Tuesday, July 9, 2013

శ్రీమద్భాగవతం దశం స్కంధం ముప్పై మూడవ అధ్యాయం (రాస పంచాధ్యాయి - 5)

                                                                 ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశం స్కంధం ముప్పై మూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ఇత్థం భగవతో గోప్యః శ్రుత్వా వాచః సుపేశలాః
జహుర్విరహజం తాపం తదఙ్గోపచితాశిషః

పరమాత్మ తీయ తీయగా ప్రేమ ఒలికేలాగ మాట్లాదేసరికి, అది విని, పరమాత్మ స్పర్శతో అన్ని దుఃఖాలనూ పోగొట్టుకుని విరహతాపాన్ని కూడా తొలగించుకున్నారు

తత్రారభత గోవిన్దో రాసక్రీడామనువ్రతైః
స్త్రీరత్నైరన్వితః ప్రీతైరన్యోన్యాబద్ధబాహుభిః

పరమాత్మ యందు ప్రీతి గల స్త్రీరత్నములు ఒకరి చేయి ఒకరు అన్యోన్యముగా పట్టుకుని రాసలీలను అప్పుడు ఆరంభించారు. గోపీ మండలమంతా ఉంది.

రాసోత్సవః సమ్ప్రవృత్తో గోపీమణ్డలమణ్డితః
యోగేశ్వరేణ కృష్ణేన తాసాం మధ్యే ద్వయోర్ద్వయోః
ప్రవిష్టేన గృహీతానాం కణ్ఠే స్వనికటం స్త్రియః
 యం మన్యేరన్నభస్తావద్విమానశతసఙ్కులమ్
 దివౌకసాం సదారాణామౌత్సుక్యాపహృతాత్మనామ్

యోగీశ్వరుడైన కృష్ణుడు అంత మంది గోపికల మధ్యలో, ఇరువైపులా గోపికలుండగా కృష్ణుడు మధ్యనున్నాడు. కృష్ణునికీ కృష్ణునికీ మధ్యన గోపికా.
మెడ మీద చేయి వేసి గోపికలను దగ్గరకు తీసుకున్నాడు. వీరి రాసలీలా ఉత్సవాన్ని చూడడానికి ఆకాశములో కొన్ని లక్షల కోట్ల విమానాలు వచ్చాయి.
వారుకూడా తమ తమ ప్రియురాళ్ళను తీసుకు వచ్చారు. రాసలీలను చూడాలన్న కుతూహలముతొ వచ్చారు

తతో దున్దుభయో నేదుర్నిపేతుః పుష్పవృష్టయః
జగుర్గన్ధర్వపతయః సస్త్రీకాస్తద్యశోऽమలమ్

దుందుభులు  మోగాయి, పుష్ప వర్షం కురిసింది.గంధర్వులు తమ భార్యలతో పరమాత్మ కీర్తిని గానం చేసారు.

వలయానాం నూపురాణాం కిఙ్కిణీనాం చ యోషితామ్
సప్రియాణామభూచ్ఛబ్దస్తుములో రాసమణ్డలే

ఆభరణముల ధ్వని, కాంతులూ,దేవతల విమానాల ధ్వనులూ వినిపిస్తూ ఉండగా పరమాత్మ బాగా శోభించాడు.

తత్రాతిశుశుభే తాభిర్భగవాన్దేవకీసుతః
మధ్యే మణీనాం హైమానాం మహామరకతో యథా

బంగారు ఆభరణముల మధ్యన మరకతమణి ఉన్నట్లుగా ఇంత మంది గోపికల మధ్య పరమాత్మ ప్రకాశిస్తున్నాడు

పాదన్యాసైర్భుజవిధుతిభిః సస్మితైర్భ్రూవిలాసైర్
భజ్యన్మధ్యైశ్చలకుచపటైః కుణ్డలైర్గణ్డలోలైః
స్విద్యన్ముఖ్యః కవరరసనాగ్రన్థయః కృష్ణవధ్వో
గాయన్త్యస్తం తడిత ఇవ తా మేఘచక్రే విరేజుః

నాట్యం చేస్తూ చేస్తున్న పాద న్యాసములూ భుజముల కదలికలూ,చిరునవ్వుతో కూడిన కనుబొమ్మల  కదలికలతో, నాట్యం చేస్తుంటే పడిపోతోందో ఎమో అన్నట్లు ఉన్న నడుమ మధ్య భాగం , పైట చెంగు జారిపోతోంది.కపోలములయందు కాంతి ప్రకాశించే కుండలములతో ఉన్నారు.ఒళ్ళంతా చెమట పట్టింది.
కొప్పు విడిపోతున్నది,వస్త్రం జారిపోతోంది, కృష్ణుని గోపికలు చాలా ఉజ్జవలముగా గానం చేస్తున్నారు. మేఘములలో మెరుపు తీగలలాగ వీరంతా ప్రకాశించారు. ఎవరికి ఏమవుతోందో ఎవరూ గుర్తు  పట్టలేదు.

ఉచ్చైర్జగుర్నృత్యమానా రక్తకణ్ఠ్యో రతిప్రియాః
కృష్ణాభిమర్శముదితా యద్గీతేనేదమావృతమ్

పెద్దగా గానం నాట్యం చేసారు. ఆ గోపికలు కృష్ణపరమాత్మ స్పర్శతో పాడుతున్న గానముతో మూడులోకాలూ ధ్వనించాయి

కాచిత్సమం ముకున్దేన స్వరజాతీరమిశ్రితాః
ఉన్నిన్యే పూజితా తేన ప్రీయతా సాధు సాధ్వితి
తదేవ ధ్రువమున్నిన్యే తస్యై మానం చ బహ్వదాత్

ఒక మహానుభావురాలు స్వామితో గొంతు కలిపి గానం చేసింది. ఆమెను పరమాత్మ మెచ్చుకున్నాడు చాలా బాగా పాడావని.భగవంతుని సంతోషాన్ని పొందింది ఆ గోపిక

కాచిద్రాసపరిశ్రాన్తా పార్శ్వస్థస్య గదాభృతః
జగ్రాహ బాహునా స్కన్ధం శ్లథద్వలయమల్లికా

ఒక గోపిక రాస నాట్యముతో అలసి జారిపోతున్న కంకణం కలిగినది స్వామి భుజం మీద విశ్రాంతి తీసుకుంది

తత్రైకాంసగతం బాహుం కృష్ణస్యోత్పలసౌరభమ్
చన్దనాలిప్తమాఘ్రాయ హృష్టరోమా చుచుమ్బ హ

ఒక గోపిక గంధం పూసిన స్వామి భుజాన్ని స్పృశించి దగ్గరకు తీసుకుంది , గంధముతో స్పర్శతో పులకించినది ఆ భుజాన్ని ముద్దు పెట్టుకున్నది

కస్యాశ్చిన్నాట్యవిక్షిప్త కుణ్డలత్విషమణ్డితమ్
గణ్డం గణ్డే సన్దధత్యాః ప్రాదాత్తామ్బూలచర్వితమ్

గోపిక కృష్ణులు చెంపా చెంపా ఆనించి ఉండగా, ఒకరు నములుతున్న తాంబూలాన్ని ఒకరి నొట్లో ఒకరు విడిచిపెట్టారు.

నృత్యతీ గాయతీ కాచిత్కూజన్నూపురమేఖలా
పార్శ్వస్థాచ్యుతహస్తాబ్జం శ్రాన్తాధాత్స్తనయోః శివమ్

నృత్యం చేస్తూ గానం చేస్తూ వాటితో సమానముగా అందెలూ వడ్డాణం ధ్వనిస్తూ ఉంటే ఒక గోపిక పరమాత్మ హస్తాన్ని తన స్తనము మీద ఉంచుకుంది.

గోప్యో లబ్ధ్వాచ్యుతం కాన్తం శ్రియ ఏకాన్తవల్లభమ్
గృహీతకణ్ఠ్యస్తద్దోర్భ్యాం గాయన్త్యస్తమ్విజహ్రిరే

ఈ రీతిలో గోపికలు అచ్యుతున్ని ఆలింగనం చేసుకుని కొందరు గానం చేస్తున్నారు
పరమాత్మతో కలసి గోపికలందరూ నాట్యం చేస్తున్నారు.

కర్ణోత్పలాలకవిటఙ్కకపోలఘర్మ
వక్త్రశ్రియో వలయనూపురఘోషవాద్యైః
గోప్యః సమం భగవతా ననృతుః స్వకేశ
స్రస్తస్రజో భ్రమరగాయకరాసగోష్ఠ్యామ్

చెవిలో అలంకారముగా ఉన్న కలువ పూలు, ముంగురుల మీద ఉన్న పూలు,చెంపల మీద ఉన్న చెమట బిందువులు, అందెలతో కంకణములతో ధ్వనించే  వాద్యాలతో పరమాత్మతో కలసి వీరు నాట్యం చేసారు.
తమ కొప్పులోనుండి జారుతున్న పూల మకరందాన్ని ఆస్వాదించడానికి వచ్చిన తుమ్మెదలు ధ్వని చేస్తుంటే పై చప్పుళ్ళంతటితో కలిపి, వారి గానం, నాట్యం చప్పుళ్ళూ కలిసాయి.
ఇక్కడ ఐదు ఉన్నాయి, తుమ్మెదల ధ్వని, నాట్యం చేసేప్పుడు అందెల కంకణముల చప్పుడూ, నాట్యము చప్పుడూ గానం చప్పుడు.ఐదు రకముల ధ్వని. రాసలీల అంత ఐదు సంఖ్య ఉంటుంది: కేశములూ పైటా వస్త్రం నూపురములూ కంకణములు. ఐదు జారిపోతున్నయని చెబుతారు
కనుబొమ్మలు కపోలములు కర్ణ భూషణములు దశంచ్చాదములు కంఠభాగం. నిరంతరం భాగవతం మొత్తం అర్థపంచకం గురించే మాట్లాడుతుంది.
పరమాత్మ జీవాత్మ విరోధి స్వరూపం తెలియాలి. పరమాత్మే వచ్చి చేరితే ఇవేవీ అవసరం లేదు. కేశములలో పుష్పములు రాలిపోవడం. కేశములంటే వ్యామోహం. పూలు జ్ఞ్యానం, తుమ్మెదలు జ్ఞ్యానులు. 

ఏవం పరిష్వఙ్గకరాభిమర్శ స్నిగ్ధేక్షణోద్దామవిలాసహాసైః
రేమే రమేశో వ్రజసున్దరీభిర్యథార్భకః స్వప్రతిబిమ్బవిభ్రమః

ఇలా కౌగిలింతలతో ఆలింగనముతో చుంబనాదులతో స్నేహం నిండిన చూపులు కలిగి ఉన్మత్తమైన విలాసములతో చిరునవ్వులతో కృష్ణ పరమాత్మ రమించాడు. పసిపిల్లవాడు తన ప్రతిబింబాన్ని చూచి ఎలా తొట్రుపడతాడో అలా ఆడుకున్నాడు.ప్రతిబింబం చేసే విలాసం చూసి పిల్లవాడు ఎలా ఆనందిస్తాడో అలా. అంటే ఎదురుగా ఉన్న గోపికలందరూ తన ప్రతిబింబాలే. అంటే ఆత్మారాముడు. తనతో తనలో తాను రమించాడు.

తదఙ్గసఙ్గప్రముదాకులేన్ద్రియాః కేశాన్దుకూలం కుచపట్టికాం వా
నాఞ్జః ప్రతివ్యోఢుమలం వ్రజస్త్రియో విస్రస్తమాలాభరణాః కురూద్వహ

ఇంతమంది గోపికలతో కూడిన కృష్ణ పరమాత్మలో ఎటువంటి వికారం లేదు. కానీ కృష్ణుని స్పర్శ వలన వారు  కలత చెందారు. వారి ఇంద్రియాలు కలత చెందాయి.కొప్పూ వస్త్రమూ కుచ పట్టిక, ఇవన్నీ ఉంటున్నాయా ఊడుతున్నాయా అన్న విషయం తెలుసుకోలేకపోయారు
ఆభరణాలు తొలగిపోతున్నాయి,వస్త్రాలూ తొలగిపోతున్నాయి. ఉన్మత్తక ఆనందములో ఉన్నారు

కృష్ణవిక్రీడితం వీక్ష్య ముముహుః ఖేచరస్త్రియః
కామార్దితాః శశాఙ్కశ్చ సగణో విస్మితోऽభవత్

కృత్వా తావన్తమాత్మానం యావతీర్గోపయోషితః
రేమే స భగవాంస్తాభిరాత్మారామోऽపి లీలయా

పరమాత్మ రాస క్రీడా విహారాన్ని చూచి ఆకాశములో విమానాలలో ఉన్న స్త్రీలందరూ మూర్చపోయారు.కామమోహితులయ్యారు. నక్షత్రాలతో కూడి ఉన్న చంద్రుడూ ఆశ్చర్యపోయాడు.ఎంత మంది గోపికా స్త్రీలు ఉన్నారో అంతమంది స్వరూపాలని తాను ఏర్పరచుకుని వారందరితో రమించాడు. ఆయన ఆనందం పొందడానికి వేరేవారితో పని లేదు. ఆయన ఆత్మారాముడు.వారికి ఆనందాన్ని కలిగించడం కోసం తాను ఆత్మారాముడైనా వారితో రమించాడు

తాసాం రతివిహారేణ శ్రాన్తానాం వదనాని సః
ప్రామృజత్కరుణః ప్రేమ్ణా శన్తమేనాఙ్గ పాణినా

ఇలా ఆడి ఆడి అలసి సొలసి గోపికల ముఖాలన్నీ వాడిపోగా స్వామి  యొక్క అమృతమైన కర స్పర్శతో నూత్న కాంతి కలిగింది

గోప్యః స్ఫురత్పురటకుణ్డలకున్తలత్విడ్
గణ్డశ్రియా సుధితహాసనిరీక్షణేన
మానం దధత్య ఋషభస్య జగుః కృతాని
పుణ్యాని తత్కరరుహస్పర్శప్రమోదాః

చక్కని మకర కుండలాలతో చిరునవ్వుతో కృష్ణున్ని వీరూ, వీరిని కృష్ణుడూ ప్రేమించుకుంటున్నారు. ఒకరిని ఒకరు చిరునవ్వుతో ప్రేమించుకుంటున్నారు. అంతకు మించి మాట్లాడడానికి వీరికి ఓపికలేదు.కృష్ణుని లీలావిలాసమును అందరూ పరవశముతో గానం చేసారు.పరమాత్మ యొక్క గోళ్ళ స్పర్శతో (కర రుహాలంటే గోళ్ళు) ఆనందించిన గోపికలు కృష్ణ లీలలను గానం చేసారు

తాభిర్యుతః శ్రమమపోహితుమఙ్గసఙ్గ
ఘృష్టస్రజః స కుచకుఙ్కుమరఞ్జితాయాః
గన్ధర్వపాలిభిరనుద్రుత ఆవిశద్వాః
శ్రాన్తో గజీభిరిభరాడివ భిన్నసేతుః

ఆడీ ఆడీ విహరించి విహరించి ఒళ్ళంతా చెమట పట్టింది, ఆభరణాలు జారిపోయాయి,వస్త్రాలు జారిపోయాయి.వీఎరిని తీసుకు మగ ఏనుగు ఆడ ఏనుగులతో నదిలో ప్రవేశించినట్లుగా, వారికి విశ్రాంతి కలిగించడానికి యమునా నదికి తీసుకు వెళ్ళి జలక్రీడలాడాడు

సోऽమ్భస్యలం యువతిభిః పరిషిచ్యమానః
ప్రేమ్ణేక్షితః ప్రహసతీభిరితస్తతోऽఙ్గ
వైమానికైః కుసుమవర్షిభిరీద్యమానో
రేమే స్వయం స్వరతిరత్ర గజేన్ద్రలీలః

నీటిలో అందరూ కలసి స్వామి మీద నీరు జల్లగాఅ, నదిలో గోపికలు నీరు జల్లుతోంటే పైనుంచి దేవతా స్త్రీలు పుష్ప వర్షం కురిపిస్తున్నారు. దేవతలు స్తోత్రం చేస్తున్నారు. ఆత్మారాముడైన కృష్ణుడు గజేంద్రునిలాగ వారితో విహరించాడు.

తతశ్చ కృష్ణోపవనే జలస్థల ప్రసూనగన్ధానిలజుష్టదిక్తటే
చచార భృఙ్గప్రమదాగణావృతో యథా మదచ్యుద్ద్విరదః కరేణుభిః

నీటిలోనూ నేల మీదా వారే. అది కృష్ణునికి వనమయ్యింది. నీటిలో గానీ నేల మీద గానీ యువతుల కొప్పుల నుండి జారిన పూలతో నిండి ఉండగా, ఆ సుగంధానికొరకు తుమ్మెదలనీ చేరగా, మగ ఏనుగు విహరించినట్లు కాసేపు నీటిలో కాసేపు ఒడ్డు మీదా విహరించాడు

ఏవం శశాఙ్కాంశువిరాజితా నిశాః స సత్యకామోऽనురతాబలాగణః
సిషేవ ఆత్మన్యవరుద్ధసౌరతః సర్వాః శరత్కావ్యకథారసాశ్రయాః

అమోఘమైన, వ్యర్థం కాని సత్యకాముడు పరమాత్మ మనను తన దగ్గరకు చేర్చుకోవడానికి పరమాత్మ చేసే ప్రయత్నమే ఇదంతా. ఆ భూములూ ప్రాంతాలూ, అన్నీ శరత్కాలములో ప్రేమ కావ్యా రసముతో నిండి పోయింది.

శ్రీపరీక్షిదువాచ
సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయేతరస్య చ
అవతీర్ణో హి భగవానంశేన జగదీశ్వరః

ధర్మాన్ని స్థాపించడానికి, అధర్మాన్ని నశింపచేయడానికి పరమాత్మ అవతరించాడంటున్నారు. అన్ని రకాల ధర్మాలనూ బోధించేవాడూ ఆచరించేవాడూ రక్షించేవాడూ ఆయనే. పరధారా మర్శనం అనే ధర్మ వ్యతిరేకమైన పనిని ఎలా చేసాడు

స కథం ధర్మసేతూనాం వక్తా కర్తాభిరక్షితా
ప్రతీపమాచరద్బ్రహ్మన్పరదారాభిమర్శనమ్

ఆప్తకామో యదుపతిః కృతవాన్వై జుగుప్సితమ్
కిమభిప్రాయ ఏతన్నః శంశయం ఛిన్ధి సువ్రత

ఆయన ఆప్త కాముడు యదుపతి, మనం కూడా అసహ్యించుకునే పనిని ఎలా చేసాడు.

శ్రీశుక ఉవాచ
ధర్మవ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాం చ సాహసమ్
తేజీయసాం న దోషాయ వహ్నేః సర్వభుజో యథా

దేవతలూ ప్రభువులూ జగన్నాధులూ కొన్ని సంధర్భాలలో జగత్తును రక్షించడానికి ధర్మాన్ని వ్యతికరించినట్లు కనపడుతుంది. తేజో వంతులకు ఇది దోషాలని కలిగించవు. అగ్ని అన్నిటినీ తింటుంది కానీ దోషం అంటదు.

నైతత్సమాచరేజ్జాతు మనసాపి హ్యనీశ్వరః
వినశ్యత్యాచరన్మౌఢ్యాద్యథారుద్రోऽబ్ధిజం విషమ్

కానీ పెద్దలు ఆచరించారు కాబట్టి నేనూ ఆచరిస్తాను అని మనసుతో కూడా అసమర్ధుడు అనుకోకూడదు.మూర్ఖత్వముతో ఆచరిస్తే నశిస్తాడు.
శంకరుడు విషం తాగాడు. నేను కూడా తాగుతామని ఎలా అనలేరో అలాగ. వారు చేసే పనుల్లో తప్పు ఒప్పు ఎంచే పని మనం చేయరాదు. వారు చేసారు కాబట్టి నేనూ చేస్తానంటే నశిస్తారు.

ఈశ్వరాణాం వచః సత్యం తథైవాచరితం క్వచిత్
తేషాం యత్స్వవచోయుక్తం బుద్ధిమాంస్తత్సమాచరేత్

అందుకే పెద్దలు చేసిన దాన్ని కాదు, చెప్పిన దాన్ని చేయాలి. వారు అలా చేసేది మనను ఉద్దరించడానికే, లోక కళ్యాణానికే. పరమాత్మ చరిత్రను ఏ విధముగా కీర్తించినా మోక్షప్రదమే.
పరమాత్మ లీలలలో మాధుర్యాన్ని గుర్తిస్తే మోక్షం, దానిలో కూడా తుచ్చ బుద్ధి చూస్తే నరకం. నరకం ఇవ్వడానికి కూడా ఆస్కారం ఇవ్వడానికే పరమాత్మ ఈ లీలలను చేస్తాడు. ఆ లీలలు రెండు రకాలుగానూ పనిచేస్తాయి, మోక్షం ఇస్తాయి, నరకమూ ఇస్తాయి.

కుశలాచరితేనైషామిహ స్వార్థో న విద్యతే
విపర్యయేణ వానర్థో నిరహఙ్కారిణాం ప్రభో

స్వార్థము లేకుండా పరోపకారము కోసం చేసే లీలలు. చేయడములో స్వార్థమూ చేయకుంటే అనర్థమూ లేదు కృష్ణుడికి. ఆయనకు ఏ ఆనందమూ లేదు. సమబంధమూ లేదు.
అటువంటప్పుడు పరమాత్మ ఆచరించే ఏ ఆచరణలో దోషం ఉంటుంది, స్వార్థం ఉంటుంది?

కిముతాఖిలసత్త్వానాం తిర్యఙ్మర్త్యదివౌకసామ్
ఈశితుశ్చేశితవ్యానాం కుశలాకుశలాన్వయః

యత్పాదపఙ్కజపరాగనిషేవతృప్తా
యోగప్రభావవిధుతాఖిలకర్మబన్ధాః
స్వైరం చరన్తి మునయోऽపి న నహ్యమానాస్
తస్యేచ్ఛయాత్తవపుషః కుత ఏవ బన్ధః

ఏ లోకములో ఐనా ఆయనకు ఎటువంటి బంధములూ ఉండవు.  ఈయన పాద పరాగాన్ని సేవించడం వలన తృప్తి పొంది, ఆ తృప్తితో కలిగిన యోగముతో అన్ని బంధములనూ తొలగించుకుని మునులూ ఋషులూ హాయిగా సంచరిస్తూ ఉంటే అలాంటి స్వామికేమి బంధముంటుంది.
కర్మతో వచ్చిన దేహానికి బంధముంటుంది కానీ, తన సంకల్పముతో శరీరం తెచ్చుకున్నవారికి ఈ బధాలన్నీ ఉంటాయా

గోపీనాం తత్పతీనాం చ సర్వేషామేవ దేహినామ్
యోऽన్తశ్చరతి సోऽధ్యక్షః క్రీడనేనేహ దేహభాక్

ఆయన లేని దేహం ఎక్కడ ఉంది. పరుల దేహముతో ఆడకుంటే పాపం. ఆయనకు పరం ఎక్కడ ఉంది? అందరి శరీరములో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తాను ఎందులో ఉన్నాడో దానితో విహరిస్తే అధర్మమా?

అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహమాస్థితః
భజతే తాదృశీః క్రీడ యాః శ్రుత్వా తత్పరో భవేత్

సకల ప్రాణులనూ అనుగ్రహించడానికి మానుష్య దేహం పొందాడు. సకల లోకాలనూ అనుగ్రహించడానికి మానవ శరీరం ధరించి అలాంటి క్రీడలను అనుభవిస్తాడు. ఆయన అనుసరించిన క్రీడలను విని మనం తన్మయులం కావాలి. అపుడు మనకు ఈ దేహ బంధం పోతుంది.

నాసూయన్ఖలు కృష్ణాయ మోహితాస్తస్య మాయయా
మన్యమానాః స్వపార్శ్వస్థాన్స్వాన్స్వాన్దారాన్వ్రజౌకసః

భర్తలను విడిచిపెట్టి వచ్చిన గోపికలు వారి వారి ఇళ్ళకు వెళ్ళగా పరమాత్మ మాయతో మోహించబడిన వారి భర్తలెవ్వరూ అసూయపడలేదు. వారికెవ్వరికీ తమ భార్యలు తమ శయ్య విడిచి వెళ్ళినట్లు తెలియలేదు

బ్రహ్మరాత్ర ఉపావృత్తే వాసుదేవానుమోదితాః
అనిచ్ఛన్త్యో యయుర్గోప్యః స్వగృహాన్భగవత్ప్రియాః

ఇంతలో బ్రాహ్మీ ముహూర్తం రాగానే పరమాత్మ అంగీకారముతో కృష్ణున్ని విడిచివెళ్ళుట ఇష్టం లేకున్న భగవత్ ప్రియులు కాబట్టి తమ తమ ఇళ్ళకు వెళ్ళిపోయారు

విక్రీడితం వ్రజవధూభిరిదం చ విష్ణోః
శ్రద్ధాన్వితోऽనుశృణుయాదథ వర్ణయేద్యః
భక్తిం పరాం భగవతి ప్రతిలభ్య కామం
హృద్రోగమాశ్వపహినోత్యచిరేణ ధీరః

ఇలా శ్రీమన్నారాయుని యొక్క గోపికలతో విహరించిన ఈ గాధను విన్నా వివరించినా పరమాత్మ యందు ఉత్తమమైన భక్తిని పొంది, హృదయానికి ఉన్న రోగాలు పోతాయి. అపార్థాలూ వ్యామోహాలూ మమకారాలూ తొలగుతాయి. తొందరగానే వారు ధీరులవుతారు.

                                                    సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment