Monday, March 18, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
భరతస్తు మహాభాగవతో యదా భగవతావనితలపరిపాలనాయ సఞ్చిన్తితస్తదనుశాసనపరః
పఞ్చజనీం విశ్వరూపదుహితరముపయేమే

భరతుడు పరమభాగవతుడు. వృషభుని ఆజ్ఞ్యను పాలించి విశ్వరూపుని పుత్రిక అయిన పంచజనిని వివాహం చేసుకున్నాడు.

తస్యాము హ వా ఆత్మజాన్కార్త్స్న్యేనానురూపానాత్మనః పఞ్చ జనయామాస భూతాదిరివ
భూత
సూక్ష్మాణి సుమతిం రాష్ట్రభృతం సుదర్శనమావరణం ధూమ్రకేతుమితి

అలా వారిద్దరికీ ఐదుగురు కుమారులు పుట్టారు తామసాహంకారానికి పంచతన్మాత్రలు ఉదయించినట్లు. సుమతిం రాష్ట్రభృతం సుదర్శనమావరణం ధూమ్రకేతుమితి - అనే ఐదుగురు కొడుకులు.

అజనాభం నామైతద్వర్షం భారతమితి యత ఆరభ్య వ్యపదిశన్తి

భరతుడు పరిపాలనకు రాకముందు అజనాభ వరషమని పేరు పొందినది భరతుని పరిపాలన వలన భారత వర్షమని పేరుగాంచింది.

స బహువిన్మహీపతిః పితృపితామహవదురువత్సలతయా స్వే స్వే కర్మణి వర్తమానాః ప్రజాః స్వ
ధర్మమనువర్తమానః పర్యపాలయత్

ఈ భరతుడు చాలా తెలిసిన వాడు. తండ్రిలాగా తాత లాగా గొప్ప వాత్సల్యం కలవాడు. ప్రజలందరూ ఎవరికి వారు తమ వృత్తులు ఆచరించేట్లు పాలించాడు. రాజు కూడా తన ధర్మాన్ని తాననుసరిస్తూ రాజ్యాన్ని పరిపాలించాడు

ఈజే చ భగవన్తం యజ్ఞక్రతురూపం క్రతుభిరుచ్చావచైః శ్రద్ధయాహృతాగ్నిహోత్రదర్శపూర్ణమాస
చాతుర్మాస్యపశుసోమానాం ప్రకృతివికృతిభిరనుసవనం చాతుర్హోత్రవిధినా

పరమాత్మను అనేకమైన ఉన్నతమైన యజ్ఞ్యములతో శ్రద్ధతో చాతుర్మాస్యమూ దశపూర్ణ మాసాలు, చాతుర్హోత్రమూ (హోత ఋత్విక్ అధ్వర్యువు ఉద్గాత) మొదలైనవి చేసాడు.

సమ్ప్రచరత్సు నానాయాగేషు విరచితాఙ్గక్రియేష్వపూర్వం యత్తత్క్రియాఫలం ధర్మాఖ్యం పరే
బ్రహ్మణి యజ్ఞపురుషే సర్వదేవతాలిఙ్గానాం మన్త్రాణామర్థనియామకతయా సాక్షాత్కర్తరి పరదేవతాయాం
భగవతి వాసుదేవ ఏవ భావయమాన ఆత్మనైపుణ్యమృదితకషాయో హవిఃష్వధ్వర్యుభిర్గృహ్యమాణేషు స
యజమానో యజ్ఞభాజో దేవాంస్తాన్పురుషావయవేష్వభ్యధ్యాయత్

ఇలా ఎన్నో యాగాలు చేస్తుండగా ఈయన యజ్ఞ్యములు చేసాడు, శ్రద్ధగా విధిగా చేసాడు గానీ, ఆ యజ్ఞ్యఫలాన్ని యజ్ఞ్యపురుషుడైన పరమాత్మార్పణం చేసాడు. యజ్ఞ్యములో యజ్ఞ్యపురుషుడైన శ్రీమన్నారాయణున్నే ఆరాధించే యజ్ఞ్యాలుండవు, కొన్ని మిగతా దేవతలని ఆరాధించేవి. కాని అవి అన్నీ ఆ దేవతల పేర్లు చెప్పడానికే గానీ అన్నిటికీ అంతర్యామి పరమాత్మ, ఏ దేవతా మంత్రాలు చదివినా ఆ మంత్రార్థాలు ఇచ్చేది పరమాత్మే. మంత్రముతో పిలిచే దేవత ఎవరైనా, అన్ని దేవతాకారాలలో ఉండేవాడు నారాయణుడే. అన్ని మత్రాలనూ లింగాలనూ దేవతలనూ ద్రవ్యాలనూ క్రియలనూ పరమాత్మ యందే భావిస్తూ తన చాతుర్యముతో తన పాపాన్ని పోగొట్టుకున్నాడు (గీతలో చెప్పినట్లుగా - కౌశలముతో కర్మలు చేయాలి; కర్మల ఫలితం అంటకుండా చేయడం కౌశలం). ఆయా అధ్వర్యులు ఆయా హవిస్సులు ఇస్తున్నప్పుడు "భగవత నారాయణస్య కంఠాయ స్వాహా" అని ఇచ్చేవాడు. అంటే పరమాత్మ యొక్క ఆయా అవయవాలలో ఆయా దేవతలను ధ్యానించాడు. బ్రహ్మకి ఇవ్వాలంటే శిరస్సే స్వాహా, అశ్వనీ దేవతలంటే నాసికలు.

ఏవం కర్మవిశుద్ధ్యా విశుద్ధసత్త్వస్యాన్తర్హృదయాకాశశరీరే బ్రహ్మణి భగవతి వాసుదేవే మహా
పురుషరూపోపలక్షణే శ్రీవత్సకౌస్తుభవనమాలారిదరగదాదిభిరుపలక్షితే నిజపురుషహృల్లిఖితేనాత్మని
పురుషరూపేణ విరోచమాన ఉచ్చైస్తరాం భక్తిరనుదినమేధమానరయాజాయత

ఇలా చేయడము వలన భరతునికి ఎలాంటి కర్మా అంటలేదు. కర్మ శుద్ధి పొందడము వలన మనసు కూడా పరిశుద్ధినొందింది. ఇలాంటి మహానుభావుని హృదయములో ఉండే అంతరాకాశములో (దహరాకాశములో) ఉన్న పరమాత్మ, వాసుదేవుడు, మహాపురుషుడు, శ్రీ వత్సమూ శంఖమూ గదా చక్రమూ మొదలైన వాటితో శొభించబడుతున్న పురుషాకారాన్ని ప్రకాశింపచేస్తూ హృదయములో పరమాత్మ సాక్షాత్కరించే సరికి ఆ పరమాత్మ యొక్క సకల అవయములని ధ్యానించడం వలన పరమాత్మ భక్తి పెరిగింది. నిత్య నైమిత్తిక కర్మలాచరిస్తూ భగవదారాధన ఎలా చేయాలో మనకీ ఆఖ్యానం చెబుతుంది. నిరంతరం సకల చరాచర జగత్తులో ఉన్న పరమాత్మని ఆరాధిస్తున్నాడు కాబట్టి పరమాత్మ యందు భక్తి పెరిగింది.

ఏవం వర్షాయుతసహస్రపర్యన్తావసితకర్మనిర్వాణావసరోऽధిభుజ్యమానం స్వతనయేభ్యో
రిక్థం పితృపైతామహం యథాదాయం విభజ్య స్వయం సకలసమ్పన్నికేతాత్స్వనికేతాత్పులహాశ్రమం
ప్రవవ్రాజ

ఇంత జాగ్రత్తగా ఉన్నా అతను పూర్వ జన్మలో చేసిన కర్మల సంస్కారం నశించడానికి పది లక్షల సంవత్సరాలు పట్టింది. తన రాజ్యాన్ని ఐదుగురికీ సమానముగా పంచాడు. సకల సంపదలకూ నికేతనమైన తన నికేతాన్ని వదిలిపెట్టి పులహాశ్రమానికి వెళ్ళాడు

యత్ర హ వావ భగవాన్హరిరద్యాపి తత్రత్యానాం నిజజనానాం వాత్సల్యేన సన్నిధాప్యత ఇచ్ఛా
రూపేణ

శ్రీమన్నారాయణుడు పులహాశ్రమములో (బదరికీ కేదారికీ మధ్యలో ఉన్నది) నిజరూపములో ఉండి భక్తుల కోరికలను ఇప్పటికీ తీరుస్తున్నాడు.

యత్రాశ్రమపదాన్యుభయతో నాభిభిర్దృషచ్చక్రైశ్చక్రనదీ నామ సరిత్ప్రవరా సర్వతః పవిత్రీ
కరోతి

అక్కడ రెండు దిక్కులా ప్రవహించే చక్ర నది ప్రవహిస్తోంది.

తస్మిన్వావ కిల స ఏకలః పులహాశ్రమోపవనే వివిధకుసుమకిసలయతులసికామ్బుభిః కన్దమూల
ఫలోపహారైశ్చ సమీహమానో భగవత ఆరాధనం వివిక్త ఉపరతవిషయాభిలాష ఉపభృతోపశమః పరాం
నిర్వృతిమవాప

ఏకాంతములో అన్ని విషయాభిలాషలూ వదిలిపెట్టి అక్కడ ఉన్న ఉద్యానవనములో ఉన్న పూలతో ఫలములతో పరమాత్మని ఆరాధించాడు, అంతటి ప్రశాంతమైన స్థలములో పరమాత్మను ఆరాధించగలుగుతున్నందుకు సంతోషించాడు. ఇలా ఆరాధించడముతో పరమాత్మ మీద ప్రేమ పెరిగింది.

తయేత్థమవిరతపురుషపరిచర్యయా భగవతి ప్రవర్ధమానానురాగభరద్రుతహృదయశైథిల్యః
ప్రహర్షవేగేనాత్మన్యుద్భిద్యమానరోమపులకకులక ఔత్కణ్ఠ్యప్రవృత్తప్రణయబాష్పనిరుద్ధావలోక
నయన ఏవం నిజరమణారుణచరణారవిన్దానుధ్యానపరిచితభక్తియోగేన పరిప్లుతపరమాహ్లాదగమ్భీర
హృదయహ్రదావగాఢధిషణస్తామపి క్రియమాణాం భగవత్సపర్యాం న సస్మార

ఆ సంతోషముతో తన మనసూ శరీరమూ పులకించి శరీరములో రోమాలు నిక్కబొడుచుకుని ఉన్నాయి. పరిపూర్ణముగా పరమాత్మను ఆరాధించడముతో ఆనందముతో తడిసిపోయాడు. ఈయనకు భక్తియోగం పెరిగింది, అత్యంత ప్రీతి పాత్రుడైన పరమాత్మ పాదపద్మాలని ఆరాధిస్తున్నందువలన. ఆరాధన చేస్తున్నాడు గానీ ఆరాధన "నేను చేస్తున్నానని " గానీ "నారాయణునికి చేస్తున్నా" అని గానీ భావించలేదు. ఇలా చేస్తున్న పరమాత్మ ఆరాధనను భక్తిలో మునిగి స్మరించలేదు

ఇత్థం ధృతభగవద్వ్రత ఐణేయాజినవాససానుసవనాభిషేకార్ద్రకపిశకుటిలజటాకలాపేన చ
విరోచమానః సూర్యర్చా భగవన్తం హిరణ్మయం పురుషముజ్జిహానే సూర్యమణ్డలేऽభ్యుపతిష్ఠన్నేతదు
హోవాచ

ఈ ప్రకారముగా వ్ర్తాన్ని అవలంబించి జింక చర్మాన్ని వస్త్రముగా కట్టుకొని అవభృత స్నానం చేసినందు వలన నెత్తిన ఉన్న జటలు విచ్చుకున్నాయి. అలా ప్రకాశిస్తూ హిరణ్మయుడైన సూర్యుడిని ధ్యానించాడు. కనపడుతున్న సూర్యభగవానునిలోనే శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని తెలుసుకున్నాడు. ఈ శ్లోకం చెప్పాడు

పరోరజః సవితుర్జాతవేదో దేవస్య భర్గో మనసేదం జజాన
సురేతసాదః పునరావిశ్య చష్టే హంసం గృధ్రాణం నృషద్రిఙ్గిరామిమః

పరమాత్మ సకల చరాచర జగత్తునూ మనస్సుతో సంకల్పముతో సృష్టించాడు.  సర్వ దేవతక అంతర్యామిగా ఉన్న స్వామిని ఆరాధించారు. దేవతలకంటే ఇతరమైన లోకాలలో ఉండే వారు మళ్ళీ ఇక్కడికే తిరిగి వచ్చి ఆరాధించారు
దేవతల కంటే ఇతరములైన లోకాలలో ఉండే లోకాలలో నివాసం ఉండే వారు మళ్ళీ ఇక్కడికే వచ్చి పరమ జ్ఞ్యాన స్వరూపులై దేవతల స్వరూపులై ఉన్న స్వామిని ఆరాధించారు

No comments:

Post a Comment