Tuesday, January 15, 2013

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 6

1. శ్రుతస్య పుంసాం సుచిరశ్రమస్య నన్వఞ్జసా సూరిభిరీడితోऽర్థః
తత్తద్గుణానుశ్రవణం ముకున్ద పాదారవిన్దం హృదయేషు యేషామ్

ఇది సిద్ధాంత వాక్యం. మానవుడెంతో కష్ట్పడి సంపాదించిన శాస్త్రమునకు పరమప్రయోజనమేమిటో పండితులు చెప్పారు. ఎవరి హృదయములో పరమాత్మ యొక్క పాదారవిందములు ఉన్నాయో, వారి గుణములను వినుటే, ఎంతో కష్ట్పడి సంపాదించుకున్న శాస్త్ర జ్ఞ్యానానికి ప్రయోజనమని పండితులు చెప్పారు. ఉదంకుడు అరవైరెండు సంవత్సరాలు గురువు దగ్గరే ఉన్నాడు. ఇంత శ్రమపడి సంపాదించిన జ్ఞ్యానానికి పరమాత్మ పాదాలను తమ హ్ర్దయములో నిలుపుకున్నవారి కథలు వినుటే ప్రయోజనం. పాండిత్యము భగవత్కథా శ్రవణమందు రుచి పుట్టించడానికే తప్ప డబ్బు సంపాదించడానికో అహంకారం మదం పెంచడానికో పేరు సంపాదించడానికో కాదు. గురువారిని సేవించినా, గ్రంధాలు చదివినా, శాస్త్రమభ్యసించినా, జ్ఞ్యానం సంపాదించినా, పాండిత్యం వచ్చినా, భక్తుల కథలు వినుటే ప్రయోజనం. మనసులో అహంకారం మమకారం అసూయ ఈర్ష్యా వారి కథలు వింటే పోతాయి.

2. మూడు పాళ్ళు సూర్యుడు ఉండగా, నక్షత్రము వస్తుండగా, నక్షత్రమును చూస్తూ సంధ్యావందనం చేయాలి. ప్రాతః కాలములో సూర్యుడు రాకముండే నక్షత్రం వస్తుంది. పొద్దున్నే అరుణోదయం కంటే ముందూ, సాయంకాలం సూర్యాస్తమయం కాబోతున్నప్పుడు సంధ్యావందనం చేయాలి.

3. ఉదయిస్తున్నా, లేక అస్తమిస్తున్న సూర్యుడిని చూడకూడదు. అది పాపం.
4. తండ్రి శరీరాన్ని రోగాలు లేకుండా, మనసునీ అధర్మ సంకల్పాలు కలగకుండా, బుద్ధినీ దుష్ట ఆలోచచనలు రాకుండా కూడా పోషించాలి. పెద్దలను (తల్లి తండ్రులను) సేవించుట పెద్దల కొరకు కాదు, మన కొరకే. మన సార్ధక్యం కొరకే). తండ్రి చెప్పిన మాటను ఆదరముతో మాత్సర్యము లేకుండా స్వీకరించాలి. తండ్రి చెప్పిన మాటను వినడమే ధర్మము.

5. పరమాత్మా నీ, చర్మములో వేదములనీ ఇమిడి ఉన్నాయి. నీ రోమములు దర్భలు. నీ నేత్రములలో నేయి ఉంది. నాలుగు పాదములూ చాతుర్హోత్రము (హోత ఉద్గాత అధ్వర్యువు ఋత్విక్ - ఇలా నలుగురితో చేసేది చాతుర్హోత్రం. ).
నీ మూతి భాగం స్రుక్, నాసికా రంధ్రాలు స్రువము. ఇడా (పాత్ర) ఉదరము. ఆధ్య పాత్ర (చమసాః) కర్ణ రంధ్రములు. సమిధలనూ ధర్భలను పెట్టే స్థానం (ప్రాశిత్రం) నోటి యందు, పాత్రలు (యజ్ఞ్య కుండము ముందర బంగారు పాత్ర వెనక వెండి, పక్క కాంస్య పాత్ర - వీటిని గ్రహములు  అంటారు) నోటిలో ఉన్నాయి. నీకు చర్వణం (నములుట) యజ్ఞ్యములో అగ్ని. యజ్ఞ్య దీక్ష నీ పుట్టుక కంటే ముందు ఏర్పడే స్వరూపం. యజ్ఞ్య పాత్రకు ముందు ఉండే ప్రదేశాన్ని గ్రీవ (కంఠం), వరాహానికి ఉండే రెండు దమ్ష్ట్రలు ప్రారంభ హోమం(ప్రాయణీయ) సమాపన (ఉదయనీయ) హోమం. నీ జిహ్వ ఆహుతి ఇవ్వడానికి కావల్సిన పాత్ర. చితులు (హవిర్ ద్రవ్యాన్ని అర్పిస్తున్నపుడు ఉండే ఉచ్చారణ స్వరములు) నీ ప్రణములూ. సోమము నీ రేతస్సు. సవనాలు నీ ఉనికి. యజ్ఞములో ఉన్న ఏడు సంస్థలు నీ ఏడు ధాతువులు. అన్ని రకముల సత్రములూ నీ శరీర సంధులు. మొత్తం కలిపితే అన్ని రకముల యజ్ఞ్యముల రూపమే నీవు సత్రములూ, క్రతువులూ హోమములూ యజ్ఞ్యములూ ఇష్టులు సవనములు సంస్థానములు, ఇంకా యజ్ఞ్యములో ఎన్ని రకాల భేధాలు ఉన్నాయో అవి అన్నీ నీవే,

అఖిల మంత్ర దేవతా ద్రవ్యాయ: అన్ని మంత్రములూ దేవతలూ ద్రవ్యములూ, కర్తువులూ,  పనులూ అన్నీ నీవే. ఇలాంటి పరమాత్మ దొరకాలంటే మాత్రం వైరాగ్యం కావాలి. సంసారం మీద ప్రీతి ఉన్నంత కాలం భగవంతుని మీద ప్రీతి కలగదు. వైరాగ్యమూ భక్తీ రెండూ కలిగితే పరమాత్మ జ్ఞ్యానం తెలుస్తుంది. తెలిసిన పరమాత్మను ఎలా సేవించాలో అర్థమవుతుంది. ఇవన్నీ రావాలంటే (విరక్తి రావాలన్నా, భక్తి కలగాలన్న) నీవే కలిగించాలి. ఇవన్నీ కలిగించే వాటిని కూడా నీవే కలిగించాలి. (యజ్ఞ్యము చేయాలంటే యజ్ఞ్య కుండములు వేరు, దర్భలు వేరు, హవిస్సులు  వేరు, యజ్ఞ్యానంగములూ, చేసేవారు, పాత్రలు, సాధనాలు, ఇవన్నీ వేరు. అదే పరమాత్మను పట్టుకుంటే, అన్నీ ఆయనే)

6. శంకరుని గూర్చి కశ్యప ప్రజాపతి దితితో పలికిన మాటలు
పరమాత్మ అయిన శంకరునికి తనవారని గానీ శత్రువని గాన్నీ భేధం లేదు. ఆయన బాగా ఆదరించే వాడు, తిరస్కరించేవాడు లేడు. ఆయన సమదృక్. ఎవరి పాదముల కింద ఉండే యోగమాయను మనం సేవిస్తున్నామో, ఆశ్రయించి ఉన్నామో. భేధములు, అభేధములూ తెలుసుకోవాలనుకునేవారు ఈయన పవిత్రమైన ఆచారాన్ని స్మరించే తొలగించుకుంటారు. ఈయనకన్నా ఎక్కువ వాడూ లేడు, ఈయన కన్నా సమానుడు లేడు. ఈ స్వామి, ఇంత గొప్ప వాడైనా, పిశాచములాగా ఆచరిస్తాడు. కొందరు అదృష్టహీనులు ఈ శంకరుని పనులు చూచి అవహేళన చేస్తారు, ఈయన ఆత్మారాముడు. ఎవరైతే వస్త్రములూ మాలలు ఆభరణములు భోజనమూ భోగమూ, ఇలాంటి వాటితో కుక్కలకి ఆహారమైన శరీరమును ఆత్మ అనుకుని పూజిస్తారో, వారు అవహేళన చేస్తారు. బ్రహ్మాదులు కూడా ఎవరు విధించిన హద్దుని దాటరో, సకల చరాచర జగత్తుకూ ఎవరి మాయ కారణమో, ఈ యోగ మాయ ఎవరి ఆజ్ఞ్యను పాటిస్తూ ఉంటుందో, అలాంటి వాడు పిశాచములా ప్రవర్తించడం సర్వ వ్యాపి అయిన పరమాత్మకు లీల.

7. మనో నిగ్రహం ఉండాలంటే శాస్త్ర విశ్వాసం ఉండాలి. ఫలాన తప్పు చేస్తే ఫలాన శిక్ష పడుతుంది అని మనం నమ్మిన నాడు మన మనసు ఆ తప్పు చేయడానికి ప్రేరేపించబడదు. మనసులో దుస్సంకల్పములు కలగకుండా ఉండాలి అంటే శాస్త్ర విశ్వాసం కలిగి ఉండాలి. కేవలం రుచిని చూసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది. రుచికరముగా ఉండీ, ఏది ఆరోగ్యాన్నిస్తుందో అదే తినమని చెబుతుంది ఆచారం.

8. న బ్రహ్మదణ్డదగ్ధస్య న భూతభయదస్య చ
నారకాశ్చానుగృహ్ణన్తి యాం యాం యోనిమసౌ గతః

బ్రాహ్మణోత్తముల ఋషుల సాధువుల శాపానికి గురైనవారు, బ్రహ్మదండ హతులని చూచి, నరక్ము కూడా భయపడుతుంది. ఇలాంటి పాపులు ఏ జాతిలో పడతారో, ఆ జాతిలో వారందరూ భయపడతారు. అంత నీచమైన జుగుప్సితమైన శిక్ష (బ్రహ్మ దండం) పడకుండా చూడండి.

9.  బృహదారణ్యకోపనిషత్తులో ఇలా ఉంది "ప్రతీ వాడు నా భార్య నన్నే ప్రేమించాలి, లేదా ప్రతీ భార్యా నా భర్త నన్ను ప్రేమించాలి అని గానీ, కొడుకు, నా తండ్రి నన్ను ప్రేమించాలి అని కోరుకుంటారు,  భావిస్తారు. ఇలా అనుకున్న వారందరూ ప్రేమిస్తున్నారా? ప్రేమగా ఉంటున్నారా? వివాహం చేసుకున్న కొద్ది రోజులవరకూ ఉన్న ప్రేమ తరువాత ఉండటం లేదు. మరి లోపం ఎక్కడుంది. ప్రేమగా ఉండాలని భర్త గానీ, భార్య గానీ ఉండాలనుకుంటే ఉండలేరు. భగవంతుడు కోరుకుంటే భార్య భర్తలు గానీ, తండ్రీ కొడుకులు గానీ, అత్తా కోడళ్ళు గానీ అన్యోన్యంగా ఉంటారు. అండుకే వివాహం మంత్రాలతో ఏర్పడాలి, వివాహం ముందూ, వివాహంలోనూ, వివ్హాహం తరువాతా, సంతానం కోసమూ పరమాత్మనే పూజించాలి. పరమాత్మ కోరితేనే భార్యను భర్తా, భర్తను భార్యా, తండ్రిని కొడుకూ, కొడుకునూ తండ్రీ ప్రేమిస్తాడు. ఆత్మన కామాయ. ఆయన కోరుకుంటేనే ఇంటికీ యజమానికి బంధం పెరుగుతుంది - స్థిరాస్తి గానీ, చరాస్తి గానీ, బంధుమిత్రుల బంధం గానీ. మన కోరికలూ సంకల్పాలు నెరవేరవు. పరమాత్మ సంకల్పిస్తేనే కలుగుతాయి. పరస్పరం ఒకరి మీద ఒకరికి ప్రేమ కలిగించేవాడు పరమాత్మే.  "

10. నాహం తథాద్మి యజమానహవిర్వితానే
శ్చ్యోతద్ఘృతప్లుతమదన్హుతభుఙ్ముఖేన
యద్బ్రాహ్మణస్య ముఖతశ్చరతోऽనుఘాసం
తుష్టస్య మయ్యవహితైర్నిజకర్మపాకైః

యజ్ఞ్య యాగాదులతో ఆచరిస్తూ, నిరంతరమూ నేయి వేస్తూ నన్ను అర్చిస్తే నేను అంతగా తృప్తి పొందను. తాను ఆచరించిన కర్మల వలన తనకు లభించిన ఫలితముతో తృప్తి పొందే బ్రాహ్మణోత్తములు (నిజకర్మపాకైః సంతుష్టస్య) భుజించే దానితో నేను తృప్తి పొందుతున్నాను
(తృప్తి పొందిన క్షత్రియుల వలే తృప్తి పొందని బ్రాహ్మణుడు నశిస్తాడు. తృప్తి పొందిన వేశ్య వలే, తృప్తి పొందని గృహిణి నశిస్తుంది) 

No comments:

Post a Comment