహుః

పురుగులతో అవయవాలన్నీ గాయం చేయబడతాయి. పూర్తిగా ఏమీ ఏర్పడని శరీరం కాబట్టి, మహా సుకుమారముగా ఉంటుంది. కాబట్టి క్షణ క్షణం మూర్చబోతూ ఉంటాడు. అతి చిన్న కీటకం కరిచినా చాలా బాధపడి మూర్చపోతూ ఉంటాడు. ఆ క్రిములు ఎందుకు కరుస్తాయి? అవి కూడా ప్రాణులే కదా? మనకు ఎలా ఆహారం కావాలో, అవి కూడా ఆహారం కొరకు మనను తింటాయి. మనం ఏ మావిలో ఉన్నామో అదే మావిలో ఉన్న క్రిములు. మనము ఎలా తల్లి తీసుకునే ఆహార పానీయాలతో ఆకలి తీర్చుకుంటున్నామో, మన నుండి అవి ఆహారం తీసుకుంటున్నాయి. పాపం బాగా చేసి ఉంటే పెద్ద క్రిమి కరుస్తుంది. కొద్దిగా చేసి ఉంటే చిన్న క్రిమి కరుస్తుంది. అంటే మావిలో ఉన్నప్పుడు కూడా మన కర్మ మన వెంటే ఉంది. ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూనే పుడతాము. అలా అనుభవింపచేయడానికే పరమాత్మ దుఃఖం సుఖం కలిగించే సాధనాలు ఏర్పరచాడు.

కటుతీక్ష్ణోష్ణలవణ రూక్షామ్లాదిభిరుల్బణైః
మాతృభుక్తైరుపస్పృష్టః సర్వాఙ్గోత్థితవేదనః

కేవలం మావిలో ఉన్న క్రిములు కాటేయడమే కాకుండా, ఆ తల్లి తినే పదార్థాల (కారం చేదూ ఉప్పూ పులుపూ) వలన (ఉదా: కారం పులుపు ఉప్పూ , పులుపు, కారం తినడం వలన రక్తం పలచబడుతుంది. మొదట పెట్టే పులుపు ఎముకలను గట్టి పరుస్తుంది. కానీ తరువాత తరువాత ఆ పులుపే రక్తాన్ని పలచబరుస్తుంది.) మావిలో ఉండి ఆ ఉప్పు కారాలకు బాధపడుతూ ఉంటాడు. ఆ ఆహారములో ఉండే రాజస తామస గుణాలు గర్భస్థ శిశువుకు కూడా పాకుతాయి. పుట్టిన తరువాత ఆ జీవి ఎలాటి కర్మలు చేయాలో, అలాంటి కర్మలు చేయడానికి రాజస తాంస గుణాలను పెంచే ఆహారము తల్లి తీసుకుని బిడ్డలకి ఇస్తుంది.. అంటే "నేనూ" అని చెప్పుకోవడం ఎంత మూర్ఖత్వమో తెలుసుతుంది.
లీలావతి గర్భములో ఉన్న పిండము నారదాశ్రమములో పెరిగింది. అక్కడ దొరికేవి కంద మూలాలు. అందుకే ప్రహ్లాదుడు మహాభక్తుడయ్యాడు. తల్లి తీసుకునే ఆహార విహారముల వలన బిడ్డకు ప్రభావం ఉంటుంది. తల్లి పెద్దగా నవ్వితే బిడ్డ వణికి పోతాడు. తల్లి కోపముగా ఉన్నా, నవ్వినా, ఏడ్చినా, ఆవేశానికి లోనైనా, ఉద్వేగానికి లోనైనా, అతి ఆహారం తీసుకున్నా, అతి ఉత్సాహం చూపినా, అతి విహారం చేసినా, అది బిడ్డమీద ప్రభావం చూపుతుంది.  తల్లి అనుభవించే వాడితో అంటుబడిన వాడు అవుతాడు. తల్లి చేసే పనుల వలన లోన ఉన్న బిడ్డకు సకల అవయవాలకూ బాధ కలుగుతుంది.

ఉల్బేన సంవృతస్తస్మిన్నన్త్రైశ్చ బహిరావృతః
ఆస్తే కృత్వా శిరః కుక్షౌ భుగ్నపృష్ఠశిరోధరః

బయటకి పోకుండా చుట్టూ మావి ఉంది. తీగలతో అల్లిన పంజరములా ఉంటుంది మావి. చుట్టూ గర్భాశయం మూత్రాశయం మలాశయం, జీర్ణాశయం అండాశయం. వీటిలో పెద్ద ప్రేగులూ చిన్న ప్రేగులూ. ఈ అల్లికల మధ్యలో మావి. తన శరీరాన్ని పూర్తిగా చాపుకొని కూడా పడుకోలేడు. కాళ్ళూ చేతులూ తలా ఒకే భాగములో వచ్చినట్లు పడుకుంటాడు. వీపూ శిరస్సు వంగి ఉంటాయి. అక్కడ ఆడించడానికి ఎటువంటి సందూ ఉండదు.

అకల్పః స్వాఙ్గచేష్టాయాం శకున్త ఇవ పఞ్జరే
తత్ర లబ్ధస్మృతిర్దైవాత్కర్మ జన్మశతోద్భవమ్
స్మరన్దీర్ఘమనుచ్ఛ్వాసం శర్మ కిం నామ విన్దతే

తన శరీరాన్ని కదల్చడానికి కూడా సమర్ధుడు కాకుండా, పంజరములో పక్షి లాగ ఉంటాడు. అందులోనే ఉంటాడు కానీ బయటకి పోలేడు. ఈ సమయములో ఇదివరకు నూరు జన్మలలో తాను ఆచరించిన కర్మలన్నీ భగవానుని ప్రేరణ వలన గుర్తుకు వస్తాయి. ఇలా ఒక్క సారి ఇవన్నీ గుర్తుకు వస్తే, అవన్నీ తల్చుకుని గట్టిగా నిట్టూరుద్ధామన్నా శక్తిలేని వాడు, ఇంకేమి సుఖము పొందుతాడు.

ఆరభ్య సప్తమాన్మాసాల్లబ్ధబోధోऽపి వేపితః
నైకత్రాస్తే సూతివాతైర్విష్ఠాభూరివ సోదరః

ఏడవ నెలలో పూర్వ జన్మ కృత కర్మలన్నీ జ్ఞ్యాపకం చేయబడతాయి. అప్పుడు బాగా నూనెలో వేయించినట్లుగా అవుతుంది. అప్పుడు మావిలో ఉండి కూడా, ఒకే చోట ఉండలేడు, బాధ తట్టుకోలేక తిరుగుతూ ఉంటాడు. ప్రసూతి వాయువు గర్భస్థ పిండాన్ని తిప్పుతూ ఉంటుంది. ఆ తిరగడానికి కారణం రెండు 1. వాడు పొందే బాధలు 2. గర్భములో ఉన్న వాయువు. అక్కడ తనతో బాటు పుట్టిన పురుగులు (సోదరులు) ఎలా ఐతే ఒక చోట ఉండక తిరుగుతూ ఉంటాయో అలాగే ఈ జీవుడు తన శరీరముతో తిరుగ్తూ ఉంటాడు.

నాథమాన ఋషిర్భీతః సప్తవధ్రిః కృతాఞ్జలిః
స్తువీత తం విక్లవయా వాచా యేనోదరేऽర్పితః

అప్పుడే చేతులు జోడిస్తాడు. వేళ్ళూ పూర్తిగా ఉంచలేడు కాబట్టి, రెండు పిడికెళ్ళూ ముడిచి దగ్గరకు చేర్చి భయపడుతూ యాచిస్తూ ఉంటాడు. అప్పటికే సప్తధాతువులు ఆవరించి ఉంటాయి. వీడి చుట్టూ ఏడు సంచులు (ధాతువులు), దాని మీద ఇంకో సంచీ (మావి), దాని మీద ఇంకో సంచి.
అతి దీనమైన వాక్కుతో, ఆ కడుపులో పడవేసిన పరమాత్మని స్తోత్రం చేస్తాడు

జన్తురువాచ
తస్యోపసన్నమవితుం జగదిచ్ఛయాత్త
నానాతనోర్భువి చలచ్చరణారవిన్దమ్
సోऽహం వ్రజామి శరణం హ్యకుతోభయం మే
యేనేదృశీ గతిరదర్శ్యసతోऽనురూపా

సకల చరాచర ప్రపంచాన్నీ కాపాడటం కోసం కోరుకుని తాను అనుకున్న శరీరమును ధరించిన మహానుభావుడూ, నిరంతరం పధ్నాలుగు లోకాలు సంచరిస్తూ ఉండే నీ పాదపద్మాలను శరణు వేడుతున్నాను. మనకు ఎక్కడినుంచీ భయము పుట్టించకుండా చేసేవి ఆ పాదములు మాత్రమే. నేను చేసిన పాపము వలన, ఆ చెడు కర్మకు ఫలముగా,  ఎవరి వలన నాకు తగిన ఇలాంటి గతి కలిగిందో అలాంటి వాని  పాద పద్మాలను శరణు వేడుతున్నాను. నేను దుర్మార్గున్ని. సకల చరాచర ప్రపంచాన్ని రక్షించడానికి శరీరాన్ని స్వీకరించేవాడు, అంతా సంచరించేవాడు,

యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా
భూతేన్ద్రియాశయమయీమవలమ్బ్య మాయామ్
ఆస్తే విశుద్ధమవికారమఖణ్డబోధమ్
ఆతప్యమానహృదయేऽవసితం నమామి

ఈ సంసారములో తాను ఆచరించిన కర్మల వలన ఎలా బంధములో ఉంటాడో, వానితో బాటు బద్ధుడైన వాడివలే నీవు కూడా సంసారములోనే ఉంటావు. పంచ్భూతములూ, జ్ఞ్యానేంద్రియములూ కర్మేంద్రియములూ మొత్తం తానే ఆవరించి ఉంటాడు. ప్రకృతిని తాను ఆవరించి ఉంటాడు. తనలో ప్రకృతి ఉంటుంది. తాను తల్చుకుంటే ప్రకృతిలోకి తానే వెళతాడు. మనలాగానే ఉంటాడు, బంధించబడినలాగ ఉంటాడు, అన్నింటిలోపలా ఉంటాడు, అన్నింటి వెలుపలా ఉంటాడు. కానీ వీటిలో ఉన్నవేమీ ఆయంకు అంటవు. ఎందుకంటే ఆయన విశుద్ధం. ఎలాంటి కల్మషం లేని వాడు. అన్ని కల్మషాలకు మూలం వికారం (మార్పు).
భగవానునికి ఆ వికారం (మార్పు) ఉండదు. ఖండితము జ్ఞ్యానము కలవాడు. ఆయన విఖుంటుడు. క్రోధముతో రోషముతో మండే మన హృదయములో ఉంటాడు. కానీ ఆయనకు ఆ మంట అంటదు. పరితపించిపోతున్న హృదయములో ఉన్న నీకు నమస్కారం.

యః పఞ్చభూతరచితే రహితః శరీరే
చ్ఛన్నోऽయథేన్ద్రియగుణార్థచిదాత్మకోऽహమ్
తేనావికుణ్ఠమహిమానమృషిం తమేనం
వన్దే పరం ప్రకృతిపూరుషయోః పుమాంసమ్

పంచభూతములచే ఏర్పడే ఈ శరీరములో ఉంటూ, మళ్ళీ అందులో లేకుండా (అంటే ఆ పంచభూతముల వలన వచ్చే ఏ వికారములూ అంటకుండా. పృధ్విలో ఉంటాడు, పృధ్వి శరీరముగా ఉంటాడు, పృధ్వికి తానే ఆత్మ అవుతాడు, పృధ్వికి తానే శరీరం అవుతాడు. పృధ్వికి ఆయనే ఆత్మా, శరీరం. అయినా పృధ్వికి ఉన్న దోషములు అంటవు. ) ప్రకృతికుండే ఏ దోషములు అంటని వాడు. అనంత కళ్యాణ గుణములు కలిగిన వాడు. జీవాత్మ పరమాత్మ అష్టగుణములు కలవారే. మన అష్టగుణములూ ప్రకృతితో సంబంధం కలిగి ఉంటాయి. ఎవరికి ఏ స్వభావం కావాలో వారికి ఆ స్వభావం ఇస్తాడు. అంటే అన్నీ ఆయనవే.  ఆచరించిన కర్మల వలన వచ్చిన సంస్కారమే స్వభావముగా మారుతుంది. ఆ స్వభావమే కొత్త కర్మలు చేయిస్తుంది. పంచభూతములూ, పంచభూతముల విషయములు (శబ్దాది విషయములు) అనుభవించే జీవుడూ, ఇంద్రియములూ అన్నీ నీవే. ఇవే నన్ను ఈ పంజరములో పడేశాయి.
పంచభూతములు, కర్మేంద్రియములు జ్ఞ్యానేంద్రియములు తన్మాత్రలూ అహంకారం మహత్తు అనే పనజరములో ఉంచి, ఆ పంజరములో నీవుండినా , నీ స్వరూపం ఎటువంటి మార్పూ చెందదు. నీవు ఋషివి. ఎలాంటి మార్పు లేని వాడే ఋషి.
నీవు ప్రకృతికన్నా పురుషుని కన్నా అవతలవాడివి. పురుషోత్తముడివి. అలాంటి నీకు నమస్కరిస్తున్నాను.

దేవ మనుష్యాదులన్నీ పంచభూతాత్మకమైన శరీరానికి గానీ ఆత్మకు (జీవునికి) కాదు. ప్రకృతికంటే పురుషుని కంటే అతీతుడైన పరమాత్మకు నమస్కారం. సంసారం బంధించేదీ, బంధించే సంసారం విడిచేదీ  నీ వల్లనే.

యన్మాయయోరుగుణకర్మనిబన్ధనేऽస్మిన్
సాంసారికే పథి చరంస్తదభిశ్రమేణ
నష్టస్మృతిః పునరయం ప్రవృణీత లోకం
యుక్త్యా కయా మహదనుగ్రహమన్తరేణ

ఈ సంసార మార్గములో సంచరిస్తున్నది నీ మాయ వల్లనే. నీ చేతనే కర్మ నిబంధనమైన (మనం ఆచరించే కర్మలే మనని బంధిస్తాయి. "ఇలా చేయడం వలన వచ్చే ఫలితం నాకు కావాలి" అనుకుంటే, "నేను చేస్తున్నాను" అనుకుంటే కర్మలు బంధిస్తాయి. ఇవి పోవాలంటే దేహాత్మాభిమానం ఉండకూడదు. ఆ దేహాత్మాభిమానం పరమాత్మ మాయ వలన కలుగుతుంది) ఈ సంసార మార్గములో సంచరిస్తూ, ఆ దారిలో నడిచీ నడిచీ, ఆ శ్రమతో అలసిపోయి, జ్ఞ్యానము కాస్తా పోతుంది. స్మృతి నశిస్తుంది. స్వస్వరూప జ్ఞ్యానం పోతుంది. అలాంటి వాడు మళ్ళీ ఈ లోకానికి వస్తాడు. జన్మల పరంపరలో చిక్కుకుంటాడు. తన అసలు నివాసాన్ని మరచిపోతాడు. ఇలాంటి నేను మళ్ళీ నా అసలు లోకానికి చేరడానికీ, స్వస్వరూప జ్ఞ్యానం పొందడానికి ఇంకేదైనా మార్గం ఉందా? పరమాత్మా!, నీ దయ లేకుండా మరి దేనితోనైనా నిన్ను చేరగలమా. నీ దయ కంటే వేరే సాధనం లేదు

జ్ఞానం యదేతదదధాత్కతమః స దేవస్
త్రైకాలికం స్థిరచరేష్వనువర్తితాంశః
తం జీవకర్మపదవీమనువర్తమానాస్
తాపత్రయోపశమనాయ వయం భజేమ

పరమాత్మ మనకు ఎలా సంసారం లేకుండా చేస్తాడు? జ్ఞ్యానాన్ని ఎలా ఇస్తాడు? అంటే, ఈ రెండూ ఇచ్చేది స్వామే. స్థావర జంగమములలో అంతర్యామిగా తాను ఉండి కలిగిస్తాడు. "నేనే చేస్తున్నాను" అని అనిపించేదీ స్వామే. "అంతా స్వామి దయ. చేస్తున్నదీ, చేయిస్తున్నదీ స్వామే " అని అనిపించేదీ స్వామే (దదామి బుద్ధి యోగం - గీత). ఆయన స్థావరములలో, జంగములలో కూడా ఉంటాడు. అన్నింటిలో అంశగా అనువర్తించి ఉంటాడు. ప్రతీ స్థావర జంగమములలో అంతర్యామిగా ఉన్న స్వామి, మనమాచరించిన కర్మకనుగుణమైన జ్ఞ్యానాన్ని ప్రసాదిస్తాడు. పరమాత్మ నిత్య అసంకుచిత జ్ఞ్యానమయుడు. అటువంటి పరమాత్మ అనేకమైన శరీరాలలో ప్రవేశిస్తాడు. సంసారములో ఆచరించే కర్మ పరంపరని అనువర్తిస్తున్న మేము నిన్ను శరణు వేడుతున్నాము. భ్రమ మోహం దేహాత్మాభిమానం, ఇవి అన్ని జీవులకూ ఉంటాయి.

దేహ్యన్యదేహవివరే జఠరాగ్నినాసృగ్
విణ్మూత్రకూపపతితో భృశతప్తదేహః
ఇచ్ఛన్నితో వివసితుం గణయన్స్వమాసాన్
నిర్వాస్యతే కృపణధీర్భగవన్కదా ను

ఇదే ఒక దేహం. దీనికి నవ రంధ్రాలు ఉన్నాయి. నవరంధ్రాలు ఉన్న ఈ శరీరము ఇంకో దేహము యొక్క రంధ్రములో (గర్భములో) చేరాను. నెత్తురూ, మలమూ, మూత్ర్ము ఉన్న గోతిలో ఉండి, ఆ అగ్నితోటీ (జఠరాగ్ని), అక్కడ ఉన్న వేరే క్రిములతోటీ, మల మూత్రాలతోటీ, బాగా వేయించబడి, బయటకి వెళ్ళడానికి భగవంతుని కోరుతూ, ఒక్కొక్క రోజూ లెక్కపెట్టుకుంటూ ఉంటాను

యేనేదృశీం గతిమసౌ దశమాస్య ఈశ
సఙ్గ్రాహితః పురుదయేన భవాదృశేన
స్వేనైవ తుష్యతు కృతేన స దీననాథః
కో నామ తత్ప్రతి వినాఞ్జలిమస్య కుర్యాత్

ఇక్కడ ఉంటే ఏడో నెలలో అయినా జ్ఞ్యానం వస్తుంది. బయట నూరేళ్ళు ఉన్నా "అంతా నేనే" అనిపిస్తుంది. గర్భవాస స్థితి (ఈ దృశీం గతి), పదినెలల బ్రతుకు నీవు అందించావు (యేన వ్సఙ్గ్రాహితః ). గొప్ప దయకలవాడివైన నీవు ఎంతో దయతో మాకు అందించావు (పురుదయేన భవాదృశేన). ఎన్నడైనా నేను గర్భవాసములో ఉంచమని అడిగానా? నీవే ఇచ్చావు. ఎందుకంటే నేను తప్పు చేసాను కాబట్టి. కానీ ఆ తప్పు చేయించేది నీవే కదా? "నేను తప్పు చేసాను, క్షమించు స్వామీ" అనే జ్ఞ్యానం కూడా నీవే ఇవ్వాలి. నీ ఉపకారానికి ప్రత్యుపకారం నీవే చేసుకోవాలి. నీవు కల్పించుకున్న ఉపకారముతోనే నీవు సంతోషించు. జీవులందరికీ నాధుడవు నీవు. నీవు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం నేను చేయలేను. ఆ ప్రత్యుపకారం నీవే చేసుకుని, నీవే సంతోషించు. నీవు చేసిన ఈ ఉపకారానికి, చేతులు జోడించడం తప్ప ఇంకే ఉపకారం నేను చేయలేను.

పశ్యత్యయం ధిషణయా నను సప్తవధ్రిః
శారీరకే దమశరీర్యపరః స్వదేహే
యత్సృష్టయాసం తమహం పురుషం పురాణం
పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతమ్

శరీరమునకే ఈ సప్త ధాతువులున్నాయి. ఈ శరీరములో జీవాత్మలో ఉన్న పరమాత్మకు లేవు. మనకు కనపడే శరీరములోనే మూడు శరీరాలు ఉన్నాయి. సప్తధాతువులతో ఉన్న శరీరం, జీవాత్మ (సూక్ష్మ దేహం), పరమాత్మ. పరమాత్మ, జీవున్నీ, శరీరాన్ని చూస్తూ ఉంటాడు. జీవుడు శరీరాన్ని చూస్తూ ఉంటాడు. జీవుడు ఎవరిని "నేను" అనుకుంటాడో, అది వాడి నిజమైన "నేను" కాదు. అందులో ఉండే నిజమైన "నేను" ను చూడలేకపోతున్నాడు. అంటే తన నిజమైన శరీరాన్ని విడిచి వేరే దాన్ని తన శరీరం అనుకుంటాడు. జీవుడు దమ శరీరి (దమమంటే ఇంద్రియ  నిగ్రహం). తాను పాంచభౌతికమైన శరీరములో ఉండి, తన బుద్ధి బలముతో చూస్తూ ఉంటాడు. పరమాత్మ కూడా ఆ జీవుడిలో ఉన్నాడు. పరమాత్మ, తననీ, జీవుడినీ, శరీరాన్ని కూడా చూస్తూ ఉంటాడు. జీవుడు కేవలం శరీరాన్ని చూస్తూ, తననూ, పరమాత్మనూ చూడలేడు.
శరీరములో పడవేసి, శరీరములో ఉన్నవాడితో కలిసి ఉన్న పరమాత్మ బుద్ధిని ప్రసాదిస్తే, ఈ శరీరం, దాని సంబంధం, అందులో ఉండే జీవాత్మ, పరమాత్మని చూస్తాడు, తనని చూచుకుంటాడు. ఈ శరీరములో పరమాత్మ ఉన్నడనే బుద్ధిని ప్రసాదించే పురాణ పురుషుడిని వెలుపలా, లోపలా చూస్తాడు. ఆ స్వామిని నా హృదయములో చూస్తాను, వెలుపల కూడా చూస్తాను. ఇదే ఉపాసన. పరమ పురుషు ప్రసాదముతోటే మనం భగవంతుని లోపలా, బయటా చూడగలం. వెలుపలా లోపలా పరమాత్మను ఒకే రీతిగా చూచుటే తైల ధారలాగ అవిచ్చిన్నమైన ఉపాసన. నిరంతరం పరమాత్మ మీద బుద్ధి లగ్నం చేయడం ఉపాసన. ఈ ఉపాసన కళ్ళు మూసుకున్నా, తెరుచుకున్నా ఉండాలి.
ఈ ఉపాసన కూడా పరమాత్మ కృపతోటే కలుగుతుంది.
ఇంతకాలం నిన్ను చూడకపోవడానికి కారణం కూడా నీవే. నిన్ను నీవు చూపితేనే నేను చూడగలను.

సోऽహం వసన్నపి విభో బహుదుఃఖవాసం
గర్భాన్న నిర్జిగమిషే బహిరన్ధకూపే
యత్రోపయాతముపసర్పతి దేవమాయా
మిథ్యా మతిర్యదను సంసృతిచక్రమేతత్

అనేక దుఃఖాలకు నివాసమైన ఈ గర్భవాసం నుండి బయటకు రావాలని లేదు. బయటకు వస్తే ఈ జ్ఞ్యానం కాస్తా పోతుంది. బయట ఉన్నదంతా చీకటే (బహిరన్ధకూపే). భూమి మీద పడగానే నీ మాయతో కప్పుతావు. నీ మాయ కప్పని గర్భవాసమే, నీ మాయ కప్పే భూవాసం కన్నా బాగుంటుంది.   ఆ యోగమాయ రాగానే దేహాత్మాభిమానం వస్తుంది.

తస్మాదహం విగతవిక్లవ ఉద్ధరిష్య
ఆత్మానమాశు తమసః సుహృదాత్మనైవ
భూయో యథా వ్యసనమేతదనేకరన్ధ్రం
మా మే భవిష్యదుపసాదితవిష్ణుపాదః

కాబట్టి దైన్యాన్ని పూర్తిగా పోగొట్టుకుని నీ సేవతో నన్ను నేను ఉద్ధరించుకుంటాను. ఉద్ధరించడమంటే, మళ్ళీ అనేక రంధ్రములు గల శరీరములో ప్రవేశించకుండా. ఇన్ని రంధ్రాల నరకం నాకు వద్దు. ఇవి రాకుండా ఉండటానికి నేను నీ పాదములనాశ్రయించి నీ అనుగ్రహముతో ఈ ఆత్మను ఉద్ధరించుకోవాలనుకుంటున్నాను.

కపిల ఉవాచ
ఏవం కృతమతిర్గర్భే దశమాస్యః స్తువన్నృషిః
సద్యః క్షిపత్యవాచీనం ప్రసూత్యై సూతిమారుతః

ఇలా అనుకునే లోపల పదవ నెల వస్తుంది. వెంటనే ప్రసూతి వాయువు ద్వారా గర్భములో ఉన్న శిశువు బయటకు నెట్టబడతాడు.

తేనావసృష్టః సహసా కృత్వావాక్శిర ఆతురః
వినిష్క్రామతి కృచ్ఛ్రేణ నిరుచ్ఛ్వాసో హతస్మృతిః

ఇలా ప్రసూతి వాయువుతో బయటకు నెట్టబడి, శిరసు కిందకు పెట్టుకుని, చాలా బాధపడుతూ, ఎంతో అతి కష్టము మీద బయటకు విడువడతాడు. శ్వాస తీసుకునే అవకాశము కూడా లేకుండా బయటపడతాడు. బయటకు రావడముతోనే ఉన్న జ్ఞ్యానమంతా తొలగిపోతుంది.

పతితో భువ్యసృఙ్మిశ్రః విష్ఠాభూరివ చేష్టతే
రోరూయతి గతే జ్ఞానే విపరీతాం గతిం గతః

దీనినే భూపతనం అంటాము. శరీరం అంతా రక్తముతో తడిసి ఉంటుంది. ఒక క్రిమిలాగ అటూ ఇటూ కొట్టుకుంట్ట్ ఉంటాడు. ఆ జ్ఞ్యానం పోయింది కాబట్టి పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. జ్ఞ్యానం పోయి విపరీత జ్ఞ్యానం వస్తుంది (దేహాత్మాభిమానం)

పరచ్ఛన్దం న విదుషా పుష్యమాణో జనేన సః
అనభిప్రేతమాపన్నః ప్రత్యాఖ్యాతుమనీశ్వరః

పుట్టినప్పటినుంచీ తల్లో తండ్రో పెంచుతూ ఉంటారు. పెంచేవారు, తమకి కావలసింది వాడికి ఇస్తారు తప్ప, వాడికేమి కావాలో అది ఇవ్వరు. పిల్లల ఇష్టం, పిల్లల బాధ తెలియని వారు పెంచుతారు. తనకు ఇష్టము ఏమిటో తెలియని వారిచే పెంచబడే వాడు, తిరకరించడానికి శక్తిలేని వాడై, తనకు ఇష్టములేని దాన్నే పొందుతాడు. అప్పటినుంచీ, తనకి ఇష్టము లేని దాన్నే పొందుతూ ఉంటాడు.

శాయితోऽశుచిపర్యఙ్కే జన్తుః స్వేదజదూషితే
నేశః కణ్డూయనేऽఙ్గానామాసనోత్థానచేష్టనే

మురికిపట్టిన మలినమైన పక్కమీద పడుకోబెడతారు. చెమట, మొదలైనవి పుట్టిన పక్కమీద పడుకోబెట్టబడతాడు. దురద వేస్తే గోక్కోలేడు. వాలిన పురుగులని వారించలేడు. పడుకోబెట్టినట్లు పడుకుంటాడు.

తుదన్త్యామత్వచం దంశా మశకా మత్కుణాదయః
రుదన్తం విగతజ్ఞానం కృమయః కృమికం యథా

లేత చర్మమాన్ని (ఆమత్వచం) నల్లులూ దోమలూ పురుగులూ కరుస్తాయి. జ్ఞ్యానము లేని వాడై, అవి కరుస్తున్నాయని తెలుసుకోలేక, చెప్పలేక, ఒక పురుగును ఇంకో పురుగు కరుస్తున్నట్లుగా తనను కరుస్తుంటాయి.

ఇత్యేవం శైశవం భుక్త్వా దుఃఖం పౌగణ్డమేవ చ
అలబ్ధాభీప్సితోऽజ్ఞానాదిద్ధమన్యుః శుచార్పితః

ఇలా పౌగండాన్ని గడుపుతాడు. ఆరేళ్ళ వయసు వచ్చేసరికి ఆ బాలుడు, "ఈ ప్రపంచం మనమనుకున్నదేదీ ఇవ్వదు" అనే భావముతో పెరుగుతాడు. పుట్టినప్పుడు లేని కోపం పెరుగుతుంటే ఇందుకే పెరుగుతుంది. కోరినదాన్ని పొందనందు వలన అజ్ఞ్యానముతో కోపం పెరుగుతుంది. పిల్లలు పెరిగేప్పుడు వారితో బాటు కోపం పెరుగుతూ వస్తుంది. ఆ కలిగిన కోపాన్ని తీర్చుకోలేక ఏడుస్తాడు.

సహ దేహేన మానేన వర్ధమానేన మన్యునా
కరోతి విగ్రహం కామీ కామిష్వన్తాయ చాత్మనః

శరీరముతో బాటే అభిమానమూ, కోపమూ పెరుగుతుంది. కోరుకున్న తాను ద్వేషం పొంది, తన మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నాడు.

భూతైః పఞ్చభిరారబ్ధే దేహే దేహ్యబుధోऽసకృత్
అహం మమేత్యసద్గ్రాహః కరోతి కుమతిర్మతిమ్

పంచభూతములచే ఆరంబించబడిన శరీరం, జ్ఞ్యానం కోల్పోయి, "నేనూ - నాదీ" అనే బుద్ధిని పొందుతూ ఉంటాడు. ఆ నేనూ అనే దానికోసం, నాదీ అనుకునే దానికోసం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటాడు

తదర్థం కురుతే కర్మ యద్బద్ధో యాతి సంసృతిమ్
యోऽనుయాతి దదత్క్లేశమవిద్యాకర్మబన్ధనః

ఆ కర్మలచే బద్ధుడై సంసారములోకి ప్రవేశిస్తాడు. అవిదయా, కర్మా తనని బంధిస్తాయి. కష్టాలకు మూలం అయిన సంసారములోకి అహం-మమ అనే అభిమానాలతో పునః పునః ప్రవేశిస్తూ ఉంటాడు

యద్యసద్భిః పథి పునః శిశ్నోదరకృతోద్యమైః
ఆస్థితో రమతే జన్తుస్తమో విశతి పూర్వవత్

వీడు నడిచే దారిలో అంతా అలాంటి వారే ఉంటారు. ప్రతీ వారూ, శిశ్నోదరాల కోసం తాపత్రయపడే వారే. ఈ రెంటిని పొందడానికి ప్రయత్నం చేసే దుర్జనులచేత లాగబడతాడు. అలాంటి వాళ్ళనే ఆశ్రయిస్తాడు, వాళ్ళతోటే కలిసి ఉంటాడు, వాళ్ళతో కలిసి ఉండుటే సంతోషమనుకుంటాడు. యధా పూర్వం మళ్ళీ అజ్ఞ్యానాన్ని పొందుతాడు

సత్యం శౌచం దయా మౌనం బుద్ధిః శ్రీర్హ్రీర్యశః క్షమా
శమో దమో భగశ్చేతి యత్సఙ్గాద్యాతి సఙ్క్షయమ్

ఈ పధునాలుగు జ్ఞ్యానాంగములు, ఇవి శిశ్నోదర పరాయణులతో స్నేహం చేయడం వలన తొలగిపోతాయి. పొరబాటున కూడా అలాంటి వారితో కలవకూడదు.

తేష్వశాన్తేషు మూఢేషు ఖణ్డితాత్మస్వసాధుషు
సఙ్గం న కుర్యాచ్ఛోచ్యేషు యోషిత్క్రీడామృగేషు చ

వారెప్పుడూ అశాంతులూ - ఆశ తీరని వారు. మూఢులు - శరీరం, ఆత్మా అనే జ్ఞ్యానం లేని వారు, ఖణ్డితాత్మ - శరీరమే ఆత్మ అనుకునే వారు. యోషిత్క్రీడామృగేషు - ఆడవారి ఆటబొమ్మలుగా పెరిగేవారితో స్నేహం చేయకూడదు

న తథాస్య భవేన్మోహో బన్ధశ్చాన్యప్రసఙ్గతః
యోషిత్సఙ్గాద్యథా పుంసో యథా తత్సఙ్గిసఙ్గతః

స్త్రీ ప్రసంగం వలనా, స్త్రీ ప్రసంగాన్ని కోరేవారి వలన కలిగే అనర్థం, మరి దేని వలనా కలగదు. ఇది మెడకు ఉరితాడు వంటిది. స్త్రీ సావాసం వలన గానీ, స్త్రీ సావసం కోరిన వారి సావాసం వలన గానీ కలిగే ఆపద, ఇతర కోరికల వలన రాదు. స్త్రీ సంగం కన్నా, స్త్రీ సంగం కోరేవారి సంగం ప్రమాదకరం.

ప్రజాపతిః స్వాం దుహితరం దృష్ట్వా తద్రూపధర్షితః
రోహిద్భూతాం సోऽన్వధావదృక్షరూపీ హతత్రపః

సాక్షాత్ చతుర్ముఖ బ్రహ్మే, తాను సృష్టించిన తన సృష్టిలో ఉన్న స్త్రీ వెంట పడ్డాడు. బ్రహ్మే సిగ్గు విడిచేలా చేసినప్పుడు, ఆయన సృష్టి చేసిన వారు చేసిన సృష్టిలో, వారి చేత సృష్టించబడిన వారమైన మనలో అజ్ఞ్యానముచే కొట్టబడని వాడు ఎవడైనా ఉంటాడా? ఒక్క నారాయణుడు తప్ప.

తత్సృష్టసృష్టసృష్టేషు కో న్వఖణ్డితధీః పుమాన్
ఋషిం నారాయణమృతే యోషిన్మయ్యేహ మాయయా

ఒక్క నారాయణుడు తప్ప.

బలం మే పశ్య మాయాయాః స్త్రీమయ్యా జయినో దిశామ్
యా కరోతి పదాక్రాన్తాన్భ్రూవిజృమ్భేణ కేవలమ్

"నా బలం చూడు, ఈ స్త్రీ అనే బలం, మొత్తం దిక్కులని జయిస్తుంది. ఒక కనుబొమ్మ పక్కకి కదిలిస్తే ఎంత మహా వీరుడైనా పాదాక్రాంతుడవుతాడు.

సఙ్గం న కుర్యాత్ప్రమదాసు జాతు యోగస్య పారం పరమారురుక్షుః
మత్సేవయా ప్రతిలబ్ధాత్మలాభో వదన్తి యా నిరయద్వారమస్య

యోగమును పొందాలనుకునే వారూ, సంసారాన్ని దాటాలనుకునే వారూ, మోక్షం పొందాలనుకునేవారూ, పొరబాటున కూడా స్త్రీ సంగము చేయవద్దు. స్త్రీ సేవని విడిచిపెట్టాలంటే, మొదలు నా సేవను చేస్తే స్త్రీ సంగం తగ్గుతుంది.  నా సేవతో ఆ సేవని విడిచిపెట్టండి. నిరంతరం నన్ను సేవించడం వలన ఆత్మ తత్వం తెలుసుతుంది. ఈ జ్ఞ్యానాన్ని పొంది స్త్రీ సంగాన్ని విడిచిపెడతాడు. స్త్రీ అంటే నరకద్వారం.

యోపయాతి శనైర్మాయా యోషిద్దేవవినిర్మితా
తామీక్షేతాత్మనో మృత్యుం తృణైః కూపమివావృతమ్

నన్ను నిరంతరం సేవిస్తూ ఉంటే, భగవంతుని చేత (నా చేత) సృష్టించబడిన స్త్రీ అనే మాయ తొలగిత్పోతుంది. సంసారమూ, బ్రతికించేదీ, వరాలిచ్చేదీ కాదు. మృత్యువును ఇచ్చేది. గడ్డి కప్పిన గోతిలాగ ఉండేది ఈ స్త్రీ అనే మాయ.

యాం మన్యతే పతిం మోహాన్మన్మాయామృషభాయతీమ్
స్త్రీత్వం స్త్రీసఙ్గతః ప్రాప్తో విత్తాపత్యగృహప్రదమ్

ఎలాగైతే స్త్రీని మృత్యు ద్వారముగా తెలుసుకుని దూరముగా ఉండాలో, ఆ స్త్రీ కూడా, ఏ స్త్రీని భర్తగా అనుకుంటుందో, ఆ భర్తనుంచి దూరముగా ఉండాలి. ఎలా ఐతే స్త్రీని ప్రేమించడం స్త్రీ జన్మకి కారణమో, పురుషున్ని ప్రేమించడం కూడా పురుష జన్మకి కారణం. స్త్రీ సంగం ఎలా పనికి రాదో, పురుష సంగం కూడా పనికి రాదు

తామాత్మనో విజానీయాత్పత్యపత్యగృహాత్మకమ్
దైవోపసాదితం మృత్యుం మృగయోర్గాయనం యథా

పురుషుడే స్త్రీ సాంగత్యముతో స్త్రీత్వాన్ని పొందాడు. ధర్మ విరుద్ధముగా స్త్రీ పురుష సంగమం ఉండకూడదు. స్త్రీ అంటే, పరమాత్మ మనకోసం తెచ్చి మన ముందు పెట్టిన మృత్యువు అని తెలుసుకో. స్త్రీ సంగం, ధనమూ, సంసారమూ, ఇళ్ళూ, పిల్లలూ అనే రూపములో భగవంతుడు మన ముందు పెట్టిన మృత్యువు అని తెలుసుకో. లేడి ఎలా ఐతే సంగీతం విని మోసపోతుందో, అమ్మాయి బాగుందని వెళ్ళి మరణం పాలవ్వకు. మనని మరణింపచేయడానికి మృత్యువుగా పరమాత్మ దగ్గరగా పెట్టినదే ఇల్లూ, ధనం, సంసారం.

దేహేన జీవభూతేన లోకాల్లోకమనువ్రజన్
భుఞ్జాన ఏవ కర్మాణి కరోత్యవిరతం పుమాన్

ఈ జీవుడు, ఒక శరీరములోంచి ఇంకో శరీరం పొంది, ఎన్నో లోకాలు తిరుగుతూ, నిరంతరం తాను చేసిన పనులని అనుభవిస్తూనే, కొత్త పనులని చేస్తూ ఉంటాడు. ఇది వరకు తాను చేసిన కర్మఫలం అనుభవించడం కూడా కర్మే. అనుభవమే కర్మ, కొత్త పాపాన్ని కొత్త లోకాన్ని కలిగిస్తుంది. కనీసం ఒక్క క్షణం విశ్రాంతి తీసుకోడు. నిరంతరం చేయడం, అనుభవించడం.

జీవో హ్యస్యానుగో దేహో భూతేన్ద్రియమనోమయః
తన్నిరోధోऽస్య మరణమావిర్భావస్తు సమ్భవః

ఈ అనుభవం కూడా జీవుడికి జ్ఞ్యానం కలిగించట్లేదు. శరీరములో జీవుడు ప్రవేశిస్తాడు, జీవుడిని అనుసరించి దేహం ఉంటుంది. భూత ఇంద్రియ మనో మయం ఈ దేహం. దేహాన్ని ఆపడం మరణం. జీవుని వెంట దేహం రాకుండా ఉండటం మరణం. దేహం వెంట జీవుడు పోవడం జననం. సూక్ష్మ దేహమే స్థూలదేహాన్ని స్వీకరిస్తున్నది. సూక్ష్మ దేహం స్థూల దేహముగా మారుట పుట్టుక. వచ్చిన స్థూల దేహం రాకుండ చేయుట మరణం

ద్రవ్యోపలబ్ధిస్థానస్య ద్రవ్యేక్షాయోగ్యతా యదా
తత్పఞ్చత్వమహంమానాదుత్పత్తిర్ద్రవ్యదర్శనమ్

ద్రవ్యోపలబ్ధిస్థానస్య - జీవుడు సూక్ష్మ రూపములో ఉంటాడు. ఈ సూక్ష్మ దేహం ఇంద్రియ అగోచరం. ఇంద్రియ అగోచరం అయిన సూక్ష్మ దేహానికి స్థూల దేహం వస్తే, ఆ వచ్చిన స్థూల దేహాన్ని, సూక్ష్మ దేహములో ఉన్న జీవుడు చూస్తాడు. స్థూల దేహాన్ని చూడకుండా ఉండుట మరణం. స్థూల దేహాన్ని చూడగలుగుట జననం. మరణమనేదీ పుట్టుకనేదీ ఆత్మకు లేదు. ఈ ఆత్మ ఏ శరీరములోకి ప్రవేశిస్తోందో ఆ శరీరాన్ని చూడగలుగుట పుట్టుకు, ఆ శరీరాన్ని చూడలేకుండుట మరణం.పంచభూత సంఘాతం పుట్టుక, పంచభూత విఘాతం మరణం.
పృధ్వీ అప్ తేజో వాయు ఆకాశములతో, పంచభూత సముదాయముతో ఏర్పడిన శరీరమునకే ఆత్మాభిమానం కలుగుతుంది. శరీరం వస్తేనే "నేనూ" అనే అభిమానం కలుగుతుంది. ఆ దేహాత్మాభిమానం, దేహములో ఉన్న పలు రకముల వస్తువులని చూచుట. ఆత్మ ప్రకృతిలోకి రావడమే పుట్టుక. జీవుడు ఎలా నిత్యమో, ప్రకృతి కూడా నిత్యమే. అంటే "భావన" పుట్టుక. ప్రకృతే నేను అనుకోవడమే పుట్టుక. ప్రకృతీ, జీవుడూ రెండూ నిత్యములే. కానీ, ప్రకృతిలో పరిణామం ఉంటుంది, జీవునిలో పరిణామం ఉండదు. దేహాత్మాభిమానం కలుగుట పుట్టుక. ఆత్మ నిత్యమూ, సత్యమూ, నాశము లేదు.
ప్రకృతిలో పరిణామం ఉంటుంది - పూవు, పిందె, కాయ. అది పరిణామి. జీవుడు అపరిణామి. ఆత్మకు మార్పు లేదు.ప్రకృతికి మార్పు ఉంది. మారుతున్న ప్రకృతే మారని ఆత్మా అనుకోవడం పుట్టుక. అంటే దేహాత్మాభిమాన ఉత్పత్తే పుట్టుక. ప్రకృతి పురుషుడిలో కలుస్తుంది. అదే సృష్టి. కలిపిన పుట్టుకే, కలియని ఆత్మలా భావించుట పుట్టుక, భావించకుండా ఉండుట ప్రళయం.
ద్రవ్యం ఎప్పుడూ నిత్యముగా ఉంటుంది. వస్త్రం నశించిందీ అంటున్నాం. అంటే దారాలు అలాగే ఉన్నాయి, దాని కూర్పు మాత్రం లేదు. అలాగే ప్రకృతి పురుషులు కలిస్తే పుట్టుక, వేరైతే మరణం. అలాగే కుండ ఆకారం పోయినంత మాత్రాన, మట్టి పోదు. కుండ కనుమరుగైనా మట్టి అలాగే ఉంటుంది.
ద్రవ్యోపలబ్ధిస్థానం అంటే శరీరం. ద్రవ్యం అంటే పంచభూతాలు. ద్రవ్యేక్షాయోగ్యతా యదా - ద్రవ్యాలను చూచే స్థితి ఎప్పుడు ఉండదో,  తత్పఞ్చత్వం - అదే మరణం.
అహంమానాదుత్పత్తిర్ద్రవ్యదర్శనమ్ - అలా కలిసిన పంచభూత సముదాయాన్ని అహం అనుకుంటాము. అదే పుట్టుక. మనలో ఉన్న పంచభూతాత్మక సమూహాన్ని చూడగలుగుట.


యథాక్ష్ణోర్ద్రవ్యావయవ దర్శనాయోగ్యతా యదా
తదైవ చక్షుషో ద్రష్టుర్ద్రష్టృత్వాయోగ్యతానయోః

ఒక వస్తువును మనం చూసాము. వాస్తవముగా చూచేది నేనా, నా కన్నా? చూచేది నేనే ఐతే, కన్ను మూసుకుని చూడగలుగుతున్నానా? కన్ను తెరుచుకుని ఉన్నా, వెలుతురు లేదు. అప్పుడు చూడగలుగుతున్నామా? వెలుతురూ ఉంది,కన్ను తెరిచే ఉంది, అయినా చూడాలని లేదు. చూడగలుగుతున్నామా?
సూర్యభగవానుడే కంటిలో చేరి చూపిస్తాడు. పరమాత్మే సూర్యభగవానునిలో ఉన్నాడు. ఆ సూర్యభగవానుడే కంటిలో ఉన్నాడు. ఆ కంటిలో ఉన్నవాడే ఆత్మలో అంతర్యామిగా ఉన్నాడు. ఈ ముగ్గురి కలయిక ఉంటేనే చూస్తాము. దానితో బాటు చూడాలన్న సంకల్పం కూడా ఉండాలి. చూడబడేదీ చూచేవాడూ ఒకే రెఖమీదకి వస్తేనే చూడగలడు.  ద్రష్టుర్ద్రష్టృత్వాయోగ్యతానయోః  - చూడగలుగుటా చూడలేకుండుట.  అలాగే శరీరం ఉన్నా, కర్తృత్వాభిమానం లేకుంటే ఆత్మని చూడగలం.

తస్మాన్న కార్యః సన్త్రాసో న కార్పణ్యం న సమ్భ్రమః
బుద్ధ్వా జీవగతిం ధీరో ముక్తసఙ్గశ్చరేదిహ

ప్రకృతి పరమాత్మా జీవుడూ మూడు నిత్యమే. ఉన్న ప్రకృతిలోకి వెళ్ళి "అది నేను" అనుకోవడం పుట్టుక. కనుక భయపడవలసిన పనిలేదు, దైన్యముతో పని లేదు, కోపముతో కూడా పని లేదు. జ్ఞ్యానం పొందిన వాడు జీవుని తత్వం తెలుసుకుని, ప్రకృతితో సంబంధాన్ని విడిచిపెట్టి సంచరిస్తాడు.

సమ్యగ్దర్శనయా బుద్ధ్యా యోగవైరాగ్యయుక్తయా
మాయావిరచితే లోకే చరేన్న్యస్య కలేవరమ్

దీన్నే సమ్యక్ దర్శనం (ఉన్నదాన్ని ఉన్నట్లు చూచుట)  అంటారు. జ్ఞ్యానముతో వైరాగ్యముతో కలిసి ఉన్న దృష్టితో మాయా విరచితమైన ప్రకృతిలో తిరుగాడు. శరీరములో ఆత్మ బుద్ధి విడిచిపెట్టి సంచరించు


                                          సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment