Monday, February 18, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఐదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
భవో భవాన్యా నిధనం ప్రజాపతేరసత్కృతాయా అవగమ్య నారదాత్
స్వపార్షదసైన్యం చ తదధ్వరర్భుభిర్విద్రావితం క్రోధమపారమాదధే

దక్ష ప్రజాపతి అవమానం చేసినందు వలన తన ప్రియురాలు శరీరం విడిచిందీ అని నారదుని వలన తెలుసుకుని. తన సైన్యాన్నీ, తన వారినీ తరిమికొట్టారని తెలుసుకుని కోపాన్ని తెచ్చుకున్నాడు.

క్రుద్ధః సుదష్టౌష్ఠపుటః స ధూర్జటిర్జటాం తడిద్వహ్నిసటోగ్రరోచిషమ్
ఉత్కృత్య రుద్రః సహసోత్థితో హసన్గమ్భీరనాదో విససర్జ తాం భువి

తతోऽతికాయస్తనువా స్పృశన్దివం సహస్రబాహుర్ఘనరుక్త్రిసూర్యదృక్
కరాలదంష్ట్రో జ్వలదగ్నిమూర్ధజః కపాలమాలీ వివిధోద్యతాయుధః

కోపం బాగా వచ్చి పెదవిని కొరికి, కపర్దము (జటాజూటము) కలవాడైన శంకరుడు (కపర్దుడంటే బ్రహ్మానందములో ఉండి, బ్రహ్మానందము ఇచ్చేవాడూ అని అర్థం), ఆ జటాజూటాన్ని లాగాడు. అది మెరుపూ నిప్పు రవ్వలూ అగ్నిజ్వాలలూ వెళ్ళగక్కుతూ ఉంది. లేచి నిలబడ్డాడు. నవ్వాడు. మహాగంభీరముగా గర్జించి ఆ జటను కిందికి వదిలిపెట్టాడు. అందులోంచి ఒక అతికాయుడు ఉద్భవించి తన శరీరం ఆకాశం అంటుతూ, వేయిబాహువులు ఉండి, మూడు కళ్ళు ఉండి, మహాకోపముతో ఉన్నాడు, భయంకరమైన కోరలు కలిగి ఉన్నాయి, మండుతున్న నిప్పుమంటల వంటి కేశములు కలిగి, కపాలములు వేసుకుని ఉన్నాడు.

తం కిం కరోమీతి గృణన్తమాహ బద్ధాఞ్జలిం భగవాన్భూతనాథః
దక్షం సయజ్ఞం జహి మద్భటానాం త్వమగ్రణీ రుద్ర భటాంశకో మే

ఆయన ఉద్భవించి "ఏమి మీ ఆజ్ఞ్య" అన్నాడు. చేతులు జోడించుకుని ఏమి చేయాలో అడిగినప్పుడు "యజ్ఞ్యముతో బాటు దక్షుని కూడా ధ్వంసం చేయి. నా మొత్తం సైన్యానికి నీవు సేనాపతివి. రుద్రుడవైన నీవు నా అంశలోంచి వచ్చావు. "

ఆజ్ఞప్త ఏవం కుపితేన మన్యునా స దేవదేవం పరిచక్రమే విభుమ్
మేనేతదాత్మానమసఙ్గరంహసా మహీయసాం తాత సహః సహిష్ణుమ్

కోపించినవాడు కోపముతో ఆజ్ఞ్యాపించాడు (అంటే ఈ పని సహజ ప్రవృత్తి కాదు). అలా చెప్పిన తరువాత వీరభద్రుడు శంకరునికి ప్రదక్షిణం చేసి, నమస్కారం చేసి ఆజ్ఞ్య పొంది వెళ్ళాడు. ప్రదక్షిణం చేసి బయటకు వెళ్ళిన వీరభద్రుడు "నా బలాన్ని ఎవ్వరూ సహించలేరు. ఎవరినైనా నేను ఎదుర్కోగలను". పెద్దలకు ప్రదక్షిణం నమస్కారం చేసి వెళ్ళినవారికి ఇటువంటి శక్తి వస్తుంది.

అన్వీయమానః స తు రుద్రపార్షదైర్భృశం నదద్భిర్వ్యనదత్సుభైరవమ్
ఉద్యమ్య శూలం జగదన్తకాన్తకం సమ్ప్రాద్రవద్ఘోషణభూషణాఙ్ఘ్రిః

ఇలా శంకరుని అనుచరులు వెంట రాగా సిమ్హనాదాలు చేస్తూ గర్జిస్తూ, యమున్ని కూడా అంతము చేసేది అయిన శూలాన్ని తీసుకున్నాడు (జగదన్తకాన్తకం ). మహా వేగముగా పరిగెత్తాడు. పాదములకున్న ఆభరణాలు ధ్వనిస్తూ ఉండగా వెళుతూ ఉంటే,

అథర్త్విజో యజమానః సదస్యాః కకుభ్యుదీచ్యాం ప్రసమీక్ష్య రేణుమ్
తమః కిమేతత్కుత ఏతద్రజోऽభూదితి ద్విజా ద్విజపత్న్యశ్చ దధ్యుః

వాతా న వాన్తి న హి సన్తి దస్యవః ప్రాచీనబర్హిర్జీవతి హోగ్రదణ్డః
గావో న కాల్యన్త ఇదం కుతో రజో లోకోऽధునా కిం ప్రలయాయ కల్పతే

యజ్ఞ్య శాలలో ఉన్న వారు చూచుచుండగా ఉత్తర దిక్కు నుంచి ధుమ్ము వచ్చింది. చీకటి ఆవహించింది. బ్రాహ్మణులూ బ్రాహ్మణ పత్నులూ ఆలోచించసాగారు. గాలీ లేదూ, దొంగలూ లేరు. అయినా ధుమూ వస్తోంది. చండశాసనుడైన రాజు అయిన ప్రాచీన బర్హి కూడా ఉన్నాడు. గోధూలి అనుకుందామనుకున్నా అది సాయం కాలం కాదు. ఈ కారణాలు లేకుండా ధుమ్ము వస్తోందంటే ప్రళయం వస్తోందా?

ప్రసూతిమిశ్రాః స్త్రియ ఉద్విగ్నచిత్తా ఊచుర్విపాకో వృజినస్యైవ తస్య
యత్పశ్యన్తీనాం దుహితౄణాం ప్రజేశః సుతాం సతీమవదధ్యావనాగామ్

ప్రసూతి మొదలైన స్త్రీలు ఉద్వేగాన్ని పొందారు. వారు కారణాన్ని ఊహించారు. "ఇతను చేసిన అపరాధానికి ఇది ఫలితం" అని ఊహించారు. ఇతర పుత్రికలందరూ చూస్తూ ఉండగా, నిరపరాధిగా ఉన్న కన్నకూతురి శరీరం దహించుకుంటే ప్రజాపతి అయి ఉండీ చూస్తూ ఊరుకున్న ఫలితం ఇది.

యస్త్వన్తకాలే వ్యుప్తజటాకలాపః స్వశూలసూచ్యర్పితదిగ్గజేన్ద్రః
వితత్య నృత్యత్యుదితాస్త్రదోర్ధ్వజానుచ్చాట్టహాసస్తనయిత్నుభిన్నదిక్

అల్లుడేమన్నా చిన్నవాడా, ప్రతీకారం చేయలేని వాడా? ఆయన ప్రళయకారకుడు. ప్రళయకాలములో ప్రళయ తాండవం చేస్తాడు. జటలను మొత్తం విప్పివేసి, తన త్రిశూలం యొక్క కొసకు అష్టదిక్కజాలను ఉంచి తన యొక్క అట్టహాసముతో వచ్చే ధ్వనితో ఈ స్వామి అన్ని దిక్కులను భేధిస్తూ నృత్యం చేస్తాడు

అమర్షయిత్వా తమసహ్యతేజసం మన్యుప్లుతం దుర్నిరీక్ష్యం భ్రుకుట్యా
కరాలదంష్ట్రాభిరుదస్తభాగణం స్యాత్స్వస్తి కిం కోపయతో విధాతుః

అలాంటి మహా తేజస్వి అయిన శంకరున్ని సహించకుండా, ఆయన కనుబొమ్మ ముడివేస్తే తట్టుకోలేనివాడు ప్రవర్తించాడు. తన దన్ష్ట్రలతో అన్ని నక్షత్రాలను చెల్లచెదురు చేస్తాడు. ఇలాంటి వారికి అపకారం చేసిన వారికి మేలు కలగదు.

బహ్వేవముద్విగ్నదృశోచ్యమానే జనేన దక్షస్య ముహుర్మహాత్మనః
ఉత్పేతురుత్పాతతమాః సహస్రశో భయావహా దివి భూమౌ చ పర్యక్

ఇలా అక్కడ చేరిన వారు దక్షుని అపరాధాన్ని చెబుతున్నారు. ఇంతలో అక్కడ కొన్ని వేలకొలదీ మహోత్పాతాలు జరిగాయి అన్ని లోకాలలో.

తావత్స రుద్రానుచరైర్మహామఖో నానాయుధైర్వామనకైరుదాయుధైః
పిఙ్గైః పిశఙ్గైర్మకరోదరాననైః పర్యాద్రవద్భిర్విదురాన్వరుధ్యత

విదురా! ఇలాంటి మహా యజ్ఞ్య (బార్హస్పత్యం) శాలను రుద్రుని యొక్క అనుచరులు, వామనకులు (చిన్నవారు) పలురకములైన ఆయుధములు ధరించి, పసుపు పచ్చ వర్ణముతో ఉన్నవారు కొందరూ, మొసలి పొట్ట ఉన్నవారు కొందరు, పారిపోతున్నవారినీ ఉన్నవారినీ చుట్టుముట్టారు. యజ్ఞ్యశాలను ముట్టడించారు.

కేచిద్బభఞ్జుః ప్రాగ్వంశం పత్నీశాలాం తథాపరే
సద ఆగ్నీధ్రశాలాం చ తద్విహారం మహానసమ్

మహానసమ్ - వంటశాలను, పాత్రలనూ పాడు చేసారు. యజ్ఞ్య కుండములో మూత్రము పోసారు. మునులను బాధపెట్టారు. ముని పత్నులను భయపెట్టారు. కొందరు దానమిచ్చేవాటిని స్వీకరించారు. కొందరు పారిపోతున్నవారిని పట్టుకున్నారు.

రురుజుర్యజ్ఞపాత్రాణి తథైకేऽగ్నీననాశయన్
కుణ్డేష్వమూత్రయన్కేచిద్బిభిదుర్వేదిమేఖలాః

అబాధన్త మునీనన్యే ఏకే పత్నీరతర్జయన్
అపరే జగృహుర్దేవాన్ప్రత్యాసన్నాన్పలాయితాన్

భృగుం బబన్ధ మణిమాన్వీరభద్రః ప్రజాపతిమ్
చణ్డేశః పూషణం దేవం భగం నన్దీశ్వరోऽగ్రహీత్

బృగువును పట్టుకున్నారు మణిమంతుడు పట్టుకున్నాడు. దక్షున్ని వీరభద్రుడు, చండీశ్వరుడు పూషని, భగున్ని నందీశ్వరుడూ పట్టుకున్నారు.

సర్వ ఏవర్త్విజో దృష్ట్వా సదస్యాః సదివౌకసః
తైరర్ద్యమానాః సుభృశం గ్రావభిర్నైకధాద్రవన్

ఆయుధాలతో కాకుండా రాళ్ళతో కొట్టారు. కొడుతుంటే పారిపోయారు. అధ్వర్యువైన బృగువు శ్రువం తీసుకుని హోమం చేస్తూ ఉంటే

జుహ్వతః స్రువహస్తస్య శ్మశ్రూణి భగవాన్భవః
భృగోర్లులుఞ్చే సదసి యోऽహసచ్ఛ్మశ్రు దర్శయన్

ఆయన మీసాలు తీసి పారేసాడు. (తాత్కాలిక ఆవేశముతో మనం పని చేస్తే ఏ పని వలన దోషం చేసామో ఆ పనే చేస్తారు. దక్షున్ని నిందించినపుడు మీసాలు దువ్వుకుంటూ నవ్విన ఈయన మీసాలు లాగేశాడు).

భగస్య నేత్రే భగవాన్పాతితస్య రుషా భువి
ఉజ్జహార సదస్థోऽక్ష్ణా యః శపన్తమసూసుచత్

భగుని కళ్ళను (దక్షుడు తిడుతున్నప్పుడు కళ్ళతో సన్జ్యలు చేస్తూ నవ్వాడు).

పూష్ణో హ్యపాతయద్దన్తాన్కాలిఙ్గస్య యథా బలః
శప్యమానే గరిమణి యోऽహసద్దర్శయన్దతః

పూష యొక్క పళ్ళు రాలగొట్టాడు (ఇతను పళ్ళు బయటపెట్టి పెద్దగా నవ్వాడు). మనం ఏ పని చేస్తున్నా మనని గమనించేవారు ఉంటూనే ఉంటారు. ఎప్పుడూ ఇతరుల హానిని కోరకూడదు. ఇతరులు హాని చేస్తూ ఉంటే చూసి అభినందించకూడదు. వీలైతే వారించాలి. లేకుంటే తొలగిపోవాలి. లేకుంటే వారికి కూడా అందులో భాగం ఉంటుంది.

ఆక్రమ్యోరసి దక్షస్య శితధారేణ హేతినా
ఛిన్దన్నపి తదుద్ధర్తుం నాశక్నోత్త్ర్యమ్బకస్తదా

దక్షున్ని పడుకోబెట్టి అతని వక్షస్థలం మీద కూర్చుని శిరస్సును ఖండించడానికి ప్రయత్నించాడు. ఆ మెడ ఈ ఆయుధముతో తొలగలేదు. యజ్ఞ్యము చేసే యజమాని ఆయుధములతో చావడు. అందుకని శస్త్రములూ అస్త్రములూ ప్రయోగించినా అతనికి ఏమీ కాలేదు

శస్త్రైరస్త్రాన్వితైరేవమనిర్భిన్నత్వచం హరః
విస్మయం పరమాపన్నో దధ్యౌ పశుపతిశ్చిరమ్

అది చూసి ఆశ్చర్యపడి, ఆలోచించి. యజ్ఞ్యములో హవిస్సుని అర్పించే పశువులను సంహరించడానికి ఏ పద్దతి అవలంబించాలో అదే అవలంబించాడు. మంత్రాలతో జపం చేసి యజ్ఞములో ఒక్కొక్క అవయావానికీ సంబంధించిన మంత్రం చదివితే (సజ్ఞ్యపనం) ఆ జంతువు యొక్క ఆయా అవయవాలు చేతికి వస్తాయి. అప్పుడు దాన్ని హవిర్భాగముగా అర్పిస్తారు.

దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం స పతిర్మఖే
యజమానపశోః కస్య కాయాత్తేనాహరచ్ఛిరః

అలాంటి సంజ్ఞపన మంత్రముతో పశువైన యజమాని యొక్క శరీరమునుండి శిరస్సును వేరు చేసి అందులో పడేసాడు. భూత ప్రేత పిశాచాలు బాగా చేసావని మెచ్చుకున్నారు. ఇతరులు బాధపడ్డారు

సాధువాదస్తదా తేషాం కర్మ తత్తస్య పశ్యతామ్
భూతప్రేతపిశాచానాం అన్యేషాం తద్విపర్యయః

జుహావైతచ్ఛిరస్తస్మిన్దక్షిణాగ్నావమర్షితః
తద్దేవయజనం దగ్ధ్వా ప్రాతిష్ఠద్గుహ్యకాలయమ్

దక్షిణాగ్నులలో దక్షుని శిరస్సునే హవిస్సుగా ఇచ్చి హోమం చేసాడు. ఇలా దక్ష ప్రజాపతి యజ్ఞ్యాన్ని ధ్వంసం చేసి మళ్ళీ తన నివాసానికి తాను బయలు దేరాడు

No comments:

Post a Comment