Wednesday, January 30, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం - కపిల దేవహూతి సంవాదం - 2 - సృష్టి తత్వం

శ్రీభగవానువాచ
అథ తే సమ్ప్రవక్ష్యామి తత్త్వానాం లక్షణం పృథక్
యద్విదిత్వా విముచ్యేత పురుషః ప్రాకృతైర్గుణైః

జ్ఞానం నిఃశ్రేయసార్థాయ పురుషస్యాత్మదర్శనమ్
యదాహుర్వర్ణయే తత్తే హృదయగ్రన్థిభేదనమ్

అనాదిరాత్మా పురుషో నిర్గుణః ప్రకృతేః పరః
ప్రత్యగ్ధామా స్వయంజ్యోతిర్విశ్వం యేన సమన్వితమ్

ఆత్మ స్వయం జ్యోతి - స్వప్రకాశం. ఆత్మ ప్రత్యక్ధామ. ఆత్మ ఇతరములనూ చూపుతుంది, ఇతరులకూ చూపుతుంది, తనను తనను తనకు తెలుపుతుంది, తనను మనకు తెలుపుతుంది.  ఈ లక్షణం ఆత్మకు మాత్రమే ఉంది. ప్రకృతికి లేదు. (పరాగ్ధామా అంటే ఎదుటివారికి చూపేది. ఉదా: దీపం. దీపం మనకు తనను చూపిస్తుంది గానీ తనను తనకు తెలుపదు. వస్తువులను మనకు చూపినా తనను తాను చూడదు).
ఆత్మతోటే సకల చరాచర ప్రపంచం వ్యాపించి ఉంది. పుట్టే గిట్టే వాటితో ఉండి కూడా ఈ అత్మ పుట్టదు చావదు. పుణ్య పాపములనే నిమిత్తములతో వాటిని అనుభవించడానికి ఏ శరీరం కావాలో దాన్ని పొందుతుంది. (అవాకులూ చవాకులూ మాట్లాడితే పశువులుగానూ పక్షులుగానూ, మానసికముగా చేస్తే అధోజాతులలో, శరీరముతో చేస్తే భూత ప్రేత పిశాచములు లాగ. అనవసరముగా వాక్కుని వాడితే మాట్లాడలేని జాతిలోనూ, మనసుతో తప్పు చేస్తే, సంకల్పించగల శక్తి లేని అంత్యజాతిలో). మనమాచరించిన కర్మలకనుగుణముగా శరీరం వస్తుంది. స్వప్నములో వచ్చినట్లుగా, స్వప్నములో చూచే పదార్థాలు పోయినా చూచేవాడు పోనట్లుగా శరీరము పోయినా ఆత్మ ఉంటుంది.

స ఏష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభుః
యదృచ్ఛయైవోపగతామభ్యపద్యత లీలయా

పరమాత్మ సంకల్పముతో ప్రకృతితో సంబంధం ఏర్పడిన జీవుడు, ప్రకృతిలో వచ్చే ప్రతీ పరిణామం జీవునిలో ప్రతిబింబిస్తుంది. ఇది వరకు మనకు దేనితో కూడా చూడటానికి వీలు కాని దశలో ఉన్న ప్రకృతిని (అవ్యక్తము (సూక్ష్మ దశ), ప్రధానము, ప్రకృతి) చూపి, ఆ ప్రకృతి పని చేస్తుంటే, ఇంద్రియములు చేస్తున్న పని వలన కలుగుతున్న ఫలితం శరీరానికైతే , అది నాకే అనుకోవడమే సంసారం. అవి ఆత్మకు అంటినట్లు కనపడతాయి.
ఇటువంటి ఆత్మ విభుః - సర్వవ్యాపి. కంటికి కనపడనంత సూక్ష్మముగా ఉన్న ఆత్మ, అంతే సూక్షమైన, గుణత్రయం కూడా భాసించనంతా సూక్ష్మముగా ఉన్న, దైవ సంబంధం వలన వచ్చిన ప్రకృతిని ధ్యానించడము వలన, ఆ ప్రకృతితో సంబంధం ఏర్పడుతోంది.
పరమాత్మ మధ్యన ఆత్మను ఉంచి, ఒక వైపు తానుండి, రెండవ వైపు ప్రకృతినుంచి మనను వీటిలో ఒక దాన్ని కోరమన్నట్లుగా చేస్తాడు. ఏడుస్తున్న పిల్లవానికి తల్లి ఆటబొమ్మను ఇచ్చినట్లు, మనకు ప్రకృతినిస్తాడు. ప్రకృతియందు విరక్తి కలిగితే ఆయన లభిస్తాడు.
ఇక్కడ యదృచ్చ అంటే భగవత్సంకల్పం అని అర్థం. వాల్మీకి రామాయణములో కూడా ఈ యదృచ్చ అనే పదం ఆరు  సార్లు కనపడుతుంది. అది ఎక్కడ ఉంటే, అక్కడ దైవానుగ్రహం వలన జరిగింది అని అర్థం.
జీవుడు భగవత్సంకల్పం వలన వచ్చిన ప్రకృతిని (యదృచ్చయా) ఆమోదించాడు (యదృచ్ఛయైవోపగతామభ్యపద్యత). పరమాత్మ పంపిన ప్రకృతిని జీవుడు కూడా పరమాత్మ లీలతో ఆమోదించాడు. పరమాత్మ లీలామాత్రముగా పంపిన ప్రకృతిని ఆమోదించుటే అన్ని జన్మలకూ మూలము,

గుణైర్విచిత్రాః సృజతీం సరూపాః ప్రకృతిం ప్రజాః
విలోక్య ముముహే సద్యః స ఇహ జ్ఞానగూహయా

జీవుడు ప్రకృతిని ఎందుకు ఆమోదిస్తున్నాడు? ఆ ప్రకృతి తన లాంటి వాటినీ, చిత్ర విచిత్రమైన వాటిని ఎన్నింటినో సృష్టిస్తుంది. అవి చూసి జీవుడు చాలా బాగున్నాయి అనుకుంటాడు. వెంటనే జీవుడు మోసపోయాడు. కంటితో  చూచి బాగుంది అనుకునే ప్రతీదీ ప్రకృతే. ఆత్మకు ఏ రంగూ రూపం ఉండదు. ప్రకృతి సృష్టించిన రూపాలను చూచి జీవుడు మోహాన్ని పొందుతున్నాడు. ఇలా లేని వాటిని ఉన్నదీ అనుకోవడమే మోహం. ప్రకృతి జ్ఞ్యానముని కప్పిపుచ్చుతుంది. ఆ జ్ఞ్యానం మరుగునపడుతుంది. మోహం పైకి తేవబడుతుంది. జీవుడు అందుకే లేని దానిని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు, తనవి కాని దాన్ని తనవి అన్నట్లు భ్రమకు లోనవుతాడు

ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతేః పుమాన్
కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే

ఎదురుగా ఉన్న దానిని ధ్యానం చేయడం వలన ఉన్న దానిని మరచిపోతున్నాడు. బాగున్న తాను "నేను బాగా లేను" అనుకుంటాడు.  అంటే తన స్వరూపాన్ని మరచిపోతాడు.  లేని రూపాన్ని ఉనంట్లు ప్రకృతిని ధ్యానం చేయడం వలన, ప్రకృతి యొక్క సత్వ రజ తమో గుణముల వలన ఇంద్రియములు చేసే పనులను "నేను చేస్తున్నాను" అనుకుంటాడు. చేసేది ప్రకృతి యొక్క గుణాలు. కాని, తాను కర్తా అని జీవుడు ఆపాదించుకుంటున్నాడు. కర్తృత్వం ఆపాదించుకోవడం వలన భోక్తృత్వం ఆపాదించబడుతోంది.
ఇదే బంధం అంటే. లేని దాన్ని ఉన్నట్లు అనుకోవడమే సంసారం. చేయని దాన్ని చేస్తున్నా అనుకోవడమే బంధం.

తదస్య సంసృతిర్బన్ధః పారతన్త్ర్యం చ తత్కృతమ్
భవత్యకర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః

ప్రకృతికి పారతంత్ర్యుడవుతాడు. ఈ ఆత్మ, అకర్తుః, దేనికీ కర్త కాదు, సాక్షి మాత్రమే. ఇలాంటి ఆత్మకు తనది కానిది, తనకు కాది, తాను కానిది, తనది, తనకు, తాను అనుకోవడం వలనే బంధము వస్తుంది

కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః
భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతేః పరమ్

శరీరాన్ని కార్యం అంటారు. ఇంద్రియములు కారణము. శరీర ఇంద్రియాలకు కర్తృత్వాన్ని ఆపాదిస్తున్నాము. జీవుడు ఉన్న శరీరమునకు, ఇంద్రియమునకు పని చెప్పడములో, చేస్తున్నదీ, అనుభవిస్తున్నదీ శరీరము మాత్రమే. కానీ చేస్తున్నది శరీరమైతే, భోక్తృత్వమును తనకు ఆపాదించుకుంటున్నాడు.  పని చేయని వాడికి అనుభవించే హక్కు లేనట్లే, ఏ పనీ చేయని ఆత్మకు అనుభమనుకు కావు. ఐనా "ఇవనీ నేనే చేస్తున్నా" అని ఆపాదించుకున్నందుకే మరలా మరలా శరీరములో బంధించబడి అనేక జన్మలు ఎత్తుతాడు. కార్యములకూ కారణములకూ కర్తృత్వం ప్రకృతి వలన వస్తున్నది.
మనం చేయని వాటికి చేస్తున్నాం అనుకోవడమే మనం అనుభవించడానికి కారణం.
పనులు చేయడం వలన వచ్చే సుఖ దుఃఖాలను మనమనుభవిస్తున్నాము.

దేవహూతిరువాచ
ప్రకృతేః పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ
బ్రూహి కారణయోరస్య సదసచ్చ యదాత్మకమ్

ప్రకృతి పురుషుల లక్షణములేమిటి. దీనికి కర్తృత్వం గానీ కారణత్వం గానీ ఏ రూపములో ఉంటాయి. కార్యావస్థలో ఉన్న ప్రకృతి, కారణావస్థలో ఉన్న ప్రకృతి (ప్రళయములో ఉన్న ప్రకృతి). సత్ అసత్ - ప్రకృతి పురుషులకి, (ఒకే వ్యక్తి తండ్రికి కొడుకూ, కొడుకుకూ తండ్రీ అవుతున్నాడు. అంటే ఒకే వ్యక్తి పితౄ అవస్థలో కార్యమై, పుత్రావస్థలో కారణమవుతున్నాడు. అలాగే పరమాత్మ సూక్ష్మావస్థలో ఉన్నప్పుడు కారణమవుతున్నాడు, స్థూల రూపములో కార్యమవుతున్నాడు. స్థూల రూపములో ఉండే దోషాలు సూక్ష్మ రూపానికి కూడా వస్తాయా. కుండలో దొషాలు ఉన్నాయి కాబట్టి మట్టిలో దోషముంటుంది అనవచ్చా? పరమాత్మ జగత్తుగా ఉన్నాడు, జగత్తు కన్నా విడిగా ఉన్నాడు. కార్యత్వం కారణత్వం కర్తృత్వం భోక్తృత్వం, ఇవన్నీ కలిసి ఉండవు.)
ఏది కారణ భూతమూ, ఏది కారణ భూతము (ఏది ప్రకృతి ఏది పురుషుడు). తండ్రే కొడుకయ్యాడు. కొడుకంటే ప్రకృతా, ఆత్మా?
కారణం అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి, సత్, అసత్, అంటే ఏమిటి. ఏది కర్తా ఏది భోక్తా?

శ్రీభగవానువాచ
యత్తత్త్రిగుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకమ్
ప్రధానం ప్రకృతిం ప్రాహురవిశేషం విశేషవత్

ప్రధానం వేరూ ప్రకృతి వేరూ కాదు. ఈ ప్రకృతి రెండు రకాలుగా ఉంటుంది. సూక్ష్మావస్థలో ఉంటుంది (సృష్టి కన్నా ముందు స్థితి), స్థూలావస్థలో ఉంటుంది. ప్రధానమైన ప్రకృతి అవిశేషముగా ఉన్నప్పుడు అవ్యక్తం. ఎలాంటి ప్ర్ధివ్యాది విశేషాలు లేనప్పుడు అది అవ్యక్తం. ఎలా జీవుడు నిత్యమో, ప్రకృతి కూడా నిత్యం. ఇది త్రిగుణం. సూక్ష్మావస్థలో కూడా ఇది గుణత్రయాత్మకమే. కానీ ప్రళయావస్థలో, సూక్ష్మావస్థలో ఉన్న గుణములు గ్రహించబడవు. గ్రహించబడనంత మాత్రాన లేవు, అని అర్థం కాదు.
ఈ ప్రపంచం స్థూలావస్థకు వెళ్ళినప్పుడు పెద్దగా అయ్యి సత్ గా కనిపిస్తుంది. ఇపుడు ఏదైతే కనపడిందో, ఇంతకు ముందు కనపడలేదు. అంటే నామ రూపాలు లేవు. నామ రూపాలు లేనపుడు అవ్యక్తం, అసత్. నామ రూపాలు ఉన్నప్పుడు సత్. అప్పుడు అవిశేషం, ఇప్పుడు విశేషం. ప్రకృతి పంచ్భూతాత్మకంగా పంచ తన్మాత్రాత్మకంగా దశ ఇందిర్యాత్మకముగా ఉన్నప్పుడు రూపం నామం ఉంటాయి. కానీ అప్పుడూ ఇప్పుడూ కూడా ప్రకృతి నిత్యమూ తిర్గుణాత్మకమే.
అందుకే ప్రకృతి జీవుని కన్నా, పరమాత్మ కన్నా, భిన్నమైనది. సత్వాది గుణత్రయం జీవునికీ పరమాత్మకీ లేదు. నిత్యత్వం ఇద్దరిలో ఉన్నాయి. త్రిగుణత్వం ఉన్నది ప్రకృతికి.
మరి లేదు అన్నది ఉన్నట్లు ఎలా కనపడుతుంది. ?

పఞ్చభిః పఞ్చభిర్బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా
ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః

ఈ ప్రకృతే ఇరవై నాలుగు తత్వాలతో ఉంటుంది.  పంచ తన్మాత్రలు పంచ్భూతములు మనసు అహంకారం మహత్తు (బుద్ధి) అవ్యక్తం, దశ జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు. ఈ ఇరవై నాలుగూ ప్రకృతి వలన ఏర్పడే తత్వాలు. వీటికే కొందరు బుద్ధి చిత్తమూ అంతఃకరణం అంటారు. కొంతమంది కాలము కూడా ఒక తత్వముగా చెబుతారు. మహత్తే బుద్ధి తత్వం, అహంకారమే మనసు, అహంకారం. మనసు యొక్క స్వరూపాలే బుద్ధి మనసు చిత్తం అంతఃకరణం.

మహాభూతాని పఞ్చైవ భూరాపోऽగ్నిర్మరున్నభః
తన్మాత్రాణి చ తావన్తి గన్ధాదీని మతాని మే

పంచమహాభూతములు: భూమి ఆపః అగ్ని మరుత్ నభః.
ఎలాగీతే పంచభూతములైదో, వాటి తన్మాత్రలు ఐదు : శబ్ద స్పర్శ రూప రస ఇంద్రియాలు

ఇన్ద్రియాణి దశ శ్రోత్రం త్వగ్దృగ్రసననాసికాః
వాక్కరౌ చరణౌ మేఢ్రం పాయుర్దశమ ఉచ్యతే

జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిపి పది. అంతరాత్మే నాలుగు రూపాలుగా మారుతుంది. బుద్ధి మనసు అంతఃకరణం చిత్తం. మనసు సంకల్పాత్మకం. సందేహం వస్తే చిత్తం . నిశ్చయం వస్తే బుద్ధి, ఆలోచిస్తే అంతఃకరణం. ఇవి నాలుగు విడిగా లేవు, ఒకే పదార్ధం పనిని బట్టి పేరు మారుతూ ఉంటుంది. మహత్తత్వం అనేది బుద్ధి.

మనో బుద్ధిరహఙ్కారశ్చిత్తమిత్యన్తరాత్మకమ్
చతుర్ధా లక్ష్యతే భేదో వృత్త్యా లక్షణరూపయా

ఏతావానేవ సఙ్ఖ్యాతో బ్రహ్మణః సగుణస్య హ
సన్నివేశో మయా ప్రోక్తో యః కాలః పఞ్చవింశకః

ఇదే లెక్కించడానికి కావలసిన తత్వముల సంఖ్య. ఈ ఇరవై నాలుగు గణములు కూడ పరమాత్మ సగుణ అవతారం లేదా ఇవి సగుణ బ్రహ్మ. ఈ ఇరవై నాలుగు కాకుండా, ఇరవై ఐదవ తత్వము కాలము.

ప్రభావం పౌరుషం ప్రాహుః కాలమేకే యతో భయమ్
అహఙ్కారవిమూఢస్య కర్తుః ప్రకృతిమీయుషః

కాలమంటే పరమాత్మ యొక్క ప్రభావం (ప్రభావం పౌరుషం - పురుషుని యొక్క ప్రభావం). ప్రకృతికి గానీ జీవునికి గానీ భయము కలిగేది కాలము వలనే. తాను స్వయముగా కల్పించుకున్న ప్రకృతి సంబంధముతో అనుభూతి కోసం ఆచరించే కర్మలే పాప పుణ్యాలు. వీటి సమూహాన్ని బట్టే ఫలం నిర్ణయించబడుతుంది. ప్రతీదానికి నియమిత కాలం ఉంటుంది. అహంకారముతో మూఢుడై కర్తృత్వాన్ని ఆపాదించుకున్న జీవునికి భయము ఈ కాలము వలన. ప్రకృతి భావాన్ని పురుషుడు పొందుతున్నాడు. ప్రకృతిని నేనే అనుకుంటున్నాడు, అహంకార విమూఢుడై. అందువలనే కర్త అయ్యాడు. కర్తృత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. అలా కర్తృత్వాన్ని తెచ్చిపెట్టుకునే జీవుడిని భయపెట్టేది ఈ కాలము.

ప్రకృతేర్గుణసామ్యస్య నిర్విశేషస్య మానవి
చేష్టా యతః స భగవాన్కాల ఇత్యుపలక్షితః

సత్వము రజస్సు తమస్సూ, ఈ మూడు గుణాలు సమానముగా ఉన్న స్థితిలో, దేని వలన కదలిక ఏర్పడుతుందో, అది కాలము. ప్రతీ దానిలో కదలిక గలిగించేదే కాలము.

అన్తః పురుషరూపేణ కాలరూపేణ యో బహిః
సమన్వేత్యేష సత్త్వానాం భగవానాత్మమాయయా

నేను (పరమాత్మ) నా మాయతో ప్రతీ ప్రాణిలోనూ లోపల పురుషునిగా ఉంటాడు, వెలుపల కాలముగా ఉంటాడు. లోపల సంకల్పం కలిగించేదీ, బయట కాలముగా ఉండి ఆ పని చేయించేదీ భగవానుడే. అలా లోపల పురుషునిగా ఉండి, బయట కాలముగా ఉండి అన్ని ప్రాణులనీ కలుపుతాడూ (సమన్వేత్యేష సత్త్వానాం). కలిపేది ఆయనే - సమన్వేతి.

దైవాత్క్షుభితధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్
ఆధత్త వీర్యం సాసూత మహత్తత్త్వం హిరణ్మయమ్

నిర్విశేషమైన ప్రకృతి సవిశేషమెలా అయ్యింది? మనము ఒక పని చేయాలీ అన్నా, మానాలీ అన్నా, మన మనసులో ఒక సంకల్పము కలగాలి. సంకల్పము కలగాలన్నా వికారం కలగాలి. మనసులో వికారం కలగడాన్నే క్షోభ, స్పందనా, చేష్టా అంటారు. విరుద్ధమైన రెండు తత్వముల కలయిక వలన స్పందన ఏర్పడుతుంది. అదే వికారం. మనసులో వికారం కలిగిందంటే మనం ఆచరించ వలసిన కర్మకు తగిన మనో వికారాన్ని భగవానుడు కలిగిస్తాడు. ప్రతీ చలనమూ పరమాత్మ సంకల్పముతోనే ఏప్రడుతుంది.
ప్రకృతి సూక్ష్మముగా ఉన్నప్పుడు, పరమాత్మ సంకల్పము వలన క్షోభ ఏర్పడితే, అందులోంచి మహత్ తత్వం ఏర్పడింది. అది బంగారు రంగులో ఉంటుంది. ఆయనే హిరణ్యగర్భుడు.

విశ్వమాత్మగతం వ్యఞ్జన్కూటస్థో జగదఙ్కురః
స్వతేజసాపిబత్తీవ్రమాత్మప్రస్వాపనం తమః

ఎన్నడూ మారని వారైన పరమాత్మ (కూటస్థుడు) , తనలో దాగి ఉన్న (ఆత్మగతం) ప్రపంచాన్ని బయలు పరిచాడు(వ్యంజన్).  పరమాత్మే జగత్తుకు అంకురం. తనలో దాగి ఉన్న జగత్తును ఆవిర్భవింపచేసి, తనను మరుగు పరచే చీకటిని త్రాగివేశాడు. తనను కూడా కనపడకుండా చేసే చీకటిని తాగి వేసాడు

యత్తత్సత్త్వగుణం స్వచ్ఛం శాన్తం భగవతః పదమ్
యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకమ్

పరమాత్మ ప్రకృతిని క్షోభ కలిగించడం వలన పుట్టినది మహత్ తత్వం. దీనికి అధిష్టాత వాసుదేవుడు. వాసుదేవుడు అధిష్టాతగా ఉన్న దాన్ని చిత్తం అంటాము. ఈ సత్వగుణము, ప్రకాశించేది స్వచ్చమైనది, కల్మషం లేనిది, చీకటంతా తొలగిపోయేది (తమస్సు పోవడం వలన), శాంతము, భగవత్స్వరూపమూ. దీనికే పేరు మహత్ తత్వం. దీన్నే చిత్తం అంటాం. దీనికి వాసుదేవుడు అధిష్టాత సంకర్షణుడు అధిష్టాతగా ఉన్నది అంతఃకరణం.

స్వచ్ఛత్వమవికారిత్వం శాన్తత్వమితి చేతసః
వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతిః పరా

ఈ చిత్తముకే మూడు స్వరూపాలు ఉంటాయి. ఈ చిత్తమే ఒక్కొక్కప్పుడు స్వచ్చముగా, శాంతముగా, ఉంటుంది, మరొకప్పుడు ఏ వికారాలు లేకుండా ఉంటుంది. ఏ వికారమూ లేనిది చిత్తం. వికారం ఏర్పడితే అంతఃకరణం లేదా బుద్ధి. ఇంకొంచెం వికారం ఏర్పడితే మనసు.
అసలు నీటిలో ఎలాంటి తరంగాలూ ఉండవు. ప్రదేశాలను బట్టి చేరిన నీరు తరంగాలతో ఉంటుందీ, తరంగాలు లేకుండా ఉంటుంది. ఇవన్నీ వచ్చి పోయేవే గానీ, అసలు నీటికి ఏ వికారమూ లేనట్లే అసలు చిత్తానికే వికారాలూ ఉండవు. అది స్వచ్చముగా, శాంతముగా అవికారముగా ఉంటుంది. అది మనసుగా మారితే సంకల్ప వికల్పాలు, అదే బుద్ధిగా మారితే, సంశయ నిశ్చయాలు, అహంకారముగా మారితే క్రోధమూ అమర్షమూ వస్తాయి. నీటి ప్రకృతి ఎలా ఊర్ములకంటే అతీతమో వికారాలకు చిత్తం అతీతము.

మహత్తత్త్వాద్వికుర్వాణాద్భగవద్వీర్యసమ్భవాత్
క్రియాశక్తిరహఙ్కారస్త్రివిధః సమపద్యత

ప్రకృతి తత్వములో పరమాత్మ సంకల్పముతో క్షోభ కలుగ చేస్తే హిరణ్మయమైన మహత్ తత్వం ఏర్పడింది.ఆ మహత్ తత్వం యొక్క వికారమే చిత్తమూ. ఈ మహత్ తత్వములో కూడా పరమాత్మ క్షోభను కలిగిస్తే, పరమాత్మ సంకల్పం వలన కలిగిన ప్రేరణతో కలిగిన వికారముతో మూడు రకములైన అహంకారాలు పుడతాయి. వీటి వలనే కర్మేంద్రియములూ జ్ఞ్యానేంద్రియములూ మనసు కలుగుతాయి.

వైకారికస్తైజసశ్చ తామసశ్చ యతో భవః
మనసశ్చేన్ద్రియాణాం చ భూతానాం మహతామపి

ఈ మహత్ తత్వమునుండే వైకారిక (సాత్విక, వికారములు గలిగిన మనసుని సృష్టించేది కాబట్టి వైకారికం అని పేరు) అహంకారం, తైజస (రాజస), తామస అహమక్రాం. వైకారికం నుండి మనసు, రాజసం నుండి ఇంద్రియములు, తామసం నుండి పంచభూతములు పుట్టాయి.

సహస్రశిరసం సాక్షాద్యమనన్తం ప్రచక్షతే
సఙ్కర్షణాఖ్యం పురుషం భూతేన్ద్రియమనోమయమ్

మహత్ తత్వమునకు వాసుదేవుడు అధిష్టాత అయినట్లు, అహంకారానికి అధిష్టాత సంకర్షణుడు (ఈయననే అనంతుడనీ, ఆది శేషుడనీ, సహస్ర పడగలు కలవాడు).
సంకర్షణుడే భూత (పంచ భూతాలు), ఇంద్రియ (పది ఇంద్రియాలు), మనో మయుడు. అహంకారం వలననే మనసూ, ఇంద్రియాలు, పంచభూతములూ పుట్టాయి.

కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణమ్
శాన్తఘోరవిమూఢత్వమితి వా స్యాదహఙ్కృతేః

ఈ అహంకారానికే కర్తృత్వం (నేను చేస్తున్నాను, నేను వెళ్తున్నాను, వస్తున్నాను, వింటున్నాను అనే భావనలు), కరణత్వం (నా ఇంద్రియములతో చేస్తున్నాను, నా కన్ను బాగుంది, నా చెవి, అలాంటి భావనలు), కార్యత్వం (నేను చేస్తే పని అవుతుంది). దీనికే మరో మూడు పేర్లు శాంతం (ప్రకాశకత్వం- ఒక వస్తువును చూపుట), ఘోరత్వము (చిత్త విక్షేపము, ఒకే సారి ఎన్నో ఆలోచనలు రావడం), మూఢత్వం (ఇది ఫలానా అని తెలియకపోవడం). ఈ మూడూ అహంకారానికి ఉంటాయి.
నా శరీరము/ఇంద్రియములూ/మనస్సు అనడమూ అహంకారమే.

వైకారికాద్వికుర్వాణాన్మనస్తత్త్వమజాయత
యత్సఙ్కల్పవికల్పాభ్యాం వర్తతే కామసమ్భవః

సాత్వికాహంకారములో కూడా పరమాత్మ వికారం కలిగిస్తాడు. సాత్వికాహంకారములోంచి మనస్తత్వం పుట్టింది. మనస్సు అంటే సంకల్పాత్మకం. అలాగే వికల్పిస్తుంది. సంకల్ప వికల్పాలు కలిగిన అహంకారానికే మనసు అని పేరు. సంకల్పాలు, వికల్పాలూ లేకుండా కేవలం ఆలోచన ఉంటే బుద్ధీ అని పేరు. ఏమీ లేకుండా ప్రశాంతముగా ఉంటే బుద్ధి అని.
కామసంభవః - ఇక్కడ కాముడు అంటే ప్రద్యుమ్నుడు. ప్రకర్షేన ద్యుమ్నాతి - బాగా కలచివేస్తాడు. ఎలాంటి వారి మనసునైన కలచివేస్తాడు. కాబట్టి ఈయన కామసంభవుడు. ఎంత గొప్ప వాడినైనా వాడి వశములో వాడు లేకుండా చేస్తాడు. ఈయన పేరే ప్రద్యుమ్న. మనసు అనేది కోరిక వలన పుట్టేది.
మహత్ - వాసుదేవుడు, అహంకారం - సంకర్షణుడు, అహంకారములో మనసుకి - ప్రద్యుమ్నుడు అధిష్టాత.

యద్విదుర్హ్యనిరుద్ధాఖ్యం హృషీకాణామధీశ్వరమ్
శారదేన్దీవరశ్యామం సంరాధ్యం యోగిభిః శనైః
తైజసాత్తు వికుర్వాణాద్బుద్ధితత్త్వమభూత్సతి
ద్రవ్యస్ఫురణవిజ్ఞానమిన్ద్రియాణామనుగ్రహః

రాజస అహంకారము యొక్క అధిష్టాత అనిరుద్ధుడు. సాత్వికాహంకార అధిష్టాత ప్రద్యుమ్నుడు. అనిరుద్ధుడు హృషీకములకు అధిష్టానము. హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియాలకు "సంతోషాన్ని తగ్గించేవి" అని పేరు. కోరికను నిర్మూలించి పరమాత్మను చేర్చేది బుద్ధి లేదా ఆత్మ. దానికి కూడా హృషీకమనే పేరు.
ఈ అనిరుద్ధుడు సకల ఇంద్రియములకూ అధిపతి. అనిరుద్ధుడూ అంటే ఆపశక్యం కాని వాడు. అందుకే మన ఇంద్రియములలో కలిగే ప్రవృత్తిని మనం ఆపలేము. అనిరుద్ధుడు ఇంద్రియాధిష్టాన దేవత.
అనిరుద్ధుడు శరదృతువులో ఉండే నల్లని కలువలా ఉంటాడు. శరదృతువులో నలుపు కొంత తెలుపుతో కలిసి ఉంటుంది. అటువంటి రంగులో ఉంటాడు.
వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నులలో సులభముగా మనకు పొందదగిన వాడు అనిరుద్ధుడు. యధాక్రమముగా మెల్లగా యోగాన్ని అవలంబిస్తూ వెళితే ఈయన దొరుకుతాడు.
ఈ తైజసాహంకారం వలన పుట్టేదే బుద్ధి తత్వం. ఈ బుద్ధి తత్వము వలన కలిగేది ద్రవ్య స్పురణ విజ్ఞ్యానం. ఇలాంటి దాని వలననే అన్ని ఇంద్రియములూ ఏర్పడి పని చేస్తాయి. బుద్ధి లేకపోతే ఇంద్రియములు చేసినా తెలియదు. కన్ను చూసినా, బుద్ధికీ మనసుకూ అనుసంధానం లేనప్పుడు ఎదురుగా ఉన్నా గమనించలేము. బుద్ధినీ మనసునూ పరమాత్మ యందు లగ్నం చేస్తే ఏమి చూసినా మనకి అంటదు.
అందుకే విద్యాతురానాం నరుచిః నపక్వం అంటారు. రాజసాహంకారం వలన అనుగ్రహించబడి, సాత్వికాహం కారము వలన పుట్టినవి ఇంద్రియాలు.

సంశయోऽథ విపర్యాసో నిశ్చయః స్మృతిరేవ చ
స్వాప ఇత్యుచ్యతే బుద్ధేర్లక్షణం వృత్తితః పృథక్

బుద్ధికి అయిదు లక్షణాలు ఉన్నాయి 1. సంశయం (అంటే వికల్ప జ్ఞ్యానం) 2. విపర్యయం 3. నిశ్చయం

1. సంశయం అంటే ఒక దానిలో ఇంకో దానిని చూచుట. అన్యధా జ్ఞ్యానం. ఒక ధర్మము యందు ధర్మి ద్వయాన్ని చెప్పుట. అదా ఇదా? తాడా పామా? మనిషా మొదా? అనే సంశయము.

2. విపర్యయం: ఇందులో రెండు ఉంటాయి. అన్యధా జ్ఞ్యానం, విపరీత జ్ఞ్యానం.
అన్యధా జ్ఞ్యానం అంటే ఒక వస్తువులో ఒక గుణం వేరుగా కనిపించుట. ఉదా: తెల్లగా ఉన్న శంఖం పచ్చగా కనిపించడం. అంటే గుణం మారింది. ధర్మిలో ధర్మం మారుట.
విపరీత జ్ఞ్యానం. ఒక వస్తువును చూచి ఇంకో వస్తువు అనుకోవడం. తగరమును చూచి వెండి అనుకోవడం. ఇక్కడ వస్తువే మారింది. ఇక్కడ ధర్మే మారింది.
3. నిశ్చయం: ఇది ప్రమాణ రూపం. ఇది ఇంతే. శంఖము తెల్లగా ఉంది అని నిశ్చయముగా తెలియడం
4. స్మృతి : అనుభూత విషయ జ్ఞ్యానం స్మృతి. జరిగిన దాన్ని గుర్తుంచుకోవడం. (ఉదా: ఈ శ్లోకం ఫలాన అధ్యాయములో వచ్చింది)
5. స్వాప - బుద్ధి స్తభముగా ఉండటం స్వాప. నిద్రపోతే కలిగేది ఇదే. బుద్ధి నిద్రపోతే అసలు నిద్ర. బుద్ధి ఆలోచిస్తూ ఉంటే కలలు వస్తాయి. దాన్ని మగత నిద్ర. బుద్ధి స్తబ్ధముగా ఉండే నిద్ర నలభై నిముషాలు చాలు.

తైజసానీన్ద్రియాణ్యేవ క్రియాజ్ఞానవిభాగశః
ప్రాణస్య హి క్రియాశక్తిర్బుద్ధేర్విజ్ఞానశక్తితా

రాజసాహ అనుగృహీతములైన ఇంద్రియములే కర్మేంద్రియ జ్ఞ్యానేంద్రియములు. ప్రాణము అంటే పని చేసే శక్తి. జ్ఞ్యాన ఇంద్రియాలకు బుద్ధి. కర్మేంద్రియాలకు ప్రాణము. మన మనసు బుద్ధి శరీరం ఇంద్రియాలూ బాగుడాలంటే, అధర్మంగా ప్రవర్తించకుండా ఉండాలంటే, కోపాది వికారాలు ప్రబలమవ్వకుండా ఉండాలంటే ఈ నాలుగు వ్యూహాలను (వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులను ) ఆరాధించాలి.

తామసాచ్చ వికుర్వాణాద్భగవద్వీర్యచోదితాత్
శబ్దమాత్రమభూత్తస్మాన్నభః శ్రోత్రం తు శబ్దగమ్

పంచభూతాలకి తామసాహంకారం ఆది కాబట్టి దీనిని భూతాది అంటారు. భగవ్త్సంకల్పమనే ప్రేరణతో తాంసాహంకారం వికారం చెంది శబ్ద తన్మాత్రం ఉదయించింది. దీని నుండి ఆకాశం పుట్టింది. ఆకాశము యొక్క గుణము శబ్దము. శబ్దమును గ్రహించే ఇంద్రియం శ్రోత్రేంద్రియం. శ్రోత్రేంద్రియం ఆకాశము నుంచి పుట్టిందా? కాదు. అది పుట్టినది రాజసాహంకారము నుండి. శ్రోత్రేంద్రియం శబ్దమును గ్రహిస్తుంది గానీ, అది ఆకాశము నుండి పుట్టలేదు.

అర్థాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లిఙ్గత్వమేవ చ
తన్మాత్రత్వం చ నభసో లక్షణం కవయో విదుః

శబ్దం అంటే ఏమిటి: శబ్దమంటే అర్థమునకు ఆశ్రయం. ఒక వస్తువును చూడగానే "ఇది వస్త్రమూ, ఇది గోడ " అంటాము. గోడ, వస్త్రము అనేది శబ్దము. దాన్ని వస్తువును చూచి చెబుతున్నాము. అంటే అర్థమునకు ఆశ్రయం. భగవంతుని గురించి చెప్పేది శబ్దం. పరమాత్మ శబ్దముతోనే తెలియబడతాడు.
తెలిసినట్లు తెలవడానికి తెలిపేది శబ్దం, "నేను ఫలానా వస్తువూ చూచాను" అని శబ్దముతోటే చెబుతాము. చూచేవాడికి కూడా శబ్దమే ప్రమాణం (ద్రష్టుః లింగం). చూచిన వాటికీ ప్రమాణం, చూచినట్లు ప్రమాణం. ఒక వస్తువును చూచినట్లు నమ్మించాలి అంటే అది ఎలా ఉంటుందో చెప్పాలి. తెలుసుకున్నవాడు తెలుసుకున్నది తెలుసుకున్నట్లు చెప్పాలంటే ప్రమాణం శబ్దం.

ఆకాశం అంటే ఏమిటి? శబ్దము గుణముగా కలిగినది ఆకాశం. ధ్వని కలిగించేది ఆకాశం. ధ్వనికి మూలం రెండు వస్తువుల ఒరిపిడి. దూరముగా ఉన్నవి దగ్గరైతే ఘర్షణ అంటాము. ఒక చోట ఉన్న ఆకాశాన్ని అనాకాశముగా చేయాలి.

భూతానాం ఛిద్రదాతృత్వం బహిరన్తరమేవ చ
ప్రాణేన్ద్రియాత్మధిష్ణ్యత్వం నభసో వృత్తిలక్షణమ్

సకల వస్తువులకూ ప్రాణులకూ అవకాశమిచ్చేది ఆకాశం. అన్ని లోకాలు, గోళాలు ఉన్నది ఆకాశములో. లోపలా వెలుపలా అను వ్యవహారమునకు మూలము ఆకాశం. గడప దాటితే ఇంటి వెలుపలా అంటాం. బయటా లోపలా అని దేన్ని బట్టి అంటున్నాం. పైన కప్పు ఉంటే దాన్ని లోపలా అంటాము, లేకపోతే దాని వెలుపలా అంటాము. ఈ "లోపలా" "వెలుపలా" అనే వ్యవహారానికి కూడా ఆకాశము మూలం.
ప్రాణానికి మూలం. హృదయాకాశం, దహరాకాశం. ఇంద్రియములు కూడా ఆకాశమే. కన్ను ముక్కు మొదైలైన రంధ్రాలు ఉన్నది కూడా ఆకాశములోనే.

నభసః శబ్దతన్మాత్రాత్కాలగత్యా వికుర్వతః
స్పర్శోऽభవత్తతో వాయుస్త్వక్స్పర్శస్య చ సఙ్గ్రహః

తన్మాత్రము నుండి భూతము పుడుతుంది. శబ్ద తన్మాత్ర నుండి పుట్టిన ఆకాశము నుండి పరమాత్మ సంకల్పముతో, ఆ ఆకాశము వికారము చెంది స్పర్శ తన్మాత్ర పుట్టింది. స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది. స్పర్శను గ్రహించే ఇంద్రియం పేరు త్వగ్ ఇంద్రియం.

మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ
ఏతత్స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః

మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది అని చెప్పగలిగేది స్పర్శ. ఇవి ముట్టుకుంటేనే తెలిసేది. ఈ నాల్గింటినీ గ్రహించేది త్వక్. స్పర్శ గుణం కలిగి ఉండుట వాయువు లక్షణం. వాయువంటే రూపము లేకుండా స్పర్శ మాత్రమే కలిగి ఉండేది వాయువు.

చాలనం వ్యూహనం ప్రాప్తిర్నేతృత్వం ద్రవ్యశబ్దయోః
సర్వేన్ద్రియాణామాత్మత్వం వాయోః కర్మాభిలక్షణమ్

ప్రతీ దాన్ని కదిలించడం గాలి యొక్క గుణం. దగ్గరగా ఉన్న దాన్ని విడదీసేదీ, దూరముగా ఉన్నవాటిని దగ్గరకు చేసేదీ వాయువు. ఈ రెండిటికీ కదలిక కావాలి. ద్రవ్యమునూ(గంధమును) శబ్దమునూ మన దగ్గరకు తీసుకుని వస్తుంది.
అన్ని ఇంద్రియములనూ ధరించేది వాయువు. మన ఇంద్రియాలు అన్నీ ఆకాశములోనే ఉన్నాయి. అవి కింద పడకుండా ఆపేది వాయువు. అలాగే అన్ని గోళాలు ఆకాశములో ఉన్నాయి కానీ కింద పడవు, అలాగే అవయవ రంధ్రాలలో ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలను ధరించేది వాయువు. చక్షురింద్రియం, ఘ్రానేంద్రియం వంటివి ఇంకో గోళం (అవయవము) లోకి వెళ్ళకుండా ఉండటానికి కారణం వాయువు.

వాయోశ్చ స్పర్శతన్మాత్రాద్రూపం దైవేరితాదభూత్
సముత్థితం తతస్తేజశ్చక్షూ రూపోపలమ్భనమ్

స్పర్శ తన్మాత్ర నుండి ఆవిర్భవించిన వాయువు నుండి ఆవిర్భవించినది రూప తన్మాత్రం. దాని నుండి అగ్ని పుడుతుంది. చక్షురింద్రియం ఈ రూపాన్ని గ్రహిస్తుంది. చక్షురింద్రియం సూర్యాధిష్టం. సుర్ర్యభగవానునిలో ఉన్నవాడు, అంతర్యామిగా ఉన్నవాడు, చక్షురింద్రియములో ఉన్నవాడూ ఒకడే. అందుకే భగవానుని ఆరాధించడానికి కనులు మూసుకున్నా తెరుచుకుని ఉన్నా కనపడతాడు భగవానుడు.

ద్రవ్యాకృతిత్వం గుణతా వ్యక్తిసంస్థాత్వమేవ చ
తేజస్త్వం తేజసః సాధ్వి రూపమాత్రస్య వృత్తయః


చక్షురింద్రియం రూపాన్ని గ్రహిస్తుంది. రూపం అంటే ప్రతీ ద్రవ్యానికి ఒక ఆకారం కలిగించేది. ఒక వస్తువు గురించి చెబుతున్న్నామంటే దాని ఆకారం బట్టే చెబుతాము. ద్రవ్యమునకు ఆకారాన్ని ఆపాదించేది రూపం.
గుణతా: అంటే ద్రవ్య ఆశ్రయత్వం. ఆధారము లేకుండా ఆధేయం ఉండదు. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది గుణం. గుణము ద్రవ్యము లేకుండా విడిగా ఉండదు. రూపం అంటే గుణం. గుణం అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది.
ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తినుండి వేరు చేసేది రూపము.
రూపముకు ఈ మూడు గుణాలు ఉన్నాయి.
1. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటున్నది
2. ఒక ద్రవ్యానికి ఆకారాన్ని ఏర్పరుస్తున్నది
3. ఒక ద్రవ్యాన్ని ఇంకో ద్రవ్యమునించి వేరు చేసి చూపుతుంది.
దీన్నే తేజత్వం అంటాము. ఇవి రూపము యొక్క వ్యాపారము.

ద్యోతనం పచనం పానమదనం హిమమర్దనమ్
తేజసో వృత్తయస్త్వేతాః శోషణం క్షుత్తృడేవ చ

తేజస్సు చేసే పనులు
1. ద్యోతనం - ప్రకాశిస్తుంది
2. పచనం - ఉడికిస్తుంది
3. పానం - నీరు తాగిస్తుంది (దాహం రూపములో లోపల మండగానే నీరు గ్రహిస్తుంది)
4. అదనం - భోజనం (ఆకలికి కూడ అగ్నే కారణం. లోపల ఉన్న అగ్నికి ఈ రెండు రకాల ఆహారం ఇస్తున్న్నం)
5.  హిమ మర్దనం - మంచుని కరిగించేస్తుంది
6. శొషణం - తడిగా ఉన్నదానిని ఆరబెడుతుంది
7. క్షుత్తృడేవ - ఆకలి దప్పి పుడుతుంది.
పరమాత్మే మనము తిన్న దాన్నీ, తాగిన దానినీ, అగ్ని రూపములో ఉండి స్వీకరిస్తున్నాడు (అహం వైశ్వానరో భూతవా...)
జఠ్రాగ్ని బాగ పని చేయాలంటే శ్రమపడాలి. అప్పుడు తిన్నది బాగా జీర్ణమవుతుంది. పరిశ్రమ వలన అగ్నిలో వాయువులో శక్తి పెరుగుతుంది. మన పెరుగుదల, మనం తీసుకున్న ఆహారం అరుగుదల వలన. అరగాలంటే జఠరాగ్ని బాగా పని చేయాలి. శరీరములో ఏ ప్రదేశానికి ఎంత కావాలోన్ అంత పంపాలి. అలా పంపేది వాయువూ, అగ్ని. వాటి శక్తి తగ్గితే అవి పంపవు. అగ్ని పని చేయకపోతేనే మనకి ఆయా రోగాలు వస్తాయి. అందుకే పరమాత్మని ఆయా రూపాలలో మనం ఆరాధించాలి.

రూపమాత్రాద్వికుర్వాణాత్తేజసో దైవచోదితాత్
రసమాత్రమభూత్తస్మాదమ్భో జిహ్వా రసగ్రహః

రూప మాత్రముచే పుట్టిన తేజస్సు పొందిన వికారముతో రస తన్మాత్ర పుడుతుంది. దాని నుండి జలము పుడుతుంది. ఆ రసాన్ని గ్రహించేది జిహ్వ.

కషాయో మధురస్తిక్తః కట్వమ్ల ఇతి నైకధా
భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే

వాస్తవముగా రసము ఒక్కటే. పదార్ధాల కలయికతో భిన్నముగా మారుతుంది. రసస్ములు ఆరు 1. కషాయం 2. మధురం మొదలైన ఆరు రసములు

క్లేదనం పిణ్డనం తృప్తిః ప్రాణనాప్యాయనోన్దనమ్
తాపాపనోదో భూయస్త్వమమ్భసో వృత్తయస్త్విమాః

జలము చేసేది
క్లేదనం - తడుపుతుంది
పిణ్డనం - ముద్ద చేస్తుంది.
తృప్తిః  - తృప్తి అనేది నీటి వలనే కలుగుతుంది
ప్రాణనం - బ్రతికించేది, ప్రాణము నిలిచేది నీటితోటే (ఈ నీటినే అగ్ని తీసుకుని వాయువుగా మరుస్తుంది)
ఆప్యాయనం - ఆకలి దప్పి తీరేది నీటితోనే. ఆప్యాయనం అంటే సంతృప్తి చెందుట
ఔందనం - గట్టిగా ఉన్నదాన్ని మెత్తగా చేస్తుంది
తాపాపనోదః - వేడినీ, తాపాన్ని తొలగిస్తుంది
భూయస్త్వం - ఊరుట (బావి త్రవ్వితే నీరు ఊరుతూ ఉంటుంది. ఈ గుణం నీటికి మాత్రమే ఉంటుంది)

రసమాత్రాద్వికుర్వాణాదమ్భసో దైవచోదితాత్
గన్ధమాత్రమభూత్తస్మాత్పృథ్వీ ఘ్రాణస్తు గన్ధగః

జలము నుండి గంధ మాత్రం పుట్టింది. గంధ మాత్రము నుండి పృధివి పుట్టింది. దీన్ని గ్రహించేది ఘ్రాణం. గంధములు ఆరు రంగములు

కరమ్భపూతిసౌరభ్య శాన్తోగ్రామ్లాదిభిః పృథక్
ద్రవ్యావయవవైషమ్యాద్గన్ధ ఏకో విభిద్యతే

పూతి గంధం అంటే దుర్గంధం.
శాంతం - ప్రశాంతముగా ఉండేది
ఉగ్ర గంధం - ఉదా: ఉల్లి వంటివి తరిగితే వచ్చే గంధము వలన కళ్ళు నీరు కారతాయి
గ్రాంల - పులిస్తే వచ్చే గంధము
కరంభం - ఇది అన్ని గంధముల కలయిక
అన్నము రెండు రోజులు ఉంచితే అందులోకి వేరే ద్రవ్యాలు వచ్చి చేరతాయి. నిప్పూ నీరుతోనే అన్నం వండుతాము. ఆ వన్నం సాయంత్రానికి మెత్తబడుతుంది, మర్నాటికి నీరు వస్తుంది, తరువాత వాసన వస్తుంది, ఆ తరువాత సాయంత్రానికి పురుగులు వస్తాయి. ఏ ద్రవ్యం యొక్క పదార్ధములు ఏ ఏ సమయాలలో ఏ మోతాదులలో కలవాలో కలిస్తే పదార్థమవుతుంది.
ఉన్న గంధము ఒకటే గానీ, ఆయా ద్రవ్యముల అవయవాల వైషమ్యాలని బట్టి వేరుగా అనిపిస్తుంది. ఆశ్రయాన్ని బట్టి గంధం మారుతుంది గానీ, గంధము అన్నది ఒకటే.

భావనం బ్రహ్మణః స్థానం ధారణం సద్విశేషణమ్
సర్వసత్త్వగుణోద్భేదః పృథివీవృత్తిలక్షణమ్

భూమి చేసే పనులు
1. భావనం - ఆకారం ఏర్పడుట (కుండ మనం భూమితోనే చేస్తున్నాము. మట్టికి ఆయా ఆకారములుగా మారగల శక్తి ఉన్నది. వివిధ రూపములు పొందగలుగుట మట్టి యొక్క లక్షణం. బంగారము కూడా మట్టి యొక్క ఆకారమే. దానిలో తేజో గుణం ఎక్కువగా ఉంది, అంతే. మనకు కంటికి కనపడే ప్రతీ ఆకారం మట్టి). ఆకారం ఉంది అంటే మట్టి.
2. బ్రహ్మణః స్థానం - సకల చరా చర జగత్తు నిలవడానికి ఆధారం భూమి. స్వర్గములో కూడా భూమి ఉంది. స్వర్గములో కూడా ఇక్కడిలాగే వాయువూ, అగ్నీ, సూర్యుడు చంద్రుడు భూమి ఉంటాయి.
3. ధారణం - మనము ఏమి వేసిన ధరిస్తుంది.
4. సద్విశేషణం - పదార్ధాలలో సారమునీ రుచినీ మార్చేది భూమి. ఒక్కో ప్రాంతములో ఒక్కో పంట విశేషముగా పండుతుంది. అలాగే ఒక ప్రాంతములో పండినవి, ఇంకో ప్రాంతములో పండిన దాని కన్నా రుచిగా ఉంటుంది. అన్ని చోట్లా పండినా, కొన్ని చోట్ల పండిన ధ్యానం రుచి బాగా ఉంటుంది. ఎంత మంచి భూమి అయినా, విత్తనం బాగా లేకుంటే పండదు. ఎంత మంచి విత్తనమైనా చౌటు భూమిలో పండదు. మంచి విత్తనము కూడా మంచి భూమిలో పెరిగినదే. దేశ భేదాన్ని బట్టి సారవంతములూ నిస్సారవంతములూ అవుతాయి.
సర్వసత్త్వగుణోద్భేదః - మట్టి ప్రాణుల ఆకారాన్ని కూడా మారుస్తుంది. ఒక ప్రాంతములో ఉన్న వారికి కళ్ళు చిన్నగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో తెల్లగా, కొన్ని ప్రాంతాలలో నల్లగా ఉంటారు. అంటే స్వరూపానీ, రుచినీ, ఆకారాన్ని మార్చేది భూమి. స్వభావాన్ని మార్చేది కూడా భూమే. దేవాలయానికి వెళితే ప్రశాంతముగా ఉంటుంది. వ్యగ్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసు వ్యగ్రముగా ఉంటుంది. హిమాలయాలలో ఉన్న జంతువులకి జుట్టు ఎక్కువ ఉంటుంది.

ప్రతీ ప్రాణి యొక్క గుణములో మార్పు తెచ్చేది భూమి.

నభోగుణవిశేషోऽర్థో యస్య తచ్ఛ్రోత్రముచ్యతే
వాయోర్గుణవిశేషోऽర్థో యస్య తత్స్పర్శనం విదుః
తేజోగుణవిశేషోऽర్థో యస్య తచ్చక్షురుచ్యతే
అమ్భోగుణవిశేషోऽర్థో యస్య తద్రసనం విదుః
భూమేర్గుణవిశేషోऽర్థో యస్య స ఘ్రాణ ఉచ్యతే

ఆకాశ గుణమైన శబ్దము దేని చేత గ్రహించబడుతుందో అది శ్రోత్రం
వాయువు యొక్క స్పర్శను గ్రహించేది త్వక్ ఇంద్రియం
తేజో గుణమైన రూపాన్ని గ్రహించేది చక్షువు
జల గుణమైన రసాన్ని గ్రహించేది జిహ్వ, ఆ ఇంద్రియం రసనం.
భూమి యొక్క గుణమైన గంధమును గ్రహించేది ఘ్రాణము

ఆకాశము - శబ్దము - శ్రొత్రము
వాయువు - స్పర్శ - త్వక్
అగ్ని - రూపము - చక్షు
జలము - రసము - రసనేంద్రియం
భూమి - గంధము - ఘ్రాణము

పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్సమన్వయాత్
అతో విశేషో భావానాం భూమావేవోపలక్ష్యతే

ఎప్పటికైనా కారణ ధర్మం కార్యములో ఉంటుంది. ఉదా. ఆకాశములో శబ్దమే ఉంది. ఆకాశము నుండి వాయువు పుట్టింది. వాయువుకు ఆకాశం కారణం. వాయువు యొక్క గుణం స్పర్శ. తన గుణమైన స్పర్శతో బాటు, ఆకాశం యొక్క గుణమైన శబ్దము కూడా ఉంటుంది.
వాయువు నుంచి పుట్టిన అగ్ని గుణం రూపం. అయినా, అగ్నిలో రూపమూ స్పర్శ శబ్దమూ ఉంటాయి. అలాగే జలములో రసమూ, రూపమూ, స్పర్శ, శబ్దమూ ఉంటాయి. భూమిలో అయిదు గుణాలూ ఉంటాయి.

కార్యము యందు కారణ ధర్మం ఉంటుంది. అలా ఉంటుంది అని ఒప్పుకోకుంటే భూమిలో అయిదు గుణాలు ఉండటానికి అవకాశము దొరకదు. భూమిలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉన్నాయి. అందుకే అన్ని విశేష గుణాలూ భూమి యందు కనపడుతున్నాయి.

ఏతాన్యసంహత్య యదా మహదాదీని సప్త వై
కాలకర్మగుణోపేతో జగదాదిరుపావిశత్

ఇలా ఉన్న ఏడూ (మహత్తు అహంకారమూ పంచభూతాలు) సృష్టించబడి ఉన్నా ఒక ఆకారం ఏర్పడలేకపోయాయి. ఇంద్రియాలు, భూతాలు, వాటి గుణాలు, తన్మాత్రలు, అన్ని విడి విడిగా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రాహ్యములూ, ఇంకోటి గ్రాహకములూ. ఇంద్రియములు గ్రాహ్యములూ, గుణాలు గ్రాహకములు. తమలో తాము ఒకటై తమలో ఉన్న వాటిని గ్రహించి, "ఇది బాగుంది, ఇది బాగా లేదు" అని చెప్పడమే భోగము. అన్ని భోగాలకు మూలము శరీరము.
అప్పుడు పరమాత్మ వీటన్నిటిలో ప్రవేశించాడు. ఒంటిగా ప్రవేశించకుండా, కాల కర్మ గుణములతో ప్రవేశించాడు. కర్మ అంటే మనము చేసుకున్న కర్మ, అదృష్టం. గుణము అంటే సత్వ రజో తమో గుణాలు.
బ్రహ్మాండములో ఉన్న అనంతకోటి జీవరాశులకూ ఆకారం చేయాలి. అందరినీ ఒకే ఆకారము చేయలేదు.   దేవతలూ మానవులూ రాక్షసులూ పక్షులూ మొదలైన జీవాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు కలిపి ఒక ఆకారం చేయాలంటే ఒకే ఆకారం ఉండాలి. మరి, ఇంద్రియాలు ఒకటే ఐతే ఇన్ని ఆకారాలు ఎందుకు ఉన్నాయి. వాటి వాటి కర్మకనుగుణముగా, వాటిని అనుభవించడానికి అనువైన ఆకారముండాలి. అదే భోగాయతనం.
కాలమూ కర్మా అనే వాటి వలన ఇన్ని జీవులు ఉద్భవిస్తున్నాయి. ఏ ప్రాణికి ఏ పాపాన్ని ఏ ప్రాణికి ఏ పుణ్యాన్ని సరఫరా చేయాలో అలా చేస్తాడు. పరమాత్మ పరమాత్మగా రాలేదు, కాల కర్మములతో కలిసి ప్రవేశించాడు. ఇది వరకి జన్మలో వారు ఆచరించిన కరమానుసారముగా భోగము అనుభవించడానికి తగిన ఆకారము ఇస్తాడు.
కర్మ అంటే అదృష్టము. గుణము అంటే సత్వం రజస్సు తమస్సు. వారి వారి పాప పుణ్యాలకు ఏ ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలకు తగిన శరీరాన్ని

తతస్తేనానువిద్ధేభ్యో యుక్తేభ్యోऽణ్డమచేతనమ్
ఉత్థితం పురుషో యస్మాదుదతిష్ఠదసౌ విరాట్

తాను ప్రవేశించిన పదార్ధాలన్ని కలిపితే ప్రాణములేని గుడ్డు ఏర్పడింది. అందులోకి పరమాత్మ ప్రవేశించాడు. బయటినుంచి అందులోకి వెళ్ళి, అందులోంచి బయటకు వచ్చాడు. అందుకే బ్రహ్మకు విరాట్ పురుషుడు. విరాట్ - అంటే విశేషేణ రాజతే.

ఏతదణ్డం విశేషాఖ్యం క్రమవృద్ధైర్దశోత్తరైః
తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః
యత్ర లోకవితానోऽయం రూపం భగవతో హరేః

దీనినే విశేషమైన అండము అంటాము. బ్రహ్మాండానికి ఏడు పొరలు ఉన్నాయి. పృధ్వి అప్ తేజో వాయు ఆకాశము,  అహంకారము, మహత్తు. ఒక ఆవరణ కంటే రెండో ఆవరణ పది రెట్లు ఎక్కువ. పృధువి కన్నా నీరు పది రెట్లు ఎక్కువ. భూమి యాభై కోట్ల విస్తీర్ణం. నీటికన్నా వాయువు పది రెట్లు ఎక్కువ.
ఈ బ్రహ్మాండానికి ఈ ఏడు ఆవరణలూ దాటాక కూడా ఇంకో ఆవరణ ఉన్నది. అదే ప్రధానం (ప్రకృతి).
సకల లోకాల విస్తారణం బ్రహ్మ యొక్క రూపమే. నీటిలో ఉన్న హిరణ్మయ రూపమైన బ్రహ్మాండ కోశములోంచి స్వామి బయటకు వచ్చాడు.

హిరణ్మయాదణ్డకోశాదుత్థాయ సలిలే శయాత్
తమావిశ్య మహాదేవో బహుధా నిర్బిభేద ఖమ్

బయటకు వచ్చి అందులో ఉన్న వాటిని భేధించాడు. అంటే సమష్టి సృష్టి నుంచి వ్యష్టి సృష్టి ఏర్పడుతుంది. అందులో ఉన్న ఒక్కొక్క ఇంద్రియాన్ని భేధించి తీసి సకల ప్రాణి కోటికీ అమరుస్తాడు పరమాత్మ. పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మలో ఆవేశించాడు.

నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతోऽభవత్
వాణ్యా వహ్నిరథో నాసే ప్రాణోతో ఘ్రాణ ఏతయోః

పరమాత్మ మొదలు బ్రహ్మ యొక్క ముఖమునూ (నోటిని), అందులో ఇంద్రియాన్ని (రసనము, వాక్కు అనే రెండు ఇంద్రియాలు) ఏర్పరచాడు. వాక్కు అనే ఇంద్రియానికి అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు.  నాసికలో ఉండే ఇంద్రియాన్ని ఘ్రాణేంద్రియము అంటాము. దీనికి అధిష్ఠాన దేవత వాయువు.

ఘ్రాణాద్వాయురభిద్యేతామక్షిణీ చక్షురేతయోః
తస్మాత్సూర్యో న్యభిద్యేతాం కర్ణౌ శ్రోత్రం తతో దిశః

కళ్ళలో ఉండేధి చక్షురింద్రియం. సూర్యుడు అధిష్ఠాన దేవత. తరువాత కర్ణములకు శ్రోత్ర ఇంద్రియము, దిక్కులు అధిష్ఠాన దేవత

నిర్బిభేద విరాజస్త్వగ్ రోమశ్మశ్ర్వాదయస్తతః
తత ఓషధయశ్చాసన్శిశ్నం నిర్బిభిదే తతః

చర్మము (త్వగ్ ఇంద్రియము), రోమములూ కేశములకు అధిష్ఠాన దేవత ఔషధులు.

రేతస్తస్మాదాప ఆసన్నిరభిద్యత వై గుదమ్
గుదాదపానోऽపానాచ్చ మృత్యుర్లోకభయఙ్కరః

ఉపస్థకు, దాని నుండి వచ్చే రేతస్సుకు అధిష్ఠాన దేవత జలము. మలవిసర్జనావయవాన్ని గుదం, ఇంద్రియం పేరు అపానం. దీనికి అధిష్ఠాన దేవత లోకభయంకర దేవతైన మృత్యువు.

హస్తౌ చ నిరభిద్యేతాం బలం తాభ్యాం తతః స్వరాట్
పాదౌ చ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరిః

హస్తములకు పాణి ఇంద్రియం. వీటి స్వరూపం బలం. వీటికి అధిష్ఠాన దేవత ఇంద్రుడు.  పాదములకు గతి గుణము. వీటికి అధిష్ఠాన దేవత విష్ణువు.

నాడ్యోऽస్య నిరభిద్యన్త తాభ్యో లోహితమాభృతమ్
నద్యస్తతః సమభవన్నుదరం నిరభిద్యత

నడములకు ఇంద్రియం రక్తమూ, అధిష్ఠాన దేవత నదులు. నదులు సక్రమముగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అందుకే నదీ స్నానం చేసే వారు. నదులు రక్తమునకు అధిష్ఠాన దేవత. మనలో రక్తం ప్రవహిస్తూ ఉన్నట్లే, భూగోళములో కూడా నదులు ప్రవహిస్తూ ఉంటాయి.

క్షుత్పిపాసే తతః స్యాతాం సముద్రస్త్వేతయోరభూత్
అథాస్య హృదయం భిన్నం హృదయాన్మన ఉత్థితమ్

కడుపు లో కలిగేవి క్షుత్ పిపాస అనే వికారాలు కలవు. ఉదరానికి సముద్రం అధిష్ఠాన దేవత. తరువాత హృదయం పుడుతుంది. హృదయం నుండి మనసు. మనసుకి అధిష్ఠానం మనసు.

మనసశ్చన్ద్రమా జాతో బుద్ధిర్బుద్ధేర్గిరాం పతిః
అహఙ్కారస్తతో రుద్రశ్చిత్తం చైత్యస్తతోऽభవత్

మనసు కూడా చంద్రునిలాగ వికారాత్మకం. అదే హృదయం నుంచి బుద్ధి పుట్టింది. ఈ బుద్ధికి అధిపతి బ్రహ్మ. ఈ హృదయం నుండే అహంకారం పుట్టింది. దీనికి అధిపతి రుద్రుడు. అదే హృదయం నుండే చిత్తం పుట్టింది. చైత్యుడు (క్షేత్రగ్న్యుడు, లేదా జీవుడు) చిత్తములో ఉంటాడు.

ఏతే హ్యభ్యుత్థితా దేవా నైవాస్యోత్థాపనేऽశకన్
పునరావివిశుః ఖాని తముత్థాపయితుం క్రమాత్

ఇంతమంది అధిష్ఠాన దేవతలూ ఇంద్రియములూ వాటి కర్మలూ ఉన్నా, ఇవన్నీ నివృత్తి కర్మలో ఉన్న జీవుడిని పర్వర్తింపచేయలేకపోయాయి. మళ్ళీ ఇంద్రియాధిష్ఠాన దేవతలౌ కదిలించడానికి ప్రయత్నించాయి.

వహ్నిర్వాచా ముఖం భేజే నోదతిష్ఠత్తదా విరాట్
ఘ్రాణేన నాసికే వాయుర్నోదతిష్ఠత్తదా విరాట్
అక్షిణీ చక్షుషాదిత్యో నోదతిష్ఠత్తదా విరాట్
శ్రోత్రేణ కర్ణౌ చ దిశో నోదతిష్ఠత్తదా విరాట్
త్వచం రోమభిరోషధ్యో నోదతిష్ఠత్తదా విరాట్
రేతసా శిశ్నమాపస్తు నోదతిష్ఠత్తదా విరాట్
గుదం మృత్యురపానేన నోదతిష్ఠత్తదా విరాట్
హస్తావిన్ద్రో బలేనైవ నోదతిష్ఠత్తదా విరాట్
విష్ణుర్గత్యైవ చరణౌ నోదతిష్ఠత్తదా విరాట్
నాడీర్నద్యో లోహితేన నోదతిష్ఠత్తదా విరాట్
క్షుత్తృడ్భ్యాముదరం సిన్ధుర్నోదతిష్ఠత్తదా విరాట్
హృదయం మనసా చన్ద్రో నోదతిష్ఠత్తదా విరాట్
బుద్ధ్యా బ్రహ్మాపి హృదయం నోదతిష్ఠత్తదా విరాట్
రుద్రోऽభిమత్యా హృదయం నోదతిష్ఠత్తదా విరాట్

అగ్నిహోత్రుడు వాగీంద్రియము ద్వారా ముఖములోకి ప్రవేశించాడు. అయినా ఆ విరాట్ పురుషుడు లేవలేదు. వాయువు ఘ్రాణేంద్రియము ద్వారా నాసికలోకీ, సూర్యుడు చక్షురింద్రియము ద్వారా నేత్రాలలోకి, దిక్కులు శ్రోత్రేంద్రియము ద్వారా కర్ణములోకీ, ఔషధులు రోమాల ద్వారా త్వక్ ఇంద్రియములోనికీ, జలము రేతస్సుతో ఉపస్త ఇంద్రియములోకీ, మృత్యువు అపానము ద్వారా పాయువులోకీ, విష్ణువు గమనముతో పాదములోనికీ, ఇంద్రుడు బలముతో చేతులలోకీ, నదులు రక్తముతో నాడులలోకీ, సముద్రము ఆకలి దప్పులతో ఉదరాన్ని ప్రవేశించింది, చంద్రుడు మనసుతో హృదయముతో చేరాడు, బ్రహ్మ బుద్ధితో హృదయములోకి చేరాడు, రుద్రుడు అహంకారముతో హృదయములో చేరాడు,

చిత్తేన హృదయం చైత్యః క్షేత్రజ్ఞః ప్రావిశద్యదా
విరాట్తదైవ పురుషః సలిలాదుదతిష్ఠత

ఇవన్నీ చేసినా ఎటువంటి స్పందనా లేదు.  జీవత్మ చిత్తముతో హృదయములో ప్రవేశించగానే అంతవరకూ నీటిలో ఉన్న ఈ స్వామి (సమష్టి పురుషుడు), చైతన్యం ప్రవేశించగానే లేచాడు

యథా ప్రసుప్తం పురుషం ప్రాణేన్ద్రియమనోధియః
ప్రభవన్తి వినా యేన నోత్థాపయితుమోజసా

జీవుడు లేదా క్షేత్రజ్ఞ్యుడు, అతని ప్రవృత్తి లేకుంటే, నిద్రపోయిన వాడిని ప్రాణములూ ఇంద్రియములూ మనస్సూ బుద్ధి లేపగలవా (ప్రవృత్తి అభిముఖుడిగా చేయగలవా)? జీవుడు అభిముఖుడుగా ఉన్నప్పుడే ఇవన్నీ ఉన్నట్లు.

తమస్మిన్ప్రత్యగాత్మానం ధియా యోగప్రవృత్తయా
భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చిన్తయేత్

ఇదంతా ప్రత్యగాత్మ అధీనం (జీవాత్మ) , జీవుడు ప్రవర్తిస్తేనే, జీవుడిలో చైతన్యం ఉన్ముఖమైతేనే పని చేస్తాయి. అందుకే "నేను చేస్తున్న్నా" అనే భావన సరికాదు. మనలో ఆ చైతన్యాన్ని కలిగించిన వాడు పరమాత్మ. పరమాత్మ ప్రవేశించిన ఈ శరీరములో క్రియాశీలమైన నాడే మన అవయవాలు మన ఇంద్రియములూ మన అధిష్ఠాన దేవతలు పని చేస్తున్నాయి.
ఈ సమష్టి పురుషునిలో వున్న వ్యష్టి పురుషుడిగా పేరు గాంచిన ప్రత్యగాత్మను యోగ బుద్ధితో తెలుసుకోవాలి. మనసు బుద్ధి చిత్తమూ అహంకారముతో కలిసి "వాస్త్వముగా ఈ సముదాయాన్ని పని చేయిస్తున్నది ప్రత్యగాత్మ, ఆ ప్రత్యగాత్మకు అలాంటి సంకల్పం కలిగించిన వాడు పరమాత్మ".

జీవాత్మ, పరమాత్మ, శరీరం, ఇంద్రియములు, అవయవములూ, అధిష్ఠాన దేవతలూ అంటే ఏమిటో, ఈ సమగ్ర స్వరూపాన్ని యధార్థ జ్ఞ్యానముతో తెలుసుకొంటే, ప్రతీ పనికీ ఆరంభం ఎక్కడో తెలుసుకోవడాన్ని జ్ఞ్యానం అంటారు. అలాంటి జ్ఞ్యానం పొంది "ఎవరి సంకల్పముతో ఇవన్నీ పని చేస్తాయో, అలాంటి వాడి సంకల్పము లేకుంటే ఇవన్నీ నిష్క్రియలైనప్పుడు, ఇవన్నీ నాకెందుకూ" అని కలగడం విరక్తి. మొదట జ్ఞ్యానం, తరువాత విరక్తీ, కలిగిన తరువాతం ఇలాంటి పరమాత్మ మీద భక్తి కలుగుతుంది.
జ్ఞ్యానముతో స్పష్టముగా విడదీసి వివేకముతో తెలుసుకుని, పరమాత్మ యందు భక్తి, ప్రపంచము యందు విరక్తినీ పెంచుకొని, ఆ స్వామిని భక్తితో ధ్యానం చేయాలి. అలా చేయడం వలన అహంకారం పెరగదు.
శరీరమే ఆత్మ అన్న భ్రమ తొలగిపోతుంది. ప్రతీ చిన్న పని ఎలా జరిగిందో తెలిసిన నాడు (ఇంద్రియములంటే ఏమిటి, అధిష్ఠాన దేవతలంటే ఏమిటీ ఇవాన్నీ తెలిస్తే) నేనే పనీ చెయటం లేదు అని తెలుస్తుంది. ఇవన్నీ చేయిస్తున్న పరమాత్మను మన చిత్తములో ధ్యానం చేస్తాము. అప్పుడు అర్థమవుతుంది మనకి గుడికి వెళ్ళే బుద్ధి పుట్టింది అంటే పరమాత్మకు ఆ సంకల్పం కలిగింది అని అర్థం. ఇది బాగా అవగాహనమైతే అదే వివేకం. ఇలాంటి వివేకముతో పరమాత్మను ఈ ఆత్మలో బుద్ధితో ధ్యానం చేస్తే, అహంకార మమకారములు తొలగుతాయి. మనసు ఏకాగ్రమవుతుంది, బుద్ధి స్థిరమవుతుంది, చిత్తం నిశ్చంచలమవుతుంది.

No comments:

Post a Comment