Monday, January 21, 2013

సనకాదులు చేసిన, నిత్యానుసంధానము చేయవలసిన స్తోత్రము

శ్రీమద్భాగవతం మూడవ స్కంధం పదిహేనవ అధ్యాయములో సనకాదులు చేసిన ఈ స్తోత్రములోనే అసలు భాగవత తత్వం ఏమిటొ తెలుస్తుంది. ఇవి పొద్దున్నే చదువుకోవలసిన శ్లోకాలు. నాలుగు వేదాల సారమంటారు వీటిని. ఇది నిత్యానుసంధానము చేయవలసిన స్తోత్రము

కుమారా ఊచుః
యోऽన్తర్హితో హృది గతోऽపి దురాత్మనాం త్వం
సోऽద్యైవ నో నయనమూలమనన్త రాద్ధః
యర్హ్యేవ కర్ణవివరేణ గుహాం గతో నః
పిత్రానువర్ణితరహా భవదుద్భవేన

పరమాత్మ అందరికీ అంతర్యామిగానే ఉంటాడు. సజ్జనులకూ దుర్జనులకూ కూడా. యోగమునందు ఆసక్తి లేని వారు, పరమాత్మను భజించని వారి హృదయములో కూడా కనపడకుండా ఉంటావు.  సజ్జనులకు కూడా నీవు హృదయములోనే భాసిస్తావు గానీ నేత్ర సాక్షాత్కారం ఉండదు. మంచి వారికీ కనపడవూ, చెడ్డవారికీ కనపడవు. అలాంటి నీవు ఈనాడు మా కన్నులకు కనపడుతున్నావు. నీవు అనంతుడవు. నీ జ్ఞ్యానము గానీ, ఐశ్వర్యము గానీ, గుణము గానీ, "ఇంతా" అని చెప్పడానికి వీలు కాదు. అందుకు మేము ధన్యులము.
ఈనాడు మా కనులకు కనపడిన నీ గురించే నీ నుండీ పుట్టిన మా తండ్రిగారు చెప్పారు. ఇంతకాలం కర్ణ రంధ్రములోంచి ప్రవేశించే నీవు, ఈనాడు కనుల ద్వారా వచ్చావు. ఇంతకాలం మా తండ్రిగారు చెప్పగా మా కర్ణ రంధ్రముల గుండా ప్రవేశించావు. నీవు మాకు దూరముగా లేవు, మాకు కాని వాడవు కావు, మాకు అందని వాడవు కావు. మేము కాదనుకున్నా, అవుననుకున్నా, నీవు మాత్రం మమ్మల్ని కాదనుకోవు.

తం త్వాం విదామ భగవన్పరమాత్మతత్త్వం
సత్త్వేన సమ్ప్రతి రతిం రచయన్తమేషామ్
యత్తేऽనుతాపవిదితైర్దృఢభక్తియోగైర్
ఉద్గ్రన్థయో హృది విదుర్మునయో విరాగాః

పేర్లు వేరు వేరు పెట్టినా, వేరు వేరు రూపాలలో ఉన్నా, పరమాత్మ తత్వము ఒకటే అని మాకు తెలుసు. నిన్ను మేము తెలుసుకున్నాము (తం త్వాం విదామ). ప్రపంచములో ఉన్న ప్రతీ వస్తువుకూ, ప్రతీ వ్యక్తికీ మరొక వస్తువుకు మీదా, వ్యక్తిమీదా ప్రీతి కలగడానికి కారణమేమిటి. బృహదారణ్యకోపనిషత్తులో ఇలా ఉంది "ప్రతీ వాడు నా భార్య నన్నే ప్రేమించాలి, లేదా ప్రతీ భార్యా నా భర్త నన్ను ప్రేమించాలి అని గానీ, కొడుకు, నా తండ్రి నన్ను ప్రేమించాలి అని కోరుకుంటారు,  భావిస్తారు. ఇలా అనుకున్న వారందరూ ప్రేమిస్తున్నారా? ప్రేమగా ఉంటున్నారా? వివాహం చేసుకున్న కొద్ది రోజులవరకూ ఉన్న ప్రేమ తరువాత ఉండటం లేదు. మరి లోపం ఎక్కడుంది. ప్రేమగా ఉండాలని భర్త గానీ, భార్య గానీ ఉండాలనుకుంటే ఉండలేరు. భగవంతుడు కోరుకుంటే భార్య భర్తలు గానీ, తండ్రీ కొడుకులు గానీ, అత్తా కోడళ్ళు గానీ అన్యోన్యంగా ఉంటారు. అండుకే వివాహం మంత్రాలతో ఏర్పడాలి, వివాహం ముందూ, వివాహంలోనూ, వివ్హాహం తరువాతా, సంతానం కోసమూ పరమాత్మనే పూజించాలి. పరమాత్మ కోరితేనే భార్యను భర్తా, భర్తను భార్యా, తండ్రిని కొడుకూ, కొడుకునూ తండ్రీ ప్రేమిస్తాడు. ఆత్మన కామాయ. ఆయన కోరుకుంటేనే ఇంటికీ యజమానికి బంధం పెరుగుతుంది - స్థిరాస్తి గానీ, చరాస్తి గానీ, బంధుమిత్రుల బంధం గానీ. మన కోరికలూ సంకల్పాలు నెరవేరవు. పరమాత్మ సంకల్పిస్తేనే కలుగుతాయి. పరస్పరం ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించేవాడు పరమాత్మే.  "
ఈ జగత్తు లోని వారందరికీ ప్రీతిని కల్పిస్తున్నావు. ప్రపంచములో ఎదుటి వస్తువు మీద ఇంకో వస్తువుకి విడగొట్టుకోరాని ప్రీతి దానంతటది కలగదు , నీవు కలిగిస్తావు. ప్రతీ వస్తువుకూ ఇంకో దాని మీద ప్రీతి కలిగించేది నీవు. అఖిల జగత్తులో ప్రేమతత్వాన్ని నింపినది నీవు. ప్రేమే నీ స్వరూపం. ఇది మేము తెలుసుకున్నాము.
ఇహ లోకములో సుఖమయ జీవితం కోరి ఆచరించే పనుల వలన కలిగిన సంపదలు ఎలా క్షీణిస్తునాయో, ఈ లోకములో స్వర్గాదులు కలగాలని చేసిన యజ్ఞ్య యాగాది కర్మల ఫలితాలు కూడా క్షీణిస్తాయి. మనము చేసిన పనుల వలన ఫలితము నాశనమే ( అది ఈ లోకములో కావొచ్చు పరలోకములో కావచ్చు) ఇంత కష్టపడి ఆచరించే కర్మలు నశించే వాటిని పొందడానికా? నశించని వాటిని పొందాలంటే ఏమి చేయాలో పశ్చాతాపముతో తెలియబడతారు (ఈ ప్రపంచములో ఉండి కష్టపడి భోగాలు సంపాదించి "అందరికంటే చాలా గొప్ప వాడిని" అనుకొంటున్న క్షణములో మొత్తం ఆస్తి తృటిలో పోతుంది. అందుకే భాగవతం కృష్ణ నిర్యానముతో, యదుకుల క్షయముతో, కురువంశ క్షయముతో మొదలయ్యింది)  . దీన్నే అనుతాపం అంటారు ( పశ్చాత్తాపం అని కూడా అనొచ్చు). అలా పశ్చాత్తాపం కలిగిన నాడే భగవత్తత్వం తెలుస్తుంది. అలా తెలిసిన తత్వం వలన కలిగిన భక్తి పెరిగి, యోగముగా మారి, గ్రంధి భేధనమవుతుంది. అహంకార గ్రంధి భేధింపబడుతుంది. అహం ("నేను నేను") అనేది హృదయాన్ని బంధించి ఉంటుంది ఎప్పుడూ. ఆ హృదయ గ్రంధి భక్తి కలిగితే పోతుంది. ఆ భక్తి పశ్చాత్తాపం కలిగితే వస్తుంది. అప్పుడు ప్రపంచం యందు వైరాగ్యం కలుగుతుంది. పశ్చాత్తాపం కలగాలి, పరమాత్మ తత్వం తెలియాలి, పరమాత్మ యందు భక్తి కలగాలి, ప్రపంచం యందు వైరాగ్యం కలగాలి, అహంకార గ్రంధి తొలగాలి. ఈ ఐదూ ఐతే వారు మునులు అవుతారు. ఇవన్నీ ఒకదాని తరువాత ఒకటి వస్తాయి. ఇవన్నీ కలిగిన తరువాత యోగులూ మునులూ, హృదయములో నీవున్నావని తెలుసుకుంటారు. అలాంటి నిన్ను ఇపుడు మేము కనులకెదురుగా చూస్తున్నాము.

నాత్యన్తికం విగణయన్త్యపి తే ప్రసాదం
కిమ్వన్యదర్పితభయం భ్రువ ఉన్నయైస్తే
యేऽఙ్గ త్వదఙ్ఘ్రిశరణా భవతః కథాయాః
కీర్తన్యతీర్థయశసః కుశలా రసజ్ఞాః

పరమాత్మ భక్తులు "నీ పాదములే మాకు రక్షకులు " అని శరణు వేడతారు. కీర్తన చేసేవారిని పవిత్రం చేస్తాడన్న పేరుపొందిన వాడవైన (కీర్తన్యతీర్థయశసః ) నీ కథ యొక్క రసము తెలిసిన వారు. అట్టివారు నేర్పరులు, సమర్ధులు (కుశలా ). దేనిలో సమర్ధులు? సంసారాన్ని దాటడములో, మాయకు అతీతులవడములో, ఆచరించిన కర్మకు ఫలితము రాకుండా చేయగలిగిన సమర్ధులు. తాము చేసిన పని యొక్క ఫలితం పొందకుండా ఉన్న వారు కుశలులు. నీ దయకు చరమావది అయిన మోక్షాన్ని కూడా వారు కోరరు. (మోక్షమే పరమాత్మ అనుగ్రహానికి చివర). మోక్షాన్ని కూడా కోరని భక్తులు నీ కనుబొమ్మల కదలికతో నశించే ఇతర ఫలితాలను (స్వర్గాది లోక ఫలితములను) కోరతారా? వారు సమర్ధులు, కుశలులు, నేర్పరులు కాబట్టి దేన్ని కోరాలో వారికి తెలుసు. నిరంతరం పరమాత్మ కథా శ్రవణం చేసేవారు మోక్షం కూడా కోరరు.

కామం భవః స్వవృజినైర్నిరయేషు నః స్తాచ్
చేతోऽలివద్యది ను తే పదయో రమేత
వాచశ్చ నస్తులసివద్యది తేऽఙ్ఘ్రిశోభాః
పూర్యేత తే గుణగణైర్యది కర్ణరన్ధ్రః

మేము చేసిన పాపాలకు శాస్త్రం ప్రకారం ఏ నరకములు రావాలో ఆ నరకములోనే జన్మ ఉండనీ (నిరయేషు స్తాచ్). నరకములో ఉన్నా మా మనసు తుమ్మెదలు మకరందాన్ని కోరినట్లు నీ పాదపద్మాలనే కోరాలి. తులసి  ఎలా నీ పాదాలను సేవిస్తుందో మా వాక్కు కూడా నీ పాదాలనే ఆశ్రయించాలి. నీ కథా శ్రవణముతో మా చెవులు నిండాలి.  మమ్మల్ని ఎక్కడైనా పంపు గానీ మా మనసు నీ పదములయందు రమించేట్లు, వాక్కు తులసి లాగ నీ పదముల యందు ఉండాలి, చెవులు నీ కథలతో నిండాలి, మా కనులు నీ రూపాన్ని చూడాలి.

ప్రాదుశ్చకర్థ యదిదం పురుహూత రూపం
తేనేశ నిర్వృతిమవాపురలం దృశో నః
తస్మా ఇదం భగవతే నమ ఇద్విధేమ
యోऽనాత్మనాం దురుదయో భగవాన్ప్రతీతః

గొప్ప మంత్రములతో, వేదొ సూత్రములతో ఆహ్వానింపబడే వాడా (పురుహూత ), నీవు ఏ రూపాన్ని సాక్షాత్కరింపచేసావో, ఆ రూపాన్ని చూసిన మా నేత్రాలు తృప్తి పొందాయి. మానసిక నిగ్రహం లేని (అనాత్మనాం) వారికి నీ సాక్షాత్కారం ఉండదు అని ప్రసిద్ధి పొందిన నీవు, మా ముందర సాక్షాత్కరింపచేసిన నీ రూపముతో మా కనులు తృప్తి పొందాయి.

No comments:

Post a Comment