Wednesday, January 30, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం - కపిల దేవహూతి సంవాదం - 2 - సృష్టి తత్వం

శ్రీభగవానువాచ
అథ తే సమ్ప్రవక్ష్యామి తత్త్వానాం లక్షణం పృథక్
యద్విదిత్వా విముచ్యేత పురుషః ప్రాకృతైర్గుణైః

జ్ఞానం నిఃశ్రేయసార్థాయ పురుషస్యాత్మదర్శనమ్
యదాహుర్వర్ణయే తత్తే హృదయగ్రన్థిభేదనమ్

అనాదిరాత్మా పురుషో నిర్గుణః ప్రకృతేః పరః
ప్రత్యగ్ధామా స్వయంజ్యోతిర్విశ్వం యేన సమన్వితమ్

ఆత్మ స్వయం జ్యోతి - స్వప్రకాశం. ఆత్మ ప్రత్యక్ధామ. ఆత్మ ఇతరములనూ చూపుతుంది, ఇతరులకూ చూపుతుంది, తనను తనను తనకు తెలుపుతుంది, తనను మనకు తెలుపుతుంది.  ఈ లక్షణం ఆత్మకు మాత్రమే ఉంది. ప్రకృతికి లేదు. (పరాగ్ధామా అంటే ఎదుటివారికి చూపేది. ఉదా: దీపం. దీపం మనకు తనను చూపిస్తుంది గానీ తనను తనకు తెలుపదు. వస్తువులను మనకు చూపినా తనను తాను చూడదు).
ఆత్మతోటే సకల చరాచర ప్రపంచం వ్యాపించి ఉంది. పుట్టే గిట్టే వాటితో ఉండి కూడా ఈ అత్మ పుట్టదు చావదు. పుణ్య పాపములనే నిమిత్తములతో వాటిని అనుభవించడానికి ఏ శరీరం కావాలో దాన్ని పొందుతుంది. (అవాకులూ చవాకులూ మాట్లాడితే పశువులుగానూ పక్షులుగానూ, మానసికముగా చేస్తే అధోజాతులలో, శరీరముతో చేస్తే భూత ప్రేత పిశాచములు లాగ. అనవసరముగా వాక్కుని వాడితే మాట్లాడలేని జాతిలోనూ, మనసుతో తప్పు చేస్తే, సంకల్పించగల శక్తి లేని అంత్యజాతిలో). మనమాచరించిన కర్మలకనుగుణముగా శరీరం వస్తుంది. స్వప్నములో వచ్చినట్లుగా, స్వప్నములో చూచే పదార్థాలు పోయినా చూచేవాడు పోనట్లుగా శరీరము పోయినా ఆత్మ ఉంటుంది.

స ఏష ప్రకృతిం సూక్ష్మాం దైవీం గుణమయీం విభుః
యదృచ్ఛయైవోపగతామభ్యపద్యత లీలయా

పరమాత్మ సంకల్పముతో ప్రకృతితో సంబంధం ఏర్పడిన జీవుడు, ప్రకృతిలో వచ్చే ప్రతీ పరిణామం జీవునిలో ప్రతిబింబిస్తుంది. ఇది వరకు మనకు దేనితో కూడా చూడటానికి వీలు కాని దశలో ఉన్న ప్రకృతిని (అవ్యక్తము (సూక్ష్మ దశ), ప్రధానము, ప్రకృతి) చూపి, ఆ ప్రకృతి పని చేస్తుంటే, ఇంద్రియములు చేస్తున్న పని వలన కలుగుతున్న ఫలితం శరీరానికైతే , అది నాకే అనుకోవడమే సంసారం. అవి ఆత్మకు అంటినట్లు కనపడతాయి.
ఇటువంటి ఆత్మ విభుః - సర్వవ్యాపి. కంటికి కనపడనంత సూక్ష్మముగా ఉన్న ఆత్మ, అంతే సూక్షమైన, గుణత్రయం కూడా భాసించనంతా సూక్ష్మముగా ఉన్న, దైవ సంబంధం వలన వచ్చిన ప్రకృతిని ధ్యానించడము వలన, ఆ ప్రకృతితో సంబంధం ఏర్పడుతోంది.
పరమాత్మ మధ్యన ఆత్మను ఉంచి, ఒక వైపు తానుండి, రెండవ వైపు ప్రకృతినుంచి మనను వీటిలో ఒక దాన్ని కోరమన్నట్లుగా చేస్తాడు. ఏడుస్తున్న పిల్లవానికి తల్లి ఆటబొమ్మను ఇచ్చినట్లు, మనకు ప్రకృతినిస్తాడు. ప్రకృతియందు విరక్తి కలిగితే ఆయన లభిస్తాడు.
ఇక్కడ యదృచ్చ అంటే భగవత్సంకల్పం అని అర్థం. వాల్మీకి రామాయణములో కూడా ఈ యదృచ్చ అనే పదం ఆరు  సార్లు కనపడుతుంది. అది ఎక్కడ ఉంటే, అక్కడ దైవానుగ్రహం వలన జరిగింది అని అర్థం.
జీవుడు భగవత్సంకల్పం వలన వచ్చిన ప్రకృతిని (యదృచ్చయా) ఆమోదించాడు (యదృచ్ఛయైవోపగతామభ్యపద్యత). పరమాత్మ పంపిన ప్రకృతిని జీవుడు కూడా పరమాత్మ లీలతో ఆమోదించాడు. పరమాత్మ లీలామాత్రముగా పంపిన ప్రకృతిని ఆమోదించుటే అన్ని జన్మలకూ మూలము,

గుణైర్విచిత్రాః సృజతీం సరూపాః ప్రకృతిం ప్రజాః
విలోక్య ముముహే సద్యః స ఇహ జ్ఞానగూహయా

జీవుడు ప్రకృతిని ఎందుకు ఆమోదిస్తున్నాడు? ఆ ప్రకృతి తన లాంటి వాటినీ, చిత్ర విచిత్రమైన వాటిని ఎన్నింటినో సృష్టిస్తుంది. అవి చూసి జీవుడు చాలా బాగున్నాయి అనుకుంటాడు. వెంటనే జీవుడు మోసపోయాడు. కంటితో  చూచి బాగుంది అనుకునే ప్రతీదీ ప్రకృతే. ఆత్మకు ఏ రంగూ రూపం ఉండదు. ప్రకృతి సృష్టించిన రూపాలను చూచి జీవుడు మోహాన్ని పొందుతున్నాడు. ఇలా లేని వాటిని ఉన్నదీ అనుకోవడమే మోహం. ప్రకృతి జ్ఞ్యానముని కప్పిపుచ్చుతుంది. ఆ జ్ఞ్యానం మరుగునపడుతుంది. మోహం పైకి తేవబడుతుంది. జీవుడు అందుకే లేని దానిని ఉన్నట్లు, ఉన్నదాన్ని లేనట్లు, తనవి కాని దాన్ని తనవి అన్నట్లు భ్రమకు లోనవుతాడు

ఏవం పరాభిధ్యానేన కర్తృత్వం ప్రకృతేః పుమాన్
కర్మసు క్రియమాణేషు గుణైరాత్మని మన్యతే

ఎదురుగా ఉన్న దానిని ధ్యానం చేయడం వలన ఉన్న దానిని మరచిపోతున్నాడు. బాగున్న తాను "నేను బాగా లేను" అనుకుంటాడు.  అంటే తన స్వరూపాన్ని మరచిపోతాడు.  లేని రూపాన్ని ఉనంట్లు ప్రకృతిని ధ్యానం చేయడం వలన, ప్రకృతి యొక్క సత్వ రజ తమో గుణముల వలన ఇంద్రియములు చేసే పనులను "నేను చేస్తున్నాను" అనుకుంటాడు. చేసేది ప్రకృతి యొక్క గుణాలు. కాని, తాను కర్తా అని జీవుడు ఆపాదించుకుంటున్నాడు. కర్తృత్వం ఆపాదించుకోవడం వలన భోక్తృత్వం ఆపాదించబడుతోంది.
ఇదే బంధం అంటే. లేని దాన్ని ఉన్నట్లు అనుకోవడమే సంసారం. చేయని దాన్ని చేస్తున్నా అనుకోవడమే బంధం.

తదస్య సంసృతిర్బన్ధః పారతన్త్ర్యం చ తత్కృతమ్
భవత్యకర్తురీశస్య సాక్షిణో నిర్వృతాత్మనః

ప్రకృతికి పారతంత్ర్యుడవుతాడు. ఈ ఆత్మ, అకర్తుః, దేనికీ కర్త కాదు, సాక్షి మాత్రమే. ఇలాంటి ఆత్మకు తనది కానిది, తనకు కాది, తాను కానిది, తనది, తనకు, తాను అనుకోవడం వలనే బంధము వస్తుంది

కార్యకారణకర్తృత్వే కారణం ప్రకృతిం విదుః
భోక్తృత్వే సుఖదుఃఖానాం పురుషం ప్రకృతేః పరమ్

శరీరాన్ని కార్యం అంటారు. ఇంద్రియములు కారణము. శరీర ఇంద్రియాలకు కర్తృత్వాన్ని ఆపాదిస్తున్నాము. జీవుడు ఉన్న శరీరమునకు, ఇంద్రియమునకు పని చెప్పడములో, చేస్తున్నదీ, అనుభవిస్తున్నదీ శరీరము మాత్రమే. కానీ చేస్తున్నది శరీరమైతే, భోక్తృత్వమును తనకు ఆపాదించుకుంటున్నాడు.  పని చేయని వాడికి అనుభవించే హక్కు లేనట్లే, ఏ పనీ చేయని ఆత్మకు అనుభమనుకు కావు. ఐనా "ఇవనీ నేనే చేస్తున్నా" అని ఆపాదించుకున్నందుకే మరలా మరలా శరీరములో బంధించబడి అనేక జన్మలు ఎత్తుతాడు. కార్యములకూ కారణములకూ కర్తృత్వం ప్రకృతి వలన వస్తున్నది.
మనం చేయని వాటికి చేస్తున్నాం అనుకోవడమే మనం అనుభవించడానికి కారణం.
పనులు చేయడం వలన వచ్చే సుఖ దుఃఖాలను మనమనుభవిస్తున్నాము.

దేవహూతిరువాచ
ప్రకృతేః పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ
బ్రూహి కారణయోరస్య సదసచ్చ యదాత్మకమ్

ప్రకృతి పురుషుల లక్షణములేమిటి. దీనికి కర్తృత్వం గానీ కారణత్వం గానీ ఏ రూపములో ఉంటాయి. కార్యావస్థలో ఉన్న ప్రకృతి, కారణావస్థలో ఉన్న ప్రకృతి (ప్రళయములో ఉన్న ప్రకృతి). సత్ అసత్ - ప్రకృతి పురుషులకి, (ఒకే వ్యక్తి తండ్రికి కొడుకూ, కొడుకుకూ తండ్రీ అవుతున్నాడు. అంటే ఒకే వ్యక్తి పితౄ అవస్థలో కార్యమై, పుత్రావస్థలో కారణమవుతున్నాడు. అలాగే పరమాత్మ సూక్ష్మావస్థలో ఉన్నప్పుడు కారణమవుతున్నాడు, స్థూల రూపములో కార్యమవుతున్నాడు. స్థూల రూపములో ఉండే దోషాలు సూక్ష్మ రూపానికి కూడా వస్తాయా. కుండలో దొషాలు ఉన్నాయి కాబట్టి మట్టిలో దోషముంటుంది అనవచ్చా? పరమాత్మ జగత్తుగా ఉన్నాడు, జగత్తు కన్నా విడిగా ఉన్నాడు. కార్యత్వం కారణత్వం కర్తృత్వం భోక్తృత్వం, ఇవన్నీ కలిసి ఉండవు.)
ఏది కారణ భూతమూ, ఏది కారణ భూతము (ఏది ప్రకృతి ఏది పురుషుడు). తండ్రే కొడుకయ్యాడు. కొడుకంటే ప్రకృతా, ఆత్మా?
కారణం అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి, సత్, అసత్, అంటే ఏమిటి. ఏది కర్తా ఏది భోక్తా?

శ్రీభగవానువాచ
యత్తత్త్రిగుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకమ్
ప్రధానం ప్రకృతిం ప్రాహురవిశేషం విశేషవత్

ప్రధానం వేరూ ప్రకృతి వేరూ కాదు. ఈ ప్రకృతి రెండు రకాలుగా ఉంటుంది. సూక్ష్మావస్థలో ఉంటుంది (సృష్టి కన్నా ముందు స్థితి), స్థూలావస్థలో ఉంటుంది. ప్రధానమైన ప్రకృతి అవిశేషముగా ఉన్నప్పుడు అవ్యక్తం. ఎలాంటి ప్ర్ధివ్యాది విశేషాలు లేనప్పుడు అది అవ్యక్తం. ఎలా జీవుడు నిత్యమో, ప్రకృతి కూడా నిత్యం. ఇది త్రిగుణం. సూక్ష్మావస్థలో కూడా ఇది గుణత్రయాత్మకమే. కానీ ప్రళయావస్థలో, సూక్ష్మావస్థలో ఉన్న గుణములు గ్రహించబడవు. గ్రహించబడనంత మాత్రాన లేవు, అని అర్థం కాదు.
ఈ ప్రపంచం స్థూలావస్థకు వెళ్ళినప్పుడు పెద్దగా అయ్యి సత్ గా కనిపిస్తుంది. ఇపుడు ఏదైతే కనపడిందో, ఇంతకు ముందు కనపడలేదు. అంటే నామ రూపాలు లేవు. నామ రూపాలు లేనపుడు అవ్యక్తం, అసత్. నామ రూపాలు ఉన్నప్పుడు సత్. అప్పుడు అవిశేషం, ఇప్పుడు విశేషం. ప్రకృతి పంచ్భూతాత్మకంగా పంచ తన్మాత్రాత్మకంగా దశ ఇందిర్యాత్మకముగా ఉన్నప్పుడు రూపం నామం ఉంటాయి. కానీ అప్పుడూ ఇప్పుడూ కూడా ప్రకృతి నిత్యమూ తిర్గుణాత్మకమే.
అందుకే ప్రకృతి జీవుని కన్నా, పరమాత్మ కన్నా, భిన్నమైనది. సత్వాది గుణత్రయం జీవునికీ పరమాత్మకీ లేదు. నిత్యత్వం ఇద్దరిలో ఉన్నాయి. త్రిగుణత్వం ఉన్నది ప్రకృతికి.
మరి లేదు అన్నది ఉన్నట్లు ఎలా కనపడుతుంది. ?

పఞ్చభిః పఞ్చభిర్బ్రహ్మ చతుర్భిర్దశభిస్తథా
ఏతచ్చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః

ఈ ప్రకృతే ఇరవై నాలుగు తత్వాలతో ఉంటుంది.  పంచ తన్మాత్రలు పంచ్భూతములు మనసు అహంకారం మహత్తు (బుద్ధి) అవ్యక్తం, దశ జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు. ఈ ఇరవై నాలుగూ ప్రకృతి వలన ఏర్పడే తత్వాలు. వీటికే కొందరు బుద్ధి చిత్తమూ అంతఃకరణం అంటారు. కొంతమంది కాలము కూడా ఒక తత్వముగా చెబుతారు. మహత్తే బుద్ధి తత్వం, అహంకారమే మనసు, అహంకారం. మనసు యొక్క స్వరూపాలే బుద్ధి మనసు చిత్తం అంతఃకరణం.

మహాభూతాని పఞ్చైవ భూరాపోऽగ్నిర్మరున్నభః
తన్మాత్రాణి చ తావన్తి గన్ధాదీని మతాని మే

పంచమహాభూతములు: భూమి ఆపః అగ్ని మరుత్ నభః.
ఎలాగీతే పంచభూతములైదో, వాటి తన్మాత్రలు ఐదు : శబ్ద స్పర్శ రూప రస ఇంద్రియాలు

ఇన్ద్రియాణి దశ శ్రోత్రం త్వగ్దృగ్రసననాసికాః
వాక్కరౌ చరణౌ మేఢ్రం పాయుర్దశమ ఉచ్యతే

జ్ఞ్యానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిపి పది. అంతరాత్మే నాలుగు రూపాలుగా మారుతుంది. బుద్ధి మనసు అంతఃకరణం చిత్తం. మనసు సంకల్పాత్మకం. సందేహం వస్తే చిత్తం . నిశ్చయం వస్తే బుద్ధి, ఆలోచిస్తే అంతఃకరణం. ఇవి నాలుగు విడిగా లేవు, ఒకే పదార్ధం పనిని బట్టి పేరు మారుతూ ఉంటుంది. మహత్తత్వం అనేది బుద్ధి.

మనో బుద్ధిరహఙ్కారశ్చిత్తమిత్యన్తరాత్మకమ్
చతుర్ధా లక్ష్యతే భేదో వృత్త్యా లక్షణరూపయా

ఏతావానేవ సఙ్ఖ్యాతో బ్రహ్మణః సగుణస్య హ
సన్నివేశో మయా ప్రోక్తో యః కాలః పఞ్చవింశకః

ఇదే లెక్కించడానికి కావలసిన తత్వముల సంఖ్య. ఈ ఇరవై నాలుగు గణములు కూడ పరమాత్మ సగుణ అవతారం లేదా ఇవి సగుణ బ్రహ్మ. ఈ ఇరవై నాలుగు కాకుండా, ఇరవై ఐదవ తత్వము కాలము.

ప్రభావం పౌరుషం ప్రాహుః కాలమేకే యతో భయమ్
అహఙ్కారవిమూఢస్య కర్తుః ప్రకృతిమీయుషః

కాలమంటే పరమాత్మ యొక్క ప్రభావం (ప్రభావం పౌరుషం - పురుషుని యొక్క ప్రభావం). ప్రకృతికి గానీ జీవునికి గానీ భయము కలిగేది కాలము వలనే. తాను స్వయముగా కల్పించుకున్న ప్రకృతి సంబంధముతో అనుభూతి కోసం ఆచరించే కర్మలే పాప పుణ్యాలు. వీటి సమూహాన్ని బట్టే ఫలం నిర్ణయించబడుతుంది. ప్రతీదానికి నియమిత కాలం ఉంటుంది. అహంకారముతో మూఢుడై కర్తృత్వాన్ని ఆపాదించుకున్న జీవునికి భయము ఈ కాలము వలన. ప్రకృతి భావాన్ని పురుషుడు పొందుతున్నాడు. ప్రకృతిని నేనే అనుకుంటున్నాడు, అహంకార విమూఢుడై. అందువలనే కర్త అయ్యాడు. కర్తృత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. అలా కర్తృత్వాన్ని తెచ్చిపెట్టుకునే జీవుడిని భయపెట్టేది ఈ కాలము.

ప్రకృతేర్గుణసామ్యస్య నిర్విశేషస్య మానవి
చేష్టా యతః స భగవాన్కాల ఇత్యుపలక్షితః

సత్వము రజస్సు తమస్సూ, ఈ మూడు గుణాలు సమానముగా ఉన్న స్థితిలో, దేని వలన కదలిక ఏర్పడుతుందో, అది కాలము. ప్రతీ దానిలో కదలిక గలిగించేదే కాలము.

అన్తః పురుషరూపేణ కాలరూపేణ యో బహిః
సమన్వేత్యేష సత్త్వానాం భగవానాత్మమాయయా

నేను (పరమాత్మ) నా మాయతో ప్రతీ ప్రాణిలోనూ లోపల పురుషునిగా ఉంటాడు, వెలుపల కాలముగా ఉంటాడు. లోపల సంకల్పం కలిగించేదీ, బయట కాలముగా ఉండి ఆ పని చేయించేదీ భగవానుడే. అలా లోపల పురుషునిగా ఉండి, బయట కాలముగా ఉండి అన్ని ప్రాణులనీ కలుపుతాడూ (సమన్వేత్యేష సత్త్వానాం). కలిపేది ఆయనే - సమన్వేతి.

దైవాత్క్షుభితధర్మిణ్యాం స్వస్యాం యోనౌ పరః పుమాన్
ఆధత్త వీర్యం సాసూత మహత్తత్త్వం హిరణ్మయమ్

నిర్విశేషమైన ప్రకృతి సవిశేషమెలా అయ్యింది? మనము ఒక పని చేయాలీ అన్నా, మానాలీ అన్నా, మన మనసులో ఒక సంకల్పము కలగాలి. సంకల్పము కలగాలన్నా వికారం కలగాలి. మనసులో వికారం కలగడాన్నే క్షోభ, స్పందనా, చేష్టా అంటారు. విరుద్ధమైన రెండు తత్వముల కలయిక వలన స్పందన ఏర్పడుతుంది. అదే వికారం. మనసులో వికారం కలిగిందంటే మనం ఆచరించ వలసిన కర్మకు తగిన మనో వికారాన్ని భగవానుడు కలిగిస్తాడు. ప్రతీ చలనమూ పరమాత్మ సంకల్పముతోనే ఏప్రడుతుంది.
ప్రకృతి సూక్ష్మముగా ఉన్నప్పుడు, పరమాత్మ సంకల్పము వలన క్షోభ ఏర్పడితే, అందులోంచి మహత్ తత్వం ఏర్పడింది. అది బంగారు రంగులో ఉంటుంది. ఆయనే హిరణ్యగర్భుడు.

విశ్వమాత్మగతం వ్యఞ్జన్కూటస్థో జగదఙ్కురః
స్వతేజసాపిబత్తీవ్రమాత్మప్రస్వాపనం తమః

ఎన్నడూ మారని వారైన పరమాత్మ (కూటస్థుడు) , తనలో దాగి ఉన్న (ఆత్మగతం) ప్రపంచాన్ని బయలు పరిచాడు(వ్యంజన్).  పరమాత్మే జగత్తుకు అంకురం. తనలో దాగి ఉన్న జగత్తును ఆవిర్భవింపచేసి, తనను మరుగు పరచే చీకటిని త్రాగివేశాడు. తనను కూడా కనపడకుండా చేసే చీకటిని తాగి వేసాడు

యత్తత్సత్త్వగుణం స్వచ్ఛం శాన్తం భగవతః పదమ్
యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహదాత్మకమ్

పరమాత్మ ప్రకృతిని క్షోభ కలిగించడం వలన పుట్టినది మహత్ తత్వం. దీనికి అధిష్టాత వాసుదేవుడు. వాసుదేవుడు అధిష్టాతగా ఉన్న దాన్ని చిత్తం అంటాము. ఈ సత్వగుణము, ప్రకాశించేది స్వచ్చమైనది, కల్మషం లేనిది, చీకటంతా తొలగిపోయేది (తమస్సు పోవడం వలన), శాంతము, భగవత్స్వరూపమూ. దీనికే పేరు మహత్ తత్వం. దీన్నే చిత్తం అంటాం. దీనికి వాసుదేవుడు అధిష్టాత సంకర్షణుడు అధిష్టాతగా ఉన్నది అంతఃకరణం.

స్వచ్ఛత్వమవికారిత్వం శాన్తత్వమితి చేతసః
వృత్తిభిర్లక్షణం ప్రోక్తం యథాపాం ప్రకృతిః పరా

ఈ చిత్తముకే మూడు స్వరూపాలు ఉంటాయి. ఈ చిత్తమే ఒక్కొక్కప్పుడు స్వచ్చముగా, శాంతముగా, ఉంటుంది, మరొకప్పుడు ఏ వికారాలు లేకుండా ఉంటుంది. ఏ వికారమూ లేనిది చిత్తం. వికారం ఏర్పడితే అంతఃకరణం లేదా బుద్ధి. ఇంకొంచెం వికారం ఏర్పడితే మనసు.
అసలు నీటిలో ఎలాంటి తరంగాలూ ఉండవు. ప్రదేశాలను బట్టి చేరిన నీరు తరంగాలతో ఉంటుందీ, తరంగాలు లేకుండా ఉంటుంది. ఇవన్నీ వచ్చి పోయేవే గానీ, అసలు నీటికి ఏ వికారమూ లేనట్లే అసలు చిత్తానికే వికారాలూ ఉండవు. అది స్వచ్చముగా, శాంతముగా అవికారముగా ఉంటుంది. అది మనసుగా మారితే సంకల్ప వికల్పాలు, అదే బుద్ధిగా మారితే, సంశయ నిశ్చయాలు, అహంకారముగా మారితే క్రోధమూ అమర్షమూ వస్తాయి. నీటి ప్రకృతి ఎలా ఊర్ములకంటే అతీతమో వికారాలకు చిత్తం అతీతము.

మహత్తత్త్వాద్వికుర్వాణాద్భగవద్వీర్యసమ్భవాత్
క్రియాశక్తిరహఙ్కారస్త్రివిధః సమపద్యత

ప్రకృతి తత్వములో పరమాత్మ సంకల్పముతో క్షోభ కలుగ చేస్తే హిరణ్మయమైన మహత్ తత్వం ఏర్పడింది.ఆ మహత్ తత్వం యొక్క వికారమే చిత్తమూ. ఈ మహత్ తత్వములో కూడా పరమాత్మ క్షోభను కలిగిస్తే, పరమాత్మ సంకల్పం వలన కలిగిన ప్రేరణతో కలిగిన వికారముతో మూడు రకములైన అహంకారాలు పుడతాయి. వీటి వలనే కర్మేంద్రియములూ జ్ఞ్యానేంద్రియములూ మనసు కలుగుతాయి.

వైకారికస్తైజసశ్చ తామసశ్చ యతో భవః
మనసశ్చేన్ద్రియాణాం చ భూతానాం మహతామపి

ఈ మహత్ తత్వమునుండే వైకారిక (సాత్విక, వికారములు గలిగిన మనసుని సృష్టించేది కాబట్టి వైకారికం అని పేరు) అహంకారం, తైజస (రాజస), తామస అహమక్రాం. వైకారికం నుండి మనసు, రాజసం నుండి ఇంద్రియములు, తామసం నుండి పంచభూతములు పుట్టాయి.

సహస్రశిరసం సాక్షాద్యమనన్తం ప్రచక్షతే
సఙ్కర్షణాఖ్యం పురుషం భూతేన్ద్రియమనోమయమ్

మహత్ తత్వమునకు వాసుదేవుడు అధిష్టాత అయినట్లు, అహంకారానికి అధిష్టాత సంకర్షణుడు (ఈయననే అనంతుడనీ, ఆది శేషుడనీ, సహస్ర పడగలు కలవాడు).
సంకర్షణుడే భూత (పంచ భూతాలు), ఇంద్రియ (పది ఇంద్రియాలు), మనో మయుడు. అహంకారం వలననే మనసూ, ఇంద్రియాలు, పంచభూతములూ పుట్టాయి.

కర్తృత్వం కరణత్వం చ కార్యత్వం చేతి లక్షణమ్
శాన్తఘోరవిమూఢత్వమితి వా స్యాదహఙ్కృతేః

ఈ అహంకారానికే కర్తృత్వం (నేను చేస్తున్నాను, నేను వెళ్తున్నాను, వస్తున్నాను, వింటున్నాను అనే భావనలు), కరణత్వం (నా ఇంద్రియములతో చేస్తున్నాను, నా కన్ను బాగుంది, నా చెవి, అలాంటి భావనలు), కార్యత్వం (నేను చేస్తే పని అవుతుంది). దీనికే మరో మూడు పేర్లు శాంతం (ప్రకాశకత్వం- ఒక వస్తువును చూపుట), ఘోరత్వము (చిత్త విక్షేపము, ఒకే సారి ఎన్నో ఆలోచనలు రావడం), మూఢత్వం (ఇది ఫలానా అని తెలియకపోవడం). ఈ మూడూ అహంకారానికి ఉంటాయి.
నా శరీరము/ఇంద్రియములూ/మనస్సు అనడమూ అహంకారమే.

వైకారికాద్వికుర్వాణాన్మనస్తత్త్వమజాయత
యత్సఙ్కల్పవికల్పాభ్యాం వర్తతే కామసమ్భవః

సాత్వికాహంకారములో కూడా పరమాత్మ వికారం కలిగిస్తాడు. సాత్వికాహంకారములోంచి మనస్తత్వం పుట్టింది. మనస్సు అంటే సంకల్పాత్మకం. అలాగే వికల్పిస్తుంది. సంకల్ప వికల్పాలు కలిగిన అహంకారానికే మనసు అని పేరు. సంకల్పాలు, వికల్పాలూ లేకుండా కేవలం ఆలోచన ఉంటే బుద్ధీ అని పేరు. ఏమీ లేకుండా ప్రశాంతముగా ఉంటే బుద్ధి అని.
కామసంభవః - ఇక్కడ కాముడు అంటే ప్రద్యుమ్నుడు. ప్రకర్షేన ద్యుమ్నాతి - బాగా కలచివేస్తాడు. ఎలాంటి వారి మనసునైన కలచివేస్తాడు. కాబట్టి ఈయన కామసంభవుడు. ఎంత గొప్ప వాడినైనా వాడి వశములో వాడు లేకుండా చేస్తాడు. ఈయన పేరే ప్రద్యుమ్న. మనసు అనేది కోరిక వలన పుట్టేది.
మహత్ - వాసుదేవుడు, అహంకారం - సంకర్షణుడు, అహంకారములో మనసుకి - ప్రద్యుమ్నుడు అధిష్టాత.

యద్విదుర్హ్యనిరుద్ధాఖ్యం హృషీకాణామధీశ్వరమ్
శారదేన్దీవరశ్యామం సంరాధ్యం యోగిభిః శనైః
తైజసాత్తు వికుర్వాణాద్బుద్ధితత్త్వమభూత్సతి
ద్రవ్యస్ఫురణవిజ్ఞానమిన్ద్రియాణామనుగ్రహః

రాజస అహంకారము యొక్క అధిష్టాత అనిరుద్ధుడు. సాత్వికాహంకార అధిష్టాత ప్రద్యుమ్నుడు. అనిరుద్ధుడు హృషీకములకు అధిష్టానము. హృషీకములు అంటే ఇంద్రియములు. ఇంద్రియాలకు "సంతోషాన్ని తగ్గించేవి" అని పేరు. కోరికను నిర్మూలించి పరమాత్మను చేర్చేది బుద్ధి లేదా ఆత్మ. దానికి కూడా హృషీకమనే పేరు.
ఈ అనిరుద్ధుడు సకల ఇంద్రియములకూ అధిపతి. అనిరుద్ధుడూ అంటే ఆపశక్యం కాని వాడు. అందుకే మన ఇంద్రియములలో కలిగే ప్రవృత్తిని మనం ఆపలేము. అనిరుద్ధుడు ఇంద్రియాధిష్టాన దేవత.
అనిరుద్ధుడు శరదృతువులో ఉండే నల్లని కలువలా ఉంటాడు. శరదృతువులో నలుపు కొంత తెలుపుతో కలిసి ఉంటుంది. అటువంటి రంగులో ఉంటాడు.
వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నులలో సులభముగా మనకు పొందదగిన వాడు అనిరుద్ధుడు. యధాక్రమముగా మెల్లగా యోగాన్ని అవలంబిస్తూ వెళితే ఈయన దొరుకుతాడు.
ఈ తైజసాహంకారం వలన పుట్టేదే బుద్ధి తత్వం. ఈ బుద్ధి తత్వము వలన కలిగేది ద్రవ్య స్పురణ విజ్ఞ్యానం. ఇలాంటి దాని వలననే అన్ని ఇంద్రియములూ ఏర్పడి పని చేస్తాయి. బుద్ధి లేకపోతే ఇంద్రియములు చేసినా తెలియదు. కన్ను చూసినా, బుద్ధికీ మనసుకూ అనుసంధానం లేనప్పుడు ఎదురుగా ఉన్నా గమనించలేము. బుద్ధినీ మనసునూ పరమాత్మ యందు లగ్నం చేస్తే ఏమి చూసినా మనకి అంటదు.
అందుకే విద్యాతురానాం నరుచిః నపక్వం అంటారు. రాజసాహంకారం వలన అనుగ్రహించబడి, సాత్వికాహం కారము వలన పుట్టినవి ఇంద్రియాలు.

సంశయోऽథ విపర్యాసో నిశ్చయః స్మృతిరేవ చ
స్వాప ఇత్యుచ్యతే బుద్ధేర్లక్షణం వృత్తితః పృథక్

బుద్ధికి అయిదు లక్షణాలు ఉన్నాయి 1. సంశయం (అంటే వికల్ప జ్ఞ్యానం) 2. విపర్యయం 3. నిశ్చయం

1. సంశయం అంటే ఒక దానిలో ఇంకో దానిని చూచుట. అన్యధా జ్ఞ్యానం. ఒక ధర్మము యందు ధర్మి ద్వయాన్ని చెప్పుట. అదా ఇదా? తాడా పామా? మనిషా మొదా? అనే సంశయము.

2. విపర్యయం: ఇందులో రెండు ఉంటాయి. అన్యధా జ్ఞ్యానం, విపరీత జ్ఞ్యానం.
అన్యధా జ్ఞ్యానం అంటే ఒక వస్తువులో ఒక గుణం వేరుగా కనిపించుట. ఉదా: తెల్లగా ఉన్న శంఖం పచ్చగా కనిపించడం. అంటే గుణం మారింది. ధర్మిలో ధర్మం మారుట.
విపరీత జ్ఞ్యానం. ఒక వస్తువును చూచి ఇంకో వస్తువు అనుకోవడం. తగరమును చూచి వెండి అనుకోవడం. ఇక్కడ వస్తువే మారింది. ఇక్కడ ధర్మే మారింది.
3. నిశ్చయం: ఇది ప్రమాణ రూపం. ఇది ఇంతే. శంఖము తెల్లగా ఉంది అని నిశ్చయముగా తెలియడం
4. స్మృతి : అనుభూత విషయ జ్ఞ్యానం స్మృతి. జరిగిన దాన్ని గుర్తుంచుకోవడం. (ఉదా: ఈ శ్లోకం ఫలాన అధ్యాయములో వచ్చింది)
5. స్వాప - బుద్ధి స్తభముగా ఉండటం స్వాప. నిద్రపోతే కలిగేది ఇదే. బుద్ధి నిద్రపోతే అసలు నిద్ర. బుద్ధి ఆలోచిస్తూ ఉంటే కలలు వస్తాయి. దాన్ని మగత నిద్ర. బుద్ధి స్తబ్ధముగా ఉండే నిద్ర నలభై నిముషాలు చాలు.

తైజసానీన్ద్రియాణ్యేవ క్రియాజ్ఞానవిభాగశః
ప్రాణస్య హి క్రియాశక్తిర్బుద్ధేర్విజ్ఞానశక్తితా

రాజసాహ అనుగృహీతములైన ఇంద్రియములే కర్మేంద్రియ జ్ఞ్యానేంద్రియములు. ప్రాణము అంటే పని చేసే శక్తి. జ్ఞ్యాన ఇంద్రియాలకు బుద్ధి. కర్మేంద్రియాలకు ప్రాణము. మన మనసు బుద్ధి శరీరం ఇంద్రియాలూ బాగుడాలంటే, అధర్మంగా ప్రవర్తించకుండా ఉండాలంటే, కోపాది వికారాలు ప్రబలమవ్వకుండా ఉండాలంటే ఈ నాలుగు వ్యూహాలను (వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులను ) ఆరాధించాలి.

తామసాచ్చ వికుర్వాణాద్భగవద్వీర్యచోదితాత్
శబ్దమాత్రమభూత్తస్మాన్నభః శ్రోత్రం తు శబ్దగమ్

పంచభూతాలకి తామసాహంకారం ఆది కాబట్టి దీనిని భూతాది అంటారు. భగవ్త్సంకల్పమనే ప్రేరణతో తాంసాహంకారం వికారం చెంది శబ్ద తన్మాత్రం ఉదయించింది. దీని నుండి ఆకాశం పుట్టింది. ఆకాశము యొక్క గుణము శబ్దము. శబ్దమును గ్రహించే ఇంద్రియం శ్రోత్రేంద్రియం. శ్రోత్రేంద్రియం ఆకాశము నుంచి పుట్టిందా? కాదు. అది పుట్టినది రాజసాహంకారము నుండి. శ్రోత్రేంద్రియం శబ్దమును గ్రహిస్తుంది గానీ, అది ఆకాశము నుండి పుట్టలేదు.

అర్థాశ్రయత్వం శబ్దస్య ద్రష్టుర్లిఙ్గత్వమేవ చ
తన్మాత్రత్వం చ నభసో లక్షణం కవయో విదుః

శబ్దం అంటే ఏమిటి: శబ్దమంటే అర్థమునకు ఆశ్రయం. ఒక వస్తువును చూడగానే "ఇది వస్త్రమూ, ఇది గోడ " అంటాము. గోడ, వస్త్రము అనేది శబ్దము. దాన్ని వస్తువును చూచి చెబుతున్నాము. అంటే అర్థమునకు ఆశ్రయం. భగవంతుని గురించి చెప్పేది శబ్దం. పరమాత్మ శబ్దముతోనే తెలియబడతాడు.
తెలిసినట్లు తెలవడానికి తెలిపేది శబ్దం, "నేను ఫలానా వస్తువూ చూచాను" అని శబ్దముతోటే చెబుతాము. చూచేవాడికి కూడా శబ్దమే ప్రమాణం (ద్రష్టుః లింగం). చూచిన వాటికీ ప్రమాణం, చూచినట్లు ప్రమాణం. ఒక వస్తువును చూచినట్లు నమ్మించాలి అంటే అది ఎలా ఉంటుందో చెప్పాలి. తెలుసుకున్నవాడు తెలుసుకున్నది తెలుసుకున్నట్లు చెప్పాలంటే ప్రమాణం శబ్దం.

ఆకాశం అంటే ఏమిటి? శబ్దము గుణముగా కలిగినది ఆకాశం. ధ్వని కలిగించేది ఆకాశం. ధ్వనికి మూలం రెండు వస్తువుల ఒరిపిడి. దూరముగా ఉన్నవి దగ్గరైతే ఘర్షణ అంటాము. ఒక చోట ఉన్న ఆకాశాన్ని అనాకాశముగా చేయాలి.

భూతానాం ఛిద్రదాతృత్వం బహిరన్తరమేవ చ
ప్రాణేన్ద్రియాత్మధిష్ణ్యత్వం నభసో వృత్తిలక్షణమ్

సకల వస్తువులకూ ప్రాణులకూ అవకాశమిచ్చేది ఆకాశం. అన్ని లోకాలు, గోళాలు ఉన్నది ఆకాశములో. లోపలా వెలుపలా అను వ్యవహారమునకు మూలము ఆకాశం. గడప దాటితే ఇంటి వెలుపలా అంటాం. బయటా లోపలా అని దేన్ని బట్టి అంటున్నాం. పైన కప్పు ఉంటే దాన్ని లోపలా అంటాము, లేకపోతే దాని వెలుపలా అంటాము. ఈ "లోపలా" "వెలుపలా" అనే వ్యవహారానికి కూడా ఆకాశము మూలం.
ప్రాణానికి మూలం. హృదయాకాశం, దహరాకాశం. ఇంద్రియములు కూడా ఆకాశమే. కన్ను ముక్కు మొదైలైన రంధ్రాలు ఉన్నది కూడా ఆకాశములోనే.

నభసః శబ్దతన్మాత్రాత్కాలగత్యా వికుర్వతః
స్పర్శోऽభవత్తతో వాయుస్త్వక్స్పర్శస్య చ సఙ్గ్రహః

తన్మాత్రము నుండి భూతము పుడుతుంది. శబ్ద తన్మాత్ర నుండి పుట్టిన ఆకాశము నుండి పరమాత్మ సంకల్పముతో, ఆ ఆకాశము వికారము చెంది స్పర్శ తన్మాత్ర పుట్టింది. స్పర్శ తన్మాత్ర నుండి వాయువు పుట్టింది. స్పర్శను గ్రహించే ఇంద్రియం పేరు త్వగ్ ఇంద్రియం.

మృదుత్వం కఠినత్వం చ శైత్యముష్ణత్వమేవ చ
ఏతత్స్పర్శస్య స్పర్శత్వం తన్మాత్రత్వం నభస్వతః

మెత్తగా ఉంది, గట్టిగా ఉంది, చల్లగా ఉంది, వేడిగా ఉంది అని చెప్పగలిగేది స్పర్శ. ఇవి ముట్టుకుంటేనే తెలిసేది. ఈ నాల్గింటినీ గ్రహించేది త్వక్. స్పర్శ గుణం కలిగి ఉండుట వాయువు లక్షణం. వాయువంటే రూపము లేకుండా స్పర్శ మాత్రమే కలిగి ఉండేది వాయువు.

చాలనం వ్యూహనం ప్రాప్తిర్నేతృత్వం ద్రవ్యశబ్దయోః
సర్వేన్ద్రియాణామాత్మత్వం వాయోః కర్మాభిలక్షణమ్

ప్రతీ దాన్ని కదిలించడం గాలి యొక్క గుణం. దగ్గరగా ఉన్న దాన్ని విడదీసేదీ, దూరముగా ఉన్నవాటిని దగ్గరకు చేసేదీ వాయువు. ఈ రెండిటికీ కదలిక కావాలి. ద్రవ్యమునూ(గంధమును) శబ్దమునూ మన దగ్గరకు తీసుకుని వస్తుంది.
అన్ని ఇంద్రియములనూ ధరించేది వాయువు. మన ఇంద్రియాలు అన్నీ ఆకాశములోనే ఉన్నాయి. అవి కింద పడకుండా ఆపేది వాయువు. అలాగే అన్ని గోళాలు ఆకాశములో ఉన్నాయి కానీ కింద పడవు, అలాగే అవయవ రంధ్రాలలో ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియాలను ధరించేది వాయువు. చక్షురింద్రియం, ఘ్రానేంద్రియం వంటివి ఇంకో గోళం (అవయవము) లోకి వెళ్ళకుండా ఉండటానికి కారణం వాయువు.

వాయోశ్చ స్పర్శతన్మాత్రాద్రూపం దైవేరితాదభూత్
సముత్థితం తతస్తేజశ్చక్షూ రూపోపలమ్భనమ్

స్పర్శ తన్మాత్ర నుండి ఆవిర్భవించిన వాయువు నుండి ఆవిర్భవించినది రూప తన్మాత్రం. దాని నుండి అగ్ని పుడుతుంది. చక్షురింద్రియం ఈ రూపాన్ని గ్రహిస్తుంది. చక్షురింద్రియం సూర్యాధిష్టం. సుర్ర్యభగవానునిలో ఉన్నవాడు, అంతర్యామిగా ఉన్నవాడు, చక్షురింద్రియములో ఉన్నవాడూ ఒకడే. అందుకే భగవానుని ఆరాధించడానికి కనులు మూసుకున్నా తెరుచుకుని ఉన్నా కనపడతాడు భగవానుడు.

ద్రవ్యాకృతిత్వం గుణతా వ్యక్తిసంస్థాత్వమేవ చ
తేజస్త్వం తేజసః సాధ్వి రూపమాత్రస్య వృత్తయః


చక్షురింద్రియం రూపాన్ని గ్రహిస్తుంది. రూపం అంటే ప్రతీ ద్రవ్యానికి ఒక ఆకారం కలిగించేది. ఒక వస్తువు గురించి చెబుతున్న్నామంటే దాని ఆకారం బట్టే చెబుతాము. ద్రవ్యమునకు ఆకారాన్ని ఆపాదించేది రూపం.
గుణతా: అంటే ద్రవ్య ఆశ్రయత్వం. ఆధారము లేకుండా ఆధేయం ఉండదు. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది గుణం. గుణము ద్రవ్యము లేకుండా విడిగా ఉండదు. రూపం అంటే గుణం. గుణం అంటే ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉండేది.
ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తినుండి వేరు చేసేది రూపము.
రూపముకు ఈ మూడు గుణాలు ఉన్నాయి.
1. ద్రవ్యాన్ని ఆశ్రయించి ఉంటున్నది
2. ఒక ద్రవ్యానికి ఆకారాన్ని ఏర్పరుస్తున్నది
3. ఒక ద్రవ్యాన్ని ఇంకో ద్రవ్యమునించి వేరు చేసి చూపుతుంది.
దీన్నే తేజత్వం అంటాము. ఇవి రూపము యొక్క వ్యాపారము.

ద్యోతనం పచనం పానమదనం హిమమర్దనమ్
తేజసో వృత్తయస్త్వేతాః శోషణం క్షుత్తృడేవ చ

తేజస్సు చేసే పనులు
1. ద్యోతనం - ప్రకాశిస్తుంది
2. పచనం - ఉడికిస్తుంది
3. పానం - నీరు తాగిస్తుంది (దాహం రూపములో లోపల మండగానే నీరు గ్రహిస్తుంది)
4. అదనం - భోజనం (ఆకలికి కూడ అగ్నే కారణం. లోపల ఉన్న అగ్నికి ఈ రెండు రకాల ఆహారం ఇస్తున్న్నం)
5.  హిమ మర్దనం - మంచుని కరిగించేస్తుంది
6. శొషణం - తడిగా ఉన్నదానిని ఆరబెడుతుంది
7. క్షుత్తృడేవ - ఆకలి దప్పి పుడుతుంది.
పరమాత్మే మనము తిన్న దాన్నీ, తాగిన దానినీ, అగ్ని రూపములో ఉండి స్వీకరిస్తున్నాడు (అహం వైశ్వానరో భూతవా...)
జఠ్రాగ్ని బాగ పని చేయాలంటే శ్రమపడాలి. అప్పుడు తిన్నది బాగా జీర్ణమవుతుంది. పరిశ్రమ వలన అగ్నిలో వాయువులో శక్తి పెరుగుతుంది. మన పెరుగుదల, మనం తీసుకున్న ఆహారం అరుగుదల వలన. అరగాలంటే జఠరాగ్ని బాగా పని చేయాలి. శరీరములో ఏ ప్రదేశానికి ఎంత కావాలోన్ అంత పంపాలి. అలా పంపేది వాయువూ, అగ్ని. వాటి శక్తి తగ్గితే అవి పంపవు. అగ్ని పని చేయకపోతేనే మనకి ఆయా రోగాలు వస్తాయి. అందుకే పరమాత్మని ఆయా రూపాలలో మనం ఆరాధించాలి.

రూపమాత్రాద్వికుర్వాణాత్తేజసో దైవచోదితాత్
రసమాత్రమభూత్తస్మాదమ్భో జిహ్వా రసగ్రహః

రూప మాత్రముచే పుట్టిన తేజస్సు పొందిన వికారముతో రస తన్మాత్ర పుడుతుంది. దాని నుండి జలము పుడుతుంది. ఆ రసాన్ని గ్రహించేది జిహ్వ.

కషాయో మధురస్తిక్తః కట్వమ్ల ఇతి నైకధా
భౌతికానాం వికారేణ రస ఏకో విభిద్యతే

వాస్తవముగా రసము ఒక్కటే. పదార్ధాల కలయికతో భిన్నముగా మారుతుంది. రసస్ములు ఆరు 1. కషాయం 2. మధురం మొదలైన ఆరు రసములు

క్లేదనం పిణ్డనం తృప్తిః ప్రాణనాప్యాయనోన్దనమ్
తాపాపనోదో భూయస్త్వమమ్భసో వృత్తయస్త్విమాః

జలము చేసేది
క్లేదనం - తడుపుతుంది
పిణ్డనం - ముద్ద చేస్తుంది.
తృప్తిః  - తృప్తి అనేది నీటి వలనే కలుగుతుంది
ప్రాణనం - బ్రతికించేది, ప్రాణము నిలిచేది నీటితోటే (ఈ నీటినే అగ్ని తీసుకుని వాయువుగా మరుస్తుంది)
ఆప్యాయనం - ఆకలి దప్పి తీరేది నీటితోనే. ఆప్యాయనం అంటే సంతృప్తి చెందుట
ఔందనం - గట్టిగా ఉన్నదాన్ని మెత్తగా చేస్తుంది
తాపాపనోదః - వేడినీ, తాపాన్ని తొలగిస్తుంది
భూయస్త్వం - ఊరుట (బావి త్రవ్వితే నీరు ఊరుతూ ఉంటుంది. ఈ గుణం నీటికి మాత్రమే ఉంటుంది)

రసమాత్రాద్వికుర్వాణాదమ్భసో దైవచోదితాత్
గన్ధమాత్రమభూత్తస్మాత్పృథ్వీ ఘ్రాణస్తు గన్ధగః

జలము నుండి గంధ మాత్రం పుట్టింది. గంధ మాత్రము నుండి పృధివి పుట్టింది. దీన్ని గ్రహించేది ఘ్రాణం. గంధములు ఆరు రంగములు

కరమ్భపూతిసౌరభ్య శాన్తోగ్రామ్లాదిభిః పృథక్
ద్రవ్యావయవవైషమ్యాద్గన్ధ ఏకో విభిద్యతే

పూతి గంధం అంటే దుర్గంధం.
శాంతం - ప్రశాంతముగా ఉండేది
ఉగ్ర గంధం - ఉదా: ఉల్లి వంటివి తరిగితే వచ్చే గంధము వలన కళ్ళు నీరు కారతాయి
గ్రాంల - పులిస్తే వచ్చే గంధము
కరంభం - ఇది అన్ని గంధముల కలయిక
అన్నము రెండు రోజులు ఉంచితే అందులోకి వేరే ద్రవ్యాలు వచ్చి చేరతాయి. నిప్పూ నీరుతోనే అన్నం వండుతాము. ఆ వన్నం సాయంత్రానికి మెత్తబడుతుంది, మర్నాటికి నీరు వస్తుంది, తరువాత వాసన వస్తుంది, ఆ తరువాత సాయంత్రానికి పురుగులు వస్తాయి. ఏ ద్రవ్యం యొక్క పదార్ధములు ఏ ఏ సమయాలలో ఏ మోతాదులలో కలవాలో కలిస్తే పదార్థమవుతుంది.
ఉన్న గంధము ఒకటే గానీ, ఆయా ద్రవ్యముల అవయవాల వైషమ్యాలని బట్టి వేరుగా అనిపిస్తుంది. ఆశ్రయాన్ని బట్టి గంధం మారుతుంది గానీ, గంధము అన్నది ఒకటే.

భావనం బ్రహ్మణః స్థానం ధారణం సద్విశేషణమ్
సర్వసత్త్వగుణోద్భేదః పృథివీవృత్తిలక్షణమ్

భూమి చేసే పనులు
1. భావనం - ఆకారం ఏర్పడుట (కుండ మనం భూమితోనే చేస్తున్నాము. మట్టికి ఆయా ఆకారములుగా మారగల శక్తి ఉన్నది. వివిధ రూపములు పొందగలుగుట మట్టి యొక్క లక్షణం. బంగారము కూడా మట్టి యొక్క ఆకారమే. దానిలో తేజో గుణం ఎక్కువగా ఉంది, అంతే. మనకు కంటికి కనపడే ప్రతీ ఆకారం మట్టి). ఆకారం ఉంది అంటే మట్టి.
2. బ్రహ్మణః స్థానం - సకల చరా చర జగత్తు నిలవడానికి ఆధారం భూమి. స్వర్గములో కూడా భూమి ఉంది. స్వర్గములో కూడా ఇక్కడిలాగే వాయువూ, అగ్నీ, సూర్యుడు చంద్రుడు భూమి ఉంటాయి.
3. ధారణం - మనము ఏమి వేసిన ధరిస్తుంది.
4. సద్విశేషణం - పదార్ధాలలో సారమునీ రుచినీ మార్చేది భూమి. ఒక్కో ప్రాంతములో ఒక్కో పంట విశేషముగా పండుతుంది. అలాగే ఒక ప్రాంతములో పండినవి, ఇంకో ప్రాంతములో పండిన దాని కన్నా రుచిగా ఉంటుంది. అన్ని చోట్లా పండినా, కొన్ని చోట్ల పండిన ధ్యానం రుచి బాగా ఉంటుంది. ఎంత మంచి భూమి అయినా, విత్తనం బాగా లేకుంటే పండదు. ఎంత మంచి విత్తనమైనా చౌటు భూమిలో పండదు. మంచి విత్తనము కూడా మంచి భూమిలో పెరిగినదే. దేశ భేదాన్ని బట్టి సారవంతములూ నిస్సారవంతములూ అవుతాయి.
సర్వసత్త్వగుణోద్భేదః - మట్టి ప్రాణుల ఆకారాన్ని కూడా మారుస్తుంది. ఒక ప్రాంతములో ఉన్న వారికి కళ్ళు చిన్నగా ఉంటాయి, కొన్ని ప్రాంతాలలో తెల్లగా, కొన్ని ప్రాంతాలలో నల్లగా ఉంటారు. అంటే స్వరూపానీ, రుచినీ, ఆకారాన్ని మార్చేది భూమి. స్వభావాన్ని మార్చేది కూడా భూమే. దేవాలయానికి వెళితే ప్రశాంతముగా ఉంటుంది. వ్యగ్రమైన ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనసు వ్యగ్రముగా ఉంటుంది. హిమాలయాలలో ఉన్న జంతువులకి జుట్టు ఎక్కువ ఉంటుంది.

ప్రతీ ప్రాణి యొక్క గుణములో మార్పు తెచ్చేది భూమి.

నభోగుణవిశేషోऽర్థో యస్య తచ్ఛ్రోత్రముచ్యతే
వాయోర్గుణవిశేషోऽర్థో యస్య తత్స్పర్శనం విదుః
తేజోగుణవిశేషోऽర్థో యస్య తచ్చక్షురుచ్యతే
అమ్భోగుణవిశేషోऽర్థో యస్య తద్రసనం విదుః
భూమేర్గుణవిశేషోऽర్థో యస్య స ఘ్రాణ ఉచ్యతే

ఆకాశ గుణమైన శబ్దము దేని చేత గ్రహించబడుతుందో అది శ్రోత్రం
వాయువు యొక్క స్పర్శను గ్రహించేది త్వక్ ఇంద్రియం
తేజో గుణమైన రూపాన్ని గ్రహించేది చక్షువు
జల గుణమైన రసాన్ని గ్రహించేది జిహ్వ, ఆ ఇంద్రియం రసనం.
భూమి యొక్క గుణమైన గంధమును గ్రహించేది ఘ్రాణము

ఆకాశము - శబ్దము - శ్రొత్రము
వాయువు - స్పర్శ - త్వక్
అగ్ని - రూపము - చక్షు
జలము - రసము - రసనేంద్రియం
భూమి - గంధము - ఘ్రాణము

పరస్య దృశ్యతే ధర్మో హ్యపరస్మిన్సమన్వయాత్
అతో విశేషో భావానాం భూమావేవోపలక్ష్యతే

ఎప్పటికైనా కారణ ధర్మం కార్యములో ఉంటుంది. ఉదా. ఆకాశములో శబ్దమే ఉంది. ఆకాశము నుండి వాయువు పుట్టింది. వాయువుకు ఆకాశం కారణం. వాయువు యొక్క గుణం స్పర్శ. తన గుణమైన స్పర్శతో బాటు, ఆకాశం యొక్క గుణమైన శబ్దము కూడా ఉంటుంది.
వాయువు నుంచి పుట్టిన అగ్ని గుణం రూపం. అయినా, అగ్నిలో రూపమూ స్పర్శ శబ్దమూ ఉంటాయి. అలాగే జలములో రసమూ, రూపమూ, స్పర్శ, శబ్దమూ ఉంటాయి. భూమిలో అయిదు గుణాలూ ఉంటాయి.

కార్యము యందు కారణ ధర్మం ఉంటుంది. అలా ఉంటుంది అని ఒప్పుకోకుంటే భూమిలో అయిదు గుణాలు ఉండటానికి అవకాశము దొరకదు. భూమిలో శబ్ద స్పర్శ రూప రస గంధములు ఉన్నాయి. అందుకే అన్ని విశేష గుణాలూ భూమి యందు కనపడుతున్నాయి.

ఏతాన్యసంహత్య యదా మహదాదీని సప్త వై
కాలకర్మగుణోపేతో జగదాదిరుపావిశత్

ఇలా ఉన్న ఏడూ (మహత్తు అహంకారమూ పంచభూతాలు) సృష్టించబడి ఉన్నా ఒక ఆకారం ఏర్పడలేకపోయాయి. ఇంద్రియాలు, భూతాలు, వాటి గుణాలు, తన్మాత్రలు, అన్ని విడి విడిగా ఉన్నాయి. వీటిలో కొన్ని గ్రాహ్యములూ, ఇంకోటి గ్రాహకములూ. ఇంద్రియములు గ్రాహ్యములూ, గుణాలు గ్రాహకములు. తమలో తాము ఒకటై తమలో ఉన్న వాటిని గ్రహించి, "ఇది బాగుంది, ఇది బాగా లేదు" అని చెప్పడమే భోగము. అన్ని భోగాలకు మూలము శరీరము.
అప్పుడు పరమాత్మ వీటన్నిటిలో ప్రవేశించాడు. ఒంటిగా ప్రవేశించకుండా, కాల కర్మ గుణములతో ప్రవేశించాడు. కర్మ అంటే మనము చేసుకున్న కర్మ, అదృష్టం. గుణము అంటే సత్వ రజో తమో గుణాలు.
బ్రహ్మాండములో ఉన్న అనంతకోటి జీవరాశులకూ ఆకారం చేయాలి. అందరినీ ఒకే ఆకారము చేయలేదు.   దేవతలూ మానవులూ రాక్షసులూ పక్షులూ మొదలైన జీవాలు ఉన్నాయి. అన్ని ఇంద్రియాలు కలిపి ఒక ఆకారం చేయాలంటే ఒకే ఆకారం ఉండాలి. మరి, ఇంద్రియాలు ఒకటే ఐతే ఇన్ని ఆకారాలు ఎందుకు ఉన్నాయి. వాటి వాటి కర్మకనుగుణముగా, వాటిని అనుభవించడానికి అనువైన ఆకారముండాలి. అదే భోగాయతనం.
కాలమూ కర్మా అనే వాటి వలన ఇన్ని జీవులు ఉద్భవిస్తున్నాయి. ఏ ప్రాణికి ఏ పాపాన్ని ఏ ప్రాణికి ఏ పుణ్యాన్ని సరఫరా చేయాలో అలా చేస్తాడు. పరమాత్మ పరమాత్మగా రాలేదు, కాల కర్మములతో కలిసి ప్రవేశించాడు. ఇది వరకి జన్మలో వారు ఆచరించిన కరమానుసారముగా భోగము అనుభవించడానికి తగిన ఆకారము ఇస్తాడు.
కర్మ అంటే అదృష్టము. గుణము అంటే సత్వం రజస్సు తమస్సు. వారి వారి పాప పుణ్యాలకు ఏ ఏ గుణాలు ఉండాలో ఆ గుణాలకు తగిన శరీరాన్ని

తతస్తేనానువిద్ధేభ్యో యుక్తేభ్యోऽణ్డమచేతనమ్
ఉత్థితం పురుషో యస్మాదుదతిష్ఠదసౌ విరాట్

తాను ప్రవేశించిన పదార్ధాలన్ని కలిపితే ప్రాణములేని గుడ్డు ఏర్పడింది. అందులోకి పరమాత్మ ప్రవేశించాడు. బయటినుంచి అందులోకి వెళ్ళి, అందులోంచి బయటకు వచ్చాడు. అందుకే బ్రహ్మకు విరాట్ పురుషుడు. విరాట్ - అంటే విశేషేణ రాజతే.

ఏతదణ్డం విశేషాఖ్యం క్రమవృద్ధైర్దశోత్తరైః
తోయాదిభిః పరివృతం ప్రధానేనావృతైర్బహిః
యత్ర లోకవితానోऽయం రూపం భగవతో హరేః

దీనినే విశేషమైన అండము అంటాము. బ్రహ్మాండానికి ఏడు పొరలు ఉన్నాయి. పృధ్వి అప్ తేజో వాయు ఆకాశము,  అహంకారము, మహత్తు. ఒక ఆవరణ కంటే రెండో ఆవరణ పది రెట్లు ఎక్కువ. పృధువి కన్నా నీరు పది రెట్లు ఎక్కువ. భూమి యాభై కోట్ల విస్తీర్ణం. నీటికన్నా వాయువు పది రెట్లు ఎక్కువ.
ఈ బ్రహ్మాండానికి ఈ ఏడు ఆవరణలూ దాటాక కూడా ఇంకో ఆవరణ ఉన్నది. అదే ప్రధానం (ప్రకృతి).
సకల లోకాల విస్తారణం బ్రహ్మ యొక్క రూపమే. నీటిలో ఉన్న హిరణ్మయ రూపమైన బ్రహ్మాండ కోశములోంచి స్వామి బయటకు వచ్చాడు.

హిరణ్మయాదణ్డకోశాదుత్థాయ సలిలే శయాత్
తమావిశ్య మహాదేవో బహుధా నిర్బిభేద ఖమ్

బయటకు వచ్చి అందులో ఉన్న వాటిని భేధించాడు. అంటే సమష్టి సృష్టి నుంచి వ్యష్టి సృష్టి ఏర్పడుతుంది. అందులో ఉన్న ఒక్కొక్క ఇంద్రియాన్ని భేధించి తీసి సకల ప్రాణి కోటికీ అమరుస్తాడు పరమాత్మ. పరమాత్మ చతుర్ముఖ బ్రహ్మలో ఆవేశించాడు.

నిరభిద్యతాస్య ప్రథమం ముఖం వాణీ తతోऽభవత్
వాణ్యా వహ్నిరథో నాసే ప్రాణోతో ఘ్రాణ ఏతయోః

పరమాత్మ మొదలు బ్రహ్మ యొక్క ముఖమునూ (నోటిని), అందులో ఇంద్రియాన్ని (రసనము, వాక్కు అనే రెండు ఇంద్రియాలు) ఏర్పరచాడు. వాక్కు అనే ఇంద్రియానికి అధిష్ఠాన దేవత అగ్నిహోత్రుడు.  నాసికలో ఉండే ఇంద్రియాన్ని ఘ్రాణేంద్రియము అంటాము. దీనికి అధిష్ఠాన దేవత వాయువు.

ఘ్రాణాద్వాయురభిద్యేతామక్షిణీ చక్షురేతయోః
తస్మాత్సూర్యో న్యభిద్యేతాం కర్ణౌ శ్రోత్రం తతో దిశః

కళ్ళలో ఉండేధి చక్షురింద్రియం. సూర్యుడు అధిష్ఠాన దేవత. తరువాత కర్ణములకు శ్రోత్ర ఇంద్రియము, దిక్కులు అధిష్ఠాన దేవత

నిర్బిభేద విరాజస్త్వగ్ రోమశ్మశ్ర్వాదయస్తతః
తత ఓషధయశ్చాసన్శిశ్నం నిర్బిభిదే తతః

చర్మము (త్వగ్ ఇంద్రియము), రోమములూ కేశములకు అధిష్ఠాన దేవత ఔషధులు.

రేతస్తస్మాదాప ఆసన్నిరభిద్యత వై గుదమ్
గుదాదపానోऽపానాచ్చ మృత్యుర్లోకభయఙ్కరః

ఉపస్థకు, దాని నుండి వచ్చే రేతస్సుకు అధిష్ఠాన దేవత జలము. మలవిసర్జనావయవాన్ని గుదం, ఇంద్రియం పేరు అపానం. దీనికి అధిష్ఠాన దేవత లోకభయంకర దేవతైన మృత్యువు.

హస్తౌ చ నిరభిద్యేతాం బలం తాభ్యాం తతః స్వరాట్
పాదౌ చ నిరభిద్యేతాం గతిస్తాభ్యాం తతో హరిః

హస్తములకు పాణి ఇంద్రియం. వీటి స్వరూపం బలం. వీటికి అధిష్ఠాన దేవత ఇంద్రుడు.  పాదములకు గతి గుణము. వీటికి అధిష్ఠాన దేవత విష్ణువు.

నాడ్యోऽస్య నిరభిద్యన్త తాభ్యో లోహితమాభృతమ్
నద్యస్తతః సమభవన్నుదరం నిరభిద్యత

నడములకు ఇంద్రియం రక్తమూ, అధిష్ఠాన దేవత నదులు. నదులు సక్రమముగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అందుకే నదీ స్నానం చేసే వారు. నదులు రక్తమునకు అధిష్ఠాన దేవత. మనలో రక్తం ప్రవహిస్తూ ఉన్నట్లే, భూగోళములో కూడా నదులు ప్రవహిస్తూ ఉంటాయి.

క్షుత్పిపాసే తతః స్యాతాం సముద్రస్త్వేతయోరభూత్
అథాస్య హృదయం భిన్నం హృదయాన్మన ఉత్థితమ్

కడుపు లో కలిగేవి క్షుత్ పిపాస అనే వికారాలు కలవు. ఉదరానికి సముద్రం అధిష్ఠాన దేవత. తరువాత హృదయం పుడుతుంది. హృదయం నుండి మనసు. మనసుకి అధిష్ఠానం మనసు.

మనసశ్చన్ద్రమా జాతో బుద్ధిర్బుద్ధేర్గిరాం పతిః
అహఙ్కారస్తతో రుద్రశ్చిత్తం చైత్యస్తతోऽభవత్

మనసు కూడా చంద్రునిలాగ వికారాత్మకం. అదే హృదయం నుంచి బుద్ధి పుట్టింది. ఈ బుద్ధికి అధిపతి బ్రహ్మ. ఈ హృదయం నుండే అహంకారం పుట్టింది. దీనికి అధిపతి రుద్రుడు. అదే హృదయం నుండే చిత్తం పుట్టింది. చైత్యుడు (క్షేత్రగ్న్యుడు, లేదా జీవుడు) చిత్తములో ఉంటాడు.

ఏతే హ్యభ్యుత్థితా దేవా నైవాస్యోత్థాపనేऽశకన్
పునరావివిశుః ఖాని తముత్థాపయితుం క్రమాత్

ఇంతమంది అధిష్ఠాన దేవతలూ ఇంద్రియములూ వాటి కర్మలూ ఉన్నా, ఇవన్నీ నివృత్తి కర్మలో ఉన్న జీవుడిని పర్వర్తింపచేయలేకపోయాయి. మళ్ళీ ఇంద్రియాధిష్ఠాన దేవతలౌ కదిలించడానికి ప్రయత్నించాయి.

వహ్నిర్వాచా ముఖం భేజే నోదతిష్ఠత్తదా విరాట్
ఘ్రాణేన నాసికే వాయుర్నోదతిష్ఠత్తదా విరాట్
అక్షిణీ చక్షుషాదిత్యో నోదతిష్ఠత్తదా విరాట్
శ్రోత్రేణ కర్ణౌ చ దిశో నోదతిష్ఠత్తదా విరాట్
త్వచం రోమభిరోషధ్యో నోదతిష్ఠత్తదా విరాట్
రేతసా శిశ్నమాపస్తు నోదతిష్ఠత్తదా విరాట్
గుదం మృత్యురపానేన నోదతిష్ఠత్తదా విరాట్
హస్తావిన్ద్రో బలేనైవ నోదతిష్ఠత్తదా విరాట్
విష్ణుర్గత్యైవ చరణౌ నోదతిష్ఠత్తదా విరాట్
నాడీర్నద్యో లోహితేన నోదతిష్ఠత్తదా విరాట్
క్షుత్తృడ్భ్యాముదరం సిన్ధుర్నోదతిష్ఠత్తదా విరాట్
హృదయం మనసా చన్ద్రో నోదతిష్ఠత్తదా విరాట్
బుద్ధ్యా బ్రహ్మాపి హృదయం నోదతిష్ఠత్తదా విరాట్
రుద్రోऽభిమత్యా హృదయం నోదతిష్ఠత్తదా విరాట్

అగ్నిహోత్రుడు వాగీంద్రియము ద్వారా ముఖములోకి ప్రవేశించాడు. అయినా ఆ విరాట్ పురుషుడు లేవలేదు. వాయువు ఘ్రాణేంద్రియము ద్వారా నాసికలోకీ, సూర్యుడు చక్షురింద్రియము ద్వారా నేత్రాలలోకి, దిక్కులు శ్రోత్రేంద్రియము ద్వారా కర్ణములోకీ, ఔషధులు రోమాల ద్వారా త్వక్ ఇంద్రియములోనికీ, జలము రేతస్సుతో ఉపస్త ఇంద్రియములోకీ, మృత్యువు అపానము ద్వారా పాయువులోకీ, విష్ణువు గమనముతో పాదములోనికీ, ఇంద్రుడు బలముతో చేతులలోకీ, నదులు రక్తముతో నాడులలోకీ, సముద్రము ఆకలి దప్పులతో ఉదరాన్ని ప్రవేశించింది, చంద్రుడు మనసుతో హృదయముతో చేరాడు, బ్రహ్మ బుద్ధితో హృదయములోకి చేరాడు, రుద్రుడు అహంకారముతో హృదయములో చేరాడు,

చిత్తేన హృదయం చైత్యః క్షేత్రజ్ఞః ప్రావిశద్యదా
విరాట్తదైవ పురుషః సలిలాదుదతిష్ఠత

ఇవన్నీ చేసినా ఎటువంటి స్పందనా లేదు.  జీవత్మ చిత్తముతో హృదయములో ప్రవేశించగానే అంతవరకూ నీటిలో ఉన్న ఈ స్వామి (సమష్టి పురుషుడు), చైతన్యం ప్రవేశించగానే లేచాడు

యథా ప్రసుప్తం పురుషం ప్రాణేన్ద్రియమనోధియః
ప్రభవన్తి వినా యేన నోత్థాపయితుమోజసా

జీవుడు లేదా క్షేత్రజ్ఞ్యుడు, అతని ప్రవృత్తి లేకుంటే, నిద్రపోయిన వాడిని ప్రాణములూ ఇంద్రియములూ మనస్సూ బుద్ధి లేపగలవా (ప్రవృత్తి అభిముఖుడిగా చేయగలవా)? జీవుడు అభిముఖుడుగా ఉన్నప్పుడే ఇవన్నీ ఉన్నట్లు.

తమస్మిన్ప్రత్యగాత్మానం ధియా యోగప్రవృత్తయా
భక్త్యా విరక్త్యా జ్ఞానేన వివిచ్యాత్మని చిన్తయేత్

ఇదంతా ప్రత్యగాత్మ అధీనం (జీవాత్మ) , జీవుడు ప్రవర్తిస్తేనే, జీవుడిలో చైతన్యం ఉన్ముఖమైతేనే పని చేస్తాయి. అందుకే "నేను చేస్తున్న్నా" అనే భావన సరికాదు. మనలో ఆ చైతన్యాన్ని కలిగించిన వాడు పరమాత్మ. పరమాత్మ ప్రవేశించిన ఈ శరీరములో క్రియాశీలమైన నాడే మన అవయవాలు మన ఇంద్రియములూ మన అధిష్ఠాన దేవతలు పని చేస్తున్నాయి.
ఈ సమష్టి పురుషునిలో వున్న వ్యష్టి పురుషుడిగా పేరు గాంచిన ప్రత్యగాత్మను యోగ బుద్ధితో తెలుసుకోవాలి. మనసు బుద్ధి చిత్తమూ అహంకారముతో కలిసి "వాస్త్వముగా ఈ సముదాయాన్ని పని చేయిస్తున్నది ప్రత్యగాత్మ, ఆ ప్రత్యగాత్మకు అలాంటి సంకల్పం కలిగించిన వాడు పరమాత్మ".

జీవాత్మ, పరమాత్మ, శరీరం, ఇంద్రియములు, అవయవములూ, అధిష్ఠాన దేవతలూ అంటే ఏమిటో, ఈ సమగ్ర స్వరూపాన్ని యధార్థ జ్ఞ్యానముతో తెలుసుకొంటే, ప్రతీ పనికీ ఆరంభం ఎక్కడో తెలుసుకోవడాన్ని జ్ఞ్యానం అంటారు. అలాంటి జ్ఞ్యానం పొంది "ఎవరి సంకల్పముతో ఇవన్నీ పని చేస్తాయో, అలాంటి వాడి సంకల్పము లేకుంటే ఇవన్నీ నిష్క్రియలైనప్పుడు, ఇవన్నీ నాకెందుకూ" అని కలగడం విరక్తి. మొదట జ్ఞ్యానం, తరువాత విరక్తీ, కలిగిన తరువాతం ఇలాంటి పరమాత్మ మీద భక్తి కలుగుతుంది.
జ్ఞ్యానముతో స్పష్టముగా విడదీసి వివేకముతో తెలుసుకుని, పరమాత్మ యందు భక్తి, ప్రపంచము యందు విరక్తినీ పెంచుకొని, ఆ స్వామిని భక్తితో ధ్యానం చేయాలి. అలా చేయడం వలన అహంకారం పెరగదు.
శరీరమే ఆత్మ అన్న భ్రమ తొలగిపోతుంది. ప్రతీ చిన్న పని ఎలా జరిగిందో తెలిసిన నాడు (ఇంద్రియములంటే ఏమిటి, అధిష్ఠాన దేవతలంటే ఏమిటీ ఇవాన్నీ తెలిస్తే) నేనే పనీ చెయటం లేదు అని తెలుస్తుంది. ఇవన్నీ చేయిస్తున్న పరమాత్మను మన చిత్తములో ధ్యానం చేస్తాము. అప్పుడు అర్థమవుతుంది మనకి గుడికి వెళ్ళే బుద్ధి పుట్టింది అంటే పరమాత్మకు ఆ సంకల్పం కలిగింది అని అర్థం. ఇది బాగా అవగాహనమైతే అదే వివేకం. ఇలాంటి వివేకముతో పరమాత్మను ఈ ఆత్మలో బుద్ధితో ధ్యానం చేస్తే, అహంకార మమకారములు తొలగుతాయి. మనసు ఏకాగ్రమవుతుంది, బుద్ధి స్థిరమవుతుంది, చిత్తం నిశ్చంచలమవుతుంది.

Monday, January 28, 2013

భాగవతం నుండి తెలుసుకోవలసిన విషయాలు - 8

1. గజేంద్ర మోక్షం రుక్మిణీ కళ్యాణం ప్రహ్లాద చరిత్ర, నారాయణ కవచం, కపిల దేవహూతి సంవాదం, ఈ ఐదు నిత్య పారాయణ చేసుకోవాలి.

2. అవిహితము, అనిషిద్ధము నిషిద్ధము: వేదమూ శాస్త్రమూ వేటిని చేయమని చెప్పదో అవి అవిహితములు. ధర్మం చరా సత్యం వదా అని కాకుండా, వేటిని విధించలేదో అవి అవిహితములు. వేటిని నిషేధించలేదో అవి అనిషిద్ధములు. వేటిని నిషేధించారో అవి నిషేధములు. ఇంచుమించు మూడూ నిషేధములు. నకళంజం భక్షయే. కానీ కొన్ని తినమనీ చెప్పలేదూ, తినవద్దనీ చెప్పలేదు. ఈ మూటిలో ఏది చేసినా పాపమే. మనసు యొక్క స్థిరత్వం ఆహారం బట్టి వస్తుంది. జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్. జాతి దుష్టం, ఆశ్రయ దుష్టం నిమిత్త దుష్టం. ఉల్లిగడ్డ లాంటివి, మాన్సం లాంటివి జాతి దుష్టం. శ్మశానములో పండినది ఆశ్రయ దుష్టం. ఒక వేళ ఇంటిలో చేసినా దానిలో వెంట్రుకపడితే అది నిమిత్త దుష్టం. ఈ మూడూ కానీ ఆహారముతో కాయ శుద్ధి. శరీరము శుద్ధికానంతవరకూ మనసు శుద్ధి పొందదు. ఈ శరీరములో రజస్సు తమస్సు గుణాలను పెంచే ఆహారములని సేవిస్తే, మంచివారికైన చేడు ఆలోచనలు వస్తాయి.

3. ప్రసాదములో రుచి చూసేవాడు వచ్చే జన్మలో బల్లిగా పుడతాడని భాగవతం పాద్మం భారతం చెబుతాయి

4. 1. ప్రకృతి గుణాలని సేవించకుండా ఉండటం 2. వైరాగ్యము నిండిన జ్ఞ్యానము కలిగి ఉండాలి 3. భక్తి కూడా నాకే అర్పించాలి ( అంటే భక్తి కూడా కృష్ణార్పణం) . భగవంతుడు మాత్రమే ఉపాయము. మనము చేసేవన్నీ భగవంతుడు మాత్రమే ఉపాయం అని తెలుసుకోవడానికి పనికొస్తాయి. ఇవి చేస్తే ఆ జీవాత్మ హృదయములో ఉండి అక్కడే ఉంటాను

5. అనిమిత్తా భాగవతీ భక్తిః సిద్ధేర్గరీయసీ
పరమాత్మ యందు ఉండే అనిమిత్తమైన (కారణము లేని, ప్రయోజనాన్ని ఆశించని భక్తి) భక్తి మోక్షము కన్నా గొప్పది.

6. యదృచ్చ అంటే భగవత్సంకల్పం అని అర్థం. వాల్మీకి రామాయణములో కూడా ఈ యదృచ్చ అనే పదం ఆరు  సార్లు కనపడుతుంది. అది ఎక్కడ ఉంటే, అక్కడ దైవానుగ్రహం వలన జరిగింది అని అర్థం.

7. పాత్ర శుద్ధిలాగ నాలిక శుద్ధి పొందాలంటే గురువుగారిని స్తోత్రం చేయాలి. మనము ఏ పని మొదలుపెట్టేముందు గురువుగారిని స్మరించాలి.

8.
విశ్వమిత్రాహి పశుషు కర్దమేషు జలేశుచ |
అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ ||

వి - పక్షి
శ్వా - కుక్క
అమిత్ర - శత్రువు
అహి - పాములు
పశుషు - పశువుల్ని కట్టడానికి
కర్దమేషు - బురద
జలేషు - నీటిలో
అంధ - గ్రుడ్డివాడైన
తమసి - చీకటిలో
వార్ధక్యే- ముసలితనం 

తా | దండం అంటే కర్ర దాన్ని పక్షుల్ని, కుక్కలని, శత్రువులని, పాముల్ని, పశువుల్ని అవసరమైతే కొట్టడానికి. బురద లో నీటిలో ఆసరా కోసం మరియు గ్రుడ్డి వాడికి, చీకటిలో నడిచేవారికి ముసలి వారికి కర్ర అవసరం. ఇవి కర్ర యొక్క పది అవసరాలు.

9. పిల్లి చూసిన వస్తువుని భగవదారాధనకు ఉపయోగించకూడదు. అలా అని చెప్పి పిల్లిని తరిమివేయకూడదు. దానికి అది పెట్టి, మనం వేరే వస్తువుని ఉపయోగించాలి 

10. గర్భములో ఉన్న కాలాన్ని జ్యోతీషములో లెక్కలోకి తీసుకోరు. గర్భవాసములో ఉన్న జీవుని జాతకం తల్లి బట్టి ఉంటుంది. భూ స్పర్శ జీవునికి అయ్యాకనే జాతకం చూస్తారు 

అరణ్యానికి వెళ్ళిన కర్దముడు చేసిన పనులు

అరణ్యానికి వెళ్ళిన కర్దముడు చేసిన పనులు

అరణ్యమునకు వెళ్ళి మౌన వ్రతాన్ని ఆచరించాడు (జితం సర్వం జితే రసే - నాలుకకు రెండు పనులు ఉన్నాయి. మౌన వ్రతం, రోజులో ఎప్పుడు ఎక్కువ మాట్లాడతామో ఆ సమయాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. మౌనం రెండు రకాలు వాచా మౌనం, హృదా మౌనం. వాక్కును నియమించినపుడు మనసును కూడా నియమించాలి.  ). పరమాత్మని మాత్రమే రక్షకునిగా భావించాడు.  మౌనం ఆశ్రయించాడు కాబట్టి ముని అయ్యాడు. ఇంద్రియార్థములయందు ఎ మాత్రం ఆసక్తి లేని వాడు. గార్హపత్యాగ్ని(నిత్యాగ్ని హోత్రాన్ని తనలో ఆవాహన చేసుకుని సన్యాసం స్వీకరించాడు), అనికేతన (ఇల్లు కూడా లేని వాడయ్యాడు). అన్ని మమకారాలకు మూలమైనది గృహం. ( అందుకే ధర్మ శాస్త్రం "ఇల్లు ఇల్లు కాదు - అసలైన ఇల్లు ఇల్లాలే అని చెబుతుంది)

తన మనసుని పరమాత్మ యందు లగ్నం చేసాడు. పరమాత్మ సత్అసత్ రెండూ అయిన్ పరమాత్మ యందు లగ్నం చేసి . గుణావభాసములైన (గుణాలలా అనిపించే) శబ్ద స్పర్శ రూప రస గంధములు వంటి గుణాలు లేని వాడు, కళ్యాణ గుణములు గలవాడైన పరమాత్మ, భక్తితో మాత్రమే ధ్యానించడానికి దొరికేవాడు అయిన పరమాత్మ యందు మనసు లగ్నం చేసాడు


నిరహంకారం ( దేహాత్మాభిమానం లేక) , మమకారం (ఆత్మగా భావించే దేహం కొరకు, దేహం వలన వచ్చిన వారి యందు ఉండేది. అవిద్య అనే మహా వృక్షం నుండి సంసారానికి రెండు బీజాలు పుట్టాయి. తనది కాని దాన్ని తనది అనుకోవాడు, తాను కాని దానిని తాను అనుకోవడం),  శీతోష్ణ సుఖదుఖాలను సమముగా చూచేవాడు (అందుకే వేసవిలో పంచాగ్నుల మధ్యా, వర్షాకాలములో పైకప్పులేని ఆకాశములో ఉండి, చలికాలములో చల్ల నీటిలో ఉండి తపస్సు చేయాలి) , సకల ప్రాణులనూ సమానముగా చూసేవాడు (ప్రతీ జీవికి, వారు వారు ఆయా జన్మలలో చేసుకున్న పాప పుణ్య కర్మల వలన వచ్చిన శరీరాలే. పరమాత్మ ప్రసాదమే ఈ శరీరాలన్నీ. పరమాత్మ అన్నింటిలోనూ ఉన్నాడు. ) ,  స్వదృక్ - అంతటా తనను చూచేవాడు, తనలో అందరినీ చూచేవాడు. ప్రపంచములో పరమాత్మనీ, పరమాత్మలో ప్రపంచాన్ని చూచుట స్వదృక్. ప్రత్యక్ - జీవాత్మ. ఎలాంటి ఒడిదుడుకులూ లేని జీవాత్మ.

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం - కపిల గీత ప్రారంభం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై ఐదవ అధ్యాయం - కపిల గీత ప్రారంభం

శౌనక ఉవాచ
కపిలస్తత్త్వసఙ్ఖ్యాతా భగవానాత్మమాయయా
జాతః స్వయమజః సాక్షాదాత్మప్రజ్ఞప్తయే నృణామ్

భగవానుడైన కపిలుడు జన్మలేని వాడై ఉండి తన సంకల్పముతో పుట్టి తత్వములను నిరూపించాడు. మానవులకు ఆత్మ బోధ చేయడానికి ఏ పుట్టుకా లేని పరమాత్మ తన సంకల్పముతో పుట్టాడు

న హ్యస్య వర్ష్మణః పుంసాం వరిమ్ణః సర్వయోగినామ్
విశ్రుతౌ శ్రుతదేవస్య భూరి తృప్యన్తి మేऽసవః

వర్షంఅ - ఉత్తముడు, ఈయన పురుషోత్తముడు, యోగులలో శ్రేష్టుడు, పురుషులలో ఉత్తముడు, ఇలాంటి పరమాత్మ జన్మ కర్మ చరితములు వింటూ ఉంటే నా మనో ఇంద్రియములకు తృప్తి కలుగుటలేదు.

యద్యద్విధత్తే భగవాన్స్వచ్ఛన్దాత్మాత్మమాయయా
తాని మే శ్రద్దధానస్య కీర్తన్యాన్యనుకీర్తయ

ఇతను స్వచ్చందాత్మ (ఇక్కడ ఆత్మ అంటే శరీరం), ఈయన దేహం సంకల్పాధీనం (మన దేహం కర్మాధీనం), తన సంకల్పముతో ఏ ఏ పనులు చేస్తున్నాడో, అలాంటి కీర్తించదగిన పరమాత్మ చరిత్రను వివరించు.

సూత ఉవాచ
ద్వైపాయనసఖస్త్వేవం మైత్రేయో భగవాంస్తథా
ప్రాహేదం విదురం ప్రీత ఆన్వీక్షిక్యాం ప్రచోదితః

శౌంకౌడు సూతున్ని అడిగితే, సూతుడు విదుర మైత్రేయ సంవాదాన్ని మళ్ళి చెప్పాడు.
భగవానుడైన మైత్రేయుడిని విదురుడు పరమతత్వాన్ని చెప్పమని ప్రేరేపిస్తే ఇలా చెప్పాడు

మైత్రేయ ఉవాచ
పితరి ప్రస్థితేऽరణ్యం మాతుః ప్రియచికీర్షయా
తస్మిన్బిన్దుసరేऽవాత్సీద్భగవాన్కపిలః కిల

కర్దముడు తన అనుమతితో అరణ్యానికి వెళ్ళగా, తల్లికి ప్రీతి కలుగచేయ దలచి, బిందు సరస్సు వద్దనే నివసించాడు

తమాసీనమకర్మాణం తత్త్వమార్గాగ్రదర్శనమ్
స్వసుతం దేవహూత్యాహ ధాతుః సంస్మరతీ వచః

దేవహూతి, ఆశ్రమములో కూర్చుని ఉన్నా, ఏ కర్మ ఫలమునూ ఆశించకుండా ఉన్న,  తత్వ సమూహం తెలిసిన వాడైన కొడుకుని దేవహూతి అడిగింది. కపిలుడిని పుత్రునిగా పొందనపుడే, బ్రహ్మ వచ్చి "నీ గర్భములో ఉండి అవతరించబోతున్న పరమాత్మ నీకు తత్వము చెప్పి బంధము తొలగిస్తాడు"అని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. ఆ వాక్యాన్ని స్మరించి కపిలుడిని ప్రశించింది

దేవహూతిరువాచ
నిర్విణ్ణా నితరాం భూమన్నసదిన్ద్రియతర్షణాత్
యేన సమ్భావ్యమానేన ప్రపన్నాన్ధం తమః ప్రభో

అంతటా వ్యాపించి ఉండే మహానుభావా, నేను పూర్తిగా చింతా క్రాంతనయి ఉన్నాను, బాధలో ఉన్నాను, చెడు ఇంద్రియములను తృప్తి కలిగించేట్లు ప్రవర్తించుట వలన నేను బాధలకు గురవుతున్నాను (మనిషి పుట్టినప్పటి నుండీ మరణించే వరకూ ఇంద్రియ తృప్తి కోసమే ప్రయత్నిస్తాడు. అవి మంచిగానే ఉంటాయి అన్న నియమం లేదు. శాస్త్ర నిషేద విషయాన్ని అనుభవించడానికే ఇంద్రియాలు ముందుకొస్తాయి. మన మనో బుద్ధి ఇంద్రియాలు పక్కదారి పట్టడానికే ప్రేరేపించబడతాయి.  )
ఇలాంటి ఇంద్రియాలను తృప్తి పరచడములో నా మనసు పరమ అజ్ఞ్యానాన్ని పొందింది. నేను అజ్ఞ్యానమనే చీకటిని పొంది ఉన్నాను

తస్య త్వం తమసోऽన్ధస్య దుష్పారస్యాద్య పారగమ్
సచ్చక్షుర్జన్మనామన్తే లబ్ధం మే త్వదనుగ్రహాత్

నాకు నేనుగా ఈ అజ్ఞ్యానాన్ని దాటలేను. అది దాటి తీరమును చేర్చే నిన్ను పొందాను. ఎన్నో జన్మల తరువాత ఇంత కాలానికి ఒక చక్కని నేత్రం దొరికింది. (చూడవలసిన దాన్ని చూపితే మంచి కన్ను, చూడకూడని దన్ని చూపితే చెడ్డ కన్ను). ఇన్ని జన్మల తరువాత చక్కని నేత్రం లభించింది. నా గొప్పదనముతో కాదు. నీ అనుగ్రహం వలన. ఈ నేత్రము నీవే. నీవే ప్రసాదించావు.

య ఆద్యో భగవాన్పుంసామీశ్వరో వై భవాన్కిల
లోకస్య తమసాన్ధస్య చక్షుః సూర్య ఇవోదితః

లోకములో ఉన్న అన్ని బ్రహ్మాండములలో ఈశ్వరుడూ (ఐశ్వర్య కలవాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం అంటే లోపల ఉండి శాసించే వాడు. ఎక్కడ లోపాలు ఉన్నాయో తెలుసుకోగలగాలి, తెలుసుకుని వాటిని తొలగించగలగాలి. ఈ రెండూ చేయగలవాడు ఈశ్వరుడు.) భగవంతుడూ ఆది పురుషుడూ నీవే కదా. అజ్ఞ్యానమనే చీకటిలో ఉన్న ఈ లోకానికి కన్ను వంటి వాడివి. సూర్యుడు ఎలా ఐతే లోకానికి వెలుగో అలాగే నీవు కూడా ఈ లోకానికి వెలుగు. (సూర్య చంద్రాగ్ని నేత్రవాన్ అని పరమాత్మకి పేరు. ఈ మూడు కళ్ళతో పరమాత్మ చూస్తాడు )

అథ మే దేవ సమ్మోహమపాక్రష్టుం త్వమర్హసి
యోऽవగ్రహోऽహం మమేతీత్యేతస్మిన్యోజితస్త్వయా

నాలో ఉన్న సమోహాన్ని ( చక్కని  మోహాన్ని) తొలగించాలి. వర్షం రాకుండా ఆపే పాపాన్ని అవగ్రహం అంటారు. అలాగే నేనూ నాది అనే అవగ్రహాన్ని నీవు పోగొట్టాలి . ఎందుకంటే ఇది నువ్వేర్పరచినదే కదా.

తం త్వా గతాహం శరణం శరణ్యం స్వభృత్యసంసారతరోః కుఠారమ్
జిజ్ఞాసయాహం ప్రకృతేః పూరుషస్య నమామి సద్ధర్మవిదాం వరిష్ఠమ్

అన్ని  లోకాలకు రక్షకుడవైన నిన్ను శరణు వేడుతున్నాను. భక్తుల యొక్క సంసారమనే వృక్షాన్ని కూలగొట్టడానికి గొడ్డలి వంటి వాడవు. ప్రకృతి యొక్క పురుషుడి యొక్క తత్వం తెలుసుకోవాలని, సద్ధరం తెలుసుకోవాలి.

మైత్రేయ ఉవాచ
ఇతి స్వమాతుర్నిరవద్యమీప్సితం నిశమ్య పుంసామపవర్గవర్ధనమ్
ధియాభినన్ద్యాత్మవతాం సతాం గతిర్బభాష ఈషత్స్మితశోభితాననః

ఇలా కల్మషం లేని (నిరవద్యం) తల్లి కోరికను విన్నాడు. మోక్ష జ్ఞ్యానాన్ని పెంచే ఆ కోరిక విని అభినందించి కొద్దిగా చిరునవ్వుతో (ఈషత్స్మిత) ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
యోగ ఆధ్యాత్మికః పుంసాం మతో నిఃశ్రేయసాయ మే
అత్యన్తోపరతిర్యత్ర దుఃఖస్య చ సుఖస్య చ

శరీరము కన్నా భిన్నమైన ఆత్మ ఒకటి ఉన్నది అని తెలుసుకోవడం జ్ఞ్యాన యోగం. ప్రతీ జీవికి ఉపయోగించేది ఇదే. జ్ఞ్యాన యోగం మాత్రమే జీవునికి మోక్షం రావడానికి ఉపయోగిస్తుందని నా సిద్ధాంతం. ఇలాంటి జ్ఞ్యాన యోగాన్ని అభ్యసిస్తే కలిగే లాభం, దుఖఃఅమూ సుఖమూ ఉండదు. సుఖాభిలాష దు@ఖాభిలాషా రెండూ ఉండవు.

తమిమం తే ప్రవక్ష్యామి యమవోచం పురానఘే
ఋషీణాం శ్రోతుకామానాం యోగం సర్వాఙ్గనైపుణమ్

దీన్నే జ్ఞ్యాన యోగమని అంటారు. నేను ఇది వరకే ఈ జ్ఞ్యాన యోగాన్ని, వినాలని ఋషులందరూ అడిగితే వారికి బోధించాను. సర్వాఙ్గనైపుణమ్ - సావయవం (అవిహితము, అనిషిద్ధము నిషిద్ధము: వేదమూ శాస్త్రమూ వేటిని చేయమని చెప్పదో అవి అవిహితములు. ధర్మం చరా సత్యం వదా అని కాకుండా, వేటిని విధించలేదో అవి అవిహితములు. వేటిని నిషేధించలేదో అవి అనిషిద్ధములు. వేటిని నిషేధించారో అవి నిషేధములు. ఇంచుమించు మూడూ నిషేధములు. నకళంజం భక్షయే. కానీ కొన్ని తినమనీ చెప్పలేదూ, తినవద్దనీ చెప్పలేదు. ఈ మూటిలో ఏది చేసినా పాపమే. మనసు యొక్క స్థిరత్వం ఆహారం బట్టి వస్తుంది. జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్. జాతి దుష్టం, ఆశ్రయ దుష్టం నిమిత్త దుష్టం. ఉల్లిగడ్డ లాంటివి, మాన్సం లాంటివి జాతి దుష్టం. శ్మశానములో పండినది ఆశ్రయ దుష్టం. ఒక వేళ ఇంటిలో చేసినా దానిలో వెంట్రుకపడితే అది నిమిత్త దుష్టం. ఈ మూడూ కానీ ఆహారముతో కాయ శుద్ధి. శరీరము శుద్ధికానంతవరకూ మనసు శుద్ధి పొందదు. ఈ శరీరములో రజస్సు తమస్సు గుణాలను పెంచే ఆహారములని సేవిస్తే, మంచివారికైన చేడు ఆలోచనలు వస్తాయి. కాయ శుద్ధిని బట్టి మనశ్శుద్ధి. మనశ్శుద్ధి బట్టే ఆత్మ పవిత్రత. జ్ఞ్యాన కర్మ భక్తి యోగములతో నిండి ఉన్న యోగాన్ని చెబుతాను

చేతః ఖల్వస్య బన్ధాయ ముక్తయే చాత్మనో మతమ్
గుణేషు సక్తం బన్ధాయ రతం వా పుంసి ముక్తయే

మోక్షం రావాలన్నా నరకము రావాలన్నా, మనసే కారణము. గుణములయందు ఆసక్తమయిన మనసు నరకాన్నిస్తుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాల యందు లగ్నమయిన మనసు సన్సారాన్ని (నరకాన్ని) ఇస్తుంది. పరమాత్మ యందు ఆసక్తమైతే ముక్తినిస్తుంది. మనసు మురికి లేనిది కావాలి. అరిషడ్వర్గాలనే ఆరు మలాలు మనసుకు ఉన్నాయి. మరి మనసు మొదటి నుండీ మురికేనా? మనసు సహజముగా మంచిదే. దానికి ఇద్దరు శత్రువులు ఉన్నారు

అహం మమాభిమానోత్థైః కామలోభాదిభిర్మలైః
వీతం యదా మనః శుద్ధమదుఃఖమసుఖం సమమ్

అహంకారం మమకారమనే ఇద్దరు శత్రువులు మనసుకు ఉన్నారు. ఆత్మ కానిదానిని ఆత్మ అనుకొనుట, నాది కాని దాన్ని నాది అనుకొనుట. ఈ రెండు అభిమానములతో ఎర్పడిన కామ లోభములనే కల్మషములు ఎపుడైతే మనసు తొలగి ఉంటుందో, అప్పుడు మనసు  శుద్ధం. అలా ఉన్న మనసుని ఎలా గుర్తించాలి? సంతోషాన్ని కలిగించే సంఘటనలను కలిగినపుడు ఆనందించకుండా, బాధ కలిగే సంఘటనలు కలిగితే దుఃఖించకుండా ఉన్నవాడు. పూర్వ జన్మలో శరీరాన్నే ఆత్మ అనుకొని, శరీరం కోసం పొందే సుఖదుఖాలన్ని ఆత్మవనుకుని చేసిన కర్మల వలన కలిగిన అభిమానానికి శిక్షగా ఈ దేహాన్ని ఇచ్చాడు. ఆత్మకు శుద్ధి కలగాలంటే దేహం పోవాలి. పోవాలంటే అది ఇచ్చినవాడే తొలగించాలి. అంత వరకూ వేచి ఉండాలి. పరమాత్మ సంకల్పం కోసం మనం ఎదురుచూడాలి. ఎపుడైతే దుఖాన్ని సుఖాన్ని సమముగా మనసు చూస్తుదో అప్పుడు మనసు శుద్ధమైనదని తెలుసుకో

తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరమ్
నిరన్తరం స్వయంజ్యోతిరణిమానమఖణ్డితమ్

మనసు పరిశుద్ధమైతే కలిగే లాభం ఏమిటి? పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యాన వైరాగ్యాలు లభిస్తాయి. దేన్ని జ్ఞ్యానమంటాం? ప్రకృతి వివిక్త ఆత్మ పరిజ్ఞ్యానం. శరీరము వేరు ఆత్మ వేరు అని తెలుసుకోవడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ ఈ శరీరములో ఉన్నాడు అన్నది జ్ఞ్యానం. ప్రకృతి కంటే వేరుగా ఉన్న పురుషున్ని చూడగలగడం. పరమాత్మ అంతర్యామిగా ఉన్న జీవాత్మ, జీవాత్మ అంతర్యామిగా ఉన్న ప్రకృతి. ప్రకృతి పురుషులు పరమాత్మ విధేయులు.
ఇది తెలుసుకున్న వాడికి వెంటనే కలిగేది వైరాగ్యం. ఆత్మ స్వరూపం తెలిసిన వాడికి విషయముల మీద వైరాగ్యం కలుగుతుంది. ఈ రెండూ కలిగితే భక్తి కలుగుతుంది.

జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియుక్తేన చాత్మనా
పరిపశ్యత్యుదాసీనం ప్రకృతిం చ హతౌజసమ్

జ్ఞ్యాన యోగం వైరాగ్యాన్ని, ఆ వైరాగ్యం పరమాత్మ మీద భక్తినీ కలిగిస్తుంది. వైరాగ్యానికి భక్తికీ సంబంధం ఏమిటి? వైరాగ్యం అంటే ప్రకృతి మీద కోరిక లేకుండుట. మనసుకు ఏదో ఒక ఆలంబనం ఉండాలి. ప్రకృతి మీద విరక్తి కలగడం వలన ప్రకృతి మీద నుంచి పరమాత్మ వైపుకు మళ్ళుతుంది మనసు. దాన్నే భక్తి అంటాము. పరిశుద్ధమైన మనసుకు జ్ఞ్యానమూ వైరాగ్యమూ భక్తీ కలుగుతాయి. ఈ మూడు కలిగితే,  పరమాత్మను సాక్షాత్కరించుకోగలుగుతాడు. (పై శ్లోకం: తదా పురుష ఆత్మానం కేవలం ప్రకృతేః పరమ్ , నిరన్తరం స్వయంజ్యోతిరణిమానమఖణ్డితమ్)ఆయన కేవలుడు ( దేనితోనూ సంబంధము లేని వాడు, సుఖ దుఖములూ ప్రకృతీ అంటని వాడు). ప్రతీ వానిలో అంతర్యామిగా ఉన్న పరమాత్మకు వీరిలో ఉన్న మురికి అంటుతుందా? బురదలో సూర్యుని ప్రతిబింబం కనపడితే ఆయన ప్రతిబింబానికి మురికి అంటుతుందా? అలాగే మనలో కూడా పరమాత్మ అంశ ఉంది. ఆయన ఎప్పుడు "నాది" అనుకోడు. ఆయన అంతరము లేని వాడు. సంబంధం లేని వాడు, అన్ని సంబంధములూ కలవాడు.  ఆయన ప్రకృతిలో ఉంటాడు, ప్రకృతికంటే వేరుగా ఉంటాడు. నిరంతరుడు. ఆయన స్వయం జ్యోతిః. సంబంధం ఉన్నవారెవరూ స్వయం ప్రకాశకుడు కాలేరు. ఆయన స్వయం జ్యోతి. అణిమా: అతి సూక్షమైన వాడు. ఆవు తోకకున్న వెంట్రుక చివర ఉన్న దానిలో వెయ్యో వంతు ఉంటాడు జీవాత్మ. పరమాత్మ ఆ జీవాత్మలో ఉంటాడు. కాబట్టి ఆయన అన్నిటికన్నా సూక్ష్మం. మరి ఆయన తనను తాను ఖండించుకొని అణువుగా అయ్యాడా అంటే? ఆయన అఖండితం.

పరమాత్మ ఇంత గొప్పవాడైనా ఆయన ఉదాసీనుడు. ఏదీ కావాలనుకోడూ, ఏది వద్దనుకోడు. అన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు. సంబంధములేకుండా. "నా స్వరూపం బాగా తెలుసుకున్న వాడి కర్మలచే బద్ధుడు కాలేడు. ". కోరిక లేకుండా ఆచరించిన ఏ కర్మ బంధించదు. "నేను చేస్తున్న పని యొక్క ఫలితం నాకు రావట్లేదని తెలియుటే".

ఎపుడైతే ఇలాంటి పరమాత్మ స్వరూపం తెలుసుకుంటామో అప్పుడు ప్రకృతి తన ప్రభావాన్ని కలిగించదు. ప్రకృతి తన మాయా వ్యాపారాన్ని సంకోచిమప్చేస్తుంది. జ్ఞ్యాన వైరాగ్య భక్తులు కలిగిన వాడికి పరమాత్మ స్వస్వరూప జ్ఞ్యానం కలుగుతుంది.  అది కలిగిన వాడిని ప్రకృతి మోహించలేదు. ఇదంతా కలగాలంటే ఎన్ని పనులు చేసినా ఫలితాన్ని ఆశించకుండా ఉండుటే. అలా చేయుట వలన తెలుసుకున్న పరమాత్మ స్వరూపానికి కైంకర్యం చేయుటే జీవుని స్వరూపం. "నాలో పరమాత్మ అంతర్యామిగా ఉండి తనకోసం తన పనులను నా చేత చేయించుకుంటున్నాడు. నేను చేసే ప్రతీ పనీ ఆయన కోసమే. "

న యుజ్యమానయా భక్త్యా భగవత్యఖిలాత్మని
సదృశోऽస్తి శివః పన్థా యోగినాం బ్రహ్మసిద్ధయే

యోగులు పరమాత్మను పొందడానికి ఉత్తమ సాధన భక్తి. అఖిలాత్మ అయిన పరమాత్మ యందు కూర్చబడిన భక్తి  కన్నా వేరే మార్గం లేదు.

ప్రసఙ్గమజరం పాశమాత్మనః కవయో విదుః
స ఏవ సాధుషు కృతో మోక్షద్వారమపావృతమ్

దుర్మార్గల యందు సంబంధము పెంచుకోవడమే పెంచబడిన పాశమని పండితులు చెబుతున్నారు. ఇదే సంబంధాన్ని సజ్జనులయందు పెట్టుకుంటే అదే మోక్షాన్ని ఇస్తుంది. పైన చెప్పినవేమీ లేకపోయినా అవి ఉన్న వారిని పట్టుకుంటే సులభముగా మోక్షం వస్తుంది. మోక్ష ద్వారం తెరిచి ఉంటుంది (మోక్షద్వారం అపావృతమ్). మనసు ఒక దాని మీద లగ్నమయ్యే ఉంటుంది. ఏ విషయములతో తగులుకోకుండా మనసు ఉండలేదు. దానినే సంగం అంటారు. అందుకే సంగాన్ని విడిచిపెట్టాలనుకున్నా విడిచిపెట్టలేము. అందుకే సత్సంగము చేయమని చెబుతుంది శాస్త్రం. సజ్జనులయందు సద్విషయముల యందు మనసు లగ్నం చేస్తే మోక్ష ద్వారం తెరుచుకుంటుంది.

తితిక్షవః కారుణికాః సుహృదః సర్వదేహినామ్
అజాతశత్రవః శాన్తాః సాధవః సాధుభూషణాః

తితిక్షవః - ఓర్పు, క్షమ. ఎదుటివారి దుఃఖాలను చూచి సహించలేకపోవుట కరుణ అంటాము. శత్రువు లేని వారు, అనతరింద్రియ నిగ్రహం కలిగిన వారు సాధువులు, సజ్జనులందరికీ అలంకారము.

మయ్యనన్యేన భావేన భక్తిం కుర్వన్తి యే దృఢామ్
మత్కృతే త్యక్తకర్మాణస్త్యక్తస్వజనబాన్ధవాః

కొంతమంది నా కొరకు వారి పనులన్నీ మానుకుంటారు. నా కోసం తన వారినీ బంధువులనీ వదిలిపెట్టాలి (లక్ష్మణుడు ప్రహ్లాదుడూ దృవుడూ వృత్తాసురుడూ పుండరీకుడు భీష్ముడూ లాగ)

మదాశ్రయాః కథా మృష్టాః శృణ్వన్తి కథయన్తి చ
తపన్తి వివిధాస్తాపా నైతాన్మద్గతచేతసః

నాకు సంబంధించిన కథలను చెబుతూ వింటూ కాలం గడుపుతారు. చెబితే వింటారు. వింటే చెబుతారు. వీరిని అధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలు తపింపచేయవు.

త ఏతే సాధవః సాధ్వి సర్వసఙ్గవివర్జితాః
సఙ్గస్తేష్వథ తే ప్రార్థ్యః సఙ్గదోషహరా హి తే

ఇలాంటి వారు సాధువులు. అన్ని రకముల సంగతినీ విడిచిపెడతారు. అలాంటి వారి విషయములో నీ మనసు సంగతి పొందాలని ప్రార్థించు. భగావంతుని మనం అడగాల్సినది ఇదొక్కటే. దుష్ట సంగం వలన కలిగిన పాపాన్ని ఈ సత్సంగం తొలగిస్తుంది

సతాం ప్రసఙ్గాన్మమ వీర్యసంవిదో భవన్తి హృత్కర్ణరసాయనాః కథాః
తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధా రతిర్భక్తిరనుక్రమిష్యతి

వారు చెప్పే నా కథలు మీ ప్రయత్నం చేయకుండానే మీ కర్ణ రంధ్రం నుండి లోపలకి వెళ్ళి అక్కడ ఉన్న దోషాన్ని పోగొడతాయి. ఇలా వారు చెప్పే కథలను వినడం వలన మోక్ష మార్గం తెలుసుకోవాలని శ్రద్ధ కలుగుతుంది. వారి యందు ప్రీతి కలుగుతుంది, నాయందు (పరమాత్మ యందు) భక్తి కలుగుతుంది. శ్రద్ధ కథల మీద, రతి చెప్పేవారి మీద, భక్తి పరమాత్మ మీద కలుగుతుంది.

భక్త్యా పుమాన్జాతవిరాగ ఐన్ద్రియాద్దృష్టశ్రుతాన్మద్రచనానుచిన్తయా
చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే ఋజుభిర్యోగమార్గైః

నాయందు కలిగిన భక్తితో జీవుడు వైరాగ్యాన్ని పొందుతాడు. ఇంద్రియములకు సంబంధించిన విషయాలయందు, చూచినా విన్నా ఆసక్తి కలుగదు. వాడి మనసు ఎప్పుడూ నా కథలను గూర్చి చింతిస్తూ ఉంటాడు. నిరంతరం నా కథలనే చెబుతూ వింటూ ఉండే వాడు సాంసారిక భోగములయందు విరక్తి కలిగి ఉంటాడు. అతను యోగములో ఉండి మనస్సును స్వాధీనములో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది జరిగితే వారికి చక్కటి దారి దొరుకుతుంది. దానితో నన్ను సాక్షాత్కరింపచేసుకోవడానికీ, మనసుని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తాడు

అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్యవిజృమ్భితేన
యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మానమిహావరున్ధే

పరమాత్మ యందు మనసు లగ్నం చేసిన వారు పొరబాటున కూడా ప్రకృతి గుణాలను సేవించడానికి ప్రయత్నించకూడదు. ప్రకృతి గుణములని సేవించకుండుట వలన, బాగా పెరిగిన వైరాగ్యం వలన, నాయందు అర్పించిన యోగముతో, నిరంతరమూ నాయందు భక్తితో, అందరికీ (అన్ని ఆత్మలకూ) ఆత్మగా ఉన్న నన్ను తన దగ్గరనుండి బయటకు పోకుండా ఉంచుకుంటాడు. నన్ను ఇక్కడే నిర్భందిస్తాడు. అలా చేయడానికి 1. ప్రకృతి గుణాలని సేవించకుండా ఉండటం 2. వైరాగ్యము నిండిన జ్ఞ్యానము కలిగి ఉండాలి 3. భక్తి కూడా నాకే అర్పించాలి ( అంటే భక్తి కూడా కృష్ణార్పణం) . భగవంతుడు మాత్రమే ఉపాయము. మనము చేసేవన్నీ భగవంతుడు మాత్రమే ఉపాయం అని తెలుసుకోవడానికి పనికొస్తాయి. ఇవి చేస్తే ఆ జీవాత్మ హృదయములో ఉండి అక్కడే ఉంటాను

దేవహూతిరువాచ
కాచిత్త్వయ్యుచితా భక్తిః కీదృశీ మమ గోచరా
యయా పదం తే నిర్వాణమఞ్జసాన్వాశ్నవా అహమ్

నీయందు చేయవలసిన భక్తి ఎలాగ ఉండాలి? నవ విధ భక్తులలో ఏది నిన్ను చేరుస్తుంది. నీ విషయముకో ఎలాంటి భక్తి చేయాలి. దేనితో నేను నిన్ను చేరుతానో అది చెప్పు. నాకు ఎలాంటిది అర్థమవుతుందో అది చెప్పు. దేని వలనైతే బాధపడుతున్న నేను నిన్ను చేరగలనో అది చెప్పు

యో యోగో భగవద్బాణో నిర్వాణాత్మంస్త్వయోదితః
కీదృశః కతి చాఙ్గాని యతస్తత్త్వావబోధనమ్

ఆనందస్వరూపా, భగవంతుని చేర్చగల సాధనముగా ఉండే యోగమేదో చెప్పు. నీవు చెప్పిన యోగము ఎలాంటిది, దానికి ఎన్ని అంగాలు ఉన్నాయి.

తదేతన్మే విజానీహి యథాహం మన్దధీర్హరే
సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోషా భవదనుగ్రహాత్

మందురాలినైన నాకు ఉన్నవాటన్నిటిలో ఏది నిన్ను చేరుస్తుందో అది చెప్పు. తెలియశక్యం కానివి కూడా సులభముగా చెప్పు. నేను స్త్రీని.

మైత్రేయ ఉవాచ
విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతస్నేహో యత్ర తన్వాభిజాతః
తత్త్వామ్నాయం యత్ప్రవదన్తి సాఙ్ఖ్యం ప్రోవాచ వై భక్తివితానయోగమ్

కపిల మహర్షి, తల్లి మనసులో ఉన్న దాన్ని తెలుసుకున్నాడు. ఏ శరీరము నుండి పుట్టాడో, ఆ శరీరం ఉన్న ఆమె యందు ప్రేమ పుట్టింది. ఇప్పటిదాకా భక్తిని చెప్పాడు. ఏ యోగముతో భక్తి వ్యాప్తి (వితానం) చెబుతుందో ఆ యోగమైన సాంఖ్య యోగాన్ని చెప్పాడు. పేరుకు సాంఖ్య (జ్ఞ్యాన) యోగమైనా, పరమాత్మ చివరకు భక్తిలోకే తీసుకు వస్తాడు. దీన్ని పెద్దలు సాంఖ్యం అంటారు. ఇది భక్తిని విస్తరించే యోగం.

శ్రీభగవానువాచ
దేవానాం గుణలిఙ్గానామానుశ్రవికకర్మణామ్
సత్త్వ ఏవైకమనసో వృత్తిః స్వాభావికీ తు యా

మనం ఏ పొరపాటు చేయడానికైనా కారణం మనస్సే. మనసు అలా చేయడానికి కారణం ఇంద్రియాలు. ఇంద్రియములే మనసును లాగుకొని పోతాయి. మనసే ఇంద్రియమును ప్రవర్తింపచేస్తుంది. ఒక దానిని చూస్తేనే దాని యందు రుచి పుడుతుంది. దానిని చూడమని చెప్పేది మనసు.
గుణలిఙ్గానామానుశ్రవికకర్మణామ్- గుణములకు లింగములు (చిహ్నములు) జ్ఞ్యానేంద్రియములు. ఆనుశ్రవికకర్మణామ్ - అంటే కర్మేంద్రియములు (కర్మలు అనుక్షణం చేయడానికి ఉపకరించేవి) . ఫలానా చోటికి వెళ్ళాలి అన్న సంకల్పం మనసు చేస్తుంది. మనసు చెబితే కాళ్ళు వెడతాయి. ఫలానా విషయం చూడాలి అని మనసు సంకల్పిస్తే, మనసు చెప్పిన రూపాన్ని జ్ఞ్యానేంద్రియం వెళ్ళి చూడటానికి ప్రయత్నిస్తే, దాని మీద కోరిక పుడితే, దాని దగ్గరకు వెళ్ళాలి అన్న ప్రయత్నం జరుగుతుంది. అందుకు మొట్టమొదట జ్ఞ్యానేంద్రియము, తరువాత కర్మేంద్రియము. వీటికి ప్రేరకం మనసు.

మన ప్రవృత్తికీ, నివృత్తికీ మూలం మన మనస్సు. ఆ మనసు కూడా తనకు తానుగా ఏ పనీ చేయలేదు. ఉదా: మనసే వెళ్ళి చూడలేదు, మనసే ఎక్కడికీ వెళ్ళలేదు. మనసులో జరిగే సంకల్ప వికల్పాలకే ఇంద్రియాలు అని పేరు. (బృహదారకములో "మనసుకే పనిని బట్టి పేరు మారుతుంది, చూడాలనుకున్నప్పుడు చక్షురింద్రియం అవుతుంది." అని). మనస్సే ఏ పనీ చేయలేదు. కంటికి కనపడితే, కనపడిన కంటి వెంట తాను ఉండి చూస్తే, అది నచ్చితే "బాగుందీ మళ్ళీ చూడు " అంటుంది.

ఇది అర్థం చేసుకుంటే ఇంద్రియ నిగ్రహం ఎందుకో తెలుస్తుంది. మనసే కోరుతుంది భావిస్తుంది. కానీ ఇంద్రియ సహకారము లేకుండా అది చేయలేదు. మనసుకి అందించేది ఇంద్రియములు (కర్మేంద్రియాలు జ్ఞ్యానేంద్రియాలు)

మనసుని అదుపులో ఉంచుకోవాలంటే ముందుగా ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. అందుకు ప్రధానమైనది కర్మేంద్రియ జ్ఞ్యానేంద్రియములు.

రాజస తాపస ప్రవృత్తులను వదిలిపెట్టి సాత్విక ప్రవృత్తిని ఇందిర్యాలకు అంటిస్తే, ఆ ఇంద్రియాలు అదే భావాన్ని మనసుకు అంటిస్తాయి. మనసునూ జ్ఞ్యాన కర్మేంద్రియాలను సత్వము యందు ఉంచు. ఇలా ఈ మూడిటినీ పరమాత్మ యందు లగ్నం చేసి, సాంసారిక ప్రవృత్తిని మానేస్తే, పరమాత్మ మన వశం అవుతాడు. అలా కావడాన్ని, పరమాత్మ యందు ఉండే అనిమిత్తమైన (కారణము లేని, ప్రయోజనాన్ని ఆశించని భక్తి) భక్తి.

అనిమిత్తా భాగవతీ భక్తిః సిద్ధేర్గరీయసీ
జరయత్యాశు యా కోశం నిగీర్ణమనలో యథా

ఇలాంటి భక్తి మోక్షము కన్నా గొప్పది. ఇలాంటి భక్తి మనకు ఉన్న హృదయ గ్రంధిని చేధింపచేస్తుంది, కాలుస్తుంది. పనికి రాని వస్తువులను అగ్ని ఎలా కాల్చి పారేస్తుందో పరమాత్మ యందు భక్తి అన్ని పాపాలను ధ్వన్సం చేస్తుంది.

నైకాత్మతాం మే స్పృహయన్తి కేచిన్మత్పాదసేవాభిరతా మదీహాః
యేऽన్యోన్యతో భాగవతాః ప్రసజ్య సభాజయన్తే మమ పౌరుషాణి

నిరంతరం నా పాదములనే సేవించాలని కోరుకున్న వారు నాతో ఐక్యం కావాలని కూడా కోరుకోరు. నన్ను మాత్రమే కోరేవారు మోక్షాన్ని కూడా కోరరు. తనలాంటి వారితో కూర్చుని నా కథలు చెప్పుకుంటారు. పరమ భాగవతులు ఒకరితో ఒకరు కలిసి నా ప్రతాప చిహ్నములైన అవతరాల లీలను చెప్పుకుంటారు.

పశ్యన్తి తే మే రుచిరాణ్యమ్బ సన్తః ప్రసన్నవక్త్రారుణలోచనాని
రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదన్తి

అమ్మా! నా సౌందర్యమైన దివ్య మంగళ విగ్రహాన్ని వారు చూస్తారు చక్కని ముఖారవిందం, ఎర్రని నేత్రాలు, దివ్యమైనటువంటివి (ప్రకృతి సంబంధమూ కాల సంబంధమూ లేనిది. కాలముతో వికారం ఏర్పడుతుంది) , వరములిచ్చేటువంటివి,  నా రూపాలనూ చూస్తారు, నా వాక్కును (వేద మంత్రాన్ని) పఠనం చేస్తారు. నేనే వెళితే ఆరాధిస్తారు. వారు అన్య ప్రసంగాలు చేయరు.

తైర్దర్శనీయావయవైరుదార విలాసహాసేక్షితవామసూక్తైః
హృతాత్మనో హృతప్రాణాంశ్చ భక్తిరనిచ్ఛతో మే గతిమణ్వీం ప్రయుఙ్క్తే

ఇలా సుందరమైన దివ్య మంగళ విగ్రహం, విలాసముతో కూడిన చూపులు, తీయని మాటలు, మనసు హరించబడి, పైప్రాణం పైనే పోతుంది అనిపించేవారు  నేను ఇవ్వాలనుకునే మోక్షాన్ని కూడా వారు కోరరు.

అథో విభూతిం మమ మాయావినస్తామైశ్వర్యమష్టాఙ్గమనుప్రవృత్తమ్
శ్రియం భాగవతీం వాస్పృహయన్తి భద్రాం పరస్య మే తేऽశ్నువతే తు లోకే

ఇలాంటి యోగముతోటీ ధ్యానముతోటీ భావముతోటీ నన్ను మాత్రమే చేరి , కొలిచి స్తుతించి, ఇంతకన్నా వేరే విషయాలను చూడకుండా ఉన్నప్పుడు, ఇంతటి పరమభక్తునికి కోరకున్నా అష్ట సిద్ధులూ వస్తాయి. అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం. అప్రయత్నముగా వచ్చినా ఈ అష్ట సిద్ధులని కూడా నా భక్తులు కోరరు. భగవత్భక్తులు కోరే మంగళకరమైన సంపద (కైవల్యం) కూడా వారు కోరరు.

న కర్హిచిన్మత్పరాః శాన్తరూపే నఙ్క్ష్యన్తి నో మేऽనిమిషో లేఢి హేతిః
యేషామహం ప్రియ ఆత్మా సుతశ్చ సఖా గురుః సుహృదో దైవమిష్టమ్

నేనిచ్చేవాటిని గానీ, లోకములో లభించే ప్రాకృతికమైన భోగములు కోరని వారికి నాశము లేదు. కర్మ ప్రకృతి సంసారము అనే తీక్షణమైన ఆయుధాలు. ఈ పదునైన ఆయుధాలను వారు (సామాన్యజనులలాగ) నాలికతో స్పృశించరు.  నేను వారికి ప్రియున్ని, ఆత్మను, పుత్రున్ని, మిత్రున్ని, గురువునీ సుహృత్, ఇష్ట దైవాన్ని

ఇమం లోకం తథైవాముమాత్మానముభయాయినమ్
ఆత్మానమను యే చేహ యే రాయః పశవో గృహాః
విసృజ్య సర్వానన్యాంశ్చ మామేవం విశ్వతోముఖమ్
భజన్త్యనన్యయా భక్త్యా తాన్మృత్యోరతిపారయే

ఈ  లోకమూ పరలోకమూ, ఈ శరీరం వెంట లభించే పశువులు భార్య పిల్లలూ సంపదలూ అన్నిటినీ విడిచిపెట్టి, అంతటా వ్యాపించి ఉన్న నన్ను అనన్యమైన భక్తితో సేవిస్తారు.
అటువంటి వారిని నేనే దగ్గరుండి సంసారాన్ని దాటిస్తాను.

నాన్యత్ర మద్భగవతః ప్రధానపురుషేశ్వరాత్
ఆత్మనః సర్వభూతానాం భయం తీవ్రం నివర్తతే

సంసారం వలనా,  ప్రకృతి వలనా,  విషయభోగముల వలన సుఖేచ్చల వలన కలిగే భయమూ సంతాపమూ, నన్ను తప్ప మిగతా దేనిని సేవించినా తొలగదూ. అన్ని ప్రాణులకూ ప్రకృతి వలన సహజముగా కలిగే భయము నా వలననే పోతుంది. భయము కలిగించే వాడినీ నేనే. భయము తొలగించే వాడినీ నేనే. అందరూ నా వలననే భయపడతారు. నన్ను స్మరించే భయాన్ని పోగొట్టుకుంటారు

మద్భయాద్వాతి వాతోऽయం సూర్యస్తపతి మద్భయాత్
వర్షతీన్ద్రో దహత్యగ్నిర్మృత్యుశ్చరతి మద్భయాత్

నాకు భయపడే సూర్యుడూ, ఇంద్రుడు అగ్ని మృత్యువూ వారి వారి పనులు చేస్తున్నారు.

జ్ఞానవైరాగ్యయుక్తేన భక్తియోగేన యోగినః
క్షేమాయ పాదమూలం మే ప్రవిశన్త్యకుతోభయమ్

బుద్ధిమంతులైన వారూ, జ్ఞ్యానమున్న వారూ, వైరాగ్యం ఉన్నవారూ, వాటితో కూడిన భక్తి ఉన్న యోగులూ, తాము బాగుండాలంటే నా పాద మూలాన్ని ఆశ్రయిస్తారు.

ఏతావానేవ లోకేऽస్మిన్పుంసాం నిఃశ్రేయసోదయః
తీవ్రేణ భక్తియోగేన మనో మయ్యర్పితం స్థిరమ్

ఈ ప్రపంచములో నిజమైన సర్వోత్తమమైన శ్రేయస్సు కలిగేది తీవ్రమైన (అనన్యమైన ) భక్తి యోగముతో నాయందు మనసు నిలుపుటే. 

Sunday, January 27, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై నాలుగవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
నిర్వేదవాదినీమేవం మనోర్దుహితరం మునిః
దయాలుః శాలినీమాహ శుక్లాభివ్యాహృతం స్మరన్

నిర్వేదాన్ని పొందిన, బాధపడుతున్న దేవహూతిని చూచి జాలిపడి, పరమాత్మ మాట్లాడిన దాన్ని గుర్తు చేసుకుని, స్మరించుకుని, ఇలా అన్నాడు

ఋషిరువాచ
మా ఖిదో రాజపుత్రీత్థమాత్మానం ప్రత్యనిన్దితే
భగవాంస్తేऽక్షరో గర్భమదూరాత్సమ్ప్రపత్స్యతే

రాజపుత్రీ, నీవు ఉత్తమురాలవు, నీవు అలా బాధపడకూడదు. కొడుకు కావలనుకున్న నీకు త్వరలోనే నాశములేని సాక్షాత్ భగవానుడే కుమారుడుగా పుట్టబోతున్నాడు.

ధృతవ్రతాసి భద్రం తే దమేన నియమేన చ
తపోద్రవిణదానైశ్చ శ్రద్ధయా చేశ్వరం భజ

ఇపుడు నీవు గర్భమను స్వీకరించే ఉన్నావు. (భార్య గర్భవతి అయిన సంగతి మొదట భర్తకే తెలుస్తుంది). వ్రతమును ధరించి ఉన్నావు. నీకు మంగళం కలుగుతుంది. నీవు గ్రభవతిగా ఉన్న కాలములో తపసుతో ఇంద్రియ నిగ్రహముతో దానముతో శ్రద్ధతో భగవంతుని సేవించు. అప్పుడు పరమాత్మ నీకు పుత్రునిగా పుడతాడు. కపిలావతారం ఆవేశావతారం. అంశావతారం కళావతారం ఆవేశావతరం అని అవతారలలో రకాలు. కలగబోయే కుమారునిలో పరమాత్మ ఆవేశించడానికి పూర్వ రంగము ఏర్పాటు చేయాడానికి దమము తపస్సుతో దానముతో నియమముతో శ్రద్ధతో ఈ ఐదింటితో పరమాత్మను ఆరాధించు

స త్వయారాధితః శుక్లో వితన్వన్మామకం యశః
ఛేత్తా తే హృదయగ్రన్థిమౌదర్యో బ్రహ్మభావనః

అలా నీ చేతా ఆరాధించబడిన పరమాత్మ నా కీర్తి విస్తరింపచేస్తూ, నీ ఉదరము నుండి పుట్టే కొడుకు బ్రహ్మ భావనుడు (బ్రహ్మగా భావించబడిన వాడు) నీ మాయను చేధిస్తాడు. హృదయ గ్రంధి అంటే అహంకారం. అహంకారం తొలగాలి. దేహాత్మభావం పోవాలి. పరమాత్మ నీ హృదయగ్రంధిని చేదిస్తాడు

మైత్రేయ ఉవాచ
దేవహూత్యపి సన్దేశం గౌరవేణ ప్రజాపతేః
సమ్యక్శ్రద్ధాయ పురుషం కూటస్థమభజద్గురుమ్

ఇలా కర్దముడు చెప్పిన మాట విన్న దేవహూతి, ఆ మాటను నమ్మి సర్వ వ్యాపకుడైన, ఎపుడూ ఒకే రకముగా ఉండే పరమాత్మను ఆరాధించింది

తస్యాం బహుతిథే కాలే భగవాన్మధుసూదనః
కార్దమం వీర్యమాపన్నో జజ్ఞేऽగ్నిరివ దారుణి

కొంతకాలము తరువాత పరమాత్మ తన అంశతో కర్దమ ప్రజాపతి వీర్యములో దారువులో (కట్టెలో) అగ్ని ఉంటుందో అలా చేరాడు

అవాదయంస్తదా వ్యోమ్ని వాదిత్రాణి ఘనాఘనాః
గాయన్తి తం స్మ గన్ధర్వా నృత్యన్త్యప్సరసో ముదా

ఇలా కర్దముని వీర్యము ద్వారా దేవహూతిలో పరమాత్మ ప్రవేశించడం తెలుసుకున్న దేవతలు ఆకాశములో మంగళ వాద్యాలను మ్రోగించారు. గంధర్వులు గానం చేసారు. అప్సరసలు నృత్యం చేసారు

పేతుః సుమనసో దివ్యాః ఖేచరైరపవర్జితాః
ప్రసేదుశ్చ దిశః సర్వా అమ్భాంసి చ మనాంసి చ

కింద ఉన్న వీరిపై దేవతలు పుష్పవృష్టి కురిపించారు. అన్ని దిక్కులూ జలములూ అందరి మనస్సులూ ప్రసన్నమయ్యాయి.

తత్కర్దమాశ్రమపదం సరస్వత్యా పరిశ్రితమ్
స్వయమ్భూః సాకమృషిభిర్మరీచ్యాదిభిరభ్యయాత్

ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ, మరీచ్యాది ప్రజాపతులు అమ్మవారితో బాటుగా అక్కడికి వేంచేసారు

భగవన్తం పరం బ్రహ్మ సత్త్వేనాంశేన శత్రుహన్
తత్త్వసఙ్ఖ్యానవిజ్ఞప్త్యై జాతం విద్వానజః స్వరాట్

సాత్వికాంశతో వచ్చిన పరమాత్మ ఎందుకు వస్తున్నాడో స్యంభువైన బ్రహ్మ తెలుసుకున్నాడు. కేవల జ్ఞ్యాన ప్రదమైనది కపిలావతారం. తత్వములెన్నో తెలియని (తత్వములెన్ని అనే సంఖ్య తెలియని) వారి కొరకు సంఖ్యా నిర్ణయం చేయడానికి పరమాత్మ పుడుతున్న్నడు, అని తెలుసుకున్నాడు

సభాజయన్విశుద్ధేన చేతసా తచ్చికీర్షితమ్
ప్రహృష్యమాణైరసుభిః కర్దమం చేదమభ్యధాత్

పరమాత్మ చేయదలచుకున్న దాన్ని  (స్తుస్తిస్తూ)అన్ని ప్రాణాలూ (ఇంద్రియాలూ) సంతోషించాయి. కర్దముడితో కూడా ఇలా మాట్లాడాడు

బ్రహ్మోవాచ
త్వయా మేऽపచితిస్తాత కల్పితా నిర్వ్యలీకతః
యన్మే సఞ్జగృహే వాక్యం భవాన్మానద మానయన్

నీవు నిజముగా కృతజ్ఞ్యతను తెలిపావు. పుత్రునిగా నీ ప్రతిక్రియనూ ధర్మాన్నీ కపటములేకుండా నిర్వహించావు. నీవు నేను చెప్పిన మాట స్వీకరించావు. నా మాటను గౌరవించావు.

ఏతావత్యేవ శుశ్రూషా కార్యా పితరి పుత్రకైః
బాఢమిత్యనుమన్యేత గౌరవేణ గురోర్వచః

కుమారులు తండ్రికి చేయవలసిన సేవ ఒకటే. తండ్రిగారు చెప్పిన మాటను గౌరవముతో ఆమోదించుటే.

ఇమా దుహితరః సత్యస్తవ వత్స సుమధ్యమాః
సర్గమేతం ప్రభావైః స్వైర్బృంహయిష్యన్త్యనేకధా

నేను సృష్టిని విస్తరించమని చెప్పిన నా సంకల్పాన్ని పాటించావు. తమ దివ్యమైన ప్రభావముతో ఈ సృష్టిని ఎన్నో రకాలుగా విస్తరిస్తారు

అతస్త్వమృషిముఖ్యేభ్యో యథాశీలం యథారుచి
ఆత్మజాః పరిదేహ్యద్య విస్తృణీహి యశో భువి

వీరందరికీ తగిన భర్తలను ఏరి నిశ్చయించి జరపవలసింది. వారి వారి ఇష్టాలను, స్వభావాన్ని బట్టి వివాహము చేయి. అలాంటి వివాహం జరిపి నీ కీర్తిని విస్తరింపచేయి

వేదాహమాద్యం పురుషమవతీర్ణం స్వమాయయా
భూతానాం శేవధిం దేహం బిభ్రాణం కపిలం మునే

నేను తెలుసుకున్నాను. త్వరలో, పరమాత్మ, ఆదిపురుషుడు, అన్ని భూతములకూ నిధి అయిన స్వామి, కపిల దేహమును ధరించి వస్తున్నాను. బ్రహ్మాస్వాదన పరుడు, పరమాత్మ స్వరూపం బోధించేవాడు, ఆ స్వరూపాన్ని తెలుసుకున్న వారిని ఆరాధించేవాడు. తోక కనులు గిట్టలు ముఖము పృష్ట భాగం ఉదరము దగ్గర తెల్ల మచ్చలుండి మిగతా చోట్ల గోధుమ రంగులో ఉన్న ఆవులను కపిల గోవులంటారు. ఇది రజస్సు కాదూ, తమస్సూ కాదూ, తెలుపూ కాదూ. అలాంటిది కపిల దేహం.

జ్ఞానవిజ్ఞానయోగేన కర్మణాముద్ధరన్జటాః
హిరణ్యకేశః పద్మాక్షః పద్మముద్రాపదామ్బుజః

దేవహూతీ, ఈయన జ్ఞ్యాన విజ్ఞ్యాన యోగముతో కర్మలను తొలగిస్తూ, బంగారు రంగులో పద్మము వంటి పాదములు కలవాడు నీ గర్భములో ప్రవేసించాడు. కైటబున్ని సంహరించినవాడు

ఏష మానవి తే గర్భం ప్రవిష్టః కైటభార్దనః
అవిద్యాసంశయగ్రన్థిం ఛిత్త్వా గాం విచరిష్యతి

అజ్ఞ్యానాన్ని సంహరిస్తూ భూమండలం అంతా సంచరిస్తాడు
అయం సిద్ధగణాధీశః సాఙ్ఖ్యాచార్యైః సుసమ్మతః
లోకే కపిల ఇత్యాఖ్యాం గన్తా తే కీర్తివర్ధనః

ఇతను సిద్ధగణములకు అధిపతి, సాంఖ్య జ్ఞ్యానము గల ఆచార్యులందరు ఇతన్ని ఆచరిస్తారు. ఈయన కపిలుడన్న పేరుతో లోకములో ప్రసిద్ధి పొంది నీ కీర్తిని పెంచుతాడు

మైత్రేయ ఉవాచ
తావాశ్వాస్య జగత్స్రష్టా కుమారైః సహనారదః
హంసో హంసేన యానేన త్రిధామపరమం యయౌ

ఇలా దేవహూతీ కర్దములతో మాట్లాడి, తన వాహమైన హంసతో, ఆకాశ మార్గములో (హంసేన యానేన) తన సత్యలోకమునకు చేరాడు. (బ్రహ్మ పేరే హంస, హంస వాహనములో వెళ్ళాడు, వెళ్ళిన దారి కూడా హంస. హంస మార్గం అంటే విశుద్ధమైన జ్ఞ్యాన మార్గములో వెళ్ళాడు). సత్యమూ జ్ఞ్యానమూ తపస్సు ఉండే లోకం సత్యలోకం. దానికి వెళ్ళాలంటే హంసలే వెళ్ళగలరు. సంసారములో ఉండి కూడా మురికి అంటకుండా పరమాత్మనే చూసే వారిని హంస అంటారు. మనలాగే లొకములో ఉండి పెరిగీ, "ఇదంతా ఆశించవలసినదీ అనుసరించవలసినదీ అభిలషించవలసినదీ కాదు" అని తెలుసుకుని వాటికి దూరముగా ఉండే వారు పరమ హంసలు. బ్రహ్మగారు హంస. జ్ఞ్యాన మార్గముతో జ్ఞ్యాన వాహనుడై తన లోకానికి వెళ్ళారు.

గతే శతధృతౌ క్షత్తః కర్దమస్తేన చోదితః
యథోదితం స్వదుహిత్ః ప్రాదాద్విశ్వసృజాం తతః

ఇలా చెప్పి బ్రహ్మ వెళ్ళిపోయిన తరువాత, బ్రహ్మ చెప్పినట్లుగా తన పుత్రికలను ప్రజాపతులకి ఇచ్చి వివాహం చేసాడు

మరీచయే కలాం ప్రాదాదనసూయామథాత్రయే
శ్రద్ధామఙ్గిరసేऽయచ్ఛత్పులస్త్యాయ హవిర్భువమ్
పులహాయ గతిం యుక్తాం క్రతవే చ క్రియాం సతీమ్
ఖ్యాతిం చ భృగవేऽయచ్ఛద్వసిష్ఠాయాప్యరున్ధతీమ్
అథర్వణేऽదదాచ్ఛాన్తిం యయా యజ్ఞో వితన్యతే
విప్రర్షభాన్కృతోద్వాహాన్సదారాన్సమలాలయత్

మరీచ ప్రజాపతికి కల అనే పుత్రికతో,
అనసూయను అత్రికి ఇచ్చి
శ్రద్ధను అంగీరసునికి
పులస్త్యునికి హవిర్భూ అనే పుత్రికను
పులహునికి గతినీ
క్రతువుకూ క్రియను
బృగువుకి ఖ్యాతిని
అరుంధతిని వశిష్టునికి
అధర్వునికి శాంతిని
శాంతి లేకుండా యజ్ఞ్యము ఉండదు.యజ్ఞ్య ప్రక్రియను బోధించినది అధర్వణ వేదం.
అల్లుళ్ళను పుత్రికలనూ లాలించాడు.

తతస్త ఋషయః క్షత్తః కృతదారా నిమన్త్ర్య తమ్
ప్రాతిష్ఠన్నన్దిమాపన్నాః స్వం స్వమాశ్రమమణ్డలమ్

వారు వివాహం చేసుకుని అత్త మామలకు నమస్కరించి ఆశ్రమాలకు బయలుదేరారు.

స చావతీర్ణం త్రియుగమాజ్ఞాయ విబుధర్షభమ్
వివిక్త ఉపసఙ్గమ్య ప్రణమ్య సమభాషత

కపిలుడు పుట్టాడని తెలుసుకుని, ఆయన పరమాత్మ అని తెలుసుకుని, ఒంటిగా ఉన్నప్పుడు దగ్గరకు వెళ్ళి నమస్కరించి ఇలా అన్నాడు

అహో పాపచ్యమానానాం నిరయే స్వైరమఙ్గలైః
కాలేన భూయసా నూనం ప్రసీదన్తీహ దేవతాః

పరమాత్మను స్తోత్రం చేయడానికి మూడు మార్గాలు ఉన్నాయి. 1. పరమాత్మను పొగడటం 2. లోకాన్ని నిందించడం 3. దేవతలు మానవులకు ఇచ్చే వరముల గురించి చెబుతూ, అవి మనలను ఎలా బంధిస్తున్నాయో చెప్పడం.
తాము ఆచరించిన అశుభ కర్మలతో నరకములలో మగ్గుతున్నవారికి ఎంతో కాలం తరువాత దేవతలు ప్రసన్నమవుతారు.

బహుజన్మవిపక్వేన సమ్యగ్యోగసమాధినా
ద్రష్టుం యతన్తే యతయః శూన్యాగారేషు యత్పదమ్

పరమాత్మను చూడటానికి ఎన్నో జన్మల తరువాత కలిగిన బుద్ధితో ప్రయత్నిస్తారు. అలా యోగం కుదిరితే అంతర్యామిగా ఉన్న పరమాత్మని చూడగలరు

స ఏవ భగవానద్య హేలనం న గణయ్య నః
గృహేషు జాతో గ్రామ్యాణాం యః స్వానాం పక్షపోషణః

ఇలా ఎన్నో జన్మల సాధనతో ప్రత్యక్షమయ్యే పరమాత్మే, మా అజ్ఞ్యానాన్ని లెక్కించకుండా, మావంటి పామరుల జ్ఞ్యానములేని  వారి ఇంట నీవు పుట్టావు. నీకు కూడా పక్షపాతం ఉంది. నీ పక్షం వారిని పోషిస్తావు. (నన్ను సేవించే వాడు ఎన్ని చెడ్డపనులు చేసినా మంచివాడే అని స్వామి అన్నాడు)

స్వీయం వాక్యమృతం కర్తుమవతీర్ణోऽసి మే గృహే
చికీర్షుర్భగవాన్జ్ఞానం భక్తానాం మానవర్ధనః

మీరు చెప్పిన మీ మాటను నిజము చేసుకోవడానికే మా ఇంటిలో అవతరించారు. భక్తులకు గొప్పదనం తేవడానికి పుట్టావు.  భక్తులకు జ్ఞ్యానం కలిగించడానికి పుట్టావు

తాన్యేవ తేऽభిరూపాణి రూపాణి భగవంస్తవ
యాని యాని చ రోచన్తే స్వజనానామరూపిణః

ఏ గుణాలూ లేని వాడివి నీవు. నీ ఆకరం ఏమిటో మాకు అర్థమయ్యింది. ఏ భక్తుడు ఏ రూపం కోరితే నీవు ఆ రూపం ధరిస్తావు. భక్తులు ఏ రూపం కోరితే అదే నీ రూపం. ప్రకృతి సంబంధంలేని ఆకారం లేని నీవు, ప్రకృతి సంబంధం ఉన్న భక్తులు కోరిన రూపాన్నే నీ ఆకారముగా ధరించి వస్తావు. నీవు సహజముగా రూపము లేని వాడవు

త్వాం సూరిభిస్తత్త్వబుభుత్సయాద్ధా సదాభివాదార్హణపాదపీఠమ్
ఐశ్వర్యవైరాగ్యయశోऽవబోధ వీర్యశ్రియా పూర్తమహం ప్రపద్యే

జ్ఞ్యానులందరూ తత్వమును గోరి నిన్ను చేరుతారు. నిరంతరమూ నమస్కరించదగినవైనవి నీ పాదాలు. జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు అనే ఆరు గుణాలతో ఉన్న భగవంతుండవైన నిన్ను శరణు వేడుతున్నాను.

పరం ప్రధానం పురుషం మహాన్తం కాలం కవిం త్రివృతం లోకపాలమ్
ఆత్మానుభూత్యానుగతప్రపఞ్చం స్వచ్ఛన్దశక్తిం కపిలం ప్రపద్యే

నీవు ప్రకృతి కంటే పరుడవు. ప్రకృతివి కూడా నీవే. ప్రకృతి పురుషుల కంటే నీవు విలక్షణుడవు. మహాన్తం - మహత్ తత్వం కూడా నీవే. నీవే కాలానివి. ప్రళయ కాలములో అన్నీ మింగి, సృష్టి కాలములో అన్నీ బయటకు వదులుతావు. ఏ ఏ కాలములో ఏ ఏ పనులు చేయాలో బోధించే వాడివి నీవే. (కవి). కవి అంటే ద్రష్ట. గర్భములో ఉన్న లోకాలను బయటకి తెచ్చి కూరుస్తాడు. అందుకు కవి. త్రివృత్ - అంటే ఓంకారము. సత్వ రజ తమస్సులు నీవే. నీ సంకల్పాను సారముగా జగత్తుని సృష్టి చేసేవాడివి. నీది స్వచ్చంద శక్తి. స్వచ్చంద శక్తి - అనుకున్నప్పుడు అనుకున్నంత శక్తిని పొందుటాడు. ఏ సమయములో ఎంత శక్తి అవసరమో అంత శక్తి తెచ్చుకుంటాడు.

అ స్మాభిపృచ్ఛేऽద్య పతిం ప్రజానాం త్వయావతీర్ణర్ణ ఉతాప్తకామః
పరివ్రజత్పదవీమాస్థితోऽహం చరిష్యే త్వాం హృది యుఞ్జన్విశోకః

ప్రజాపతులము మేము కాదు. నీవు. నిన్ను నేను అనుమతి కోరుతున్నాను వీడుకోలు పలకడానికి. నీ వలన నేను సంసారాన్ని దాటాను. అన్ని కోరికలూ తీరిన నేను  ఇపుడు అన్నీ విడిచిపెట్టి సన్యాసము తీసుకుంటున్నాను. నిన్నే హృదయములో నిలుపుకుని అన్ని శోకములూ తొలగించుకుని ప్రపంచమంతా సంచరిస్తాను.

శ్రీభగవానువాచ
మయా ప్రోక్తం హి లోకస్య ప్రమాణం సత్యలౌకికే
అథాజని మయా తుభ్యం యదవోచమృతం మునే

ఏతన్మే జన్మ లోకేऽస్మిన్ముముక్షూణాం దురాశయాత్
ప్రసఙ్ఖ్యానాయ తత్త్వానాం సమ్మతాయాత్మదర్శనే

కపిలావతారం  కేవలం తత్వ నిరూపణకు వచ్చింది

ఏష ఆత్మపథోऽవ్యక్తో నష్టః కాలేన భూయసా
తం ప్రవర్తయితుం దేహమిమం విద్ధి మయా భృతమ్

నేను ఈ సాంఖ్యమార్గాన్ని చాలా సార్లు చెప్పాను. ఇది ఆత్మ స్వరూపానికి మార్గం, ఇది సులభముగా అర్థమయ్యేది కాదు. ఎంతో కాలం గడిచిపోయింది కాబట్టి నేను చెప్పినది కూడా లుబ్దమైపోయింది.  అలా నశించిన ఆత్మ మార్గాన్ని ప్రవర్తింపచేయడానికి నేను వచ్చాను అని తెలుసుకో.

గచ్ఛ కామం మయాపృష్టో మయి సన్న్యస్తకర్మణా
జిత్వా సుదుర్జయం మృత్యుమమృతత్వాయ మాం భజ

మీ ఇష్టానుగుణముగా నా అంగీకారాన్ని పొందిన మీరు వెళ్ళవచ్చు. నీవు ఆచరించే అన్ని కర్మలను నా యందు అర్పించు. సంసారాన్ని గెలువు. అహంకార మమకారాలని గెలువు. శరీరమే ఆత్మ అనుకోవడమే మృతువు. దాన్ని గెలవడానికి  మార్గం అన్ని కర్మలూ నాకు అర్పించడమే. మోక్షము కొరకు నన్ను సేవించు.

మామాత్మానం స్వయంజ్యోతిః సర్వభూతగుహాశయమ్
ఆత్మన్యేవాత్మనా వీక్ష్య విశోకోऽభయమృచ్ఛసి

అన్ని ఆత్మలకూ ఆత్మనైన నేను (శరీరం అంటే పరమాత్మ ఆత్మగా ఉన్న, జీవాత్మ ఆత్మ గా ఉన్న శరీరం).నేను అనుకుంటేనే నన్ను నీవు తెలుసుకోగలవు. నేను ప్రతీ ప్రాణి యొక్క దహరాకాశములో ఉంటాను. నన్ను చూడటానికి ఎక్కడికో పోవాల్సిన అవసరము లేదు. నీ ఆత్మలో అంతర్యామిగా ఉన్న నన్ను మనసుతో పరిశీలించు (ఆత్మన్యేవాత్మనా ). నేను నీలో ఉన్న అని తెలుసుకున్నాక దుఃఖం ఉండదు. అభయం (అంటే క్షేమం) పొందుతావు.

మాత్ర ఆధ్యాత్మికీం విద్యాం శమనీం సర్వకర్మణామ్
వితరిష్యే యయా చాసౌ భయం చాతితరిష్యతి

నేను తల్లికి, అన్ని కర్మలనూ తొలగించేదైన ఆధ్యాత్మ విద్య బోధిస్తాను, ఉపదేశిస్తాను. నేను ఉపదేశించిన ఆధ్యాత్మిక విద్యతో నా తల్లి సంసారాన్ని హాయిగా దాటుతుంది.

మైత్రేయ ఉవాచ
ఏవం సముదితస్తేన కపిలేన ప్రజాపతిః
దక్షిణీకృత్య తం ప్రీతో వనమేవ జగామ హ

ఈ రీతిలో కపిలుడు కర్దమ ప్రజాపతికి చెబితే, కర్దముడు ప్రదక్షిణం చేసి వనానికి వెళ్ళాడు.

వ్రతం స ఆస్థితో మౌనమాత్మైకశరణో మునిః
నిఃసఙ్గో వ్యచరత్క్షోణీమనగ్నిరనికేతనః

అరణ్యమునకు వెళ్ళి మౌన వ్రతాన్ని ఆచరించాడు (జితం సర్వం జితే రసే - నాలుకకు రెండు పనులు ఉన్నాయి. మౌన వ్రతం, రోజులో ఎప్పుడు ఎక్కువ మాట్లాడతామో ఆ సమయాన్ని మెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. మౌనం రెండు రకాలు వాచా మౌనం, హృదా మౌనం. వాక్కును నియమించినపుడు మనసును కూడా నియమించాలి.  ). పరమాత్మని మాత్రమే రక్షకునిగా భావించాడు.  మౌనం ఆశ్రయించాడు కాబట్టి ముని అయ్యాడు. ఇంద్రియార్థములయందు ఎ మాత్రం ఆసక్తి లేని వాడు. గార్హపత్యాగ్ని(నిత్యాగ్ని హోత్రాన్ని తనలో ఆవాహన చేసుకుని సన్యాసం స్వీకరించాడు), అనికేతన (ఇల్లు కూడా లేని వాడయ్యాడు). అన్ని మమకారాలకు మూలమైనది గృహం. ( అందుకే ధర్మ శాస్త్రం "ఇల్లు ఇల్లు కాదు - అసలైన ఇల్లు ఇల్లాలే అని చెబుతుంది)

మనో బ్రహ్మణి యుఞ్జానో యత్తత్సదసతః పరమ్
గుణావభాసే విగుణ ఏకభక్త్యానుభావితే

తన మనసుని పరమాత్మ యందు లగ్నం చేసాడు. పరమాత్మ సత్అసత్ రెండూ అయిన్ పరమాత్మ యందు లగ్నం చేసి . గుణావభాసములైన (గుణాలలా అనిపించే) శబ్ద స్పర్శ రూప రస గంధములు వంటి గుణాలు లేని వాడు, కళ్యాణ గుణములు గలవాడైన పరమాత్మ, భక్తితో మాత్రమే ధ్యానించడానికి దొరికేవాడు అయిన పరమాత్మ యందు మనసు లగ్నం చేసాడు

నిరహఙ్కృతిర్నిర్మమశ్చ నిర్ద్వన్ద్వః సమదృక్స్వదృక్
ప్రత్యక్ప్రశాన్తధీర్ధీరః ప్రశాన్తోర్మిరివోదధిః

నిరహంకారం ( దేహాత్మాభిమానం లేక) , మమకారం (ఆత్మగా భావించే దేహం కొరకు, దేహం వలన వచ్చిన వారి యందు ఉండేది. అవిద్య అనే మహా వృక్షం నుండి సంసారానికి రెండు బీజాలు పుట్టాయి. తనది కాని దాన్ని తనది అనుకోవాడు, తాను కాని దానిని తాను అనుకోవడం),  శీతోష్ణ సుఖదుఖాలను సమముగా చూచేవాడు (అందుకే వేసవిలో పంచాగ్నుల మధ్యా, వర్షాకాలములో పైకప్పులేని ఆకాశములో ఉండి, చలికాలములో చల్ల నీటిలో ఉండి తపస్సు చేయాలి) , సకల ప్రాణులనూ సమానముగా చూసేవాడు (ప్రతీ జీవికి, వారు వారు ఆయా జన్మలలో చేసుకున్న పాప పుణ్య కర్మల వలన వచ్చిన శరీరాలే. పరమాత్మ ప్రసాదమే ఈ శరీరాలన్నీ. పరమాత్మ అన్నింటిలోనూ ఉన్నాడు. ) ,  స్వదృక్ - అంతటా తనను చూచేవాడు, తనలో అందరినీ చూచేవాడు. ప్రపంచములో పరమాత్మనీ, పరమాత్మలో ప్రపంచాన్ని చూచుట స్వదృక్. ప్రత్యక్ - జీవాత్మ. ఎలాంటి ఒడిదుడుకులూ లేని జీవాత్మ.

ఈ లక్షణాలు ఉన్న వాడు ధీర. బుద్ధి యందు ఆనందించే వాడు ధీర. పరమాత్మ యందు బుద్ధి లగ్నమయ్యే వాడు ధీరః. వాడికి భయం ఉండది. ఊర్మి ( తరగము) లేని సముద్రములా ప్రశాంతముగా ఉన్నాడు. ఆకలి దప్పి శోక మోహములూ జరా మరణం అనేవి అందరికీ ఉండే ఊర్ములు. సముద్రములో తరంగము ఎలా వచ్చి పోతుందో ఇవి కూడా అలాగే వచ్చిపోతాయి. షడూర్ములు లేని సంసారములో ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడు

వాసుదేవే భగవతి సర్వజ్ఞే ప్రత్యగాత్మని
పరేణ భక్తిభావేన లబ్ధాత్మా ముక్తబన్ధనః

సర్వజ్ఞ్యుడైన పరమాత్మ యందు, సర్వోత్కృష్టమైన భక్తి భావముతో తన ఆత్మను సమర్పించాడు. అలా సమర్పించి బంధము నుండి ముక్తుడయ్యాడు.

ఆత్మానం సర్వభూతేషు భగవన్తమవస్థితమ్
అపశ్యత్సర్వభూతాని భగవత్యపి చాత్మని

పరమాత్మ యందు తన ఆత్మను సమర్పించడం వలన సర్వ భూతములయందు పరమాత్మ ఉన్నాడనీ భావన కలిగి

ఇచ్ఛాద్వేషవిహీనేన సర్వత్ర సమచేతసా
భగవద్భక్తియుక్తేన ప్రాప్తా భాగవతీ గతిః

అంతటా సమబుద్ధి కలుగుటచే కోరికా వైరమూ అనే రెండూ పోయాయి, ఇలాంటి స్థితితో పరమాత్మ యందు భక్తి కలవాడై పరమపదమును పొందాడు

Friday, January 25, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై మూడవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
పితృభ్యాం ప్రస్థితే సాధ్వీ పతిమిఙ్గితకోవిదా
నిత్యం పర్యచరత్ప్రీత్యా భవానీవ భవం ప్రభుమ్

విశ్రమ్భేణాత్మశౌచేన గౌరవేణ దమేన చ
శుశ్రూషయా సౌహృదేన వాచా మధురయా చ భోః

విసృజ్య కామం దమ్భం చ ద్వేషం లోభమఘం మదమ్
అప్రమత్తోద్యతా నిత్యం తేజీయాంసమతోషయత్

స వై దేవర్షివర్యస్తాం మానవీం సమనువ్రతామ్
దైవాద్గరీయసః పత్యురాశాసానాం మహాశిషః

కాలేన భూయసా క్షామాం కర్శితాం వ్రతచర్యయా
ప్రేమగద్గదయా వాచా పీడితః కృపయాబ్రవీత్

కర్దమ ఉవాచ
తుష్టోऽహమద్య తవ మానవి మానదాయాః
శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా
యో దేహినామయమతీవ సుహృత్స దేహో
నావేక్షితః సముచితః క్షపితుం మదర్థే

ప్రాణులన్నిటికీ ఇష్టమైన దేహమును కూడ కృశింపచేసుకున్నావు

యే మే స్వధర్మనిరతస్య తపఃసమాధి
విద్యాత్మయోగవిజితా భగవత్ప్రసాదాః
తానేవ తే మదనుసేవనయావరుద్ధాన్
దృష్టిం ప్రపశ్య వితరామ్యభయానశోకాన్

అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజృమ్భ
విభ్రంశితార్థరచనాః కిమురుక్రమస్య
సిద్ధాసి భుఙ్క్ష్వ విభవాన్నిజధర్మదోహాన్
దివ్యాన్నరైర్దురధిగాన్నృపవిక్రియాభిః

నీవు సిద్ధిని పొందావు. నీవు ఆచరించిన ధర్మము ఆకరము దాల్చగా వచ్చిన భోగాలను అనుభవించు. సామాన్య మానవులు పొందలేని దివ్యమైనవి అయిన భోగాలనూ, ఎంతో మంది చక్రవర్తులు కూడా పొందగోరే భోగాలను అనుభవించు. నీవు ఆచరించిన ధర్మము ప్రసాదించినవి.

ఏవం బ్రువాణమబలాఖిలయోగమాయా
విద్యావిచక్షణమవేక్ష్య గతాధిరాసీత్
సమ్ప్రశ్రయప్రణయవిహ్వలయా గిరేషద్
వ్రీడావలోకవిలసద్ధసితాననాహ

అప్పుడు దేవహూతి మనసులో ఉన్న బాధ తొలగిపోయింది. ఇంత వరకూ తపస్సులో ఉండి నూరేళ్ళు కాగానే ఇంత బాగా మాట్లాడినందుకు. "నేనా చరించిన తపసుతో వచ్చిన లోకాలు నీకు ఇస్తున్నాను" అని చెప్పడముతో అతనికున్న యోగ సిద్ధిని అర్థము చేసుకుంది. ఆమె దేనిని కోరి ఇంతకాలం భర్త శుశ్రూష చేసిందో అది  అర్థం చేసుకున్నాడని తెలుసుకుంది. వినయమూ ప్రేమాతో తడపడిన వాక్కుతో, నును సిగ్గుతో చిరునవ్వు నవ్వుతూ

దేవహూతిరువాచ
రాద్ధం బత ద్విజవృషైతదమోఘయోగ
మాయాధిపే త్వయి విభో తదవైమి భర్తః
యస్తేऽభ్యధాయి సమయః సకృదఙ్గసఙ్గో
భూయాద్గరీయసి గుణః ప్రసవః సతీనామ్

స్వామీఇ, ఇప్పుడు మీరు మాట్లాడిన మాటతో, నీ విషయములో ఇది అంతా సిద్ధించినదే అని అర్థమయ్యింది. వివాహం చేసుకునే ముందే చెప్పారు, "సంతానం కలిగించే వరకే నేను ఉంటాను" అని. అంటే మనకు ప్రేమ పూర్వకమైన సంగమం జరగాలి కదా. దాని వలన భర్త కన్నా భార్యకే ఎక్కువ మన్ననా, గౌరవం లభిస్తాయి, సంతాన రూపములో. సంతానమే భర్త కంటే భార్యకు లభించిన అధికయోగం.

తత్రేతికృత్యముపశిక్ష యథోపదేశం
యేనైష మే కర్శితోऽతిరిరంసయాత్మా
సిద్ధ్యేత తే కృతమనోభవధర్షితాయా
దీనస్తదీశ భవనం సదృశం విచక్ష్వ

మీ సమాగమం కోసమే, ఈ దేహం యొక్క సుఖాన్ని భోగాని ఆశించే ఇన్ని సేవలూ చేసాను కాబట్టి, కృశించిన నా శరీరానికి మీరనుకున్న  భోగాన్ని ప్రసాదించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లూ చేయండి. మన్మధుని చేత పీడించబడుతున్న నాకూ, మీకు, యోగ్యమైన భవనాన్ని ఏర్పాటు చేయండి.

మైత్రేయ ఉవాచ
ప్రియాయాః ప్రియమన్విచ్ఛన్కర్దమో యోగమాస్థితః
విమానం కామగం క్షత్తస్తర్హ్యేవావిరచీకరత్

దేహము కన్నా ధర్మాచరణా, భోగము కన్నా తపస్సిద్ధీ ఎంతో ముఖ్యము.నూరు సంవత్సరాలు పరిశుద్ధితో శరీరన్ని మనసుని నిగ్రహించుకుని ఎదురుగా ఉన్న ప్రియుడైన భర్తను చూస్తూ సేవించింది దేవహూతి. ఉత్తమ సంతానం కలగాలంటే దంపతులు కఠోరమైన నియమాన్ని ఆచరించాలి.
ఆమె యొక్క ప్రీతిని కలిగించాలన్న కోరిక ఉన్నవాడు కాబట్టి, ఆమెకు కావలసినవి కల్పించడానికి కాసేపు యోగ సమాధికి వెళ్ళాడు. విమానాన్ని తన యోగమాయతో ఏర్పరచాడు. తాను ఎటు వెళ్ళాలని అనుకుంటే అటు వెళ్ళే విమానం.

సర్వకామదుఘం దివ్యం సర్వరత్నసమన్వితమ్
సర్వర్ద్ధ్యుపచయోదర్కం మణిస్తమ్భైరుపస్కృతమ్

ఏమి కావాలన్నా ఇచ్చే విమానం, దివ్యమైన ప్రకృతి సంబంధము లేనిది, రత్నాలతో చేయబడి, అన్ని భోగాలు కలిగి ఉన్న, మణులు కలిగిన స్తంభముతో చేయబడి

దివ్యోపకరణోపేతం సర్వకాలసుఖావహమ్
పట్టికాభిః పతాకాభిర్విచిత్రాభిరలఙ్కృతమ్

ఏ కాలములో ఏ స్పర్శ కావాలో ఆ స్పర్శనిచ్చేది. రక రకాల జండాలు పట్టీలు కట్టబడి, చూచే వారికి ఆశ్చర్యం కలిగించేట్లు ఉండి

స్రగ్భిర్విచిత్రమాల్యాభిర్మఞ్జుశిఞ్జత్షడఙ్ఘ్రిభిః
దుకూలక్షౌమకౌశేయైర్నానావస్త్రైర్విరాజితమ్

దండలూ మాలలు హారాలు, మాలలలో ఉన్న పూలను ఆస్వాదించడానికి తుమ్మెదలు వచ్చి మెల్లగా ధ్వని చేస్తున్నాయి. నానా రకాల వస్త్రాలతో

ఉపర్యుపరి విన్యస్త నిలయేషు పృథక్పృథక్
క్షిప్తైః కశిపుభిః కాన్తం పర్యఙ్కవ్యజనాసనైః

విమానములో అంతస్థులు ఉన్నాయి, ఒక్కొక్క అంతస్థులో ఒక్కొక్క రకములైన వస్త్రములతో ఆచ్చాదన చేయబడి ఉన్నాయి. ప్రతీ అంతస్తులోనూ అన్ని గదులలోనూ పరుపులు అమర్చబడి ఉన్నాయి. పరుపుల మీద వస్త్రాలు అమర్చబడి ఉన్నాయి. విసన కర్రలు , విసన కర్రలు నిలబడడానికి ఆసనాలు కూడా ఉన్నాయి.

తత్ర తత్ర వినిక్షిప్త నానాశిల్పోపశోభితమ్
మహామరకతస్థల్యా జుష్టం విద్రుమవేదిభిః

ప్రతీ భవనములోనూ ప్రతీ గోడ మీదా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. మరకతములూ, పగడములూ వజ్రములతో వేదికలు ఏర్పరచబడి ఉన్నాయి, (ఎంతటి భోగాన్ని అనుభవించే శక్తి ఉండి కూడా కేవలం విరత్కి చేత అనుభవించలేదు. అన్నీ వేదాలలో ఉన్నా, కోరిక లేక వారు అలా అనుభవించలేదు.)

ద్వాఃసు విద్రుమదేహల్యా భాతం వజ్రకపాటవత్
శిఖరేష్విన్ద్రనీలేషు హేమకుమ్భైరధిశ్రితమ్

ఆ విమానములో గదులకు వజ్రములతో చేయబడిన తలుపులూ, పగడాల గడపలు ఉన్నాయి. భవనం యొక్క పైభాగాలలో ఇంద్ర నీలమణులతో పొదగబడిన బంగారు కలశాలు.

చక్షుష్మత్పద్మరాగాగ్ర్యైర్వజ్రభిత్తిషు నిర్మితైః
జుష్టం విచిత్రవైతానైర్మహార్హైర్హేమతోరణైః

ఆయా గోడలలో రకరకాల పక్షులు చిత్రించి, అవి పక్షులని గుర్తించడానికి నేత్రముల స్థానములలో పద్మరాగ మణులు అమర్చారు. పైన చాందినీ లాగ వైతానములు అమర్చారు

హంసపారావతవ్రాతైస్తత్ర తత్ర నికూజితమ్
కృత్రిమాన్మన్యమానైః స్వానధిరుహ్యాధిరుహ్య చ

విమానములో పావురాలు హంసలు చిలకలు కోకిలలూ ధ్వని చేస్తున్నాయి. ఇన్ని బొమ్మలను చూసిన వారు తమని చూచి బొమ్మలని అనుకుంటారని ఆ పక్షులు ధ్వని చేస్తున్నాయి

విహారస్థానవిశ్రామ సంవేశప్రాఙ్గణాజిరైః
యథోపజోషం రచితైర్విస్మాపనమివాత్మనః

భవనం యొక్క ముందు లోపలి భాగములూ, ప్రాకారం యొక్క వెలుపల లోపల భాగాలు, విహరించడానికి యోగ్యమైన అన్ని విశ్రాంతి ఆవాసాలు ఏర్పరచి ఉన్నాయి. చూచే వారు విస్మయానికి గురయ్యేట్లు ఉన్నాయి

ఈదృగ్గృహం తత్పశ్యన్తీం నాతిప్రీతేన చేతసా
సర్వభూతాశయాభిజ్ఞః ప్రావోచత్కర్దమః స్వయమ్

ఇంత పెద్ద విమానాన్ని సృష్టిస్తే దాన్ని చూచిన దేవహూతి పెద్దగా సంతోషించలేదు.

నిమజ్జ్యాస్మిన్హ్రదే భీరు విమానమిదమారుహ
ఇదం శుక్లకృతం తీర్థమాశిషాం యాపకం నృణామ్

శుబ్రముగా మంగళ స్నానం చేసి విమానాన్ని అధిరోహించు అని దేవహూతికి చెప్పాడు. ఆ సరస్సు పరమాత్మ కన్నీటితో ఏర్పడిన జలముతో ఉన్న సరస్సు. (పరమాత్మకు శుక్ల అని పేరు. నిత్య శుద్ధుడు అని అర్థం). మానవుల అన్ని కోరికలూ తీర్చేది (ఆమాశిషాం యాపకం నృణామ్). అంటే అనురత్కి ఉన్న వారికి విరక్తి కలిగిస్తుంది, విరక్తి ఉన్న వారికి అనురక్తి కలిగిస్తుంది. అందుకే దీనికి కోరికలు తీర్చేదీ, కోరికలు తొలగించేదీ అని అర్థం.

సా తద్భర్తుః సమాదాయ వచః కువలయేక్షణా
సరజం బిభ్రతీ వాసో వేణీభూతాంశ్చ మూర్ధజాన్

నల్లని కన్నులు గల దేవహూతి, దుమ్ము పట్టిన వస్త్రం కట్టుకొని ఉంది, జటలు కట్టిన జడ, దుమ్ము పట్టిన శరీరమూ

అఙ్గం చ మలపఙ్కేన సఞ్ఛన్నం శబలస్తనమ్
ఆవివేశ సరస్వత్యాః సరః శివజలాశయమ్

అలా పరమ మంగళ నీరు ఉన్న నదిలో ప్రవేశించింది. అలా మునగగానే,

సాన్తః సరసి వేశ్మస్థాః శతాని దశ కన్యకాః
సర్వాః కిశోరవయసో దదర్శోత్పలగన్ధయః

 వేయి మంది చిన్న పిల్లలైన అప్సరసలు వచ్చారు.

తాం దృష్ట్వా సహసోత్థాయ ప్రోచుః ప్రాఞ్జలయః స్త్రియః
వయం కర్మకరీస్తుభ్యం శాధి నః కరవామ కిమ్

చేతులు జోడించి "అమ్మా మేము మీకు సేవకురాళ్ళము. ఏమి చేయాలో చెప్పు " అని చెప్పి ఆమెకు స్నానము చేయించి,

స్నానేన తాం మహార్హేణ స్నాపయిత్వా మనస్వినీమ్
దుకూలే నిర్మలే నూత్నే దదురస్యై చ మానదాః

మురికి లేనీ దుమ్ము లేని కొత్త వస్త్రాలు ఇచ్చారు

భూషణాని పరార్ధ్యాని వరీయాంసి ద్యుమన్తి చ
అన్నం సర్వగుణోపేతం పానం చైవామృతాసవమ్

గొప్ప విలువ గల కాంతి మంతమైన ఆభరణాలను అమృతం లాంటి పానమునూ అన్నమునూ ఇచ్చీ

అథాదర్శే స్వమాత్మానం స్రగ్విణం విరజామ్బరమ్
విరజం కృతస్వస్త్యయనం కన్యాభిర్బహుమానితమ్

స్నాతం కృతశిరఃస్నానం సర్వాభరణభూషితమ్
నిష్కగ్రీవం వలయినం కూజత్కాఞ్చననూపురమ్

ఇంత అలంకరించి అద్దం ఇచ్చారు, ఆ అద్దములో ఆమె "పూల మాలలతో అలంకరించబడి, దుమ్ము లేని వస్త్రాలతో అలంకరించబడి, పుణ్యాహవాచనం చేయబడి హారాలతో బంగారు నూపురాలతో "

శ్రోణ్యోరధ్యస్తయా కాఞ్చ్యా కాఞ్చన్యా బహురత్నయా
హారేణ చ మహార్హేణ రుచకేన చ భూషితమ్

కొన్ని వందల వేల రత్నాలు పొదిగిన మొలత్రాడు,

సుదతా సుభ్రువా శ్లక్ష్ణ స్నిగ్ధాపాఙ్గేన చక్షుషా
పద్మకోశస్పృధా నీలైరలకైశ్చ లసన్ముఖమ్

దంతములు ధావనం చేయబడి, చక్కని కనుబొమ్మలు కలిగి, ప్రేమ నిండిన చూపు కలిగి, నల్లని విడదీయబడిన చక్కని ముంగురులతో సౌందర్యముగా

యదా సస్మార ఋషభమృషీణాం దయితం పతిమ్
తత్ర చాస్తే సహ స్త్రీభిర్యత్రాస్తే స ప్రజాపతిః

ఇలా తన అలంకారాన్ని తాను చూచుకుంది. చూచి భర్తను స్మరించింది. అలా తలచిన క్షణములో భర్త వేయిమంది పరిచారికలతో పక్కన నిలిచాడు

భర్తుః పురస్తాదాత్మానం స్త్రీసహస్రవృతం తదా
నిశామ్య తద్యోగగతిం సంశయం ప్రత్యపద్యత
స తాం కృతమలస్నానాం విభ్రాజన్తీమపూర్వవత్
ఆత్మనో బిభ్రతీం రూపం సంవీతరుచిరస్తనీమ్

భర్త తపో శక్తిని చూచి ఆశ్చర్యమునకు లోనయ్యింది. ఇంత తపశ్శక్తి ఉండి ఇంతవరకూ ఈయనకి కోరిక కలగలేదు. ఇపుడు కలిగిన ఎంత కాలం నిలుస్తుందో అని సంశయించింది

విద్యాధరీసహస్రేణ సేవ్యమానాం సువాససమ్
జాతభావో విమానం తదారోహయదమిత్రహన్

వేయిమంది విద్యాధర స్త్రీలు ఆమెను పరిచర్య చేస్తున్నారు. ఆమె యందు అనురాగం కలిగి ఆ విమానాన్ని అధిరోహింపచేసాడు

తస్మిన్నలుప్తమహిమా ప్రియయానురక్తో
విద్యాధరీభిరుపచీర్ణవపుర్విమానే
బభ్రాజ ఉత్కచకుముద్గణవానపీచ్యస్
తారాభిరావృత ఇవోడుపతిర్నభఃస్థః

విమానములో ఎంతో మంది పరిచారికలు ఉన్నారు. సిద్ధ సాద్య గరుడ గంధర్వ కిన్నెరలతో కలిసి, చుక్కలతో కూడి ఉన్న చంద్రునిలాగ ఉన్నాడు. ఆకాశం విమానం. తారకలు సేవికలు, రోహిణి దేవహూతి.

తేనాష్టలోకపవిహారకులాచలేన్ద్ర
ద్రోణీష్వనఙ్గసఖమారుతసౌభగాసు
సిద్ధైర్నుతో ద్యుధునిపాతశివస్వనాసు
రేమే చిరం ధనదవల్లలనావరూథీ

అష్ట్దిక్పాలకుల అన్ని లోకాలలో విహరించాడు. ఎనిమిది లోకపాలకుల లోకములూ, సప్త కుల పర్వతాల ద్రోణులలో (ఒక్కొక్క పర్వతములో ఒక్కో దివ్య లోకాముంటుంది. మేరు పర్వతం మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారు). సుగంధ ప్రాంతాలలో గాలితో వచ్చే సుగంధము, మన్మధుని మిత్రుడైన మలయమారుతుని చేత సుగంధము చేయబడిన అష్టదిక్పాలకుల సప్త కుల పర్వతాలలో విహరించాడు.అక్కడ సిద్ధులు స్తోత్రం చేస్తున్నారు. ద్యుధుని - ద్యు+ ధుని - ఆకాం + నది శమ్నాకాశ గంగ జలపాతాల నుండి వచ్చే సుగంధాలు గల. ఈ భోగమంతా యోగముతో సంపాదించినది. ఇలాంటి భోగం ఉత్తమ పుత్రున్నే ప్రసాదిస్తుంది. గీత్లో ఉన్నట్లుగా "ధర్మానికి విరుద్ధమైన కామము" పరమాత్మ స్వరూపమే.
కుబేరునిలాగ వైరాగ్యముతో అనుభవించాడు. కుబేరుడు ధనాధిపతి అయినా ఆ ధనమును అనుభవించడు. అంటే కర్దముడు కూడా పరమాత్మ సేవ కొరకే అనుభవించాడు. ప్రియురాలనే సైన్యముగల కర్దముడు కుబేరునిలా అనుభవించాడు

వైశ్రమ్భకే సురసనే నన్దనే పుష్పభద్రకే
మానసే చైత్రరథ్యే చ స రేమే రామయా రతః

ఇవన్నీ అష్ట దిక్పాలకుల తోటలు

భ్రాజిష్ణునా విమానేన కామగేన మహీయసా
వైమానికానత్యశేత చరల్లోకాన్యథానిలః

కోరిన చోటుకు వెళ్ళే విమానముతో అన్ని లోకాలనూ వాయువు సంచరిస్తున్నట్లు సంచరించాడు. ఆయా  లోకాలలో సంచరించే విమానాలను దాటి వెళ్ళాడు.

కిం దురాపాదనం తేషాం పుంసాముద్దామచేతసామ్
యైరాశ్రితస్తీర్థపదశ్చరణో వ్యసనాత్యయః

ఇంత మహానుభావుడెలా అయ్యాడు? ఉజ్జ్వలమైన పరిశుద్ధమైన చిత్తము కలవారు, గంగకు నెలవైన పాదములను ఆశ్రయించ వారు, అలాంటి మహానుభావులు పొందలేనిది పొందరానిది ఏమైనా ఉందా? ఆ పరమాత్మ పాదములు అన్ని కష్టములూ తొలగించేవి.

ప్రేక్షయిత్వా భువో గోలం పత్న్యై యావాన్స్వసంస్థయా
బహ్వాశ్చర్యం మహాయోగీ స్వాశ్రమాయ న్యవర్తత

తన దివ్య యోగ బలముతో తన ప్రియురాలికి మొత్తం భూగోలాన్ని చూపించి మరలా ఆశ్రమానికి వచ్చాడు. బహు ఆశ్చర్యాలు కలిగించే భూగోలాన్ని చూపించి, ఆ మహాయోగి (వాటి యందు మనసు లగ్నం కాని వాడు) ,

విభజ్య నవధాత్మానం మానవీం సురతోత్సుకామ్
రామాం నిరమయన్రేమే వర్షపూగాన్ముహూర్తవత్

ఈ విమానములో నూరేళ్ళు విహరించాడు. తొమ్మిది మంది అమ్మాయిలను కన్నాడు. ఒక వంద సంవత్సరములు ఆ ప్రియురాలని ఆనందింపచేస్తు తనను తాను తొమ్మిదిగా విభజించుకున్నాడు. వంద సంవత్సరాలూ ఒక ముహూర్తములా గడిపాడు.

తస్మిన్విమాన ఉత్కృష్టాం శయ్యాం రతికరీం శ్రితా
న చాబుధ్యత తం కాలం పత్యాపీచ్యేన సఙ్గతా

రతికి అనుకూలించే శయ్యను ఏర్పరిచి విహరించారు. సుందరుడైన భర్తతో ఉన్న దేవహూతి, ఎంత కాలం గడిచిందో తెలియలేకపోయింది

ఏవం యోగానుభావేన దమ్పత్యో రమమాణయోః
శతం వ్యతీయుః శరదః కామలాలసయోర్మనాక్

యోగబలంతో ఏర్పరచిన సుఖాలలో రమిస్తూ ఉండగా నూరు సంవత్సరాలు గడిచాయి. కొన్ని వేల సంవత్సరాలు తపస్సులో ఉన్నవాడు ప్రియురాలి కోరిక తీర్చడానికి కామాసక్తుడిలా కనిపించాడు

తస్యామాధత్త రేతస్తాం భావయన్నాత్మనాత్మవిత్
నోధా విధాయ రూపం స్వం సర్వసఙ్కల్పవిద్విభుః

పరమాత్మ సంకల్పాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి తనను తాను తొమ్మిదిగా విభజించి ఆమె యందు తొమ్మిది మంది సంతానం కలిగేట్టుగా చేసాడు

అతః సా సుషువే సద్యో దేవహూతిః స్త్రియః ప్రజాః
సర్వాస్తాశ్చారుసర్వాఙ్గ్యో లోహితోత్పలగన్ధయః

దేవహూతి తొమ్మిది మంది స్త్రీలను ప్రసవించింది. వారు సౌందర్యవంతులు, జ్ఞ్యానము కలవారు. శరీరమంతా సుగంధం కలవారు

పతిం సా ప్రవ్రజిష్యన్తం తదాలక్ష్యోశతీ బహిః
స్మయమానా విక్లవేన హృదయేన విదూయతా

ఇలా తొమ్మిది మంది సంతానం కలిగిన నాడు కర్దముడు "ఇక నేను వెళ్ళబోతున్నాను" అన్న భర్తను చూచి హృదయములో వేదన కలిగింది, విస్మయాన్ని కూడా పొందింది (ఇంత భోగం అనుభవించి ఒక్కసారి విడిచి వెళ్ళిపోతాడా అని ఆశ్చర్యం. భార్యను ఆనందింపచేయడం భర్తృ ధర్మం. ఆమె కోరికను తీర్చడం తన ధర్మం కాబట్టి ఆమె "ఇంక చాలు"అని అనేంత భోగాన్ని కల్పించి భోగాలలో తేలి ఆడాడు. అలాంటి స్వామి వెళ్ళిపోవాలనుకుంటే ఆశ్చర్యపడింది)

లిఖన్త్యధోముఖీ భూమిం పదా నఖమణిశ్రియా
ఉవాచ లలితాం వాచం నిరుధ్యాశ్రుకలాం శనైః

తన కాలి గోటితో భూమిని రాస్తూ వస్తున్న కన్నీటిని బలవంతముగా ఆపుకుంటూ మెల్లిగా మాట్లాడింది

దేవహూతిరువాచ
సర్వం తద్భగవాన్మహ్యముపోవాహ ప్రతిశ్రుతమ్
అథాపి మే ప్రపన్నాయా అభయం దాతుమర్హసి

స్వామీ మీరు వివాహానికి ముందు ఏమి ప్రతిజ్ఞ్య చేసారో అదంతా నెరవేర్చారు. అయినా నిన్నే ఆశ్రయించి ఉన్న నాకు అభయాన్ని ప్రసాదించండి

బ్రహ్మన్దుహితృభిస్తుభ్యం విమృగ్యాః పతయః సమాః
కశ్చిత్స్యాన్మే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనమ్

భర్తృ ధర్మం పూర్తి చేసారు గానీ పితృ ధర్మం పూర్తి చేయలేదు. వారికి తగిన పతులను కూర్చవలసిన బాధ్యత మీదే కదా. అందరూ అమ్మాయిలే కలిగారు, పెళ్ళి చేసుకుని అందరూ వెళ్ళిపోయే వారే. మీరు కూడా వెళ్ళిపోయే వారే.  మరి నాతో ఎవరు ఉంటారు? నాకు ఒక కొడుకు కలిగితే బాగుంటుంది

ఏతావతాలం కాలేన వ్యతిక్రాన్తేన మే ప్రభో
ఇన్ద్రియార్థప్రసఙ్గేన పరిత్యక్తపరాత్మనః

ఇంతవరకూ మీ సాహచర్యములో పరమార్ధాన్ని జ్ఞ్యానమునూ పరమాత్మ తత్వమునూ విడిచిపెట్టాను. అది చాలు. నాకు ఇహం సరిపోయింది. ఇంతవరకూ పరార్ధాన్ని విడిచిపెట్టాను. పారమార్ధికమైన జ్ఞ్యానాన్ని కూడా మీరే ప్రసాదించవలసినది.  భార్యను జ్ఞ్యాన మార్గములో తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత కూడా భర్తదే.

ఇన్ద్రియార్థేషు సజ్జన్త్యా ప్రసఙ్గస్త్వయి మే కృతః
అజానన్త్యా పరం భావం తథాప్యస్త్వభయాయ మే

కేవలం ఇంద్రియ చాపల్యముతోనే విహరించాము. పరమార్ధాన్ని పూర్తిగా మరచిపోయాము. మిమ్ములను నా భర్తగానే చూసాను తప్ప, ఒక ప్రజాపతిగా ఒక మహర్షిగా ఒక తత్వవేత్తగా ఒక జ్ఞ్యాన ప్రదునిగా చూడలేదు. ఆ పొరబాటుని మన్నించి నాకు అభయం ఇవ్వాలి. (మనకు భయం లేకుండా ఉండాలంటే పరతత్వాన్ని ధ్యానం చేయాలి. సంసారములో ఉన్నంత వరకూ భయమే ఉంటుంది)

సఙ్గో యః సంసృతేర్హేతురసత్సు విహితోऽధియా
స ఏవ సాధుషు కృతో నిఃసఙ్గత్వాయ కల్పతే

ధర్మ శాస్త్రం "బుద్ధి జ్ఞ్యానమూ లేని వారు దుర్జనులతో సావాసం చేస్తారు." అంటుంది. అలాంటి సావాసం సంసారానికి కారణమవుతుంది. అదే సంగం సజ్జనులతో చెస్తే మోక్షం వస్తుంది. సజ్జనులతో సావాసం ఏ విధముగా చేసినా మోక్షమే. కృష్ణుడు చెప్పినట్లు "నా యందు మనసు ఎలా వుంచినా ఆ కోరిక కోరికను పెంచేదిగా ఉండదు. బాగా వేయించిన ధాన్యాన్ని భూమిలో వేసినా మొలవదు. " పరమాత్మ మీద కోరిక బాగా వేపబడినది. అది మళ్ళీ మొలకెత్తదు
మీతో నా సావాసం జ్ఞ్యానాన్నే ప్రసాదిస్తుంది

నేహ యత్కర్మ ధర్మాయ న విరాగాయ కల్పతే
న తీర్థపదసేవాయై జీవన్నపి మృతో హి సః

పని అంటే ఏమిటి, కర్మ అని దేన్ని అంటారు. ఏ పని ధర్మాన్ని గానీ వైరాగ్యాన్ని గానీ, ఉత్తముల పాదసేవకు ఉపయోగించకుండా ఉండదో అలాంటి వాడు బ్రతికి ఉన్నా మరణించినవాడే. ఏ పని చేసినా ధర్మం కలగాలి విరక్తి కలగాలి, మనమాచరించే కర్మ వలన మహాత్ములు మన ఇంటికి రావాలి. కర్మకు మూడు ఫలితాలు 1. ధర్మము 2. విరక్తి 3. మహాత్ముల పాద సేవ.

సాహం భగవతో నూనం వఞ్చితా మాయయా దృఢమ్
యత్త్వాం విముక్తిదం ప్రాప్య న ముముక్షేయ బన్ధనాత్

కాబట్టి ఏదో సంసారమని సౌందర్యమనీ విహారమనీ సంతానమనే మాటలతో నామనసుతోనే మోసగించబడ్డాను. మీవంటి వారి సాంగత్యం పొంది కూడా జ్ఞ్యానముని గూర్చి అడగనీయకుండా చేసింది మీ మాయ. నేను వంచించబడ్డాను. మోక్షమునిచ్చే మీలాంటి మహానుభావుని భర్తగా పొంది కూడా మోక్షము పొందబోతే వ్యర్ధము.

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఇరవై రెండవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
ఏవమావిష్కృతాశేష గుణకర్మోదయో మునిమ్
సవ్రీడ ఇవ తం సమ్రాడుపారతమువాచ హ

కొంచెం సంకోచించి సిగ్గుపడుతున్నవాడిలా అడగడం ఆపిన ఋషితో ఇలా అన్నాడు

మనురువాచ
బ్రహ్మాసృజత్స్వముఖతో యుష్మానాత్మపరీప్సయా
ఛన్దోమయస్తపోవిద్యా యోగయుక్తానలమ్పటాన్

పరమాత్మ తన స్వస్వరూపాన్ని చూచుకోవడానికి మిమ్ములను తన ముఖము నుండి సృష్టించాడు. సకల వేద స్వరూపుడు పరమాత్మ. బ్రాహ్మణులంటే తపస్సు విద్యా యోగమూ ఉండాలి. అంతకన్నా ముఖ్యముగా లంపటము లేకుండా ఉండాలి. అంటే ఆశలేకుండా ఉండాలి.

తత్త్రాణాయాసృజచ్చాస్మాన్దోఃసహస్రాత్సహస్రపాత్
హృదయం తస్య హి బ్రహ్మ క్షత్రమఙ్గం ప్రచక్షతే

మిమ్మలని కాపాడటానికి తన వేయిబాహువులనుండి సృష్టించాడు. శరీరం బాగుంటేనే హృదయం బాగుంటుంది.  అలాగే హృదయం బాగుంటేనే శరీరం బాగుంటుంది. ఇలా పరస్పర రక్ష రక్షక భావం ఉంది మనకు

అతో హ్యన్యోన్యమాత్మానం బ్రహ్మ క్షత్రం చ రక్షతః
రక్షతి స్మావ్యయో దేవః స యః సదసదాత్మకః

ఉన్నట్లూ లేనట్లూ కూడా కనపడే పరమాత్మ మనను కాపాడుతున్నాడు

తవ సన్దర్శనాదేవ చ్ఛిన్నా మే సర్వసంశయాః
యత్స్వయం భగవాన్ప్రీత్యా ధర్మమాహ రిరక్షిషోః

మిమ్మలని దర్శించడం వలన ఉన్న సంశయాలన్నీ తొలగిపోయాయి. మీరే స్వయముగా రక్షించవలసినవాడు ఆచరించ వలసిన ధర్మాన్ని చెప్పారు.

దిష్ట్యా మే భగవాన్దృష్టో దుర్దర్శో యోऽకృతాత్మనామ్
దిష్ట్యా పాదరజః స్పృష్టం శీర్ష్ణా మే భవతః శివమ్

మీలాంటి వారు మనో నిగ్రహం లేని వారికి కనపడరు. ఎదురుగా ఉన్నా పరిశుద్ధి లేనివారికి కనపడరు.

దిష్ట్యా త్వయానుశిష్టోऽహం కృతశ్చానుగ్రహో మహాన్
అపావృతైః కర్ణరన్ధ్రైర్జుష్టా దిష్ట్యోశతీర్గిరః

మీరు కనపడ్డారు. మిమ్ములని తాకనిచ్చారు. మీ మంగళ కరమైన పాదధూళి మా శిరసు మీద పడింది. మీ మాటలు కూడా విన్నా. కళ్ళూ చెవులూ శరీరమూ పవిత్రమైంది. ధ్యానముతో మనసూ పవిత్రమయ్యింది

స భవాన్దుహితృస్నేహ పరిక్లిష్టాత్మనో మమ
శ్రోతుమర్హసి దీనస్య శ్రావితం కృపయా మునే

పుత్రిక యందు ప్రేమతో ఆర్ధ్రమైన మనసు కల నేను చెప్పేది దయతో వినండి.

ప్రియవ్రతోత్తానపదోః స్వసేయం దుహితా మమ
అన్విచ్ఛతి పతిం యుక్తం వయఃశీలగుణాదిభిః

ప్రియవ్రత ఉత్తానపాదుడనే కుమారులు నాకు గలరు. వారికి చెల్లెలు ఈమె. వయసు శీలము గుణము గల వానిని భర్తగా పొందాలని కోరుకున్నది

యదా తు భవతః శీల శ్రుతరూపవయోగుణాన్
అశృణోన్నారదాదేషా త్వయ్యాసీత్కృతనిశ్చయా

నారద మహర్షి వచ్చి నీ రూప గుణము తపస్సు చెప్పాడు. అది విని నీవు భర్త కావాలని సంకల్పించుకుంది. ఆమెను శ్రద్ధగా అర్పిస్తాను. నీవు స్వీకరించవలసింది

తత్ప్రతీచ్ఛ ద్విజాగ్ర్యేమాం శ్రద్ధయోపహృతాం మయా
సర్వాత్మనానురూపాం తే గృహమేధిషు కర్మసు

గృహస్తాశ్రమము వారు ఆచరించవలసిన కర్మలయందు అనుకూలముగా ప్రవర్తిస్తుంది

ఉద్యతస్య హి కామస్య ప్రతివాదో న శస్యతే
అపి నిర్ముక్తసఙ్గస్య కామరక్తస్య కిం పునః

నీకు ధర్మం చెప్పవలసిన వాడిని కాదు గానీ, ఎంత నిర్ముక్త సంగుడైనా సరే, కొన్ని కొన్ని సందర్భములలో కామోపహతుడవుతాడు. అలాంటి వారికి ప్రతిక్రియగా వివాహము తప్పదు. సంసారము వద్దు అనుకుంటున్నవాడు కూడా కాలవశములో కర్మ వశములో కామాసక్తుడైనపుడు తృప్తి అనేది కామసేవనముతో తప్ప మరొకదానితో లేదు. ముక్త సంగుడికే లేనప్పుడు, వివాహం కావాలి అనుకున్నవాడి గురించి చెప్పేదేముంది.

య ఉద్యతమనాదృత్య కీనాశమభియాచతే
క్షీయతే తద్యశః స్ఫీతం మానశ్చావజ్ఞయా హతః

అన్నం పెట్టడానికి వచ్చినవాడిని తిరస్కరించి రైతు వద్దకు వెళ్ళి వ్యవసాయము చేయై ఆకలేస్తోందని అడిగి ప్రయోజనం లేదు. ఈ తపనతో ఆయాసముతో కీర్తి తరగిపోతుంది.

అహం త్వాశృణవం విద్వన్వివాహార్థం సముద్యతమ్
అతస్త్వముపకుర్వాణః ప్రత్తాం ప్రతిగృహాణ మే

నీవు వివాహం చేసుకోవాలనుకుంటున్నావని విన్నాను. నీ కోరిక తీర్చడానికి నీకు ఇచ్చుటకు నిర్ణయించబడిన కన్యను నీకు ఇస్తున్నాను. (ఒకరికి ఇస్తానని అన్న అమ్మాయిని వేరొకరికి ఇవ్వడం వ్యభిచారముతో సమానం. ఇంకొకరికి ఇస్తా అన్న అమ్మయిని వివాహం చేసుకోకూడదు అని శాస్త్రం)

ఋషిరువాచ
బాఢముద్వోఢుకామోऽహమప్రత్తా చ తవాత్మజా
ఆవయోరనురూపోऽసావాద్యో వైవాహికో విధిః

అది విన్న కర్దముడు. "నిజమే,, నేను వివాహం చేసుకోవాలనే అనుకున్నాను. అలాగే నీ పుత్రికను కూడా ఎవరికీ ఇవ్వలేదు. కాబట్టి మా ఇద్దరికీ వివాహం అనురూపమే (యోగ్యమే). ఇది మొదటి వైవాహిక విధి.

కామః స భూయాన్నరదేవ తేऽస్యాః పుత్ర్యాః సమామ్నాయవిధౌ ప్రతీతః
క ఏవ తే తనయాం నాద్రియేత స్వయైవ కాన్త్యా క్షిపతీమివ శ్రియమ్

తన దివ్య శరీర కాంతితో లక్ష్మీదేవి శొభను ప్రకటిస్తున్నట్లు ఉన్న నీ పుత్రికను ఎవరు చేసుకోరు

యాం హర్మ్యపృష్ఠే క్వణదఙ్ఘ్రిశోభాం విక్రీడతీం కన్దుకవిహ్వలాక్షీమ్
విశ్వావసుర్న్యపతత్స్వాద్విమానాద్విలోక్య సమ్మోహవిమూఢచేతాః

నారదుడు నాకు చెప్పాడు. మిద్దె మీద బంతి ఆడుతూ తిరుగుతున్న మీ అమ్మయిని విమానము నుంచి చూచి విశ్వావసుడు అనే గంధర్వుడు మూర్చపోయాడు.

తాం ప్రార్థయన్తీం లలనాలలామమసేవితశ్రీచరణైరదృష్టామ్
వత్సాం మనోరుచ్చపదః స్వసారం కో నానుమన్యేత బుధోऽభియాతామ్

ఎలా ఐతే నేను మనో నిగ్రహం తపస్సిద్ధి పవిత్ర అంతఃకరణం లేని వారికి కనపడనో, అమ్మవారిని స్వామినీ సేవించని వారికి కనపడదు. అందులో ఉత్తానపాదునికి చెల్లెలు, మనువుకి పుత్రిక అయిన ఈమెను ఎవరు కాదంటారు.

అతో భజిష్యే సమయేన సాధ్వీం యావత్తేజో బిభృయాదాత్మనో మే
అతో ధర్మాన్పారమహంస్యముఖ్యాన్శుక్లప్రోక్తాన్బహు మన్యేऽవిహింస్రాన్

నేను వివాహము చేసుకుంటాను. సంతానము కలిగేంతవరకు మాత్రమే నేను ఆమెను దగ్గర ఉంచుకుంటాను. తరువాత నేను సన్యాసాశ్రమానికి వెళ్తాను. నా తేజస్సుని ధరించేంతవరకూ ఉంటాను. దాని తరువాత పరమహంసలు ఆచరించే పరమాత్మ బోధించే అహింసా ప్రధానమైన ధర్మాలను ఆచరిస్తాను.

యతోऽభవద్విశ్వమిదం విచిత్రం సంస్థాస్యతే యత్ర చ వావతిష్ఠతే
ప్రజాపతీనాం పతిరేష మహ్యం పరం ప్రమాణం భగవాననన్తః

వివాహం చేసుకున్న వెంటనే కామాసక్తుడనై ప్రవర్తించను. వివాహం తరువాత కూడా యోగి ధర్మాలు ఆచరిస్తాను. పిల్లలు పుట్టాక సన్యాస ధర్మాలు ఆచరిస్తాను. ఈ జగత్తు ఎవరి వల్ల పుట్టిందో, ఉంటుందో,నశిస్తుందో, అలాంటి ప్రజాపతికి (బ్రహ్మ)పతి అయిన భగవంతుని మీదే నా మనసు ఉంటుంది. నాకు పరమ ప్రమాణము పరమాత్మ. నా ఆచరణ అతను బోధించిన ధర్మాలే. నా ప్రవృత్తి అహింసా పరాయణత్వం.

మైత్రేయ ఉవాచ
స ఉగ్రధన్వన్నియదేవాబభాషే ఆసీచ్చ తూష్ణీమరవిన్దనాభమ్
ధియోపగృహ్ణన్స్మితశోభితేన ముఖేన చేతో లులుభే దేవహూత్యాః

ఆయన ఇంతే మాట్లాడాడు. మాట్లాడి ఊరుకున్నాడు. దేవహూతి మనసును లోభింపచేసే చిరునవ్వుతో ఉన్నాడు.

సోऽను జ్ఞాత్వా వ్యవసితం మహిష్యా దుహితుః స్ఫుటమ్
తస్మై గుణగణాఢ్యాయ దదౌ తుల్యాం ప్రహర్షితః

అతను చెప్పిన మాటను భార్యతో కూడా సంప్రదించి. అలాంటి ఉత్తమ గుణ సంపన్నుడికి శతరూపని ఇచ్చి దానము చేసాడు.

శతరూపా మహారాజ్ఞీ పారిబర్హాన్మహాధనాన్
దమ్పత్యోః పర్యదాత్ప్రీత్యా భూషావాసః పరిచ్ఛదాన్
ప్రత్తాం దుహితరం సమ్రాట్సదృక్షాయ గతవ్యథః
ఉపగుహ్య చ బాహుభ్యామౌత్కణ్ఠ్యోన్మథితాశయః

ఉభయులకూ వస్త్రములూ ఆభరణములూ కానుకలూ సంపదలూ ఇచ్చి. యోగ్యుడైన వాడికి అమ్మాయిని ఇచ్చాను అని సంతృప్తి చెంది,

అశక్నువంస్తద్విరహం ముఞ్చన్బాష్పకలాం ముహుః
ఆసిఞ్చదమ్బ వత్సేతి నేత్రోదైర్దుహితుః శిఖాః

ఎడబాటును సహించలేక, ఆమె శిరస్సును కన్నీళ్ళతో తడిపారు.

ఆమన్త్ర్య తం మునివరమనుజ్ఞాతః సహానుగః
ప్రతస్థే రథమారుహ్య సభార్యః స్వపురం నృపః

ఇలా వివాహం పూర్తి చేసి రాజు తన భార్యతో నగరానికి చేరాడు.

ఉభయోరృషికుల్యాయాః సరస్వత్యాః సురోధసోః
ఋషీణాముపశాన్తానాం పశ్యన్నాశ్రమసమ్పదః

దారిలో కనపడుతున్న అనేక ఋషులు ఆశ్రమాలను సేవిస్తూ ఉన్నాడు

తమాయాన్తమభిప్రేత్య బ్రహ్మావర్తాత్ప్రజాః పతిమ్
గీతసంస్తుతివాదిత్రైః ప్రత్యుదీయుః ప్రహర్షితాః

మళ్ళీ నగరానికి వస్తున్న రాజుని ప్రజలు గీత వాద్యాలతో బ్రహ్మావర్త రాజ్య రాజధాని అయిన బర్హిష్మతికి ఆహ్వానించారు. వరాహ అవతారములో రోమములు అక్కడ పడ్డాయి కాబట్టి దానికి బర్హిష్మతి పేరు వచ్చింది

బర్హిష్మతీ నామ పురీ సర్వసమ్పత్సమన్వితా
న్యపతన్యత్ర రోమాణి యజ్ఞస్యాఙ్గం విధున్వతః

కుశాః కాశాస్త ఏవాసన్శశ్వద్ధరితవర్చసః
ఋషయో యైః పరాభావ్య యజ్ఞఘ్నాన్యజ్ఞమీజిరే

అవే ఆకుపచ్చరంగులో కుశములుగా పెరిగాయి.ఈ దర్భలతోటే ఋషులు యజ్ఞ్యములకు ఆటంకం కలిగించే రాక్షసులను పారద్రోలారు

కుశకాశమయం బర్హిరాస్తీర్య భగవాన్మనుః
అయజద్యజ్ఞపురుషం లబ్ధా స్థానం యతో భువమ్

బర్హిష్మతీం నామ విభుర్యాం నిర్విశ్య సమావసత్
తస్యాం ప్రవిష్టో భవనం తాపత్రయవినాశనమ్

అలాంటి నగరాన్ని రాజధానిగా చేసుకుని ఆ మహరాజు పరిపాలిస్తున్నాడు. తాపత్రయ వినాశనమైన రాజభవనములో ప్రవేశించాడు.

సభార్యః సప్రజః కామాన్బుభుజేऽన్యావిరోధతః
సఙ్గీయమానసత్కీర్తిః సస్త్రీభిః సురగాయకైః
ప్రత్యూషేష్వనుబద్ధేన హృదా శృణ్వన్హరేః కథాః

భార్యతో సంతానముతో కలిసి అన్ని కామ భోగాలను ఇతరులకు (ఇతరములకు) విరోధము కాకుండా సేవించాడు (గీతలో చెప్పినట్లు సకల ప్రాణులలో ధర్మానికి విరోధము కాని కామము నేను అని స్వామి అన్నాడు. ధరమార్ధ మోక్షములకు విరోధం కాని విధముగా కామాన్ని అనుభవించాడు). దేవతా స్త్రీలు గానము చేస్తూ నాట్యము చేస్తున్నాడు. ప్రతీ ప్రాతః కాలం సాయం కాలం పరమాత్మ కథలను వింటూ ఆ నృత్య గీతాలను అనుభవించాడు. ప్రత్యూష అంటే ప్రాతః కాలానికి ముందు వచ్చేది, ఉషః కాలం. ఈ రెండు సంధ్యలలో పరమాత్మ కథలు వింటూ మిగతా పురుషార్ధాలను ధర్మబద్ధముగా సేవించాడు

నిష్ణాతం యోగమాయాసు మునిం స్వాయమ్భువం మనుమ్
యదాభ్రంశయితుం భోగా న శేకుర్భగవత్పరమ్

మనువు యోగములో నిష్ణాతుడు. ఈ మనువుకు ఉజ్జ్వలమైన భోగాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా పరమాత్మ యందు ఉన్న మనసును తప్పించలేకపోయాయి.

అయాతయామాస్తస్యాసన్యామాః స్వాన్తరయాపనాః
శృణ్వతో ధ్యాయతో విష్ణోః కుర్వతో బ్రువతః కథాః

ప్రతీ యామము (ఝామూ) గడిచిపోలేదు (అయాత). రెండవ ఝాము వచ్చినపుడు మొదటి ఝామును మరచిపోతే గడిచిపోయినట్టు. భగవంతుని గుణమూ గానము ధ్యానమూ ఆరాధనా లేకుండా ఏ క్షణమూ గడపలేదు. అందుకు ఆయనకు ఒకే కాలం ఉన్నట్లు ఉంది.

స ఏవం స్వాన్తరం నిన్యే యుగానామేకసప్తతిమ్
వాసుదేవప్రసఙ్గేన పరిభూతగతిత్రయః

డెబ్బై యొక్క మహాయుగాలు ఒక మన్వంతరం. ఇలా తన కాలమును గడిపాడు. పరమాత్మ కథా వ్యవహారముతో గడిపాడు. గతి త్రయం - ధర్మార్థకామములనే గతులని తప్పించాడు. వాటికి లొంగకుండా వాటిని లొంగదీసుకున్నాడు.

శారీరా మానసా దివ్యా వైయాసే యే చ మానుషాః
భౌతికాశ్చ కథం క్లేశా బాధన్తే హరిసంశ్రయమ్

శరీర మానసిక దివ్య భావాలు, దైవిక మానసిక భావాలు, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికములు అతన్ని ఏ మాత్రం బాధించలేదు

యః పృష్టో మునిభిః ప్రాహ ధర్మాన్నానావిధాన్ఛుభాన్
నృణాం వర్ణాశ్రమాణాం చ సర్వభూతహితః సదా

అతను ఋషులని సేవించాడు. ఋషులకు కూడా ధర్మాన్ని చెప్పాడు. మనువంటే బ్రహ్మ యొక్క అంశే కాబట్టి అందరికీ ఎన్నో రకాల ధర్మాలని బోధించాడు. మానవ ధరమాలు వర్ణ ధర్మాలు ఆశ్రమ ధర్మాలు చెప్పాడు, సకల ప్రాణుల హితమును కోరి చెప్పాడు

ఏతత్త ఆదిరాజస్య మనోశ్చరితమద్భుతమ్
వర్ణితం వర్ణనీయస్య తదపత్యోదయం శృణు

ఈ ప్రకారముగా ఆది రాజైన మనువు చరిత్రను , వర్ణించదగిన చరిత్ర అయిన దాన్ని నీకు వివరించాను. ఇప్పుడు వారి సంతానం గురించి విను.