Saturday, April 13, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదహారవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదహారవ అధ్యాయం

శ్రీబాదరాయణిరువాచ
అథ దేవఋషీ రాజన్సమ్పరేతం నృపాత్మజమ్
దర్శయిత్వేతి హోవాచ జ్ఞాతీనామనుశోచతామ్

ఇంత చెప్పినా ఆ రాజుకు చనిపోయిన పిల్లవాడిమీదే ధ్యాస ఉండటముతో ఆ చనిపోయిన పిల్లవాని ఆత్మను పిలిచాడు

శ్రీనారద ఉవాచ
జీవాత్మన్పశ్య భద్రం తే మాతరం పితరం చ తే
సుహృదో బాన్ధవాస్తప్తాః శుచా త్వత్కృతయా భృశమ్

ఓ జీవాత్మా నీకు మేలు, వీరిద్దరూ నీ తల్లితండ్రులు, వారి కోసం నీ శరీరములో మళ్ళీ చేరు. నీవు రాజుగారి కొడుకువు. పెరిగితే యువరాజువవుతావు

కలేవరం స్వమావిశ్య శేషమాయుః సుహృద్వృతః
భుఙ్క్ష్వ భోగాన్పితృప్రత్తానధితిష్ఠ నృపాసనమ్

జీవ ఉవాచ
కస్మిన్జన్మన్యమీ మహ్యం పితరో మాతరోऽభవన్
కర్మభిర్భ్రామ్యమాణస్య దేవతిర్యఙ్నృయోనిషు

అప్పుడు జీవాత్మ "వీరు తల్లి తండ్రులంటున్నారు. ఇన్ని కోట్ల జన్మలో ఏ జన్మలో వీరు నాకు తల్లి తండ్రులు"

బన్ధుజ్ఞాత్యరిమధ్యస్థ మిత్రోదాసీనవిద్విషః
సర్వ ఏవ హి సర్వేషాం భవన్తి క్రమశో మిథః

దేవతగా మానవునిగా పశువుగా కీటకముగా పుట్టాను.  వీటిలో ఏ జన్మలో తల్లి తండ్రులు వీరు. తల్లి తండ్రులూ బందువులూ జ్ఞ్యాతులూ మిత్రులూ భార్యా, ప్రతీ ఒక్కరూ సంసారములో ఇవన్నీ అవుతారు. ఎవరు ఎప్పుడు తండ్రో అన్నో కొడుకో మిత్రుడో ఎవరు ఎవరికి ఏమవుతారో. తామాచరించే కర్మల వలన సంచరించే ఈ సంసారములో అందరికీ అందరూ అన్నీ కావొచ్చు, ఏమీ కాకపోవచ్చు

యథా వస్తూని పణ్యాని హేమాదీని తతస్తతః
పర్యటన్తి నరేష్వేవం జీవో యోనిషు కర్తృషు

అంగట్లో వస్తువును మనం కొనుక్కుంటే అది మన వస్తువు. దాన్ని మళ్ళీ అమ్మితే కొన్నవాడు యజమాని.మనం కూడా ఇంతే.

నిత్యస్యార్థస్య సమ్బన్ధో హ్యనిత్యో దృశ్యతే నృషు
యావద్యస్య హి సమ్బన్ధో మమత్వం తావదేవ హి

అంగట్లో ఉన్న వస్తువులు అందరిలో తిరుగుతూ ఉన్నట్లు ఈ జీవుడు రకరకాల శరీరాలలో పుడతాడు. ఆత్మ ఒక్కటే నిత్యం. శరీరమ నిత్యం. నిత్యమైన ఆత్మకు శరీరముతో సంబంధం అనిత్యం. అనిత్యమైన శరీరాన్ని మరచిపోయి నిత్యమైన ఆత్మను తలచుకోవడం జ్ఞ్యాని పని. అలా చేయని వాడు మూర్ఖుడు. అసలు జీవునికి నాశమూ అహంకారం లేదు

ఏవం యోనిగతో జీవః స నిత్యో నిరహఙ్కృతః
యావద్యత్రోపలభ్యేత తావత్స్వత్వం హి తస్య తత్

ఏష నిత్యోऽవ్యయః సూక్ష్మ ఏష సర్వాశ్రయః స్వదృక్
ఆత్మమాయాగుణైర్విశ్వమాత్మానం సృజతే ప్రభుః

అందరికీ ఇదే ఆశ్రయం నిత్యం సూక్షం. పరమాత్మ దీన్ని ఆత్మ మాయా గుణములతో సృష్టించి సంహరిస్తాడు. ఆత్మకు కానీ పరమాత్మకు కానీ ప్రియమైనదీ అప్రియమైనదీ ఉండదు. ఎవరు ఏ తప్పు చేస్తున్నాడో చూసే పరమాత్మ. ఈ ఆత్మ ఏ తప్పూ చేయదు, ఏ పనీ చేయదు. ఈ ఆత్మకు ఏ కర్మ ఫల దోషం అంటదు. అలాంటి నన్ను తీసుకొచ్చి ఈ కారాగారములో ఉండమని అంటున్నారు. పరమాత్మ ఉదాసీనముగా ఉంటాడు. అన్నీ కటాక్షిస్తూ ఉంటాడు. ఆయనతోనే నాకు సంబంధం అని చెప్పి ఆ జీవుడు వెళ్ళిపోయాడు.

న హ్యస్యాస్తి ప్రియః కశ్చిన్నాప్రియః స్వః పరోऽపి వా
ఏకః సర్వధియాం ద్రష్టా కర్తౄణాం గుణదోషయోః

నాదత్త ఆత్మా హి గుణం న దోషం న క్రియాఫలమ్
ఉదాసీనవదాసీనః పరావరదృగీశ్వరః

శ్రీబాదరాయణిరువాచ
ఇత్యుదీర్య గతో జీవో జ్ఞాతయస్తస్య తే తదా
విస్మితా ముముచుః శోకం ఛిత్త్వాత్మస్నేహశృఙ్ఖలామ్

అది విని రాజూ బంధువులూ ఆశ్చర్యముతో స్నేహాన్నీ దుఃఖాన్ని విడిచిపెట్టి ఆ దేహానికి అంత్య సంస్కారం చేసి, విడిచిపెట్టలేని ప్రేమనూ స్నేహాన్ని ఉపదేశముతో విడిచిపెట్టి

నిర్హృత్య జ్ఞాతయో జ్ఞాతేర్దేహం కృత్వోచితాః క్రియాః
తత్యజుర్దుస్త్యజం స్నేహం శోకమోహభయార్తిదమ్

బాలఘ్న్యో వ్రీడితాస్తత్ర బాలహత్యాహతప్రభాః
బాలహత్యావ్రతం చేరుర్బ్రాహ్మణైర్యన్నిరూపితమ్
యమునాయాం మహారాజ స్మరన్త్యో ద్విజభాషితమ్

ఇంత జరిగితే ఆపిల్లవాన్ని చంపిన తొమ్మిది వందల తొంభై మంది స్త్రీలు చేసిన పనికి సిగ్గుపడి బాల హత్యకు పరిహారం చేసుకుని యమునా నదిలో స్నానం చేసి పాపం పోగొట్టుకున్నారు. నారాద అంగీరసుల జ్ఞ్యాన బోధ వలన బుద్ధి తెచ్చుకున్న బురదలోంచి ఏనుగు బయటకు వచ్చినట్లు చిత్రకేతు సంసారం నుండి బయటకు వచ్చి యమునా నదిలో స్నానం చేసి తర్పణాలు చేసి ప్రాణాయామం చేసి నారాదాంగీరసులకు నమస్కరించాడు.

స ఇత్థం ప్రతిబుద్ధాత్మా చిత్రకేతుర్ద్విజోక్తిభిః
గృహాన్ధకూపాన్నిష్క్రాన్తః సరఃపఙ్కాదివ ద్విపః

కాలిన్ద్యాం విధివత్స్నాత్వా కృతపుణ్యజలక్రియః
మౌనేన సంయతప్రాణో బ్రహ్మపుత్రావవన్దత

అథ తస్మై ప్రపన్నాయ భక్తాయ ప్రయతాత్మనే
భగవాన్నారదః ప్రీతో విద్యామేతామువాచ హ

ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ ధీమహి
ప్రద్యుమ్నాయానిరుద్ధాయ నమః సఙ్కర్షణాయ చ

ఓం నమస్తుభ్యం భగవతే వాసుదేవాయ
ఓం నమస్తుభ్యం భగవతే ప్రద్యుమ్నాయా
ఓం నమస్తుభ్యం భగవతే అనిరుద్ధాయ
ఓం నమస్తుభ్యం భగవతే సఙ్కర్షణాయ

నమో విజ్ఞానమాత్రాయ పరమానన్దమూర్తయే
ఆత్మారామాయ శాన్తాయ నివృత్తద్వైతదృష్టయే

వ్యక్తముగా సమస్తముగా మంత్రమును నారదుడు ఉపదేశించి ఆత్మారామునికీ శాంతునికీ భేధ దృష్టి లేని వానికి నమస్కారం.

ఆత్మానన్దానుభూత్యైవ న్యస్తశక్త్యూర్మయే నమః
హృషీకేశాయ మహతే నమస్తేऽనన్తమూర్తయే

సకల ఇంద్రియాధిపతికి నమస్కారం

వచస్యుపరతేऽప్రాప్య య ఏకో మనసా సహ
అనామరూపశ్చిన్మాత్రః సోऽవ్యాన్నః సదసత్పరః

మనస్సుతో సహా అన్ని వాక్కులూ మంత్రములూ అక్కడిదాకా వెళ్ళి తెలియక్ వచ్చాయి. సకల చరాచర జగత్తు ఎవరిలో పుట్టి ఉండి లీనమవుతుందో. మట్టితో చేయబడీ కుండలు మట్టిలోకే వెళ్ళినట్లు మనం కూడా పరమాత్మ నుండి వచ్చి, పరమాత్మ లోనికే వెళతాము

యస్మిన్నిదం యతశ్చేదం తిష్ఠత్యప్యేతి జాయతే
మృణ్మయేష్వివ మృజ్జాతిస్తస్మై తే బ్రహ్మణే నమః

యన్న స్పృశన్తి న విదుర్మనోబుద్ధీన్ద్రియాసవః
అన్తర్బహిశ్చ వితతం వ్యోమవత్తన్నతోऽస్మ్యహమ్

దేహేన్ద్రియప్రాణమనోధియోऽమీ యదంశవిద్ధాః ప్రచరన్తి కర్మసు
నైవాన్యదా లౌహమివాప్రతప్తం స్థానేషు తద్ద్రష్ట్రపదేశమేతి

దేహం ఇంద్రియం ప్రాణం మనసు బుద్ధీ అంతః కరణం పరమాత్మ అంశ ఉన్నప్పుడే పని చేస్తాయి. అవి లేనప్పుడు పని చేయలేవు. ఇనుము గానీ బంగారం కానీ రాగి కానీ ఏ లోహమైనా అగ్ని సంస్కారం ఉంటేనే  మనకు కావలసిన రీతిలో మలచుకుంటుంది. అలాగే మనం ఏ పని చేయాలన్నా పరమాత్మ స్పృష్టం కావాలి.ఆయన లేకుండా గడ్డిపరక కూడా కదలదు. మనం చూస్తున్నామని కానీ చూడబడుతున్నామని కానీ అంటున్నామంటే అది ఆయన సంకల్పం ఉంటేనే. మాట్లాడుటా చూచుటా తినుటా నడుచుటా అన్ని పరమాత్మ అంశ వలనే జరుగుతాయి

ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే
సకలసాత్వతపరివృఢనికరకరకమలకుడ్మలోపలాలితచరణారవిన్దయుగల పరమపరమేష్ఠిన్నమస్తే

అరవై ఎనిమిది అక్షరాల మంత్రం ఇది. దీన్ని ఏడు రోజులు జపం చేస్తే

శ్రీశుక ఉవాచ
భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారదః
యయావఙ్గిరసా సాకం ధామ స్వాయమ్భువం ప్రభో

సంకర్షణుడు కనపడతాడని చెప్పి నారదుడూ అంగీరసుడు వెళ్ళిపోయారు. చిత్ర్కేతువు నీరు మాత్రమే తీసుకుంటూ ఏడు రోజులు సావధాన మనస్కుడై ఆ మంత్రాన్ని జపించాడు. అలా చేస్తే మానవుడిగా  ఉన్న చిత్రకేతువు విద్యాధరాధిపత్యం పొందాడు

చిత్రకేతుస్తు తాం విద్యాం యథా నారదభాషితామ్
ధారయామాస సప్తాహమబ్భక్షః సుసమాహితః

తతః స సప్తరాత్రాన్తే విద్యయా ధార్యమాణయా
విద్యాధరాధిపత్యం చ లేభేऽప్రతిహతం నృప

తతః కతిపయాహోభిర్విద్యయేద్ధమనోగతిః
జగామ దేవదేవస్య శేషస్య చరణాన్తికమ్

ఈ మంత్రాన్ని అలాగే జపిస్తూ ఈ మంత్ర ప్రభావముతో కొద్ది రోజులలోనే ఆదిశేషుని వద్దకు వెళ్ళాడు

మృణాలగౌరం శితివాససం స్ఫురత్కిరీటకేయూరకటిత్రకఙ్కణమ్
ప్రసన్నవక్త్రారుణలోచనం వృతం దదర్శ సిద్ధేశ్వరమణ్డలైః ప్రభుమ్

ఆదిశేషున్ని సాక్షాత్కరించుకోగలిగాడు. తామర తూడు లాగ తెల్లని వర్ణం గలిగి, నల్లని వస్త్రం ధరించి,సిద్ధ సాధ్యాదులతో కూడి ఉన్న స్వామిని సేవించాడు. అలా సేవించడం వలన పాపములన్నీ పటాపంచలైపోయాయి

తద్దర్శనధ్వస్తసమస్తకిల్బిషః స్వస్థామలాన్తఃకరణోऽభ్యయాన్మునిః
ప్రవృద్ధభక్త్యా ప్రణయాశ్రులోచనః ప్రహృష్టరోమానమదాదిపురుషమ్

పరిశుద్ధమైన అంతఃకరణముతో భక్తి పెరిగి పులకింతలు కలిగి ఆనంద బాష్పాలతో నమస్కరించాడు. ఆయన పాద పద్మాలను కన్నీటితో తడిపితే

స ఉత్తమశ్లోకపదాబ్జవిష్టరం ప్రేమాశ్రులేశైరుపమేహయన్ముహుః
ప్రేమోపరుద్ధాఖిలవర్ణనిర్గమో నైవాశకత్తం ప్రసమీడితుం చిరమ్

తతః సమాధాయ మనో మనీషయా బభాష ఏతత్ప్రతిలబ్ధవాగసౌ
నియమ్య సర్వేన్ద్రియబాహ్యవర్తనం జగద్గురుం సాత్వతశాస్త్రవిగ్రహమ్

మాట్లాడాలనుకున్నా నోట మాట రాలేదు. ఆయన కటాక్షముతో మనసుని నిగ్రహించుకుని వాక్కుని పొంది ఇతర ఇంద్రియముల పనులు మానివేసి ఆదిశేషుని స్తోత్రం చేస్తున్నాడు. ఇది సంకర్షణ స్తుతి. మనో నియమానికి ఇదొక మంత్రం. ఇది రోజూ చదివితే మనసు చెప్పినట్లు వింటుంది

చిత్రకేతురువాచ
అజిత జితః సమమతిభిః సాధుభిర్భవాన్జితాత్మభిర్భవతా
విజితాస్తేऽపి చ భజతామకామాత్మనాం య ఆత్మదోऽతికరుణః

ఎవరు మనసు జయిస్తారో వారు నిన్ను గెలుస్తారో. ఎవరు తమ మనసుని గెలవరో వారిని నీవు గెలుస్తావు

తవ విభవః ఖలు భగవన్జగదుదయస్థితిలయాదీని
విశ్వసృజస్తేऽంశాంశాస్తత్ర మృషా స్పర్ధన్తి పృథగభిమత్యా

ఎవరికి కోరికలుండవో వారికి నిన్ను నీవు ఇచ్చుకుంటావో. ఎవరికి  కోరికలు ఉంటాయో వారికి కోరికలు తప్ప ఇంకేమీ మిగలవు. ప్రపంచం యొక్క సృష్టి స్థితీ సంహారం నీ లీలలు. ప్రజాపతులందరూ నేనే సృష్టి చేస్తున్నానని తమలో తాము గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నీ దయ లేనప్పుడు ఇలాంటి దోషాలు కలుగుతాయి.నీవే అసలు జగన్నాయకుడవు.

పరమాణుపరమమహతోస్త్వమాద్యన్తాన్తరవర్తీ త్రయవిధురః
ఆదావన్తేऽపి చ సత్త్వానాం యద్ధ్రువం తదేవాన్తరాలేऽపి

చిన్నవాటికన్నిటికీ చిన్నవాడివీ, పెద్దవాటన్నిటికీ పెద్దవాడివి. లోపలా వెలుపలా నీవున్నావు ప్రాణుల యొక్క ప్రారంభమూ మధ్యా చివరలో నీవే ఉంటావు. మొదలూ మధ్యా చివరా ప్రతీ వస్తువులో నీవే. ఏడు ఊర్ధ్వ ఏడు అధో లోకాలు కలిపి ఉన్న బ్రహ్మ్మాండం చుట్టూ ఏడు ఆవరణలు ఉంటాయి. భూమి ఎంత విస్తీర్ణమో దానికి పదిరెట్లు జలము. అలా ఒకదానికి ఒకటి పది రెట్లు భూమీ జలం అగ్ని వాయువు ఆకాశం  మహత్తూ అహంకారం. త్రయవిధురః - ఆ మూడూ (మొదలు మధ్య అంతం) నీకు లేవు. కానీ ఆది మధ్యాంతములు కల్పిస్తూ ఆ ఆదిలో అంతములో మధ్యలో నీవే ఇంద్రియములూ శరీరములూ నీవే. ఈ అనంతకోటి బ్రహ్మాండములలో ఉన్న జీవులందరిలో అంతర్యామిగా నీవే ఉన్నావు. బ్రహ్మానడములలో బ్రహ్మాండముల ఆవరణలో ఆ ఆవరణలో ఉన్న ఆది మధ్యాంతములలో వాటిలో ఉండే జీవులలో అంతర్యామిగా ఉన్నావు నీవు.

క్షిత్యాదిభిరేష కిలావృతః సప్తభిర్దశగుణోత్తరైరణ్డకోశః
యత్ర పతత్యణుకల్పః సహాణ్డకోటికోటిభిస్తదనన్తః

ఈ బ్రహ్మాండమంతా నీ ఇన్ని వేల శిరస్సులలో ఒక అణువులా అనిపిస్తుంది. అందుకే నిన్ను అనంతుడూ అంటారు

విషయతృషో నరపశవో య ఉపాసతే విభూతీర్న పరం త్వామ్
తేషామాశిష ఈశ తదను వినశ్యన్తి యథా రాజకులమ్

ఇలాంటి సప్తావరణలూ వాటి ప్రభావాలూ చూసాక కూడా నీవు ప్రసాదించే ఐశ్వర్యాలు కావాలి గానీ నీవు మాత్రం వద్దు అంటారు. వారేమి కోరుకున్నారో అదే ఇస్తున్నావు. అవీ పోతున్నాయి, వారూ పోతున్నారు. అందరూ నీ విభూతులు కావలని కోరుకుంటారు గానీ నిన్ను కోరరు. ఇలా వరాలిచ్చే దేవతలు కూడా నిత్యము కాదు. యథా రాజకులమ్ - కొత్త రాజు రాగానే పాత రాజు ఇచ్చినవి వెనక్కు తీసేసుకుంటాడు. అలా మనం నిత్యముగా ఉండని దేవతలని ఆరాధిస్తే వారి వలన వచ్చే సుఖ భోగాలు ఆ విభూతులు ఉన్నంత వరకే ఉంటాయి.

కామధియస్త్వయి రచితా న పరమ రోహన్తి యథా కరమ్భబీజాని
జ్ఞానాత్మన్యగుణమయే గుణగణతోऽస్య ద్వన్ద్వజాలాని

మంచి విత్తనాలు వేస్తే మొలుస్తాయి గానీ, చెడు విత్తనాలు మొలుస్తాయా? నీ యందు భక్తి లేకుండా ఆశతో సేవించే వారికి నీవు కనపడతావా.  కోరికలు నింపుకున్న బుద్ధి గలవారు నీ యందు మనసు నిలుపలేరు. నీవు జ్ఞ్యాన స్వరూపుడవు, గుణ రహితుడవు. గుణాలను లెక్కపెట్టుకునే మేము గుణాలు లేని నిన్ను నశించేవాటిని అడగడం అవివేకం.

జితమజిత తదా భవతా యదాహ భాగవతం ధర్మమనవద్యమ్
నిష్కిఞ్చనా యే మునయ ఆత్మారామా యముపాసతేऽపవర్గాయ

సాంసారికమైన విషయములు కావాలనుకున్న వారు నీవు చెప్పిన భాగవత ధర్మాన్ని ఆచరించలేరు. గుణవంతులైన వారి దగ్గర నేను నాదీ, నీవు నీది అన్న భావములు ఎక్కువగా ఉంటాయి.

విషమమతిర్న యత్ర నృణాం త్వమహమితి మమ తవేతి చ యదన్యత్ర
విషమధియా రచితో యః స హ్యవిశుద్ధః క్షయిష్ణురధర్మబహులః

వైషమ్యముతో కూడిన భేధ బుద్ధితో ఏర్పరచిన ఈ భావ పరంపర ఎవరికుంటుందో వారు పరిశుద్ధులు కారు. వారు నశించిపోయేవారు, అధర్మమే అధికముగా కలవారు.

కః క్షేమో నిజపరయోః కియాన్వార్థః స్వపరద్రుహా ధర్మేణ
స్వద్రోహాత్తవ కోపః పరసమ్పీడయా చ తథాధర్మః

నాదీ, ఇతరులదీ అంటున్నవారిలో ఎవరు నమ్మదగ్గర వారు?  ఈ ఇద్దరిలో ఎవరైనా నశించకుండా ఉంటారా? ఈ రెండు భావాలూ అజ్ఞ్యాన జనితములే. లోకములో మానవులు రెండు రకాలుగా ఉంటారు. కొందరు తమరికి ద్రోహం చేసుకుంటారు. కొందరు ఇతరులకు ద్రోహం చేస్తారు. ఈ రెంటిలో దేని వల్లనైనా లాభం ఉందా? నష్టం లేకుండా ఉందా?? లాభం లేకపోయినా నష్టం ఉంటుంది. తనకు తాన ద్రోహం చేసుకుంటే పరమాత్మవైన నీకు కోపం వస్తుంది. ఇతరులకు చేస్తే అది అధర్మం అవుతుంది.

న వ్యభిచరతి తవేక్షా యయా హ్యభిహితో భాగవతో ధర్మః
స్థిరచరసత్త్వకదమ్బేష్వపృథగ్ధియో యముపాసతే త్వార్యాః

నీవు బోధించిన పరమభాగవత ధర్మానికి ఏ ద్రోహమూ లేదు, న వ్యభిచరతి (తన గతిని విడిచిపెట్టి పోదు). భేధ బుద్ధి లేని వారు చరాచరమైన జగత్తు విషయమూలో భేధ భావనతో ఉండరు. అన్నీ పరమాత్మే అనుకున్నవారు ఎవరికి ద్రోహం చేస్తారు ఎవరిని నిందిస్తారు, దేన్ని అనుభవిస్తారు?

న హి భగవన్నఘటితమిదం త్వద్దర్శనాన్నృణామఖిలపాపక్షయః
యన్నామ సకృచ్ఛ్రవణాత్పుక్కశోऽపి విముచ్యతే సంసారాత్

నిన్ను ఒక్క సారి దర్శించుకుంటే అంతవరకూ చేసినటువంటి అన్ని పాపాలూ పోతాయి. చండాలుడు కూడా తన వశములో లేకుండా అనుకోకుండా నీ నామాన్ని స్మరిస్తే ఉత్తమ స్థితి లభిస్తుంది. ఒకటికి నాలుగు సార్లు నీ నామం వింటే చండాలుడు కూడా సంసారం నుంచి విముక్తుడైనప్పుడు నిరంతరం నీ నామ స్మరణ చేసేవాడు మోక్షానికి వెళతాడని వేరే చెప్పాలా

అథ భగవన్వయమధునా త్వదవలోకపరిమృష్టాశయమలాః
సురఋషిణా యత్కథితం తావకేన కథమన్యథా భవతి

నిన్ను దర్శించుకున్నతరువాత నాకు ఉన్న గుణ త్రయములు నశించాయి, వాటి వలన బాధ నశించింది. నిన్ను చూసిన వెంటనే నా అజ్ఞ్యానం తొలగిపోయి నా స్వరూపం నేను తెలుసుకున్నాను

విదితమనన్త సమస్తం తవ జగదాత్మనో జనైరిహాచరితమ్
విజ్ఞాప్యం పరమగురోః కియదివ సవితురివ ఖద్యోతైః

అందరిలో అంతర్యామిగా ఉన్న నీకు ఎవరు ఏది చేస్తారో ఎందుకు చేస్తారో చెప్పాలా. అఖిల జగదాత్మవు నీవు. నిన్ను లోకానికి తెలపడానికి నిన్ను మేము స్తోత్రం చేస్తున్నామంటే జనులకు నిన్ను చూపడమనేది అయ్యే పనేనా? దివిటీలతో సూర్యున్ని చూపినట్లుగా, మిణుగురు పురుగులతో సూర్యభగవానుని చూపెట్టగలమా?

నమస్తుభ్యం భగవతే సకలజగత్స్థితిలయోదయేశాయ
దురవసితాత్మగతయే కుయోగినాం భిదా పరమహంసాయ

సకల చరాచర సృష్టి స్థితి లయాలను చేసే నీకు నమస్కారం. నీ స్వరూపం మాకు అర్థం కాదు. దుష్ట యోగులకు ఆత్మ గతి అర్థం కాదు.

యం వై శ్వసన్తమను విశ్వసృజః శ్వసన్తి
యం చేకితానమను చిత్తయ ఉచ్చకన్తి
భూమణ్డలం సర్షపాయతి యస్య మూర్ధ్ని
తస్మై నమో భగవతేऽస్తు సహస్రమూర్ధ్నే

నీవు చూస్తే లోకాలన్నీ చూస్తాయి, నీవు నిట్టూర్పు విడిస్తే లోకాలన్నీ నిట్టుర్పు విడుస్తాయి. ఎవరు శిరస్సు మీద ఈ లోకాలన్నీ ఉంటాయో అటువంటి స్వామికి నమస్కారం.

శ్రీశుక ఉవాచ
సంస్తుతో భగవానేవమనన్తస్తమభాషత
విద్యాధరపతిం ప్రీతశ్చిత్రకేతుం కురూద్వహ

ఈ ప్రకారముగా స్తోత్రం చేసిన చిత్రకేతుతో పరమాత్మ

శ్రీభగవానువాచ
యన్నారదాఙ్గిరోభ్యాం తే వ్యాహృతం మేऽనుశాసనమ్
సంసిద్ధోऽసి తయా రాజన్విద్యయా దర్శనాచ్చ మే

నారదాంగీరసులు నీకు ఏ నా స్వరూపాన్ని బోధించారో ఆ విద్యతో నా దర్శనముతో సిద్ధుడవయ్యావు. అన్ని భూతాలకూ ఆత్మని నేనే, అన్ని  భూతాలను బతికించేవాడినీ నేనే. నేనే శబ్ద బ్రహ్మ (ఉపాసకులకు) పరబ్రహ్మ (జ్ఞ్యానులకు). ఈ రెండూ నేనే. లోకములో నేనూ, నాలో లోకములూ వ్యాపించి ఉన్నాయి.

అహం వై సర్వభూతాని భూతాత్మా భూతభావనః
శబ్దబ్రహ్మ పరం బ్రహ్మ మమోభే శాశ్వతీ తనూ

లోకే వితతమాత్మానం లోకం చాత్మని సన్తతమ్
ఉభయం చ మయా వ్యాప్తం మయి చైవోభయం కృతమ్

ప్రకృతి జీవాత్మలలో నేనున్నాను, ఆ రెండూ నాలో ఉన్నాయి. రెండు నాతోటీ నేను రెంటితోటి వ్యాపించి ఉన్నను.లోకములో నారాయణుడు ఉన్నాడు. నారాయణునిలో లోకము ఉంది.

యథా సుషుప్తః పురుషో విశ్వం పశ్యతి చాత్మని
ఆత్మానమేకదేశస్థం మన్యతే స్వప్న ఉత్థితః

కలలో అనేక వాహనాలను చూస్తాడు, కొన్నిటిని అధిరోహిస్తాడు, మరి కల ఐపోగానే అవన్నీ అసత్యం అని తెలుసుకుంటాడు. జగత్తు కూడా ఇంతే. కల ఉన్నంత వరకూ అవి అన్నీ చూస్తాడు. అజ్ఞ్యానం ఉన్నంతవరకూ నా ఇల్లూ నా భార్యా నా సంపదా అని అంటాడు. అజ్ఞ్యానం తొలగగానే అవేవీ ఉండవు.

ఏవం జాగరణాదీని జీవస్థానాని చాత్మనః
మాయామాత్రాణి విజ్ఞాయ తద్ద్రష్టారం పరం స్మరేత్

సుషుప్తి జాగరం స్వప్నం అనే మూడు దశలు ఉన్నాయి. నిద్రావస్థలో ఏదీ తెలియదు. స్వప్నావస్థలో కల వచ్చినట్లు తెలుస్తూ ఉంటుంది. నిద్రపోయింది కలగన్నదీ శరీరమా ఆత్మా? స్వప్నావస్థలో ఉన్న సకల జగత్తు ఎలా మేలుకున్న తరువాత అదృశ్యమవుతుందో మాయచే ఆక్రమించిన జీవుడు ఇదంతా మాయతో ఏర్పరచిన జగత్తు అని తెలుసుకుని, మాయతో ఏర్పరచిన జగత్తుని కాకుండా నన్ను చూస్తాడు. బుద్ధిమంతుడైన వాడు నన్ను స్మరిస్తాడు

యేన ప్రసుప్తః పురుషః స్వాపం వేదాత్మనస్తదా
సుఖం చ నిర్గుణం బ్రహ్మ తమాత్మానమవేహి మామ్

పడుకున్న వాడు పడుకుని లేచిన తరువాత "నేను చాలా బాగా నిదుర్పోయాను " అంటాడు. కలగన్న వాడు కల ఐపోయాక "నేను బాగా కలగన్నాను" అని అంటాడు. ఆ రెంటిలో ఉన్న "నేను" నిద్రపోయిన వాడిలో ఉన్నట్లా, కలగన్న వాడిలో ఉన్నట్లా? ఈ "నేను" ఆ రెంటి కంటే వేరు. నిద్రా స్వప్నావస్థలకంటే ఎలా ఐతే జీవుడు వేరో, ప్రకృతీ జీవులకంటే పరమాత్మ ఐన నేను వేరు. శరీరం విశ్రమించినప్పుడు జీవుడు ఏమి చేస్తూ ఉంటాడు. పరమాత్మను కౌగిలించుకుని ఉంటాడు. నేను నిర్గుణ బ్రహ్మనూ, సుఖ స్వరూపుడిని, నన్ను మాత్రమే నీవు తెలుసుకో..

ఉభయం స్మరతః పుంసః ప్రస్వాపప్రతిబోధయోః
అన్వేతి వ్యతిరిచ్యేత తజ్జ్ఞానం బ్రహ్మ తత్పరమ్

నిద్రపోయిన వాడూ కలగన్న వాడూ రెంటినీ తెలుసుకుంటాడు. నిద్రపోయానూ అంటాడు, కలగన్నానూ అంటాడు. ఆ జ్ఞ్యానం కలిగించే వాడిని నేనే. అవస్థలిచ్చేవాడిని నేనే, అవస్థలలో తేడాని తెలిపేవాడిని నేనే. అటువంటి నన్ను తెలుసుకో. రెండిటి వెంట ఉండేది, రెంటి కన్నా వేరుగా ఉండేది బ్రహ్మము.

యదేతద్విస్మృతం పుంసో మద్భావం భిన్నమాత్మనః
తతః సంసార ఏతస్య దేహాద్దేహో మృతేర్మృతిః

ఆత్మకంటే జగత్తుకంటే పరమాత్మ వేరనీ, ఆ వేరుగా ఉన్న పరమాత్మను మరచిపోవుటే సంసారం. ఆ పరమాత్మను తెలియుటే మోక్షము. సంసారమంటే ఒక దేహం నుండి ఇంకో దేహానికి మారడమే. విజ్ఞ్యానమూ (లౌకిక జ్ఞ్యానం) జ్ఞ్యానమూ (ఆధ్యాత్మ జ్ఞ్యానం) తెలుసుకోగల మానవ జన్మ పొంది కూడా అది తెలుసుకోకుంటే ఆ జీవునికి శాంతం ఉండదు.

లబ్ధ్వేహ మానుషీం యోనిం జ్ఞానవిజ్ఞానసమ్భవామ్
ఆత్మానం యో న బుద్ధ్యేత న క్వచిత్క్షేమమాప్నుయాత్

స్మృత్వేహాయాం పరిక్లేశం తతః ఫలవిపర్యయమ్
అభయం చాప్యనీహాయాం సఙ్కల్పాద్విరమేత్కవిః

ఆశలో కష్టములు తెలిసి ఆశించడములో ఉన్న ఫలితం తెలుసుకుని, ఆశా ఫలం విపారీతం అనీ, విరక్తిలోనే అభయం ఉంది అని తెలుసుకున్న వాడు దేనినీ సంకల్పించకూడదు. కావాలి కావాలి అంటున్నంత సేపూ కష్టాలపాలవుతాడు. పండితుడు కోరికలను విరమించుకోవాలి.

సుఖాయ దుఃఖమోక్షాయ కుర్వాతే దమ్పతీ క్రియాః
తతోऽనివృత్తిరప్రాప్తిర్దుఃఖస్య చ సుఖస్య చ

భార్యా భర్తలు సుఖం కలగాలనీ దుఃఖం తొలగాలనీ సంసారం చేస్తారు. అది కలగక పోగా ఉన్న సుఖం పోయి కొత్త దుఃఖం వస్తుంది.

ఏవం విపర్యయం బుద్ధ్వా నృణాం విజ్ఞాభిమానినామ్
ఆత్మనశ్చ గతిం సూక్ష్మాం స్థానత్రయవిలక్షణామ్

మనమనుకున్నదేదీ రాదు, అనుకోనిదే వస్తుంది. పండితుడైన వాడు అనుకోవడం మానేస్తాడు. పొందుతున్న దాన్ని తెలుసుకుని అనుకోవడం మానెయ్యాలి. ఆత్మ యొక్క గతి చాలా విలక్షణమైనది, సూఖ్షమైనదీ అని తెలుసుకుని చూచిన దానితో విన్నదానితో చూచినవీ విన్నవీ అబద్దమని తెలుసుకుని వాటిని విడిచిపెట్టి జ్ఞ్యాన విజ్ఞ్యానముతో సంతోషముతో నా భక్తుడు నన్ను పొందాలి.

దృష్టశ్రుతాభిర్మాత్రాభిర్నిర్ముక్తః స్వేన తేజసా
జ్ఞానవిజ్ఞానసన్తృప్తో మద్భక్తః పురుషో భవేత్

ఏతావానేవ మనుజైర్యోగనైపుణ్యబుద్ధిభిః
స్వార్థః సర్వాత్మనా జ్ఞేయో యత్పరాత్మైకదర్శనమ్

యోగములో నైపుణ్యం సంపాదించిన మానవులు చేయవలసిన పని ఇదే. జీవుని స్వార్థమంటే ఒక్కటే - పరమాత్మ గురించి తెలుసుకోవడం, పరమాత్మను చూడలనుకోవడం. అది తెలుసుకోవడమే ప్రయోజనం అని భావించాలి

త్వమేతచ్ఛ్రద్ధయా రాజన్నప్రమత్తో వచో మమ
జ్ఞానవిజ్ఞానసమ్పన్నో ధారయన్నాశు సిధ్యసి

నేను చెప్పిన మాటలను పొరబడకుండా తెలుసుకుని జ్ఞ్యాన విజ్ఞ్యానమును తెలుసుకుని త్వరలోనే సిద్ధిని పొందుతావు. కోరికలూ మాని పరమాత్మని ధ్యానించు. ఇదే నిత్యం. ఇదే సత్యం.

శ్రీశుక ఉవాచ
ఆశ్వాస్య భగవానిత్థం చిత్రకేతుం జగద్గురుః
పశ్యతస్తస్య విశ్వాత్మా తతశ్చాన్తర్దధే హరిః

ఇలా జగత్తునకు గురువైన భగవానుడు చిత్రకేతువును ఓదార్చి చిత్రకేతువు చూస్తుండగా అంతర్ధానం చెందాడు

No comments:

Post a Comment