Thursday, March 14, 2013

శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ప్రధమాధ్యాయం


శ్రీమద్భాగవతం పంచమ స్కంధం ప్రధమాధ్యాయం

రాజోవాచ
ప్రియవ్రతో భాగవతాత్మారామః కథం మునే
గృహేऽరమత యన్మూలః కర్మబన్ధః పరాభవః

నారదుడి వలన ఆధ్యాత్మ జ్ఞ్యానం పొంది కూడా ప్రియవ్రతుడు, భాగవతుడు పరమాత్మ యందే రమించేవాడు, సంసారములో ఎలా రమించాడు. అలాంటి మహానుభావుడు సంసారములో ఎలా రమించాడు. అన్ని కర్మబంధాలూ పరాభవాలు సంసారము వలనే వస్తాయి కదా? న్

న నూనం ముక్తసఙ్గానాం తాదృశానాం ద్విజర్షభ
గృహేష్వభినివేశోऽయం పుంసాం భవితుమర్హతి

అన్ని సంగములూ వదిలిపెట్టిన అలాంటిన్ వారికి సంసారము యందు అభిలాష ఉండదు కదా

మహతాం ఖలు విప్రర్షే ఉత్తమశ్లోకపాదయోః
ఛాయానిర్వృతచిత్తానాం న కుటుమ్బే స్పృహామతిః

పరమాత్మ యందు ఆసక్తి ఉన్న వారికి సంసారము యందు ఆసక్తి ఉండదు కదా? అంత సంసారములో ఉన్నవాడు ముక్తిని ఎలా పొందాడు. పరమాత్మయందు జారని మనసు ఎలా ఉంది.

సంశయోऽయం మహాన్బ్రహ్మన్దారాగారసుతాదిషు
సక్తస్య యత్సిద్ధిరభూత్కృష్ణే చ మతిరచ్యుతా

శ్రీశుక ఉవాచ
బాఢముక్తం భగవత ఉత్తమశ్లోకస్య శ్రీమచ్చరణారవిన్దమకరన్దరస ఆవేశితచేతసో
భాగవతపరమహంసదయితకథాం కిఞ్చిదన్తరాయవిహతాం స్వాం శివతమాం పదవీం న ప్రాయేణ హిన్వన్తి

మంచిగా చెప్పావు.  జ్ఞ్యాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు గల నారాయణుని మీద మనసు ఉంచినవాడికి, పరమాత్మ యందు ప్రేమ కలిగిన వారు పరమాత్మ భక్తికి ఏ కొద్ది విఘ్నమొచ్చినా సహించరు.

యర్హి వావ హ రాజన్స రాజపుత్రః ప్రియవ్రతః పరమభాగవతో నారదస్య
చరణోపసేవయాఞ్జసావగతపరమార్థసతత్త్వో బ్రహ్మసత్రేణ దీక్షిష్యమాణోऽవనితలపరిపాలనాయామ్నాత
ప్రవరగుణగణైకాన్తభాజనతయా స్వపిత్రోపామన్త్రితో భగవతి వాసుదేవ ఏవావ్యవధానసమాధియోగేన
సమావేశితసకలకారకక్రియాకలాపో నైవాభ్యనన్దద్యద్యపి తదప్రత్యామ్నాతవ్యం తదధికరణ
ఆత్మనోऽన్యస్మాదసతోऽపి పరాభవమన్వీక్షమాణః

ఆ రాజపుత్రుడైన ప్రియవ్రతుడు పరమభాగవతుడు. నారదుని పాద సేవతో సులభముగా పరమాత్మ జ్ఞ్యానం తెలుసుకున్నవాడై, పరమాత్మను చేరాలని కోరుతూ బ్రహ్మదీక్షలోకి దిగబోయే సమయములో తండ్రి రాజ్యపరిపాలన చేయమని ఆహ్వానించాడు. ఉత్తముడైన అన్ని గుణగణములు గల తన తండ్రి చేత ఆహ్వాఇంచబడి పరమాత్మ మీద ఏ మాత్రం వ్యవధానం లేకుండా భక్తి కలవాడు, చేయవలసిన పనులు పరమాత్మ యందు ఉంచి తండ్రి మాటలను అంతగా ఆమోదించలేదు. ఎందుకంటే దాన్ని ఆమోదిస్తే పరాభవం తప్పదు.

అథ హ భగవానాదిదేవ ఏతస్య గుణవిసర్గస్య పరిబృంహణానుధ్యానవ్యవసితసకలజగద్
అభిప్రాయ ఆత్మయోనిరఖిలనిగమనిజగణపరివేష్టితః స్వభవనాదవతతార

ప్రియవ్రతుని ఉత్తమ గుణాలు ఎంత బాగా వ్యాపించాయో తెలుసుకుని, నిరంతర పరమాత్మ గుణములలో మునిగి ప్రాపంచిక విషయాల మీద విరక్తితో ఉన్నాడని తెలుసుకుని స్వయంభువైన బ్రహ్మ అఖిల వేదాలూ ఋషులతో పరివేష్టించబడి కిందకు వచ్చాడు..

స తత్ర తత్ర గగనతల ఉడుపతిరివ విమానావలిభిరనుపథమమర
పరివృఢైరభిపూజ్యమానః పథి పథి చ వరూథశః సిద్ధగన్ధర్వసాధ్యచారణముని
గణైరుపగీయమానో గన్ధమాదనద్రోణీమవభాసయన్నుపససర్ప

ఈయన చంద్రునివలే కిందికి దిగి వస్తుంటే దేవతలందరూ విమానాలలో వచ్చి ఈయనని పూజించారు. సిద్ధ చారణులచే కీర్తించబడుతూ, గంధమాధన ప్రాంతమునకు వచ్చాడు

తత్ర హ వా ఏనం దేవర్షిర్హంసయానేన పితరం భగవన్తం హిరణ్యగర్భముపలభమానః
సహసైవోత్థాయార్హణేన సహ పితాపుత్రాభ్యామవహితాఞ్జలిరుపతస్థే

దేవర్షుడైన నారదాదులూ మనువూ లేచి సావధాన మనస్సుతో స్వాగతం చెప్పి అక్కడ కూర్చున్నారు

భగవానపి భారత తదుపనీతార్హణః సూక్తవాకేనాతితరాముదితగుణగణావతారసుజయః
ప్రియవ్రతమాదిపురుషస్తం సదయహాసావలోక ఇతి హోవాచ

బ్రహ్మ కూడా అటువంటి వారిచేత పూజించబడి చక్కని మాటతో సంతోషింపబడి ప్రియవ్రతున్ని దయతో చూస్తూ ఇలా అన్నాడు.

శ్రీభగవానువాచ
నిబోధ తాతేదమృతం బ్రవీమి మాసూయితుం దేవమర్హస్యప్రమేయమ్
వయం భవస్తే తత ఏష మహర్షిర్వహామ సర్వే వివశా యస్య దిష్టమ్

నేను నిజమును చెబుతున్నాను తెలుసుకో. భగవంతుని యందు అసూయ పడకు (దోషాలు ఎంచకు). ఆయన అప్రమేయుడు. ఆయనని ఇంద్రియ మనో బుద్ధి చిత్తమూ అంతఃకరణమూ తెలుసుకోలేవు. ఆయనను దోష దృష్టితో చూడవద్దు. నేనూ శంకరుడూ మహర్షి నారదుడూ ప్రజాపతులూ, మేమందరమూ ఆయన ఆజ్ఞ్యకు బద్ధులమై పరమాత్మ వశములో ఉన్న మేము ఆయన ఆజ్ఞ్యను శిరసా వహిస్తున్నాము.

న తస్య కశ్చిత్తపసా విద్యయా వా న యోగవీర్యేణ మనీషయా వా
నైవార్థధర్మైః పరతః స్వతో వా కృతం విహన్తుం తనుభృద్విభూయాత్

ఏ దేహధారి అయినా ఎన్ని సాధనములు జ్ఞ్యానమును పొందడానికీ పరమాత్మను సాక్షాత్కరింపచేసుకోవడానికి చెప్పబడ్డాయో అవి అన్నీ సంపాదించినా కూడా పరమాత్మ సంకల్పాన్ని అడ్డగించడానికి ఏ దేహధారికీ శక్తిలేదు

భవాయ నాశాయ చ కర్మ కర్తుం శోకాయ మోహాయ సదా భయాయ
సుఖాయ దుఃఖాయ చ దేహయోగమవ్యక్తదిష్టం జనతాఙ్గ ధత్తే

ఈ శరీరం ధరించింది సుఖమూ దుఃఖము కోసము. శరీరం వచ్చిందంటే పుట్టుకా మరణమూ శోకమూ మోహమూ భయమూ సుఖమూ దుఃఖమూ శరీరముతోటే వస్తాయి. ఎవ్వరికీ అందుబాటులో లేని పరమాత్మ సంకల్పాన్ని శిరసా వహించాల్సిందే శరీరముతో వచ్చినవారందరూ. భగవత్సంకల్పముతో వచ్చిన శరీరాన్ని నాదీ అనే హక్కు మనకు లేదు.

యద్వాచి తన్త్యాం గుణకర్మదామభిః సుదుస్తరైర్వత్స వయం సుయోజితాః
సర్వే వహామో బలిమీశ్వరాయ ప్రోతా నసీవ ద్విపదే చతుష్పదః

మనము బంధించబడ్డాము, ఒక దారముతో గుచ్చబడ్డాము. మూడు గుణములు దారములు. ఆరు కర్మలు అధ్యయన అధ్యాపన యజన యాజన మొదలైనవి. ఆరు మూళ్ళు పద్దెనిమిది. అందుకే భారతము పద్దెనిమిది పర్వములు. కర్మలు ఆరు గుణములు పద్దెనిమిది. పూలు దారముతో గుచ్చినట్లుగా మనని ఈ దారముతో గుచ్చారు. ఈ గుణకర్మలను ఎంత కష్టపడినా దాటలేము. ఇలా పరమాత్మ చేత కట్టివేయబడ్డ మనమందరమూ పరమాత్మను పూజిస్తున్నాము. రెండు కాళ్ళు గలవాడు నాలుగు కాళ్ళు గలవాడిని ముకుతాడు వేస్తే అవి ఎలా చెప్పినట్లు వింటాయో పరమాత్మ కూడా మనని అలాగే ఆడిస్తున్నాడు.

ఈశాభిసృష్టం హ్యవరున్ధ్మహేऽఙ్గ దుఃఖం సుఖం వా గుణకర్మసఙ్గాత్
ఆస్థాయ తత్తద్యదయుఙ్క్త నాథశ్చక్షుష్మతాన్ధా ఇవ నీయమానాః

మనకెంత జ్ఞ్యానమున్నా పరమాత్మ చెప్పిన దాన్ని మాత్రమే అనుసరిస్తున్నాము. మన కర్మల బట్టీ గుణములను  బట్టి సుఖములనూ దుఃఖములనూ అనుభవిస్తున్నాము. మనమనుకున్నట్లే అవి జరిగితే ప్రపంచములో ఎవరైనా దుఃఖాన్ని కోరుకుంటారా? పరమాత్మ సృష్టించిన దాన్ని మాత్రమే మనమనుసరిస్తున్నాము. భగవంతుని సంగతి వలన వచ్చిన దుఃఖాన్ని అనుభవించే తీరాలి. మనం ఆయా పనులు చేస్తాము, ఆయా వేషాలలో వ్యవహరిస్తాము. ఇదంతా మన ఇష్టమా? పరమాత్మ నిన్ను దేనిలో నియోగించాడో ఆయా కర్మలను స్వీకరించి గుడ్డివారిని కన్నులు గలవారు చేయిపట్టుకుని సురక్షిత ప్రాంతానికి చేరుస్తారో, సుఖ దుఃఖములను గురించి తెలియని మనని పరమాత్మ గమ్యాన్ని చేరుస్తాడు. మోక్షం పొందినవాడైనా గానీ మోక్షం వచ్చేంతవరకూ స్వామి చెప్పినట్లే వినాలి.

ముక్తోऽపి తావద్బిభృయాత్స్వదేహమారబ్ధమశ్నన్నభిమానశూన్యః
యథానుభూతం ప్రతియాతనిద్రః కిం త్వన్యదేహాయ గుణాన్న వృఙ్క్తే

మోక్షం పొందినవాడైనా మోక్షం వచ్చేంతవరకైనా శరీరాన్ని ధరించాలి. అర్చిరాది మార్గములో బయలు దేరేంత వరకూ దేహ ధారణ తప్పదు. ఈ దేహము ప్రారబ్ద వశాన వచ్చింది. అనుభవించాలి గానీ "నాదీ" అన్న భావనతో అనుభవించకూడదు. మనమాచరించే కర్మకు ఫలితముగా దేన్ని అనుభవించాలని పరమాత్మ సంకల్పించాడో అవి అనుభవించడానికి పరమాత్మ ఆజ్ఞ్యాపించిన కర్మలు చేయడానికి ఇష్టము లేకుండానే రాజువవుతావూ భిక్షువు అవుతావు. మరి ఇలాంటి వాటికి నీ ఇష్టముతో సంబంధము లేనట్లే అనుభవించడములో కూడా నీ ఇష్ఠము ఉండదు. ఏమరుపాటు లేకుండా పరమాత్మ ప్రసాదించిన దాన్ని అనుభవించాలి. మళ్ళీ ఈ అనుభవించడములో పరమాత్మ కైంకర్యముగా చేస్తే పాప నివృత్తి కలిగి మోక్షం వస్తుంది. నీ ఇష్టం వచ్చిన పనులు చేస్తూ ఇష్టము వచ్చినట్లు అనుభవిస్తే పాపం వచ్చి మళ్ళీ జన్మ వస్తుంది. ఇంకో శరీరము రావడానికి పనులు చేస్తావా? ఇంకో శరీరము రాకుండా పనులు చేస్తావా? మళ్ళీ శరీరము రాకుండా ఉండాలంటే ప్రకృతి విషయాలను అనుభవిస్తూ పరమాత్మ నా చేత ఇది అనుభవింపచేయాలనుకుంటున్నాడని చేయి.

భయం ప్రమత్తస్య వనేష్వపి స్యాద్యతః స ఆస్తే సహషట్సపత్నః
జితేన్ద్రియస్యాత్మరతేర్బుధస్య గృహాశ్రమః కిం ను కరోత్యవద్యమ్

నీవు రాజ్యమూ సంసరామూ వద్దన్నావు. మరి ఈ శరీరముతో ఏమి చేస్తావు.  ఏమరుపాటుతో ఉన్నవాడికి అరణ్యములో ఉన్నా భయమే. నీ వెంట నిత్యమూ ఉన్న ఆరుగురిని తీసుకుని ఎక్కడున్నా ఒకటే. అరిషడ్వర్గాన్ని జయించకుండా అడవికి పోయీ వ్యర్థము, గెలిస్తే ఇంట్లో ఉన్నా భయముండదు. అరణ్యానికి వెళ్ళినా వాడి వెంట కామక్రోధాదులు వెంటనే ఉంటాయి. అడవైకి వెళ్ళి ఇంద్రియాలను గెలుస్తామంటే పరమాత్మ యందే రమించి ఇంద్రియాలను జయించినవాడికి రాజ్యమైనా అడవైనా ఒకటే. ఇంద్రియనిగ్రహం కలిగి ఉన్న ఆత్మా రమునికి గృహస్థాశ్రమం ఎటువంటి చెడూ చేయదు.

యః షట్సపత్నాన్విజిగీషమాణో గృహేషు నిర్విశ్య యతేత పూర్వమ్
అత్యేతి దుర్గాశ్రిత ఊర్జితారీన్క్షీణేషు కామం విచరేద్విపశ్చిత్

అరిషడ్వర్గాలను గెలవాలనుకునే వారు దాన్ని ఇంటిలోనే అభ్యసించాలి. అన్నీ చుట్టూ ఉండి కూడా ఇంద్రియాలను గెలవాలి. మొదలు ఇంట్లో ఉండే ప్రయత్నించాలి. శత్రువులను గెలవాలంటే రాజైన వాడు వారి దగ్గరకు వెళ్ళకుండా తన కోటలోనే ఉండి గెలవాలి. శత్రువులను గెలిచే వాడు దుర్గములో ఉండి ఎలా గెలుస్తాడో అరిషడ్వర్గాలను గెలవాలనుకునే వాడు ఇంటిలోనే ఉండీ గెలవాలి. శత్రువులు క్షయించిన తరువాత ఎంత విహరించినా అపాయముండదు.

త్వం త్వబ్జనాభాఙ్ఘ్రిసరోజకోశ దుర్గాశ్రితో నిర్జితషట్సపత్నః
భుఙ్క్ష్వేహ భోగాన్పురుషాతిదిష్టాన్విముక్తసఙ్గః ప్రకృతిం భజస్వ

నీకు పరమాత్మ పాదముల భక్తీ ఇంద్రియ నిగ్రహం సహజముగా వచ్చాయి. పరమాత్మ యొక్క పాద పరాగము అనే దుర్గములో నీవుండి (శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే) నీమీదకు వచ్చినవారిని ఓడించు
సంగము లేకుండా పరమాత్మ ప్రసాదించిన అన్ని భోగాలను అనుభవించు. ఎన్ని భోగాలను అనుభవించినా వాటి యందు ఆశ వదిలిపెట్టాలి. అనుభవించేప్పుడు అనుభవించే విషయాల మీద ఆసక్తి పెంచుకోకు. సంగతిని వదిలిపెట్టి పరమాత్మ ఇచ్చినవాటిని స్వీకరించు

శ్రీశుక ఉవాచ
ఇతి సమభిహితో మహాభాగవతో భగవతస్త్రిభువనగురోరనుశాసనమాత్మనో లఘుతయావనత
శిరోధరో బాఢమితి సబహుమానమువాహ

బ్రహ్మ చేత ఉపదేశించబడిన ప్రియవ్రతుడు ఆ ఆజ్ఞ్యను స్వీకరించి అలాగే అని చెప్పాడు. బ్రహ్మ ఆజ్ఞ్యను శిరసా వహించాడు

భగవానపి మనునా యథావదుపకల్పితాపచితిః ప్రియవ్రత
నారదయోరవిషమమభిసమీక్షమాణయోరాత్మసమవస్థానమవాఙ్మనసం క్షయమవ్యవహృతం
ప్రవర్తయన్నగమత్

బ్రహ్మకూడా మనువు చేత శాస్త్రోక్తమముగా చేయబడిన పూజలు స్వీకరించి ప్రియవ్రత మనువులు సమాన ప్రీతితో చూస్తుండగా వాక్కుకూ మనసుకూ అందని ఆయన లోకానికి వెళ్ళాడు

మనురపి పరేణైవం ప్రతిసన్ధితమనోరథః సురర్షివరానుమతేనాత్మజమఖిలధరామణ్డల
స్థితిగుప్తయ ఆస్థాప్య స్వయమతివిషమవిషయవిషజలాశయాశాయా ఉపరరామ

మనువు కూడా బ్రహ్మ తన కోరిక తీర్చడముతో నారదునిచే తన కుమారుడు భూఅమండలం పరిపాలించుటకు పట్టాభిషేకం చేసి "అతి విషమములైన విషముతో నిండిన విషయములనే విషజలము కల చెరువు నుండి విరమించుకున్నాడు.

ఇతి హ వావ స జగతీపతిరీశ్వరేచ్ఛయాధినివేశితకర్మాధికారోऽఖిలజగద్బన్ధధ్వంసన
పరానుభావస్య భగవత ఆదిపురుషస్యాఙ్ఘ్రియుగలానవరతధ్యానానుభావేన పరిరన్ధితకషాయాశయో
ऽవదాతోऽపి మానవర్ధనో మహతాం మహీతలమనుశశాస

ఈ రీతిలో ప్రియవ్రతుడు పరమాత్మ సంకల్పముతో తానాచరించవలసిన రాజ సింహాసనాన్ని అధిష్ఠించాడు. సకల జగత్తు బంధాన్నీ నాశనము చేసే ప్రభావముగల పరమాత్మ యొక్క పాద పద్మాలను ధ్యానిస్తునాడు. "నిరంతరమూ" పరమాత్మ పాద పద్మములను ధ్యానము చేస్తూ మనస్సుకున్న మురికంతా పోగొట్టుకున్నాడు. పరమాత్మా, తండ్రి గారు చెప్పినట్లుగా చేస్తూ కీర్తిని పొందినవాడై భూమండలాన్ని పరిపాలించాడు.

అథ చ దుహితరం ప్రజాపతేర్విశ్వకర్మణ ఉపయేమే బర్హిష్మతీం నామ తస్యాము హ వావ
ఆత్మజానాత్మసమానశీలగుణకర్మరూపవీర్యోదారాన్దశ భావయామ్బభూవ కన్యాం చ
యవీయసీమూర్జస్వతీం నామ

విశ్వకర్మ పుత్రిక అయిన బర్హిష్మతిని వివాహం చేసుకున్నాడు. ఆ భార్య యందు తనతో సమానమైన గుణములు గలిగిన పదిమంది కుమారులను పొందాడు. ఊర్జస్వతి అనే అమ్మాయిని కూడా పొందాడు (ఈమెనె శుక్రాచార్యులకిచ్చి పెళ్ళి చేసాడు)

ఆగ్నీధ్రేధ్మజిహ్వయజ్ఞబాహుమహావీరహిరణ్యరేతోఘృతపృష్ఠసవనమేధాతిథివీతిహోత్రకవయ
ఇతి సర్వ ఏవాగ్నినామానః

వారి పుత్రులందరికీ అగ్ని హోత్రుని పేర్లు పెట్టాడు

ఏతేషాం కవిర్మహావీరః సవన ఇతి త్రయ ఆసన్నూర్ధ్వరేతసస్త ఆత్మవిద్యాయామర్భ
భావాదారభ్య కృతపరిచయాః పారమహంస్యమేవాశ్రమమభజన్

కవి మహా వీరా సవన, ఈ ముగ్గురూ ఊర్ధ్వరేతస్కులై సన్యాసాన్ని స్వీకరించి అడవికి వెళ్ళారు. ఈ ముగ్గురూ బాల్యమునుండే ఆత్మ విద్య యందు కోరిక ఉన్న వారు కాబట్టి సన్సారాన్ని అభిలషించలేదు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు.

తస్మిన్ను హ వా ఉపశమశీలాః పరమర్షయః సకలజీవనికాయావాసస్య భగవతో వాసుదేవస్య
భీతానాం శరణభూతస్య శ్రీమచ్చరణారవిన్దావిరతస్మరణావిగలితపరమభక్తియోగానుభావేన
పరిభావితాన్తర్హృదయాధిగతే భగవతి సర్వేషాం భూతానామాత్మభూతే ప్రత్యగ్
ఆత్మన్యేవాత్మనస్తాదాత్మ్యమవిశేషేణ సమీయుః

వీరు సకల ప్రపంచమంతా ఎవరిలో ఉందో అటువంటి పరమాత్మ ఐన వాసుదేవుని యందు (సకల చరాచర జగత్తుని వ్యాపించి ఉన్నవాడూ) భయపడిన వారికి అభయమిచ్చేవాడు, నిరంతరమూ పరమాత్మ పాద పద్మాలను స్మరించుటచేత భక్తియోగము పెరిగింది. అన్ని ప్రాణులకూ ఆత్మగా ఉండే వాడైన పరమాత్మ, నిరంతర స్మరణతో సంసారాన్ని విడిచిపెట్టారు. వారికి పరమాత్మ సాక్షాత్కారం లభించింది. జీవాత్మకూ పరమాత్మకూ తేడా ఇహలోకములోనే కనిపిస్తుంది.

అన్యస్యామపి జాయాయాం త్రయః పుత్రా ఆసన్నుత్తమస్తామసో రైవత ఇతి మన్వన్తరాధిపతయః

ప్రియవ్రతునికి ఇంకో భార్య ఉంది: ఆమెతో ఉత్తమా తామస రైవతులు పుత్రులుగా కలిగారు.

ఏవముపశమాయనేషు స్వతనయేష్వథ జగతీపతిర్జగతీమర్బుదాన్యేకాదశ
పరివత్సరాణామవ్యాహతాఖిలపురుషకారసారసమ్భృతదోర్దణ్డయుగలాపీడితమౌర్వీగుణస్తనితవిరమిత
ధర్మప్రతిపక్షో బర్హిష్మత్యాశ్చానుదినమేధమానప్రమోదప్రసరణయౌషిణ్యవ్రీడాప్రముషిత
హాసావలోకరుచిరక్ష్వేల్యాదిభిః పరాభూయమానవివేక ఇవానవబుధ్యమాన ఇవ మహామనా బుభుజే

ఇలా కొందరు సన్యాసులయ్యారు కొందరు రాజులయ్యారు. తరువాత ఈ భూమండలాన్ని పదకొండు కోట్ల సంవత్సరాలు తన ఆజ్ఞ్యకు అడ్డులేకుండా అమ్మవారి అనుగ్రహం పొందిన భక్తుడు కాబట్టి తన వింటినారి శబ్దము వలన శత్రువులని సంహరిస్తూ, తన ప్రియురాలు బర్హిష్మతి వయ్యారములకు మనసు అర్పించిన వాడు, భూమండలాన్ని గెలిచి ప్రియురాలి భ్రూమండలాన్ని గెలవలేకపోయాడు. కాస్త చిరునవ్వూ సిగూ క్రీగంటి చూపుతో అన్ని వివేకాలూ వదిలిపెట్టి ఏమీ తెలియని వాడిలాగానే అన్ని భోగాలనూ అనుభవించాడు.

యావదవభాసయతి సురగిరిమనుపరిక్రామన్భగవానాదిత్యో వసుధాతలమర్ధేనైవ
ప్రతపత్యర్ధేనావచ్ఛాదయతి తదా హి భగవదుపాసనోపచితాతిపురుష
ప్రభావస్తదనభినన్దన్సమజవేన రథేన జ్యోతిర్మయేన రజనీమపి దినం కరిష్యామీతి సప్త
కృత్వస్తరణిమనుపర్యక్రామద్ద్వితీయ ఇవ పతఙ్గః

ఇలా భోగాలనుభవిస్తూ ఉంటే ఒక ఆలోచన కలిగింది. "పన్నెండు గంటలే వెలుగు ఉంటోంది, ఇంకో పన్నెండు గంటలు చీకటి ఎందుకు ఉంది"  సూర్యభగవానుడు ఈ వైపు ఉండట్లేదు అని, ప్రియవ్రతుడు రథము సిద్ధము చేసుకుని సూర్య్నికి వ్యతిరేక దిశలో తిరగడం మొదలుపెట్టాడు. సూర్యుడు తూర్పు దిక్కులో ఉంటే ఆయన పశ్చిమ దిక్కులో ఉండి, చీకటి అనేది లేకుండా చేసాడు. ఆయన రథ చక్రాల నుండి ఏడు మార్గాలు ఏర్పడ్డాయి, ఇవే ఏడు ద్వీపాలు. ఏడు రోజులు ఏడు దారులు. ఈ దారికీ ఆ దారికి మధ్య ఉన్నది ద్వీపం. దారిలో పడిన గుంటలో జలము చేరి సముద్రమయ్యింది. ఇలా మనకు సప్తసముద్రాలనూ సప్త ద్వీపములను ఏర్పరచాడు. మేరు పర్వతాన్ని చుట్టి వస్తున్న సూర్యభగవానుడూ సగం భూమండలానికి మాత్రమే వెలుగునూ మిగిలిన మండలానికి నీడనిస్తున్నాడని తెలుసుకొని పరమాత్మనారాధించడం వలన సంపాదించిన బలము కలవాడు కాబట్టి సూర్యుని చేష్టితమును మెచ్చుకోక సూర్యుని రథ వేగముతో ఇంకో జ్యోతిర్య్మయమైన ప్రకాశమైన రథం తీసుకుని రాత్రిని కూడా పగలు చేస్తానని ఏడు సార్లు సూర్యున్ని అనుసరించి రెండవ సూర్యునిలా తిరిగాడు

యే వా ఉ హ తద్రథచరణనేమికృతపరిఖాతాస్తే సప్త సిన్ధవ ఆసన్యత ఏవ కృతాః సప్త భువో
ద్వీపాః

తన రథ చక్రాల వలన ఏర్పడిన గుంటలు సప్తసముద్రాలయ్యాయి. ఆ మధ్య భాగాలు ఏడు ద్వీపాలు - జమ్బూప్లక్షశాల్మలికుశక్రౌఞ్చశాకపుష్కర

జమ్బూప్లక్షశాల్మలికుశక్రౌఞ్చశాకపుష్కరసంజ్ఞాస్తేషాం పరిమాణం
పూర్వస్మాత్పూర్వస్మాదుత్తర ఉత్తరో యథాసఙ్ఖ్యం ద్విగుణమానేన బహిః సమన్తత ఉపక్లృప్తాః

పూర్వ ద్వీపము కంటే ఉత్తర ద్వీపం రెట్టింపు ఉంటుంది. ఏడు సముద్రాలు, ఏడు ద్వీపాలకు హద్దులు. ఇలా హద్దులు కల్పించబడి ఈ ఏడు ద్వీపాలలో సన్యాసులు కాగా మిగిలిన ఏడుగురు కొడుకులకూ ఏడు ద్వీపాలనిచ్చాడు. తన పుత్రికను శుక్రాచార్యులకిచ్చి వివాహం చేయగా ఆమెయందు దేవయాని పుత్రికగా పుట్టింది.

దుహితరం చోర్జస్వతీం నామోశనసే ప్రాయచ్ఛద్యస్యామాసీద్దేవయానీ నామ కావ్యసుతా

నైవంవిధః పురుషకార ఉరుక్రమస్య
పుంసాం తదఙ్ఘ్రిరజసా జితషడ్గుణానామ్
చిత్రం విదూరవిగతః సకృదాదదీత
యన్నామధేయమధునా స జహాతి బన్ధమ్

పరమాత్మ యొక్క పాద ధూళితో అరిషడ్వర్గాలను జయించినవారికి ఈ ప్రభావమేమీ వింతకాదు. ఒక్క సారి పిలిస్తేనే సంసార బంధమే పోయినప్పుడు నిరంతరమూ ఆయన నామాన్ని కీర్తించేవారికి ఈ బలముండటం వింతకాదు.ఇటువంటి వాడు సంసార బంధాన్ని విడిచిపెడతాడు. ప్రియవ్రతుడు ఇన్ని రాజభోగాలను అనుభవించినా పరమాత్మ స్మరణను విడిచిపెట్టనందు వలన అవేవీ బంధించలేదు.

శమ దమ తపః శౌచం తితిక్ష ఉపరతి (విషయముల యందు ఇంద్రియాలు ప్రవర్తించకుండా ఆపుట ఆత్మా రామం.),  ఈ ఆరు అందరికీ ఉండాల్సినవి. అహింస సత్యం అస్తేయం (దొంగతనం చేయకపోవుట) అనసూయ ఉండాలి, అమర్షమూ (ఎదుటివారి వృద్ధిని చూచి సహించకపోవడం), లోలుపత ఉండకుండుట , - ఈ పన్నెండు గుణాలూ బ్రాహ్మణుడికి ఉండాలి.

స ఏవమపరిమితబలపరాక్రమ ఏకదా తు దేవర్షిచరణానుశయనానుపతితగుణవిసర్గ
సంసర్గేణానిర్వృతమివాత్మానం మన్యమాన ఆత్మనిర్వేద ఇదమాహ

రాజ్యాన్ని పరిపాలించాడూ, పుత్రులకు రాజ్యమిచ్చాడు, ఒక్క సారి ఈయనకి విరక్తి కలిగింది. తన గురించి తానిలా విచారించాడు. నారదుని సేవించిన ప్రభావం వలన సంసార విషయములు అంటకున్నప్పటికీ సంసారముతో సంబంధము పెట్టుకున్నందువలన తృప్తి పొందక తనలో తానే పశ్చాత్తాపం పొందాడు

అహో అసాధ్వనుష్ఠితం యదభినివేశితోऽహమిన్ద్రియైరవిద్యారచితవిషమవిషయాన్ధకూపే
తదలమలమముష్యా వనితాయా వినోదమృగం మాం ధిగ్ధిగితి గర్హయాం చకార

నేను తప్పు చేసాను. పరమాత్మను సేవిస్తున్నట్లు కనపడినా ఇంద్రియ ఆరామము నన్ను వదిలిపెట్టలేదు. ఇంద్రియముల చేత మోసగించబడ్డాను, ప్రభావితున్నయ్యను.అవిద్య చేత ఏర్పరచిన విషమమైన విషయములనే బావిలో పడిపోయాను.
ఇంతకాలం నేను ఒక స్త్రీకి (భార్యకు) ఆట మృగముగా ఉన్నాను.

పరదేవతాప్రసాదాధిగతాత్మప్రత్యవమర్శేనానుప్రవృత్తేభ్యః పుత్రేభ్య ఇమాం యథాదాయం
విభజ్య భుక్తభోగాం చ మహిషీం మృతకమివ సహ మహావిభూతిమపహాయ స్వయం నిహితనిర్వేదో హృది
గృహీతహరివిహారానుభావో భగవతో నారదస్య పదవీం పునరేవానుససార

ఇంతకాలం సంసారములో ఉండి ఇంత భోగమనుభవించి విరక్తి పొందడానికి కారణం పరమాత్మ అనుగ్రహం. దాని వలన ఆత్మ పరిశీలనను పొందగలిగాడు. తనను అనుసరించి ఉన్న పుత్రులకు రాజ్యం ఎంత భాగం రావాలో అంత భాగం ఇచ్చివేశాడు. ఇంతకాలం అన్ని రకాల సుఖ దుఃఖములను పంచుకున్న భార్యను కూడా విడిచిపెట్టి, సంపదలను విడిచిపెట్టి పరిపూర్ణమైన విరక్తి కలవాడై హృదయమునను పరమాత్మ ప్రభావాన్ని స్మరిస్తూ, గురువుగారైన నారదుని మార్గాన్ని అనుసరించాడు.

తస్య హ వా ఏతే శ్లోకాః
ప్రియవ్రతకృతం కర్మ కో ను కుర్యాద్వినేశ్వరమ్
యో నేమినిమ్నైరకరోచ్ఛాయాం ఘ్నన్సప్త వారిధీన్

ప్రియవ్రతుని ప్రభావం చెప్పే శ్లోకాలు ఇవి: ప్రియవ్రతుడు చేసిన కర్మ ఎవరు చేయగలరు పరమాత్మ తప్ప. తన రధ చక్రం యొక్క అంచుగీతలతో ఏడు సముద్రాలను చేసాడు.

భూసంస్థానం కృతం యేన సరిద్గిరివనాదిభిః
సీమా చ భూతనిర్వృత్యై ద్వీపే ద్వీపే విభాగశః

అదే సమయములో నదులనీ పర్వతములనీ వ్యవస్థ ఏర్పరచాడు. (పర్వతం పర్వతం మధ్యన నీరూ, పర్వతమూ వనమూ గ్రామమూ ఏర్పరచాడు. ప్రతీ గ్రామానికి పర్వతమూ నదీ వనమూ ఉండేట్లు చేసాడు. ప్రతీ ప్రాణికీ నీళ్ళూ రాళ్ళూ చెట్లూ కావాలి. చెట్లు భూగర్భ జలాన్ని కాపాడతాయి. వరషం ద్వారా వచ్చి నీటిని పీల్చుకుంటాయి, ఆ ప్రాంతమెప్పుడూ పదునుగా ఉంచుతాయి. తాను తాగిన నీటిని వదిలిపెడతాయి. వదిలిపెట్టిన నీరు కొత్త నీరు పడగానే ఇంకిపోకుండా ఆపుతుంది. అందుకే వృక్షాలు భూగర్భ జలాన్ని పెంచుతాయి. ) నదులనీ వనములనీ పర్వతాలనీ విభజించాడు అన్ని ప్రాంతాలకీ వచ్చేట్లుగా.  పర్వతాలు ఎక్కువ ఉన్నచోట భూకంపాలు రావు, మేఘాలు కూడా పర్వతాలలో వర్షిస్తాయి. అక్కడ వర్షం పడటం వలన కిందికి రావడములో వేగము తక్కువగా ఉంటుంది, నీరు క్రమముతో వస్తుంది. ఆ నీరు భూమి మీద నిలుస్తాది. వర్షం నీరు గ్రామానికి ఎలా ఉపయోగపడాలో అంత నీరు అంత వేగముతో అందిస్తాయి పర్వతాలు. పర్వతమునుండి వచ్చే నీరుని ఝరీ అంటాము లేదా శిల యేరు (సెలయేరు) అంటాము. ప్రతీ ద్వీపానికీ హద్దులు కూడా ఏర్పరచాడు. ఒక్కో ద్వీపానికీ నదులూ వృక్షాలూ పర్వతాలూ వేరే ఉన్నాయి. అల్లనేరేడు పళ్ళు ఎక్కువ ఉండే ద్వీపం జంబూ ద్వీపము. అంతంత పళ్ళు కిందకి పడి ఆ రసం పారి భూమిలోకి పోయి భూమిలో మట్టిని శుద్ధిచేస్తే గని ఏర్పడింది, దాని నుంచి వచ్చినది బంగారం. అందుకే బంగారానికి జాంబూనదం అంటారు. ద్వీపమూ, నదీ పర్వతమూ ఖనిజమూ ఒక్కో ద్వీపానికీ ఉంటాయి. జంభూనది పరివాహక ప్రాంతం ఉన్న మట్టిలోంచి వచ్చింది బంగారము.

భౌమం దివ్యం మానుషం చ మహిత్వం కర్మయోగజమ్
యశ్చక్రే నిరయౌపమ్యం పురుషానుజనప్రియః

అక్కడ ఉండే ప్రాణుల సంతృప్తి కోసం అన్నీ ఏర్పాటు చేసాడు. తన రాజ్యములో ఉండేవారికి ప్రీతిపాత్రుడైన ప్రియవ్రతుడు స్వర్గము దాకా నరకము దాకా తన కీర్తిని వ్యాపింపచేసాడు

Wednesday, March 13, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం

                                                              ఓం నమో భగవతే వాసుదేవాయ

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ముప్పై ఒకటవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
తత ఉత్పన్నవిజ్ఞానా ఆశ్వధోక్షజభాషితమ్
స్మరన్త ఆత్మజే భార్యాం విసృజ్య ప్రావ్రజన్గృహాత్

ఇలా ప్రాచేతసులు మారిషను వివాహం చేసుకుని కొంతకాలం హాయిగా ఉండి దక్షున్ని పుత్రునిగా పొంది పరమాత్మ వరం ఉన్నవారు కాబట్టి సంసాఅరం మీద విరక్తి క్లైగింది. పరమాత్మ మాటలను గుర్తుచేసుకుని తమ భర్యను కొడుకుకు అప్పగించి ఇంటినుంచి అన్ని వదిలి బయట్పడ్డారు

దీక్షితా బ్రహ్మసత్రేణ సర్వభూతాత్మమేధసా
ప్రతీచ్యాం దిశి వేలాయాం సిద్ధోऽభూద్యత్ర జాజలిః

తపస్సుచే వీరందరూ దీక్షితులై ప్రతీచి దిక్కుకు వెళ్ళారు. జాజలి ఆశ్రమానికి వెళ్ళారు.

తాన్నిర్జితప్రాణమనోవచోదృశో జితాసనాన్శాన్తసమానవిగ్రహాన్
పరేऽమలే బ్రహ్మణి యోజితాత్మనః సురాసురేడ్యో దదృశే స్మ నారదః

ప్రాణాయామముతో అన్ని ఇంద్రియాలనూ మనసునూ గెలిచారు, శరీరానికి కలిగే అన్నిటినీ సమానముగా చూచారు. పరిశుద్ధుడైన పరమాత్మ యందు మనసు లగ్నం చేసారు

తమాగతం త ఉత్థాయ ప్రణిపత్యాభినన్ద్య చ
పూజయిత్వా యథాదేశం సుఖాసీనమథాబ్రువన్

అక్కడికి నారడు వచ్చాడు. ఆయనకు నమస్కరించి పూజించి ఉన్నతాసనములో కూర్చోబెట్టి

ప్రచేతస ఊచుః
స్వాగతం తే సురర్షేऽద్య దిష్ట్యా నో దర్శనం గతః
తవ చఙ్క్రమణం బ్రహ్మన్నభయాయ యథా రవేః

మీకు స్వాగతం మా అదృష్టం బాగుండి మీ దర్శనం లభించింది. సూర్యుని వంటి మీ వారి సంచారం మావంటి వారి కోసమే

యదాదిష్టం భగవతా శివేనాధోక్షజేన చ
తద్గృహేషు ప్రసక్తానాం ప్రాయశః క్షపితం ప్రభో

శంకరుడూ విష్ణువూ చెప్పినట్లుగా గృహస్థాశ్రమములో ఆచరించవలసిన దాన్ని ఆచరించాము

తన్నః ప్రద్యోతయాధ్యాత్మ జ్ఞానం తత్త్వార్థదర్శనమ్
యేనాఞ్జసా తరిష్యామో దుస్తరం భవసాగరమ్

వారు చెప్పినట్లుగా కొంతకాలం అందులో ఉన్నాము, దాని వలన మరుగు పడిన ఆధ్యాత్మ జ్ఞ్యానన్ని మళ్ళీ వెలిగించు. అలాంటి ఆధ్యాత్మ జ్ఞ్యానముతో దాటశక్యముగా కాని సంసారాన్ని దాటుతాము

మైత్రేయ ఉవాచ
ఇతి ప్రచేతసాం పృష్టో భగవాన్నారదో మునిః
భగవత్యుత్తమశ్లోక ఆవిష్టాత్మాబ్రవీన్నృపాన్

ప్రాచేతుసులడిగిన వెంటనే నారదుడు తన మనసును పరమాత్మ యందు లగ్నం చేసి ఇలా అన్నాడు

నారద ఉవాచ
తజ్జన్మ తాని కర్మాణి తదాయుస్తన్మనో వచః
నృణాం యేన హి విశ్వాత్మా సేవ్యతే హరిరీశ్వరః

కిం జన్మభిస్త్రిభిర్వేహ శౌక్రసావిత్రయాజ్ఞికైః
కర్మభిర్వా త్రయీప్రోక్తైః పుంసోऽపి విబుధాయుషా

శ్రుతేన తపసా వా కిం వచోభిశ్చిత్తవృత్తిభిః
బుద్ధ్యా వా కిం నిపుణయా బలేనేన్ద్రియరాధసా

కిం వా యోగేన సాఙ్ఖ్యేన న్యాసస్వాధ్యాయయోరపి
కిం వా శ్రేయోభిరన్యైశ్చ న యత్రాత్మప్రదో హరిః

శ్రేయసామపి సర్వేషామాత్మా హ్యవధిరర్థతః
సర్వేషామపి భూతానాం హరిరాత్మాత్మదః ప్రియః

యథా తరోర్మూలనిషేచనేన తృప్యన్తి తత్స్కన్ధభుజోపశాఖాః
ప్రాణోపహారాచ్చ యథేన్ద్రియాణాం తథైవ సర్వార్హణమచ్యుతేజ్యా

యథైవ సూర్యాత్ప్రభవన్తి వారః పునశ్చ తస్మిన్ప్రవిశన్తి కాలే
భూతాని భూమౌ స్థిరజఙ్గమాని తథా హరావేవ గుణప్రవాహః

ఏతత్పదం తజ్జగదాత్మనః పరం సకృద్విభాతం సవితుర్యథా ప్రభా
యథాసవో జాగ్రతి సుప్తశక్తయో ద్రవ్యక్రియాజ్ఞానభిదాభ్రమాత్యయః

యథా నభస్యభ్రతమఃప్రకాశా భవన్తి భూపా న భవన్త్యనుక్రమాత్
ఏవం పరే బ్రహ్మణి శక్తయస్త్వమూ రజస్తమః సత్త్వమితి ప్రవాహః

ప్రాణములు ఉంటే జ్ఞ్యానేందిర్య కర్మేంద్రియములు ఎలా ఉత్తేజితమై అన్ని పనులూ చేస్తాయో ఆకాశములో మబ్బులు ఎలా వస్తూ పోతూ ఉంటాయో అలా సాత్విక రాజస తామసిక శక్తులు పరమాత్మ యందే ఉంటాయి.

తేనైకమాత్మానమశేషదేహినాం కాలం ప్రధానం పురుషం పరేశమ్
స్వతేజసా ధ్వస్తగుణప్రవాహమాత్మైకభావేన భజధ్వమద్ధా

ఆయన ఒక్కడే ఆత్మ. సకల జీవులకూ ఒక్కడే ఆత్మ అయిన వాడు. జీవునికీ ప్రకృతికీ ఆయనే ఈశుడు. తన దివ్య తేజస్సుతో సకల సత్వ రజో తమో గుణాల ప్రభావాన్ని ధ్వంసం చేసిన వాడు. అలాంటి స్వామిని సావధాన చిత్తముతో సేవించండి.

దయయా సర్వభూతేషు సన్తుష్ట్యా యేన కేన వా
సర్వేన్ద్రియోపశాన్త్యా చ తుష్యత్యాశు జనార్దనః

సర్వభూత దయతో పరమాత్మ ప్రసాదించిన దానితో తృప్తి పడాలి అన్ని ఇంద్రియాలకు శాంతి కావాలి అప్పుడు పరమాత్మ సంతోషిస్తాడు. తృప్తీ సకల ఇంద్రియ జయమూ దయా ఈ మూడూ ఉంటే పరమాత్మ తొందరగా సంతోషిస్తాడు.

అపహతసకలైషణామలాత్మన్యవిరతమేధితభావనోపహూతః
నిజజనవశగత్వమాత్మనోऽయన్న సరతి ఛిద్రవదక్షరః సతాం హి

మన హృదయములో పరమాత్మ సాక్షాత్కరాం అందులో మరే కోరికలూ లేకుంటే కలుగుతుంది. నిరంతరమూ పెరిగిన భక్తిచే పిలువబడితే ఆయన వస్తాడు. బాగా పెరిగిన భక్తి భావంతో ఆహ్వానించబడినవాడై వస్తాడు. పరమాత్మ భక్త పరాధీనుడు. ఒక సారి ఈ పరమాత్మ మన హృదయములో ప్రవేశిస్తే బయటకి వెళ్ళడు. రధ్రం ఉన్న పాత్రలోంచి నీరు బయటకు వెళ్ళినట్లు ఇతర భావనలున్న మనసునుండి స్వామి బయటకు వెళతాడు. లేకుంటే అక్కడే ఉంటాడు

న భజతి కుమనీషిణాం స ఇజ్యాం హరిరధనాత్మధనప్రియో రసజ్ఞః
శ్రుతధనకులకర్మణాం మదైర్యే విదధతి పాపమకిఞ్చనేషు సత్సు

పరమాత్మ దుష్ట బుద్ధులు కలవారు చేసే ఆరాధనలు స్వీకరించడు. ఆయన డబ్బులేని వారి మనసులో ఉన్న ధనమునకు ప్రియుడు. ఆయన రసజ్ఞ్యుడు. భక్తి రసాన్ని తెలిసిన వాడు. భక్తి లేకుండా దుష్టబుద్ధితో ఆరాధిస్తే స్వీకరించడు. శ్రుతధనకులకర్మణాం  - విద్యా ధన ఆభిజాత్య (నేను మంచి వంశములో పుట్టాను) అనే మూడు మదాలతో ఎవరితే ఇతరులకు హాని కలిగిస్తారో వారి ఆరాధనను స్వీకరించడు. పరమాత్మ కన్నా వేరే దిక్కు లేకుండా ఉండేవారికి అపకారం చేసేవారి పూజను స్వీకరించడు.

శ్రియమనుచరతీం తదర్థినశ్చ ద్విపదపతీన్విబుధాంశ్చ యత్స్వపూర్ణః
న భజతి నిజభృత్యవర్గతన్త్రః కథమముముద్విసృజేత్పుమాన్కృతజ్ఞః

తన వెంట పడ్డ లక్ష్మినే పరమాత్మ లెక్క చేయలేదు. అలాగే లక్ష్మితో అదే మాట అన్నవారిని కూడా లెక్క చేయలేదు (డబ్బు కావాలనుకున్న వారిని). దేవతలని కూడా లెక్క చేయని కొరత లేని మహానుభావుడు. ఆయన ఆత్మారాముడు. సహజముగానే అన్నీ ఉన్న వాడు. ఆయన భక్తుల వశములో ఉంటాడు. ఇలాంటి స్వామిని ప్రపంచములో ఏ కృతజ్ఞ్యుడైనా విడిచిపెడతాడా

మైత్రేయ ఉవాచ
ఇతి ప్రచేతసో రాజన్నన్యాశ్చ భగవత్కథాః
శ్రావయిత్వా బ్రహ్మలోకం యయౌ స్వాయమ్భువో మునిః

ఇలా ప్రాచేతసులకు భగవత్ తత్వాన్ని చెప్పి నారదుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు

తేऽపి తన్ముఖనిర్యాతం యశో లోకమలాపహమ్
హరేర్నిశమ్య తత్పాదం ధ్యాయన్తస్తద్గతిం యయుః

ప్రాచేతసులు నారదుని ముఖము నుండి వెలువడిన పరమాత్మ కీర్తిని విని పరమాత్మ పాద పద్మములను ధ్యానం చేస్తూ పరమాత్మ సనందిహికి చేరారు

ఏతత్తేऽభిహితం క్షత్తర్యన్మాం త్వం పరిపృష్టవాన్
ప్రచేతసాం నారదస్య సంవాదం హరికీర్తనమ్

నీవు నన్ను ఏమడిగావో అది చెప్పను. ప్రాచేతసులూ నారదుల సంవాదమైన పరమాత్మ నామ సంకీర్తనా రూపమైన దానిని నీకు వివరించాను

శ్రీశుక ఉవాచ
య ఏష ఉత్తానపదో మానవస్యానువర్ణితః
వంశః ప్రియవ్రతస్యాపి నిబోధ నృపసత్తమ

ఇది ఉత్తన పాదుని వంశము. ప్రియవ్రతుడి చరిత్ర కూడా విన వలసింది

యో నారదాదాత్మవిద్యామధిగమ్య పునర్మహీమ్
భుక్త్వా విభజ్య పుత్రేభ్య ఐశ్వరం సమగాత్పదమ్

ప్రియవ్రతుడు కూడా నారదుని వల్లనే ఆధ్యాత్మ జ్ఞ్యానన్ని పొంది రాజ్యాన్ని పొంది దాన్ని సంతానానికి పంచి పరమపదమును పొందాడు

ఇమాం తు కౌషారవిణోపవర్ణితాం క్షత్తా నిశమ్యాజితవాదసత్కథామ్
ప్రవృద్ధభావోऽశ్రుకలాకులో మునేర్దధార మూర్ధ్నా చరణం హృదా హరేః

మైత్రేయుని చేత వర్ణించబడిన నిరంతరమూ జయ జయ ధ్వానాలు వినే పరమాత్మ గాధను విదురుడు విని పరమాత్మయందు భక్తి భావం వృద్ధి పొంది పరమాత్మ గాధను విన్నందు వలన ఆనందాశ్రువులు వచ్చి ఈ కథ చెప్పిన మైత్రేయుని పాదాలను శిరస్సు మీదా, పరమాత్మ పాదాలను హృదయములోనూ పెట్టుకున్నాడు.

విదుర ఉవాచ
సోऽయమద్య మహాయోగిన్భవతా కరుణాత్మనా
దర్శితస్తమసః పారో యత్రాకిఞ్చనగో హరిః

దయ గల మీరు సంసారం యొక్క అవతల ఒడ్డును చూపెట్టారు. అక్కడ పరమాత్మ ఉన్నాడు. ఆయన ఏమీ లేని వారికి దొరికేవాడు - యత్రాకిఞ్చనగో

శ్రీశుక ఉవాచ
ఇత్యానమ్య తమామన్త్ర్య విదురో గజసాహ్వయమ్
స్వానాం దిదృక్షుః ప్రయయౌ జ్ఞాతీనాం నిర్వృతాశయః

విదురుడు మైత్రేయునికి నమస్కరించాడు ఆయన ఆజ్య్నను పొంది బందువులను చూడటానికి హస్తినకు వెళ్ళాడు

ఏతద్యః శృణుయాద్రాజన్రాజ్ఞాం హర్యర్పితాత్మనామ్
ఆయుర్ధనం యశః స్వస్తి గతిమైశ్వర్యమాప్నుయాత్

పరమాత్మ యందు మాత్రమే మనసు ఉన్న వీరి చరిత్రను ఎవరు వింటారో వారికి ఆయుష్షు ధనము కీర్తి ఐశ్వర్యమూ స్వస్తి లభిస్తాయి


                                                   సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ముప్పైయొవ అధ్యాయం

విదుర ఉవాచ
యే త్వయాభిహితా బ్రహ్మన్సుతాః ప్రాచీనబర్హిషః
తే రుద్రగీతేన హరిం సిద్ధిమాపుః ప్రతోష్య కామ్

ప్రాచీన బర్హి కుమారు రుద్రగీత విని పరమాత్మను సంతోషపరచారా?

కిం బార్హస్పత్యేహ పరత్ర వాథ కైవల్యనాథప్రియపార్శ్వవర్తినః
ఆసాద్య దేవం గిరిశం యదృచ్ఛయా ప్రాపుః పరం నూనమథ ప్రచేతసః

మైత్రేయా! (బృహస్పతి శిష్యుడు) ఇక్కడ గానీ పరలోకములో గానీ కైవల్యనాధుడైన శ్రీమన్నారాయణునికి పార్శ్వదుడైన శంకరున్ని పిలవకపోయినా సాక్షాత్కరింపచేస్తుకున్నవారు ఉత్తమ లోకాన్ని పొందారా లేదా?

మైత్రేయ ఉవాచ
ప్రచేతసోऽన్తరుదధౌ పితురాదేశకారిణః
అపయజ్ఞేన తపసా పురఞ్జనమతోషయన్

ఈ ప్రాచేతసులు తండ్రి ఆజ్ఞ్యను మనసులో పెట్టుకుని సముద్రములోకి వెళ్ళి పరమాత్మను మెప్పించారు

దశవర్షసహస్రాన్తే పురుషస్తు సనాతనః
తేషామావిరభూత్కృచ్ఛ్రం శాన్తేన శమయన్రుచా

పదివేల సంవత్సరాలు తపస్సు చేసాక పరమాత్మ తన దివ్యమైన దేహ కాంతితో చీకట్లు తొలగిస్తూ పరమాత్మ ఆవిర్భవించాడు. ఇంతకాలం వారు తపస్సు చేసి పడ్డ బాధ అంతా తన దివ్యమంగళ విగ్రహముతో పోగొట్టాడు.

సుపర్ణస్కన్ధమారూఢో మేరుశృఙ్గమివామ్బుదః
పీతవాసా మణిగ్రీవః కుర్వన్వితిమిరా దిశః

గరుత్మంతుని భుజము మీద అధిరోహించి ఉన్నాడు. మేరు శిఖరము మీద మబ్బు ఉనంట్లు ఉన్నాడు. పీతాంబరధారి కౌస్తుభమణితో తన తేజస్సుతో చీకట్లు పోగొడుతూ

కాశిష్ణునా కనకవర్ణవిభూషణేన
భ్రాజత్కపోలవదనో విలసత్కిరీటః
అష్టాయుధైరనుచరైర్మునిభిః సురేన్ద్రైర్
ఆసేవితో గరుడకిన్నరగీతకీర్తిః

బంగారు రంగుతో ఉన్న పట్టు పీతాంబరముతో ప్రకాశించే చెక్కిళ్ళతో కిరీటములతో, ఎనిమిది భుజాలతో దేవతలతో కీర్తించబడినవాడై, గరుడాదులు కీర్తిస్తుండగా

పీనాయతాష్టభుజమణ్డలమధ్యలక్ష్మ్యా
స్పర్ధచ్ఛ్రియా పరివృతో వనమాలయాద్యః
బర్హిష్మతః పురుష ఆహ సుతాన్ప్రపన్నాన్
పర్జన్యనాదరుతయా సఘృణావలోకః

పొడమైన బలిసి ఉన్న ఎనిమిద్ భుజాలతో అమ్మవారితో పోటీ పడుతున్న అమ్మవారితో అలమరించబడినవాడై ప్రాచీన బర్హి పుత్రులతో ఇలా అన్నాడు. దయ ప్రసరించే చూపుతో మేఘ గంభీర నాదముతో

శ్రీభగవానువాచ
వరం వృణీధ్వం భద్రం వో యూయం మే నృపనన్దనాః
సౌహార్దేనాపృథగ్ధర్మాస్తుష్టోऽహం సౌహృదేన వః

మీకేమి కావాలో కోరుకోండి. మీకు మేలు కలుగుతుంది. మీరందరూ నాకు అత్యంత ఆప్తులు ఎందుకంటే మీరందరూ కలిసే ఉన్నారు. మీ పరస్పర సోదర ప్రేమతో నేను సంతోషించాను

యోऽనుస్మరతి సన్ధ్యాయాం యుష్మాననుదినం నరః
తస్య భ్రాతృష్వాత్మసామ్యం తథా భూతేషు సౌహృదమ్

అందుకే ప్రతీ రోజూ సాయం సంధ్యా సమయములో మిమ్ములను తలచుకున్నవారికి సోదరప్రేమ కలుగుతుంది. "వారు నా తమ్ముళ్ళు కాదు. నేనే వారు వారే నేను " అన్నంతగా ఏర్పడుతుంది. సకల ప్రాణులయందూ ప్రేమకలుగుతుంది.

యే తు మాం రుద్రగీతేన సాయం ప్రాతః సమాహితాః
స్తువన్త్యహం కామవరాన్దాస్యే ప్రజ్ఞాం చ శోభనామ్

మీ కథనే కాకుండా రుద్రగీతతో ప్రాతః సాయం కాలం నన్ను ధ్యానం చేస్తే వారు కోరిన అన్ని వరాలూ ఇస్తాను. ప్రజ్ఞ్య కూడా ఇస్తాను

యద్యూయం పితురాదేశమగ్రహీష్ట ముదాన్వితాః
అథో వ ఉశతీ కీర్తిర్లోకానను భవిష్యతి

తండ్రిగారిచ్చిన ఆదేశాన్ని సంతోషముతో అనుసరించారు.పితృవాక్య పరిపాలకులుగా మీ కీర్తి వ్యాపించి ఉంటుంది

భవితా విశ్రుతః పుత్రోऽనవమో బ్రహ్మణో గుణైః
య ఏతామాత్మవీర్యేణ త్రిలోకీం పూరయిష్యతి

మీకు గుణములతో బ్రహ్మకు తీసిపోనివాడుఒక చక్కని కుమారుడు కలుగుతాడు. తన సంతానముతో ప్రపంచాన్ని ముంచేస్తాడు

కణ్డోః ప్రమ్లోచయా లబ్ధా కన్యా కమలలోచనా
తాం చాపవిద్ధాం జగృహుర్భూరుహా నృపనన్దనాః
క్షుత్క్షామాయా ముఖే రాజా సోమః పీయూషవర్షిణీమ్
దేశినీం రోదమానాయా నిదధే స దయాన్వితః

మీకు దక్షుడు కుమారుడుగా పుట్టడానికి ఒక భార్య కలగాలి. కణ్డు మహర్షికి ఒక అప్సరస స్త్రీ తపస్సు భంగం చేయడానికి పంపగా వారికొక అమ్మాయి పుట్టింది, ఆ అమ్మాయిని చెట్లమీద పడేస్తి వెళ్ళింది. ఆ పిల్లను చెట్లు కాపాడాయి. చంద్రుడు చూపుడు వేలితో అమృతాన్ని అందించాడు.

ప్రజావిసర్గ ఆదిష్టాః పిత్రా మామనువర్తతా
తత్ర కన్యాం వరారోహాం తాముద్వహత మా చిరమ్

మీకు మీ నాన్నగారు ప్రజా సృష్టిని చేయమని చెప్పగా మీ తండ్రి ఆజ్ఞ్యను పాటిస్తూ నన్ను సేవించారు. మీ పది మందీ ఆమెను వివాహం చేసుకోండి.

అపృథగ్ధర్మశీలానాం సర్వేషాం వః సుమధ్యమా
అపృథగ్ధర్మశీలేయం భూయాత్పత్న్యర్పితాశయా

మీరు ధర్మ శీలురు. ఐకమత్యం కలిగి ఉన్నవారు. భేధభావము లేని వారు మీరు.

దివ్యవర్షసహస్రాణాం సహస్రమహతౌజసః
భౌమాన్భోక్ష్యథ భోగాన్వై దివ్యాంశ్చానుగ్రహాన్మమ

లక్ష సంవత్సరాలు మీరు ఆమెతో ఆనందం అనుభవిస్తారు. నేను అనుగ్రహిస్తున్నాను మీకు ఆ దివ్య భోగాలు

అథ మయ్యనపాయిన్యా భక్త్యా పక్వగుణాశయాః
ఉపయాస్యథ మద్ధామ నిర్విద్య నిరయాదతః

లక్ష సంవత్సరాలు భోగం అనుభవించినా నా యందు మీకున్న భక్తి తొలగిపోదు. నా యందు మనసు ఉన్నవారు మీరు. ఈ నరకాన్ని వదిలి మీరు నన్ను చేరుతారు

గృహేష్వావిశతాం చాపి పుంసాం కుశలకర్మణామ్
మద్వార్తాయాతయామానాం న బన్ధాయ గృహా మతాః

నా యందు మనసు లగ్నము చేసి నేర్పరితనముతో పని చేసే వారికి సంసారము బంధానికి కారణం కాదు. మోక్షాన్నే ఇస్తుంది. వారికి నా వార్తతోనే పొద్దంతా గడుస్తుంది. అలాంటి వారికి సంసారం బంధము కాదు

నవ్యవద్ధృదయే యజ్జ్ఞో బ్రహ్మైతద్బ్రహ్మవాదిభిః
న ముహ్యన్తి న శోచన్తి న హృష్యన్తి యతో గతాః

సంసారములో వారెంత కాలం ఉన్నారో, ఎలా ఐతే సంసారములో ఉన్న వారికి ప్రతీక్షణం కొత్తగా ఉంటుందో  నా యందు మనసు ఉంచిన వారికి నేను కూడా ప్రతీ క్షణం కొత్త రుచిని కలిగిస్తాను. హృదయములో ఎప్పుడూ వాడికి నేను కొత్తే. నా యందు భక్తిని నిత్య నూతనం చేస్తాను. అలాంటి సంసార విషయములో మోహాన్ని పొందరూ బాధపడరు సంతోషించరు. నన్ను మనసులో ఉంచుకొని సంసారములో ఉన్న వారికి ఇవేవీ ఉండవు.

మైత్రేయ ఉవాచ
ఏవం బ్రువాణం పురుషార్థభాజనం జనార్దనం ప్రాఞ్జలయః ప్రచేతసః
తద్దర్శనధ్వస్తతమోరజోమలా గిరాగృణన్గద్గదయా సుహృత్తమమ్

ఇలా జనార్ధనుడు మాట్లాడగా అలాంటి పరమాత్మ దివ్య దర్శనముతో అంతవరకూ తమో రజో గుణాల వలన వచ్చిన మురికి పోగా, బొంగురుపోయిన గొంతుతో స్తోత్రం చేసారు

ప్రచేతస ఊచుః
నమో నమః క్లేశవినాశనాయ నిరూపితోదారగుణాహ్వయాయ
మనోవచోవేగపురోజవాయ సర్వాక్షమార్గైరగతాధ్వనే నమః

అన్ని కష్టములూ తొలగించేవాడవూ, ఉదారగుణములు కలవాడవని నిరూపించబడినవాడా, మనస్సుకంటే వాక్కు కంటే ముందర వెళ్ళేవాడా, అన్ని ఇంద్రియములు వెళ్ళే దారిలో వెళితే నీవు దొరకవు. మా ఇంద్రియాలు వెళ్ళే మార్గములో వెళ్ళని నీకు నమస్కారము.

శుద్ధాయ శాన్తాయ నమః స్వనిష్ఠయా మనస్యపార్థం విలసద్ద్వయాయ
నమో జగత్స్థానలయోదయేషు గృహీతమాయాగుణవిగ్రహాయ

పరమాత్మ త్రిగుణ స్పర్శ రహితుడు కాబట్టి శుద్ధుడూ, ఎలాంటి వికారాలూ పొందని వాడు, పరమాత్మ సంకల్పముతోనే మనసులో భేధ బుద్ధి కలుగుతుంది. ప్రపంచముయొక్క సృష్టి స్థితి సంహారములయందు మీరే ప్రవేశించి చేస్తారు

నమో విశుద్ధసత్త్వాయ హరయే హరిమేధసే
వాసుదేవాయ కృష్ణాయ ప్రభవే సర్వసాత్వతామ్

కల్తీ లేని సత్వము కలవాడా. సకల జీవులకూ ప్రబువు. నీవే వాసుదేవుడవు, నీవే కృష్ణుడవు. అపరిచ్చిన ఆనంద స్వరూపుడవు.

నమః కమలనాభాయ నమః కమలమాలినే
నమః కమలపాదాయ నమస్తే కమలేక్షణ

కమలనాభుడూ కమలమాలినీ కమలపాదుడవు కమలముల వంటి కన్నులవంటివాడవు. వాసువేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ వ్యూహాలకు ఇది గుర్తు

నమః కమలకిఞ్జల్క పిశఙ్గామలవాససే
సర్వభూతనివాసాయ నమోऽయుఙ్క్ష్మహి సాక్షిణే

పద్మములో ఉన్న పుప్పొడి రగ్ను ఉన్న వస్త్రం ధరించినవాడా, ప్రతీ ప్రాణిలో ఉన్న నీకు నమస్కారము. మేము చేసే ప్రతీ పనికీ సాక్షివి నీవు.

రూపం భగవతా త్వేతదశేషక్లేశసఙ్క్షయమ్
ఆవిష్కృతం నః క్లిష్టానాం కిమన్యదనుకమ్పితమ్

నీ ఈ రూపం అన్ని కష్టాలనూ నశింపచేసేది. పాపులమైన మాకు ఇంత చక్కని రూపం చూపావు. ఇంకా మేమడగాల్సినదేముంది.

ఏతావత్త్వం హి విభుభిర్భావ్యం దీనేషు వత్సలైః
యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యాభద్రరన్ధన

దయ గలవారూ ప్రభువులూ తమ సేవకులకు చేయదగినది ఇదే. అభద్రరన్ధన - అమంగళ నాశకా, సమయం రాగానే నీవు మమ్ము గుర్తు చేసుకుంటే చాలు. అందుకు మేము పరమాత్మ భక్తులు గుర్తు చేసుకుంటే చాలు. అది నీ దర్శనముతోనే సంభవిస్తుంది

యేనోపశాన్తిర్భూతానాం క్షుల్లకానామపీహతామ్
అన్తర్హితోऽన్తర్హృదయే కస్మాన్నో వేద నాశిషః

లోకములో క్షుద్రమైన కోరికలను అనుభవించేవారికి కూడా శాంతి కలుగుతున్నదని అనిపిస్తున్నది. నిన్ను కోరేవారికి వేరే కోరికలు కలగకూడదు. అలాంటి వారికి కూడా తృప్తి కలుగుతోందంటే వారి హృదయములో నీవే ఉన్నావు. ఎక్కడ కోరిక కలుగుతుందో అక్కడే నీవున్నావు. మరి నాకేమి కావాలో నిన్ను అడగలాసిన అవసరమేముంది.

అసావేవ వరోऽస్మాకమీప్సితో జగతః పతే
ప్రసన్నో భగవాన్యేషామపవర్గః గురుర్గతిః

మోక్షాన్నిచ్చే పరమాత్మ ప్రసన్నమైతే మోక్షాన్నే కోరతాము

వరం వృణీమహేऽథాపి నాథ త్వత్పరతః పరాత్
న హ్యన్తస్త్వద్విభూతీనాం సోऽనన్త ఇతి గీయసే

ఐనా సరే మీ ఆజ్ఞ్య కాబట్టి వరము కోరుతాము. నీవు అనంతుడవు. అనంత విభూతులు కలవాడవు.

పారిజాతేऽఞ్జసా లబ్ధే సారఙ్గోऽన్యన్న సేవతే
త్వదఙ్ఘ్రిమూలమాసాద్య సాక్షాత్కిం కిం వృణీమహి

పారిజాతము సులభముగా దొరికితే ఆ తుమ్మెదకు వేరే పూవెందుకు. నీవు కనిపించే వరకే వేరే కోరికలుంటాయి. నీవు కనబడ్డాక ఇంకేమి కోరుకుంటాము.

యావత్తే మాయయా స్పృష్టా భ్రమామ ఇహ కర్మభిః
తావద్భవత్ప్రసఙ్గానాం సఙ్గః స్యాన్నో భవే భవే

ఐనా కోరాలి కాబట్టి కోరుతాము. మేము ఎంత కాలం ఈ సంసారములో పరిభ్రమిస్తామో అన్ని జన్మలలో నిన్ను వదలకుండా ఉండేట్లు చూడు. లేదా నిన్ను తలచే వారితో కలిసి ఉండేట్లు చేయి.

తులయామ లవేనాపి న స్వర్గం నాపునర్భవమ్
భగవత్సఙ్గిసఙ్గస్య మర్త్యానాం కిముతాశిషః

పరమాత్మ సంగమును కలిగి ఉన్న భక్తులతో క్షణ కాలం కలిసి ఉండటం మోక్షమునకూ స్వర్గమునకూ సమానం కాదు. అలాంటప్పుడు సంసారములో ఉన్నవి సాటి అవుతాయా?

యత్రేడ్యన్తే కథా మృష్టాస్తృష్ణాయాః ప్రశమో యతః
నిర్వైరం యత్ర భూతేషు నోద్వేగో యత్ర కశ్చన

పరమాత్మ  భక్తులున్న చోట కథలు మాటి మాటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆశ చావాలి అంటే భక్తులతో కలిసి ఉండాలి. అక్కడ వైరమూ ఆందోళనా ఉండదు.

యత్ర నారాయణః సాక్షాద్భగవాన్న్యాసినాం గతిః
సంస్తూయతే సత్కథాసు ముక్తసఙ్గైః పునః పునః

మహానుభావులందరూ కలిసి ఉంటే వారు చెప్పుకునే కథలలో శ్రీమన్నారాయణుడే గానం చేయబడుతూ ఉంటాడు

తేషాం విచరతాం పద్భ్యాం తీర్థానాం పావనేచ్ఛయా
భీతస్య కిం న రోచేత తావకానాం సమాగమః

అలాంటి మహానుభావులు పుణ్యం క్షేత్రాలను పావనం చేద్దామని అడుగులు వేస్తూ తిరుగుతూ ఉన్నవారి కలయిక, సంసారమంటే భయపడే వారికి ఎందుకు రుచించదు?

వయం తు సాక్షాద్భగవన్భవస్య ప్రియస్య సఖ్యుః క్షణసఙ్గమేన
సుదుశ్చికిత్స్యస్య భవస్య మృత్యోర్భిషక్తమం త్వాద్య గతిం గతాః స్మ

మేము మీ ప్రియ మిత్రుడైన శంకరుని క్షణ కాల కలయికతో చాలా కష్టపడికూడా చికిత్స చేయడం కష్టమైన (సుదుశ్చికిత్స్యస్య ) సంసారమునకు వైద్యుడవైన నిన్ను చూడగలిగాము

యన్నః స్వధీతం గురవః ప్రసాదితా విప్రాశ్చ వృద్ధాశ్చ సదానువృత్త్యా
ఆర్యా నతాః సుహృదో భ్రాతరశ్చ సర్వాణి భూతాన్యనసూయయైవ

మేము చాలా పుణ్యం చేసుకుని ఉన్నాము. మీ దర్శనమవుతుందని నమ్మకం కలిగింది, ఎందుకంటే శంకరుని దర్శనమయ్యింది కనుకనే. మేము గురువలను ప్రసన్నం చేసుకుని ఉంటాము. బ్రాహ్మణులూ వృద్ధులూ సజ్జనుల అనువృత్తితో పెద్దలకు నమసరించాము సకల ప్రాణులనూ అసూయ లేకుండా చూసాము. కాబట్టే మొదట వారి దర్శనం తరువాత మీ దర్శనం అయ్యింది

యన్నః సుతప్తం తప ఏతదీశ నిరన్ధసాం కాలమదభ్రమప్సు
సర్వం తదేతత్పురుషస్య భూమ్నో వృణీమహే తే పరితోషణాయ

మేము చక్కని తపస్సు చేసి ఉంటాము. ఇంతకాలం ఎలాంటి ఇబ్బందీ లేకుండా నీటిలో ఉండగలిగాము, ఇదంతా మహానుభావుడవైన మీ ప్రీతి కొరకు చేసాము

మనుః స్వయమ్భూర్భగవాన్భవశ్చ యేऽన్యే తపోజ్ఞానవిశుద్ధసత్త్వాః
అదృష్టపారా అపి యన్మహిమ్నః స్తువన్త్యథో త్వాత్మసమం గృణీమః

బ్రహ్మా శంకరుడూ మనువూ తపస్సుతో జ్ఞ్యానముతో పరిశుద్ధమైన ఇతరులందరకూ కూడా నీవెంత గొప్పవాడవనే అంతము తెలియకుండా ఉండేవారు. అయినా నీ మహిమను స్తోత్రం చేస్తూనే ఉన్నారు. నీ స్తోత్రాన్ని చేస్తూనే ఉన్నారు. మేము కూడా అలాగే చేస్తాము.

నమః సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ
వాసుదేవాయ సత్త్వాయ తుభ్యం భగవతే నమః

నీకు అందరూ ఒకటే, గుణ త్రయ దోష రహితుడవు. పరమ పురుషుడవు. నీకు నమస్కారము

మైత్రేయ ఉవాచ
ఇతి ప్రచేతోభిరభిష్టుతో హరిః ప్రీతస్తథేత్యాహ శరణ్యవత్సలః
అనిచ్ఛతాం యానమతృప్తచక్షుషాం యయౌ స్వధామానపవర్గవీర్యః

ఇలా ప్రాచేతసులచే స్తోత్రం చేయబడిన శరణ వత్సలుడైన హరి "మీరు చెప్పిన దంతా నిజమే" అని వెళ్ళడానికి సిద్ధపడుతుంటే ఆయన సౌందర్యాన్ని చూసి తృప్తి కలగక ఆయన వెళ్ళడం ఇష్టపడలేదు. అపవర్గ వీర్యుడైన స్వామి తన లోకానికి తాను వెళ్ళిపోయాడు

అథ నిర్యాయ సలిలాత్ప్రచేతస ఉదన్వతః
వీక్ష్యాకుప్యన్ద్రుమైశ్ఛన్నాం గాం గాం రోద్ధుమివోచ్ఛ్రితైః

స్వామినుండి వరములు పొంది స్వామి వెళ్ళిన తరువాత సముద్రము నుండి బయటకు వచ్చి చూస్తే భూమి అంతా చెట్లతో నిండి ఉన్నాయి. దీన్ని చూచి కోపించారు

తతోऽగ్నిమారుతౌ రాజన్నముఞ్చన్ముఖతో రుషా
మహీం నిర్వీరుధం కర్తుం సంవర్తక ఇవాత్యయే

కోపించిన వారు ముఖము నుంచి అగ్నినీ వాయువునీ వదిలిపెట్టారు. ప్రళయకాలాగ్ని లాగ అగ్ని బయలు దేరి చెట్లను దహిస్తోంది

భస్మసాత్క్రియమాణాంస్తాన్ద్రుమాన్వీక్ష్య పితామహః
ఆగతః శమయామాస పుత్రాన్బర్హిష్మతో నయైః

అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి ప్రాచేతసులను శాంతింపచేసాడు

తత్రావశిష్టా యే వృక్షా భీతా దుహితరం తదా
ఉజ్జహ్రుస్తే ప్రచేతోభ్య ఉపదిష్టాః స్వయమ్భువా

బ్రహ్మ చెప్పగా కాలిపోగా మిగిలిన చెట్లు తమ కూతురిని ప్రాచేతసులకు ఇచ్చారు

తే చ బ్రహ్మణ ఆదేశాన్మారిషాముపయేమిరే
యస్యాం మహదవజ్ఞానాదజన్యజనయోనిజః

మారిషను బ్రహ్మ ఆజ్ఞ్యతో వివాహం చేసుకున్నారు. ఇది వరకు పుట్టిన దక్షుడు మళ్ళీ పుట్టాడు

చాక్షుషే త్వన్తరే ప్రాప్తే ప్రాక్సర్గే కాలవిద్రుతే
యః ససర్జ ప్రజా ఇష్టాః స దక్షో దైవచోదితః

ఇంతకు ముందు ఉన్న చాక్షుష మన్వంతరములో చాలా మందిని సృష్టించిన దక్షుడు పరమాత్మచే ప్రేరేపించబడి పుట్టబోతూ ఇంతవరకూ ఉన్న తేజోవంతుల తేజస్సును తీసుకుని ప్రాచేతసులకూ మారిషకూ పుట్టాడు

యో జాయమానః సర్వేషాం తేజస్తేజస్వినాం రుచా
స్వయోపాదత్త దాక్ష్యాచ్చ కర్మణాం దక్షమబ్రువన్

చేయవలసిన పనులను దక్షతతో చేసేవాడు కాబట్టి దక్షుడయ్యాడు.

తం ప్రజాసర్గరక్షాయామనాదిరభిషిచ్య చ
యుయోజ యుయుజేऽన్యాంశ్చ స వై సర్వప్రజాపతీన్

ప్రజాపతులకు దక్షుడు నాయకుడయ్యాడు.

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం
ఇది తత్వ త్రయాన్ని వివరించిన కథ. దేవతలు పరోక్ష ప్రియులు.

ప్రాచీనబర్హిరువాచ
భగవంస్తే వచోऽస్మాభిర్న సమ్యగవగమ్యతే
కవయస్తద్విజానన్తి న వయం కర్మమోహితాః

మీరు చెప్పిన మాటలలో అంతరార్థం మాకు తెలియలేదు. కొంచెం తెలిసింది గానీ బాగుగా తెలియలేదు. మీరే ఉద్దేశ్యముతో చెప్పారో అది పూర్తిగా అర్థం కాలేదు. జ్ఞ్యానులు తెలుసుకుంటారు గానీ కర్మలచే మోహింపబడిన వారము మేము.

నారద ఉవాచ
పురుషం పురఞ్జనం విద్యాద్యద్వ్యనక్త్యాత్మనః పురమ్
ఏకద్విత్రిచతుష్పాదం బహుపాదమపాదకమ్

పురుషుడు పురంజనుడు. పురమంటే శరీరము.
జీవుడు తనకు కావలసిన శరీరాన్ని వెతుక్కుంటాడు. తానాచరించిన కర్మకు తగిన శరీరములోకి పరమాత్మ పంపిస్తాడు. ఒక కాలి జంతువులూ, రెండు కాళ్ళూ మూడూ నాలుగు కాళ్ళూ

యోऽవిజ్ఞాతాహృతస్తస్య పురుషస్య సఖేశ్వరః
యన్న విజ్ఞాయతే పుమ్భిర్నామభిర్వా క్రియాగుణైః

పురనజనునికి ఒక మిత్రుడు అవిజ్ఞ్యాత నాముడు. ఆయన పరమాత్మ. పరమాత్మే జీవాత్మకు మిత్రుడు. ఆయన అవిజ్ఞ్యాతుడెందుకంటే ఆయన పేరూ నివాసమూ ఎవరికీ తెలీదు. నామ స్వరూప గుణ వ్యవహారాలతో ఆయన స్వరూపాన్ని తెలుసుకోలేము.

యదా జిఘృక్షన్పురుషః కార్త్స్న్యేన ప్రకృతేర్గుణాన్
నవద్వారం ద్విహస్తాఙ్ఘ్రి తత్రామనుత సాధ్వితి

ఈ పురుషుడు తానాచరించిన కర్మఫలాన్ని  ప్రకృతి యొక్క గుణాలను అనుభవించాలి అని నవ ద్వారాలు, రెండు చేతులూ కాళ్ళూ ఉన్న నగరాన్ని బాగుందనుకున్నాడు. జీవుడు మానవాకారాన్ని (పురుషాకారాన్ని మెచ్చుకున్నాడు)

బుద్ధిం తు ప్రమదాం విద్యాన్మమాహమితి యత్కృతమ్
యామధిష్ఠాయ దేహేऽస్మిన్పుమాన్భుఙ్క్తేऽక్షభిర్గుణాన్

పురంజని అనే స్త్రీ బుద్ధి. ఆమె గొప్పతనం (బుద్ధి గొప్పతనం) ఏమిటంటే నేనూ నాదీ అనే భావన బుద్ధి వలన వస్తుంది. పురుషుడు (జీవుడు) బుద్ధిని ఆశ్రయించే ఇంద్రియములతో ప్రకృతి గుణాలను అనుభవిస్తాడు. ఇంద్రియములకూ బుద్ధికీ సంబంధముంటేనే ప్రకృతి గుణాలను అనుభవించడం.

సఖాయ ఇన్ద్రియగణా జ్ఞానం కర్మ చ యత్కృతమ్
సఖ్యస్తద్వృత్తయః ప్రాణః పఞ్చవృత్తిర్యథోరగః

అమ్మాయి వెనక పదకొండు మంది స్నేహితులూ ఇంద్రియగణం. జ్ఞ్యానం కర్మచ యత్కృతం - కొన్ని జ్ఞ్యానేంద్రియాలూ కొన్ని కర్మేంద్రియాలు. రూప రస గంధ స్పర్శాదులు తెలియాలంటే ఇంద్రియాలుండాలి. తెలిసినదాన్నే ఇంకో ఇంద్రియముతో చేస్తాము. అంటే కాళ్ళూ చేతులూ పని చేయాలి. మనసుతో కలిపి పదకొండు.
మిత్రులతో బాటు ఉన్న దాసీ గణము ఇంద్రియ వృత్తులు. వృత్తులు రెండు రకాలు. ప్రవృత్తీ నివృత్తీ (మానుట). కనులు మూసుకోవడం కూడా ఒక పనే. పదకొండు ఇంద్రియాలకూ ఇరవై రెండు మంది దాసీ జనమూ. ఐదు తలల పాము పంచ ప్రాణములు.

బృహద్బలం మనో విద్యాదుభయేన్ద్రియనాయకమ్
పఞ్చాలాః పఞ్చ విషయా యన్మధ్యే నవఖం పురమ్

మనస్సు కర్మ జ్ఞ్యానేంద్రియాలకూ నాయకుడు. ఒక విషయాన్ని తెలియాలన్నా తెలిసిన దాన్ని చేయాలన్నా మనసే కావాలి. జ్ఞ్యాన కర్మేంద్రియాలకు అధిపతి. అందుకు అది బృహద్బలం. పఞ్చాలాః  - శబ్ద స్పర్శ రూప రస గంధములు అనే ఐదు విషయములు చాలు.  ఈ విషయాల మధ్యే తొమ్మిది ద్వారాలు ఉన్న శరీరం ఉంటుంది.

అక్షిణీ నాసికే కర్ణౌ ముఖం శిశ్నగుదావితి
ద్వే ద్వే ద్వారౌ బహిర్యాతి యస్తదిన్ద్రియసంయుతః

నవరంధ్రాలు. రెండు రెండు ద్వారాలు చెవులూ. ఆయా ఇంద్రియాలతో కలిసి ఆ ద్వారములు బయటకు వెళ్ళి బయటి వాటిని తీసుకుంటాయి

అక్షిణీ నాసికే ఆస్యమితి పఞ్చ పురః కృతాః
దక్షిణా దక్షిణః కర్ణ ఉత్తరా చోత్తరః స్మృతః

ముందర ఉండేవి ఐదు. రెండు కళ్ళూ చెఉవులూ రెండు నాసికా ద్వారాలు నోరు.  ముందర ఉండేవి ఐదు. పక్కన ఉండేవి రెండు. దక్షిణ ఉత్తర ద్వారాలు కుడి ఎడమ చెవు

పశ్చిమే ఇత్యధో ద్వారౌ గుదం శిశ్నమిహోచ్యతే
ఖద్యోతావిర్ముఖీ చాత్ర నేత్రే ఏకత్ర నిర్మితే
రూపం విభ్రాజితం తాభ్యాం విచష్టే చక్షుషేశ్వరః

కింద ద్వారాలు రెండు.
ఖద్యోతము (ఆకాశం ప్రకాశింపచేసేవాడు) అవిర్ముఖము (తేజో ముఖి) - సుర్ర్యుడు - రెండు కన్నులు. ఇంద్రియాధిపతి రెండు కనులతో ప్రకాశింపచేసే రూపం స్వీకరిస్తాడు. అంటే వెలుగు ఉంటేనే చూడగలడు

నలినీ నాలినీ నాసే గన్ధః సౌరభ ఉచ్యతే
ఘ్రాణోऽవధూతో ముఖ్యాస్యం విపణో వాగ్రసవిద్రసః

నలినీ నాలినీ - రెండు నాసికలు. గంధాన్ని స్వీకరిస్తాయి. ఘ్రాణ ఇంద్రియము నాసిక ద్వారా గంధమును గ్రహిస్తుంది. నోరు విపణి (అంగడి). దానిలో రసాన్ని కొంటాము. ఈ వాక్కే రసాన్ని గ్రహించేది.

ఆపణో వ్యవహారోऽత్ర చిత్రమన్ధో బహూదనమ్
పితృహూర్దక్షిణః కర్ణ ఉత్తరో దేవహూః స్మృతః

రక రకాల అన్నాన్ని స్వీకరిస్తుంది. రెండు చెవులలో దక్షిణ కర్ణం పితృహు ఎడమ చెవి దేవహు.

ప్రవృత్తం చ నివృత్తం చ శాస్త్రం పఞ్చాలసంజ్ఞితమ్
పితృయానం దేవయానం శ్రోత్రాచ్ఛ్రుతధరాద్వ్రజేత్

ఈ రెండు ద్వారాలనుంచీ ప్రవృత్తి నివృత్తీ అనే శాస్త్రం వింటాము. పఞ్చాలసంజ్ఞితమ్ - విషయభోగాన్ని అనుభవించమనీ చెప్పినదీ, వదలమని చెప్పినదీ శాస్త్రమే. కర్తృత్వ భోక్తృత్వ జ్ఞ్యాతృత్వములను వదిలి అనుభవించమని చెబుతుంది. దీనికే పితృయానమనీ దేవ ద్వారమనీ పేరు.

ఆసురీ మేఢ్రమర్వాగ్ద్వార్వ్యవాయో గ్రామిణాం రతిః
ఉపస్థో దుర్మదః ప్రోక్తో నిరృతిర్గుద ఉచ్యతే

ఉపస్థ వలన స్త్రీ పురుష సమాగమం (వ్యవాయు). అది ఏమీ తెలియని వారు పొందే ఆనందము. ఇది దూర్మదః. ఎంత కష్టపడ్డా గానీ తొలగించలేని మదము. (బలవానిన్ద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి). మల ద్వారం న్రృతి. మలమును విడిచిపెట్టడమంటే హింస. పనికొచ్చేదిగా నోటి లోపలకు వెళ్ళి పనికి రానిదిగా బయటకు వస్తుంది.

వైశసం నరకం పాయుర్లుబ్ధకోऽన్ధౌ తు మే శృణు
హస్తపాదౌ పుమాంస్తాభ్యాం యుక్తో యాతి కరోతి చ

దీనికి లుబ్ధ అని పేరు. నోటికి కూడా లుబ్ధ అని పేరు. ఆశ ఎక్కువ. తినవలసిన దాన్ని తినకుండా ఆపలేదు. తినడానికి పడిన తొందరకన్నా ఎక్కువ తొందర మలాన్ని విడిచిపెట్టడానికి ఉంటుంది. హస్తపాదాలు గుడ్డివి. కళ్ళతో చూచినవి కాళ్ళూ చేతులూ తీసుకుంటాయి. పాదములతో వెళతాడూ, హస్తములతో చేస్తాడు.

అన్తఃపురం చ హృదయం విషూచిర్మన ఉచ్యతే
తత్ర మోహం ప్రసాదం వా హర్షం ప్రాప్నోతి తద్గుణైః

ఈ నగరములో అంతఃపురముంది. అదే హృదయం. దాని పాలకుడు మనసు. ఈ మనస్సుతో హృదయములో సంతోషం గానీ, సుఖం గానీ దుఃఖం గానీ బాధగానీ ప్రకృతి గుణములతో పొందుతాడు

యథా యథా విక్రియతే గుణాక్తో వికరోతి వా
తథా తథోపద్రష్టాత్మా తద్వృత్తీరనుకార్యతే

ఆయా గుణములచే అంటబడి ఎలా వికారం పొందుతాడో (విక్రియతే ), పొందించబడతాడో  (వికరోతి ) అలా దాని వెంట అనుసరించే ఆత్మ కూడా ఆ గుణాలు అనుభవించినట్లు అనుకరిస్తుంది.

దేహో రథస్త్విన్ద్రియాశ్వః సంవత్సరరయోऽగతిః
ద్వికర్మచక్రస్త్రిగుణ ధ్వజః పఞ్చాసుబన్ధురః

శరీరమే రధమూ ఇంద్రియములే గుఱ్ఱాలు, సంవత్సరము వేగము. చాలా వేగముగా పోతుంది గానీ ఒక్క అడుగు కూడా ముందుకు పోదు (అగతిః)
పుణ్యమూ పాపమూ అనే కర్మలు చక్రాలు. మూడు గుణాలు ద్వజములు. ఐదు బంధాలు ఐదు ప్రాణాలు

మనోరశ్మిర్బుద్ధిసూతో హృన్నీడో ద్వన్ద్వకూబరః
పఞ్చేన్ద్రియార్థప్రక్షేపః సప్తధాతువరూథకః

మనస్సే పగ్గము. బుద్ధి సారధి. హృదయము నీడము (యజమాని కూర్చునే స్థలం) శీతోష్ణములూ సుఖ దుఃఖములూ మానావమానాలు కూబరులు. శబ్దాది విషయాలు ప్రక్షేపములు. రథానికున్న ఏడు అంచెలు సప్తధాతువులు.

ఆకూతిర్విక్రమో బాహ్యో మృగతృష్ణాం ప్రధావతి
ఏకాదశేన్ద్రియచమూః పఞ్చసూనావినోదకృత్

ఆకూతి (సంస్కారమూ వాసన) పరాక్రమం, విక్రమం (అడుగు వేయిస్తుంది). వేట అంటే ఎండమావి. పదకొండు మంది సైన్యము ఇంద్రియాలు. వినోదం కలుగుతుందని మృగాలని చంపడం పంచసూనములు (ఐదు హింసలు, ఊడవడం ఉడికించడం విసరాలి కోయాలి దంచాలి )

సంవత్సరశ్చణ్డవేగః కాలో యేనోపలక్షితః
తస్యాహానీహ గన్ధర్వా గన్ధర్వ్యో రాత్రయః స్మృతాః
హరన్త్యాయుః పరిక్రాన్త్యా షష్ట్యుత్తరశతత్రయమ్

చండవేగుడు సంవతస్రము. ఈ చండవేగునితోనే కాలము తెలుస్తుంది. మూడు వందల అరవై ఐదు మంది గంధర్వులు, తెల్లటి వారు పగళ్ళూ, నల్లటి వారు రాత్రులు. మూడు వందల అరవై పగళ్ళూ రాత్రులు ఒక సారి తిరిగితే ఆయువు ఒక సంవత్స్రం ఒకటి తగ్గింది.

కాలకన్యా జరా సాక్షాల్లోకస్తాం నాభినన్దతి
స్వసారం జగృహే మృత్యుః క్షయాయ యవనేశ్వరః

కాలకన్య ముసలితనం. ప్రపంచములో ఎవ్వరూ దీన్ని అభినందించరు. యవనేశ్వరుడు మృత్యువు. ఇతను కాల కన్యను (జరా) సోదరిగా స్వీకరించాడు.

ఆధయో వ్యాధయస్తస్య సైనికా యవనాశ్చరాః
భూతోపసర్గాశురయః ప్రజ్వారో ద్వివిధో జ్వరః

మృత్యువు సైనికులు వ్యాధులూ ఆధులు (మనోవ్యాధి). వీళ్ళే యవనులు. జ్వరములలో ఒకటి మహావేగముగా వస్తుంది ఒకటి మెలమెల్లగా వస్తుంది.

ఏవం బహువిధైర్దుఃఖైర్దైవభూతాత్మసమ్భవైః
క్లిశ్యమానః శతం వర్షం దేహే దేహీ తమోవృతః

ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతికంలనే బాధలు ఉంటాయి. ఇలాంటి రక రకముల దుఃఖములతో కష్టపడుతూ

ప్రాణేన్ద్రియమనోధర్మానాత్మన్యధ్యస్య నిర్గుణః
శేతే కామలవాన్ధ్యాయన్మమాహమితి కర్మకృత్

ప్రాణ ఇంద్రియ మనో ధర్మాలను ఆత్మయందు ఆరోపిస్తాడు (నేను బలహీనున్నీ, నాకు కనిపించడములేదు ఇలాంటివి కొన్ని ప్రాణ ఇంద్రియ మనో ధర్మాలు). ఆత్మకే గుణమూ లేదు. చిన చిన్న కోరికలను ఆలోచిస్తూ నిద్రపోతాడు. సోమరితనమే నిష్క్రియత్వమే విరోధానికి మూలము. ఇలా అలోచిస్తూ నేనూ నాదీ అంటూ కర్మలు చేస్తూ ఉంటాడు.

యదాత్మానమవిజ్ఞాయ భగవన్తం పరం గురుమ్
పురుషస్తు విషజ్జేత గుణేషు ప్రకృతేః స్వదృక్

ఆత్మ గురించి తెలుసుకోడూ, పరమాత్మ గురించీ తెలుసుకోడు. భగవద్స్వరూప జ్ఞ్యానము గానీ స్వస్వరూప జ్ఞ్యానము లేనప్పుడే ఈ జీవుడు గుణాలలో మునుగుతాడు. ప్రకృఇ కంటే ఆత్మ వేరు, ఆత్మకే గుణాలూ దోషాలూ లేవు

గుణాభిమానీ స తదా కర్మాణి కురుతేऽవశః
శుక్లం కృష్ణం లోహితం వా యథాకర్మాభిజాయతే

లేని గుణములను ఉన్నవీ అనుకున్నందువలన ఉన్న వాటినీ అనుకున్నవాటినీ పొందాలనుకుని పనికిరాని అవసరము లేని పనులను చేస్తుంది. సత్వమూ తాంసస్సు రజస్సులతో కూడిన పనులను ఆచరిస్తారు. ఎలాంటి పనులు చేస్తాడో అలాంటి వాడిగా పుడతాడు.

శుక్లాత్ప్రకాశభూయిష్ఠా లోకానాప్నోతి కర్హిచిత్
దుఃఖోదర్కాన్క్రియాయాసాంస్తమఃశోకోత్కటాన్క్వచిత్

సాత్విక కర్మలు చేస్తే చంద్ర స్వర్గ మరుత్ లోకాలూ, తామసిక కర్మలు చేస్తే నరకాది లోకాలకూ వెళతారు, దుఃఖము బాగా కలిగించే పనులు ఆచరిస్తారు

క్వచిత్పుమాన్క్వచిచ్చ స్త్రీ క్వచిన్నోభయమన్ధధీః
దేవో మనుష్యస్తిర్యగ్వా యథాకర్మగుణం భవః

ఈ ఆత్మే ఒక చోట పురుషునిగా, ఇంకో చోట స్త్రీగా, ఇంకో చోట నపున్సకముగా ఉంటుంది. దేవతగా మనిషిగా పశువులుగా అదే ఆత్మ శరీరం ధరిస్తుంది కర్మను బట్టి.

క్షుత్పరీతో యథా దీనః సారమేయో గృహం గృహమ్
చరన్విన్దతి యద్దిష్టం దణ్డమోదనమేవ వా

బాగా ఆకలిగొన్న కుక్క (సారమేయో ) ఈ ఇంటినుంచి ఆ ఇంటికీ ఆ ఇంటినుంచి ఈ ఇంటికీ పోతుంది. అన్ని ఇళ్ళలో అన్నమే దొరుకుతాయా? కొన్ని ఇళ్ళలో అన్నము తింటుంది కొన్ని ఇళ్ళల్లో దెబ్బలు తింటుంది. అలాగే మానవులు కూడా

తథా కామాశయో జీవ ఉచ్చావచపథా భ్రమన్
ఉపర్యధో వా మధ్యే వా యాతి దిష్టం ప్రియాప్రియమ్

కోరికలను మనసు నిండా నిలుపుకుని పైలోకాలూ కిందలోకాలూ తిరుగుతూ ఉంటారు. అదృష్టవశాత్తూ లభించే ప్రీతినీ అప్రీతినీ సంతోషాన్నీ దుఃఖాన్నీ పొందుతారు

దుఃఖేష్వేకతరేణాపి దైవభూతాత్మహేతుషు
జీవస్య న వ్యవచ్ఛేదః స్యాచ్చేత్తత్తత్ప్రతిక్రియా

ఆధ్యాత్మ ఆదిదైవిక ఆదిభౌతికములనే మూడు రకముల దుఃఖములలో ఒక్క దానితో కూడా జీవునికి విముక్తి కనపడదు.

యథా హి పురుషో భారం శిరసా గురుముద్వహన్
తం స్కన్ధేన స ఆధత్తే తథా సర్వాః ప్రతిక్రియాః

కష్టములొచ్చాయని వచ్చిన బాధలను తప్పించుకోజూస్తాడు. శిరస్సున ఉన్న బరువును భుజము మీదకు మార్చుకుని బరువు తగ్గిందనుకుంటాడు. అతను చేసే ప్రతిక్రియలన్నీ ఇలాంటివే.

నైకాన్తతః ప్రతీకారః కర్మణాం కర్మ కేవలమ్
ద్వయం హ్యవిద్యోపసృతం స్వప్నే స్వప్న ఇవానఘ

ఒక కర్మకు ఇంకో కర్మ ఎప్పుడూ ప్రతీకారము కాదు. నిదురపోయిన తరువాత కల వచ్చి, కలలో నిదురపోయి అందులో ఇంకో కల వస్తే అందులో ఏ కల మంచిదంటే ఏమి చెప్తాము

అర్థే హ్యవిద్యమానేऽపి సంసృతిర్న నివర్తతే
మనసా లిఙ్గరూపేణ స్వప్నే విచరతో యథా

అర్థములు (విషయములు) లేకున్నా సంసారము పోదు. వాటిని కలిగించే వాసన అలాగే ఉంటుంది. అన్నం తిన్న నాటి కంటే అన్న తినని నాడే ఆహారం మీద మనసు ఉంటుంది. అలాగే విషములు లేకున్నప్పటికీ సంసారము పోదు. మనసుతో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎదురుగా లేని విషయాలని మనసుతో ఆలోచిస్తూ ఉంటాడు.

అథాత్మనోऽర్థభూతస్య యతోऽనర్థపరమ్పరా
సంసృతిస్తద్వ్యవచ్ఛేదో భక్త్యా పరమయా గురౌ

అర్థమైనటువంటి (స్వచ్చమైనటువంటి) ఆత్మకు అనర్థములు కలవడానికి కారణం మనసూ వాసనా సంస్కారము వలన కలుగుతున్నాయి. ఇది పోవాలంటే గురువు యందు పరమ భక్తి కలిగి ఉండాలి.

వాసుదేవే భగవతి భక్తియోగః సమాహితః
సధ్రీచీనేన వైరాగ్యం జ్ఞానం చ జనయిష్యతి

పరమాత్మ యందు భక్తి కలిగి ఉండు. చక్కని నిశ్చలమైన సావధానమైన మనసుతో చేస్తే (సధ్రీచీనేన - అన్య విషయ అప్రాపకమైన మనసుతో ), అలా ఉంటే  విరక్తిని కలిగిస్తుంది. భక్తి వైరాగ్యాన్నీ జ్ఞ్యానాన్నీ కలిగిస్తుంది.

సోऽచిరాదేవ రాజర్షే స్యాదచ్యుతకథాశ్రయః
శృణ్వతః శ్రద్దధానస్య నిత్యదా స్యాదధీయతః

త్వరలోనే ఇలాంటి వాడికి పరమాత్మ కథలను వినాలనే కోరిక పుడుతుంది. ఇలా పరమాత్మ కథలను శ్రద్ధగా వింటున్నవాడికి శ్రద్ధా భక్తీ నిరంతరం చలించకుండా ఉంటాయి

యత్ర భాగవతా రాజన్సాధవో విశదాశయాః
భగవద్గుణానుకథన శ్రవణవ్యగ్రచేతసః

పరమాత్మ కథ యందు కోరిక కలిగితే ఎక్కడ భాగవతోత్తములు పరమాత్మ భక్తులు పరిశుద్ధ మనస్కులు, ఉంటారో వారు మనము పిలవకుండానే వేంచేస్తారు

తస్మిన్మహన్ముఖరితా మధుభిచ్ చరిత్రపీయూషశేషసరితః పరితః స్రవన్తి
తా యే పిబన్త్యవితృషో నృప గాఢకర్ణైస్తాన్న స్పృశన్త్యశనతృడ్భయశోకమోహాః

అలాంటి వారి విషయములో మహానుభావులచేత చెప్పబడిన పరమాత్మ కథలతో, కథ అనే అమృతము యొక్క శేషము యొక్క నదులు అన్నీ చుట్టూ ప్రవహిస్తాయి. అలాంటి పరమాత్మ కథలను తృప్తి పొందక తాగుతూ ఉంటారో ఆకలీ దప్పీ దుఃఖమూ శోకమూ మోహమూ జరా స్పృశించవు. అలాంటి కథలను విన్న వారిని సాంసారిక విషయాలు స్పృశించవు.

ఏతైరుపద్రుతో నిత్యం జీవలోకః స్వభావజైః
న కరోతి హరేర్నూనం కథామృతనిధౌ రతిమ్

వినాలని అందరికీ తెలుసుకానీ అందరూ వినలేరు. అనేక సాంసారిక బాధలతో ఉన్నవాడు ఇవేమీ చేయడు. ఆకలీ దప్పీ భయమూ మోహమూ శోకమూ సహజముగా ఉంటాయి. ఆకలి దప్పులూ మొదలైనవి తొలగిపోతోనే కథలు విందామనుకుంటాడు. ఆ కథలు వింటేనే ఆకలీ దప్పీ మొదలైనవి పోతాయి. అనుకోకుండా కథలను వినడముతో ప్రీతి కలుగుతుంది, దాని తరువాత జ్ఞ్యానమూ వైరాగ్యమూ కలుగుతాయి. అప్పుడు ఆకలీ దప్పీ కూడా పోతాయి. ప్రయత్నము లేకుండా పరమాత్మ కథలను వినడము అదృష్టమూ. అది పరమాత్మ దయకు సంకేతము.

ప్రజాపతిపతిః సాక్షాద్భగవాన్గిరిశో మనుః
దక్షాదయః ప్రజాధ్యక్షా నైష్ఠికాః సనకాదయః
మరీచిరత్ర్యఙ్గిరసౌ పులస్త్యః పులహః క్రతుః
భృగుర్వసిష్ఠ ఇత్యేతే మదన్తా బ్రహ్మవాదినః

ఇలాంటి విశాల ప్రపంచములో పరమాత్మను మాత్రమే ధ్యానించేవారు శివుడు (ప్రజాపతిపతిః సాక్షాద్భగవాన్గిరిశో ) దక్షాది ప్రజాపతులు సనకాదులూ మరీచి అత్రి అంగీరస పులస్త్య పులహ క్రతు బృగు వశిష్ఠ నారద (నవ బ్రహ్మలు)

అద్యాపి వాచస్పతయస్తపోవిద్యాసమాధిభిః
పశ్యన్తోऽపి న పశ్యన్తి పశ్యన్తం పరమేశ్వరమ్

తపస్సుతో విద్యతో జ్ఞ్యానముతో కొంతమంది అర్థమైనా ఆచరించలేరు. చూస్తూ ఉండి కూడా గుడ్డివారవుతారు. పరమాత్మ అందరినీ చూస్తుంటాడన్న విషయం తెలిసి కూడా ఆచరణకు వచ్చేసరికి ఆ విషయం చూడలేడు

శబ్దబ్రహ్మణి దుష్పారే చరన్త ఉరువిస్తరే
మన్త్రలిఙ్గైర్వ్యవచ్ఛిన్నం భజన్తో న విదుః పరమ్

పరమాత్మ శబ్ద బ్రహ్మ. మంత్రాలనూ బీజాక్షరాలనో స్మరించి జపించి నేను పూజ చేసాను అనుకుంటారు.

సర్వేషామేవ జన్తూనాం సతతం దేహపోషణే
అస్తి ప్రజ్ఞా సమాయత్తా కో విశేషస్తదా నృణామ్
లబ్ధ్వేహాన్తే మనుష్యత్వం హిత్వా దేహాద్యసద్గ్రహమ్
ఆత్మసృత్యా విహాయేదం జీవాత్మా స విశిష్యతే

యదా యస్యానుగృహ్ణాతి భగవానాత్మభావితః
స జహాతి మతిం లోకే వేదే చ పరినిష్ఠితామ్

పరమాత్మ సహజముగా ఎవరిని అనుగ్రహిస్తాడో అటువంటి వాడు లౌకిక వైదిక విషయములో బుద్ధిని వదిలిపెడతాడు. మనకి భతీ వైరాగ్యం కలగలేదంటే అది పరమాత్మ కలిగించలేదని అర్థం. అందుకే భతి లేని వారిని చూచి జాలి పడమనీ, భగవంతున్ని ప్రార్థించమనీ పెద్దలు చెబుతారు. వేదములలో బోధించబడిన కర్మయోగములను కూడా పరమాత్మ భక్తులు ఆచరించరు.

తస్మాత్కర్మసు బర్హిష్మన్నజ్ఞానాదర్థకాశిషు
మార్థదృష్టిం కృథాః శ్రోత్ర స్పర్శిష్వస్పృష్టవస్తుషు

కన్నులతో చెవులతో చూసి తెలుసుకునేవాటి యందు "ఇవన్నీ నాకు ప్రయోజనములూ లాభములూ" అని అనుకోకు. శ్రోత్రేంద్రియమూ త్వగ్ ఇంద్రియమూ ఇలాంటి అస్పృష్ట వస్తువులయందు మతిని విడిచిపెట్టు. వేదాలకు శ్రోత్ర స్పర్శిషు అని పేరు. వేదం బోధించే కామ్య కర్మలు చెవులకి మాత్రమే తాకుతాయి. అర్థకాశిషు - ప్రయోజనాన్ని కలిగిస్తాయి అనిపిస్తాయి. పురుషార్థములా భాసిస్తాయి. అజ్ఞ్యానాత్ అర్థకాశిషు - జ్ఞ్యానము లేనందువలన వీటిని ప్రయోజనమనిపిస్తాయి. అస్పృష్టవస్తుషు - అసలు వస్తువైన భగవంతుని తాకవు ఈ కర్మలు.

స్వం లోకం న విదుస్తే వై యత్ర దేవో జనార్దనః
ఆహుర్ధూమ్రధియో వేదం సకర్మకమతద్విదః

తామేమి చేస్తున్నారో మరచిపోతారు. వారి లోకమేదో మరచిపోతారు. పరమాత్మ ఎక్కడుంటాడో అదే మన లోకము. జ్ఞ్యానులూ యోగులూ బుద్ధిమంతులూ ఏవి పనికి రావని వదిలేసారో (కామ్య కర్మలు) వాటినే మనము పట్టుకుని వ్రేళ్ళాడుతున్నాము. బుద్ధి అంతా పొగబారి ఉంటుంది. వేదము యొక్క అంతరార్థము తెలియని వారు వేదాన్ని సకర్మకం అని అంటారు. వేదం నైష్కర్యం. దుఃఖాన్ని కలిగించే కర్మలను చెబుతుందా?

ఆస్తీర్య దర్భైః ప్రాగగ్రైః కార్త్స్న్యేన క్షితిమణ్డలమ్
స్తబ్ధో బృహద్వధాన్మానీ కర్మ నావైషి యత్పరమ్
తత్కర్మ హరితోషం యత్సా విద్యా తన్మతిర్యయా

ఎవరెవరు ఎలాంటి విషయాలను స్వీకరిస్తారు? స్వీకరించినవారు ఎలా ఆచరిస్తారు. నిరంతరము పరమాత్మను మాత్రమే ధ్యానించడానికి కావలసిన పుణ్యవిశేషం పరమాత్మ మాత్రమే దయ చూపి అనుగ్రహించాలి. పరమాత్మ కంటే  భిన్నమైనది ఉపాయమనుకోవడం ఉపాయ విరోధి భగవంతుని కంటే ఇతరులకు దాసులమనుకోవడం స్వరూప విరోధి భగవంతుని కంటే ఇంకొకరిని పొందాలి అనుకోవడం ప్రాప్య విరోధి. వీటిలో ఏ ఒక్కటి విరోధి వచ్చినా మిగతా రెండూ వస్తాయి. భూమండలమంతా దర్భలు పరచి యజ్ఞ్యము చేస్తే పరమాత్మను పొందరు. అలాంటి వాడు జ్ఞ్యానమును కోల్పోయి మొద్దుబారిపోతాడు. యజ్ఞ్యమనే పేరుతో జంతు వధ చేస్తున్నాడు. ఇలాంటి పని వలన పుణ్యమొస్తుందా? ఆ యజ్ఞ్యాలు చేసి "నేనిన్ని యజ్ఞ్యాలు చేసాను" అని అంటాడు.
తత్కర్మ హరితోషం యత్సా విద్యా తన్మతిర్యయా - పరమాత్మకు సంతోషం కలిగింపచేసేదే పని, పరమాత్మయందు బుద్ధి నిలిపేదే చదువు

హరిర్దేహభృతామాత్మా స్వయం ప్రకృతిరీశ్వరః
తత్పాదమూలం శరణం యతః క్షేమో నృణామిహ

శరీర ధారులైన జీవాత్మలకు ఆత్మ అయిన వాడు పరమాత్మ. ఆయనే ప్రధానమైన కారణం. జగత్తంతా పరమాత్మ నుండే వెలువడింది. ఆయనే శాసకుడు. ఆ పరమాత్మ యొక్క పాదమూలమే రక్షకము. పరమాత్మ పాదములను చేరితేనే క్షేమము.

స వై ప్రియతమశ్చాత్మా యతో న భయమణ్వపి
ఇతి వేద స వై విద్వాన్యో విద్వాన్స గురుర్హరిః

మనకు నిజమైన ప్రియతముడు ఆయనే. అలాంటి వాని వలన కొద్ది భయము కూడా కలుగదు. ఎవడు ఈ విషయాన్ని తెలుసుకుంటాడో వాడు పండితుడు. ఆ పండితుడే గురువు. ఆ గురువే పరమాత్మ. (-ఉదరమంతరం కురుతే, అథతస్య భయం భవతి)

నారద ఉవాచ
ప్రశ్న ఏవం హి సఞ్ఛిన్నో భవతః పురుషర్షభ
అత్ర మే వదతో గుహ్యం నిశామయ సునిశ్చితమ్

నీకు అతి రహస్యమును చెబుతున్నాను విను. ఇది సునిశ్చితం. పరమ సిద్ధాంతం.
వ్యాసుడు వ్యాఖ్యానం వ్రాసిన ఏకైక శ్లోకం ఇది.

క్షుద్రం చరం సుమనసాం శరణే మిథిత్వా
రక్తం షడఙ్ఘ్రిగణసామసు లుబ్ధకర్ణమ్
అగ్రే వృకానసుతృపోऽవిగణయ్య యాన్తం
పృష్ఠే మృగం మృగయ లుబ్ధకబాణభిన్నమ్

ఒక లేడి తనకు కావలసిన పచ్చికనున్ తిందామని వెళ్ళింది. దూరముగా పచ్చిక కనపడింది. అక్కడకు వెళ్ళగా నాలుగు తోడేళ్ళు కనపడ్డాయి. వెనక్కు వెళదామంటే వేటగాడు బాణము పట్టుకుని ఉన్నాడు. ముందర సంపద ఉన్నదని చూడక పరిగెత్తితే వెనకనుంచి ఆపదలొస్తాయి. ఆ తోడేళ్ళు (వృకా) ముందర (అగ్రే )వారి ప్రాణాలతో బ్రతికేవి. ప్రాణాలకోసం ప్రాణాలు తీసేవారు - అన్సుతృప. వెనక నుంచి వేటగాడి బాణాలు తగులుతున్నాయి, ముందరనుంచి తోడేళ్ళ కోరలు తగులుతున్నాయి. కాలము వేటగాడు యముడు తోడేళ్ళు. ఆశలే బాణాలు.
క్షుద్రమైన అల్పమైన నీచమైన దానితో సంచరించేవాడు జీవుడు. పూల వంటి సుకుమారమైనా స్త్రీలయొక్క ఆశ్రయాన్ని పొందినవారు - సుమనసాం . వారిని శరణుగా పొంది పరస్పరం కలిసి కోరిక పెంచుకున్నవారవుతారు(రక్తం). పుస్ఫాల మీద వాలిన తుమ్మెదలు (షడఙ్ఘ్రిగణం) ఝంకారం చేస్తాయి. పద్మం మీదకి మగ తుమ్మెద తనకు తానుగా రాదు. ముందు ఆడ తుమ్మెద గానం చేస్తుంది. దానికి ఆశపడి మగ తుమ్మెద వచ్చి వాలుతుంది. ప్రియురాళ్ళు మాట్లాడే తీఎయని మాటలయందు ఆశపడే చెవులు కలవాడు ఆ పద్మములో బంధించబడుతున్నాడు. పచ్చిక కోసం వెళ్ళిన లేడి కూడా బంధించబడుతోంది.

అస్యార్థః సుమనఃసమధర్మణాం స్త్రీణాం శరణ ఆశ్రమే పుష్పమధుగన్ధవత్క్షుద్రతమం
కామ్యకర్మవిపాకజం కామసుఖలవం జైహ్వ్యౌపస్థ్యాది విచిన్వన్తం మిథునీభూయ తదభినివేశిత
మనసం షడఙ్ఘ్రిగణసామగీతవదతిమనోహరవనితాదిజనాలాపేష్వతితరామతిప్రలోభితకర్ణమగ్రే
వృకయూథవదాత్మన ఆయుర్హరతోऽహోరాత్రాన్తాన్కాలలవవిశేషానవిగణయ్య గృహేషు విహరన్తం పృష్ఠత ఏవ
పరోక్షమనుప్రవృత్తో లుబ్ధకః కృతాన్తోऽన్తః శరేణ యమిహ పరావిధ్యతి తమిమమాత్మానమహో
రాజన్భిన్నహృదయం ద్రష్టుమర్హసీతి

పూల వంటి సుకుమారమైన స్త్రీ మీద కోరికతో సుఖము లాంటి దానికోసం, నాలుకకూ ఉపస్థకూ సుఖము కలిగించుటకే మనసు లగ్నం చేసి ఆరు కాళ్ళతో (ఐదు జ్ఞ్యానేంద్రియాలు మనసు) సుందరమైనటువంటి ప్రేమ కురిపించే ప్రియురాళ్ళ మాటల మీద మోజు పడతాడు. అహోరాత్రములనే తోడేళ్ళు ఆయువును హరిస్తాయి నిమిషాలూ గంటలూ పూటలూ సంవత్సరాఊ గడుస్తూ ఉన్నా గమనించము. సంసారములో సంచరిస్తూ ఉంటాడు. వెనక యముడనే వేటగాడు లొపలనుండి వేసే బాణముతో హృదయం  భిన్నమవుతుంది. ఆహారము కోసము గానీ కామము కోసము గానీ మన స్థానాన్ని విడిచి వెళ్ళరాదు

స త్వం విచక్ష్య మృగచేష్టితమాత్మనోऽన్తశ్
చిత్తం నియచ్ఛ హృది కర్ణధునీం చ చిత్తే
జహ్యఙ్గనాశ్రమమసత్తమయూథగాథం
ప్రీణీహి హంసశరణం విరమ క్రమేణ

ఈ మృగచేష్టితాన్ని జాగ్రత్తగా చూచి నీవు కూడా నీ మనసును నిగ్రహించుకో. ఇంద్రియములను జయించకుంటే ఇంద్రియములు కోరేభోగం అనుభవించకపోగా మొదటికే మోసమొస్తుంది. చెవులో అమృతమూ పాలూ నేయి పోసేలాంటి (కర్ణధునీం) కోరికలతో ఉభయభ్రష్టులవుతారు. మనసుని నిగ్రహించు. చెవులతో వినగానే విన్నదాన్ని ఫలితం కలుగుతుందని ముందుకు అడుగు వేయకు. చిత్తాన్ని నిగ్రహించుకో. గృహస్థాశ్రమాన్ని (అంగనాశ్రమం) విడిచిపెట్టు. అది చెడువారిగుంపు (అసత్త్మయూధగాధం). వారు గృహస్థాశ్రమమే మంచిదని పాటలు పాడుతూ ఉంటారు. (చెవుల్లో విన్నదీ కళ్ళతో చూసినదీ, వీటి వైపు మనసు మళ్ళకుండా ఉంటే గృహస్థాశ్రమం ఉత్తమం. త్యాగముతో ఉండాలి - తేన త్యక్తేన భుఞ్జీథా మా గృధ్ కస్యస్విద్ధనమ్)
సన్యాసులూ యోగులూ ఎవరిని ఆశ్రయిస్తారో అటువంటి పరమాత్మను సంతోషింపచేయి. క్రమముగా సంసారమునుండీ విరముంచుకో. గృహస్థాశ్రమాన్ని చెడగొట్టడానికి మూలము ఆశ. ఆశ చూపి భ్రష్టులని చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తారు. వారి మాటలకు మోహం చెందితే ఉభయభ్రష్టులవుతారు. ఆశను క్రమముగా విడిచిపెట్టు. (దానము యొక్క అసలు అర్థమిదే)

రాజోవాచ
శ్రుతమన్వీక్షితం బ్రహ్మన్భగవాన్యదభాషత
నైతజ్జానన్త్యుపాధ్యాయాః కిం న బ్రూయుర్విదుర్యది

మీరు చెప్పిన ఈ వేదాంతాన్ని (అన్వీక్షితం) నేను విన్నాను. ఈ తత్వం మా గురువులకి తెలియదు. ఈ తత్వం మా గురువులు చెప్పలేదు. తెలుసుంటే ఎందుకు చెప్పలేదు.

సంశయోऽత్ర తు మే విప్ర సఞ్ఛిన్నస్తత్కృతో మహాన్
ఋషయోऽపి హి ముహ్యన్తి యత్ర నేన్ద్రియవృత్తయః

నాకు కలిగిన పెద్ద సందేహాన్ని సులభముగా తొలగించారు. ఇంద్రియములు ప్రవర్తించకుండా ఎలా ఉండాలి. శబ్దాది విషయములు ఎదురుగా ఉండగా వాటిలో ఇంద్రియములు ప్రవర్తించకుండా ఎలా చేయాలో అన్న విషయం మీద ఋషులు కూడా మోహం పొందుతున్నారు. అది మీరు నాకు సులభముగా చెప్పారు.

కర్మాణ్యారభతే యేన పుమానిహ విహాయ తమ్
అముత్రాన్యేన దేహేన జుష్టాని స యదశ్నుతే

ఏ శరీరముతో యాగం చేసాడో ఆ శరీరానికి స్వర్గం రావట్లేదు. వేరే శరీరాన్ని తీసుకుని దానితో స్వర్గాన్ని అనుభవిస్తాడు. అంటే ఆ స్వర్గ ఫలితం చేసిన వాడికి కాదు, వేరే దేహం తీసుకున్నాడికి. ఏ శరీరముతో మానవుడు కర్మలు చేస్తున్నాడో అది విడిచిపెట్టి వేరే శరీరముతో ఆ కర్మను అనుభవిస్తాడని వేదములో వింటున్నాము. చేసిన శరీరము వేరు అనుభవించే శరీరము వేరు. అంటే శరీరమూ ఆత్మా వేరు. ఆత్మ ఒక్కటే. కానీ ఆత్మ ఏ శరీరముతో యజ్ఞ్యం చేసిందో అదే శరీరముతో అనుభవాన్ని పొందడము లేదు. ఇంత స్పష్టముగా చెప్పినా శరీరాత్మభావాన్ని వదలలేకపోతున్నారు.

ఇతి వేదవిదాం వాదః శ్రూయతే తత్ర తత్ర హ
కర్మ యత్క్రియతే ప్రోక్తం పరోక్షం న ప్రకాశతే

చేసిన కర్మ చేసిన వాడు లేనప్పుడు వాడికి చాటుగా ఫలితాన్ని ఇస్తుందంటే ఎలా నమ్మాలి. మనము ఉండగా ఫలితమివ్వని పని లేనప్పుడు ఎలా ఇస్తుంది.

నారద ఉవాచ
యేనైవారభతే కర్మ తేనైవాముత్ర తత్పుమాన్
భుఙ్క్తే హ్యవ్యవధానేన లిఙ్గేన మనసా స్వయమ్

నీవు దేనితో ఇక్కడ కర్మ చేస్తున్నావో దానితోటే నీవు ఫలితాన్ని అనుభవిస్తావు. శరీరము జడము ఆ శరీరముతో చేయించేది మనసు. రెండు శరీరాలలో ఉండే మనసు ఒక్కటే. అందుకే సంస్కారాలు మన్సుకు ఉంటాయి. (అందుకే కొన్ని ప్రాంతాలకు వెళ్ళినపుడు "ఇతను మనకు పరిచయస్థుడిలా ఉన్నాడే" అనుకుంటాము)
మనసు ఏర్పరచిన శరీరముతో (స్థూల శరీరము రావడానికి గానీ సూక్ష శరీరం రావడానికీ మనసే కారణం)

శయానమిమముత్సృజ్య శ్వసన్తం పురుషో యథా
కర్మాత్మన్యాహితం భుఙ్క్తే తాదృశేనేతరేణ వా

మరణించేవాడు "నేను వెళుతున్నాను" అన్నాడంటే ఆ వెళుతున్నవాడు ఆత్మ. పడుకుని ఉన్న శరీరాన్ని పోతాడు గానీ, అందులో ఉన్న మనసుని విడిచిపెట్టడు. మనసుని తీసుకునే వెళతాడు. అందుకే ఏ మనసుతో యజ్ఞ్యం చేసావో ఆ మనసుతోనే ఫలితాన్ని అనుభవిస్తావు. అలాంటి దానితో గానీ మరొకదానితో గానీ అనుభవించేది శరీరముతో కాదు.

మమైతే మనసా యద్యదసావహమితి బ్రువన్
గృహ్ణీయాత్తత్పుమాన్రాద్ధం కర్మ యేన పునర్భవః

మనసుతోటే నేనూ నాదీ ఇతనూ ఇదీ అని చెబుతాడు. శరీరముతో చేసిన కర్మను మనసు "నాదీ, నేనూ " అంటుంది. మన్సు దేన్ని నాదీ అనుకుంటున్నాడో దానితోనే మళ్ళీ పుడతాడు. శరీరములతో చేసిన అన్ని కర్మల వలన కలిగిన సంస్కారాలు మనసులో ఉంటాయి.

యథానుమీయతే చిత్తముభయైరిన్ద్రియేహితైః
ఏవం ప్రాగ్దేహజం కర్మ లక్ష్యతే చిత్తవృత్తిభిః

అసలు మనసనేది ఒకటి ఉందని ఎందుకనుకోవాలి? మనసు లేదూ ఇంద్రియములే చేయిస్తున్నాయంటే.  ఆ ఇందిర్యాలు అన్ని ప్రాణులకు ఉన్నాయి. మానవులందరికీ ఒకే రకమైన ఇంద్రియాలున్నాయి. మరి అందరూ ఒకే పని ఎందుకు చేయట్లేదు. అన్ని ఇంద్రియాలూ సమానమే కాబట్టి అందరు చేసే పనులూ సమానముగా ఉండాలి. అంటే ఇంద్రియముల వెనక ఎవరో ఉండి పని చేయిస్తున్నారు. కాబట్టే ఒక్కొక్కరూ ఒక్కో రకమైన పని చేస్తున్నారు. ఇంద్రియములచే చేయబడే పనులే మనసు మోహపడుతుంది. కర్మలచేతనే, ఇంద్రియ వృత్తములను బట్టీ మనసును ఊహిస్తాము. మన్సు యొక్క స్వరూపాన్ని చెప్పేది ఉభయేంద్రియములు. ఇపుడు చేసిన పనులబట్టి మనసు ఇలాంటిదీ అని ఊహించవచ్చు. దాని బట్టే ఇంతకు ముందు జన్మలలో చేసిన పనులను కూడా ఊహించవచ్చు. ఇప్పటి పనులు చిత్తాన్ని చెబుతాయి. ఇప్పటి చిత్తం పూర్వ కర్మను చెబుతుంది. మన ప్రవృత్తితో ఇది వరకు జన్మలలో చేసిన కర్మను గుర్తించవచ్చు.

నానుభూతం క్వ చానేన దేహేనాదృష్టమశ్రుతమ్
కదాచిదుపలభ్యేత యద్రూపం యాదృగాత్మని

నీవెన్నడూ అనుభవించనిదీ చూడనిదీ చేయనిదీ నీ ఆలోచనలోకే రాదు. నీవాలోచించావంటే అలాంటి దానితో సంబంధము ఏదో ఒక జన్మలో ఉండే ఉంటుంది. సంబంధమూ సంస్కారమూ లేకుండా కొత్తగా ఆలోచన రాదు

తేనాస్య తాదృశం రాజ లిఙ్గినో దేహసమ్భవమ్
శ్రద్ధత్స్వాననుభూతోऽర్థో న మనః స్ప్రష్టుమర్హతి

ఏ ప్రవృత్తితో నీవు వ్యవహరించావో దాని సంబంధిన సంస్కారమేర్పడుతుంది. అనుభవం వలన కలిగిన సంస్కారమే ఇంకో శరీరాన్నిస్తుంది. అలాంటి సంస్కారం ఉన్నవాడికి ఆ మనసుకి దేహం కలుగుతుంది. మనసుకున్న సంస్కారముతో దేహ సంబంధమేర్పడుతుంది. ఎలాంటీ కర్మ చేస్తే అలాంటీ సంస్కారము. ఇది వరకెన్నడూ అనుభవించని విషయాన్ని మనసు సంకల్పించలేదు. ఎన్నడూ అనుభవైంచని విషయం కొత్తగా నీ మనసు సృష్టించలేదు

మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి శంసతి
భవిష్యతశ్చ భద్రం తే తథైవ న భవిష్యతః

మనిషికి పూర్వరూపాలను చెప్పేది మనసే. నవాంశం అరూఢ చక్రాన్ని కలిపితే పూర్వ జన్మలో మనమేమిటో చెప్పవచ్చు. ఏ గ్రహము మనం పుట్టినపుడూ ఏ స్థానములో  ఉందో, ఆ గ్రహం ఆస్థానములో ముంటే మన మనసు పనిచేస్తుందో , మన మనసులో ఉన్న సంస్కారాన్ని బట్టి ఆ గ్రహాలు అక్కడ చేరుతాయో కలిపితే నవాంశం.
మన పూర్వ రూపమేమిటో మనసే చెబుతుంది. ఇది వరకు ఎలా పుట్టామో కాదు, ఇక ముందు ఎలా పుట్టబోతామో కూడా చెబుతుంది.

అదృష్టమశ్రుతం చాత్ర క్వచిన్మనసి దృశ్యతే
యథా తథానుమన్తవ్యం దేశకాలక్రియాశ్రయమ్

ఇదివరకెన్నడూ చూడనిది నీవు అనుభవించలేవు. దేశ కాల క్రియలను బట్టి "ఫలానా పని చేసి ఉంటాడు" అని అనుకోవాలి.

సర్వే క్రమానురోధేన మనసీన్ద్రియగోచరాః
ఆయాన్తి బహుశో యాన్తి సర్వే సమనసో జనాః

ఆయా క్రమములకనుగుణముగా అన్నీ మనసులోనే ఇంద్రియములతో చూస్తాము. ఇంద్రియములకు కనపడతాయి, ఇంద్రియములతో కనపడతాయి. ఇంద్రియములు ప్రవర్తిస్తున్నయంటే మనసు వెనక ఉండి ప్రేరేపిస్తుంది. మనసున్న వారాందరూ గుంపులు గుంపులుగా వస్తుంటారు, గుంపులు గుంపులుగా పోతుంటారు

సత్త్వైకనిష్ఠే మనసి భగవత్పార్శ్వవర్తిని
తమశ్చన్ద్రమసీవేదముపరజ్యావభాసతే

మనసును పరమాత్మ యందు సత్వగుణముతో లగ్నం చేస్తే ఈ సంస్కారములన్నీ పోతాయి చద్రుని ముందు చీకటి లేనట్లుగా.

నాహం మమేతి భావోऽయం పురుషే వ్యవధీయతే
యావద్బుద్ధిమనోऽక్షార్థ గుణవ్యూహో హ్యనాదిమాన్

ఎప్పుడైతే పరమాత్మ దగ్గర చిత్తాన్ని చేర్చామో నేనూ నాదీ అన్న భావన తొలగిపోతుంది. పరమాత్మకీ మనకీ మధ్య అడ్డుగా ఉన్నది ఆ రెండే.
మనసు బుద్ధి ఇంద్రియములూ ఇంద్రియార్థములూ మొదలైన ఇరవై నాలుగు తత్వముల సమూహము అనాది. ప్రకృతి లేకుండా ఉండదు.

సుప్తిమూర్చ్ఛోపతాపేషు ప్రాణాయనవిఘాతతః
నేహతేऽహమితి జ్ఞానం మృత్యుప్రజ్వారయోరపి

నిద్రపోతున్నా మూర్చపోతున్నా పడిపోతున్నా దెబ్బలు తగిలేది దేహానికే గానీ మనసుకు కాదు. చనిపోయిన వాడు నేను చనిపోయాను అని చెప్పడు. నిదురపోయినవాడు నిద్రపోతున్నంత వరకూ నేను నిదురపోతున్నాను అని చెప్పడు. శరీరానికీ మనసుకూ సంబంధము ఉన్నంతవరకే ఆ శరీరముతో చేఇన పనులు చెప్పగలడు. శరీరము పోయిన తరువాత వచ్చే శరీరములో మనసు చేరితే అంతకు ముందు శరీరముతో చేసిన పనుల సంస్కారము మాత్రం ఉంటుంది గానీ చేసిన పనులు మాత్రం గుర్తు ఉండవు.

గర్భే బాల్యేऽప్యపౌష్కల్యాదేకాదశవిధం తదా
లిఙ్గం న దృశ్యతే యూనః కుహ్వాం చన్ద్రమసో యథా

గర్భములో బాల్యములో ఉన్నప్పుడు కూడా ఇవే ఇంద్రియాలు ఉన్నాయి.  అదే శరీరం ఉంది. కానీ సంస్కారములో మార్పు ఉంది. ఇంద్రియములు బాగా ఎదగలేదు కాబట్టి బాల్య గర్భావస్థలో ఇంద్రియానుభవం ఉండదు. సంస్కారం ఉన్నా ఆ సంస్కారాన్ని ప్రకటించడానికి కావలసిన పని ఈ శరీరం చేయలేదు. శరీర వృద్ధి పొందినప్పుడే ఆ సంస్కారం వృద్ధి పొందుతుంది. ఆ శరీరం ఆ అవస్థలలో కనపడదు అమావాస్యలో చంద్రుడు కనపడనట్లు. చంద్రుడు అలాగే ఉన్నాడు కానీ అమావాస్య నాడు కనపడడు. ఆయా సంస్కార వృద్ధి వచ్చేవరకు అది కనపడు.

అర్థే హ్యవిద్యమానేऽపి సంసృతిర్న నివర్తతే
ధ్యాయతో విషయానస్య స్వప్నేऽనర్థాగమో యథా

కనపడదు కాబట్టి ఆ సంస్కారము లేదు అనుకోగలమా? విషయములు లేకున్నా విషయములతో సంబంధం లేదన్నట్లు అనిపించినా సంస్కారం మాత్రం పోదు. లేని వాటి గురించే ఎక్కువ ఆలోచిస్తాము. పడుకున్నప్పుడు చెడ్డ కలవస్తే లేని ఆపద ఉన్నట్లు అనిపించినట్లుగా లేని సంసారం ఉన్నట్లు అనిపిస్తుంది.

ఏవం పఞ్చవిధం లిఙ్గం త్రివృత్షోడశ విస్తృతమ్
ఏష చేతనయా యుక్తో జీవ ఇత్యభిధీయతే

జీవుడంటే ఎవరు? వేటితో కలిసి ఉంటాడు. పంచభూతములూ పదకొండు ఇంద్రియములూ మూడు గుణములూ చైతన్యమూ. వీటితో కలిసి ఉంటాడు. వీటిలో కనపడేది శరీరం మాత్రమే. శరీరముతోటే తక్కిన వాటిని ఊహించాలి. శరీరమును బట్టి ఇంద్రియాలను, ఇంద్రియాలను బట్టి సంస్కారాలను, సంస్కారాలను బట్టి పూర్వ కర్మలను ఊహించవచ్చు

అనేన పురుషో దేహానుపాదత్తే విముఞ్చతి
హర్షం శోకం భయం దుఃఖం సుఖం చానేన విన్దతి

దీనితోటే శరీరాలను స్వీకరించి వదిలిపెడతాడు. హర్షమూ శోకమూ భయమూ దుఃఖమూ శరీరముతోనే ఉంటాయి. శరీరానికి అనుభూతి ఉండదు. మనసుకి క్రియా ఉండదు. మనసు అనుభవిస్తుంది. శరీరము చేస్తుంది.

భక్తిః కృష్ణే దయా జీవేష్వకుణ్ఠజ్ఞానమాత్మని
యది స్యాదాత్మనో భూయాదపవర్గస్తు సంసృతేః

యథా తృణజలూకేయం నాపయాత్యపయాతి చ
న త్యజేన్మ్రియమాణోऽపి ప్రాగ్దేహాభిమతిం జనః

గడ్డి పరకను పట్టుకుని ఎలా పురుగు ఉంటుందో, ఇంకో గడ్డిపరక సిద్ధముగా ఉంటేనే ఆ గడ్డిపరకను వదిలి వెళుతుందో ఈ శరీరం విడిచివెళ్ళేముందు వేరే శరీరం ఉంటేనే వెళతాము, వెళ్ళేప్పుడు సంస్కారాన్ని వెంటబెట్టుకుని వెళతాము. జాతకం పూర్వ జన్మ సంస్కారానికి సూచిక.

అదృష్టం దృష్టవన్నఙ్క్షేద్భూతం స్వప్నవదన్యథా
భూతం భవద్భవిష్యచ్చ సుప్తం సర్వరహోరహః
యావదన్యం న విన్దేత వ్యవధానేన కర్మణామ్
మన ఏవ మనుష్యేన్ద్ర భూతానాం భవభావనమ్

ఇంకో శరీరాన్ని పొందనంత వరకూ (కర్మదా వ్యవధానం - ఆచరించిన కర్మలు సంస్కారముగా మారేంతవరకూ సమయం పడుతుంది. పన్నెండు రోజులు ఈ భూ వాతావరణ పరిధిలోనే ఉంటాడు. ) ఆ పొందేదాకా మనసులోనే అన్నీ ఉంటాయి. మనసే జన్మకు కారణం. అన్ని సంస్కారాలు మనసులో నిండి ఉంటాయి.

యదాక్షైశ్చరితాన్ధ్యాయన్కర్మాణ్యాచినుతేऽసకృత్
సతి కర్మణ్యవిద్యాయాం బన్ధః కర్మణ్యనాత్మనః

శరీరాన్ని విడిచిపెట్టినా పెట్టకున్నా ఒక సారి శరీరముతో చేఇన పనుల గురించి జీవుడు చింతిస్తూ ఉంటాడు పశువులు నెమరు వేస్తున్నట్లుగా. ధ్యానము చేయకుండా ఉంటే సంస్కారం పోతుంది. కనీ మన మనసు ధ్యానించకుండా ఉండదు. ధ్యానం వలన సంస్కారం, సంస్కారం వలన జన్మ. జన్మ వలన మళ్ళీ కర్మలు. పనులు ఉంటేనే ధ్యానము. ఈ అవిద్యలో కర్మలు చేసినందు వలన బంధించబడి బంధించబడతాడు. కర్మ - సంస్కారమూ - జన్మ. అవిద్యతో శరీరం బంధించబడుతుంది.

అతస్తదపవాదార్థం భజ సర్వాత్మనా హరిమ్
పశ్యంస్తదాత్మకం విశ్వం స్థిత్యుత్పత్త్యప్యయా యతః

ఈ చక్రం నీకు రాకుండా ఉండాలంటే పనులు నేను చేస్తున్నాననే భావన గానీ, పనులు నా కోసం చేస్తున్నా అన్న భావన గానీ విడిచిపెట్టు. అన్ని పనులు శ్రీమన్నారాయణునికి సమర్పించు. చేసిన పనులు తనకోసమే అని ధ్యానం చేస్తే సంస్కారం వచ్చి మళ్ళీ జన్మ వస్తుంది. జనన మరణ చక్రాన్ని దాటాలంటే పరమాత్మకోసమే అన్ని పనులూ చేయి ఎందుకంటే ప్రపంచమంతా పరమాత్మాత్మకం. సృష్టి స్థితి లయములు ఎవరివలన అవుతున్నాయో ఆయనకు అర్పించు నీవు చేసే పనులన్నీ.

మైత్రేయ ఉవాచ
భాగవతముఖ్యో భగవాన్నారదో హంసయోర్గతిమ్
ప్రదర్శ్య హ్యముమామన్త్ర్య సిద్ధలోకం తతోऽగమత్

పరమభాగవతోత్తముడైన నారదుడు జీవాత్మా పరమాత్మ స్వరూప స్వభావాలు చెప్పి ప్రాచీన బర్హితో చెప్పి తన సిద్ధలోకానికి వెళ్ళిపోయాడు

ప్రాచీనబర్హీ రాజర్షిః ప్రజాసర్గాభిరక్షణే
ఆదిశ్య పుత్రానగమత్తపసే కపిలాశ్రమమ్

నారదుడు వెళ్ళిపోయిన తరువాత తన రాజ్యాన్నీ ప్రజలనూ పరిపాలించే పనిని కుమారులకు అప్పగించి తపస్సు చేసుకోవడానికి కపిలాశ్రమానికి వెళ్ళాడు

తత్రైకాగ్రమనా ధీరో గోవిన్దచరణామ్బుజమ్
విముక్తసఙ్గోऽనుభజన్భక్త్యా తత్సామ్యతామగాత్

సావధాన చిత్తుడై శరీరసంగాన్ని విడిచిపెట్టి భక్తితో పరమాత్మ సారూప్య మోక్షాన్ని పొందాడు

ఏతదధ్యాత్మపారోక్ష్యం గీతం దేవర్షిణానఘ
యః శ్రావయేద్యః శృణుయాత్స లిఙ్గేన విముచ్యతే

నారడు ఈ ఉపాఖ్యానం పేరుతో వేదాంతాన్నే పరోక్షముగా చెప్పాడు. ఇది వినిపించినవాడికీ విన్నవాడికీ పునర్జన్మబంధముండదు

ఏతన్ముకున్దయశసా భువనం పునానం
దేవర్షివర్యముఖనిఃసృతమాత్మశౌచమ్
యః కీర్త్యమానమధిగచ్ఛతి పారమేష్ఠ్యం
నాస్మిన్భవే భ్రమతి ముక్తసమస్తబన్ధః

ఇదంతా మనఃశుద్ధికారకం. ఇలాంటి చరితాన్ని ఎవడు వింటాడో ఎవరు చెబుతారో ఆ ఇద్దరూ పరబ్రహ్మ లోకాన్ని పొందుతారు. మళ్ళీ వారు ఈ సంసారములో సంచరించరు. వారికి అన్ని బంధాలూ తొలగిపోతాయి..

అధ్యాత్మపారోక్ష్యమిదం మయాధిగతమద్భుతమ్
ఏవం స్త్రియాశ్రమః పుంసశ్ఛిన్నోऽముత్ర చ సంశయః

ఈ ప్రకారముగా నేను విన్న ఆధ్యాత్మ పారోక్షం నీకు చెప్పాను. పురుషుడు గృహస్థాశ్రమం స్వీకరించడం వలన కలిగేవన్నీ వివరించాను.

Monday, March 11, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఎనిమిదవ అధ్యాయం

నారద ఉవాచ
సైనికా భయనామ్నో యే బర్హిష్మన్దిష్టకారిణః
ప్రజ్వారకాలకన్యాభ్యాం విచేరురవనీమిమామ్

ఇలా యవనాధిపతి సైన్యాన్ని తీసుకుని దాడి చేసాడు. ఇష్టకారిణః - భగవంతుడు అనుకున్నదాన్ని చేసేవి. భగవత్సంకల్పాన్ని అనుసరించేవి. మొత్తం భూమండలాన్ని సంచరించడం మొదలుపెట్టాయి.

త ఏకదా తు రభసా పురఞ్జనపురీం నృప
రురుధుర్భౌమభోగాఢ్యాం జరత్పన్నగపాలితామ్

అలా తిరుగుతూ పురంజన పురానికొచ్చారు. ఈ నగరాన్ని ఐదు తలల పాము కాపాడుతోంది. ఆ పాము ముసలిదైంది. ఆ ముసలి పాముతో కాపాడబడుతోన్నా సర్వ భోగాలు గల పురంజన పురానికి వచ్చారు

కాలకన్యాపి బుభుజే పురఞ్జనపురం బలాత్
యయాభిభూతః పురుషః సద్యో నిఃసారతామియాత్

కాల కన్య కూడా వచ్చి ఈ పురంజర పురాన్ని బలాత్కారముగా అనుభవించడం మొదలుపెట్టింది. ఆ కాలకన్య రాగానే పురుషుడు బలహీనుడవుతాడు. ఇలా జరా పురంజనున్ని ఆక్రమించింది.

తయోపభుజ్యమానాం వై యవనాః సర్వతోదిశమ్
ద్వార్భిః ప్రవిశ్య సుభృశం ప్రార్దయన్సకలాం పురీమ్

ఇలా కాల కన్యా చండవేగుడూ రాగానే వారి సైన్యం వచ్చింది. తొమ్మిది ద్వారాల నుండీ వారు వచ్చారు.

తస్యాం ప్రపీడ్యమానాయామభిమానీ పురఞ్జనః
అవాపోరువిధాంస్తాపాన్కుటుమ్బీ మమతాకులః

ఇలా పురంజనున్ని ఆక్రమించినా ఇంకా అభిమానం తొలగక కుటుంబముతో కలిసి గొప్ప బాధననుభవించాడు. మమకారం వలన బాధపడుతున్నాడు.

కన్యోపగూఢో నష్టశ్రీః కృపణో విషయాత్మకః
నష్టప్రజ్ఞో హృతైశ్వర్యో గన్ధర్వయవనైర్బలాత్

కాల కన్య గట్టిగా కౌగిలించుకుంది (కన్యోపగూఢో ) విడిచిపెట్టకుండా. ధనము పోయి కృపణుడయ్యాడు. విషయములయందే మనసు ఉంచినవాడు. గంధర్వులు వచ్చి మొత్తమూ హరించారు

విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాననాదృతాన్
పుత్రాన్పౌత్రానుగామాత్యాన్జాయాం చ గతసౌహృదామ్

తన నగరము యొక్క ద్వారాలూ గోపురాలూ చూస్తుండగానే కూలిపోతున్నాయి.  తన నగరాన్ని చూచి, పుత్ర పౌత్ర అనుగ(సేవకులు) ఆమాత్యులు (అప్పటికే ఆమాత్యులు ఇతని మాట కాదని మనవల మాట వినడం మొదలు పెట్టారు, భార్య మాట వినడం మానేసింది.)

ఆత్మానం కన్యయా గ్రస్తం పఞ్చాలానరిదూషితాన్
దురన్తచిన్తామాపన్నో న లేభే తత్ప్రతిక్రియామ్

తనకు జర వచ్చింది. పంచాల రాజ్యము (పంచ జ్ఞ్యానేంద్రియాలు) శత్రువులచే ఆక్రమించబడింది. ఇలా చింతను పొందినవాడై దీనికి ఏమి ప్రతిక్రియ చేయాలో తెలియని వాడయ్యాడు.

కామానభిలషన్దీనో యాతయామాంశ్చ కన్యయా
విగతాత్మగతిస్నేహః పుత్రదారాంశ్చ లాలయన్

జర వచ్చి అన్ని కోరికలనూ ఆక్రమించుకుంది (తినలేడూ తాగలేదు ఏమీ చేయలేడు). ఏ పనీ చేయలేక కేవలం కాలము గడిచిన కామనలను తలచుకుంటూ తన యందు ప్రేమలేని కొడుకులనూ భార్యలనూ బంధువులను ఓదారుస్తూ ఉంటాడు.

గన్ధర్వయవనాక్రాన్తాం కాలకన్యోపమర్దితామ్
హాతుం ప్రచక్రమే రాజా తాం పురీమనికామతః

గంధర్వ యవన కాల కన్యచే ఆక్రమించబడిన నగరాన్ని, ఈ రాజ్యములో ఉండలేమని వదిలిపెట్టాలనుకున్నాడు.

భయనామ్నోऽగ్రజో భ్రాతా ప్రజ్వారః ప్రత్యుపస్థితః
దదాహ తాం పురీం కృత్స్నాం భ్రాతుః ప్రియచికీర్షయా

మృత్యువు వచ్చాడు. అంతకన్నా ముందు రోగమొచ్చింది. వారొచ్చి శరీరాన్ని తగలబెట్టారు అన్నగారైన మృత్యువుకోసం.

తస్యాం సన్దహ్యమానాయాం సపౌరః సపరిచ్ఛదః
కౌటుమ్బికః కుటుమ్బిన్యా ఉపాతప్యత సాన్వయః

అలా తగలబడుతోంటే పౌరులందరూ (బంధువులు) పరితపించారు.

యవనోపరుద్ధాయతనో గ్రస్తాయాం కాలకన్యయా
పుర్యాం ప్రజ్వారసంసృష్టః పురపాలోऽన్వతప్యత

ఇక్కడ ఉండలేమని పుర పాలకుడు బాగా పరితపించి బాగా వణుకుపుట్టి దీన్ని కాపాడలేమని

న శేకే సోऽవితుం తత్ర పురుకృచ్ఛ్రోరువేపథుః
గన్తుమైచ్ఛత్తతో వృక్ష కోటరాదివ సానలాత్

నిప్పంటుకున్న చెట్టు తొర్రలోంచి పక్షులు వెళ్ళిపోయింట్లు వెళ్ళదలచుకున్నాడు.

శిథిలావయవో యర్హి గన్ధర్వైర్హృతపౌరుషః
యవనైరరిభీ రాజన్నుపరుద్ధో రురోద హ

గంధర్వుల వలన (పగలూ రాత్రీ) మొత్తం బలమంతా పోయింది. ఇలా అరికడితే ఉండలేకా వెళ్ళలేక ఏడ్చాడు.

దుహితౄః పుత్రపౌత్రాంశ్చ జామిజామాతృపార్షదాన్
స్వత్వావశిష్టం యత్కిఞ్చిద్గృహకోశపరిచ్ఛదమ్
అహం మమేతి స్వీకృత్య గృహేషు కుమతిర్గృహీ
దధ్యౌ ప్రమదయా దీనో విప్రయోగ ఉపస్థితే

ఒక్క సారి ఈ నగరాన్ని విడిచిపెట్టి పోవాలనుకునే సరికి కూతుర్లూ కొడుకులూ మనవలూ బంధువులూ మొదలైన వారు ఎవరూ రాలేదు. ఎవరూ నా వాడు అనలేదు. ఒక్క శరీరం ఒక్కటే తనది. అది కూడా పోవాలనే అనుకుంటోంది. ఇల్లూ డబూ ఆస్థి పాస్తులూ అహంకార మమకారముతో నేనూ నాది అన్న భావనతో పోగొట్టుకున్నాడు

లోకాన్తరం గతవతి మయ్యనాథా కుటుమ్బినీ
వర్తిష్యతే కథం త్వేషా బాలకాననుశోచతీ

భార్యను చూచి "నేను లోకాంతరానికి వెళితే నా  భార్య ఏమవ్వాలి. అమాయకురాలు ఆమె ఎలా బ్రతుకుతుందో "

న మయ్యనాశితే భుఙ్క్తే నాస్నాతే స్నాతి మత్పరా
మయి రుష్టే సుసన్త్రస్తా భర్త్సితే యతవాగ్భయాత్

నేను తినకపోతే అదీ తినదు.  నేను స్నానం చేస్తేనే అది స్నానం చేస్తుంది. మరి ఇప్పుడు ఎలా ఉంటుంది. భయపెడితే మాట్లాడకుండా ఉండేది

ప్రబోధయతి మావిజ్ఞం వ్యుషితే శోకకర్శితా
వర్త్మైతద్గృహమేధీయం వీరసూరపి నేష్యతి

ఎక్కడికైనా వెళితే ఏడుస్తూ ఉండేది. ఈ గృహ్స్థాశ్రమ మార్గాన్ని నేను లేకుండా ఎలా గడుపుతుంది.

కథం ను దారకా దీనా దారకీర్వాపరాయణాః
వర్తిష్యన్తే మయి గతే భిన్ననావ ఇవోదధౌ

నావ లేని సముద్రములో వెళ్ళలేనట్లు నేను లేకపోతే పిల్లలను ఎలా పోషిస్తుంది.

ఏవం కృపణయా బుద్ధ్యా శోచన్తమతదర్హణమ్
గ్రహీతుం కృతధీరేనం భయనామాభ్యపద్యత

ఆలోచించకూడని సమయములో ఇలా అందరి గురించి శొచిస్తూ ఉంటే ఇటువంటి వాడిని పట్టుకోవడానికి మృత్యువు చేరింది.

పశువద్యవనైరేష నీయమానః స్వకం క్షయమ్
అన్వద్రవన్ననుపథాః శోచన్తో భృశమాతురాః

పశువును మెడలో తాడు వేసి లాగుకొని పోయినట్లు మృత్యువు పాశముతో లాగుకొని వెళ్ళింది.

పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజఙ్గమః
యదా తమేవాను పురీ విశీర్ణా ప్రకృతిం గతా

ఆ సర్పం కూడా అరికట్టబడింది.

వికృష్యమాణః ప్రసభం యవనేన బలీయసా
నావిన్దత్తమసావిష్టః సఖాయం సుహృదం పురః

ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇందరు వచ్చి బంధించి బాధిస్తూ తీసుకుని వెళుతూ ఉన్నా కూడా తన ప్రాణ మిత్రున్ని గుర్తు చేసుకోలేదు అజ్ఞ్యానం ఆవరించినవాడై.

తం యజ్ఞపశవోऽనేన సంజ్ఞప్తా యేऽదయాలునా
కుఠారైశ్చిచ్ఛిదుః క్రుద్ధాః స్మరన్తోऽమీవమస్య తత్

ఇలా పాశములు కట్టి లాగుకొని పోతుంటే అక్కడికి పోతుంటే ఇతని కోసం యజ్ఞ్య పశువులు సిద్ధముగా ఉన్నాయి. కోపముతో ఇతని పాపాన్ని తలచుకుంటూ గొడ్డళ్ళతో (కుఠారై) నరికేసాయి

అనన్తపారే తమసి మగ్నో నష్టస్మృతిః సమాః
శాశ్వతీరనుభూయార్తిం ప్రమదాసఙ్గదూషితః

అంతులేని చీకటిలో కూరుకుపోయి చాలా కాలం అవస్థపడ్డాడు, తన ఇంతకు ముందు ప్రియా సంగము వలన.

తామేవ మనసా గృహ్ణన్బభూవ ప్రమదోత్తమా
అనన్తరం విదర్భస్య రాజసింహస్య వేశ్మని

భార్యని తలచుకుంటూ మరణించాడు కాబట్టి తరువాతి జన్మలో స్త్రీగా పుట్టాడు.

ఉపయేమే వీర్యపణాం వైదర్భీం మలయధ్వజః
యుధి నిర్జిత్య రాజన్యాన్పాణ్డ్యః పరపురఞ్జయః

విదర్భ రాజ కుమారుడిని వివాహం చేసుకుంది. భగవంతుని సేవ చేసి తోటి రాజులను (కామ క్రోధాలను గెలిచాడు) నిరంతరం యజ్ఞ్యములాచరించాడు దాని వలన

తస్యాం స జనయాం చక్ర ఆత్మజామసితేక్షణామ్
యవీయసః సప్త సుతాన్సప్త ద్రవిడభూభృతః

మహాపరాక్రమవంతుడు ఇతను, యుద్ధములో చాలా రాజ్యాలను గెలిచి భార్యతో ఒక అమ్మాయిని కన్నాడు. ద్రవిడ దేశానికి రాజులుగా ఏడుగురు కొడుకులని కన్నాడు
భక్తి అనే కూతురు కలిగింది (నల్లని చూపు కలది - నల్లని వాన్ని చూపులో ఉంచుకున్నది - భక్తి) ఏడుగురు కొడుకులు సత్య ఆత్మ నివేదనములు తప్ప మిగతా నవ విధ భక్తులు.

ఏకైకస్యాభవత్తేషాం రాజన్నర్బుదమర్బుదమ్
భోక్ష్యతే యద్వంశధరైర్మహీ మన్వన్తరం పరమ్

ఒక్కో రాజ కుమారుడికీ మళ్ళీ సంతానం కలిగారు. ఇలా వారి వారితో భూమి మన్వంతర కాలం అనుభవించబడింది

అగస్త్యః ప్రాగ్దుహితరముపయేమే ధృతవ్రతామ్
యస్యాం దృఢచ్యుతో జాత ఇధ్మవాహాత్మజో మునిః

అందులో ఒక అమ్మాయిని అగస్త్యుడు వివాహం చేసుకున్నాడు. అగః అంటే పర్వతం. పర్వతాన్ని వచినవాడు (వింధ్య పర్వతం) . అహంకారాన్ని వచినవాడు. జ్ఞ్యాని. భక్తిని జ్ఞ్యానం వివాహం చేసుకున్నాడు. వినయశీలీ అహంకార రహితుడే భక్తిని వశం చేసుకోగలడు. ఇధ్మవాహాత్మజో  - అగ్ని కుమారుడు

విభజ్య తనయేభ్యః క్ష్మాం రాజర్షిర్మలయధ్వజః
ఆరిరాధయిషుః కృష్ణం స జగామ కులాచలమ్

ఇతను తన రాజ్యాన్ని అందరికీ పంచివేసాడు. కులాద్రి పర్వతానికి భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు

హిత్వా గృహాన్సుతాన్భోగాన్వైదర్భీ మదిరేక్షణా
అన్వధావత పాణ్డ్యేశం జ్యోత్స్నేవ రజనీకరమ్

అందరినీ వదిలి ఈమె కూడా భర్తను అనువర్తించింది

తత్ర చన్ద్రవసా నామ తామ్రపర్ణీ వటోదకా
తత్పుణ్యసలిలైర్నిత్యముభయత్రాత్మనో మృజన్

చన్ద్రవసా - తామ్రపర్ణీ. ఈ నదికి రెండువైపులా మఱ్ఱి చెట్టు ఉంది. మఱ్ఱి చెట్టు సంసారానికి సంకేతము. ఇహ పరలోకములో వచ్చే అన్ని పాపాలను మర్రి చెట్టు వేళ్ళు తాకిన నీరు తాగితే పోతాయి. అటువంటి మర్రి చెట్టు నీడలో తపస్సుకు కూర్చున్నాడు

కన్దాష్టిభిర్మూలఫలైః పుష్పపర్ణైస్తృణోదకైః
వర్తమానః శనైర్గాత్ర కర్శనం తప ఆస్థితః
శీతోష్ణవాతవర్షాణి క్షుత్పిపాసే ప్రియాప్రియే
సుఖదుఃఖే ఇతి ద్వన్ద్వాన్యజయత్సమదర్శనః

తపస్సు ద్వారా ద్వంద్వాలను గెలిచాడు సమదర్శనుడై అన్నిటిలో ఉన్న పరమాత్మను చూస్తూ మౌనముగా తపస్సు చేసాడు. తపస్సుతో పాపాలన్ని భస్మయ్యాయి

తపసా విద్యయా పక్వ కషాయో నియమైర్యమైః
యుయుజే బ్రహ్మణ్యాత్మానం విజితాక్షానిలాశయః

ఇంద్రియములనూ వాయువునూ మనసునూ మూటినీ గెలిచాడు కో మొద్దులా ఐపోయి నూరు సంవత్సరాలు పరమాత్మ యందు తప్ప దేని యందూ మనసు ఉంచలేదు

ఆస్తే స్థాణురివైకత్ర దివ్యం వర్షశతం స్థిరః
వాసుదేవే భగవతి నాన్యద్వేదోద్వహన్రతిమ్

స వ్యాపకతయాత్మానం వ్యతిరిక్తతయాత్మని
విద్వాన్స్వప్న ఇవామర్శ సాక్షిణం విరరామ హ

పరమాత్మ సర్వాంతర్యామి అని తెలుసుకొని జగత్తునీ శరీరాన్నీ కలలోని వస్తువుగా అనిత్యముగా తెలుసుకున్నాడు, అన్నీ మానేశాడు

సాక్షాద్భగవతోక్తేన గురుణా హరిణా నృప
విశుద్ధజ్ఞానదీపేన స్ఫురతా విశ్వతోముఖమ్

కపిలుడు ఏ మార్గాన్ని చెప్పాడో ఆ మార్గాన్ని తీసుకుని తనను పరామాత్మలో పరమాత్మను తనలో చూచాడు.

పరే బ్రహ్మణి చాత్మానం పరం బ్రహ్మ తథాత్మని
వీక్షమాణో విహాయేక్షామస్మాదుపరరామ హ

కోరికనూ ఆసక్తినీ విడిచి శరీరమునుండీ విడిచిపెట్టాడు

పతిం పరమధర్మజ్ఞం వైదర్భీ మలయధ్వజమ్
ప్రేమ్ణా పర్యచరద్ధిత్వా భోగాన్సా పతిదేవతా

అన్ని రాజభోగాలను విడిచిపెట్టి పతిని సేవించింది, నార వస్త్రాలను ధరించి కేశాలనున్ జడలుగా చేసుకుని భర్తను అనుగమించింది

చీరవాసా వ్రతక్షామా వేణీభూతశిరోరుహా
బభావుప పతిం శాన్తా శిఖా శాన్తమివానలమ్

అజానతీ ప్రియతమం యదోపరతమఙ్గనా
సుస్థిరాసనమాసాద్య యథాపూర్వముపాచరత్

భర్తను సేవిస్తూ గడిపింది. అతను శరీరం విడిచిపెట్టినట్లు తెలుసుకోలేదు. తన భర్త పాద ప్రక్షాళన చేయబోతే అతని కాళ్ళు వేడిగా లేవు.

యదా నోపలభేతాఙ్ఘ్రావూష్మాణం పత్యురర్చతీ
ఆసీత్సంవిగ్నహృదయా యూథభ్రష్టా మృగీ యథా

తోటి వారిని కోల్పోయిన ఆడలేడిలా దైన్యముతో ఏడుస్తూ ఉంది.

ఆత్మానం శోచతీ దీనమబన్ధుం విక్లవాశ్రుభిః
స్తనావాసిచ్య విపినే సుస్వరం ప్రరురోద సా

ఉత్తిష్ఠోత్తిష్ఠ రాజర్షే ఇమాముదధిమేఖలామ్
దస్యుభ్యః క్షత్రబన్ధుభ్యో బిభ్యతీం పాతుమర్హసి

మహారాజా  నీవు పోతే ఈ రాజ్యాన్ని ఎవరు కాపాడతారని ఏడుస్తూ

ఏవం విలపన్తీ బాలా విపినేऽనుగతా పతిమ్
పతితా పాదయోర్భర్తూ రుదత్యశ్రూణ్యవర్తయత్

కన్నీరు స్రవింపచేస్తూ చితిని పేర్చి అగ్నిని పెట్టి సంస్కారం చేసి తాను కూడా అందులో పడి మరణించాలనుకుంటే

చితిం దారుమయీం చిత్వా తస్యాం పత్యుః కలేవరమ్
ఆదీప్య చానుమరణే విలపన్తీ మనో దధే

తత్ర పూర్వతరః కశ్చిత్సఖా బ్రాహ్మణ ఆత్మవాన్
సాన్త్వయన్వల్గునా సామ్నా తామాహ రుదతీం ప్రభో

తన పూర్వ మిత్రుడు ఓదారుస్తూ ఇలా అన్నాడు

బ్రాహ్మణ ఉవాచ
కా త్వం కస్యాసి కో వాయం శయానో యస్య శోచసి
జానాసి కిం సఖాయం మాం యేనాగ్రే విచచర్థ హ

నీవరు ఎవరి దానవు ఇతనెవరు. నీ స్నేహితుడనైన నేను నీకు తెలుసా

అపి స్మరసి చాత్మానమవిజ్ఞాతసఖం సఖే
హిత్వా మాం పదమన్విచ్ఛన్భౌమభోగరతో గతః

నా పేరు అవిజ్ఞ్యాతుడు. నా కన్న ఉత్తమైన సుఖము కావాలని కోరి భూలోకానికి వచ్చావు

హంసావహం చ త్వం చార్య సఖాయౌ మానసాయనౌ
అభూతామన్తరా వౌకః సహస్రపరివత్సరాన్

నీవూ నేనూ ఇద్దరమూ హంసలమే. ఇద్దరమూ మానస సరోవరములో ఉంటాము. అది వదిలిపెట్టి ఏదో ఒక నావ పట్టుకుని ఇక్కడికి వచ్చి

స త్వం విహాయ మాం బన్ధో గతో గ్రామ్యమతిర్మహీమ్
విచరన్పదమద్రాక్షీః కయాచిన్నిర్మితం స్త్రియా

నన్ను విడిచిపెట్టి గ్రామ్య సుఖాలనాశించి వచ్చావు. అలా ఒక స్త్రీ యొక్క నగరాన్ని, తొమ్మిది ద్వారాలున్న, జలమూ శరీరమూ అగ్నీ (అన్నమయ మనో మయ ప్రాణమయ) ద్వారాలుగా గల దాన్ని

పఞ్చారామం నవద్వారమేకపాలం త్రికోష్ఠకమ్
షట్కులం పఞ్చవిపణం పఞ్చప్రకృతి స్త్రీధవమ్

పఞ్చేన్ద్రియార్థా ఆరామా ద్వారః ప్రాణా నవ ప్రభో
తేజోऽబన్నాని కోష్ఠాని కులమిన్ద్రియసఙ్గ్రహః

పంచేంద్రియాలనే ఆరామాలతో తొమ్మిది ప్రాణ ద్వారాలతో అగ్నీ జలమూ అన్నమూ అనే మూడు కోష్టాలతో, జ్ఞ్యానేంద్రియాలతో కర్మేంద్రియాలనే అంగడితో

విపణస్తు క్రియాశక్తిర్భూతప్రకృతిరవ్యయా
శక్త్యధీశః పుమాంస్త్వత్ర ప్రవిష్టో నావబుధ్యతే

తరగని ప్రకృతితో బుద్ధి అనే స్త్రీకి వశమై తానెక్కడికి వచ్చాడో తెలుసుకోలేకపోయాడు

తస్మింస్త్వం రామయా స్పృష్టో రమమాణోऽశ్రుతస్మృతిః
తత్సఙ్గాదీదృశీం ప్రాప్తో దశాం పాపీయసీం ప్రభో

నీవానగరములో ఉన్న స్త్రీని ఆలింగనం చేసుకోబోయి ఈ స్థితిని పొందావు. ఇదంతా పాప దశ

న త్వం విదర్భదుహితా నాయం వీరః సుహృత్తవ
న పతిస్త్వం పురఞ్జన్యా రుద్ధో నవముఖే యయా

నువ్వు విదర్భ పుత్రికవూ కావు ఇతను నీకు భర్తా కాదు. పూర్వ జన్మలో కూడా పురంజనికి భర్తవి కావు. బంధించబడ్డావు

మాయా హ్యేషా మయా సృష్టా యత్పుమాంసం స్త్రియం సతీమ్
మన్యసే నోభయం యద్వై హంసౌ పశ్యావయోర్గతిమ్

ఇదంతా నా మాయ. నేను పురుషుడినీ పక్కవారు స్త్రీ అన్న మాయలో పడ్డావు. రెండూ కాదు. నీవు స్త్రీవీ అతను పురుషుడూ కావు. మనిద్దరమూ హంసలము. మనకే సంబంధము లేదు. నిత్య ముక్త బుద్ధ స్వరూపము మనది

అహం భవాన్న చాన్యస్త్వం త్వమేవాహం విచక్ష్వ భోః
న నౌ పశ్యన్తి కవయశ్ఛిద్రం జాతు మనాగపి

నేనూ నీవూ వేరు కాదు. నీవు నా అంశే. పండితులూ జ్ఞ్యానులూ మనిద్దరిలో ఏ కొంచెమూ తేడా చూడరు

యథా పురుష ఆత్మానమేకమాదర్శచక్షుషోః
ద్విధాభూతమవేక్షేత తథైవాన్తరమావయోః

ఇద్దరం కనపడుతున్నా మనం ఒక్కరమే. అద్దములో మన ప్రతిబింబమూ మనమూ వేరని అనుకుంటామా? అలాగే అద్దములో మనమూ మన కన్నూ కనబడుతుంది. అద్దములో కంటిలో కూడా ప్రతిబింబాలు కనపడతాయి. ఈ ప్రతిబింబాలూ మనకన్నా వేరా? అలాంటి తేడానే నీకూ నాకూ ఉంది.

ఏవం స మానసో హంసో హంసేన ప్రతిబోధితః
స్వస్థస్తద్వ్యభిచారేణ నష్టామాప పునః స్మృతిమ్

ఇలా పరమాత్మ జీవాత్మకు బోధించాడు. దీనితో జీవుడు పరిశుద్ధుడయ్యాడు. పరమాత్మ కృపతో ఇంతకాలం మరచిపోయిన జ్ఞ్యానన్ని మళ్ళీ పొందాడు

బర్హిష్మన్నేతదధ్యాత్మం పారోక్ష్యేణ ప్రదర్శితమ్
యత్పరోక్షప్రియో దేవో భగవాన్విశ్వభావనః

ప్రాచీనబర్హీ! నేను చెప్పేది కథకాదు. ఇది ఆధ్యాత్మ జ్ఞ్యానము. పరోక్షముగా వ్యంగ్యముగా చెప్పాను, ఎందుకంటే సకల లోకాన్ని సృష్టించే పరమాత్మ పరోక్ష ప్రియుడు.

Sunday, March 10, 2013

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఏడవ అధ్యాయం

నారద ఉవాచ
ఇత్థం పురఞ్జనం సధ్ర్యగ్వశమానీయ విభ్రమైః
పురఞ్జనీ మహారాజ రేమే రమయతీ పతిమ్

ఆ ప్రియురాలు అలుక పేరుతో ప్రియుణ్ణి వశం చేసుకుంది. ఇలా భర్తను రమింపచేస్తూ తాను కూడా ఆనందించింది

స రాజా మహిషీం రాజన్సుస్నాతాం రుచిరాననామ్
కృతస్వస్త్యయనాం తృప్తామభ్యనన్దదుపాగతామ్

ప్రియురాలు ప్రసన్నురాలవడముతో రాజు కూడా అభినందించాడు.

తయోపగూఢః పరిరబ్ధకన్ధరో రహోऽనుమన్త్రైరపకృష్టచేతనః
న కాలరంహో బుబుధే దురత్యయం దివా నిశేతి ప్రమదాపరిగ్రహః

ఇలా ప్రియురాలితో కలిసి అన్ని రకముల భోగములు అనుభవించాడు. మెల్లగా చెవిలో చెప్పే మాటలతో మనసు ఆమె వశం చేసి ఉన్న జ్ఞ్యానము వదిలిపెట్టి ఎంత కాలము జరిగిందో తెలుసుకోలేకపోయాడు. దురత్యయమైన కాలమును మనం అందుకోలేము.

శయాన ఉన్నద్ధమదో మహామనా మహార్హతల్పే మహిషీభుజోపధిః
తామేవ వీరో మనుతే పరం యతస్తమోऽభిభూతో న నిజం పరం చ యత్

బాగా మదించినవాడై భోగాలను అనుభవించినవాడై భార్య యొక్క  భుజమును దిండుగా ఉంచుకొని "ఇంతకంటే నేను పొందవలసినది ఏదీ లేదు " అని అజ్ఞ్యానం బాగా ఆవరించి తానేమిటి ఇతరులేమిటీ ఏమి జరగాలి అని తెలియలేకుండా ఐపోయాడు.

తయైవం రమమాణస్య కామకశ్మలచేతసః
క్షణార్ధమివ రాజేన్ద్ర వ్యతిక్రాన్తం నవం వయః

ఆశ కోరిక అనేవాటితో మనసంతా మురికై ఒక అరక్షణములా తన వయసంతా కరిగిపోయింది.

తస్యామజనయత్పుత్రాన్పురఞ్జన్యాం పురఞ్జనః
శతాన్యేకాదశ విరాడాయుషోऽర్ధమథాత్యగాత్

ఇతనికీ ఆమెకూ పదకొండు వందల మంది పుత్రులు కలిగారు. (5 జ్ఞ్యానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు మనసు, ఒక్కో దానికి వంద ప్రవృత్తులు . అంటే బుద్ధితో జీవునికి ఇంత ఆలోచనలోస్తాయి) . ఈ సంతానముతో తన ఆయుష్షు సగం ఐపోయింది.

దుహితౄర్దశోత్తరశతం పితృమాతృయశస్కరీః
శీలౌదార్యగుణోపేతాః పౌరఞ్జన్యః ప్రజాపతే

నూటపది మంది కూతురులు , తండ్రికీ తల్లికీ కీర్తిని పెంచే కూతురులు, శీలము ఔదార్యమూ కలిగిన కుమార్తెలు కలిగారు.

స పఞ్చాలపతిః పుత్రాన్పితృవంశవివర్ధనాన్
దారైః సంయోజయామాస దుహితౄః సదృశైర్వరైః

ఇలా వారు పెద్దవారైన తరువాత పుత్రులకి తగిన అమ్మాయిలతో, కూతురులకు కూడా తగిన వరుళ్ళను చూసి పెళ్ళి చేసాడు.

పుత్రాణాం చాభవన్పుత్రా ఏకైకస్య శతం శతమ్
యైర్వై పౌరఞ్జనో వంశః పఞ్చాలేషు సమేధితః

రాజ్యం మొత్తం పుత్రులు పౌత్రులతో నిండిపోయింది.

తేషు తద్రిక్థహారేషు గృహకోశానుజీవిషు
నిరూఢేన మమత్వేన విషయేష్వన్వబధ్యత

ఎవరి భాగాలు వారు స్వీకరించారు. ఇళ్ళనీ ధనములనీ సేవకులనీ పంచుకున్నారు. పిల్లలు ఆస్తి గుంజుకున్నా మమకారముతో వాళ్ళేమి చేస్తున్నారో గుర్తించలేనంత అజ్ఞ్యానములో ఉన్నాడు.

ఈజే చ క్రతుభిర్ఘోరైర్దీక్షితః పశుమారకైః
దేవాన్పితౄన్భూతపతీన్నానాకామో యథా భవాన్

ఇవన్నీ సంపాధించడానికి కౄరమైన యజ్ఞ్యాలను చేసాడు. భూతములను హింసిస్తూ యజ్ఞ్యాలను చేసాడు. తాను ఎన్నో కోరుకుంటూ పశువులను బలి ఇస్తూ తనకు కావాలసిన కోరికలను తీర్చుకునేందుకు యజ్ఞ్యములు చేసాడు.

యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుమ్బాసక్తచేతసః
ఆససాద స వై కాలో యోऽప్రియః ప్రియయోషితామ్

ఇలా రాజ్యం పరిపాలించాడు యజ్ఞ్యములు చేసాడు పుత్రులకీ పౌత్రులకీ భాగం ఇచ్చాడు. అంతా నేనే, ఇంక నాకు దిగులేముంది అనుకుంటున్న దశలో నేను అనుకోవడానికి కూడా శక్తి లేని కాలము వచ్చింది. తమకు ప్రియురాలుగా ఉండేవారికి ఏది నచ్చదో అది వచ్చింది. యువతులకు నచ్చని వార్ధక్యం వచ్చింది.

చణ్డవేగ ఇతి ఖ్యాతో గన్ధర్వాధిపతిర్నృప
గన్ధర్వాస్తస్య బలినః షష్ట్యుత్తరశతత్రయమ్


చండవేగుడనే గంధర్వాధిపతి ఇతని రాజ్యాన్ని చూచాడు. ఇతనికి మూడు వందల ఆరు మంది, వారి భార్యలు ఇంకో మూడు వందల అరవై మంది (చండవేగుడంటే కాలం. కాలాన్ని సంవత్సరాలు గుర్తు. దానికి మూడు వందల అరవై మగవారు సైన్యం, వారి భార్యలు ఇంకో మూడు వందల అరవై అమంది. వీరిలో కొందరు తెల్లగా ఉన్నారు, కొందరు నల్లగా ఉన్నారు. అంటే మూడ్వందల అరవై పగళ్ళూ రాత్రులూ.)

గన్ధర్వ్యస్తాదృశీరస్య మైథున్యశ్చ సితాసితాః
పరివృత్త్యా విలుమ్పన్తి సర్వకామవినిర్మితామ్

వారి పత్నులు కూడా అలాంటి వారే. తెలుపు వారు నలుపు వారు. (రాత్రులూ పగళ్ళు) భ్రమణముతో అన్ని కోరికలూ తీరడానికి కావలసిన ఏర్పాటుతో ఈ ఏడువందల ఇరవై మందీ తిరుగుతూ తిరుగుతూ మోహింపచేస్తారు (ఒక్కో రోజు గడుస్తున్న కొద్దీ మన శరీరములో ఉన్న అన్ని శక్తులూ క్షీణిస్తూ ఉంటాయి). అది అన్ని కామనలనూ తీర్చుకోవడానికి సౌకర్యముగా నిర్మించబడిన నగరం.

తే చణ్డవేగానుచరాః పురఞ్జనపురం యదా
హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ప్రజాగరః

ఈ గంధర్వులు నగరాన్ని చుట్టుముట్టి నగరాన్ని హరించడానికి ఆకరమించడానికి వచ్చారు. వారి ప్రయత్నం వారు చేస్తూ ఉంటే ఆ నగరానికి ఉన్న నిత్యమూ మేలుకొని ఉన్న కాపలాదారుడు ఆ చండవేగుని అనుచరులను అరికట్టాడు. (ప్రాణము, ప్రాణము బలీయముగా ఉన్నంత వరకూ వ్యాధులు ఏమీ చేయలేవు)

స సప్తభిః శతైరేకో వింశత్యా చ శతం సమాః
పురఞ్జనపురాధ్యక్షో గన్ధర్వైర్యుయుధే బలీ

ఏడువందల ఇరవై ఒక్క మంది సైన్యముతో పోట్లాడాడు.  ఇరవై ఏడుతో - 5 తన్మాత్రలు 5 భూతములు 5 జ్ఞ్యానేంద్రియములూ 5 కర్మేంద్రియములూ అపాన వ్యాన ఉదాన సమానములూ బుద్ధి మనసు అహంకారము, ఇవన్నీ కలిపిన్ ఇరవై ఏడు. సప్తవింశతి) ఇరవై ఏడింటిని ముందు పెట్టుకుని ప్రాణం కోట్లాడింది. ప్రాణం ఈ సైన్యాన్ని పెట్టుకుని ఆ సైన్యముతో నూరు సంవత్సరాలు కోట్లాడింది. గంధర్వులంటే మాయావులు. కనపడకుండానే అన్ని పనులూ చేసేవారు.

క్షీయమాణే స్వసమ్బన్ధే ఏకస్మిన్బహుభిర్యుధా
చిన్తాం పరాం జగామార్తః సరాష్ట్రపురబాన్ధవః

ఇలా యుద్ధం చేస్తోన్న కొద్దీ తన బలం తగ్గిపోతోంది. వారు యుద్ధం చేస్తూ ప్రాణాన్ని ఏమి చేయకుండా తక్కిన వాటిని హింసిస్తున్నారు. చాలా మందితో యుద్ధము చేయడం వలన తనకు సంబంధించినవారంతా పోతూంటే పురంజనుడు (జీవుడు) చింతాక్రాంతుడయ్యాడు. శరీరమూ మనసూ ఇంద్రియమూ చిత్తమూ మొదలైనవన్నీ కలిసి ఏ నగరములో ఆనందాన్ని అనుభవించాడో

స ఏవ పుర్యాం మధుభుక్పఞ్చాలేషు స్వపార్షదైః
ఉపనీతం బలిం గృహ్ణన్స్త్రీజితో నావిదద్భయమ్

తన సేవకులు అందించిన సేవను ఇంతవరకూ స్వీకరించాడు. బుద్ధికి లొంగాడు. (బుద్ధిమంతుడు చిత్తానికి లొంగాలి, బుద్ధికి కాదు.  బుద్ధిలో ఉన్నది విచారాత్మకం మాత్రమే. అదా ఇదా అని పరిశీలించడమే బుద్ధి చేసే పని) అలా లొంగడం వలన రాబోయే భయాన్ని తెలుసుకోలేకపోయాడు

కాలస్య దుహితా కాచిత్త్రిలోకీం వరమిచ్ఛతీ
పర్యటన్తీ న బర్హిష్మన్ప్రత్యనన్దత కశ్చన

ఇంతలో కాలుని పుత్రిక జరా వచ్చింది. ఆమె తనకనుగుణమైన భర్తను సంపాదించాలని వెతుకుతున్నదీ. ఆ అమ్మాయిని ఎవరూ వరించలేదు (జరా అంటే ముసలితనం)

దౌర్భాగ్యేనాత్మనో లోకే విశ్రుతా దుర్భగేతి సా
యా తుష్టా రాజర్షయే తు వృతాదాత్పూరవే వరమ్

యయాతి కొడుకైన పూరువనే వాడు ఆమెను వరించాడు. అతనికి ఆమె వరమిచ్చింది.

కదాచిదటమానా సా బ్రహ్మలోకాన్మహీం గతమ్
వవ్రే బృహద్వ్రతం మాం తు జానతీ కామమోహితా

ఇలా అన్ని లోకాలు తిరుగుతూ నన్ను చూఇన్సింది. బృహద్వ్రతుడనైన నా (నారదున్ని) గురించి తెలుసుకుని నన్ను వరించడానికి వచ్చింది. నేను ఒప్పుకోలేదు. కోపమొచ్చి నన్ను శపించింది

మయి సంరభ్య విపుల మదాచ్ఛాపం సుదుఃసహమ్
స్థాతుమర్హసి నైకత్ర మద్యాచ్ఞావిముఖో మునే

నా మాట ఒప్పుకోలేదు కాబట్టి నీవు నిలకడగా ఒక చోట ఉండకుందువు గాక. అని శపించింది.

తతో విహతసఙ్కల్పా కన్యకా యవనేశ్వరమ్
మయోపదిష్టమాసాద్య వవ్రే నామ్నా భయం పతిమ్

శపించినా నేను ఆమెకు తగిన వరున్ని చూపాను. అతని పేరు భయం (మృత్యువు).

ఋషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిమ్
సఙ్కల్పస్త్వయి భూతానాం కృతః కిల న రిష్యతి

ఆమె అక్కడికి వెళ్ళింది. "నిన్ను నేను భర్తగా వరిస్తున్నాను" అని చెప్పింది

ద్వావిమావనుశోచన్తి బాలావసదవగ్రహౌ
యల్లోకశాస్త్రోపనతం న రాతి న తదిచ్ఛతి

వీరిద్దరూ బాలురు (అవివేకులు). పరిశుద్ధ జ్ఞ్యానం లేని వారు. "మనిద్దరం కలిస్తే ఇంక మనకు ఎదురు ఉండదు" అని చెప్పింది.

అథో భజస్వ మాం భద్ర భజన్తీం మే దయాం కురు
ఏతావాన్పౌరుషో ధర్మో యదార్తాననుకమ్పతే

"ఉత్తముడైన పురుషుడి ధర్మమే బాధ పడుతున్నవరిని దయ చూపుట" అని అడిగింది

కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వరః
చికీర్షుర్దేవగుహ్యం స సస్మితం తామభాషత

ఆమె మాట విని దేవతా రహస్యాన్ని కాపాడదలచి చిరునవ్వుతో ఇలా అన్నాడు. మనిద్దరం కలిసి పని చేయడం కుదరదు. ముందు నీవు తరువాత నేను వస్తాను

మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మసమాధినా
నాభినన్దతి లోకోऽయం త్వామభద్రామసమ్మతామ్

నీకు ఉత్తముడైన పతిని ఏర్పాటు చేసాను. నీవు అమంగళకరురాలవు. నిన్నెవరూ అభినందించరు

త్వమవ్యక్తగతిర్భుఙ్క్ష్వ లోకం కర్మవినిర్మితమ్
యా హి మే పృతనాయుక్తా ప్రజానాశం ప్రణేష్యసి

ఈ లోకమంతా నీవనుభవించు. నా సైన్యాన్ని (పగలూ రాత్రీ) నీకు ఇస్తాను. దానితో నీవు ప్రజలందరినీ నశింపచేస్తావు.

ప్రజ్వారోऽయం మమ భ్రాతా త్వం చ మే భగినీ భవ
చరామ్యుభాభ్యాం లోకేऽస్మిన్నవ్యక్తో భీమసైనికః

ప్రజ్వరుడనే నా తమ్ముడు ఉన్నాడు (పుట్టగానే రోగాలూ జరా మృత్యువూ వస్తాయి). వాడు నాకు సోదరుడూ నీవు సోదరివి. మన ముగ్గురమూ లోకాలను అనుభవిద్దాము. మీరు తోడుగా ఉంటే ఎవరికీ తెలియకుండా సిన్యముతో కలిసి లోకమంతా విహరిస్తూ ఉంటాను.

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధం ఇరవై ఆరవ అధ్యాయం

బృహదారణ్యకములో స్వప్నము గురించి విశేషముగా చెప్పబడింది. స్వప్నములో అన్ని రకాల సుఖ దుఃఖానుబూతి పొందుతాము. ఉత్తమమైన ఆనందాన్ని భయంకరమైన భయాన్ని పొందుతాము. మనకు ఆ అనుభూతి కలుగుతుంది. మనం చేసిన పాప పుణ్యాల తారతమ్యాలను బట్టి ఉంటుంది. ఇహలోకములో స్వర్గనరకాది లోకములో అనుభవించినా మిగిలిన వాటిని అనుభవించడానికి స్వప్నలోకం సృష్టించబడింది. ఇక్కడ వేట అంటే స్వప్నం. మృగాలంటే ఇంద్రియ ప్రవృత్తి. వాంచ అభిలాష కోరికా ఇవన్నీ మృగాలు.

నారద ఉవాచ
స ఏకదా మహేష్వాసో రథం పఞ్చాశ్వమాశుగమ్
ద్వీషం ద్విచక్రమేకాక్షం త్రివేణుం పఞ్చబన్ధురమ్

వేటకు వెళ్ళడానికి రథమెక్కాడు. ఐదు గుఱ్ఱాలతో కూడి వేగముగా వెళుతుందీ రథం. రథాన్ని ముందుకు లాగడానికి నొగలు (ద్వీషం) ఒకటి, రెండు చక్రాలు, ఒక ఇరుసు, వీటిని కలిపే మూడు వేణులు, దీన్ని కట్టేసే ఐదు బంధాలు
మహేష్వాసో  - గొప్ప ధనువు కలవాడు.  ధనువును వేదాంత పరిభాషలో ప్రణవమంటారు. జీవుడు ఏ అవస్థలో ఉన్నా ప్రణవార్థ మననం మాత్రం మరవకూడదు.
ఐదు గుఱ్ఱాలు ఐదు జ్ఞ్యానేంద్రియాలు. రథమంటే శరీరం. ఇది చాలా వేగముగా వెళుతుంది (ఆశుగం) కలలో.
ద్వీషం - అహంకార మమకారాలు.
రెండు చక్రాలు - పుణ్య  పాపాలు.
ఏకాక్షం - వాసన. ప్రధానమనే అక్షము కలది.
సత్వ రజ తమస్సు అనే మూడు వేనులు.
పఞ్చబన్ధురమ్ - పంచ కర్మేంద్రియాలు.

ఏకరశ్మ్యేకదమనమేకనీడం ద్వికూబరమ్
పఞ్చప్రహరణం సప్త వరూథం పఞ్చవిక్రమమ్

ఒకే పగ్గం. ఒకే సారధి. రధికుడు కూర్చునేది (నీడము), రెండు పక్కల కూబరాలు, కొట్టడానికి ఐదు రకాల ఆయుధాలు, ఏడు బంధములూ, ఐదు రకాలుగా ఇది బయలు దేరుతుంది
మనస్సు పగ్గము.
నియంత ఒకడే - సారాధి , బుద్ధి
నీడము హృదయము.
రెండు కూబరాలు - బీజమూ వాసన (సంస్కారము)
పఞ్చప్రహరణం -శబ్దాది పంచ విషయములు.
సప్త వరూథం- ఏడు ధాతువులు
పఞ్చవిక్రమమ్ - ఐదు విక్రమాలు. ఐదు తన్మాత్రలు

హైమోపస్కరమారుహ్య స్వర్ణవర్మాక్షయేషుధిః
ఏకాదశచమూనాథః పఞ్చప్రస్థమగాద్వనమ్

బంగారు తొడుగు ఉంది, ఎన్ని బాణములు కొట్టినా తరగని అమ్ములపొది ఉంది. పదకొండు మంది సైన్యాలను తీసుకుని ఐదు చోట్లకు బయలు దేరాడు.
రథానికి బంగారు తొడుగు. బంగారమంటే వ్యామోహం. చర్మం
స్వర్ణవర్మాక్షయేషుధిః - జీవుడు బాణము. దానికి నిలయం మనస్సు బుద్ధి అంతఃకరణం
పదకొండు మంది సైన్యం - ఏకాదశ ఇంద్రియములు

చచార మృగయాం తత్ర దృప్త ఆత్తేషుకార్ముకః
విహాయ జాయామతదర్హాం మృగవ్యసనలాలసః

బాణాన్ని ఎక్కుపెట్టి మదించి అరణ్యములో సంచరించాడు. భార్యను తీసుకుని వెళ్ళకుండా వేటకు వెళ్ళాడు. వదిలిపెట్టకూడని దానిని విడిచిపెట్టి వెళ్ళాడు - అతదర్హాం  జాయాం. మృగవ్యసనలాలసః - ఇంద్రియ విషయములను వెతుకుతూ వెళ్ళాడు.

ఆసురీం వృత్తిమాశ్రిత్య ఘోరాత్మా నిరనుగ్రహః
న్యహనన్నిశితైర్బాణైర్వనేషు వనగోచరాన్

ఎందుకు బుద్ధిని విడిచిపెట్టాడంటే అతని ప్రవృత్తి ఆసురీ ప్రవృత్తి. వేటకు వెళ్ళడమంటేనే ఆసురీ ప్రవృత్తి. వేటకు వేళ్ళాల్సివస్తే ఋష్యాశ్రమాలను విడిచిపెట్టాలి. వాటికి దూరముగా ఉండాలి. ఆశ్రమమంటే సాత్వికం. వేట అంటే తామసం. తీవ్రమైన మనసు గలవాడై మృగముల యందు దయ విడిచిపెట్టి తీక్షణమైన బాణములతో మృగాలను చంపాడు. అంటే ఇంద్రియములు అనుభవించాలనుకున్న విషయాలను వివేకం కోల్పోయి అనుభవించాడు. వనమంటే స్వప్నం. స్వప్నములో కనపడే ఇంద్రియార్థాలను ఆలోచించకుండా అనుభవించాడు.

తీర్థేషు ప్రతిదృష్టేషు రాజా మేధ్యాన్పశూన్వనే
యావదర్థమలం లుబ్ధో హన్యాదితి నియమ్యతే

వేటాడాలంటే శ్రాద్ధములలో (తీర్థేషు), ఎవరెవరు మాంస భోజనం చేయవచ్చని చెప్పారో అటువంటి వారి విషయములో (ప్రతిదృష్టేషు ), వాటికోసం రాజులు మాత్రమే వేటాడాలి. తినదగిన వాటినే వేటాడాలి. శ్రాద్ధార్థములనే వేటాడాలి. ఊరి పొలిమేరలో వేటాడకూడదు. అడవిలోనే వేటాడాలి. పవిత్రమైనదాన్ని తినదగినదాన్నీ, శ్రాద్ధ విషయములలోనే రాజు మాత్రమే ఎంత కావాలో అంత మాత్రమే వేటాడాలి. (ఇక్ష్వాకు వంశస్థుడైన వికుక్షి పదమూడు కుందేళ్ళను వేటాడి దారిలో ఒక దాన్ని తినేసాడు. ) వేటాడిన దాన్ని ఆశ ఉండి అనుభవించకూడదు.
పురంజనుడు వేటాడుతున్నాడు గానీ ఈ నియమాలని విడిచిపెట్టాడు
జీవుడు కూడా ఈ సంసారములోకి వచ్చి ఉన్న ఇంద్రియాలతో విషయాలని అనుభవించాలి. అనుభవించాలి అన్న కోరిక తప్పు కాదు. ఆశ తప్పు. (ఉదా: పదిహేను ముద్దలు మాత్రమే భోజనం చేయాలి. అది శరీరం నిలుపుకోవడానికి అవసరం. తినకూడనంత తినకూడని దాన్ని తినకూడని వేళలో తినడం వలన వాయువు ప్రకోపిస్తుంది)
ఇంద్రియార్థముల యందు ప్రవృత్తి నియమితముగా ఉండాలి. కావలసినన్ని మాత్రమే వేటగాడు (లుబ్ధో ) సంహరించాలి. మనం కూడా ఎంత అనుభవించడానికి యోగ్యమో అంత అనుభవించాలి, అంతే సంపాదించాలి. తనకు కావలసినదాని కంటే ఎక్కువ సంపాదించి దాచిపెట్టిన వాడు దొంగ. వేటగాడు కూడా ఎక్కువ మృగాలు వేటాడితే శిక్షార్హుడు.

య ఏవం కర్మ నియతం విద్వాన్కుర్వీత మానవః
కర్మణా తేన రాజేన్ద్ర జ్ఞానేన న స లిప్యతే

తెలిసిన వాడు విధించిన పనిని నియమబద్ధముగా ఆచరించాలి. శాస్త్ర విహితమైన కర్మను శాస్త్ర విహితమైన పద్దతిలో ఆచరించినప్పుడు, అలా ఆచరించినందువలన కలిగే ఫలితం వాడికి అంటదు. జ్ఞ్యాని అయిన వాడికి కర్మల ఫలముతో కలిగిన సంబంధముండదు.

అన్యథా కర్మ కుర్వాణో మానారూఢో నిబధ్యతే
గుణప్రవాహపతితో నష్టప్రజ్ఞో వ్రజత్యధః

శాస్త్రాన్ని విధిని విడిచిపెట్టి అహంకార మమకారాలు వంటబట్టి యధేచ్చగా వ్యవహరిస్తే సంసారములో బంధించబడతాడు. అలాంటి వాడు సత్వ రజో తమో గుణాలలో, ఆ ప్రవాహాలలో (సంసారములో) పడి బుద్ధి కాస్తా నశించి నరకలోకములో పడతాడు.

తత్ర నిర్భిన్నగాత్రాణాం చిత్రవాజైః శిలీముఖైః
విప్లవోऽభూద్దుఃఖితానాం దుఃసహః కరుణాత్మనామ్

ఇలా అడవిలో ఈ మహారాజు వేటాడుతూ ఉన్నాడు. బాణముల దెబ్బకు మృగముల చర్మములు లేచి ప్రాణములు పోతున్నాయి. విచిత్రమైన కొనలు గల బాణములతో ఏడ్చేవారి మానసిక క్షోభతో దయగలవారికి ఇలాంటి దృశ్యము సహించలేరు. మృగాలను వధించుటా అంటే విషయములను ఇంద్రియములతో అనుభవించుట. నియమం ప్రకారం అనుభవించుట ఆమోదయోగ్యమే.
అలా బాణాలతో కొడుతూ ఉంటే కరుణార్థ హృదయులైన చుట్టుపక్కల ఉన్న మునుల మనసు క్షోభించింది. అజ్ఞ్యానులు విషవ్యామోహపరాయణులైతే అది చూసిన జ్ఞ్యానులు తమలో తాము బాధ పడి వారి మీద జాలి పడతారు

శశాన్వరాహాన్మహిషాన్గవయాన్రురుశల్యకాన్
మేధ్యానన్యాంశ్చ వివిధాన్వినిఘ్నన్శ్రమమధ్యగాత్

కుందేళ్ళూ వరాహములూ మొదలైన రక రకాల మృగాలను సంహరిస్తూ అలసిపోయి,

తతః క్షుత్తృట్పరిశ్రాన్తో నివృత్తో గృహమేయివాన్
కృతస్నానోచితాహారః సంవివేశ గతక్లమః

ఆకలీ దప్పీ అవ్వగానే ఇళ్ళు గుర్తు వచ్చింది. కలలో కూడా అనుకున్న దాన్ని అనుభవించిన తరువాత మెలుకువ వస్తుంది. కథా పరముగా ఇంటికి వచ్చాడు. బుద్ధి లేకుండా పని చేసుకున్నా అని ఆత్మ విమర్శ చేసుకోవడం ఇంటికి రావడం, ఆకలీ దప్పులు వేయడం. స్నానం చేసి ఆహారం చేసి అలసట తీరిన తరువాత

ఆత్మానమర్హయాం చక్రే ధూపాలేపస్రగాదిభిః
సాధ్వలఙ్కృతసర్వాఙ్గో మహిష్యామాదధే మనః

శరీరానికి అగరు గంధమూ మొదలైన సుగంధ ద్రవ్యాలు అలంకరించుకుని, మనసు భార్య యందు లగ్నం చేసాడు (బుద్ధి కావాలీ అని కోరుకున్నాడు)

తృప్తో హృష్టః సుదృప్తశ్చ కన్దర్పాకృష్టమానసః
న వ్యచష్ట వరారోహాం గృహిణీం గృహమేధినీమ్

ఆకలీ దప్పీ అలసట మూడూ పోయాయి. తృప్తి కలిగిన వెటనే దృప్తి వచ్చింది ( మదం). మదావిష్ఠమనస్కుడై కామోద్దీపనం కలిగి ప్రియురాలు ఉన్న అంతఃపురానికి వెళ్ళాడు. బుద్ధి లేకుండా చాలా పనులు చేసానని తెలుసుకుని బుద్ధినీ వివేకాన్నీ పొందడానికి ప్రయత్నం చేసాడు. బుద్ధిని దొరికించుకోవాలంటే దానికంటే ముందు ఉన్న ప్రవృత్తులని మంచి చేసుకోవాలి (చిత్తం అంతఃకరణం)

అన్తఃపురస్త్రియోऽపృచ్ఛద్విమనా ఇవ వేదిషత్
అపి వః కుశలం రామాః సేశ్వరీణాం యథా పురా

చిన్న బోయిన మనసు కలవాడై అంతఃపుర స్త్రీలను అడిగాడు. మీరంతా బాగున్నారా? మీ యజమానురాలు బాగున్నదా?

న తథైతర్హి రోచన్తే గృహేషు గృహసమ్పదః
యది న స్యాద్గృహే మాతా పత్నీ వా పతిదేవతా
వ్యఙ్గే రథ ఇవ ప్రాజ్ఞః కో నామాసీత దీనవత్

మీరు బాగుండాలన్నా మేము బాగుండాలన్నా ఇల్లు బాగుండాలన్నా గృహిణి బాగుండాలి. లేకుంటే ఇవన్నీ ఉన్నా లేనట్లే లెక్క. తల్లిగానీ భార్యగానీ లేని ఇళ్ళు చక్రములు లేని రథములా ఉంటుంది.

క్వ వర్తతే సా లలనా మజ్జన్తం వ్యసనార్ణవే
యా మాముద్ధరతే ప్రజ్ఞాం దీపయన్తీ పదే పదే

ఇంతకూ నా ప్రియురాలు ఎక్కడ ఉంది. నేను కష్టములో ఉన్నాను. బాధిస్తున్న నన్ను నా బాధ నుండి ప్రతీ క్షణం తొలగించే ఆమె ఎక్కడుంది

రామా ఊచుః
నరనాథ న జానీమస్త్వత్ప్రియా యద్వ్యవస్యతి
భూతలే నిరవస్తారే శయానాం పశ్య శత్రుహన్

నీ ప్రియురాలు ఎక్కడుందో తెలుసు కానీ ఏమి చేయాలనుకుంటోందో తెలియదు. ఆమె ఇప్పుడు కటిక నేల మీద పడుకుని ఉంది (నిరవస్తారే ). ఏమాత్రం ఆస్తవం లేని భూమి మీద పడుకుని ఉన్నది.

నారద ఉవాచ
పురఞ్జనః స్వమహిషీం నిరీక్ష్యావధుతాం భువి
తత్సఙ్గోన్మథితజ్ఞానో వైక్లవ్యం పరమం యయౌ

ఒక సారి బుద్ధిని విడిచిపెడితే మళ్ళీ సంపాదించడానికి చాలా కష్టపడాలి. మన బుద్ధి కూడా మనం అది చెప్పినట్లు వింటే అది మన దగ్గరకు వస్తుంది. చీతమూ మనసునే లెక్కిస్తే  బుద్ధి దూరముగా పోతుంది. తన ప్రియురాలైనా తాను  కోరినప్పుడు దగ్గరకు రాలేదు. అతని మనసు కలతచెంది

సాన్త్వయన్శ్లక్ష్ణయా వాచా హృదయేన విదూయతా
ప్రేయస్యాః స్నేహసంరమ్భ లిఙ్గమాత్మని నాభ్యగాత్

ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. నిరంతరం ప్రేమించే ప్రియురాలు కోపించడానికి గల కారణమేమిటని ఓదార్చడములో నేర్పరి తనమున్న వాడైన ప్రియుడు ఓదార్చాడు.

అనునిన్యేऽథ శనకైర్వీరోऽనునయకోవిదః
పస్పర్శ పాదయుగలమాహ చోత్సఙ్గలాలితామ్

ఆమె రెండు కాళ్ళూ పట్టుకున్నాడు. ఆమెను ఒడిలోకి తీసుకున్నాడు.

పురఞ్జన ఉవాచ
నూనం త్వకృతపుణ్యాస్తే భృత్యా యేష్వీశ్వరాః శుభే
కృతాగఃస్వాత్మసాత్కృత్వా శిక్షాదణ్డం న యుఞ్జతే

నిజముగా నీవు యజమానురాలివీ నేను భృత్యున్నీ ఐతే, నేను తప్పు చేసినట్లైతే నీవు అలా భావిస్తే నీవు నన్ను దండించాలి. లేకుంటే ప్రజల చేత దండించబడని వారు నరకానికి పోతారు. ఎవరికైతే దండము విధించరో వారు అదృష్టవంతులు కారు

పరమోऽనుగ్రహో దణ్డో భృత్యేషు ప్రభుణార్పితః
బాలో న వేద తత్తన్వి బన్ధుకృత్యమమర్షణః

యజమాని సేవకున్ని దండించడమంటే దయ చూపడమే (బందుకృత్యం). జ్ఞ్యానము లేని వారికి ఆ విషయం తెలియదు.

సా త్వం ముఖం సుదతి సుభ్ర్వనురాగభార వ్రీడావిలమ్బవిలసద్ధసితావలోకమ్
నీలాలకాలిభిరుపస్కృతమున్నసం నః స్వానాం ప్రదర్శయ మనస్విని వల్గువాక్యమ్

నేలమీద ముసుగు వేసి పడుకున్న నీవు నాకు మధురముగా మాట్లాడే మంచి వాక్యములతో నీ ముఖమైనా చూపించు.

తస్మిన్దధే దమమహం తవ వీరపత్ని యోऽన్యత్ర భూసురకులాత్కృతకిల్బిషస్తమ్
పశ్యే న వీతభయమున్ముదితం త్రిలోక్యామన్యత్ర వై మురరిపోరితరత్ర దాసాత్

నీవిలా కోపించి ఉన్నావంటే తప్పకుండా ఎవరో తప్పు చేసే ఉంటారు. ఒక చిన్న మినహాయింపు. బ్రాహ్మణోత్తములూ భగవంతుని భక్తులూ తప్ప ఇంకెవరినైన శిక్షిస్తాను. ప్రపంచమంతా భయపడేదీ భగవంతుని భక్తులకు. వారు శాపమిచ్చినా వరమిచ్చినా తిరుగులేదు.

వక్త్రం న తే వితిలకం మలినం విహర్షం సంరమ్భభీమమవిమృష్టమపేతరాగమ్
పశ్యే స్తనావపి శుచోపహతౌ సుజాతౌ బిమ్బాధరం విగతకుఙ్కుమపఙ్కరాగమ్

బాగా ఏడ్వడం వలన ముఖము మీద బొట్టు లేదు. ముఖానికి అందం కలిగించేది తిలకం. నీ ముఖము మురికి అంటి కోపముతో భయంకరముగా ఉంది.

తన్మే ప్రసీద సుహృదః కృతకిల్బిషస్య స్వైరం గతస్య మృగయాం వ్యసనాతురస్య
కా దేవరం వశగతం కుసుమాస్త్రవేగ విస్రస్తపౌంస్నముశతీ న భజేత కృత్యే

నీవు ప్రసన్నురాలవు కావాలి. వ్యసనముతో బాధపడుతూ నిన్ను విడిచి వేటకు వెళ్ళాను. అంత మాత్రముతో వ్యసన బానిసనైన వాడిని లోకములో ఏ ప్రియురాలైనా ఉపేక్షిస్తుందా. అలా నీవు విడిచిపెడితే ఆ వ్యసనం నుంచి విముక్తుడవుతాడా?