Friday, April 12, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పధ్నాలుగవ అధ్యాయం

శ్రీపరీక్షిదువాచ
రజస్తమఃస్వభావస్య బ్రహ్మన్వృత్రస్య పాప్మనః
నారాయణే భగవతి కథమాసీద్దృఢా మతిః

పరమరాక్షసుడైన వృతాసురుడు, రజో తమో గుణాలు బాగా ఉండాల్సిన రాక్షస జాతిలో పుట్టిన్వాడికి పరమాత్మ యందు ఇంతటి భక్తీ ప్రీతీ ఎలా కలిగింది.

దేవానాం శుద్ధసత్త్వానామృషీణాం చామలాత్మనామ్
భక్తిర్ముకున్దచరణే న ప్రాయేణోపజాయతే

ఋషులకూ దేవతలకూ శుద్ధ సాత్వికులకు కూడా భక్తి కలగదే, ఎదో ఒక శక్తి ఎక్కువయ్యేసరికి అహంకారం వస్తుంది. మహానుభావులకు కూడా కష్టమైన భక్తి వృత్తాసురునికి భక్తి ఎలా కలిగింది.

రజోభిః సమసఙ్ఖ్యాతాః పార్థివైరిహ జన్తవః
తేషాం యే కేచనేహన్తే శ్రేయో వై మనుజాదయః

చాలా మంది రజోగుణం కలిగిన మానవులూ ఇతర ప్రాణులలో ఎన్నో కోట్లమందిలో ఒకరికి భక్తి కలుగుతుంది. అందులో కూడా ఎవరో ఒక్కరు మోక్షాన్ని కోరతారు.

ప్రాయో ముముక్షవస్తేషాం కేచనైవ ద్విజోత్తమ
ముముక్షూణాం సహస్రేషు కశ్చిన్ముచ్యేత సిధ్యతి

పరమాత్మ మీద భక్తి కలవారే తక్కువ, అందులో మోక్షం కోరేవారు వేలల్లో ఒకరు, అందులో మోక్షం పొందేవారు ఏ ఒక్కరో ఉంటారు. వృతాసురునికి మోక్షం ఎలా వచ్చింది.

ముక్తానామపి సిద్ధానాం నారాయణపరాయణః
సుదుర్లభః ప్రశాన్తాత్మా కోటిష్వపి మహామునే

పరమాత్మ యందు భక్తి మోక్షం యందు కోరికా ఉండి కూడా శ్రీమన్నారాయణున్ని ఆరాధించాలి అన్న కోరిక ఉన్న వారు కోట్లలో కూడా ఉండరు.

వృత్రస్తు స కథం పాపః సర్వలోకోపతాపనః
ఇత్థం దృఢమతిః కృష్ణ ఆసీత్సఙ్గ్రామ ఉల్బణే

అటువంటి వారు దొరకరు. ఇంతటి పాపి అయిన వృత్తాసురుడు శ్రీమన్నారాయణుని మీద భక్తి కలిగి యుద్ధములో అలా ఎలా మాట్లాడాడు. దేవతలకే కలగని జ్ఞ్యానం ఒక రాక్షసుడికి ఎలా కలిగింది.

అత్ర నః సంశయో భూయాఞ్ఛ్రోతుం కౌతూహలం ప్రభో
యః పౌరుషేణ సమరే సహస్రాక్షమతోషయత్

శ్రీసూత ఉవాచ
పరీక్షితోऽథ సమ్ప్రశ్నం భగవాన్బాదరాయణిః
నిశమ్య శ్రద్దధానస్య ప్రతినన్ద్య వచోऽబ్రవీత్

నేను నీకొక ఇతిహాసమును చెబుతున్నాను. మా తండ్రి వ్యాసభగవానుడూ నారదుడి వలన విన్నాను.

శ్రీశుక ఉవాచ
శృణుష్వావహితో రాజన్నితిహాసమిమం యథా
శ్రుతం ద్వైపాయనముఖాన్నారదాద్దేవలాదపి

ఆసీద్రాజా సార్వభౌమః శూరసేనేషు వై నృప
చిత్రకేతురితి ఖ్యాతో యస్యాసీత్కామధుఙ్మహీ

చిత్రకేతు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. భూమి కావలసినవన్నీ ఇచ్చేది, వర్షాలు కురిసేవి.

తస్య భార్యాసహస్రాణాం సహస్రాణి దశాభవన్
సాన్తానికశ్చాపి నృపో న లేభే తాసు సన్తతిమ్

అతనికి వేయి మంది భార్యలున్నారట. అంత మంది ఉన్నా ఆయనకు సంతానము లేదు

రూపౌదార్యవయోజన్మ విద్యైశ్వర్యశ్రియాదిభిః
సమ్పన్నస్య గుణైః సర్వైశ్చిన్తా బన్ధ్యాపతేరభూత్

అందమైన భార్యలూ, సౌందర్యమూ ఔదార్యమూ వంశమూ ఐశ్వర్యమూ భోగమూ ఉండీ, చెప్పినట్లు వినే మంత్రులూ ఉన్నారు, ఇవి ఉన్నా సంతానం లేదన్న చింత చుట్టుముట్టింది.

న తస్య సమ్పదః సర్వా మహిష్యో వామలోచనాః
సార్వభౌమస్య భూశ్చేయమభవన్ప్రీతిహేతవః

తస్యైకదా తు భవనమఙ్గిరా భగవానృషిః
లోకాననుచరన్నేతానుపాగచ్ఛద్యదృచ్ఛయా

ఇలా ఉండగా అంగీరస మహర్షి అన్ని లోకాలూ తిరుగుతూ పరమాత్మ సంకల్పముతో ఈయన భవనానికి వచ్చాడు

తం పూజయిత్వా విధివత్ప్రత్యుత్థానార్హణాదిభిః
కృతాతిథ్యముపాసీదత్సుఖాసీనం సమాహితః

ఆయనను రాజు పూజించి ఆసనం మీద కూర్చోబెట్టి

మహర్షిస్తముపాసీనం ప్రశ్రయావనతం క్షితౌ
ప్రతిపూజ్య మహారాజ సమాభాష్యేదమబ్రవీత్

అంగీరసుడు కుశల ప్రశన్లు వేసాడు

అఙ్గిరా ఉవాచ
అపి తేऽనామయం స్వస్తి ప్రకృతీనాం తథాత్మనః
యథా ప్రకృతిభిర్గుప్తః పుమాన్రాజా చ సప్తభిః

ఆత్మానం ప్రకృతిష్వద్ధా నిధాయ శ్రేయ ఆప్నుయాత్
రాజ్ఞా తథా ప్రకృతయో నరదేవాహితాధయః

నీవూ ప్రజలూ క్షేమముగా ఉనారా, ప్రజలందరినీ బాగా పరిపాలిస్తున్నావా, ప్రజలయందు మనసు పెట్టీ వారి శ్రేయస్సు కోరి పరిపాలిస్తున్నావా,ప్రజల శ్రేయస్సు కోరేవాడే రాజు. ప్రజలూ మంత్రులూ బృత్యులూ సైన్యాధిపతులూ ఎవరి వశములో ఉంటారో అలాంటి రాజునే కోరతారు. ప్రజల క్షేమం కోరని రాజు మాట మంత్రులూ ప్రజలూ భృత్యులూ వినరు. నిన్ను చూస్తే చాలా పెద్ద దిగులుతో బాధపడుతున్నట్లు కనపడుతున్నావు. అది నీ తప్పు వలనా? ఎదుటివారి తప్పు వలనా? నీవు దేని వలన బాధపడుతున్నావని అడిగితే వినయముతో తల వంచి ఇలా మాట్లాడుతున్నాడు

అపి దారాః ప్రజామాత్యా భృత్యాః శ్రేణ్యోऽథ మన్త్రిణః
పౌరా జానపదా భూపా ఆత్మజా వశవర్తినః

యస్యాత్మానువశశ్చేత్స్యాత్సర్వే తద్వశగా ఇమే
లోకాః సపాలా యచ్ఛన్తి సర్వే బలిమతన్ద్రితాః

ఆత్మనః ప్రీయతే నాత్మా పరతః స్వత ఏవ వా
లక్షయేऽలబ్ధకామం త్వాం చిన్తయా శబలం ముఖమ్

ఏవం వికల్పితో రాజన్విదుషా మునినాపి సః
ప్రశ్రయావనతోऽభ్యాహ ప్రజాకామస్తతో మునిమ్

చిత్రకేతురువాచ
భగవన్కిం న విదితం తపోజ్ఞానసమాధిభిః
యోగినాం ధ్వస్తపాపానాం బహిరన్తః శరీరిషు

తపస్సు జ్ఞ్యానం యోగమూ ఉన్న మీకు నేను నా మనసులో ఉన్నదాన్ని వేరే చెప్పాలా. అందరి మనసులో మీరు అంతర్యామిగా ఉంటారు.

తథాపి పృచ్ఛతో బ్రూయాం బ్రహ్మన్నాత్మని చిన్తితమ్
భవతో విదుషశ్చాపి చోదితస్త్వదనుజ్ఞయా

లోకపాలైరపి ప్రార్థ్యాః సామ్రాజ్యైశ్వర్యసమ్పదః
న నన్దయన్త్యప్రజం మాం క్షుత్తృట్కామమివాపరే

పెద్దలడిగితే చెప్పడం ధర్మం కనుక చెబుతున్నాను. లోకపాలకులకు అసూయ కలిగించే ఐశ్వర్యములు నా వద్ద ఉన్నాయి. బాగా ఆకలిగా ఉన్నవాడికి ఐశ్వర్యం రుచించనట్లు

తతః పాహి మహాభాగ పూర్వైః సహ గతం తమః
యథా తరేమ దుష్పారం ప్రజయా తద్విధేహి నః

ఇన్ని సంపదలూ సంతానం లేని నాకు తృప్తినివ్వట్లేదు. మీరు నా ఈ చీకటిని తొలగించండి. నాకు సంతానం ప్రసాదించండి.

శ్రీశుక ఉవాచ
ఇత్యర్థితః స భగవాన్కృపాలుర్బ్రహ్మణః సుతః
శ్రపయిత్వా చరుం త్వాష్ట్రం త్వష్టారమయజద్విభుః

జ్యేష్ఠా శ్రేష్ఠా చ యా రాజ్ఞో మహిషీణాం చ భారత
నామ్నా కృతద్యుతిస్తస్యై యజ్ఞోచ్ఛిష్టమదాద్ద్విజః

అంగీరసుడు ఒక యజ్ఞ్యం చేయించి ఆ ప్రసాదాన్ని పెద్ద భార్య అయిన కృత ద్యుతికి ప్రసాదించాడు.

అథాహ నృపతిం రాజన్భవితైకస్తవాత్మజః
హర్షశోకప్రదస్తుభ్యమితి బ్రహ్మసుతో యయౌ

అలా చేసి , నీకొక కుమారుడు కలుగుతాడూ, అతను నీకెంత హర్షాన్ని ప్రసాదిస్తాడో అంత శోకాన్నీ ప్రసాదిస్తాడు అని చెప్పి వెళ్ళాడు

సాపి తత్ప్రాశనాదేవ చిత్రకేతోరధారయత్
గర్భం కృతద్యుతిర్దేవీ కృత్తికాగ్నేరివాత్మజమ్

తస్యా అనుదినం గర్భః శుక్లపక్ష ఇవోడుపః
వవృధే శూరసేనేశ తేజసా శనకైర్నృప

సరి అయిన కాలములో వారికొక కుమారుడు కలిగాడు. బ్రాహ్మణులు ఆ పిల్లవాడికి అన్ని కర్మలూ చేసారు, ఆశీర్వచనాలూ చేసారు. ఆ బ్రాహ్మణులకి గోవులనూ గ్రామాలను ధనాన్నీ ఇచ్చాడు. రాజు హాయిగా ఉన్నాడు ఇంత కాలానికి సంతానం కలిగింది కాబట్టి. పర్జన్యుడు నెలకు మూడు వానలు కురిపిస్తున్నాడు. చాలా కాలం తరువాత కలిగినవాడు కాబట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లికి పిల్లవాడిమీద ఎంతో ప్రేమ.

అథ కాల ఉపావృత్తే కుమారః సమజాయత
జనయన్శూరసేనానాం శృణ్వతాం పరమాం ముదమ్

హృష్టో రాజా కుమారస్య స్నాతః శుచిరలఙ్కృతః
వాచయిత్వాశిషో విప్రైః కారయామాస జాతకమ్

తేభ్యో హిరణ్యం రజతం వాసాంస్యాభరణాని చ
గ్రామాన్హయాన్గజాన్ప్రాదాద్ధేనూనామర్బుదాని షట్

వవర్ష కామానన్యేషాం పర్జన్య ఇవ దేహినామ్
ధన్యం యశస్యమాయుష్యం కుమారస్య మహామనాః

కృచ్ఛ్రలబ్ధేऽథ రాజర్షేస్తనయేऽనుదినం పితుః
యథా నిఃస్వస్య కృచ్ఛ్రాప్తే ధనే స్నేహోऽన్వవర్ధత

మాతుస్త్వతితరాం పుత్రే స్నేహో మోహసముద్భవః
కృతద్యుతేః సపత్నీనాం ప్రజాకామజ్వరోऽభవత్

సంతానం కలగడం వలన రాజు ఆ భార్యని బాగా ప్రేమగా చూస్తున్నాడన్న జ్వరం మిగతా భార్యలను పీడించింది. రాజు గారి ప్రేమ కలిగితేనే గానీ సంతానం కలగదు. సంతానం కలిగితేనే గానీ రాజు గారి ప్రేమ కలుగుతుంది. సంతానం లేదనీ రాజు ఆదరించడం లేదనీ బాధపడి సంతానం లేని స్త్రీబతుకు వృధా అని నిర్ణ్న్యించుకుని, సంతానం లేకుంటే లోకులూ ప్రజలూ రాజూ నిందిస్తాడనీ, ఒక్క భార్యకే సంతానం ఉంటే మిగతా భార్యలందరూ ఆమెకే దాసీ చేయాలీ అని తమలో తాము దిగులుగా ఉండి బాధ కాస్తా కొంతకాలానికి అసూయగామరి, అసూయ కొంత కాలానికి ద్వేషముగా మారి, ఆ ద్వేషం బయటకు తెలియకుండా పెద్ద భార్య ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉన్నట్లు నటించి, ఆమెనూ పిల్లవాడినీ నమ్మించి ఆ పిల్లవాడికి ఒక రోజున విషమిచ్చారు. నిదురపోతున్నాడనుకున్న పిల్లవాడు చనిపోయాడు అని తెలుసుకుని గుండెలు బాదుకొని ఏద్చింది, భూమి మీద పడి మూర్చపోయింది. చనిపోయిన కుమారుడిని చూసి అందరూ బాధపడ్డారు. రాజు గారు కూడా జుట్టు రేగిపోయి మాలలన్నీ కిందపడి బొంగురుపోయి బాధపడుతూ ఉన్నాడు. ఈ భార్యా భర్తలను చూచి అందరూ బాధపడ్డారు.

చిత్రకేతోరతిప్రీతిర్యథా దారే ప్రజావతి
న తథాన్యేషు సఞ్జజ్ఞే బాలం లాలయతోऽన్వహమ్

తాః పర్యతప్యన్నాత్మానం గర్హయన్త్యోऽభ్యసూయయా
ఆనపత్యేన దుఃఖేన రాజ్ఞశ్చానాదరేణ చ

ధిగప్రజాం స్త్రియం పాపాం పత్యుశ్చాగృహసమ్మతామ్
సుప్రజాభిః సపత్నీభిర్దాసీమివ తిరస్కృతామ్

దాసీనాం కో ను సన్తాపః స్వామినః పరిచర్యయా
అభీక్ష్ణం లబ్ధమానానాం దాస్యా దాసీవ దుర్భగాః

ఏవం సన్దహ్యమానానాం సపత్న్యాః పుత్రసమ్పదా
రాజ్ఞోऽసమ్మతవృత్తీనాం విద్వేషో బలవానభూత్

విద్వేషనష్టమతయః స్త్రియో దారుణచేతసః
గరం దదుః కుమారాయ దుర్మర్షా నృపతిం ప్రతి

కృతద్యుతిరజానన్తీ సపత్నీనామఘం మహత్
సుప్త ఏవేతి సఞ్చిన్త్య నిరీక్ష్య వ్యచరద్గృహే

శయానం సుచిరం బాలముపధార్య మనీషిణీ
పుత్రమానయ మే భద్రే ఇతి ధాత్రీమచోదయత్

సా శయానముపవ్రజ్య దృష్ట్వా చోత్తారలోచనమ్
ప్రాణేన్ద్రియాత్మభిస్త్యక్తం హతాస్మీత్యపతద్భువి

తస్యాస్తదాకర్ణ్య భృశాతురం స్వరం ఘ్నన్త్యాః కరాభ్యాముర ఉచ్చకైరపి
ప్రవిశ్య రాజ్ఞీ త్వరయాత్మజాన్తికం దదర్శ బాలం సహసా మృతం సుతమ్

పపాత భూమౌ పరివృద్ధయా శుచా ముమోహ విభ్రష్టశిరోరుహామ్బరా

తతో నృపాన్తఃపురవర్తినో జనా నరాశ్చ నార్యశ్చ నిశమ్య రోదనమ్
ఆగత్య తుల్యవ్యసనాః సుదుఃఖితాస్తాశ్చ వ్యలీకం రురుదుః కృతాగసః

శ్రుత్వా మృతం పుత్రమలక్షితాన్తకం వినష్టదృష్టిః ప్రపతన్స్ఖలన్పథి
స్నేహానుబన్ధైధితయా శుచా భృశం విమూర్చ్ఛితోऽనుప్రకృతిర్ద్విజైర్వృతః

పపాత బాలస్య స పాదమూలే మృతస్య విస్రస్తశిరోరుహామ్బరః
దీర్ఘం శ్వసన్బాష్పకలోపరోధతో నిరుద్ధకణ్ఠో న శశాక భాషితుమ్

పతిం నిరీక్ష్యోరుశుచార్పితం తదా మృతం చ బాలం సుతమేకసన్తతిమ్
జనస్య రాజ్ఞీ ప్రకృతేశ్చ హృద్రుజం సతీ దధానా విలలాప చిత్రధా

స్తనద్వయం కుఙ్కుమపఙ్కమణ్డితం నిషిఞ్చతీ సాఞ్జనబాష్పబిన్దుభిః
వికీర్య కేశాన్విగలత్స్రజః సుతం శుశోచ చిత్రం కురరీవ సుస్వరమ్

అహో విధాతస్త్వమతీవ బాలిశో యస్త్వాత్మసృష్ట్యప్రతిరూపమీహసే
పరే ను జీవత్యపరస్య యా మృతిర్విపర్యయశ్చేత్త్వమసి ధ్రువః పరః

ఇలా నవ్వించి ఏడిపించడం బ్రహ్మగారికి సరాదాలా ఉంది. నీవే సంతాన్ని కలిగించి, వారిమీద ప్రేమను కలిగించి, కలిగించిన ప్రేమను నీవే త్రుంచి పారవేస్తున్నావు. గొడ్రాలన్న అపనింద పోయిందనుకుంటూ ఉంటే ఇలా చేసావా. అంటూ ఆ పిల్లవాడిని లేపుతూ ఉంది

న హి క్రమశ్చేదిహ మృత్యుజన్మనోః శరీరిణామస్తు తదాత్మకర్మభిః
యః స్నేహపాశో నిజసర్గవృద్ధయే స్వయం కృతస్తే తమిమం వివృశ్చసి

త్వం తాత నార్హసి చ మాం కృపణామనాథాం
త్యక్తుం విచక్ష్వ పితరం తవ శోకతప్తమ్
అఞ్జస్తరేమ భవతాప్రజదుస్తరం యద్
ధ్వాన్తం న యాహ్యకరుణేన యమేన దూరమ్

"నీవు నా ముందర చనిపోవడం నేను తట్టుకోలేను, నీ చిరునవ్వు ముఖాన్ని మాకు చూపించు అని " తల్లీ తండ్రీ విలపిస్తూ ఉన్నారు.

ఉత్తిష్ఠ తాత త ఇమే శిశవో వయస్యాస్
త్వామాహ్వయన్తి నృపనన్దన సంవిహర్తుమ్
సుప్తశ్చిరం హ్యశనయా చ భవాన్పరీతో
భుఙ్క్ష్వ స్తనం పిబ శుచో హర నః స్వకానామ్

నాహం తనూజ దదృశే హతమఙ్గలా తే
ముగ్ధస్మితం ముదితవీక్షణమాననాబ్జమ్
కిం వా గతోऽస్యపునరన్వయమన్యలోకం
నీతోऽఘృణేన న శృణోమి కలా గిరస్తే

శ్రీశుక ఉవాచ
విలపన్త్యా మృతం పుత్రమితి చిత్రవిలాపనైః
చిత్రకేతుర్భృశం తప్తో ముక్తకణ్ఠో రురోద హ

తయోర్విలపతోః సర్వే దమ్పత్యోస్తదనువ్రతాః
రురుదుః స్మ నరా నార్యః సర్వమాసీదచేతనమ్

ఏవం కశ్మలమాపన్నం నష్టసంజ్ఞమనాయకమ్
జ్ఞాత్వాఙ్గిరా నామ ఋషిరాజగామ సనారదః

ఇలా అందరూ బాధపడుతూ ఉంటే నారద మహర్షితో అంగీరసుడు వచ్చారు

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదమూడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదమూడవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
వృత్రే హతే త్రయో లోకా వినా శక్రేణ భూరిద
సపాలా హ్యభవన్సద్యో విజ్వరా నిర్వృతేన్ద్రియాః

ఇలా వృత్తాసుర సంహారం జరిగిన తరువాత ఒక్క ఇంద్రుడు తప్ప లోకపాలకులూ త్రిలోకవాసులూ వారి బాధ తొలగి సంతోషించారు. వృత్తాసురున్ని చంపినందు వలన బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది ఇంద్రునకు.

దేవర్షిపితృభూతాని దైత్యా దేవానుగాః స్వయమ్
ప్రతిజగ్ముః స్వధిష్ణ్యాని బ్రహ్మేశేన్ద్రాదయస్తతః

దేవతలూ వారి అనుచరులూ సంతోషముతో తమ తమ నెలవులకు వెళ్ళిపోయారు.

శ్రీరాజోవాచ
ఇన్ద్రస్యానిర్వృతేర్హేతుం శ్రోతుమిచ్ఛామి భో మునే
యేనాసన్సుఖినో దేవా హరేర్దుఃఖం కుతోऽభవత్

అందరూ ఆనందిస్తుండగా ఇంద్రుడెందుకు ఆనందించలేదు.

శ్రీశుక ఉవాచ
వృత్రవిక్రమసంవిగ్నాః సర్వే దేవాః సహర్షిభిః
తద్వధాయార్థయన్నిన్ద్రం నైచ్ఛద్భీతో బృహద్వధాత్

వృత్తాసురుడు స్వర్గం మీదకు దండెత్తి వచ్చినప్పుడే అతని భయంకరమైన పరాక్రమాన్ని చూసి భయపడి ఇంద్రున్ని శరణు వేడారు.

ఇన్ద్ర ఉవాచ
స్త్రీభూద్రుమజలైరేనో విశ్వరూపవధోద్భవమ్
విభక్తమనుగృహ్ణద్భిర్వృత్రహత్యాం క్వ మార్జ్మ్యహమ్

బ్రాహ్మణున్ని చంపడం ఎందుకని ఇంద్రుడు శంకించాడు. ఇది వరకే విశ్వరూపున్ని చంపినందు వలన వచ్చిన బ్రహ్మ హత్యా దోషాన్ని స్త్రీ జలం భూమీ వృక్షాలకు పంచాను. మళ్ళీ వృత్తాసురుని వధతో వచ్చే బ్రహ్మహత్యాపాతకాన్ని ఎలా పోగొట్టుకోవాలో ముందే జాగ్రత్త పడాలి. అది ఎలా పోగొట్టుకోవాలి.

శ్రీశుక ఉవాచ
ఋషయస్తదుపాకర్ణ్య మహేన్ద్రమిదమబ్రువన్
యాజయిష్యామ భద్రం తే హయమేధేన మా స్మ భైః

అప్పుడు అందరూ "నీ చేత అశ్వమేధము చేయిస్తాము. దాని వలన ఒక్క బ్రహ్మ హత్య కాదు. సమస్తలోకాన్ని చంపిన పాపం పోతుంది"

హయమేధేన పురుషం పరమాత్మానమీశ్వరమ్
ఇష్ట్వా నారాయణం దేవం మోక్ష్యసేऽపి జగద్వధాత్

బ్రహ్మహా పితృహా గోఘ్నో మాతృహాచార్యహాఘవాన్
శ్వాదః పుల్కసకో వాపి శుద్ధ్యేరన్యస్య కీర్తనాత్

పరమాత్మ నామాన్ని స్మరిస్తే బ్రహ్మ పితృ గో ఆచార్య మాతృ హత్యలనే పాపాలు పోతాయి. ఆయనను ఆరాధిస్తే ఏ పాపాలూ ఉండవు

తమశ్వమేధేన మహామఖేన శ్రద్ధాన్వితోऽస్మాభిరనుష్ఠితేన
హత్వాపి సబ్రహ్మచరాచరం త్వం న లిప్యసే కిం ఖలనిగ్రహేణ

మేము చాలా భక్తి శ్రద్ధలతో అశ్వమేధ యాగాన్ని జరిపిస్తాము. నీవూ అలా ఆచరించు, అలా చేస్తే బ్రాహ్మణున్ని చంపిన పాపమే కాదు బ్రహ్మను చంపిన పాపం కూడా పోతుంది. సాధువులను పీడించేవాడు బ్రాహ్మణుడైనా తప్పు కాదు. నీకే భయం లేదు అని ఋషులందరూ హామీ ఇచ్చారు

శ్రీశుక ఉవాచ
ఏవం సఞ్చోదితో విప్రైర్మరుత్వానహనద్రిపుమ్
బ్రహ్మహత్యా హతే తస్మిన్నాససాద వృషాకపిమ్

ఇలా ఋషులందరూ ప్రభోధించి ప్రేరేపిస్తే వృత్తాసురున్ని వధించాడు.వృత్తాసురున్ని చంపగానే బ్రహ్మ హత్యాపాపం ఇంద్రున్ని వెంటాడింది. ఆ తాపమును ఇంద్రుడు సహించలేకపోయాడు.

తయేన్ద్రః స్మాసహత్తాపం నిర్వృతిర్నాముమావిశత్
హ్రీమన్తం వాచ్యతాం ప్రాప్తం సుఖయన్త్యపి నో గుణాః

అందుకు ఆనందించలేకపోయాడు. ఎన్ని మంచి గుణములున్నా పది మంది నోట్లో పడితే (అపనిందపడితే) ఏమి సుఖం ఉంటుంది. ఇంద్రునికదే స్థితి కలిగింది. బ్రహ్మహత్య ఒక చండాల స్త్రీరూపములో ఉండి ముసలి తనముతో కంపిస్తూ, కుష్ఠు వ్యాధితో నెత్తురోడున్న చర్మముతో ఆమె నెరిసిన జుట్టును విరబోసుకుని "ఆగు ఆగ" మని అంటూ వచ్చింది. ఆమె వస్తూ ఉంటే చేపల వాసన అంతా వ్యాపించి దారినే చెడగొడుతున్నది. ఆమె నడిచే దారంతా చేపల వాసనే ఉంది.

తాం దదర్శానుధావన్తీం చాణ్డాలీమివ రూపిణీమ్
జరయా వేపమానాఙ్గీం యక్ష్మగ్రస్తామసృక్పటామ్

వికీర్య పలితాన్కేశాంస్తిష్ఠ తిష్ఠేతి భాషిణీమ్
మీనగన్ధ్యసుగన్ధేన కుర్వతీం మార్గదూషణమ్

నభో గతో దిశః సర్వాః సహస్రాక్షో విశామ్పతే
ప్రాగుదీచీం దిశం తూర్ణం ప్రవిష్టో నృప మానసమ్

ఇంద్రుడు ఏ దిక్కుకు వెళితే ఆ దిక్కుకు వచ్చింది. అలా తిరిగి తిరిగి మానస సరోవరానికి వచ్చాడు. అందులో పద్మము యొక్క నాడములో ఉన్న తంతువులలో దాక్కున్నాడు.

స ఆవసత్పుష్కరనాలతన్తూనలబ్ధభోగో యదిహాగ్నిదూతః
వర్షాణి సాహస్రమలక్షితోऽన్తః సఞ్చిన్తయన్బ్రహ్మవధాద్విమోక్షమ్

ఒక వెయ్యి సంవత్సరాలు వేరే దారిలేక బ్రహ్మవధ నుడి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ మగ్గిపోయాడు.

తావత్త్రిణాకం నహుషః శశాస విద్యాతపోయోగబలానుభావః
స సమ్పదైశ్వర్యమదాన్ధబుద్ధిర్నీతస్తిరశ్చాం గతిమిన్ద్రపత్న్యా

నహుషుడికి తాత్కాలికముగా ఇంద్రపదవిని ఇచ్చారు. ఈ నగుషుడు విద్యా తపమూ యోగమూ ఉన్నవాడు. అతను స్వర్గాన్ని పరిపాలించాడు. ఆ నహుషుడు పరిపాలిస్తూ ఉన్నాడు. మన పూర్వ పుణ్యము వలన ధర్మం వలన పెద్దలను సేవించడం వలన మంచి యోగం వస్తే ఆ యోగముతో వినయాన్నీ భక్తినీ పెద్దలను సేవించడం పెంచుకోవాలి. పెద్దలను అవమానిస్తే స్థాన భ్రష్టుడవుతాడు.

తతో గతో బ్రహ్మగిరోపహూత ఋతమ్భరధ్యాననివారితాఘః
పాపస్తు దిగ్దేవతయా హతౌజాస్తం నాభ్యభూదవితం విష్ణుపత్న్యా

అలా శచీదేవి వలన నహుషుడు పాముగా మారాడు. అతను వెళ్ళిన తరువాత బ్రహ్మదేవుడే వచ్చి ఇంద్రున్ని స్వయముగా రమ్మని పిలిచి ఋతంభరా మంత్రాన్ని ఉపదేశించాడు. ఋతమంటే పరమాత్మ. పరమాత్మ చేత భరించబడేది, అమ్మ వారు. అది అమ్మవారిని స్తోత్రం చేసే మంత్రం. ఆ మంత్రాన్ని జపించడము వలన అమ్మవారి కృపతో ఇంద్రుడు బయటకు వచ్చినా బ్రహ్మహత్య విడిచిపెట్టింది.

తం చ బ్రహ్మర్షయోऽభ్యేత్య హయమేధేన భారత
యథావద్దీక్షయాం చక్రుః పురుషారాధనేన హ

ఋతంభర (లక్ష్మీ నారాయణుల ధ్యానముతో తొలగిన పాపము కలవాడై తనలోకానికి వెళ్ళిపోయాడు. లక్ష్మీదేవిచేత కాపాడబడిన ఇంద్రున్ని బ్రహ్మ హత్య ఏమీ చేయలేకపోయింది. అప్పుడు ఋషులందరూ దీక్షనిచ్చి అశ్వమేధయాగాన్ని ప్రారంభించారు.

అథేజ్యమానే పురుషే సర్వదేవమయాత్మని
అశ్వమేధే మహేన్ద్రేణ వితతే బ్రహ్మవాదిభిః

స వై త్వాష్ట్రవధో భూయానపి పాపచయో నృప
నీతస్తేనైవ శూన్యాయ నీహార ఇవ భానునా

బ్రహ్మహత్యా పాతకం చాలా పెద్దదే అయినా శ్రీమన్నారాయణుని ఆరాధనతో అది బాదించలేకపోయినది. పరమాత్మ ఆరాధనతో తొలగని పాపం అంటూ ఏదీ లేదు. సూర్యభగవానుని వలన మంచు తొలగినట్లు పాపం తొలగించబడింది.

స వాజిమేధేన యథోదితేన వితాయమానేన మరీచిమిశ్రైః
ఇష్ట్వాధియజ్ఞం పురుషం పురాణమిన్ద్రో మహానాస విధూతపాపః

ఇంద్రుడు పెద్దలు చెప్పిన అశ్వమేధయాగాన్ని ఆచరించి, పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణున్ని ఆరాధించి పాపము తొలగించుకున్నాడు

ఇదం మహాఖ్యానమశేషపాప్మనాం ప్రక్షాలనం తీర్థపదానుకీర్తనమ్
భక్త్యుచ్ఛ్రయం భక్తజనానువర్ణనం మహేన్ద్రమోక్షం విజయం మరుత్వతః

అఖిల పాపములనూ కడిగేసే ఈ శ్రీమన్నారాయణుని కీర్తనను చేసే వ్యాఖ్యానం ఇది. ఈ చరిత్ర వింటే భక్తి పెరుగుతుంది (వృత్తాసురుడు పరమ భాగవతుడు). దీనిలో ఇంద్రవిజయం ఇంద్ర మోక్షం (పాపము తొలగిపోవుట) ఉన్నాయి. రాజైన వాడికి శత్రు సంహారం వలన విజయం లభించినా దానితోబాటే పాపం కూడా ఉంటుంది. ఇవి జరుగుతున్నా పరమాత్మ నామసంకీర్తన చేస్తుంటే ఆ పాపం మనను బాధించదు.

పఠేయురాఖ్యానమిదం సదా బుధాః శృణ్వన్త్యథో పర్వణి పర్వణీన్ద్రియమ్
ధన్యం యశస్యం నిఖిలాఘమోచనం రిపుఞ్జయం స్వస్త్యయనం తథాయుషమ్

జ్ఞ్యానము కలవారు ఈ వృత్తాసుర ఉపాఖ్యాన్ని అధ్యయం చేస్తే (శ్రాద్ధ సమయములో వృత్తాసుర వధ, వామన చరిత్ర చదివేవారు) , ప్రతీ పర్వలో (పూర్ణిమా అమావాస్య అష్టమీ ఏకాదశి ఇవి నాలుగు పర్వలు) ఈ ఆఖ్యానాన్ని వినాలి. ఇది ధనమునూ కీర్తినీ ఇస్తుంది అన్ని సంపదలూ ఇస్తుంది, శత్రు సంహారం చేస్తుంది, పాపాలను తొలగిస్తుంది, కీర్తి లభిస్తుంది.

Thursday, April 11, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పన్నెండవ అధ్యాయం

శ్రీఋషిరువాచ
ఏవం జిహాసుర్నృప దేహమాజౌ మృత్యుం వరం విజయాన్మన్యమానః
శూలం ప్రగృహ్యాభ్యపతత్సురేన్ద్రం యథా మహాపురుషం కైటభోऽప్సు

ఇలా యుద్ధములో గెలుపు కంటే మృత్యువే గొప్ప అనుకున్నాడు. ఇవన్నీ చెప్పిన వృత్తాసురుడు ఇంద్రుని మీదకు శూలము పట్టుకుని కైటభుడు నీటిలో ఉన్న పరమాత్మ మీదకి పరిగెత్తుకు వెళ్ళినట్లుగా వెళ్ళాడు.

తతో యుగాన్తాగ్నికఠోరజిహ్వమావిధ్య శూలం తరసాసురేన్ద్రః
క్షిప్త్వా మహేన్ద్రాయ వినద్య వీరో హతోऽసి పాపేతి రుషా జగాద

ప్రళయకాలాగ్నిలాగ  భయంకరమైన శూలాన్ని ఇంద్రుని మీద వేసి "నీవు చచ్చావు" అని పెద్దగా గర్జించాడు.

ఖ ఆపతత్తద్విచలద్గ్రహోల్కవన్నిరీక్ష్య దుష్ప్రేక్ష్యమజాతవిక్లవః
వజ్రేణ వజ్రీ శతపర్వణాచ్ఛినద్భుజం చ తస్యోరగరాజభోగమ్

ఆ శులాన్ని వజ్రాయుధముతో ఖండించి శూలము విసిరిన వృత్తాసురుడి ఒక బాహువుని ఖండించాడు

ఛిన్నైకబాహుః పరిఘేణ వృత్రః సంరబ్ధ ఆసాద్య గృహీతవజ్రమ్
హనౌ తతాడేన్ద్రమథామరేభం వజ్రం చ హస్తాన్న్యపతన్మఘోనః

ఒక చేయి పోయిన రెండవ చేతితో ఒక పరిఘను తీసుకుని దవడ మీదా ఏనుగు మీదా కొట్టాడు. ఆ దెబ్బకు ఇంద్రుడు వజ్రాయుధాన్ని జరవిడిచాడు.

వృత్రస్య కర్మాతిమహాద్భుతం తత్సురాసురాశ్చారణసిద్ధసఙ్ఘాః
అపూజయంస్తత్పురుహూతసఙ్కటం నిరీక్ష్య హా హేతి విచుక్రుశుర్భృశమ్

ఆయుధము లేని ఇంద్రున్ని వృత్తాసురుడు కొట్టలేదు. ఇంద్రుని స్థితి చూసి అందరూ హాహాకారాలు చేసారు.

ఇన్ద్రో న వజ్రం జగృహే విలజ్జితశ్చ్యుతం స్వహస్తాదరిసన్నిధౌ పునః
తమాహ వృత్రో హర ఆత్తవజ్రో జహి స్వశత్రుం న విషాదకాలః

ధర్మం తెలిసిన ఇంద్రుడు వజ్రాయుధాన్ని తిరిగి తీసుకోలేదు. "ఆయుధము తీసుకుని చంపు" అని వృత్తాసురుడు చెప్పాడు.

యుయుత్సతాం కుత్రచిదాతతాయినాం జయః సదైకత్ర న వై పరాత్మనామ్
వినైకముత్పత్తిలయస్థితీశ్వరం సర్వజ్ఞమాద్యం పురుషం సనాతనమ్

నీవు ఎన్నో యుద్ధాలు చూసి ఉంటావు. ఏ యుద్ధములోనైనా ఎప్పుడూ ఒక్కరే గెలుస్తారా. ఇలా ఆయుధం కిందపడిందని బెంబేలుపడకు. యుద్ధం చేసే వారెవరూ యుద్ధములో ఒకరికే జయం కలుగుతుందని నమ్మరు. ఎప్పటికీ గెలిచే వాడు ఒకడే ఉన్నాడు. ఆయన సృష్టి రక్షణ ప్రళయం చేస్తాడు. ఈ మూటికీ ప్రభువైన అన్నిటికీ ఆది ఐన పరమాత్మ సనాతన పురుషుడు తప్ప ప్రపంచములో ఏ ఒక్కడూ ఎప్పుడూ గెలవడు.

లోకాః సపాలా యస్యేమే శ్వసన్తి వివశా వశే
ద్విజా ఇవ శిచా బద్ధాః స కాల ఇహ కారణమ్

సకల చరా చర లోకములూ లోకపాలకులూ అతని వశములోనే బ్రతుకుతున్నారు. పక్షులను వల వేసి పట్టుకుంటాము. గింజలు ఏరుకుని తినదామనుకున్న పక్షులు సరిగ్గా అప్పుడే వల పడినా అది తెలుసుకోలేక, "మాకు ఆహారం దొరికింది" అనుకుంటాయి.బలికోరుతున్నవాడికీ బలి ఇస్తున్నవాడికీ కూడా చక్కగా ఆహరం పెట్టి బట్టలు తొడుగుతారు. బలికి సిద్ధం చేసేవాడికి ఆహారం సమృద్ధిగా పెట్టినట్లు మృత్యువు సిద్ధమైనప్పుడు మనకు పరమాత్మ సంపదలూ భార్యలూ ఐశ్వర్యాలూ ఇస్తాడు. కాలమే వీటన్నిటికీ కారణం.

ఓజః సహో బలం ప్రాణమమృతం మృత్యుమేవ చ
తమజ్ఞాయ జనో హేతుమాత్మానం మన్యతే జడమ్

ప్రవృత్తి సామర్ధ్యం(సహః), ఎదుటి వారిని ఓడించే సామర్ధ్యం (ఓజ), ధారణ సామర్ధ్యం, ప్రాణం, అమృతం, మృత్యువు, ఇవన్నీ మన ఇష్టం కాదు. అవి అన్నీ పరమాత్మ ఇష్టం. అది తెలియక జడులు మాత్రమే "ఇవన్నీ నావు" అంటారు.

యథా దారుమయీ నారీ యథా పత్రమయో మృగః
ఏవం భూతాని మఘవన్నీశతన్త్రాణి విద్ధి భోః

ఒక చెక్కబొమ్మ నడిపేవాడు నడిపితే నడిచినట్లుగా సకల భూతములూ పరమాత్మ ఆధీనములో ఉంటాయని తెలుసుకో

పురుషః ప్రకృతిర్వ్యక్తమాత్మా భూతేన్ద్రియాశయాః
శక్నువన్త్యస్య సర్గాదౌ న వినా యదనుగ్రహాత్

సకల ఇంద్రియాలూ మనసూ భూతములూ అన్నీ ఎవరి సంకల్పము వలన కలుగుతున్నాయో అతనే కారణం అని తెలుసుకో.

అవిద్వానేవమాత్మానం మన్యతేऽనీశమీశ్వరమ్
భూతైః సృజతి భూతాని గ్రసతే తాని తైః స్వయమ్

జ్ఞ్యానం లేని వాడు అంతా తానని భ్రమిస్తాడు. జ్ఞ్యానం ఉన్న వాడు తనదంటూ ఏదీ లేదని తెలుసుకుంటాడు. ప్రాణులతో ప్రాణులనీ భూతములతో భూతములనీ సృష్టిస్తాడు. వేటితో సృష్టిస్తాడో వాటితో సంహరిస్తాడు.

ఆయుః శ్రీః కీర్తిరైశ్వర్యమాశిషః పురుషస్య యాః
భవన్త్యేవ హి తత్కాలే యథానిచ్ఛోర్విపర్యయాః

మనం కోరినా కోరకున్నా ఆయువూ సంపదా కీతీ ఐశ్వర్యమూ బలమూ బ్రతుకూ మరణమూ పరమాత్మ అనుకుంటే వస్తాయి. మనం వేటిని కోరమో అవే ఎక్కువ వచ్చి కోరనివి ఎక్కువ వస్తాయి. రాకపోకలు మన ఇష్టం కాదు, పరమాత్మ ఇష్టం. ఇంద్రియములూ బుద్ధీ పరమాత్మ వశములో ఉంటాయి.

తస్మాదకీర్తియశసోర్జయాపజయయోరపి
సమః స్యాత్సుఖదుఃఖాభ్యాం మృత్యుజీవితయోస్తథా

గెలుపూ ఓటములనూ కీర్తి అపకీర్తులనూ జనన మరణములను సుఖ దుఃఖములనూ ఒకే తీరుగా చూస్తాడు జ్ఞ్యాని. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చేది పరమాత్మే. పరమాత్మ మనకు ఇచ్చే ప్రతీదీ మన మంచికే.

సత్త్వం రజస్తమ ఇతి ప్రకృతేర్నాత్మనో గుణాః
తత్ర సాక్షిణమాత్మానం యో వేద స న బధ్యతే

సత్వం రజస్సూ తమస్సూ అని మూడు గుణాలూ ప్రకృతివి, ఆత్మవి కావు. ప్రకృతిలో ఆత్మ సాక్షిగా ఉంటాడు. చూస్తున్నట్లూ అనుభవిస్తున్నట్లూ అనుకుంటాడు. అలా అనుకోవడం మానేస్తే, ఆత్మ కేవలం సాక్షీ అని తెలుసుకుంటారో అలాంటి వారు సంసారములో బంధించబడరు.

పశ్య మాం నిర్జితం శత్రు వృక్ణాయుధభుజం మృధే
ఘటమానం యథాశక్తి తవ ప్రాణజిహీర్షయా

నన్ను చూసి నేర్చుకో. నాకు చేయిపోయింది. నీకు కేవలం ఆయుధమే పోయింది. కింద పడ్డ ఆయుధం తీసుకోవడానికి చేయి ఉంది నీకు. నాకు చేయి లేకపోయినా నేను ఆనందముగా మాట్లాడుతున్నాను. ఒక చేయి పోయినా ఇంకో చేయితో నిన్ను ఓడించాలని ప్రయత్నిస్తున్నాను. అదే పని నీవూ చేయి.

ప్రాణగ్లహోऽయం సమర ఇష్వక్షో వాహనాసనః
అత్ర న జ్ఞాయతేऽముష్య జయోऽముష్య పరాజయః

యుద్ధమంటే జ్యూతం, ప్రాణమే పందెం, పాచికలు ఆయుహ్దాలు, ఆసనాలు వాహనాలు. జ్యూతములో ఒకడు గెలుస్తాడు ఒకడు ఓడుతాడని ఎవరికైనా తెలుస్తుందా

శ్రీశుక ఉవాచ
ఇన్ద్రో వృత్రవచః శ్రుత్వా గతాలీకమపూజయత్
గృహీతవజ్రః ప్రహసంస్తమాహ గతవిస్మయః

ఇన్ద్ర ఉవాచ
అహో దానవ సిద్ధోऽసి యస్య తే మతిరీదృశీ
భక్తః సర్వాత్మనాత్మానం సుహృదం జగదీశ్వరమ్

ఇది విన్న ఇంద్రుడు, నీవు నాకు శత్రువువై ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నావంటే నీవు సిద్ధుడవు, నీవు నిజమైన పరమాత్మ భక్తుడవు. సకల జగత్తుకూ నీవు మిత్రుడవు.

భవానతార్షీన్మాయాం వై వైష్ణవీం జనమోహినీమ్
యద్విహాయాసురం భావం మహాపురుషతాం గతః

సకల జగత్తునూ మోహింపచేసే పరమాత్మ మాయను గెలిచావు నీవు. రాక్షస భావాన్ని వదిలిపెట్టి పరమభాగవత భావాన్ని నీవు పొందావు.

ఖల్విదం మహదాశ్చర్యం యద్రజఃప్రకృతేస్తవ
వాసుదేవే భగవతి సత్త్వాత్మని దృఢా మతిః

రజో గుణములో పుట్టిన నీవు సత్వగుణముతో పరమాత్మ యందు ఇంత భక్తి కలిగి ఉన్నావంటే నీ స్వభావానికీ జన్మకీ సంబంధం లేదు.

యస్య భక్తిర్భగవతి హరౌ నిఃశ్రేయసేశ్వరే
విక్రీడతోऽమృతామ్భోధౌ కిం క్షుద్రైః ఖాతకోదకైః

పరమాత్మ మీద భక్తి ఉన్నవాడికి తక్కిన సాంసారిక సుఖాలు ఎందుకు. పరమాత్మ భక్తి అనే అమృత సరస్సులో మునిగిన వాడు ఊట బావిలో నీరు తీసుకుంటాడా. నీకు ఈ గెలుపూ రాజ్యం క్షుద్రములు.

శ్రీశుక ఉవాచ
ఇతి బ్రువాణావన్యోన్యం ధర్మజిజ్ఞాసయా నృప
యుయుధాతే మహావీర్యావిన్ద్రవృత్రౌ యుధామ్పతీ

ప్రపంచములో ఇలాంటి యుద్ధము ఎక్కడా జరుగలేదు. ఇద్దరూ తత్వం తెలిసిన వారే. ఇద్దరూ పరమాత్మ చేతిలో కీలుబొమ్మలే, అస్వతంత్ర్యులే.

ఆవిధ్య పరిఘం వృత్రః కార్ష్ణాయసమరిన్దమః
ఇన్ద్రాయ ప్రాహిణోద్ఘోరం వామహస్తేన మారిష

ఇలా ఇద్దరూ పరస్పర యుద్ధం చేసారు. ఎడమ చేత్తో వృత్తాస్రుడు ముద్గలాన్ని ప్రయోగించహాడు.

స తు వృత్రస్య పరిఘం కరం చ కరభోపమమ్
చిచ్ఛేద యుగపద్దేవో వజ్రేణ శతపర్వణా

వజ్రాయుధముతో ఆ పరిఘనూ ఇంకో బాహువునూ ఖండించాడు. రెండు చేతులూ తెగి, వజ్రాయుధము చేత రెక్కలు తెగిన పరవతములా భాసించాడు వృత్తాసురుడు

దోర్భ్యాముత్కృత్తమూలాభ్యాం బభౌ రక్తస్రవోऽసురః
ఛిన్నపక్షో యథా గోత్రః ఖాద్భ్రష్టో వజ్రిణా హతః

మహాప్రాణో మహావీర్యో మహాసర్ప ఇవ ద్విపమ్
కృత్వాధరాం హనుం భూమౌ దైత్యో దివ్యుత్తరాం హనుమ్

నభోగమ్భీరవక్త్రేణ లేలిహోల్బణజిహ్వయా
దంష్ట్రాభిః కాలకల్పాభిర్గ్రసన్నివ జగత్త్రయమ్

అతిమాత్రమహాకాయ ఆక్షిపంస్తరసా గిరీన్
గిరిరాట్పాదచారీవ పద్భ్యాం నిర్జరయన్మహీమ్

జగ్రాస స సమాసాద్య వజ్రిణం సహవాహనమ్
వృత్రగ్రస్తం తమాలోక్య సప్రజాపతయః సురాః
హా కష్టమితి నిర్విణ్ణాశ్చుక్రుశుః సమహర్షయః

రెండు పాదాలతో పర్వతాలనూ భూమినీ దేవతలనూ అల్లకల్లోలం చేస్తూ నోరు బాగా తెరిచి వాహనముతో కూడి ఉన్న ఇంద్రున్ని మింగేసాడు. పెద్ద కొండచిలువ ఏనుగును మింగినట్లుగా మింగేసారు. ఎంత కష్టమొచ్చిందీ అని ప్రజాపతులూ దేవతలూ అందరూ హాహాకారాలు చేసారు. అమృతం నిండి ఉన్నవాడు కాబట్టీ, పరమాత్మ తేజస్సు నిండి ఉన్నవాడు కాబట్టి ఇంద్రుడు మరణించలేదు.

నిగీర్ణోऽప్యసురేన్ద్రేణ న మమారోదరం గతః
మహాపురుషసన్నద్ధో యోగమాయాబలేన చ

నారయణ కవచ ప్రభావము వలన (మహాపురుషసన్నద్ధో ) ఇంద్రుడు కడుపులోకి వెళ్ళి తన వజ్రాయుధముతో వృత్తాసురుని కడుపు చీల్చి బయటకు వచ్చి

భిత్త్వా వజ్రేణ తత్కుక్షిం నిష్క్రమ్య బలభిద్విభుః
ఉచ్చకర్త శిరః శత్రోర్గిరిశృఙ్గమివౌజసా

వృత్తాసురుని శిరస్సును ఖండించాడు.

వజ్రస్తు తత్కన్ధరమాశువేగః కృన్తన్సమన్తాత్పరివర్తమానః
న్యపాతయత్తావదహర్గణేన యో జ్యోతిషామయనే వార్త్రహత్యే

వజ్రాయుధం కూడా వృత్తాసురుని శిరస్సు ఖండించడానికి కష్టపడింది. మంచి ముహూర్తం కోసం (కాల రూపములో ఉన్న పరమాత్మ చూపు కోసం) ఆగింది. వృత్తాసురుని సంహారానికి నక్షత్రములూ గ్రహములూ రాశులూ వీటి సమూహముతో ఉత్తమ ముహూర్తం వచ్చేదాక ఆగి అది వచ్చాక సంహరించాడు. వృత్తాసురుని ఆయువు తీరిన తరువాత సంహరించబడ్డాడు

తదా చ ఖే దున్దుభయో వినేదుర్గన్ధర్వసిద్ధాః సమహర్షిసఙ్ఘాః
వార్త్రఘ్నలిఙ్గైస్తమభిష్టువానా మన్త్రైర్ముదా కుసుమైరభ్యవర్షన్

ఆకాశములో దుందుభులు మోగాయి, అప్సరలు ఆడారు, ఇంద్రున్ని స్తోత్రం చేసారు, వృత్తఘ్న మంత్రముతో స్తోత్రం చేసారు, (మనం కూడా ఉదకశాంతి అని చేస్తాము శుభ ముహూర్తాలలో. ఆనాడు ఇంద్రుడు వృత్తాసురున్ని చంపినట్లుగా మనకొచ్చే విఘ్నములు కూడ తొలగించబడతాయి. )

వృత్రస్య దేహాన్నిష్క్రాన్తమాత్మజ్యోతిరరిన్దమ
పశ్యతాం సర్వదేవానామలోకం సమపద్యత


ఇలా ఇంద్రుడు వజ్రాయుధముతో ఖండించిన తరువాత అతని శరీరము నుండి సకల లోకములూ మిరుమిట్లూ గొలిపే తేజస్సు బయలు దేరి పరమపద లోకానికి వెళ్ళింది.

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదకొండవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
త ఏవం శంసతో ధర్మం వచః పత్యురచేతసః
నైవాగృహ్ణన్త సమ్భ్రాన్తాః పలాయనపరా నృప

వృత్తాసురుడు చెప్పిన మాటలని భయముతో వణికిపోతూ ఉన్న రాక్షసులు పట్టించుకోలేదు.

విశీర్యమాణాం పృతనామాసురీమసురర్షభః
కాలానుకూలైస్త్రిదశైః కాల్యమానామనాథవత్

కాలం దేవతలకు అనుకూలముగా ఉంది.

దృష్ట్వాతప్యత సఙ్క్రుద్ధ ఇన్ద్రశత్రురమర్షితః
తాన్నివార్యౌజసా రాజన్నిర్భర్త్స్యేదమువాచ హ

ఇది చూసి ఇంద్ర శత్రువైన వృత్తాసురునికి కోపం వచ్చింది. వారందినీ ఆపి "మీర్చ్ చేస్తున్న పని ఏంటి" అని

కిం వ ఉచ్చరితైర్మాతుర్ధావద్భిః పృష్ఠతో హతైః
న హి భీతవధః శ్లాఘ్యో న స్వర్గ్యః శూరమానినామ్

యుద్ధములో పలాయనం చేయకూడదు, పలాయనం చేస్తున్న వారిని చంపకూడదు. పారిపోవడం ఎంత అధర్మమో పారిపోతున్న వారిని చంపడం అంతకన్నా అధర్మం. మేము వీరులమని చెప్పుకునే వారెవరూ పారిపోతున్నవారిని చంపరు

యది వః ప్రధనే శ్రద్ధా సారం వా క్షుల్లకా హృది
అగ్రే తిష్ఠత మాత్రం మే న చేద్గ్రామ్యసుఖే స్పృహా

నిజముగా మీకంత భయము ఉంటే ప్రాణాల మీద ఆశలేని నన్ను చంపండి.

ఏవం సురగణాన్క్రుద్ధో భీషయన్వపుషా రిపూన్
వ్యనదత్సుమహాప్రాణో యేన లోకా విచేతసః

అన్ని లోకాలూ భయపడి వణికిపోయేలా ఒక పెద్ద సింహ నాదం చేసాడు వృత్తాసురుడు

తేన దేవగణాః సర్వే వృత్రవిస్ఫోటనేన వై
నిపేతుర్మూర్చ్ఛితా భూమౌ యథైవాశనినా హతాః

వృత్తాసుర్డు అస్త్ర శస్త్రాలేమీ ప్రయోగించలేదు. అతను గట్టిగా అరిస్తేనే సగం మంది దేవతలు పడిపోయారు. ఆ సైన్యాన్ని వృత్తాసురుడు పాదములతో తొక్కుకుంటూ వెళ్ళాడు

మమర్ద పద్భ్యాం సురసైన్యమాతురం నిమీలితాక్షం రణరఙ్గదుర్మదః
గాం కమ్పయన్నుద్యతశూల ఓజసా నాలం వనం యూథపతిర్యథోన్మదః

మదించిన ఏనుగు ఎలా అర్ణ్యాన్ని ధ్వంసం చేస్తుందో కోపించిన వృత్తాసురుడు దైవసైన్యాన్ని అలా ధ్వంసం చేసాడు.

విలోక్య తం వజ్రధరోऽత్యమర్షితః స్వశత్రవేऽభిద్రవతే మహాగదామ్
చిక్షేప తామాపతతీం సుదుఃసహాం జగ్రాహ వామేన కరేణ లీలయా

ఇలా వృత్తాసురుడు భీభత్సం చేస్తుంటే ఇంద్రుడు తన గదను పర్యోగించాడు. ఆ గదను వృత్తాసురుడు ఎడమ చేత్తో పట్టుకుని, ఆ గదతో ఐరావతాన్ని కుమంభ స్థానం మీద కొట్టాడు. వజ్రాయుధముతో కొట్టబడినట్టుగా ఆ ఐరావతం ఆ దెబ్బకు ఘీంకరించింది.

స ఇన్ద్రశత్రుః కుపితో భృశం తయా మహేన్ద్రవాహం గదయోరువిక్రమః
జఘాన కుమ్భస్థల ఉన్నదన్మృధే తత్కర్మ సర్వే సమపూజయన్నృప

ఐరావతో వృత్రగదాభిమృష్టో విఘూర్ణితోऽద్రిః కులిశాహతో యథా
అపాసరద్భిన్నముఖః సహేన్ద్రో ముఞ్చన్నసృక్సప్తధనుర్భృశార్తః

ఆ ఐరావతం వెనక్కు పరిగెత్తింది.

న సన్నవాహాయ విషణ్ణచేతసే ప్రాయుఙ్క్త భూయః స గదాం మహాత్మా
ఇన్ద్రోऽమృతస్యన్దికరాభిమర్శ వీతవ్యథక్షతవాహోऽవతస్థే

అప్పుడు ఇంద్రుడు తన అమృతహస్తముతో నిమిరేసరికి ఆ బాధంతా పోయింది ఐరావతానికి

స తం నృపేన్ద్రాహవకామ్యయా రిపుం వజ్రాయుధం భ్రాతృహణం విలోక్య
స్మరంశ్చ తత్కర్మ నృశంసమంహః శోకేన మోహేన హసన్జగాద

వజ్రాయుధాన్ని తీసుకుని ఐరావతం మీద తనతో యుద్ధానికి వచ్చిన తన సోదరున్ని చంపిన ఇంద్రున్ని చూచి వృత్తాసురుడు శోకముతో మోహముతో, కొంచెం నవ్వు నవ్వి ఇలా అన్నాడు

శ్రీవృత్ర ఉవాచ
దిష్ట్యా భవాన్మే సమవస్థితో రిపుర్యో బ్రహ్మహా గురుహా భ్రాతృహా చ
దిష్ట్యానృణోऽద్యాహమసత్తమ త్వయా మచ్ఛూలనిర్భిన్నదృషద్ధృదాచిరాత్

ఇంతకాలానికి అదృష్టం బాగుండి నీవు నా కళ్ళెదురుగా కనపడ్డావు. నీవు బ్రాహ్మణున్నీ సోదరునీ గురువునీ చంపావు (విశ్వరూపుడు). మూడు హత్యలు చేసిన నీకు ధర్మం కూడా తెలుసా. నీవు నా ముందర దొరికావు నా అదృష్టం వలన.ఇంతకాలానికి నా ఋణం తీర్చుకుంటున్నాను.

యో నోऽగ్రజస్యాత్మవిదో ద్విజాతేర్గురోరపాపస్య చ దీక్షితస్య
విశ్రభ్య ఖడ్గేన శిరాంస్యవృశ్చత్పశోరివాకరుణః స్వర్గకామః

ఏ పాపమూ చేయని వాడూ, బ్రాహ్మణుడూ, గురువూ, యజ్ఞ్యములో దీక్ష తీసుకున్నవాడు, నిరాయుధుడు అయిన విశ్వరూపున్ని దయలేనివాడవై స్వర్గాన్ని కోరి పశువును చంపినట్లు చంపావు.

శ్రీహ్రీదయాకీర్తిభిరుజ్ఝితం త్వాం స్వకర్మణా పురుషాదైశ్చ గర్హ్యమ్
కృచ్ఛ్రేణ మచ్ఛూలవిభిన్నదేహమస్పృష్టవహ్నిం సమదన్తి గృధ్రాః

ఇలాంటి పని చేసినందు వలన కీర్తీ సంపదా వినయమూ దయా పోయాయి. ఇంతవరకూ అందరూ రాక్షసులను నిందించేవారు. నీ పని వలన రాక్షసులే నయమనిపించావు. ఇలాంటి నిన్ను నా శూలముతో చీలుస్తాను. చనిపోయిన తరువాత దహహ సంస్కారాలు చేయకముందే పైన ఎదురు చూస్తున్న గ్రద్దలు భుజిస్తాయి.

అన్యేऽను యే త్వేహ నృశంసమజ్ఞా యదుద్యతాస్త్రాః ప్రహరన్తి మహ్యమ్
తైర్భూతనాథాన్సగణాన్నిశాత త్రిశూలనిర్భిన్నగలైర్యజామి

నీవే కాక ఇంకా దేవతలెవరెవరీతే నా మీద దాడి చేయడానికి వస్తారో వారిని నా శూలముతో సంహరిస్తాను. ఒక వేళ నేను త్రిశూలముతో నిన్ను చంపకముందే నన్ను నీవు చంపితే వచ్చిన పని పూర్తి చేసుకున్నందుకు పెద్దల చేత కీర్తించబడతాను. రెండు రకాలుగా నేను బ్రాతృ ఋణాన్ని తీర్చుకున్నవాడిని అవుతాను.

అథో హరే మే కులిశేన వీర హర్తా ప్రమథ్యైవ శిరో యదీహ
తత్రానృణో భూతబలిం విధాయ మనస్వినాం పాదరజః ప్రపత్స్యే

నేనింత మాట్లాడుతుంటే నీవు వజ్రాయుధాన్నెందుకు ప్రయోగించడం లేదు. ఇది వరకు నీవు ప్రయోగించిన గదలాగ నీ వజ్రాయుధం కూడా వ్యర్థమవుతుందని భయపడుతున్నాఅవా?

సురేశ కస్మాన్న హినోషి వజ్రం పురః స్థితే వైరిణి మయ్యమోఘమ్
మా సంశయిష్ఠా న గదేవ వజ్రః స్యాన్నిష్ఫలః కృపణార్థేవ యాచ్ఞా

పిసినారిని యాచించినవాడిలాగ నా మీద ప్రయోగించిన వజ్రాయుధం కూడా వ్యర్థమవుతుందని భయపడుతున్నావా.

నన్వేష వజ్రస్తవ శక్ర తేజసా హరేర్దధీచేస్తపసా చ తేజితః
తేనైవ శత్రుం జహి విష్ణుయన్త్రితో యతో హరిర్విజయః శ్రీర్గుణాస్తతః

నీ వజ్రాయుధం ధధీచి మహర్షి తేజస్సుతో శ్రీమహావిష్ణువు తేజస్సుతో నిండి ఉంది. ఇదంతా నీకు చెప్పింది శ్రీర్మహావిష్ణువే. శ్రీమహావిష్ణువు చేతా ఆజ్ఞ్యాపించబడి ఆయన తేజస్సుతో కూడి ఉన్న వజ్రాయుధముతో నన్ను సంహరించు. పరమాత్మ ఎటువైపు ఉంటాడో అటు వైపే గెలుపూ, సంపదా, మంచి గుణాలూ ఉంటాయి. అలాంటి శ్రీహరి నీవైపు ఉన్నాడు.

అహం సమాధాయ మనో యథాహ నః సఙ్కర్షణస్తచ్చరణారవిన్దే
త్వద్వజ్రరంహోలులితగ్రామ్యపాశో గతిం మునేర్యామ్యపవిద్ధలోకః

నీ వజ్రాయుధముతో నన్ను తొందరగా కొడితే నీకు సహాయము చేసిన శ్రీమహావిష్ణువు పాదములలోకి నేను ప్రవేశించి ఆయన లోకానికే వెళతాను. ఈ లోకాలన్ని వదిలి పరమాత్మ పాదముల యందు చేరుతాను.

పుంసాం కిలైకాన్తధియాం స్వకానాం యాః సమ్పదో దివి భూమౌ రసాయామ్
న రాతి యద్ద్వేష ఉద్వేగ ఆధిర్మదః కలిర్వ్యసనం సమ్ప్రయాసః

పరమాత్మను చేరిన వాడికి స్వర్గ బ్రహ్మలోకములో లేని సంపదలన్నీ చేరతాయి. ద్వేషమూ అజ్ఞ్యానమూ బాధా ఉద్వేగమూ పరమాత్మ దగ్గర ఉంటే రావు. అక్కడ ఉంటే ఉండే సంపదలలో కోటి వంతు కూడా బయట ఉండవు. అలాంటి లోకాన్ని నేను పొందుతాను.

త్రైవర్గికాయాసవిఘాతమస్మత్పతిర్విధత్తే పురుషస్య శక్ర
తతోऽనుమేయో భగవత్ప్రసాదో యో దుర్లభోऽకిఞ్చనగోచరోऽన్యైః

మూడు లోకాలలో ఉండి సంచరించిన బాధ అంతా పరమాత్మే పోగొడతాడు. అలాంటి స్థానం ఉంటేనే భగవంతుని అనుగ్రహం మనకు లభించినట్లు లెక్క. భగవంతుని దయ ఏమీ లేని వారికే దొరుకుతుంది. భగవంతుని మనం చేరాలన్నా భగవంతుడు మనని చేరాలన్నా భగవంతుని కన్నా మనకు వేరొక రక్షణం ఉండకూడదు. ఆయనను మించిన మరొక రక్షణా ఆస్తి పాస్తులూ లేనివాడి దగ్గరకే పరమాత్మ లభిస్తాడు. అలా ఏమి లేని వారికి లభించే పరమాత్మ దయ నీవు వజ్రాయుధముతో కొడితే లభిస్తుంది.

అహం హరే తవ పాదైకమూల దాసానుదాసో భవితాస్మి భూయః
మనః స్మరేతాసుపతేర్గుణాంస్తే గృణీత వాక్కర్మ కరోతు కాయః

నేను పరమాత్మ యొక్క దాసులకు దాసున్ని. నీవు వజ్రాయుధముతో కొడితే పరమాత్మ పాదమే దిక్కు అనుకునే వారికి నేను దాసున్ని అవుతాను. పరమాత్మ దాస్యం లభిస్తే పరమాత్మ దాసులకు దాసున్ని ఐతే మనస్సు పరమాత్మ యొక్క గుణములను స్మరిస్తుంది, వాక్కు పరమాత్మ నామాన్ని జపిస్తుంది, శరీరము పరమాత్మ కైంకర్యము చేస్తుంది. త్రికరణములతో పరమాత్మనే ధ్యానించాలి.

న నాకపృష్ఠం న చ పారమేష్ఠ్యం న సార్వభౌమం న రసాధిపత్యమ్
న యోగసిద్ధీరపునర్భవం వా సమఞ్జస త్వా విరహయ్య కాఙ్క్షే

ఇంద్రున్ని ముందు పెట్టుకుని పరమాత్మకే విజ్ఞ్యప్తి చేస్తున్నాడు. నిన్ను తప్ప మరి నేను దేన్నీ కోరను. స్వర్గలోకాధిపత్యం, బ్రహ్మలోకాధిపత్యం గానీ, భూలోక చక్రవర్తిత్వం గానీ, రసాతలాధిపత్యం గానీ కోరను. నిన్ను తప్ప యోగాన్ని సిద్ధినీ మోక్షాన్ని కూడా కోరను.

అజాతపక్షా ఇవ మాతరం ఖగాః స్తన్యం యథా వత్సతరాః క్షుధార్తాః
ప్రియం ప్రియేవ వ్యుషితం విషణ్ణా మనోऽరవిన్దాక్ష దిదృక్షతే త్వామ్

రెక్కలు రాని పక్షులు తమ తల్లితండ్రులు ఆహారం వెతకడానికి వెళితే అవి వారు వచ్చే వరకూ ఎదురు చూచినట్లుగా, పాలు తాగే దూడలు తమ తల్లుల కోసం ఎదురు చూస్తున్నట్లుగా, ఎడబాటు చెందిన ప్రియున్ని చేరుకోవాలని ప్రియురాలు ఎలా ఎదురు చూస్తుందో అలా నిన్ను చూడతానికి నా మనసు తహ తహ లాడుతోంది.

మమోత్తమశ్లోకజనేషు సఖ్యం సంసారచక్రే భ్రమతః స్వకర్మభిః
త్వన్మాయయాత్మాత్మజదారగేహేష్వాసక్తచిత్తస్య న నాథ భూయాత్

నాకు మోక్షము కూడా ఇవ్వకరలేదు, నాకు సంసారములో ఉంచి నా మన్సును భార్యా పిల్లలలో లగ్నమయ్యేట్లుగా చేయకు. నిరంతరం నీ భక్తులతో స్నేహం ఉండేట్లు చేయి. శరీరమూ భార్యా బంధువులూ ఇలూ సంపదా, మొదలైన వాటి యందు మనసు ఉండకుండా నీ భక్తుల యందు స్నేహం ఉండే జన్మలు ఎన్ని ఇచ్చినా నాకు ఇష్టమే. నీవు జ్ఞ్యాపకం ఉండే జన్మలు ఎన్ని వచ్చినా నాకు ఫర్వాలేదు. ఇది నేను కోరుతున్నాను.

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం పదవ అధ్యాయం

శ్రీబాదరాయణిరువాచ
ఇన్ద్రమేవం సమాదిశ్య భగవాన్విశ్వభావనః
పశ్యతామనిమేషాణాం అత్రైవాన్తర్దధే హరిః

ఈ విధముగా చెప్పి ఆ దేవతలందరూ చూస్తుండగానే శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు

తథాభియాచితో దేవైరృషిరాథర్వణో మహాన్
మోదమాన ఉవాచేదం ప్రహసన్నివ భారత

పరమాత్మ చెప్పినట్లు దేవతలందరూ ధధీచి వద్దకు వెళ్ళి ధధీచి శరీరాన్ని అడిగితే వారి మాటలు అంగీకరిస్తున్నట్లుగానే నవ్వుతూ

అపి వృన్దారకా యూయం న జానీథ శరీరిణామ్
సంస్థాయాం యస్త్వభిద్రోహో దుఃసహశ్చేతనాపహః

మీకు మరణ లేదు కాబట్టి మరణం వలన శరీరానికి కలిగే బాధ మీకు తెలియదు. శరీరము కలవానికి శరీరముకోసం జరిగే హాని మీకు తెలియదు. శరీరములోంచి ప్రాణం వెళ్ళిపోవడం ఎంత దుస్సహమో మీకు తెలియదు.

జిజీవిషూణాం జీవానామాత్మా ప్రేష్ఠ ఇహేప్సితః
క ఉత్సహేత తం దాతుం భిక్షమాణాయ విష్ణవే

ప్రతీ ప్రాణీ బ్రతకాలనే కోరుతుంది. శరీరము మీద ప్రీతి అలాంటిది. శరీరం అన్నిటికంటే ఇష్టమైనది (ఆత్మా ప్రేష్ఠ). అలాంటి శరీరాన్ని పరమాత్మే వచ్చి అడిగినా ఎవరు ఇస్తారు?

శ్రీదేవా ఊచుః
కిం ను తద్దుస్త్యజం బ్రహ్మన్పుంసాం భూతానుకమ్పినామ్
భవద్విధానాం మహతాం పుణ్యశ్లోకేడ్యకర్మణామ్

మీరు చెప్పినది నిజమే. కానీ భూత దయ కల వారికి వదిలిపెట్టరానిది ఏమైనా ఉందా. మీరు మహానుభావులు. పవిత్రులైన మహానుభావుల చేత కొనియాడబడే కర్మలు చేసే వారు.

నూనం స్వార్థపరో లోకో న వేద పరసఙ్కటమ్
యది వేద న యాచేత నేతి నాహ యదీశ్వరః

అడిగిన దాన్ని కాదంటే ఎదుటివారు ఎంత బాధపడతారో స్వార్థపరులు తెలుసుకోలేరు.  ఒక వేళ సమర్ధుడైన వాడైతే యాచించిన వాడికి లేదంటాడా. లేదంటే వాడూ స్వార్థపరుడే కదా.

శ్రీఋషిరువాచ
ధర్మం వః శ్రోతుకామేన యూయం మే ప్రత్యుదాహృతాః
ఏష వః ప్రియమాత్మానం త్యజన్తం సన్త్యజామ్యహమ్

మీ నుండి ధర్మం విందామనే నేను అలా అన్నాను. మీరడిగిన దాన్ని నేను కాదనట్లేదు. ఇప్పుడు నా శరీరము మీద నాకంటే మీకే ఎక్కువ ఇష్టము.

యోऽధ్రువేణాత్మనా నాథా న ధర్మం న యశః పుమాన్
ఈహేత భూతదయయా స శోచ్యః స్థావరైరపి

వివేకం కలవాడు అనిత్యమైన శరీరముతో నిత్యమైన కీర్తిని సంపాదించుకుంటాడు. ధర్మాన్ని కీర్తిని ఆశించకుండా భూతదయతో సహాయం చేయకపోతే చేతనమున్నవే కాదు, చేతనములేని కొండలూ గుట్టలు కూడా అలాంటి వాడిని చూచి జాలిపడతాయి.

ఏతావానవ్యయో ధర్మః పుణ్యశ్లోకైరుపాసితః
యో భూతశోకహర్షాభ్యామాత్మా శోచతి హృష్యతి

ఇదే అవ్యయమైన ధర్మం. ప్రాణులు సుఖ పడితే సుఖపడడం, దుఃఖపడుతుంటే దుఃఖించడం పుణ్యశ్లోకులచే సేవించబడిన ధర్మం

అహో దైన్యమహో కష్టం పారక్యైః క్షణభఙ్గురైః
యన్నోపకుర్యాదస్వార్థైర్మర్త్యః స్వజ్ఞాతివిగ్రహైః

ఎత్న దైన్యం ఏర్పడింది, ఎంత బాధ కలిగింది. శరీరం మనది అని చెప్పగలమా. అలా ఐతే ఎవరైనా శరీరానికి రోగం రావాలని కోరకుంటారా, శరీరం పోవాలని కోరుకుంటారా. శరీరమూ ప్రాణమూ రెండూ మనవి కావు. మనవి కానప్పుడు, మనం ఉండమన్నా ఉండనప్పుడు ఆ శరీరాన్ని ఇతరులకు ఉపకరించేట్లు ఉపయోగపడాలి. పరార్థములైన ప్రాణములతో స్వార్థపరుడైన మానవుడు భూతములను కాపాడకుంటే అపకీర్తి పొందుతాడు. జ్ఞ్యాతులతో బంధువులతో తోటివారితో బ్రతకడానికి విరోధం పెట్టుకుంటాడు. ఇంతటి వ్యామోహముతో విరోధం పెట్టుకున్నా వ్యాధులూ ఆప్దలూ రాకుండా ఉంటున్నాయా? అవి ఎప్పుడూ పరార్థములే ఐతే మానవుడెందుకు స్వార్థముగా ఉండాలి.

శ్రీబాదరాయణిరువాచ
ఏవం కృతవ్యవసితో దధ్యఙ్ఙాథర్వణస్తనుమ్
పరే భగవతి బ్రహ్మణ్యాత్మానం సన్నయన్జహౌ

ఇలా నిర్ణ్యించుకుని తన మనసునీ ఆత్మనూ పరమాత్మ యందు నిలిపి యోగ ధారణతో శరీరాన్ని విడిచిపెట్టాడు.

యతాక్షాసుమనోబుద్ధిస్తత్త్వదృగ్ధ్వస్తబన్ధనః
ఆస్థితః పరమం యోగం న దేహం బుబుధే గతమ్

యోగములో ఉండి శరీరాన్ని విడిచిపెట్టాడన్న సంగతి కూడా తెలియకనే శరీరాన్ని విడిచిపెట్టాడు. ఇంద్రియములనూ మనసునూ బుద్ధినీ నియమించుకుని తత్వమును చూడగలిగిన ధధీచి పాపపుణ్యముల రెంటినీ నశింపచేసుకున్నవాడై పరమయోగమును పొంది శరీరాన్ని విడిచిపెట్టినట్లు కూడా తెలుసుకోలేదు.

అథేన్ద్రో వజ్రముద్యమ్య నిర్మితం విశ్వకర్మణా
మునేః శక్తిభిరుత్సిక్తో భగవత్తేజసాన్వితః

అప్పుడు అతని ఎముకలతో విశ్వకర్మ వజ్రాయుధాన్ని సిద్ధం చేసి అందులో పరమాత్మ తేజస్సు కూడా నిక్షిప్తమాయ్యాక

వృతో దేవగణైః సర్వైర్గజేన్ద్రోపర్యశోభత
స్తూయమానో మునిగణైస్త్రైలోక్యం హర్షయన్నివ

దేవతలందరూ చుట్టుముట్టగా ఐరావతం మీద కూర్చుని ఋషులందరూ స్తోత్రం చేస్తే మూడు లోకాలూ సంతోషిస్తుంటే

వృత్రమభ్యద్రవచ్ఛత్రుమసురానీకయూథపైః
పర్యస్తమోజసా రాజన్క్రుద్ధో రుద్ర ఇవాన్తకమ్

రాక్షస సైన్యముతో కూడి ఉన్న వృత్తాసురునికొరకు కోపించిన రుద్రుడు యముని మీదకు ఉరికినట్లుగా వెళ్ళాడు (మార్కండేయ ఉపాఖ్యానం)

తతః సురాణామసురై రణః పరమదారుణః
త్రేతాముఖే నర్మదాయామభవత్ప్రథమే యుగే

అలా దేవతలకూ రాక్షసులకూ మహాభయంకరమైన యుద్ధం మొదటి మహాయుగములో మొదటి కృతయుగ చివరా (త్రేతా యుగం ప్రారంభములో) నర్మదా నదీ తీరములో జరిగింది

రుద్రైర్వసుభిరాదిత్యైరశ్విభ్యాం పితృవహ్నిభిః
మరుద్భిరృభుభిః సాధ్యైర్విశ్వేదేవైర్మరుత్పతిమ్

వసు (8) రుద్ర (11) ఆదిత్య (12) అశ్వినుల్లు (2) పితృదేవతలూ అగ్ని దేవతలూ మరుత్తులూ ఋభులు సాధ్యులు విశ్వేదేవతలతో కలిసి

దృష్ట్వా వజ్రధరం శక్రం రోచమానం స్వయా శ్రియా
నామృష్యన్నసురా రాజన్మృధే వృత్రపురఃసరాః

వజ్రాయుధం ధరించి ఐరావతం మీద ఉన్న ఇంద్రున్ని చూసి యుద్ధములో వృత్తాసురునీ ముందు ఉంచుకున్న రాక్షసులు ఇంద్రుని తేజస్సు చూసి సహించలేకపోయారు

నముచిః శమ్బరోऽనర్వా ద్విమూర్ధా ఋషభోऽసురః
హయగ్రీవః శఙ్కుశిరా విప్రచిత్తిరయోముఖః

పులోమా వృషపర్వా చ ప్రహేతిర్హేతిరుత్కలః
దైతేయా దానవా యక్షా రక్షాంసి చ సహస్రశః

సుమాలిమాలిప్రముఖాః కార్తస్వరపరిచ్ఛదాః
ప్రతిషిధ్యేన్ద్రసేనాగ్రం మృత్యోరపి దురాసదమ్

రాక్షసులు బంగారు వస్త్రములు కట్టుకుని మృత్యువుకు కూడా అందరాని ఇంద్ర సైన్యాన్ని మదముతో సింహనాదం చేస్తూ వీళ్ళారు

అభ్యర్దయన్నసమ్భ్రాన్తాః సింహనాదేన దుర్మదాః
గదాభిః పరిఘైర్బాణైః ప్రాసముద్గరతోమరైః

శూలైః పరశ్వధైః ఖడ్గైః శతఘ్నీభిర్భుశుణ్డిభిః
సర్వతోऽవాకిరన్శస్త్రైరస్త్రైశ్చ విబుధర్షభాన్

న తేऽదృశ్యన్త సఞ్ఛన్నాః శరజాలైః సమన్తతః
పుఙ్ఖానుపుఙ్ఖపతితైర్జ్యోతీంషీవ నభోఘనైః

ఒకరి మీదకొకరు అనేకమైన ఆయుధాలనూ శస్త్రములనూ అస్త్రములనూ పరస్పరం విడిచారు. ఇలా బాణాలు ఆకాశమంతా కప్పగా ఎవరు ఎవరిని కొట్టుకుంటున్నారో తెలియడం లేదు. ఒకరితో ఒకరు దెబ్బలు తిన్నారు.

న తే శస్త్రాస్త్రవర్షౌఘా హ్యాసేదుః సురసైనికాన్
ఛిన్నాః సిద్ధపథే దేవైర్లఘుహస్తైః సహస్రధా

ఒకరినొకరు హింసించారు.

అథ క్షీణాస్త్రశస్త్రౌఘా గిరిశృఙ్గద్రుమోపలైః
అభ్యవర్షన్సురబలం చిచ్ఛిదుస్తాంశ్చ పూర్వవత్

తానక్షతాన్స్వస్తిమతో నిశామ్య శస్త్రాస్త్రపూగైరథ వృత్రనాథాః
ద్రుమైర్దృషద్భిర్వివిధాద్రిశృఙ్గైరవిక్షతాంస్తత్రసురిన్ద్రసైనికాన్

శస్త్రాస్త్రముల కంటే రాక్షసులు గుట్టలను చెట్లను తీసుకుని రాక్షసులు దేవతలతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. ఇలా పరస్పరం కొట్టుకున్నారు. రాక్షసులు చేసిన అన్ని ప్రయత్నములూ దేవతల విషయములో వ్యర్థములైపోయాయి

సర్వే ప్రయాసా అభవన్విమోఘాః కృతాః కృతా దేవగణేషు దైత్యైః
కృష్ణానుకూలేషు యథా మహత్సు క్షుద్రైః ప్రయుక్తా ఊషతీ రూక్షవాచః

పరమాత్మ యందు భక్తి ఉన్న వారి మీద దుర్మార్గులు ప్రయోగించే దుష్ట వాకులు ఎలా వ్యర్థమవుతాయో ఆలా దేవతల మీద రాక్షసులు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి.

తే స్వప్రయాసం వితథం నిరీక్ష్య హరావభక్తా హతయుద్ధదర్పాః
పలాయనాయాజిముఖే విసృజ్య పతిం మనస్తే దధురాత్తసారాః

ఇది చూసి ఇంక మేము యుద్ధం చేయలేమని రాక్షసులు వృత్తాసురున్ని కూడా లెక్క చేయక పారిపోవడం మొదలుపెట్టారు.

వృత్రోऽసురాంస్తాననుగాన్మనస్వీ ప్రధావతః ప్రేక్ష్య బభాష ఏతత్
పలాయితం ప్రేక్ష్య బలం చ భగ్నం భయేన తీవ్రేణ విహస్య వీరః

భయపడి పారిపోతున్నవారిని చూచి నవ్వుతూ ఇలా అన్నాడు.

కాలోపపన్నాం రుచిరాం మనస్వినాం జగాద వాచం పురుషప్రవీరః
హే విప్రచిత్తే నముచే పులోమన్మయానర్వన్ఛమ్బర మే శృణుధ్వమ్

మీరు నా మాట వినండి.

జాతస్య మృత్యుర్ధ్రువ ఏవ సర్వతః ప్రతిక్రియా యస్య న చేహ క్లృప్తా
లోకో యశశ్చాథ తతో యది హ్యముం కో నామ మృత్యుం న వృణీత యుక్తమ్

పుట్టినవాడికి ఎప్పుడో ఒకప్పుడు మృత్యువు సిద్ధముగా ఉంటుంది. మృత్యువును ఆపగలిగే ప్రతీకారం ఏది లేదు. ధర్మమూ కీర్తీ ప్రతిష్ట అన్నీ వస్తుంటే తెలిసినవాడెవడైనా వాటికోసం చావును వరిస్తాడా పరిహరిస్తాడా. తెలిసినవాడెవడూ మృత్యువును వరించకుండా ఉండడు.

ద్వౌ సమ్మతావిహ మృత్యూ దురాపౌ యద్బ్రహ్మసన్ధారణయా జితాసుః
కలేవరం యోగరతో విజహ్యాద్యదగ్రణీర్వీరశయేऽనివృత్తః

మృత్యువు ఎలాగూ తప్పదు. ఆ మృత్యువులో రెండు రకములైన మృత్యువులు శ్రేష్టం. పరమాత్మ మీద మనసు పెట్టి యోగములో శరీరం విడుచుట, శత్రువుకు ఎదురుగా నిలబడి విడుచుట. ఇవి ఉత్తమములైన మరణములు. ఆల అయాచితముగా మరణం లభిస్తే పారిపోవడం ధర్మమా?

Wednesday, April 10, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం తొమ్మిదవ అధ్యాయం


శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తస్యాసన్విశ్వరూపస్య శిరాంసి త్రీణి భారత
సోమపీథం సురాపీథమన్నాదమితి శుశ్రుమ

ఏ విశ్వరూపుని వలన ఇంద్రుడు రాక్షసులను గెలిచి త్రైలోక్య రాజ్యం పొందాడో అతనికి మూడు తలకాయలు. ఒక తలకాయ సోమరసాన్ని పానం చేస్తూ ఉంటుంది, ఇంకో తలకాయ అన్నం తింటుంది అని విన్నాము. అంటే ఇంత జ్ఞ్యానం సంపాదించి కూడా భోగమునకే ప్రాధాన్యం. మనం కూడా ఇంతే..

స వై బర్హిషి దేవేభ్యో భాగం ప్రత్యక్షముచ్చకైః
అదదద్యస్య పితరో దేవాః సప్రశ్రయం నృప

ఇంద్రునికి రాజ్యం రాగానే భగవంతునికి కృతజ్ఞ్యతగా ఒక యజ్ఞ్యం చేసి ప్రాచీనాగ్ర దర్భలను పరచి ఆహుతులను ఇస్తున్నాడు. దేవతల ఆహుతులను పితృస్థానములో ఉన్న వారికి స్పష్టముగా వినయముగా పెద్దగా ఆహుతులిస్తున్నాడు

స ఏవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ప్రతి
యజమానోऽవహద్భాగం మాతృస్నేహవశానుగః

మాత్రే వంశం (దితి) వారైన రాక్షసులకు చాటుగా ఆహుతులిస్తున్నాడు తల్లి మీద ప్రేమతో

తద్దేవహేలనం తస్య ధర్మాలీకం సురేశ్వరః
ఆలక్ష్య తరసా భీతస్తచ్ఛీర్షాణ్యచ్ఛినద్రుషా

ఇది ధర్మము కాదు, దేవహేళనం చేస్తున్నాడని దేవతలు తెలుసుకున్నారు. దేవతలకు జరిగిన అవమానం తెలుసుకుని ఇంద్రుడు ఆయన తలలను నరికేసాడు. ఒక శిరస్సు కపిజరం అనే పక్షిగా సోమ శిరస్సు, కలజింక పక్షిగా సోమ శిరస్సు, తిత్తిరి పక్షిగా అన్నం శిరస్సు అయి ఇంద్రున్ని వెంటాడాయి. బ్రహ్మ హత్యకు ఇంద్రుడు శిరస్సు వంచి స్వీకరించాడు. సంవత్సరము అనుభవించాడు.

సోమపీథం తు యత్తస్య శిర ఆసీత్కపిఞ్జలః
కలవిఙ్కః సురాపీథమన్నాదం యత్స తిత్తిరిః

బ్రహ్మహత్యామఞ్జలినా జగ్రాహ యదపీశ్వరః
సంవత్సరాన్తే తదఘం భూతానాం స విశుద్ధయే
భూమ్యమ్బుద్రుమయోషిద్భ్యశ్చతుర్ధా వ్యభజద్ధరిః

భూమిస్తురీయం జగ్రాహ ఖాతపూరవరేణ వై
ఈరిణం బ్రహ్మహత్యాయా రూపం భూమౌ ప్రదృశ్యతే

తరువాత ఇంద్రుడు ఆ పాపాన్ని నలుగురికి పంచాడు భూమికీ వృక్షమునకూ జలమునకూ స్త్రీలకు. నాలగవ భాగాన్ని భూమి తీసుకుంది

తుర్యం ఛేదవిరోహేణ వరేణ జగృహుర్ద్రుమాః
తేషాం నిర్యాసరూపేణ బ్రహ్మహత్యా ప్రదృశ్యతే

అలా తీసుకున్నందుకు "తవ్విన ప్రదేశం మళ్ళీ పూడుకుని పోవాలి" అన్న వరం తీసుకుంది. బ్రహ్మ హత్యా పాతకం భూమిలో పుండుగా (ఊభి) మారింది. దీన్ని కర్బుదం అంటారు. చెట్టును నరికినా కొన్నాళ్ళకు మళ్ళీ అది చిగురిస్తుంది. ఆ వరాన్ని తీసుకుని చెట్లు నాలగవ భాగం తీసుకున్నాయి. చెట్టు నుండి వచ్చే జిగురు రూపములో బ్రహ్మ హత్య ఉంటుంది. సంతానం కలిగిన తరువాత కూడా మాకు భర్తృ సంగమ అభిలాష ఉండాలి అని వరం తీసుకుని స్త్రీలు ఇంకో నాలగవ వంతు భాగం తీసుకున్నారు. ఇది వారికి మాసిక ధర్మము రూపములో కనపడుతుంది. బ్రహ్మ హత్య కాబట్టే ఆ రోజులలో తాకకూడదంటారు. ఊట అనే వరం తీసుకుని జలం మిగిలిన నాలగవ వంతు పాపం తీసుకున్నాయి. బ్రహ్మ హత్య బుడగల రూపములో కనపడుతుంది. అందుకే బుడగలు ఉన్న నీరు పనికి రాదు.

శశ్వత్కామవరేణాంహస్తురీయం జగృహుః స్త్రియః
రజోరూపేణ తాస్వంహో మాసి మాసి ప్రదృశ్యతే

ద్రవ్యభూయోవరేణాపస్తురీయం జగృహుర్మలమ్
తాసు బుద్బుదఫేనాభ్యాం దృష్టం తద్ధరతి క్షిపన్

హతపుత్రస్తతస్త్వష్టా జుహావేన్ద్రాయ శత్రవే
ఇన్ద్రశత్రో వివర్ధస్వ మా చిరం జహి విద్విషమ్

త్వష్ట, తన కుమారుడిని చంపినందుకు, ఇంద్రున్ని చంపే వాడు కొడుకుగా రావాలని యజ్ఞ్యం మొదలుపెట్టి "ఇంద్ర శత్రువుగా పెరుగు" అని మంత్రాన్ని చదివాడు . అతను మంత్రం చదవగానే యజ్ఞ్య కుండమునుంచి ఒకడు ఆవిర్భవించాడు. ప్రతీ రోజు మూడు అడుగుల (బాణమంత) పెరుగుతూ, సంద్యాకలములో కాలిన మబ్బులా ఉన్నాడు. కాలిన రాగిలాంటి శిఖలూ మీసములూ . మధ్యాన్న సూర్యుని ప్రకాశము గలవాడై, ప్రకాశించే  శూలముతో నాట్యం చేస్తూ గర్ఝిస్తూ ఉన్నాడు. ఆకాశాన్నే తాగుతున్నట్లు నోరు తెరిచి, నాలుకతో నక్షత్రాలను నాకేస్తూ, నోటితో లోకాలను మింగేస్తూ, దన్ష్ట్రలో లోకాలు లోపలకు పోయేట్లు ఆవాలిస్తూ,ఉండగా దేవతలందరూ భయపడి అన్ని దిక్కులకూ పారిపోయారు. అన్ని లోకాలకూ ఆవరించాడు కాబట్టి అతనిపేరు వృత్తుడు. ఇతను పాపి మహాభయంకరుడు. దేవతలు అతన్ని చంపడానికి వచ్చి కొడుతున్నారు. దేవతలు ప్రయోగించే  దివ్యాయుధాలను మింగేస్తున్నాడు. తమ ఆయుధాలూ తేజస్సు బలమూ మింగేసాడు.

అథాన్వాహార్యపచనాదుత్థితో ఘోరదర్శనః
కృతాన్త ఇవ లోకానాం యుగాన్తసమయే యథా

విష్వగ్వివర్ధమానం తమిషుమాత్రం దినే దినే
దగ్ధశైలప్రతీకాశం సన్ధ్యాభ్రానీకవర్చసమ్

తప్తతామ్రశిఖాశ్మశ్రుం మధ్యాహ్నార్కోగ్రలోచనమ్

దేదీప్యమానే త్రిశిఖే శూల ఆరోప్య రోదసీ
నృత్యన్తమున్నదన్తం చ చాలయన్తం పదా మహీమ్

దరీగమ్భీరవక్త్రేణ పిబతా చ నభస్తలమ్
లిహతా జిహ్వయర్క్షాణి గ్రసతా భువనత్రయమ్

మహతా రౌద్రదంష్ట్రేణ జృమ్భమాణం ముహుర్ముహుః
విత్రస్తా దుద్రువుర్లోకా వీక్ష్య సర్వే దిశో దశ

యేనావృతా ఇమే లోకాస్తపసా త్వాష్ట్రమూర్తినా
స వై వృత్ర ఇతి ప్రోక్తః పాపః పరమదారుణః

తం నిజఘ్నురభిద్రుత్య సగణా విబుధర్షభాః
స్వైః స్వైర్దివ్యాస్త్రశస్త్రౌఘైః సోऽగ్రసత్తాని కృత్స్నశః

తతస్తే విస్మితాః సర్వే విషణ్ణా గ్రస్తతేజసః
ప్రత్యఞ్చమాదిపురుషముపతస్థుః సమాహితాః

శ్రీదేవా ఊచుః
వాయ్వమ్బరాగ్న్యప్క్షితయస్త్రిలోకా బ్రహ్మాదయో యే వయముద్విజన్తః
హరామ యస్మై బలిమన్తకోऽసౌ బిభేతి యస్మాదరణం తతో నః

సకల చరాచర లోకములూ జగత్తులూ బ్రహ్మాదులూ మేమూ ఎవరికి భయపడి పూజ చేస్తామో

అవిస్మితం తం పరిపూర్ణకామం స్వేనైవ లాభేన సమం ప్రశాన్తమ్
వినోపసర్పత్యపరం హి బాలిశః శ్వలాఙ్గులేనాతితితర్తి సిన్ధుమ్

అటువంటి అన్ని కోరికలూ తీరిన స్వామి అయిన పరమాత్మను కాక ఇంకొకరిని ఆరాధించేవాడు కుక్క తోక పట్టుకుని సముద్రమును దాటినట్లు అవుతుంది.

యస్యోరుశృఙ్గే జగతీం స్వనావం మనుర్యథాబధ్య తతార దుర్గమ్
స ఏవ నస్త్వాష్ట్రభయాద్దురన్తాత్త్రాతాశ్రితాన్వారిచరోऽపి నూనమ్

మత్స్యావతారములో చేప కొమ్ములో భూమి పడవగా మారగా, భూమిని కట్టి సత్యవ్రతుడిని ప్రళయకాలమంతా అతన్ని పడవలో ధరించి, ప్రళయకాల భయాన్ని నావలో తొలగించాడు. అటువంటి మత్స్యమూర్తి ఈ త్వాష్ట్ర భయాన్ని తొలగించాలి.

పురా స్వయమ్భూరపి సంయమామ్భస్యుదీర్ణవాతోర్మిరవైః కరాలే
ఏకోऽరవిన్దాత్పతితస్తతార తస్మాద్భయాద్యేన స నోऽస్తు పారః

పరమాత్మ నాభి పద్మములో పుట్టిన బ్రహ్మను సముద్ర తరంగముల నుండి పద్మాన్ని పడిపోకుండా కాపాడిన పరమాత్మ మమ్ము కాపాడు గాక. ఎవరు ఈ ప్రపంచాన్ని సృష్టించాడో దానిని అనుసరించి మేము సృష్టి చేస్తున్నాము

య ఏక ఈశో నిజమాయయా నః ససర్జ యేనానుసృజామ విశ్వమ్
వయం న యస్యాపి పురః సమీహతః పశ్యామ లిఙ్గం పృథగీశమానినః

మాలో ప్రతీ ఒక్కరమూ మేమే నాయకులమని భావిస్తున్నాము. మాకీ అధికారాన్నిచ్చినవారిని మరచిపోతున్నాము.

యో నః సపత్నైర్భృశమర్ద్యమానాన్దేవర్షితిర్యఙ్నృషు నిత్య ఏవ
కృతావతారస్తనుభిః స్వమాయయా కృత్వాత్మసాత్పాతి యుగే యుగే చ

శత్రువులతో మాటి మాటికీ పీడించబడుతున్న మేము దేవతలూ ఋషులూ పశుపక్ష్యాదులూ మానవులలో నిత్యమూ బాధపడుతున్నవారికి నీవు ఈ నాలిగింటిగా పుట్టావు. దేవతగా ఋషిగా మానవుడుగా పశు పక్షాదులుగా పుట్టావు. ప్రతీ యుగములో ఆయా అవతారాలుగా వచ్చి మమ్ము కాపాడుతున్నాడు

తమేవ దేవం వయమాత్మదైవతం పరం ప్రధానం పురుషం విశ్వమన్యమ్
వ్రజామ సర్వే శరణం శరణ్యం స్వానాం స నో ధాస్యతి శం మహాత్మా

నీవే ప్రధానం నీవే ప్రకృతి నీవే పరుడివి నీవే అన్యం. నిన్ను మేము శరణు వేడుతున్నాము. నీవు మహానుభావుడివి కాబట్టి నీవారికి శుభం కలిగిస్తావు.

శ్రీశుక ఉవాచ
ఇతి తేషాం మహారాజ సురాణాముపతిష్ఠతామ్
ప్రతీచ్యాం దిశ్యభూదావిః శఙ్ఖచక్రగదాధరః

ఇలా స్తోత్రం చేస్తే పశ్చిమ దిక్కులో వారికి కనిపించాడు. పదహారు విభూతులతో కనపడ్డాదు. ఆయనకు పద్దెనిమిది విభూతులు. శ్రీవత్సం కౌస్తుభం లేకుండా వచ్చాడు.

ఆత్మతుల్యైః షోడశభిర్వినా శ్రీవత్సకౌస్తుభౌ
పర్యుపాసితమున్నిద్ర శరదమ్బురుహేక్షణమ్

వికసించిన శర్త్కాల పద్మము వంటి నేత్రము గల స్వామిని చూచి

దృష్ట్వా తమవనౌ సర్వ ఈక్షణాహ్లాదవిక్లవాః
దణ్డవత్పతితా రాజఞ్ఛనైరుత్థాయ తుష్టువుః

ఆ సంతోషముతో భూమి మీద పడి సాష్టాంగ నమస్కారం చేసారు

శ్రీదేవా ఊచుః
నమస్తే యజ్ఞవీర్యాయ వయసే ఉత తే నమః
నమస్తే హ్యస్తచక్రాయ నమః సుపురుహూతయే

నీవు యజ్ఞ్య వీరుడవు, అన్ని రకముల పక్షులకూ అవస్థలకూ మూలం. నీవు పురుహూతుడవు (మొదలు పిలవబడినవాడు). అటువంటి నీకు నమస్కారం. అగ్ర పూజను నీవే అందుకుంటావు

యత్తే గతీనాం తిసృణామీశితుః పరమం పదమ్
నార్వాచీనో విసర్గస్య ధాతర్వేదితుమర్హతి

మూడు లోకములూ మూడు స్థానములు మూడు గతులను శాసించేవాడవు. సృష్టి తరువాత లేని వాడవు (పుట్టుక లేని వాడవు). నీవంటి వారిని మేము తెలియలేము

ఓం నమస్తేऽస్తు భగవన్నారాయణ వాసుదేవాదిపురుష మహాపురుష మహానుభావ పరమమఙ్గల
పరమకల్యాణ పరమకారుణిక కేవల జగదాధార లోకైకనాథ సర్వేశ్వర లక్ష్మీనాథ
పరమహంసపరివ్రాజకైః పరమేణాత్మయోగసమాధినా
పరిభావితపరిస్ఫుటపారమహంస్యధర్మేణోద్ఘాటితతమఃకపాటద్వారే చిత్తేऽపావృత ఆత్మలోకే
స్వయముపలబ్ధనిజసుఖానుభవో భవాన్

అన్ని విడిచ్పెట్టిన మహానుభావుల చేత సర్వోత్కృష్టమైన సమాధిలో స్పష్టముగా ప్రకాశింపచేసే సకల ధర్మ పరిత్యాగముతో పరమాత్మను సాక్షాత్కరించుకునే వారికి అజ్ఞ్యానాన్ని తొలగించి జ్ఞ్యానాన్ని ప్రసాదించిన వాడా. మనసులో అజ్ఞ్యానాన్ని తొలగించి నీ స్వరూపాన్ని మాకు సాక్షాత్కరింపచేసే వాడా. నీ పనులూ విహారం మాకు అర్థం కావు.
మనసు యందు అజ్ఞ్యానాన్ని తొలగించి ఆత్మలోకములో తనకు తానుగా తన స్వరూపాన్ని మాకు సాక్షాత్కరింపచేసే వాడివి.

దురవబోధ ఇవ తవాయం విహారయోగో యదశరణోऽశరీర ఇదమనవేక్షితాస్మత్సమవాయ
ఆత్మనైవావిక్రియమాణేన సగుణమగుణః సృజసి పాసి హరసి

ఏ గుణములూ లేని నీవు గుణములు గల ప్రకృతిని సృష్టిస్తున్నావు రక్షిస్తున్నావు, నశింపచేస్తున్నావు. సృష్టి చేసే నీకు ఎలాంటి వికారము, గుణమూ ఉండదు. కానీ సృష్టిలో అన్ని రకాల వికారాలూ, గుణాలూ ఉంటాయి

అథ తత్ర భవాన్కిం దేవదత్తవదిహ గుణవిసర్గపతితః పారతన్త్ర్యేణ స్వకృతకుశలాకుశలం
ఫలముపాదదాత్యాహోస్విదాత్మారామ ఉపశమశీలః సమఞ్జసదర్శన ఉదాస్త ఇతి హ వావ న విదామః

లోకములో సామాన్య జీవునిలా సృష్టించిన దాని ఫలమును అనుభవిస్తావా, లేక వైరాగ్యం పొందిన యతిలా ఉంటావా, అని మాకు అర్థం కాదు. నీ సృష్టిలో జీవునిలా ఫలితాన్ని అనుభవిస్తావా, నీ సృష్టిలో యతిలాగ ఫలమును ఆశించవా?

న హి విరోధ ఉభయం భగవత్యపరిమితగుణగణ ఈశ్వరేऽనవగాహ్యమాహాత్మ్యే
ऽర్వాచీనవికల్పవితర్కవిచారప్రమాణాభాసకుతర్కశాస్త్రకలిలాన్తఃకరణాశ్రయదురవగ్రహవాదినాం
వివాదానవసర ఉపరతసమస్తమాయామయే కేవల ఏవాత్మమాయామన్తర్ధాయ కో న్వర్థో దుర్ఘట ఇవ భవతి
స్వరూపద్వయాభావాత్

నీలో రెండూ కనపడుతున్నాయి. నీవు చేసే సృష్టి స్థ్తి లయములు వైరాగ్యములో భాగమా? అనుభవములో భాగమా. పరమాత్మలో ఏ గుణము వ్యాపిస్తుందో మాకు అర్థం కాదు. నీ సృష్తి వ్యాపారం తెలియాలంటే వికల్పం  (అదా ఇదా అన్న ఆలోచన) వితర్కం  (ఊహ) విచారం (ఆలోచన) ప్రమాణము, కుతర్కం (లోకములో కర్తలకు పుట్టుకా చావూ ఉన్నట్లు భగవంతునికీ ఉంటాయి అని వాదించడం) మొదలైన వాటితో వాదించే వారికి,అలాంటి వివాదాలతో సంబంధం లేకుండా వారికి అర్థం కాని మాయకు ఆశ్రయముగా ఉన్న నీవు, నీ మాయను నీవే సృష్టించి అంతర్థానం చేస్తావు.

సమవిషమమతీనాం మతమనుసరసి యథా రజ్జుఖణ్డః సర్పాదిధియామ్

అలాంటి నీ విషయములో "చేయలేనిది" అని ఏమి ఉంటుంది. నీవు కూడా మా ఆలోచనలను అనుసరిస్తావు . చీకట్లో తాడుని చూసి పామనుకొని పామును చూసినప్పుడు కలగాల్సిన భావనలు కలుగుతాయి. అలాగే మాయతో ఇలాంటి వన్నీ కలుగుతాయి. నీవు అన్నిటిలో ఉంటావు. ఎందులోనూ ఉండవు. అన్నిటినీ సృష్టిస్తావు, ఏ దోషమూ నీకంటదు.

స ఏవ హి పునః సర్వవస్తుని వస్తుస్వరూపః సర్వేశ్వరః సకలజగత్కారణకారణభూతః
సర్వప్రత్యగాత్మత్వాత్సర్వగుణాభాసోపలక్షిత ఏక ఏవ పర్యవశేషితః

ఇకాడ ఏ తర్కమూ పని చేయదు. ప్రతీ వస్తువులో ఏ వస్తువులో ఆ వస్తువులాగే ఉంటావు. నీవు సర్వేశ్వరుడవు. అన్ని జగత్తులనూ సృష్టించేవారిని నీవు సృష్టిస్తావు. ప్రతీఇ వాడి ఆత్మలో అంతర్యామిగా ఉంటావు.

అథ హ వావ తవ మహిమామృతరససముద్రవిప్రుషా సకృదవలీఢయా స్వమనసి
నిష్యన్దమానానవరతసుఖేన విస్మారితదృష్టశ్రుతవిషయసుఖలేశాభాసాః పరమభాగవతా ఏకాన్తినో
భగవతి సర్వభూతప్రియసుహృది సర్వాత్మని నితరాం నిరన్తరం నిర్వృతమనసః కథము హ వా ఏతే
మధుమథన పునః స్వార్థకుశలా హ్యాత్మప్రియసుహృదః సాధవస్త్వచ్చరణామ్బుజానుసేవాం విసృజన్తి న యత్ర
పునరయం సంసారపర్యావర్తః

పరమాత్మ మహిమ ఒక పెద్ద రసామృతం. మనం ఆ అమృతమనే ఒక మహాసముద్రములో ఒక చిన్న తుంపర తాగితే అన్ని మరచి అపరిమితానందములో మునుగుతాము. అప్పటిదాకా ఉన్న ప్రాపంచిక సుఖ దు@ఖాలను మరచిపోతాము. అలాంటి వారు పరమభక్తులు, పరమ భాగవతులు. సర్వభూత మిత్రుడైన పరమాత్మ  యందు మాత్రమే వారు ఆనందం పొందుతారు.  నీ పాద పద్మాల సేవ లభించిన వారు, మళ్ళీ దాన్ని విడిచిపెట్టి ఈ సంసారములో ఎలా పడతారు. అటువంటి వారు మళ్ళీ పుట్టరు.

త్రిభువనాత్మభవన త్రివిక్రమ త్రినయన త్రిలోకమనోహరానుభావ తవైవ విభూతయో
దితిజదనుజాదయశ్చాపి తేషాముపక్రమసమయోऽయమితి స్వాత్మమాయయా
సురనరమృగమిశ్రితజలచరాకృతిభిర్యథాపరాధం దణ్డం దణ్డధర దధర్థ ఏవమేనమపి భగవన్జహి
త్వాష్ట్రముత యది మన్యసే

మూడు లోకములూ నీకు నివాసం. నీవు త్రివిక్రముడివి. మూడు లోకాల మనసునీ హరిస్తావు. దేవతలూ దానవులూ మానవులూ మృగములూ పక్షులూ నీ విభూతులే. అందరిలో నీవు ఉన్నావు, అన్ని రూపాలలో ఉన్నావు, అన్ని రూపాలలో వస్తావు. తప్పు చేసిన వారే రూపములో ఉంటే నీవారూపములోనే వచ్చి శిక్షిస్తావు.మరి ఏ రూపములో ఉన్న వారిని ఆ రూపములో దండిస్తావు కదా, ఈ వృత్తాసురున్ని కూడా నీవు తలచుకుంటే ఇతన్ని దండించు.

అస్మాకం తావకానాం తతతత నతానాం హరే తవ
చరణనలినయుగలధ్యానానుబద్ధహృదయనిగడానాం
స్వలిఙ్గవివరణేనాత్మసాత్కృతానామనుకమ్పానురఞ్జితవిశదరుచిరశిశిరస్మితావలోకేన
విగలితమధురముఖరసామృతకలయా చాన్తస్తాపమనఘార్హసి శమయితుమ్


మేము నీ భక్తులమూ నిన్ను ఆశ్రయించి నీ పాదపద్మముల ధ్యానముతో ఉంటాము. దయతో నీ చిరునవ్వు మా మీద ప్రసరింప్చేసి. అన్ని ఆపదలూ తొలగించి మకరందం యొక్క అమృతాన్ని మా మీద చిలికి మా సంతాపాన్ని తొలగించడానికి నీవే సమర్ధుడవు

అథ భగవంస్తవాస్మాభిరఖిలజగదుత్పత్తిస్థితిలయనిమిత్తాయమానదివ్యమాయావినోదస్య
సకలజీవనికాయానామన్తర్హృదయేషు బహిరపి చ బ్రహ్మప్రత్యగాత్మస్వరూపేణ ప్రధానరూపేణ చ
యథాదేశకాలదేహావస్థానవిశేషం తదుపాదానోపలమ్భకతయానుభవతః సర్వప్రత్యయసాక్షిణ
ఆకాశశరీరస్య సాక్షాత్పరబ్రహ్మణః పరమాత్మనః కియానిహ వార్థవిశేషో విజ్ఞాపనీయః
స్యాద్విస్ఫులిఙ్గాదిభిరివ హిరణ్యరేతసః

సకల జగత్తునీ ఆటగా సృష్టించి సంహరించి రక్షిస్తావు. అన్ని ప్రాణుల లోపలా బయటా ఉంటావు. పరమాత్మ జీవాత్మ ప్రకృతి రూపముగా ఆయా దేశ కాల శరీరములలో ఉంటూ ఆ వస్తువుగా నీవుంటావు, ఆ వస్తువుకు కారణముగా కూడా ఉంటావు. అన్ని అనుభూతులకూ నీవే సాక్షి. మా దహరాకాశములో ఉన్నావు. అందరిలో ఉండి అందరితో అన్ని పనులూ చేయించేవాడికి మాకీ ఆపద వచ్చింది అని చెప్పవలసిన పని ఏముంది. నిప్పు రవ్వలు "మేమొచ్చాము" అని అగ్నిహోత్రులకు వేరే చెప్పాలా.

అత ఏవ స్వయం తదుపకల్పయాస్మాకం భగవతః పరమగురోస్తవ చరణశతపలాశచ్ఛాయాం
వివిధవృజినసంసారపరిశ్రమోపశమనీముపసృతానాం వయం యత్కామేనోపసాదితాః

నిరంతరం నీ పాదములనే శరణు వేడిన మాకు సంసారము వలన కలిగే శ్రమను ఉపశమించి దేన్ని కోరి నీ దగ్గరకు చేరామో అది నెర్వేర్చవలసినది.

అథో ఈశ జహి త్వాష్ట్రం గ్రసన్తం భువనత్రయమ్

గ్రస్తాని యేన నః కృష్ణ తేజాంస్యస్త్రాయుధాని చ

హంసాయ దహ్రనిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయశసే నిరుపక్రమాయ
సత్సఙ్గ్రహాయ భవపాన్థనిజాశ్రమాప్తావన్తే పరీష్టగతయే హరయే నమస్తే

మూడు లోకములనూ మింగేస్తున్న వృత్తాసురున్ని వధించు నీవు పరమ హంసవు, దహరాకాశములో ఉండేవాడివీ సర్వసాక్షివి, అపరిమిత ఆనంద స్వరూపుడివి  అందరిలో ఉండేవాడివి సర్వ సాక్షివి, వృద్ధి పొందిన కీర్తిగల వాడివి, ఆది లేని వాడివి, సజ్జనులను కాపాడేవాడు, సంసారములో నడిచినందు వలన కలిగిన శ్రమను తొలగించేవాడివి

శ్రీశుక ఉవాచ
అథైవమీడితో రాజన్సాదరం త్రిదశైర్హరిః
స్వముపస్థానమాకర్ణ్య ప్రాహ తానభినన్దితః

వారి ప్రార్థనను చూసి నవ్వి అభినందించి, మీ స్తోత్రముతో నేను ప్రీతి చెందాను. ఆపద వచ్చినప్పుడు మాత్రమే నేను జ్ఞ్యాపకం వస్తాను. భక్తులు మాత్రమే నా స్థితిని కనుక్కోగలరు

శ్రీభగవానువాచ
ప్రీతోऽహం వః సురశ్రేష్ఠా మదుపస్థానవిద్యయా
ఆత్మైశ్వర్యస్మృతిః పుంసాం భక్తిశ్చైవ యయా మయి

కిం దురాపం మయి ప్రీతే తథాపి విబుధర్షభాః
మయ్యేకాన్తమతిర్నాన్యన్మత్తో వాఞ్ఛతి తత్త్వవిత్

న వేద కృపణః శ్రేయ ఆత్మనో గుణవస్తుదృక్
తస్య తానిచ్ఛతో యచ్ఛేద్యది సోऽపి తథావిధః

నేను ప్రీతి చెందితే లభించరానిది అంటూ ఏదీ ఉండదు. తత్వం తెలిసినవాడెవడూ నా కంటే వేరే వాటిని కోరడు. ఆపదలతో కొట్టబడిన దీనుడు , అజ్ఞ్యానికి తనకు ఏది మేలు కలిగిస్తుందో తెలియడు, ఎదురుగా ఉన్న గుణాలను (భార్యలనూ బంగారన్ని) చూస్తాడు. నన్ను చూడడు

స్వయం నిఃశ్రేయసం విద్వాన్న వక్త్యజ్ఞాయ కర్మ హి
న రాతి రోగిణోऽపథ్యం వాఞ్ఛతోऽపి భిషక్తమః

తన శ్రేయస్సు ఏదో తెలియని వాడికి అడిగింది ఇస్తే ఇచ్చిన వాడు కూడా తెలియని వాడే అవుతాడు. ఏది హితమునూ మేలునూ కలిగిస్తుందో తెలిసిన వాడు తెలియని వాడికి దుఃఖాన్ని ఇచ్చే కర్మను చేయమని చెబుతాడా

మఘవన్యాత భద్రం వో దధ్యఞ్చమృషిసత్తమమ్
విద్యావ్రతతపఃసారం గాత్రం యాచత మా చిరమ్

స వా అధిగతో దధ్యఙ్ఙశ్విభ్యాం బ్రహ్మ నిష్కలమ్
యద్వా అశ్వశిరో నామ తయోరమరతాం వ్యధాత్

దధ్యఙ్ఙాథర్వణస్త్వష్ట్రే వర్మాభేద్యం మదాత్మకమ్
విశ్వరూపాయ యత్ప్రాదాత్త్వష్టా యత్త్వమధాస్తతః

రోగి ఎప్పుడూ అపథ్యమే కోరతాడు. రోగి కోరినా వైద్యుడు అపథ్యాన్ని  ఇస్తాడా. అజ్ఞ్యాని కోరినా జ్ఞ్యాని కోరికలను ఇవ్వడు. మీరడగకుండానే నేను మీకు కోరికను తీరుస్తాను. మీరు ధధీచి మహర్షి వద్దకు వెళ్ళి అతని విద్యా వ్రతం తపస్సు నిండి ఉన్న అతని శరీరాన్ని కోరండి. ఈయనే అశ్వనీ దేవతలకు హయశీర్ష వేషములో హయగ్రీవ బ్రహ్మ విద్యను బోధించాడు. అయాన అధర్వ వంశం వాడు. ఆయనే విశ్వరూపునికీ త్వష్టకూ నా (నారాయణ కవచం) కవచం ఇచ్చాడు. అందుకే అతని కొడుకైన వృత్తాసురునికీ వచ్చింది. అందుకే ఎవరి వలన ఈ విద్య వచ్చిందో ఆ ధధీచినే ఆశ్రయించండి. ధధీచి శరీరం అంతా నారాయణ కవచమే ఉంది.  నారాయణ కవచమే నారాయణ కవచాన్ని ఎదుర్కోగలదు.

యుష్మభ్యం యాచితోऽశ్విభ్యాం ధర్మజ్ఞోऽఙ్గాని దాస్యతి
తతస్తైరాయుధశ్రేష్ఠో విశ్వకర్మవినిర్మితః
యేన వృత్రశిరో హర్తా మత్తేజౌపబృంహితః

శిష్యులైన అశ్వనీ దేవతలడిగితే ధధీచి తన శరీరాన్ని ఇస్తాడు. దానితో విశ్వకర్మ అత్యుత్తమమైన ఆయుధం నిర్మిస్తాడు. ఆ ఆయుధం తీసుకుని, ఆ ఆయుధములో నా తేజస్సును నేను పెట్టాక, ఇంద్రుడు వృత్తాసురున్ని సంహరిస్తాడు. అప్పుడు అతను మింగిన మీ మీ తేజస్సును పొందుతారు.

తస్మిన్వినిహతే యూయం తేజోऽస్త్రాయుధసమ్పదః
భూయః ప్రాప్స్యథ భద్రం వో న హింసన్తి చ మత్పరాన్

నా భక్తులెవరూ నా భక్తులను హింసించరు

Sunday, April 7, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

 ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఎనిమిదవ అధ్యాయం
నారాయణ కవచం
దధీచి మహర్షికి (అంగిరసుని సంతానం) వచ్చిన విద్య ఈ నారాయణ కవచం. మంత్రమెప్పుడూ రహస్యముగా ఉంటుంది. దీనినే హయగ్రీవ బ్రహ్మవిద్య అంటారు. పరమాత్మ స్వరూపాన్ని బోధించేది. ఆయన దగ్గరకు అశ్వనీ దేవతలు వెళ్ళి వారికీ విద్య ఉపదేశించమని కోరగా తాను యజ్ఞ్యములో ఉన్నానని, తరువాత రమ్మని చెప్తాడు దధీచి మహర్షి. ఈ విషయం ఇంద్రుడు తెలుసుకున్నాడు. ముందు తనకు తెలుపవలసినదని ఇంద్రుడు దధీచిని కోరాడు. మళ్ళీ అదే సమాధానమిచ్చాడు ధధీచి. ఇంద్రుడు ఆ విద్యను తనకు చెప్పకుండా ఎవరికీ చెప్పరాదని, చెప్తే ఆయన శిరస్సును ఖండిస్తానని శాసించి వెళ్ళాడు. యజ్ఞ్యము పూర్తికాగానె శిష్యులైన అశ్వనీ దేవతలు ధధీచి వద్దకు వెళ్ళి ఆ విద్య కోరగా ధధీచి జరిగిన విషయం చెప్పారు. శిరస్సు ఇంద్రుడు ఖండిస్తాడని భయపడవలదని, ఆయన శిరస్సు కాపాడటానికి ప్రస్తుతం ఉన్న శిరస్సును మేమే ఖండించి, వేరే శిరస్సు ఉంచి, హయగ్రీవ విద్యను నేర్చుకుని, ఇంద్రుడు శిరస్సును ఖండించగానే అసలు తలను అతికిస్తామని చెప్పారు. అశ్వనీ దేవతలు ఆయన తల తీసి ఒక గుఱ్ఱం తలని ఆయన తల స్థానములో పెట్టారు. గుఱ్ఱం తలతో ఉపదేశించబడినది కాబట్టి అది హయగ్రీవ బ్రహ్మవిద్య అయ్యింది. ఇంద్రుడు తరువాత ఆ శిరస్సును ఖండించాడు. అలా చేసాడు కాబట్టి ఆయననుండి ఇంద్రునికి ఆ విద్య ధధీచి నుండి రాలేదు. ఇంద్రుడు అదే నారాయణ కవచాన్ని విశ్వరూపుడి నుంచి నేర్చుకున్నాడు. విశ్వరూపుడు ఈ నారాయణ కవచాన్ని ఇంద్రునికి ఉపదేశించాడు.

శ్రీరాజోవాచ
యయా గుప్తః సహస్రాక్షః సవాహాన్రిపుసైనికాన్
క్రీడన్నివ వినిర్జిత్య త్రిలోక్యా బుభుజే శ్రియమ్

ఏ బ్రహ్మ విద్యను నేర్చుకుని సహస్రాక్షుడైన ఇంద్రుడు వాహనములతో కూడిన సైన్యాన్ని ఓడించాడు. (యోద్ధ కంటే వాహనం ముఖ్యం, శత్రువును శారీరకముగా కాకుందా మనాసికముగా పరాజితున్ని చేయాలంటే వారి రథాన్ని పడగొట్టాలి) సునాయాసముగా గెలిచాడు. మన శక్తి సామర్ధ్యాల కంటే మంత్ర శక్తి గుర్వనుగ్రహం ఎన్నో రెట్లు ఎక్కువ. ఆడుకొంటున్నట్లుగా తెలిచాడు, త్రైలోక్య లక్ష్మిని దేనితో అందుకున్నాడో

భగవంస్తన్మమాఖ్యాహి వర్మ నారాయణాత్మకమ్
యథాతతాయినః శత్రూన్యేన గుప్తోऽజయన్మృధే

గురువర్యా ఆ కవచాన్ని మాకు ఉపదేశించండి. ఇంద్రుడు శత్రువులను ఏ విద్యతో గెలిచాడో అది చెప్పండి. అలాంటి శత్రువులు (ఇంద్రియాలు) నాకు కూడా ఉన్నారు.

శ్రీబాదరాయణిరువాచ
వృతః పురోహితస్త్వాష్ట్రో మహేన్ద్రాయానుపృచ్ఛతే
నారాయణాఖ్యం వర్మాహ తదిహైకమనాః శృణు

పురోహితుడిగా వరించబడ్డ త్వాష్ట్రుడు (త్వష్ట యొక్క పుత్రుడు) అడుగుతున్న ఇంద్రునికోసం నారాయణమనే కవచాన్ని ఉపదేశించాడు. అది నేను నీకు ఇప్పుడు చెబుతున్నాను. ఇది మహామంత్రము కాబట్టి దీని యందే మనస్సు ఉంచి ఈ కవచాన్ని శ్రద్ధగా విను.

శ్రీవిశ్వరూప ఉవాచ
ధౌతాఙ్ఘ్రిపాణిరాచమ్య సపవిత్ర ఉదఙ్ముఖః
కృతస్వాఙ్గకరన్యాసో మన్త్రాభ్యాం వాగ్యతః శుచిః

ఒక మహామంత్రాన్ని వినడానికి ముందు కాళ్ళూ చేతులూ కడుక్కోవాలి. కడుగుకొని, ఆచమనం చేసి, చేతికి దర్భలు వేసుకు కూర్చోవాలి. ఉత్తరముఖముగా కూర్చోవాలి. ఇది మంత్రం కాబట్టి, మంత్రాన్ని జపించాలంటే అంగన్యాస కర్న్యాసములు మంత్రములతో చేయాలి. నారయణ మంత్రం మూడు రకాలు. అష్టాక్షరీ షడక్షరీ ద్వాదశాక్షరి.  ఏదైన రెండు మంత్రాలతో అంగన్యాస కరన్యాసములు చేయాలి. ఏ మంత్రం జపిస్తున్నా పారాయణ చేస్తున్నా మధ్యలో వేరే విషయాలు మాట్లాడకూడదు. మనసులో వేరే ఆలోచనలు ఉండకూడదు, అంటే శుచిగా ఉండాలి.

నారాయణపరం వర్మ సన్నహ్యేద్భయ ఆగతే
పాదయోర్జానునోరూర్వోరుదరే హృద్యథోరసి

భయమొచ్చినప్పుడు ఈ నారయణమయమైన కవచాన్ని కట్టుకోవాలి. సంసారములో ఉన్నవాడు తప్పకుండా నారాయణ కవచాన్ని బాగా కట్టుకోవాలి. లౌకిక కవచం కంఠం నుండి నాభి వరకే ఉంటుంది. కానీ ఈ కవచం శరీరం మొత్తం ఉంటుంది. పాదములూ, మోకాళ్ళు, తొడలు, ఉదరం, హృదయం, వక్షస్థలం, ముఖమునంది, శిరస్సు నందూ

ముఖే శిరస్యానుపూర్వ్యాదోంకారాదీని విన్యసేత్
ఓం నమో నారాయణాయేతి విపర్యయమథాపి వా

ఓం నమో నారాయణాయ. ఎనిమిది అక్షరాలను ఈ ఎనిమిది అవయవాలలో (పాదములూ, మోకాళ్ళు, తొడలు, ఉదరం, హృదయం, వక్షస్థలం, ముఖమునంది, శిరస్సు నందూ) ఉంచాలి. వీటితో న్యాసం చేయాలి. లేదా పాదములనుంచి శిరస్సు దాకా లేదా శిరస్సు నుండి పాదముల దాకా కూడా న్యాసము చేయాలి.

కరన్యాసం తతః కుర్యాద్ద్వాదశాక్షరవిద్యయా
ప్రణవాదియకారాన్తమఙ్గుల్యఙ్గుష్ఠపర్వసు

కరన్యాసం ద్వాదశాక్షరితో చేయాలి. అంగన్యాసం అష్టాక్షరితో కరన్యాసం ద్వాదశాక్షరితో చేయాలి.
అంగుళి  అంగుష్ఠం. ఓం నుంచీ మొదలుపెట్టి

న్యసేద్ధృదయ ఓంకారం వికారమను మూర్ధని
షకారం తు భ్రువోర్మధ్యే ణకారం శిఖయా న్యసేత్

హృదయములో ఓంకారాన్నీ, మూర్ధకు వికారం, రెండు కనుబొమ్మల మధ్య షకారం, శిఖలో నకారం, వేకారం నేత్రములయందు, ణకారం అన్ని సంధులలో ఉంచాలి.

వేకారం నేత్రయోర్యుఞ్జ్యాన్నకారం సర్వసన్ధిషు
మకారమస్త్రముద్దిశ్య మన్త్రమూర్తిర్భవేద్బుధః

మకారం అస్త్రాయ ఫట్. అని తనలో తాను న్యాసం చేసి. జపం చేసేప్పుడు జపం వేరు తాను వేరు అన్న భావం విడిచిపెట్టాలి. ఆ దేవతా మూర్తే మనం కావాలి. అప్పుడే ఆ మత్రాన్ని జపించే యోగ్యత వస్తుంది. తాను మంత్రం కావడానికి ఏర్పరచబడినవే అంగన్యాస కరన్యాసములు.

సవిసర్గం ఫడన్తం తత్సర్వదిక్షు వినిర్దిశేత్
ఓం విష్ణవే నమ ఇతి

నమః కారముతో ఎనిమిది దిక్కులలో దిగ్బంధం చేయాలి.

ఆత్మానం పరమం ధ్యాయేద్ధ్యేయం షట్శక్తిభిర్యుతమ్
విద్యాతేజస్తపోమూర్తిమిమం మన్త్రముదాహరేత్

పరమాత్మను ధ్యానం చేయాలి. జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు కలిగిన స్వామిని ధ్యానం చేయాలి. విద్య తేజస్సు తపస్సు మూర్తీభవించిన మంత్రాన్ని ఉచ్చరించాలి. మన శరీరములో ప్రతీ అవయవం దేనికి ప్రతీకో దన్ని పరమాత్మ ఏ రూపముతో సృష్టించాడో ఆ రూపములో ఉన్న పరమాత్మ ఆ అవయవాన్ని కాపాడాలి. పరమాత్మ విశ్వరూపములో కేశవుడు అందమైన కేశములు కలవాడు, కేశి అన్న రాక్షసుడిని సంహరించిన వాడు, అలాగే అజ్ఞ్యః అన్న నామముతో పరమాత్మ భక్తులు చేసే తప్పులు తెలియని వాడు. అలా పరమాత్మ ఏ ఏ రూపాలలో ఏ ఏ అవయవాలని సృష్టించాడో ఆయా రూపాలలో ఆయనే మనను కాపాడు గాక.

ఓం హరిర్విదధ్యాన్మమ సర్వరక్షాం న్యస్తాఙ్ఘ్రిపద్మః పతగేన్ద్రపృష్ఠే
దరారిచర్మాసిగదేషుచాప పాశాన్దధానోऽష్టగుణోऽష్టబాహుః

పరమాత్మ నాకు అన్ని వైపుల నుండీ రక్షణ కల్పించు గాక. మనకొచ్చే విఘ్నాలన్నిటికీ కారణం, భయాలకీ కారణం, ఆపదలకీ కరణం మన పాపాలే. పరమాత్మ నామాన్ని స్మరించి భయ విఘ్న ఆపద రూపములో ఉన్న పాపాన్ని పోగొట్టుకుంటున్నాము. గరుత్మంతుని వీపు మీద పాదములు పెట్టి కూర్చున్న హరి. అంటే రావడానికి సిద్ధముగా ఉన్న హరి. మనకు ఆపదలు రాక ముందే వచ్చి కాపాడే అవతారం హరి. హరి అనేది ఒక అవతారం. ఆ అవతారములోనే స్వామి గజేంద్రున్ని కాపాడాడు. గరుడుని మీద పాదములుంచి ప్రయాణానికి సిద్ధముగా ఉన్న హరి. నారాయణ కవచములో నామ భూష ఆయుధ వాహనాలున్నాయి. వీటిలో ఏ ఒక్కటి స్మరించినా మంత్ర స్మరణే అవుతుంది.
అష్ట గుణములూ అష్ట బాహువులు. ఇక్కడ గుణమంటే ఆయుధాలు. (మనకు కూడా గుణాలు ఆయుధాలే. ఆయుధమంటే మననున్ కాపాడేది, పక్కవారి బలాన్ని తగ్గించేది. మంచి గుణములతో చెడ్డవారిని కూడా గెలవవచ్చు.)
పరమాత్మకు ఎనిమిది గుణములు ఎనిమిది ఆయుధాలు ఉన్నాయి. పరమాత్మకు (ఆత్మకు) కూడా ఎనిమిది లక్షణాలుంటాయి.
వెన్న దొంగతనం చేస్తున్న కృష్ణున్ని వారించాలని గోపికలు వెన్నకుండను ఉట్టిమీద  పెట్టారు. అప్పుడు కృష్ణుడు పైకెక్కి, రెండు చేతులతో గంటలను, రెండు చేతులతో కుండను, ఇంకో రెండు చేతులతో పక్కనున్నవారికి పెడుతూ, ఇంకో రెండు చేతులతో తాను తిన్నాడు.
పరమాత్మ అష్ట గుణః అష్ట బాహుః

జలేషు మాం రక్షతు మత్స్యమూర్తిర్యాదోగణేభ్యో వరుణస్య పాశాత్
స్థలేషు మాయావటువామనోऽవ్యాత్త్రివిక్రమః ఖేऽవతు విశ్వరూపః

ఇక్కడ మాయావటువు అంటే అమ్మ వారు కూడా ఉన్నారు అని అర్థం. బలిని కాపాడేందుకే అమ్మవారు కూడా వామనావతారములో వచ్చారు. ప్రహ్లాదుని వంశములో ఎవరినీ చమప్నూ అన్న స్వామి వరం నిలబెట్టడానికే స్వామితో అమ్మవారు వచ్చారు. వామనుడిగా వచ్చి యాచించాడు. పిల్లల మీద తల్లితండ్రులకుండే ప్రేమను చూపించిన అవతారం వామనావతారం. ఈ వామనుడి రెండవ రూపమే త్రివిక్రముడు. బలి చక్రవర్తి చేతిలోంచి దానజలము భూమిని తాకేలోపే స్వామి ఆకాశాన్ని తాకాడు. వి అంటే పాదం, క్రమ అంటే అడుగు వేయుటు. అడుగు యొక్క కదలిక విక్రమః. ఆయన ఒక్క అడుగుకు భూమి, రెండవ అడుగుకు ఆకాశం. ఆయన్ త్రివిక్రముడు కావాలంటే మూడవ అడుగుకు స్థలమే లేదు. తన విశ్వవ్యాపకత్వం, సకల జగత్తుకూ అధినాయకత్వం చాటాడు.  దురాశను ళండించిన అవతారం త్రివిక్రమావతారం. భూమి మీద వామనుడు కాపాడాలి, త్రివిక్రముడు ఆకాశములో కాపాడాలి. ప్రపంచం తన రూపముగా ఉన్న త్రివిక్రముడు ఆకాశము నుండి వచ్చే ప్రమాదాల నుండి కాపాడాలి.

దుర్గేష్వటవ్యాజిముఖాదిషు ప్రభుః పాయాన్నృసింహోऽసురయూథపారిః
విముఞ్చతో యస్య మహాట్టహాసం దిశో వినేదుర్న్యపతంశ్చ గర్భాః

దుర్గేషు అటవి ఆజిముఖేషు - దుర్గములలో అరణ్యములలో యుద్ధములలో నరసింహుడు కాపాడాలి. నరుడు దుర్గాలలో సింహం అరణ్యములో కాపాడాలి. యుద్ధములో నారసింహుడు కాపాడాలి. ద్వంద్వ యుద్ధములో నారసింహుని మించిన వీరుడు లేడు. హిరణ్యకశ్యపుడు తన చుట్టూ దుర్గాన్ని నిర్మించుకున్నాడు దేని ద్వారా మరణము రాకుండా. మన బుద్ధికి అందని మహాపద వస్తుంది. అలాంటప్పుడు నరసింహున్ని తలచుకుంటే ఆయన మనకు సమయస్పూర్థిని ప్రసాదిస్తాడు. మనం నిరంతరం యుద్ధరంగములో ఉన్నాము.
అసురయూథపారిః - రాక్షసైన్యాధిపతికి శత్రువు. మన ఇంద్రియములు ఎప్పుడూ ఆసురీ ప్రవృత్తితో ఉంటాయి. వాటిని స్వామి తొలగిస్తాడు. ఇంద్రియ జయం ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహాన్ని సూచించడానికి స్వామిని అసుర యూధపారి.
విముఞ్చతో యస్య మహాట్టహాసం - నాస్తిక వాదాన్ని ఖండించిన స్వామి నారసింహుడు. అన్ని దిక్కులూ చిల్లుపడ్డాయి ఆయన అట్టహాసము వలన. ఆయన మహాట్టహాసానికి గర్భములన్నీ ప్రసవించాయి. స్వామి కనపడీ కాపాడతాడు, వినపడీ కాపాడతాడు. హిరణ్యకశ్యపుని సైన్యములో చాలామంది స్వామి అట్టహాసానికే హతులయ్యారు. నారసింహుడు షోడశ భుజుడు. పదహారు భుజాలూ పదహారు ఆయుధాలు. మన ఇంద్రియాలు, పంచ జ్ఞ్యానేంద్రియములూ, పంచ కర్మేంద్రియములూ, పంచ తన్మాత్రలు, మనసూ కలిపి పదహారు. పరమాత్మ జీవున్ని ఎలా వశం చేసుకుంటాడు? మన సైన్యాన్ని వశం చేసుకుంటాడు. పదహారు ఇంద్రియాలనూ వశం చేసుకోవడానికి పదహారు భుజాలతో వస్తాడు. మన ఇంద్రియ వ్యాపారాన్ని నియంత్రించేవాడు, దారిలోపెట్టేవాడు నరసింహుడు. ఈ మంత్రం చదివేప్పుడు ఆయన గుణాలని స్మరిస్తూ చదవాలి. ఆయన ప్రళయభయంకరత్వం, దుష్టజన శిక్షకత్వ, ఆశ్రిత రక్షణ, ఆశ్రిత వ్యామోహం, ఇవన్నీ నారసింహావతారములో ఉన్నాయి.

రక్షత్వసౌ మాధ్వని యజ్ఞకల్పః స్వదంష్ట్రయోన్నీతధరో వరాహః
రామోऽద్రికూటేష్వథ విప్రవాసే సలక్ష్మణోऽవ్యాద్భరతాగ్రజోऽస్మాన్

జలమూ ఆకాశమూ దుర్గములలో అడవులలో రక్షణ కల్పించుకున్న తరువాత, ఇక ఆకడికి వెళ్ళే దారినీ దారిలో వెళ్ళే మననూ కాపాడే వాడు యజ్ఞ్య వరాహ స్వామి. వరాహ స్వామి, దారినీ, దారిలో వారినీ కాపాడాలి. సముద్రములో మునిగి ఉన్న భూమిని పైకి తేవడానికి అవతరించాడు స్వామి. భూమిని తీసుకు వస్తుంటే ఒక రాక్షసుడు అడ్డుపడ్డాడు. అంటే భూమిని జలము నుండీ, హిర్ణ్యాక్షుని నుండీ కాపాడాలి. పరమాత్మ భూమిలో కాపాడాలి, భూమినీ కాపాడాలి. తన ఒక కోరతో భూమిని లేపాడు. ఆ కోరమీదనే భూమండలాన్ని నిలిపాడు. వరాహవతారములో స్వామి భూదేవిని ముద్దుపెట్టుకున్నాడు. వారికి నరకాసురుడు పుట్టాడు. ఈ ఉదంతముతో స్వామి మనకు బోధిస్తున్నాడు. భార్యా భర్తలు మంచి వారే కావొచ్చు, వారి ప్రేమకూడా మంచిదే కావొచ్చు, గానీ వారి మీద దుష్ట దృష్టి పడకుండా చూసుకోవాలి. హిరణ్యాక్షుని దృష్టి సోకింది వారి మీద.
నగరాన్నీ గ్రామాన్ని వదిలి అడవికి వెళ్ళినప్పుడు కొండలలో కోనలలో విప్రవాసాలలో మనను కాపాడేవాడు లక్ష్మణుడితో కూడి ఉన్న భరతాగ్రజుడైన రాముడు. రాముడితో బాటు అడవిలో ఉన్నంతకాలం వెంట ఉన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడంటే ఆదిశేషుడు, పరంభాగవతోత్తముడు. భరతుడంటే శంఖం, ప్రణవం. అడవికి ఒంటిగా వెళ్ళరాదు. ఆదిశేషుని వెంటతీసుకుని అడవికి వెళ్ళాడు శ్రీరామచంద్రుడు. ఆదిశేషుడంటే పరమభాగవతోత్తముడు. వారి ఆశీర్వాదముతోనే మనం ప్రయాణం చేయాలి.

మాముగ్రధర్మాదఖిలాత్ప్రమాదాన్నారాయణః పాతు నరశ్చ హాసాత్
దత్తస్త్వయోగాదథ యోగనాథః పాయాద్గుణేశః కపిలః కర్మబన్ధాత్

శ్రీమన్నారాయణుడు కాపాడాలి. ఉగ్రధర్మాలనుండి, అభిచారహోమములనుండి. మనలో ఉగ్రధర్మం కలకూడదు. ఎదుటివారు అభిచారాలు చేస్తే నారాయణుడు కాపాడాలి. అందరూ పరమాత్మ రూపాలే అన్న ఎరుక ఇచ్చేవాడు శ్రీమన్నారాయణుడు.
ఎదుటివారిని పరిహాసం హేళన చేసి తృప్తి పొందడం భయంకరమైన పాపం. అలాంటి వారిని బాగు చేసే వాడు నరుడు. సహస్రకవచుడనే రాక్షసున్ని చంపడానికి నర నారాయణులు అవతారం ఎత్తారు.
దత్తః అయోగాత్: యోగనాధుడు దత్తాత్రేయుడు, యోగ్యులు కాని వారికి యోగం అందచేయకుండా వచ్చిన అవతారం దత్తత్రేయావతారం. రహస్యం తెలియని వారికి అందకుండా ఉండటానికి తెలిసిన వారికి దగ్గరవడానికి వచ్చిన అవతారం దత్తాత్రేయావతారం. నాలుగు కుక్కలు నాలుగు వేదాలు, ఎనిమిది మంది వేశ్యలు ఎనిమిది అణిమాది అష్టసిద్ధులు, ఆరు సురాపాత్రలు జ్ఞ్యానాది షడ్గుణములు. మన మనస్సు చలించకుండా ఉండడానికి సేవించాల్సింది దత్తాత్రేయున్ని. కార్త్వీర్యార్జునికీ, ప్రహ్లాదునికీ అలర్కుడికీ పరశురామునికీ గురువు దత్తాత్రేయులే. యోగమును బోధించడం కంటే ఎవరెవరు యోగం జోలికి రాకూడదో వారినుంచి యోగాన్ని కాపాడాడు. అందుకే దత్తుడు యోగము లేని స్థితి నుండి కాపాడాలి. జీవాత్మ పరమాత్మతో ఉండడమే యోగం. పరమాత్మ నుండి కలిగే వియోగం నుండి కాపాడాల్సిన వాడు దత్తాత్రేయుడు.
పాయాత్ గణేశః (గుణేశః) కపిలః కర్మబంధాత్ - కపిలుడు మనకు సాంఖ్యమును బోధించి, గణములకూ గుణములకూ రెంటికీ అధిపతి కపిలుడు. ఇరవై నాలుగు గణాలు సాంఖ్య గణములు, గనేశ. గుణేశః అంటే త్రిగుణాలకూ అధిపతి.

సనత్కుమారోऽవతు కామదేవాద్ధయశీర్షా మాం పథి దేవహేలనాత్
దేవర్షివర్యః పురుషార్చనాన్తరాత్కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్

మొదట ప్రదేశముల నుండి రక్ష, తరువాత అయోగముల గురించి కాపాడమని, గుణాల నుండి కాపాడమని రక్ష. బయట నుంచి వచ్చే ఆపదలూ, లోపల నుండి వచ్చే ఆపదలు (హాసం, అపహాసం, హేలన, అయోగం, హేలన) అని రెండు రకములు. కర్తృత్వాభిమానం నుండి కపిలుడు కాపాడాలి.
సనత్కుమారుడు కామదేవుడి నుండి కాపాడాలి. ఐదేండ్ల పిల్లవాడిగా ఉన్నవాడు ఎన్ని యుగాలైనా. కోరికలు కలగడానికి కూడా యోగ్యమైన వయసు లేని వాడు సనత్కుమారుడు. కాల ప్రభావం లేని వాడు. అటువంటి కాల ప్రభావం మన మీద రాకుండా ఉండాలంటే సనత్కుమారున్ని ప్రార్థించాలి.
హయశీర్షము గల రాక్షసుడు బ్రహ్మగారు నిదురపోయినపుడు ఆయన నిశ్వాస నుండి వేదాలను లాక్కొన్నాడు. అలా లాక్కొని బ్రహ్మగారిని అవహేళన చేసాడు.
ఇలా బ్రహ్మను అపహసించినందుకు ఈ అవతారం వచ్చింది. వేదాలను అపహరించినందుకు కాదు. దేవహేళనానిన్ని ఖండించడానికి వచ్చిన అవతారం. సోమకుడనే అసురుడు బ్రహ్మ నుండి తనకు తనలాంటి వాడిచేతే మరణం పొందాలని వరము పొంది ఆ వరమిచ్చినందుకు వికటాట్టహాసం చేసి బ్రహ్మను హేళనం చేసాడు. ఎప్పుడూ మనకొచ్చే సంకల్పానికి అనుగుణమైన రూపం ఒక చోట వచ్చే ఉంటుంది. మనలో ఎప్పుడూ ఉన్నదే పుడుతుంది. నాలాంటి ఆకారముతో ఉన్నవాడితోనే మృత్యువు రావాలని కోరాడంటే అలాంటి రూపం ఒక చోట వచ్చే ఉంటుంది. ఇలా బ్రహ్మనూ హేళనం చేసాడు. హయగ్రీవ అవతారం రావడానికి నారదుడు శివ కేశవ యుద్ధం కల్పించాడు. దాని వలన వచ్చింది హయగ్రీవ అవతారం. పెద్దలనూ, దేవతలనూ, మహానుభావులనూ అవమానించడము కన్నా పాపం లేదు. దీన్ని పోగొట్టాలంటే దానికోసం వచ్చిన స్వామే పోగొట్టాలి. అందుకు మనను హయగ్రీవుడు దేవహేళనము నుండి కాపాడాలి.

నారదుడు, పురుష అర్చన అంతరాత్, నుండి కాపాడాలి. భగవంతుని ఆరాధించడములో కలిగే విఘ్నములనుండి కాపాడాలి. నారదుడూ నిరంతరం భగవంతుని నామ సంకీర్తనం చేస్తూ ఉంటాడు. భగవదారాధనా విఘ్నాన్ని పోగొట్టేవాడు నారదుడు. నారదుడు ముందు జన్మలో దాసీ పుత్రునిగా పుట్టి  చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు చాత్రుమాస్యము చేసుకుంటున్న మహాత్ముల దగ్గర ఉండి భగవంతున్ని ఆరాధించడం నేర్చుకున్నాడు. అందుకు పరమాత్మను ఆరాధించే ముందు నారదున్ని స్మరిస్తే అంతరాలు రావు.

కూర్మావతారం అన్ని రకముల నరకముల నుండీ తొలగించాలి. అశేషాత్ నిరయాత్ మాం అవతు. నరకం నుంచి కాపాడేవాడు కూర్మము. నరకానికీ కూర్మానికి ఏమిటి సంబంధం? కూర్మావతారం మందర పర్వతాన్ని మునగకుండా చేసింది. ఈ సంసారమనే సముద్రములో మునగడానికి సిద్ధముగా ఉన్న మనమందరమూ మందర పరవతములమే. కూర్మము మందర పర్వతం మునగకుండా చేస్తుంది. కవ్వాన్ని చిలికేప్పుడు కవ్వం పూర్తిగా మునగకుండా, పూర్తిగా తేలకుండా ఉంటేనే వెన్న వస్తుంది. కొంత భాగం తేలుతూ ఉండాలి, కొంతభాగం మునిగి ఉండాలి. మనం కూడా సంసారములో ఉండాలి, పూర్తిగా పైకి రాకూడదు, పూర్తిగా మునగకూడదు. అందులో ఉన్నట్లే ఉంటూ మునగకుండా ఉండాలి. ప్రతీ పనీ మనం ఆచరించాలి.  జ్ఞ్యానం లేని వారు సాంసరిక ప్రక్రియల యందు, సాంసారిక ప్రక్రియల వలన కలిగే ఫలమునందు ఆసక్తితో వ్యవహరిస్తారు. జ్ఞ్యానులు పని చేస్తారు గానీ ఆశతో కోరికతో చేయరు. ధర్మం కాబట్టి చేస్తారు. జీవితములో అది ఒక భాగముగా  చేస్తారు గానీ అదే జీవితముగా చేయరు. జీవితములో సంసారం ఒక భాగం మాత్రమే. జ్ఞ్యానులు సాంసారిక ప్రక్రియలో ఆసక్తి లేకుండా ఉంటారు. కవ్వమంటే జ్ఞ్యాని. మునుగుతుంటుంది తేలుతుంటుంది, వెన్న మాత్రం వస్తుంది. కానీ ఆ కవ్వం ఆ వెన్నను ఏ మాత్రం తినదు. జ్ఞ్యాని కూడా తాను సంపాదించిన జ్ఞ్యానాన్ని ఏ కొంచెమూ మిగుల్చుకోకుండా అందరికీ పంచిపెడతాడు. ఈ మందర పర్వతం ములగకుండా కూర్మం కావలసి వచ్చింది. మనం పాపం బాగా చేస్తే సంసారములో మునుగుతాము. పాపమే కాదు, పుణ్యము చేసినా సరే సంసారములో మునుగాతము. నిరయాద్ అంటే నరకమనీ, స్వర్గమనీ కూడా అర్థం వస్తుంది.  మనను సంసారము యందు అనురక్తి కలిగించడములో నరకమూ స్వర్గమూ రెండూ సమానమే. ఈ కూర్మం రెంటినీ కాపాడుతుంది. కవ్వమన్న పేరుతో జీవాత్మనూ, సముద్రమన్న పేరుతో సంసారాన్ని, మునగడం అన్న పేరుతో స్వర్గమూ నరకమూ అన్న కామనలనూ. ఈ మూటినీ కలిపి కూర్మో హరిర్మాం నిరయాదశేషాత్. స్వర్గము నుంచీ నరకము నుంచీ కూర్మావతారం కాపాడాలి. అందుకే సంధ్యావందనములో కూర్చునే ముందు కూర్మ మంత్రాన్ని చదివి "ఆసనే వినియోగః" అంటారు. కూర్మము స్థైర్యానికి గుర్తు. మనం స్వర్గానికీ నరకానికీ పోకుండా ఉండాలంటే స్థిరత్వం ఉండాలి. మందర పర్వతం ఎంత లోతులో ఉంటే చిలకడానికి ఉపయోగిస్తుందో అంతే లోతు ఉంది. మరీ లోతుకు వెళ్ళకుండా ఉంది. అలాగే మనం కూడా సంసారములో ఉండాలి. మనమాచరించే కర్మల యొక్క శుభాశుభ ఫలితాలు పొందేవరకూ వద్దన్నా మనం సంసారములోనే ఉంటాము. ఆ అంటీ అంటకుండా ఉండే స్థితి కూర్మము యొక్క స్థితి.

ధన్వన్తరిర్భగవాన్పాత్వపథ్యాద్ద్వన్ద్వాద్భయాదృషభో నిర్జితాత్మా
యజ్ఞశ్చ లోకాదవతాజ్జనాన్తాద్బలో గణాత్క్రోధవశాదహీన్ద్రః

అమృతాన్ని అందించినది ధన్వంతరి. ఈయన వైద్యుడు. మనం ఏవేవి తినకూడదో అవి తింటూ ఉంటాము. కప వాత పిత్తములకు ఎంతెంత అందాలో అంతంత అందాలి. అందించకూడని వాటిని అందించే పదార్థాలు మనం తీసుకునే ఆహారములో ఉంటాయి. తినకూడని వాటిని తినడము వలన వచ్చే దోషాన్ని ధన్వంతరి కాపాడాలి.
అందుకే భోజనం చేసే ముందు "అగస్త్యం కుంభ కర్ణం చ శమ్యం చ బడబానలం ఆహార పరిణామార్ధం స్మరామి చ వృకోదరం" అని అంటాము.
రోగమును పెంచే ఆహారమును తీసుకున్నా ఆ ఆహరం వలన వచ్చే దోషాల నుండి ధన్వంతరి కాపాడు గాక.
ఋషభుడు మహా యోగి. సంసారములో వచ్చీ పాపపుణ్యములని మనం అనుభవిస్తున్నాము. దాన్ని ఇప్పుడు తప్పించుకోవాలనుకున్నా, తరువాతైనా దాన్ని అనుభవించి తీరాల్సిందే. శరీరానికి ప్రకృతి ఇచ్చేది పడదు, విపరీతం కావాలి (వేసవి కాలములో చల్లగా ఉండాలని, చలి కాలములో వెచ్చగా ఉండాలని శరీరం కోరుతుంది). వీటిని ద్వంద్వములూ అంటారు. చలీ వేడీ ఆకలి దప్పి లాభాలాభములూ సుఖదుఃఖములూ, జంటలు. ఇవన్నీ శరీరానికే. ఆత్మకూ మనసుకూ కాదు. బాధపడి ప్రార్థించుట అజ్ఞ్యాని చేస్తాడు. వీటిని తట్టుకుంటాడు జ్ఞ్యాని. వృషభుడు దీన్నే చూపించాడు, వేసవిలో పంచాగ్నుల నడుమ తపస్సు చేసాడు. అలాంటి మనసుని గెలిచిన వృషభుడు "జంటల వలన" కలిగే భయం నుంచి కాపాడు గాక.
జనాంతమంటే అపవాదు. అపవాదులకు ఇష్టమైన లోకమునుండి యజ్ఞ్యుడు కాపాడుగాక. ఈ లోకం మనము ఎలా ఉన్నా అపవాదు కల్పిస్తూ ఉంటుంది. మౌనముగా ఉంటే మూగ వాడని, మాట్లాడితే వదరుబోతని, గంభీరముగా ఉంటే గర్విష్ఠీ అని, నిందించే ఈ లోకానికి తప్పు చేయని వాడెవ్వడూ కనపడడు. లోకమునుండి వచ్చే అపవాదులనుండి యజ్ఞ్య పురుషుడు కాపాడాలి.
గణాత్ - గుంపులు. మన మీద గుంపులుగా ఎవరైన దాడి చేస్తే దాని నుంచి బలరాముడు కాపాడాలి.
మనకు క్రోధము రాకుండా ఆదిశేషుడు కాపాడాలి. నిత్యమూ సంకర్షణ జపాన్ని చేస్తే కోపాన్ని గెలవగలము. మనలో కోపాన్ని మనం జయించాలంటే సంకర్షణున్ని జపించాలి. అందుకే సంధ్యావందనములో ప్రతీ రోజూ ఉదయం అచ్యుతా అనంతా గోవిందా అని చేస్తాము. శరీరము వలన మనసులో కలిగే వికారాలు తలెత్తవు. కోపమూ మోహమూ వ్యామోహమూ మొదలైనవి రాకుండా ఉంటాయి. మానసిక వికారాలు ఇరవై నాలుగు, కామానికి పది, క్రోధానికి ఎనిమిది,  మానసికమైనవి ఆరు. అందుకే ఈ ఇరవై నాలుగు వికారాలు తొలగించుకోవడానికి కేశవాది ఇరవై నాలుగు నామాలూ జపించాలి.

ద్వైపాయనో భగవానప్రబోధాద్బుద్ధస్తు పాషణ్డగణప్రమాదాత్
కల్కిః కలేః కాలమలాత్ప్రపాతు ధర్మావనాయోరుకృతావతారః

మనందరికీ జ్ఞ్యానం కలగడానికి ఆయన ఇన్ని పురాణాలు వ్రాశాడు. ఆయన మనకు జ్ఞ్యానం కలిగించు గాక.
యజ్ఞ్యమునూ ధర్మమును ఆచరిస్తూ అధర్మానికి మార్గాన్ని లేపిన వారి కొరకు బుద్ధావతారం వచ్చింది. ధర్మపు ముసుగులో అధర్మాన్ని ఆచరించే వారి ఆటకట్టించడానికి వారు చేసే కపట యజ్ఞ్య యాగాదులను ఆచరించకుండా వచ్చిన అవతారం బుద్ధావతారం. వాదములతో ప్రతీ వారి మనసును ఆకర్షించి వారాచరించే ధర్మాన్నుంచి వారు బయటకు వచ్చేట్లు చేసి వారిని సంహరించిన వాడు. పాషణ్డ గణం, తాము అధర్మం ఆచరిస్తూ, ధర్మం ఆచరించే వారి మనసును ఆకర్షిస్తుంది. అధర్మాన్ని బోధించే మాటలకు మనసు తొందరగా ఆకర్షింపబడుతుంది. బుద్ధుడు వారిలో అధర్మాన్నే పెంచి, వారిని శిక్షించి లోకకళ్యాణాన్ని చేకూర్చాడు.  ధర్మాన్ని స్థాపించడానికి అధర్మాన్ని పాలద్రోలడమే మార్గం. ధర్మమను ముసుగులో అధర్మాన్ని ఆచరించేవారిని అణచడానికి వచ్చిన అవతారం బుద్ధుడు. అటువంటి బుద్ధుడు పాషణ్డ మతముల నుండి మమ్ము కాపాడుగాక.
కలి అంటే కలహం. ఇది కాలం యొక్క దోషం. దాన్ని పోగెట్టే పరమాత్మ అవతారం కల్కి. ఈ కల్కి కాల మలం నుండి కాపాడతాడు. ధర్మమును కాపాడటానికి అవతరించిన వాడు కలి.

మాం కేశవో గదయా ప్రాతరవ్యాద్గోవిన్ద ఆసఙ్గవమాత్తవేణుః
నారాయణః ప్రాహ్ణ ఉదాత్తశక్తిర్మధ్యన్దినే విష్ణురరీన్ద్రపాణిః

పొద్దున్నే కాపాడేవాడు కేశవుడు. అందమైన జుట్టు గలవాడు, కేశి అన్న రాక్షసున్ని సంహరించినవాడూ, బ్రహ్మ రుద్రులకు మూలమైన వాడు అయిన కేశవుడు ప్రాతః కాలం కాపాడాలి. రజో గుణ తమో గుణాలను తగ్గించి సత్వ గుణమును వృద్ధి పొందించాలి. గదను ధరించిన కేశవుడు కాపాడాలి. గదను చేతిలో ధరించిన కేశవుడు ప్రాతఃకాలం కాపాడాలి. మాయకు గద ప్రతీక. మాయకు మూలం ఆయనే. ప్రాతఃకాలం మెలుకువ రావలసింది మనకు నిద్ర వస్తుంది. దానికి కారణం మాయ. దాన్ని పోగొట్టేవాడు కేశవుడు. కేశవాయానమః అనుకుంటూ లేవాలి. కేశవాయ గదాధరాయ నమః అనుకోవాలి.
(ప్రాతః సంగవ  మధ్యాహ్నం అపరాహ్నం రాత్రి అర్థ రాత్రి అపర రాత్రి)
సూర్యోదయానికంటే ముందు ఉండేది ప్రాతః కాలం. సూర్యోదయం నుండి రెండు ఘడియల వరకూ ఉండేది సంగమ (సంగవ - సం - గవ - గోవులను బయటక్ వదిలే కాలం) కాలం. ఈ కాలములో వేణువు ధరించిన గోవిందుడు కాపాడాలి.

దేవోऽపరాహ్ణే మధుహోగ్రధన్వా సాయం త్రిధామావతు మాధవో మామ్
దోషే హృషీకేశ ఉతార్ధరాత్రే నిశీథ ఏకోऽవతు పద్మనాభః

పరాహ్ణ కాలములో (రెండవ ఝాములో) నారాయణుడు కాపాడాలి, మధ్యందినం యందు చక్రం (అరి) ధరించిన విష్ణువు కాపాడాలి, అపరాహ్ణములో మధువు అనే రాక్షసున్ని చంపిన (మధుహా) మధుసూధనుడు కాపాడాలి. మనకు అహంకారం కోపం అపరాహ్నము పెరుగుతాయి. అందుకు ఆ సమయములో మనము "అన్నీ నాకే కావాలి" అన్న భావన రాకుండా అహంకారం రాకుండా, కోపం రాకుండా మధుసూధనుడు కాపాడాలి.
సాయంకాలం మాధవుడు కాపాడాలి. త్రిధామ అంటే భూః భువః సువః లేదా ఉదరమూ, హృదయ దహరాకాశమూ, ఉరస్సు (వక్షస్థలం). (స్వాహాకారములతో మనం తినేది అందుకునేది పరమాత్మే). త్రిధామములో ఉండే మాధవుడు మమ్ము కాపాడు గాక.
రాత్రి కాగానే (దోష సమయం) ఇంద్రియాలను అరికట్టే హృషీకేశుడు కాపాడాలి. అర్థరాత్రి, అపరరాత్రి పద్మనాభుడు కాపాడాలి. పద్మనాభుడు సృష్టికి ప్రతీక. సంభోగం కేవలం సంతానం కోసమే అవ్వాలి. భోగలాలసకు గురికాకుండా పద్మనాభుడు కాపాడాలి

శ్రీవత్సధామాపరరాత్ర ఈశః ప్రత్యూష ఈశోऽసిధరో జనార్దనః
దామోదరోऽవ్యాదనుసన్ధ్యం ప్రభాతే విశ్వేశ్వరో భగవాన్కాలమూర్తిః

అపర రాత్రములో శ్రీ వత్సము ధరించిన ఈశ్వరుడు కాపాడాలి. శ్రీ వత్సం అంటే అమ్మవారికి ఇష్టమైనది. అది చూసి అమ్మవారు స్వామిని ప్రేమించింది. అపరరాత్రములో మన మనసు వ్యభిచరించకుండా ఉండటానికి శ్రీవత్స ధామున్ని స్మరిచుకోవాలి. భార్య నుండి మనసు వేరే వైపు వెళ్ళకుండా ఉండేట్లు కాపాడేవాడు శ్రీవత్సధాముడు. ప్రత్యూష కాలములో (సూర్యోదయానికీ ఉదయ సంధ్యకీ మధ్య కాలం) జనార్ధనుడు ఖడ్గమును ధరించి మనసులో కలిగే కోరికలను ఖండించి కాపాడాలి. కడుపునకు తాడు గలవాడైన దామోదరుడు సంద్యా కాలములో కాపాడు గాక. ఈ దామోదరుడు భక్త పరవశుడు. సకల జగన్నాధుడు కాలమూర్తి విశ్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు అన్ని వేళలా అన్ని కాలాలలో కాపాడాలి.

నామములూ భూషణములూ వాహనములూ అయిన తరువాత, ఇంక ఆయుధాలతో రక్ష.

చక్రం యుగాన్తానలతిగ్మనేమి భ్రమత్సమన్తాద్భగవత్ప్రయుక్తమ్
దన్దగ్ధి దన్దగ్ధ్యరిసైన్యమాశు కక్షం యథా వాతసఖో హుతాశః

ప్రళయ కాలాగ్ని వలే తీక్షణమైన అంచు గల చక్రం పరమాత్మ చేత ప్రయోగించబడి అంతటా తిరుగుతూ శత్రు సైన్యమునూ వేగముగా దహింపచేయాలి దహింపచేయాలి. ఎండు కట్టెల మోపును అగ్నిహోత్రుడు ఎలా కాలుస్తాడో అలా. అలా పరమాత్మ చేత ప్రయోగించబడిన చక్రం అగ్నిహోత్రుడు అరణ్యాన్ని దహించినట్లుగా దహించాలి. ఈ దందగ్ధి, దందగ్ధి అనేది అగ్ని బీజము మంత్ర శాస్త్రములో.

గదేऽశనిస్పర్శనవిస్ఫులిఙ్గే నిష్పిణ్ఢి నిష్పిణ్ఢ్యజితప్రియాసి
కుష్మాణ్డవైనాయకయక్షరక్షో భూతగ్రహాంశ్చూర్ణయ చూర్ణయారీన్

అశనిస్పర్శనవిస్ఫులిఙ్గే - విస్పులింగమంటే నిప్పు రవ్వలు. పిడుగుపాటు తాకిడికి వచ్చే నిప్పు రవ్వలను వెదజల్లే కౌమోదికీ అనే విష్ణు మూర్తికి ప్రియురాలైన గద భూత ప్రేత పిశాచ శాఖినీ ఢాకినీ కూష్మాండ దుష్ట గ్రహాలను పిండి చేయి పిండి చేయి.

త్వం యాతుధానప్రమథప్రేతమాతృ పిశాచవిప్రగ్రహఘోరదృష్టీన్
దరేన్ద్ర విద్రావయ కృష్ణపూరితో భీమస్వనోऽరేర్హృదయాని కమ్పయన్

శంఖమా! నీవు కృష్ణ పరమాత్మచే నింపబడి శత్రు హృదయాలను వణికిస్తూ భయంకరమైన ధ్వని కలిగి మన ప్రయత్నం లేకున్నా కోరకున్నా మనం చేసే తప్పుల వలన కొన్ని గ్రహాలు ప్రవేశిస్తూ ఉంటాయి (చీపురు రోకలి తిరగలి కత్తిపీట, కూరలను కోసాక విడిచిపెట్టిన తొడిమెలు, చాట, ఇవన్నీ భూతావాసములు. కత్తిపీట కుడి వైపు వంచి పెట్టాలి, తిరుగలి రెంటినీ వేరు చేసి పెట్టకూడదు. వీటితో కొన్ని లక్షల క్రిములను చంపుతూ ఉంటాము. ఇవే భూతములూ ప్రేతములూ మాత్రే గణములూ, కూష్మాండములు. ఇవే ఇంట్లో కలహాలనూ కోపాలనూ కలిగిస్తాయి. మనం చేసే అన్ని రకాల తప్పులకూ నారాయణ కవచం ప్రాయశ్చిత్తం).

త్వం తిగ్మధారాసివరారిసైన్యమీశప్రయుక్తో మమ ఛిన్ధి ఛిన్ధి
చక్షూంషి చర్మన్ఛతచన్ద్ర ఛాదయ ద్విషామఘోనాం హర పాపచక్షుషామ్

చర్మ అంటే డాలులాంటిది. ఇది గుండ్రముగా ఉన్న కత్తిలాంటిది. ఖడ్గరాజమా, శత్రు సైన్యమును నీవు పరమాత్మ చేత ప్రయోగించబడి శత్రుసైన్యాన్ని చేదించు. ఈ ఒక్క శ్లోకములోనే రెండు ఆయుధాలు. ఖడ్గం శత్రువులను ఖండించాలి. చర్మమా పాపపు చూపు గల శత్రువుల కళ్ళు కప్పేయి.

యన్నో భయం గ్రహేభ్యోऽభూత్కేతుభ్యో నృభ్య ఏవ చ
సరీసృపేభ్యో దంష్ట్రిభ్యో భూతేభ్యోऽంహోభ్య ఏవ చ

మాకు ఏ ఏ చోట్ల నుండీ ఏ ఏ ఆపదలు వస్తాయో వాటినుండి కాపాడు. గ్రహముల నుండి , కేతువుల నుండీ మానవుల నుండీ సర్పముల నుండీ దమ్ష్ట్రముల నుండీ పాపముల నుండీ

సర్వాణ్యేతాని భగవన్నామరూపానుకీర్తనాత్
ప్రయాన్తు సఙ్క్షయం సద్యో యే నః శ్రేయఃప్రతీపకాః

ప్రాణుల నుండి ఎన్ని రకాల భయములు ఉన్నాయో వాటి నుండి కాపాడు. పరమాత్మ యొక్క నామ రూప అస్త్రములను మేము కీర్తించడముతో ఏవేవి మన శ్రేయస్సును హరిస్తున్నాయో, ఆ శ్రేయస్సుకు హాని చేసే అన్నిటినుండీ పరమాత్మ యొక్క నామ రూప అస్త్రముల కీర్తన కాపాడాలి.

గరుడో భగవాన్స్తోత్ర స్తోభశ్ఛన్దోమయః ప్రభుః
రక్షత్వశేషకృచ్ఛ్రేభ్యో విష్వక్సేనః స్వనామభిః

ఇపుడు వాహనం.  నామ రూప యాన ఆయుధాలు అన్ని రకములైన ఆపదలనుండీ ఆయన నామమూ రూపమూ వాహనమూ ఆయుధములూ కాపడాలి.

సర్వాపద్భ్యో హరేర్నామ రూపయానాయుధాని నః
బుద్ధీన్ద్రియమనఃప్రాణాన్పాన్తు పార్షదభూషణాః

బుద్ధి మనసు ఇంద్రియం ప్రాణం. బుద్ధి ఆలోచన కలిగిస్తుంది, ఇంద్రియములు పని చేస్తాయి, మనసు సంకల్పిస్తుంది, ప్రాణం బలాన్నిస్తుంది. వీటిని పరమాత్మ నామ రూప యాన ఆయుధాలతో, నామం బుద్ధిని రూపం ఇంద్రియాలనూ యానము మన మనసునూ, పరమాత్మ ఆయుధము మన ప్రాణాన్నీ కాపాడాలి నిరంతర పరమాత్మ నామ సంకీర్తన చేస్తే మన బుద్ధిలో చెడు ఆలోచనలు రావు. నిరంతరం పరమాత్మ రూపాన్ని ధ్యానం చేస్తే ఇంద్రియాలు చెడు వైపు ప్రసరించవు, గరుడున్ని నిరంతరం ధ్యానం చేస్తే మనసు చెడును సంకల్పించదు, పరమాత్మ పంచాయుధాలని ప్రాథన చేస్తే మన ప్రాణములు చెడు పనులకు బలమును అందించవు. అన్ని ఆపదలనుండీ ఇవి మనను కాపాడు గాక. పరమాత్మ పక్కన ఉండే పార్శ్వదులు మమ్ము కాపాడు గాక. వారి ఆభరణములు కూడా మనను కాపాడాలి. భగవంతుని ఆభరణాలను ప్రార్తించినా చాలు మనకు రక్ష దొరుకుతుంది. పరమాత్మకు సంబంధించినదాన్ని దేన్ని స్మరించినా మన బుద్ధీ మనసు ఇందిర్యములూ ప్రాణములూ చెడు వైపుకాకుండా మంచి వైపు ప్రయాణిస్తాయి

యథా హి భగవానేవ వస్తుతః సదసచ్చ యత్
సత్యేనానేన నః సర్వే యాన్తు నాశముపద్రవాః

అన్ని తానే అయి ఉన్న పరమాత్మ, తానే సృష్టించి, తానే లయమూ చేస్తున్నాడు.  సత్తూ అసతూ రెండూ పరమాత్మే అన్న సత్యం మనం తెలుసుకుంటే పరమాత్మే ప్రపంచముగా మారాడని అర్థం చేసుకుంటే పరమాత్మ మనకు ఆపద కలిగిస్తాడా? మరి ఆపద బాధా హానీ ఎక్కడిది? ఇదంతా అజ్ఞ్యానముతో ఇదంతా పరమాత్మ కంటే వేరు అనుకోవడం వలన వస్తాయి. అంతా పరమాత్మే అనుకున్నప్పుడు ఆపదా భయమూ హానీ రాదు. ఈ సత్యమును తెలుసుకున్నందు వలన అన్ని రకముల ఉపద్రవములూ నశించుగాక.

యథైకాత్మ్యానుభావానాం వికల్పరహితః స్వయమ్
భూషణాయుధలిఙ్గాఖ్యా ధత్తే శక్తీః స్వమాయయా

పరమాత్మకు ఎటువంటి వికల్పమూ ఉండదు (ప్రియమూ అప్రియమూ, రూపము గుణమూ ద్రవ్యమూ ఉత్పత్తీ నాశమూ). పరమాత్మే జగత్తుగా మార్పు చెందుతున్నాడు. ప్రళయములో జగత్తు కనపడదు, సృష్టి కాలములో పరమాత్మ కనపడడూ, రెండు కాలాలలో రెంటినీ చూచినవాడు జ్ఞ్యాని. అన్ని సమయాలలో ఉండే పరమాత్మ ఒక్కడే. ఆయనలో ఎటువంటి భేధమూ ఉండదు. పరమాత్మ తన మాయా విభూతులతో భూషణములూ ఆయుధములూ లింగములు (శ్రీవత్సం), వాహనం. ఆయనకు ఏ వికల్పములూ ఉండవు. ఈ రహస్యం తెలుసుకుంటే, ఇలాంటి నిజమైన ప్రమాణముతో

తేనైవ సత్యమానేన సర్వజ్ఞో భగవాన్హరిః
పాతు సర్వైః స్వరూపైర్నః సదా సర్వత్ర సర్వగః

జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సు గలిగిన పరమాత్మ తన యొక్క అన్ని స్వరూపములతో సదా (ఎల్లప్పుడూ) సర్వత్రా (అన్ని చోట్లా కాపాడాలి) సర్వదా (అన్ని చోట్లా ఉన్నవాడై కాపాడాలి) . మనకు పరమాత్మ రక్ష కన్నా పరమాత్మే మన దగ్గర ఉండటం కావాలి. ఆయన మనదగ్గర ఉండగా మనకు ఆపదలు రావు, ఆయన సర్వ ప్రహరణాయుధుడు కాబట్టి. అన్ని చోట్లా అన్ని వేళలా అన్ని రూపములలో కాపాడాలి.

విదిక్షు దిక్షూర్ధ్వమధః సమన్తాదన్తర్బహిర్భగవాన్నారసింహః
ప్రహాపయ లోకభయం స్వనేన స్వతేజసా గ్రస్తసమస్తతేజాః

విదిక్కు అంటే రెండు దిక్కుల మధ్య (ఉదా: ఈశాన్యం), దిక్కులలో, పైనా, కిందా , అంతటా, వెలుపలా, లోపలా ఇలా అన్ని చోట్లా భగవానుడైన నారసింహుడు కాపాడాలి. సర్వ వ్యాపకత్వాన్ని ఋజువు చేసిన అవతారం నరసింహుని అవతారం. తన ఘర్జనతో భయాన్ని పోగొట్టాడు. హిరణ్యకశిపుని తేజస్సుని మింగేశాడు. తన రాకతో పరమాత్మ సర్వ వ్యాపకుడని చాటాడు. ఇది నారాయణ కవచం

మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకమ్
విజేష్యసేऽఞ్జసా యేన దంశితోऽసురయూథపాన్

ఇంద్రా, ఇది నారాయణ కవచం. ఈ కవచాన్ని బందించుకుంటే రాక్షస సైన్యాన్ని నీవు గెలుస్తావు

ఏతద్ధారయమాణస్తు యం యం పశ్యతి చక్షుషా
పదా వా సంస్పృశేత్సద్యః సాధ్వసాత్స విముచ్యతే

ఇలాంటి నారాయణ కవచాన్ని ఉపాసించినవాడు, పఠించిన వాడు కంటితో చూసినా కాలితో తాకినా అలా తాకపడిన వాడు అన్ని పాపముల నుండీ విముక్తుడవుతాడు.

న కుతశ్చిద్భయం తస్య విద్యాం ధారయతో భవేత్
రాజదస్యుగ్రహాదిభ్యో వ్యాధ్యాదిభ్యశ్చ కర్హిచిత్

అన్ని రకముల ఆపదల నుండీ విడుదల అవుతారు. ఈ నారాయణ కవచాన్ని ధరించేవారికి ఎక్కడ నుండీ ఎలాంటి భయమూ కలగదు.  రాజులూ దొంగలూ గ్రహములూ మృగములూ, వీటి వలన ఈ నాలిగింటినుండీ భయము కలగదు

ఇమాం విద్యాం పురా కశ్చిత్కౌశికో ధారయన్ద్విజః
యోగధారణయా స్వాఙ్గం జహౌ స మరుధన్వని

పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడు ఈ విద్యను ఉపాసించి ధారణ చేస్తూ యోగ ప్రభావముతో శరీరాన్ని ఒక చవట భూమి యందు విడిచిపెట్టాడు.

తస్యోపరి విమానేన గన్ధర్వపతిరేకదా
యయౌ చిత్రరథః స్త్రీభిర్వృతో యత్ర ద్విజక్షయః

గగనాన్న్యపతత్సద్యః సవిమానో హ్యవాక్శిరాః
స వాలిఖిల్యవచనాదస్థీన్యాదాయ విస్మితః
ప్రాస్య ప్రాచీసరస్వత్యాం స్నాత్వా ధామ స్వమన్వగాత్

ఆ అస్తిపంజరమున్న చోటి నుంచీ భార్యలతో ఒక గంధర్వుడు విమానము మీద నుంచి వెళ్ళగా ఆ విమానం త్రల్లకిందులుగా కూలిపోయింది. అప్పుడు వాలఖిల్యులు చెప్పగా ఆశ్చర్యపడి ఆ అస్తులని తీసుకుని సరస్వతీ నది నీటిలో కలిపి తనలోకానికి వెళ్ళాడు. నారాయణ కవచం ధరించిన వాడి అస్తిపంజరానికి కూడా అంత శక్తి ఉంటుంది..

శ్రీశుక ఉవాచ
య ఇదం శృణుయాత్కాలే యో ధారయతి చాదృతః
తం నమస్యన్తి భూతాని ముచ్యతే సర్వతో భయాత్

ఎవరు ఈ నారాయణ కవచాన్ని వినదగిన కాలములో వింటారో విని ఆదరముతో ధరిస్తారో అలాంటి వానికి అన్ని ప్రాణులూ నమస్కరిస్తాయి. ఆపదలు వచ్చాయంటే నారాయణ కవచ సప్తాహం చేస్తారు.

ఏతాం విద్యామధిగతో విశ్వరూపాచ్ఛతక్రతుః
త్రైలోక్యలక్ష్మీం బుభుజే వినిర్జిత్య మృధేऽసురాన్

ఈ హయగ్రీవ బ్రహ్మ విద్యను విశ్వరూపుని వలన ఇంద్రుడు విని యుద్ధములో రాక్షసులను గెలిచి త్రైలోక్య రాజ్య సంపదను అనుభవించాడు

ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే  శత సహస్రికాయాయాం వైయాసిక్యాం షష్ఠ స్కంధే నారాయణ వర్మోపదేశో నామ్నాష్టమోధ్యాయః

                                                       సర్వం శ్రీకృష్ణార్పణమస్తు