Thursday, February 28, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పందొమ్మిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పందొమ్మిదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
అథాదీక్షత రాజా తు హయమేధశతేన సః
బ్రహ్మావర్తే మనోః క్షేత్రే యత్ర ప్రాచీ సరస్వతీ

నూరు అశ్వమేధ యాగాలు చేసాడు. మనువు యొక్క క్షేత్రమైన బ్రహ్మావర్తములో

తదభిప్రేత్య భగవాన్కర్మాతిశయమాత్మనః
శతక్రతుర్న మమృషే పృథోర్యజ్ఞమహోత్సవమ్

పృధు చక్రవర్తి ఇలా యజ్ఞ్యం చేస్తుంటే, నూరు యజ్ఞ్యాలు దగ్గరకు వచ్చాయి. నూరు యాగాలు చేస్తే ఇంద్రపదవి వస్తుంది. ఇంద్రుడు దాన్ని సహించలేదు

యత్ర యజ్ఞపతిః సాక్షాద్భగవాన్హరిరీశ్వరః
అన్వభూయత సర్వాత్మా సర్వలోకగురుః ప్రభుః
అన్వితో బ్రహ్మశర్వాభ్యాం లోకపాలైః సహానుగైః
ఉపగీయమానో గన్ధర్వైర్మునిభిశ్చాప్సరోగణైః
సిద్ధా విద్యాధరా దైత్యా దానవా గుహ్యకాదయః
సునన్దనన్దప్రముఖాః పార్షదప్రవరా హరేః
కపిలో నారదో దత్తో యోగేశాః సనకాదయః
తమన్వీయుర్భాగవతా యే చ తత్సేవనోత్సుకాః
యత్ర ధర్మదుఘా భూమిః సర్వకామదుఘా సతీ
దోగ్ధి స్మాభీప్సితానర్థాన్యజమానస్య భారత


యజ్ఞ్యపతి అయిన పరమాత్మ యజ్ఞ్యము మొదలైనప్పటినుండీ బ్రహ్మ రుద్రులతో, లోకపాలకులతో దిగ్పాలకులతో వారి అనుచరులతో గంధర్వులతో యక్షులతో పరమాత్మ ద్వారపాలకురైన నంద సునందులూ, ఋషులూ యోగులూ సిద్ధేశ్వరులూ అక్కడకి వచ్చి ఉన్నారు. ఈయన రాజ్యములో భూమి ఏది కావాలంటే అది ఇస్తోంది. యజ్ఞ్య సంబారాలన్నీ భూమే ఇస్తోంది.

ఊహుః సర్వరసాన్నద్యః క్షీరదధ్యన్నగోరసాన్
తరవో భూరివర్ష్మాణః ప్రాసూయన్త మధుచ్యుతః

చెట్లు అన్ని రసాలనూ ఇస్తున్నాయి. పాలూ పెరుగూ వెన్నా మొదలినవి చెట్లే ఇస్తున్నాయి. పళ్ళనీ రసలానూ ఇస్తున్నాయి. మకరందాన్నిస్తున్నాయి.

సిన్ధవో రత్ననికరాన్గిరయోऽన్నం చతుర్విధమ్
ఉపాయనముపాజహ్రుః సర్వే లోకాః సపాలకాః

సముద్రములు అన్న రాశులనిస్తున్నాయి. పర్వతాలు చతుర్విధాన్నాన్ని ఇస్తున్నయి. లోకపాలకులు కానుకలు తెచ్చి ఇస్తున్నారు

ఇతి చాధోక్షజేశస్య పృథోస్తు పరమోదయమ్
అసూయన్భగవానిన్ద్రః ప్రతిఘాతమచీకరత్

చరమేణాశ్వమేధేన యజమానే యజుష్పతిమ్
వైన్యే యజ్ఞపశుం స్పర్ధన్నపోవాహ తిరోహితః

తనకంటే మించిన అతిశయాన్ని చూచి అసూయ పడి విఘ్నం కలిగించాలనుకొని, ఇంద్రుడు యజ్ఞ్యాశ్వాన్ని చివరి నూరవ యజ్ఞ్యములో అపహరించుకుని వెళ్ళాడు.

తమత్రిర్భగవానైక్షత్త్వరమాణం విహాయసా
ఆముక్తమివ పాఖణ్డం యోऽధర్మే ధర్మవిభ్రమః

అది అత్రి మహర్షి తన యోగ దృష్టితో చూచాడు. ఆయన పాఖణ్డ (పాపానికి గుర్తయిన) వేషములో వెళుతున్నాడు. అది పృధు పుత్రునికి చెప్పాడు. అతను ధనుర్భాణాలు తీసుకుని

అత్రిణా చోదితో హన్తుం పృథుపుత్రో మహారథః
అన్వధావత సఙ్క్రుద్ధస్తిష్ఠ తిష్ఠేతి చాబ్రవీత్

తం తాదృశాకృతిం వీక్ష్య మేనే ధర్మం శరీరిణమ్
జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం న ముఞ్చతి

ఇంద్రుని వెనక "ఆగమంటూ " వెళ్ళాడు. ఇంద్రుని వేషం చూచాడు. జటలున్నాయి బూడిద పూసుకున్నాడు. అది చూచి బాణం వేయలేదు

వధాన్నివృత్తం తం భూయో హన్తవేऽత్రిరచోదయత్
జహి యజ్ఞహనం తాత మహేన్ద్రం విబుధాధమమ్

మళ్ళీ అత్రి మహర్షి ప్రోత్సహించాడు బాణముతో కొట్టమని.

ఏవం వైన్యసుతః ప్రోక్తస్త్వరమాణం విహాయసా
అన్వద్రవదభిక్రుద్ధో రావణం గృధ్రరాడివ

ఇలా పృధు చక్రవర్తి పుత్రుడు అత్రి మహర్షి మాట విని రావణున్ని జటాయువు వెంటాడినట్లు వెంటాడాడు..

సోऽశ్వం రూపం చ తద్ధిత్వా తస్మా అన్తర్హితః స్వరాట్
వీరః స్వపశుమాదాయ పితుర్యజ్ఞముపేయివాన్

ఆ గుర్రాన్ని వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు ఇంద్రుడు. ఆ గుర్రాన్ని తీసుకుని తండ్రి వద్దకు వచ్చాడు

తత్తస్య చాద్భుతం కర్మ విచక్ష్య పరమర్షయః
నామధేయం దదుస్తస్మై విజితాశ్వ ఇతి ప్రభో

ఆ పృధు కుమారుడు చాలా గొప్పవాడని ఎరిగిన యజ్ఞ్యము వద్ద ఉన్న వారందరూ ఇంద్రున్ని ఓడించి గుర్రాన్ని తీసుకు వచ్చినందుకు విజితాశ్వుడని పేరు పెట్టారు

ఉపసృజ్య తమస్తీవ్రం జహారాశ్వం పునర్హరిః
చషాలయూపతశ్ఛన్నో హిరణ్యరశనం విభుః

మళ్ళీ ఇంద్రుడు వచ్చి మొత్తం చీకటి చేసి బంగారు స్తంభానికి కట్టి ఉన్న గుర్రాన్ని బంగారు గొలుసుతో సహా తీసుకుని వెళ్ళాడు

అత్రిః సన్దర్శయామాస త్వరమాణం విహాయసా
కపాలఖట్వాఙ్గధరం వీరో నైనమబాధత

అత్రి మళ్ళీ తన దృష్టితో చూసి పట్టుకోమని చెప్పాడు. పృధు చక్రవర్తి దగ్గరకు వెళ్ళగా ఈ సారి ఇంద్రుడు ఒక చేతిలో పుర్రె ఇంకో చేతిలో కట్టే పట్టుకుని నించున్నాడు.

అత్రిణా చోదితస్తస్మై సన్దధే విశిఖం రుషా
సోऽశ్వం రూపం చ తద్ధిత్వా తస్థావన్తర్హితః స్వరాట్

వీరశ్చాశ్వముపాదాయ పితృయజ్ఞమథావ్రజత్
తదవద్యం హరే రూపం జగృహుర్జ్ఞానదుర్బలాః

ఆ రూపమును చూపించి మళ్ళీ ఇంద్రుడు అంతర్ధానమయ్యాడు.
జ్ఞ్యాన దుర్బలులైన వారు ఈ వ్రతాన్ని తీసుకున్నారు. ఎవరికి జ్ఞ్యానము లేదో వారు ఈ వేషాన్ని తీసుకున్నారు. దొంగతనం చేసిన వస్తువును కాపాడుకోవడానికి వేసిన వేషం ధర్మం అనుకున్న వారు.

యాని రూపాణి జగృహే ఇన్ద్రో హయజిహీర్షయా
తాని పాపస్య ఖణ్డాని లిఙ్గం ఖణ్డమిహోచ్యతే

అశ్వమును దొంగిలించడానికి ఇంద్రుడు ఏ ఏ రూపాలని స్వీకరించాడో అవి అన్నీ పాపముల యొక్క గుర్తులూ. పాపము చేయడానికి వెశిన వేషం పాపానికి గుర్తే కదా.

ఏవమిన్ద్రే హరత్యశ్వం వైన్యయజ్ఞజిఘాంసయా
తద్గృహీతవిసృష్టేషు పాఖణ్డేషు మతిర్నృణామ్

పరమోత్తములు అత్యుత్తమ కార్యము చేస్తున్న సందర్భములో వారాచరించే ఉత్తమ కార్యాలని భంగం చేయడానికి వచ్చేవారు ఆచరించే పనులు వేసే వేషాలు జ్ఞ్యాన బలహీనులని బాగా ఆకర్షిస్తాయి. ఈ ఉత్తమ కార్యాలను గాక, వాటిని చూచి అలాంటి వాటికి ఆకర్షితులవుతారు. భగవంతుడు యజ్ఞ్యము చేస్తున్నాడు, అక్కడే త్రిమూర్తులూ యోగులూ ఉన్నారు. ఇందరు ఉండి, మంచి వాడే తన పదవిని కాపాడుకోవడానికి అతని యొక్క పనిని విఘ్నం చేయడానికి కొన్ని వేషాలేస్తే, చూచిన వారికి ఆ వేషాలు నచ్చాయి గానీ యజ్ఞ్యం నచ్చలేదు. ఇంద్రుడు స్వీకరించి విడిచిపెట్టిన పాప లింగములైన వేషముల యందు మానవులకు మనసు కలిగింది

ధర్మ ఇత్యుపధర్మేషు నగ్నరక్తపటాదిషు
ప్రాయేణ సజ్జతే భ్రాన్త్యా పేశలేషు చ వాగ్మిషు

ధర్మముల లాంటివైన దిగంబరముగా ఉన్న, నల్లబట్టలు, ఎర్రబట్టలూ, తెల్ల బట్టలూ, వేసుకుని ఇదంతా వ్రతమూ, ఇదంతా ధర్మమూ అంటున్నారు. కానీ ఇదంతా పాఖణ్డములూ. ప్రజలు ఇలాంటి వాటి వెంట ఎక్కువ ఎందుకు వెళతారంటే ఆకర్చిందే వాటి యందు మనసు త్వరగా లగ్నమవుతుంది. అంతే కాక మాటకారులు చెప్పినవాటిని త్వరగా నమ్ముతారు

తదభిజ్ఞాయ భగవాన్పృథుః పృథుపరాక్రమః
ఇన్ద్రాయ కుపితో బాణమాదత్తోద్యతకార్ముకః

ఇదంతా చూసాడు పృధు చక్రవర్తి. ధనువు తీసుకుని బాణం ఎక్కుపెట్టాడు.

తమృత్విజః శక్రవధాభిసన్ధితం విచక్ష్య దుష్ప్రేక్ష్యమసహ్యరంహసమ్
నివారయామాసురహో మహామతే న యుజ్యతేऽత్రాన్యవధః ప్రచోదితాత్

మహోగ్రముగా ఉన్నవాడినీ, చూడ శక్యముగాని వాడినీ చూచి "దీక్షలో ఉన్నవాడు దేన్ని వధించమని యజ్ఞ్య శాస్త్రం చెప్పిందో దాన్నే వధించాలి, తక్కిన వాటి వధ శాస్త్ర విహితము కాదు"

వయం మరుత్వన్తమిహార్థనాశనం హ్వయామహే త్వచ్ఛ్రవసా హతత్విషమ్
అయాతయామోపహవైరనన్తరం ప్రసహ్య రాజన్జుహవామ తేऽహితమ్

ఇంద్రున్ని వధించాలని నీకుంటే మాకు చెప్పు. అతని పేరుతో పిలిచి "స్వాహా" అంటాము. నీ కోపముచేతనే ఆయన తేజస్సు చాలా పోయింది.  మొదలు ఈ పని పూర్తి చేసి నీ యజ్ఞ్యానికి అడ్డుగా వస్తున్న వాడిని కూడా హోమము చేస్తాము

ఇత్యామన్త్ర్య క్రతుపతిం విదురాస్యర్త్విజో రుషా
స్రుగ్ఘస్తాన్జుహ్వతోऽభ్యేత్య స్వయమ్భూః ప్రత్యషేధత

ఇలా పృధు చక్రవర్తిని ఆపి సృక్కును తీసుకుని ఇంద్రున్ని హోమములో వేయడానికి ఉద్యుక్తులవగా బ్రహ్మగారు వారించారు. యజ్ఞ్యము పరమాత్మ స్వరూపమే. ఇంద్రుడు కూడా పరమాత్మ స్వరూపమే.

న వధ్యో భవతామిన్ద్రో యద్యజ్ఞో భగవత్తనుః
యం జిఘాంసథ యజ్ఞేన యస్యేష్టాస్తనవః సురాః

యజ్ఞ్యం ఎవరికోసం చేస్తున్నరో వారిని చంపుతారా? ఇదెక్కడి ధర్మం. దేవతలందరూ ఎవరికి ఇష్టమో ఆయనని చంపాలనుకోవడం ధర్మవ్యతికరం

తదిదం పశ్యత మహద్ ధర్మవ్యతికరం ద్విజాః
ఇన్ద్రేణానుష్ఠితం రాజ్ఞః కర్మైతద్విజిఘాంసతా

ఇంద్రుడు రాజు యజ్ఞ్యాన్ని భంగం చేయడానికి చేసిన ప్రయత్నము నీవు వంద యజ్ఞ్యాలు చేయకుండా ఉండటానికి. నీవు తొంభై తొమ్మిది యజ్ఞ్యాలు చేసినవాడన్న పేరు చాలదా? ఆ ఇంద్రునికి స్వర్గము కూడా నీవిచ్చిన పదవే కదా.

పృథుకీర్తేః పృథోర్భూయాత్తర్హ్యేకోనశతక్రతుః
అలం తే క్రతుభిః స్విష్టైర్యద్భవాన్మోక్షధర్మవిత్

మోక్షం వద్దన్నవాడు యజ్ఞ్యాలు చేస్తాడు.

నైవాత్మనే మహేన్ద్రాయ రోషమాహర్తుమర్హసి
ఉభావపి హి భద్రం తే ఉత్తమశ్లోకవిగ్రహౌ

ఇంద్రుడి మీద నీవు కోపించరాదు. ఆయన లోకాలు ఆయనకున్నాయి. నీ రాజ్యము నీకున్నది, నీ తేజస్సుతోన్ గెలిచిన లోకాలూ నీకున్నాయి. ఇదరూ గొప్పవారే, మహానుభావులచే స్తుతింపబడే శరీరములు కలవారే

మాస్మిన్మహారాజ కృథాః స్మ చిన్తాం నిశామయాస్మద్వచ ఆదృతాత్మా
యద్ధ్యాయతో దైవహతం ను కర్తుం మనోऽతిరుష్టం విశతే తమోऽన్ధమ్

ఈ విషయములో ఎలాంటి దిగులూ పెట్టుకోకూ. మా మాట విను. భగవంతుడు చెడగొట్టిన దాన్ని చేయాలి అనుకున్నవారికి కోపం వస్తుంది ఆవేశం వస్తుంది బుద్ధి పాడవౌతుంది జ్ఞ్యానం నశిస్తుంది. ఆ పని కాలేదంటే "ఇది పరమాత్మకు ఇష్టం లేదేమో" అని పరమాత్మకు నమస్కరించాలి.
పరమాత్మ చెడగొట్టిన దాన్ని గురించి చేయడానికి ఆలోచించేవాడికి మనసు కోపాక్రాంతమవుతుంది. అజ్ఞ్యానములో చేరుతుంది. భగవంతుడు చెడగొట్టిన పని గురించి ఆలోచించవద్దు

క్రతుర్విరమతామేష దేవేషు దురవగ్రహః
ధర్మవ్యతికరో యత్ర పాఖణ్డైరిన్ద్రనిర్మితైః

ఈ యజ్ఞ్యము చాలు. యజ్ఞ్య ధర్మాన్ని దాటుతోంది. దేవతల మీద కోపం తెప్పించే యజ్ఞ్యం ఆపు. అంతటితో ఆగక ఇంద్రుడు వేసిన వేషాలని బలహీనులు చూచి వాటి వైపు ఆకర్షితులయ్యారు. దేవతలను దూషించి యజ్ఞ్యం చేస్తే ధర్మం వృద్ధి పొందదు సరి కదా అధర్మం పుడుతుంది.

ఏభిరిన్ద్రోపసంసృష్టైః పాఖణ్డైర్హారిభిర్జనమ్
హ్రియమాణం విచక్ష్వైనం యస్తే యజ్ఞధ్రుగశ్వముట్

ఇంద్రుడు సిగ్గుపడ్డాడు, భయపడ్డాడు పారిపోతున్నాడు. యజ్ఞ్యానికీ ద్రోహం చేసాడు అశ్వాన్నీ దొంగిలించాడు కొన్ని అధర్మ మార్గాలూ చూపాడు.

భవాన్పరిత్రాతుమిహావతీర్ణో ధర్మం జనానాం సమయానురూపమ్
వేనాపచారాదవలుప్తమద్య తద్దేహతో విష్ణుకలాసి వైన్య

ఆయా కాలానుగుణముగా ప్రజలకు ధర్మాన్ని బోధించడానికీ ఆచరించడానికీ నీవు పుట్టావు. వేనుడు చేసిన అపచారాన్ని ప్రక్షాళన చేసి లోకములో ధర్మాన్ని ఉద్ధరించడానికి నీవు పుట్టావు

స త్వం విమృశ్యాస్య భవం ప్రజాపతే సఙ్కల్పనం విశ్వసృజాం పిపీపృహి
ఐన్ద్రీం చ మాయాముపధర్మమాతరం ప్రచణ్డపాఖణ్డపథం ప్రభో జహి

నీవెందుకు పుట్టావో ఇంద్రున్ని ఎందుకు ఏర్పరచావో ఆలోచించు. ప్రజాపతులా ధర్మ రక్షకులా సంకల్పాన్ని పోషించాలి నీవు. యజ్ఞ్యము కన్నా నీవు ముందు చేయాల్సింది, ఇంద్రుడు బోధించిన ఉపధర్మాల ప్రచారాన్ని ఆపాలి. ఆ ఉపధర్మ ప్రవర్తకులను ద్వేషించూ వధించూ.

మైత్రేయ ఉవాచ
ఇత్థం స లోకగురుణా సమాదిష్టో విశామ్పతిః
తథా చ కృత్వా వాత్సల్యం మఘోనాపి చ సన్దధే

ఇలా బ్రహ్మ గారు ఆజ్ఞ్యాపిస్తే ఇంద్రుని మీద వాత్సల్యాన్ని చూపి ఇంద్రునితో సంధి చేసుకున్నాడు.

కృతావభృథస్నానాయ పృథవే భూరికర్మణే
వరాన్దదుస్తే వరదా యే తద్బర్హిషి తర్పితాః

హవిస్సుతో తృప్తి పొందిన దేవతలు అవభృత స్నానం పూర్తి చేసుకున్న పృధు చక్రవర్తికి వరాలు ఇచ్చారు. బ్రాహ్మణులు శ్రద్ధగా యజ్ఞ్యము చేసారు. యజమాని వారికి శ్రద్ధగా దక్షిణలు ఇచ్చాడు.

విప్రాః సత్యాశిషస్తుష్టాః శ్రద్ధయా లబ్ధదక్షిణాః
ఆశిషో యుయుజుః క్షత్తరాదిరాజాయ సత్కృతాః

పృధు చక్రవర్తికి బ్రాహ్మణులు ఆశీర్వాదాన్నిచ్చారు

త్వయాహూతా మహాబాహో సర్వ ఏవ సమాగతాః
పూజితా దానమానాభ్యాం పితృదేవర్షిమానవాః

"యజ్ఞ్యము చేయాలనుకుని నీవు పితృ దేవతలనూ దేవతలనూ ఋషులనూ మానవులనూ ఎవరిని పిలిచావో వారందరూ వచ్చారు. వారికి గౌరవ పూర్వకముగా నీవు దానం చేసావు." అని బ్రాహ్మణులందరూ పృధు చక్రవర్తికి ఆశీర్వాదాలు అందించారు.

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవైయ్యవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవైయ్యవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
భగవానపి వైకుణ్ఠః సాకం మఘవతా విభుః
యజ్ఞైర్యజ్ఞపతిస్తుష్టో యజ్ఞభుక్తమభాషత

తొంబైతొమ్మిది యజ్ఞ్యాలతో పరమాత్మ సంతోషించాడు. ఎందుకంటే ఆయానే యజ్ఞ్య భోగి (యజ్ఞ్య భుక్). పృధు చక్రవర్తితో పరమాత్మ ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
ఏష తేऽకార్షీద్భఙ్గం హయమేధశతస్య హ
క్షమాపయత ఆత్మానమముష్య క్షన్తుమర్హసి

ఇంద్రుడు నీ గుర్రము అపహరించాడు. నిన్ను నీవు శాంతింపచేసుకో. మనం చేసే ఏ పనీ ఆత్మ చేసినది కాదు. శరీరమే ఆత్మ అనుకున్నవారికే ఈ యజ్ఞ్యాలు

సుధియః సాధవో లోకే నరదేవ నరోత్తమాః
నాభిద్రుహ్యన్తి భూతేభ్యో యర్హి నాత్మా కలేవరమ్

ఒక పేరు పెట్టి ఒక ప్రాణిని సంబోదిస్తున్నావంటే ఆ పేరు ఆ ఆకారానికి గానీ ఆత్మకు కాదు. సత్పురుషులూ బుద్ధిమంతులూ ప్రాణులకు ద్రోహం చేయరు ఎందుకంటే శరీరమాత్మ కాదు కాబట్టి.
శరీరమే నేననే భావన కలగడముతో ఆ ఆత్మ బంధానికి గురవుతున్నదే గానీ ఆత్మ ఏ పనీ చేయదు. ఫలితం పొందేది శరీరం. ఆత్మ "నేను ఫలితాన్ని పొందుతున్నాను" అని అనుకుంటోంది.

పురుషా యది ముహ్యన్తి త్వాదృశా దేవమాయయా
శ్రమ ఏవ పరం జాతో దీర్ఘయా వృద్ధసేవయా

నీలాంటి వాడు కూడా దేవమాయతో మోహం చెందితే ఎంతో కాలం నుంచీ చేస్తోన్న పెద్దల సేవ కేవలం శ్రమగానే ఫలిస్తుంది. ఆత్మ జ్ఞ్యానం (శరీరం వేరు ఆత్మ వేరని) కలగడం  పెద్దలను సేవించడం వలన ప్రయోజనం.

అతః కాయమిమం విద్వానవిద్యాకామకర్మభిః
ఆరబ్ధ ఇతి నైవాస్మిన్ప్రతిబుద్ధోऽనుషజ్జతే

ప్రతీ వాడూ తెలుసుకోవలసినది, "ఇమం విద్వానవిద్యాకామకర్మభిః" - ఈ శరీరం పాంచభౌతికం (ఏ ప్రాణికైనా). ఆయా భూతముల ఆకారములు ఏర్పడడానికి ఏది కారణం. అజ్ఞ్యానం, కోరికా, ఆచరించిన పనులూ. కోరిక అజ్ఞ్యానము వలన కలుగుతుంది. జ్ఞ్యానికి కోరిక ఉండదు. ఆత్మకు ఇవేవీ ఉండవు. కోరిక పుట్టడం అంటే అజ్ఞ్యానమే. ఆ కోరిక తీర్చుకోవడానికే పని చేస్తారు. ఈ మూడిటితోటి (అవిజ్ఞ్యా కామ కర్మలు). తెలుసుకున్నవాడు (మేలుకొన్నవాడు) ఎవడూ ఈ శరీరం మీద ఆసక్తి కనపరచడు

అసంసక్తః శరీరేऽస్మిన్నమునోత్పాదితే గృహే
అపత్యే ద్రవిణే వాపి కః కుర్యాన్మమతాం బుధః

శరీరం మీదనే ఆసక్తి లేని వాడికి, శరీరముతో ఏర్పడిన ఇంటిమీదా పిల్లల మీదా ధనము బంధువుల మీదా ఆశ ఉంటుందా? శరీరం మీద వ్యామోహం తొలగించుకుంటేనే తక్కినవాటి మీద వ్యామోహం పెంచుకుంటాము. విరక్తి పొందినవాడు "నాకు - నేను" అనడు.

ఏకః శుద్ధః స్వయంజ్యోతిర్నిర్గుణోऽసౌ గుణాశ్రయః
సర్వగోऽనావృతః సాక్షీ నిరాత్మాత్మాత్మనః పరః

 ఇవి ఆత్మ లక్షణాలు. ఆత్మ ఏకః - ఇలాంటిది ఇంకోటి లేదు. జీవాత్మలు చాలా ఉన్నా అన్ని జ్ఞ్యానాశ్రయములే కాబట్టి ఏకః. ఆత్మకు రాగ ద్వేషాలు లేవు కాబట్టి శుద్ధము. ఆత్మ స్వయం జ్యోతి. ఆత్మకు సత్వ రజఓ తమో గుణాలు లేవు. ప్రకృతి సంబంధమైన గుణాలు లేవు కాబట్టి నిర్గుణః. గుణాశ్రయః - ఆత్మకున్న అష్టగుణాలు  కలవాడు. అంతటా వ్యాపించి ఉండేది ఆత్మ. కనుక సర్వగః. ఆత్మకు ఎలాంటి ఆవరణా లేదు, అనావృతః. పరమాత్మకు కూడా ఎలాంటి ఆవర్ణా లేదు. ఇంద్రియాలూ, పంచ్భూతములు అంతఃకరణమూ బుద్ధీ మనసూ చేసే వాటిని సాక్షిగా చూస్తూ ఉంటుంది. ప్రేరణా నివారణ ఉండదు. అందుకు సాక్షిః. . ఈ ఆత్మ శరీరము లేనివాడు. శరీరానికంటే వేరుగా ఉండేవాడు. ఇదీ ఆత్మయొక్క లక్షణం



య ఏవం సన్తమాత్మానమాత్మస్థం వేద పూరుషః
నాజ్యతే ప్రకృతిస్థోऽపి తద్గుణైః స మయి స్థితః


ఈ ఆత్మ పరమాత్మలో ఉంటుందీ, అంతటా వ్యాపించి ఉంటుందీ, అన్ని శరీరాలలోనూ ఉంటుంది, అన్ని ఆత్మలలో పరమాత్మ ఉంటాడని ఎవరైతే తెలుసుకుంటారో సంసారములో ప్రకృతిలో ఉన్నా ప్రకృతి గత గుణములు అంటుకోవూ. ఆత్మకు ఎటువంటి బంధమూ సంబంధమూ లేవు అని తెలుసుకున్నవాడు ప్రకృతిలో ఉన్నప్పటికీ ప్రకృతి యొక్క సత్వ రజ తమో గుణాలతో అంటుకోడు ఎందుకంటే వీడు నాలో ఉంటాడు


యః స్వధర్మేణ మాం నిత్యం నిరాశీః శ్రద్ధయాన్వితః
భజతే శనకైస్తస్య మనో రాజన్ప్రసీదతి

భాగావతం చెప్పేదే కపటము లేని ధర్మాన్ని. ఫలమును ఆశించి చేయుటే కాపట్యం
తన ధర్మముతో వారి వారి ధర్మాలకు అనుగుణముగా భగవంతుని కోరికలు లేకుండా ఆరాధించాలి. ధర్మమని ఆరాధించాకి. కోరికలు లేకపోయినా కోరికలు కోరేవారికంటే ఎక్కువ శ్రద్ధగా ఆరాధించాలి. ఇలా ఆరాధిస్తే మెల్లగా వారి మనసు ప్రసన్నమవుతుంది.  మనసుకి ఉన్న మురికంతా పోతుంది. మనసు యొక్క అసలు మురికి కోరిక.
ఆ మురికి పోవాలంటే భగవంతుని ఆరాధించాలి.

పరిత్యక్తగుణః సమ్యగ్దర్శనో విశదాశయః
శాన్తిం మే సమవస్థానం బ్రహ్మ కైవల్యమశ్నుతే

ఎపుడైతే మనసు నిర్మలమవుతుందో (రాగ ద్వేషములు వదిలిపెట్టి) ఉన్నదన్ని ఉన్నట్లు (శరీరమూ ఆత్మా వేరు అని) తెలుసుకుని పరిశుద్ధమైన మనసు కలిగి, శాంతుడై (ఎలాంటి ఉపద్రవాలు ద్వేషమూ కోపమూ లేకుండా) ఏకాకారముతో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకుంటాడు.

ఉదాసీనమివాధ్యక్షం ద్రవ్యజ్ఞానక్రియాత్మనామ్
కూటస్థమిమమాత్మానం యో వేదాప్నోతి శోభనమ్

ఎవరు శాంతినీ శుభాన్నీ మంగళాన్నీ పొందుతారు? ఈ ఆత్మ నిర్వికారమూ నిరంజనమూ. దీనికి దేనితోనూ సంబంధము లేదు. ఈ ఆత్మకు ఏ వికారమూ లేదు అని తెలుసుకోవాలి. ఆత్మంటే ద్రవ్య జ్ఞ్యాన క్రియలకు ( పంచభూతాలు, జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు) ఈ ఆత్మ అధ్యక్షుడు. అంటే వీటి ప్రవృత్తి కలిగేదీ కలిగించేదీ ఆయనలోనే. అధ్యక్షుడై ఉండి కూడా ఆత్మ కూటస్థుడు (నిర్వికారుడని) అని తెలుసుకుంటారో వారు మంగళాన్ని పొందుతారు. ఆసక్తీ అనాసక్తి ఉండదు ఆత్మకు అని ఎవరు తెలుసుకుంటారో వారు శుభాన్ని పొందుతారు

భిన్నస్య లిఙ్గస్య గుణప్రవాహో ద్రవ్యక్రియాకారకచేతనాత్మనః
దృష్టాసు సమ్పత్సు విపత్సు సూరయో న విక్రియన్తే మయి బద్ధసౌహృదాః

ప్రకృతీ ప్రపంచం శరీరాం మానావమానాలు సుఖదుఃఖాలు ఇవన్నీ శరీరానివి
ప్రకృతి కంటే వేరుగా ఉన్నవాడు ఆత్మ. కానీ ప్రకృతితో ఉండి ప్రకృతినే తన గుర్తుగా పెట్టుకున్నాడు. ఒక పంచభూతాలను ముద్ద చేసి ఆ ముద్దలో సత్వ రజ తమస్సు వేసి పంచభూతాలూ జ్ఞ్యాన కర్మేంద్రియాలు వేస్తే శరీరం. ఇది ఆత్మకంటే భిన్నం. ప్రకృతితో ఏర్పడిన ఆకారం.

ఆత్మకు వీటితో ఏ సంబంధమూ లేదు. ఇందులో వచ్చి ఆత్మ చేరి ఇవన్నీ నావి అనుకుంటోంది. అది తప్ప ఆత్మకూ శరీరానికీ సంబంధము లేదు. ఈ స్వరూపం తెలిస్తే. ద్రవ్య క్రియా కారకాలతో ఏర్పడిన ఆకారములో ఆత్మ ఉంటుందీ. సంపత్తులూ విపత్తులూ మానావమానాలు సుఖమూ దుఃఖమూ ఎవరికి? శరీరానికి. రోగమంటే పంచభూతములు ఈ శరీరములో ఎక్కువ తక్కువలైతే రోగము వస్తుంది. మొత్తం శరీరానికి తగ్గితే ఒక రోగము, ఒక భాగములో తగ్గితే ఒక రోగమూ వస్తుంది. కాబట్టి ఆపదలలో గానీ సంపత్తులలో గానీ జ్ఞ్యానులెవరూ వికారం చెందరు నా యందు దృఢమైన భక్తి కలవారు కాబట్టి. వారికి కావలసింది నేనే.


సమః సమానోత్తమమధ్యమాధమః సుఖే చ దుఃఖే చ జితేన్ద్రియాశయః
మయోపక్లృప్తాఖిలలోకసంయుతో విధత్స్వ వీరాఖిలలోకరక్షణమ్

ఆత్మ తత్వం తెలిసిన వాడు సమముగా ఉంటాడు. అందరిలో సమముగా ఉంటాడు. ఉత్తమ మధ్య అధములలో కూడా సమానముగా ఉంటాడు. అలాంటి వాడికి సుఖము మీదా దుఃఖము మీదా అనురక్తీ విరక్తీ ఉండదూ ఎందుకంటే ఇంద్రియాలనూ మనసునూ జయించినవాడు. నీవు రాజ్యాన్ని ఇలా పరిపాలించు. నేను ప్రసాదించిన సకల లోకములూ కలిగినవాడవవి వాటిని ఈ రీతిలో రక్షించు

శ్రేయః ప్రజాపాలనమేవ రాజ్ఞో యత్సామ్పరాయే సుకృతాత్షష్ఠమంశమ్
హర్తాన్యథా హృతపుణ్యః ప్రజానామరక్షితా కరహారోऽఘమత్తి


ఈ ఆత్మ ఏ శరీరన్ని తీసుకుని వచ్చిందో, అది ఏ జాతికి చెందినదో ఆ ధర్మాన్ని పాలించాలి. కానీ నేను చేస్తున్నాను అనకూడదు. రాజుకు ప్రజాపాలన వలనే కీర్తి పెర్గుతుంది. రాజు సక్రమముగా ప్రజాపాలన చేస్తే అతను శరీరన్ని విడిచి వెళ్ళేప్పుడు అతని చేత పరిపాలించబడిన ప్రజలు చేసిన పుణ్యములో ఆరవ భాగం తీసుకుని వేలతాడు. లేకుంటే వారు చేసిన పాపములో ఆరవ భాగాన్ని తీసుకుని నరకములోకి వెళతాడు. రాజు చేసిన పుణ్యాన్ని కూడా వారే తీసుకుంటారు. ప్రజలు పాపం చేసారంటే ఆ పాపం వారితో ఆ పాపం చేయనిచ్చిన రాజుది.
ప్రజలు పన్ను కట్టేది "మా జీవనం సక్రమముగా కొనసాగడానికి అడ్డంకులు తొలగించమని" కడతారు. ధర్మ బద్ధముగా సంపాదించుకునేందుకు అవకాశం కోసం ఆదాయపు పన్ను. ఏమీ చేయకుండా పన్ను తీసుకుంటే వారి పాపం రాజుకీ రాజు పుణ్యం ప్రజలకూ వస్తాయి. రక్షించకుండా పన్ను తీసుకునే వాడు ప్రజల పాపాన్ని భుజిస్తాడు.
అందుకే కరువు వస్తే పృధు చరిత్ర పదకొండు రోజులు చెప్పుకునేవారు

ఏవం ద్విజాగ్ర్యానుమతానువృత్త ధర్మప్రధానోऽన్యతమోऽవితాస్యాః
హ్రస్వేన కాలేన గృహోపయాతాన్ద్రష్టాసి సిద్ధాననురక్తలోకః

నీవు బ్రాహ్మణులతో అథితులతో ఆమోదించబడిన ధర్మాన్ని అనుసరిస్తూ, ప్రజలందరినీ వారిలో ఒకడివై పరిపాలించాలి (నేను ప్రజా సేవకున్ని అన్న భావనతో చేయాలి). వారిలో తాను కూడా ఒకడన్న భావనతో పరిపాలించాలి. ఇలా చేస్తే చాలా సిద్ధులు (సనకాదులు) నీ దగ్గరకు వస్తారు (పద్మ పురాణం - అధర్మం పోకూడదని వారు సామాన్యుల ఇంటికి రారు). వారిని నీవు చూడగలవు.

వరం చ మత్కఞ్చన మానవేన్ద్ర వృణీష్వ తేऽహం గుణశీలయన్త్రితః
నాహం మఖైర్వై సులభస్తపోభిర్యోగేన వా యత్సమచిత్తవర్తీ

ఇంత సేపు ఇక్కడ ఉండి నీ పూజలను పొందాను. నీ స్వరూప స్వభావాన్ని చూచాను. నీకు ఏమి కావాలో చెప్పు. నా నుండి ఏదైనా వరమును పొందు. నేను నీ గుణమునకూ స్వభావానికీ వశమయిపోయాను. నేను  యోగాలూ యాగాలు యజ్ఞ్యాలు మొదలైన వాటితో లొంగేవాడిని కాదు. నాకు అందరూ సమానమే. అందరితో సమానమైన భావనతో ఉన్న నన్ను కూడా నీవు ఆకర్షించి వశం చేసుకున్నావు. నీవు పుణ్యాత్ముడవు

మైత్రేయ ఉవాచ
స ఇత్థం లోకగురుణా విష్వక్సేనేన విశ్వజిత్
అనుశాసిత ఆదేశం శిరసా జగృహే హరేః

లోకగురువైన స్వామి చేత ఆదేశించబడి ఆయన ఆజ్ఞ్యను శిరసా వహించాడు. పరమాత్మ మాట్లాడినంత సేపూ ఇంద్రుడు పక్కనే ఉన్నాడు. పరమాత్మ మాట్లాడటం పూర్తి అవ్వగానే పక్కన ఉన్న ఇంద్రుడు

స్పృశన్తం పాదయోః ప్రేమ్ణా వ్రీడితం స్వేన కర్మణా
శతక్రతుం పరిష్వజ్య విద్వేషం విససర్జ హ

తను చేసిన పనికి సిగ్గుపడి పృధు చక్రవర్తి కాళ్ళు పట్టుకోబోతుంటే అతన్ని వారించి పృధు చక్రవర్తి పగని మరచిపోయి ఆలింగనం చేసుకున్నాడు. (నూరు యజ్ఞ్యాల ఫలితాన్ని పాడు చేసినా ఇంద్రుని మీద కోపం విడిచి పెట్టాడు)

భగవానథ విశ్వాత్మా పృథునోపహృతార్హణః
సముజ్జిహానయా భక్త్యా గృహీతచరణామ్బుజః

ఇలా పరమాత్మ పృధు చక్రవర్తితో అన్ని రకాల ఆరాధనలతో ఆరాధించబడ్డాడు. పరమాత్మ ఎదురుగా ఉన్న కొద్దీ పృధు చక్రవర్తికి ఆయన మీద భక్తి పెరుగుతోంది. స్వామి పాదాలను గట్టిగా పట్టుకున్నాడు

ప్రస్థానాభిముఖోऽప్యేనమనుగ్రహవిలమ్బితః
పశ్యన్పద్మపలాశాక్షో న ప్రతస్థే సుహృత్సతామ్

పుండరీకాక్షుడైన స్వామి కూడా వెళ్ళడానికి లేవబోతూ, పృధువును వదిలి వెళ్ళడం ఇష్టం లేక, ఆయన మీద అనుగ్రహముతో వెళ్ళలేకపోయాడు. ఆయన మంచి వారికి మిత్రుడు - సుహృత్సతామ్

స ఆదిరాజో రచితాఞ్జలిర్హరిం విలోకితుం నాశకదశ్రులోచనః
న కిఞ్చనోవాచ స బాష్పవిక్లవో హృదోపగుహ్యాముమధాదవస్థితః

ఆది రాజైన పృధు చక్రవర్తి పరమాత్మకు చేతులు జోడించి బాగా చూడాలనుకున్నాడు గానీ స్వామి వెళ్ళబోతుంటే నీళ్ళు నిండిన కళ్ళతో స్పష్టముగా స్వామిని చూడలేకపోతున్నాడు. కన్నీళ్ళ వలన, గొతు పూడ్చుకు పోయి మాటలు కూడా సరిగా మాట్లాడలేకపోయాడు.  భావనతో పరమాత్మను ఆలింగనం చేసుకున్నాడు

అథావమృజ్యాశ్రుకలా విలోకయన్నతృప్తదృగ్గోచరమాహ పూరుషమ్
పదా స్పృశన్తం క్షితిమంస ఉన్నతే విన్యస్తహస్తాగ్రమురఙ్గవిద్విషః

కన్నీళ్ళు తుడుచుకుని స్వామిని చూస్తూ తృప్తి పొందక రెండు కాళ్ళూ భూమి మీద ఉంచి గరుత్మంతుని భుజము మీద చేయి వేసి ఉన్న పరమాత్మతో ఇలా అన్నాడు
(దేవతల పాదాలు భూమిని తాకవు. పరమాత్మ పాదాలని భూమిని తాకించాడంటే? ఎదురుగా భక్తుడుంటే దైవత్వాన్ని కూడా మరచిపోయాడు. భక్తానుగ్రహ కాంక్షలో పరవశుడై ఉన్నాడు. గరుడుని మీద చేయి వేయడం అంటే తనను మరి కాస్త చూడాలని ఆలస్యం చేస్తున్నాడు. నేను మీ వాన్ని అని మనకు చెప్పే ప్రయత్నం)

పృథురువాచ
వరాన్విభో త్వద్వరదేశ్వరాద్బుధః కథం వృణీతే గుణవిక్రియాత్మనామ్
యే నారకాణామపి సన్తి దేహినాం తానీశ కైవల్యపతే వృణే న చ

స్వామీ! వరముని కోరుకోమన్నావు గానీ, జ్ఞ్యానమున్నవాడెవరైనా వరాలు అడుగుతాడా. మాటి మాటికీ మారిపోయేవి, గుణములచేత వికారం చెందేవి అయిన వరములను ఎందుకు కోరాలి. కోరుకునే ప్రతీ వరమూ కలిగే ప్రతీ ఫలం అంతలోనే మారిపోయేదే కదా? కర్మల వలన కలిగే ఫలితం నశించేదే. నశించని ఫలితం మనం చేసే పనుల వలన రాదు. పరమాత్మ కృపతో రావాలి. నరకములో ఉన్న వారు కూడా కోరికలు కలిగే ఉంటారు. ఆ కోరికలు ప్రతీ క్షణమూ మారేవే. సుఖము పేరుతో దుఃఖాన్ని కలిగిస్తాయి. నీవు కైవల్య పతివి. మోక్షం ఇచ్చేవాడివి

న కామయే నాథ తదప్యహం క్వచిన్న యత్ర యుష్మచ్చరణామ్బుజాసవః
మహత్తమాన్తర్హృదయాన్ముఖచ్యుతో విధత్స్వ కర్ణాయుతమేష మే వరః

అయినా నీలాంటి వారు వరము కోరుకోమంటే కోరకుంటే తప్పు. నాకు మోక్షం కూడా వద్దు. మహానుభావుల ముఖ పద్మమునుండి వచ్చే నీ కథలు లేని మోక్షము నాకు వద్దు. నాకోక కోరిక ఉంది. నకు పదివేల చెవులు కావాలి. వాటితో నిరంతరం నీ కథలను వినాలి.

స ఉత్తమశ్లోక మహన్ముఖచ్యుతో భవత్పదామ్భోజసుధా కణానిలః
స్మృతిం పునర్విస్మృతతత్త్వవర్త్మనాం కుయోగినాం నో వితరత్యలం వరైః

మహానుభావా (ఉత్తమశ్లోక) మహానుభావుల ముఖము నుండి వెలువడే నీ పాదపద్మముల వలన వెలువడే నీ కథ అనే గాలి దేహాత్మ తత్వాన్ని భాగవత తత్వాన్నీ భగవత్ తత్వాన్నీ మరచిపోయిన మాలాంటి కుయోగులకు గుర్తు చేస్తుంది.

యశః శివం సుశ్రవ ఆర్యసఙ్గమే యదృచ్ఛయా చోపశృణోతి తే సకృత్
కథం గుణజ్ఞో విరమేద్వినా పశుం శ్రీర్యత్ప్రవవ్రే గుణసఙ్గ్రహేచ్ఛయా

చక్కని కీర్తి (కథా) గల మహానుభావా, సజ్జనులతో సమాగమమై నీ సంకల్పముతో నీ కథను చాలా సార్లు వినే వాడూ, నీ గుణముల యందు రుచి ఉన్నవాడూ "ఇంక చాలు" అనడు. పశువు తప్ప మరెవ్వరు చాలూ అంటారు?
అమ్మవారు నిన్ను వరించడానికి కారణం నిరంతరం నీ గుణాలను వినాలన్న కోరికతోనే.

అథాభజే త్వాఖిలపూరుషోత్తమం గుణాలయం పద్మకరేవ లాలసః
అప్యావయోరేకపతిస్పృధోః కలిర్న స్యాత్కృతత్వచ్చరణైకతానయోః

నీవు క్షేత్ర క్షేత్రజ్ఞ్యులకు పతివి. కారుణ్య వాత్సల్యాది గుణాలు కలవాడవు. నిన్ను నేను అమ్మవారి వలెనే కోరుకుంటున్నాను. మా ఇద్దరికి నీవే పతివి. ఇద్దరమూ ఒకే భర్తను కోరుతున్నాము. అయినా మాకు కలహం కలగదు. ఎందుకంటే మా ఇద్దరికీ నీ పాదాలే కావాలి. (నీవు సహస్ర పాదములు కలవాడివి)

జగజ్జనన్యాం జగదీశ వైశసం స్యాదేవ యత్కర్మణి నః సమీహితమ్
కరోషి ఫల్గ్వప్యురు దీనవత్సలః స్వ ఏవ ధిష్ణ్యేऽభిరతస్య కిం తయా

ఒక వేళ మా ఇద్దరికీ కలహం వచ్చినా మంచిదే. మా ఇద్దరి కోరికా ఒకే పని మీద ఉంది. నీ గుణాలు వినాలనే. అయినా నాకు భయం లేదు. భక్త పక్షపాతి అయిన నీవు మా వైపే ఉంటావు. ఇంద్రుడితో కలహం వచ్చినప్పుడు కూడా నీవు నా పక్షమే కదా. నీ భక్తులు ఎంత చిన్న సేవ చేసినా దాన్ని గొప్పగా చూస్తావు. నీవు దీన వత్సలుడివి. దైన్యం ఎక్కువగా ఉన్న నాయందు దయ ఎక్కువ చూపుతావు. ఏ కోరికలూ లేని నీవు నా వైపే ఉంటావు, అమ్మవారితో నీకేమి పని (కోరికలున్నవారు నిన్ను వదిలి అమ్మను ఆరాధిస్తారు).

భజన్త్యథ త్వామత ఏవ సాధవో వ్యుదస్తమాయాగుణవిభ్రమోదయమ్
భవత్పదానుస్మరణాదృతే సతాం నిమిత్తమన్యద్భగవన్న విద్మహే

ఇందుకోసమే సజ్జనులూ భక్తులూ ఉత్తములూ నిన్ను సేవిస్తారు. నీ భక్తులను చూస్తే కట్టుకున్న భార్యనే పట్టించుకోవు. మాయతో ఏర్పడే సత్వ రజ తమో గుణాభివృద్ధిని తొలగించేవాడివి. నీ పాదములను స్మరించడం కంటే వేరే వరము మేమే కాదు, భక్తులెవ్వరికీ తెలియదు. సత్పురుషులకు భగవానుని పాద పద్మాలు తప్ప వేరే కోరేది ఉందని తెలియదు

మన్యే గిరం తే జగతాం విమోహినీం వరం వృణీష్వేతి భజన్తమాత్థ యత్
వాచా ను తన్త్యా యది తే జనోऽసితః కథం పునః కర్మ కరోతి మోహితః

బహుశా అన్ని లోకాలను మోహింపచేసేది నీ మాట. నన్ను కూడా మోహింపచేయడానికే అది ప్రయోగించావు, వరము కోరుకోమని. ప్రేమతో మాట్లాడిన నీ మాటల మాయతో, మోహింపచేసే వాక్కుతో బంధిచబడిన వారు మళ్ళీ మోహం పొంది వేరే పని ఎలా చేస్తారు.

త్వన్మాయయాద్ధా జన ఈశ ఖణ్డితో యదన్యదాశాస్త ఋతాత్మనోऽబుధః
యథా చరేద్బాలహితం పితా స్వయం తథా త్వమేవార్హసి నః సమీహితుమ్

నీ మాయతో మోహించబడిన మానవులు నీ కంటే భిన్నమైనదాన్ని కోరుకుంటే వాడు అజ్ఞ్యాని. కాసేపు నీవు మాకు అమ్మ అనుకోకుండా నాన్న అనుకో. తల్లి అడిగినదిస్తుంది. తండ్రి మేలు కోరేదిస్తాడు. అలాగే మా హితాన్ని నీవు కోరాలి. మాచే వరమడిగిస్తావా లేదా నీ సేవ చేయించుకుంటావా? తండ్రి హితాన్ని కోరినట్లుగా మా హితం తెలిసినవాడవు నీవే ఏది మంచిదో అదే చేయి.

మైత్రేయ ఉవాచ
ఇత్యాదిరాజేన నుతః స విశ్వదృక్తమాహ రాజన్మయి భక్తిరస్తు తే
దిష్ట్యేదృశీ ధీర్మయి తే కృతా యయా మాయాం మదీయాం తరతి స్మ దుస్త్యజామ్

ఇలా అది రాజు స్తోత్రం చేస్తే పరమాత్మ "నీకు నా మీద భక్తి నిరంతరం ఇలాగే ఉండనీ. ఈ భక్తితో ఇతరులు దాటలేని సంసారాన్ని నీవు దాటుతావు"

తత్త్వం కురు మయాదిష్టమప్రమత్తః ప్రజాపతే
మదాదేశకరో లోకః సర్వత్రాప్నోతి శోభనమ్

నేను చెప్పినట్లుగా ఏమరుపాటు లేకుండా పాలించు. నా మాట వినే వారు అన్ని చోట్లా మంచే పొందుతారు.

మైత్రేయ ఉవాచ
ఇతి వైన్యస్య రాజర్షేః ప్రతినన్ద్యార్థవద్వచః
పూజితోऽనుగృహీత్వైనం గన్తుం చక్రేऽచ్యుతో మతిమ్

ఈ ప్రకారముగా పృధు చక్రవర్తి మాట్లను అభినందించి అతనిచే పూజించబడి పరమాత్మ వెళ్ళాలనుకున్నాడు

దేవర్షిపితృగన్ధర్వ సిద్ధచారణపన్నగాః
కిన్నరాప్సరసో మర్త్యాః ఖగా భూతాన్యనేకశః
యజ్ఞేశ్వరధియా రాజ్ఞా వాగ్విత్తాఞ్జలిభక్తితః
సభాజితా యయుః సర్వే వైకుణ్ఠానుగతాస్తతః

పరమాత్మే కాకుండా ఇతరులందరూ పృధు చక్రవర్తి చేసిన పూజలు స్వీకరించి పరమాత్మ వెళ్ళగానే అందరూ తమ తమ స్థానాలకు వెళ్ళారు

భగవానపి రాజర్షేః సోపాధ్యాయస్య చాచ్యుతః
హరన్నివ మనోऽముష్య స్వధామ ప్రత్యపద్యత

పరమాత్మ కూడా అందరి మనసునూ దొంగలించుకొని వెళ్ళినట్లుగా వెళ్ళాడు.

అదృష్టాయ నమస్కృత్య నృపః సన్దర్శితాత్మనే
అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ

పరమాత్మ వెళ్ళిన తరువాత పృధు చక్రవర్తి పరమాత్మ వెళ్ళిన దిక్కుకి నమస్కరించాడు. దేవతలందరికీ దేవుడైన పరమాత్మకి నమస్కారం చేసి తన నగరానికి తాను వెళ్ళాడు

Wednesday, February 27, 2013

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 10

1. పూర్వం విత్తనం వేయటానికి ఊరిబయటకు వెళ్ళీ భూమినీ నాగలినీ దేవతలనీ బ్రాహ్మణులనీ ఎద్దులనీ వరుణున్నీ పూజించి ప్రారంభించేవారు. పంట పండించడమే కాదు భోజనం చేయడం కూడా వ్రతం. బ్రతికేదీ పుట్టేదీ అన్నముతో. భోజనవ్రతం. కాళ్ళూ చేతులూ కడుకున్ని ఆచమనం చేసి హృదయములో స్వామిని ఆరాధించి, భోజనానికి అనుమతి తీసుకోవాలి, పాత్రను మూడు సార్లు ప్రోక్షించాలి, పదహారు సార్లు ఆచమనం చేయాలి భోజనం చేసే ముందు, చేసిన తరువాత ఇరవై నాలుగు సార్లు ఆచమనం చేయాలి, దాని వలన చిగుళ్ళమధ్య ఇరుక్కున్నవి పోతాయి, చేతిని పదహారు సార్లు కడుక్కోవాలి.
కోపముతోనూ ఏడుస్తూ అరుస్తూ కలహిస్తూ నిందిస్తూ కాళ్ళూ చేతులూ ఒళ్ళూ ఊపుతూ, సంగీతం వింటూ భోజనం చేయకూడదు. ఆచమనం చేసి తినడం వలన అన్న నాళములో ఏమీ అడ్డురాకుండా ఉంటుంది. అన్నము సరిగ్గా లోపలకి వెళుతుంది

2. సమాం చ కురు మాం రాజన్దేవవృష్టం యథా పయః
అపర్తావపి భద్రం తే ఉపావర్తేత మే విభో

ఎత్తువంపులుగా ఉన్న నన్ను సమానము చేయి. కురిసిన నీరు అన్ని ప్రాంతాలలోకీ సమానముగా వెళుతుంది. ఇంకిన తరువాత కొంత నీరు నిలువ ఉండేట్లు చేయి. వర్షాకలం కాని సమయములో కూడా భూమి మీద నీరు నిలువ ఉండేలా చేయి. భగవంతుని చేత వర్షించిన నీరు వర్షాకాలం కాని సమయములో కూడా మీకందరికీ అందాలి
3. యద్ధ్యాయతో దైవహతం ను కర్తుం మనోऽతిరుష్టం విశతే తమోऽన్ధమ్
భగవంతుడు చెడగొట్టిన దాన్ని చేయాలి అనుకున్నవారికి కోపం వస్తుంది ఆవేశం వస్తుంది బుద్ధి పాడవౌతుంది జ్ఞ్యానం నశిస్తుంది. ఆ పని కాలేదంటే "ఇది పరమాత్మకు ఇష్టం లేదేమో" అని పరమాత్మకు నమస్కరించాలి.
పరమాత్మ చెడగొట్టిన దాన్ని గురించి చేయడానికి ఆలోచించేవాడికి మనసు కోపాక్రాంతమవుతుంది. అజ్ఞ్యానములో చేరుతుంది. భగవంతుడు చెడగొట్టిన పని గురించి ఆలోచించవద్దు

4. శరీరం ఉన్న వాడు తింటే శరీరము లేని వాడి కడుపు నిండుతుంది. పాంచభౌతిక శరీరం లేని వాడికి శరీరం ఉన్నవాడు తింటే కడుపు నిండుతుంది. అగ్ని జలము వలన పుడుతుంది (విద్యుత్ శక్తి). సజాతీయములతో పుట్టుక జరుగదు. విద్యుత్తు నీటి నుండి పుడుతుంది. వేడికి సంబంధించిన దానితో వేడి పుట్టదు. విజాతీయం ( విరుద్ధమైన ధర్మం) ఉన్న వాటితోనే పుడుతుంది. అలాగే శరీరం లేని వాడికి కడుపు నిండాలంటే శరీరం ఉన్నవాడు తినాలి. మరి శరీరం లేని వాడికి కడుపుంటుందా? ఉండదు. కానీ మనసు ఉంటుంది. అది నిండితే చాలు. ఎక్కడో ఉన్న కొడుకుకు మేలు జరిగితే (ఉదా: మనవడు పుడితే) ఇక్కడే ఉన్న తండ్రి మనసు నిండుతుంది. అంటే తృప్తి అనేది ఎక్కడ ఉన్నా పుడుతుంది. అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. పరలోకములోకి నిండేది కడుపు కాదు తృప్తి. ఈ లోకములో పూజిస్తే పైలోకములో ఉన్నవాడు తృప్తిపడతాడు.

5. గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణతేऽను సమ్పదః
ప్రసీదతాం బ్రహ్మకులం గవాం చ జనార్దనః సానుచరశ్చ మహ్యమ్

సంపదలు ఎవరి దగ్గరకు వస్తాయి? అన్ని మంచి గుణములూ కలవాడికి, ఉత్తం శీలము కలవాడికి, చేసిన ఉపకారం మరచిపోని వాడికీ, పెద్దవారిని ఆశ్రయించి ఉన్నవాడికీ అన్ని సంపదలూ స్వయముగా వచ్చి వరిస్తాయి. కాబట్టి అలాంటి బ్రాహ్మణోత్తములు గోవులూ దేవతలూ పరమాత్మ నా విషయములో ప్రసన్నమవుదురు గాక.

6. సప్తర్షులు యజ్ఞ్యం నిర్వహించినపుడు ఋషులు వారి భార్యలతో ప్రదక్షిణం చేసినపుడు అగ్నిహోత్రుడు వారిమీద వ్యామోహపడ్డాడు. ఆ వేదనతో అగ్నిహోత్రుడు చిక్కిపోయి, హవిస్సులను కూడా తీసుకోవట్లేదు. అది గమనించిన భార్య ఆయా భార్యల రూపములో వ్యవహరించింది. అగ్నిహోత్రుడు తృప్తి పడ్డాడు. ఋషులు ఆ విషయం తెలియక తమ భార్యలనూ అగ్నిహోత్రునీ శపించాడు. అగ్నిహోత్రుని భార్య నచ్చజెప్పడం వలన ఋషులు శాపాన్ని ఉపసంహరించారు. అప్పటినుంచీ భార్యాభర్తలు ప్రదక్షిణం చేస్తుంటే అగ్నిహోత్రునికి కళ్ళు కనపడకుండా ఉండాలన్న శాపమిచ్చారు. ఈ విషయం శంకరుడు స్కాంధ పురాణములో చెప్పాడు. అగ్నీ వాయువూ శంకరుని అంశలే. అందుకే కుమారస్వామి ఆరుగురి నుంచి జన్మించాడు: భూమి, భూమి భరించలేకపోతే అగ్ని, వాయువు, నీరు, శంకరుడు ఇలా ఆరుగురినుంచి షడ్యః అని కుమారస్వామి పుట్టాడు. అందుకే కృత్తికలు ఆరుగురు వచ్చారు. కుమారస్వామి అగ్ని పుత్రుడయ్యాడు. అలాగే హనుమంతుడు వాయు పుత్రుడు. అగ్నీ వాయువూ శంకరుడూ ఒకరే.

7. మశకా మత్కుణా రాత్రౌ మక్షికా భిక్షుకా దివా
పిపీలికా చ భార్యా చ దివారాత్రం ప్రబాధతే

8. న అతంత్రీ వాద్యతే వీణా న అచక్రః వర్తతే రథః |
న అపతిః సుఖం ఏధతే యా స్యాత్ అపి శత ఆత్మజా |౨-౩౯-౨౯|

మితం దదాతి హి పితా మితం మాతా మితం సుతః |
అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్ |౨-౩౯-౩౦|

హద్దు లేని ప్రేమనిచ్చేవాడు భర్త మాత్రమే. తల్లీ తండ్రీ అంత ప్రేమను ఇవ్వలేరు. అందుకు భర్తను అవమననించవద్దు. అయోధ్యాకాండము_-_సర్గము_39

9. గుణేషు క్రియతాం యత్నః కిమాటోపైః భయంకరైః
విక్రీయంతే న ఘంటాభిః గావః క్షీర వివర్జితాః

పాలియ్యని ఆవుల మెడలో గంటలు పెడితే కొంటారా.  మానవుడు గుణములచే గౌరవము పొందును గానీ,
ఆడంబరముచే కాదు.

10. తత్కర్మ హరితోషం యత్సా విద్యా తన్మతిర్యయా - పరమాత్మకు సంతోషం కలిగింపచేసేదే పని, పరమాత్మయందు బుద్ధి నిలిపేదే చదువు 

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పద్దెనిమిదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ఇత్థం పృథుమభిష్టూయ రుషా ప్రస్ఫురితాధరమ్
పునరాహావనిర్భీతా సంస్తభ్యాత్మానమాత్మనా

ఇలా చెప్పి భూమి మళ్ళీ మాట్లాడుతోంది

సన్నియచ్ఛాభిభో మన్యుం నిబోధ శ్రావితం చ మే
సర్వతః సారమాదత్తే యథా మధుకరో బుధః

నీ కోపాన్ని కొంత శాంతింపచేయి. తెలియని వారికీ తెలిసిన వారికీ తేడా, జ్ఞ్యాని చేడులో కూడా మంచిని చూస్తాడు, చేడు వారిలో చెడును పోగొడతారు. ఉదాహరణకు తేనెటీగ ప్రతీ పూవు మీదా వాలి, మకరందాన్ని తీసుకుంటుంది గానీ పూవును పాడు చేయదు. చేడ్డ పూవూ మంచి పూవూ అని చూడకుండా అన్ని పుష్పాల మీదా వాలుతుంది. పండితుడు కూడా మంచిని మాత్రమే స్వీకరిస్తాడు. మీరు కూడా నాలో ఉన్న మంచినే స్వీకరించాలి

అస్మిన్లోకేऽథవాముష్మిన్మునిభిస్తత్త్వదర్శిభిః
దృష్టా యోగాః ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయఃప్రసిద్ధయే
తానాతిష్ఠతి యః సమ్యగుపాయాన్పూర్వదర్శితాన్
అవరః శ్రద్ధయోపేత ఉపేయాన్విన్దతేऽఞ్జసా

లోకములో జీవులకు శ్రేయస్సు కలగడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయో వాటిని ఋషులు దర్శించారు. శ్రేయస్సు కలగడానికి ఎన్నో మార్గాలను మునులు చూచారూ ప్రయోగించారు కూడా. ఇది మానవులకు శ్రేయస్సు కలగడానికి చేసారు. అలా ప్రయోగించి సఫలమయ్యారు. నీవు ఆ మార్గాన్ని అవలంబిస్తే చాలు.

తాననాదృత్య యోऽవిద్వానర్థానారభతే స్వయమ్
తస్య వ్యభిచరన్త్యర్థా ఆరబ్ధాశ్చ పునః పునః

పెద్దలు ఏర్పరచిన మార్గము కాక తెలివైన వారెవరైనా కొత్త మార్గాన్ని చూపడానికి ప్రయత్నిస్తే అనుకున్న ఫలితం రాక అప్రదిష్టపాలవుతారు. ఆలోచించగల తెలివి తప్ప ప్రయోగించగల ఓర్పుండదు వీఎరికి. ప్రజలబాగు కోసం మీ పూర్వీకులు ఏర్పరచిన మార్గాన్ని అవలంబించండి

పురా సృష్టా హ్యోషధయో బ్రహ్మణా యా విశామ్పతే
భుజ్యమానా మయా దృష్టా అసద్భిరధృతవ్రతైః

నేను పంటనివ్వలేదూ విత్తనాలని తీసుకుంటున్నానూ అని నా మీద కోప్పడుతున్నావు గానీ నీవే నాలో అనేక ఔషధులు నిక్షిప్తం చేసావు. ఎవరు ఉపయోగించడానికి నీవేర్పాటు చేసావో, వారికి కాక దుర్మార్గులకీ హింసాపరాయణులకి అందుతున్నాయి. వ్రతము లేని వారికి అందుతున్నాయి. భూమి మీద విత్తనం వేయటానికీ అన్నం తినటానికీ వ్రతం కావాలి. (పూర్వం విత్తనం వేయటానికి ఊరిబయటకు వెళ్ళీ భూమినీ నాగలినీ దేవతలనీ బ్రాహ్మణులనీ ఎద్దులనీ వరుణున్నీ పూజించి ప్రారంభించేవారు. పంట పండించడమే కాదు భోజనం చేయడం కూడా వ్రతం. బ్రతికేదీ పుట్టేదీ అన్నముతో. భోజనవ్రతం. కాళ్ళూ చేతులూ కడుకున్ని ఆచమనం చేసి హృదయములో స్వామిని ఆరాధించి, భోజనానికి అనుమతి తీసుకోవాలి, పాత్రను మూడు సార్లు ప్రోక్షించాలి, పదహారు సార్లు ఆచమనం చేయాలి భోజనం చేసే ముందు, చేసిన తరువాత ఇరవై నాలుగు సార్లు ఆచమనం చేయాలి, దాని వలన చిగుళ్ళమధ్య ఇరుక్కున్నవి పోతాయి, చేతిని పదహారు సార్లు కడుక్కోవాలి. కోపముతోనూ ఏడుస్తూ అరుస్తూ కలహిస్తూ నిందిస్తూ కాళ్ళూ చేతులూ ఒళ్ళూ ఊపుతూ, సంగీతం వింటూ భోజనం చేయకూడదు. ఆచమనం చేసి తినడం వలన అన్న నాళములో ఏమీ అడ్డురాకుండా ఉంటుంది. అన్నము సరిగ్గా లోపలకి వెళుతుంది . పొరమారకుండా ఉంటుంది. )
ఇలా వ్రతము లేకుండా తినేవారికి నేనేందుకు ఇవ్వాలి. దుర్మార్గులు భుజిస్తున్నారు. మంచి వారిగా చెప్పుకునే వారు వ్రతము లేకుండా భుజిస్తున్నారు. ధాన్యం పండిచే ముందూ, అన్నం తినే ముందూ వ్రతము లేదు. అలాంటి దుర్మార్గులు అనుభవిస్తుంటే నేను వెనక్కు లాక్కున్నాను.

అపాలితానాదృతా చ భవద్భిర్లోకపాలకైః
చోరీభూతేऽథ లోకేऽహం యజ్ఞార్థేऽగ్రసమోషధీః

భూలోకములో ఇంత దారుణం జరుగుతూ ఉంటే, నన్ను నిరాదరణ చేస్తుంటే ఈ లోకపాలకులంతా ఏమి చేస్తున్నారు? ఇలా దురుపయోగం చేసే వారికి సహకరిస్తే తరువాత తరువాత ఎవరిన భక్తులకు సదుపయోగం చేయడానికి ఏదీ ఉండదు. ఆకలి ఉన్నా లేకున్నా "తినడం నా హక్కు" అని తినడం మొదలుపెడితే నిజముగా ఆకలైనపుడు తినడానికేమీ ఉండదు.
నేను వాళ్ళ చేతా నీ చేతా ఉపేక్షించబడ్డాను. లోకములో వారంతా దొంగలయ్యారు. తరువాత మంచి వారు వచ్చి యజ్ఞ్యం చేస్తే ఉండాలని దాచిపెట్టాను.

నూనం తా వీరుధః క్షీణా మయి కాలేన భూయసా
తత్ర యోగేన దృష్టేన భవానాదాతుమర్హతి

కానీ అది కూడా ప్రమాదమే. ఒక వస్తువును చాలా కాలం దాచిపెడితే మళ్ళీ ఆ వస్తువు దాచిపెట్టిన వాడికి కూడా (ఆ రూపములో) దొరకదు. తరువాత తీసుకోదలచిన వాడు దానిని సారవంతం చేసి మరీ తీసుకోవాలి. నా విత్తనములన్నీ క్షీణించి పోయాయి, నిర్వీర్యములైపోయాయి. ఇపుడు వాటిని వీర్యవంతములు చేయాలంటే నీ యోగముతో నీవే చేయాలి.

వత్సం కల్పయ మే వీర యేనాహం వత్సలా తవ
ధోక్ష్యే క్షీరమయాన్కామాననురూపం చ దోహనమ్

నేనెట్లాగూ గోరూపములో ఉన్నాను కాబట్టి నా నుండి ఔషధులు కావాలంటే నేను పాల రూపములో ఇస్తాను. దానికి ఒక దూడ కావాలి. పాల రూపములో అన్ని కోరికలనూ స్రవింపచేస్తానూ. దానికి దూడా కావాలీ, యోగ్యుడైన పాలు పితికేవాడూ కావాలి.

దోగ్ధారం చ మహాబాహో భూతానాం భూతభావన
అన్నమీప్సితమూర్జస్వద్భగవాన్వాఞ్ఛతే యది

ఆయా ప్రాణులలో ఉత్తమైన పాలు పితికేవాడిని ఏర్పాటు చేయి. ఇష్టమున్నా, తేజోవంతమైన అన్నాన్ని కోరాలి. భోజనం చేస్తే ఓజః సహః బలం రావాలి. అలాంటి శక్తి గల అన్నాన్ని ఇస్తాను

సమాం చ కురు మాం రాజన్దేవవృష్టం యథా పయః
అపర్తావపి భద్రం తే ఉపావర్తేత మే విభో

ఎత్తువంపులుగా ఉన్న నన్ను సమానము చేయి. కురిసిన నీరు అన్ని ప్రాంతాలలోకీ సమానముగా వెళుతుంది. ఇంకిన తరువాత కొంత నీరు నిలువ ఉండేట్లు చేయి. వర్షాకలం కాని సమయములో కూడా భూమి మీద నీరు నిలువ ఉండేలా చేయి. భగవంతుని చేత వర్షించిన నీరు వర్షాకాలం కాని సమయములో కూడా మీకందరికీ అందాలి

ఇతి ప్రియం హితం వాక్యం భువ ఆదాయ భూపతిః
వత్సం కృత్వా మనుం పాణావదుహత్సకలౌషధీః

ఈ రీతిగా భూమి ప్రియమునూ హితమునూ (నచ్చేమాటనూ మంచిమాటనూ) చెప్పింది. మనువును దూడగా చేసుకుని మానవులకు కావలసిన సకల ఔషధులనూ మనువు స్వీకరించాడు

తథాపరే చ సర్వత్ర సారమాదదతే బుధాః
తతోऽన్యే చ యథాకామం దుదుహుః పృథుభావితామ్

ఎవరెవరికి ఏమేమి కావాలో వారి వారిలో ముఖ్యులని దూడగా చేసుకొని వారికి కావల్సిన వాటిని స్వీకరించారు. ఇలా పృధు చక్రవర్తి చేత ప్రసన్నము చేసుకోబడిన గోవు ఎవరెవరికి ఏమేమి కావాలో ఇచ్చింది

ఋషయో దుదుహుర్దేవీమిన్ద్రియేష్వథ సత్తమ
వత్సం బృహస్పతిం కృత్వా పయశ్ఛన్దోమయం శుచి

ఋషులు, ఇంద్రియ నిగ్రహము గల బృహస్పతిని దూడగా చేసుకుని తమకు కావలసిన చందోమయమైన పాలను తీసుకున్నారు

కృత్వా వత్సం సురగణా ఇన్ద్రం సోమమదూదుహన్
హిరణ్మయేన పాత్రేణ వీర్యమోజో బలం పయః

దేవతలు కూడా ఇంద్రున్ని దూడగా చేసుకుని సోమరసాన్ని స్వీకరించారు, బంగారు పాత్రతో వీర్యమూ ఓజస్సునూ బలమునూ పాలుగా తీసుకున్నారు

దైతేయా దానవా వత్సం ప్రహ్లాదమసురర్షభమ్
విధాయాదూదుహన్క్షీరమయఃపాత్రే సురాసవమ్

రాక్షసులూ దైత్యులూ దానవులూ ప్రహ్లాదున్ని దూడగా చేసుకుని ఇనుము పాత్రలో సురను తీసుకున్నారు

గన్ధర్వాప్సరసోऽధుక్షన్పాత్రే పద్మమయే పయః
వత్సం విశ్వావసుం కృత్వా గాన్ధర్వం మధు సౌభగమ్

గంధర్వాదులు పద్మమయమైన పాత్రలో విశ్వావసున్ని దూడగా చేసుకుని సంగీతాన్ని పాలుగా స్వీకరించారు.

వత్సేన పితరోऽర్యమ్ణా కవ్యం క్షీరమధుక్షత
ఆమపాత్రే మహాభాగాః శ్రద్ధయా శ్రాద్ధదేవతాః

పితృదేవతలు అర్య్మున్ని దూడగా చేసుకుని కవ్యాన్ని (శ్రాద్ధ భోజనం) పాలుగా స్వీకరించారు. వీరిని శ్రాద్ధ దేవతలూ అని పేరు.

ప్రకల్ప్య వత్సం కపిలం సిద్ధాః సఙ్కల్పనామయీమ్
సిద్ధిం నభసి విద్యాం చ యే చ విద్యాధరాదయః

సిద్ధులు కపిలున్ని దూడగా చేసుకుని సిద్ధిని పాలగా తీసుకున్నారు. విద్యాధరులు తమ అధిపతిని దూడగా చేసుకుని విద్యను స్వీకరించారు

అన్యే చ మాయినో మాయామన్తర్ధానాద్భుతాత్మనామ్
మయం ప్రకల్ప్య వత్సం తే దుదుహుర్ధారణామయీమ్

మాయావులు అంతర్ధాన సిద్ధిని బోధించే మాయను మయున్ని దూడగా చేసుకుని ఆ పాలు స్వీకరించారు.

యక్షరక్షాంసి భూతాని పిశాచాః పిశితాశనాః
భూతేశవత్సా దుదుహుః కపాలే క్షతజాసవమ్

యక్షులూ రాక్షసులూ భూత ప్రేత పిశాచాలు తమ అధిపతిని దూడగా  చేసుకుని వారికి కావల్సినవి స్వీకరించారు

తథాహయో దన్దశూకాః సర్పా నాగాశ్చ తక్షకమ్
విధాయ వత్సం దుదుహుర్బిలపాత్రే విషం పయః

అన్ని రకాల పాములూ (తోకతో కొట్టే పాములూ,, కరిచే పాములూ - దన్దశూకాః , మింగే పాములూ చుట్టే పాములూ - అహయః, కాటేసేవి - నాగాః, పాకేవి - సర్పాః) తక్షకున్ని దూడగా చేసుకుని విషాన్ని స్వీకరించారు. అంటే అమృతాన్ని ఇచ్చే భూమే విషాన్నిస్తుంది.

పశవో యవసం క్షీరం వత్సం కృత్వా చ గోవృషమ్
అరణ్యపాత్రే చాధుక్షన్మృగేన్ద్రేణ చ దంష్ట్రిణః

పశువులు వృషబాన్ని దూడగా చేసుకుని గడ్డిని తీసుకున్నాయి, సింహాన్ని దూడగా చేసుకుని అరణ్యమనే పాత్రలో

క్రవ్యాదాః ప్రాణినః క్రవ్యం దుదుహుః స్వే కలేవరే
సుపర్ణవత్సా విహగాశ్చరం చాచరమేవ చ

మృగాలన్నీ తమకు కావలసిన ఆహారాన్ని తీసుకున్నారు.

వటవత్సా వనస్పతయః పృథగ్రసమయం పయః
గిరయో హిమవద్వత్సా నానాధాతూన్స్వసానుషు

మర్రి చెట్టును దూడగా చేసుకుని వనస్పతులన్నీ రసమును పాలుగా స్వీకరించాయి. పర్వతాలన్నీ హిమవంతున్ని దూడగా చేసుకుని గైరికాధి ధాతువులని తీసుకున్నాయి.

సర్వే స్వముఖ్యవత్సేన స్వే స్వే పాత్రే పృథక్పయః
సర్వకామదుఘాం పృథ్వీం దుదుహుః పృథుభావితామ్

అందరూ తమలో ఎవరు ముఖ్యమో వారిని దూడగ చేసుకుని ఆ పాలను వారు తీసుకున్నారు. పృధు చక్రవర్తి చేత ప్రసన్నం చేసుకోబడిన భూమినుండి తమకు కావలసిన దాన్ని అన్ని ప్రాణులూ తీసుకున్నారు

ఏవం పృథ్వాదయః పృథ్వీమన్నాదాః స్వన్నమాత్మనః
దోహవత్సాదిభేదేన క్షీరభేదం కురూద్వహ

తినబడేదంతా అన్నమే.  తమ తమకు కావలసిన అన్నమును వారు స్వీకరించారు. పితికేవారు వేరు దూడ వేరు, దూడ మారితే పాలు మారుతున్నాయి. పితికేవారి భేధముతో దూడ భేధముతో పాలలో భేదమేర్పడింది

తతో మహీపతిః ప్రీతః సర్వకామదుఘాం పృథుః
దుహితృత్వే చకారేమాం ప్రేమ్ణా దుహితృవత్సలః

ఎవరికి కావలసినవి వారికిచ్చినందుకు పృధు చక్రవర్తికి భూమి మీద ప్రేమ కలిగింది. ఈ నాటి నుండి నిన్ను నా పుత్రికగా స్వీకరిస్తున్నాను. ఆ నాటినుండీ భూమి పృధ్వి అయ్యింది

చూర్ణయన్స్వధనుష్కోట్యా గిరికూటాని రాజరాట్
భూమణ్డలమిదం వైన్యః ప్రాయశ్చక్రే సమం విభుః

తన ధనువు యొక్క కొనతో అడ్డుగా ఉన్న పర్వతాలనూ పర్వత సమూహాలనూ చూర్ణం చేసాడు. భూమిని సమం చేసాడు

అథాస్మిన్భగవాన్వైన్యః ప్రజానాం వృత్తిదః పితా
నివాసాన్కల్పయాం చక్రే తత్ర తత్ర యథార్హతః

గ్రామాన్పురః పత్తనాని దుర్గాణి వివిధాని చ
ఘోషాన్వ్రజాన్సశిబిరానాకరాన్ఖేటఖర్వటాన్

గ్రామములూ పట్టణాలు దుర్గాలు పల్లెలూ ఏర్పాటు చేసాడు. పొలములూ వ్యవసాయ క్షేత్రములూ దున్నేవారూ కోసేవారూ

ప్రాక్పృథోరిహ నైవైషా పురగ్రామాదికల్పనా
యథాసుఖం వసన్తి స్మ తత్ర తత్రాకుతోభయాః

పృధు చక్రవర్తి కంటే ముందు ఈ వ్యవస్థ లేదు. వేరే భయమేదీ లేదు కాబట్టి ఎవరికెక్కడ నచ్చితే అక్కడ ఉండేవారు అక్కడి వనరులు ఉన్నదాకా

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదహేడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదహేడవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ఏవం స భగవాన్వైన్యః ఖ్యాపితో గుణకర్మభిః
ఛన్దయామాస తాన్కామైః ప్రతిపూజ్యాభినన్ద్య చ

ఈ రీతిలో వేన పుత్రుడైన పృధు చక్రవర్తి చేయబోయె పనులేమిటో వంది మాగధులు స్తోత్రం చేసారు.

బ్రాహ్మణప్రముఖాన్వర్ణాన్భృత్యామాత్యపురోధసః
పౌరాన్జానపదాన్శ్రేణీః ప్రకృతీః సమపూజయత్

బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా, మంత్రులూ (రాజ్య ప్రాంతములో నగరాలకు అధినాయకులు) ఆమాత్యులూ (రాజు తరువాతి వారు) సచివులూ (రాజు తరువాత నాలగవ వారు) ఈ విధముగా విభజించాడు.
పురవాసులూ జనపదవాసులూ పల్లెటూరిలో ఉండేవారు (శ్రేణీ) ప్రజలూ అందరినీ ఆదరించాడు
(శ్రేణులంటే ఉండటానికి లేక ఒక చోట గుడారాలలో ఉండేవారు. రాజు కూడా సైన్యములో కొంత మందిని శ్రేణుల్లా పంపుతారు. దాని వలన ప్రజలకు వాస్తవముగా ఉన్న ఇబ్బందులు తెలుస్తాయి)

విదుర ఉవాచ
కస్మాద్దధార గోరూపం ధరిత్రీ బహురూపిణీ
యాం దుదోహ పృథుస్తత్ర కో వత్సో దోహనం చ కిమ్

మరి భూమి గోరూపం ధరిస్తే ఈయన పాలు పితికాడన్నారు. భూమి గోరూపం ఎందుకు ధరించింది. పాలు పితకాలంటే దూడ కావాలి కదా? ఆ దూడ ఎవరు? ఆ వచ్చిన పాలు ఏమిటి? ఒకే దూడతో అన్ని పాలు పిండారా? లేక వేరు వేరుగా ఉన్న దూడలు వచ్చాయా?

ప్రకృత్యా విషమా దేవీ కృతా తేన సమా కథమ్
తస్య మేధ్యం హయం దేవః కస్య హేతోరపాహరత్

పృధు చక్రవర్తి అశ్వమేధము చేస్తే అశ్వాన్నెందుకు ఇంద్రుడు అపహరించాడు

సనత్కుమారాద్భగవతో బ్రహ్మన్బ్రహ్మవిదుత్తమాత్
లబ్ధ్వా జ్ఞానం సవిజ్ఞానం రాజర్షిః కాం గతిం గతః

సనత్కుమారుని వలన జ్ఞ్యానం పొందిన ఈయన ఏ లోకాలకు వెళ్ళాడు

యచ్చాన్యదపి కృష్ణస్య భవాన్భగవతః ప్రభోః
శ్రవః సుశ్రవసః పుణ్యం పూర్వదేహకథాశ్రయమ్

నేను అడిగినవే కాకుండా అడగనివాటిని కూడా పరమ పవిత్రమైన స్వామి యొక్క కథను

భక్తాయ మేऽనురక్తాయ తవ చాధోక్షజస్య చ
వక్తుమర్హసి యోऽదుహ్యద్వైన్యరూపేణ గామిమామ్

నీకూ స్వామికీ ఇద్దరికీ భక్తుడనైనా, అనురక్తుడనైన నాకు చెప్పవలసింది. పృధు చక్రవర్తి ఆవునుండి అన్ని ఔషధులనూ తీసుకున్న చరిత్ర చెప్పవలసినది.

సూత ఉవాచ
చోదితో విదురేణైవం వాసుదేవకథాం ప్రతి
ప్రశస్య తం ప్రీతమనా మైత్రేయః ప్రత్యభాషత

కృష్ణ కథను బాగా అడిగావు. అని ప్రీతితో ఇలా అన్నాడు

మైత్రేయ ఉవాచ
యదాభిషిక్తః పృథురఙ్గ విప్రైరామన్త్రితో జనతాయాశ్చ పాలః
ప్రజా నిరన్నే క్షితిపృష్ఠ ఏత్య క్షుత్క్షామదేహాః పతిమభ్యవోచన్

బ్రాహ్మణులందరూ ఈయనని ప్రజాపాలకునిగా అభిషేకం చేసారు . ఆకలితో బక్క చిక్కిన దేహముతో ఉన్న ప్రజలు పరిగెత్తుకోచ్చారు ఈ విషయం తెలిసి.

వయం రాజఞ్జాఠరేణాభితప్తా యథాగ్నినా కోటరస్థేన వృక్షాః
త్వామద్య యాతాః శరణం శరణ్యం యః సాధితో వృత్తికరః పతిర్నః

మహారాజా, మేము జఠరాగ్నితో బాధపడుతున్నాము, తొర్రలో ఉన్న అగ్నితో చెట్టు బాధపడినట్లు. ఇలా ఆకలితో అలమటిస్తున్న మేము రక్షణ కోసం నిన్ను శరణు వేడాము. బ్రతుకు తెరువును నీవే చూపాలి.

తన్నో భవానీహతు రాతవేऽన్నం క్షుధార్దితానాం నరదేవదేవ
యావన్న నఙ్క్ష్యామహ ఉజ్ఝితోర్జా వార్తాపతిస్త్వం కిల లోకపాలః

అడుగుతున్న మా అందరికీ మీరు అన్నాన్ని పెట్టండి. ఉన్న బలం మొత్తం తొలగిపోయి మేము ప్రాణాలు విడువక ముందే భుక్తిని ఏర్పాటు చేయి

మైత్రేయ ఉవాచ
పృథుః ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితమ్
దీర్ఘం దధ్యౌ కురుశ్రేష్ఠ నిమిత్తం సోऽన్వపద్యత

ఇలా దయతో వారడిగిన మాట విని, ఎందుకిలా జరిగిందీ అని ఆలోచించి, కారణాన్ని అర్థం చేసుకున్నాడు

ఇతి వ్యవసితో బుద్ధ్యా ప్రగృహీతశరాసనః
సన్దధే విశిఖం భూమేః క్రుద్ధస్త్రిపురహా యథా

భూమి పంటనివ్వటం లేదు అని తెలుసుకున్నాడు. వేసిన ధాన్యం తీసుకుంటోంది గానీ పంట ఇవ్వట్లేదు. కోపించిన త్రిపురాంతకునిలా ధనస్సుని ధరించి వెంటపడ్డాడు.

ప్రవేపమానా ధరణీ నిశామ్యోదాయుధం చ తమ్
గౌః సత్యపాద్రవద్భీతా మృగీవ మృగయుద్రుతా

ఇలా తన మీదకు వస్తున్నాడని గ్రహించి వేటగాడు వెంటబడితే లేడి పారిపోతున్నట్లుగా భూమి గోరూపం ధరించి పారిపోయింది.

తామన్వధావత్తద్వైన్యః కుపితోऽత్యరుణేక్షణః
శరం ధనుషి సన్ధాయ యత్ర యత్ర పలాయతే

ఎర్రబడిన కనులతో పృధు మహారాజు బాణం ఎక్కుపెట్టి వెంటబడ్డాడు

సా దిశో విదిశో దేవీ రోదసీ చాన్తరం తయోః
ధావన్తీ తత్ర తత్రైనం దదర్శానూద్యతాయుధమ్

భూ భువర్ సువర్లోకములూ అన్ని దిక్కులూ పరిగెట్టింది

లోకే నావిన్దత త్రాణం వైన్యాన్మృత్యోరివ ప్రజాః
త్రస్తా తదా నివవృతే హృదయేన విదూయతా

ఎక్కడికి పరిగెత్తినా తన కంటే ముందే బాణం ఎక్కుపెట్టి ఉన్నాడు. ఎలా ఐతే ప్రజలు మృత్యువును తప్పించుకోలేరో తాను పృధు చక్రవర్తిని తప్పించుకోలేకపోఇంది. భయపడుతూ ఉంది. పరిగెత్తడం మానేసింది. అక్కడే నిలబడి...

ఉవాచ చ మహాభాగం ధర్మజ్ఞాపన్నవత్సల
త్రాహి మామపి భూతానాం పాలనేऽవస్థితో భవాన్

రక్షించవలసిన వాడు శిక్షించడానికి వస్తే అతని నుండి ఎక్కడికి పారిపోగలదు. ఈ విషయం తెలుసుకుని ఇలా అంది " నీకు అన్ని ధర్మములూ తెలుసు, ఆపదలు పొందినవారంటే ఎక్కువ జాలి చూపుతావు. సకల ప్రాణులనూ కాపాడతానని పట్టాభిషేకం చేసుకున్నావు"

స త్వం జిఘాంససే కస్మాద్దీనామకృతకిల్బిషామ్
అహనిష్యత్కథం యోషాం ధర్మజ్ఞ ఇతి యో మతః

నీ పరిపాలనలో ఉన్న అందరిలాగ కాపాడవలసిన దీనురాలైన ఏ తప్పు చేయని నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు. లోకములో ధర్మజ్ఞ్యుడని పేరు పొందిన నీవు స్త్రీని చంపుతావా

ప్రహరన్తి న వై స్త్రీషు కృతాగఃస్వపి జన్తవః
కిముత త్వద్విధా రాజన్కరుణా దీనవత్సలాః

ఒక వేళ తప్పు చేసినా, ధర్మం తెలిసిన వారు స్త్రీని చంపరు. సామాన్యులే తప్పు చేసినా స్త్రీలను చంపకుండా వదిలిపెడతారే నీవంటి దీన వత్సలుర గురించి వేరే చెప్పాలా.

మాం విపాట్యాజరాం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితమ్
ఆత్మానం చ ప్రజాశ్చేమాః కథమమ్భసి ధాస్యసి

కోపముతో ఆవేశములో ఏమి చేస్తున్నావో అర్థం కావట్లేదా? నీ యోగ బలముతో నన్ను చంపితే, నీ ప్రజలూ నీవూ ఎక్కడ ఉంటారు? ఆధారం లేని వారిని నీవేమి చేస్తావు? భూమి అంటే పడవ. దాని మీదే ప్రపంచమంతా ఉంది. మరి నన్ను చంపి, నీటిలో ఉన్న వీరిని ఎలా వీరందరినీ కాపాడతావు.

పృథురువాచ
వసుధే త్వాం వధిష్యామి మచ్ఛాసనపరాఙ్ముఖీమ్
భాగం బర్హిషి యా వృఙ్క్తే న తనోతి చ నో వసు

నా ఆజ్ఞ్యను దిక్కరించావు. అదే నీవు చేసిన తప్పు. నీవు ప్రజల నుండి నీకు రావల్సిన భాగమును తీసుకుని ఊరుకుంటున్నావు. నీకు భాగమిచ్చిన వారికి నీవు భాగమిస్తున్నావా?

యవసం జగ్ధ్యనుదినం నైవ దోగ్ధ్యౌధసం పయః
తస్యామేవం హి దుష్టాయాం దణ్డో నాత్ర న శస్యతే

రోజు గడ్డైతే బాగా తింటున్నావు కానీ దూడలకి పాలివ్వటం లేదు. ఎదుటి వారి దగ్గర తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియకపోవడం తప్పు. అందుకే ఇలాంటి దుర్మార్గులను దండిస్తే అది నింద్యమైన పని కాదు.

త్వం ఖల్వోషధిబీజాని ప్రాక్సృష్టాని స్వయమ్భువా
న ముఞ్చస్యాత్మరుద్ధాని మామవజ్ఞాయ మన్దధీః

నీవు స్వయముగా పళ్ళను పండిస్తున్నావా లేదా ఇంకొకరు వేస్తే పండిస్తున్నావా. బ్రహ్మ మొదట నీయందు అన్ని ఔషధులనూ నాటాడు. వాటిని బయట్కి తేవాలి. బ్రహ్మ నీకిచ్చిన అన్ని ఔషధులనూ ప్రజలకివ్వాలి. మంద బుద్ధి గల నీవు అది నీవివ్వడం లేదు. ఇపుడు నేను రాజును.

అమూషాం క్షుత్పరీతానామార్తానాం పరిదేవితమ్
శమయిష్యామి మద్బాణైర్భిన్నాయాస్తవ మేదసా

ఆకలీ దప్పులల్తో అలమటిస్తున్న ఆర్తులైన వీరి రోదనలు విని నా బాణాలతో నిన్ను చేధించి నీ మేదస్సుతో (కొవ్వుతో) నా ప్రజలందరికీ ఆకలి తీరుస్తాను

పుమాన్యోషిదుత క్లీబ ఆత్మసమ్భావనోऽధమః
భూతేషు నిరనుక్రోశో నృపాణాం తద్వధోऽవధః

నీకు ఆడవారిని చంపకూడదని తెలుసుగానీ, నీవెలా ఉండాలో తెలియదా. స్త్రీ పురుష నపుంసకులని ఎవరి గురించి వారు చెప్పుకునే వారు అధములు. తోటి ప్రాణుల మీద జాలి లేకుండా ఉన్న వారిని చంపుట తప్పు కాదు.

త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశః శరైః
ఆత్మయోగబలేనేమా ధారయిష్యామ్యహం ప్రజాః

నీవు స్తబ్ధముగా ఉన్నావు (ఇంత మంది విత్తనాలు వేస్తున్నా స్పందన లేదు), ఇలా మాయతో ఉన్న నిన్ను బాణముతో చంపుతాను. నీవు లేకపోయినా ఈ ప్రజలు ఉంటారు. ఈ ప్రజలందరినీ నేను భరిస్తాను. నిన్ను మోస్తున్నది కూడా నేనే. అది నా యోగ ప్రభావం.

ఏవం మన్యుమయీం మూర్తిం కృతాన్తమివ బిభ్రతమ్
ప్రణతా ప్రాఞ్జలిః ప్రాహ మహీ సఞ్జాతవేపథుః

కోపమే ఆధారమా అన్నట్లు ఉన్న మూర్తిని, యముడిలా ఉన్న స్వామిని చూచి, వంగి చేతులు జోడించినదై ఒళ్ళంతా వెతుకూ మాట్లాడుతోంది

ధరోవాచ
నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానాతనవే గుణాత్మనే
నమః స్వరూపానుభవేన నిర్ధుత ద్రవ్యక్రియాకారకవిభ్రమోర్మయే

పరమ పురుషునికి నమస్కారము. యోగమాయతో అనేకమైన శరీరములను ధరించే మహానుభావుడా, వాత్సల్యాది గుణములు కలవాడా, నీ ప్రభావముతోటే ద్రవ్య క్రియ కర్మ (ఉపకరణం ద్రవ్యమూ కర్త, కర్త యొక్క క్రియా కావాలి. వీటిలో ఏమి లేకున్నా పని కాదు ) జరుగుతాయి. నీవే ఇచ్చేవాడివి.  ఇదంతా ఒక నాటకం, విభ్రమం. అలాంటి నీకు నమస్కారము.

యేనాహమాత్మాయతనం వినిర్మితా ధాత్రా యతోऽయం గుణసర్గసఙ్గ్రహః
స ఏవ మాం హన్తుముదాయుధః స్వరాడుపస్థితోऽన్యం శరణం కమాశ్రయే

నన్ను బ్రహ్మ సృష్టించాడు, అన్ని గుణముల సృష్టి ఇక్కడినుంచి కలగాలని. ఇక్కడే ఉన్న వారు ఇక్కడే అన్నీ తీసుకుని బ్రతుకుతున్నారు. మరి నా బ్రతుకుకు ఆధారమేది? బ్రహ్మతో సకల జీవులకూ ఆధారముగా నిర్మించబడ్డాను. ఎవరు సృష్టించారో ఆ పరమాత్మే ధనుర్బాణాలతో ముందుకొచ్చాడు. ఇంకెవరిని శరణు వేడాలి? నాకు ఇంకో రక్షకుడు లేడు (అనన్య శరణత్వము)

య ఏతదాదావసృజచ్చరాచరం స్వమాయయాత్మాశ్రయయావితర్క్యయా
తయైవ సోऽయం కిల గోప్తుముద్యతః కథం ను మాం ధర్మపరో జిఘాంసతి

ఇతరులెవ్వరూ ఊహించరాని రీతిలో ఈ ప్రపంచాన్ని సృష్టించావు. ఇంత కాలమూ సృష్టించిన నీవే సంహరించాలనుకుంటున్నావు. నీవు సంకల్పించిన పనిని ఎవరు వారించగలరు. నీవేమనుకుంటున్నావో ఎవరికి తెలుసు. నీకంటే వేరుగా నన్ను కాపాడే వారు ఉన్నారా?

నూనం బతేశస్య సమీహితం జనైస్తన్మాయయా దుర్జయయాకృతాత్మభిః
న లక్ష్యతే యస్త్వకరోదకారయద్యోऽనేక ఏకః పరతశ్చ ఈశ్వరః

ఎవరు చేస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో, ఎవరు చాలారూపాలలో ఉండి, ఏకరూపములో కూడా ఉన్నారో, అవతల వైకుంఠములో ఏ మహానుభావుడిగా వేంచేసి ఉంటాడో, నీ చేత నీవే స్వయముగా ఏర్పరచుకున్న జగత్తు (ఇంద్రియాలు మనసు మొదలైన వాటితో ఉన్న జగత్తు)

సర్గాది యోऽస్యానురుణద్ధి శక్తిభిర్ద్రవ్యక్రియాకారకచేతనాత్మభిః
తస్మై సమున్నద్ధనిరుద్ధశక్తయే నమః పరస్మై పురుషాయ వేధసే
స వై భవానాత్మవినిర్మితం జగద్భూతేన్ద్రియాన్తఃకరణాత్మకం విభో
సంస్థాపయిష్యన్నజ మాం రసాతలాదభ్యుజ్జహారామ్భస ఆదిసూకరః
అపాముపస్థే మయి నావ్యవస్థితాః ప్రజా భవానద్య రిరక్షిషుః కిల
స వీరమూర్తిః సమభూద్ధరాధరో యో మాం పయస్యుగ్రశరో జిఘాంససి

తాను సృష్టించినదానికాధారం కావలని బ్రహ్మ నన్ను తీసుకొచ్చాడు. ఆది వరాహముగా నన్ను సముద్రపడుగు నుండి బయటకు తెచ్చింది ఎవరు? ఇపుడు చంపుతా అన్నది ఎవరు? అంతా నీరే ఉన్నప్పుడు ప్రళయకాలములో ఒక నావను ఏర్పరచావు, అందులో ప్రజాపతులని కూర్చావు.
ఈనాడు ఆ మహానుభావుడే తీస్ఖణమైన బాణములతో సంహరించబోతున్నాడు

నూనం జనైరీహితమీశ్వరాణామస్మద్విధైస్తద్గుణసర్గమాయయా
న జ్ఞాయతే మోహితచిత్తవర్త్మభిస్తేభ్యో నమో వీరయశస్కరేభ్యః

రాజైన వాడు తప్పు చేసిన వారిని శిక్షించాలి. కానీ ప్రజలకు బాగా ఉపకరించేవారిని శిక్షిస్తే ఏమొస్తుంది? ప్రజలకు ఏమేమి కావాలో మాతో చెప్పి, ఎక్కడ లోపముందో అడిగి చేయించుకోవాలి. చేయగలవారు పని చేయనపుడు దండించుట కాదు, ప్రభువైన వాడు వారితో ఆ పని చేయించుకోవాలి.
మనసు బుద్ధీ అంతా మోహించబడి, నీవాచరించే మాయా సృష్టి ఎవరికి తెలుస్తుందోవారికి నమస్కారం.

Tuesday, February 26, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదహారవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదహారవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితాః
తుష్టువుస్తుష్టమనసస్తద్వాగమృతసేవయా

ముని చేత ప్రేరేపించబడిన గాయకులు రాజు మాట్లాడిన మాటలతో సంతోషించారు.

నాలం వయం తే మహిమానువర్ణనే యో దేవవర్యోऽవతతార మాయయా
వేనాఙ్గజాతస్య చ పౌరుషాణి తే వాచస్పతీనామపి బభ్రముర్ధియః

మాయతో ఈ రూపముగా అవతరించావు. నీ మహిమ వర్ణించుటకు మేము సరిపోము. వేనుని వలన పుట్టిన నీ పురుష కార్యములు వర్ణించాలంటే వాక్పతుల బుద్ధులు కూడా భ్రమిస్తాయి

అథాప్యుదారశ్రవసః పృథోర్హరేః కలావతారస్య కథామృతాదృతాః
యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి

అలా అని నీ స్తోత్రం చేయకుండా ఉండలేము. అమృతం మొత్తం ప్రవహిస్తోంది అమృతం మొత్తం తాగలేమని చూస్తూ ఊరుకుంటామా. ఎంతో కొంతైనా నోట్లో వేసుకుందామని చూస్తాము. అలాగే నీ గుణాలు మొత్తం చెప్పాలన్న నియమం లేదు. నీవు ఔదార్యము కలిగిన చరిత్ర కల వాడివి
మాకు మా మునులు చెప్పినట్లుగా నీ ఉత్తమ కర్మలను మేము వివరిస్తాము.నీవు ముందు ఏమి చేయబోతున్నావో చెబుతాము. నీవు పరమాత్మ అని తెలుసు కాబట్టి నీవు చేసే పనులు పెద్దల వలన విని ఉన్నాము కాబట్టి వాటినే కీర్తన చేస్తాము

ఏష ధర్మభృతాం శ్రేష్ఠో లోకం ధర్మేऽనువర్తయన్
గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపన్థినామ్

ధర్మము ఆచరించే వారిలో ఉత్తముడు ఈ మహానుభావుడు. లోకాన్ని ధర్మములో అనువర్తింపచేస్తాడు. ఎవరు ధర్మాన్ని తప్పకుండా కాపాడతాడు. ధర్మాన్ని అతిక్రమించే వారిని శాసిస్తాడు

ఏష వై లోకపాలానాం బిభర్త్యేకస్తనౌ తనూః
కాలే కాలే యథాభాగం లోకయోరుభయోర్హితమ్

అటు రాజుగా ఉన్న వాడే సకల లోకపాలకుల అంశలను తనలో నిలుపుకుంటాడు. ఇహ పర లోకముల హితమును (ఏ ఏ కాలములో ఏ ఏ లోకాలకి ఎలాంటి హితమును కావాలో దానిని) కూరుస్తాడు. లోకపాలురకు కూడా శక్తినీ సామర్ధ్యాన్నీ ప్రసాదిస్తాడు. ఇహ పర లోకముల ధర్మాన్ని కాపాడతాడు.

వసు కాల ఉపాదత్తే కాలే చాయం విముఞ్చతి
సమః సర్వేషు భూతేషు ప్రతపన్సూర్యవద్విభుః

సమయమొచ్చినప్పుడు పన్ను రూపములో ద్రవ్యాన్ని తీసుకోవడం. ఈతి బాధలతో బాధపడుతున్నప్పుడు ఇవ్వడం, వరద వచ్చినప్పుడు ఎత్తైన ప్రాంతములో ప్రజలను క్షేమముగా ఉంచి, వారికి ఆహారం అందించి, వరద తగ్గాక దింపి, కొన్ని రోజులు పోషించి, నష్టపరిహారం ఇవ్వాలి. సుర్ర్య కిరణాలకు వలె అందరి యందూ సమత్వాన్ని ప్రకటించాలి

తితిక్షత్యక్రమం వైన్య ఉపర్యాక్రమతామపి
భూతానాం కరుణః శశ్వదార్తానాం క్షితివృత్తిమాన్

ఆక్రమించే వారి స్వభావన్ని కొంతకాలం క్షమించాలి. భూతముల మీద కరుణ చూపుతాడు. రోగ గ్రస్తులూ ఆర్తులు ఉండటానికి భూమి ఇస్తాడు

దేవేऽవర్షత్యసౌ దేవో నరదేవవపుర్హరిః
కృచ్ఛ్రప్రాణాః ప్రజా హ్యేష రక్షిష్యత్యఞ్జసేన్ద్రవత్

ఈయన బలపరాక్రములను పరీక్షించడానికి వరుణ ఇంద్రాదులు వర్షించడం మానేస్తే పృధువు తన శక్తితో వర్షాన్ని కురిపిస్తాడు. తన దివ్య ముఖ శోభతో లోకాన్ని ఆనందింపచేస్తాడు.

ఆప్యాయయత్యసౌ లోకం వదనామృతమూర్తినా
సానురాగావలోకేన విశదస్మితచారుణా

స్వచ్చమైన నవ్వుతో ప్రకాశించే ముఖమండలములో ప్రేమను చూపడముతో

అవ్యక్తవర్త్మైష నిగూఢకార్యో గమ్భీరవేధా ఉపగుప్తవిత్తః
అనన్తమాహాత్మ్యగుణైకధామా పృథుః ప్రచేతా ఇవ సంవృతాత్మా

ఈయన ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారో ప్రజలకు అవి ఫలితమిచ్చినప్పుడు అర్థమవుతుంది (చేసే ముందు చాటింపు ఉండదు). ఏమి చేస్తున్నాడో అది అతి రహస్యముగా ఉంచుతాడు. గంభీరమైన బుద్ధి కలవాడు. తానేరీతిలో ప్రవర్తిస్తాడో కూడా రహస్యముగా ఉంచుతాడు. ఇతను అనేకమైన గొప్ప గుణాలకు ఒకే నివాసమైన వాడు. వరుణుడి లాగ తన స్వరూపాన్ని తాను దాచుకొని ఉంటాడు

దురాసదో దుర్విషహ ఆసన్నోऽపి విదూరవత్
నైవాభిభవితుం శక్యో వేనారణ్యుత్థితోऽనలః

అందరికీ దగ్గరలో ఉంటాడు. ఇతన్ని ఎవరూ చేరలేరూ, సహించలేరు. దగ్గరలో ఉన్నా దూరముగా ఉన్నవాడిలా ప్రవర్తిస్తాడు. వేనుడనే అరణిలో పుట్టిన అగ్నిహోత్రము ఇతడు.

అన్తర్బహిశ్చ భూతానాం పశ్యన్కర్మాణి చారణైః
ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేవ దేహినామ్

ఇతను పరమాత్మ కాబట్టి అన్ని చోట్లా ఉంటాడు. అయినా ఉదాసీనుడిలా ఉంటాడు. ఈయన అధ్యక్షుడు. గూఢచారులను నియమిచి రాజ్యములో విషయాలను కనుక్కుంటూ ఉంటాడు. శరీర ధారులకు వాయువు ఎలా ఐతే లోపలా బయటా ఉంటుందో ఈయన కూడా అలాగే ఉంటాడు.

నాదణ్డ్యం దణ్డయత్యేష సుతమాత్మద్విషామపి
దణ్డయత్యాత్మజమపి దణ్డ్యం ధర్మపథే స్థితః

తనను ద్వేషించేవాడైనా సరే దండించడానికి కావలసిన తప్పు చేయనప్పుడు వాడిని దండించడు

అస్యాప్రతిహతం చక్రం పృథోరామానసాచలాత్
వర్తతే భగవానర్కో యావత్తపతి గోగణైః

మానస సరోవరమునుంచీ సూర్యభగవానుడు తన కిరణములను ఎంతవర్కూ ప్రసరింపచేస్తున్నాడో ఆ ప్రాంతమంతా ఈయన రాజ్యమే

రఞ్జయిష్యతి యల్లోకమయమాత్మవిచేష్టితైః
అథాముమాహూ రాజానం మనోరఞ్జనకైః ప్రజాః

ఈ లోకాన్ని రంజింపచేస్తాడు. ప్రజలు ఇతన్ని స్తోత్రం చేస్తారు

దృఢవ్రతః సత్యసన్ధో బ్రహ్మణ్యో వృద్ధసేవకః
శరణ్యః సర్వభూతానాం మానదో దీనవత్సలః

ఈయన దృఢవ్రతుడు (చెప్పిన పని చేసేవాడు), అసత్యమనేది పలకని వాడు. బ్రాహ్మణుల భక్తుడు వృద్ధ సేవకుడు. అన్ని ప్రాణులకూ అభయమిచ్చిన మహనుభావుడు. అందరి గౌరవాన్నీ కాపాడే వాడు (మానద)

మాతృభక్తిః పరస్త్రీషు పత్న్యామర్ధ ఇవాత్మనః
ప్రజాసు పితృవత్స్నిగ్ధః కిఙ్కరో బ్రహ్మవాదినామ్

పరస్త్రీలను తల్లిలాగ, తన భార్యను తనలో సగముగా, ప్రజలకు తండ్రిలాగా, బ్రాహ్మణోత్తములకు దాసునిలాగ,

దేహినామాత్మవత్ప్రేష్ఠః సుహృదాం నన్దివర్ధనః
ముక్తసఙ్గప్రసఙ్గోऽయం దణ్డపాణిరసాధుషు

మామూలు మానవులకు ఆత్మ అంటే ఎంత ఇష్టమో ఈ రాజంటే అంతే ఇష్టమూ, మిత్రులలో ఆనందము పెంచేవాడు. సంసారములో బద్ధులైన వారి విషయాలు గానీ సంసారములో విషయాలు కానీ పూర్తిగా విడిచీపెట్టినవాడు. అసాధువులను దండించేవాడు

అయం తు సాక్షాద్భగవాంస్త్ర్యధీశః కూటస్థ ఆత్మా కలయావతీర్ణః
యస్మిన్నవిద్యారచితం నిరర్థకం పశ్యన్తి నానాత్వమపి ప్రతీతమ్

ఈయనే మూడులోకాలకు అధిపతి. రక్షకుడు. ఈయన పరమాత్మ. కూటస్థుడు (కదలిక లేనివాడు). పరమాత్మ కల (అంశ)తో అవతరించాడు. చాలా మంది అజ్ఞ్యాన ప్రభావముతో ఈ ప్రపంచమంతా నానాత్వం వహించి ఉంటారు.

అయం భువో మణ్డలమోదయాద్రేర్గోప్తైకవీరో నరదేవనాథః
ఆస్థాయ జైత్రం రథమాత్తచాపః పర్యస్యతే దక్షిణతో యథార్కః

కానీ ఈయన ఉదయ పర్వతం నుండి అస్థా చలం వరకూ ఉన్న భూమండలాన్ని పరిపాలిస్తాడు. ఈయన రథం పేరు జైత్రం. ఆ రథానికి జయించడం మాత్రమే తెలుసు. ధనువును ధరించి భూమండలమంతా తిరుగుతాడు సూర్యభగవానునిలాగ.

అస్మై నృపాలాః కిల తత్ర తత్ర బలిం హరిష్యన్తి సలోకపాలాః
మంస్యన్త ఏషాం స్త్రియ ఆదిరాజం చక్రాయుధం తద్యశ ఉద్ధరన్త్యః

ఈయన కోసం ఆయా రాజులు (సామంతులు), లోకపాలకులూ ఎదురుగా వచ్చి కానుకలు ఇచ్చి ఆరాధిస్తారు. మహారాణులు కూడా ఈయనని ఆదిరాజుగా స్తోత్రం చేస్తారు.

అయం మహీం గాం దుదుహేऽధిరాజః ప్రజాపతిర్వృత్తికరః ప్రజానామ్
యో లీలయాద్రీన్స్వశరాసకోట్యా భిన్దన్సమాం గామకరోద్యథేన్ద్రః

భూమి గోరూపముగా ఉన్నప్పుడు ఆమెయందు అన్ని ఔషధులనూ పాలలా పితుకుతాడు. ప్రజలకు వృత్తి కలిగిస్తాడు. తన ధనువు యొక్క కొనతో భూమిని సమానము చేస్తాడు (ఎలా ఐతే ఇంద్రుడు పర్వతాలను వజ్రాయుధముతో నరికాడో)

విస్ఫూర్జయన్నాజగవం ధనుః స్వయం యదాచరత్క్ష్మామవిషహ్యమాజౌ
తదా నిలిల్యుర్దిశి దిశ్యసన్తో లాఙ్గూలముద్యమ్య యథా మృగేన్ద్రః

ధనువు ఎక్కుపెట్టి ఈయన బయలుదేరితే సింహాన్ని చూచి ఎలా మిగతా మృగాలు దాక్కుంటాయో అలా మిగిలిన రాజులు దాక్కుంటారు

ఏషోऽశ్వమేధాఞ్శతమాజహార సరస్వతీ ప్రాదురభావి యత్ర
అహార్షీద్యస్య హయం పురన్దరః శతక్రతుశ్చరమే వర్తమానే

ఈయన నూరు అశ్వమేధ యాగాలు చేస్తాడు. ఈయన దగ్గరే సరస్వతి కూడా ఆవిర్భవించింది. నూరవ అశ్వమేధం వచ్చేసరికి ఇంద్రుడు అశ్వాన్ని అపహరిస్తాడు

ఏష స్వసద్మోపవనే సమేత్య సనత్కుమారం భగవన్తమేకమ్
ఆరాధ్య భక్త్యాలభతామలం తజ్జ్ఞానం యతో బ్రహ్మ పరం విదన్తి

తన రాజ్యములో సభామంటపములోకి వేంచేసిన సనత్కుమారున్ని భక్తితో ఆరాధించి పరమాత్మ స్వరూపాన్ని చెప్పే ఉత్తమ జ్ఞ్యానన్ని పొందుతాడు.

తత్ర తత్ర గిరస్తాస్తా ఇతి విశ్రుతవిక్రమః
శ్రోష్యత్యాత్మాశ్రితా గాథాః పృథుః పృథుపరాక్రమః

ఈయన తన యొక్క, తన పనుల యొక్కా, కీర్తిని గానము చేసే వాక్యములను ఆయా ప్రాంతములలో వింటూ ఉంటాడు.

దిశో విజిత్యాప్రతిరుద్ధచక్రః స్వతేజసోత్పాటితలోకశల్యః
సురాసురేన్ద్రైరుపగీయమాన మహానుభావో భవితా పతిర్భువః

తన రథమునకు అడ్డు లేకుండా అన్ని ప్రాంతములనూ గెలిచి తన దివ్యమైన తేజస్సుతో లోకుల బాధలు తొలగించీ, దేవదానవులందరిచేత గానము చేయబడతాడు. భూపతి అవుతాడు, మహానుభావుడు అవుతాడు. అందరినీ కాపాడుతాడు

Monday, February 25, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదిహేనవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదిహేనవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
అథ తస్య పునర్విప్రైరపుత్రస్య మహీపతేః
బాహుభ్యాం మథ్యమానాభ్యాం మిథునం సమపద్యత

ఇప్పుడు పాపము పోయింది కాబట్టి రెండు బాహువులనూ మదించారు. అప్పుడు కవలల జంట పుట్టింది

తద్దృష్ట్వా మిథునం జాతమృషయో బ్రహ్మవాదినః
ఊచుః పరమసన్తుష్టా విదిత్వా భగవత్కలామ్

అది చూసి భగవానుని అంశ ఆవిర్భవించిందని ఆనందముగా తెలుసుకొని

ఋషయ ఊచుః
ఏష విష్ణోర్భగవతః కలా భువనపాలినీ
ఇయం చ లక్ష్మ్యాః సమ్భూతిః పురుషస్యానపాయినీ

సకల జగత్తునూ కాపాడవలసిన పరమాత్మ అంశ ఈయన. ఈమె లక్ష్మి అంశ. ఎందుకంటే అమ్మవారు స్వామిని విడిచిపెట్టి ఉండదు.

అయం తు ప్రథమో రాజ్ఞాం పుమాన్ప్రథయితా యశః
పృథుర్నామ మహారాజో భవిష్యతి పృథుశ్రవాః

రాజుల వంశమంతరించిపోయిందన్న మహా ఆపద సమయములో ప్రథమ రాజుగా పుట్టాడు. అన్ని లోకములలో మంచి కీర్తిని పొందుతాడు. ఇతను పృధు చక్రవర్తి. పృధు అంటే ప్రధముడు మొదటివాడు, ప్రసిద్ధి పొందేవాడు.

ఇయం చ సుదతీ దేవీ గుణభూషణభూషణా
అర్చిర్నామ వరారోహా పృథుమేవావరున్ధతీ

ఈమె గుణములు ఈమెకున్న అలంకారములకు అలంకారములు. ఈమె పేరు అర్చి (తేజస్సు, కాంతి). ఈమె పృధువుని వివాహమాడుతుంది

ఏష సాక్షాద్ధరేరంశోజాతో లోకరిరక్షయా
ఇయం చ తత్పరా హి శ్రీరనుజజ్ఞేऽనపాయినీ

ఇతను సాక్షాత్తు భగవానుడు సకల లోకాలని కాపాడటానికి అవతరించాడు. నిత్యానపాయినీ అయిన అమ్మవారు కూడా అవతరించారు

మైత్రేయ ఉవాచ
ప్రశంసన్తి స్మ తం విప్రా గన్ధర్వప్రవరా జగుః
ముముచుః సుమనోధారాః సిద్ధా నృత్యన్తి స్వఃస్త్రియః

బ్రాహ్మణులందరూ ఈ పృధువును కీర్తించారు, గంధర్వులు గానమూ, దేవతలు పుష్ప వృష్టీ, అప్సరలసు నాట్యమూ చేసారు

శఙ్ఖతూర్యమృదఙ్గాద్యా నేదుర్దున్దుభయో దివి
తత్ర సర్వ ఉపాజగ్ముర్దేవర్షిపితౄణాం గణాః

బ్రహ్మా జగద్గురుర్దేవైః సహాసృత్య సురేశ్వరైః
వైన్యస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిహ్నం గదాభృతః

దేవతలందరితో కలిసి బ్రహ్మ వేంచేసారు. ఇతడు వేన పుత్రుడు.  ఇతని కుడి చేతిలో చక్రము యొక్క గుర్తు ఉంది

పాదయోరరవిన్దం చ తం వై మేనే హరేః కలామ్
యస్యాప్రతిహతం చక్రమంశః స పరమేష్ఠినః

పాదములలో పద్మాన్ని చూచాడు. ఇతను సాక్షాత్తు పరమాత్మ. చక్రం చేతిలో ఉంటే అది పరమాత్మ అంశే.

తస్యాభిషేక ఆరబ్ధో బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః
ఆభిషేచనికాన్యస్మై ఆజహ్రుః సర్వతో జనాః

బ్రాహ్మణోత్తములూ బ్రహ్మా కలసి రాజ్యాభిషేకం చేసారు. ప్రజలూ దేవతలూ అభిషేక సంబారాలు తీసుకొచ్చారు

సరిత్సముద్రా గిరయో నాగా గావః ఖగా మృగాః
ద్యౌః క్షితిః సర్వభూతాని సమాజహ్రురుపాయనమ్

అన్ని ప్రాణులూ కానుకలు తెచ్చాయి.

సోऽభిషిక్తో మహారాజః సువాసాః సాధ్వలఙ్కృతః
పత్న్యార్చిషాలఙ్కృతయా విరేజేऽగ్నిరివాపరః

పృధు రాజ్య పట్టభిషేకం జరిగింది. మంచి వస్త్రాలతో అలంకారముతో, స్వాహాతో అగ్నిహోత్రునిలా అర్చితో పృధు చక్రవర్తి ఉన్నాడు.

తస్మై జహార ధనదో హైమం వీర వరాసనమ్
వరుణః సలిలస్రావమాతపత్రం శశిప్రభమ్

కుబేరుడు ఉత్తమమైన బంగారు సింహాసనం. వరుణుడు నిరంతరం నీరు పక్కన పడే గొడుగును ఇచ్చాడు. వాయువు వింజామరలనూ, ధర్మము పుష్పమాలనూ, ఇంద్రుడు కిరీటాన్ని, యముడు దండాన్ని, బ్రహ్మ వేద కవచాన్ని ఇచ్చాడు, సరస్వతి హారాన్ని, శ్రీమన్నారాయణుడు చక్రాన్నీ, లక్ష్మీ దేవి అవ్యాహతమైన సంపదనూ ఇచ్చింది, శంకరుడు పది చంద్రులతో ప్రకాశించే ఖడ్గాన్ని, పార్వతి నూరుచంద్రులతో ప్రసాదించే ఖడ్గాన్నీ, చంద్రుడు గుర్రాలనూ, త్వష్ట రథాన్నీ ఇచ్చడు, అగ్ని రథాన్నిచ్చాడు, సూర్యుడు బంగారాన్నిచ్చాడు, భూమి పాదుకలనూ, ఆకాశం పుష్పాలని, ఖేచరులు మంగళ వాద్యాలనూ అంతర్ధాన విద్యను ఇచ్చారు, ఋషులు ఆశీర్వాదాన్నిచ్చారు, సముద్రుడు తనలో పుట్టిన శంఖాన్నీ, నదులూ మొదలైనవి రథమారగాన్ని ఇచ్చారు

వాయుశ్చ వాలవ్యజనే ధర్మః కీర్తిమయీం స్రజమ్
ఇన్ద్రః కిరీటముత్కృష్టం దణ్డం సంయమనం యమః

బ్రహ్మా బ్రహ్మమయం వర్మ భారతీ హారముత్తమమ్
హరిః సుదర్శనం చక్రం తత్పత్న్యవ్యాహతాం శ్రియమ్

దశచన్ద్రమసిం రుద్రః శతచన్ద్రం తథామ్బికా
సోమోऽమృతమయానశ్వాంస్త్వష్టా రూపాశ్రయం రథమ్

అగ్నిరాజగవం చాపం సూర్యో రశ్మిమయానిషూన్
భూః పాదుకే యోగమయ్యౌ ద్యౌః పుష్పావలిమన్వహమ్

నాట్యం సుగీతం వాదిత్రమన్తర్ధానం చ ఖేచరాః
ఋషయశ్చాశిషః సత్యాః సముద్రః శఙ్ఖమాత్మజమ్

సిన్ధవః పర్వతా నద్యో రథవీథీర్మహాత్మనః
సూతోऽథ మాగధో వన్దీ తం స్తోతుముపతస్థిరే

వందిమాగధులు స్తోత్రం చేయడానికి వచ్చినపుడు

స్తావకాంస్తానభిప్రేత్య పృథుర్వైన్యః ప్రతాపవాన్
మేఘనిర్హ్రాదయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్

ప్రతాపుడైన పృధువు గంభీరమైన వాక్కుతో ఇలా అన్నాడు

పృథురువాచ
భోః సూత హే మాగధ సౌమ్య వన్దిన్లోకేऽధునాస్పష్టగుణస్య మే స్యాత్
కిమాశ్రయో మే స్తవ ఏష యోజ్యతాం మా మయ్యభూవన్వితథా గిరో వః

సూతా మాగధా, నేను ఎలాంటి వాణ్ణో లోకానికి తెలియదు. అది తెలియకుండా మీరేమి స్తోత్రం చేస్తారు? మీరు స్తోత్రం చేస్తే దానికి నేను విపర్యయముగా ఉంటే మీ వాక్కు అబద్దం కాకూడదు. గుణము తెలియకుండా స్తోత్రం చేయవలదు

తస్మాత్పరోక్షేऽస్మదుపశ్రుతాన్యలం కరిష్యథ స్తోత్రమపీచ్యవాచః
సత్యుత్తమశ్లోకగుణానువాదే జుగుప్సితం న స్తవయన్తి సభ్యాః

మీరు సుందర వాక్కులు, అలాంటి మీరు మా చాటున మా గురించి ఏమి చెప్పుకుంటారో వాటిని స్తోత్రం చేయాలి. కొన్నాళ్ళు మేము పరిపాలన చేస్తే ప్రజలు చాటున మాట్లాడుకుంటున్నవి మీరు స్తోత్రం చేయాలి. లోకములో అందరూ స్తోత్రం చేస్తున్నారని స్తోత్రం చెయ్యొద్దు. అన్ని వేళలా అందరి చేతా స్తోత్రం చేయదగిన వాడు ఒకడు ఉండగా ఆయనని విడిచి మనలాంటి జుగుప్సితులని స్తోత్రం చేయడం భావ్యము కాదు. ఉత్తములు దీన్ని అంగీకరించరు. సభ్యులెవ్వరూ తమను తాము స్తోత్రం చేయించుకోరు.

మహద్గుణానాత్మని కర్తుమీశః కః స్తావకైః స్తావయతేऽసతోऽపి
తేऽస్యాభవిష్యన్నితి విప్రలబ్ధో జనావహాసం కుమతిర్న వేద

లేని గుణాలను ఉన్నట్లు ఏ బుద్ధిమంతుడు స్తోత్రం చేయించుకుంటాడు? లేని గుణాలను ఎదుట ఉన్న వారు పొగడుతూ స్తోత్రం చేస్తూ ఉంటే, అది విన్న రాజు ఆనందిస్తే, ఆ స్తోత్రం చేసిన వారి వెనక ఉన్న వారు నవ్వుకోరా? అవహేళన చేయరా?

ప్రభవో హ్యాత్మనః స్తోత్రంజుగుప్సన్త్యపి విశ్రుతాః
హ్రీమన్తః పరమోదారాః పౌరుషం వా విగర్హితమ్

అందుకే నిజముగా బుద్ధిమంతులైన వారు తమ స్తోత్రాన్ని తాము అసహ్యించుకుంటారు. సిగ్గు ఉన్న వారు స్తోత్రాన్ని ఒప్పుకోరు. లేని గుణాలను ఎదుటివారు చెబుతూ ఉంటే సిగ్గు ఉన్న వారు ఒప్పుకోరు.

వయం త్వవిదితా లోకే సూతాద్యాపి వరీమభిః
కర్మభిః కథమాత్మానం గాపయిష్యామ బాలవత్

అసలు నేనేమిటో ఈ లోకానికి ఇంకా తెలియదు. మంచి పనులను చేసానని ఎలా చెప్పుకుంటాను చిన్నపిల్లవాడిలాగ

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంధం పద్నాల్గవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్ధ స్కంధం పద్నాల్గవ అధ్యాయం 

మైత్రేయ ఉవాచ
భృగ్వాదయస్తే మునయో లోకానాం క్షేమదర్శినః
గోప్తర్యసతి వై నౄణాం పశ్యన్తః పశుసామ్యతామ్

లోకుల యొక్క క్షేమము కోరి మునులందరూ, "రక్షకుడు లేకుంటే ప్రజలందరూ పశువుల్లా అవుతారు (అంటే పశువుల్లా కొట్టుకుంటారు) అని

వీరమాతరమాహూయ సునీథాం బ్రహ్మవాదినః
ప్రకృత్యసమ్మతం వేనమభ్యషిఞ్చన్పతిం భువః

తల్లి అయిన సునీధిని పిలిచారు ఋషులందరూ. వేనుడు రాజ్యానికి యోగ్యుడు కాడు. ప్రజలు కూడా ఒప్పుకోరు. అయినా రాజు అనేవాడొకడుండాలి కాబట్టి ప్రజలకిష్టం లేని వాడిని రాజు చేసారు

శ్రుత్వా నృపాసనగతం వేనమత్యుగ్రశాసనమ్
నిలిల్యుర్దస్యవః సద్యః సర్పత్రస్తా ఇవాఖవః

పాముకు బయపడే ఎలుకవలే దొంగలందరూ దాక్కున్నారు. ఎలుకా పామూ రెండూ దొంగలే. కానీ ఎలుకకు పామంటే భయం. అంటే ఎలుక వంటి దొంగలు పాము వంటి రాజును చూసి భయపడ్డారు. పామంటే పెద్ద దొంగ. తన రాజరికాన్ని బాగా చాటుకున్నాడు.

స ఆరూఢనృపస్థాన ఉన్నద్ధోऽష్టవిభూతిభిః
అవమేనే మహాభాగాన్స్తబ్ధః సమ్భావితః స్వతః

అష్టదిగ్పాలకుల శక్తులు కూడా తెచ్చుకుని, నేనే దేవున్ని అని అహంకారం కలవాడై తనను తాను ఎక్కువగా గౌరవించుకుంటూ మహాత్ములను అవమానించే వాడు.

ఏవం మదాన్ధ ఉత్సిక్తో నిరఙ్కుశ ఇవ ద్విపః
పర్యటన్రథమాస్థాయ కమ్పయన్నివ రోదసీ

అంకుశములేని ఏనుగులాగ మధాంధుడై గర్వించి భూమ్యాకాశలను స్తంభింపచేస్తున్నట్లుగా రథము ఎక్కి సంచరిస్తూ

న యష్టవ్యం న దాతవ్యం న హోతవ్యం ద్విజాః క్వచిత్
ఇతి న్యవారయద్ధర్మం భేరీఘోషేణ సర్వశః

యజ్ఞ్యమూ దానమూ హోమమూ మీరెవ్వరూ చేయడానికి వీలు లేదు అని చాటింపు చేయించాడు.

వేనస్యావేక్ష్య మునయో దుర్వృత్తస్య విచేష్టితమ్
విమృశ్య లోకవ్యసనం కృపయోచుః స్మ సత్రిణః

అతన్ని రాజుగా చేసిన మునులు అతని దుష్ట చేష్టీములు చూసి లోకానికి ఇంత బాధ కలిగిందే అన్న దయతో

అహో ఉభయతః ప్రాప్తం లోకస్య వ్యసనం మహత్
దారుణ్యుభయతో దీప్తే ఇవ తస్కరపాలయోః

"ఇప్పుడు రెండు రకాల కష్టం ప్రజలకు వచ్చింది. దొంగల వలనా బాధ, రాజులవలనా బాధ. పొయ్యిలో పెట్టిన కొన్ని కట్టెలకు రెండు కొనలకూ నిప్పు అంటుకుంటుంది. అలా రెండు కొనలకూ నిప్పు అంటుకుంటే ఆ కట్టెకు మధ్యలో ఉన్న పురుగులు ఎటూ వెళ్ళలేక ఎలా బాధపడతారో అలా అయ్యింది ఇక్కడ ప్రజల విషయం"

అరాజకభయాదేష కృతో రాజాతదర్హణః
తతోऽప్యాసీద్భయం త్వద్య కథం స్యాత్స్వస్తి దేహినామ్

"రాజపదివికి అర్హుడు కాడని తెలిసీ దొంగల భయము వలన వీనిని రాజుని చేస్తే ఇప్పుడు ఆ భయం రాజునుంచే వచ్చింది. ప్రజలకు శుభం ఎలా కలుగుతుంది"

అహేరివ పయఃపోషః పోషకస్యాప్యనర్థభృత్
వేనః ప్రకృత్యైవ ఖలః సునీథాగర్భసమ్భవః

పాముకు పాలు పోసి పెంచితే ఆ పెంచినవాడికే ఆపద వస్తుంది. వేనుడు పుట్టినప్పటినుండే దుర్మార్గుడు. సునీధ కడుపులో పుట్టాడు (ఆమె మృత్యువుకి కూతురూ అధర్మానికి మనవరాలు)

నిరూపితః ప్రజాపాలః స జిఘాంసతి వై ప్రజాః
తథాపి సాన్త్వయేమాముం నాస్మాంస్తత్పాతకం స్పృశేత్

ప్రజలని పోషించమని నియమిస్తే ఆ రాజు ప్రజలను భక్సిస్తున్నాడు. రాజుగా చేసిన వాడు ప్రజలను బాధపెడుతూ ఉంటే ఆ పాపం ఆయన్ని రాజుగా చేసిన మనదే. అందుకు రాజును మంచివాడిగా చేసే ప్రయత్నం చేద్దాము

తద్విద్వద్భిరసద్వృత్తో వేనోऽస్మాభిః కృతో నృపః
సాన్త్వితో యది నో వాచం న గ్రహీష్యత్యధర్మకృత్

దుర్మార్గుడనీ రాజుగా పనికిరాడనీ అందరినీ బాధిస్తాడనీ తెలిసీ అతన్ని రాజుగా చేసాము. ఒక వేళ మనము ఎంత చెప్పినా ఆ రాజు వినకుంటే

లోకధిక్కారసన్దగ్ధం దహిష్యామః స్వతేజసా
ఏవమధ్యవసాయైనం మునయో గూఢమన్యవః
ఉపవ్రజ్యాబ్రువన్వేనం సాన్త్వయిత్వా చ సామభిః

ఆ చచ్చినవాడిని మనము చంపుదాము. ఇలా నిర్ణయించుకుని కోపాన్ని లోపల దాచుకుని మునులు రాజు వద్దకు వెళ్ళారు. అతన్ని మంచి మాటలతో ఓదార్చి ఇలా మాట్లాడారు.

మునయ ఊచుః
నృపవర్య నిబోధైతద్యత్తే విజ్ఞాపయామ భోః
ఆయుఃశ్రీబలకీర్తీనాం తవ తాత వివర్ధనమ్

మా విజ్ఞ్యాపనను అర్థం చేసుకో. మా మాటల వలన ఆయుష్షూ సంపదా కీర్తీ బలమూ నీకు పెంచుతాయి.

ధర్మ ఆచరితః పుంసాం వాఙ్మనఃకాయబుద్ధిభిః
లోకాన్విశోకాన్వితరత్యథానన్త్యమసఙ్గినామ్

లోకములో మానవులు చతుష్కరణములతో ధర్మాన్ని ఆచరించాలి. త్రికరణ శుద్ధి అంటే మనసు వాక్కూ కాయం. నాలగవది బుద్ధి. ఈ నాలిగింటితో ధర్మం ఆచరిస్తే ప్రజలందరికీ దుఃఖం లేకుండా చేస్తుంది. ఆచరించే వాడు ఆశ లేకుండా చేస్తే ఆ ఆచరించే వాడికి పరమపదమే వస్తుంది.

స తే మా వినశేద్వీర ప్రజానాం క్షేమలక్షణః
యస్మిన్వినష్టే నృపతిరైశ్వర్యాదవరోహతి

ప్రజలకు క్షేమాన్ని కలిగించడానికి కావలసిన ధర్మం నీ దగ్గర నశించకూడదు. అలాంటి ధర్మం నశిస్తే ఆ రాజు పదవిలో ఉండడు.

రాజన్నసాధ్వమాత్యేభ్యశ్చోరాదిభ్యః ప్రజా నృపః
రక్షన్యథా బలిం గృహ్ణన్నిహ ప్రేత్య చ మోదతే

రాజు ప్రజలను దొంగ మంత్రులనుండి కూడా కాపాడాలి, దొంగల నుండీ కాపాడాలి. అలా కాపాడితేనే ఆ ప్రజల నుండి పన్ను తీసుకునే హక్కు రాజుకుంటుంది. అలాంటి రాజు ఇహ పరాలలో సుఖముగా ఉంటాడు. లేకుంటే ఉభయభ్రష్టుడవుతాడు

యస్య రాష్ట్రే పురే చైవ భగవాన్యజ్ఞపూరుషః
ఇజ్యతే స్వేన ధర్మేణ జనైర్వర్ణాశ్రమాన్వితైః

ప్రతీ వాని రాజ్యములో ప్రజలు యజ్ఞ్యముని చేస్తూ పరమాత్మను ఆరాధించాలి. యజ్ఞ్యములు వర్ణాశ్రమ ధర్మాలలో భాగం.

తస్య రాజ్ఞో మహాభాగ భగవాన్భూతభావనః
పరితుష్యతి విశ్వాత్మా తిష్ఠతో నిజశాసనే

అలా ప్రజల చేత ఆరాధించబడే పరమాత్మ ఆ రాజు యందు ప్రసన్నుడవుతాడు. ఆ పరమాత్మ అందరికీ ఆత్మ. పరమాత్మ సంతోషిస్తే రాజూ ప్రజలూ పొందలేనిదంటూ ఏదీ ఉండదు

తస్మింస్తుష్టే కిమప్రాప్యంజగతామీశ్వరేశ్వరే
లోకాః సపాలా హ్యేతస్మై హరన్తి బలిమాదృతాః

ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని లోకపాలకులూ లోకులూ దిక్కులూ దిగ్పాలకులూ ఇలాంటి పరమాత్మకు పరమ ఆదరముతో పూజ చేస్తారు

తం సర్వలోకామరయజ్ఞసఙ్గ్రహం త్రయీమయం ద్రవ్యమయం తపోమయమ్
యజ్ఞైర్విచిత్రైర్యజతో భవాయ తే రాజన్స్వదేశాననురోద్ధుమర్హసి

ఈ పరమాత్మ సర్వ లోకములలో ఉండే దేవతల చేత ఆచరించబడే సకల యజ్ఞ్యములకూ ఆయన సంగ్రహ స్వరూపుడు. పరమాత్మ వేద స్వరూపుడు (త్రయీమయం) లోక స్వరూపుడు (ద్రవ్యమయం) తపో స్వరూపుడు. కాబట్టి ఇలాంటి శాస్త్ర విహితమైన వర్ణాచార ధర్మములు ప్రజలు నీ ఉనికి కోసం ఆచరిస్తారు. అలాంటి యజ్ఞ్యాన్ని నీవు నిరోధించకూడదు.

యజ్ఞేన యుష్మద్విషయే ద్విజాతిభిర్వితాయమానేన సురాః కలా హరేః
స్విష్టాః సుతుష్టాః ప్రదిశన్తి వాఞ్ఛితం తద్ధేలనం నార్హసి వీర చేష్టితుమ్

నీ రాజ్యములో బ్రాహ్మణులు ఆచరించే యజ్ఞ్యముతో పరమాత్మ అంశలైన దేవతలు హవిస్సు ఆరగించి సంతోషించి మనము కోరినది ప్రసాదిస్తారు. అలాంటి దేవతలను అవమానించకూడదు. బ్రాహ్మణులు యజ్ఞ్యాన్ని చేసి నీకే ఇస్తున్నారు

వేన ఉవాచ
బాలిశా బత యూయం వా అధర్మే ధర్మమానినః
యే వృత్తిదం పతిం హిత్వా జారం పతిముపాసతే

శిశువుల వంటి మీకు (అజ్ఞ్యానులు) శాస్త్రం తెలీదు. అధర్మాన్ని ధర్మం అనుకుంటున్నారు. మీకు అన్నం పెట్టేదీ పాలించేదీ నేనైతే ఇంకొకరిని పూజించమంటారా. భర్తను వదిలి పెట్టి జారుని వద్దకు పోయే ధర్మాన్ని ఆచరిస్తున్నారు

అవజానన్త్యమీ మూఢా నృపరూపిణమీశ్వరమ్
నానువిన్దన్తి తే భద్రమిహ లోకే పరత్ర చ

పరమ మూర్ఖులై రాజుగా ఉన్న ఈశ్వరున్ని అయిన నన్ను అవమానిస్తున్నారు. రాజును అవమానించే వారు ఇహ పరాలలో సుఖాన్ని పొందలేరు.

కో యజ్ఞపురుషో నామ యత్ర వో భక్తిరీదృశీ
భర్తృస్నేహవిదూరాణాం యథా జారే కుయోషితామ్

యజ్ఞ్య పురుషుడంటున్నారు వాడెవడు. మీ ధర్మాన్ని మీరు తప్పారు

విష్ణుర్విరిఞ్చో గిరిశ ఇన్ద్రో వాయుర్యమో రవిః
పర్జన్యో ధనదః సోమః క్షితిరగ్నిరపామ్పతిః

ఏతే చాన్యే చ విబుధాః ప్రభవో వరశాపయోః
దేహే భవన్తి నృపతేః సర్వదేవమయో నృపః

రాజు దేహములో ఈ దేవతలందరూ ఉంటారు. రాజు అంటే సర్వ దేవ మయుడు.

తస్మాన్మాం కర్మభిర్విప్రా యజధ్వం గతమత్సరాః
బలిం చ మహ్యం హరత మత్తోऽన్యః కోऽగ్రభుక్పుమాన్

మీరు యజ్ఞ్యం ఎవరికి చేస్తున్నారో అది నేనే. యజ్ఞ్యములలో ఎవరినో ఆరాధించే బదులు హవిస్సు నాకే ఇవ్వండి. మీ మత్సరమంతా తొలగించుకుని నాకే ఇవ్వండి, నాకే పూజలు చేయండి, యజ్ఞ్యములో నాకంటే ముందు వచ్చి యజ్ఞ్య ఫలం తినేవాడెవడున్నాడు

మైత్రేయ ఉవాచ
ఇత్థం విపర్యయమతిః పాపీయానుత్పథం గతః
అనునీయమానస్తద్యాచ్ఞాం న చక్రే భ్రష్టమఙ్గలః

పాపి అయి అడ్డదారి పట్టిన వాడికి ఇంకొంత నచ్చజెప్ప ప్రయత్నించారు. అయినా అన్ని శుభములూ పోగొట్టుకున్న వేనుడు ఋషి వాక్యాలు వినలేదు.

ఇతి తేऽసత్కృతాస్తేన ద్విజాః పణ్డితమానినా
భగ్నాయాం భవ్యయాచ్ఞాయాం తస్మై విదుర చుక్రుధుః

నేనే పండితుడన్న భావనతో వారిని తిరస్కరిస్తే ఋషులలో దాగి ఉన్న కోపం బయటకు వచ్చింది

హన్యతాం హన్యతామేష పాపః ప్రకృతిదారుణః
జీవన్జగదసావాశు కురుతే భస్మసాద్ధ్రువమ్

ఈ రాజు ప్రజలకు భయంకరుడు, భయంకర స్వభావుడూ, ఇతన్ని సంహరించండి. ఎందుకు చంపాలంటే లోకన్ని చంపుతాడు. లోకం నశించక ముందే వీడిని నశింపచేయండి.

నాయమర్హత్యసద్వృత్తో నరదేవవరాసనమ్
యోऽధియజ్ఞపతిం విష్ణుం వినిన్దత్యనపత్రపః

ఈ దుష్ట చరిత్రుడు రాజ సిమ్హాసనములో కూర్చునే  అర్హత లేని వాడు. సిగ్గు విడిచి యజ్ఞ్యపతి అయిన విష్ణువును నిందిస్తున్నాడు. ఆ నింద విన్న వారు మౌనముగా వింటే ఆ భాగం విన్న వారికీ వస్తుంది. ఇటువంటి వాడు ఉండటానికి అర్హుడు కాడు

కో వైనం పరిచక్షీత వేనమేకమృతేऽశుభమ్
ప్రాప్త ఈదృశమైశ్వర్యం యదనుగ్రహభాజనః

ఒక్క వీడు తప్ప పరమాత్మను ఎవరు నిందిస్తారు? ఎవరి దయ వలన రాజయ్యాడో ఈ వేనుడు ఒక్క క్షణము కూడా ఆలోచించట్లేదు. పరమాత్మ అనుగ్రహ పాత్రుడై రాజ్యాన్ని పొందిన వేనుడు ఆ పరమాత్మనే నిందిస్తున్నాడు

ఇత్థం వ్యవసితా హన్తుమృషయో రూఢమన్యవః
నిజఘ్నుర్హుఙ్కృతైర్వేనం హతమచ్యుతనిన్దయా

రాజును చంపాలని నిశ్చయించుకుని కోపముతో (రూఢమన్యవః) (అంతకు ముందు వీరు గూఢ మన్యవః) అందరూ కలిసి హుంకారం చేసారు. భగవంతుని వలన బ్రతుకుతూ భగవంతుని నిందించినవాడు అప్పటికే చచ్చినవాడు. అలాంటి వాడిని హుంకారముతో చంపారు.

ఋషిభిః స్వాశ్రమపదం గతే పుత్రకలేవరమ్
సునీథా పాలయామాస విద్యాయోగేన శోచతీ

సునీధ తన తపో బలముతో (విద్యా యోగముతో - జ్ఞ్యాన బలముతో) ఆ దేహాన్ని చెడిపోకుండా కాపాడింది.

ఏకదా మునయస్తే తు సరస్వత్సలిలాప్లుతాః
హుత్వాగ్నీన్సత్కథాశ్చక్రురుపవిష్టాః సరిత్తటే

కొంతకాలానికి ఋషులు స్నానము చేసి పరమాత్మ కథలను చెప్పుకుంటున్నప్పుడు వారికి ఉత్పాతాలు కనబడ్డాయి

వీక్ష్యోత్థితాంస్తదోత్పాతానాహుర్లోకభయఙ్కరాన్
అప్యభద్రమనాథాయా దస్యుభ్యో న భవేద్భువః

రాజు లేని ఊరికి దొంగల వలన ఆపద కలగబోతున్నదా అనుకొని

ఏవం మృశన్త ఋషయో ధావతాం సర్వతోదిశమ్
పాంసుః సముత్థితో భూరిశ్చోరాణామభిలుమ్పతామ్

ఆలోచ్చించి ఏమి జరుగుతోందో చూసారు. దోచుకునే దోపిడీ దొంగల వలన వచ్చిన దుమ్ము చూచీ, రాజు లేకపోవడం వలన ఎవరికి వారు దొంగలవడం చూచి,

తదుపద్రవమాజ్ఞాయ లోకస్య వసు లుమ్పతామ్
భర్తర్యుపరతే తస్మిన్నన్యోన్యం చ జిఘాంసతామ్

చోరప్రాయం జనపదం హీనసత్త్వమరాజకమ్
లోకాన్నావారయఞ్ఛక్తా అపి తద్దోషదర్శినః

రాజ్యమంతా దొంగల పరమైఅనదీ అని తెలుసుకున్నారు. మరి రాజుని చంపిన వారు దొంగలను చంపలేరా? దొంగలను చంపగలిగిన వారైనా వారించలేదు. తాము దొంగలను వారించడం మొదలుపెడితే వారే రాజులవుతారు. అంటే బ్రాహ్మణుడు బ్రాహ్మణ ధర్మాన్ని వదిలినట్లవుతుంది. ఒక్క సారి పరిపాలనా రాజ్యమూ వస్తే ఇంక బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరించలేరు. రాజుగా ఉంటే కలిగే దోషం తెలుసు కాబట్టి (రాజ్యాంతే నరకం ధ్రువం) వారిని వారించలేదు.

బ్రాహ్మణః సమదృక్శాన్తో దీనానాం సముపేక్షకః
స్రవతే బ్రహ్మ తస్యాపి భిన్నభాణ్డాత్పయో యథా

శిక్షించడమూ తప్పే, ప్రజలకు హాని కలిగినప్పుడు చూస్తూ ఊరుకున్నా తప్పే. అందరిలో పరమాత్మను చూచేవాడూ, ఇంద్రియముల యందు నిగ్రహం కలిగినవాడూ, అయిన బ్రాహ్మణుడు ఇలాంటి వారిని ఉపేక్షిస్తే  చిల్లు కుండలో ఉన్న నీరు కారిపోతున్నట్లు వాడు సంపాదించిన వారి తపస్సంతా కర్చయి పోతుంది

నాఙ్గస్య వంశో రాజర్షేరేష సంస్థాతుమర్హతి
అమోఘవీర్యా హి నృపా వంశేऽస్మిన్కేశవాశ్రయాః

మనం రాజును చంపేసాము కానీ దాని వలన అంగ వంశం నిర్వంశం కాకూడదు. అంగ వంశ రాజులు బల పరాక్రమం కలవారు. విష్ణు భక్తులూ.

వినిశ్చిత్యైవమృషయో విపన్నస్య మహీపతేః
మమన్థురూరుం తరసా తత్రాసీద్బాహుకో నరః
కాకకృష్ణోऽతిహ్రస్వాఙ్గో హ్రస్వబాహుర్మహాహనుః
హ్రస్వపాన్నిమ్ననాసాగ్రో రక్తాక్షస్తామ్రమూర్ధజః

అలా ఆలోచించుకుని ఆ వేనుని దేహం వద్దకు వచ్చి అతని తొడని మదించారు. అప్పుడు ఒక పొట్టివాడు, నల్లటి వాడూ పొట్టి చేతులూ కలవాడు, పెద్ద నోరు కలవాడు పొట్టి కాళ్ళు కలవాడు, ముక్కు లావుగా ఉన్నవాడు ఎర్రటి కళ్ళూ కేశములూ కలవాడు. సంతానం రావాలంటే బాహువును మదించాలి గానీ తొడనెందుకు మదించారు? తెలియకనా? తొడనుండి పుట్టిన వారి వలన వేనుడు పరిశుద్ధుడయ్యాడు. అతని నుండి మంచి సంతానం కావాలంటే మొదలు అతను పాప విముక్తుడు కావాలి.

తం తు తేऽవనతం దీనం కిం కరోమీతి వాదినమ్
నిషీదేత్యబ్రువంస్తాత స నిషాదస్తతోऽభవత్

దీనముగా ఉన్న వాడు ఏమి చేయాలి అని అడగగా "నీవు కూర్చో" మన్నారు. వీరే నిషాధులయ్యారు.

తస్య వంశ్యాస్తు నైషాదా గిరికాననగోచరాః
యేనాహరజ్జాయమానో వేనకల్మషముల్బణమ్

వీరుండేది పర్వత అరణ్య ప్రాంతాలలో ఉంటారు. వీడు పుట్టి మహాభయంకరమైన వేనుని పాపాన్ని పోగొట్టాడు. (అందుకే ఆటవికులకు తల్లి తండ్రులంటే ప్రేమ ఎక్కువ. దానికి ఇదే కారణం. ఈ నిషాధుడు పుట్టి అంతవరకూ వేనుడు పాపం పోగొట్టాడు )

Sunday, February 24, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదమూడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పదమూడవ అధ్యాయం

సూత ఉవాచ
నిశమ్య కౌషారవిణోపవర్ణితం ధ్రువస్య వైకుణ్ఠపదాధిరోహణమ్
ప్రరూఢభావో భగవత్యధోక్షజే ప్రష్టుం పునస్తం విదురః ప్రచక్రమే

పరమాత్మ ఆర్తత్రాణ పరాయణుడు. అనన్యమైన శరణం వేడిన వారు జడులైనా జ్ఞ్యానులైనా పిలిస్తే వెంటనే వస్తాడు. పరమాత్మ ఎక్కడో ఉంటాడు, మనం పిలిస్తే పలుకుతాడా అని అనుకునే మనకు ధృవ చరిత్ర చదివితే పరమాత్మ వాత్సల్యం అర్థమవుతుంది. దూడ ప్రసవించగానే తల్లి తన నాలుకతో దూడ ఒంటిని శుభ్రపరుస్తుంది. పరమాత్మ కూడా తప్పులు చేసిన వారిని విశేషముగా కరుణిస్తాడు. ఇలాంటి చరిత్ర చదివితే పరమాత్మ యందు భక్తి కలుగుతుంది. ఆయన ఇంద్రియ వ్యాపారములను కిందుగా చేసేవాడు
ధృవుడు వైఖుంఠానికి వెళ్ళిన గాధ విన్న విదురుడు మళ్ళీ ఇంకా అడగటానికి ప్రారంభించాడు.

విదుర ఉవాచ
కే తే ప్రచేతసో నామ కస్యాపత్యాని సువ్రత
కస్యాన్వవాయే ప్రఖ్యాతాః కుత్ర వా సత్రమాసత

ధృవుని యొక్క గొప్ప్ప తనాన్ని నారదుడు ప్రాచేతసుల యజ్ఞ్యములో గానము చేసాడని చెప్పరు. ఆ ప్రచేతసులు ఎవరూ, ఏ వంశం వారు. ఎక్కడ యజ్ఞ్యం చేసారు.

మన్యే మహాభాగవతం నారదం దేవదర్శనమ్
యేన ప్రోక్తః క్రియాయోగః పరిచర్యావిధిర్హరేః

నారదుడు భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రుడైన భక్తాగ్రేసుడు. భగవంతుని సాక్షాత్కరించుకున్న వాడు నారదుడు అని అనుకుంటున్నాను. పరమాత్మకు ఎలా ఉపచారములు చేయాలి, ఎలా పరిచర్యలు చేయాలి ( పాంచరాత్ర ఆగమ రీత్యా పరమాత్మను ఎలా ఆరాధించాలి - అర్ఘ్య పాద్య ఆచమనీయం స్నానం వస్త్రం ధూపం దీపం నైవేద్యం మొదలిన పరిచర్యలు అన్నీ ఆరాధనా విధి. ఉదా: చల్లటి నీటితో భగవానునికి స్నామ చేయించకూడదు. గోరువెచ్చని నీటితో చేయించాలి. నవ కలశాలు స్థాపించి 9,16, మొదలైన కలశాలు స్థాపించి స్నానం చేయించాలి. ఏ సమయములో ఎటువంటి వస్త్రాలు ధరింపచేయాలి. అవి మనకు కూడా వర్తిస్తాయి. ఉదా పెళ్ళికి వెళుతూ నలుపు వస్త్రాలు ధరిస్తారు. అది తప్పు. అలాగే పరమాత్మని దర్శించడానికి వెళ్ళేప్పుడు ఎలాంటి వస్త్రాలు ధరించాలి, ఎలాంటివి స్వామికి అలంకరించాలి, ఎలాంటి జలముతో పరమాత్మకి స్నానం చేయించాలి. ఎలాంటి నీరైనా గోరువెచ్చటి నీటితోనే స్నానం చేయించాలి ) అనే క్రియా యోగాన్ని రచించిన వాడు నారదుడు. క్రియాయోగమంటే భగవంతుని పరిచర్య.

స్వధర్మశీలైః పురుషైర్భగవాన్యజ్ఞపూరుషః
ఇజ్యమానో భక్తిమతా నారదేనేరితః కిల

తనతో సమానమైన పురుషుల చేత భగవానుడు, యజ్ఞ్య పురుషుడు, యజ్ఞ్య యాగాదులు చేయబడుతూ.

యాస్తా దేవర్షిణా తత్ర వర్ణితా భగవత్కథాః
మహ్యం శుశ్రూషవే బ్రహ్మన్కార్త్స్న్యేనాచష్టుమర్హసి

నారదుడు ఏ ఏ విషయాలను ఆ సభలో చెప్పారో నిన్ను సేవిస్తున్న నాకు చెప్పాలని ప్రార్థిస్తున్నాను.

మైత్రేయ ఉవాచ
ధ్రువస్య చోత్కలః పుత్రః పితరి ప్రస్థితే వనమ్
సార్వభౌమశ్రియం నైచ్ఛదధిరాజాసనం పితుః

ధృవుని కుమారుడైన ఉత్కలుడు ధృవుడు వనానికి వెళ్ళిన తరువాత "నాన్న లేని రాజ్యం నాకెందుకనుకున్నాడు". ఆ  రాజ్య లక్ష్మిని కోరుకోలేదు.

స జన్మనోపశాన్తాత్మా నిఃసఙ్గః సమదర్శనః
దదర్శ లోకే వితతమాత్మానం లోకమాత్మని

పుట్టుకతోనే ఇతడు ప్రశాంతమైన మనసునే కలిగి ఉన్నాడు. ఆటలూ పాటలన్నా మనసు లేక. ప్రాపంచిక విషయాల యందు నిస్సంగుడై, అందరిలో సమాన రూపములో ఉన్న పరమాత్మను చూసేవాడు. ప్రపంచములో అంతటా ఉన్న పరమాత్మనూ పరమాత్మలో ఉన్న ప్రపంచాన్నీ చూడగలిగాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఎవరికి ప్రాపంచిక విషయాల మీద ధ్యాస ఉండదో వాడు అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మను దర్శించగలడు. అంతర్యామిగా ఉన్న స్వామిని పర  వ్యూహ విభవాది ఆకారలలో ఉన్న పరమాత్మని ప్రతీ ప్రాణిలోనూ చూస్తారు.

ఆత్మానం బ్రహ్మ నిర్వాణం ప్రత్యస్తమితవిగ్రహమ్
అవబోధరసైకాత్మ్యమానన్దమనుసన్తతమ్

ఇటువంటి మహాత్ముడు కాబట్టి, బ్రహ్మానందాన్ని పొందీ ఎలాంటి వారిమీదా ద్వేష భావము లేక. ఆకారము యందూ దేహము యందూ ప్రత్యేకమైన అభిమానం లేని వాడు. పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడమే అన్ని రసముల కన్నా (అవబోధ రసం - జ్ఞ్యానమనే రసం) మిన్న అయిన పరమాత్మను ఆనంద రసముగా తెలుసుకొని

అవ్యవచ్ఛిన్నయోగాగ్ని దగ్ధకర్మమలాశయః
స్వరూపమవరున్ధానో నాత్మనోऽన్యం తదైక్షత

నిరంతర సమాధి యోగాగ్నితో అంతవరకూ చేసిన పాపాలని, కర్మ మలాన్నీ కాల్చాడు. మనకు తెలియకనే మనం చేసే మంచి పనులలో కూడా చెడు భాగమే ఉంటుంది. ఆత్మ స్వరూపాన్ని నిరంతరం మనసులో ధ్యానం చేయడం వలన, ఆత్మ కన్నా వేరే వస్తువు ఉన్నదని చూడలేదు. అంతా పరమాత్మ మయమని తెలుసుకున్నాడు. (ఈశావాస్యమిదం సర్వం) తన ఆత్మకంటే వేరే స్వరూపాన్ని తాను ఎక్కడా చూడలేదు.

జడాన్ధబధిరోన్మత్త మూకాకృతిరతన్మతిః
లక్షితః పథి బాలానాం ప్రశాన్తార్చిరివానలః

సంసారము యందు ఆసక్తి లేకుండా ఉన్నాడనడానికి గుర్తు - అన్నీ ఉండి కూడా ఏమి లేనివాడిలాగ ఉన్నాడు. చెవులుండీ చెవిటి వాడిలా, మూగవాడిలా ఉన్మత్తుడిలా ఉన్నాడు.  సంసారము యందు మనసు లేకుండా ఉన్నాడు. పరమాత్మ జ్ఞ్యానామృత రసాన్ని పానము చేసిన వాడికి ఈ అవస్థలేమీ ఉండవు.

మత్వా తం జడమున్మత్తం కులవృద్ధాః సమన్త్రిణః
వత్సరం భూపతిం చక్రుర్యవీయాంసం భ్రమేః సుతమ్

ఇతను దారిలో వెళుతూ ఉంటే బాలురు పిచ్చివాడనుకున్నారు. పెద్దలూ కుల వృద్ధులు కూడా నివురు గప్పిన నిప్పులా ఉన్న ఈయనను చూసి పిచ్చివాడనుకున్నారు. ఎప్పుడైతే రాజ్యము మీద ఆశలేకుండా వెళ్ళిపోయాడో వతలున్ని రాజుగా చేసారు. ఈయన భ్రమి కుమారుడు.

స్వర్వీథిర్వత్సరస్యేష్టా భార్యాసూత షడాత్మజాన్
పుష్పార్ణం తిగ్మకేతుం చ ఇషమూర్జం వసుం జయమ్

ఇతని యొక్క భార్య ఆరుగురు కుమారులను ప్రసవించింది

పుష్పార్ణస్య ప్రభా భార్యా దోషా చ ద్వే బభూవతుః
ప్రాతర్మధ్యన్దినం సాయమితి హ్యాసన్ప్రభాసుతాః

పుష్పార్ణుడికి దోషా ప్రభా అని ఇద్దరు భార్యలు. ప్రభకు ప్రాతః మధ్యాన్నం సాయం అని పేర్లు. పుష్పార్ణ అంటే సూర్యుడు. సూర్యుని భార్య ప్రభ (కాంతి).

ప్రదోషో నిశిథో వ్యుష్ట ఇతి దోషాసుతాస్త్రయః
వ్యుష్టః సుతం పుష్కరిణ్యాం సర్వతేజసమాదధే

దోషకు (రాత్రికి) ముగ్గురు కుమారులు ప్రదోష (రాత్రికన్నా ముందు వచ్చేది - సాయం) నిశీధ (రాత్రి) వ్యుష్ట (మధ్య రాత్రి). వ్యుష్టుడు పుష్కరిణి అన్న భార్య యందు సర్వ తేజసుడనే వాడికి జన్మనిచ్చాడు

స చక్షుః సుతమాకూత్యాం పత్న్యాం మనుమవాప హ
మనోరసూత మహిషీ విరజాన్నడ్వలా సుతాన్

సర్వ తేజసుడు అకూతి యందు చక్షువును పుత్రుడుగా పొందాడు. మనోర సుతి కుమారులను కలిగింది

పురుం కుత్సం త్రితం ద్యుమ్నం సత్యవన్తమృతం వ్రతమ్
అగ్నిష్టోమమతీరాత్రం ప్రద్యుమ్నం శిబిముల్ముకమ్

ఉల్ముకోऽజనయత్పుత్రాన్పుష్కరిణ్యాం షడుత్తమాన్
అఙ్గం సుమనసం ఖ్యాతిం క్రతుమఙ్గిరసం గయమ్

ఉన్ముఖునికి ఇంకో ఆరు కుమారులు కలిగారు

సునీథాఙ్గస్య యా పత్నీ సుషువే వేనముల్బణమ్
యద్దౌఃశీల్యాత్స రాజర్షిర్నిర్విణ్ణో నిరగాత్పురాత్

అంగుడు సునీధి యందు వేనుడు పుట్టాడు. ఈ వేనుడి దుష్ట స్వభావాన్ని చూచి తండ్రి అయిన అంగుడు నగరము నుండి అన్నీ వదిలి వెళ్ళిపోయాడు. పరమ శాంత స్వభావులైన ఋషులు కూడా వేనున్ని శపించారు.

యమఙ్గ శేపుః కుపితా వాగ్వజ్రా మునయః కిల
గతాసోస్తస్య భూయస్తే మమన్థుర్దక్షిణం కరమ్

రాజు ఒకడు దుష్టులని శిక్షించడానికి కావాలి గనుకు ఇతని ప్రాణము పోయిన తరువాత అదే మునులు ఇతని దక్షిణ బాహువుని చిలకగా

అరాజకే తదా లోకే దస్యుభిః పీడితాః ప్రజాః
జాతో నారాయణాంశేన పృథురాద్యః క్షితీశ్వరః

దక్షిణ బాహువు నుండి పృధు చక్రవర్తి పుట్టాడు.

విదుర ఉవాచ
తస్య శీలనిధేః సాధోర్బ్రహ్మణ్యస్య మహాత్మనః
రాజ్ఞః కథమభూద్దుష్టా ప్రజా యద్విమనా యయౌ

అంగుడు ధర్మాతుడూ సాధువు బ్రహ్మణ భక్తి కలవాడు, రాజర్షీ ఉత్తముడూ అన్నావు. ఇలాంటి వాడికి ఇంత దుష్టుడైన కుమారుడు ఎలా కలిగాడు. ఇతని వలన తండ్రి వెళ్ళిపోయాడు రాజ్యం వదిలి.

కిం వాంహో వేన ఉద్దిశ్య బ్రహ్మదణ్డమయూయుజన్
దణ్డవ్రతధరే రాజ్ఞి మునయో ధర్మకోవిదాః

పరమ శాంత స్వభావులైన బ్రాహ్మణులు అన్ని మర్యాదలు దాటిపోతేనే కోపిస్తారు. ఋషులు శపించారంటే ఆశ్చర్యం కాదు, సంహరించడం ఆశ్చర్యం. బ్రాహ్మణున్ని చంపడం కంటే పరిపాలించే రాజుని చంపడం ఆశ్చర్యం కద. ధర్మ కోవిదులైన మునులు ...

నావధ్యేయః ప్రజాపాలః ప్రజాభిరఘవానపి
యదసౌ లోకపాలానాం బిభర్త్యోజః స్వతేజసా

... తమని పరిపాలించేవారు ఎంత పాపం చేసినా చంపరు కదా. దేశ బహిష్కారం చేయవచ్చు. పదవి నుంచి దింపవచ్చు. ప్రజలు తమ పాలకుడిని చంపకూడదు కదా. అగ్ని వాయు ఇంద్ర యమ కుబేర మొదలైన అంశలను రాజు ధరించి ఉంటాడు. అష్ట దిగ్పాలకుల అంశనూ త్రిమూర్తుల తేజస్సు కలిగి ఉంటాడు రాజు అని శాస్త్రం.

ఏతదాఖ్యాహి మే బ్రహ్మన్సునీథాత్మజచేష్టితమ్
శ్రద్దధానాయ భక్తాయ త్వం పరావరవిత్తమః

ఈ సునీధ కుమారుడూ అంతటి పరమ దుర్మార్గుడా? నాకా కధ వినాలని శ్రద్ధ కలుగుతోంది. నీ భక్తుడనైన నేను శ్రద్ధగా వినాలనుకుంటున్నాను. నీవు అంతా తెలిసిన వాడవౌఉ (కొద్దిగానూ తెలుసూ పెద్దగానూ తెలుసు అంటే ఒక్క శ్లోకాన్ని మూడు రోజులూ చెప్పగలగడం మూడు వందల శ్లోకాలని ఒక్కరోజులోనూ చెప్పగలగడం - పరావరవిత్తమః)

మైత్రేయ ఉవాచ
అఙ్గోऽశ్వమేధం రాజర్షిరాజహార మహాక్రతుమ్
నాజగ్ముర్దేవతాస్తస్మిన్నాహూతా బ్రహ్మవాదిభిః

అశ్వమేధ యజ్ఞ్యాన్ని ఆచరించాడు అంగుడు. అతను ఆచరించిన అశ్వమేధ యాగములో ఆహుతులు తీసుకోవడానికి దేవతలెవ్వరూ రాలేదు.

తమూచుర్విస్మితాస్తత్ర యజమానమథర్త్విజః
హవీంషి హూయమానాని న తే గృహ్ణన్తి దేవతాః
రాజన్హవీంష్యదుష్టాని శ్రద్ధయాసాదితాని తే
ఛన్దాంస్యయాతయామాని యోజితాని ధృతవ్రతైః

అప్పుడు హోతా అధ్వర్యువూ వచ్చి "మేము హవిస్సు శ్రద్ధగానే ఇస్తున్నాము. మేము వేదాధ్యాయనం చేసిన నాటినుండీ చదువుకున్న వేద మంత్రాలని ఏ ఒక్క పూటా కూడా చదవకుండా ఉండలేదు.  మేము శ్రాద్ధాళువులము.""

న విదామేహ దేవానాం హేలనం వయమణ్వపి
యన్న గృహ్ణన్తి భాగాన్స్వాన్యే దేవాః కర్మసాక్షిణః

ఇన్ని ఉన్నా దేవతలెందుకు తిరస్కరించారో మాకు తెలియదు. దేవతలు కర్మ సాక్షులు. మనమాచరించే ప్రతీ పనీ వారు చూస్తున్నారూ, చేయిస్తున్నారు. అంతర్యామిగా ఉన్న పరమాత్మకు మనమనుకునే ప్రతీదీ తెలుస్తుంది. తలుపులన్నీ వేసుకుని మనం పనులు చేయాలన్నా మనం పని చేసే ఇంద్రియాలకు ఉన్న దేవతలు ఆ పనికి సాక్షులు. ఉదా కన్ను చూస్తున్నదంటే సూర్యుడు చూస్తున్నాడనే అర్థం. మన ప్రీ ఇంద్రియానికీ ఉన్న అధిష్ఠాన దేవతలకు తెలియకుండా మనం ఏ పనీ చేయలేము. మనకు తెలియకుండానే మనం ఏవో తప్పులు చేసి ఉంటాము.

మైత్రేయ ఉవాచ
అఙ్గో ద్విజవచః శ్రుత్వా యజమానః సుదుర్మనాః
తత్ప్రష్టుం వ్యసృజద్వాచం సదస్యాంస్తదనుజ్ఞయా

బ్రాహ్మణుల వాక్యం విన్న అంగదుడు దుఃఖపడి అసలు విషయం తెలుసుకుందామని ఋత్విక్కుల ఆజ్ఞ్య పొంది అందరినీ అడిగాడు

నాగచ్ఛన్త్యాహుతా దేవా న గృహ్ణన్తి గ్రహానిహ
సదసస్పతయో బ్రూత కిమవద్యం మయా కృతమ్

మేము అర్పించిన హవిస్సును దేవతలు తీసుకోవటం లేదు. నేనేమి తప్పు చేసాను. బ్రాహ్మణులు తమ లోపం లేదని చెప్పారు. నా తప్పేముంది

సదసస్పతయ ఊచుః
నరదేవేహ భవతో నాఘం తావన్మనాక్స్థితమ్
అస్త్యేకం ప్రాక్తనమఘం యదిహేదృక్త్వమప్రజః

మహారాజా నీ విషయములో కూడా ఏ చిన్న తప్పు కలుగలేదు. నీవీ జన్మలో ఏ పాపమూ చేయకపోయినా పూర్వ జన్మలో ఏదో పాపం చేసి ఉంటావు ఎందుకంటే నీకన్నీ ఉన్నాయి గానీ సంతానం లేదు. సంతానం లేని వాడు చేసే హోమ హవిస్సులు దేవతలు స్వీకరించరు.

తథా సాధయ భద్రం తే ఆత్మానం సుప్రజం నృప
ఇష్టస్తే పుత్రకామస్య పుత్రం దాస్యతి యజ్ఞభుక్

హవిస్సులు దేవతలు తీసుకోవాలంటే నీకు సత్సంతానం కలగాలి. పరమాత్మని ఆరాధిస్తే ఆయన నీ ఇష్టాన్ని నెరవేరుస్తాడు.

తథా స్వభాగధేయాని గ్రహీష్యన్తి దివౌకసః
యద్యజ్ఞపురుషః సాక్షాదపత్యాయ హరిర్వృతః

పరమాత్మ సంతానాన్ని ప్రసాదిస్తే దేవతలు కూడా హవిస్సును స్వీకరిస్తారు.

తాంస్తాన్కామాన్హరిర్దద్యాద్యాన్యాన్కామయతే జనః
ఆరాధితో యథైవైష తథా పుంసాం ఫలోదయః

భగవంతున్నే కుమారుడిగా కోరితే ఆయనే పుట్టాడు. అలాంటి దృష్టాంతాలు చాలా కలవు. భక్తులడిగిన ప్రతీ కోరికనూ దగ్గరుండి మరీ తీరుస్తాడు. మానవులు ఎలా ఆరాధిస్తారో అవి ఇస్తాడు. ధర్మార్థ కామ మోక్షాలన్నీ ఇచ్చేది ఆయనే

ఇతి వ్యవసితా విప్రాస్తస్య రాజ్ఞః ప్రజాతయే
పురోడాశం నిరవపన్శిపివిష్టాయ విష్ణవే

ఉత్తమ సంతానం కావడం కోసం పుత్రకామేష్టి మొదలుపెట్టి శిపి విష్టుడైన విష్ణువు యొక్క యజ్ఞ్యాన్ని చేసారు

తస్మాత్పురుష ఉత్తస్థౌ హేమమాల్యమలామ్బరః
హిరణ్మయేన పాత్రేణ సిద్ధమాదాయ పాయసమ్

ఆ యజ్ఞ్య కుండం నుండి పీత మాల్యాంబరములతో బంగారు పాయసముతో ఒక పురుషుడు వచ్చి పాయసం ఇచ్చాడు.

స విప్రానుమతో రాజా గృహీత్వాఞ్జలినౌదనమ్
అవఘ్రాయ ముదా యుక్తః ప్రాదాత్పత్న్యా ఉదారధీః

చుట్టూ పెద్దలు ఉన్నప్పుడు వారి అనుమతిపొందిన తరువాతే తీసుకోవాలి. కనుక బ్రాహ్మణుల అనుమతి తీసుకుని పాయసాన్ని యజ్ఞ్య పురుషుడి నుండి తీసుకుని వాసన చూసి,

సా తత్పుంసవనం రాజ్ఞీ ప్రాశ్య వై పత్యురాదధే
గర్భం కాల ఉపావృత్తే కుమారం సుషువేऽప్రజా

ఉదార బుద్ధి కలవాడగుటచే భార్యకు ఇచ్చాడు. భర్తనుండి వచ్చిన ఆ పాయసాన్ని తీసుకుని గర్భమును పొంది ప్రసూతి సమయానికి ఉత్తముడైన కుమారుడిని ప్రసవించింది

స బాల ఏవ పురుషో మాతామహమనువ్రతః
అధర్మాంశోద్భవం మృత్యుం తేనాభవదధార్మికః

పుట్టిన పిల్లవాడికి తల్లి యొక్క తండ్రి అయిన మృత్యువు పోలికలు వచ్చాయి. అధర్మమునుండి పుట్టినవాడైన మృత్యువు పోలికలూ గుణాలూ వచ్చాయి. అందువలన అధార్మికుడయ్యాడు.

స శరాసనముద్యమ్య మృగయుర్వనగోచరః
హన్త్యసాధుర్మృగాన్దీనాన్వేనోऽసావిత్యరౌజ్జనః

వీడెంత దుర్మార్గుడంటే ధనుర్బాణాలు తీసుకుని వేట యందు ఆసక్తి కలవాడై, దుష్ట మృగాలనే కాకుండా సాధు మృగాలను కూడా చంపాడు. అందు వలన జనాలందరూ మొత్తుకున్నారు.

ఆక్రీడే క్రీడతో బాలాన్వయస్యానతిదారుణః
ప్రసహ్య నిరనుక్రోశః పశుమారమమారయత్

తన వయసున్న పిల్లలతో ఆడుకుంటూ, వారిని కింద పడేసి కాలితో తొక్కి పశువులను చంపినట్లు చంపేవాడు.

తం విచక్ష్య ఖలం పుత్రం శాసనైర్వివిధైర్నృపః
యదా న శాసితుం కల్పో భృశమాసీత్సుదుర్మనాః

ఇంతటి పరమ దుర్మార్గుడైన పుత్రున్ని చూచిన రాజు చాలా సార్లు చాలా రకములుగా దండించాడు. ఎన్ని చేసినా మారకపోయే సరికి మనసులో బాగా కలత చెందాడు.

ప్రాయేణాభ్యర్చితో దేవో యేऽప్రజా గృహమేధినః
కదపత్యభృతం దుఃఖం యే న విన్దన్తి దుర్భరమ్

లోకములో చాలా మంది సంతానం కావాలని మొక్కుతారు గానీ దుష్ట సంతానం కలిగడం వలన కలిగే బాధ వారికి తెలియదు. దుష్ట సంతానం వలన కలిగే ఇబ్బంది తెలిస్తే పొరబాటున కూడా సంతానం కోసం ప్రాకులాడరు.

యతః పాపీయసీ కీర్తిరధర్మశ్చ మహాన్నృణామ్
యతో విరోధః సర్వేషాం యత ఆధిరనన్తకః

సంతానం చెడ్డదైతే అపకీర్తి వస్తుంది, అంతులేని మనోవ్యధ వస్తుంది.

కస్తం ప్రజాపదేశం వై మోహబన్ధనమాత్మనః
పణ్డితో బహు మన్యేత యదర్థాః క్లేశదా గృహాః

సంతానం ఆత్మను కట్టి పడేస్తుంది. భార్య మీద విరక్తి పుడుతుందేమో గానీ కొడుకు మీద పుట్టదు. ఇలాంటి సంతానాన్ని ఏ పండితుడైనా కావాలని కోరుకుంటాడా. ఏ సంతానం వలన ఇల్లు అన్ని రకముల కష్టాలు కల్పించేదవుతుందో, నిత్యమూ సమస్యల వలయమవుతుందో అలాంటి సంతానం కోసం బుద్ధిమంతుడెవడూ దేవతలను సంతానం కొరకు ప్రార్థించడు.

కదపత్యం వరం మన్యే సదపత్యాచ్ఛుచాం పదాత్
నిర్విద్యేత గృహాన్మర్త్యో యత్క్లేశనివహా గృహాః

అయినా కొంత ఆలోచిస్తే సత్సంతానం కంటే దుష్ట సంతానమే మేలు. వారి వలన తండ్రికి విరక్తి పుట్టి సంసారం విడిచి వెళతాడు. వందమంది మంచి సంతానం కన్నా ఒక దుష్ట సంతానమే మేలు. విరక్తి కలిగించే వారు దుష్ట సంతానమే. త్వరగా విరక్తి పుడుతుంది.

ఏవం స నిర్విణ్ణమనా నృపో గృహాన్నిశీథ ఉత్థాయ మహోదయోదయాత్
అలబ్ధనిద్రోऽనుపలక్షితో నృభిర్హిత్వా గతో వేనసువం ప్రసుప్తామ్

ఇలా ఆ అంగరాజు పూర్తిగా విరక్తి చెంది నిద్రపట్టని వాడై సూర్యోదయం కంటే ముందే లేచి ఇల్లు వదిలిపెట్టి, పడుకుని ఉన్న వేనున్నీ, భార్యనీ చూసి, వారికి చెప్పకుండా వెళ్ళాడు

విజ్ఞాయ నిర్విద్య గతం పతిం ప్రజాః పురోహితామాత్యసుహృద్గణాదయః
విచిక్యురుర్వ్యామతిశోకకాతరా యథా నిగూఢం పురుషం కుయోగినః

తెల్లవారగానే విరక్తి చెంది రాజు వెళ్ళిపోయాడని ప్రజలు తెలుసుకున్నారు. పురోహితులూ మంత్రులూ మొదలైన వారు "కొడుకును వెళ్ళగొట్టక ఇంత మంచి వాడు వెళ్ళిపోయాడని" బాధపడ్డారు. అతి రహస్యముగా దాగి ఉన్న అంతర్యామి అయిన పరమాత్మను కుయోగి సాక్షాత్కరించుకోలేనట్లుగా ఈ మంత్రులు ఎంత వెదికినా రాజును పట్టుకోలేకపోయారు.

అలక్షయన్తః పదవీం ప్రజాపతేర్హతోద్యమాః ప్రత్యుపసృత్య తే పురీమ్
ఋషీన్సమేతానభివన్ద్య సాశ్రవో న్యవేదయన్పౌరవ భర్తృవిప్లవమ్

ఇలా రాజుగారెక్కడికి వెళ్ళారో తెలియక అన్నీ వెతికి వెతికీ తిరిగి అదే నగరానికి వచ్చారు. అక్కడ కూడి ఉన్న ఋషులకు నమస్కరించి కన్నీరు గారుస్తూ, మహారాజుగారు దొరకలేదంటే ఆయన లోకాన్నే విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటారు అన్న్న విషయాన్ని ఋషులకు నివేదించారు. విరక్తి పొందిన రాజులు ఏ ఏ ప్రాంతాలలో ఉంటారు తెలిసిన్ వారు కాబట్టి అవన్నీ గాలించి రాజు ఎవరికీ అందని ప్రాంతానికి వెళ్ళి ఉంటారని తెలుసుకొని ఋషులకు ఆ విషయాన్ని నివేదించారు.

Saturday, February 23, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం పన్నెండవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ధ్రువం నివృత్తం ప్రతిబుద్ధ్య వైశసాదపేతమన్యుం భగవాన్ధనేశ్వరః
తత్రాగతశ్చారణయక్షకిన్నరైః సంస్తూయమానో న్యవదత్కృతాఞ్జలిమ్

కోపము తొలగిపోయి హింసనుండి మరలిన ధృవున్ని తెలుసుకుని మహాత్ముడైన కుబేరుడు శారద యక్ష కిన్నెరాదులచే స్తోత్రం చేయబడుతూ అక్కడికి వచ్చాడు. ధృవుడు కుబేరునికి నమస్కారం చేసాడు. ధృవునితో కుబేరుడిలా అన్నాడు

ధనద ఉవాచ
భో భోః క్షత్రియదాయాద పరితుష్టోऽస్మి తేऽనఘ
యత్త్వం పితామహాదేశాద్వైరం దుస్త్యజమత్యజః

(పెద్దలమాట విన్నాడు ధృవుడు అనఘుడు)
పాప రహితుడవైన ధృవా, నీ పనికి నేను మెచ్చాను (తాతగారి మాట వినడాన్ని, కోపములో ఉన్నవారు ఎవరినీ పట్టించుకోరు). తాత గారి ఆజ్ఞ్య వలన విడిచిపెట్టరాని కోపాన్ని విడిచిపెట్టావు.

న భవానవధీద్యక్షాన్న యక్షా భ్రాతరం తవ
కాల ఏవ హి భూతానాం ప్రభురప్యయభావయోః

నీవు యక్షులనూ చంపలేదూ, యక్షులు  నీ సోదరున్నీ చంపలేదు. ప్రాణి పుట్టాలన్నా మరణించాలన్నా వారి వారి కాలమే కారణం. కాలానుగుణముగానే పుడతారూ, కాలానుగుణముగానే మరణిస్తారు.

అహం త్వమిత్యపార్థా ధీరజ్ఞానాత్పురుషస్య హి
స్వాప్నీవాభాత్యతద్ధ్యానాద్యయా బన్ధవిపర్యయౌ

నేనూ నీవు అన్న వ్యవహారమే అపార్థము. ఇది అజ్ఞ్యానం వలన కలిగేదే తప్ప ఈ భేదము కూడా లేదు. స్వప్నములోని బుద్ధిలాగ, అసత్తును ధ్యానం చేయడం వలన (లేదా భగవంతుని ధ్యానం చేయనందు వలన) . ఈ దృష్టితోటే పుట్టుకా సంసారం నరకం కలుగుతున్నాయి. జగత్తు సంసారము కన్నా భిన్నమైంది అనుకోవడం వలనే కలుగుతున్నాయి

తద్గచ్ఛ ధ్రువ భద్రం తే భగవన్తమధోక్షజమ్
సర్వభూతాత్మభావేన సర్వభూతాత్మవిగ్రహమ్

నీవు నగరానికి వెళ్ళి, ఇంద్రియ వ్యాపారములను కిందిగా చేసేవాడైన భగవంతుని ఆరాధించు. అన్ని ప్రాణులలో ఆయన అంతర్యామిగా ఉన్నాడు. అన్ని ప్రాణుల శరీరమూ, ఆత్మా, అంతర్యామిగా ఉన్నాడు.

భజస్వ భజనీయాఙ్ఘ్రిమభవాయ భవచ్ఛిదమ్
యుక్తం విరహితం శక్త్యా గుణమయ్యాత్మమాయయా

అలాంటి పరమాత్మను సేవించు. ఎందరెందరిచేతో సేవించబడిన పాదపద్మములు కలవాడు. మళ్ళీ పుట్టుక లేకుండా చేయగలిగే వాడు. ఆయన సంసారాన్ని చేధిస్తాడు. ఈయన అన్నిటితో కలిసి ఉండీ దేనితోనూ కలవని వాడు. తన యోగమాయ శక్తితో గుణ త్రయముతో కూడిన శక్తితో ఈ పనులు చేస్తాడు

వృణీహి కామం నృప యన్మనోగతం మత్తస్త్వమౌత్తానపదేऽవిశఙ్కితః
వరం వరార్హోऽమ్బుజనాభపాదయోరనన్తరం త్వాం వయమఙ్గ శుశ్రుమ

ఉత్తాన పాదుని పుత్రుడా, ఏ మాత్రం సందేహించకుండా నీకు కావలసిన వరాన్ని కోరుకో.  నిరనతరం శ్రీమన్నారాయణ పాదపద్మాలు సేవిస్తూ ఉంటావని విన్నాను కాబట్టి స్వయముగా వచ్చాను.

మైత్రేయ ఉవాచ
స రాజరాజేన వరాయ చోదితో ధ్రువో మహాభాగవతో మహామతిః
హరౌ స వవ్రేऽచలితాం స్మృతిం యయా తరత్యయత్నేన దురత్యయం తమః

అలా కుబేరుడు అడిగితే పరమాత్మ భక్తులలో అగ్రగణ్యుడూ, మహామతీ అయిన ధృవుడు, "శ్రీమన్నారాయణుడి యందు స్మర్ణ తొలగకుండా ఉండు గాక" అని కోరాడు. పరమాత్మను స్మరించడం వలన ఇతరుల చేత దాట శక్యం కాని అజ్ఞ్యానన్ని అప్రయత్నముగా తొలగించుకుంటాము.

తస్య ప్రీతేన మనసా తాం దత్త్వైడవిడస్తతః
పశ్యతోऽన్తర్దధే సోऽపి స్వపురం ప్రత్యపద్యత

ఇలా ధృవుడు అడిగితే కుబేరుడు ఆ వరాన్ని ఇచ్చాడు. ఇచ్చి తన నగరానికి వెళ్ళిపోయాడు.

అథాయజత యజ్ఞేశం క్రతుభిర్భూరిదక్షిణైః
ద్రవ్యక్రియాదేవతానాం కర్మ కర్మఫలప్రదమ్

ధృవుడు అనేక యజ్ఞ్యాలు ఆచరించాడు. యజ్ఞ్యమంటే పరమాత్మ ఆరాధనమే. దక్షిణలతో కూడిన యజ్ఞ్యాలు ఆచరించాడు. యజ్ఞ్యములతో యజ్ఞ్యపతిని ఆరాధించాడు. అంటే "నేనే యజ్ఞ్యం చేస్తున్నాను" అన్న కర్తృత్వాభిమానాన్ని వదిలిపెట్టాడు. యజ్ఞ్యములో ద్రవ్యమూ క్రియా దేవతా ఉంటాయి. దేవతా మంత్రమూ క్రియా ఉండాలి. ఏ ద్రవ్యాన్ని ఏ దేవతకి ఇవ్వాలో ఆ దేవతకివ్వాలి. అలా హవిస్సులిచ్చి ఆరాధించాడు. ఇది కర్మఫలప్రదం. చేసిన కర్మ యొక్క ఫలితాన్ని ఇస్తుంది.

సర్వాత్మన్యచ్యుతేऽసర్వే తీవ్రౌఘాం భక్తిముద్వహన్
దదర్శాత్మని భూతేషు తమేవావస్థితం విభుమ్

ధృవుడీరీతిలో అద్భుతమైన యజ్ఞ్య యాగాలు చేసాడు. అందరిలో అంతరాత్మగ ఉండి ఏమీ అంటని పరమాత్మలో తీవ్రమైన భక్తిని ధరించి, తన ఆత్మలోనూ సకలప్రాణులలోనూ పరమాత్మే ఉన్నడన్న విషయాన్ని సాక్షాత్కరించుకున్నాడు. ఇదే కర్మ ఫల ప్రదం. ఇదే ఫలితం.

తమేవం శీలసమ్పన్నం బ్రహ్మణ్యం దీనవత్సలమ్
గోప్తారం ధర్మసేతూనాం మేనిరే పితరం ప్రజాః

శీలసంపన్నుడు ధృవుడు. బ్రాహ్మణుల ఎడ గౌరవం ఉన్నావాడు. దీనుల మీద ప్రేమ చూపేవాడు. ధర్మ నియమాలను జాగ్రత్తగా కాపాడేవాడు. ప్రజలందరూ ఇతన్ని తండ్రిగా చూసారు.

షట్త్రింశద్వర్షసాహస్రం శశాస క్షితిమణ్డలమ్
భోగైః పుణ్యక్షయం కుర్వన్నభోగైరశుభక్షయమ్

స్వామిచెప్పినట్లుగా ధృవుడు 36000 సంవత్సరాలు పరిపాలించాడు. కేవలం రాజ్యపరిపాలనే కాకుండా దుర్మార్గులను శిక్షిస్తూ కూడా ఉన్నాడు. రాజ్య పరిపాలన చేసినప్పుడు వచ్చిన భోగాలన్నె అనుభవించాడు. కానీ అవి భోగమని అనుభవించలేదు. సుఖపడడం వలన పుణ్యం వ్యయమవుతుంది, కష్టాలు పడడం వలన పాపం పోతుంది. ధృవుడు ఈ రెండూ కర్చుపెట్టాలని ధృవుడు భోగాలు అనుభవించి పుణ్యాన్నీ, కష్టములనుభవించి పాపాన్ని పోగొట్టుకున్నాడు

ఏవం బహుసవం కాలం మహాత్మావిచలేన్ద్రియః
త్రివర్గౌపయికం నీత్వా పుత్రాయాదాన్నృపాసనమ్

ఇలా చాలా కాలం ఇంద్రియములు పక్కకు పోకుండా చూసుకున్నాడు. ధర్మార్థ కామాలనే మూడు పురుషార్థములకు కావలసిన పనులు చేసి, ఇంక చేయవలసిన పని లేదు అని కుమారునికి రాజ్యమిచ్చాడు

మన్యమాన ఇదం విశ్వం మాయారచితమాత్మని
అవిద్యారచితస్వప్నగన్ధర్వనగరోపమమ్

ఈ ప్రపంచనమంతా పరమాత్మ యొక్క మాయ అని తెలుసుకుని, ఏదీ ఉండేది కాదు, ఏదీ లేనిది కాదు అని తెలుసుకుని, ఇదంతా అవిద్యా రచితమైనదనీ, స్వప్నములో ఉన్న గంధర్వ నగరము లాంటిది అని తెలుసుకున్నాడు.

ఆత్మస్త్ర్యపత్యసుహృదో బలమృద్ధకోశమ్
అన్తఃపురం పరివిహారభువశ్చ రమ్యాః
భూమణ్డలం జలధిమేఖలమాకలయ్య
కాలోపసృష్టమితి స ప్రయయౌ విశాలామ్

తాను గానీ శరీరము గానీ స్త్రీ కానీ సైన్యమూ అంతఃపురమూ ఇవన్నీ కూడా చూడటానికి సుందరముగా కనపడతాయి. ఈ భూమండలమంతా ఎన్నటికో ఒక నాటికి కాలము చేత కబళింపబడేదే.
కాలోపసృష్టమితి   - ఇవన్నీ కాలము చేత కబళింపబడేవే. పాము నోట్లో కప్ప ఉన్నట్లు కాలము నోట్లో ఉన్నాము మనము. ఈ విషయం తెలుసుకున్నాడు ధృవుడు. ఇంతటి భోగాలనుభవించి వెళ్ళిపోవాలంటే ఎంతో వైరాగ్యం ఉండాలి.
ధృవుడు విశాలాకు (బదరికాశ్రమానికి) వెళ్ళాడు.

తస్యాం విశుద్ధకరణః శివవార్విగాహ్య
బద్ధ్వాసనం జితమరున్మనసాహృతాక్షః
స్థూలే దధార భగవత్ప్రతిరూప ఏతద్
ధ్యాయంస్తదవ్యవహితో వ్యసృజత్సమాధౌ

ఆ బదరికాశ్రమములో పరిశుద్ధమైన ఇంద్రియములు కలవాడై పరమ మంగళ కరములైన నదులలో స్నానం చేసి, యమ నియమ ఆసనాదులతో (విశుద్ధకరణః  - యమ, శివవా - నియమ బద్ధ్వాసనం  - ఆసన జితమరున్మనసాహృతాక్షః - ప్రాణాయామమూ ప్రత్యాహారము స్థూలే దధార భగవాన్ - ధారణ వ్యసృజత్సమాధౌ - సమాధి)

భక్తిం హరౌ భగవతి ప్రవహన్నజస్రమ్
ఆనన్దబాష్పకలయా ముహురర్ద్యమానః
విక్లిద్యమానహృదయః పులకాచితాఙ్గో
నాత్మానమస్మరదసావితి ముక్తలిఙ్గః

పరమాత్మ యందు భక్తి కలిగి, ప్రత్యక్షముగా తాను చూసిన భగవానుని రూపాన్ని తలచుకుని కన్నీళ్ళతో మాటి మాటికీ అడ్డగింపబడిన వాడై పులకిత గాత్రుడై శరీరము మీద ధ్యాస వదిలిపెట్టి తనను కూడా తాను తలచుకోలేదు.

స దదర్శ విమానాగ్ర్యం నభసోऽవతరద్ధ్రువః
విభ్రాజయద్దశ దిశో రాకాపతిమివోదితమ్

ఎప్పుడైతే తన శరీరము కూడా తాను చూచుకోని స్థితికి వెళ్ళాడో అప్పుడు ఆకాశములో ఒక విమానం తన కోసం వచ్చింది. దాన్ని చూచాడు

తత్రాను దేవప్రవరౌ చతుర్భుజౌ
శ్యామౌ కిశోరావరుణామ్బుజేక్షణౌ
స్థితావవష్టభ్య గదాం సువాససౌ
కిరీటహారాఙ్గదచారుకుణ్డలౌ

ఆ విమానం నుండి ఇద్దరు దిగారు. వారు శ్రీమన్నారాయణుని ఆకారముతో ఉన్నాను, విశాల నేత్రాలు గలిగి, యవ్వనానికీ బాల్యానికి మధ్య ఉన్న వయసు కలిగి ఉన్నారు (కిశోర) .

విజ్ఞాయ తావుత్తమగాయకిఙ్కరావ్
అభ్యుత్థితః సాధ్వసవిస్మృతక్రమః
ననామ నామాని గృణన్మధుద్విషః
పార్షత్ప్రధానావితి సంహతాఞ్జలిః

శ్రీమన్నారాయణుని కింకరులు వచ్చారని తెలుసుకున్న ధృవునికి ఒళ్ళు పులకించి వణికి తొట్రుపాటు పడి క్రమమును మరచిపోయాడు. పరమాత్మ నామాలను పలుకుతూ నమస్కారం చేసాడు. పలుకుతూ నమస్కారం చేయాలా, నమస్కారం చేసి నామం పలకాలా అన్న విషయం జ్ఞ్యప్తికి రాలేదు. (కృష్ణ పరమాత్మ బృందావనములో వేణువులూదుతుంటే ఆ తొందరలో మొలత్రాడుని మెడలో వేసుకుని హారమును నడుముకు వేసుకున్నారు. సంతోషములో మనకు క్రమము తెలియదు)

తం కృష్ణపాదాభినివిష్టచేతసం
బద్ధాఞ్జలిం ప్రశ్రయనమ్రకన్ధరమ్
సునన్దనన్దావుపసృత్య సస్మితం
ప్రత్యూచతుః పుష్కరనాభసమ్మతౌ

నమస్కారము చేస్తూ అక్కడే కూర్చున్నాడు. వినయముతో తల వచుకుని ఉన్నాడు. వచ్చిన వారు సునంద నందులు. వారు దగ్గరకు వచ్చి చిరునవ్వుతో పరమాత్మకు అనుకూలముగా ఉన్న మాటను పలుకుతున్నారు

సునన్దనన్దావూచతుః
భో భో రాజన్సుభద్రం తే వాచం నోऽవహితః శృణు
యః పఞ్చవర్షస్తపసా భవాన్దేవమతీతృపత్

రాజా! నీకు శుభము కలుగు గాక. నీవు ఐదేళ్ళ వయసులోనే శ్రీమన్నారాయణున్ని సంతృప్తి పరచావు.

తస్యాఖిలజగద్ధాతురావాం దేవస్య శార్ఙ్గిణః
పార్షదావిహ సమ్ప్రాప్తౌ నేతుం త్వాం భగవత్పదమ్

సకల చరాచర జగత్తుని పరిపాలించే శ్రీమన్నారాయణుని పార్షదులము

సుదుర్జయం విష్ణుపదం జితం త్వయా యత్సూరయోऽప్రాప్య విచక్షతే పరమ్
ఆతిష్ఠ తచ్చన్ద్రదివాకరాదయో గ్రహర్క్షతారాః పరియన్తి దక్షిణమ్

ఎలాంటి వారికైన దుర్లభమైన పరమాత్మ పదమును నీవు గెలిచావు. మహాత్ములు కూడా దేనిగురించి ధ్యానిస్తూ ఉంటారో, ఏ స్థానాన్ని సూర్య చంద్ర ఋషులు ప్రదక్షిణం చేస్తారో ఆ స్థానన్ని నీవు పొందబోతున్నావు

అనాస్థితం తే పితృభిరన్యైరప్యఙ్గ కర్హిచిత్
ఆతిష్ఠ జగతాం వన్ద్యం తద్విష్ణోః పరమం పదమ్

ఎవ్వరూ ఇటువంటి స్థానాన్ని పొంది ఉండలేదు. అలాంటి ఉత్తమ స్థానాన్ని, పరమపదముగా భాసించే ఆ స్థానాన్ని నీవు చేరుకో.

ఏతద్విమానప్రవరముత్తమశ్లోకమౌలినా
ఉపస్థాపితమాయుష్మన్నధిరోఢుం త్వమర్హసి

పరమాత్మ తన శిరస్సును కదల్చి ఈ విమానము నీ కొరకు తీసుకుపొమ్మని చెప్పాడు. నీవు దీన్ని అధిరోహించవలసినది

మైత్రేయ ఉవాచ
నిశమ్య వైకుణ్ఠనియోజ్యముఖ్యయోర్మధుచ్యుతం వాచమురుక్రమప్రియః
కృతాభిషేకః కృతనిత్యమఙ్గలో మునీన్ప్రణమ్యాశిషమభ్యవాదయత్

పరమాత్మే కాదు, పరమాత్మ దాసులు కూడా తీయగా మాట్లాడగలరు. వారి మాటలు విని సరస్సులో మునిగి స్నాన సంధ్యాదులు ముగించుకొని (కృతనిత్యమఙ్గలో ) మళ్ళీ వచ్చి వారికి నమస్కరించి వారి ఆశీర్వాదాన్ని కోరాడు

పరీత్యాభ్యర్చ్య ధిష్ణ్యాగ్ర్యం పార్షదావభివన్ద్య చ
ఇయేష తదధిష్ఠాతుం బిభ్రద్రూపం హిరణ్మయమ్

విమానం దగ్గరకు వెళ్ళి, దాని చుట్టూ ప్రదక్షిణం చేసి, పూజించి ఉత్తమ విమానాన్ని, ద్వారపాలకు నమస్కరించి, బంగారు మయమైన విమానాన్ని చూచి ఎక్కాలనుకున్నాడు

తదోత్తానపదః పుత్రో దదర్శాన్తకమాగతమ్
మృత్యోర్మూర్ధ్ని పదం దత్త్వా ఆరురోహాద్భుతం గృహమ్

ఇలా విమానాన్ని అధిరోహించాలనుకుంటూ ఉండగా, మృత్యువు వచ్చింది (అంతకమాగతం). మృత్యువు నెత్తిన కాలు పెట్టి ఆ విమానాన్ని ఎక్కాడు ధృవుడు.

తదా దున్దుభయో నేదుర్మృదఙ్గపణవాదయః
గన్ధర్వముఖ్యాః ప్రజగుః పేతుః కుసుమవృష్టయః

ఇలా ధృవుడు విమానం ఎక్కుతూ ఉంటే దుంధుబులు మ్రోగాయి, గంధర్వులు గానం చేసారు, పుష్ప వర్షాన్ని కురిపించారు.

స చ స్వర్లోకమారోక్ష్యన్సునీతిం జననీం ధ్రువః
అన్వస్మరదగం హిత్వా దీనాం యాస్యే త్రివిష్టపమ్

ఇలా విమానం ఎక్కి వైకుంఠానికి వెళుతున్నాప్పుడు తన తల్లిని తలచాడు. ఇది చాలా పాపము. తన తల్లి పరమ దీనురాలు. తల్లిని వదిలి స్వామి దగ్గరకు వెళ్ళడం పుత్ర ధర్మము కాదు. అని తల్లిని తలచుకున్నాడు.

ఇతి వ్యవసితం తస్య వ్యవసాయ సురోత్తమౌ
దర్శయామాసతుర్దేవీం పురో యానేన గచ్ఛతీమ్

వారు దేవతలూ, పరమాత్మ పార్షదులు కాబట్టి ధృవుని మనస్సు తెలుసుకున్నారు. "దిగులు పడకు, నీ ముందర విమానములో నీ తల్లి ఉంది, చూడు"

తత్ర తత్ర ప్రశంసద్భిః పథి వైమానికైః సురైః
అవకీర్యమాణో దదృశే కుసుమైః క్రమశో గ్రహాన్

ఇలా వెళుతున్న ధృవుని విమానాలు చూసి దారిలో ఉన్న గంధర్వ యక్ష కిన్నరుల విమానాలలోంచి చూసి పూలవాన కురిపించారు. ఒక్కో గ్రహాన్నీ లోకాన్నీ దాటుకుంటూ వెళుతున్నారు.

త్రిలోకీం దేవయానేన సోऽతివ్రజ్య మునీనపి
పరస్తాద్యద్ధ్రువగతిర్విష్ణోః పదమథాభ్యగాత్

ఈ మూటినీ దాటి, పరమాత్మ స్థానముగా ఉన్న పరమపదాన్ని చేరాడు. తన దివ్య మైన కాంతితోటే సకల బ్రహ్మాండములో ఉన్న లోకాలన్నీ ప్రకాశింపచేస్తోంది.

యద్భ్రాజమానం స్వరుచైవ సర్వతో లోకాస్త్రయో హ్యను విభ్రాజన్త ఏతే
యన్నావ్రజన్జన్తుషు యేऽననుగ్రహా వ్రజన్తి భద్రాణి చరన్తి యేऽనిశమ్

ఆ లోకము వలన మూడు లోకాలు కూడా ప్రకాశిస్తున్నాయి. నిరంతరమూ ఎవరు మంగళములను ఆచరిస్తూ ముందుకు వెళతారో, పరి శాంతి పొందిన మనసు గలవారూ, పరిశుద్ధులూ, సకల ప్రాణులనూ ఆనందింపచేసే వారు, వారు సులభముగా పరమాత్మ పదమును చేరతారు.

శాన్తాః సమదృశః శుద్ధాః సర్వభూతానురఞ్జనాః
యాన్త్యఞ్జసాచ్యుతపదమచ్యుతప్రియబాన్ధవాః

ఎవరైతే భగవంతునికి ప్రీతి కలిగించే వారికి భక్తులుగా ఉంటారో, వారు పరమాత్మని చేరతారు

ఇత్యుత్తానపదః పుత్రో ధ్రువః కృష్ణపరాయణః
అభూత్త్రయాణాం లోకానాం చూడామణిరివామలః

ఉత్తాన పాదుని కొడుకైన ధృవుడు శ్రీకృష్ణ పరమాత్మ భక్తుడు. మూడు లోకములకు పరిశుద్ధమైన చూడామణి లాగ ప్రకాశిస్తున్నాడు

గమ్భీరవేగోऽనిమిషం జ్యోతిషాం చక్రమాహితమ్
యస్మిన్భ్రమతి కౌరవ్య మేఢ్యామివ గవాం గణః

అక్కడి నుంచి కాస్త పైకి వెళితే అద్భుతమైన వేగం కలిగి, జ్యోతిష చక్రం ఉంది. నక్షత్ర మండలం అంతా ధృవ మండలాన్ని ఆధారం చేసుకునే తిరుగుతుంది.

మహిమానం విలోక్యాస్య నారదో భగవానృషిః
ఆతోద్యం వితుదఞ్శ్లోకాన్సత్రేऽగాయత్ప్రచేతసామ్

పరమాత్మ చేత పంపబడిన విమానం ఎక్కి పరమాత్మను చేరాడు ధృవుడు. ఈ మహిమను నారదుడు గానం చేసాడు. తన వీణను మీటుతూ ప్రచేతసుల యజ్ఞ్యములో ధృవుని ప్రభావాన్ని గానం చేసాడు.

నారద ఉవాచ
నూనం సునీతేః పతిదేవతాయాస్తపఃప్రభావస్య సుతస్య తాం గతిమ్
దృష్ట్వాభ్యుపాయానపి వేదవాదినో నైవాధిగన్తుం ప్రభవన్తి కిం నృపాః

పరమ పతివ్రత అయిన సునీతి పుత్రుడు ఆమె తపః ప్రభావము వలన చేసిన తపస్సు చూడండి. తల్లి తపోనిష్ఠురాలు కాకుంటే ఇంత ఉత్తముడైన పుత్రుడు పుడతాడా? ఇది సార్వ కాలికమైన సత్యం. మనలో ఏదో ఒక రకమైన చాతుర్యముంటే అది మన గొప్ప కాదు, మన పెద్దలు చేసిన పుణ్యం, వారు చేసిన తపస్సు. వారు భగవదారాధన చేస్తుంటే ఆ ఫలం కొంత మనకు వస్తుంది. ఏడు తరాలలో ఏ ఒక్కరు మహానుభావులున్నా, వారు తమ ముందు ఏడు తరాల వారినీ, వెనక ఏడు తరాల వారిని పావనం చేస్తారు. వారి ఆశీర్వాదం ప్రభావం అలవాట్లు భక్తి ప్రపతీ మంగళాశాసనం మన మీద ప్రభావం పడి ఉంటుంది. అందుకే నారదుడు " పరమ పతివ్రత అయిన సునీతి పైత్ భక్తి అనే తపసు వలన్ పుట్టిన ధృవుని తపస్సు వలన సునీతి పొందిన ఉత్తమలోకాన్ని చూడు"
ఇలాంటి దాన్ని చూచినా, ధృవున్ని అనుసరించడం ఎవరి వలనా కాదు. మహానుభావులకీ యోగులకి కూడా ధృవుని స్థితి పొందటం సాధ్యం కాదు. ఇంక రాజులకు ఏమి సాధ్యమవుతుంది

యః పఞ్చవర్షో గురుదారవాక్శరైర్భిన్నేన యాతో హృదయేన దూయతా
వనం మదాదేశకరోऽజితం ప్రభుం జిగాయ తద్భక్తగుణైః పరాజితమ్

ఐదేళ్ళ వయసులోనే పిన తల్లి వాక్కుతో మనసు కలవరపడి నా ఆజ్ఞ్యను పొంది వనానికి వెళ్ళాడు. పరమాత్మను గానము చేసాడు.

యః క్షత్రబన్ధుర్భువి తస్యాధిరూఢమన్వారురుక్షేదపి వర్షపూగైః
షట్పఞ్చవర్షో యదహోభిరల్పైః ప్రసాద్య వైకుణ్ఠమవాప తత్పదమ్

మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల వరకూ ఎవరినా ధృవునిలా ఆ పరమాత్మ పదాన్ని చేరుకుంటారా? ఐదారేళ్ళ పిల్లవాడు ఆరు నెలలలో చాలా తక్కువ రోజులలో పరమాత్మను ప్రసన్నం చేసుకుని పరమపదాన్ని పొందాడంటే ఆయన్ని ఎవరు తెలుసుకోగలరు అని ప్రాచేతసుల సభలో నారదుడు గానము చేసాడు

మైత్రేయ ఉవాచ
ఏతత్తేऽభిహితం సర్వం యత్పృష్టోऽహమిహ త్వయా
ధ్రువస్యోద్దామయశసశ్చరితం సమ్మతం సతామ్

నీవు ఏమేమి అడిగావో అది అంతా నీకు చెప్పాను. సజ్జనుల సమ్మతమైన ధృవుని చరితను నీకు చెప్పాను

ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్త్యయనం మహత్
స్వర్గ్యం ధ్రౌవ్యం సౌమనస్యం ప్రశస్యమఘమర్షణమ్

ధృవ చరిత్రం ఎంత గొప్పది? ఇది ధన్యమైనది. ధనమును అందించేది. కృతార్థమైంది. కీర్తినీ ఆయుస్షునూ కలిగించేది. పవిత్రమైనది, మంగళములకు నెలవు. గొప్పది, స్వర్గాన్నిచ్చేది. ధృవం (శాశ్వతం), మంచి మనసుని ప్రసాదించేది, అందరిచేతా కొనియాడబడేది, అందరి పాపాలను పోగొట్టేది.

శ్రుత్వైతచ్ఛ్రద్ధయాభీక్ష్ణమచ్యుతప్రియచేష్టితమ్
భవేద్భక్తిర్భగవతి యయా స్యాత్క్లేశసఙ్క్షయః

పరమాత్మను పరమ ప్రియభక్తుడైన ధృవుడు చేసిన ఈ చరిత్రను శ్రద్ధగా విన్నావారికి "పరమాత్మ యందు భక్తి కలుగుతుంది". ఆ భక్తి వలన ప్రయోజనం ఏమిటి? ఆ భక్తి వలనే అన్ని కష్టాలు తొలగుతాయి. ఇప్పుడు మనం పడుతున్న కష్టాలకు కారణం భగత్భక్తి లేకపోవడమే.

మహత్త్వమిచ్ఛతాం తీర్థం శ్రోతుః శీలాదయో గుణాః
యత్ర తేజస్తదిచ్ఛూనాం మానో యత్ర మనస్వినామ్

పరమపవిత్రమైన పరమాత్మ యొక్క అనంత కళ్యాణ గుణాలు వింటే మనసు గలిగిన వారికి అభిమానమూ గౌరవమూ తేజస్సూ, కీర్తీ వస్తాయి.

ప్రయతః కీర్తయేత్ప్రాతః సమవాయే ద్విజన్మనామ్
సాయం చ పుణ్యశ్లోకస్య ధ్రువస్య చరితం మహత్

మనో నిగ్రహముతో ప్రొద్దున్నే లేచి బ్రాహ్మణోత్తముల సమూహములో కూర్చుని చదవండి. సాయంకాలము కూడా చదవండి.

పౌర్ణమాస్యాం సినీవాల్యాం ద్వాదశ్యాం శ్రవణేऽథవా
దినక్షయే వ్యతీపాతే సఙ్క్రమేऽర్కదినేऽపి వా

పున్నమి నాడూ, అమావాస్యనాడు, ద్వాదశి నాడూ, శ్రవణా నక్షత్రం నాడూ, సంక్రమణం నాడూ, రథ సప్తమి నాడు గానీ (అర్క దినం నాడు గానీ)

శ్రావయేచ్ఛ్రద్దధానానాం తీర్థపాదపదాశ్రయః
నేచ్ఛంస్తత్రాత్మనాత్మానం సన్తుష్ట ఇతి సిధ్యతి

పరమాత్మ పాదములని ఆశ్రయించిన భక్తులు అందరినీ కూర్చోబెట్టి వినిపించాలి. తన విషయం ఏమీ ఆలోచించకుండా కోరికలు లేకుండా, సాంసారిక విషయభోగములయందు ఆసక్తి లేని వాడై పరిశుద్ధం మనసుక్డై సిద్ధులన్నీ పొందుతాడు.

జ్ఞానమజ్ఞాతతత్త్వాయ యో దద్యాత్సత్పథేऽమృతమ్
కృపాలోర్దీననాథస్య దేవాస్తస్యానుగృహ్ణతే

ఇలాంటి పరమాత్మ గాధను చెప్పినా విన్నా తత్వం తెలియని వారికి తత్వ జ్ఞ్యానం కలుగుతుంది. మంచి దారిలో లేని వాడు మంచి దారిలో ఉంటాడు, విషాన్ని తీసుకునే వాడు (సంసారములో ఉండేవాడు) అమృతాన్ని (మోక్షాన్ని) పొందుతాడు
పరమాత్మ దీన నాధుడు, పరమ దయాళువు. అతని చరిత్ర చదువుకుంటే అలాంటి భక్తున్ని దేవతలు అనుగ్రహిస్తారు.

ఇదం మయా తేऽభిహితం కురూద్వహ ధ్రువస్య విఖ్యాతవిశుద్ధకర్మణః
హిత్వార్భకః క్రీడనకాని మాతుర్గృహం చ విష్ణుం శరణం యో జగామ

కురుకుల భూషణా, నీకు ప్రసిద్ధమైనా, పవిత్రమైన పనులు చేసిన ధృవుని చరిత్రను చెపాను. చిన్నపిల్లవాడిగా ఉండి, ఆటబొమ్మలతో ఆటాడుకొనే వాడు, ఆటబొమ్మలనూ తల్లినీ ఇంటినీ విడిచిపెట్టి, పరమాత్మను శరణు వేడటానికి అరణ్యానికి వెళ్ళాడు.