Wednesday, December 26, 2012

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం పదవ అధ్యాయం


                                                       ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధం పదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయః
మన్వన్తరేశానుకథా నిరోధో ముక్తిరాశ్రయః

దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణమ్
వర్ణయన్తి మహాత్మానః శ్రుతేనార్థేన చాఞ్జసా

సర్గ  - సృష్టి, ప్రతి సర్గ - ప్రళయము, వంశము, మన్వంతరములు, వంశానుచరితములూ - ఇవి అయిదు లక్షణాలు.
అన్ని పురాణాలు ప్రతిపాదించేది దశమాన్ని (ఆశ్రయాన్ని). సకల జగత్తుకీ ఆధారం పరమాత్మ స్వరూప రూప గుణ విభూతుల యొక్క యాదాత్మ్య అవగాహన. పరమాత్మ గుణాలను చెప్పడానికే అన్ని పురాణాలు. మాహానుభావులందరూ వారి గురువు గారి దగ్గర విన్న దానితో, శాస్త్ర బలంతో, శాస్త్ర పరిజ్ఞ్యానంతో పురాణ లక్షణాలను ఉదహరిస్తారు

భూతమాత్రేన్ద్రియధియాం జన్మ సర్గ ఉదాహృతః
బ్రహ్మణో గుణవైషమ్యాద్విసర్గః పౌరుషః స్మృతః

బ్రహ్మాండ సృష్టిని సర్గ అంటారు. అంటే పంచభూతములు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియములూ, పంచ జ్ఞ్యానేంద్రియాలు, అహంకారము. వీటి సృష్టిని సర్గము అంటారు.
చతుర్ముఖ బ్రహ్మగారు చేసే సృష్టిని విసర్గ అంటారు. బ్రహ్మ కంటే ముందు ఉన్న సృష్టి సర్గ ( (భూతములు, తన్మాత్రలు, జ్ఞ్యాన కర్మేంద్రియాలు, మహత్ అహంకారం ప్రకృతి అంతఃకరణం 24)అయితే బ్రహ్మాగారిచే చేయబడిన సృష్టిని విసర్గము అంటారు. పురుష సృష్టిని విసర్గము అంటారు. బ్రహ్మచేసే సృష్టి విసర్గము

స్థితిర్వైకుణ్ఠవిజయః పోషణం తదనుగ్రహః
మన్వన్తరాణి సద్ధర్మ ఊతయః కర్మవాసనాః

స్థానం: పరమాత్మ యొక్క దుష్ట శిక్షణ స్థానం
పోషణం: భక్తులని అనుగ్రహించుట
మన్వంతరం: పరమాత్మ చేత ప్రతిపాదిచబడిన వేదములచే ప్రతిపాదించబడిన ధర్మాలు.
ఊతి: కర్మల వలన కలిగే వాసనలు

అవతారానుచరితం హరేశ్చాస్యానువర్తినామ్
పుంసామీశకథాః ప్రోక్తా నానాఖ్యానోపబృంహితాః

ఈశ కథ: పరమాత్మ అవతారాలు, అవతరించిన పరమాత్మను అనుసరించిన సజ్జనుల కథలు, వాటికి సంబంధించిన వివిధ కథలు

నిరోధోऽస్యానుశయనమాత్మనః సహ శక్తిభిః
ముక్తిర్హిత్వాన్యథా రూపం స్వరూపేణ వ్యవస్థితిః

నిరోధ:  జీవాత్మ ప్రకృతి సంబంధమైన సకల శక్తులతో సూక్ష్మావస్థలోకి వెళ్ళుట.
ముక్తి: మనది కాని దాన్ని వదిలిపెట్టి మన రూపాన్ని పొందటం. స్వస్వరూపస్థితి.

ఆభాసశ్చ నిరోధశ్చ యతోऽస్త్యధ్యవసీయతే
స ఆశ్రయః పరం బ్రహ్మ పరమాత్మేతి శబ్ద్యతే

సకల ప్రపంచము ఏర్పడుట, ఉన్నట్లు తోచుట, లేకుండా పోవుటా ఎవరి సంకల్పం వలన జరుగుతున్నాయో ఆ పరమాత్మే సకల జగత్తుకూ ఆశ్రయం

యోऽధ్యాత్మికోऽయం పురుషః సోऽసావేవాధిదైవికః
యస్తత్రోభయవిచ్ఛేదః పురుషో హ్యాధిభౌతికః

సృష్టి మొత్తాన్ని జ్ఞ్యానము (తెలియబడేది) జ్ఞేయమూ (తెలుసుకొనేది) జ్ఞ్యాతగా (తెలిసేది) లేదా శరీరము ఇంద్రియములూ విషయములూ అనుకుంటే, వీటిలో ఇంద్రియాలు ఆదిదైవికములు అంటాము (దేవతలచే అధిస్టించబడినవి), జ్ఞేయము (విషయములు) ఆది భౌతికములు అంటాము (శబ్ద స్పర్శాది మొ అన్నీ భౌతికములు) , శరీరాన్ని అధ్యాత్మం అంటాం. జ్ఞ్యాత ఆత్మ, జ్ఞేయం విషయం, జ్ఞ్యానం ఇంద్రియముల ద్వారా
శరీర ఇంద్రియ విషయములు - ఆధ్యాత్మ ఆదిదైవిక ఆదిభౌతములు - జ్ఞ్యాన్ము జ్ఞ్యాత జ్ఞేయము
ఐతే ఈ మూడూ ఒక్కటా వేరా? సూక్ష్మ రూపంలో ఉన్న పరమాత్మ స్థూలరూపాన్ని చెందాడు. కారణం ఎప్పుడూ సూక్ష్మరూపంలో ఉంటుంది, కార్యం స్థూలరూపంలో ఉంటుంది. ఇక్కడా కారణమే కార్యంగా మారింది. అలాంటప్పుడు జ్ఞ్యతృ జ్ఞ్యాన జ్ఞేయములూ మూడూ ఒకటే.

ఎవరిని శరీరము ఆత్మగా చెప్పుకుంటున్నామో ఆయనే  ఇంద్రియములను శబ్దాది విషయములను ఏర్పాటుచేసాడు. కనుక ఆయనే ఆదిదైవికుడు, ఆయనే ఆది భౌతికుడు, ప్రకృతీ ఆయనే, ప్రకృతి నుండి మహత్ తత్వం , మహత్ తత్వం నుండి అహంకారం, అహంకారం యొక్క త్రైవర్గీకరణం, అందులోని కర్మేంద్రియములూ జ్ఞ్యానేంద్రియములూ, ఇవన్నీ పరమాత్మే. అందువల్ల ఆధ్యాత్మకమైన ఆయనే, ఆది భౌతికుడు. ఆది భౌతికుడే ఆది దైవికుడు. అంతా పరమాత్మ స్వరూపమే.

జ్ఞ్యాత జ్ఞ్యానం ఈ రెండూ మారేవి జ్ఞేయమును బట్టే, తెలియవలసిన దాన్ని బట్టే, తెలిసేవాడు, తెలియుట ఉంటుంది. విషయములే, విషయములకొరకే, శరీరమూ ఇంద్రియములు. అందుకే ప్రకృతి తత్వమూ, ప్రకృతినుండి మహత్ తత్వమూ, మహత్ తత్వాన్ని మూడు భాగాలు చేసి అందులో కర్మేంద్రియములనూ , జ్ఞ్యానేంద్రియములనూ సృష్టించి, పంచభూతములూ, వాటిగుణములు (భూతాది). పంచభూతముల గుణములకొరకే ఇంద్రియములు శబ్ద స్పర్శ రూప రస గంధములను స్వీకరించుటకే ఇంద్రియములు. విషములూ, విషయములను స్వీకరించే ఇంద్రియములూ, ఈ రెండూ కలవాడే శరీరి.

ఆధ్యాత్మ ఆదిదైవికములను విభజిస్తే ఆది భౌతికమేర్పడుతుంది. విషయములు జ్ఞ్యానము జ్ఞ్యాతను బట్టి, జ్ఞేయము కొరకు. శబ్ద స్పర్శాది ఇంద్రియ విషయములని గ్రహించేవి ఇంద్రియములు. వాటికి అధిష్టానం ఆత్మ, శరీరం.

ఏకమేకతరాభావే యదా నోపలభామహే
త్రితయం తత్ర యో వేద స ఆత్మా స్వాశ్రయాశ్రయః

ఇలా జ్ఞ్యాన్ము జ్ఞేయమూ జ్ఞ్యాతా, ఈ మూటిలో ఏ ఒక్కటి లేకున్నా తక్కినవి పని చేయవు. కన్ను ఉండి, వెలుతురూ ఉండి, రూపం లేకపోయినా, కన్నూ రూపం ఉండి వెలుతురు లేకపోయినా, కన్నులేకుండా వెలుతురూ రూపమూ ఉన్నా పని చేయదు. అలాగే శరీర ఇంద్రియ విషయములు లేకుండా క్రియాశీలములు కాదు. ఈ మూడూ లేకున్నా కూడా ఉండేది ఆత్మ. ఆ పరమాత్మే ఈ మూడిటినీ లేకుండా చేయగలడు, ఉండేలా చేయగలడు.

అలాంటి చోటా ఆ మూటినీ (తెలుసుకునేదీ తెలిపేదీ తెలియబడేదీ) ఎవరు తెలుసుకుంటారో ఆయనే పరమాత్మ.

పురుషోऽణ్డం వినిర్భిద్య యదాసౌ స వినిర్గతః
ఆత్మనోऽయనమన్విచ్ఛన్నపోऽస్రాక్షీచ్ఛుచిః శుచీః

సమష్టి సృష్టి - బ్రహ్మగారిలో ఏమేమి ఏర్పడ్డాయో వాటినుంచే మనకు ఉన్నవన్నీ ఏర్పడ్డాయి. సకల అవయవాలకీ మూలం బ్రహ్మ. ఆయననే విరాట్ పురుసుడు, హిరణ్యగర్భుడు, సూత్రాత్మా అంటాము. 24 తత్వములతో కల అండాన్ని భేధించుకుని వచ్చాడు. ఆయన నివాసముండటానికి జలాన్ని సృష్టించుకున్నాడు. అలా సృష్టించుకున్న జలములో వేయి దివ్య సంవత్సరాలు ఉన్నాడు.

తాస్వవాత్సీత్స్వసృష్టాసు సహస్రం పరివత్సరాన్
తేన నారాయణో నామ యదాపః పురుషోద్భవాః

కొన్ని వేల సంవత్స్రాలు నివసించాడు. కాబట్టే ఆయనను నారాయణుడు అంటున్నము. పురుషున్నించి పుట్టాయి కబట్టి ఆ జలాన్ని నారములు అంటున్నాము. నరుడి నుంచి వచ్చినవి నారములు. వాటియందు ఉన్నవాడు నారాయణుడు.

ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవ ఏవ చ
యదనుగ్రహతః సన్తి న సన్తి యదుపేక్షయా

ఈ జగత్తులో మనము ద్రవ్యమూ కర్మ కాలము స్వభావమూ జీవుడు, ఈ ఐదింటినీ చూస్తున్నాము. ఈ ఐదు పరమాత్మ అనుగ్రహం వలన, సంకల్పము చేత ఏర్పడతాయి

ఏకో నానాత్వమన్విచ్ఛన్యోగతల్పాత్సముత్థితః
వీర్యం హిరణ్మయం దేవో మాయయా వ్యసృజత్త్రిధా

బహుశ్యాం ప్రజాయేయా - నేను చాలా రూపాలుగా మారాలి అనుకున్నాడు. ఒకడుగా ఉన్న ఆయన నేను అనేకమవ్వాలి అనుకున్నాడు. ఇక్కడ యోగతల్పము. యోగమంటే యుజ్యతే ఇతి యోగః. కూర్చడమే యోగము. శరీర ఇంద్రియ విషయములు లేని ఆత్మకు, వాటితో సంబంధము కలుపుట. ఆయన కడుపులో ఉన్న ఆత్మలకి ఆకారాన్ని కూర్చుట యోగము. దానికోసం ఆయన నిద్రలో ఉన్నాడు. అదే యోగ తల్పం, ఆదిశేషుడు అని కూడా అంటారు.
అప్పుడు హిరణ్మయమైన వీర్యాన్ని ఆధ్యాత్మ ఆదైవికం ఆదిభౌతికం, (శరీరము ఇంద్రియములు విషయాలు) అనే మూడు భాగాలుగా చేసాడు.

అధిదైవమథాధ్యాత్మమధిభూతమితి ప్రభుః
అథైకం పౌరుషం వీర్యం త్రిధాభిద్యత తచ్ఛృణు

ఒక్కడిగా ఉన్న పరమాత్మ వీర్యం మూడు ఎలా అయింది? పరమాత్మ సంకల్పం వలన అవుతుంది. మనము చూస్తున్నాము అంటే, మనకన్నా ముందు ఆ కంటితో చూసేది ఆయనే. అలాగే ఏ ఇంద్రియముతో మనం అనుభవించిన ముందు వచ్చేది పరమాత్మ నుంచే. ఓజః ప్రవృత్తి సామర్ధ్యం, సహః వేగ సామర్ధ్యం బలం అంటే ధారణ సామర్ధ్యం. విషయములయందు ప్రవర్తించే సామర్ధ్యం ఇంద్రియములకుంటుంది (ఉదా ఒక శబం వస్తే వెంటనే చెవి వింటుంది ). విషయములయందు ప్రవర్తించే సామర్ధ్యం ఇంద్రియములకు ఉంటుంది. ఇదే ఓజ సామర్ధ్యం. మనం ఒక్క చోటనే ఉన్నా మనసు వేగంగా పరుగెడుతుంది. సహం మనసుది. బలం శరీరానిది.

అన్తః శరీర ఆకాశాత్పురుషస్య విచేష్టతః
ఓజః సహో బలం జజ్ఞే తతః ప్రాణో మహానసుః

అంతఃశరీర ఆకాశంలో స్వామి సంకల్పిస్తే ఓజః సహః బలమః పుట్టాయి. వాటిలో చలనం కావాలి, అంటే వాయువు కావాలి. ఉన్నదాన్ని నిలిపేది, లేనిదాన్ని కలిగించేది కావాలి. దానినే ప్రాణం అంటారు. అపుడు కలిగినటువంటి ఓజస్సు సహస్సు బలములను సంచరింపజేయడానికి ప్రవర్తింపచేయడానికి ప్రాణ వాయువును ఏర్పరిచాడు.

అనుప్రాణన్తి యం ప్రాణాః ప్రాణన్తం సర్వజన్తుషు
అపానన్తమపానన్తి నరదేవమివానుగాః

ప్రాణముంటేనే అన్ని ఇంద్రియాలు రాజును సేవకులు అనుసరించినట్లు అనుసరిస్తాయి.

ప్రాణేనాక్షిపతా క్షుత్తృడన్తరా జాయతే విభోః
పిపాసతో జక్షతశ్చ ప్రాఙ్ముఖం నిరభిద్యత

ఓజ సహ బలం ప్రాణము వచ్చాయి. వాయువు వచ్చిందంటే అగ్ని పుట్టాలి. ప్రాణం రాగానే జఠరాగ్ని పుట్టింది. దానివలన ఆకలి దప్పి పుట్టాయి. వాయువు సంచరించగానే అగ్ని పుడుతుంది. సమిధలు వేస్తున్నతసేపే అగ్ని ఉంటుంది, అలాగే ఘన లేదా ద్రవ పదార్ధం వేసేనే ఆ ఆగ్ని ఉంటుంది. ప్రాణం వచ్చిన వెంటనే క్షుత్ పిపాస పుట్టింది. దాహం అంటే దహించుట. మంచు కూడా అదే పనిగా పెడితే అందులోంచి కూడా అగ్ని పుడుతుంది. అందుకే బాగా చల్లగా ఉండే ద్రవం త్రాగవద్దంటారు. దాహం గానీ ఆకలి గాని రోగ నివారణ మాత్రమే గానీ భోగము కొరకు కాదు

ముఖతస్తాలు నిర్భిన్నంజిహ్వా తత్రోపజాయతే
తతో నానారసో జజ్ఞే జిహ్వయా యోऽధిగమ్యతే

అలా నీరు తాగి అన్నం తినాలి అంటే ఒక ద్వారం ఉండాలి, అదే నోరు (ముఖము) పుట్టింది. కేవలం రంధ్రం కాకుణ్డ, ఏ భాగంలోంచి కడుపులోకి వెళ్ళాలో ఆ భాగంలోకి పంపాలి, అదే తాళువు. రెండు దవడల మూల భాగంలో ఉండే కొండ నాలుక. దాని నుంచే అసలు నాలుక (జిహ్వ) వచ్చింది. పదార్థాలను అటు ఇటు పోకుండా జీర్ణకోశంలోకి పంపే పని తాళువు చేస్తుంది. పదార్థాల రుచిని జిహ్వ చూస్తుంది

వివక్షోర్ముఖతో భూమ్నో వహ్నిర్వాగ్వ్యాహృతం తయోః
జలే చైతస్య సుచిరం నిరోధః సమజాయత

ఎపుడైతే నాలుకా, తాళువు, అందులో రంధ్రమూ వచ్చినపుడు, ఆ నాలుకకు ఎప్పుడు ఏ రుచి కావాలో చెప్పదలచుకోవడానికి వాక్కు పుట్టింది. దీనికి అగ్ని దేవత.
అగ్ని - వాక్కు - వ్యాహృతం(పలుకుట) : దేవత ఇంద్రియం కర్మ

నాసికే నిరభిద్యేతాం దోధూయతి నభస్వతి
తత్ర వాయుర్గన్ధవహో ఘ్రాణో నసి జిఘృక్షతః

లోపలకి పోయిన వాయువు కంఠంలో ఉండి కంఠాన్ని నిర్భందిస్తుంది. ఆ వాయువు బయటకి పోవడానికి నాసా రంధ్రాలు పుట్టాయి. వాయువు అటూ ఇటూ ఊగుతూ ఉంటే నాసికపుట్టింది. వాయువుని విడిచి స్వీకరిస్తుంది (నసి జిఘృక్షతః)

యదాత్మని నిరాలోకమాత్మానం చ దిదృక్షతః
నిర్భిన్నే హ్యక్షిణీ తస్య జ్యోతిశ్చక్షుర్గుణగ్రహః

మనము చేస్తున్న దాని యొక్క రూపం చూడటానికి రెండు నేత్రాలు ఏర్పడ్డాయి. నేత్రాలకి సూర్యుడు అధిపతి. చక్షు ఇంద్రియం వస్తువు యొక్క గుణమును గ్రహిస్తుంది.

బోధ్యమానస్య ఋషిభిరాత్మనస్తజ్జిఘృక్షతః
కర్ణౌ చ నిరభిద్యేతాం దిశః శ్రోత్రం గుణగ్రహః

వేదములు చేప్పేవాటిని వినడాని కర్ణములు వచ్చాయి. దిక్కులు దేవతగా, శ్రోత్రము ఇంద్రియముగా, గుణములని గ్రహించడం దాని పని

వస్తునో మృదుకాఠిన్య లఘుగుర్వోష్ణశీతతామ్
జిఘృక్షతస్త్వఙ్నిర్భిన్నా తస్యాం రోమమహీరుహాః
తత్ర చాన్తర్బహిర్వాతస్త్వచా లబ్ధగుణో వృతః

స్పర్శను గ్రహించడానికి త్వగింద్రియం ఏర్పడింది. ఒక్క త్వగ్ ఇంద్రియమే కాక రోమాలు ఏర్పడ్డాయి. చర్మానికి కలిగే బాధను ముందు భరించేవి రోమాలు. అవి త్వగింద్రియాన్ని కాపాడతాయి. మనసులో కలిగే వికారాలను కూడా రోమాలు చెబుతాయి. చర్మమునకు కలిగించే వికారాన్ని తప్పించడానికి అవి లేస్తాయి
చర్మము లోపలా బయటా ఉన్న వాయు సంచారాన్ని తెలిపేది త్వగింద్రియం, స్పర్శ. ఒక వస్తువును తాకితే, ఆ వస్తువుకీ చేతికీ మధ్య ఉన్న గాలిని వత్తిడి కలిగిస్తుంది. త్వగింద్రియం వాయ్వును స్వీకరించి బయటకు పంపుతుంది. మన మనసులో ఉండే భావముల వల్లనే కఠిన స్పర్శ, మృదు స్పర్శ ఉంటుంది.

హస్తౌ రురుహతుస్తస్య నానాకర్మచికీర్షయా
తయోస్తు బలవానిన్ద్ర ఆదానముభయాశ్రయమ్

హస్తములకు అధిదేవత ఇంద్రుడు. హస్తములు చేసే పని ఆదానం (తీసుకొనుట లేదా ఇచ్చుట)

గతిం జిగీషతః పాదౌ రురుహాతేऽభికామికామ్
పద్భ్యాం యజ్ఞః స్వయం హవ్యం కర్మభిః క్రియతే నృభిః

పాముల అధిదేవత యజ్ఞ్యుడు. హోమ ద్రవ్యములు తీసుకుని వచ్చుటకు ఏర్పడ్డవి కాళ్ళు.

నిరభిద్యత శిశ్నో వై ప్రజానన్దామృతార్థినః
ఉపస్థ ఆసీత్కామానాం ప్రియం తదుభయాశ్రయమ్

కూడగట్టుకున్న శక్తిని శరీరంలోనే ఉంచకుండా, దాన్ని బయటకు విడిచిపెట్టడానికి, అది కూడా ఇష్టపూర్వకంగా విడిచిపెట్టడానికి, దాన్ని వీర్య రూపంలో విడిచి పెట్టడానికి ఉపస్థ ఇంద్రియం, శిశ్నం అనే అవయవం. ప్రజాతి ఆనంద నిర్వృతి. సంతానం కలగడానికి కావల్సిన ఆనందంతో ఏర్పడే భోగము.

ఉత్సిసృక్షోర్ధాతుమలం నిరభిద్యత వై గుదమ్
తతః పాయుస్తతో మిత్ర ఉత్సర్గ ఉభయాశ్రయః

సారం వదిలిపెట్టడానికి ఉపస్థ అయితే, నిస్సారం వదలడానికి పాయు ఇంద్రియము, గుదం అవయవం, అదిదేవత మిత్రుడు.

ఆసిసృప్సోః పురః పుర్యా నాభిద్వారమపానతః
తత్రాపానస్తతో మృత్యుః పృథక్త్వముభయాశ్రయమ్

ఇలా సంచరించే వాయువును క్రమబద్దీకరించేందుకు నాభిని సృష్టించాడు. ఏ ఏ రంధ్రముల, ఇంద్రియముల ద్వారా ఎంత వాయువు లోపల ఉంచాలి, ఎంత బయటకు పోవాలనేది నాభి చేస్తుంది. వాయువును అధోభాగమునుండి బయటకు పంపించడానికి ఉన్న ద్వారం నాభి. నాభికి అధిష్టాన దేవత మృత్యువు. వేరు చేసినా కలిపినా నాభి నుంచే (పృథక్త్వముభయాశ్రయమ్)

ఆదిత్సోరన్నపానానామాసన్కుక్ష్యన్త్రనాడయః
నద్యః సముద్రాశ్చ తయోస్తుష్టిః పుష్టిస్తదాశ్రయే

తీసుకున్న ఆహారం ఎక్కడ ఉండాలి? అదే కడుపులోని నరములూ ప్రేగులు. ప్రేగులకు అదిష్టాన దేవతలు నదులు సముద్రాలు. తుష్టి పుష్టి అనేవి వీటికున్న రెండు గుణాలు

నిదిధ్యాసోరాత్మమాయాం హృదయం నిరభిద్యత
తతో మనశ్చన్ద్ర ఇతి సఙ్కల్పః కామ ఏవ చ

తన ప్రకృతినీ ధ్యానం చేయడానికి హృదయాన్ని. అందులో మనసు పుట్టింది. ఆ మనసుకి చంద్రుడు దేవత. ప్రతీ సంకల్పమూ కోరికా పుట్టేది మనసులోనే

త్వక్చర్మమాంసరుధిర మేదోమజ్జాస్థిధాతవః
భూమ్యప్తేజోమయాః సప్త ప్రాణో వ్యోమామ్బువాయుభిః

సప్త ధాతువులు ఏర్పడ్డాయి: త్వక్, చర్మ మాన్స మేధో రుధిర మధ్య అస్తి. పై భాగాన్ని చర్మం అంటాం. లోపల భాగాన్ని త్వక్ అంటాం. ఈ సప్త ధాతువులూ త్రిభూతములతో వచ్చాయి. భూమి జలము తేజస్సు. ప్రాణవాయువు ఆకాశము వాయువు జలముతో ఏర్పడింది. ప్రాణము నిలవాలంటే నీరు కావాలి. అందుకే నీరు వాయువు ఆకాశమూ కావాలి ప్రాణానికి

గుణాత్మకానీన్ద్రియాణి భూతాదిప్రభవా గుణాః
మనః సర్వవికారాత్మా బుద్ధిర్విజ్ఞానరూపిణీ

శబ్ద స్పర్శ మొదలైన విషయాలను అనుభవింపచేసేవి ఇంద్రియాలు. వాటి గుణాలు పంచభూతాలతో ఏర్పడతాయి. అన్ని వికారాలకు మూలం మనసు. జ్ఞ్యానాన్ని కలిగించేది బుద్ధి. వికారాన్ని కలిగించేది మనసు.

ఏతద్భగవతో రూపం స్థూలం తే వ్యాహృతం మయా
మహ్యాదిభిశ్చావరణైరష్టభిర్బహిరావృతమ్

ఇది పరమాత్మ యొక్క స్థూల రూపం. దీని నుండే అనతకోటిబ్రహ్మాండంలో అన్ని జీవుల శరీరాలు ఏర్పడ్డాయి. పృధ్వి అప్ తేజో వాయు ఆకాశం అవ్యక్తం మహత్ అహంకారం అనే అష్ట ఆవరణలతో ఉన్నది.

అతః పరం సూక్ష్మతమమవ్యక్తం నిర్విశేషణమ్
అనాదిమధ్యనిధనం నిత్యం వాఙ్మనసః పరమ్

ఇప్పటిదాకా స్థూలరూపాన్ని చెప్పాను. ఇక వాక్కుకూ మనసుకూ అందనిదీ ప్రకృతి మహదహంకారానికంటే సూక్షమమైనది సూక్ష్మరూపం. దీనిలో ఎటువంటి వికారం ఉండదు. ఆది అంతములు ఉండవు.

అమునీ భగవద్రూపే మయా తే హ్యనువర్ణితే
ఉభే అపి న గృహ్ణన్తి మాయాసృష్టే విపశ్చితః

విజ్ఞ్యానులు ఈ రెంటినీ తీసుకోరు (ప్రకృతినీ, ఇంద్రియాలనూ, వాటికతీతంగా ఉండే మాయనూ తీసుకోరు).

స వాచ్యవాచకతయా భగవాన్బ్రహ్మరూపధృక్
నామరూపక్రియా ధత్తే సకర్మాకర్మకః పరః

మనం వేటిని చెప్పుకుంటున్నామో, వస్తువులూ వాటి గుణములు రెండు భగవానునివే. ఆ పరమాత్మే వీటికి నామము రూపమూ క్రియా కలిపించాడు.

ప్రజాపతీన్మనూన్దేవానృషీన్పితృగణాన్పృథక్
సిద్ధచారణగన్ధర్వాన్విద్యాధ్రాసురగుహ్యకాన్
కిన్నరాప్సరసో నాగాన్సర్పాన్కిమ్పురుషాన్నరాన్
మాత్రక్షఃపిశాచాంశ్చ ప్రేతభూతవినాయకాన్
కూష్మాణ్డోన్మాదవేతాలాన్యాతుధానాన్గ్రహానపి
ఖగాన్మృగాన్పశూన్వృక్షాన్గిరీన్నృప సరీసృపాన్
ద్వివిధాశ్చతుర్విధా యేऽన్యే జలస్థలనభౌకసః
కుశలాకుశలా మిశ్రాః కర్మణాం గతయస్త్విమాః
సత్త్వం రజస్తమ ఇతి తిస్రః సురనృనారకాః
తత్రాప్యేకైకశో రాజన్భిద్యన్తే గతయస్త్రిధా
యదైకైకతరోऽన్యాభ్యాం స్వభావ ఉపహన్యతే

రెండు కాళ్ళ వారు నాలుగు కాళ్ళ వారు, ఆకాశములో భూమిలో ఉండేవారు, కుశలులు (నేర్పరులూ), అకుశలులు. సత్వమంటే దేవతలు, రజస్సు అంటే నరులు, తమస్సు అంటే నరకములు
ఈ నరులు దేవతలూ రాక్షసులలో కూడా సాత్విక రాజస తామస భేధాలు ఉంటాయి. తన స్వభావం తాను అనుసరించి ఆచరిస్తే అందరికీ క్షేమం. లేకపోతే ఒక స్వభావన్ని ఒకటి పాడుచేస్తుంది. దాని వలననే రాగద్వేషాదులు వస్తాయి. దానినే నరకం అంటాము.

స ఏవేదం జగద్ధాతా భగవాన్ధర్మరూపధృక్
పుష్ణాతి స్థాపయన్విశ్వం తిర్యఙ్నరసురాదిభిః

ఈ సకల జగత్తునీ ధరించేవాడు, ధర్మాన్ని స్వరూపంగా ఉండే వాడు అయిన పరమాత్మ. ఈయనే ప్రపంచాన్ని సృష్టించి పోషిస్తాడు

తతః కాలాగ్నిరుద్రాత్మా యత్సృష్టమిదమాత్మనః
సన్నియచ్ఛతి తత్కాలే ఘనానీకమివానిలః

విష్ణు రూపంలో కాపాడతాడు, బ్రహ్మరూపంలో సృష్టిస్తాడు, కాలాగ్ని రుద్రుని రూపంలో సంహరిస్తాడు.

ఇత్థమ్భావేన కథితో భగవాన్భగవత్తమః
నేత్థమ్భావేన హి పరం ద్రష్టుమర్హన్తి సూరయః

ఇవన్నీ చేయడం వలన ఆయనని భగవానుడంటారు. అన్నీ తెలిసినవాడు (జ్ఞ్యానము), శక్తిమంతుడు, ఐశ్వర్యం కలవాడు (శాసకత్వం), ఆయన అందరిలో ఉండి శాసితాడు

నాస్య కర్మణి జన్మాదౌ పరస్యానువిధీయతే
కర్తృత్వప్రతిషేధార్థం మాయయారోపితం హి తత్

ఈయన కర్మలూ అవతారాలు మనకి ఎప్పుడు సుస్పష్టంగా తెలియదు. పరమాత్మే అంతా చేయిస్తున్నాడని తెలియక మనమే చేస్తున్నాము అనుకుంటాము. మధ్యలో ఉన్న మాయ "అంతా ఆయనే చేసాడన్న" భావన రాకుండ చేస్తుంది.

అయం తు బ్రహ్మణః కల్పః సవికల్ప ఉదాహృతః
విధిః సాధారణో యత్ర సర్గాః ప్రాకృతవైకృతాః

ఇప్పటివరకూ బ్రహ్మకల్పముని చెప్పాను. ప్రాకృత సృష్టి (బ్రహ్మగారి సృష్టికి ముందు ఉన్న 24 తత్వాలు), వైకృత సృష్టి (బ్రహ్మగారి సృష్టి - దేవ తిర్యక్ మనుష్యాదులు)

పరిమాణం చ కాలస్య కల్పలక్షణవిగ్రహమ్
యథా పురస్తాద్వ్యాఖ్యాస్యే పాద్మం కల్పమథో శృణు

ఇపుడు పద్మ కల్పాన్ని చెబుతాను విను. కాలము కాల పరిణామం, కల్పమంటే ఏమిటి అనేవి చెబుతాను

శౌనక ఉవాచ
యదాహ నో భవాన్సూత క్షత్తా భాగవతోత్తమః
చచార తీర్థాని భువస్త్యక్త్వా బన్ధూన్సుదుస్త్యజాన్

శౌనకుడు "భాగవతోత్తముడైన (క్షత్తా ) విధురుడు యుద్ధం ప్రారంభం కాకముందు తీర్థయాత్రలకు వెళ్ళాడని చెప్పారు కదా, విడిచిపెట్టజాలని బంధువులందరినీ వదిలిపెట్టి వెళ్ళాడే"

క్షత్తుః కౌశారవేస్తస్య సంవాదోऽధ్యాత్మసంశ్రితః
యద్వా స భగవాంస్తస్మై పృష్టస్తత్త్వమువాచ హ

అలాంటి విధురినికి మైత్రేయునితో (కౌశారవేస్తస్య ) సమాగమం ఎక్కడ కలిగినది. ఆ ఆధ్యాత్మిక విద్య (సంవాదం) ఎలా జరిగింది. ఆ తత్వాన్ని మైత్రేయుడు విధురునికి ఏమి చెప్పాడు

బ్రూహి నస్తదిదం సౌమ్య విదురస్య విచేష్టితమ్
బన్ధుత్యాగనిమిత్తం చ యథైవాగతవాన్పునః

బంధువులకు ఎందుకు విడిచిపెట్టాడు, విడిచిపెట్టి మరలా ఎందుకు వచ్చాడు. వెళ్ళడానికి ప్రయోజనమేమిటి, తిరిగి రావడానికి ప్రయోజనమేమిటి.

సూత ఉవాచ
రాజ్ఞా పరీక్షితా పృష్టో యదవోచన్మహామునిః
తద్వోऽభిధాస్యే శృణుత రాజ్ఞః ప్రశ్నానుసారతః

ఓ మహామునీ ఇవన్నీ పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని అడిగితే శుకుడు చెప్పగా నేను విన్నది చెబుతాను. పరీక్షిత్తు ఏ విధంగా అడిగాడో దానిననుసరించి నీకు వివరిస్తాను

                                                        సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు

No comments:

Post a Comment