Friday, April 5, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఏడవ అధ్యాయం

శ్రీరాజోవాచ
కస్య హేతోః పరిత్యక్తా ఆచార్యేణాత్మనః సురాః
ఏతదాచక్ష్వ భగవఞ్ఛిష్యాణామక్రమం గురౌ

గురువు శిష్యున్ని ఎలా విడిచిపెట్టాడు. శిష్యుడు చేసిన తప్పు ఏమిటి.

శ్రీబాదరాయణిరువాచ
ఇన్ద్రస్త్రిభువనైశ్వర్య మదోల్లఙ్ఘితసత్పథః
మరుద్భిర్వసుభీ రుద్రైరాదిత్యైరృభుభిర్నృప

ఇంద్రుడు త్రైలోక్య రాజ్య మదముతో ఉన్నాడు.

విశ్వేదేవైశ్చ సాధ్యైశ్చ నాసత్యాభ్యాం పరిశ్రితః
సిద్ధచారణగన్ధర్వైర్మునిభిర్బ్రహ్మవాదిభిః

విద్యాధరాప్సరోభిశ్చ కిన్నరైః పతగోరగైః
నిషేవ్యమాణో మఘవాన్స్తూయమానశ్చ భారత

సిద్ధులూ సాధ్యులూ గంధర్వులూ మొదలైన వారందరూ సేవిస్తూ ఉంటే

ఉపగీయమానో లలితమాస్థానాధ్యాసనాశ్రితః
పాణ్డురేణాతపత్రేణ చన్ద్రమణ్డలచారుణా

పాటలు పాడుతూ సేవిస్తూ ఉండగా దేవ సభలో సింహాసనం మీద తెల్లని గొడుగు కింద కూర్చుని ఉన్నాడు

యుక్తశ్చాన్యైః పారమేష్ఠ్యైశ్చామరవ్యజనాదిభిః
విరాజమానః పౌలమ్యా సహార్ధాసనయా భృశమ్

రాజలాంచనాలని తెలియబరచే గుర్తులతో పౌలోమితో సింహాసనం మీద ఉండగా

స యదా పరమాచార్యం దేవానామాత్మనశ్చ హ
నాభ్యనన్దత సమ్ప్రాప్తం ప్రత్యుత్థానాసనాదిభిః

అప్పుడూఉ బృహస్పతి వచ్చాడు. లేచి వెళ్ళి ఆయన ఎదురుపడి తీసుకు రాలేదు. కనీసం లేవలేదు.

వాచస్పతిం మునివరం సురాసురనమస్కృతమ్
నోచ్చచాలాసనాదిన్ద్రః పశ్యన్నపి సభాగతమ్

ఆయనను చూచి కూడా ఇంద్రుడు సింహాసనం మీద నుండి లేవలేదు. ఆ బృహస్పతిని దేవతలతో బాటు రాక్షసులు కూడా నమస్కారం చేస్తారు.

తతో నిర్గత్య సహసా కవిరాఙ్గిరసః ప్రభుః
ఆయయౌ స్వగృహం తూష్ణీం విద్వాన్శ్రీమదవిక్రియామ్

అది చూసి, సంపద ఇచ్చే మదం ఎలాంటిదో తెలుసు కాబట్టి, బృహస్పతి ఏమీ అనకుండా తన ఇంటికి వెళ్ళిపోయాడు.

తర్హ్యేవ ప్రతిబుధ్యేన్ద్రో గురుహేలనమాత్మనః
గర్హయామాస సదసి స్వయమాత్మానమాత్మనా

గురువు గారు వెళ్ళిపోయేసరికి తన తప్పు తాను తెలుసుకున్నాడు. తనను తానే నిందించుకున్నాడు.

అహో బత మయాసాధు కృతం వై దభ్రబుద్ధినా
యన్మయైశ్వర్యమత్తేన గురుః సదసి కాత్కృతః

చంచల బుద్ధితో తప్పు చేసాను. ఐశ్వర్యమదం బాగా ఎక్కి సభకు వచ్చిన గురువును తిరస్కరించాను.

కో గృధ్యేత్పణ్డితో లక్ష్మీం త్రిపిష్టపపతేరపి
యయాహమాసురం భావం నీతోऽద్య విబుధేశ్వరః

ఐశ్వర్య మదముతో గురువును అవమానించాను. అందుకే బుద్ధిమంతుడెవడూ ఐశ్వర్యమునూ ఇంద్ర సామ్రాజ్యపదవినీ కోరుకోరు. ఆ సంపదతోటే దేవతలలో పుట్టి కూడా రాక్షస బుద్ధిని పొందాను.

యః పారమేష్ఠ్యం ధిషణమధితిష్ఠన్న కఞ్చన
ప్రత్యుత్తిష్ఠేదితి బ్రూయుర్ధర్మం తే న పరం విదుః

పారమేష్ఠ్య ఆసనములో ఉన్నప్పుడు గురువు వచ్చినా లేవరాదని కొందరంటారు గానీ వారికి ధర్మం తెలియదు.

తేషాం కుపథదేష్టౄణాం పతతాం తమసి హ్యధః
యే శ్రద్దధ్యుర్వచస్తే వై మజ్జన్త్యశ్మప్లవా ఇవ

ఇలా చెడు దారి చెప్పే వారి మాట్లనూ నరకములో పడవేసే వారి మాటలనెవరు వింటారో వారు రాతిపడవలా మునిగిపోతారు. పెద్దలని అవమానించేది ధర్మం కాదు.

అథాహమమరాచార్యమగాధధిషణం ద్విజమ్
ప్రసాదయిష్యే నిశఠః శీర్ష్ణా తచ్చరణం స్పృశన్

ఆయన మాయనదరికీ గురువు. అంతుతెలియని బుద్ధి వైభవం కలవాడు. బ్రాహ్మణోత్తముడు. ఆయనను కపటము లేకుండా ప్రసన్నం చేసుకుంటాను. నా శిరస్సుతో వారి పాదాలను తాకుతాను.

ఏవం చిన్తయతస్తస్య మఘోనో భగవాన్గృహాత్
బృహస్పతిర్గతోऽదృష్టాం గతిమధ్యాత్మమాయయా

ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇది తెలుసుకున్న  బృహస్పతి తన ఇంటినుంచి తన యోగ శక్తితో అంతర్ధానం చెందాడు.

గురోర్నాధిగతః సంజ్ఞాం పరీక్షన్భగవాన్స్వరాట్
ధ్యాయన్ధియా సురైర్యుక్తః శర్మ నాలభతాత్మనః

ఇంద్రుడు సామ్రాట్ అయినా గురువు ఎక్కడ దాక్కున్నాడో తెలియలేకున్నాడు. అదే ఆలోచిస్తూ దేవతలందరినీ సమావేశపరచాడు. మనశ్శాంతి పొందలేదు

తచ్ఛ్రుత్వైవాసురాః సర్వ ఆశ్రిత్యౌశనసం మతమ్
దేవాన్ప్రత్యుద్యమం చక్రుర్దుర్మదా ఆతతాయినః

ఈ వార్త అసురులకు చేరింది. శుక్రాచార్యులవారి  సలహాననుసరించి రాక్షసులు దేవతల మీదకి వచ్చారు

తైర్విసృష్టేషుభిస్తీక్ష్ణైర్నిర్భిన్నాఙ్గోరుబాహవః
బ్రహ్మాణం శరణం జగ్ముః సహేన్ద్రా నతకన్ధరాః

వారి బాణాలకు తట్టుకోలేక దేవతలందరూ బ్రహ్మగారి వద్దకు వెళ్ళి ప్రార్థించారు.

తాంస్తథాభ్యర్దితాన్వీక్ష్య భగవానాత్మభూరజః
కృపయా పరయా దేవ ఉవాచ పరిసాన్త్వయన్

దయతో వారిని ఓదారుస్తూ బ్రహ్మగారిలా అన్నారు.

శ్రీబ్రహ్మోవాచ
అహో బత సురశ్రేష్ఠా హ్యభద్రం వః కృతం మహత్
బ్రహ్మిష్ఠం బ్రాహ్మణం దాన్తమైశ్వర్యాన్నాభ్యనన్దత

ఇప్పుడు వస్తే ఏమి లాభం. మీరు చాలా పెద్ద అమంగళం చేసారు. ఐశ్వర్యమదముతో బ్రహ్మిష్ఠుడైన, ఇంద్రియ నిగ్రహం కలవాడైన, బృహస్పతిని అవమానించినందుకే ఈ ఫలితం.

తస్యాయమనయస్యాసీత్పరేభ్యో వః పరాభవః
ప్రక్షీణేభ్యః స్వవైరిభ్యః సమృద్ధానాం చ యత్సురాః

మీరు గురువును అవమానిస్తే శత్రువులు మిమ్ములను అవమానించారు. వారు మీకంటే తక్కువ వారు. పెద్దలనవమానిస్తే తక్కిన ఏవీ మనను కాపాడలేవు

మఘవన్ద్విషతః పశ్య ప్రక్షీణాన్గుర్వతిక్రమాత్
సమ్ప్రత్యుపచితాన్భూయః కావ్యమారాధ్య భక్తితః
ఆదదీరన్నిలయనం మమాపి భృగుదేవతాః

ఇది వరకు రాక్షసులు గురువును దిక్కరించే ఓడిపోయారు. ఇపుడాతప్పు మీరు చేసారు. గురు కృప ఉంటే చిన్నవాడు కూడా పెద్దవాడవుతాడు. అదే రాక్షసులు గురువు గారిని భక్తితో ఆరాధించి బాగా పెరిగిపోయారు. వారు అనుకుంటే ఇప్పుడు నా లోకాన్ని కూడా ఆక్రమించుకోగలరు, ఎందుకంటే వారు గురువే దైవముగా ఉండిన వారు. వారికి వారి గురువు ఏ మంత్రం ఇచ్చారో తెలియదు.

త్రిపిష్టపం కిం గణయన్త్యభేద్య మన్త్రా భృగూణామనుశిక్షితార్థాః
న విప్రగోవిన్దగవీశ్వరాణాం భవన్త్యభద్రాణి నరేశ్వరాణామ్

బ్రాహ్మణులూ పరమాత్మా గోవులు. ఈ మూటినీ ఆరాధించేవారికి ఎక్కడా ఏ అమంగళమూ జరుగదు. ఇప్పుడు ఒకటే మార్గము. వారికి గురువున్నారు మీకు గురువు లేరు.  ముందు మీరు ఒక గురువును పట్టుకోండి.

తద్విశ్వరూపం భజతాశు విప్రం తపస్వినం త్వాష్ట్రమథాత్మవన్తమ్
సభాజితోऽర్థాన్స విధాస్యతే వో యది క్షమిష్యధ్వముతాస్య కర్మ

త్వష్ట యొక్క పుత్రుడు తపస్వీ మనోనిగ్రహం కలవాడూ అయిన విశ్వరూపుడు ఉన్నాడు. ఈయనను సక్రమముగా గౌర్వైంచ గలిగితే, తప్పు చేసినా ఊరుకుంటే, మీరు పోగొట్టుకున్నది మరలా ఆయన పొందింపచేస్తాడు

శ్రీశుక ఉవాచ
త ఏవముదితా రాజన్బ్రహ్మణా విగతజ్వరాః
ఋషిం త్వాష్ట్రముపవ్రజ్య పరిష్వజ్యేదమబ్రువన్

బ్రహ్మ ఈ విధముగా బోధించగానే వారు విగత జ్వరులై త్వాష్ట దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి కౌగిలించుకొని ఇలా అన్నాడు

శ్రీదేవా ఊచుః
వయం తేऽతిథయః ప్రాప్తా ఆశ్రమం భద్రమస్తు తే
కామః సమ్పాద్యతాం తాత పితౄణాం సమయోచితః

మేము నీకు అధితులుగా వచ్చాము. మేము నీకు తండ్రుల వరస వారము. మాకు ఈ సమయములో ఉన్న కోరిక మీరు తీర్చాలి. తండ్రిని సేవించుట సత్పుత్రుల పరమ ధర్మం సంతానం ఉన్నవారైనా సరే. ఇక బ్రహ్మచారులైన వారి గురించి వేరే చెప్పాలా?

పుత్రాణాం హి పరో ధర్మః పితృశుశ్రూషణం సతామ్
అపి పుత్రవతాం బ్రహ్మన్కిముత బ్రహ్మచారిణామ్

ఆచార్యో బ్రహ్మణో మూర్తిః పితా మూర్తిః ప్రజాపతేః
భ్రాతా మరుత్పతేర్మూర్తిర్మాతా సాక్షాత్క్షితేస్తనుః

గురువంటే పరబ్రహ్మ రూపం, ప్రజాపతి స్వరూపం తండ్రి, అన్నగారు మరుత్తుల స్వరూపం, తల్లి భూమికి ప్రతిరూపం.

దయాయా భగినీ మూర్తిర్ధర్మస్యాత్మాతిథిః స్వయమ్
అగ్నేరభ్యాగతో మూర్తిః సర్వభూతాని చాత్మనః

చెల్లెలు దయకు ప్రతిరూపం, ధర్మానికి ప్రతిరూపం ఆత్మ. అథితికి మర్యాద చేస్తే తనను తాను గౌరవించుకున్నట్లు అభ్యాగతుడు అగ్నికి ప్రతిరూపం, అన్ని ప్రాణులూ తనకు ప్రతిరూపాలు.

తస్మాత్పితౄణామార్తానామార్తిం పరపరాభవమ్
తపసాపనయంస్తాత సన్దేశం కర్తుమర్హసి

నీ తండ్రులమైన మేము శత్రువుల చేత అవమానించబడి ఉన్నాము. మా మాట వినవలసినది నీవు.  ఈ ఆపదలో నిన్ను పురోహితునిగా ఉండాలనుకుంటున్నాము.

వృణీమహే త్వోపాధ్యాయం బ్రహ్మిష్ఠం బ్రాహ్మణం గురుమ్
యథాఞ్జసా విజేష్యామః సపత్నాంస్తవ తేజసా

నీవు చిన్నవాడవైనా బ్రహ్మిష్ఠుడవు బ్రాహ్మణుడవు. నీ తేజస్సుతో మేము శత్రువులను సులభముగా గెలవాలి.

న గర్హయన్తి హ్యర్థేషు యవిష్ఠాఙ్ఘ్ర్యభివాదనమ్
ఛన్దోభ్యోऽన్యత్ర న బ్రహ్మన్వయో జ్యైష్ఠ్యస్య కారణమ్

అవసరం వచ్చినప్పుడు చిన్నవారి కాళ్ళు పట్టుకోవడం తక్కువతనం కాదు. వేదం కంటే ఇతర చోటనే చిన్నా పెద్దా అన్న లెక్క వస్తుంది. వైదిక ప్రక్రియలో వయస్సును లెక్కపెట్టాల్సిన పని లేదు.

శ్రీఋషిరువాచ
అభ్యర్థితః సురగణైః పౌరహిత్యే మహాతపాః
స విశ్వరూపస్తానాహ ప్రసన్నః శ్లక్ష్ణయా గిరా

ఇది విన్న మహాతపస్వి అయిన విశ్వరూపుడు ఇలా అన్నాడు.

శ్రీవిశ్వరూప ఉవాచ
విగర్హితం ధర్మశీలైర్బ్రహ్మవర్చౌపవ్యయమ్
కథం ను మద్విధో నాథా లోకేశైరభియాచితమ్
ప్రత్యాఖ్యాస్యతి తచ్ఛిష్యః స ఏవ స్వార్థ ఉచ్యతే

బుద్ధిమంతుడెవడూ పురోహితునిగా ఉండటానికి ఒప్పుకోడు. తపస్సుతో వచ్చే బ్రహ్మవర్చస్సంతా ఖర్చుపెట్టించేది పౌరోహిత్యము. కానీ మీరు లోకపాలకులు. మీచే యాచించబడిన దాన్ని తిరస్కరించ కూడదు. తిరస్కరిస్తే మీకూ నాకూ తేడా ఉండదు. అలా చేస్తే నేను స్వార్థపరున్ని అవుతాను.

అకిఞ్చనానాం హి ధనం శిలోఞ్ఛనం తేనేహ నిర్వర్తితసాధుసత్క్రియః
కథం విగర్హ్యం ను కరోమ్యధీశ్వరాః పౌరోధసం హృష్యతి యేన దుర్మతిః

మాలాంటి వారికి రెండు వృత్తులు ఉన్నాయి. శిల ( కిందబడిన దాన్ని ఏరుకోవడం) ఉంచ వృత్తి. శిలోచనమే మాకు ధనం. పది మంది నిందించే పౌరోహిత్యం చేస్తే దుష్టబుద్ధి కలవాడు సంతోషిస్తాడు.

తథాపి న ప్రతిబ్రూయాం గురుభిః ప్రార్థితం కియత్
భవతాం ప్రార్థితం సర్వం ప్రాణైరర్థైశ్చ సాధయే

మీరడిగిన దాన్ని నా ప్రాణం ఇచ్చైనా తీరుస్తాను.

శ్రీబాదరాయణిరువాచ
తేభ్య ఏవం ప్రతిశ్రుత్య విశ్వరూపో మహాతపాః
పౌరహిత్యం వృతశ్చక్రే పరమేణ సమాధినా

ఇలా వారి మాట విని వారితరపున పౌరోహిత్యం స్వీకరించాడు.

సురద్విషాం శ్రియం గుప్తామౌశనస్యాపి విద్యయా
ఆచ్ఛిద్యాదాన్మహేన్ద్రాయ వైష్ణవ్యా విద్యయా విభుః

శుక్రాచార్యుల మాయా విద్యతో రాక్షసులు సంపాదించిన త్రైలోక్యరాజ్యాన్ని వైష్ణవీ విద్యతో గెలిచి ఇంద్రునికి ఇచ్చాడు

యయా గుప్తః సహస్రాక్షో జిగ్యేऽసురచమూర్విభుః
తాం ప్రాహ స మహేన్ద్రాయ విశ్వరూప ఉదారధీః

ఇలా వైష్ణవ విద్యతో గెలిచిన రాజ్యాన్ని ఇంద్రునికిచ్చాడు. ఇలా వైష్ణవీ విద్యను ఇంద్రునికిచ్చాడు విశ్వరూపుడు.

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తతః ప్రాచేతసోऽసిక్న్యామనునీతః స్వయమ్భువా

షష్టిం సఞ్జనయామాస దుహితౄః పితృవత్సలాః
దశ ధర్మాయ కాయాదాద్ద్విషట్త్రిణవ చేన్దవే

బ్రహ్మ ఆజ్ఞ్య మేరకు దక్షుని భార్య యందు అరవై మంది పుత్రికలను సృష్టించాడు. వారికి తండ్రి మీద అపారమైన ప్రేమ కలదు. ధర్ముడికి పది మంది, పదమూడు మందిని కశ్యప ప్రజాపతికి, చంద్రుడికి ఇరవై ఏడు మంది

భూతాఙ్గిరఃకృశాశ్వేభ్యో ద్వే ద్వే తార్క్ష్యాయ చాపరాః
నామధేయాన్యమూషాం త్వం సాపత్యానాం చ మే శృణు

రుద్రునికి అంగిరసునికి అగ్నికి ఇద్దరేసి మంది తార్క్షునికి ఒకరిని. వారి పేర్లు విను

యాసాం ప్రసూతిప్రసవైర్లోకా ఆపూరితాస్త్రయః
భానుర్లమ్బా కకుద్యామిర్విశ్వా సాధ్యా మరుత్వతీ

వీరి సంతానమే మూడు లోకాలూ నిండి ఉన్నది.
భానుః, లంబా కకుద్యామిర్విశ్వా సాధ్యా మరుత్వతీ వసుర్ముహూర్తా సఙ్కల్పా - వీరంతా ధర్ముని భార్యలు

వసుర్ముహూర్తా సఙ్కల్పా ధర్మపత్న్యః సుతాఞ్శృణు
భానోస్తు దేవఋషభ ఇన్ద్రసేనస్తతో నృప

భానువు యొక్క సంతానం దేవఋషభుడు, అతనికి ఇంద్రసేనుడు

విద్యోత ఆసీల్లమ్బాయాస్తతశ్చ స్తనయిత్నవః
కకుదః సఙ్కటస్తస్య కీకటస్తనయో యతః

మనం పొందే ప్ర్తీ అనుభూతీ అచేతనం కాదు. ప్రతీ దానికి ఒక అధిష్ఠాన దేవత ఉంటుంది. అలాగే కంప అనే వాడు సంతానం. వణకడం ఈయన వలన వస్తుంది. శరీరములో కలిగే ప్రతీ వికారానికి ఒక అధిదేవత ఉంటుంది. ప్రతీ స్పందనకూ ప్రతినిధులున్నారు. విద్యోత (మెరుపు) , ఉరుము పుట్టారు.

భువో దుర్గాణి యామేయః స్వర్గో నన్దిస్తతోऽభవత్
విశ్వేదేవాస్తు విశ్వాయా అప్రజాంస్తాన్ప్రచక్షతే

భూ అనే ఆమెకు దుర్గాలు (కోటలు) దాని నుండి స్వర్గమూ నంది.
విశ్వేదేవాలు విశ్వేదవతలు పుట్టారు. వారికి సంతానం లేదు. అందుకే శ్రాద్ధములో వారికి అన్నం పెడతారు. మొదటి తర్పణం వారికే.

సాధ్యోగణశ్చ సాధ్యాయా అర్థసిద్ధిస్తు తత్సుతః
మరుత్వాంశ్చ జయన్తశ్చ మరుత్వత్యా బభూవతుః

సాధ్య అనే అమ్మాయికి సాధ్య గణం. వారికి అర్థ సిద్ధి సాధ్యం (ప్రయత్నం) నుంచి సిద్ధి (ఫలం)
మరుత్వతి అనే అమాయికి మరుత్వాన్ జయంతుడు అని కలిగారు.

జయన్తో వాసుదేవాంశ ఉపేన్ద్ర ఇతి యం విదుః
మౌహూర్తికా దేవగణా ముహూర్తాయాశ్చ జజ్ఞిరే

ఈ జయంతుడు వాసుదేవుని అంశ. ఇతనికి కూడా ఉపేంద్ర అని పేరు ఉంది. ముహూర్తా అనే ఆమెకు మౌహూర్తికా అనే దేవగణాలు పుట్టారు. మనమే ముహూర్తం పెట్టినా ఆ అధిదేవత ఆ ముహూర్తాన్ని ప్రసన్నముగా చూడాలి. శుభగ్రహాలు (గురు శుక్ర) ముహూర్తాన్ని చూస్తే మంచిది. ముహూర్త ధర్ముని భార్యలలో ఒకరు. మనం ధర్మాన్ని చక్కగా ఆచరిస్తే ముహూర్తం అతని సంతానమే కాబట్టి మనకు మంచే జరుగుతుంది. ధర్మం తప్పకుండా ఉంటే ముహూర్తం బాగుంటుంది.

యే వై ఫలం ప్రయచ్ఛన్తి భూతానాం స్వస్వకాలజమ్
సఙ్కల్పాయాస్తు సఙ్కల్పః కామః సఙ్కల్పజః స్మృతః

ఈ మౌహూర్తి గణములే ప్రపంచములో అన్ని ప్రాణులూ తమ తమ సమయములో రావలసిన ఫలితాన్ని ఇస్తాయి. సంకల్ప అనే ఆమెనుండి సంకల్పం, ఆ సంకల్పం నుంచి కామ (కోరిక).

వసవోऽష్టౌ వసోః పుత్రాస్తేషాం నామాని మే శృణు
ద్రోణః ప్రాణో ధ్రువోऽర్కోऽగ్నిర్దోషో వాస్తుర్విభావసుః

వసువుకు ఎనిమిది పుత్రులు. వారి పేర్లు. ద్రోణః ప్రాణో ధ్రువోऽర్కోऽగ్నిర్దోషో వాస్తుర్విభావసుః

ద్రోణస్యాభిమతేః పత్న్యా హర్షశోకభయాదయః
ప్రాణస్యోర్జస్వతీ భార్యా సహ ఆయుః పురోజవః

ద్రోణునికి అభిమతి అన్న భార్య నుండి హర్ష శోకము మొదలైనవి కలిగాయి పుత్రులుగా

ధ్రువస్య భార్యా ధరణిరసూత వివిధాః పురః
అర్కస్య వాసనా భార్యా పుత్రాస్తర్షాదయః స్మృతాః

ధ్రువుని భార్య ధరణి. (వీరే నంద యశొదలు). వీరికి పురములు సంతానం. అర్కుడి భార్య పేరు వాసన. సంతానం హర్షము.

అగ్నేర్భార్యా వసోర్ధారా పుత్రా ద్రవిణకాదయః
స్కన్దశ్చ కృత్తికాపుత్రో యే విశాఖాదయస్తతః

అగ్ని భార్య వసుధార (నెయ్యి) వారి సంతానం ద్రవిణ ( ద్రవ్యం, దక్షిణ). కృత్తిక యొక్క పుత్రులు స్కంధుడు. ఆయన నుండి విశాఖాదులు

దోషస్య శర్వరీపుత్రః శిశుమారో హరేః కలా
వాస్తోరాఙ్గిరసీపుత్రో విశ్వకర్మాకృతీపతిః

దోషునికి శర్వరీ పుత్ర. వీరికి శిశుమారుడని పరమాత్మ అంశ పుట్టారు. వసువుకు ఆంగీరసుని నుంచి విశ్వకర్మ పుట్టాడు.

తతో మనుశ్చాక్షుషోऽభూద్విశ్వే సాధ్యా మనోః సుతాః
విభావసోరసూతోషా వ్యుష్టం రోచిషమాతపమ్

విశ్వకర్మ నుండి మనువు. వారి నుండి విశ్వే సాధ్యా అని పుట్టారు. అగ్నిహోత్రుని నుండి ఉష ముగ్గురిని కన్నది

పఞ్చయామోऽథ భూతాని యేన జాగ్రతి కర్మసు
సరూపాసూత భూతస్య భార్యా రుద్రాంశ్చ కోటిశః

రోజుకు ఐదు ఝాములు. ఐదు ఝాములు గల దినములో అన్ని ప్రాణులూ కర్మలు చేస్తాయి. పగలు అందరూ పని చేస్తారు. రుద్రుని భార్య సరూప కోటి మంది రుద్రులని సృష్టించింది

రైవతోऽజో భవో భీమో వామ ఉగ్రో వృషాకపిః
అజైకపాదహిర్బ్రధ్నో బహురూపో మహానితి

వీరు ఏకాదశ రుద్రులు. వీరికి కోట్ల మంది ప్రాశ్వదులు ఉన్నారు.

రుద్రస్య పార్షదాశ్చాన్యే ఘోరాః ప్రేతవినాయకాః
ప్రజాపతేరఙ్గిరసః స్వధా పత్నీ పితౄనథ

అంగిరుడికి స్వధా అన్న భార్యకు కలిగిన వారు పితృదేవతలు. మనం ఇచ్చేది వీరికే శ్రాద్ధాది కర్మలలో. అందుకే స్వధాకారముతో (తల్లి చేత) వీరికే ఇస్తాము.

అథర్వాఙ్గిరసం వేదం పుత్రత్వే చాకరోత్సతీ
కృశాశ్వోऽర్చిషి భార్యాయాం ధూమకేతుమజీజనత్

వీరు అధర్వణ వేదాన్ని స్వీకరించారు. అగ్నిహోత్రుడు తన భార్య అయిన అర్చిషులో ధూమకేతున్ని కన్నాడు

ధిషణాయాం వేదశిరో దేవలం వయునం మనుమ్
తార్క్ష్యస్య వినతా కద్రూః పతఙ్గీ యామినీతి చ

కార్క్షునికి వినతా కద్రూ పతంగి యామినీ. పతంగి పక్షులనీ, యామిని మిడతలనూ, వినత పరమాత్మ వాహనమైన గరుడుడినీ, పొందింది

పతఙ్గ్యసూత పతగాన్యామినీ శలభానథ
సుపర్ణాసూత గరుడం సాక్షాద్యజ్ఞేశవాహనమ్
సూర్యసూతమనూరుం చ కద్రూర్నాగాననేకశః

వినతకు కలిగిన ఇంకో కుమారుడు అనూరుడు, ఊరువులు లేని వాడు. కద్రువు నాగాదులని పొందింది

కృత్తికాదీని నక్షత్రాణీన్దోః పత్న్యస్తు భారత
దక్షశాపాత్సోऽనపత్యస్తాసు యక్ష్మగ్రహార్దితః

చంద్రుని భార్య కృత్రికాదులు. వారికి సంతానం కలగలేదు దక్షుని శాపం వలన.

పునః ప్రసాద్య తం సోమః కలా లేభే క్షయే దితాః
శృణు నామాని లోకానాం మాతౄణాం శఙ్కరాణి చ

దక్షున్ని మరలా ప్రసన్నం చేసుకుని తన కళలను మళ్ళీ పొందాడు. వారి పేర్లు చెబుతాను విను.

అథ కశ్యపపత్నీనాం యత్ప్రసూతమిదం జగత్
అదితిర్దితిర్దనుః కాష్ఠా అరిష్టా సురసా ఇలా

సకల లోకాలకూ హితం కలిగించే కశ్యప ప్రజాపతి భార్యల పేర్లు చెబుతాను విను. వారితోనే ఈ జగత్తు ఏర్పడింది.

మునిః క్రోధవశా తామ్రా సురభిః సరమా తిమిః
తిమేర్యాదోగణా ఆసన్శ్వాపదాః సరమాసుతాః

ఈ పదమూడు మందిలో తిమికి యాదో గణాలు (నీటిలో ఉండేవారు). సరమ కు సారమేయులు (కుక్కలు)

సురభేర్మహిషా గావో యే చాన్యే ద్విశఫా నృప
తామ్రాయాః శ్యేనగృధ్రాద్యా మునేరప్సరసాం గణాః

సురభి నుండి గేదెలూ గావులు. రెండు గిట్టలున్న జంతువులన్నీ ఈవిడ సంతానమే. తామ్రకు డేగలూ గద్దలు. మునికి అప్సరసలు

దన్దశూకాదయః సర్పా రాజన్క్రోధవశాత్మజాః
ఇలాయా భూరుహాః సర్వే యాతుధానాశ్చ సౌరసాః

క్రోధవత్తుకు సర్పాలు. ఇలా అనే భార్యకు భూరుహా (వృక్షములు) సురసకు రాక్షసులు అరిష్టకు గంధర్వులు కాష్టకు ఒక గిట్ట ఉన్న సంతానం

అరిష్టాయాస్తు గన్ధర్వాః కాష్ఠాయా ద్విశఫేతరాః
సుతా దనోరేకషష్టిస్తేషాం ప్రాధానికాఞ్శృణు

ధను యొక్క పుత్రులు అరవై ఒక్క మంది. వారిలో ముఖ్యులు

ద్విమూర్ధా శమ్బరోऽరిష్టో హయగ్రీవో విభావసుః
అయోముఖః శఙ్కుశిరాః స్వర్భానుః కపిలోऽరుణః

పులోమా వృషపర్వా చ ఏకచక్రోऽనుతాపనః
ధూమ్రకేశో విరూపాక్షో విప్రచిత్తిశ్చ దుర్జయః

స్వర్భానోః సుప్రభాం కన్యామువాహ నముచిః కిల
వృషపర్వణస్తు శర్మిష్ఠాం యయాతిర్నాహుషో బలీ

స్వర్భాను యొక్క బిడ్డను నముచి వివాహం చేసుకున్నాడు. వృషపర్వణుడి కుమార్తే శర్మిష్ట, ఈమెను యయాతి మహారాజు పెళ్ళి చేసుకున్నాడు

వైశ్వానరసుతా యాశ్చ చతస్రశ్చారుదర్శనాః
ఉపదానవీ హయశిరా పులోమా కాలకా తథా

ఉపదానవీం హిరణ్యాక్షః క్రతుర్హయశిరాం నృప
పులోమాం కాలకాం చ ద్వే వైశ్వానరసుతే తు కః

ఉపయేమేऽథ భగవాన్కశ్యపో బ్రహ్మచోదితః
పౌలోమాః కాలకేయాశ్చ దానవా యుద్ధశాలినః

పులోమా పుత్రులు కాలకేయులు అరవై వేల మంది. వీరు ఎవరు యజ్ఞ్యం చేసినా ధ్వంసం చేస్తారు.

తయోః షష్టిసహస్రాణి యజ్ఞఘ్నాంస్తే పితుః పితా
జఘాన స్వర్గతో రాజన్నేక ఇన్ద్రప్రియఙ్కరః

వీరిని మీ తాతగారు చంపారు.

విప్రచిత్తిః సింహికాయాం శతం చైకమజీజనత్
రాహుజ్యేష్ఠం కేతుశతం గ్రహత్వం య ఉపాగతాః

విప్రచిత్తి సింహిక యందు నూట ఒక మంది సంతానం పొందారు. రాహువు కేతువులు మొదట చివరి వారు

అథాతః శ్రూయతాం వంశో యోऽదితేరనుపూర్వశః
యత్ర నారాయణో దేవః స్వాంశేనావాతరద్విభుః

అధితి వంశాన్ని చెబుతాను విను. ఈ అధితి వంశములోనే శ్రీమన్నారాయణుడు అవతరించాడు.

వివస్వానర్యమా పూషా త్వష్టాథ సవితా భగః
ధాతా విధాతా వరుణో మిత్రః శత్రు ఉరుక్రమః

వీరు ద్వాదశాదిత్యులు. అదితి పుత్రులంతా ఆదిత్యులు, దితి పుత్రులు దైత్యులు.

వివస్వతః శ్రాద్ధదేవం సంజ్ఞాసూయత వై మనుమ్
మిథునం చ మహాభాగా యమం దేవం యమీం తథా
సైవ భూత్వాథ వడవా నాసత్యౌ సుషువే భువి

సూర్యుని భార్య సజ్ఞ్య, వీరికి శ్రాద్ధ దేవుడు. వీరికే యముడూ యమునా కలిగారు. సూర్యభగవానుని తాపాన్ని తట్టుకోలేక నీడకి ప్రాణం పోసి ఆమెనుంచి ఈమె వెళ్ళిపోయింది. చాయతో సూర్యునికి కలిగినవారు శని. వడవ యందు అశ్వినీ దేవతలూ

ఛాయా శనైశ్చరం లేభే సావర్ణిం చ మనుం తతః
కన్యాం చ తపతీం యా వై వవ్రే సంవరణం పతిమ్

చాయకు సూర్యునికీ శనీ, సావర్ణి పుట్టారు. ఈ సావర్ణి మనువు. వైవస్వత మనువు అని అంటారు. ఈమెకు తపతి అన్న కుమార్తె. ఈమె సంవరణున్ని పతిగా పొందింది.

అర్యమ్ణో మాతృకా పత్నీ తయోశ్చర్షణయః సుతాః
యత్ర వై మానుషీ జాతిర్బ్రహ్మణా చోపకల్పితా

అర్యమ భార్య మాతృక, వీరికి చర్షణి పుట్టింది. చర్షణి అంటే కర్మ. చర్షణులంటే కర్మ కారులు. ఈ చర్షణ నుంచే మనుష్య జాతి పుట్టింది.

పూషానపత్యః పిష్టాదో భగ్నదన్తోऽభవత్పురా
యోऽసౌ దక్షాయ కుపితం జహాస వివృతద్విజః

పూషకు పళ్ళు లేవు. ఇతను పిండి తింటాడు. శంకరున్ని దక్షుడు అవమానించినప్పుడు పళ్ళతో (ద్విజ - రెండు సార్లు వచ్చేవి) నవ్వాడు. పళ్ళు లేని కారణముగా ఈయనకు పిల్లలు లేరు. త్వష్ట భార్య రచన. వీరిద్దరి సంతానమే విశ్వరూపుడు. ఈ త్వష్ట ద్వాదశాదిత్యులలో ఒకడు

త్వష్టుర్దైత్యాత్మజా భార్యా రచనా నామ కన్యకా
సన్నివేశస్తయోర్జజ్ఞే విశ్వరూపశ్చ వీర్యవాన్

త్వష్ట భార్య రాక్షస స్త్రీ. ఆమెను వివాహం చేసుకున్నందు వలన విశ్వరూపుడు రాక్షసులంటే ప్రేమగా ఎక్కువగా ఉండేవాడు. ఈ విశ్వరూపుడే దేవతలకు గురువుగా ఉండేవాడు.

తం వవ్రిరే సురగణా స్వస్రీయం ద్విషతామపి
విమతేన పరిత్యక్తా గురుణాఙ్గిరసేన యత్

ఇంద్రుడు ఇతన్ని గురువుగా ఎందుకు స్వీకరించాడంటే ఇంద్రుడు త్రైలోక్య రాజ్యమదముతో బృహస్పతిని అవమానించాడు. అవమానానికి గురైన బృహస్పతి తప్పుకోగానే రాక్షసులు దాడి చేసారు.

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ఐదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
తస్యాం స పాఞ్చజన్యాం వై విష్ణుమాయోపబృంహితః
హర్యశ్వసంజ్ఞానయుతం పుత్రానజనయద్విభుః

పాంచజనిని పెళ్ళి చేసుకుని పదివేల మంది పుత్రులను పొందాడు

అపృథగ్ధర్మశీలాస్తే సర్వే దాక్షాయణా నృప
పిత్రా ప్రోక్తాః ప్రజాసర్గే ప్రతీచీం ప్రయయుర్దిశమ్

ఈ పదివేల మందీ ఒకే స్వభావం గలవారు ఒకే ధర్మాన్ని ఆచరించేవారు. తండ్రి మాట విని ఉత్తమ సంతానం పొందడానికి పశ్చిమ దిక్కుకు బయలు దేరారు

తత్ర నారాయణసరస్తీర్థం సిన్ధుసముద్రయోః
సఙ్గమో యత్ర సుమహన్మునిసిద్ధనిషేవితమ్

సముద్రము నుండి వచ్చిన నారాయణ తీర్థానికి వెళ్ళారు. నదీ సముద్ర సంగమం సర్వ శ్రేష్టం కాబట్టి అక్కడ నిరంతరం మునులూ సిద్ధులూ ఉంటారు

తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయాః
ధర్మే పారమహంస్యే చ ప్రోత్పన్నమతయోऽప్యుత

అలాంటి పవిత్ర జలాన్ని ఆచమనం చేసినందు వలన వారి మనసులో మురికి పోయి భగవంతుని మీద రుచి కలిగి తండ్రి ఆజ్ఞ్యతో ఉగ్రమైన తపస్సు చేసారు

తేపిరే తప ఏవోగ్రం పిత్రాదేశేన యన్త్రితాః
ప్రజావివృద్ధయే యత్తాన్దేవర్షిస్తాన్దదర్శ హ

ప్రజా సృష్టి పెరగడానికి కావలసిన ప్రయత్నం చేయడానికి పరమాత్మ గురించి తపస్సు చేసారు

ఉవాచ చాథ హర్యశ్వాః కథం స్రక్ష్యథ వై ప్రజాః
అదృష్ట్వాన్తం భువో యూయం బాలిశా బత పాలకాః

అక్కడికి నారదుడు వచ్చాడు. "మీరు ప్రజలను ఎలా సృష్టిస్తారు. ఉండడానికి ఎంత భూమి ఉందో తెలుసా మీకు. సృష్టించిన ప్రతీ వారికీ ఆశ్రయమివ్వగలరా? భూమి యొక్క అంతము తెలియదు మీకు. మూర్ఖులులా ఎలా సృష్టిస్తారు"

తథైకపురుషం రాష్ట్రం బిలం చాదృష్టనిర్గమమ్
బహురూపాం స్త్రియం చాపి పుమాంసం పుంశ్చలీపతిమ్

ఈ ప్రపంచం మొత్తం ఒకే పురుషుడు ఉన్నాడు. ఈ శరీరములో ఉన్న పురుషుడు (జీవాత్మ) ఒక్కడే. దారి తెలియని బిలం ఒకటి ఉంది (బ్రహ్మాండం). స్త్రీ(బుద్ధి) చాలా రూపాలతో వస్తుంది. జీవుడు వేశ్యా భర్త.

నదీముభయతో వాహాం పఞ్చపఞ్చాద్భుతం గృహమ్
క్వచిద్ధంసం చిత్రకథం క్షౌరపవ్యం స్వయం భ్రమి

ఒక నది (సంసారం) రెండు వైపులా ప్రవహిస్తూ ఉంటుంది (నివృత్తి ప్రవృత్తి మార్గాలు). ఇంటిలో ఐదు, ఐదు,, మొత్తం పది మంది ఉంటారు. కొన్ని చోట్ల హంస (జ్ఞ్యానం) ఉంటుంది. పదునైన ఆయుధము గలిగి తనకు తాను తిరిగేది (కాలం) ఒకటుంది

కథం స్వపితురాదేశమవిద్వాంసో విపశ్చితః
అనురూపమవిజ్ఞాయ అహో సర్గం కరిష్యథ

మీరున్న సంసారములో ఏదైనా బాగున్నదా? తండ్రి చెప్పాడన్న ఒకే ఒక్క సాకుతో "ఇది నాకు తగినదా కాదా" అన్న ఆలోచనతోనే మీరు సృష్టిచేస్తున్నారా?

శ్రీశుక ఉవాచ
తన్నిశమ్యాథ హర్యశ్వా ఔత్పత్తికమనీషయా
వాచః కూటం తు దేవర్షేః స్వయం విమమృశుర్ధియా

ఇది విన్న ఆ దక్షుని కుమారులు, సృష్టి చేయాలన్న కోరికతో ఉన్నవారు నారదుడు ఆడిన మాటల మోహములో పడ్డారు. ఏమి చేయాలో ఆలోచిస్తున్నారు

భూః క్షేత్రం జీవసంజ్ఞం యదనాది నిజబన్ధనమ్
అదృష్ట్వా తస్య నిర్వాణం కిమసత్కర్మభిర్భవేత్

రాష్ట్రం అంటే భూమి, జీవుడు పురుషుడు. మాయకు కూడా పరమాత్మ లాగే ఆది లేదు. ఇలాంటి పరమాత్మ ప్రకృతి స్వరూపాన్ని మాయనూ తెలుసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే లాభం ఏమిటి. స్వరూప స్వభావం జ్ఞ్యానం లేకుండా ఆచరించే కర్మల వలన మనకేమి ఒరుగుతుంది.

ఏక ఏవేశ్వరస్తుర్యో భగవాన్స్వాశ్రయః పరః
తమదృష్ట్వాభవం పుంసః కిమసత్కర్మభిర్భవేత్

ఇక్కడిదాకా వచ్చి ఎక్కడికి వెళతాడో, ఎప్పుడు వెళతాడో తెలియలేడు.

పుమాన్నైవైతి యద్గత్వా బిలస్వర్గం గతో యథా
ప్రత్యగ్ధామావిద ఇహ కిమసత్కర్మభిర్భవేత్

ఆత్మ పరమాత్మ యొక్క స్వరూపం తెలియని వారు చేసిన అసత్కర్మలతో ఏమి ప్రయోజనం.

నానారూపాత్మనో బుద్ధిః స్వైరిణీవ గుణాన్వితా
తన్నిష్ఠామగతస్యేహ కిమసత్కర్మభిర్భవేత్

స్త్రీ అంటే నానా రూపాలతో (సాత్విక రాజస తామస) ఉండే బుద్ధి. ఇలాంటి బుద్ధి వేశ్య లాగ తన స్వరూప స్వభావాన్ని మార్చుకుంటుంది. అలాంటి బుద్ధికి లొంగినవాడు చేసే పనులతో ఏమి ప్రయోజనం.

తత్సఙ్గభ్రంశితైశ్వర్యం సంసరన్తం కుభార్యవత్
తద్గతీరబుధస్యేహ కిమసత్కర్మభిర్భవేత్

అలాంటి వారి సంగముతో తొలగిపోయిన ఐశ్వర్యం కలవాడై సంసారములో "చేడు భార్య" సంచరించినట్లుగా సంచరిస్తూ ఉంటాడు. విషయాన్ని తెలుసుకోకుండా కర్మలాచరిస్తే ఫలితం ఉండదు.

సృష్ట్యప్యయకరీం మాయాం వేలాకూలాన్తవేగితామ్
మత్తస్య తామవిజ్ఞస్య కిమసత్కర్మభిర్భవేత్

జగత్తు సృష్టించబడుతున్నదీ, సంహరించబడుతున్నది పరమాత్మ చేత. పరమాత్మ తానేమీ చేయడు. తన మాయ చేస్తుంది. ఇలాంటి ప్రకృతి స్వరూపం తెలుసుకోకుండా ఆచరించే కర్మల ఫలితం ఏమిటి.

పఞ్చవింశతితత్త్వానాం పురుషోऽద్భుతదర్పణః
అధ్యాత్మమబుధస్యేహ కిమసత్కర్మభిర్భవేత్

ఇరవై ఐదు తత్వములకూ దర్పణం ఎవరు? పురుషుడు. ఇరవై నాలుగు తత్వములతో ఏర్పడిన జీవుడు తానేర్పడిన తత్వముల గురించి తెలియకుండా పనులు చేస్తే ఏమి లాభం.

ఐశ్వరం శాస్త్రముత్సృజ్య బన్ధమోక్షానుదర్శనమ్
వివిక్తపదమజ్ఞాయ కిమసత్కర్మభిర్భవేత్

నరకం మోక్షం గురించి చెప్పే వేదాంత సారము తెలియకుండా పరమాత్మ ఉండే చోటుని తెలుసుకోకుండా పనులు చేస్తే ఏమి లాభం

కాలచక్రం భ్రమి తీక్ష్ణం సర్వం నిష్కర్షయజ్జగత్
స్వతన్త్రమబుధస్యేహ కిమసత్కర్మభిర్భవేత్

సకల జగత్తునూ కాల చక్రం నడిపిస్తూ ఉంటుంది. జీవుడు కాలాధీనుడు ప్రకృతి అధీనుడు లేదా గుణాధీనుడు. స్వతంత్ర్యుడు కాని జీవుడు సృష్టి ఎలా చేస్తాడు.

శాస్త్రస్య పితురాదేశం యో న వేద నివర్తకమ్
కథం తదనురూపాయ గుణవిస్రమ్భ్యుపక్రమేత్

శాస్త్రమును కూడా మాని తండ్రి ఆజ్ఞ్యను పరిపాలిస్తారు. ఇలాంటి స్వరూపానికి తత్వానికీ గుణముల యందు ఆసక్తి ఉన్నవాడు తండ్రి ఆజ్ఞ్య యొక్క స్వరూపాన్ని తెలియకుండా పని ఎలా ప్రారంభిస్తారు

ఇతి వ్యవసితా రాజన్హర్యశ్వా ఏకచేతసః
ప్రయయుస్తం పరిక్రమ్య పన్థానమనివర్తనమ్

నారదుడు చెప్పినదాన్ని గూర్చి హర్యశ్వులు ఇలా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చారు.
ఇంత మంచి దారి చూపించినందు నారదునికి ముమ్మారు ప్రదక్షిణం చేసి నమస్కరించి తిరిగిరాని చోటికి (మోక్షానికి ) వేళ్ళిపోయారు

స్వరబ్రహ్మణి నిర్భాత హృషీకేశపదామ్బుజే
అఖణ్డం చిత్తమావేశ్య లోకాననుచరన్మునిః

నారదుడు తన వీణను మీటుతూ ప్రపంచమనతా సంచరిస్తున్నాడు.

నాశం నిశమ్య పుత్రాణాం నారదాచ్ఛీలశాలినామ్
అన్వతప్యత కః శోచన్సుప్రజస్త్వం శుచాం పదమ్

ఈ విషయం దక్షునికి తెలిసింది. అన్ని దు@ఖాలకు సంతానమే మూలమని ఆలోచిస్తూ ఉండగా

స భూయః పాఞ్చజన్యాయామజేన పరిసాన్త్వితః
పుత్రానజనయద్దక్షః సవలాశ్వాన్సహస్రిణః

బ్రహ్మ వచ్చి ఓదార్చాడు. దాని వలన మళ్ళీ ఇంకో పదివేల మంది సంతానాన్ని పొందాడు

తే చ పిత్రా సమాదిష్టాః ప్రజాసర్గే ధృతవ్రతాః
నారాయణసరో జగ్ముర్యత్ర సిద్ధాః స్వపూర్వజాః

వారు కూడా వారి అన్నలు ఎక్కడ తపస్సు చేసారో అక్కడికే వెళ్ళారు తపస్సుకు

తదుపస్పర్శనాదేవ వినిర్ధూతమలాశయాః
జపన్తో బ్రహ్మ పరమం తేపుస్తత్ర మహత్తపః

ఆచమనం చేసి స్నానం చేసి గొప్ప తపస్సు చేసారు

అబ్భక్షాః కతిచిన్మాసాన్కతిచిద్వాయుభోజనాః
ఆరాధయన్మన్త్రమిమమభ్యస్యన్త ఇడస్పతిమ్

నీరు లేక వాయువును ఆహారముగా తీసుకుంటూ

ఓం నమో నారాయణాయ పురుషాయ మహాత్మనే
విశుద్ధసత్త్వధిష్ణ్యాయ మహాహంసాయ ధీమహి

ఈ మంత్రాన్ని జపిస్తూ. ఐశ్వర్యానికీ సంతానానికీ మానసిక దిగులు లేకుండా ఉండటానికి దీన్ని జపించాలి

ఇతి తానపి రాజేన్ద్ర ప్రజాసర్గధియో మునిః
ఉపేత్య నారదః ప్రాహ వాచః కూటాని పూర్వవత్

నారదుడు ఈ విషయం తెలుసుకుని మొదటి వారికి చెప్పినట్లుగా కపట వాక్యాలు చెప్పాడు

దాక్షాయణాః సంశృణుత గదతో నిగమం మమ
అన్విచ్ఛతానుపదవీం భ్రాతౄణాం భ్రాతృవత్సలాః

నేను చెప్పిన దాన్ని జాగ్రత్తగా వినండి. ఇక్కడికే వచ్చిన మీ అన్నలు ఏమయ్యారో తెలుసా. మొదట వారెక్కడున్నారో తెలుసుకోవద్దా?

భ్రాతౄణాం ప్రాయణం భ్రాతా యోऽనుతిష్ఠతి ధర్మవిత్
స పుణ్యబన్ధుః పురుషో మరుద్భిః సహ మోదతే

అన్నల మార్గాన్ని ఆచరించిన వాడే పుణ్యాత్ముడు. వాడికి మరుత్తు లోకం వస్తుంది

ఏతావదుక్త్వా ప్రయయౌ నారదోऽమోఘదర్శనః
తేऽపి చాన్వగమన్మార్గం భ్రాతౄణామేవ మారిష

తమ్ములు అన్నలని వెతుకుతూ వెళ్ళారు

సధ్రీచీనం ప్రతీచీనం పరస్యానుపథం గతాః
నాద్యాపి తే నివర్తన్తే పశ్చిమా యామినీరివ

కాసేపు తూర్పు పశ్చిమ ఉత్తరం దక్షిణం వెతికారు. వారు దొరకలేదు. ఇప్పటికీ వీరు తిరిగి రాలేదు.

ఏతస్మిన్కాల ఉత్పాతాన్బహూన్పశ్యన్ప్రజాపతిః
పూర్వవన్నారదకృతం పుత్రనాశముపాశృణోత్

దక్షునికి అన్నీ దుశ్శకునాలు కలిగి, విషయం తెలుసుకుని శోకముతో కోపం వచ్చి

చుక్రోధ నారదాయాసౌ పుత్రశోకవిమూర్చ్ఛితః
దేవర్షిముపలభ్యాహ రోషాద్విస్ఫురితాధరః

కోపముతో నారదున్ని శపించాడు.

శ్రీదక్ష ఉవాచ
అహో అసాధో సాధూనాం సాధులిఙ్గేన నస్త్వయా
అసాధ్వకార్యర్భకాణాం భిక్షోర్మార్గః ప్రదర్శితః

నీవు మంచి వాడి వేషములో ఉన్న దుర్మార్గుడవు. చిన్న పిల్లలకి ధర్మం తెలియని అర్భకులను సన్యాసం ఇచ్చావు.

ఋణైస్త్రిభిరముక్తానామమీమాంసితకర్మణామ్
విఘాతః శ్రేయసః పాప లోకయోరుభయోః కృతః

సన్యాసం స్వీకరించాలంటే ఋణత్ర్యాన్ని పోగొట్టుకోవాలి. అధ్యయనం యజ్ఞ్య యాగాదులు చేసి సంతానము పొందాలి. కర్మ యొక్క స్వరూప స్వభావమే వారికి తెలియదు. ఈ లోకం ఆ లోకం కూడా అందకుండా చేసావు

ఏవం త్వం నిరనుక్రోశో బాలానాం మతిభిద్ధరేః
పార్షదమధ్యే చరసి యశోహా నిరపత్రపః

చిన్న పిల్లల బుద్ధిని దయలేని వాడవై భేధించావు. పరమాత్మ భక్తుల మధ్య ఉండి వారి కీర్తిని పాడుచేస్తున్నావు

నను భాగవతా నిత్యం భూతానుగ్రహకాతరాః
ఋతే త్వాం సౌహృదఘ్నం వై వైరఙ్కరమవైరిణామ్

పరమాత్మ భక్తులు సకల ప్రాణులనూ దయ చూస్తారు, నీవొక్కడవు తప్ప. స్నేహితులనీ స్నేహాన్ని నశింపచేసావు. నాకు నీవు శత్రువుకావు. అయినా ఇపుడు శత్రువయ్యావు

నేత్థం పుంసాం విరాగః స్యాత్త్వయా కేవలినా మృషా
మన్యసే యద్యుపశమం స్నేహపాశనికృన్తనమ్

నిన్ను నీవు విరాగివనుకుంటున్నావు గానీ అది అబద్దం. నీవు జ్ఞ్యానన్ని తత్వాన్నీ బోధించానని అనుకుంటున్నావు. పరమాత్మ స్వరూపం తెలియాలంటే ఉన్న దానిలో చెడు తెలిస్తేనే కొత్తదానికోసం ప్రయత్నం చేస్తాము. సంసారములోకి ప్రవేశించకుండానే వెళ్ళగొడితే ధర్మ స్వరూపం గానీ కర్మ స్వరూపం గానీ ఎలా తెలుసుతుంది

నానుభూయ న జానాతి పుమాన్విషయతీక్ష్ణతామ్
నిర్విద్యతే స్వయం తస్మాన్న తథా భిన్నధీః పరైః

నీలాంటి వానితో బుద్ధి భేధించబడకుండా ఉంటే ఎవరూ సంసారములో ప్రవేశించకుండా విరక్తులు కారు మేమంతా పరమాత్మ ఆజ్ఞ్యగా కర్మలను ఆచరించేవారము. మేము సాధువులము గృహస్థులము

యన్నస్త్వం కర్మసన్ధానాం సాధూనాం గృహమేధినామ్
కృతవానసి దుర్మర్షం విప్రియం తవ మర్షితమ్

తన్తుకృన్తన యన్నస్త్వమభద్రమచరః పునః
తస్మాల్లోకేషు తే మూఢ న భవేద్భ్రమతః పదమ్

మా వంశాన్ని చేధించినవాడవు కాబట్టి మాకు అమంగళాన్ని ఆచరించావు. సంసారములో  మాకు చోటు లేకుండా చేసావు కాబట్టి మూడు లోకాలలో నీకు స్థిరమైన ఆవాసముండదు. నువ్వు తిరుగుతూనే ఉంటావు.

శ్రీశుక ఉవాచ
ప్రతిజగ్రాహ తద్బాఢం నారదః సాధుసమ్మతః
ఏతావాన్సాధువాదో హి తితిక్షేతేశ్వరః స్వయమ్

సాధు సమ్మతుడైన, ఓర్పు గల నారదుడు ఆ శాపాన్ని స్వీకరించాడు.  

Wednesday, April 3, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీరాజోవాచ
దేవాసురనృణాం సర్గో నాగానాం మృగపక్షిణామ్
సామాసికస్త్వయా ప్రోక్తో యస్తు స్వాయమ్భువేऽన్తరే

తస్యైవ వ్యాసమిచ్ఛామి జ్ఞాతుం తే భగవన్యథా
అనుసర్గం యయా శక్త్యా ససర్జ భగవాన్పరః

స్వాయంభువ మన్వంతరములో దేవ దానవ సిద్ధ సాధ్యుల సృష్టి జరిగినదని (అనుసర్గ) చెప్పావు. దానిని విస్తారముగా తెలుసుకోవాలనుకుంటున్నాను.

శ్రీసూత ఉవాచ
ఇతి సమ్ప్రశ్నమాకర్ణ్య రాజర్షేర్బాదరాయణిః
ప్రతినన్ద్య మహాయోగీ జగాద మునిసత్తమాః

మంచి ప్రశ్న అడిగావని అభినందించి ఇలా చెప్పాడు శుకుడు

శ్రీశుక ఉవాచ
యదా ప్రచేతసః పుత్రా దశ ప్రాచీనబర్హిషః
అన్తఃసముద్రాదున్మగ్నా దదృశుర్గాం ద్రుమైర్వృతామ్

ప్రాచీన బర్హి పది మంది కుమారులు ప్రాచేతసులు తపస్సు నుంచి బయటకు వచ్చి చూస్తే భూమి కనపడక కేవలం చెట్లతో కప్పబడి ఉనంది

ద్రుమేభ్యః క్రుధ్యమానాస్తే తపోదీపితమన్యవః
ముఖతో వాయుమగ్నిం చ ససృజుస్తద్దిధక్షయా

అది చూసిన వారికి కోపం వచ్చెసింది. తమ తపః ప్రభావముతో నొటి నుండి అగ్నినీ వాయువునూ విడిచిపెట్టారు

తాభ్యాం నిర్దహ్యమానాంస్తానుపలభ్య కురూద్వహ
రాజోవాచ మహాన్సోమో మన్యుం ప్రశమయన్నివ

ఇలా వారు చెట్లను తగలబెడుతూ ఉంటే చంద్రుడు (చెట్లకు అధిపతి) వచ్చి

న ద్రుమేభ్యో మహాభాగా దీనేభ్యో ద్రోగ్ధుమర్హథ
వివర్ధయిషవో యూయం ప్రజానాం పతయః స్మృతాః

దీనములైన చెట్లకు మీరు ద్రోహం చేయకూడదు. మీరు సృష్టిని పెంచాలనుకుంటున్నారు. అలాంటి వారు సృష్టిలో భాగమైన చెట్లను నరకరాదు.

అహో ప్రజాపతిపతిర్భగవాన్హరిరవ్యయః
వనస్పతీనోషధీశ్చ ససర్జోర్జమిషం విభుః

మీరిప్పుడు ప్రజాపతులు. ఇదంతా ప్రజాపతి పతి అయిన శ్రీమన్నారాయణుడు ఈ సకల వృక్ష సంపదను పెంచాడు. పితృదేవతలకిచ్చే ఆహారమైన ఊర్జన్మూ, దేవతలకిచ్చే ఆహారమైన "ఇష"ను కల్పించాడు. (ఈ రెండూ చంద్రుడు ఇస్తాడు. అందుకే అమా అనే సూర్యుని కిరణం వచ్చినప్పుడు, ఆ రోజు చంద్రుడు అమా అనే కిరణము కింద ఉంటాడు. ఆ అమా అనే కిరణములో ఉన్న చంద్రుడు వృక్షాలను పోషిస్తాడు. అందుకే అమావాస్యనాడు చెట్లను ముట్టరాదు, పగలైనా రాత్రైనా. ఎందుకంటే ఆ రోజు చంద్రుడు చెట్లను పోషిస్తూ ఉంటాడు)

అన్నం చరాణామచరా హ్యపదః పాదచారిణామ్
అహస్తా హస్తయుక్తానాం ద్విపదాం చ చతుష్పదః

కదలకుండా ఉండేవి కదిలేవాటికీ కాళ్ళు లేనివి కాళ్ళు ఉన్నవాటికీ చేతులు లేనివి చేతులు ఉన్నవాటికీ నాలుగు కాళ్ళు ఉన్నవి రెండు కాళ్ళు ఉన్నవాటికీ ఆహారం.

యూయం చ పిత్రాన్వాదిష్టా దేవదేవేన చానఘాః
ప్రజాసర్గాయ హి కథం వృక్షాన్నిర్దగ్ధుమర్హథ

మీరు తండ్రి చేత ఆజ్ఞ్యాపించబడీ, దేవ దేవుడైన విష్ణువుచేతా చెప్పబడి సృష్టిని పెంచడానికి వచ్చిన మీరు ఇలా వృక్షాలను దహించవేయరాదు

ఆతిష్ఠత సతాం మార్గం కోపం యచ్ఛత దీపితమ్
పిత్రా పితామహేనాపి జుష్టం వః ప్రపితామహైః

సజ్జనుల మార్గాన్ని అనుసరించి మండుతున్న కోపాన్ని చల్లార్చండి. తాతలూ తండ్రులూ ముత్తాతలూ ఒక ధర్మాన్ని ఏర్పరచారు. ఎవరికెవరెవరు రక్షకులో చెప్పారు

తోకానాం పితరౌ బన్ధూ దృశః పక్ష్మ స్త్రియాః పతిః
పతిః ప్రజానాం భిక్షూణాం గృహ్యజ్ఞానాం బుధః సుహృత్

పిల్లలకు తల్లి తండ్రులూ
కంటికి రెప్ప
స్త్రీలకు భర్తలు
ప్రజలకు రాజు
బిక్షకులకు దాత
రహస్యం తెలియాలనుకున్నవాడికి పండితుడు రక్షకులు

అన్తర్దేహేషు భూతానామాత్మాస్తే హరిరీశ్వరః
సర్వం తద్ధిష్ణ్యమీక్షధ్వమేవం వస్తోషితో హ్యసౌ

శరీరములో లోపల దాగి ఉన్న ఆత్మకు అంతర్యామి అయిన పరమాత్మ రక్షకుడు.
ప్రపంచం మొత్తం అతని ఇల్లే. అలాంటి పరమాత్మను మీరు సంతోషిమప్చేసారు. భగవంతుని అనుగ్రహాన్ని పొందిన మీరే ప్రపంచాన్ని భగవదాలయముగా తెలియలేకుంటే ఇంకెవరికి తెలుస్తుంది

యః సముత్పతితం దేహ ఆకాశాన్మన్యుముల్బణమ్
ఆత్మజిజ్ఞాసయా యచ్ఛేత్స గుణానతివర్తతే

ఆకాశం నుండి వాయువు వచ్చినట్లుగా మనశారీరం నుండి వచ్చే కోపాన్ని గెలవ గలిగిన వాడే ప్రకృతిని గెలిచి గుణములను దాటగలుగుతాడు

అలం దగ్ధైర్ద్రుమైర్దీనైః ఖిలానాం శివమస్తు వః
వార్క్షీ హ్యేషా వరా కన్యా పత్నీత్వే ప్రతిగృహ్యతామ్

ఇంతవరకూ కాల్చినవి చాలు. మిగిలినవాటిని క్షేమముగా ఉంచండి. వారి అమ్మాయిని మీకు ఇస్తున్నాము. ఈమెను భార్య్గా స్వీకరించండి

ఇత్యామన్త్ర్య వరారోహాం కన్యామాప్సరసీం నృప
సోమో రాజా యయౌ దత్త్వా తే ధర్మేణోపయేమిరే

ఇలా పలికి చంద్రుడు మారిషను వారికిచ్చి వెళ్ళిపోయాడు. వారు ఆమెను యధావిధిగా వివాహం చేసుకున్నారు

తేభ్యస్తస్యాం సమభవద్దక్షః ప్రాచేతసః కిల
యస్య ప్రజావిసర్గేణ లోకా ఆపూరితాస్త్రయః

వారి నుండి ఆమెకు దక్షుడు పుట్టాడు. అతనిచేత మూడు లోకాలు నిండిపోయేంత సృష్టి పెరిగింది.

యథా ససర్జ భూతాని దక్షో దుహితృవత్సలః
రేతసా మనసా చైవ తన్మమావహితః శృణు

దక్షునికి పుత్రికలంటే ప్రేమ ఎక్కువ. అతను మనసుతో కొందరిని రేతస్సుతో కొందరినీ సృష్టించాడు. అది విను

మనసైవాసృజత్పూర్వం ప్రజాపతిరిమాః ప్రజాః
దేవాసురమనుష్యాదీన్నభఃస్థలజలౌకసః

బ్రహ్మ కూడా మొదట అందరినీ మనస్సుతోటే సృష్టించాడు. దేవ రాక్షస ఆకాశ చారులు జలచరులు భూచరులను మనసుతో సృష్టించాడు

తమబృంహితమాలోక్య ప్రజాసర్గం ప్రజాపతిః
విన్ధ్యపాదానుపవ్రజ్య సోऽచరద్దుష్కరం తపః

ఈ సృష్టిని ఏమి చేయాలో తెలియక వింధ్యపాదము వద్దకు వెళ్ళి

తత్రాఘమర్షణం నామ తీర్థం పాపహరం పరమ్
ఉపస్పృశ్యానుసవనం తపసాతోషయద్ధరిమ్

అఘమర్షణ తీర్థం వద్ద తపస్సు చేసాడు.

అస్తౌషీద్ధంసగుహ్యేన భగవన్తమధోక్షజమ్
తుభ్యం తదభిధాస్యామి కస్యాతుష్యద్యథా హరిః

పరమాత్మను హంస గుహ్య స్తోత్రముతో తపస్సు చేసాడు. ఆ ప్రజాపతి (దక్షుడు) ఈ స్తోత్రం చేసాడు. ఆ స్తోత్రాన్ని నీకు నేను చెబుతాను. ఈ స్తోత్రానికి మెచ్చే పరమాత్మ దక్ష ప్రజాపతికి వరమిచ్చాడు.

శ్రీప్రజాపతిరువాచ
నమః పరాయావితథానుభూతయే గుణత్రయాభాసనిమిత్తబన్ధవే
అదృష్టధామ్నే గుణతత్త్వబుద్ధిభిర్నివృత్తమానాయ దధే స్వయమ్భువే

నీవు అన్నిటికంటే (ప్రకృతి జీవులకంటే) విలక్షణమైనవాడవు. నీ అనుభూతి వాస్తవమైనది సత్యమైంది. మనము లోకములో దేన్ని హాయి అంటున్నామో అదే బాధగా మారుతుంది. ఏది బాధ అనుకుంటామో అదే కొద్ది సేపట్లో ఆనందముగా మారుతుంది. మానవులు దు@ఖాన్నే సుఖమని అనుకుంటారు. పరమాత్మ మాత్రం నిత్యం సత్యమైన అనుభూతి కలవాడు. గుణ త్రయం భాసించడానికి నీవే నిమిత్తం. నీ నివాసం ఎవరికీ (ప్రకృతితో సంబంధం ఉన్నవారికి) కనపడదు. ఇంతటి వాడని కొలవలేము. అటువంటి పరమాత్మకు నమస్కారం.

న యస్య సఖ్యం పురుషోऽవైతి సఖ్యుః సఖా వసన్సంవసతః పురేऽస్మిన్
గుణో యథా గుణినో వ్యక్తదృష్టేస్తస్మై మహేశాయ నమస్కరోమి

ఒకే పురములో (శరీరము) ఇద్దరున్నారు. దహరాకాశములో జీవుడున్నాడు, ఏ మిత్రుని మత్రి జీవుడు తెలుసుకోలేడో అటువంటి పరమాత్మకి నమస్కారం. తనతో ఉంటున్న రంగు తనలో ఉన్న గుణము తనకు ఎలా తెలీదు, మనకు మనలో ఉన్న పరమాత్మ తెలీడు.

దేహోऽసవోऽక్షా మనవో భూతమాత్రామాత్మానమన్యం చ విదుః పరం యత్
సర్వం పుమాన్వేద గుణాంశ్చ తజ్జ్ఞో న వేద సర్వజ్ఞమనన్తమీడే

పంచ భూతములూ శరీరమూ, ఇదంతా ఒక రధమైతే, శరీరం ఒక ఇరుసు వంటిది, పంచభూతాలు చతుర్దశ ఇంద్రియాలు దానికి అవయవాలు. మన గురించీ మనం తెలుసుకోలేము, పరమాత్మ గురించీ తెలుసుకోలేము. శరీరముతో సంబంధం ఏర్పడేంత వరకూ జీవుడికీ ఇందిర్యాలూ శరీరాలూ వేరూ తాను వేరనీ తెలుసు. తెలిసి కూడా ఆ విషయాన్ని తెలియకుండా అవుతున్నాడు. శరీర సంబంధం ఏర్పడ్డాక విడిగా ఉన్న దాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, సర్వజ్ఞ్యుడైన పరమాత్మని తెలుసుకోలేకపోతున్నాడు. అటువంటి పరమాత్మకు నమస్కారం.

యదోపరామో మనసో నామరూప రూపస్య దృష్టస్మృతిసమ్ప్రమోషాత్
య ఈయతే కేవలయా స్వసంస్థయా హంసాయ తస్మై శుచిసద్మనే నమః

అక్కడ సూర్యుడూ నక్షత్రాలూ చంద్రుడూ తారకలూ పరమాత్మ తేజస్సు వెనక ఉండేవే. అలాంటి చోటుని శుచి సద్మ అంటారు. పరిశుద్ధమైన నివాసం, పరంధామం, పరమపదం. పరమాత్మ మనకు తెలియబడాలంటే మనకు తెలిసినవన్నీ తెలియకుండా పోవాలి. చూచినదీ తలచినదీ పూర్తిగా మూసుకుపోవాలి, వాటి అంశకూడా స్పృశించకూడదు. మనం జగత్తును వేటితో తెలుసుకుంటున్నామో అలాంటి వాటితో పరమాత్మ తెలియబడడు. ప్రత్యక్ష అనుమాన ఉపమానముల వలన తెలియబడడు. శబ్దము కూడా పరమాత్మ ఇలా ఉండవచ్చు అని మాత్రమే చెబుతుంది. మనం చూసినదీ తెలిసినదీ అంతరించినప్పుడే తనకు తాను తన సంకల్పముతో తెలియబడుతున్నాడో అటువంటి పరమాత్మకు నమస్కారం. పరమాత్మ ఎవరికి తెలియబడాలి అని సంకల్పిస్తాడో వాడికి తెలియబడతాడు.

మనీషిణోऽన్తర్హృది సన్నివేశితం స్వశక్తిభిర్నవభిశ్చ త్రివృద్భిః
వహ్నిం యథా దారుణి పాఞ్చదశ్యం మనీషయా నిష్కర్షన్తి గూఢమ్

అన్నిటికంటే ముందుంటాండు, స్పష్టముగా ఉంటాడు ప్రకాశమానముగా ఉంటాడు కానీ ఆయన కనపడడు. ప్రత్యక్షముగా ఇంద్రియ గోచరం కాడు. అంతర్యామిగా హృదయములో ఉంటాడు. పరమాత్మ యొక్క శక్తులు (పర వ్యూహ విభవ అంతర్యామి అరచ, హృదయమూ కంఠమూ శిరస్సు, అకార ఉకార మకారం, త్రివృత్ అంటే ఓంకారం). ఎవరికీ తెలియని కనపడని వాడిని ఎలా గుర్తుపట్టాలి? కట్టెలో నిప్పు కనపడదు. కానీ అందులో నిప్పు ఉంటుంది. అరణిని మధించినట్లు పరమాత్మను తెలుసుకోగోరేవారు తమను మదించుకుంటారు, ఇంద్రియాలను నియమింపచేసి, శరీర ఇంద్రియాలను మనసునూ శుష్కింపచేసి, ఇంద్రియాల జోలికి వెళ్ళకుండా విషయాలకు లోబడకుండా తపస్సు చేస్తే కట్టెలో ఉన్న అగ్ని ఎలా ఐతే బయటకు కనపడుతుందో పరమాత్మ కూడా మన దృష్టికి గోచరమవుతాడు.

స వై మమాశేషవిశేషమాయా నిషేధనిర్వాణసుఖానుభూతిః
స సర్వనామా స చ విశ్వరూపః ప్రసీదతామనిరుక్తాత్మశక్తిః

ఎవరికీ చెప్పడానికి వీలు లేనంత శక్తి గలవాడు పరమాత్మ(ప్రసీదతామనిరుక్తాత్మశక్తిః). ఎన్ని రకాల మాయలున్నాయో వాటిని తొలగించి సత్యమూ నిత్యమైన నుభూతిని ఇచ్చినవాడు. పరమాత్మ సాక్షాత్కారం జరింగిన తరువాత ప్రకృతి బంధములో ఉన్నా అది మనను బాధించదు వామ్యోహింపచేయదు. అన్ని పేర్లూ ఆయనే. అన్ని రూపాలూ ఆయనే. అటువంటి పరమాత్మ నాయందు ప్రసన్నుడగుగాక.ఎన్ని రకముల మాయలు ఉన్నాయో వాటిని తొలగించి సత్యమూ నిత్యమూ అయిన తక సాక్షాత్కారాన్నిచ్చేవాడు

యద్యన్నిరుక్తం వచసా నిరూపితం ధియాక్షభిర్వా మనసోత యస్య
మా భూత్స్వరూపం గుణరూపం హి తత్తత్స వై గుణాపాయవిసర్గలక్షణః

ఆయన వేటికీ అందడు. వాక్కుతో మనసుతో బుద్ధితో ఇంద్రియములతో గానీ మనం అనుకునే స్వరూపమేదీ సత్యం కాదు. మనం చెప్పే రూపాలన్నీ గుణములతో కూడి ఉన్నది. పరమాత్మ ప్రళయకాల స్వరూపుడు. మనకా స్వరూపము తెలియదు. మనకు తెలిసినది జగత్తులోనిది.

యస్మిన్యతో యేన చ యస్య యస్మై యద్యో యథా కురుతే కార్యతే చ
పరావరేషాం పరమం ప్రాక్ప్రసిద్ధం తద్బ్రహ్మ తద్ధేతురనన్యదేకమ్

ఈ ప్రపంచములో ఎన్ని రకముల కార్యములు జరుగుతున్నాయో దేనితో దేనిలో దేని వలన దేనికోసం జరుగుతున్నాయో ఎవరి వలన జరుగుతున్నాయో, ఏది ఏ రకముగా చేయబడుతున్నదో చేయించబడుతున్నదో అందరికంటే ముందువారికంటే ముందువారు తరువాత వారి కంటే తరువాతి వాడు. ఈయన మొదట ఉండేవాడు. ఆయనను మించి ప్రపంచానికి వేరే కారణం లేదు.ఆయనే ఉపాదాన నిమిత్త సహకారీ కారణం.

యచ్ఛక్తయో వదతాం వాదినాం వై వివాదసంవాదభువో భవన్తి
కుర్వన్తి చైషాం ముహురాత్మమోహం తస్మై నమోऽనన్తగుణాయ భూమ్నే

చెప్పేవారికీ చెప్పినది కాదని వాదించేవారికీ, ఔనని నిరూపించేవారికీ , ఈ మూటికీ కారణం కూడా పరమాత్మే . ఎలాంటి మహా పండితులకు కూడా ఆత్మ మోహాన్ని ఎవరు కలిగిస్తారో ఆ పరమాత్మకు నమస్కారం. యోగమూ సాంఖ్యమూ అంటూ ఒక్కో మతములో ఉంది. కొందరు పరమాత్మలేడని అంటారు.

అస్తీతి నాస్తీతి చ వస్తునిష్ఠయోరేకస్థయోర్భిన్నవిరుద్ధధర్మణోః
అవేక్షితం కిఞ్చన యోగసాఙ్ఖ్యయోః సమం పరం హ్యనుకూలం బృహత్తత్

యోగ సాంఖ్యములలో వారు చెప్పినవి వారికి నిజమనే అనిపిస్తుంది.

యోऽనుగ్రహార్థం భజతాం పాదమూలమనామరూపో భగవాననన్తః
నామాని రూపాణి చ జన్మకర్మభిర్భేజే స మహ్యం పరమః ప్రసీదతు

పుట్టవలసిన అవసరం లేని పరమాత్మ, ఆయన భక్తులను అనుగ్రహించడానికి, పేరూ రూపమూ లేని వాడు పేరు పెట్టుకుని ఏ పనులూ చేయవలసిన అవసరం లేని వాడు కర్మలను చేస్తున్నాడు. అటువంటి పరమాత్మ అనుగ్రహిచుగాక

యః ప్రాకృతైర్జ్ఞానపథైర్జనానాం యథాశయం దేహగతో విభాతి
యథానిలః పార్థివమాశ్రితో గుణం స ఈశ్వరో మే కురుతాం మనోరథమ్

ప్రకృతి సంబంధముతో వచ్చిన గుణములు మనను పాడు చేయకుండా మనలో ఆయన కాపలాగా ఉంటాడు. మనసు శరీరములో ఉన్నంతవరకే ప్రకాశిస్తుంది.వాయువు కూడా అగ్నికి తోడైతే అగ్ని బాగా మండుతుంది.శరీరములో ఉన్న మనసు మనకు ఎలా మనస్సు ఉన్నదని తెలియజేస్తుందో, దేహముండగా ఆత్మనీ పరమాత్మనీ తెలుసుకోని వారు ఆయనను తెలుసుకోవడానికి ప్రాకృతమైన బోధనతో అందని పరమాత్మ స్వరూపాన్ని ఆచార్య కృపతో ఎలా తెలియబడుతుందో, ఘటము భిన్నమవగానే కుండలో ఉన్న వాయువు బయట వాయువుతో కలిసినట్లు శరీరము లేనప్పుడు ఆత్మ ఆత్మలో కలుస్తుంది. ఇలాంటి పరమాత్మ నా కోరిక తీర్చాలి

శ్రీశుక ఉవాచ
ఇతి స్తుతః సంస్తువతః స తస్మిన్నఘమర్షణే
ప్రాదురాసీత్కురుశ్రేష్ఠ భగవాన్భక్తవత్సలః

ఇలా అఘమర్షణ క్షేత్రములో స్తోత్రం చేయబడి పరమాత్మ దక్షునికి ప్రత్యక్షమయ్యాడు

కృతపాదః సుపర్ణాంసే ప్రలమ్బాష్టమహాభుజః
చక్రశఙ్ఖాసిచర్మేషు ధనుఃపాశగదాధరః

వైకుంఠములో పరమాత్మ అష్టభుజములతో ఉంటాడు

పీతవాసా ఘనశ్యామః ప్రసన్నవదనేక్షణః
వనమాలానివీతాఙ్గో లసచ్ఛ్రీవత్సకౌస్తుభః

మహాకిరీటకటకః స్ఫురన్మకరకుణ్డలః
కాఞ్చ్యఙ్గులీయవలయ నూపురాఙ్గదభూషితః

త్రైలోక్యమోహనం రూపం బిభ్రత్త్రిభువనేశ్వరః
వృతో నారదనన్దాద్యైః పార్షదైః సురయూథపైః

గరుత్మంతుని మీద వచ్చి, ఎనిమిది ఆయుధాలతో పీతాంబరధారి నీల మేఘశ్యాముడు ప్రసన్నమైన చూపులు కలవాడై, వనమాల హారముగా కలిగి, శ్రీవత్సం కలవాడై, కుండలములూ అందెలూ అన్ని ధరించి, మూడులోకాలూ మోహింపచ్సే రూపముతో నారదాదులతో స్తోత్రం చేయబడుతూ, కొందరు ఆ స్తోత్రాలను అనువచిస్తూ,

స్తూయమానోऽనుగాయద్భిః సిద్ధగన్ధర్వచారణైః
రూపం తన్మహదాశ్చర్యం విచక్ష్యాగతసాధ్వసః

దక్షుడు సాష్టాంగపడి శిరస్సుతో పాదాలను సృశించాడు. పరమాత్మను ప్రత్యక్షం చేసుకున్నానన్న పరమానందము కలవాడై

ననామ దణ్డవద్భూమౌ ప్రహృష్టాత్మా ప్రజాపతిః
న కిఞ్చనోదీరయితుమశకత్తీవ్రయా ముదా
ఆపూరితమనోద్వారైర్హ్రదిన్య ఇవ నిర్ఝరైః

కొండ వాగు మీద నుంచి నీరు వస్తుంటే ఆ ప్రవాహాన్ని అరికట్టడానికి కాలువ చేసినట్లుగా, పరమాత్మ కృప అనే నీరు గుండెనిండా నిండి ఉంది,

తం తథావనతం భక్తం ప్రజాకామం ప్రజాపతిమ్
చిత్తజ్ఞః సర్వభూతానామిదమాహ జనార్దనః

అందరి మనసులో ఏముందో తెలుసుకునే పరమాత్మ, పరమభక్తుడు సంతానము కోరే ప్రజాపతి అయిన దక్షుని మనసులో ఏముందో తెలుసుకొని ఇలా అన్నాడు.

శ్రీభగవానువాచ
ప్రాచేతస మహాభాగ సంసిద్ధస్తపసా భవాన్
యచ్ఛ్రద్ధయా మత్పరయా మయి భావం పరం గతః

నీవు తపస్సుతో సిద్ధి పొందావు. పరమ భక్తితో నాయందు నిశ్చల భావాన్ని ఉంచుకున్నావు. నీవింత గొప్ప తపస్సు చేసావు కాబట్టి నేను మెచ్చాను

ప్రీతోऽహం తే ప్రజానాథ యత్తేऽస్యోద్బృంహణం తపః
మమైష కామో భూతానాం యద్భూయాసుర్విభూతయః

నా విభూతులు లోకమంతా విస్తరించాలి, సంసారం విడిచి నన్ను సేవించడానికే అందరి మనసు కలగాలి అని నాకోరిక

బ్రహ్మా భవో భవన్తశ్చ మనవో విబుధేశ్వరాః
విభూతయో మమ హ్యేతా భూతానాం భూతిహేతవః

బ్రహ్మాదులందరూ నా విభూతులే. అవే సకల జగత్తు పుట్టుకకూ కారణమవుతున్నాయి.

తపో మే హృదయం బ్రహ్మంస్తనుర్విద్యా క్రియాకృతిః
అఙ్గాని క్రతవో జాతా ధర్మ ఆత్మాసవః సురాః

తపస్సే నా హృదయం శరీరం క్రియా స్వరూపం అవయవాలు

అహమేవాసమేవాగ్రే నాన్యత్కిఞ్చాన్తరం బహిః
సంజ్ఞానమాత్రమవ్యక్తం ప్రసుప్తమివ విశ్వతః

అన్నిటికంటే ముందూ తరువాతా మధ్యా నేనే ఉన్నాను. నా కంటే ముందూ ఎవరూ లేరు, నేను లేనిదీ ఏదీ లేదు. మొదలు నేనొక్కడినే ఉన్నాను.

మయ్యనన్తగుణేऽనన్తే గుణతో గుణవిగ్రహః
యదాసీత్తత ఏవాద్యః స్వయమ్భూః సమభూదజః

ఇలా ఎవరైతే అనంత కళ్యాణ గుణములు కలిగిన నా యందు కొన్ని గుణాలను తీసుకుని ఆ గుణాలు ఉన్నవాడిగా నా విగ్రహాలను కొందరు తయారు చేసి ఆరాధిస్తున్నారు. దాన్ని పోగొట్టడానికే నా నాభి కమలం నుంచి బ్రహ్మను సృష్టించాను.

స వై యదా మహాదేవో మమ వీర్యోపబృంహితః
మేనే ఖిలమివాత్మానముద్యతః స్వర్గకర్మణి

తనను సృష్టించింది సృష్టిని పెంచడానికే అని తెలుసుకుని సృష్టి కర్మలో నిమగ్నమయ్యాడు. ఆయన కూడా ఘోరమైన తపస్సు చేసాడు

అథ మేऽభిహితో దేవస్తపోऽతప్యత దారుణమ్
నవ విశ్వసృజో యుష్మాన్యేనాదావసృజద్విభుః

ఆ తపః ప్రభావముగానే నవ ప్రజాపతులను సృష్టించాడు.

ఏషా పఞ్చజనస్యాఙ్గ దుహితా వై ప్రజాపతేః
అసిక్నీ నామ పత్నీత్వే ప్రజేశ ప్రతిగృహ్యతామ్

ఈమే పంచజనుని యొక్క పుత్రిక అసిక్ని. ఈమెను నీవు భార్యగా స్వీకరించు.

మిథునవ్యవాయధర్మస్త్వం ప్రజాసర్గమిమం పునః
మిథునవ్యవాయధర్మిణ్యాం భూరిశో భావయిష్యసి

త్వత్తోऽధస్తాత్ప్రజాః సర్వా మిథునీభూయ మాయయా
మదీయయా భవిష్యన్తి హరిష్యన్తి చ మే బలిమ్

మీరిద్దరూ అన్నోన్యముగా కాపురం చేసినందు వలన కొందరు మానసికముగా కాపురం చేఇన్సందు వలన కొంతమందీ, ఇలా చాలా మంది సంతానం కలుగుతారు
మానసిక వ్యాపారముతో సంతానం కలుగుతుంది ఇదంతా నా మాయతో, అన్న నియమం కేవలం నీకు మాత్రమే. మిగతా వారందరికీ మిధునముతోనే సంతానం కలుగుతుంది.

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్త్వా మిషతస్తస్య భగవాన్విశ్వభావనః
స్వప్నోపలబ్ధార్థ ఇవ తత్రైవాన్తర్దధే హరిః

ఇలా చెప్పి దక్షుడు చూస్తుండగా స్వప్నములో దొరికిన వస్తువులాగ అంతర్ధానమయ్యాడు.

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం మూడవ అధ్యాయం


శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీరాజోవాచ
నిశమ్య దేవః స్వభటోపవర్ణితం ప్రత్యాహ కిం తానపి ధర్మరాజః
ఏవం హతాజ్ఞో విహతాన్మురారేర్నైదేశికైర్యస్య వశే జనోऽయమ్

ఇది విని పరీక్షిత్తు అడిగాడు "మీరొక అంశాన్ని వదిలిపెట్టారు. విష్ణు భటులు విడిపించి యమలోకానికి యమభటులను పంపేసారు. అది వారు తమ ప్రభువుకు నివేదించలేదా? విన్న యమధర్మరాజు ఏమి చేసాడు."

యమస్య దేవస్య న దణ్డభఙ్గః కుతశ్చనర్షే శ్రుతపూర్వ ఆసీత్
ఏతన్మునే వృశ్చతి లోకసంశయం న హి త్వదన్య ఇతి మే వినిశ్చితమ్

సకల చరాచర జగత్తు మృత్యు వశములో ఉంటుంది. అలాంటప్పుడు తమ వారిని విష్ణు భక్తులు వెళ్ళగొడితే ఆయన ఎలా ఊరుకున్నాడు. ఇంతవరకూ యముని ఆజ్ఞ్య కొట్టబడినట్లు ఎక్కడా లేదు. అలాంటి యముని ఆజ్ఞ్య ఉల్లంఘించబడితే ఏమి జరిగింది

శ్రీశుక ఉవాచ
భగవత్పురుషై రాజన్యామ్యాః ప్రతిహతోద్యమాః
పతిం విజ్ఞాపయామాసుర్యమం సంయమనీపతిమ్

పరమాత్మ భక్తులతో అడ్డగించబడిన యమభటులు స్వామితో ఇలా అన్నారు

యమదూతా ఊచుః
కతి సన్తీహ శాస్తారో జీవలోకస్య వై ప్రభో
త్రైవిధ్యం కుర్వతః కర్మ ఫలాభివ్యక్తిహేతవః

ఈ ప్రపంచాన్ని శాసించే వారెందరున్నారు. వారు వారు ఆచరించే కర్మకనుగుణమైన ఫలితాన్ని ప్రసాదించేవారెందరున్నారు.

యది స్యుర్బహవో లోకే శాస్తారో దణ్డధారిణః
కస్య స్యాతాం న వా కస్య మృత్యుశ్చామృతమేవ వా

మాకు తెలిసి శాసకుడు ఒకడే ఉండాలి. చాలా మంది శాసకులు ఉంటే, ప్రతీ శాసకుడు తమ వారిని కాపాడాలి అనుకుంటే తప్పు చేసిన వారు శిక్షించబడరు, తన వాడు కాదనుకుంటే తప్పు చేయని వారు కూడా శిక్షించబడతారు. ఎవరికి నరకం ఎవరికి మోక్షం వస్తుంది అన్నది నీవల్లే తెలియాలి కదా.

కిన్తు శాస్తృబహుత్వే స్యాద్బహూనామిహ కర్మిణామ్
శాస్తృత్వముపచారో హి యథా మణ్డలవర్తినామ్

చాలామంది శాసకులుంటే శాసక్త్వం నామమాత్రమై (ఉపచారమాత్రమై) అపరాధమే పని చేస్తుంది (అపరాధులే శాసకులవుతారు). మండలాధికారులకు వారి మండలములో వారేది చెప్తే ధర్మాధర్మాలతో పనిలేకుండా అదే శాసనం

అతస్త్వమేకో భూతానాం సేశ్వరాణామధీశ్వరః
శాస్తా దణ్డధరో నౄణాం శుభాశుభవివేచనః

అందరికీ నీవే ఈశ్వరుడవని మాకు తెలుసు, శాసకుడవు, దండధారివి, పుణ్యపాపములను తెలుసుకొని తగిన రీతిలో శిక్ష విధించగలవాడవు నీవే. ఇలాంటి నీ శాసనం కూడా నివారించబడినది. అంటే లోకములో శాసనం లేదని అర్థం.

తస్య తే విహితో దణ్డో న లోకే వర్తతేऽధునా
చతుర్భిరద్భుతైః సిద్ధైరాజ్ఞా తే విప్రలమ్భితా

దివ్యమంగళ విగ్రహముతో నలుగురు పురుషులొచ్చి

నీయమానం తవాదేశాదస్మాభిర్యాతనాగృహాన్
వ్యామోచయన్పాతకినం ఛిత్త్వా పాశాన్ప్రసహ్య తే

నరకలోకముకు మాచే తీసుకుపోబడుతున్న మా పాశాలను చేదించారు.

తాంస్తే వేదితుమిచ్ఛామో యది నో మన్యసే క్షమమ్
నారాయణేత్యభిహితే మా భైరిత్యాయయుర్ద్రుతమ్

మేము తెలియదగినదని మీరనుకుంటే మేము వినదగినవారమని మీరనుకుంటే నారాయణ అన్న మాత్రన వారొచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టడానికి కారణం ఏమిటీని అడిగితే

శ్రీబాదరాయణిరువాచ
ఇతి దేవః స ఆపృష్టః ప్రజాసంయమనో యమః
ప్రీతః స్వదూతాన్ప్రత్యాహ స్మరన్పాదామ్బుజం హరేః

యమ దూతలు విష్ణు దూతలను వెళ్ళగొట్టినా ఏమీ అనకుండా వచ్చినందుకు యముడు సంతోషించాడు, పరమాత్మ పాద పద్మాలను స్మరిస్తూ ఇలా అన్నాడు

యమ ఉవాచ
పరో మదన్యో జగతస్తస్థుషశ్చ ఓతం ప్రోతం పటవద్యత్ర విశ్వమ్
యదంశతోऽస్య స్థితిజన్మనాశా నస్యోతవద్యస్య వశే చ లోకః

నీకూ నాకే కాదు సకల చరాచర జగత్తుకూ అసలైన శాసకుడు ఒకడున్నాడు, నేను కాదు. స్థావర జంగమాదులైన సకల జగత్తుకూ ఈశ్వరుడు ఒకడున్నాడు. ఆ పరమాత్మ యందే సకల జగత్తూ ఇమిడి ఉన్నది. వస్త్రములో నిలువు దారాలూ అడ్డదారాలూ ఉంటాయి. నిలువు దారాలలో అడ్డదారాలు జొప్పిస్తారు. నిలువు దారాలు ప్రోతం. అడ్డదారాలు ఓతం. ఎలా ఐతే వస్త్రములో దారాలు కూరుస్తారో ఈ పరమాత్మలో జగత్తంతా ఇమిడి ఉన్నది. ఈ జగత్తు ఒకదానికి మరొకటి ఆధారమని అనిపిస్తుంది. నిలువుదారం లేకుంటే అడ్డదారాలు కూర్చబడవు. ఎవరికి వారే మేమే శాసకులమనుకుంటారు ఇలా దారాలు చూసినప్పుడు అనుకున్నట్లు. ఈ దారాలను దగ్గరకు ఏర్చీ కూర్చు వస్త్రముగా చేసినవాడు మూలం.నిలువు దారాలు మేము గొప్పా అని, అడ్డదారాలు మేము గొప్పా అనుకుంటే మరి వాటిని కూర్చినవాడినేమని అనాలి? పత్తి చెట్టు నాటి పెంచి పోషించి గింజలను తీసి వేరు చేసి దారాలను తీసి ఏర్చి కూర్చి వస్త్రం తయారు చేస్తే నిలువు, అడ్డ దారాలు "మాతోటే వస్త్రం తయారయ్యిందని" అనుకున్నట్లు ఉంటుంది మనం "నేను బలవంతున్నీ, బుద్ధి కలవాడినీ, ఆరోగ్యవంతున్నీ, బుద్ధిమంతున్ని" అని అనుకుంటాము.

తన కడుపులో ఉన్న జీవునికి ఇంద్రియాలూ మనసు తొడిగి వాడిని పంపిస్తే వాడు "నేను తెలివైన వాడిని అనుకున్నట్లు ఉంటుంది". ఆయనలో సకల చరాచర జగత్తు కూర్చబడినదీ, పేర్చబడినది. సకల చరాచర జగత్తు యొక్క సృష్టి స్థితి లయములు పరమాత్మ యొక్క సహస్రాంశతో జరుగుతున్నాయి. మనందరికీ ఆయన ముక్కు తాడు వేసి పట్టుకున్నాడు.

యో నామభిర్వాచి జనం నిజాయాం బధ్నాతి తన్త్ర్యామివ దామభిర్గాః
యస్మై బలిం త ఇమే నామకర్మ నిబన్ధబద్ధాశ్చకితా వహన్తి

మనందరినీ పేర్లతో కట్టేస్తాడు. నేను మనిషినీ దేవతనీ రాక్షసున్నీ అని. నమాలనే ధామాలతో (దారాలతో) కట్టి వేసాడు తాళ్ళతో గోవులను కట్టెసినట్లుగా. తమ పేర్లతో కర్మలతో జీవులందరూ ఆ పరమాత్మకే ఆరాధన జరుపుతారు. మనం చేసే అన్ని పనులూ భగవత్ ఆరాధనా రూపముగా ఉండాలి. ఇష్టమున్నా లేకున్నా పరమాత్మ చెప్పినట్లే మనం వింటూ ఉంటాము.

అహం మహేన్ద్రో నిరృతిః ప్రచేతాః సోమోऽగ్నిరీశః పవనో విరిఞ్చిః
ఆదిత్యవిశ్వే వసవోऽథ సాధ్యా మరుద్గణా రుద్రగణాః ససిద్ధాః

వీరందరూ

అన్యే చ యే విశ్వసృజోऽమరేశా భృగ్వాదయోऽస్పృష్టరజస్తమస్క
యస్యేహితం న విదుః స్పృష్టమాయాః సత్త్వప్రధానా అపి కిం తతోऽన్యే

వీరే కాక ప్రజాపతులు దేవతాధిపతులు, రజస్సూ తమస్సూ అంటని భృగ్వాదులు కూడా పరమాత్మ మాయని దాటలేరు. ఆయనౌ వాక్కుతో గానీ మనసుతో హృదయముతో గానీ ప్రాణులు తెలియలేరు

యం వై న గోభిర్మనసాసుభిర్వా హృదా గిరా వాసుభృతో విచక్షతే
ఆత్మానమన్తర్హృది సన్తమాత్మనాం చక్షుర్యథైవాకృతయస్తతః పరమ్

ఆయన మన హృదయములోనే అంతర్యామిగా ఉన్నాడు. కన్ను ఎదురుగా ఉన్న రూపాన్ని కన్నులో చూస్తుంది. కన్ను ఏ రూపాన్ని చూస్తుందో ఆ రూపం కనుగుడ్డులో కూడా కనపడుతుంది. అందులో పడితేనే మనకు రూపం కనిపిస్తుంది. కానీ మనం కంటి గుడ్డులో ఉన్న రూపాన్ని చూడలేము, ఎదురుగునా ఉన్నదానినే చూడగలం.

తస్యాత్మతన్త్రస్య హరేరధీశితుః పరస్య మాయాధిపతేర్మహాత్మనః
ప్రాయేణ దూతా ఇహ వై మనోహరాశ్చరన్తి తద్రూపగుణస్వభావాః

అలాగే మనం హృదయములో ఉన్న పరమాత్మను చూడలేము. పరమాత్మ సర్వతంత్ర స్వతంత్ర్యుడు. ఆయన పరుడు మాయాధిపతి. అలాంటి పరమాత్మ దూతలు ఈ లోకములో సంచరిస్తూ ఉంటారు. పరమాత్మ రూపమూ గుణమూ స్వభావమూ కలిగి ఉంటారు వారు. ఎదుటి వారు బాధపడుతూ ఉంటే చూడలేకపోయే వారు, వారు.

భూతాని విష్ణోః సురపూజితాని దుర్దర్శలిఙ్గాని మహాద్భుతాని
రక్షన్తి తద్భక్తిమతః పరేభ్యో మత్తశ్చ మర్త్యానథ సర్వతశ్చ

పరమాత్మ యొక్క దుర్దర్శలింగాని (చిహ్నములు) రూపములూ ఇవన్నీ పరమాత్మకు అత్యంత ప్రియమైన వారికి కూడా వస్తాయి. అలాంటి వారు ఇలాంటి రూపాన్ని కాపాడతారు. ఆ రూపములో వచ్చి రక్షిస్తుంటారు. నా నుంచే కాదు, పరమాత్మ భక్తులకు ఎవరు ఆపద కలిగేప్పుడు వారు వెళ్ళి రక్షిస్తారు

ధర్మం తు సాక్షాద్భగవత్ప్రణీతం న వై విదురృషయో నాపి దేవాః
న సిద్ధముఖ్యా అసురా మనుష్యాః కుతో ను విద్యాధరచారణాదయః

మీరు చెప్పిన ధర్మ మర్యాద లోకములో సరిపోతుంది గానీ ఆయన వద్ద కాదు. ధర్మమును పరమాత్మే ఏర్పరచాడు. అలాంటి ధర్మాన్ని ఋషులు గానీ దేవతలు గానీ సిద్ధులూ విద్యాధరులూ గంధర్వులూ మానవులు కిమంపురుషులూ తెలియజాలరు.

స్వయమ్భూర్నారదః శమ్భుః కుమారః కపిలో మనుః
ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకిర్వయమ్

పరమాత్మ యొక్క మాయను తెలిసిన వారు కొంతమంది ఉన్నారు. స్వయమ్భూర్నారదః శమ్భుః కుమారః కపిలో మనుః, ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకిర్వయమ్. మా పన్నెండు మందికి మాత్రమే భగవత్ ధర్మం తెలుసు.

ద్వాదశైతే విజానీమో ధర్మం భాగవతం భటాః
గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వామృతమశ్నుతే

పరమ రహస్యమైనదీ పరిశుద్ధమైనదీ ఎంత కష్టపడ్డా తెలియనిది, అలాంటి ధర్మాన్ని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందుతాడు.

ఏతావానేవ లోకేऽస్మిన్పుంసాం ధర్మః పరః స్మృతః
భక్తియోగో భగవతి తన్నామగ్రహణాదిభిః

ఈ ప్రపంచములో ఇదే ధర్మం. పరమాత్మ యొక్క నామ సంకీర్తనం కథా శ్రవణం పరమాత్మ గుణాను సంధానమే పరమాత్మ ఆరాధన. పరమాత్మ యందు భక్తి యోగమే ధర్మం. తక్కినదంతా అధర్మం.

నామోచ్చారణమాహాత్మ్యం హరేః పశ్యత పుత్రకాః
అజామిలోऽపి యేనైవ మృత్యుపాశాదముచ్యత

పరమాత్మ నామం పలికితే కలిగే ఫలితం మీరే చూసారు. అజామీలుడు కేవలం ఒక్క సారి నారాయణ అంటేనే మీ పాశాలు ఎగిరిపోయాయి. ఇంతకన్నా పరమాత్మ నామ కీర్తన గురించి చెప్పేదేముంది.

ఏతావతాలమఘనిర్హరణాయ పుంసాం
సఙ్కీర్తనం భగవతో గుణకర్మనామ్నామ్
విక్రుశ్య పుత్రమఘవాన్యదజామిలోऽపి
నారాయణేతి మ్రియమాణ ఇయాయ ముక్తిమ్

మానవుల సర్వపాపాలు పోవడానికి ఇదొక్కటి చాలు. పరమాత్మ పేర్లు ఆయన ఆచరించిన కర్మలు పరమాత్మ గుణములు.  నామం గానీ గుణం కానీ కర్మను కానీ ఈ మూటిలో దేన్ని ఆచరించినా మానవులు తమ పాపాన్ని తొలగించుకుంటారు

ప్రాయేణ వేద తదిదం న మహాజనోऽయం
దేవ్యా విమోహితమతిర్బత మాయయాలమ్
త్రయ్యాం జడీకృతమతిర్మధుపుష్పితాయాం
వైతానికే మహతి కర్మణి యుజ్యమానః

మరి ఇంత సులభమైతే నరకానికి అందరూ ఎందుకు పోతున్నారు. గొప్పవాళ్ళు కూడా పరమాత్మ యొక్క మాయా దేవితో మోహించబడిన బుద్ధి గల వారు ఈ విషయాన్ని తెలియలేరు. మకరందాన్ని అందించే వేదాన్ని (మనసును ఊరించే) చూసి అందరూ మోహములో పడతారు. అది చూసి విశాలమైన పనులు చేస్తాడు (వ్రతాలూ నోములూ ఉపవాసాలు) గానీ, పెద్ద పెద్ద పనులు (యాగాలూ యజ్ఞ్యాలూ) చేయాలంటాడు గానీ గొప్పవారు కూడా పరమాత్మ నామాన్ని జపించలేరు. వేదములో మునిగి జడ మతులవుతున్నారు.

ఏవం విమృశ్య సుధియో భగవత్యనన్తే
సర్వాత్మనా విదధతే ఖలు భావయోగమ్
తే మే న దణ్డమర్హన్త్యథ యద్యమీషాం
స్యాత్పాతకం తదపి హన్త్యురుగాయవాదః

మంచి బుద్ధి కలవారు ఇలా విషయాన్ని పరిశీలించి పరమాత్మ యందు తమ భావాన్ని నిలుపుతారు. అలాంటి వారు నా దండమును పొందరు. వారు పాపమును చేసినా పరమాత్మ నామోచ్చారణే ఆ పాపమును తొలగిస్తుంది.

తే దేవసిద్ధపరిగీతపవిత్రగాథా
యే సాధవః సమదృశో భగవత్ప్రపన్నాః
తాన్నోపసీదత హరేర్గదయాభిగుప్తాన్
నైషాం వయం న చ వయః ప్రభవామ దణ్డే

ఇలాంటి మహాత్ములు దేవతల చేతా సిద్ధుల చేతా మహానుభావులచేతా గానం చేసే గాధను కలిగి ఉంటారు. వీరు సాధువులు సమదర్శులు. పరమాత్మను మాత్రమే ఆశ్రయించిన వారు. అలాంటి వారి దగ్గరకు మాత్రం మీరు వెళ్ళకండి. వారి చుట్టూ పరమాత్మ గద ఉండి వారిని కాపాడుతూ ఉంటుంది. అలాంటి వారికి మేము శిక్ష విధించలేము. వారాచరించిన పాపం కూడా వారిని శిక్షించలేదు.

తానానయధ్వమసతో విముఖాన్ముకున్ద
పాదారవిన్దమకరన్దరసాదజస్రమ్
నిష్కిఞ్చనైః పరమహంసకులైరసఙ్గైర్
జుష్టాద్గృహే నిరయవర్త్మని బద్ధతృష్ణాన్

మీరు ఎలాంటి వారిని తీసుకు రావాలంటే, పరమాత్మ పాద పద్మ మకరంద రసమును స్వీకరించడానికి ఎవరు విముఖముగా ఉంటారో అలాంటి వారిని తీసుకు రండి. పరమ దరిద్రులు (నిష్కిఞ్చనైః - పరమాత్మ తప్ప వేరే దిక్కు లేని వారు, భగవంతుని కంటే భిన్నమైన రక్షణ, భగవంతుని దయ కన్నా భిన్నమైన ఆస్తి లేనివారు), పరమాత్మ పాద పద్మ మకరందాన్ని కోరేవారు కాకుండా మిగిలిన వారికి నరకమార్గం మీద ఆశ ఎక్కువ. ఇల్లు అనే నరక మార్గాన్ని కోరేవారిని, దాని మీద ఆశ పెంచుకున్నవారినీ మీరు బంధించాలి.

జిహ్వా న వక్తి భగవద్గుణనామధేయం
చేతశ్చ న స్మరతి తచ్చరణారవిన్దమ్
కృష్ణాయ నో నమతి యచ్ఛిర ఏకదాపి
తానానయధ్వమసతోऽకృతవిష్ణుకృత్యాన్

పరమాత్మను ఆశ్రయించని వాడంటే పూజ చేయకపోయినా గుడికి వెళ్ళకపోయినా, పరమాత్మ నామాన్ని కూడా ఎవరి నాలుక పలకదో, ఒక్క సారి కూడా పరమాత్మకు శిరస్సు వంచి నమస్కరించదో అటువంటి వారిని పట్టుకు రండి. ఏ ఒక్క సారీ పరమాత్మ యొక్క ఏ చిన్న సేవా చేయని వారిని పట్టుకు రండి.

తత్క్షమ్యతాం స భగవాన్పురుషః పురాణో
నారాయణః స్వపురుషైర్యదసత్కృతం నః
స్వానామహో న విదుషాం రచితాఞ్జలీనాం
క్షాన్తిర్గరీయసి నమః పురుషాయ భూమ్నే

మీరు వారి చర్యకు అడ్డు చెప్పకున్నా కొంతసేపైనా వారితో వాదన చేసారు కాబట్టి తన పురుషులకెదురుగా వాదనకు దిగి మాట్లాడిన మన తెలివి మానిన పనిని ఆ పరమాత్మ క్షమించుగాక. మా మనుషులు చేసిన దాన్ని స్వామి క్షమించుగాక. మహానుభావులకు అంజలి జోడించడమే అన్ని క్షమలకూ మూలము. (అంజలి - అం జలయతి. అకారమంటే శ్రీమన్నారాయణుడు. పరమాత్మను కూడా కరిగించేది.) తప్పు చేసినందు వలన కలిగిన కోపం క్షమాపణ వేడితే తొలగిపోతుంది.

తస్మాత్సఙ్కీర్తనం విష్ణోర్జగన్మఙ్గలమంహసామ్
మహతామపి కౌరవ్య విద్ధ్యైకాన్తికనిష్కృతమ్

నిరంతర పరమాత్మ నామ సంకీర్తనం సకల జగత్తుకూ మంగళం కలిగిస్తుంది. మహామాహా పాతకములకు కూడా ఒకే ఒక పరిహారం పరమాత్మ నామ సంకీర్తనం

శృణ్వతాం గృణతాం వీర్యాణ్యుద్దామాని హరేర్ముహుః
యథా సుజాతయా భక్త్యా శుద్ధ్యేన్నాత్మా వ్రతాదిభిః

ఏదో పేరుకు రకరకాల వ్రతాలు చేస్తే మనసు పరిశుద్ధమవదు. పరమాత్మ అనంతమైన గుణములూ పరాక్రమములూ విన్న వారికీ చెప్పేవారికీ చదివేవారికీ మనసు పవిత్రమవుతుంది. ఈ మూడూ లేకుండా మేము వ్రతం చేస్తున్నామని పదిమందికీ చూపేవారి మనసు పవిత్రం కాదు.

కృష్ణాఙ్ఘ్రిపద్మమధులిణ్న పునర్విసృష్ట
మాయాగుణేషు రమతే వృజినావహేషు
అన్యస్తు కామహత ఆత్మరజః ప్రమార్ష్టుమ్
ఈహేత కర్మ యత ఏవ రజః పునః స్యాత్

అందుకే పరమాత్మ పాద పద్మ మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదా (భక్తుడు) పొరబాటున కూడా ప్రకృతి గుణముల యందు ఆసక్తుడు కాడు, ఇరుక్కోడు. పరమాత్మ పాదాలను స్మరించని వాడు కోరికలతో కొట్టబడి తనకంటిన మురికిని తొలగించుకోవడానికి ప్రయత్నించి మరికాస్త మురికి అంటించుకుంటాడు. ఆ కర్మతో మరి కాస్త బురద అంటుతుంది కానీ ఉన్న బురద పోదు. భగవత్సేవ కన్నా భిన్నమైన దానితో ఉన్న పాపాలు పోక పోగా కొత్త పాపాలు వస్తాయి

ఇత్థం స్వభర్తృగదితం భగవన్మహిత్వం
సంస్మృత్య విస్మితధియో యమకిఙ్కరాస్తే
నైవాచ్యుతాశ్రయజనం ప్రతిశఙ్కమానా
ద్రష్టుం చ బిభ్యతి తతః ప్రభృతి స్మ రాజన్

తన యజమాని చెప్పిన విషయాలని విన్న యమ కింకరులు విస్మయాన్ని పొందారు. అప్పటినుంచీ పరమాత్మ భక్తుల పేర్లు పలకడానికే చూడటానికే భయపడుతున్నారు.

ఇతిహాసమిమం గుహ్యం భగవాన్కుమ్భసమ్భవః
కథయామాస మలయ ఆసీనో హరిమర్చయన్

ఇది పరమ రహస్యమైన ఇతిహాసం. దీన్ని మలయ పర్వతం మీద అగస్త్య మహాముని (రావణున్ని చంపించినవాడు, ఖర్దూషణులను చంపేందుకు వైష్ణవమనే ధనువు ఇచ్చినవాడు, వాతాపిని జీర్ణం చేసుకున్నవాడు)చెప్పాడు.  ఇది పరమ ప్రమాణం.

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం రెండవ అధ్యాయం

శ్రీబాదరాయణిరువాచ
ఏవం తే భగవద్దూతా యమదూతాభిభాషితమ్
ఉపధార్యాథ తాన్రాజన్ప్రత్యాహుర్నయకోవిదాః

ఇది విన్న ధర్మము బాగా తెలిసిన వారైన విష్ణు దూతలు ఇలా పలికారు

శ్రీవిష్ణుదూతా ఊచుః
అహో కష్టం ధర్మదృశామధర్మః స్పృశతే సభామ్
యత్రాదణ్డ్యేష్వపాపేషు దణ్డో యైర్ధ్రియతే వృథా

ప్రజానాం పితరో యే చ శాస్తారః సాధవః సమాః
యది స్యాత్తేషు వైషమ్యం కం యాన్తి శరణం ప్రజాః

ధర్మం సభను అధర్ములు పాలిస్తున్నారే. పాపం చేయని వారిని శిక్షిస్తున్నారే. పాలకులే అధర్మం ఆచరిస్తే ప్రజల గతి ఏమి కావాలి.

యద్యదాచరతి శ్రేయానితరస్తత్తదీహతే
స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే

ఉత్తముడైన వాడు ఏమి చేస్తే మిగిలిన వారు అదే పని చేస్తారు

యస్యాఙ్కే శిర ఆధాయ లోకః స్వపితి నిర్వృతః
స్వయం ధర్మమధర్మం వా న హి వేద యథా పశుః

పిల్లవాడు తండ్రి ఒడిలో తల పెట్టుకుని పరిపూర్ణ విశ్వాసముతో ఉన్నప్పుడు ఆ తండ్రే (తల్లే) తిని వేస్తే? పశువుకు ఎలా ధర్మం తెలియదో ధర్మాన్ని పరిపాలించే ధర్మరాజే అధర్మముగా ప్రవర్తిస్తే ఇక ధర్మమేది.

స కథం న్యర్పితాత్మానం కృతమైత్రమచేతనమ్
విస్రమ్భణీయో భూతానాం సఘృణో దోగ్ధుమర్హతి
అయం హి కృతనిర్వేశో జన్మకోట్యంహసామపి
యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః

మైత్రీ భావముతో తనను తాను అర్పించిన వ్యక్తికి తానెలా నమ్మదగినవాడవుతాడు. దయ ఉన్నవాడెవడూ ద్రోహం చేయకూడదు. పరమ దయాళువైన యముడే దయలేని వాడిగా ప్రవర్తిస్తే లోకములో ఎవరు దిక్కు. మీరు ఇతను చేసిన తప్పులను చెబుతున్నారు గానీ ఇతను తొలగించుకున్న కోటి జన్మల పాపాన్ని గురించి చెప్పట్లేదు

ఏతేనైవ హ్యఘోనోऽస్య కృతం స్యాదఘనిష్కృతమ్
యదా నారాయణాయేతి జగాద చతురక్షరమ్

అన్ని రకాల పాపములకూ "నారాయణ" అన్న నామాన్ని చెప్పి అన్ని పాపాల నిష్కృతినీ సాధించాడు. దొంగతన మద్యపానం మిత్రద్రోహం బ్రాహ్మణ స్త్రీ రాజ గో హత్యలు చేసినవారందరికీ ఒకే పరిహారం. పరమాత్మ నామం ఉచ్చరించుట లేదా పరమాత్మ యందు బుద్ధి నిలుపుట. ఇవి చేస్తే ఏ పాపం పరిగణించబడదు, అన్ని పాపాలూ పరిహరించబడతాయి. వేదమూ వేద పారాయణం యజ్ఞ్యం వ్రతములతో పరమాత్మ యందు మనసు ఉంచకుండా చేస్తే ఏ పరిహారమూ జరగదు. పరమాత్మ నామముచ్చరించడం వలన కలిగే పాప పరిహారం వీటి వలన జరుగదు

స్తేనః సురాపో మిత్రధ్రుగ్బ్రహ్మహా గురుతల్పగః
స్త్రీరాజపితృగోహన్తా యే చ పాతకినోऽపరే

సర్వేషామప్యఘవతామిదమేవ సునిష్కృతమ్
నామవ్యాహరణం విష్ణోర్యతస్తద్విషయా మతిః

న నిష్కృతైరుదితైర్బ్రహ్మవాదిభిస్తథా విశుద్ధ్యత్యఘవాన్వ్రతాదిభిః
యథా హరేర్నామపదైరుదాహృతైస్తదుత్తమశ్లోకగుణోపలమ్భకమ్

నైకాన్తికం తద్ధి కృతేऽపి నిష్కృతే మనః పునర్ధావతి చేదసత్పథే
తత్కర్మనిర్హారమభీప్సతాం హరేర్గుణానువాదః ఖలు సత్త్వభావనః

పరమాత్మ యందు మనసు ఉంచకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా, పరిహారం చేసిన వెంటనే మనసు పాత దారికే పోతుంది. మనసు మళ్ళీ ఆ దారిలో పోకుండా ఉండడానికి సత్వభావమును నిలిపే పరమాత్మ నామాన్ని కీర్తించడమే అసలైన పరిహారం. అన్ని పాపాలకూ పరిహారం చేసుకున్నాడు కాబట్టి ఇతన్ని మీరు తీసుకెళ్ళరాదు.

అథైనం మాపనయత కృతాశేషాఘనిష్కృతమ్
యదసౌ భగవన్నామ మ్రియమాణః సమగ్రహీత్

సాఙ్కేత్యం పారిహాస్యం వా స్తోభం హేలనమేవ వా
వైకుణ్ఠనామగ్రహణమశేషాఘహరం విదుః

పరమాత్మ పేరు ఎలా పలికినా పాపం తొలగుతుంది. పేరుగా పలికినా, పరిహాసముగా పలికినా, గర్వముగా పలికినా,హేళనముగా పలికినా, ఏ భావముతో అన్నా పరమాత్మ పేరు అన్ని పాపాలనూ తొలగిస్తుంది.

పతితః స్ఖలితో భగ్నః సన్దష్టస్తప్త ఆహతః
హరిరిత్యవశేనాహ పుమాన్నార్హతి యాతనాః

పతితుడు గానీ జారిపడిన వాడు గానీ భగ్నుడు గానీ పామూ తేళ్ళు కరవబడినవాడు కానీ ఎండన బడ్డవాడు కానీ, కొట్టబడినవాడు కానీ,

గురూణాం చ లఘూనాం చ గురూణి చ లఘూని చ
ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాని మహర్షిభిః

తైస్తాన్యఘాని పూయన్తే తపోదానవ్రతాదిభిః
నాధర్మజం తద్ధృదయం తదపీశాఙ్ఘ్రిసేవయా

అజ్ఞానాదథవా జ్ఞానాదుత్తమశ్లోకనామ యత్
సఙ్కీర్తితమఘం పుంసో దహేదేధో యథానలః

తుమ్మినా దగ్గినా వశములో లేకుండా పలికినా అలాంటి వారు నరకానికి తగరు. పెద్దపాపాలూ చిన్న పాపాలూ ప్రాయశ్చిత్తాలూ. ఆయా పాపాలు తపస్సు దానమూ యజ్ఞ్యములతో పోతాయి. కానీ నారాయణ నామ స్మరణతో అన్ని పాపాలూ పోతాయి. పరమాత్మ సంకల్పం లేకుండా ఎవరూ పరమాత్మ నామం పలకలేరు. తెలిసి పలికినా తెలియ పలికినా హరినామం పాపాలను పోగొడుతుంది. తెలిసి పడినా తెలియక పడినా ఎండిన గడ్డి మీద నిప్పు పడితే కాలినట్లు

యథాగదం వీర్యతమముపయుక్తం యదృచ్ఛయా
అజానతోऽప్యాత్మగుణం కుర్యాన్మన్త్రోऽప్యుదాహృతః

పెద్ద జబ్బు వచ్చినవాడు తెలియక ఒక మందును ఆహారముతో తీసుకుంటే రోగము పోయినట్లు పరిహారమని తెలియకున్నా పరమాత్మ నామాన్ని కీర్తిస్తే పాపం పోతుంది. మంత్రమును తెలియక పలికినా పాపాన్ని తొలగిస్తుంది.

శ్రీశుక ఉవాచ
త ఏవం సువినిర్ణీయ ధర్మం భాగవతం నృప
తం యామ్యపాశాన్నిర్ముచ్య విప్రం మృత్యోరమూముచన్

ఇలా పలికి విష్ణు దూతలు అజామీళున్ని యమ పాశాల నుంచి రక్షించారు.

ఇతి ప్రత్యుదితా యామ్యా దూతా యాత్వా యమాన్తికమ్
యమరాజ్ఞే యథా సర్వమాచచక్షురరిన్దమ

యమదూతలు వెళ్ళిపోయి యముని వద్ద ఈ జరిగిన విషయాన్ని వివరించారు.

ద్విజః పాశాద్వినిర్ముక్తో గతభీః ప్రకృతిం గతః
వవన్దే శిరసా విష్ణోః కిఙ్కరాన్దర్శనోత్సవః

చనిపోతున్నాననుకున్న సమయములో ఎంత భయంకరులైన యమదూతలను చూచాడో అంత ఆహ్లాదముతో మనసుకు ఆనందం కలిగించే విష్ణు దూతలను కూడా చూచాడు. ఇంకాసేపుంటే అజామీళుడేమైనా మాట్లాడతాడేమో అని విష్ణు దూతలు బయలు దేరి వెళ్ళారు.

తం వివక్షుమభిప్రేత్య మహాపురుషకిఙ్కరాః
సహసా పశ్యతస్తస్య తత్రాన్తర్దధిరేऽనఘ

అజామిలోऽప్యథాకర్ణ్య దూతానాం యమకృష్ణయోః
ధర్మం భాగవతం శుద్ధం త్రైవేద్యం చ గుణాశ్రయమ్

విష్ణు యమ దూతల సంబాషణ విన్న అజామీళుడు పరిశుద్ద్మైన ధర్మమేమిటో సత్వ రజ తమో గుణాలను ఆశ్రయించిన వేద విద్య ఏమిటో రెంటి స్వరూపాన్నీ అర్థం చేసుకుని

భక్తిమాన్భగవత్యాశు మాహాత్మ్యశ్రవణాద్ధరేః
అనుతాపో మహానాసీత్స్మరతోऽశుభమాత్మనః

పరమాత్మ దయవలన తాను చేసిన తప్పులకు పశ్చాత్తాపం చేసుకుని, ఉత్తమ బ్రాహ్మణున్నై శూద్రస్త్రీతో సంసారం చేసి సకల బ్రాహ్మణుల ధర్మాన్నీ భర్ష్టుపట్టించాను. నన్ను నేనే నిందించుకుంటున్నాను. బాలురాలు ఉత్తములారు ధర్మజ్ఞ్యురాలు అయిన భార్యను వేశ్య లాగ మద్యపానం చేయనందుకు వదిలిపెట్టాను.

అహో మే పరమం కష్టమభూదవిజితాత్మనః
యేన విప్లావితం బ్రహ్మ వృషల్యాం జాయతాత్మనా

ధిఙ్మాం విగర్హితం సద్భిర్దుష్కృతం కులకజ్జలమ్
హిత్వా బాలాం సతీం యోऽహం సురాపీమసతీమగామ్

వృద్ధావనాథౌ పితరౌ నాన్యబన్ధూ తపస్వినౌ
అహో మయాధునా త్యక్తావకృతజ్ఞేన నీచవత్

వృద్ధులైన తల్లి తండ్రులని కృతజ్ఞ్యత రహితున్నైన నేను వదిలిపెట్టాను. ధర్మమును వదిలిపెట్టిన కాముకులు ఎలాంటి యాతన పొందుతారో అలాంటి యాతనను నేను పొందాలి. అయినా ఎలాంటి యాతనా పొందకుండా భగవత్ దూతలను చూచాను. ఇది కలా నిజమా. ఆ యమ దూతలు ఎక్కడికి వెళ్ళారు, ఈ విష్ణు దూతలు ఎక్కడికి వెళ్ళారు

సోऽహం వ్యక్తం పతిష్యామి నరకే భృశదారుణే
ధర్మఘ్నాః కామినో యత్ర విన్దన్తి యమయాతనాః

కిమిదం స్వప్న ఆహో స్విత్సాక్షాద్దృష్టమిహాద్భుతమ్
క్వ యాతా అద్య తే యే మాం వ్యకర్షన్పాశపాణయః

అథ తే క్వ గతాః సిద్ధాశ్చత్వారశ్చారుదర్శనాః
వ్యామోచయన్నీయమానం బద్ధ్వా పాశైరధో భువః

అథాపి మే దుర్భగస్య విబుధోత్తమదర్శనే
భవితవ్యం మఙ్గలేన యేనాత్మా మే ప్రసీదతి



అన్యథా మ్రియమాణస్య నాశుచేర్వృషలీపతేః
వైకుణ్ఠనామగ్రహణం జిహ్వా వక్తుమిహార్హతి

క్వ చాహం కితవః పాపో బ్రహ్మఘ్నో నిరపత్రపః
క్వ చ నారాయణేత్యేతద్భగవన్నామ మఙ్గలమ్

సోऽహం తథా యతిష్యామి యతచిత్తేన్ద్రియానిలః
యథా న భూయ ఆత్మానమన్ధే తమసి మజ్జయే

విముచ్య తమిమం బన్ధమవిద్యాకామకర్మజమ్
సర్వభూతసుహృచ్ఛాన్తో మైత్రః కరుణ ఆత్మవాన్

మోచయే గ్రస్తమాత్మానం యోషిన్మయ్యాత్మమాయయా
విక్రీడితో యయైవాహం క్రీడామృగ ఇవాధమః

మమాహమితి దేహాదౌ హిత్వామిథ్యార్థధీర్మతిమ్
ధాస్యే మనో భగవతి శుద్ధం తత్కీర్తనాదిభిః

శూద్ర స్త్రీతో ఇన్ని పాపములు చేసిన నాకు విష్ణు దూతలు కనిపించారంటే పాపముతో బాటు పుణ్యము కూడా చేసి ఉంటాను. ఇన్ని తప్పులు చేసిన నా నాలుక పరమాత్మ నామం గ్రహించిందంటే కొంత పుణ్యం నేను తెలియకుండానే చేసి ఉంటాను. సిగ్గు విడిచిన వాడినీ, భ్రష్టుపట్టిన నేనెక్కడా పరమమంగళమైన పరమాత్మ నామమెక్కడ. ఎలాగా తెలిసింది కాబట్టి నామనో ఇంద్రియాలను నా వశములో ఉంచుకుని మళ్ళీ పాపాంధకారములోకి వెళ్ళకుండా ప్రయత్నిస్తాను. ఇలాంటి అవిద్యాబంధాన్నీ మోహాన్నీ వదిలిపెట్టి, వేశ్య అనే మహామోహం నుండి బయట పడి మంచి మార్గములో నడుస్తాను. ఇంతవరకూ నన్ను ఈ వేశ్య ఒక పెంపుడు మృగములా ఆడుకొంది. నా ప్రియురాలన్న భావనతో ఈ శరీరం యందు వేశ్య యందూ కలిగిన భావాన్ని సంపూర్ణముగా వదిలి, ఒక్క సారి  నారాయణ అంటేనే ఇన్నిపాపాలూ పోయాయని చెప్పారు కాబట్టి నా జీవితమనతా పరమాత్మ నామనుతోనే గడుపుతాను. అవిద్యా అజ్ఞ్యానమునుంచి విడుదల అవుతాను

శ్రీశుక ఉవాచ
ఇతి జాతసునిర్వేదః క్షణసఙ్గేన సాధుషు
గఙ్గాద్వారముపేయాయ ముక్తసర్వానుబన్ధనః

ఇలా అజామీళునికి చక్కని వైరాగ్యం కలిగి, అన్నీ వదిలిపెట్టి గంగా తీరానికి (హరిద్వార్) చేరుకుని

స తస్మిన్దేవసదన ఆసీనో యోగమాస్థితః
ప్రత్యాహృతేన్ద్రియగ్రామో యుయోజ మన ఆత్మని

యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారములతో (తాబేలులా ఇంద్రియములను వెనక్కు మరల్చుకుని) మనసుని ఆత్మలో నిలిపాడు.

తతో గుణేభ్య ఆత్మానం వియుజ్యాత్మసమాధినా
యుయుజే భగవద్ధామ్ని బ్రహ్మణ్యనుభవాత్మని

పరమాత్మలో ఆత్మను నిలిపి గుణత్రయములను వెనక్కు లాగి అనుభవమే స్వరూపముగా గల పరంధామాన్ని చేరుకున్నాడు

యర్హ్యుపారతధీస్తస్మిన్నద్రాక్షీత్పురుషాన్పురః
ఉపలభ్యోపలబ్ధాన్ప్రాగ్వవన్దే శిరసా ద్విజః

ఇది వరకు చూసిన మహా పురుషులని మళ్ళీ సాక్షాత్కరించుకున్నాడు. ఇది వరకు చూసిన వారిని గుర్తుపట్టి వారికి శిరస్సు వంచి నమస్కరించాడు

హిత్వా కలేవరం తీర్థే గఙ్గాయాం దర్శనాదను
సద్యః స్వరూపం జగృహే భగవత్పార్శ్వవర్తినామ్

వారిని చూడగానే గంగానదిలోకి వెళ్ళి స్నానం చేసి, శరీరాన్ని విడిచిపెట్టి, పరమాత్మ పార్శ్వదులైన ఆ పురుషుల స్వరూపాన్ని పొందాడు.

సాకం విహాయసా విప్రో మహాపురుషకిఙ్కరైః
హైమం విమానమారుహ్య యయౌ యత్ర శ్రియః పతిః

భగవ్త్ స్వారూప్యాన్ని పొంది వారితో కలిసి బంగారు విమానాన్ని అధిరోహించి శ్రియః పతి ఉన్న చోటికి వెళ్ళాడు

ఏవం స విప్లావితసర్వధర్మా దాస్యాః పతిః పతితో గర్హ్యకర్మణా
నిపాత్యమానో నిరయే హతవ్రతః సద్యో విముక్తో భగవన్నామ గృహ్ణన్

భోగాభిలాషకు గురై అన్ని ధర్మాలను భ్రష్టు పట్టించి దాసీ పతి అయిన అజామీళుడు నింద్యమైన పనితో పతితుడై కూడా అన్ని వ్రతాలూ వదులుకొని నరకములో పడబోతున్నవాడు కూడా పరమాత్మ నామాన్ని ఒక్కసారి స్వీకరించి ఆ బాధల నుండి విముక్తుడయ్యాడు.

నాతః పరం కర్మనిబన్ధకృన్తనం ముముక్షతాం తీర్థపదానుకీర్తనాత్
న యత్పునః కర్మసు సజ్జతే మనో రజస్తమోభ్యాం కలిలం తతోऽన్యథా

పరమాత్మ నామ సంకీర్తనాన్ని మించినటువంటి సంసారాన్ని విడిపించే సాధనం మరొకటి లేదు. ఒక్క సారి మనః పూర్వకముగా గానీ మనసు లేకుండా గానీ పరమాత్మ నామ సంకీర్తనములో మునిగిపోతే అలాంటి వాడి మనసు త్రిగుణాత్మకమైన వాటిలో చిక్కుకోదు

య ఏతం పరమం గుహ్యమితిహాసమఘాపహమ్
శృణుయాచ్ఛ్రద్ధయా యుక్తో యశ్చ భక్త్యానుకీర్తయేత్

పరమరహస్యమైన ఇతిహాసం ఇది అన్ని పాపాలను తొలగిస్తుంది. దీన్ని భక్తితో విన్నవాడు

న వై స నరకం యాతి నేక్షితో యమకిఙ్కరైః
యద్యప్యమఙ్గలో మర్త్యో విష్ణులోకే మహీయతే

పొరబాటున కూడా నరకానికి వెళ్ళడు, యమ భటులను కూడా చూడడు. పరమపాపి అయినా పరమాత్మ లోకాన్ని పొందుతాడు

మ్రియమాణో హరేర్నామ గృణన్పుత్రోపచారితమ్
అజామిలోऽప్యగాద్ధామ కిముత శ్రద్ధయా గృణన్

తాను బాగా ప్రేమించిన పుత్రుని పేరు చనిపోయే ముందు పలికి కూడా వైకుంఠానికి వెళ్ళాడంటే శ్రద్ధగా ఈ పరమాత్మ యొక్క కథను విన్నవారి గురించి వేరే చెప్పాలా

Tuesday, April 2, 2013

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ప్రధమాధ్యాయం

శ్రీమద్భాగవతం ఆరవ స్కంధం ప్రధమాధ్యాయం

శ్రీపరీక్షిదువాచ
నివృత్తిమార్గః కథిత ఆదౌ భగవతా యథా
క్రమయోగోపలబ్ధేన బ్రహ్మణా యదసంసృతిః

ప్రారంభములో మీరు మొత్తం నివృత్తి మార్గమే చెప్పారు. చేసిన ప్రతీ కర్మనూ పరమాత్మార్పణం చేయమని. బ్రహ్మ జ్ఞ్యానముతోటే సంసారం పోతుంది అని చెప్పారు. దానితోబాటు త్రిగుణాత్మకమైన మూడు గుణములలో ఉండే ప్రవృత్తి మార్గం (కర్మ యోగం). కర్మ యోగమంటే ప్రకృతియొక్క గుణ సర్గం.

ప్రవృత్తిలక్షణశ్చైవ త్రైగుణ్యవిషయో మునే
యోऽసావలీనప్రకృతేర్గుణసర్గః పునః పునః

అధర్మలక్షణా నానా నరకాశ్చానువర్ణితాః
మన్వన్తరశ్చ వ్యాఖ్యాత ఆద్యః స్వాయమ్భువో యతః

ప్రియవ్రతోత్తానపదోర్వంశస్తచ్చరితాని చ
ద్వీపవర్షసముద్రాద్రి నద్యుద్యానవనస్పతీన్

ధరామణ్డలసంస్థానం భాగలక్షణమానతః
జ్యోతిషాం వివరాణాం చ యథేదమసృజద్విభుః

అధునేహ మహాభాగ యథైవ నరకాన్నరః
నానోగ్రయాతనాన్నేయాత్తన్మే వ్యాఖ్యాతుమర్హసి

స్వాయంభువ చరిత్రను. ప్రియవ్రత ఉత్తానపాదుల చరిత్రనూ చెప్పారు. ద్వీప వర్ష సముద్ర నదుల వృక్ష ఉద్యానవనాలనూ భూమండలాన్నీ దాని విభాగాన్నీ అధోలోకాలూ నక్షత్రాలను పరమాత్మ ఎలా సృష్టించారో చెప్పారు . తప్పులు చేసినా నరకానికి వెళ్ళకుండా ఉండే మార్గం చెప్పండి.

శ్రీశుక ఉవాచ
న చేదిహైవాపచితిం యథాంహసః కృతస్య కుర్యాన్మనౌక్తపాణిభిః
ధ్రువం స వై ప్రేత్య నరకానుపైతి యే కీర్తితా మే భవతస్తిగ్మయాతనాః

చేయకుండా ఫలితం రాదు. చేసిన ఫలితం పోదు. ఇక్కడి తప్పుకు ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకోకుంటే అక్కడ నరకాలు తప్పవు.ప్రాయశ్చిత్తం కూడా కర్మే.

తస్మాత్పురైవాశ్విహ పాపనిష్కృతౌ యతేత మృత్యోరవిపద్యతాత్మనా
దోషస్య దృష్ట్వా గురులాఘవం యథా భిషక్చికిత్సేత రుజాం నిదానవిత్

త్రికరణాలతో (మనసు మాటా చేతితో) ఆచరించిన పాపములకు ప్రాయశ్చిత్తమును చేయకున్నట్లైతే తప్పకుండా నరకాన్ని చేరతాడు. అతి దారుణమైన యాతనలు అనుభవిస్తాడు. కాబట్టి ఇక్కడే త్వరగా పాపం పరిష్కారమవడానికి ప్రయత్నం చేయాలి. ఈ శరీరానికి మరణం రాకముందే చేసుకోవాలి.. ఈ శరీరముండగా ఏమేమి చేసామో దానికి ఈ శరీరముతోనే ప్రాయశ్చిత్తం చేసుకుంటే ఇంకో శరీరముతో వాటి ఫలితం అనుభవించాల్సిన అవసరం రాదు. కాబట్టి తప్పుకు వెంటనే పరిహారం చేసుకోవాలి.
రోగము యొక్క మూలం తెలుసుకున్న వైద్యుడు రోగాన్ని బట్టి తగిన మందు ఇస్తాడు. అలా మనం చేసిన తప్పు చిన్నదైతే చిన్న, పెద్దదైతే పెద్దా ప్రాయశ్చిత్తం

శ్రీరాజోవాచ
దృష్టశ్రుతాభ్యాం యత్పాపం జానన్నప్యాత్మనోऽహితమ్
కరోతి భూయో వివశః ప్రాయశ్చిత్తమథో కథమ్

మీరు చెప్పినది తెలియకుండా తప్పు చేసిన వారికి సరిపోతుంది గానీ, అది పాపమని తెస్లిసి అలాంటి దాని గురించి వినీ అలా చేస్తే ఏమవుతుందో చూచీ బుద్ధి పూర్వకముగా చేసినవారికి ప్రాయశ్చిత్తం ఏ విధముగా ఉపయోగపడుతుంది

క్వచిన్నివర్తతేऽభద్రాత్క్వచిచ్చరతి తత్పునః
ప్రాయశ్చిత్తమథోऽపార్థం మన్యే కుఞ్జరశౌచవత్

ఒక చోట తప్పు చేసి మరో చోట ప్రాయశ్చిత్తం చేసి మరో తప్పు చేస్తున్నాడు. ఏనుగు స్నానం లాగ అలాగే మనం కూడా ధర్మం చేసిన వెంటనే అధర్మం చేస్తూనే ఉంటాము. ఐతే ప్రాయశ్చిత్తం వలన లాభం లేదేమో

శ్రీబాదరాయణిరువాచ
కర్మణా కర్మనిర్హారో న హ్యాత్యన్తిక ఇష్యతే
అవిద్వదధికారిత్వాత్ప్రాయశ్చిత్తం విమర్శనమ్

ఒక కర్మను ఆచరించటం వలన వచ్చిన ఫలితం, ఇంకో కర్మను ఆచరించడం వలన తొలగదు. పరిపూర్ణముగా పరిహారం కాదు. ప్రాయశ్చిత్తమంటే కేవలం తాను చేసిన పనిని పరిశీలించుకోవడం మాత్రమే. ఇక ముందు అలాంటి తప్పు చేయకుండా పనికొస్తుంది గానీ చేసిన తప్పు పరిహారం అవ్వదు. జ్ఞ్యానం లేని వాడు మాత్రమే తప్పులు చేస్తాడు.

నాశ్నతః పథ్యమేవాన్నం వ్యాధయోऽభిభవన్తి హి
ఏవం నియమకృద్రాజన్శనైః క్షేమాయ కల్పతే

తినవలసిన దానిని తిన్నవాడికి వ్యాధులు రావు. ధర్మాన్ని ఆచరించినవాడికి పాపమూ రాదు

తపసా బ్రహ్మచర్యేణ శమేన చ దమేన చ
త్యాగేన సత్యశౌచాభ్యాం యమేన నియమేన వా

నియమం తప్పిన వాడికే నరకబాధలు. వెదురు బొంగును అగ్ని కాల్చినట్లుగా తాము చేసిన ఎంత చిన్న తప్పులైనా మహాత్ములు తొలగించుకుంటారు. శమాది మార్గాలు దానికి ఉన్నాయి

దేహవాగ్బుద్ధిజం ధీరా ధర్మజ్ఞాః శ్రద్ధయాన్వితాః
క్షిపన్త్యఘం మహదపి వేణుగుల్మమివానలః

కేచిత్కేవలయా భక్త్యా వాసుదేవపరాయణాః
అఘం ధున్వన్తి కార్త్స్న్యేన నీహారమివ భాస్కరః

కొందరు భక్తితోటే పరమాత్మను ఆరాధిస్తారు. వారు తప్పునూ ఒప్పునూ తెలియకనే చేస్తారు. పరమాత్మ నామ సంకీర్తన కూడా పరవశముతో చేస్తారు.కోరికలేని వాడు కోరకుండా చేసిన పనికి పాపం అంటదు. కేవల భక్తులై పూర్తిగా పాపాన్ని పోగొట్టుకుంటారు. సూర్యభగవానుడు మంచును తొలగించినట్లుగా వారి పాపాలు తొలగించబడతాయి. దాని వలన పాపం పోతాయి గానీ, ప్రాయశ్చిత్తం వలన కాదు.

న తథా హ్యఘవాన్రాజన్పూయేత తపాదిభిః
యథా కృష్ణార్పితప్రాణస్తత్పురుషనిషేవయా

భగవంతుని  యందు భక్తి కలవారు తప్పులు పోయినట్లు తపస్సు దానమూ యజ్ఞ్యములతో ప్రాయశ్చిత్తము చేస్తే పోవ్. భగవత్ భాగవతారాధనతో పవిత్రులైనట్లుగా ప్రాయశ్చిత్తముతో పవిత్రులము కాలేము.

సధ్రీచీనో హ్యయం లోకే పన్థాః క్షేమోऽకుతోభయః
సుశీలాః సాధవో యత్ర నారాయణపరాయణాః

ప్రపంచములో ఏ పక్కనుండీ ఎలాంటి భయమూ లేకుండా ఉండే మార్గముగా ఇది చెప్పబడింది. పరమాత్మ భక్తులకు ప్రాయశ్చిత్తాలతో పని లేదు. భగవత్ భాగవత ఆచార్య భక్తి కలవారు ప్రాయశ్చిత్తం చేయవలసిన పని లేదు. అది లేని వారు ప్రాయశ్చిత్తం చేసినా ఫలితం లేదు.

ప్రాయశ్చిత్తాని చీర్ణాని నారాయణపరాఙ్ముఖమ్
న నిష్పునన్తి రాజేన్ద్ర సురాకుమ్భమివాపగాః

పరమాత్మ యందు వైముఖ్యం కలిగిన మనసుతో చేసిన ప్రాయశ్చిత్తం పాపాన్ని పోగొట్టలేదు. మద్యపాత్రను గంగలో ఉంచితే దాని అపవిత్రత పోదు కదా. నదులు సురా కుంభాన్ని పవిత్రం చేయలేనట్లుగా పరమాత్మ విముఖముగా చేసిన ప్రాయశ్చిత్తాలు పవిత్రం చేయలేవు.

సకృన్మనః కృష్ణపదారవిన్దయోర్నివేశితం తద్గుణరాగి యైరిహ
న తే యమం పాశభృతశ్చ తద్భటాన్స్వప్నేऽపి పశ్యన్తి హి చీర్ణనిష్కృతాః

ఒక్క సారి మన మనసును పరమాత్మ పాద పద్మాల యందూ ఆయన గుణాల యందూ ఉంచితే యమున్ని గానీ, పాశధారులైన యమభటులని గానీ కలలో కూడా చూడరు. ఇంక వారికే ప్రాయశ్చిత్తములూ అవసరం లేదు. పరమాత్మ ఏ భావముతో భావించినా పాపం అంటదు. అగ్నిలో ఏది పడ్డా భస్మమైనట్లు.

అత్ర చోదాహరన్తీమమితిహాసం పురాతనమ్
దూతానాం విష్ణుయమయోః సంవాదస్తం నిబోధ మే

దీనికొక ఉదాహరణ ఇస్తాను. విష్ణు యమ దూతలకు జరిగిన సంవాదము చెబుతాను. కన్యా కుబ్జ నగరములో అజామీళుడనే వాడు ఒక శూద్ర స్త్రీకి భార్యగా పెరిగి దాసీ సంబోగముతో ఆచార భ్రష్టుడై

కాన్యకుబ్జే ద్విజః కశ్చిద్దాసీపతిరజామిలః
నామ్నా నష్టసదాచారో దాస్యాః సంసర్గదూషితః

బన్ద్యక్షైః కైతవైశ్చౌర్యైర్గర్హితాం వృత్తిమాస్థితః
బిభ్రత్కుటుమ్బమశుచిర్యాతయామాస దేహినః

దాసీ సగమం వచ్చాక ఆ ఒక్క పాపం వలన అందరూ నిందించే వృత్తిని అవలంబించి అపవిత్రుడై దాసీ కుటుంబాన్ని అపరిశుద్ధమైన మార్గములో పోషించుకుంటూ గడిపాడు

ఏవం నివసతస్తస్య లాలయానస్య తత్సుతాన్
కాలోऽత్యగాన్మహాన్రాజన్నష్టాశీత్యాయుషః సమాః

ఆ దాసీ పుత్రులను లాలిస్తూ, ఎనభై ఎనిమిది సంవత్సరాలు గడిపాడు.

తస్య ప్రవయసః పుత్రా దశ తేషాం తు యోऽవమః
బాలో నారాయణో నామ్నా పిత్రోశ్చ దయితో భృశమ్

ఆ దాసీ యందు పది మంది కుమారులు కలిగారు. అందరికంటే చిన్నవాడికి "నారాయణ" అన్న పేరు పెట్టుకున్నాడు.

స బద్ధహృదయస్తస్మిన్నర్భకే కలభాషిణి
నిరీక్షమాణస్తల్లీలాం ముముదే జరఠో భృశమ్

ముద్దు మాటలాడుతున్న నారాయణుని మాటలను వింటూ కాలం గడుపుతున్నాడు. ఆ పిల్లవాడి మాటలనీ ఆటలనీ సంతోషముగా చూస్తూ వింటూ ఉన్నాడు

భుఞ్జానః ప్రపిబన్ఖాదన్బాలకం స్నేహయన్త్రితః
భోజయన్పాయయన్మూఢో న వేదాగతమన్తకమ్

యముడు అనే వాడొకడున్నాడని కూడా తెలుసుకోలేదు

స ఏవం వర్తమానోऽజ్ఞో మృత్యుకాల ఉపస్థితే
మతిం చకార తనయే బాలే నారాయణాహ్వయే
స పాశహస్తాంస్త్రీన్దృష్ట్వా పురుషానతిదారుణాన్
వక్రతుణ్డానూర్ధ్వరోమ్ణ ఆత్మానం నేతుమాగతాన్
దూరే క్రీడనకాసక్తం పుత్రం నారాయణాహ్వయమ్
ప్లావితేన స్వరేణోచ్చైరాజుహావాకులేన్ద్రియః

మృత్యుకాలం వచ్చేసరికి ఎవరు చిన్నవారో వారి మీద ప్రేమ ఉంటుంది. అందుకు ఇతనికి నారాయణుడు జ్ఞ్యాపకం వచ్చాడు. ముగ్గురు యమభటులు పాశము ధరించి వంకర మూతితో భయంకరముగా వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉండి తనను తీసుకు పోవడానికి రాగానే వారిని చూచి భయము పొంది, "నారాయణ" "నారాయణా" "నారాయణా" అంటూ గట్టిగా పిలిచాడు

నిశమ్య మ్రియమాణస్య ముఖతో హరికీర్తనమ్
భర్తుర్నామ మహారాజ పార్షదాః సహసాపతన్
వికర్షతోऽన్తర్హృదయాద్దాసీపతిమజామిలమ్
యమప్రేష్యాన్విష్ణుదూతా వారయామాసురోజసా
ఊచుర్నిషేధితాస్తాంస్తే వైవస్వతపురఃసరాః
కే యూయం ప్రతిషేద్ధారో ధర్మరాజస్య శాసనమ్
కస్య వా కుత ఆయాతాః కస్మాదస్య నిషేధథ
కిం దేవా ఉపదేవా యా యూయం కిం సిద్ధసత్తమాః

తమ ప్రభువైన నారాయణుని పేరు పిలవగానే విష్ణు పార్శ్వదులు వచ్చారు. అప్పటికే యమదూతలు పాశముతో ఇతన్ని లాగుతూ ఉండగా విష్ణు పార్శ్వదులు వారిని నెట్టి వేసారు.

"మేము ధర్మరాజు దూతలం. ఆయన ఆజ్ఞ్యని కాదనడానికి మీరెవరు. దేవతలా ఉపదేవతలా (రాక్షసులా)"

సర్వే పద్మపలాశాక్షాః పీతకౌశేయవాససః
కిరీటినః కుణ్డలినో లసత్పుష్కరమాలినః

సర్వే చ నూత్నవయసః సర్వే చారుచతుర్భుజాః
ధనుర్నిషఙ్గాసిగదా శఙ్ఖచక్రామ్బుజశ్రియః

దిశో వితిమిరాలోకాః కుర్వన్తః స్వేన తేజసా
కిమర్థం ధర్మపాలస్య కిఙ్కరాన్నో నిషేధథ

పుండరీకాషులూ కిరీటములతో ఇపుడే యవ్వనములోకి వచ్చినట్లు ఉన్నారు. శంఖ చక్రాదులతో మీ తేజస్సుతో అన్ని దిక్కుల చీకట్లనూ పొగొడుతున్నారు. మేము ధర్మరాజు కింకరులము. మమ్ము మీరెందుకు నిషేధిస్తున్నారు".

శ్రీశుక ఉవాచ
ఇత్యుక్తే యమదూతైస్తే వాసుదేవోక్తకారిణః
తాన్ప్రత్యూచుః ప్రహస్యేదం మేఘనిర్హ్రాదయా గిరా

పరమాత్మ అనుచరులు నవ్వుతూ మేఘగంభీర స్వనముతో ఇలా అన్నారు

శ్రీవిష్ణుదూతా ఊచుః
యూయం వై ధర్మరాజస్య యది నిర్దేశకారిణః
బ్రూత ధర్మస్య నస్తత్త్వం యచ్చాధర్మస్య లక్షణమ్

మీరు యమధర్మరాజూ అనుచరులని మాకర్ధ్మైంది. ధర్మమంటే ఏమిటొ చెప్పగలరా మీరు. దండన తత్వం గురించి కూడా వివరించండి.

కథం స్విద్ధ్రియతే దణ్డః కిం వాస్య స్థానమీప్సితమ్
దణ్డ్యాః కిం కారిణః సర్వే ఆహో స్విత్కతిచిన్నృణామ్

తప్పు చేసిన వారందరినీ దండిస్తారా. కొందరినే దండిస్తారా. అని అడుగగా.

యమదూతా ఊచుః
వేదప్రణిహితో ధర్మో హ్యధర్మస్తద్విపర్యయః
వేదో నారాయణః సాక్షాత్స్వయమ్భూరితి శుశ్రుమ

వేదముచే విధించబడినది ధర్మం. వేదం చేత నిషేధించబడినది అధర్మం. వేదమంటే సాక్షాత్ నారాయణుడే. నారాయణుని వలన వచ్చినది వేదం. అయినప్పటికీ వేదం అపౌరుషేయం. నారాయణుని రూపమే వేదం. పరమాత్మ నిశ్వాసమే వేదం.

యేన స్వధామ్న్యమీ భావా రజఃసత్త్వతమోమయాః
గుణనామక్రియారూపైర్విభావ్యన్తే యథాతథమ్

ధరించేదీ ధరించబడేదీ ధర్మం. వృద్ధుడు కట్టెను పట్టుకుంటేనే నడిపిస్తుంది. అలాగే ధర్మం కూడా దానిని ఆచరిస్తేనే అది మనను కాపాడుతుంది. రజస్సు సత్వం తమో అనే భావములు గుణ నామ క్రియ పరమాత్మ చేతనే సృష్టించబడతాయి

సూర్యోऽగ్నిః ఖం మరుద్దేవః సోమః సన్ధ్యాహనీ దిశః
కం కుః స్వయం ధర్మ ఇతి హ్యేతే దైహ్యస్య సాక్షిణః

ఎవరికీ తెలియకుండా అతి రహస్యముగా మేము పని చేయగలం అనుకుటారు గానీ. సూర్యుడూ అగ్ని ఆకాశం వాయువు గోవులు చంద్రుడు సంధ్య పగలు దిక్కులూ బ్రహ్మ భూమి కాలమూ ధర్మమూ, ఈ పన్నెండూ దేహం కలవాడిచేత చేయబడే పనులకి సాక్షులు.

ఏతైరధర్మో విజ్ఞాతః స్థానం దణ్డస్య యుజ్యతే
సర్వే కర్మానురోధేన దణ్డమర్హన్తి కారిణః

ఇవి దేహం కలవారు చేసే అధర్మాన్ని తెలుసుకొని చేసిన అధర్మానికి శిక్ష కూడా విధిస్తాయి. ఏ ప్రాణి మరణానికైన ఈ పన్నెంటిలో ఏదో ఒకటి కారణమవుతుంది. వారు వారు చేసిన కర్మకనుగుణముగా శిక్షననుభవిస్తారు.

సమ్భవన్తి హి భద్రాణి విపరీతాని చానఘాః
కారిణాం గుణసఙ్గోऽస్తి దేహవాన్న హ్యకర్మకృత్

ధర్మాన్ని అనుసరించిన వారికి మగళము జరుగుతుంది. కాని వారికి శిక్షపడుతుంది. ధర్మమో అధర్మమో ఏదో ఒకటి చేసే తీరాలి. ఎందుకంటే ప్రకృతిలో ఉంటే సత్వమూ రజస్సూ తమస్సులలో ఏదో ఒకటి చేయాలి

యేన యావాన్యథాధర్మో ధర్మో వేహ సమీహితః
స ఏవ తత్ఫలం భుఙ్క్తే తథా తావదముత్ర వై

శరీరము కలవాడు కర్మ చేయకుండా ఉండలేడు. ఎవరు వారి గుణ సంగమును బట్టి ధర్మమో అధర్మమో చేసి తీరతాడు. అలా అనుకోవడానికి వాడి గుణము కారణం. ఇలా వారాచరించిన ధర్మాధర్మములకు అనుగుణముగానే ఫలితాన్ని పొందుతాడు. అన్నీ ఇక్కడే పొందడు. కొన్ని పరలోకములలో కూడా పొందుతాడు.

యథేహ దేవప్రవరాస్త్రైవిధ్యముపలభ్యతే
భూతేషు గుణవైచిత్ర్యాత్తథాన్యత్రానుమీయతే

దేవతలలో తేడాలు లాగ, సాత్విక రాజస తామస ప్రాణులు ఉంటాయి. వారాచరించే కర్మను బట్టి వారు సాత్వికులో రాజసికులో తామసికులో చెప్పవచ్చు.

వర్తమానోऽప్యయం కాలో గుణాభిజ్ఞాపకో యథా
ఏవం జన్మాన్యయోరేతద్ధర్మాధర్మనిదర్శనమ్

ఆయా జాతులలో ఉన్న శరీరుల శరీరం ఒకే తీరుగా ఉంటుంది. మరి వారు రాజసులా సాత్వికులా అని ఎలా చెప్పగలం. ఒక్కటే అయిన కాలాన్ని భూత భవిష్యత్ వర్త్మానమనీ. అలాగే రోజులో తెల్లవార్జు ఝామును సాత్వికమనీ, సాయం కాలం వరకూ రాజసమనీ, రాత్రి తామసికమని ఎలా చెప్పగలుగుతున్నాము. ప్రాణులు ఆచరించే పనులను బట్టి. ఆ పనులు ఏ గుణానివో ఆ గుణం కాలానికి ఆపాదిస్తున్నాము. సంబంధం లేని కాలానికే ఆ గుణం ఉన్నప్పుడు కర్తృత్వం ఉన్న ప్రాణికి ఆ గుణం ఉండదా?  ఎలాంటి వారికి పుత్రులుగా పుట్టారు, ఎలాంటి కాలములో పుట్టారు, ఎలాంటి పనులు చేస్తున్నారు.

మనసైవ పురే దేవః పూర్వరూపం విపశ్యతి
అనుమీమాంసతేऽపూర్వం మనసా భగవానజః

యథాజ్ఞస్తమసా యుక్త ఉపాస్తే వ్యక్తమేవ హి
న వేద పూర్వమపరం నష్టజన్మస్మృతిస్తథా

సామాన్యులు వారి మనస్సును బట్టి ఊహిస్తారు. మనస్సే వారి పూర్వ రూపాన్ని చెబుతుంది. (జాతకములో ద్వాదశాంశ అని ఒకటుంటుంది. అది తెలిస్తే పూర్వ జన్మ గురించి చెప్పవచ్చు). మనసు బట్టే వాడు పూర్వ జన్మలో ఎలాంటి వాడో చెప్పవచ్చు. పరమాత్మ కూడా ఒకడి కర్మ  బట్టే రాబోయే శరీరాన్ని నిర్ణ్యైస్తాడు. జ్ఞ్యానము లేని వాడు, తమో గుణములో ఉన్నవాడు, చీకటిలో ఉన్నవాడు దేనినీ సేవించలేడు. జ్ఞ్యానం పొంది వెలుతురులో ఉన్నవాడు స్పష్టముగా ఉన్న దానినే సేవిస్తాడు. చీకటిలో ఉన్నవాడు దేనినీ తెలియనట్లుగా పూర్వ జన్మ జ్ఞ్యానమున్నవాడు తరువాత దన్ని గానీ ముందు దాన్ని గానీ తెలుసుకోలేడు.

పఞ్చభిః కురుతే స్వార్థాన్పఞ్చ వేదాథ పఞ్చభిః
ఏకస్తు షోడశేన త్రీన్స్వయం సప్తదశోऽశ్నుతే

ప్రతీ వ్యక్తి తనకు కావలసిన దానిని ఐదింటితో చేస్తాడు. ఐదింటితో చేసి ఐదింటితో తెలుసుకుంటాడు.ఐదింటినీ కూడా ఐదింటితో తెలుసుకుంటాడు. ఒకడు పదహారుతో పదిహేడవది భావించి మూటినీ అనుభవిస్తాడు. ఐదు కర్మేంద్రియములతో ఐదు విషయములను ఆచరిస్తాడు. శబ్ద స్పర్శ రూప రస గంధములను పంచ జ్ఞ్యానేంద్రియములతో తెలుసుకుంటాడు. ఐదు కర్మేంద్రియములతో ఐదు పనులనూ చేస్తాడు. పదహారవది మనస్సు, పదిహేడవది బుద్ధి. మనసుతో చేసె దాన్ని అనుభవించేది బుద్ధి.  ఈ పదహారవ పదిహేడవ దానితోటే కర్తృత్వ కార్యత్వ కరణత్వ భావాలు కలుగుతాయి.

తదేతత్షోడశకలం లిఙ్గం శక్తిత్రయం మహత్
ధత్తేऽనుసంసృతిం పుంసి హర్షశోకభయార్తిదామ్

జ్ఞ్యానెంద్రియ కర్మేంద్రియ పంచ భూతములూ మనసుతో కలిసి ఉన్నది త్రిగుణాత్మకం. ద్రవ్య జ్ఞ్యాన క్రియా శక్తిగా ఉంటుంది. ఈ శక్తి త్రయమే (బుద్ధి) జీవునిలో సంసారాన్ని ప్రవేశింపచేస్తుంది. సంతోషం దుఃఖం భయం ఆర్తి, వీటిని సంసారం కలిగిస్తుంది. ఈ సంసారాన్ని బుద్ధి కలిగిస్తుంది. అదే చేయిస్తుంది, అదే అనుభవిస్తుంది. ఆ అనుభవాన్ని ఆత్మకు ఆపాదిస్తుంది.

దేహ్యజ్ఞోऽజితషడ్వర్గో నేచ్ఛన్కర్మాణి కార్యతే
కోశకార ఇవాత్మానం కర్మణాచ్ఛాద్య ముహ్యతి

అసలు జీవునికి వీటితో సంబంధం లేదు. అసలు ఆత్మ జ్ఞ్యాధికరణం. అది మరచిపోయి అరిషడ్వర్గాలని గెలవలేక, తనకు ఇష్టము లేకున్నా పనులు చేస్తూనే ఉంటాడు. సాలీడు తను వేసుకున్న వల తననే బంధిస్తుందని తెలియక అల్లుకున్నట్లు మనం కూడా మనని బంధించుకుంటాము. ఏ ఒక్కడూ ఏ ఒక్క క్షణం పని చేయకుండా ఉండజాలడు. తన వశములో తాను లేక ఇలాంటి పనులను తాను చేస్తూ ఉంటాడు. తాను కాదు ఆ పని చేసేది. గుణములు చేయిస్తుంటాయి. ఆ గుణములు తన స్వభావము వలన వచ్చినది. మామిడి విత్తనం వేస్తే వేప వస్తుందా? (పక్వానికి వచ్చిన మామిడి చెట్టును గొడ్డలితో కొట్టి అదే స్థానములో వేప చెట్టును నాటి దానిని పాలతో పోషించినా ఆ పండు చేదుగానే ఉంటుంది గానీ తీపిగా ఉండదు - భరతుని వాక్యం రామాయణములో) క్షేత్రం (యోనీ) విత్తనం కాలం - ప్రతీ దానికీ ఈ మూడే కారణం. వీటి బట్టే కర్మ వస్తువూ అనుభవం నిర్ణయించబడి ఉంటాయి.

న హి కశ్చిత్క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్
కార్యతే హ్యవశః కర్మ గుణైః స్వాభావికైర్బలాత్
లబ్ధ్వా నిమిత్తమవ్యక్తం వ్యక్తావ్యక్తం భవత్యుత
యథాయోని యథాబీజం స్వభావేన బలీయసా
ఏష ప్రకృతిసఙ్గేన పురుషస్య విపర్యయః
ఆసీత్స ఏవ న చిరాదీశసఙ్గాద్విలీయతే

కారణం వ్యక్తం కావచ్చు అవ్యక్తం కావచ్చు వ్యక్తావ్యక్తమూ కవొచ్చు గానీ ఆయా క్షేత్రం బీజం ప్రకృతి స్వభావం బట్టే విపరీతముగా ప్రవర్తిస్తాడు.

అయం హి శ్రుతసమ్పన్నః శీలవృత్తగుణాలయః
ధృతవ్రతో మృదుర్దాన్తః సత్యవాఙ్మన్త్రవిచ్ఛుచిః

ఎవరిని ఊర్ధ్వ లోకాలకు పంపాలనుకుంటాడో అలాంటి వాడిచేత అలాంటి పని పరమాత్మే చేయిస్తాడు.

గుర్వగ్న్యతిథివృద్ధానాం శుశ్రూషురనహఙ్కృతః
సర్వభూతసుహృత్సాధుర్మితవాగనసూయకః

ఇతను శచ్చీలం కలవాడు శాస్త్రం చదువుకున్నవాడు మృదుస్వభావి. ఇంద్రియ నిగ్రహం కలవాడు, శుచి శౌచం కలవాడు. గురువులనూ అగ్నినీ భూతములనూ అథితినీ సేవించేవాడు, అహంకారం లేని వాడు, సకల ప్రాణులయందూ మైత్రీభావం కలవాడూ, సజ్జనుడూ, మితబాషి, ఇతరుల గుణాలలో దోషం ఎంచని వాడు.

ఏకదాసౌ వనం యాతః పితృసన్దేశకృద్ద్విజః
ఆదాయ తత ఆవృత్తః ఫలపుష్పసమిత్కుశాన్

దదర్శ కామినం కఞ్చిచ్ఛూద్రం సహ భుజిష్యయా
పీత్వా చ మధు మైరేయం మదాఘూర్ణితనేత్రయా

ఒక సారి పితృ ఆదేశం మీద దర్భలు తీసుకు రావడానికి వనానికి వెళ్ళాడు. పళ్ళనూ పూలనూ సమిధలనూ తీసుకుని వెనకకు బయలుదేరగా, విశ్రమిద్దామని చెట్టుకింద కూర్చుని ఉండగా కాముకుడైన ఒక శూద్రుడు తాననుభవించడానికి ఏర్పాటు చేసుకున్న వేశ్యను చూచాడు.

మత్తయా విశ్లథన్నీవ్యా వ్యపేతం నిరపత్రపమ్
క్రీడన్తమనుగాయన్తం హసన్తమనయాన్తికే

దృష్ట్వా తాం కామలిప్తేన బాహునా పరిరమ్భితామ్
జగామ హృచ్ఛయవశం సహసైవ విమోహితః

స్తమ్భయన్నాత్మనాత్మానం యావత్సత్త్వం యథాశ్రుతమ్
న శశాక సమాధాతుం మనో మదనవేపితమ్

ఆ వేశ్య మద్యపానం చేసి ఎర్రబారిన చూపుతో ఉన్నది. మద్యపానము చేయడముతో బాగా మదించి ఉన్నది. వస్త్రం జారిపోతూ ఉండగా సిగ్గును విడిచి ఉన్న స్త్రీనీ ఆ పురుషున్ని చూచాడు. వారిద్దరూ ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ఉండగా పరిపూర్ణ్మైన కామోద్రేకముతో ఆలింగనం చేసుకున్న ఆ జంటను చూడగానే పాండిత్యం శ్రద్దా జ్ఞ్యానం పోయి మధన బాధితుడై

మధ్యాన్నం పన్నెండు నించీ నాలుగు వరకూ అడవికీ అర్థరాత్రి శ్మశానములోకీ అపరరాత్రి నదీ జలమునకూ వెళ్ళకూడదు. ఆయా సమయాలలో అక్కడ అటువంటి పనులు జరుగుతాయి. మధ్యాహ్నం ఎవరూ ఉండరని అడవిలో కొందరు కాముకులు అరణ్యాన్ని శయ్యాగృహముగా వాడుకొంటారు. అర్థరాత్రి భూత ప్రేతములు శ్మశానాన్ని అలా వాడుకొంటాయి, అలాగే అపర రాత్రి సరస్సులూ. అప్పటికీ చదువుకున్నవాడు కాబట్టి నిగ్రహించుకుందామని ప్రయత్నించాడు గానీ సమాధానపరచుకోలేకపోయాడు.

తన్నిమిత్తస్మరవ్యాజ గ్రహగ్రస్తో విచేతనః
తామేవ మనసా ధ్యాయన్స్వధర్మాద్విరరామ హ


తామేవ తోషయామాస పిత్ర్యేణార్థేన యావతా
గ్రామ్యైర్మనోరమైః కామైః ప్రసీదేత యథా తథా


మన్మధుడనే గ్రహం పట్టింది ఇతనికి. ఆ వేశ్యనే కోరుకున్నాడు. ఎలాగూ వేశ్య కాబట్టి తండ్రి సంపాదించిన డబ్బుని (తండ్రి నుంచి నేర్చుకున్న జ్ఞ్యానం శీలం తపస్సూ ధారపోసాడు) ధార్పోసాడు. ఆమెను సంతోషపరచి తాను సంతోషం పొందాడు. అంతవరకూ తనకన్ని రకములుగా సేవచేసిన ధర్మపత్నినీ, అప్రౌఢ (వేశ్య లాగ తనని రజింపచేయలేక పోయినదైన భార్య)

విప్రాం స్వభార్యామప్రౌఢాం కులే మహతి లమ్భితామ్
విససర్జాచిరాత్పాపః స్వైరిణ్యాపాఙ్గవిద్ధధీః

తన భార్య తనకు అలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోయింది అని విడిచిపెట్టాడు. భర్తను తన వశములో ఉంచుకోవడానికి అవసరమైన చేష్టలు చేయలేనిది - అప్రౌఢ.

యతస్తతశ్చోపనిన్యే న్యాయతోऽన్యాయతో ధనమ్
బభారాస్యాః కుటుమ్బిన్యాః కుటుమ్బం మన్దధీరయమ్

ఉత్తమ కులములో పుట్టినది. మాయోపాయములతో భర్తను వశం చేసుకోవాలన్న భావన అటువంటి స్త్రీలకు కలదు. ఆ వేశ్యను పోషించడానికి ఈ బ్రాహ్మణోత్తముడు అన్ని వైపులనుంచీ ధనాన్ని తీసొచ్చాడు, ధర్మముగా అధరమముగా కూడా సంపాధించాడు. బుద్ధి తక్కువ వాడై ఆమె సంతానాన్ని పోషించాడు.

యదసౌ శాస్త్రముల్లఙ్ఘ్య స్వైరచార్యతిగర్హితః
అవర్తత చిరం కాలమఘాయురశుచిర్మలాత్

తత ఏనం దణ్డపాణేః సకాశం కృతకిల్బిషమ్
నేష్యామోऽకృతనిర్వేశం యత్ర దణ్డేన శుద్ధ్యతి

ఇలా ధర్మాన్నీ శాస్త్రాన్ని ఉల్లంఘించి చాలా కాలం వ్యవహరించాడు. యధేచ్చగా ప్రవర్తిస్తూ చాలా కాలం గడిపి జీవితమంతా పాపముతో గడిపాడు. ఇతను చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవించడానికి ఇతను తీసుకుపోవడానికి యమధర్మరాజు దగ్గర నుంచి వచ్చాము. చేసిన అపరాధం శిక్షతో పరిశుద్ధమవుతుంది కాబట్టి యమ ధర్మ రాజు పంపాడు