Wednesday, July 3, 2013

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం

                                                  ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం దశమ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే
గోలోకాదావ్రజత్కృష్ణం సురభిః శక్ర ఏవ చ

ఇలా ధారాపాతముతో బాధపడిన వ్రేపల్లెల్ను గోవర్థన పర్వతాన్ని ధరించి స్వామి రక్షిస్తే
గోలోకము నుండి కామధేనువూ ఇంద్రుడూ బయలు దేరి వచ్చారు. అందరూ చూడకుండా రహస్యముగా వచ్చి, చేసిన అపచారానికి సిగ్గుపడుతూ తన కిరీటముతో స్వామి పాదాల మీద పడ్డాడు

వివిక్త ఉపసఙ్గమ్య వ్రీడీతః కృతహేలనః
పస్పర్శ పాదయోరేనం కిరీటేనార్కవర్చసా

దృష్టశ్రుతానుభావోऽస్య కృష్ణస్యామితతేజసః
నష్టత్రిలోకేశమద ఇదమాహ కృతాఞ్జలిః

కనులారా స్వామి ప్రభావం చూసిన తరువాత "నేను త్రిలోకాధిపతిని" అన్న గర్వం పోయింది. చేతులు జోడించి ఇంద్రుడు అంటున్నాడు.

ఇన్ద్ర ఉవాచ
విశుద్ధసత్త్వం తవ ధామ శాన్తం తపోమయం ధ్వస్తరజస్తమస్కమ్
మాయామయోऽయం గుణసమ్ప్రవాహో న విద్యతే తే గ్రహణానుబన్ధః

పరమాత్మా, నీ నివాసం శాంతం. గుణత్రయ ఉత్తేజితం కాదు. ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. రజో గుణ తమో గుణాలు నశించి ఉంటాయి. సంసారమంతా గుణ త్రయముతో ప్రసరిస్తోంది

కుతో ను తద్ధేతవ ఈశ తత్కృతా లోభాదయో యేऽబుధలిన్గభావాః
తథాపి దణ్డం భగవాన్బిభర్తి ధర్మస్య గుప్త్యై ఖలనిగ్రహాయ

జ్ఞ్యానం లేని వారికి కలిగేదే కామ క్రోధాధులు. మాలాంటి దుర్మార్గులను నిగ్రహించడానికీ ధర్మ రక్షణకూ నీవు దండిస్తావు.

పితా గురుస్త్వం జగతామధీశో దురత్యయః కాల ఉపాత్తదణ్డః
హితాయ చేచ్ఛాతనుభిః సమీహసే మానం విధున్వన్జగదీశమానినామ్

నీవే తండ్రివీ గురువువూ జగన్నాధుడివి. నీవే కాలానివీ, దండం విధించేవాడివి, లోకహితంకోసం అనుకున్న రూపముతో అవతరిస్తున్నావు. మేము లోకేశులం అని గర్వించే వారి గర్వాన్ని అణచడానికి అవతరిస్తున్నావు. నాలాంటి అజ్ఞ్యానులు మేమే లోకేశులం అని గర్వించి నిన్ను చూసి అభయాన్ని పొందుతున్నాము

యే మద్విధాజ్ఞా జగదీశమానినస్త్వాం వీక్ష్య కాలేऽభయమాశు తన్మదమ్
హిత్వార్యమార్గం ప్రభజన్త్యపస్మయా ఈహా ఖలానామపి తేऽనుశాసనమ్

ఎలా సాధువులను కాపాడతావో దుష్టులనుకూడా వారి గర్వాన్ని అణచి కాపాడతావు

స త్వం మమైశ్వర్యమదప్లుతస్య కృతాగసస్తేऽవిదుషః ప్రభావమ్
క్షన్తుం ప్రభోऽథార్హసి మూఢచేతసో మైవం పునర్భూన్మతిరీశ మేऽసతీ

ఐశ్వర్య మదముతో ఉన్న నేను గర్వించి తప్పు చేసాను. నీ ప్రభావాన్ని తెలియని నా అపరాధాన్ని క్షమించండి.నా గర్వాన్ని నీవు అణచావు

తవావతారోऽయమధోక్షజేహ భువో భరాణామురుభారజన్మనామ్
చమూపతీనామభవాయ దేవ భవాయ యుష్మచ్చరణానువర్తినామ్

తమనే తాము పోషించుకుంటున్నామనే గర్వముతో భూమికి భారం కలిగించే సేనాధిపతులనూ రాక్షసులనూ రాజులను సంహరించి నీ పాదాలను చేరిన వారికి క్షేమం కలిగించడానికి నీ అవతారం . మహానుభావుడవైన పరమాత్మా నీకు నమస్కారం. వాసుదేవ కృష్ణ పరమాత్మకు నమస్కారం

నమస్తుభ్యం భగవతే పురుషాయ మహాత్మనే
వాసుదేవాయ కృష్ణాయ సాత్వతాం పతయే నమః

స్వచ్ఛన్దోపాత్తదేహాయ విశుద్ధజ్ఞానమూర్తయే
సర్వస్మై సర్వబీజాయ సర్వభూతాత్మనే నమః

నీకుగా నీవు సంకల్పించుకుని దేహాన్ని తెచ్చుకున్నావు విశుద్ధ జ్ఞ్యాన స్వరూపిడివి, అన్నీ నీవే , అన్ని బీజములూ , అన్ని ప్రాణుల స్వరూపాలూ నీవే. నేను ఈ వ్రేపల్లెను ధ్వంసం చేయాలని ధారాపాతములతో వర్షించాను. కోపముతో గర్వముతో ఈ పని చెస్తే, అలాంటి నన్ను కూడా నీవు  అనుగ్రహించావు. నా గర్వం అంతా ధ్వంసం అయ్యింది, నా ప్రయత్నం వ్యర్థమయ్యింది. పరమాత్మవూ గురువువూ స్వామివీ ఐన నిన్ను శరణు వేడుతున్నాను.

మయేదం భగవన్గోష్ఠ నాశాయాసారవాయుభిః
చేష్టితం విహతే యజ్ఞే మానినా తీవ్రమన్యునా

త్వయేశానుగృహీతోऽస్మి ధ్వస్తస్తమ్భో వృథోద్యమః
ఈశ్వరం గురుమాత్మానం త్వామహం శరణం గతః

శ్రీశుక ఉవాచ
ఏవం సఙ్కీర్తితః కృష్ణో మఘోనా భగవానముమ్
మేఘగమ్భీరయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్

ఇలా ఇంద్రుడు స్తోత్రం చేస్తే మేఘ గంభీరమైన వాక్కుతో ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
మయా తేऽకారి మఘవన్మఖభఙ్గోऽనుగృహ్ణతా
మదనుస్మృతయే నిత్యం మత్తస్యేన్ద్రశ్రియా భృశమ్

నిన్ను అనుగ్రహించ దలచే నీ యజ్ఞ్యాన్ని నేను భంగం చేసాను. నేనే ఇంద్రున్నని ఐశ్వర్య గర్వం పెరిగి నన్ను మరచావు. మళ్ళీ  నన్ను జ్ఞ్యాపకం ఉంచుకోవడానికీ నిరంతరం నన్ను స్మరించడానికీ ఇలా చేసాను.

మామైశ్వర్యశ్రీమదాన్ధో దణ్డ పాణిం న పశ్యతి
తం భ్రంశయామి సమ్పద్భ్యో యస్య చేచ్ఛామ్యనుగ్రహమ్

ఐశ్వర్య శ్రీ మదముతో ఉన్నవాడు చేసిన తప్పుకు నిరంతరం శిక్ష వేయడానికి దండధారి అయి సిద్ధముగా ఉంటాను. ఐశ్వర్య మద మత్తులకు ఈ విషయం తెలియదు.

నేను ఎవరిని అనుగ్రహించాలనుకుంటానో వారిని సంపదలనుండి భ్రష్టు పట్టిస్తాను

గమ్యతాం శక్ర భద్రం వః క్రియతాం మేऽనుశాసనమ్
స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వః స్తమ్భవర్జితైః

స్వర్గానికి వెళ్ళి నేను చెప్పినట్లు విను. నా శాసనాన్ని పాలించు. నీ ధర్మం నీవు చేయి. గర్వం లేకుండా మీ మీ అధికారాలలో ఉండండి. బుద్ధి తెచ్చుకుని ప్రవర్తించండి

అథాహ సురభిః కృష్ణమభివన్ద్య మనస్వినీ
స్వసన్తానైరుపామన్త్ర్య గోపరూపిణమీశ్వరమ్

అపుడు కామధేనువు పరమాత్మకు నమస్కరించి తన సంతానమైన గోవులతో కలసి, గోరూపి ఐన ఈశ్వరునికి

సురభిరువాచ
కృష్ణ కృష్ణ మహాయోగిన్విశ్వాత్మన్విశ్వసమ్భవ
భవతా లోకనాథేన సనాథా వయమచ్యుత

త్వం నః పరమకం దైవం త్వం న ఇన్ద్రో జగత్పతే
భవాయ భవ గోవిప్ర దేవానాం యే చ సాధవః

పరమాత్మ సకల జగద్స్వరూపా, మహాయోగీ, సకల ప్రపంచాన్నీ సృష్టించిన వాడా, నీలాంటి లోకనాధులు ఉండడం వలనే మేము సనాధులం (దిక్కు ఉన్నవారం) అయ్యాము. నీవే పరదైవానివి, నీవే మాకు ఇంద్రుడవు
గోవులకూ బ్రాహ్మణులకూ దేవతలకూ సజ్జనులకూ క్షేమాన్ని ప్రసాదించు

ఇన్ద్రం నస్త్వాభిషేక్ష్యామో బ్రహ్మణా చోదితా వయమ్
అవతీర్ణోऽసి విశ్వాత్మన్భూమేర్భారాపనుత్తయే

చతుర్ముఖ బ్రహ్మ మమ్ము పంపాడు నీకు గోవిందుడిగా అభిషేకం చేయమని. భూభారాన్ని తొలగించడానికి నీవు అవతరించావు. అటువంటి నిన్ను మేము పూజిస్తాము.

శృశుక ఉవాచ
ఏవం కృష్ణముపామన్త్ర్య సురభిః పయసాత్మనః
జలైరాకాశగఙ్గాయా ఐరావతకరోద్ధృతైః

ఐరావతం తన తొండములతో ఆకాశ గంగను చిమ్మింది. కామధేనువు తన పాలతో

ఇన్ద్రః సురర్షిభిః సాకం చోదితో దేవమాతృభిః
అభ్యసిఞ్చత దాశార్హం గోవిన్ద ఇతి చాభ్యధాత్

దేవేంద్రుడు సకల దేవతా ఋషులతో దేవమాతలతో కలసి , దేవర్షులూ దిగ్పాలకులూ కలసి స్వామిని గోవిందుడిగా అభిషేకం చేసారు.

తత్రాగతాస్తుమ్బురునారదాదయో గన్ధర్వవిద్యాధరసిద్ధచారణాః
జగుర్యశో లోకమలాపహం హరేః సురాఙ్గనాః సన్ననృతుర్ముదాన్వితాః

పరమాత్మకు అభిషేకం జరుగుతూ ఉంటే తుంబురు నారదాదులూ గంధర్వ సిద్ధ చరణాదులూ విద్యాధరులూ  మొదలైన వారు ఆయన కీర్తిని గానం చేసారు
దేవతా స్త్రీలు నాట్యం చేసారు

తం తుష్టువుర్దేవనికాయకేతవో హ్యవాకిరంశ్చాద్భుతపుష్పవృష్టిభిః
లోకాః పరాం నిర్వృతిమాప్నువంస్త్రయో గావస్తదా గామనయన్పయోద్రుతామ్

అఖిల దేవతా లోకాలలో ఉండే దేవతలనదరూ ఏకకంఠముతో పరమాత్మను స్తోత్రం చేసారు. లెక్కలేనన్ని పుష్పాలతో స్వామిని కప్పేసారు,పూలతో ఉన్న గోవర్ధనములా ఉన్నాడు స్వామి
మూడు లోకాలూ ఎన్నడూ లేని ఆనందాన్ని పొందాయి. భూలోకం మొత్తం గోవుల పాలతో నిండిపోయింది. అన్ని గోవులూ పాలను  వర్షించాయి.  ఆకాశమునుండి ఆకాశగంగ, కామధేనువు. 

నానారసౌఘాః సరితో వృక్షా ఆసన్మధుస్రవాః
అకృష్టపచ్యౌషధయో గిరయోऽబిభ్రనున్మణీన్

అంతేకాకుండా ఎక్కడెక్కడి నదులూ కూడా తమ రసాన్ని తీసుకు వచ్చి అభిషేకం చేసాయి, చెట్లు తీగలతో, పళ్ళు తన రసాలతో అభిషేకం చేయాసి. అన్ని వనస్పతులు వనౌషధములూ నదులు వృక్షములూ పర్వతములూ, పర్వతాలు తమ  పర్వత ప్రాంతాలలో ఉన్న తేనెను స్వామి మీద కురిపించాయి. మూడు లోకాలలో ఉన్న అనంతమైన దేవతలూ ఋషులు అందరూ అభిషేకం చేసారు. గోలోకమే భూలోకమయ్యిందేమో అనిపించేట్లుగా ఉంది. ఈ అనుభూతి వచ్చిన వారందరూ పొందారు.

కృష్ణేऽభిషిక్త ఏతాని సర్వాణి కురునన్దన
నిర్వైరాణ్యభవంస్తాత క్రూరాణ్యపి నిసర్గతః

భూమి దున్నకుండానే విత్తనం వేయకుండానే ఇంతకాలం చుట్టుపక్కల వారు ఏ ఏ పంటలు వేసారో ఆ పంటలన్నీ భూమిని పెకిలించుకుని వచ్చి స్వామిని అభిషేకించాయి.పాలూ నీరూ పళ్ళూ అమృతం తేనే, దున్నకుండానే పంటపండి ధాన్యం ,
ఏనుగులు కూడా మదజలాన్ని తెచ్చి వర్షించాయి. (పాద్మములో చెప్పబడి ఉంది - ఆ ఏనుగులను సింహాలు మోసుకుని వచ్చాయి మద జలం వర్షించమని. కృరమృగాలు కూడా సహజముగానే తమ వైరాన్ని విడిచిపెట్టాయి, )చెట్లూ పుట్టలూ గుహలూ గనులూ అన్నీ వచ్చాయి. 

ఇతి గోగోకులపతిం గోవిన్దమభిషిచ్య సః
అనుజ్ఞాతో యయౌ శక్రో వృతో దేవాదిభిర్దివమ్

గోకుల పతి ఐన స్వామిని గోవిందుడిగా అభిషేకం చేసాయి. చేసిన తరువాత స్వామి వద్ద ఆజ్ఞ్య పొంది అందరినీ తీసుకుని ఎంత వేగముగా వచ్చారో అంత వేగముగా తమ లోకాలకు వెళ్ళారు. 

                                               సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment