Thursday, March 21, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం పదకొండవ అధ్యాయం

బ్రాహ్మణ ఉవాచ
అకోవిదః కోవిదవాదవాదాన్వదస్యథో నాతివిదాం వరిష్ఠః
న సూరయో హి వ్యవహారమేనం తత్త్వావమర్శేన సహామనన్తి

తథైవ రాజన్నురుగార్హమేధ వితానవిద్యోరువిజృమ్భితేషు
న వేదవాదేషు హి తత్త్వవాదః ప్రాయేణ శుద్ధో ను చకాస్తి సాధుః

ఏమీ తెలియని వాడు తెలిసిన వాడు మాట్లాడినట్లు ఉంది. నీకేదో కొద్దిగా తెలుసు గానీ నీ మాటలే చెబుతున్నాయి నీకు పూర్తి తత్వం తెలియదని. నీవు పలికిన పలుకులు వ్యవహార వాదములు. వీటిని తెలిసిన వారు ఒప్పుకోరు. నీవు మాట్లాడినది వేడార్థం వేదాంతం కాదు. వేదములలో ఏది నిశ్చయించబడినదో అది వేదాంతం. ఎంతో కాలం గృహస్థాశ్రమాన్ని పాటించి అందులో పుట్టిన విద్యచేత చెప్పిన దానిలో తత్వముండదు.
మంచి వాడు బాసిస్తాడు గానీ శుద్ధి చేయబడిన వాడు కాడు.

న తస్య తత్త్వగ్రహణాయ సాక్షాద్వరీయసీరపి వాచః సమాసన్
స్వప్నే నిరుక్త్యా గృహమేధిసౌఖ్యం న యస్య హేయానుమితం స్వయం స్యాత్

గృహస్థాశ్రమములో ఉండి విద్యాభ్యాసం చేసిన వాడికి తత్వజ్ఞ్యానం కలగకపోగా తత్వ జ్ఞ్యానం బోధిస్తున్నవారి మాటలు కూడా అర్థం కావు. ఉత్తమ వాక్యాలు కూడా అర్థం కావు. "నేనిన్నాళ్ళు హాయిగా ఉన్నాను" అని  అనుకోవడం కలను చూచి తృప్తి పొందడం లాంటిది. సంసారములో పొందే సౌఖ్యం కల లాంటిది. అలాంటి సౌఖ్యాన్ని పొంది ఆ కలలో పొందే జ్ఞ్యానన్ని నా జ్ఞ్యానం అనుకోవడం వలన ఏమి ప్రయోజనం. అది హేయమైనది. సంసారమూ సాంసారిక విషయ సుఖములూ స్వపనముల లాంటివి అన్న జ్ఞ్యానం లేని వారికి సర్వోత్తములైన వేద వాక్యాలు కూడా తత్వ జ్ఞ్యానాన్ని బోధించలేవు.
వరీయసీరపి వాచః - వేద వాక్యాలు

యావన్మనో రజసా పూరుషస్య సత్త్వేన వా తమసా వానురుద్ధమ్
చేతోభిరాకూతిభిరాతనోతి నిరఙ్కుశం కుశలం చేతరం వా

మనం క్షేమం పొందడానికి గానీ ఆపద పొందడానికి గానీ మనసే కారణం. అన్నిటికీ మూలం మనస్సే. మనస్సులో ఉండే (సత్వ రజ తమో) గుణాల బట్టే జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియాలతో (చేతోభి ఆకూతి) పుణ్య పాపాలని చేస్తాడు. ఏ పని చేస్తాడో ఆ పనికి తగినటువంటి శరీరమే తరువాత జన్మలో వస్తుంది. చేసిన కర్మ యొక్క ఫల రూపములోనే ఆ కర్మ కలిగించిన సంస్కారముతోనే మంచో చెడో పొందుతావు. ఏ శరీరముతో నీవు పని చేసావో పని చేసిన శరీరం నశిస్తోంది కాబట్టి శిక్ష ఎవరికి? చేసింది శరీరమే కావచ్చు గానీ చేయించిన మనస్సు అప్పుడూ ఇప్పుడూ సమానమే. కష్టాలనుభవించే మనస్సు అక్కడా ఇక్కడా సమానమే. ఆ మనస్సు ఆ సంస్కారముతో ఇంకో శరీరములోకి వెళ్తుంది.

స వాసనాత్మా విషయోపరక్తో గుణప్రవాహో వికృతః షోడశాత్మా
బిభ్రత్పృథఙ్నామభి రూపభేదమన్తర్బహిష్ట్వం చ పురైస్తనోతి

సంస్కారమూ వాసనా అలాగే ఉంటుంది. మనస్సు అలా ఎందుకు చేస్తుంది? మనస్సు విషయముల యందు ఆసక్తి పొంది సత్వ రజస్సు తమస్సు గుణాలతో వికారం పొంది, త్రైగుణ్యముతో షోడశాత్మగా (పంచ జ్ఞ్యానేంద్రియాలూ కర్మేంద్రియాలూ భూతములూ మనస్సు) మనస్సే రూపాంతరం చెందుతుంది. ఇలా ఎన్ని పేర్లు  మారినా గుణాలు మారలేదు. వేరు వేరు పేర్లు రూపభేదముతో పొందుతోంది. పేర్లు వేరే గానీ అనుభూతి మాత్రం ఒకటే. కష్టమూ సుఖమూ భయమూ బాధా అన్నీ ఒకటే. పేరు రూపాన్ని బట్టి మారుతుంది. రూపం పేరు మారినా వాసన మారదు మనస్సు మారదు సంస్కారం మారదు. ఆ సంస్కారం ఉన్నంతవరకూ తత్వజ్ఞ్యానం కలగదు.
అన్తర్బహిష్ట్వం చ పురైస్తనోతి - ఒక సారి బయట పురములో ఇంకోసారి లోపల పురములో (శరీరములో) ఉంటాడు. అంతఃపురమంటే దేవతలు, బహిః పురమంటే మానవ శరీరం.

దుఃఖం సుఖం వ్యతిరిక్తం చ తీవ్రం కాలోపపన్నం ఫలమావ్యనక్తి
ఆలిఙ్గ్య మాయారచితాన్తరాత్మా స్వదేహినం సంసృతిచక్రకూటః

శరీరం మారుతుంది కానీ మనస్సూ సంస్కారం అదే. ఈ సంస్కారముతో కలిగే సుఖమూ లేదా దుఃఖమూ లేదా తటస్థమూ మూటినీ అనుసంధానం చేయాలి. చేసిన కర్మ యొక్క సంస్కార ఫలితం ఏ సమయములో అందించాలో ఆ సమయములో అందిస్తాడు. స్వదేహినం ఆలిఙ్గ్య మాయారచితాన్తరాత్మా - మనకు ఆత్మ అయిన పరమాత్మను గట్టిగా కౌగిలించుకుని ప్రకృతి సుఖములను గూర్చి ఆలోచిస్తాము. ఆ పరమాత్మ దేహం మాయారచితం, నిరంతరం ఆయన యోగమాయలో ఉంటాడు. మనం నిరంతరం గట్టిగా ఆయననే పట్టుకున్నా ప్రకృతినే చూస్తూ ఉంటాము. దీనికి కారణం మనస్సు. పరమాత్మను ఆలింగనం చేసుకుని సంసారములో భ్రమిస్తూ ఉంటాడు.

తావానయం వ్యవహారః సదావిః క్షేత్రజ్ఞసాక్ష్యో భవతి స్థూలసూక్ష్మః
తస్మాన్మనో లిఙ్గమదో వదన్తి గుణాగుణత్వస్య పరావరస్య

మనం చేసే ప్రతీ పనికి పరమాత్మ సాక్షి (క్షేత్రజ్ఞసాక్ష్యో ). ఇది స్థూల శరీరమూ సూక్ష్మ శరీరము. స్థూల సంస్కారం సూక్ష్మ సంస్కారం. ఏ దేహం తీసుకున్నా మనస్సు మాత్రం అలాగే ఉంటుంది, లింగం మాత్రం మారదు. అందుకే యాతనా దేహాన్ని కొరడాలతో కొడుతూ ఉన్న మనకు బాధ కలుగుతూ ఉంటుంది. మంచి చెడ్డా, పెద్దా చిన్నా అని చెప్పడానికి ఏది కొలత? మనసుని బట్టే అది నిర్ణ్యమవుతుంది.

గుణానురక్తం వ్యసనాయ జన్తోః క్షేమాయ నైర్గుణ్యమథో మనః స్యాత్
యథా ప్రదీపో ఘృతవర్తిమశ్నన్శిఖాః సధూమా భజతి హ్యన్యదా స్వమ్
పదం తథా గుణకర్మానుబద్ధం వృత్తీర్మనః శ్రయతేऽన్యత్ర తత్త్వమ్

మనస్సు (త్రి)గుణముల యందు అనురక్తమయి ఉంటే మానవులకి కష్టాలు వస్తాయి. క్షేమానికి నైర్గుణ్యం కారణం. ఎలాగంటే దీపం వత్తితో వెలుగుతూ ఉంటుంది. వత్తి ఉన్నంతవరకే మంటా, మసి పొగ ఉంటుంది. అగ్నికీ నేతికీ మధ్య వత్తి ఉంటేనే ఇవన్నీ వస్తాయి. అలాగే శరీరానికీ ఆత్మకీ మధ్య మనస్సు ఉంటేనే కష్టాలన్నీ వస్తాయి. వత్తిలేకుంటే అగ్ని ఎలా తన నిజమైన తేజస్సును పొంది ఉంటుందో అలాగే మనస్సు లేని జీవుడు కూడా శ్రేయస్సు పొందుతాడు. మనస్సు చేసే పని వల్లనే మనసుకు సంస్కారం కలుగుతుంది. సంస్కారం పొందిన మనసే ఇంకో శరీరం తీసుకుని ఇంకో పనుక్లు చేస్తుంది. దాని వలన కొత్త సంస్కారాలు తెచ్చుకుంటుంది.గుణత్రయాసక్తమైతే గుణత్రయ ప్రవృత్తిలో మనస్సు ఉంటుంది, వాటిని విడిచి పెడితే తత్వజ్ఞ్యానములో ఉంటుంది.

ఏకాదశాసన్మనసో హి వృత్తయ ఆకూతయః పఞ్చ ధియోऽభిమానః
మాత్రాణి కర్మాణి పురం చ తాసాం వదన్తి హైకాదశ వీర భూమీః

మనస్సే ఇన్ని ఇంద్రియాలుగా రూపాంతరం చెందింది. ఐదు కర్మలూ ఐదు జ్ఞ్యానములూ పంచ భూతాలు, వాటి మీద మమకారం (అకూతి) కలిపి పదహారు.  ఇలాంటి వాటికి విషయములూ కర్మలే ఆధారం. మన్స్సు ఇంద్రియములతో పని చేయిస్తుంది. ఏ ఇంద్రియముతో పని చేస్తుంటే ఆ పనికి ఆ ఇంద్రియమే ఆధారం. కష్టానికైనా సుఖానికైనా ఇంద్రియమే ఆధారం.

గన్ధాకృతిస్పర్శరసశ్రవాంసి విసర్గరత్యర్త్యభిజల్పశిల్పాః
ఏకాదశం స్వీకరణం మమేతి శయ్యామహం ద్వాదశమేక ఆహుః

గంధమూ రూపమూ స్పర్శ రసమూ శబ్దమూ వీటిని జ్ఞ్యానేంద్రియాలతో, మల విసర్జనమూ సమాగనము మాట్లాడడం పని చేయడం ఈ ఐదు కర్మేంద్రియాలు. ఈ పదింటిని స్వీకరించేది పదకొండవది. అదే అభిమానం అంతఃకరణం. "మమ" అనేది పదకొండు "నేను" అనేది పరమాత్మ పన్నెండవది.

ద్రవ్యస్వభావాశయకర్మకాలైరేకాదశామీ మనసో వికారాః
సహస్రశః శతశః కోటిశశ్చ క్షేత్రజ్ఞతో న మిథో న స్వతః స్యుః

ఈ పదకొండూ మనస్సు యొక్క వికారాలే. ద్రవ్యస్వభావాశయకర్మకాలై - పదార్థాన్ని బట్టీ పదార్థం యొక్క స్వభావం బట్టీ బుద్ధిని బట్టీ బుద్ధితో చేసే పనిని బట్టీ పని చేసే సమయం బట్టీ నిర్ణ్యైంచబడుతుంది. ఈ ఐదూ కూర్చబడతాయి. ఆరంభ దశలో పదకొండు వికారాలుగా ఉన్నవి వేలుగా లక్షలుగా కోట్లుగా అవుతాయి. ఈ పదకొండుతోటే అన్ని పనులూ చేస్తాము.

క్షేత్రజ్ఞ ఏతా మనసో విభూతీర్జీవస్య మాయారచితస్య నిత్యాః
ఆవిర్హితాః క్వాపి తిరోహితాశ్చ శుద్ధో విచష్టే హ్యవిశుద్ధకర్తుః

ఇవన్నీ మనస్సు యొక్క విభూతులు. ఈ విభూతులన్నీ నిత్యములు, ఎక్కడున్నా ఉంటాయి. ఒక సారి బయట పడతాయి, ఒక సారి దాక్కొని ఉంటాయి. ఇవన్నీ పరమాత్మే చేయిస్తున్నాడు. దోషములు ఉన్నవాడి చేత, దోషములు లేనివాడు పని చేయిస్తున్నాడు.  చేసుకున్న పనుల వలన కలిగిన సంస్కారం కలిగిన శరీరాన్ని జీవునికి పరమాత్మ ఏర్పరుస్తాడు. ఆ మనసుతో చేసిన పనులతో సంస్కారం పొందుతాడు. దానితో మళ్ళీ శరీరాన్ని పొందుతాడు.

క్షేత్రజ్ఞ ఆత్మా పురుషః పురాణః సాక్షాత్స్వయం జ్యోతిరజః పరేశః
నారాయణో భగవాన్వాసుదేవః స్వమాయయాత్మన్యవధీయమానః

క్షేత్రజ్ఞ్యుడంటే పురాణ పురుషుడు, పరమాత్మ, స్వయం ప్రకాశకుడు పరులకంటే ఈశుడు, పరమాత్మ అయిన వాసుదేవుడు. ఈ పరమాత్మే తన మాయతో మన ఆత్మలో అంతర్యామిగా ఉంటాడు.

యథానిలః స్థావరజఙ్గమానామాత్మస్వరూపేణ నివిష్ట ఈశేత్
ఏవం పరో భగవాన్వాసుదేవః క్షేత్రజ్ఞ ఆత్మేదమనుప్రవిష్టః

గాలి ఎలా ఐతే మనిషిలో రాయిలో పశువులలో స్థావరాలలో జంగమాలలో ఉంటుందో జీవులందరిలో పరమాత్మ ప్రవేశించి ఉంటాడు.

న యావదేతాం తనుభృన్నరేన్ద్ర విధూయ మాయాం వయునోదయేన
విముక్తసఙ్గో జితషట్సపత్నో వేదాత్మతత్త్వం భ్రమతీహ తావత్

జ్ఞ్యానోదయముతో పరమాత్మ ఏర్పరచిన ఈ మాయను గెలిచినవాడు సంగమును విడిస్తాడు ఆరుగురు శత్రువులనూ గెలుస్తాడు. అలా ఎంతవరకూ చేయలేడో అంతవర్కూ సంసారములో భ్రమిస్తూ ఉంటాడు

న యావదేతన్మన ఆత్మలిఙ్గం సంసారతాపావపనం జనస్య
యచ్ఛోకమోహామయరాగలోభ వైరానుబన్ధం మమతాం విధత్తే

ఆత్మకు కారణమైన, సూచికమైన మనసు సంసార తాపములను జీవులకు నాటనంతవరకూ శొకమూ మోహమూ మాయా రాగమూ వైరమూ కలిగే ఉంటాయి. అరిషడ్వర్గాన్ని గెలవనంత వరకూ సంసార తాపాన్ని తొలగించనంత వరకూ ఇలా సంసార చక్రములో భ్రమిస్తూ ఉంటాము.

భ్రాతృవ్యమేనం తదదభ్రవీర్యముపేక్షయాధ్యేధితమప్రమత్తః
గురోర్హరేశ్చరణోపాసనాస్త్రో జహి వ్యలీకం స్వయమాత్మమోషమ్

ఈ మనస్సు ఒక పాలివాడిలాగ (శత్రువులాగ) ఉంటుంది. ఉపేక్షాభావముతో అజాగ్రత్తగా ఉండి మనస్సును దాని ఇష్టప్రకారం నడిచే అవకాశం ఇస్తే ఇంక నీకు అవకాశం ఇవ్వకుండా నరకములోకి తీసుకుని వెళుతుంది. అజాగ్రత్తగా ఉంటే బాధలు తప్పవు. జాగ్రత్తగా ఉంటే పొరబాటుపడకుండా ఉంటే వీటిని గెలవవచ్చు. జాగ్రత్త అంటే ఏమిటి? గురుచరణ సేవ హరి చరణ సేవ చేయడం. ఇవే అస్త్రాలు. గురు సేవే అస్త్రము, హరి సేవే అస్త్రము. ఆ అస్త్రముతో ఈ దొంగను చంపివేయి. ఈ దొంగ ఆత్మనే దొంగిలించాడు. మనస్సు ఆత్మను దొంగిలిస్తుంది. దాన్ని గురుచరణ హరిచరణ ఉపాసనతో గెలవాలి.

No comments:

Post a Comment