Wednesday, May 1, 2013

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ప్రధమాధ్యాయం

శ్రీమద్భాగవతం ఎనిమిదవ స్కంధం ప్రధమాధ్యాయం

శ్రీరాజోవాచ
స్వాయమ్భువస్యేహ గురో వంశోऽయం విస్తరాచ్ఛ్రుతః
యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్వదస్వ నః

స్వాయంభూవ మనువు చరిత్రను చెప్పారు. ఇతర మనువుల చరిత్రను కూడా వివరించవలసింది. ప్రతీ మన్వంతరములోనూ మనువూ మనుపుత్రులూ ఇంద్రుడూ దేవతలూ సప్తఋషులూ పరమాత్మ అవతారాలు ఉంటాయి. పరమాత్మ యొక్క జన్మ, ఆయన కర్మలు జ్ఞ్యానులు చెబుతూ ఉంటారు. అవి మాకు వివరించండి.

మన్వన్తరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః
గృణన్తి కవయో బ్రహ్మంస్తాని నో వద శృణ్వతామ్

యద్యస్మిన్నన్తరే బ్రహ్మన్భగవాన్విశ్వభావనః
కృతవాన్కురుతే కర్తా హ్యతీతేऽనాగతేऽద్య వా

జరిగిన దానిలో జరగబోయే దానిలో జరుగుతున్న దానిలో పరమాత్మ ఏమేమి చేసి ఉన్నాడో ఏమేమి చేయబోతాడు ఏమేమి చేస్తున్నాడో చెప్పవలసింది.

శ్రీఋషిరువాచ
మనవోऽస్మిన్వ్యతీతాః షట్కల్పే స్వాయమ్భువాదయః
ఆద్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సమ్భవః

ఈ కల్పములో మనకు ఆరుగురు మనువులు గడిచిపోయారు. ఆరు మనువులలో మొదటివాడైన స్వాయంభువ మన్వంతరం నీకు వివరించాను.

ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తస్య వై మనోః
ధర్మజ్ఞానోపదేశార్థం భగవాన్పుత్రతాం గతః

ఆకూతి (రుచి భార్య) దేవహూతి (కర్దముని భార్య) అనే వారిలో అకూతి గురించి చెబుతాను. దేవహూతికి కపిలునిగా వచ్చాడు. అకూతికీ రుచికీ యజ్ఞ్యుడిలా వచ్చాడు పరమాత్మ. కపిలుడు జ్ఞ్యానోపదేశం. యజ్ఞ్యుడు ధర్మోపదేశము గురించి వచ్చాడు.

కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితమ్
ఆఖ్యాస్యే భగవాన్యజ్ఞో యచ్చకార కురూద్వహ

ఇది వరకే నీకు కపిల చరిత్ర విస్తారముగా చెప్పాను. ఇపుడు యజ్ఞ్యుని గురించి వివరిస్తాను.

విరక్తః కామభోగేషు శతరూపాపతిః ప్రభుః
విసృజ్య రాజ్యం తపసే సభార్యో వనమావిశత్

ఇలా సంతానం కలిగిన తరువాత స్వాయంభువ మనువు సంసారం యందు విరక్తి కలిగి రాజ్యాన్ని విడిచి వానప్రస్థాశ్రమానికి వనానికి వెళ్ళి.

సునన్దాయాం వర్షశతం పదైకేన భువం స్పృశన్
తప్యమానస్తపో ఘోరమిదమన్వాహ భారత

సునంద తీరములో ఘోరముగా ఒంటి కాలి మీద నిలబడి ఈ మంత్రాన్ని జపించాడు. శరీరానికి కావలసిన దాని కన్నా శరీరాన్ని దూరముగా ఉంచడం తపస్సు. తపస్సు శరీరానికి, జపం మనసుకీ.

శ్రీమనురువాచ
యేన చేతయతే విశ్వం విశ్వం చేతయతే న యమ్
యో జాగర్తి శయానేऽస్మిన్నాయం తం వేద వేద సః

పరమాత్మ సకల ప్రపంచములో స్పందన కలిగిస్తాడు. సకల ప్రపంచాన్నీ స్పందింపచేస్తాడు. ఈ ప్రపంచం పరమాత్మని స్పందింపచేయలేదు. సకల చరాచరజగత్తూ నిద్రపోయినా ఆయన నిద్రపోడు. (వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే .. - పరమాత్మ స్వరూపం ఎవరికీ అర్థం కాదని నాకు తెలుసు )

ఆత్మావాస్యమిదం విశ్వం యత్కిఞ్చిజ్జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధః కస్య స్విద్ధనమ్

పరమాత్మ చేత విడువబడిన జగత్తులో నీవు అనుభవించడానికి ప్రయత్నించకు. భగవంతుడు వ్యాపించని ప్రదేశం లేదు. పరమాత్మకు సంబంధించినదాన్ని నాది అనకు. పరమాత్మ అనుగ్రహించిన దాన్ని ఆయన ప్రసాదముగా స్వీకరించు. ఆయనకు అర్పించవలసినదాన్ని నీవు దొంగిలించకు. భగవంతునికి సంబంధించిన జీవున్ని నాది అనుకోకు.తేన త్యక్తే నభుఞ్జీథా - పరమాత్మది కాదు అని అనుకొని ప్రపంచాన్ని నీవు అనుభవించ ప్రయత్నించవద్దు.

యం పశ్యతి న పశ్యన్తం చక్షుర్యస్య న రిష్యతి
తం భూతనిలయం దేవం సుపర్ణముపధావత

మన కన్ను పరమాత్మను చూడాలి. మనను చూస్తున్న పరమాత్మను ఏ కన్ను చూడలేదో, పరమాత్మను చూడలేని కన్నుకు ఎవరు చూపును ఇస్తారో, జగత్తును చూస్తున్న పరమాత్మ జ్ఞ్యాన చక్షువు క్షీణించదు, పరమాత్మను చూడలేని మన చక్షువు యొక్క శక్తి క్షీణిస్తుంది. ప్రపంచం మొత్తాన్నీ స్వామి లయం చేస్తాడు, కానీ ఆయన శక్తి లయం కాదు. పరమాత్మ ప్రపంచాన్ని చూస్తున్నాడన్న మన జ్ఞ్యానం లయమవుతుంది. పరమాత్మ భూత నిలయుడు (సకల ప్రపంచాన్నీ దాచుకున్నవాడు). ఆయన సుపర్ణుడు. అలాంటి పరమాత్మను సేవించండి.

న యస్యాద్యన్తౌ మధ్యం చ స్వః పరో నాన్తరం బహిః
విశ్వస్యామూని యద్యస్మాద్విశ్వం చ తదృతం మహత్

పరమాత్మకు ఆది మధ్య అంతములు లేవు, తన వారు ఇతరులూ తటస్థులూ అన్న భావము లేవు. ప్రపంచానికి ఇవి ఉన్నాయి. ఇంత పెద్ద విశము పరమాత్మ చేత సృష్టించబడేదీ రక్షించబడేది. పరమాత్మ విశ్కాయ (విశ్వరూపుడు).

స విశ్వకాయః పురుహూతశః సత్యః స్వయంజ్యోతిరజః పురాణః
ధత్తేऽస్య జన్మాద్యజయాత్మశక్త్యా తాం విద్యయోదస్య నిరీహ ఆస్తే

సకల వేద వాక్యాల చేతా స్మరించబడే వాడు. బ్రహ్మాది దేవతలతో ఆహావింపబడేవాడు. త్రికాల అబాధితుడు, స్వయంప్రకాశుడు,ప్రకృతి గుణాలతో బాధించబడని వాడు. యోగ మాయ చేత ప్రపంచం యొక్క జన్మ స్థితి లయాలను కలిగించేవాడు. ఆ సృష్టి స్థితి లయములను తన జ్ఞ్యానముతో ప్రభావముతో తొలగించి ఎలాంటి కోరికా లేకుండా ఉంటాడు. తాను సృష్టించిన జగత్తు మీద మమకారం ఉండదు.

అథాగ్రే ఋషయః కర్మాణీహన్తేऽకర్మహేతవే
ఈహమానో హి పురుషః ప్రాయోऽనీహాం ప్రపద్యతే

లోకములో ఋషులు ఇకముందు కర్మలు ఆచరించ వలసిన అవసరం లేకుండా కర్మను చేస్తారు. వైరాగ్యం కలగడానికి కర్మలు చేస్తారు. వారు నశ్వరమైన ఫలితాన్ని ఆశించి కర్మలు చేయరు. వైరాగ్యం కలగడం కోసం ఋషులు కర్మలు ఆచరిస్తారు. కోరిక పుడితే దాని వలన తాము అనుభవించిన కష్టములు బేరీజు వేసుకుంటే కోరిక మీద విరక్తి కలుగుతుంది.

ఈహతే భగవానీశో న హి తత్ర విసజ్జతే
ఆత్మలాభేన పూర్ణార్థో నావసీదన్తి యేऽను తమ్

కోరికలో మనం లగ్నం కానంతవరకూ కోరిక తప్పు కాదు. పరమాత్మ సృష్టి చేయాలని సంకల్పించాడు కానీ, దాని మీద ఆశపెట్టుకోలేదు. ధర్మముగా కర్మలు ఆచరించాలి గానీ అభిలాషతో కాదు. జరగబోయే ఫలితం మీద ఆలోచన కర్మను సరిగా చేయనివ్వదు. పరమాత్మ ఆత్మలాభముతో (తనకు తాను లభించే దానితో) పూర్ణుడు కాబట్టి, ఎవరు పరమాత్మను అనుసరిస్తారో వారు కూడా బాధపడరు.

తమీహమానం నిరహఙ్కృతం బుధం నిరాశిషం పూర్ణమనన్యచోదితమ్
నౄన్శిక్షయన్తం నిజవర్త్మసంస్థితం ప్రభుం ప్రపద్యేऽఖిలధర్మభావనమ్

పరమాత్మ సంకల్పిస్తాడు, సృష్టీ రక్షణ జరగాలని. కానీ జ్ఞ్యాన స్వరూపుడు కాబట్టి నేనే సృష్టిస్తున్నాను, నేనే కాపాడుతున్నాను అని అనుకోడు. జ్ఞ్యానం ఉన్నట్లు గుర్తు కోరిక లేకపోవడం. కోరికలు పూర్ణులకు ఉండవు. పూర్ణత్వానికి గుర్తు తనకు తానుగా ప్రవర్తించడం (ఎవరో ప్రేరేపిస్తే ప్రయత్నించకపోవడం). జీవులకు తత్వమును నేర్పేవాడు, తన దారిలోనే తాను ఉండేవాడు, అలాంటి వాడే ప్రభువు. ఆయననే సేవించాలి. ఆయన అన్ని ధర్మములకూ మూలపురుషుడు.

శ్రీశుక ఉవాచ
ఇతి మన్త్రోపనిషదం వ్యాహరన్తం సమాహితమ్
దృష్ట్వాసురా యాతుధానా జగ్ధుమభ్యద్రవన్క్షుధా

ఇలా ఉపనిషత్ మంత్రలాతో (ఈశ కేన కఠ ఉపనిషత్తులు) అధ్యయనం చేస్తూ ఉన్న మనువును రాక్షసులు ఆకలి ఎక్కువై ఈయనను తిందామని బయలుదేరారు

తాంస్తథావసితాన్వీక్ష్య యజ్ఞః సర్వగతో హరిః
యామైః పరివృతో దేవైర్హత్వాశాసత్త్రివిష్టపమ్

ఇలా మనువును బక్షించవచ్చిన రాక్షసులను యజ్ఞ్యుడు దేవతలతో కలసి వచ్చి వారిని సంహరించి మనువును రక్షించి జగత్తును శాసించాడు.

స్వారోచిషో ద్వితీయస్తు మనురగ్నేః సుతోऽభవత్
ద్యుమత్సుషేణరోచిష్మత్ప్రముఖాస్తస్య చాత్మజాః

రెండవ మనువు స్వారోచిష మనువు. ఈయన అగ్ని కుమారుడు. ఈ స్వారోచిష మనువుకు కుమారులు కలిగారు.

తత్రేన్ద్రో రోచనస్త్వాసీద్దేవాశ్చ తుషితాదయః
ఊర్జస్తమ్భాదయః సప్త ఋషయో బ్రహ్మవాదినః

రోచనుడనే వాడు ఈ మన్వంతరములో ఇంద్రుడు. తుషితులు దేవతలు. ఊర్జ స్తభాదులు ఋషులు.

ఋషేస్తు వేదశిరసస్తుషితా నామ పత్న్యభూత్
తస్యాం జజ్ఞే తతో దేవో విభురిత్యభివిశ్రుతః

వేదశిరసు అనే ఋషికి స్తుషితా అనే భార్యకి పరమాత్మ విభు అనే అవతారములో వచ్చాడు

అష్టాశీతిసహస్రాణి మునయో యే ధృతవ్రతాః
అన్వశిక్షన్వ్రతం తస్య కౌమారబ్రహ్మచారిణః

ఈ విభువు ఎనభై ఎనిమిది వేల మంది మునులకు తత్వజ్ఞ్యానమును బోధించాడు. వారికి ఈ వ్రతాన్ని నేర్పాడు

తృతీయ ఉత్తమో నామ ప్రియవ్రతసుతో మనుః
పవనః సృఞ్జయో యజ్ఞ హోత్రాద్యాస్తత్సుతా నృప

మూడవ మనువు ఉత్తముడు (ద్రువుని సోదరుడు). అతనికి పవన యజ్ఞ్యహోత్రాదులు కుమారులు

వసిష్ఠతనయాః సప్త ఋషయః ప్రమదాదయః
సత్యా వేదశ్రుతా భద్రా దేవా ఇన్ద్రస్తు సత్యజిత్

వసిష్ఠ పుత్రులైన ప్రమదాదులు సప్త ఋషులు. సత్యాదులు దేవతలు. సత్యజిత్ ఇంద్రుడు.

ధర్మస్య సూనృతాయాం తు భగవాన్పురుషోత్తమః
సత్యసేన ఇతి ఖ్యాతో జాతః సత్యవ్రతైః సహ

ధర్ముడికి భార్య ఐన సూనృత యందు భగవానుడు సత్యసేనుడనే పేరుతో అవతరించాడు

సోऽనృతవ్రతదుఃశీలానసతో యక్షరాక్షసాన్
భూతద్రుహో భూతగణాంశ్చావధీత్సత్యజిత్సఖః

సత్యసేనుడు అబద్దాలాడడం అనే వ్రతము కలిగి ఉన్న దుశ్శీలనూ యక్ష రాక్షసులను సకల ప్రాణులకూ హాని చేసే వారిని వధించాడు

చతుర్థ ఉత్తమభ్రాతా మనుర్నామ్నా చ తామసః
పృథుః ఖ్యాతిర్నరః కేతురిత్యాద్యా దశ తత్సుతాః

నాలుగవ మనువు ఉత్తమ సోదరుడు తామసుడు. పృధువాది కుమారులు.

సత్యకా హరయో వీరా దేవాస్త్రిశిఖ ఈశ్వరః
జ్యోతిర్ధామాదయః సప్త ఋషయస్తామసేऽన్తరే

సత్యకాదులు ఇతర దేవతలు త్రిశిఖుడు ఈశ్వరుడు. జ్యోతిర్థాములు ఋషులు

దేవా వైధృతయో నామ విధృతేస్తనయా నృప
నష్టాః కాలేన యైర్వేదా విధృతాః స్వేన తేజసా

విదృతి యొక్క పుత్రులు దేవతలు. వైదృతులకి ఆ పేరు రావడానికి కాల క్రమములో అంతరించిపోతున్న వేదాలను ధరించారు.

తత్రాపి జజ్ఞే భగవాన్హరిణ్యాం హరిమేధసః
హరిరిత్యాహృతో యేన గజేన్ద్రో మోచితో గ్రహాత్

ఈ తామస మన్వంతరములో హరిమేధ అనే మహర్షికి హరిణి అనే భార్య యందు హరి అనే అవతారములో వచ్చాడు. ఈయనే గజేంద్రునికి మోక్షాన్నిచ్చాడు.

శ్రీరాజోవాచ
బాదరాయణ ఏతత్తే శ్రోతుమిచ్ఛామహే వయమ్
హరిర్యథా గజపతిం గ్రాహగ్రస్తమమూముచత్

మేము ఈ విషయాన్ని వినాలనుకుంటున్నాము. మకరము పొందిన ఏనుగును స్వామి వచ్చి ఎలా విడిపించాడు

తత్కథాసు మహత్పుణ్యం ధన్యం స్వస్త్యయనం శుభమ్
యత్ర యత్రోత్తమశ్లోకో భగవాన్గీయతే హరిః

ఈ కథ ఎంతో గొప్ప పవిత్రమైనది శుభాన్ని కలిగించేది మంగళాన్ని ధనాన్నీ ప్రసాదించేది. పరమాత్మగానం చేయబడే ఏ కథైనా ఇంతే

శ్రీసూత ఉవాచ
పరీక్షితైవం స తు బాదరాయణిః ప్రాయోపవిష్టేన కథాసు చోదితః
ఉవాచ విప్రాః ప్రతినన్ద్య పార్థివం ముదా మునీనాం సదసి స్మ శృణ్వతామ్

ఇలా పరీక్షిన్మహరజాఉ ఇలా అడిగితే శుకుడు బాగా అడిగావని మెచ్చుకుని, ఆనందముతో వింటున్న ఋషుల సభలో ఈ కథను వివరించడం మొదలు పెట్టాడు.

No comments:

Post a Comment