Monday, April 29, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పదిహేనవ అధ్యాయం

                                                     ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పదిహేనవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
కర్మనిష్ఠా ద్విజాః కేచిత్తపోనిష్ఠా నృపాపరే
స్వాధ్యాయేऽన్యే ప్రవచనే కేచన జ్ఞానయోగయోః

భగవదారాధనా రూపముగా కర్మలు ఆచరించే వారు కొందరు. అవి పక్కన పెట్టి తపస్సు చేసే వారు కొందరు. కొందరు నిత్యం వేదం అభ్యాసం చేస్తూ, స్వాధ్యాయ ప్రవచనములు చేస్తూ ఉండేవారు కొందరు. కొందరు జ్ఞ్యానాన్ని కొందరు యోగాన్ని. కర్మ నిష్ఠులూ తపో నిష్టులు స్వాధ్యాయ ప్రవచన జ్ఞ్యా యోగులని ఆరు కర్మలు

జ్ఞాననిష్ఠాయ దేయాని కవ్యాన్యానన్త్యమిచ్ఛతా
దైవే చ తదభావే స్యాదితరేభ్యో యథార్హతః

హవ్య కవ్యాలలో ప్రధమ తాంబూలం జ్ఞ్యాన నిష్ఠునికే. తరువాత దైవ నిష్ఠులకూ, తరువాత ఆయా యోగ్యతలను బట్టి ఇవ్వాలి

ద్వౌ దైవే పితృకార్యే త్రీనేకైకముభయత్ర వా
భోజయేత్సుసమృద్ధోऽపి శ్రాద్ధే కుర్యాన్న విస్తరమ్

శ్రాద్ధమప్పుడు ఇద్దరు బ్రాహ్మణులకు విశ్వేదేవతల స్థానములో, పితృ కార్యములో ముగ్గురుని.  శక్తి లేకపోతే ఇద్దరు సరిపోతారు.ఎంత గొప్ప సంపద ఉన్నా శ్రాద్ధాన్ని విస్తరింపచేయరాదు

దేశకాలోచితశ్రద్ధా ద్రవ్యపాత్రార్హణాని చ
సమ్యగ్భవన్తి నైతాని విస్తరాత్స్వజనార్పణాత్

విస్తరం ఎందుకు చేయకూడదంటే, మంది ఎక్కువైన కొద్దీ శ్రద్ధ తగ్గుతుంది. దేశకాలాలు మారుతాయి యోగ్యతా మారుతుంది. శ్రాద్ధమునకు తన వారిని పిలవరాదు. తనవారికి పెట్టినా ఎక్కువ మందికి పెట్టినా ఇవన్నీ లోపిస్తాయి

దేశే కాలే చ సమ్ప్రాప్తే మున్యన్నం హరిదైవతమ్
శ్రద్ధయా విధివత్పాత్రే న్యస్తం కామధుగక్షయమ్

సరి ఐన సమయములో కాలములో దేశములో పాత్రకు హరి అర్పణ బుద్ధితో ఇస్తే అది అక్షయమవుతుంది.
శ్రద్ధతో హరి అర్పణ భావముతో కంద మూలాలు ఇచ్చినా మంచిదే.

దేవర్షిపితృభూతేభ్య ఆత్మనే స్వజనాయ చ
అన్నం సంవిభజన్పశ్యేత్సర్వం తత్పురుషాత్మకమ్

దేవ పితృ ఋషి భూతములూ తాను తనవారు - ఆరు భాగాలుగా విభజించాలి. శ్రాద్ధములో మాంఅసాన్ని పెట్టకూడదూ తినకూడదు. ముని అన్నం వలన కలిగే ప్రీతి పశు హింసతో కలగదు

న దద్యాదామిషం శ్రాద్ధే న చాద్యాద్ధర్మతత్త్వవిత్
మున్యన్నైః స్యాత్పరా ప్రీతిర్యథా న పశుహింసయా

నైతాదృశః పరో ధర్మో నృణాం సద్ధర్మమిచ్ఛతామ్
న్యాసో దణ్డస్య భూతేషు మనోవాక్కాయజస్య యః

ఉత్తమ ధర్మం ఆశించేవారు ప్రాణులను మానసికముగా వాచికముగా కాయకముగా సకల భూతాల మీద శిక్షను మానుట కన్నా మించినది లేదు.

ఏకే కర్మమయాన్యజ్ఞాన్జ్ఞానినో యజ్ఞవిత్తమాః
ఆత్మసంయమనేऽనీహా జుహ్వతి జ్ఞానదీపితే

కొందరు కర్మ యజ్ఞ్యములూ కొందరు జ్ఞ్యాన యజ్ఞ్యములూ చేస్తారు. మనో నిగ్రహం కావాలి. క్రోధమూ లోభమూ మొదలైనవి జ్ఞ్యానాగ్నిలో హవిస్సులా ఇవ్వాలి

ద్రవ్యయజ్ఞైర్యక్ష్యమాణం దృష్ట్వా భూతాని బిభ్యతి
ఏష మాకరుణో హన్యాదతజ్జ్ఞో హ్యసుతృప్ధ్రువమ్

యజ్ఞ్యములో హవ్యముగా ఇవ్వ వలసినది పశు హింస కాదు. ఇంద్రియ ప్రీతిని హవిస్సుగా ఇవ్వాలి. దాని వలన మనో నిగ్రహం ఏర్పడుతుంది.

తస్మాద్దైవోపపన్నేన మున్యన్నేనాపి ధర్మవిత్
సన్తుష్టోऽహరహః కుర్యాన్నిత్యనైమిత్తికీః క్రియాః

ఫలితాన్ని కోరి జ్ఞ్యాన యజ్ఞ్యం కాకుండా ద్రవ్యములతో మాత్రమే యజ్ఞ్యం చేసే వారిని చూచి ప్రాణులన్నీ భయపడతాయి. వీడు తత్వం తెలియని వాడు. కరుణ లేని వాడై మమ్ములని చంపుతున్నాడు. వీడు తన ప్రాణములను తృప్తి పరచేవాడు. పరమాత్మ ఇచ్చిన కంద మూలాలతో శ్రాద్ధం పెట్టినా భగవానుడు సంతోషిస్తాడు. నైమిత్తిక నిత్య కర్మలు కంద మూలలతో చేసినా చాలు

విధర్మః పరధర్మశ్చ ఆభాస ఉపమా ఛలః
అధర్మశాఖాః పఞ్చేమా ధర్మజ్ఞోऽధర్మవత్త్యజేత్

ధర్మాభాసము - ధర్మమే అనిపించేవి. విధర్మమూ పరధర్మమూ ఆభాసము ఉపమ చరం అనే ఐదు అధర్మ శాఖలు. అధర్మాన్ని విడిచిపెట్టినట్లే వీటినీ విడిచిపెట్టాలి.

ధర్మబాధో విధర్మః స్యాత్పరధర్మోऽన్యచోదితః
ఉపధర్మస్తు పాఖణ్డో దమ్భో వా శబ్దభిచ్ఛలః

ఆచరించవలసిన ధర్మాలు దాచడం విధర్మం. ఇతరులకు చెప్పిన ధర్మం మనం ఆచరించడం పర ధర్మం. పాఖండ ధర్మాన్ని ఉపధర్మం అంటారు. దంభముగా ఉండటం చలం (కపటం)

యస్త్విచ్ఛయా కృతః పుమ్భిరాభాసో హ్యాశ్రమాత్పృథక్
స్వభావవిహితో ధర్మః కస్య నేష్టః ప్రశాన్తయే

ఒక ఆశ్రమములో ఉండేవాడు ఇంకో ఆశ్రమ ధర్మాన్ని చేయడం ఆభాసం. ఏ ఏ ధర్మం వారు ఏ ఏ విధముగా ఆచరిస్తారో దాన్ని బట్టే పెద్దలు వర్ణాశ్రమాలను నిర్ణయించారు. వర్ణాశ్రమ ధర్మములు స్వభావ విరుద్ధములు కావు.

ధర్మార్థమపి నేహేత యాత్రార్థం వాధనో ధనమ్
అనీహానీహమానస్య మహాహేరివ వృత్తిదా

ఆయా ధర్మములు ఆచరించుట వారికి మానసిక ప్రశాంతి కలుగుటకే. ధర్మం కోసం గానీ యాత్ర కోసం కానీ, ధనము లేని వాడు ధనాన్ని కోరుకోకూడదు.యాత్రకు ధనాన్ని అడగకూడదు.

సన్తుష్టస్య నిరీహస్య స్వాత్మారామస్య యత్సుఖమ్
కుతస్తత్కామలోభేన ధావతోऽర్థేహయా దిశః

పది మందినీ భిక్షాటన చేసి యాత్రలకు వెళ్ళి నీవు పొందే తృప్తి ఏమీ ఉండదు. తృప్తి కలవాడు ఇంటిలో పొందే ఆనందం తృప్తి లేని వాడు యాత్రలలో కూడా పొందలేదు. ఏ కోరిక లేని కొండచిలువ ఎక్కడికీ వెళ్ళక ఉంటుంది.
నిత్య సంతుషుటినికి ఏ కోరికలూ లేని వానికి కలిగే సంతోషం కోరికల కోసం పది దిక్కులకూ పరిగెత్తే వానికి కలుగుతుందా

సదా సన్తుష్టమనసః సర్వాః శివమయా దిశః
శర్కరాకణ్టకాదిభ్యో యథోపానత్పదః శివమ్

నిరంతరం సంతోషం ఉన్న వారికి అన్ని చోట్లూ ఆనందాన్నే ఇస్తాయి. చెప్పులేసుకున్నవాడికి ముళ్ళూ రాళ్ళూ గుచ్చుకుంటాయా. సంతోషముగా బతికేవాడు నీళ్ళతో కూడా బతుకుతాడు

సన్తుష్టః కేన వా రాజన్న వర్తేతాపి వారిణా
ఔపస్థ్యజైహ్వ్యకార్పణ్యాద్గృహపాలాయతే జనః

ఉపస్థా జిహ్వ యొక్క వ్యామోహము వలన మానవుడు శునకములాగ బతుకుతున్నాడు

అసన్తుష్టస్య విప్రస్య తేజో విద్యా తపో యశః
స్రవన్తీన్ద్రియలౌల్యేన జ్ఞానం చైవావకీర్యతే

సంతుష్టిలేని బ్రాహ్మణుడికి తేజస్సూ విద్యా తపస్సూ కీర్తీ అన్నీ జారిపోతాయి ఇంద్రియ లౌల్యముల వలన

కామస్యాన్తం హి క్షుత్తృడ్భ్యాం క్రోధస్యైతత్ఫలోదయాత్
జనో యాతి న లోభస్య జిత్వా భుక్త్వా దిశో భువః

ఉన్న జ్ఞ్యానం కూడా వెదజల్ల బడుతుంది. కామ క్రోధముల కంటే మహా భయంకరమైన శత్రువు లోభము. పది దిక్కులూ జయించినా లోభాన్ని జయించలేము.

పణ్డితా బహవో రాజన్బహుజ్ఞాః సంశయచ్ఛిదః
సదసస్పతయోऽప్యేకే అసన్తోషాత్పతన్త్యధః

అసఙ్కల్పాజ్జయేత్కామం క్రోధం కామవివర్జనాత్
అర్థానర్థేక్షయా లోభం భయం తత్త్వావమర్శనాత్

మహాపండితులూ బాగా తెలిసినవారు, ఇతరుల సంశయాలను తీర్చగలిగినవారు కూడా అసంతృప్తి వలన పతనమవుతారు. కోరికను జయించాలి అంటే ఏమిచేయాలి? సంకల్పము చేయకు.సంకల్పాన్ని మానుకో. కామాన్ని వదలడం వలన క్రోధం ఉండదు.  అర్థములను అనర్థములు అనుకుంటే లోభం పోతుంది. తత్వాన్ని తెలుసుకుంటే భయం పోతుంది

ఆన్వీక్షిక్యా శోకమోహౌ దమ్భం మహదుపాసయా
యోగాన్తరాయాన్మౌనేన హింసాం కామాద్యనీహయా

శరీరాత్మ విజ్ఞ్యానముతో శోకమోహాన్ని విడిచిపెట్టాలి, మహానుభావులను సేవించడం వలన ధంభాన్నీ, యోగములో వచ్చే విఘ్నాలను మౌనముతో పోగొట్టాలి.

కృపయా భూతజం దుఃఖం దైవం జహ్యాత్సమాధినా
ఆత్మజం యోగవీర్యేణ నిద్రాం సత్త్వనిషేవయా

శరీరం మీద వ్యామోహాన్ని మానుకో, దాని వలన హింస పోతుంది, ఎదుటి వారి మీద కృప చూపి దుఃఖాన్ని తొలగించుకో, సమాధిలో ఉండుట వలన ఆది దైవికాన్ని గెలవాలి, మనసులో కలిగే దోషాలను యోగ బలముతో గెలవాలి, పరమాత్మ స్వరూపాన్ని సేవించడం వలన నిద్రని గెలవాలి. రజసతమో గుణాలని సత్వముతో గెలవాలి,

రజస్తమశ్చ సత్త్వేన సత్త్వం చోపశమేన చ
ఏతత్సర్వం గురౌ భక్త్యా పురుషో హ్యఞ్జసా జయేత్

ఇవన్నీ చేయాలంటే గురువు మీద భక్తి ఉండాలి.

యస్య సాక్షాద్భగవతి జ్ఞానదీపప్రదే గురౌ
మర్త్యాసద్ధీః శ్రుతం తస్య సర్వం కుఞ్జరశౌచవత్

ఎక్కడ గురువుగారి మీద "ఈయన కూడా మనిషి" అన్న బుద్ధి ఉంటుందో అక్కడ వాడు చదివినదంతా ఏనుగు స్నానములాగ పనికిరాకుండా పోతుంది

ఏష వై భగవాన్సాక్షాత్ప్రధానపురుషేశ్వరః
యోగేశ్వరైర్విమృగ్యాఙ్ఘ్రిర్లోకో యం మన్యతే నరమ్

ఈ కృష్ణుడు (ఏష వై) ప్రకృతికీ పురుషునికీ అధిపతి. మహా యోగేశ్వరులు ఈయన పాద పద్మాలను వెతుకుతూ ఉంటారు. ఇలాంటి స్వామిని మనం మామూలు మనిషి అనుకుంటున్నాము.

షడ్వర్గసంయమైకాన్తాః సర్వా నియమచోదనాః
తదన్తా యది నో యోగానావహేయుః శ్రమావహాః

కామ క్రోధాది షడ్వర్గములను నిగ్రహించే అన్ని నియమాలూ అన్ని విధులూ యోగ సాధనాలూ పరమాత్మలో ఆత్మని ఉంచకపోతే, అన్నీ శ్రమ మాత్రమే. అరిషడ్వర్గ జయమే కాదు,

యథా వార్తాదయో హ్యర్థా యోగస్యార్థం న బిభ్రతి
అనర్థాయ భవేయుః స్మ పూర్తమిష్టం తథాసతః

 మన బతుకు తెరువుకోసం ఆచరిస్తున్న అన్ని వృత్తులూ చివరకు యోగములోకే పర్యవసించాలి. లేకుంటే అవి వ్యర్థము. మనం బతుకు తెరువుకు చేసే ధర్మ విరుద్ధము కాని పనులన్నీ యోగార్థమును సాధించనట్లైతే అవి అన్నీ అనర్థములవుతాయి. యజ్ఞ్య యాగాదులూ దాన ధర్మాలు దేవాలయాలు కట్టించడం చెరువులూ త్రవ్వించడం మొదలైనవన్నీ కూడా యోగము కొరకే కావాలి. అవి అహంకారమును పెంచేవే ఐతే వ్యర్థం.

యశ్చిత్తవిజయే యత్తః స్యాన్నిఃసఙ్గోऽపరిగ్రహః
ఏకో వివిక్తశరణో భిక్షుర్భైక్ష్యమితాశనః

మనసును గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మొదలు మనసును గెలవాలంటే మనసు దేని మీదా ఆస్కతి కాకుండా ఉండటానికి ప్రయత్నించాలి. అది లేకుండా ఉండాలంటే ఎవరు ఏమిచ్చినా తీసుకోకూడదు. ఒంటరిగా ఉండాలి.

దేశే శుచౌ సమే రాజన్సంస్థాప్యాసనమాత్మనః
స్థిరం సుఖం సమం తస్మిన్నాసీతర్జ్వఙ్గ ఓమితి

భిక్ష చేసుకుని, భిక్షలో వచ్చిన వాటిని కూడా మితముగా తినాలి. పవిత్రమైన ప్రదేశములో సమానముగా ఉన్న ప్రదేశములో ఆసనమును ఏర్పాటు చేసుకుని, స్థిరముగా, సమముగా, సుఖముగా, నిటారుగా ఉండి, ఓంకారముతో ప్రాణాయామం చేయాలి. పూరక కుంభక రేచకములతో ప్రాణాయామం చేసి ప్రాణ వాయువును నిలుపుకోవాలి. మనసు కోరికల వెంట పరిగెత్తడం ఆపేదాకా, ముక్కు చివర మీద దృష్టి లగ్నం చేయాలి

ప్రాణాపానౌ సన్నిరున్ధ్యాత్పూరకుమ్భకరేచకైః
యావన్మనస్త్యజేత్కామాన్స్వనాసాగ్రనిరీక్షణః

యతో యతో నిఃసరతి మనః కామహతం భ్రమత్
తతస్తత ఉపాహృత్య హృది రున్ధ్యాచ్ఛనైర్బుధః

మనసు ఏ ఏ దారుల వైపు పరిగెత్తుతుందో అక్కడి నుంచి వెనక్కు లాగాలి మెల్ల మెల్లగా.

ఏవమభ్యస్యతశ్చిత్తం కాలేనాల్పీయసా యతేః
అనిశం తస్య నిర్వాణం యాత్యనిన్ధనవహ్నివత్

ఇలా అభ్యాసం చేస్తే కొద్ది కాలములోనే చిత్త జయాన్ని పొందుతారు. ఇలా చేస్తే కట్టెలు లేని నిప్పు లాగ ఆశ చల్లారిపోతుంది. కామ క్రోధాదులతో కొట్టబడకుండా ఉండే చిత్తమే బ్రహ్మానందం

కామాదిభిరనావిద్ధం ప్రశాన్తాఖిలవృత్తి యత్
చిత్తం బ్రహ్మసుఖస్పృష్టం నైవోత్తిష్ఠేత కర్హిచిత్

యః ప్రవ్రజ్య గృహాత్పూర్వం త్రివర్గావపనాత్పునః
యది సేవేత తాన్భిక్షుః స వై వాన్తాశ్యపత్రపః

పరమాత్మ యందు ఉన్న మనసు మళ్ళీ అక్కడి నుంచి లేచి బయటకు రాకూడదు.విరక్తి పుట్టి సంసారం వదిలి సన్యాసం తీసుకున్నవాడు మళ్ళీ గృహస్థాశ్రమములోకి వస్తే వాడు వాంతి చేసుకున్నదాన్ని తిన్నవాడు, సిగ్గులేని వాడు.

యైః స్వదేహః స్మృతోऽనాత్మా మర్త్యో విట్కృమిభస్మవత్
త ఏనమాత్మసాత్కృత్వా శ్లాఘయన్తి హ్యసత్తమాః

ఏ ఏ పనులని ఆచరించుట వలన, వేటిని వినుట వలన శరీరం ఆత్మ కాదు అని తెలియబడినదో, మలమూ క్రిమీ విట్ గా మారే శరీరం గురించీ, శరీరం ఆత్మనుంచి వేరు అని తెలుసుకున్నవారే దేహం కొరకు తాపత్రయపడితే, దేహ పోషణ కోసం ఎవరినైనా అడిగితే, అడిగినవాడూ అడిగించుకున్నవాడూ ఇద్దరూ చెడతారు.  దేహం గురించి అలమటించే స్థితి కలగకూడదు, అలమటించకూడదు.అజ్ఞ్యానులు మాత్రమే దేహ పోషణకు ఇతరులను పొగుడుతారు

గృహస్థస్య క్రియాత్యాగో వ్రతత్యాగో వటోరపి
తపస్వినో గ్రామసేవా భిక్షోరిన్ద్రియలోలతా

గృహస్థుడు కర్మలనూ బ్రహ్మచారి వ్రతమునూ విడువరాదు, వానప్రస్థుడు ఊళ్ళో ఉండరాదు, సన్యాసి కి ఇంద్రియ చాపల్యం ఉండరాదు. ఎవరైనా ఇలా చేస్తే "మేము ఈ ఆశ్రమములో ఉన్నాము" అని పటాటోపం చేసేవారు.

ఆశ్రమాపసదా హ్యేతే ఖల్వాశ్రమవిడమ్బనాః
దేవమాయావిమూఢాంస్తానుపేక్షేతానుకమ్పయా

అలాంటి వారు ఉంటే చూసిన వారు వారిని విమర్శించకూడదు. భగవంతుని మాయ ఇంతదా అని జాలిపడాలి. జాలితో ఉపేక్షించు.

ఆత్మానం చేద్విజానీయాత్పరం జ్ఞానధుతాశయః
కిమిచ్ఛన్కస్య వా హేతోర్దేహం పుష్ణాతి లమ్పటః

జ్ఞ్యానముతో సంస్కారాన్ని పవిత్రం చేసి ఆత్మను తెలుసుకుంటే, దేనికోసం శరీరాన్ని ఎక్కువగా పోషిస్తాడు. ఆత్మ జ్ఞ్యానం ఉన్నవాడు ఏ ప్రయోజనాన్ని కోరి శరీరాన్ని ఎక్కువగా పోషిస్తాడు

ఆహుః శరీరం రథమిన్ద్రియాణి హయానభీషూన్మన ఇన్ద్రియేశమ్
వర్త్మాని మాత్రా ధిషణాం చ సూతం సత్త్వం బృహద్బన్ధురమీశసృష్టమ్

అక్షం దశప్రాణమధర్మధర్మౌ చక్రేऽభిమానం రథినం చ జీవమ్
ధనుర్హి తస్య ప్రణవం పఠన్తి శరం తు జీవం పరమేవ లక్ష్యమ్

రాగో ద్వేషశ్చ లోభశ్చ శోకమోహౌ భయం మదః
మానోऽవమానోऽసూయా చ మాయా హింసా చ మత్సరః

రజః ప్రమాదః క్షున్నిద్రా శత్రవస్త్వేవమాదయః
రజస్తమఃప్రకృతయః సత్త్వప్రకృతయః క్వచిత్

యావన్నృకాయరథమాత్మవశోపకల్పం
ధత్తే గరిష్ఠచరణార్చనయా నిశాతమ్
జ్ఞానాసిమచ్యుతబలో దధదస్తశత్రుః
స్వానన్దతుష్ట ఉపశాన్త ఇదం విజహ్యాత్

శరీరం రథమూ, ఇంద్రియములు గుఱ్ఱములూ, మనసు పగ్గము, ఐదు విషయములూ మార్గములు, బుద్ధి సారధి, పెద్ద సత్వం దాని ప్రధానమైన భాగం, ఇదే మనకు బంధురం, బంధములని కలిగించేది, పది ఆకులు పది ప్రాణములు, ధర్మాధర్మములు రెండు చక్రములు, జీవుడు రధికుడు. రధం మీద ఉన్న రధికుని ధనువు ఓంకారం. జీవుడే శరం, పరమాత్మే గురి (లక్ష్యం). జీవాత్మ బాణం,పరమాత్మ గురి, ఓంకారముతో సంధించాలి. రహ్తమూ గుఱ్ఱమూ సారధ్హీ ఉండగా, లాభమూ శోకమూ మోహమూ మత్సరమూ  ప్రమాదమూ క్షుట్ నిద్ర మొదలైనవన్నీ శత్రువులు. కొందరు రజ ప్రకృతులూ, కొందరు తమఃప్రకృతులూ కొందరు సత్వ ప్రకృతులు
లక్ష్యాన్ని భేధించాలంటే శరమును సానపెట్టాలి. మాన శరీరం అనే ఈ రథం తన శరీరములో ఉన్నట్లు చేసుకుని గురువుగారి పాదములను అర్చిచి, తద్వారా ఆయుధానికి పదునుపెట్టు. జ్ఞ్యానమనే కత్తిని గురువు గారి పాద పూజ అనే దానితో పదును పెట్టాలి. అప్పుడు శత్రువులు నశిశ్స్తారు.అప్పుడు పరమపదాన్ని పొందుతాడు.

నోచేత్ప్రమత్తమసదిన్ద్రియవాజిసూతా
నీత్వోత్పథం విషయదస్యుషు నిక్షిపన్తి
తే దస్యవః సహయసూతమముం తమోऽన్ధే
సంసారకూప ఉరుమృత్యుభయే క్షిపన్తి

ఈ పని చేయకుంటే దుష్ట ఇంద్రియములనే గుర్రాలు దుష్ట సారధి చెడు దారిలోకి తీసుకుని వెళ్ళి దొంగలకు అప్పచెబుతాడు. విషయములనేవి దొంగలు. మన ఆస్తిని మొత్తం లాక్కుని మనను కటిక చీకటి బావిలో పడవేస్తాడు. అక్కడ మృత్యు భయం ఉంటుంది

ప్రవృత్తం చ నివృత్తం చ ద్వివిధం కర్మ వైదికమ్
ఆవర్తతే ప్రవృత్తేన నివృత్తేనాశ్నుతేऽమృతమ్

వైదిక కర్మ రెండు రకాలు. ఫలాకాంక్ష ఉన్నది, ఫలాకాంక్షలేనిది. ప్రవృత్తి కర్మ ఆచరిస్తే మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటావు.

హింస్రం ద్రవ్యమయం కామ్యమగ్నిహోత్రాద్యశాన్తిదమ్
దర్శశ్చ పూర్ణమాసశ్చ చాతుర్మాస్యం పశుః సుతః

యజ్ఞ్యాలు చేస్తూ పశువులను ఆహుతి ఇవ్వడం హింస మయం, కామ్య మయం, ద్రవ్య మయం, అశాంతినిచ్చేది. చాతుర్మాస్యాది హోమాలన్నీ "ఇష్టములు".
పూర్తములంటే తోటలూ సత్రాలూ బావులూ చెరువులూ మొదలైనవి కట్టడం

ఏతదిష్టం ప్రవృత్తాఖ్యం హుతం ప్రహుతమేవ చ
పూర్తం సురాలయారామ కూపాజీవ్యాదిలక్షణమ్

ద్రవ్యసూక్ష్మవిపాకశ్చ ధూమో రాత్రిరపక్షయః
అయనం దక్షిణం సోమో దర్శ ఓషధివీరుధః

ద్రవ్యములలో కూడా దక్షిణాయనములో చేసేవి కొన్నీ ఉత్తరాయణములో చేసేవి కొన్నీ మొదలైన పితృ మార్గాలు ఉన్నాయి. ఇదే ధూమ దారి, నల్ల దారి.

అన్నం రేత ఇతి క్ష్మేశ పితృయానం పునర్భవః
ఏకైకశ్యేనానుపూర్వం భూత్వా భూత్వేహ జాయతే

కామముతో చేసే యజ్ఞ్యములన్నీ మనకు పితృ మార్గములో పయనింపచేస్తాయి.ఇవన్నీ పునర్జన్మనిచ్చేవి. మనం చేసే ప్రతీ దానికీ జన్మనెత్తుతూనే ఉండాలి.

నిషేకాదిశ్మశానాన్తైః సంస్కారైః సంస్కృతో ద్విజః
ఇన్ద్రియేషు క్రియాయజ్ఞాన్జ్ఞానదీపేషు జుహ్వతి

ఇంద్రియాలను మనసులో మనసుని ఊర్ములలో, సాత్విక మనసును వాక్కులో వాక్కును అక్షరాలలో అక్షరాలను ఓంకారములో ఓంకారమును బిందువులో దాన్ని ప్రాణములో ప్రాణమును మహత్తులో ఉంచాలి.

ఇన్ద్రియాణి మనస్యూర్మౌ వాచి వైకారికం మనః
వాచం వర్ణసమామ్నాయే తమోంకారే స్వరే న్యసేత్
ఓంకారం బిన్దౌ నాదే తం తం తు ప్రాణే మహత్యముమ్

అగ్నిః సూర్యో దివా ప్రాహ్ణః శుక్లో రాకోత్తరం స్వరాట్
విశ్వోऽథ తైజసః ప్రాజ్ఞస్తుర్య ఆత్మా సమన్వయాత్

దేవయానమిదం ప్రాహుర్భూత్వా భూత్వానుపూర్వశః
ఆత్మయాజ్యుపశాన్తాత్మా హ్యాత్మస్థో న నివర్తతే
నిశేకమునుండీ శ్మశానం వరకూ ఉన్న సంస్కారాలతో బ్రాహ్మణుడు జ్ఞ్యానాగ్నిలో క్రియాలన్నీ ఆహుతి చేస్తాడు.
అగ్ని సూర్యుడూ విశ్వా తేజసా ప్రాజ్ఞ్యా తురీయ అనే నాలుగు రకాల ఆత్మ సమన్వయముతో దేవయానం చేస్తాడు (తెల్ల దారి). ఈతను మళ్ళీ తిరిగిరాడు. ఈతను ఆత్మ యాజి. ఝ్న్యాన దీపములో తనను తాను అర్పించుకున్నాడు. మనసులో ఏ ఉద్వేగాలూ ఉండవు. ఈతను మళ్ళీ తిరిగిరాడు. దీన్ని శాస్త్ర జ్ఞ్యానముతో తెలుసుకుంటే జనులు మోహాన్ని పొందరు

య ఏతే పితృదేవానామయనే వేదనిర్మితే
శాస్త్రేణ చక్షుషా వేద జనస్థోऽపి న ముహ్యతి

ఆదావన్తే జనానాం సద్బహిరన్తః పరావరమ్
జ్ఞానం జ్ఞేయం వచో వాచ్యం తమో జ్యోతిస్త్వయం స్వయమ్

ఆబాధితోऽపి హ్యాభాసో యథా వస్తుతయా స్మృతః
దుర్ఘటత్వాదైన్ద్రియకం తద్వదర్థవికల్పితమ్

క్షిత్యాదీనామిహార్థానాం ఛాయా న కతమాపి హి
న సఙ్ఘాతో వికారోऽపి న పృథఙ్నాన్వితో మృషా

ఆద్యంతములో లోపలా వెలుపలా ఆదీ అంతమూ జ్ఞ్యానం జ్ఞేయం వాక్కూ వాక్యం చీకటీ వెలుతురూ ప్రవృత్తీ నివృత్తీ. ఇంద్రియాలను అదుపులోనికి తెచ్చుకోకుండా ఏ మార్గములోకీ వెళ్ళలేము. ప్రవృత్తి నివృత్తి మార్గాలలో ఇంద్రియ జయముండాల్సిందే. అదే కష్టమైనది. ఈ అర్థమా ఆ అర్థమా, ఏది కావాలి? ఇవి ఏ ఒక్క భాగం వచ్చినా తృప్తి కలగదు.ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే, కుండ మట్టితో తయారయ్యింది, కానీ మట్టి ముద్దను కుండ అనలేము.

ధాతవోऽవయవిత్వాచ్చ తన్మాత్రావయవైర్వినా
న స్యుర్హ్యసత్యవయవిన్యసన్నవయవోऽన్తతః

స్యాత్సాదృశ్యభ్రమస్తావద్వికల్పే సతి వస్తునః
జాగ్రత్స్వాపౌ యథా స్వప్నే తథా విధినిషేధతా

వస్త్రం దారల సమూహం కాదు, దారాల సమూహం వస్త్రం కాదు. అది విడిగా ఉండదూ కలిసీ ఉండదు. అబద్దమూకాదు నిజమూ కాదు. అవయవి అవయవాలు లేకుండా ఉండదు.అంత మాత్రాన అవయవాలే అవయవి కాదు.వస్త్రం లేకుండా దారం ఉండొచ్చు గానీ దారములేకుండా వస్త్రం ఉండదు. కానీ వస్త్రములలో దారం కనపడు. పొందిన ఫలములో చేసిన కర్మ కనపడదు. అంత మాత్రాన కర్మ చేయకుండా ఫలితం వచ్చిందని చెప్పగలమా
మేలుకొని ఉంటాము నిద్రపోతామూ కలగంటాము. కల రాకుండా ఉండాలంటే నిద్రపోకూడదు అనగలమా. విధినిషేధాల వలన అవస్థలు మనకు కలగవు.

భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం తథాత్మనః
వర్తయన్స్వానుభూత్యేహ త్రీన్స్వప్నాన్ధునుతే మునిః

భావాద్వైతం క్రియాద్వైతం ద్రవ్యాద్వైతం అని మూడు ఉంటాయి ఆత్మకు. ముని ఐన వాడు వీటిని తొలగించుకుంటాడు.

కార్యకారణవస్త్వైక్య దర్శనం పటతన్తువత్
అవస్తుత్వాద్వికల్పస్య భావాద్వైతం తదుచ్యతే

దారాలన్ని కలిస్తే వస్త్రం ఏర్పడింది.ఈ రెండూ ఒక్కటే, వికల్పం (దారం వేరు వస్త్రం వేరు అనుకోవడం) లేదు అనుకోవడం భావాద్వైతం.

యద్బ్రహ్మణి పరే సాక్షాత్సర్వకర్మసమర్పణమ్
మనోవాక్తనుభిః పార్థ క్రియాద్వైతం తదుచ్యతే

కాయిక వాచిక మానసిక కర్మలు పరమాత్మ యందే అర్పించుట క్రియాద్వైతం.  పరమాత్మకే అర్పించుట క్రియాద్వైతం

ఆత్మజాయాసుతాదీనామన్యేషాం సర్వదేహినామ్
యత్స్వార్థకామయోరైక్యం ద్రవ్యాద్వైతం తదుచ్యతే

భార్యా పుత్రులూ ఇతర ప్రాణులూ, మనమెలా మన స్వార్థం కోరుకుంటామో వారు కూడా అంతే అని భావించడం ద్రవ్యాద్వైతం. అందరినీ ఒకటిగా చూచుట ద్రవ్యాద్వైతం. అన్ని క్రియలూ పరమాత్మకు అర్పించుట క్రియ అద్వైతం. కార్య కారణ సంబంధం భావాద్వైతం

యద్యస్య వానిషిద్ధం స్యాద్యేన యత్ర యతో నృప
స తేనేహేత కార్యాణి నరో నాన్యైరనాపది

ఏ వర్ణం వాడు ఏ ఆశ్రమం వాడు ఏ పనిని చేయకూడదని నిషేధించారో ఆ నిషేదించినదాన్ని ఆపద లేని సమయములో ఆచరించరాదు.

ఇలాంటి ధర్మాలు ఇంటిలో ఉండి ఆచరించినా మోక్షం పొందుతారు.

ఏతైరన్యైశ్చ వేదోక్తైర్వర్తమానః స్వకర్మభిః
గృహేऽప్యస్య గతిం యాయాద్రాజంస్తద్భక్తిభాఙ్నరః

యథా హి యూయం నృపదేవ దుస్త్యజాదాపద్గణాదుత్తరతాత్మనః ప్రభోః
యత్పాదపఙ్కేరుహసేవయా భవానహారషీన్నిర్జితదిగ్గజః క్రతూన్

మీరు ఇంటిలోనే ఉండి మీకు వచ్చిన ఎన్నో ఆప్దలను ఈయన వలనే, ఈయన పాదముల యందు ఉన్న భక్తి వలనే తొలగించుకున్నారు . ఇన్ని యజ్ఞ్యాలు అన్ని దిక్కులూ జయించి చేసావు. అది ఆయన పదముల భక్తి వలన. భగవత్ భాగవత పాద సేవ వలన అన్ని కష్టాలు తొలగుతాయి. దీనికి దుష్టాంతం నేనే

అహం పురాభవం కశ్చిద్గన్ధర్వ ఉపబర్హణః
నామ్నాతీతే మహాకల్పే గన్ధర్వాణాం సుసమ్మతః

నేను పూర్వం ఒక గంధర్వ రాజును. సౌకుమార్యం సౌగంధ్యం మాధుర్యముతో నేను స్త్రీలకు ఇష్టునిలాగ బ్రతికాను.

రూపపేశలమాధుర్య సౌగన్ధ్యప్రియదర్శనః
స్త్రీణాం ప్రియతమో నిత్యం మత్తః స్వపురలమ్పటః

ఏకదా దేవసత్రే తు గన్ధర్వాప్సరసాం గణాః
ఉపహూతా విశ్వసృగ్భిర్హరిగాథోపగాయనే

ఒక సారి అందరూ యాగం చేసారు. మమ్ము కూడా హరి కథా గానం కోసం పిలిచారు. వారు చెప్పినట్లు గానం చేయడానికి స్త్రీలతో కూడి వెళ్ళాను.

అహం చ గాయంస్తద్విద్వాన్స్త్రీభిః పరివృతో గతః
జ్ఞాత్వా విశ్వసృజస్తన్మే హేలనం శేపురోజసా
యాహి త్వం శూద్రతామాశు నష్టశ్రీః కృతహేలనః

భగవంతుని కథలను గానం చేయడానికి ప్రియురాలిని తీసుకుని వచ్చినందుకు, దేవ ధర్మాన్ని హేళన చేసినందుకు శూద్ర జాతిలో జన్మించమని శపించారు. కొంత సేపు ఆడవారితో కలిసి ఐనా సరే పరమాత్మ నామాన్ని సంకీర్తన చేసాను కాబట్టి దాసీ పుత్రునిగా జన్మించినా బ్రహ్మజ్ఞ్యానులను సేవించే అవకాశం వచ్చింది. వారిని సేవించడం వలన బ్రహ్మకు పుత్రుడినయ్యాను

తావద్దాస్యామహం జజ్ఞే తత్రాపి బ్రహ్మవాదినామ్
శుశ్రూషయానుషఙ్గేణ ప్రాప్తోऽహం బ్రహ్మపుత్రతామ్

ధర్మస్తే గృహమేధీయో వర్ణితః పాపనాశనః
గృహస్థో యేన పదవీమఞ్జసా న్యాసినామియాత్

గృహస్థ ధర్మాలని నీకు వర్ణించాను నీ పాపాలు పోగొట్టే విధముగా. నేను చెప్పే ఈ ధర్మాలను సక్రమముగా ఆచరిస్తే గృహస్థు కూడా సన్యాసి పొందే ఫలితాన్ని పొందుతారు. మానవ లోకములో మీరు గొప్ప అదృష్టం చేసుకున్నవారు. అన్ని లోకాలను పవిత్రం చేసే మహర్షులందరూ ఇక్కడికి వస్తున్నారు.
మీ ఇంటిలో పరబ్రహ్మ మానవ రూపములో రహస్యముగా ఉన్నాడని సకల లోకాలనూ పావనం చేసే ఋషులు నీ దగ్గరకు వస్తున్నారు

యూయం నృలోకే బత భూరిభాగా లోకం పునానా మునయోऽభియన్తి
యేషాం గృహానావసతీతి సాక్షాద్గూఢం పరం బ్రహ్మ మనుష్యలిఙ్గమ్

స వా అయం బ్రహ్మ మహద్విమృగ్య కైవల్యనిర్వాణసుఖానుభూతిః
ప్రియః సుహృద్వః ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ

ఎవరో అనుకోకు. ఆయన ఈయనే. కైవల్య సామ్రాజ్యానికి అధిపతి. అలాంటి వాడు మీకు ప్రియుడు మిత్రుడు మేనమామ కొడుకు మీ ఆత్మ వంటి వాడు మీరు చెప్పినట్లు వినేవాడు, మీకు చెప్పేవాడు

న యస్య సాక్షాద్భవపద్మజాదిభీ రూపం ధియా వస్తుతయోపవర్ణితమ్
మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష స సాత్వతాం పతిః

బ్రహ్మ రుద్రేంద్రాదులు ఊహలో కూడా ఈయన రూపం ఇలా ఉంటుంది అని తెలుసుకోలేరో, మౌనముతో భక్తితో శాంతముతో పూజించబడే అటువంటి స్వామి మాకు ప్రసన్నమవు గాక.

శ్రీశుక ఉవాచ
ఇతి దేవర్షిణా ప్రోక్తం నిశమ్య భరతర్షభః
పూజయామాస సుప్రీతః కృష్ణం చ ప్రేమవిహ్వలః

ఈ రీతిగా నరదుడు చెప్పిన మాటను ధర్మరాజు విని, ఆయననూ శ్రీకృష్ణున్నీ ప్రేమతో పూజించాడు

కృష్ణపార్థావుపామన్త్ర్య పూజితః ప్రయయౌ మునిః
శ్రుత్వా కృష్ణం పరం బ్రహ్మ పార్థః పరమవిస్మితః

కృష్ణ ధర్మరాజుల అనుమతి పొంది నారదుడు వెళ్ళిపోయాడు. కృష్ణుడు పరమాత్మ అని తెలుసుకుని పరమాశ్చర్యాన్ని పొంది మరింతగా కృష్ణున్ని సేవించాడు

ఇతి దాక్షాయిణీనాం తే పృథగ్వంశా ప్రకీర్తితాః
దేవాసురమనుష్యాద్యా లోకా యత్ర చరాచరాః

ఇది దక్ష ప్రజాపతి పుత్రికల వంశ కథలు. దేవ రాక్షస మనుష్య క్రిమి కీటకాదులన్నీ వారి సంతానమే.

                                          సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పధ్నాలగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పధ్నాలగవ అధ్యాయం

శ్రీయుధిష్ఠిర ఉవాచ
గృహస్థ ఏతాం పదవీం విధినా యేన చాఞ్జసా
యాయాద్దేవఋషే బ్రూహి మాదృశో గృహమూఢధీః

గృహస్థాశ్రమ విధానాన్ని వివరించండి

శ్రీనారద ఉవాచ
గృహేష్వవస్థితో రాజన్క్రియాః కుర్వన్యథోచితాః
వాసుదేవార్పణం సాక్షాదుపాసీత మహామునీన్

గృహస్థుడు గృహస్థాశ్రమానికి కావలసిన పనులు చేస్తూ వాసుదేవార్పణం చేయాలి. అలా చేయాలంటే మహా మునులను సేవించాలి

శృణ్వన్భగవతోऽభీక్ష్ణమవతారకథామృతమ్
శ్రద్దధానో యథాకాలముపశాన్తజనావృతః

మాటి మాటికీ పరమాత్మ యొక్క దివ్యమైన అవతార కథలను సమయపాలన పాటిస్తూ శాంతమైన స్వభావం కలవారితో కలిసి శ్రద్ధగా వింటూ ఉండాలి. దాని వలన నాది అన్న భావన పోతుంది. 

సత్సఙ్గాచ్ఛనకైః సఙ్గమాత్మజాయాత్మజాదిషు
విముఞ్చేన్ముచ్యమానేషు స్వయం స్వప్నవదుత్థితః

ఇలాంటి వారితో సంగం వలన మెల్లమెల్లగా తన మీదా భర్య మీదా ఇల్లు మీదా ఆస్తి మీదా ఆసక్తి తగ్గుతుంది. ఒక్కొక్క ఆసక్తి తొలగుతున్నకొద్దీ కలగని లేచినవాడిలా అవుతాడు.

యావదర్థముపాసీనో దేహే గేహే చ పణ్డితః
విరక్తో రక్తవత్తత్ర నృలోకే నరతాం న్యసేత్

ఇంటి మీద కానీ ఒంటి మీద కానీ పని ఉన్నంతవరకే ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ ప్రేమను పెంచుకోకు. బతుకుకు ఎంత అవసరమో అంత వాడుకో. అలా అని సన్యాసిలాగ విరక్తునిలాగ కనపడకు. ఎంతో తాపత్రయపడుతున్నవాడిలాగ ఉనండాలి. ప్రేమించినట్లు కనపడాలి. కానీ పరమాత్మనే ప్రేమించాలి. మానవలోకములో ఉన్నా తాను ఒక శరీరి అన్న స్పృహను వదలాలి

జ్ఞాతయః పితరౌ పుత్రా భ్రాతరః సుహృదోऽపరే
యద్వదన్తి యదిచ్ఛన్తి చానుమోదేత నిర్మమః

బంధువులూ కొడుకులూ మొదలినవారితో వాదించకు, మమకారం లేకుండా వారు చెప్పినది ఆమోదించు. ఏ ఆమోదములో మనకారముండకూడదు.

దివ్యం భౌమం చాన్తరీక్షం విత్తమచ్యుతనిర్మితమ్
తత్సర్వముపయుఞ్జాన ఏతత్కుర్యాత్స్వతో బుధః

దివ్యమైన భోగాలు పరమాత్మ వేటిని ప్రసాదిస్తే వాటిని అనుభవించు. బుద్ధిమంతుడు ఇలా చేయాలి

యావద్భ్రియేత జఠరం తావత్స్వత్వం హి దేహినామ్
అధికం యోऽభిమన్యేత స స్తేనో దణ్డమర్హతి

ఎంత ఆహారం మన కడుపు నింపుతుందో అదే నీది. అంత కన్నా ఎక్కువ దాచుకున్నవాడు దొంగ, శిక్షార్హుడు.

మృగోష్ట్రఖరమర్కాఖు సరీసృప్ఖగమక్షికాః
ఆత్మనః పుత్రవత్పశ్యేత్తైరేషామన్తరం కియత్

లేళ్ళూ ఒంటెలూ గాడిదలూ పురుగులూ చీమలూ మొదలైనవి మన ఇంటిలోనే ఉంటాయి. వాటిని నీ కొడుకులులా చూడు. వాటినీ నీకూ తేడా లేదు. నీ దేహం లాంటిదే వాటి దేహం.

త్రివర్గం నాతికృచ్ఛ్రేణ భజేత గృహమేధ్యపి
యథాదేశం యథాకాలం యావద్దైవోపపాదితమ్

గృహస్థుడైనా ధర్మార్థ కామాలను కష్టపడి సేవించకూడదు. భగవంతుడు సహజముగా ఇవ్వని దాన్ని భగవంతుని నిర్భందించి పొందితే కలిగేది దుఃఖమే. దేశకాలానుగుణముగా భగవంతుడు ప్రసాదించిన దాన్ని

ఆశ్వాఘాన్తేऽవసాయిభ్యః కామాన్సంవిభజేద్యథా
అప్యేకామాత్మనో దారాం నృణాం స్వత్వగ్రహో యతః

వారి వారికి, పంచి ఇవ్వాలి. పురుషునికి కానీ స్త్రీకి కానీ నాది అన్న భావన, నా వస్తువు మీద మమకారం పెరిగేది పేళ్ళి అయిన తరువాతే.

జహ్యాద్యదర్థే స్వాన్ప్రాణాన్హన్యాద్వా పితరం గురుమ్
తస్యాం స్వత్వం స్త్రియాం జహ్యాద్యస్తేన హ్యజితో జితః

వీరు తమకు కావలసిన దాని కోసం, తండ్రినీ గురువునూ చంపుతారు. కొంతమంది స్త్రీలు వారు కోరుకున్న వాని కోసం భర్తను కూడా చంపుతుంది. చాలామందిని చంపడానికి కారణమైన వారు ప్రేమాస్పదులెలా అవుతారు. అలాంటి వారిని మొదలు వదిలిపెట్టారు. వారి మీద అతి ప్రేమ చూపకు. ఏ స్త్రీ కోసం వీరందరినీ చంపుతున్నావో ఆ స్త్రీ యందు నాది అన్న భావనను విడిచిపెట్టాలి. అలాంటి స్త్రీపై కోరికను గెలిచిన వాడే ప్రపంచాన్ని గెలిచినవాడు.

కృమివిడ్భస్మనిష్ఠాన్తం క్వేదం తుచ్ఛం కలేవరమ్
క్వ తదీయరతిర్భార్యా క్వాయమాత్మా నభశ్ఛదిః

ఈ శరీరం, కృములచే తినబడే శరీరం,  భస్మ మట్టిగా మలముగా మారే శరీరం, ఇన్ని రూపాంతరాలు చెందే శరీరం మీద అంత మమకారం ఎందుకు? అలాంటి శరీరం మీద ప్రేమ చూపే భార్య ఎందుకు? భార్యా భర్తలు ఒకరికొకరు వారి శరీరాలను చూచే ప్రేమిస్తారు. అది నిజమైన ప్రేమేనా? ఆత్మ ఆకాశాన్ని కూడా వ్యాపించేది. దాన్ని వదిలిపెట్టి పురుగుగా మలముగా భస్మముగా అయ్యే శరీరాన్ని ప్రేమిస్తే అది జ్ఞ్యానం ఉన్న పని ఎలా అవుతుంది.

సిద్ధైర్యజ్ఞావశిష్టార్థైః కల్పయేద్వృత్తిమాత్మనః
శేషే స్వత్వం త్యజన్ప్రాజ్ఞః పదవీం మహతామియాత్

సహజముగా సిద్ధమైన వాటితో బతుకు.  పంచ యజ్ఞ్యం చేయగా మిగిలిన దాన్ని తిను. మిగిలిన దాని మీద నాది అనుకోకు.

దేవానృషీన్నృభూతాని పితౄనాత్మానమన్వహమ్
స్వవృత్త్యాగతవిత్తేన యజేత పురుషం పృథక్

తాను కష్టపడి సంపాదించిన ధనముతో దేవతలనూ నరులనూ పితృ దేవతలనూ ఇతర ప్రాణులనూ తననూ పోషించుకోవాలి. ఇది కాక భగవంతుని కూడా ఆరాధించాలి.

యర్హ్యాత్మనోऽధికారాద్యాః సర్వాః స్యుర్యజ్ఞసమ్పదః
వైతానికేన విధినా అగ్నిహోత్రాదినా యజేత్

మనకు ఆయా అధికారాలతో వచ్చిన విధితో అగ్నిహోత్రాదులతో భగవానుని ఆరాధించాలి.

న హ్యగ్నిముఖతోऽయం వై భగవాన్సర్వయజ్ఞభుక్
ఇజ్యేత హవిషా రాజన్యథా విప్రముఖే హుతైః

పరమాత్మ అగ్ని ద్వారానే మనం ఇచ్చేది తింటాడు. లేదంటే బ్రాహ్మణులకు భోజనం పెట్టినా భగవానునికి పెట్టినట్లే.

తస్మాద్బ్రాహ్మణదేవేషు మర్త్యాదిషు యథార్హతః
తైస్తైః కామైర్యజస్వైనం క్షేత్రజ్ఞం బ్రాహ్మణానను

అగ్ని ముఖముతో తింటాడన్న మాట వాస్తవమైనా, భగవానుడు బ్రాహ్మణ ముఖముతోనే తింటాడు. యజ్ఞ్యములు చేయలేకపోయినా బ్రాహ్మణ భోజనముతో మీ మీ కోరీకలు తీరుతాయి.

కుర్యాదపరపక్షీయం మాసి ప్రౌష్ఠపదే ద్విజః
శ్రాద్ధం పిత్రోర్యథావిత్తం తద్బన్ధూనాం చ విత్తవాన్

గృహస్థుడు భాద్రపద మాస కృష్ణపక్షములో పితృ దేవ ఆరాధన చేయాలి. మన దగ్గర ఉన్న ధనానికి అనుగుణముగా శ్రద్ధగా పితృదేవతలకు శ్రాధం పెట్టాలి. డబ్బు ఉన్నవారు బంధువులకు కూడా పెట్టవచ్చు.

అయనే విషువే కుర్యాద్వ్యతీపాతే దినక్షయే
చన్ద్రాదిత్యోపరాగే చ ద్వాదశ్యాం శ్రవణేషు చ

ఉత్తరాయణములో దక్షిణాయనములో ఇతర సంక్రమణములలో ద్వాదశ, శ్రవణ

తృతీయాయాం శుక్లపక్షే నవమ్యామథ కార్తికే
చతసృష్వప్యష్టకాసు హేమన్తే శిశిరే తథా

నాలుగు అష్టములలో, మార్గశిరమూ పుష్య ఫాల్గుణ మాఘ మాసాలలో

మాఘే చ సితసప్తమ్యాం మఘారాకాసమాగమే
రాకయా చానుమత్యా చ మాసర్క్షాణి యుతాన్యపి

మాఘ శుద్ధ సప్తములలో (రథ సప్తమి), మాఘ పూర్ణిమ నాడు ఆయా మాస నక్షత్రాలలో (మాఘ మాసం - మఖ నక్షత్రం) వచ్చే పూర్ణిమ సమయాలలో

ద్వాదశ్యామనురాధా స్యాచ్ఛ్రవణస్తిస్ర ఉత్తరాః
తిసృష్వేకాదశీ వాసు జన్మర్క్షశ్రోణయోగయుక్

మూడు శ్రవణా నక్షత్రాలలో మూడు ఉత్తరాలలో (ఉత్తరా ఉత్తరాభాద్ర ఉత్తరాషాడ), ఈ నక్షత్రాలలో ఏకాదశి గానీ జన్మ నక్షత్రం గానీ వస్తే

త ఏతే శ్రేయసః కాలా నౄణాం శ్రేయోవివర్ధనాః
కుర్యాత్సర్వాత్మనైతేషు శ్రేయోऽమోఘం తదాయుషః

ఇవన్నీ శుభ కాలాలు. వీటిలో భగవానుని బ్రాహ్మణ ముఖముగా ఆరాధించాలి. మానవులకు ఇవి శ్రేయస్సును కలిగించేవి. భగవత్ భాగవత ఆరాధన చేస్తే దీర్ఘ ఆయువు ఆరోగ్యాలతో ఉంటాడు

ఏషు స్నానం జపో హోమో వ్రతం దేవద్విజార్చనమ్
పితృదేవనృభూతేభ్యో యద్దత్తం తద్ధ్యనశ్వరమ్

ఇలాంటి సమయాలలో స్నానం జపం హోమం వ్రతత్మ్ దేవతార్చనా పితృదేవతలకు శ్రాద్ధం పెట్టాలి. ఇలాంటి రోజులలో దేవతలకూ బ్రాహ్మణులకూ పశు పక్షదులకూ ఏమిచ్చినా దాని ఫలం అనంతం

సంస్కారకాలో జాయాయా అపత్యస్యాత్మనస్తథా
ప్రేతసంస్థా మృతాహశ్చ కర్మణ్యభ్యుదయే నృప

భార్యకు చేయవలసిన సంస్కారాలలో, పిల్లవానికి చేసే సంస్కారాలలో, తన పుట్టిన రోజూ, మొదలైన దినాలలో

అథ దేశాన్ప్రవక్ష్యామి ధర్మాదిశ్రేయావహాన్
స వై పుణ్యతమో దేశః సత్పాత్రం యత్ర లభ్యతే

ఇవి ఉత్తమ దినాలు. ఇవి భగవానుని ఆరాధించవలసిన దినములు. ధర్మార్థ కామ మోక్షాలు ప్రసాదించే దేశాలు చెబుతున్నాను. ఉత్తముడు ఉన్న దేశం ఉత్తమమైనది.

బిమ్బం భగవతో యత్ర సర్వమేతచ్చరాచరమ్
యత్ర హ బ్రాహ్మణకులం తపోవిద్యాదయాన్వితమ్

ఎక్కడ పరమాత్మ యొక్క అర్చా విగ్రహం ఉంటుందో అది ఉత్తమ దేశం. ఎక్కడ తపస్సూ విద్యా సదాచ్రం కల బ్రాహ్మణుల ఇల్లు కలవో అవి

యత్ర యత్ర హరేరర్చా స దేశః శ్రేయసాం పదమ్
యత్ర గఙ్గాదయో నద్యః పురాణేషు చ విశ్రుతాః

ఆయా పురాణాలలో పేర్కొనబడిన గంగాది నదులు ఉన్న స్థలములూ

సరాంసి పుష్కరాదీని క్షేత్రాణ్యర్హాశ్రితాన్యుత
కురుక్షేత్రం గయశిరః ప్రయాగః పులహాశ్రమః

నైమిషం ఫాల్గునం సేతుః ప్రభాసోऽథ కుశస్థలీ
వారాణసీ మధుపురీ పమ్పా బిన్దుసరస్తథా

కుశస్థలీ - ద్వారక

నారాయణాశ్రమో నన్దా సీతారామాశ్రమాదయః
సర్వే కులాచలా రాజన్మహేన్ద్రమలయాదయః

అన్ని కుల పర్వతములూ (మహేంద్ర మలయాది పర్వతాలు)

ఏతే పుణ్యతమా దేశా హరేరర్చాశ్రితాశ్చ యే
ఏతాన్దేశాన్నిషేవేత శ్రేయస్కామో హ్యభీక్ష్ణశః
ధర్మో హ్యత్రేహితః పుంసాం సహస్రాధిఫలోదయః

ఇవి కాక పరమాత్మ ఆర్చ విగ్రహం ఉంటుందో అవి అన్నీ పుణ్య దేశాలే. వీటిని శ్రేయస్సు కావాలి అనుకున్నవారు సేవించాలి. ఈ ప్రదేశాలలో ధర్మాన్ని ఆచరించాలి. ఏ చిన్న సత్కర్మ అయినా ఈ ప్రదేశాలలో ఆచరిస్తే వేయి రెట్లు ఫలితం ఇస్తుంది.

పాత్రం త్వత్ర నిరుక్తం వై కవిభిః పాత్రవిత్తమైః
హరిరేవైక ఉర్వీశ యన్మయం వై చరాచరమ్

కవులు చెప్పారు, పరమాత్మ ఒక్కడే పాత్ర. అలాంటి పరమాత్మను మాత్రమే ధ్యానం చేసే వాడు సత్పాత్రుడు.

దేవర్ష్యర్హత్సు వై సత్సు తత్ర బ్రహ్మాత్మజాదిషు
రాజన్యదగ్రపూజాయాం మతః పాత్రతయాచ్యుతః

ఋషులూ బ్రహ్మ పుత్రులూ మొదలైనవారు. రాజులూ బ్రాహ్మణోత్తములూ మొదలైనవారిలో పరమాత్మ విశేషమైన ఆదరముతో ఉంటాడు. అందుకు వీరు సత్పాత్రులు (పరమాత్మకు నివాసం)

జీవరాశిభిరాకీర్ణ అణ్డకోశాఙ్ఘ్రిపో మహాన్
తన్మూలత్వాదచ్యుతేజ్యా సర్వజీవాత్మతర్పణమ్

సకల చరాచర జీవ రాశి ఉన్న ఈ బ్రహ్మాండం పరమాత్మ పాదముతో కొలవబడి ఉన్నది. అందుచే అన్ని ప్రాణులూ లోకాలూ పరమాత్మనుండి వచ్చి ఆయన పాదములతో పవిత్రమయ్యాయి. కాబట్టి పరమాత్మను ఆరాధించుట అన్నిప్రాణూలకూ తృప్తి కలిగించుట.

పురాణ్యనేన సృష్టాని నృతిర్యగృషిదేవతాః
శేతే జీవేన రూపేణ పురేషు పురుషో హ్యసౌ

నృ తిర్యక్ ఋషి దేవత అనే సకల శరీరాలూ పరమాత్మే సృష్టించాడు. ఆ శరీరాలలో పరమాత్మ జీవ రూపములో ఉంటాడు కాబట్టి పరమాత్మ పురుషుడు. పురములలో ఉండేవాడు కాబట్టి ఆయన పురుషుడు.

తేష్వేవ భగవాన్రాజంస్తారతమ్యేన వర్తతే
తస్మాత్పాత్రం హి పురుషో యావానాత్మా యథేయతే

పరమాత్మే అందరిలో ఉంటాడు కానీ తారతమ్యులతో ఉంటాడు. తోటి మానవులనూ ప్రాణులనూ అవమానించే శరీరములో పరమాత్మ ఇబ్బందిగా ఉంటాడు. అందరినీ పరమాత్మ రూపముగా భావించి ఆరాధించేవారి శరీరములో ప్రసన్నముగా ఉంటాడు.

దృష్ట్వా తేషాం మిథో నృణామవజ్ఞానాత్మతాం నృప
త్రేతాదిషు హరేరర్చా క్రియాయై కవిభిః కృతా

త్రేతాది యుగాలలో పరమాత్మ యొక్క అర్చను ఆయా జ్ఞ్యానులు చేసారు.

తతోऽర్చాయాం హరిం కేచిత్సంశ్రద్ధాయ సపర్యయా
ఉపాసత ఉపాస్తాపి నార్థదా పురుషద్విషామ్

సకల ప్రాణులలో దేవతాదులలో బ్రాహ్మణాదులలో ఆరాధించుట అందరికీ చేత కాదు కాబట్టి అర్చా రూపం ఏర్పాటు చేసారు. తోటి ప్రాణులను ద్వేషిస్తూ ఇతర ప్రాణులను ద్వేషిస్తే ఫలితం రాదు.

పురుషేష్వపి రాజేన్ద్ర సుపాత్రం బ్రాహ్మణం విదుః
తపసా విద్యయా తుష్ట్యా ధత్తే వేదం హరేస్తనుమ్

తక్కిన పురుషులందరి కంటే బ్రాహ్మణుడు ఉత్తమ పాత్ర. ఎందుకంటే ఆయన పరమాత్మ శరీరాన్ని ప్రత్యక్షముగా దాలుస్తున్నాడు. తపస్సూ వేదం యజ్ఞ్యం అనే మూడు రూపాలలో.

నన్వస్య బ్రాహ్మణా రాజన్కృష్ణస్య జగదాత్మనః
పునన్తః పాదరజసా త్రిలోకీం దైవతం మహత్

కృష్ణ పరమాత్మ బ్రాహ్మణుడే తన పాద పరాగముతో మూడు లోకాలనూ పావనం చేస్తున్నాడు అని చెప్పాడు. తోటి ప్రాణులను ద్వేషిస్తూ ఆరాధిస్తే పరమాత్మ సంతోషించడు. 

Sunday, April 28, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పదమూడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదమూడవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
కల్పస్త్వేవం పరివ్రజ్య దేహమాత్రావశేషితః
గ్రామైకరాత్రవిధినా నిరపేక్షశ్చరేన్మహీమ్

వానప్రస్థ ఆశ్రమములో ఉన్నవాడు సన్యాస ఆశ్రమం తీసుకోగలిగితే తీసుకోవాలి. సమర్ధుడైతేనే సన్యాస ఆశ్రమములోకి ప్రవేశించాలి. సన్యాసాశ్రమానికి శరీరం మాత్రమే ఉండాలి. ఆశ్రమం కూడా ఉండరాదు. వానప్రస్థానములో ఆశ్రమం ఉంటుంది కానీ, సన్యాస ఆశ్రమములో అది ఉండరాదు. ఏ రెండో రాత్రీ ఒకే ఊళ్ళో ఉండకూడదు. నిరపేక్షుడై ఉండాలి.

బిభృయాద్యద్యసౌ వాసః కౌపీనాచ్ఛాదనం పరమ్
త్యక్తం న లిఙ్గాద్దణ్డాదేరన్యత్కిఞ్చిదనాపది

మరీ ఉండలేనప్పుడు ఆచ్చాధన కోసమే ఒక కౌపీనాన్ని కట్టుకోవాలి. దండ కమండలు తప్ప మరి ఏది తన కొరకు ధరించకూడదు ఆపద లేనప్పుడు.

ఏక ఏవ చరేద్భిక్షురాత్మారామోऽనపాశ్రయః
సర్వభూతసుహృచ్ఛాన్తో నారాయణపరాయణః

భూమిని సంచరించేప్పుడు ఒక్కరే సంచరించాలి, తనలో తాను ఆనందిస్తూ ఉండాలి. దేన్నీ ఆశ్రయించి ఉండరాదు. ఏ ప్రాణులనూ ద్వేషించకూడదు ప్రేమించకూడదు, రాగ ద్వేషాలను జయించాలి. పరమాత్మ యందు మాత్రమే బుద్ధీ మనసు లగ్నం చేసి ఉండాలి.

పశ్యేదాత్మన్యదో విశ్వం పరే సదసతోऽవ్యయే
ఆత్మానం చ పరం బ్రహ్మ సర్వత్ర సదసన్మయే

పరమాత్మలో ఈ ప్రపంచం మొత్తాన్ని చూడలి. ప్రపంచం పరమాత్మలో ఉన్నట్లు చూడాలి. తననూ పరమాత్మనూ ప్రకృతీ జీవుల స్వరూపలుగా ఉండే ప్రపంచము పరమాత్మలో ఉంది అని భావిస్తూ ఉండాలి.

సుప్తిప్రబోధయోః సన్ధావాత్మనో గతిమాత్మదృక్
పశ్యన్బన్ధం చ మోక్షం చ మాయామాత్రం న వస్తుతః

పడుకోని లేవడానికి మధ్య ఉన్న సంధ్యా సమయములో ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి అని, పరమాత్మనీ ఆత్మనీ సాక్షాత్కరించుకున్నవాడై, సంసారమూ మోక్షమూ అన్న మాయ నుంచి (సంసారములో చిక్కుకోవడం ఎంత మాయో, మోక్షము కూడా అంతే మాయ. సంసారం అబద్దమైనపుడు మోక్షం కూడా మాయ) విడువడాలి

నాభినన్దేద్ధ్రువం మృత్యుమధ్రువం వాస్య జీవితమ్
కాలం పరం ప్రతీక్షేత భూతానాం ప్రభవాప్యయమ్

మృత్యువుని గానీ జీవితాన్ని గానీ రెంటినీ అభినందించకూడదు. పరమాత్మ ప్రసాదించిన శరీరం ఎప్పుడు పోతుందో ఆ సమయం కోసం ఎదురు చూడాలి. ప్రాణుల పుట్టుకా నాశమూ ఇష్టం ప్రకారం జరుగదు.

నాసచ్ఛాస్త్రేషు సజ్జేత నోపజీవేత జీవికామ్
వాదవాదాంస్త్యజేత్తర్కాన్పక్షం కంచ న సంశ్రయేత్

సన్స్యాసి నాస్తిక వాదాల జోలికి వెళ్ళరాదు. బతుకు తెరువు కోసం ప్రయత్నించరాదు. ఎవ్వరితో వాదించరాదు. ఏ ఒకరి పక్షమునూ ఆశ్రయించరాదు. అందుకే వాదాల జోలికి వెళ్ళకూడదు.

న శిష్యాననుబధ్నీత గ్రన్థాన్నైవాభ్యసేద్బహూన్
న వ్యాఖ్యాముపయుఞ్జీత నారమ్భానారభేత్క్వచిత్

శిష్యులతో ఎక్కువ అనుబంధం పెంచుకోకూడదు. వారిని నిర్భందం చేయకూడదు. ఎక్కువ గ్రంధాలను చదువకూడదు. గ్రంధాలు చదివినా వ్యాఖ్యానాల జోలికి వెళ్ళకూడదు. ఏ ఉద్యమాలూ,

న యతేరాశ్రమః ప్రాయో ధర్మహేతుర్మహాత్మనః
శాన్తస్య సమచిత్తస్య బిభృయాదుత వా త్యజేత్

బ్రహ్మచారీ గృహస్థా వానప్రస్థాలు ధర్మాచరణ గురించి. కానీ సన్యాసాశ్రమం ధర్మాన్ని ఆచరించడానికి కాదు. సన్యాసాశ్రమం ధర్మహేతువు కాదు.

అవ్యక్తలిఙ్గో వ్యక్తార్థో మనీష్యున్మత్తబాలవత్
కవిర్మూకవదాత్మానం స దృష్ట్యా దర్శయేన్నృణామ్

పూర్తిగా తన్మయమైన తరువాత, అటువంటి వారిని చూస్తే వారు ఏ ఆశ్రమానికి చెందినవారో తెలియకూడదు. చూసేవారికి తానేమిటో తెలియకూడదు. ఆ గుర్తులు ధరించకూడదు. కానీ విషయం మాత్రం స్పష్టముగా ఉండాలి. పరమాత్మను ధ్యానం చేస్తూ ఉండాలి. బుద్ధిమంతుడై ఉండాలి గానీ పిచ్చి పిల్లవానిలాగ ఉండాలి. పండితుడై ఉండాలి గానీ మూగవానిలా ఉండాలి. తనను తాను మూగవానిగా చూపుకోవాలి. ఈ విషయములో ఒక పురాణం ఉంది. అది చెబుతాను విను.

అత్రాప్యుదాహరన్తీమమితిహాసం పురాతనమ్
ప్రహ్రాదస్య చ సంవాదం మునేరాజగరస్య చ

ప్రహ్లాదునికీ ఒక అజగర వ్రతం ధరించిన ఒక మునికీ జరిగిన సంవాదం.

తం శయానం ధరోపస్థే కావేర్యాం సహ్యసానుని
రజస్వలైస్తనూదేశైర్నిగూఢామలతేజసమ్

సహ్య పర్వతములో కావేరీ నదీ తీరములో భూమి మీద పడుకుని ఉన్నాడు. శరీరమంతా దుమ్ముకొట్టుకుని పోయి ఉంది. నివురు గప్పిన నిప్పులా ఉన్నాడు. రహస్యముగా దాగి ఉన్న స్వచ్చమైన తేజస్సు కలిగి ఉన్నాడు.

దదర్శ లోకాన్విచరన్లోకతత్త్వవివిత్సయా
వృతోऽమాత్యైః కతిపయైః ప్రహ్రాదో భగవత్ప్రియః

లోకజ్ఞ్యానం పొందాలని, తత్వం తెలుసుకోవాలని సంచరిస్తున్న ప్రహ్లాదుడు ఇతనిని చూచాడు. కొందరు మంత్రులను తీసుకుని తిరుగుతూ ఉన్నాడు

కర్మణాకృతిభిర్వాచా లిఙ్గైర్వర్ణాశ్రమాదిభిః
న విదన్తి జనా యం వై సోऽసావితి న వేతి చ

ఈయన చూస్తే బ్రహ్మచారా గృహస్థా యతా వానప్రస్థా సన్యాసా అని తెలియలేదు. ఆయనకు నమస్కరించి పూజించి

తం నత్వాభ్యర్చ్య విధివత్పాదయోః శిరసా స్పృశన్
వివిత్సురిదమప్రాక్షీన్మహాభాగవతోऽసురః

తల వంచి పాదములని స్పృశించి ఇలా అడిగాడు

బిభర్షి కాయం పీవానం సోద్యమో భోగవాన్యథా
విత్తం చైవోద్యమవతాం భోగో విత్తవతామిహ
భోగినాం ఖలు దేహోऽయం పీవా భవతి నాన్యథా

మీరు బాగా బలిసిన శరీరం ధరించి ఉన్నారు ప్రయత్నం చేసి ధనమును సంపాదించి భోగములని అనుభవించిన వారు ఎలా ఉంటారో అలా ఉన్నారు. ప్రయత్నంచేసిన వారికే ధనం వస్తుంది, వారే భోగం అనుభవిస్తారు, భోగం అనుభవించిన వారే అనుభవిస్తారు. మీకు చివరిదైన భోగం మాత్రమే ఉంది. డబ్బూ ప్రయత్నం ఉన్నట్లు కనపడట్లేదు.

న తే శయానస్య నిరుద్యమస్య బ్రహ్మన్ను హార్థో యత ఏవ భోగః
అభోగినోऽయం తవ విప్ర దేహః పీవా యతస్తద్వద నః క్షమం చేత్

 ఏ ప్రయత్నం లేకుండా ఇలా పడుకుని ఉన్న మీకు డబ్బు ఎక్కడినుంచి వస్తుంది. అలాంటి వారికి  భోగం ఎక్కడిది? ఎలాంటి భోగం లేని మీ శరీరం ఇలా ఎలా ఉంది? చెప్పదలచుకుంటే చెప్పండి.

కవిః కల్పో నిపుణదృక్చిత్రప్రియకథః సమః
లోకస్య కుర్వతః కర్మ శేషే తద్వీక్షితాపి వా

మిమ్ము చూస్తే కవి సమర్ధుడు నిపుణముగా చూసేవాడు, లౌకికమైన కర్మలు ఆచరించే వారు ఎలా పడుకుని ఉంటారో అలా ఉన్నారు. అన్ని భోగాలూ ఆచరించేవారు పడుతున్నట్లు పడుకున్నారు గానీ మీరే పనీ చేయట్లేదు

శ్రీనారద ఉవాచ
స ఇత్థం దైత్యపతినా పరిపృష్టో మహామునిః
స్మయమానస్తమభ్యాహ తద్వాగమృతయన్త్రితః

ఇలా అడిగితే ఆయన ఒక చిరునవ్వు నవ్వి

శ్రీబ్రాహ్మణ ఉవాచ
వేదేదమసురశ్రేష్ఠ భవాన్నన్వార్యసమ్మతః
ఈహోపరమయోర్నౄణాం పదాన్యధ్యాత్మచక్షుషా

నీవు సజ్జనులకు ఇష్టుడవు. నీవడిగితే చెప్పకుండా ఉండకూడదు. మనకు రెండే ఉన్నాయి. ఒకటి కోరిక. ఇంకొకటి విరక్తి. ఈ రెంటి యందు కూడా కోరిక లేకుంటే సన్యాసి అవుతాడు.

యస్య నారాయణో దేవో భగవాన్హృద్గతః సదా
భక్త్యా కేవలయాజ్ఞానం ధునోతి ధ్వాన్తమర్కవత్

శ్రీమన్నారాయణుడు అన్ని వేళలా హృదయములో ఉంటాడు. చీకటిని సూర్యుడు పోగొట్టినట్లు హృదయములో ఉన్న పరమాత్మ అజ్ఞ్యానాన్ని పోగొడతాడు. దానికి పరమాత్మ యందు భక్తి మాత్రం ఉండాలి.

తథాపి బ్రూమహే ప్రశ్నాంస్తవ రాజన్యథాశ్రుతమ్
సమ్భాషణీయో హి భవానాత్మనః శుద్ధిమిచ్ఛతా

సాధారణముగా నీ ప్రశ్నకు నేను సమాధానం చెప్పకూడదు. నీవు పరమాత్మ దగ్గరనుంచి వచ్చినవాడవు. మనసు పరిశుద్ధముగా ఉండాలని కోరుకునేవారు నిన్ను గౌరవించకతప్పదు. ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టినా ప్రకృతిలో ఉండి పరమాత్మ భక్తులని గౌరవించాలి. అలాంటి వారందరికీ నీవు గౌరవించదగిన వాడవు.

తృష్ణయా భవవాహిన్యా యోగ్యైః కామైరపూర్యయా
కర్మాణి కార్యమాణోऽహం నానాయోనిషు యోజితః

నేను ఎన్నటికీ నిండని, సంసారం వైపు ప్రవహింపచేసేదైన , ఆశతో, యోగ్యమైన అయోగ్యమైన కోరికలతో రక రకముల పనులను చేయించబడుతూ ఉన్న నేను ఎన్నో జన్మలను ఎత్తాను

యదృచ్ఛయా లోకమిమం ప్రాపితః కర్మభిర్భ్రమన్
స్వర్గాపవర్గయోర్ద్వారం తిరశ్చాం పునరస్య చ

ఆయా కర్మలతో తిరుగుతూ స్వామి కృపతో భూలోకములో వచ్చిపడ్డాను. ఈ భూలోకం స్వర్గానికైనా అపవర్గానికైనా ద్వారం.

తత్రాపి దమ్పతీనాం చ సుఖాయాన్యాపనుత్తయే
కర్మాణి కుర్వతాం దృష్ట్వా నివృత్తోऽస్మి విపర్యయమ్

ఇక్కడికొస్తే ఈ భూలోకములో సుఖము కోసం, దుఃఖం తొలగించడానికి ప్రయత్నం. స్త్రీ పురుష సమాగమ రూపమైన సుఖమును పొందాలి, అంతకన్నా ముందు దుఃఖాన్ని తొలగించుకోవాలి. వాటి కోసం రక రకాల పనులు చేస్తూ ఉన్నాను. ఇలా చేస్తు చేస్తూ నేను విపర్యయాన్నే పొందాను. సుఖాన్ని పొందాలని కర్మలు చేస్తే సుఖం తొలగి దుఃఖం కలిగింది.

సుఖమస్యాత్మనో రూపం సర్వేహోపరతిస్తనుః
మనఃసంస్పర్శజాన్దృష్ట్వా భోగాన్స్వప్స్యామి సంవిశన్

అన్ని కోరికలనూ విడిచిపెట్టుటే సుఖం అని తెలుసుకున్నాను. ఏ కోరికలూ లేకుండా ఉండుటే సుఖం. మనస్సు యొక్క యోగం (ఆస్కతి) వలన ఇవన్నీ కలుగుతున్నాయి. వారి వారి మనసుకు నచ్చినవాటిని సుఖముగా భావించి వాటి గురించి బతకడం మొదలుపెడితే సంసారం పెరుగుతూ ఉంటుంది. కళ్ళు తెరిస్తే బాధ అని కళ్ళు మూసుకున్నాను.

ఇత్యేతదాత్మనః స్వార్థం సన్తం విస్మృత్య వై పుమాన్
విచిత్రామసతి ద్వైతే ఘోరామాప్నోతి సంసృతిమ్

అసలు ఆత్మ యొక్క స్వరూపాన్నీ స్వార్థాన్నీ మరచిపోయిన మానవుడు లేని భేధ బుద్ధిలో మనసు ఉంచి ఘోరమైన సంసారాన్ని పొందుతున్నాడు.

జలం తదుద్భవైశ్ఛన్నం హిత్వాజ్ఞో జలకామ్యయా
మృగతృష్ణాముపాధావేత్తథాన్యత్రార్థదృక్స్వతః

మనకు నీరు కావాలి. మనం నీటి దగ్గరే ఉన్నం. కానీ నీటి పైన నాచు పడి ఉంది. నీటితో పుట్టినవాటితోటే నీరు కప్పబడి ఉన్నది. అలాగే మనసులో పుట్టిన కోరికలే మన మనసును కప్పేస్తాయి. ఎలా ఐతే మనం జలాన్ని అక్కడ చూడక ఎండమావులను చూచి నీరు అనుకుంటే దొరకదు. పరమాత్మకంటే ఇతరమైన చోట మనకు కావలసిన ఆశలు తీరుతాయి అనడం కూడా అలాంటిదే.

దేహాదిభిర్దైవతన్త్రైరాత్మనః సుఖమీహతః
దుఃఖాత్యయం చానీశస్య క్రియా మోఘాః కృతాః కృతాః

నాకు సుఖం కావాలి అని కోరుకుంటాడు. కానీ తాను కోరుకున్న సుఖం తన శరీరముతో పొందాలి అనుకుంటాడు. శరీరం ఇంద్రియములూ మనసూ బుద్ధీ చిత్తముతో పొందాలి అనుకుంటాడు. కాని అవి అన్నీ దైవాధీనాలు. మనం చెప్పినట్లు వినవు. భగవంతుని ఆధీనములో దేహాదులతో మనసుకూ ఆత్మకూ సుఖం కోరేవాడు దుఃఖాన్ని తప్పించాలి అని కోరేవాడు చేసే పనులన్నీ వ్యర్థం అవుతున్నాయి.

ఆధ్యాత్మికాదిభిర్దుఃఖైరవిముక్తస్య కర్హిచిత్
మర్త్యస్య కృచ్ఛ్రోపనతైరర్థైః కామైః క్రియేత కిమ్

తాపత్రయములచే కొట్టబడే వానికి ఎంతో కష్టపడి సంపాదించిన అర్థ కామములతో మానవునికి తృప్తీ సుఖమూ కలుగుతాయా? తల్లి వలే పిల్లలు ఉన్నట్లు కష్టం నుంచి వచ్చిన పనులకు ఫలితం కష్టమే.

పశ్యామి ధనినాం క్లేశం లుబ్ధానామజితాత్మనామ్
భయాదలబ్ధనిద్రాణాం సర్వతోऽభివిశఙ్కినామ్

ధనవంతులూ ఏడుస్తున్నారు, దరిద్రులూ ఏడుస్తున్నారు, లోభులూ ఏడుస్తున్నారు. లేని వాని కన్నా డబ్బు ఉన్నవారికే ఎక్కువ బాధలు. ధనవంతులకు లోభులకూ డబ్బు పోతుంది అన్న భయముతో నిద్రేపట్టదు. దరిద్రుడే హాయిగా నిదురపోతాడు. ధనవంతుడు ప్రతీ చోటా ఆపదను శంకిస్తూనే ఉంటాడు.

రాజతశ్చౌరతః శత్రోః స్వజనాత్పశుపక్షితః
అర్థిభ్యః కాలతః స్వస్మాన్నిత్యం ప్రాణార్థవద్భయమ్

రాజుల నుంచి భయం (పన్ను), దొంగల వలన భయం, శత్రువుల నుంచి భయం, తన వారి నుంచి భయం, పశు పక్షాదుల వలన, యాచకుల వలన, కాలము వలన భయం, తనకే దుష్ట బుద్ధి పుట్టవచ్చు, ఈ భయం ప్రాణానికీ అర్థానికీ ఉంటుంది. ప్రాణమూ అర్థమూ ఉన్నవారికి ఉంటుంది.

శోకమోహభయక్రోధ రాగక్లైబ్యశ్రమాదయః
యన్మూలాః స్యుర్నృణాం జహ్యాత్స్పృహాం ప్రాణార్థయోర్బుధః

శోకమూ మోహమూ భయమూ క్రోధమూ రాగమూ విషాదమూ అలసటా, ఇవన్నీ ఆశ ఉండుట వలన కలుగుతాయి. ఆశ లేకుంటే ఇవేవీ ఉండవు. ఉన్నవి రెండే ఆశలు. ఒకటి  బాగా డబ్బు ఉండాలనీ, రెండు చాలా ఎక్కువ కాలం ఉండాలని. ప్రాణం మీదా డబ్బు మీదా ఆశ వలనే పైవన్నీ వస్తున్నాయి.

మధుకారమహాసర్పౌ లోకేऽస్మిన్నో గురూత్తమౌ
వైరాగ్యం పరితోషం చ ప్రాప్తా యచ్ఛిక్షయా వయమ్

నాకు ఇద్దరు మహా గురువులు. ఒక గురువు తేనెటీగ. ఇంకో గురువు కొండచిలువ. తేనెటీగతో వైరాగ్యాన్నీ, కొండ చిలువతో తృప్తినీ నేర్చుకున్నాను. కష్టపడి సంపాదించుకున్న తేనెని, ఎవరైనా కింద మంట పెడితే అది వదిలేసి వెళ్ళిపోతాయి. మనం కూడా తినకుండా తాగకుండా సమపాదించినవి మన పిల్లలూ స్వజనులూ అనుభవిస్తారు.

విరాగః సర్వకామేభ్యః శిక్షితో మే మధువ్రతాత్
కృచ్ఛ్రాప్తం మధువద్విత్తం హత్వాప్యన్యో హరేత్పతిమ్

కొండచిలువ తన దగ్గరకు వచ్చినదాన్నే తింటుంది. దొరికినప్పుడు దొరికినదానితో తృప్తి పొందడం నేర్చుకున్నాను. తేనెటీగ వలన అన్ని కోరికల నుండీ వైరాగ్యాన్ని నేర్చుకున్నాను. ఎంతో కష్టపడి సంపాదించిన తేనెను ఇతరులు పొందినట్లుగా, మనం సంపాదించిన ధనాన్ని మనను చంపి తీసుకుని పోతారు.

అనీహః పరితుష్టాత్మా యదృచ్ఛోపనతాదహమ్
నో చేచ్ఛయే బహ్వహాని మహాహిరివ సత్త్వవాన్

ఏ కోరికా లేకుండా సంతోషముతో భగవంతుని దయ వలన వచ్చిన దాన్ని తినడం నేర్చుకున్నాను కొండచిలువ వలన.

క్వచిదల్పం క్వచిద్భూరి భుఞ్జేऽన్నం స్వాద్వస్వాదు వా
క్వచిద్భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్

ఒక రోజు ఎక్కువ అన్నం దొరుకుంతుంది, ఒక రోజు రుచి లేనిది దొరుకుతుంది. దొరికినప్పుడు దొరికినదానితో తృప్తి పడాలి.

శ్రద్ధయోపహృతం క్వాపి కదాచిన్మానవర్జితమ్
భుఞ్జే భుక్త్వాథ కస్మింశ్చిద్దివా నక్తం యదృచ్ఛయా

కొందరు మనని గౌరవించి పెడతారు. కొందరు అవమానించి పెడతారు. దొరికిన దాన్ని తింటాను. దొరికిన చోట పడుకుంటాను.

క్షౌమం దుకూలమజినం చీరం వల్కలమేవ వా
వసేऽన్యదపి సమ్ప్రాప్తం దిష్టభుక్తుష్టధీరహమ్

క్వచిచ్ఛయే ధరోపస్థే తృణపర్ణాశ్మభస్మసు
క్వచిత్ప్రాసాదపర్యఙ్కే కశిపౌ వా పరేచ్ఛయా

కొందరు బాగా ఆదరిస్తారు. కొందరు పడుకోవడానికి చోటు ఇస్తారు. కటిక నేలైనా పరుపైనా తెలిసేది నిద్ర పట్టేదాకానే. కొందరు ఒంటికి అత్తరూ పన్నీరు రాస్తారు,. కొందరు పట్టు వస్త్రాలు కట్టి పూల మాలలు వేసి అలంకరిస్తారు. కొందరు రథం మీద ఏనుగు మీదా గుర్రాల మీద ఒంటెల మీదా ఊరేగిస్తారు.

క్వచిత్స్నాతోऽనులిప్తాఙ్గః సువాసాః స్రగ్వ్యలఙ్కృతః
రథేభాశ్వైశ్చరే క్వాపి దిగ్వాసా గ్రహవద్విభో

నాహం నిన్దే న చ స్తౌమి స్వభావవిషమం జనమ్
ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని

నన్ను ఆదరించిన వాడిన్ పొగడను, అవమానించినవాడిని నిందించను. అదంతా వారి వారి స్వభావములను బట్టి వారు చేస్తున్నారు. వారందరికీ భగవానుడు మేలు కలిగించుగాక అని అడుగుతాను.

వికల్పం జుహుయాచ్చిత్తౌ తాం మనస్యర్థవిభ్రమే
మనో వైకారికే హుత్వా తం మాయాయాం జుహోత్యను

వికల్పాన్ని చిత్తములో చిత్తాన్ని, చిత్తాన్ని మనసులో, మనసును అహంకారములో, అహంకారాన్ని ప్రకృతిలో విడిచిపెట్టాలి. దీన్ని ఆత్మానుభూతిలో మాయను, మాయను పరమాత్మలో పెట్టి ఈ విధానాన్ని అవలంబిస్తే ఆశ పోతుంది. మనవి అనుకున్నవన్నీ పరమాత్మకు అర్పించాలి. శరీరాన్ని అవయవాలలో, అవయవాలను ఇంద్రియాలలో, ఇంద్రియాలను మనసులో, మనసును ప్రాణములో, ప్రాణమును చిత్తములో, చీతమును బుద్ధిలో బుద్ధిని అనతఃకరణములో అంతఃకరణాన్ని అహంకారములో అహంకారమును ప్రకృతిలో ప్రకృతిని జీవాత్మలో జీవాత్మని పరమాత్మలో ఉంచాలి.

ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్సత్యదృఙ్మునిః
తతో నిరీహో విరమేత్స్వానుభూత్యాత్మని స్థితః

తన అనుభూతితో పరమాత్మానుభూతితోటే ఉండాలి.

స్వాత్మవృత్తం మయేత్థం తే సుగుప్తమపి వర్ణితమ్
వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్హి భగవత్పరః

ఇది పరమ రహస్యమైనది. నీవడిగావు కాబట్టి, నీవు పరమాత్మ భక్తుడవి కాబట్టి, నీకు చెప్పడం వలన అది పెరుగుతుంది కానీ తరుగదు. ఇది లోక శాస్త్రములకంటే అవతల ఉన్నది. నీవు భగవంతునికి అధీనుడవు

శ్రీనారద ఉవాచ
ధర్మం పారమహంస్యం వై మునేః శ్రుత్వాసురేశ్వరః
పూజయిత్వా తతః ప్రీత ఆమన్త్ర్య ప్రయయౌ గృహమ్

ఈ రీతిలో సన్యాస ధర్మాన్ని ముని వలన విన్న అసురేశ్వరుడు ప్రహ్లాదుడు ఆయను పూజించి ఆయన అనుజ్ఞ్యను పొంది తన ఇంటికి వెళ్ళాడు.

Saturday, April 27, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
బ్రహ్మచారీ గురుకులే వసన్దాన్తో గురోర్హితమ్
ఆచరన్దాసవన్నీచో గురౌ సుదృఢసౌహృదః

బ్రహ్మచారి ఐన వాడు గురుకులములో ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. గురువుకు హితమును ఆచరిస్తూ గురువుగారికి దాసునిలా నైత్యానుసంధానము చేస్తూ గురువు యందు గట్టి ప్రీతి గలవాడు కావాలి

సాయం ప్రాతరుపాసీత గుర్వగ్న్యర్కసురోత్తమాన్
సన్ధ్యే ఉభే చ యతవాగ్జపన్బ్రహ్మ సమాహితః

ప్రాతః సాయంకాలం రెండుపూటలా గురువులనూ అగ్నిహోత్రున్ని సూర్యున్ని దేవతలనూ ఆరాధించాలి. వాక్కును నియమించుకుని రెండు సంధ్యలలో గాయత్రిని జపిస్తూ ఉండాలి. గురువుగారు పిలిస్తే వెళ్ళి కూర్చుని వినయముతో చదువుకోవాలి.

ఛన్దాంస్యధీయీత గురోరాహూతశ్చేత్సుయన్త్రితః
ఉపక్రమేऽవసానే చ చరణౌ శిరసా నమేత్

పాఠం ప్రారంభించినప్పుడూ పాఠం ముగిసిన తరువాత గురువుగారి పాదములను శిరస్సుతో స్పృశించి నమస్కరించాలి.

మేఖలాజినవాసాంసి జటాదణ్డకమణ్డలూన్
బిభృయాదుపవీతం చ దర్భపాణిర్యథోదితమ్

బ్రహ్మచారి మేఖలమూ జింక చర్మమూ వస్త్రమూ దండం కమడలం ధరించాలి. వీటితో బాటు యజ్ఞ్యోపవీతం కూడా ధరించాలి. చేతిలో నిరంతరం దర్భలు చెప్పిన రీతిలో ధరించాలి.

సాయం ప్రాతశ్చరేద్భైక్ష్యం గురవే తన్నివేదయేత్
భుఞ్జీత యద్యనుజ్ఞాతో నో చేదుపవసేత్క్వచిత్

ప్రాతః సాయంకాలం బిక్షాటన చేసి వచ్చిన దాన్ని గురువుగారికి అర్పించాలి. గురువుగారు పిలిచి తినమంటే భుజించాలి. లేకుంటే ఉపవసించాలి.

సుశీలో మితభుగ్దక్షః శ్రద్దధానో జితేన్ద్రియః
యావదర్థం వ్యవహరేత్స్త్రీషు స్త్రీనిర్జితేషు చ

చక్కని శీల స్వభావం ఉండాలి.మితముగా భుజించాలి. గురువుగారి కార్యము చేయడములో సమర్ధుడై ఉండాలి. చెప్పే పాఠములో శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఆడవారితో ఎక్కువ సన్నిహితముగా వ్యవహరించరాదు. ఎంత వరకూ వారితో పనే అంతవరకే ఉండాలి. స్త్రీలతో కన్నా స్త్రీలాచే ఓడించబడినవారితో (స్త్రీ దాసులతో) జాగ్రత్తగా ఉండాలి.

వర్జయేత్ప్రమదాగాథామగృహస్థో బృహద్వ్రతః
ఇన్ద్రియాణి ప్రమాథీని హరన్త్యపి యతేర్మనః

గృహస్థుడు కాని వాడు బ్రహ్మచర్య వ్రతములో ఉన్నప్పుడు ఆడవారి గాధలను పూర్తిగా విడిచిపెట్టాలి. ఇంద్రియములు ప్రమాదకారి, సన్యాసై మనసును కూడా చలింపచేస్తాయి. వాటికి అవకాశం ఇవ్వకు. ఆ గాధలను మాట్లాడకు.

కేశప్రసాధనోన్మర్ద స్నపనాభ్యఞ్జనాదికమ్
గురుస్త్రీభిర్యువతిభిః కారయేన్నాత్మనో యువా

యువకుడైన వాడు ఆడవారితో గానీ గురువుగారి పత్నితో గానీ పిల్లలతో గానీ జుట్టుకు నూనె రాయించుకొనుట, ఒంటికి నలుగు పెట్టుటా స్నానం అభ్యంగనం చేయించుకోరాదు.

నన్వగ్నిః ప్రమదా నామ ఘృతకుమ్భసమః పుమాన్
సుతామపి రహో జహ్యాదన్యదా యావదర్థకృత్

స్త్రీ అంటే అగ్ని, నిప్పులాంటిది. పురుషుడు నీటి కుండ వంటి వాడు. గురుపత్నే కాదు, కన్న కూతురైనా యువతి ఐతే వారితో రహస్యముగా ఏకాంతముగా ఒంటిగా ఉండరాదు. ఉండవలసి వస్తే (యావధర్ధం) ఎంత వరకూ అవసరమైతే అంత వరకూ.

కల్పయిత్వాత్మనా యావదాభాసమిదమీశ్వరః
ద్వైతం తావన్న విరమేత్తతో హ్యస్య విపర్యయః

పరమాత్మ, జగత్తూ, ప్రకృతి. సకల జగత్తూ పరమాత్మ స్వరూపమే. జగత్తునూ పరమాత్మనూ రెంటినీ చూడాలి; రెండవది లేకుండా పరమాత్మ ఒక్కటే ఉన్నాడు అన్న జ్ఞ్యానం పెంచుకోవాలంటే భావించబడే వాడు ఉండాలి. జ్ఞ్యానం కలిగే వరకూ ద్వైత బుద్ధి వదిలి పెట్టరాదు. అభేధ బుద్ధీ, తత్వ జ్ఞ్యానం కలిగే వరకూ ద్వైతాన్ని విడవకూడదు

ఏతత్సర్వం గృహస్థస్య సమామ్నాతం యతేరపి
గురువృత్తిర్వికల్పేన గృహస్థస్యర్తుగామినః

పైన చెప్పిన ఈ నాలుగూ, (స్త్రీలను, వారెవరైనా, ఏకాంతములో కలవరాదు, పని ఎంతవరకో అంత వరకే ఉండాలి) అన్ని వర్ణాల వారికీ, ఆశ్రమాల వారికి. గృహస్థ, వానప్రస్థ సన్యాసులకు కూడా వర్తిస్తాయి. ఒక్క గురు శుశ్రూష విషయములో తప్ప తక్కిన నియమాలన్నీ గృహస్థుకు కూడా ఉంటాయి. భార్య ఋతుమతి అయినప్పుడు సంతానం కోసం సంగమించుట తప్ప బ్రహ్మచర్య గార్హస్థాశ్రమాలకు తేడా ఉండవు.

అఞ్జనాభ్యఞ్జనోన్మర్ద స్త్ర్యవలేఖామిషం మధు
స్రగ్గన్ధలేపాలఙ్కారాంస్త్యజేయుర్యే బృహద్వ్రతాః

గృహస్థుడు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని వ్రతాలు స్వీకరిస్తారు. అప్పుడు కంటికి కాటుక పెట్టరాదు, తలకు స్నానం చేయరాదు, ఒంటికి నలుగు పెట్టకూడదు, ఆడువారిని చూడరాదు, ఆడవరాఇని రాయకూడదు (చిత్రించరాదు). మద్య మాంఅసములను విడవాలి, పూలదండలనూ గంధములు రాసుకొనుట విడవాలి. వ్రతం స్వీకరించిన వారు విడిచిపెట్టాలి

ఉషిత్వైవం గురుకులే ద్విజోऽధీత్యావబుధ్య చ
త్రయీం సాఙ్గోపనిషదం యావదర్థం యథాబలమ్

బ్రహ్మచారి ఐన వారు, ఇలా గురువుగారి ఇంటిలో కొంతకాలం నివసించి బ్రాహ్మణుడు చదువుకొని, తెలుసుకున్ని, వేదమును అంగములతో (శిక్షా వ్యాకరణం జ్యోతిషాది అంగాలను) అవసరమున్నంత అవకాశం ఉన్నంత చదువుకోవాలి.

దత్త్వా వరమనుజ్ఞాతో గురోః కామం యదీశ్వరః
గృహం వనం వా ప్రవిశేత్ప్రవ్రజేత్తత్ర వా వసేత్

శక్తికి తగ్గట్టుగా గురువుగారికి దక్షిణ ఇచ్చి, వారి అనుగ్రహం పొంది గురువు గారి అనుజ్ఞ్య పొంది ఇష్టముంటే గృహస్థాశ్రమానికీ, లేకుంటే వానప్రస్థానికీ, సన్యాసాశ్రమానికి వెళ్ళవచ్చు. లేకుంటే గురువుగారి దగ్గరే ఉండవచ్చు

అగ్నౌ గురావాత్మని చ సర్వభూతేష్వధోక్షజమ్
భూతైః స్వధామభిః పశ్యేదప్రవిష్టం ప్రవిష్టవత్

అగ్ని యందూ గురువు యందూ తనలోనూ సర్వభూతముల యందూ శ్రీమన్నారాయణున్ని చూడాలి. ఆయా భూతములలో పరమాత్మ ప్రవేశించి ఉన్నాడని తెలుసుకోవాలి. తాన్ ఎందులోనూ ప్రవేశించకుండా ప్రవేశించనట్లే ఉండాలి. అన్ని కోరికలూ కోరుతున్నట్లే ఉండాలి గానీ కోరకూడదు. పని చేస్తున్నప్పుడు అజ్ఞ్యానుల కన్నా ఎక్కువ వ్యామోహం ఉందేమో అన్నట్లు చేయాలి, కానీ ఫలితం మీద ఆసక్తి ఉండకుండా అంతటా పరమాత్మను చూడాలి

ఏవం విధో బ్రహ్మచారీ వానప్రస్థో యతిర్గృహీ
చరన్విదితవిజ్ఞానః పరం బ్రహ్మాధిగచ్ఛతి

బ్రహ్మచారి, వానప్రస్థుడు సన్యాసీ గృహస్థుడు, తెలియ వలసిన వాటిని గురించి బాగా తెలుసుకుని పరమాత్మని పొందుతారు

వానప్రస్థస్య వక్ష్యామి నియమాన్మునిసమ్మతాన్
యానాస్థాయ మునిర్గచ్ఛేదృషిలోకముహాఞ్జసా

ఇక వాన ప్రస్థాన్ని గురించి పొందుతాడు. ఈ ధర్మం ఆచరించిన వారు ఋషిలోకం పొందుతారు.

న కృష్టపచ్యమశ్నీయాదకృష్టం చాప్యకాలతః
అగ్నిపక్వమథామం వా అర్కపక్వముతాహరేత్

దున్ని చేసి వండిన దాన్ని తినకూడదు. సహజముగా ఉన్న ఆహారాన్నే తినాలి, అది కూడా ఏ సమయములో భోజనం చేయాలో ఆ సమయములోనే చేయాలి. సహజముగా అగ్నితో పండిన పండుగానీ, పండని కాయలు కాఈ, సూర్యభగవానుని చేత వండబడినదాన్ని తినాలి

వన్యైశ్చరుపురోడాశాన్నిర్వపేత్కాలచోదితాన్
లబ్ధే నవే నవేऽన్నాద్యే పురాణం చ పరిత్యజేత్

అడవిలో సహజముగా పండిన వాటినే హోమములో పురోడాశముగా అర్పించాలి. ఒక వేళ కొత్త ఆహారం దొరికితే కొత్త ఆహారం తిని పాత ఆహారం దాచుకోరాదు. కొత్త ఆహారం దొరికితే పాత ఆహారాన్ని వదలాలి.

అగ్న్యర్థమేవ శరణముటజం వాద్రికన్దరమ్
శ్రయేత హిమవాయ్వగ్ని వర్షార్కాతపషాట్స్వయమ్

అగ్ని చల్లారబడకుండా ఉండటానికి పర్ణశాల కట్టుకుని ఉండాలి. తాను మంచుకు గానీ గాలికి గానీ వర్షాలకు గానీ అగ్నికి కానీ సహించగలవాడిగా ఉండాలి. పర్వత గుహలో ఉన్నా ఆశ్రమం కట్టుకుని ఉన్నా దానిలో అగ్ని ఉండాలి.

కేశరోమనఖశ్మశ్రు మలాని జటిలో దధత్
కమణ్డల్వజినే దణ్డ వల్కలాగ్నిపరిచ్ఛదాన్

శరీరానికి ఏ వ్యాధి వస్తుందో అని భయపడరాదు. కేశములూ రోమములూ నఖములూ మీసములూ గడ్డములూ (ఇవన్నీ శరీరం యొక్క మలాలు) వీటిని ధరించాలి. ఇలా పెంచడము వలన శరీరం మీద మోజు తగ్గుతుంది. మండలం జింక చర్మం నారవస్త్రములూ అగ్నీ ఇవన్నీ ధరించి

చరేద్వనే ద్వాదశాబ్దానష్టౌ వా చతురో మునిః
ద్వావేకం వా యథా బుద్ధిర్న విపద్యేత కృచ్ఛ్రతః

పన్నెండు గానీ ఎనిమిది కానీ నాలుగేళ్ళుగానీ తిరిగి తరువాత సన్యాసాశ్రమం తీసుకోవలి. తనకు ఇబ్బంది కాకుండానే వానప్రస్థాన్ని తీసుకోవాలి. సన్యాసాశ్రం మీద కోరిక పుట్టేంతవరకూ వానప్రస్థం.

యదాకల్పః స్వక్రియాయాం వ్యాధిభిర్జరయాథవా
ఆన్వీక్షిక్యాం వా విద్యాయాం కుర్యాదనశనాదికమ్

శరీరం సహకరించకపోతే వానప్రస్థం స్వీకరించకూడదు. ఇంటిలోనే గృహస్థాశ్రమములో ఉండి ఉపవాసాలతో శరీరం కృశింపచేస్తూ కోరికలను జయించాలి

ఆత్మన్యగ్నీన్సమారోప్య సన్న్యస్యాహం మమాత్మతామ్
కారణేషు న్యసేత్సమ్యక్సఙ్ఘాతం తు యథార్హతః

అగ్నిని తనలో ఉంచుకొని, తనలో అగ్నిని ఆవాహన చేసుకుని అహంకార మమకారాలను వదిలి, కారణములను కార్యాలలో ఉంచాలి. అర్థాలను ఇంద్రియాలలో, ఇంద్రియాలను మనస్సులో, మనస్సును ప్రాణములో, ప్రాణమును వాక్కులో ఉంచాలి.

ఖే ఖాని వాయౌ నిశ్వాసాంస్తేజఃసూష్మాణమాత్మవాన్
అప్స్వసృక్శ్లేష్మపూయాని క్షితౌ శేషం యథోద్భవమ్

ఇంద్రియములను ఆకాశములో, ఆకాశాన్ని వాయువులో వాయువును తేజస్సులో తేజస్సును జలములో జలముని పృధ్విలో. శరీరాన్నీ, శరీరములో ఇంద్రియాలను విడిచిపెట్టాలి. నిట్టూర్పులను వాయువులో, శరీరములో ఉన్న తేజస్సును అగ్నిలో నెత్తురూ మలమూ శ్లేషమునూ జలములో ఉంచాలి, మిగిలిన దాన్ని భూమిలో ఉంచి, వాకును అగ్ని యందు ఉంచి, మాటను ఇంద్రుని యందు, పని చేయుటని ఇంద్రుని యందు ఉంచి, గత్యాదులని వ్యాకరణములో ఉంచి, ఉపస్థని ప్రజాపతులలో ఉంచి, పాయువును మృత్యువు యందు, ఏ ఏ ఇంద్రియములకు ఏ ఏవి అవయములో వాటియందు ఉంచి.

వాచమగ్నౌ సవక్తవ్యామిన్ద్రే శిల్పం కరావపి
పదాని గత్యా వయసి రత్యోపస్థం ప్రజాపతౌ

మృత్యౌ పాయుం విసర్గం చ యథాస్థానం వినిర్దిశేత్
దిక్షు శ్రోత్రం సనాదేన స్పర్శేనాధ్యాత్మని త్వచమ్

దిక్కుని శ్రోత్రములో, త్వక్కును ఆధ్యాత్మలో ఉంచి, రూపాన్ని చక్షువులో ఉంచి, చక్షువుతో బాటు రూపాన్ని అగ్నిలో ఉంచి, జిహ్వను జలములో, ఘ్రాణాన్ని భూమిలో, మనసును చంద్రునిలో,

రూపాణి చక్షుషా రాజన్జ్యోతిష్యభినివేశయేత్
అప్సు ప్రచేతసా జిహ్వాం ఘ్రేయైర్ఘ్రాణం క్షితౌ న్యసేత్

మనో మనోరథైశ్చన్ద్రే బుద్ధిం బోధ్యైః కవౌ పరే
కర్మాణ్యధ్యాత్మనా రుద్రే యదహం మమతాక్రియా
సత్త్వేన చిత్తం క్షేత్రజ్ఞే గుణైర్వైకారికం పరే

బుద్ధిని శుక్రునిలో ఆధ్యాత్మ కర్మలను రుద్రునిలో, (నేను నాది అన్న భావము వచ్చే అహంకారానికి శివుడు అధిష్ఠాన దేవత, అంతఃకరణాన్ని ఆయనలో ఉంచి) మనసుని సత్వగుణముతో జీవుని యందు ఉంచి, ఆ క్షేత్రజ్య్నున్ని (జీవున్ని) పరమాత్మలో న్యాసం చేయాలి

అప్సు క్షితిమపో జ్యోతిష్యదో వాయౌ నభస్యముమ్
కూటస్థే తచ్చ మహతి తదవ్యక్తేऽక్షరే చ తత్

ఇలా భూమిని నీటిలో, నీటిని అగ్నిలో, అగ్నిని వాయువులో, వాయువుని ఆకాశములో, ఆకాశముని మహత్ తత్వములో, మహత్తును ప్రకృతిలో, ప్రకృతి జీవునిలో, జీవున్ని పరమాత్మలో న్యాసం చేయాలి.

ఇత్యక్షరతయాత్మానం చిన్మాత్రమవశేషితమ్
జ్ఞాత్వాద్వయోऽథ విరమేద్దగ్ధయోనిరివానలః

ఇలా అక్షరరూపముగా చిన్మాత్రముగా జ్ఞ్యనరూపముగా భేధములేకుండా తెలుసుకుని తనను తాను విరమించుకోవాలి. కట్టెలన్నీ ఐపోయినప్పుడు అగ్ని తనకు తాను చల్లారినట్లుగా అవ్వాలి. ఇలా పరమాత్మను ఆరాధించాలి.

Thursday, April 25, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
శ్రుత్వేహితం సాధు సభాసభాజితం మహత్తమాగ్రణ్య ఉరుక్రమాత్మనః
యుధిష్ఠిరో దైత్యపతేర్ముదాన్వితః పప్రచ్ఛ భూయస్తనయం స్వయమ్భువః

రాజసూయములో అగ్ర పూజ పొందిన పరమాత్మ చరిత్రను నారదుని వలన విని సంతోషించి మళ్ళీ ఇలా అడిగాడు.

శ్రీయుధిష్ఠిర ఉవాచ
భగవన్శ్రోతుమిచ్ఛామి నృణాం ధర్మం సనాతనమ్
వర్ణాశ్రమాచారయుతం యత్పుమాన్విన్దతే పరమ్

సనాతన ధర్మాన్ని నేను వినాలనుకుంటున్నాను. దీని వలననే జీవుడు పరమ పదాన్ని పొందుతాడు.

భవాన్ప్రజాపతేః సాక్షాదాత్మజః పరమేష్ఠినః
సుతానాం సమ్మతో బ్రహ్మంస్తపోయోగసమాధిభిః

నీవు బ్రహ్మపుత్రుడవు. బ్రహ్మపుత్రులందరిలో బ్రహ్మగారికి నీవి ఇష్టుడవు. తపో యోగ సమాధులు నీవు బాగా ఆచరించి బ్రహ్మగారి ప్రీతిని పొందావు

నారాయణపరా విప్రా ధర్మం గుహ్యం పరం విదుః
కరుణాః సాధవః శాన్తాస్త్వద్విధా న తథాపరే

ఎవరు పరమాత్మ యందు నిశ్చలమైన భక్తి భావం కలిగి ఉంటారో వారే బ్రాహ్మణులు. అలాంటి వారే పరమ రహస్యమైన ధర్మాన్ని తెలుస్తారు. అలాంటి వారు దయ కలిగి ఉంటారు, సాధువులూ శాంత స్వభావులు, నీవంటి వారు.

శ్రీనారద ఉవాచ
నత్వా భగవతేऽజాయ లోకానాం ధర్మసేతవే
వక్ష్యే సనాతనం ధర్మం నారాయణముఖాచ్ఛ్రుతమ్

సకల లోకముల ధర్మానికి ఆధారమైన పరమాత్మకు నమస్కారం చేసి నారాయణనుని ముఖము నుండి విన్న సనాతనధర్మం గురించి చెబుతాను.

యోऽవతీర్యాత్మనోऽంశేన దాక్షాయణ్యాం తు ధర్మతః
లోకానాం స్వస్తయేऽధ్యాస్తే తపో బదరికాశ్రమే

ధర్మప్రజాపతికి దక్షుని పుత్రిక అయిన మూర్తికీ, నర నారాయణులుగా పుట్టి బదరికాశ్రమములో తపస్సు చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన నాకు అన్ని ధర్మాలూ వివరించారు

ధర్మమూలం హి భగవాన్సర్వవేదమయో హరిః
స్మృతం చ తద్విదాం రాజన్యేన చాత్మా ప్రసీదతి

పరమాత్మ అన్ని ధర్మాలకూ మూలం. ఆయనే సర్వ వేద మయుడు, సర్వ దేవ మయుడు. అలాంటి మహానుభావున్ని స్మరిస్తే మనసు ప్రసన్నమవుతుంది, ఆత్మ దుఃఖాన్ని పోగొట్టుకుంటుంది

సత్యం దయా తపః శౌచం తితిక్షేక్షా శమో దమః
అహింసా బ్రహ్మచర్యం చ త్యాగః స్వాధ్యాయ ఆర్జవమ్

సన్తోషః సమదృక్సేవా గ్రామ్యేహోపరమః శనైః
నృణాం విపర్యయేహేక్షా మౌనమాత్మవిమర్శనమ్

అన్నాద్యాదేః సంవిభాగో భూతేభ్యశ్చ యథార్హతః
తేష్వాత్మదేవతాబుద్ధిః సుతరాం నృషు పాణ్డవ

శ్రవణం కీర్తనం చాస్య స్మరణం మహతాం గతేః
సేవేజ్యావనతిర్దాస్యం సఖ్యమాత్మసమర్పణమ్

నృణామయం పరో ధర్మః సర్వేషాం సముదాహృతః
త్రింశల్లక్షణవాన్రాజన్సర్వాత్మా యేన తుష్యతి

ధర్మమంటే ఈ ముప్పై లక్షణాలు. అన్ని వర్ణాల వారికీ ఇదే ధర్మం. సత్యం దయ తప(శరీరం మనసు అదుపులో ఉంచుకోవడం) శౌచం తితీక్ష ఈక్ష(పరిశీలన) శమం దమం (ఇంద్రియ నిగ్రహం) అహింస (మాటతో పనితో మనసుతో హింసించకుండుట) బ్రహ్మచర్యం త్యాగం స్వాధ్యాయం(పెద్దలు చెప్పినది చేయుట) ఆర్జవం (కపటం లేకుండా ఉండుట) సంతోషం (దొరికిన దానితో సంతోషం) సుఖ ధుఃఖాలను సమముగా చూచుట, సేవ, గ్రామ్య(తుచ్చమైన) సుఖాలను మెల్లగా విడిచిపెట్టాలి, వాడు గొప్ప వీడు తక్కువ అన్న విపర్యయ జ్ఞ్యానం తొలగించుకోవాలి, మౌనం, ఆత్మ విమర్శనం, మన దగ్గర ఉన్న అన్నం జలం సంపద మన చుట్టూ ఉన్నవారికి అర్హతను బట్టి సమముగా పంచాలి, మనకంటే ఇతర భూతములను మనలాగ చూడాలి.
పరమాత్మ కథలను వినడం కీర్తించడం స్మరించడం, పెద్దల యొక్క ఆకారాన్ని స్మరించాలి, సేవించాలి పూజించాలి వినయం దాస్యం సఖ్యం ఆత్మ సమర్పణం. ఇది మానవులకు ఉత్తమ ధర్మం. వర్ణాశ్రమాలతో సంబంధం లేకుండా అందరూ ఆచరించ వలసిన ధర్మాలు ఇవి. వీటిచే భగవానుడు ప్రీతి చెందుతాడు

సంస్కారా యత్రావిచ్ఛిన్నాః స ద్విజోऽజో జగాద యమ్
ఇజ్యాధ్యయనదానాని విహితాని ద్విజన్మనామ్
జన్మకర్మావదాతానాం క్రియాశ్చాశ్రమచోదితాః

బ్రాహ్మణుడు: గర్భాదానం నుంచీ శరీర దహనం వరకూ ఏ సంస్కారం ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగితే వాడు బ్రాహ్మణుడు అని బ్రహ్మ చెప్పాడు. యజ్ఞ్యం వేదాధ్యయనం దానం బ్రాహ్మణ ధర్మాలు. జన్మతో పరిశుద్ధి కావాలి. కర్మతో పరిశుద్ధి కావాలి (పరిశుద్ధ కర్మలు చేస్తూ ఉండాలి). ఈ రెండూ జరిగితే ఆశ్రమశుద్ధి.

విప్రస్యాధ్యయనాదీని షడన్యస్యాప్రతిగ్రహః
రాజ్ఞో వృత్తిః ప్రజాగోప్తురవిప్రాద్వా కరాదిభిః

అధ్యయన అధ్యాపన యజన యాజన(యజ్ఞ్యం చేయాలీ చేయించాలి) దానం చేయడం దానం స్వీకరించడం. ఇవి బ్రాహ్మణులు చేయవలసినవి. తక్కిన వారికి చివరది లేదు (దానం స్వీకరించడం) . క్షత్రియులు అబ్రాహ్మణుల నుంచి పన్ను తీసుకుని ప్రజలను పాలించాలి

వైశ్యస్తు వార్తావృత్తిః స్యాన్నిత్యం బ్రహ్మకులానుగః
శూద్రస్య ద్విజశుశ్రూషా వృత్తిశ్చ స్వామినో భవేత్

వైశ్యులు కూడా బ్రాహ్మణ ధర్మాలను అనుసరిస్తూ అనుచరిస్తూ వ్యాపారం చేయలి. శూద్రులు బ్రాహ్మణ సేవ, క్షత్రియ సేవా చేయాలి

వార్తా విచిత్రా శాలీన యాయావరశిలోఞ్ఛనమ్
విప్రవృత్తిశ్చతుర్ధేయం శ్రేయసీ చోత్తరోత్తరా

బ్రాహ్మణుడు ఈ నాలుగు తీరులా బ్రతకచ్చు. 1. శాలీన (ధాన్యమును సంపాదించుట) 2. యాయావర 3. శిల (పొలములో పడిన ధాన్యములను ఏరుకొనుట) 4. ఊంచనం (ధాన్యము రైతులు తీసుకుని పోగా, కింద పగుళ్ళలో కొట్టినప్పుడు పడిన గింజలు ఏరుకొని అందులో ఎన్ని ఉంటే అన్ని తీస్కుని వండుకొనుట. ఆహారం మీద అస్సలు అభిరుచి లేకపోవడం), ఈ నాలుగూ బ్రాహ్మణ వృత్తులు. ఇందులో ఉత్తరోత్తరం ఉత్తమం. ఊంచనం అన్నిటికన్నా ఉత్తమం.

జఘన్యో నోత్తమాం వృత్తిమనాపది భజేన్నరః
ఋతే రాజన్యమాపత్సు సర్వేషామపి సర్వశః

తరువాతి వాడు మొదటి వాడి వృత్తిని అనాపదలో (ఆపద లేని సమయాలలో) చేయకూడదు. వేరే మార్గం లేనప్పుడు క్షత్రియుడు భిక్షాటనం చేయచ్చు, బ్రాహ్మణులు వ్యవసాయం చేయవచ్చు. బతకలేమనుకుంటే తక్కువారు పెద్దవారి వృత్తిని ఆచరించవచ్చు. రాజు తప్ప తక్కిన వారు ఆపదలలో అన్ని పనులూ చేయవచ్చు.

ఋతామృతాభ్యాం జీవేత మృతేన ప్రమృతేన వా
సత్యానృతాభ్యామపి వా న శ్వవృత్త్యా కదాచన
ఋతముఞ్ఛశిలం ప్రోక్తమమృతం యదయాచితమ్
మృతం తు నిత్యయాచ్ఞా స్యాత్ప్రమృతం కర్షణం స్మృతమ్

ఋతం అంటే ఊంచ వృత్తి, యాచించకుండా లభించేదాన్ని (సతోషముగా తమకు తాముగా ఇచ్చిన దాన్ని) అణృతం. ప్రతీ రోజు బిక్షము చేయడం మృతం. వ్యవసాయం చేయడం ప్రమృతం. వ్యాపారానికి సత్యానృతం అని పేరు. నీచులను సేవించడం కుక్క పని.

సత్యానృతం చ వాణిజ్యం శ్వవృత్తిర్నీచసేవనమ్
వర్జయేత్తాం సదా విప్రో రాజన్యశ్చ జుగుప్సితామ్
సర్వవేదమయో విప్రః సర్వదేవమయో నృపః

రాజూ బ్రాహ్మణుడు నీచ వృత్తిని చేయరాదు. సకల వేద మయుడు బ్రాహ్మణుడైతే సకల దేవ స్వరూపుడు రాజు. అందుకు వీరు నీచులను సేవించరాదు.

శమో దమస్తపః శౌచం సన్తోషః క్షాన్తిరార్జవమ్
జ్ఞానం దయాచ్యుతాత్మత్వం సత్యం చ బ్రహ్మలక్షణమ్

శమ దమః తపః శౌచం సతోషం శాంతి ఆర్జవం జ్ఞ్యానం దయ నారాయణుని యందు మనసు నిలుపుట సత్యం బ్రాహ్మణ లక్షణం

శౌర్యం వీర్యం ధృతిస్తేజస్త్యాగశ్చాత్మజయః క్షమా
బ్రహ్మణ్యతా ప్రసాదశ్చ సత్యం చ క్షత్రలక్షణమ్

ప్రసాదం అంటే అనుగ్రహం. ఈ తొమ్మిదీ క్షత్రియునికి ఉండాలి

దేవగుర్వచ్యుతే భక్తిస్త్రివర్గపరిపోషణమ్
ఆస్తిక్యముద్యమో నిత్యం నైపుణ్యం వైశ్యలక్షణమ్

ఈ ఆరూ వైశ్యుల లక్షణం. దేవతల యందూ గురువుల యందూ పరమాత్మ యందూ భక్తి ఉండాలి, బ్రాహ్మణ క్షత్రియ శూద్రుల యందు పోషణ, ధర్మార్థ కామాలను పోషించుట ఉండాలి, భగవంతుని యందూ వేదములయందూ విశ్వాసం. ప్రతీ దినం ప్రయత్న శీలత, నైపుణ్యం ఉండాలి వైశ్యులకు.

శూద్రస్య సన్నతిః శౌచం సేవా స్వామిన్యమాయయా
అమన్త్రయజ్ఞో హ్యస్తేయం సత్యం గోవిప్రరక్షణమ్

శూద్రులు వినయముగా పరిశుద్ధముగా ఉండాలి. యజమాని విషయములో కపటములేకుండా హృదయ పూర్వకముగా సేవించాలి. మంత్రములు లేకుండా మానసికమైన యజ్ఞ్యం చేయాలి. దొంగతనం చేయరాదు. సత్యం మాట్లాడాలి, గోవిప్ర రక్షణం చేయాలి.

స్త్రీణాం చ పతిదేవానాం తచ్ఛుశ్రూషానుకూలతా
తద్బన్ధుష్వనువృత్తిశ్చ నిత్యం తద్వ్రతధారణమ్

భర్తను దైవముగా భావించుట, భర్తను సేవించడములో ఆనుకూల్యత ప్రదర్శించాలి, నిత్యం భర్త యొక్క బందువుల యందు ప్రేమగా ఉండాలి, భర్త చేసిన పూజ భార్య చేయాలి. భర్త ఎవరిని ఆరాధిస్తారో వారిని ఆరాధించాలి.

సమ్మార్జనోపలేపాభ్యాం గృహమణ్డనవర్తనైః
స్వయం చ మణ్డితా నిత్యం పరిమృష్టపరిచ్ఛదా

రోజూ ఇల్లు ఊడవాలి, అలకాలి, ఇంటిలో ముగ్గులు వేయాలి, ఇంటిని అలంకరించాలి, తనను తాను అలంకరించుకోవాలి నిత్యం, పరిశుద్ధమైన వస్త్రాలు కట్టుకోవాలి

కామైరుచ్చావచైః సాధ్వీ ప్రశ్రయేణ దమేన చ
వాక్యైః సత్యైః ప్రియైః ప్రేమ్ణా కాలే కాలే భజేత్పతిమ్

చిన్న చిన్న కోరికలు కోరరాదు. క్షుద్రమైన కోరికలు కోరరాదు. భక్తితో వినయముతో కోరాలి. భర్త నొచ్చుకోకుండా మాట్లాడాలి. నిజమైన మాట మాట్లాడాలి, ప్రియమైన సత్యాన్ని మాట్లాడాలి. చెప్పే సత్యమే ప్రియముగా చెప్పాలి. ఇంద్రియ నిగ్రహముతో మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, కాలనికనుగుణముగా మాట్లాడాలి.

సన్తుష్టాలోలుపా దక్షా ధర్మజ్ఞా ప్రియసత్యవాక్
అప్రమత్తా శుచిః స్నిగ్ధా పతిం త్వపతితం భజేత్

నిత్యమూ సంతోషిస్తూ ఉండాలి. అలా అని ఏ కోరికలూ లేకుండా ఉండరాదు. తనకూ భరతకూ మేలు కలిగించే కోరిక కలిగి ఉండాలి. భర్త మనసూ బంధువుల మనసూ నొప్పించకుండా ఉండాలి. ధర్మం తెలిసినదై ఉండాలి. నిజము మాట్లాడాలి, ప్రియముగా (మనసు నొప్పించకుండా) మాట్లాడాలి. ఏమరపాటుగా ఉండాలి.  పరిశుద్ధురాలుగా ఉండాలి. ఎప్పుడూ స్నేహముగా ఉండాలి.
పతితుడు కాని భర్తనే సేవించాలి. భర్త పతితుడు కాకుంటేనే భర్తను సేవించాలి. లేకుంటే అటువంటి భర్తను వదిలిపెట్టుట దోషం కాదు. మనసు నొవ్వకుండా దారికి తెచ్చేందుకు ప్రయత్నించాలి. లేకుంటే వదిలినా తప్పుకాదు.

యా పతిం హరిభావేన భజేత్శ్రీరివ తత్పరా
హర్యాత్మనా హరేర్లోకే పత్యా శ్రీరివ మోదతే

భర్తను శ్రీమన్నారాయణుడన్న భావనతో సేవిస్తే, భర్త దుర్మార్గుడైనా సరే, ఆ భార్య చేసిన సేవ వలన భర్త కూడా తరిస్తాడు.

వృత్తిః సఙ్కరజాతీనాం తత్తత్కులకృతా భవేత్
అచౌరాణామపాపానామన్త్యజాన్తేవసాయినామ్

సంకర కులానికి ఏ కులముతో సంకరము వచ్చిందో ఆ కులానికి సంబంధించిన ధర్మం ఆచరించాలి. దొంగతనం చేయకుండా పాపం చేయకుండా ఉన్నవారు, అంత్య జాతితో ఉన్నవారు, అంత్య జాతిని సేవించేవారు, అలాంటి వారికి కూడా యుగయుగాలలో వారి వారి స్వభావానికి అనుగుణముగా ధర్మ బోధించబడినది.

ప్రాయః స్వభావవిహితో నృణాం ధర్మో యుగే యుగే
వేదదృగ్భిః స్మృతో రాజన్ప్రేత్య చేహ చ శర్మకృత్

వేదమును సాక్షాత్కరించుకున్న వారు ఇహపరలోకములో సుఖం శాంతి సంపాదించడానికి ఏర్పరచారు. ధర్మాచరణ ఏ ఒక్క జాతికో ఏర్పరచినది కాదు. వేదమును సాక్షాత్కరించుకున్నవారి మాట ఇది. ఇహ పర లోకములో సుఖాన్ని కలిగించేది.

వృత్త్యా స్వభావకృతయా వర్తమానః స్వకర్మకృత్
హిత్వా స్వభావజం కర్మ శనైర్నిర్గుణతామియాత్

ప్రతీ వారు తన స్వభావానికి అనుగుణముగా విధించబడిన కర్మలు ఆచరిస్తూ ఉంటే దాని వలన శరీర మనో ఇంద్రియ బుద్ధులు శుద్ధి అవుతాయి. ఇవన్నీ శుద్ధి పొందినతరువాత త్రైగుణ్యాన్ని వదిలి నైర్గుణ్యాన్ని సాధించాలి. ఒకసారి శరీరం పొందిన తరువాత మళ్ళీ శరీరం పొందకుండా ఉండుటకు కావలసిన ధర్మాన్ని ఆచరించాలి. ధర్మాచరణ నిర్గుణులవ్వడానికి తోత్పడాలి. తమ కర్మలు తాను చేస్తూ స్వభావజములైన కర్మలు వదిలిపెట్టి మెల్లగా నైర్గుణ్యాన్ని పొందాలి.

ఉప్యమానం ముహుః క్షేత్రం స్వయం నిర్వీర్యతామియాత్
న కల్పతే పునః సూత్యై ఉప్తం బీజం చ నశ్యతి

నైర్గుణ్యం కలగడానికే గుణాలూ, కోరికలు కలగకుండా ఉండడానికే కోరికలూ ఉండాలి. ఉదాహరణకు ఒక భూమిలో పది సార్లూ ఒకే పంట వేస్తే పది సార్లూ ఒకే విధమైన పంట వస్తుందా? వేస్తూ, పండిస్తున్న కొద్దీ భూమి నిస్సారమవుతుంది. వేసిన బీజం కూడా నశిస్తుంది. అలా మారడానికి కావలసిన మానసిక స్వచ్చత సజ్జన సాంగత్యముతో సంపాదించుకోవాలి.

ఏవం కామాశయం చిత్తం కామానామతిసేవయా
విరజ్యేత యథా రాజన్నగ్నివత్కామబిన్దుభిః

ఇలా హితం సత్యం ప్రియమైన కోరికలతో కోరికలను జయించాలి. ధర్మార్థ కామములలో నైర్గుణ్యముతో ధర్మాన్ని సేవించాలన్న బుద్ధితో ధర్మానికి అడ్డురాని కామాన్ని అనుభవిస్తే కొంత కాలానికి నైర్గుణ్యం ఏర్పడుతుంది. విరక్తి పుడుతుంది. అగ్నిలో నెయ్యి వేస్తే మంట పైకి లేస్తుంది. ఒక స్థాయిలో ఉన్నంతవరకే నెయ్యి వేస్తే మంట పెరుగుతుంది. ఆ తరువాత పెరగదు.

యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యఞ్జకమ్
యదన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్

ఏ ఏ ధర్మాలు ఎవరెవరివిగా చెప్పామో ఆ ధర్మాలు ఎవరు ఆచరించినా వారు ఆ ధర్మానికి చెందిన వారవుతారు. బ్రాహ్మణ ధర్మాలు శూద్రునిలో కనపడితే వాడు బ్రాహ్మణుడే అవుతాడు. వారి దగ్గర ఏ లక్షణం ఉందో ఆ లక్షణం ఏ వర్ణముదో వాడు ఆ వర్ణానికి చెందినవాడవుతాడు. తనలో ఉన్న లక్షణాన్ని బట్టి వర్ణం. వర్ణాన్ని బట్టి లక్షణం కాదు. ఆ వర్ణమును ఆ లక్షణముతోటే చెప్పాలి గానీ, పుట్టుకను బట్టి కాదు.

Tuesday, April 23, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం పదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
భక్తియోగస్య తత్సర్వమన్తరాయతయార్భకః
మన్యమానో హృషీకేశం స్మయమాన ఉవాచ హ

శ్రీప్రహ్రాద ఉవాచ
మా మాం ప్రలోభయోత్పత్త్యా సక్తంకామేషు తైర్వరైః
తత్సఙ్గభీతో నిర్విణ్ణో ముముక్షుస్త్వాముపాశ్రితః

నాలోపల ఇలాంటి లోభాన్ని కలిగించకు. కోరికల యందు నా మనసు ఉండేట్లు చేయకు.కేవలం నీ శరీరం నుండి విడువడి నిన్ను చేరాలనే కోరిక తప్ప వేరే కోరిక లేదు. నాకు అక్కరలేదు.

భృత్యలక్షణజిజ్ఞాసుర్భక్తం కామేష్వచోదయత్
భవాన్సంసారబీజేషు హృదయగ్రన్థిషు ప్రభో

నేను నీ నిజమైన భృత్యున్నో కానో కనుక్కునేందుకు కోరుకోమంటున్నావు. నిజమైన భృత్యుడైతే ఒకటిస్తే సేవచేస్తా అనడు. ఒక ఫలమును ఆశించి సేవ చేయడు. ఫల సంబంధముతో కాదు మన సంబంధం. నీవారమైన మేము నీకే చెంది నీకొరకే పని చేయవలసిన మేము ఒక కోరిక కోరి నీకు పని చేయడం భృత్యుని లక్షణం కాదు.

నాన్యథా తేऽఖిలగురో ఘటేత కరుణాత్మనః
యస్త ఆశిష ఆశాస్తే న స భృత్యః స వై వణిక్

సహజ సంబంధం ఉన్న చోట ప్రతిఫలాపేక్ష ఉండదు. నీవు నీకిష్టం వచ్చినట్లు మమ్ము ఉపయోగించుకో. నీకు ఉపయోగపడకపోతే మేము బాధపడాలి.ఎవరైతే ఏమి కావాలో కోరి పని చేస్తాడు వాడు నిజమైన భక్తుడు కాడు.

ఆశాసానో న వై భృత్యః స్వామిన్యాశిష ఆత్మనః
న స్వామీ భృత్యతః స్వామ్యమిచ్ఛన్యో రాతి చాశిషః

మనది రాజూ సేవకుడి వంటి సంబంధం కాదు.

అహం త్వకామస్త్వద్భక్తస్త్వం చ స్వామ్యనపాశ్రయః
నాన్యథేహావయోరర్థో రాజసేవకయోరివ

యది దాస్యసి మే కామాన్వరాంస్త్వం వరదర్షభ
కామానాం హృద్యసంరోహం భవతస్తు వృణే వరమ్

లేదూ, వరం ఇస్తానూ అంటావా, నా లోపల ఇక కోరికా పుట్టకుండా ఉండే వరాన్నివ్వు. పుట్టుక అనేది రాగానే కోరిక దానితోటే వస్తుంది.

ఇన్ద్రియాణి మనః ప్రాణ ఆత్మా ధర్మో ధృతిర్మతిః
హ్రీః శ్రీస్తేజః స్మృతిః సత్యం యస్య నశ్యన్తి జన్మనా

దానితో ఇవన్నీ నశించి పోతాయి. ఏనాడైతే కోరికలు పోతాయో ఆనాడు భగవంతునితో సమానుడవుతాడు

విముఞ్చతి యదా కామాన్మానవో మనసి స్థితాన్
తర్హ్యేవ పుణ్డరీకాక్ష భగవత్త్వాయ కల్పతే

ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే
హరయేऽద్భుతసింహాయ బ్రహ్మణే పరమాత్మనే

శ్రీభగవానువాచ
నైకాన్తినో మే మయి జాత్విహాశిష ఆశాసతేऽముత్ర చ యే భవద్విధాః
తథాపి మన్వన్తరమేతదత్ర దైత్యేశ్వరాణామనుభుఙ్క్ష్వ భోగాన్

నీవంటి వారు నాయందే మనసు లగ్నం చేసిన వారు ఎక్కడా ఎప్పుడూ ఏమీ కోరరు. నీవు దైత్యులకు రాజువై కొంతకాలం పాతాళలోకం పాలించు.

కథా మదీయా జుషమాణః ప్రియాస్త్వమావేశ్య మామాత్మని సన్తమేకమ్
సర్వేషు భూతేష్వధియజ్ఞమీశం యజస్వ యోగేన చ కర్మ హిన్వన్

నా కథలు వింటూ అందరికీ చెబుతూ యజ్ఞ్య రూపున్నైన నన్ను యజ్ఞ్యముతో ఆరాధించు యోగముతో లోపల నన్ను దర్శిస్తూ ఉండు. పుణ్య కర్మను భోగాలతో పాప కర్మను కుశలముగా (నైపుణ్యముతో) తొలగించుకో. కష్టములకూ సుఖములకూ సముడవై ఉండుట నైపుణ్యం. అలా ఉండుట నేర్పు గలవారికే సాధ్యం. నీవు అలాగే ఉండు

భోగేన పుణ్యం కుశలేన పాపం కలేవరం కాలజవేన హిత్వా
కీర్తిం విశుద్ధాం సురలోకగీతాం వితాయ మామేష్యసి ముక్తబన్ధః

య ఏతత్కీర్తయేన్మహ్యం త్వయా గీతమిదం నరః
త్వాం చ మాం చ స్మరన్కాలే కర్మబన్ధాత్ప్రముచ్యతే

నీవు చేసిన స్తోత్రాన్ని ఎవరైనా రోజూ చేసి, నిన్నూ నన్నూ భావిస్తూ ధ్యానిస్తూ ఈ స్తోత్రం చదివితే వాడికి కర్మ బంధములు అంటవు. ఇంకా ఏదైనా వరం కోరుకో

శ్రీప్రహ్రాద ఉవాచ
వరం వరయ ఏతత్తే వరదేశాన్మహేశ్వర
యదనిన్దత్పితా మే త్వామవిద్వాంస్తేజ ఐశ్వరమ్

మా తండ్రి నీ గొప్ప తనం తెలియక నిన్ను దూషించాడు. నీ భక్తుడనైన నన్ను దూషించాడు. అలా చాలా పాపం మూట గట్టుకున్నాడు

విద్ధామర్షాశయః సాక్షాత్సర్వలోకగురుం ప్రభుమ్
భ్రాతృహేతి మృషాదృష్టిస్త్వద్భక్తే మయి చాఘవాన్

తస్మాత్పితా మే పూయేత దురన్తాద్దుస్తరాదఘాత్
పూతస్తేऽపాఙ్గసందృష్టస్తదా కృపణవత్సల

శ్రీభగవానువాచ
త్రిఃసప్తభిః పితా పూతః పితృభిః సహ తేऽనఘ
యత్సాధోऽస్య కులే జాతో భవాన్వై కులపావనః

నీవంటి మహా భక్తుడు పుట్టుట వలన ముందు పదీ ఇవతల పది తరాలు తరించాయి.

యత్ర యత్ర చ మద్భక్తాః ప్రశాన్తాః సమదర్శినః
సాధవః సముదాచారాస్తే పూయన్తేऽపి కీకటాః

నీ తండ్రిని గురించి నీకు విచారం అవసరం లేదు. నా చేతుల్లో అతను చనిపోయాడు కాన నీవు ఆయన విషయమై నీవు బాధపడవలదు.

సర్వాత్మనా న హింసన్తి భూతగ్రామేషు కిఞ్చన
ఉచ్చావచేషు దైత్యేన్ద్ర మద్భావవిగతస్పృహాః

భవన్తి పురుషా లోకే మద్భక్తాస్త్వామనువ్రతాః
భవాన్మే ఖలు భక్తానాం సర్వేషాం ప్రతిరూపధృక్

కురు త్వం ప్రేతకృత్యాని పితుః పూతస్య సర్వశః
మదఙ్గస్పర్శనేనాఙ్గ లోకాన్యాస్యతి సుప్రజాః

పిత్ర్యం చ స్థానమాతిష్ఠ యథోక్తం బ్రహ్మవాదిభిః
మయ్యావేశ్య మనస్తాత కురు కర్మాణి మత్పరః

శ్రీనారద ఉవాచ
ప్రహ్రాదోऽపి తథా చక్రే పితుర్యత్సామ్పరాయికమ్
యథాహ భగవాన్రాజన్నభిషిక్తో ద్విజాతిభిః

ప్రహ్లాదుడు కూడా తండ్రి యొక్క అంత్య క్రియలను పూర్తి చేసి

ప్రసాదసుముఖం దృష్ట్వా బ్రహ్మా నరహరిం హరిమ్
స్తుత్వా వాగ్భిః పవిత్రాభిః ప్రాహ దేవాదిభిర్వృతః

ప్రహ్లాదుడు సమీపించి స్తోత్రం చేసిన తరువాత పరమాత్మ ప్రశాంతుడయ్యాడని తెలుసుకుని బ్రహ్మగారు దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు

శ్రీబ్రహ్మోవాచ
దేవదేవాఖిలాధ్యక్ష భూతభావన పూర్వజ
దిష్ట్యా తే నిహతః పాపో లోకసన్తాపనోऽసురః

అఖిల జగత్తుకూ ముందు ఉన్న వాడా, అన్ని జగత్తులకూ అధ్యక్షుడా. సకల లోకాలనీ బాధించే రాక్షసుడు నీ చేత వధించబడ్డాడు

యోऽసౌ లబ్ధవరో మత్తో న వధ్యో మమ సృష్టిభిః
తపోయోగబలోన్నద్ధః సమస్తనిగమానహన్

నా సృష్టితో మరణించను అని వరం పొందాడు ఈ రాక్షసుడు. తపస్సుతో యోగ బలముతో నా వరముతో ధార్మిక కట్టు బాట్లను అతిక్రమించాడు. అదృష్టం బాగుండి ఇతని కొడుకు పరమ బాగవతుడయ్యాడు

దిష్ట్యా తత్తనయః సాధుర్మహాభాగవతోऽర్భకః
త్వయా విమోచితో మృత్యోర్దిష్ట్యా త్వాం సమితోऽధునా

నీ నుండి ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. ఇపుడు నిన్ను చేరుకున్నాడు.

ఏతద్వపుస్తే భగవన్ధ్యాయతః పరమాత్మనః
సర్వతో గోప్తృ సన్త్రాసాన్మృత్యోరపి జిఘాంసతః

నీ ఈకారాన్ని ధ్యానిస్తే తలిస్తే ఎంతటి క్లిష్టమైన, పరిష్కారం దొరకని ఆపద వస్తే, నీవు వచ్చి కాపాడతావు. ప్రయతాత్మనః - ఆయన యందే మనసు లగ్నం చేసి ధ్యానం చేస్తే అన్ని రకముల భయముల నుండి కాపాడతాడు. చంపడానికి మృత్యువు వచ్చినా స్వామిని ఈ ఆకారముతో ధ్యానం చేస్తే ఆ మృత్యువు పారిపోతుంది. స్వామి మృత్యువుకే మృత్యువు.

శ్రీభగవానువాచ
మైవం విభోऽసురాణాం తే ప్రదేయః పద్మసమ్భవ
వరః క్రూరనిసర్గాణామహీనామమృతం యథా

రాక్షసులకు ఇక ముందు ఇలాంటి వరములు ఇవ్వకు. కౄర స్వభావం కలవారికి వరమివ్వడమంటే పాములకు అమృతం పోయడమే.

శ్రీనారద ఉవాచ
ఇత్యుక్త్వా భగవాన్రాజంస్తతశ్చాన్తర్దధే హరిః
అదృశ్యః సర్వభూతానాం పూజితః పరమేష్ఠినా

ఇలా చెప్పి బ్రహ్మ చేత స్తుతించబడి ఏ ప్రాణికీ కనపడక అంతర్ధానమయ్యాడు.

తతః సమ్పూజ్య శిరసా వవన్దే పరమేష్ఠినమ్
భవం ప్రజాపతీన్దేవాన్ప్రహ్రాదో భగవత్కలాః

స్వామి అంతర్ధానమవ్వడముతో ప్రహ్లాదుడు మొదలు పరమాత్మ అంశలైన బ్రహ్మకూ శంకరునికీ ప్రజాపతులకీ ఇతర దేవతలకూ నమస్కరించి పూజించాడు.

తతః కావ్యాదిభిః సార్ధం మునిభిః కమలాసనః
దైత్యానాం దానవానాం చ ప్రహ్రాదమకరోత్పతిమ్

అప్పుడు బ్రహ్మ శుక్రాచార్యులు మొదలైన వారితో మునులతో కలిసి దైత్య దానవులకు ప్రహ్లాదున్ని అధిపతిని చేసాడు.

ప్రతినన్ద్య తతో దేవాః ప్రయుజ్య పరమాశిషః
స్వధామాని యయూ రాజన్బ్రహ్మాద్యాః ప్రతిపూజితాః

దేవతలు ప్రహ్లాదున్ని అభినందించి ఉత్తమ ఆశీర్వాదాలు ఇచ్చి ప్రహ్లాదునితో పూజలందుకుని తమ తమ లోకాలకి వెళ్ళారు

ఏవం చ పార్షదౌ విష్ణోః పుత్రత్వం ప్రాపితౌ దితేః
హృది స్థితేన హరిణా వైరభావేన తౌ హతౌ

హిరణ్యకశ్యప హిరణ్యాక్షులు పరమాత్మ ద్వారపాలకులే. వారు పరమాతమ్ను హృదయములో ఉంచుకున్నారు. హృదయములో స్వామిని ఉంచుకుని పైకి వైరాన్ని చూపారు.

పునశ్చ విప్రశాపేన రాక్షసౌ తౌ బభూవతుః
కుమ్భకర్ణదశగ్రీవౌ హతౌ తౌ రామవిక్రమైః

వీరిద్దరే రావణ కుంభకర్ణులుగా పుట్టగా రామచంద్రుడు వారిని వధించాడు

శయానౌ యుధి నిర్భిన్న హృదయౌ రామశాయకైః
తచ్చిత్తౌ జహతుర్దేహం యథా ప్రాక్తనజన్మని

రాముని బాణముతో కొట్టబడి యుద్ధరంగములో శరీరాన్ని వదిలిపెట్టినవారు ఆయనను తలచుకుంటూ వెళ్ళారు

తావిహాథ పునర్జాతౌ శిశుపాలకరూషజౌ
హరౌ వైరానుబన్ధేన పశ్యతస్తే సమీయతుః

వారే ఈ జన్మలో శిశుపాల దంతవక్తృలు. పరమాత్మ యందు వైరాన్ని పెంచుకుని ఆయనలోనే చేరారు.

ఏనః పూర్వకృతం యత్తద్రాజానః కృష్ణవైరిణః
జహుస్తేऽన్తే తదాత్మానః కీటః పేశస్కృతో యథా

వీరే కాదు ఎంత మంది రాజులు కృష్ణ పరమాత్మ యందు వైరముతో ప్రవర్తించి అతని చేతిలో మరణించారో వారందరూ ఆయననే చేరారు. పరమాత్మను ఎలా సేవించినా వచ్చేది మోక్షమే. తుమ్మెద పురుగును ఒక రంధ్రములో పెట్టి దాని చుట్టు తిరగడముతో ఆ పురుగు కూడా ఈ ఆకారాన్నే పొందుతుంది. పరమాత్మ యందు వైరముతో నిరనతరం పరమాత్మను ధ్యానించడముతో వీరందరూ పరమాత్మనే పొందుతారు

యథా యథా భగవతో భక్త్యా పరమయాభిదా
నృపాశ్చైద్యాదయః సాత్మ్యం హరేస్తచ్చిన్తయా యయుః

పరమాత్మ యందు ఉన్న భక్తితో గానీ ద్వేష భావముతో కానీ శిశుపాలాది రాజులు పరమాత్మ యందు తాదాత్మ్యాన్ని పొందారు. ధ్యానిస్తూ ద్వేషిస్తూ దూషిస్తూ పరమాత్మనే తలచారు.

ఆఖ్యాతం సర్వమేతత్తే యన్మాం త్వం పరిపృష్టవాన్
దమఘోషసుతాదీనాం హరేః సాత్మ్యమపి ద్విషామ్

నీవు నన్ను ఏమి అడిగావో అది చెప్పాను. శిశుపాలుడు మోక్షం పొందడానికి కారణం వివరించాను.

ఏషా బ్రహ్మణ్యదేవస్య కృష్ణస్య చ మహాత్మనః
అవతారకథా పుణ్యా వధో యత్రాదిదైత్యయోః

ఇది బ్రాహ్మణుల మీద అత్యంత ప్రీతి కలిగిన కృష్ణ పరమాత్మ యొక్క కథ. పరమ పావన కథ. ఆది దైత్యుల వధను చెప్పాను. ప్రహ్లాద కధను చెప్పాను.

ప్రహ్రాదస్యానుచరితం మహాభాగవతస్య చ
భక్తిర్జ్ఞానం విరక్తిశ్చ యాథార్థ్యం చాస్య వై హరేః

ప్రహ్లాదునికి భక్తి జ్ఞ్యానం వైరాగ్యం ఉంది. అలా ఉన్న వారు పరమాత్మను చేరతారు

సర్గస్థిత్యప్యయేశస్య గుణకర్మానువర్ణనమ్
పరావరేషాం స్థానానాం కాలేన వ్యత్యయో మహాన్

సృష్టి స్థితి లయములకు అధినాయకుడైన పరమాత్మ కథలను వర్ణించాను. హెచ్చు తగ్గులకు ష్తానం లేని. న్యూనత్వం, కాల ప్రభావం పరమాత్మకు ఉండవు. మనుషులకు ఉంటాయి

ధర్మో భాగవతానాం చ భగవాన్యేన గమ్యతే
ఆఖ్యానేऽస్మిన్సమామ్నాతమాధ్యాత్మికమశేషతః

పరమాత్మను పొందే భాగవత ధర్మాన్ని వివరించాను నీకు. ఆధ్యాత్మకమైన్న ఆఖ్యానాన్ని నీకు వర్ణించాను

య ఏతత్పుణ్యమాఖ్యానం విష్ణోర్వీర్యోపబృంహితమ్
కీర్తయేచ్ఛ్రద్ధయా శ్రుత్వా కర్మపాశైర్విముచ్యతే

పరమాత్మ పరాక్రమముతో వ్యాపించిన ఈ కథను శ్రద్ధా భక్తులతో ఎవరు గానం చేస్తారో వింటారో వారు సంసార పాశము నుండి విడుదల అవుతారు

ఏతద్య ఆదిపురుషస్య మృగేన్ద్రలీలాం
దైత్యేన్ద్రయూథపవధం ప్రయతః పఠేత
దైత్యాత్మజస్య చ సతాం ప్రవరస్య పుణ్యం
శ్రుత్వానుభావమకుతోభయమేతి లోకమ్

ఈయన ఆది పురుషుడు. ఇది మృగేంద్ర లీల. దైత్యేంద్ర వధ లీలను, ప్రహ్లాద వైభావాన్ని ఎవరు శ్రద్ధతో చదువుతారో వింటారో, వారు ఎక్కడా ఏ ఆపద లేని లోకానికి వెళతారు.

యూయం నృలోకే బత భూరిభాగా లోకం పునానా మునయోऽభియన్తి
యేషాం గృహానావసతీతి సాక్షాద్గూఢం పరం బ్రహ్మ మనుష్యలిఙ్గమ్

ఇప్పుడు ఈ మానవ లోకములో మహా అదృష్టవంతులు మీరే. మీ ఇంటిలోకి మునులందరూ వస్తున్నారు. ఎవరు వస్తే, ఎవరిని ఒక్క సారి చూస్తే చూసిన వారి పాపములు పోతాయో వారు మీ ఇంటికి వస్తున్నారు. వారు శ్రీకృష్ణున్ని చూడడానికి వస్తున్నాడు. అతి రహస్యముగా మానవ దేహములో ఉన్న సాక్షత్ పరబ్రహ్మ కృష్ణుడి రూపములో ఉన్నాడు.

స వా అయం బ్రహ్మ మహద్విమృగ్య కైవల్యనిర్వాణసుఖానుభూతిః
ప్రియః సుహృద్వః ఖలు మాతులేయ ఆత్మార్హణీయో విధికృద్గురుశ్చ

ఈయనే! ఇక్కడ కూర్చున్న ఈయనే. మహానుభావుల చేత అణ్వేషించబడే మోక్షం, దాని వలన వచ్చే సుఖం, ఆ సుఖానుభూతి, ఈయనే.  నీకు పరమ మిత్రుడు, బావ, నీవు చెప్పినట్లు వినే వాడు, గురువు, ఆత్మ, పూజించదగినవాడు.

న యస్య సాక్షాద్భవపద్మజాదిభీ రూపం ధియా వస్తుతయోపవర్ణితమ్
మౌనేన భక్త్యోపశమేన పూజితః ప్రసీదతామేష స సాత్వతాం పతిః

ఈ మహానుభావుని యదార్థ రూపం ఇలా ఉంటుంది అని బ్రహ్మ రుద్రాదులు కూడా చెప్పలేరు. భగవంతుని ఆరాధించడానికి ఉత్తమమైన తపస్సు మౌనం. తరువాత భక్తి, ఉపశమం (ఇంద్రియ నిగ్రహం). వీటిచే పూజించబడి పరమాత్మ మన విషయములో ప్రసన్నమవుగాక.

స ఏష భగవాన్రాజన్వ్యతనోద్విహతం యశః
పురా రుద్రస్య దేవస్య మయేనానన్తమాయినా

ఒక సారి ఈయనే శంకరుని కీర్తిని పెంచాడు. అనత మాయుడైన మయునిచే ఇబ్బంది కలిగితే స్వామి యొక్క కృప వలన త్రిపురాసురుడు వధించబడ్డాడు

రాజోవాచ
కస్మిన్కర్మణి దేవస్య మయోऽహన్జగదీశితుః
యథా చోపచితా కీర్తిః కృష్ణేనానేన కథ్యతామ్

మయుడు శంకరుని కీర్తిని అడ్డగించాడా. దాన్ని పరమాత్మ పెంచాడా? ఆ కథ నాకు చెప్పండి

శ్రీనారద ఉవాచ
నిర్జితా అసురా దేవైర్యుధ్యనేనోపబృంహితైః
మాయినాం పరమాచార్యం మయం శరణమాయయుః

విష్ణు కటాక్షముతో దేవతలు రాక్షసులను ఓడించారు. ఆ రాక్షసులు మహా మాయావి అయిన మాయాసురున్ని శరణు వేడారు

స నిర్మాయ పురస్తిస్రో హైమీరౌప్యాయసీర్విభుః
దుర్లక్ష్యాపాయసంయోగా దుర్వితర్క్యపరిచ్ఛదాః

ఆ మయుడు బంగారమూ వెండి ఇనుము నగరాలను ఏర్పాటు చేసాడు. ఆ నగరాలు ఎవరికీ కనపడవు. ఎవరు అపాయం కలిగించినా కలగదు. దాని పైన కప్పు ఏమున్నదో ఎవరికీ తెలియదు. ఆ నగర కప్పును చూచే మోహం చెందుతారు అందరూ.

తాభిస్తేऽసురసేనాన్యో లోకాంస్త్రీన్సేశ్వరాన్నృప
స్మరన్తో నాశయాం చక్రుః పూర్వవైరమలక్షితాః

ఎవరికీ కనపడరు కాబట్టి వాటిలో ఉండి అన్ని లోకాలను తిరుగుతూ అందరినీ బాధపెట్టడం మొదలు పెట్టారు, పా వైరాన్ని స్మరించుకుని.

తతస్తే సేశ్వరా లోకా ఉపాసాద్యేశ్వరం నతాః
త్రాహి నస్తావకాన్దేవ వినష్టాంస్త్రిపురాలయైః

ఈ త్రిపురాలయముల నుంచి కాపాడమని అందరూ శంకరున్ని శరణు వేడారు.

అథానుగృహ్య భగవాన్మా భైష్టేతి సురాన్విభుః
శరం ధనుషి సన్ధాయ పురేష్వస్త్రం వ్యముఞ్చత

ఈశ్వరుడు అభయమిచ్చి ధనస్సు ఎక్కుపెట్టి ఆ నగరముల పైకి ప్రయోగించాడు. సూర్య మండలం నుంచి బయలు దేరిన కిరణాల లాగ

తతోऽగ్నివర్ణా ఇషవ ఉత్పేతుః సూర్యమణ్డలాత్
యథా మయూఖసన్దోహా నాదృశ్యన్త పురో యతః

ఆ బాణములు తగలగానే ఆ రాక్షసులందరూ చనిపోయారు.

తైః స్పృష్టా వ్యసవః సర్వే నిపేతుః స్మ పురౌకసః
తానానీయ మహాయోగీ మయః కూపరసేऽక్షిపత్

మయుడు ఆ రాక్షసులను అమృతములో ముంచి తీసాడు. మళ్ళీ వారందరూ బలం పెరిగి లేచారు.

సిద్ధామృతరసస్పృష్టా వజ్రసారా మహౌజసః
ఉత్తస్థుర్మేఘదలనా వైద్యుతా ఇవ వహ్నయః

మేఘములను చీల్చుకుని వచ్చే మెరుపు తీగలలా తయారయ్యారు.

విలోక్య భగ్నసఙ్కల్పం విమనస్కం వృషధ్వజమ్
తదాయం భగవాన్విష్ణుస్తత్రోపాయమకల్పయత్

అది చూసి శంకరుడు ఆశ్చర్యపోయాడు. శంకరుడు విష్ణువును తలచుకుని ఒక ఉపాయాన్ని ఆలోచించి

వత్సశ్చాసీత్తదా బ్రహ్మా స్వయం విష్ణురయం హి గౌః
ప్రవిశ్య త్రిపురం కాలే రసకూపామృతం పపౌ

బ్రహ్మను ఒక దూడగా చేసి తాను ఆవు అయ్యి ఆ మయుని లోకానికి వెళ్ళి అక్కడున్న అమృతాన్ని అందరూ చూస్తుండగా తాగేశారు

తేऽసురా హ్యపి పశ్యన్తో న న్యషేధన్విమోహితాః
తద్విజ్ఞాయ మహాయోగీ రసపాలానిదం జగౌ

స్మయన్విశోకః శోకార్తాన్స్మరన్దైవగతిం చ తామ్
దేవోऽసురో నరోऽన్యో వా నేశ్వరోऽస్తీహ కశ్చన

అది తెలుసుకుని మయుడు ఇదంతా పరమాత్మ మాయ అని తెలుసుకున్నారు. దేవ రాక్షస మానవులు విధికి శాసకులు కారు. అందరూ విధి చెప్పినట్లు విన వలసిన వారే

ఆత్మనోऽన్యస్య వా దిష్టం దైవేనాపోహితుం ద్వయోః
అథాసౌ శక్తిభిః స్వాభిః శమ్భోః ప్రాధానికం వ్యధాత్

మనం చేసినదాన్ని దైవం తొలగిస్తాడు కానీ దైవం చేసిన దాన్ని మనమ తెలుసుకోలేము, తొలగించలేము.

ధర్మజ్ఞానవిరక్త్యృద్ధి తపోవిద్యాక్రియాదిభిః
రథం సూతం ధ్వజం వాహాన్ధనుర్వర్మశరాది యత్

పరమాత్మ తన తేజస్సును శంకరునిలో ఉంచాడు. ఆధ్యాత్మికములైన తన శక్తులను శంకరునిలో ఉంచాడు. రథం సారధి ధనువు అశ్వమూ ఉంచాడు
ధర్మ - రథం
జ్ఞ్యానం - సారధి
విరక్తి - ద్వజం
ఋద్ధి - వాహనం
తపస్సు - ధనువు
విద్య - కవచం
క్రియ - శరం.
ఇది మన కథ, మనకు కూడా మూడు పురములు ఉంటాయి. సాత్విక రాజసిక తామసిక పురాలు. మోహింపచేసే పైపొర ఉంటుంది. అదే చర్మం. అది (లోపల ఉన్నది) ఎవరికీ కనపడదు. దీన్ని శంకరుడు ఆత్మ జ్ఞ్యానమనే బాణముతో పోగొడతాడు. మయుడనే అజ్ఞ్యానం వ్యామోహం మనను కర్మలో వాసనలో పడేస్తాడు. అప్పుడు పరమాత్మ దాన్ని తాగేస్తాడు. అంటే పూర్వ జన్మ వాసనను తాగేస్తాడు. అప్పుడు పై రథమును సిద్ధం చేసుకుంటాడు

సన్నద్ధో రథమాస్థాయ శరం ధనురుపాదదే
శరం ధనుషి సన్ధాయ ముహూర్తేऽభిజితీశ్వరః

అభిజిత్ ముహూర్తములో శంకరుడు

దదాహ తేన దుర్భేద్యా హరోऽథ త్రిపురో నృప
దివి దున్దుభయో నేదుర్విమానశతసఙ్కులాః

దుర్భేద్యమైన బాణముతో (నారాయణాస్త్రముతో) కాల్చి వేసాడు. వెంటనే దుందుభులు మోగాయి. ఆకాశములో దేవతలు దుందుబులు మోగించి జయ జయ ధ్వానాలు చేసారు

దేవర్షిపితృసిద్ధేశా జయేతి కుసుమోత్కరైః
అవాకిరన్జగుర్హృష్టా ననృతుశ్చాప్సరోగణాః

గంధర్వులు గానం చేసారు, నాట్యం చేసారు

ఏవం దగ్ధ్వా పురస్తిస్రో భగవాన్పురహా నృప
బ్రహ్మాదిభిః స్తూయమానః స్వం ధామ ప్రత్యపద్యత

అప్పటినుంచి స్వామికి త్రిపురారీ పురారి అన్న పేరు వచ్చింది. బ్రహ్మాదులు శంకరున్ని స్తోత్రం చేయగా ఆయన తన లోకానికి వెళ్ళారు

ఏవం విధాన్యస్య హరేః స్వమాయయా విడమ్బమానస్య నృలోకమాత్మనః
వీర్యాణి గీతాన్యృషిభిర్జగద్గురోర్లోకం పునానాన్యపరం వదామి కిమ్

ఇటువంటి పరమాత్మ గాధలు అనేకం. తన మాయతో అందరినీ తన వశం చేసుకుని, తనను ఆశ్రయించిన వారికి విజయం ప్రసాదించే స్వామి. తననాశ్రయించిన వారికి సంసారాన్ని తొలగించి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. అటువంటి స్వామి మానవ దేహం ధరించి నాటకం ఆడుతున్నాడు. ఈయన ఆరుగుణములు గల భగవానుడు, జగత్తునకు గురువు. ఆయన కీర్తిని గానం చేస్తున్నాము. అలా మన చేత గానం చేయబడిన ఈయన గాధలు లోకాలను పావనం చేస్తాయి.

Monday, April 22, 2013

శ్రీమద్భాగవతం ఏడవ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

శ్రీనారద ఉవాచ
ఏవం సురాదయః సర్వే బ్రహ్మరుద్రపురః సరాః
నోపైతుమశకన్మన్యు సంరమ్భం సుదురాసదమ్

ఇలా మహా ఉగ్రముగా ఉన్న స్వామిని స్తోత్రం చేసారు. కానీ స్వామి కోపం తగ్గలేదు. అప్పుడు దేవతలందరూ అమ్మవారిని పంపారు శాంతింపచేయడానికి. అమ్మవారు కూడా ఎప్పుడూ స్వామిని ఇలా వినలేదు చొఓడలేదు. ఆమెకూడా కొంచెం శంకించి దగ్గరకు వెళ్ళలేదు.

సాక్షాత్శ్రీః ప్రేషితా దేవైర్దృష్ట్వా తం మహదద్భుతమ్
అదృష్టాశ్రుతపూర్వత్వాత్సా నోపేయాయ శఙ్కితా

ప్రహ్రాదం ప్రేషయామాస బ్రహ్మావస్థితమన్తికే
తాత ప్రశమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుమ్

ఎవ్వరూ వెళ్ళకుంటే బ్రహ్మ ప్రహ్లాదున్ని  పంపించాడు.
పక్కనే ఉన్న ప్రహ్లాదునితో నీవు వెళ్ళి నీ తండ్రి కారణముగా కోపించిన స్వామిని శాంతింపచేయి అన్నాడు.

తథేతి శనకై రాజన్మహాభాగవతోऽర్భకః
ఉపేత్య భువి కాయేన ననామ విధృతాఞ్జలిః

స్వపాదమూలే పతితం తమర్భకం విలోక్య దేవః కృపయా పరిప్లుతః
ఉత్థాప్య తచ్ఛీర్ష్ణ్యదధాత్కరామ్బుజం కాలాహివిత్రస్తధియాం కృతాభయమ్

సరేనని మహాభాగవతుడైన పిల్లవాడు దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి భూమి మీద సాష్టాంగపడ్డాడు. పాదముల ఎదుట ఉన్న పిల్లవాన్ని చూసి, దయ ముంచగా ప్రహ్లాదున్ని లేపి, ఆ పిల్లవాని శిరస్సు మీద "కాలగ్రస్థులకు అభయాన్నిచ్చే" తన హస్తాన్ని ఉంచాడు. ఎపుడైతే పరమాత్మ హస్తం శిరస్సుమీద పడిందో, తన హస్త స్పర్శతో అన్ని పాపాలూ పోయాయి.

స తత్కరస్పర్శధుతాఖిలాశుభః సపద్యభివ్యక్తపరాత్మదర్శనః
తత్పాదపద్మం హృది నిర్వృతో దధౌ హృష్యత్తనుః క్లిన్నహృదశ్రులోచనః

పరమాత్మ స్పర్శతో పరమాత్మ తత్వం సాక్షాత్కరించబడినది. శరీరమంతా పులకిస్తూ ఉండగా ఆనందబాష్పాలు తడిపేస్తూ ఉండగా, ఏకాగ్ర మనస్సుతో సావధానముతో ప్రేమతో గొంతు బొంగురుపోగా స్తోత్రం చేస్తున్నాడు

అస్తౌషీద్ధరిమేకాగ్ర మనసా సుసమాహితః
ప్రేమగద్గదయా వాచా తన్న్యస్తహృదయేక్షణః

శ్రీప్రహ్రాద ఉవాచ
బ్రహ్మాదయః సురగణా మునయోऽథ సిద్ధాః
సత్త్వైకతానగతయో వచసాం ప్రవాహైః
నారాధితుం పురుగుణైరధునాపి పిప్రుః
కిం తోష్టుమర్హతి స మే హరిరుగ్రజాతేః

బ్రహ్మాదులూ దేవతలూ మునులూ నీ ఎదుట చేతులు ముడుచుకుని కూర్చున్నారు. కేవలం సత్వగుణం మాత్రమే గలవారు తమ అత్యధికమైన ఉత్తమ గుణములతో వాక్ప్రభావముతో నిన్ను ఆరాధించజాలరు. అలాంటి నిన్ను రాక్షస జాతికి చెందిన  నేను స్తోత్రం చేయ యోగ్యుడినా.

మన్యే ధనాభిజనరూపతపఃశ్రుతౌజస్
తేజఃప్రభావబలపౌరుషబుద్ధియోగాః
నారాధనాయ హి భవన్తి పరస్య పుంసో
భక్త్యా తుతోష భగవాన్గజయూథపాయ

నిన్ను ఆరాధించడానికి అవేవీ అవసరం లేదు అని నా శిరసు మీద నీవు చేయి వేసి చెప్పావు. ధనమూ ఉత్తమ వంశం శాత్రం తేజస్సూ బలం బుద్ధీ పరమాత్మను ఆరాధించడానికి పనికి రావు. గజేంద్రుని భక్తికి సంతోషించావు.

విప్రాద్ద్విషడ్గుణయుతాదరవిన్దనాభ
పాదారవిన్దవిముఖాత్శ్వపచం వరిష్ఠమ్
మన్యే తదర్పితమనోవచనేహితార్థ
ప్రాణం పునాతి స కులం న తు భూరిమానః

పన్నెండు గుణాలు ఉన్న బ్రాహ్మణులు కూడా పరమాత్మ మీద భక్తిలేకపోతే, పరమాత్మ మీద భక్తి ఉన్న చండాలుడే నయం. పరమాత్మ యందే మనసూ వాక్కూ శరీరం అభిలాష నీ యందు అర్పించినవాడే తన కులమును పవిత్రం చేస్తాడు.  నేనింత గొప్పవాడినీ అన్న అభిమానం పవిత్రం చేయదు.

నైవాత్మనః ప్రభురయం నిజలాభపూర్ణో
మానం జనాదవిదుషః కరుణో వృణీతే
యద్యజ్జనో భగవతే విదధీత మానం
తచ్చాత్మనే ప్రతిముఖస్య యథా ముఖశ్రీః

పరమాత్మ భక్తులను ఎందుకు దయ చూస్తాడు? ఆయనకు అందరూ ఒకటే. అజ్ఞ్యాని జనులతో సర్వదా పరిపూర్ణుడైన వాడు పూజను ఎందుకు స్వీకరిస్తున్నాడు. దయతో స్వీకరిస్తున్నాడు. నీవు అద్దం వంటి వాడివి. అద్దం ఎదురుగా పెట్టుకుని మనం ముఖాన్ని దిద్దుకుంటాము. అద్దములో ప్రతిబింబం చూసుకోవడం మా లాభం కోసం అయినట్లు, నిన్ను స్తోత్రం చేయడం కూడా మా లాభం కోసమే. నీవు దయతో కాపాడుతుంటే, తెలియై వారు "బాగా స్తోత్రం చేస్తే పరమాత్మ కాపాడతాడు" అని అంటారు. నీవు పరిపూర్ణుడవు. నిన్ను స్తోత్రం చేయడం మా కోసమే తప్ప నీ కోసం కాదు.

తస్మాదహం విగతవిక్లవ ఈశ్వరస్య
సర్వాత్మనా మహి గృణామి యథా మనీషమ్
నీచోऽజయా గుణవిసర్గమనుప్రవిష్టః
పూయేత యేన హి పుమాననువర్ణితేన

నిన్ను స్తోత్రం చేసిన వారికే శుభం కలుగుతుంది కాబట్టి నిన్ను నా బుద్ధికి తోచినట్లుగా అన్ని రకములుగా స్తోత్రం చేస్తాను. నిన్ను స్తోత్రం చేస్తే కానీ మా మీద ఉన్న నీ మాయ పోదు. నీ మాయచే సృష్టించబడిన త్రిగుణాత్మకమైన ప్రకృతిలో బంధించబడిన మేము నీ స్తోత్రం చేతనే మేము పవిత్రులమవుతాము. ప్రకృతిలో ఉన్న మానవుడు ఏ స్తోత్రముతో పవిత్రుడవుతాడో అలాంటి స్తోత్రాన్ని చేస్తున్నాను.

సర్వే హ్యమీ విధికరాస్తవ సత్త్వధామ్నో
బ్రహ్మాదయో వయమివేశ న చోద్విజన్తః
క్షేమాయ భూతయ ఉతాత్మసుఖాయ చాస్య
విక్రీడితం భగవతో రుచిరావతారైః

నీవు చెప్పినట్లు చేసే బ్రహ్మాదులందరూ నిన్ను చూచి భయపడ్డారు.నీ అందమైన అవతారాలు జగత్తుకు క్షేమం శుభం ఆనందం కలిగించాలి, దుఃఖాన్ని తొలగించాలి. నీవు శాంతించు. ఇది మీకు ఒక ఆట. కోపాన్ని నిగ్రహించుకో, అసురుడు చనిపోయాడు.

తద్యచ్ఛ మన్యుమసురశ్చ హతస్త్వయాద్య
మోదేత సాధురపి వృశ్చికసర్పహత్యా
లోకాశ్చ నిర్వృతిమితాః ప్రతియన్తి సర్వే
రూపం నృసింహ విభయాయ జనాః స్మరన్తి

సజ్జనుడైనా, అహింసాపరాయణులైనా పామునో తేలునో చంపితే హర్షిస్తాడు. లోకపీడా పరాయణున్ని వధించుట లోకాలకి ఆనందమే. అన్ని లోకాలూ ఆనందం పొందాయి. వచ్చినవారందరూ తిరిగి వెళుతున్నారు. నీ ఈ స్వరూపాన్ని భయం తొలగడానికి స్మరించాలి

నాహం బిభేమ్యజిత తేऽతిభయానకాస్య
జిహ్వార్కనేత్రభ్రుకుటీరభసోగ్రదంష్ట్రాత్
ఆన్త్రస్రజఃక్షతజకేశరశఙ్కుకర్ణాన్
నిర్హ్రాదభీతదిగిభాదరిభిన్నఖాగ్రాత్

మహాభయంకరమైన వక్త్రం జిహ్వ సూర్యుని లాంటి కళ్ళు, పేగులు మాలలా వేసుకుని శంఖం వంటి కర్ణములు కలిగి, గర్ఝనతో దిగ్గజాలను భయపెట్టిన, శత్రువును చీల్చిన గోళ్ళను చూచీ నాకేమీ భయం కలగట్లేదు

త్రస్తోऽస్మ్యహం కృపణవత్సల దుఃసహోగ్ర
సంసారచక్రకదనాద్గ్రసతాం ప్రణీతః
బద్ధః స్వకర్మభిరుశత్తమ తేऽఙ్ఘ్రిమూలం
ప్రీతోऽపవర్గశరణం హ్వయసే కదా ను

సంసారాన్ని చూచి భయపడుతున్నాను గాని నిన్ను చూచి కాదు. మమ్ములను మేమే కట్టేసుకుంటున్నాము. ఈ బంధములు తెగి మోక్షం ప్రసాదించే నీ పాదమూలం ఎప్పుడు చేరతానో అని నేను భయపడుతున్నాను గానీ నీ నారసింహరూపాన్ని చూచి కాదు.

యస్మాత్ప్రియాప్రియవియోగసంయోగజన్మ
శోకాగ్నినా సకలయోనిషు దహ్యమానః
దుఃఖౌషధం తదపి దుఃఖమతద్ధియాహం
భూమన్భ్రమామి వద మే తవ దాస్యయోగమ్

ప్రియ వియోగం అప్రియ సయోగం - ఇదే సంసారం. ఈ రెంటి వలనా దుఃఖమే. నానా జాతులలో పుట్టి కాల్చబడుతున్నాము. మేము దుఃఖాన్ని సుఖం అనుకుని అనుభవిస్తున్నాము. దుఃఖాన్ని దుఃఖం అని అనుభవించడం లేదు. మాకు దుఃఖానికి మందుగా నీ దాస్య యోగాన్ని ప్రసాదించు

సోऽహం ప్రియస్య సుహృదః పరదేవతాయా
లీలాకథాస్తవ నృసింహ విరిఞ్చగీతాః
అఞ్జస్తితర్మ్యనుగృణన్గుణవిప్రముక్తో
దుర్గాణి తే పదయుగాలయహంససఙ్గః

ఎన్నో సార్లు బ్రహ్మ గానం చేసిన నీ దివ్య లీలలను నేను కూడా గానం చేస్తాను. ప్రకృతి ప్రయోగించిన సత్వ రజః తమో గుణముల నుండి సులభముగా దాటుతాను. నీ పాదముల జంటను నివాసముగా చేసుకున్న వారి సంగముతో.

బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ
నార్తస్య చాగదముదన్వతి మజ్జతో నౌః
తప్తస్య తత్ప్రతివిధిర్య ఇహాఞ్జసేష్టస్
తావద్విభో తనుభృతాం త్వదుపేక్షితానామ్

నీ చూపు పడని పిల్లవానికి తల్లి తండ్రులు రక్షకులు కారు, రోగికి మందు రక్షకం కాదు, సముద్రములో మునిగేవారికి నావ రక్షకం కాదు, కాలినవాడికి చల్లటి నీరు రక్షకం కాదు. నీ చేత ఉపేక్షించబడిన వారికి రక్షకములేవీ రక్షకములు గావు


యస్మిన్యతో యర్హి యేన చ యస్య యస్మాద్
యస్మై యథా యదుత యస్త్వపరః పరో వా
భావః కరోతి వికరోతి పృథక్స్వభావః
సఞ్చోదితస్తదఖిలం భవతః స్వరూపమ్

కారకములు. ఒక పని చేయాలంటే ఆరు ఉండాలి. కర్తా కర్మా సాధనం సంప్రదానం (ఉద్దేశ్యం) అపాదానం (దేని వలన) సంబంధం (దేనికి అధీనమై) .
ప్రతీ పనిలో ఈ ఆరు ఉంటాయి. దేని యందు, దేని కొరకు, దేని వలన, దేనితోటి, ఏ సంబంధముతో, ఎక్కడా ఎవ్వరూ ఎప్పుడూ, ఎలా.
మన సంస్కారమే పనీ చేయిస్తుందీ, పనిలో మార్పూ చేస్తుంది. ఒక పని చేయడానికీ మానడానికీ కూడా కారణం సంస్కారం.

మాయా మనః సృజతి కర్మమయం బలీయః
కాలేన చోదితగుణానుమతేన పుంసః
ఛన్దోమయం యదజయార్పితషోడశారం
సంసారచక్రమజ కోऽతితరేత్త్వదన్యః

ఇదంతా నీ స్వరూపమే. ఈ మాయ కర్మమయమైన మనసుని సృష్టి చేస్తుంది. సృష్టించాలంటే కాలం కావాలి. సత్వ రజః తమో గుణాలతో ప్రోత్సహించబడిన కాలం. నీకంటే తాను వేరు అనుకున్నవాడు ఈ కాల చక్రాన్ని దాటగలడా

స త్వం హి నిత్యవిజితాత్మగుణః స్వధామ్నా
కాలో వశీకృతవిసృజ్యవిసర్గశక్తిః
చక్రే విసృష్టమజయేశ్వర షోడశారే
నిష్పీడ్యమానముపకర్ష విభో ప్రపన్నమ్


ఆ కాలానికి గుణ సహకారం ఉంటుంది. త్రిగుణముల చేత సహకారం పొందిన కాలముతో పని చేస్తాము. నిన్ను కాక ఇంకొకరిని ఆశ్రయించిన వాడు ఈ సంసారాన్ని ఎలా దాటుతాడు. ప్రకృతి పదహారు అరలు గల చక్రములో పడవేయబడ్డవాడు ఎలా దాటగలడు. నీవు తప్ప ఎవరు దాటిస్తారు. నిన్నాశ్రయించినవారికి మాయ అంటదు. అన్ని గుణములూ నీ వశములో ఉంచుకున్నవాడవు. కర్మలూ ప్రకృతీ నీ వశములోనే ఉంది. సృష్టి, సృష్టికి కారణమైన కర్మలూ, ప్రకృతీ నీ అధీమనులోనే ఉన్నాయి. ఈ మొత్తం ప్రపంచాన్ని పదహారు ఆకులు గల గానుగ చక్రములో పడవేసావు.  ఎపుడూ తిరుగుతూనే ఉంటుంది ఆ గానుగా, గానీ ఒక్క అడుగూ ముందుకు వేయదు. ఇది పిండి చేసే తైల యంత్రం.

దృష్టా మయా దివి విభోऽఖిలధిష్ణ్యపానామ్
ఆయుః శ్రియో విభవ ఇచ్ఛతి యాన్జనోऽయమ్
యేऽస్మత్పితుః కుపితహాసవిజృమ్భితభ్రూ
విస్ఫూర్జితేన లులితాః స తు తే నిరస్తః

ప్రపంచములో ఉన్న సకల జీవులూ నిరంతరం తహ తహతో కోరికునే అన్ని వైభవాలూ, దేవతలూ వారి వైభవాలూ అన్నీ చూచాను. ఆ భోగాలన్నీ మా తండ్రి కోపముతో చూడగానే వారి ఐశ్వర్యాలన్నీ పోయాయి.అలాంటి వాడు నీవు కన్నెర్ర చేస్తే  పోయాడు. మరి ఇప్పుడు ఏది నిజం? ఏది నిత్యం? మా తండ్రి వలన అన్నిటి గొప్ప ఎంతో అర్థమయ్యింది. అందరూ మా నాన్నకు భయపడేవారు. లోకపాలురనే వారి వైభవం ఏమిటో నేను చూసాను. మా నాన్న గారికి కోపం వచ్చి కనుబొమ్మ ఎక్కు బెట్టగానే భయపడే వారు. ఈ లోకాలూ కోరికలూ ఆయుర్దాయం ఐశ్వర్యం నాకు వద్దు. ఎప్పుడూ మాసిపోనిది నాకు కావాలి.

తస్మాదమూస్తనుభృతామహమాశిషోऽజ్ఞ
ఆయుః శ్రియం విభవమైన్ద్రియమావిరిఞ్చ్యాత్
నేచ్ఛామి తే విలులితానురువిక్రమేణ
కాలాత్మనోపనయ మాం నిజభృత్యపార్శ్వమ్

ఈ కోరికలను నేను కోరను. ఆయ్ష్షు సంపదా సుఖం వైభవం అవి అన్నీ నీవు కనుబొమ్మలు ముడివేయగానే పోతాయి.నీ చిన్న పరాక్రమముతో పోయేవాటిని నేను కోరను. బ్రహ్మాదులు పొందే వైభవాలు నాకొద్దు, నన్ను నీ భక్తుల వద్ద జేర్చు.

కుత్రాశిషః శ్రుతిసుఖా మృగతృష్ణిరూపాః
క్వేదం కలేవరమశేషరుజాం విరోహః
నిర్విద్యతే న తు జనో యదపీతి విద్వాన్
కామానలం మధులవైః శమయన్దురాపైః

కోరికలు వినడానికి ఇంపుగా ఉంటాయి. ఎండమావుల వంటి కోరికలెక్కడా, అన్ని రోగాలకూ పుట్టినిలూ అయిన శరీరమెక్కడా, ఐనా జ్ఞ్యానులకు కూడా విరక్తి కలగదు.
కామమనే నిప్పును తేనే దొరికితే తేనె  చుక్కలతో చల్లార్చాలనుకుంటాడు. ఈ మానవులు విరతిని మాత్రం పొందరు. అవి నశించేవని తెలిసినా విరక్తిని మాత్రం పొందరు. అగ్ని జ్వాలలను కోరికలనే తేనె చుక్కలతో చల్లాచ్ర్చ ప్రయత్నిస్తాడు.

క్వాహం రజఃప్రభవ ఈశ తమోऽధికేऽస్మిన్
జాతః సురేతరకులే క్వ తవానుకమ్పా
న బ్రహ్మణో న తు భవస్య న వై రమాయా
యన్మేऽర్పితః శిరసి పద్మకరః ప్రసాదః

కొంచెం ఆలోచిస్తే ఆశ్చర్యముగా ఉంది, తమోగుణం ఎక్కువగా ఉన్న కులములో పుట్టిన నేనెక్కడా, నీ దయ ఎక్కడా? నీ దయకు ఇవేవీ పట్టింపులు లేవు. ఎన్నో పురాణాలు చదివానూ, ఎన్నో విన్నాను, గానీ ఎక్కడా నీ హస్తమును బ్రహ్మ నెత్తిన గానీ, శంకరుని నెత్తిన కానీ, అమ్మవారి నెత్తిన కానీ పెట్టినట్లు వినలేదు. పద్మం లాంటి నీ హస్తమునూ అనుగ్రహాన్నీ నా శిరస్సు నందు ఉంచావు.. అది నా యోగ్యత కాదు నీ దయ.

నైషా పరావరమతిర్భవతో నను స్యాజ్
జన్తోర్యథాత్మసుహృదో జగతస్తథాపి
సంసేవయా సురతరోరివ తే ప్రసాదః
సేవానురూపముదయో న పరావరత్వమ్

వీడు ఎక్కువ వాడూ, వీడు తక్కువ వాడూ అన్న పక్షపాతం నీకు లేదు.  సకల జగత్తుకూ నీవు మిత్రుడివి. కల్పవృక్షం కోరిన వారు ఎవరా అన్న ప్రశ్న లేకుణ్డా ఎవరు కోరితే వారికి వరాలిస్తుంది, అడిగితే. నీవు కూడా నిన్న్సేవించిన వారికి మోక్షాన్ని ఇస్తావు. సేవించిన దాని బట్టి ఇస్తావు గానీ, వీడు ఎక్కువ వాడు,, వీడు తక్కువ వాడు అని కాదు. అది నీ స్వభావం.

ఏవం జనం నిపతితం ప్రభవాహికూపే
కామాభికామమను యః ప్రపతన్ప్రసఙ్గాత్
కృత్వాత్మసాత్సురర్షిణా భగవన్గృహీతః
సోऽహం కథం ను విసృజే తవ భృత్యసేవామ్

సంసారమనే మహా భయంకరమైన అగ్నిలో పడబోతున్న నన్ను పైకిలాగావు. నన్ను సంసారాన్ని దాటింపచేసావు. ఇంత మేలు చేసిన నీ భక్తులను నేను విడిచిపెడతానా? నీ భక్తులనెవరినీ విడిచిపెట్టను. సంసారమనే పాముల బావిలో, ఒక కోరిక తీరకమునుపే ఇంకో కోరిక ఊరుతూ ఉన్న చీకటి బావిలో పడిపోతూ దయతో నారదుని చేత గ్రహించాడ్డాను. అలాంటి నేను నీ సేవను ఎలా విడిచిపెడతాను.

మత్ప్రాణరక్షణమనన్త పితుర్వధశ్చ
మన్యే స్వభృత్యఋషివాక్యమృతం విధాతుమ్
ఖడ్గం ప్రగృహ్య యదవోచదసద్విధిత్సుస్
త్వామీశ్వరో మదపరోऽవతు కం హరామి

నీ సేవకుడైన నారదుని మాట "పరమాత్మను సేవించిన వాడు చేదిపోడు, భగవంతుని సేవించిన వాడికి ఎవరూ ఆపద కల్పించలేరు" అని చెప్పిన దాన్ని నిజం చేయడానికే ఈ పని చేసావు. కత్తిని తీసుకుని చంపబోతూ (కీఎడు చేయగోరి), ఒక వేళ నాకన్న వేరే భగవంతుడు ఉంటే నిన్ను కాపడు గాక అని అన్న నీ సేవకుడైన హిరణ్యకశిపుని వాక్యం నిజం చేసావు.

ఏకస్త్వమేవ జగదేతమముష్య యత్త్వమ్
ఆద్యన్తయోః పృథగవస్యసి మధ్యతశ్చ
సృష్ట్వా గుణవ్యతికరం నిజమాయయేదం
నానేవ తైరవసితస్తదనుప్రవిష్టః

నీ మాయతో మహత్ తత్వాన్నీ ప్రకృతినీ సృష్టించి అందులో నీవు ప్రవేశించి ఈ విశ్వాన్ని తయారు చేస్తున్నావు.

త్వమ్వా ఇదం సదసదీశ భవాంస్తతోऽన్యో
మాయా యదాత్మపరబుద్ధిరియం హ్యపార్థా
యద్యస్య జన్మ నిధనం స్థితిరీక్షణం చ
తద్వైతదేవ వసుకాలవదష్టితర్వోః

చిత్ అచిత్ ఈశ్వరుడు, జీవుడు ప్రకృతీ ఈశ్వరుడు. ఈ మూడు సత్. మరి అసత్ ఎక్కడనుంచి వచ్చింది? మాయ కూడా నీకంటే వేరు కాదు. అంటే ఇక్కడ అసత్ అనే పదమే లేదు. అసత్ అనేది కేవలం భేధ  బుద్ధి వలన వచ్చింది. సత్ కంటే, నీ కంటే మాయ విడిగా ఉంటుంది. ప్రళయకాలములో ఈ సత్ అసత్ గా భాసిస్తుంది. సృష్టి కాలములో అసత్ గా అనిపిస్తున్నది సత్ గా మారుతుంది. ఇలా సత్ అసత్ గా అసత్ సత్ గా భాసించడానికి నీ యోగ మాయ కారణం. నీవు సత్ అసత్తులకు అధిపతివి. నేనూ వాడూ అనే బుద్ధి అపార్థం. వీడు వేరూ నేను వేరు అనే భేధ బుద్ధి అపార్థం. ప్రపంచములో సృష్టి స్థితి లయమూ సంకల్పమూ

న్యస్యేదమాత్మని జగద్విలయామ్బుమధ్యే
శేషేత్మనా నిజసుఖానుభవో నిరీహః
యోగేన మీలితదృగాత్మనిపీతనిద్రస్
తుర్యే స్థితో న తు తమో న గుణాంశ్చ యుఙ్క్షే

బీజములో వృక్షం, వృక్షము నుండి బీజం, ఈ రెంటినీ ఒకే సారి చూడలేము. బీజములో వృక్షం ఉంది. కనపడదు. అలాగే నీలో జగత్తు ఉంది, కనపడదు. జగత్తులో నీవున్నావు, కానీ కనపడవు. జగత్తు నీలో నీవు జగత్తులో ఉన్నావని అజ్ఞ్యానులు చూడలేరు. ఈ సకల చరాచర జగత్తునీ నీలో దాచుకుని హాయిగా నిదురిస్తున్నావు ఏ కోరికా లేకుండా. నీవు ప్రళయ కాలములో తమో గుణము గానీ ఇతర గుణములు గానీ కూర్చడం లేదు. సూక్ష్మావస్థలో ఉన్న ప్రకృతిని క్షోభిస్తే సృష్టి జరుగుతుంది. అవ్యక్తం, సూక్షం, మూల ప్రకృతి, ప్రధానం, వ్యక్తం, వికారం, ఇది దాటాక మహత్ తత్వం. ఇందులో మూల ప్రకృతి అవ్యక్తం చాలా చిన్న భాగముగా ఉంటుంది. పరమాత్మను చూచినపుడు ప్రకృతీ జీవుడూ కనపడరు. ప్రకృతిని చూస్తే పరమాత్మ జీవుడూ కనపడరు. ఇలా ఒక దాన్ని చూస్తే రెండవది కనపడకపోవుట నీ మాయ.

తస్యైవ తే వపురిదం నిజకాలశక్త్యా
సఞ్చోదితప్రకృతిధర్మణ ఆత్మగూఢమ్
అమ్భస్యనన్తశయనాద్విరమత్సమాధేర్
నాభేరభూత్స్వకణికావటవన్మహాబ్జమ్

అలాంటి సూక్ష్మావస్థలో కాలమును ప్రవేశింపచేస్తే అంతకాలం రహస్యముగా ప్రళయ కాలములో దాగి ఉన్న జగత్తు వ్యక్తమవుతుంది. నీ శరీరమే జగత్తూ జీవుడూ ప్రకృతి. నీవు నీ శరీరాన్ని(జగత్తుని) చూపెట్టినపుడు. అంతకాలం నీలో దాగి ఉన్న మూల ప్రకృతిని బయటకు వెలువరిస్తున్నావు. సమాధిని విరమించిన నీ నాభి నుండి చిన్న గింజ నుంచి పెద్ద వృక్షములాగ మహా పద్మం పుట్టింది.  ఆ పద్మమంటే ఒక్కో రేకు ఒక్కో బ్రహ్మాండం.

తత్సమ్భవః కవిరతోऽన్యదపశ్యమానస్
త్వాం బీజమాత్మని తతం స బహిర్విచిన్త్య
నావిన్దదబ్దశతమప్సు నిమజ్జమానో
జాతేऽఙ్కురే కథముహోపలభేత బీజమ్

ఆ పద్మం నుండి పుట్టినవాడు బ్రహ్మ. ఆయనకు అంత పెద్ద పద్మములో ఏమీ కనపడలేదు. పద్మానికి బీజాన్ని వెలుపలా లోపలా వెతికాడు. దిగి నీటిలోకి వెళ్ళాడు. దొరకని బీజం కోసం వంద ఏళ్ళు వెతికాడు. ఇది నీ మాయ కాక మరేమిటి

స త్వాత్మయోనిరతివిస్మిత ఆశ్రితోऽబ్జం
కాలేన తీవ్రతపసా పరిశుద్ధభావః
త్వామాత్మనీశ భువి గన్ధమివాతిసూక్ష్మం
భూతేన్ద్రియాశయమయే వితతం దదర్శ

మళ్ళీ పద్మములో కూర్చుని నీ ఉపదేశముతో తీవ్రమైన తపస్సు చేసి, మనస్సు పరిశుద్ధం చేసుకుని భూమిలో గంధములాగ అతి సూక్ష్మమైన నిన్ను చూచాడు. పంచ భూతములూ, కర్మ జ్ఞ్యాన ఇందిర్యములూ పంచ తన్మాత్రలూ ఉన్న అంతఃకరణములో నిన్ను సందర్శించాడు

ఏవం సహస్రవదనాఙ్ఘ్రిశిరఃకరోరు
నాసాద్యకర్ణనయనాభరణాయుధాఢ్యమ్
మాయామయం సదుపలక్షితసన్నివేశం
దృష్ట్వా మహాపురుషమాప ముదం విరిఞ్చః

నీవు సకల చరాచర జగత్తూ వ్యాపించి అనంత క్రియా అనంత జ్ఞ్యాన శక్తి కలవాడవై ఉన్నావు. సహస్ర శీర్షా అంటే అనంత జ్ఞ్యానం. ఇచ్చా శక్తీ క్రియా శక్తీ జ్ఞ్యాన శక్తి కలవాడు. ఇలా ఉన్న నిన్ను చూచి, గుర్తించదగ్గా అవయ సంస్థానం ఉన్న నిన్ను చూచి బ్రహ్మ గారు ఆనందాన్ని పొందారు

తస్మై భవాన్హయశిరస్తనువం హి బిభ్రద్
వేదద్రుహావతిబలౌ మధుకైటభాఖ్యౌ
హత్వానయచ్ఛ్రుతిగణాంశ్చ రజస్తమశ్చ
సత్త్వం తవ ప్రియతమాం తనుమామనన్తి

ఆ సమయములోనే బ్రహ్మగారికి వైదిక పరిజ్ఞ్యానాన్ని అందచేయబోతుంటే ఇద్దరు రాక్షసులు ఆ వేద రాశిని అపహరించారు, దాన్ని బ్రహ్మకు అందించడానికి హయగ్రీవ అవతారములో వచ్చి వారిని సంహరించి వేదములను బ్రహ్మగారికి ఇచ్చావు.  ఆ రాక్షసులు రజస్సూ తమస్సులకు ప్రతీక. వారిని సంహరించిన నీవు శుద్ధ సత్వ స్వరూపుడివి.

ఇత్థం నృతిర్యగృషిదేవఝషావతారైర్
లోకాన్విభావయసి హంసి జగత్ప్రతీపాన్
ధర్మం మహాపురుష పాసి యుగానువృత్తం
ఛన్నః కలౌ యదభవస్త్రియుగోऽథ స త్వమ్

నీవు లోకములను సృష్టించి, వాటిని కాపాడుతున్నావు. నరునిగా, తిర్యక్, ఋషి, దేవ, ఝష (మత్స్య), అవతారాలుగా వచ్చి, ధర్మముకు విఘాతం కలిగించేవారిని శిక్షిస్తున్నావు. కలియుగములో నీవు దాగి ఉండి సత్వాన్ని కాపాడి రజస్సూ తమస్సులను అణగదొక్కుతున్నావు. అందుకే నీవు త్రి యుగః - సత్వ రజ తమో గుణాలు, సృష్టి స్థితి రక్షణలు, కృత త్రేతా ద్వాపరాలు

నైతన్మనస్తవ కథాసు వికుణ్ఠనాథ
సమ్ప్రీయతే దురితదుష్టమసాధు తీవ్రమ్
కామాతురం హర్షశోకభయైషణార్తం
తస్మిన్కథం తవ గతిం విమృశామి దీనః

ఇలాంటి నీ కథలలో లగ్నం చేయని మనసుని సృష్టించావు. ఈ మనసు మహా పాతకి, చెడ్డది. ఈ మనసుకు విపరీతమైన కోరికలుంటాయి. ఇందులో హర్ష శోక భయ ఈశనము ఇలాంటి మనసునెందుకు సృష్టించావు.అలాంటి మనసు మాకిచ్చినప్పుడు ఎవరైనా అటువంటి మనసులో నీ గురించి ఆలోచిస్తారా. అలాంటి మనసుతో నిన్ను ఎలా ధ్యానిస్తాను.

జిహ్వైకతోऽచ్యుత వికర్షతి మావితృప్తా
శిశ్నోऽన్యతస్త్వగుదరం శ్రవణం కుతశ్చిత్
ఘ్రాణోऽన్యతశ్చపలదృక్క్వ చ కర్మశక్తిర్
బహ్వ్యః సపత్న్య ఇవ గేహపతిం లునన్తి

ఒక్క మనసు పెట్టావు, పది ఇంద్రియాలు పెట్టావు. ఒక్కో ఇంద్రియం ఒక్కో వైపు లాగుకొని పోతుంది. ఇలా రకరకాలుగా బహు భార్యలు గల భర్తను భార్యలు లాగినట్లుగా లాగుకుని పోతాయి.

ఏవం స్వకర్మపతితం భవవైతరణ్యామ్
అన్యోన్యజన్మమరణాశనభీతభీతమ్
పశ్యన్జనం స్వపరవిగ్రహవైరమైత్రం
హన్తేతి పారచర పీపృహి మూఢమద్య

ఇలా సంసారమనే వైతరినీ నదిలో పడి, పుడుతూ చస్తూ, పుట్టినందుకు తింటూ,  బాధలు పడుతూ భయపడుతూ ఉంటారు. ఈ మధ్యన "వాడు నా వస్తువు తీసుకున్నాడు, వాడిని నేను చంపుతాను" అని అనుకుంటాడు. ఈ మధ్యలోనే ఒకడి మీద శతృత్వం, ఇంకొకరి మీద మిత్రత్వం. ఇన్ని బాధలలో ఉన్న మమ్ము దయ చూసి నీవే బయట పడెయ్యాలి.

కో న్వత్ర తేऽఖిలగురో భగవన్ప్రయాస
ఉత్తారణేऽస్య భవసమ్భవలోపహేతోః
మూఢేషు వై మహదనుగ్రహ ఆర్తబన్ధో
కిం తేన తే ప్రియజనాననుసేవతాం నః

సంసారమనే మహాసముద్రము నుండి బయటకు తీయుట నీకొక లెఖ్ఖా? మమ్ము నీవు ఉద్దరించాలి. మూర్ఖుల యందు దయ చూపేవారే మహానుభావులు. మాలాంటి వారి మీద నీవు దయ చూపాలి. నీ భక్తులను నిరంతరం సేవించే మమ్ము సంసారం నుండీ బయట పడేయ్యాలి

నైవోద్విజే పర దురత్యయవైతరణ్యాస్
త్వద్వీర్యగాయనమహామృతమగ్నచిత్తః
శోచే తతో విముఖచేతస ఇన్ద్రియార్థ
మాయాసుఖాయ భరముద్వహతో విమూఢాన్

వైతరణీ నది నుంచీ నరకలోకం గురించీ నేను భయపడను. నిన్ను గానం చేస్తూ ఆ కథ అనే మహాసముద్రలో ఆనందముగా ఉన్నాను. ఇంత అద్భుతమైన నీ ప్రతాపమూ దయ ఉండగా, వీటిని వదిలిపెట్టి సంసారములో మగ్గుతున్నవారిని చూచి నాకు బాధ కలుగుతోంది. ఇంద్రియములూ విషయములనే మాయా సుఖముల యందు ఆసక్తి కలిగి ఉంటారు.

ప్రాయేణ దేవ మునయః స్వవిముక్తికామా
మౌనం చరన్తి విజనే న పరార్థనిష్ఠాః
నైతాన్విహాయ కృపణాన్విముముక్ష ఏకో
నాన్యం త్వదస్య శరణం భ్రమతోऽనుపశ్యే

లోకములో చాలామంది మునులూ యోగులూ తపస్వులు తమంత తాము ఒక చెట్టుకింద కూర్చుని తపస్సు చేస్తూ ప్రయత్నిస్తున్నారు గానీ, ఇతరులనీ దీనులనీ ఉద్దరించడానికి ప్రయత్నించరు. వారికే కోరికం లేదు. వారి మౌనముగా ఏకాంతముగా తపస్సు చేస్తూ ఉంటారు. ఇలాంటి దీనులని వదిలిపెట్టి నేనొక్కడినే మోక్షానికి రావడం నాకు ఇష్టం లేదు. సంసారములో పడి ఉన్న వారికి సంసారం వదలాలంటే నీవు తప్ప వేరే దిక్కు లేదు.

యన్మైథునాదిగృహమేధిసుఖం హి తుచ్ఛం
కణ్డూయనేన కరయోరివ దుఃఖదుఃఖమ్
తృప్యన్తి నేహ కృపణా బహుదుఃఖభాజః
కణ్డూతివన్మనసిజం విషహేత ధీరః

స్త్రీ పురుష సమాగమాన్ని చాలా సుఖం అంటున్నారు. దూరద పెడితే గోక్కున్నప్పుడు వచ్చే సుఖం లాంటిది అది. ఆ ఏడుపునే కోరి ఏడుస్తూనే ఉంటారు కానీ తృప్తి పొందడం లేదు మన్షులు.. అనేక దుఃఖాలని వీరు పొందుతున్నారు. ఎలాగైతే దురద పెడితే గోరు తగిలేంత గోక్కోవద్దు అని వైద్యుడు చెబుతాడు. దురదని సహించింట్లుగా కామాతురతని నిగ్రహించుకోవాలి.

మౌనవ్రతశ్రుతతపోऽధ్యయనస్వధర్మ
వ్యాఖ్యారహోజపసమాధయ ఆపవర్గ్యాః
ప్రాయః పరం పురుష తే త్వజితేన్ద్రియాణాం
వార్తా భవన్త్యుత న వాత్ర తు దామ్భికానామ్

మోక్షాన్నిచ్చేది మౌనం వ్రత్రం అధ్యయం మొదలైనవి. ఇవన్నీ ఇంద్రియ జయం లేని వారికి ముచ్చట మాత్రమే, వారు ఆచరించలేరు. ఇంద్రియ నిగ్రహం లేని వారికి ఇవి వార్తలేం( చెప్పుకోవదానికి మాత్రమే పనికొచ్చేవి)

రూపే ఇమే సదసతీ తవ వేదసృష్టే
బీజాఙ్కురావివ న చాన్యదరూపకస్య
యుక్తాః సమక్షముభయత్ర విచక్షన్తే త్వాం
యోగేన వహ్నిమివ దారుషు నాన్యతః స్యాత్

బీజమూ మొలక లాగ, ప్రపంచాన్ని చూస్తే నీవూ, నిన్ను చూస్తే ప్రపంచమూ కనపడదు. ప్రపంచమంతా నీలోనే ఉంది, నీవు ప్రపంచములోనే ఉన్నావు. ఇదంతా వేద సృష్టే. నీకు ఏ రూపమూ లేదు. పాంచభౌతిక రూపాలన్నీ నీ నుండే వచ్చాయి. అందుకే నిన్ను ప్రకృతిలో జీవునిలో సృష్టిలో ప్రళయములో జీవులు నిన్ను వెతుకుతూనే ఉంటారు. కట్టెలో నిప్పు ఉంటుంది, అది మధనం చేస్తారు. దాన్ని మధనముతో బయటకు తెచ్చినట్లు ధ్యానముతో నిన్ను బయటకు తీసుకురావాలి.

త్వం వాయురగ్నిరవనిర్వియదమ్బు మాత్రాః
ప్రాణేన్ద్రియాణి హృదయం చిదనుగ్రహశ్చ
సర్వం త్వమేవ సగుణో విగుణశ్చ భూమన్
నాన్యత్త్వదస్త్యపి మనోవచసా నిరుక్తమ్

పంచ భూతాలూ పంచ తన్మాత్రలూ ఇంద్రియాలూ ప్రాణాలూ అన్నీ నీవే . నీవే సగుణుడివీ నిర్గుణుడివి. వాక్కుకు అందవు.

నైతే గుణా న గుణినో మహదాదయో యే
సర్వే మనః ప్రభృతయః సహదేవమర్త్యాః
ఆద్యన్తవన్త ఉరుగాయ విదన్తి హి త్వామ్
ఏవం విమృశ్య సుధియో విరమన్తి శబ్దాత్

గుణాలూ మనస్సూ జ్ఞ్యాన కర్మేంద్రియాలూ పంచ తన్మాత్రలూ అన్నీ జనన మరణములు కలవే. అందరూ ఆద్యంతములు కలవారే. నీవొక్కడే అవి లేనివాడవు. జ్ఞ్యానులు ఈ విషయం తెలుసుకుని మౌనముగా ఉంటారు. ప్రవృత్తి నుండి విరమిస్తారు.

తత్తేऽర్హత్తమ నమః స్తుతికర్మపూజాః
కర్మ స్మృతిశ్చరణయోః శ్రవణం కథాయామ్
సంసేవయా త్వయి వినేతి షడఙ్గయా కిం
భక్తిం జనః పరమహంసగతౌ లభేత

నీకు నమస్కారం చేయాలి నిన్ను స్తోరం చేయాలి నీకు పూజలూ చేయాలి. బుద్ధి నీ పాదాల యందూ, చెవులలో నీ కథలూ ఉండాలి, నా మనసు బుద్ధీ నిన్ను సేవిస్తూ ఉండాలి. ఇలాంటి షడంగమైన ఈ  భక్తి లేకుండా ఎవరైనా నిన్ను పొందుతారా?మానవులు ఆరు పనులు చేయాలి. నీకు నమస్కారం చేయాలి. ఎప్పుడైనా నమస్కారం చేయవచ్చి, ఎవరైనా చేయవచ్చు. ఎలాగైనా చేయవచ్చు. అలా ఒక్క సారి నమస్కరించినా చాలు. అలా చేస్తే ఇంతకాలం మనలో దాచుకున్న పాపాలన్నీ పోతాయి. తరువాత స్తోత్రం చేయాలి. కర్మ (పని) చేయాలి. ఏ కర్మ, పని చేసినా అది స్వామి కొరకే చేయాలి. అదే యజ్ఞ్యం. అలా చేయగా స్వామికి నివేదించిన పదార్ధం శేష పదార్ధం అవుతుంది. ప్రసాదం అవుతుంది. పూజ చేయాలి. లోపల ఎవరిగురించో ఆలోచించకుండా, భగవంతుని గురించి వినాలి. తరువాత భగవత్ కథలు శ్రవణం చేస్తూ ఉండాలి.
ఇవి చేస్తే భగవంతుని పొందే దారిలో ప్రయాణం చేస్తాము.

శ్రీనారద ఉవాచ
ఏతావద్వర్ణితగుణో భక్త్యా భక్తేన నిర్గుణః
ప్రహ్రాదం ప్రణతం ప్రీతో యతమన్యురభాషత

ఇలా ప్రకృతి గుణములు లేని పరమాత్మ ప్రహ్లాదుని చేత స్తోత్రం చేయబడి కోపాన్ని నిగ్రహించుకుని ప్రీతితో ఇలా అన్నాడు

శ్రీభగవానువాచ
ప్రహ్రాద భద్ర భద్రం తే ప్రీతోऽహం తేऽసురోత్తమ
వరం వృణీష్వాభిమతం కామపూరోऽస్మ్యహం నృణామ్

ప్రహ్లాదా నీకు మంగళం, శుభం. నీ స్తుతిచే ప్రీతి చెందాను. నీకు బెంగ అక్కరలేదు. నేనే కోరికలు తీర్చే వాడిని. నన్ను చూచిన వాడెవడూ మరలా దుఃఖం పొందడు. సాధువులూ శ్రేయస్సు కోరేవారు నన్నే సేవించి నా వలనే కోరికలను నింపుకుంటారు.

మామప్రీణత ఆయుష్మన్దర్శనం దుర్లభం హి మే
దృష్ట్వా మాం న పునర్జన్తురాత్మానం తప్తుమర్హతి

ప్రీణన్తి హ్యథ మాం ధీరాః సర్వభావేన సాధవః
శ్రేయస్కామా మహాభాగ సర్వాసామాశిషాం పతిమ్

శ్రీనారద ఉవాచ
ఏవం ప్రలోభ్యమానోऽపి వరైర్లోకప్రలోభనైః
ఏకాన్తిత్వాద్భగవతి నైచ్ఛత్తానసురోత్తమః

ప్రహ్లాదుడు స్వామిని స్తోత్రం చేసాడు. ప్రహ్లాదుడు ఒక వరమును కోరుకున్నాడు. ఆనాటినుంచీ మనసులో ఎటువంటి కోరికలూ కలగని వరం కోరాడు. అప్పుడు స్వామి "నీవు కూడా ఒక మన్వంతర కాలం (72 మహా యుగాలు, నాలుగు యుగాలు ఒక మహా యుగం). రాజ్యాన్ని పరిపాలించాలి". రాజ్య భోగాలలోనే మనసుని లగ్నం చేయకు. మనసు నా యందు లగ్నం చేయి. అన్ని కర్మలూ నాకు అర్పిస్తూ నిరంతరం నన్ను ధ్యానిస్తూ అన్ని కర్మలూ చేయి. అని భగావనుడు చెప్పాడు.