Friday, January 11, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

 శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం తొమ్మిదవ అధ్యాయం

బ్రహ్మోవాచ
జ్ఞాతోऽసి మేऽద్య సుచిరాన్నను దేహభాజాం
న జ్ఞాయతే భగవతో గతిరిత్యవద్యమ్
నాన్యత్త్వదస్తి భగవన్నపి తన్న శుద్ధం
మాయాగుణవ్యతికరాద్యదురుర్విభాసి

స్వామీ తెలిసింది నీవెవరో. ఇంతకాలం లోకములో శరీరం గలవారెవరికి తెలియనటువంటి నీవు నాకు ఈనాడు తెలిశావు. నీకంటే వేరైన వస్తువు లోకములో లేదని తెలిసింది. ఏ వస్తువును చూచినా ఆయన లోపల లేని వస్తువు లేదు అని మనకు తెలిస్తే అది జ్ఞ్యానం. అది పరిశుద్దమైన వస్తువు. కానీ వస్తువులన్నింటిలోనూ ఉన్నది . బయట ఉన్న అన్ని వస్తువులలోనూ సత్వమూ రజస్సు తమస్సు అని మూడు గుణములు ఉంటాయి. ఈ మూడు గుణములు గల ప్రకృతిని మార్చి తాను అనేక గుణములతో భాసిస్తూ ఉంటాడు సర్వేశ్వరుడు . కానీ అటువంటివాడు మనకు విశ్వములో అంతటా కనిపించేవాడు తన రూపంతో తాను భాసించినపుడు, తాను ఏ విధమైన గుణముల యొక్క సంపర్కం లేకుండా తాను పరిశుద్దమైన జ్ఞ్యాన స్వరూపుడై ఆనందస్వరూపుడై ఉంటాడు. అట్టివాడే మనని అనుగ్రహించడానికి అవతారములు దాలుస్తాడు. అట్టి అవతారములన్నింటికీ బీజమైన అవతారం ఆ మొట్టమొదట సముద్రములో పండుకొనిన అవతారం. ఆయన నాభి పద్మము నుండి నేను వచ్చాను. అందుచే స్వామీ నీ యొక్క రూపాన్ని నేను దర్శిస్తున్నాను, అందుచే నేను నీకు నమస్కారం చేస్తున్నాను. లోకములన్నిటికీ క్షేమం కలిగించే వాడా అటువంటి నీకు నంస్కరించుచున్నాను.

రూపం యదేతదవబోధరసోదయేన
శశ్వన్నివృత్తతమసః సదనుగ్రహాయ
ఆదౌ గృహీతమవతారశతైకబీజం
యన్నాభిపద్మభవనాదహమావిరాసమ్



నాతః పరం పరమ యద్భవతః స్వరూపమ్
ఆనన్దమాత్రమవికల్పమవిద్ధవర్చః
పశ్యామి విశ్వసృజమేకమవిశ్వమాత్మన్
భూతేన్ద్రియాత్మకమదస్త ఉపాశ్రితోऽస్మి

తద్వా ఇదం భువనమఙ్గల మఙ్గలాయ
ధ్యానే స్మ నో దర్శితం త ఉపాసకానామ్
తస్మై నమో భగవతేऽనువిధేమ తుభ్యం
యోऽనాదృతో నరకభాగ్భిరసత్ప్రసఙ్గైః

యే తు త్వదీయచరణామ్బుజకోశగన్ధం
జిఘ్రన్తి కర్ణవివరైః శ్రుతివాతనీతమ్
భక్త్యా గృహీతచరణః పరయా చ తేషాం
నాపైషి నాథ హృదయామ్బురుహాత్స్వపుంసామ్

భగవత్ పాదారవింద గంధమును ఎవరితే చెవులతో వాసన చూస్తారో (అంటే ఆయన కథలను వింటారో). ఆయన గూర్చిన కథలను ఎవరు వింటారో, కథల ద్వారా వచ్చిన గాలి (శ్రుతివాతనీతమ్) శ్రుతులనే వాటి నుంచి పెద్దల సూక్తుల నుంచి చెవులలో పడి లోపలకు దిగి, దిగగానే దాన్ని మనసులోపల ధరిస్తే దాని వలన నీ మనసులోంచి భగవంతుడు కదలకుండా నిశ్చలంగా నిలిచి ఉంటాడు. ఎంతకాలం మన మన్సులో భగవంతుని గూర్చి, ఆయన పాదముల గూర్చీ భాసించదో భగవంతుని స్మరించమో అంతవరకూ మనం దబ్బు ఇల్లు వాకిలి పిల్లలూ అన్ని మనకు బాధలే కలిగిస్తాయి గానీ సుఖం కలిగించరు.

తావద్భయం ద్రవిణదేహసుహృన్నిమిత్తం
శోకః స్పృహా పరిభవో విపులశ్చ లోభః
తావన్మమేత్యసదవగ్రహ ఆర్తిమూలం
యావన్న తేऽఙ్ఘ్రిమభయం ప్రవృణీత లోకః

 ఏనాడు భగవంతుని పాదారవిందముల గూర్చిన స్మరణ మనలోపల కలుగుతుందో అప్పుడు  ద్రవిణదేహసుహృన్నిమిత్తం భయం ఉండదు. స్పృహా - ప్రతీ దాని మీదా కోరికలు బయలుదేరవు, పరిభవో - అవమానం జరగదు విపులశ్చ లోభః - విశాలమైన జ్ఞ్యానం కలుగుతుంది. తండ్రీ లోకంలో ఇంతగొప్పదైన భగవంతుని దగ్గరకు అందరూ ఎందుకు రారు. శొకము లేదు భయమూ లేదు ఆనందమూ కలుగుతుంది అని చెబుతున్నా వారికి భగవదనుగ్రహం లేదు. రజో గుణ తమో గుణాలు విజృంభించాయి. దాని వలన అహంకారమమకారములు వస్తాయి. దాని వలన నేనే స్వతంత్ర్యుడన్న బుద్ధి కలుగుతుంది, నాకు మరి వేరేది ఒకటి కారణం కాదు అనే బుద్ధి కలుగుతుంది.అట్లాంటి వారు సమస్తమైన అమంగళములను తగ్గించేటువంటి భగవంతుని పాదారవిందములయందు ఇంద్రియములు ప్రసరించని వారు అయి ఉంటారు .

దైవేన తే హతధియో భవతః ప్రసఙ్గాత్
సర్వాశుభోపశమనాద్విముఖేన్ద్రియా యే
కుర్వన్తి కామసుఖలేశలవాయ దీనా
లోభాభిభూతమనసోऽకుశలాని శశ్వత్

 వారు కేవలం లోకంలో కామ సుఖలేశ లవాయ. ఆ కామం వల్ల వచ్చే సుఖం లేశంలో లవం.కామం యొక్క లేశములో లవమైన భాగాన్ని అనుభవిస్తూ. దీని గురించి లోభపడుతూ, ఆ లోభపడటం చేత మనసంతా చెదిరి బాధలనుభవిస్తూ, లోకంలో సమస్త దుఃఖములనుభవిస్తూ తాను కోరికలు కోరుతూ సుఖముననుభవిస్తున్నాడే ఈ సుఖములనుభవించాలని తాను పడే శ్రమలో తాను పడే దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు. ఆ దు@ఖం తొలగాలంటే సర్వేశ్వరున్ని ఎల్లప్పుడూ ఒకే రూపముగా సుఖమైనటువంటి ఆనందస్వరూపుడైన భగవానుని తలంచరు వీరు.

క్షుత్తృట్త్రిధాతుభిరిమా ముహురర్ద్యమానాః
శీతోష్ణవాతవరషైరితరేతరాచ్చ
కామాగ్నినాచ్యుతరుషా చ సుదుర్భరేణ
సమ్పశ్యతో మన ఉరుక్రమ సీదతే మే

లోకంలో మనమెవ్వర్మూ భగంతుని విషయం తలచం. సుఖపడుతున్నామా? ఆకలి దాహం శరీరంలో ఉండే అనేక రోగములూ, లోకములో ఉండే కపవాత పైత్యములచే పీడించబడుతూ చలి వేడి గాలి వర్షం , వీటన్నిటి వలన బాధ పడుతూ కోరికలు లోపల పెనవేసుకుక్పోతూ, ఆ కోరికలు అగ్నిహోత్రములా దహించివేస్తూ ఉంటే దుర్భరమైన భరించరానికి శక్యము గానటువంటి పగలు పెట్టుకుని బాధలు పడుతున్నారు గానీ భగవంతుని పాద పద్మాలపై మనసు పెట్టరే? అది గాని ఉంటే న వాసుదేవ భక్తానా మశుభం విద్యతే క్వచ్చిత్ జన్మమృత్యు జరావ్యాధి భయం నైవోపజాయతే, నక్రోథో నచ మాత్సర్యం న లోభో నాశుభా మతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమం. భగవంతుని యందు మనసు నిలిపి, ఆయన లేని పదార్థం లేదని తెలుసుకొంటే లోకములో ఏ వస్తువును చూచినా అందులో భగవంతుడు ఉన్నట్లు దర్శనమైతే దేనిని ద్వేషితాము? భగవంతుని కంటే వేరైన రెండవ వస్తువు లేదు భగవంతునికి చెందని వస్తువు లేదు, అంతా నీదే అయినపుడు అంతా నీ శరీరంలో ఒక భాగమే అయినపుడు, శరీరంలో ఒక దేశమందు ప్రేమా ఒక దేశమందు ద్వేషముంటుందా.

యావత్పృథక్త్వమిదమాత్మన ఇన్ద్రియార్థ
మాయాబలం భగవతో జన ఈశ పశ్యేత్
తావన్న సంసృతిరసౌ ప్రతిసఙ్క్రమేత
వ్యర్థాపి దుఃఖనివహం వహతీ క్రియార్థా

విశ్వమంతా భగవానుని శరీరమని తెలుసుకుంటే అన్నిటియందు ద్వేషముండదు కోపముండదూ అసూయా ఉండదు. భగవత్ సంబంధం విశ్వంలో ప్రతీ పదార్థముకూ ఆత్మగా ఉందన్న భావన లేకపోవడం వలన ఈ భేధ భావన కలుగుతోంది. దాని వలన క్రోధమూ మాత్స్రయ్మూ అసూయాదులు కలుగుతున్నయి గనుక త్భగవత్ భావన కలగాలి భగవంతుడు సర్వత్రా ఉన్నాడని తెలియాలి. సర్వత్రా ఉన్న భగవంతునికి లోకమంతా శరీరం అని తెలియాలి. తాను భగవత్ దర్శనం చేసినవాడైన నాడు వాడికి ఏ లోటూ ఉండదు కదా. దీనిని తెలుసుకోకుండా పృధక్ భావం చేస్తూ ఉంటారు లోపల. దీని వలన మాయ అవిద్య అజ్ఞ్యానం (ఉన్నదాన్ని ఉన్నట్లు గుర్తించకపోవడం చేత) ఇంద్రియ ప్రియమే పురుషార్థమనుకొని, ఈ లోకమనే సంసారంలో గిర గిరా తిరుగుతున్నాడు.

అహ్న్యాపృతార్తకరణా నిశి నిఃశయానా
నానామనోరథధియా క్షణభగ్ననిద్రాః
దైవాహతార్థరచనా ఋషయోऽపి దేవ
యుష్మత్ప్రసఙ్గవిముఖా ఇహ సంసరన్తి

 పగలు పని ఎక్కువ, రాత్రి నిద్రెక్కువ. తీరుబాటు ఉండదు. పగలంతా వ్యాపారాలే (కంటికి పనీ చేతికి పని చెవికి పనీ మనసుకి పనీ మనిషికి పనీ) రాత్రి ఐతే అలసిపోయి నిద్రతోనూ, పడుకుని వెంటనే తెలివి వచ్చి నిద్రపట్టదు. లోకంలో తాము పొందవలసిందై పొందడానికి అవకాశం లేకుండా బాధపడుతూ ఉంటారు ఈ ప్రజలు. అటువంటి వారంతా బాధను కలిగించే దాని మీద మనసు లగ్నం చేస్తున్నరు గానీ బాధను తొలగించే దాని మీద మనసు లగ్నం చేయడంలేదే. భగవంతుని స్మరిస్తే ఆయన జ్ఞ్యానాంద స్వరూపుడు గనుక జ్ఞ్యానమూ ఆనందమూ కలుగుతుంది. లోకములో వస్తువులు రజస్సు తమస్సు గలవి గనక రాజస తామస వృత్తులు పెరుగుతాయి,దు@ఖం కలుగుతుంది.

త్వం భక్తియోగపరిభావితహృత్సరోజ
ఆస్సే శ్రుతేక్షితపథో నను నాథ పుంసామ్
యద్యద్ధియా త ఉరుగాయ విభావయన్తి
తత్తద్వపుః ప్రణయసే సదనుగ్రహాయ

ఎవరైతే మనసులో భగవంతున్నే భావన చేస్తూ, తన సర్వ వ్యాపారాలు తాను చేసుకుంటూ, ఇంద్రియములు వ్యాపారములు మానక్కర్లేదు చేతితో చేయవలసిన పనులు కంటితో చూడవలసినవి అన్నీ చూడవచ్చును, గనీ మనసులోపల వానిని నిలపండి. మనసులో వానిని నిలిపి, అన్నింటిలో వాడు ఉన్నాడని భావించి, చెవుల ద్వారా విన్నదానిని చూడటానికి ప్రయత్నిస్తే ఏ రూపంలో ధ్యానిస్తే, ఆ రూపములోనే ఆయన, సమస్త రూపములు గలవాడు గనుక, ఆయన రూపం కానిది లోకములో లేదు గనుక, ఆ రూపములో దర్శనమిస్తాడు.

నాతిప్రసీదతి తథోపచితోపచారైర్
ఆరాధితః సురగణైర్హృది బద్ధకామైః
యత్సర్వభూతదయయాసదలభ్యయైకో
నానాజనేష్వవహితః సుహృదన్తరాత్మా

భగవదారాధన చేయాలంటే మంచి పూలివ్వాలా పళ్ళివాలా? జలాలు పోయాలా, అభిషేకం చేయాలా, పన్నీరు అత్తరూ తెచ్చి పోయాలా? పాలూ పెరుగూ ఉండాలా? వీటన్నిన్నిటినీ ఎన్ని సమర్పించిన భగవంతుడు ఆరాధించబడటానికి సంతోషించడు. మరి దేని వలన సంతోషిస్తాడు? యత్సర్వభూతదయయా "నీకు కనిపించిన ఏ వస్తువును చూచిన ఆ వస్తువులోపల భగవంతుడు ఉన్నాడు అని, దానికి ఏ మాత్రం బాధ కలిగినా ఆపద కలిగినా, అయ్యో నేను తొలగించాలి అని, తన కొరకు ప్రయోజనం లేకుండా, స్వప్రయోజనమును కాంక్షించకుండా పరులకు కలిగిన దు@ఖమును తొలగించాలి అన్న కోరిక ఎవరికి ఉంటుందో వాడు దయ గల వాడు. దయ అవసర్మ్". సర్వ భూత దయ లేనిదే ఎన్ని పూలు వేసినా ఎన్ని పూజలు చేసినా భగవంతుడు సేవింపబడిన వాడు కాదు. అందరినీ ద్వేషిస్తూ ఉంటే భగవంతుని దయ లభించదు. ఆ సర్వభూత దయ పండాలి. అది పండడానికి జ్ఞ్యానం కావాలి. ఆ దయ దేవతార్చన లేనిదే రాదు. లోపల అంటుకున్న అహంకార మమకారాలు తొలగి, నాదీ - నేనూ అన్న భేధ భావం తొలగి, రజస్ తమస్సులు తొలగి, తన మనసుకంటి మాలిన్యములు తొలగి, తానెవడో తనకి తెలిసి, అన్నిటిలో భగవంతుడు ఉన్నాడన్న జ్ఞ్యానం కలగాలి. అది ఈ జన్మలో సంపాదించలేకపోవచ్చు. జన్మాంతరంలో సంపాదించవచ్చు. గీతలో నిర్వైర సర్వ భూతానాం అన్నట్లు, ఏ ప్రాణికి కష్టం కలిగినా మనసులో అయ్యో అన్న భావన కలిగితే భక్తి ఉన్నట్లు. చూచే ప్రతీ వాటిలో భగవంతుని చూడగలిగినపుడు ఆ భాగానికి దెబ్బతగిలితే తన స్వామికి శరీరానికి తగిలినట్లు భావిస్తే అది నిజమైన భక్తి

పుంసామతో వివిధకర్మభిరధ్వరాద్యైర్
దానేన చోగ్రతపసా పరిచర్యయా చ
ఆరాధనం భగవతస్తవ సత్క్రియార్థో
ధర్మోऽర్పితః కర్హిచిద్మ్రియతే న యత్ర

దీనికి ముందు మెట్లు యజ్ఞ్యాలు. ఎందుకు యజ్ఞ్యాలు? యాగాలు? మనలోపల అహంకార మమకారాలు తగ్గడానికి. యజ్ఞ్య్నానికి డబ్బు ఇవ్వాలంటే "ఆ డబ్బు నాది", "ఈ నెయ్యి నాది"స్థలం కావాలంటే " ఈ స్థలం నాది" యజ్య్నానికి రమ్మంటే "కాలం నాది". ఈ "నాది నాది" అనే దాన్ని కోసుకోవడమే దానం. దా అంటే ఖండించడం. ఇది నాది అనే భావాన్ని లోపల కోసుకోవాలి. ఏది మనం ఇస్తున్నామో అది వాడిది. వాడి వస్తువు వాడికే సమర్పిస్తున్నాము. ఈ భావం కలగడానికి మనలోపల అంటిన రజస్సు తమస్సులు తగ్గాలి, మాలిన్యాలు కడగబడాలి. మనసులో మాలిన్యాలు తొలగాలి. దానికి మనం ఆచరించ వలసిన కర్మలు ఆచరించాలి. యజ్ఞ్యమూ దానమూ తపస్సు, ఈ మూడూ చేయాలి. ఈ మూడూ చేస్తే, అప్పుడు మనసు పరిశుద్దమైతే, అప్పుడు పరిశుద్దమైన మనసులో ఆత్మ స్వరూపం దర్శనమైతే, అప్పుడు తపస్సు, వ్రతములూ చేస్తే అపుడు మరల ఏనాటికి చెదిరిపోని ఆత్మ వస్తువు దర్శనమవుతుంది. "నేనేవడనో తెలుస్తుంది". మనకి "నేను" తెలీదు. ఆ నేను అనేది భగవంతునికి పరతత్రమై ఉంది. లోపల ఒకడు ఉండి, అధికారిలాగా మనకి ప్రేరణ ఇస్తున్నాడు. అది తెలియక అహంకారంతో "నేను చేస్తున్నాను" అంటున్నాము. ఏ పని చేస్తున్నా, విశ్వమంతా భగవంతుని శరీరమైతే విశ్వాత్మకుడైన పరమాత్మ ఉంటే, ఆ పరమాత్మ యొక్క వ్యాపారాన్ని నీ చేత చేయించుకుంటూ ఉంటే "నేను చేస్తున్నా " అనడం ఎంత అవివేకం. ఈ రెండూ ఎప్పుడు తొలగుతాయో అపుడు మనలోపల ఉన్న "నేను" ఎవరో మనకు తెలుస్తుంది.
"నేను" తెలియడమంటే ఏమి చేస్తున్నా  అందరిలో ఉన్న ఆత్మలు అన్నీ ఏకరూపం అని అనుభవం అవుతుంది. అందుకే  భగవత్గీతలో సమదర్శినః అంటారు. అంటే కుక్క అనే శరీరంలో ఉన్న ఆత్మ, ఏనుగ అనే శరీరంలో ఉన్న ఆత్మా ఒక్కటే. కనిపించే భేధం శరీరమూ కర్మ వలన వచ్చిన భేధం. లోపల ఉన్న ఆత్మ జ్ఞ్యాన స్వరూపం అయినది ఒక్కటే. ఏకరూపమైంది. అట్టి ఏకరూపమైన ఆత్మ భగవంతునికి పరతంత్రమైనది.భగవంతునికి ఆధీనమై పని చేస్తుంది. "దీనికి కర్మానుగుణంగా దీనికి ఈ శరీరం వచ్చింది " అని జాలి కలగాలి గానీ ఏవగింపు కలగకూడదు. దానిలో ఉన్న వస్తువు తత్వం  తెలిస్తేనే గానీ ఏవగింపు కలగడం మానదు. దాని మీద ఏవగింపు తొలగాలంటే దానిలోపల ఏముందో తెలియాలి.

ఈ ఆత్మ స్వరూప జ్ఞ్యానం కలిగితే దాని ముందు కర్మాచరణం చేస్తే శాస్త్రంలో పెద్దలూ గురువుల చేత  " దేహ స్వరూపం ఇది, ఆత్మ స్వరూపం ఇది " అని తెలిస్తే , దానితో బాటు కర్మలాచరించి. ఆ ఆచరించేప్పుడు పరమాత్మ ఆయన పనిని ఆయనకొరకు చేయించుకుంటున్నాడన్న భావన కలిగి, కోరికలేకుండా కర్మలాచరిస్తే, దాని వలన మనసులో రజో గుణ తమో గుణాలు తగ్గి, అహంకారం తగ్గితే, నేను భగవంతునికి చెంది ఆయనకొరకు సర్వ వ్యాపారాలు చేస్తున్నా అన్న భావన కలిగితే, అప్పుడు భక్తి కలుగుతుంది. స్వామి నాకు అటువంటి భక్తిని కలిగించాడు.

శశ్వత్స్వరూపమహసైవ నిపీతభేద
మోహాయ బోధధిషణాయ నమః పరస్మై
విశ్వోద్భవస్థితిలయేషు నిమిత్తలీలా
రాసాయ తే నమ ఇదం చకృమేశ్వరాయ

సమస్త లోకాలకీ కారణమైన వాడు, (ఎప్పుడు కారణమైన దానిని ధ్యానించాలి. అన్నిటికీ మూలభావమేదో తెలుసుకుంటే గానీ భేధభావం నశించదు. కారణవస్తువుని తెలుసుకోవాలీ, సర్వాత్మకమైన పరమాత్మని తెలుసుకోవాలి. ఈ రెండూ తెలియాలి. ముందు ఎవడు ఉన్నాడు? ఇప్పుడున్న దానిలోపల ఏమున్నది, ఈ భేధమంతా నిజమైన భేధమా కాదా? ఇవన్నీ తెలియాలి) , ఈ భావం కలగడానికి ఎవరు కారణమో, ఎవరు సర్వ జగద్ కారణమో ఎవరు లోపల ఉండి నియమిస్తున్నాడో, అట్టి వానికి నమస్కారం. రామ కృష్ణ్యాది అవతారాలు ఉన్నాయి. ఈ కథలన్నీ చెప్పుకుంటూ ఉంటే ప్రాణం వదిలేప్పుడు ఆ కథలే జ్ఞ్యాపకం వస్తాయి. లోక కథల వలన మనసు పాడవుతుంది. శుద్ధ సత్వ స్వరూపుడైన భగవంతుడు మన మనసులోకి దిగుతాడు. ఆ రామ కృష్ణ రూపంలో చరిత్రలు మన మనసుకు అందుబాటులోనివి

యస్యావతారగుణకర్మవిడమ్బనాని
నామాని యేऽసువిగమే వివశా గృణన్తి
తేऽనైకజన్మశమలం సహసైవ హిత్వా
సంయాన్త్యపావృతామృతం తమజం ప్రపద్యే

ప్రాణం వదిలేప్పుడు మనకి ఆ నామములే జ్ఞ్యాపకం వస్తాయి. ఆ భగవానుని రూపాలని గుణాలని స్మరిస్తే మనలో ఉన్న పాపములు తొలగిపోతాయి. లోపల భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి. కృష్ణ కథని చదివి, కృష్ణ నామం జపించి, కృష్ణ పాదములయందు పుష్పం ఉంచి, రోజూ కొంతసేపు చేస్తే దాని వలన మన దు@ఖములూ మనలో పాపములూ తొలగిపోతాయి

యో వా అహం చ గిరిశశ్చ విభుః స్వయం చ
స్థిత్యుద్భవప్రలయహేతవ ఆత్మమూలమ్
భిత్త్వా త్రిపాద్వవృధ ఏక ఉరుప్రరోహస్
తస్మై నమో భగవతే భువనద్రుమాయ

నన్నూ రుద్రున్నీ సృష్టి లయములకు నియమించిం, నీవే స్వయంగా రక్షకత్వం వహించావు మాతో సమానుడిలాగ. మా కంటే పైగా వ్యాపించి ఉన్నావు నీవు. లోకమంతా ఒక చెట్టైతే ఆ చెట్టుకు మూలం నీవు.

లోకో వికర్మనిరతః కుశలే ప్రమత్తః
కర్మణ్యయం త్వదుదితే భవదర్చనే స్వే
యస్తావదస్య బలవానిహ జీవితాశాం
సద్యశ్ఛినత్త్యనిమిషాయ నమోऽస్తు తస్మై

లోకములో అందరికీ చేయకూడని పనులు చేయడంలో ఆసక్తి ఎక్కువ. చేయవలసిన పనిలో శ్రద్ధ తక్కువ ( కుశలే ప్రమత్తః)
అట్లాంటి భగవంతుని స్వరూపాన్ని తెలుసుకొని, భగవంతుని ఆరాధించి, భగవంతుని గుణములు తెలుసుకొని, భగవంతుని చరిత్రలు స్మరించి ఎవరైతే ఒక్కసారి భగవానుని మీద మనసు నిల్పుతారో, వారికి ఈ ప్రపంచం మీద మనసు లగ్నం కాదు.

యస్మాద్బిభేమ్యహమపి ద్విపరార్ధధిష్ణ్యమ్
అధ్యాసితః సకలలోకనమస్కృతం యత్
తేపే తపో బహుసవోऽవరురుత్సమానస్
తస్మై నమో భగవతేऽధిమఖాయ తుభ్యమ్

నిన్ను జ్ఞ్యాపకం ఉంచుకోగలనో లేనో అని నేను భయపడుతూ ఉంటాను. ఎక్కడ "నేనే సృష్టి కర్తను అని అహంకరిస్తానో" అని భయపడుతూ ఉంటాను. అట్లాంటి నన్ను భగవంతుడు ఎప్పుడూ అనుగ్రహించి నాలో అహంకారం కలగకుండా రక్షించు గాక. అటువంటి భగవానునికి నమస్కారం.

తిర్యఙ్మనుష్యవిబుధాదిషు జీవయోనిష్వ్
ఆత్మేచ్ఛయాత్మకృతసేతుపరీప్సయా యః
రేమే నిరస్తవిషయోऽప్యవరుద్ధదేహస్
తస్మై నమో భగవతే పురుషోత్తమాయ

వేదములు పోతే మనకోసమని చేప అయ్యి,  భూమి మునిగిపోతే వరాహమై, హిరణ్యకశిపుడు విజృంభిస్తే సిమ్హమై వచ్చాడు. కేవలం లోకములో అధర్మం పెరుగుతూ ఉంటే రాముడై వచ్చాడు, అధర్మంతో కూడిన రాజుల పేరుతో ఉన్న రాక్షసులని సంహరించడానికి కృష్ణుడిలా వచ్చాడు, దేవతలలో వామనుడిగా వచ్చాడు, ఇలా వచ్చి తాను ఏర్పరచిన ధర్మాన్ని నిలబెట్టడానికి వచ్చాడు.

యోऽవిద్యయానుపహతోऽపి దశార్ధవృత్త్యా
నిద్రామువాహ జఠరీకృతలోకయాత్రః
అన్తర్జలేऽహికశిపుస్పర్శానుకూలాం
భీమోర్మిమాలిని జనస్య సుఖం వివృణ్వన్

స్వామి నిద్రపోతున్నాడు పాల కడలిలో. పరమాత్మ నిద్రపోతాడా? ఒక మంచి మెత్తని పాంపు మీద పడుకున్నాడు. చుట్టూ నీరు, మధ్యలో పాము, పాము మీద స్వామి. ఇదీ మన జీవితం. విషయములు అనే అగాధమైన జలములో, విషయములలో ఉండే విషముతో కూడినటువంటిది పాము, అలాంటి విషపూరితమైన అంతఃకరణ ఇంద్రియప్రవృత్తులతో నిండి ఉన్న దానిలో భగవానుడు ఉన్నాడు అనే భావన మనలో కలగాలి. నేనే ఉన్నాను నేనే నడుపుతున్నాను అనే భావన ప్రమాదకరం.
ఇంద్రియములు పని చేయడం మానేస్తే నిద్ర. ఇంద్రియములు పని చేయడం మానేస్తే సుఖంగా ఉంటుందని మనకెప్పుడూ తెలుసు. కానీ దానికి ఎవరూ ఒప్పుకోరు. కనులు చూడకుండా చెఉవులు వినకుండా మనసు ఆలోచించకుండా ఉండాలి. మేలుకొని ఉండగా నిదురపోవాలి. చూస్తున్న కన్ను చూడకూడదు. మనసు కంటితో కలవకపోతే మనసు చూడదు. అలాగే మన మనసులో భగవంతుని నిలిపితే లోకంలో చూసేవి చూస్తున్నా లోపలకి  దిగవు, వింటున్నా లోపలకి దిగవు. ఇంద్రియములు వెనుకకు వెళ్ళి బయట విషయములను చూడకుండా ఉండుటే నిద్ర. ఇదే మానవునికి సుఖమూ.
స్వామి పాల కడలిలో ఆదిశేషుని మీద పడుకుని, మనల్ని కూడా అలాగే చేయమంటున్నాడు. అంటే? లోకములో ఉండి, ఆ విషయములను అనుభవిస్తూ, ఆ అనుభవిస్తున్న విషయములు అనుభవించేది పరమాత్మే అన్న భావనతో ఉంటే బాహ్య విషయములలో వచ్చిన దోషం మనకు అంటదు. అందుకే ఏ పని చేసిన భగవన్నామం చెప్పమని పెద్దలు చెబుతారు. ఇంట్లో ఏది వండుకున్నా దేవుని కోసం వండుకోమని అంటారు. దాని వలన అహంకార మమకారాలు తగ్గుతాయి. ఇది మరొకడిది అనుకోవడం వలననే అహంకార మమకారాలు తగ్గుతాయి.
అలా నిదురపొమ్మనే చెబుతున్నాడు. బాహ్యమైన విషయములను తాను చూస్తూ వింటూ, వాటి మీద ఇంద్రియములు ప్రవర్తించకుండా వెనక్కు మళ్ళాలి. ఇంద్రియాలు తమ తమ వ్యాపారలు మనడమే నిద్ర. అదే మనకు సుఖము. ఇంద్రియములు విషయ్ములను అనుభవిస్తూ అనిభవించకుండా లోపల ఉన్న భగవంతుని లోపల చేరి ఉండటం మన ఇంద్రియాలకు నేర్పు అని స్వామినకు పాఠం చెబుతున్నాడు.
 మనకు తమో గుణం ఆవహించినపుడు నిద్ర వస్తుంది. మనమందరం అవిద్య ఉపహతులం. అవిద్య అయిదురకాలుగా ఉంటుంది. 1.తామిశ్రము 2.అంధ తామిశ్రము 3. మోహము 4. మహా మోహమూ 5. తమస్సు అనే అయిదు అవిద్య యొక్క స్వరూపాలు. తామిశ్రమంటే చీకటి. చీకటి నాలుగు రకాలుగా ఉంటుంది. 1. వెలుగు లేకపోవుటా 2. వెలుగు ఉన్నా మనం చూడలేకపోవుట 3. వెలుగూ ఉండి మనమూ చూడగలిగీ వస్తువు లేకపోవుటా 4. ఈ మూడూ ఉన్నా చూడాలన్న సంకల్పం లేకపోవుట.
అంధ తామిశ్రం అంటే చీకటిలో చీకటి, కళ్ళూ లేవూ, సూర్యుడూ లేడు. మోహమంటే ఉన్న దాన్ని ఇంకోదానిగా చూచే స్వభావం. మహా మోహం అంటే వస్తువు వాస్తువుగా ఉన్న గుర్తిచకపోవడం. తామస్సు అంటే అజ్ఞ్యానం. పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిచకపోవుట. ఈ ఐదు రకములైన అవిద్యచే కొట్టబడకపోయినా స్వామి నిద్రపోయాడు
ఈ స్వామి పదునాలుగు లోకాలను కడుపులో దాచుకుని నిదురపోతున్నాడు. సకల జగద్రక్షణ చేస్తూనే నిద్రపోతున్నాడు. మనం నిద్రపోతే మన పని మనం చేయలేము. పరమాత్మ నిద్రూపోతూ గూడా పని చేయగలడు. ఎందుకంటే అక్కడ అవిద్య లేదు. మన దగ్గర అవిద్య ఉంది. ఈయన పడుకున్న పరుపు నీటిలో ఉంది. స్వామికి ఎలాంటి స్పర్శ కావాలంటే అలాంటి స్పర్శ ఇచ్చే పరుపు అయిన ఆదిశేషువు. తెల్లగా చల్లగా మెత్తగా ఎత్తుగా విశాలంగా ఉండే పరుపు అది (అశి కశిపు). ఆయన పడుకున్నది సముద్రములో.
లోకములో మానవుల నిద్రాసుఖం ఇలా ఉంటుందని బోధిస్తున్నట్లుగా పడుకున్నాడు. నిరంతర్మ్ కదిలే స్వభావం గల సర్పం పరుపు, ఉవ్వెత్తున ఎగిసిపడే అలల మధ్య పడుకున్నాడు. మానవుల నిద్ర ఎలాంటి స్వరూపంలో ఉంటుందో మనకు చెబుతున్నట్లుగా పడుకున్నాడు.


యన్నాభిపద్మభవనాదహమాసమీడ్య
లోకత్రయోపకరణో యదనుగ్రహేణ
తస్మై నమస్త ఉదరస్థభవాయ యోగ
నిద్రావసానవికసన్నలినేక్షణాయ


నీ నాభిపద్మమనే మహా పద్మం నుండి నేను పుట్టాను. మూడు లోకాలను సృష్టించడానికి పనికి వచ్చే  నేను నీ అనుగ్రహంతో ఆవిర్భవించాను. సకల ప్రపంచమునూ కడుపులో దాచుకున్న, యోగ నిదుర పూర్తి అయిన తరువాత, అపుడే విచ్చుకుంటున్నా పద్మముల వంటి కనులు గలవాడి వైన నీకు నమస్కారము.
అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను

సోऽయం సమస్తజగతాం సుహృదేక ఆత్మా
సత్త్వేన యన్మృడయతే భగవాన్భగేన
తేనైవ మే దృశమనుస్పృశతాద్యథాహం
స్రక్ష్యామి పూర్వవదిదం ప్రణతప్రియోऽసౌ

లోకంలో ఉన్న కదిలే ప్రతీ వస్తువుకీ, మారే ప్రతీ వస్తువుకీ, శరీరములో ఉన్న ప్రతీ ప్రాణికీ, ఆయనొక్కడే సుహృత్. సర్వలోక సుహృత్ ఆయనే. మన మేలు కోరే వారు ఇంకెవరూ లేరు. అన్ని ఆత్మలకూ ఆత్మ ఆయన. లోపల ఉండి నియమించే వాడు ఆయన. అట్టి ఆ భగవంతుని చూచి, ఆ దర్శనం చేత మనలో ఉండే మాలిన్యాలన్నీ తొలగితే ఆ స్వామి మనకు ప్రీతి పాత్రుడైతే మనని ఆయన ప్రేమిస్తాడు
సుహృత్ - చక్కని హృదయమును ఇచ్చేవాడు, చక్కని హృదయములో చక్కని హృదయముగా ఉండేవాడు. ఇటువంటి సుహృత్తులు చాలా మంది ఉండరు. ఒక్కడే ఉంటాడు. ఆరుగుణములు (భగము) కలవాడు అయిన నీవు భగ శబ్దవాక్యమైన ఐశ్వర్యంతో, సహజమైన సత్వముతో మొత్తం ప్రపంచాన్ని వ్యాపింపచేస్తున్నావు. ఈ సకల చరాచర జగత్తును ఏ చక్కని దృష్టితో చూసి వృద్ధిపొందిస్తున్నారో, ఆ చూపు నన్ను కూడా తాకనీ. ప్రణత ప్రియుడివి నీవు - ఆశ్రయించినవారి యెడల ప్రీతి కలవాడవు. ప్రణత అర్తి అర్థ ప్రదుడు అని కంచి వరదరాజ స్వామికి పేరు. అటువంటి నీ చూపు నన్ను తాకితే నేను సృష్టి చేయగలను

ఏష ప్రపన్నవరదో రమయాత్మశక్త్యా
యద్యత్కరిష్యతి గృహీతగుణావతారః
తస్మిన్స్వవిక్రమమిదం సృజతోऽపి చేతో
యుఞ్జీత కర్మశమలం చ యథా విజహ్యామ్

నీ ఆత్మ శక్తి అయిన తల్లి లక్ష్మితోటి  అన్ని పనులూ చేస్తున్నావు. ఒక్కొక్క గుణం తీసుకుని ఆ గుణముతో పని చేస్తున్నావు . ప్రసన్నమైన ముఖ మండలం దర్శనమైతే , లక్షీ దేవి అనుసరించి వస్తే, లోకములో అనేక రూపములు కలిగి మనని రక్షించడానికి అనేక రూపములో వస్తున్నాడు. స్వామి నాకు మకరందమైన ఆయన వాక్కుని నాకు వినిపిస్తూ నా దుఃఖాన్ని తొలగించుగాక. ఆశ్రయించిన వారికి వరములు ఇచ్చేవాడివి నీవు. నీ విక్రమముతో (ప్రభావముతో),  నీ మహిమతో, నేను సృష్టిస్తూ ఉంటే, "నేనే సృష్టిస్తున్నాను" అన్న అహంకారం నన్ను తాకకుండా ఉండేట్టు చేయి. అందుకు నీ దృష్టి కావాలి. ఇంత చేస్తూ ఉన్నా నా చిత్తం అక్కడ కాకుండా, నీ యందే లగ్నమవ్వాలి. ఈ సృష్టి అనే కర్మ చేస్తున్నందువలన సంసారములో ఉన్న నాకు మురికి అంటకుండా ఉండాలి. కర్మలని ఆచరించడం వలన ఎలా నేను తొలగించుకుంటానో అలా అనుగ్రహించు

నాభిహ్రదాదిహ సతోऽమ్భసి యస్య పుంసో
విజ్ఞానశక్తిరహమాసమనన్తశక్తేః
రూపం విచిత్రమిదమస్య వివృణ్వతో మే
మా రీరిషీష్ట నిగమస్య గిరాం విసర్గః

నీ నభి అనే సరస్సు నుండి నేను సృజించబడ్డాను. విజ్ఞ్యాన శక్తిగా నేను ఆవిర్భవించాను. నీ అనంతశక్తిలో ఒకటిగా నేను వచ్చాను. నీవు నీ నాభి పద్మం నుండి నన్ను ఎందుకు సృష్టించావో ప్రపంచం యొక్క విశిష్ట రూపాన్ని, సకల చరాచర జగత్తుని ఏర్పరుస్తున్న నాకు, వేద వాక్కుల విశిష్టమైన జ్ఞ్యానం నశించకుండుగాక. జగత్తు యొక్క సృష్టి చేస్తున్న నేను ఆ పనిలో పడి వేదాన్ని మరచిపోకూడదు. నా మనసు నీలోనే ఉండాలి. అహంకారం తాకకూడదు.

సోऽసావదభ్రకరుణో భగవాన్వివృద్ధ
ప్రేమస్మితేన నయనామ్బురుహం విజృమ్భన్
ఉత్థాయ విశ్వవిజయాయ చ నో విషాదం
మాధ్వ్యా గిరాపనయతాత్పురుషః పురాణః

అమోఘమైన గొప్ప దయగల మాహానుభావుడవు నీవు. పెరిగిన ప్రేమతో కలిగిన చిరునవ్వుతో నన్ను చూడాలి. ప్రపంచాన్ని సృష్టించాలి కాబట్టి, ఈ పనికోసం నీవు లేచి, నా విషాదాన్ని తేనెలొలికే నీ మాటలతో తొలగించు. నీవు పురాణ పురుషుడివి (అందరికన్న ముందు ఉన్నవాడివి).

మైత్రేయ ఉవాచ
స్వసమ్భవం నిశామ్యైవం తపోవిద్యాసమాధిభిః
యావన్మనోవచః స్తుత్వా విరరామ స ఖిన్నవత్

ఇలా స్తోత్రం చేసి అలసిపోయిన వాడిలాగ ఆగిపోయాడు. తన పుట్టుకను పరమాత్మకు ఆవిష్కరించాడు. పరమాత్మ ప్రసాదించిన తపసు విద్యా సమాధులతో తన మనసు వాక్కు ఎంత దూరం వెళ్ళగలదో అంతవరకూ వెళ్ళి (అందినంతవరకూ స్తోత్రం చేసి)  స్తోత్రం చేసి అలసిపోయినవాడిలాగ

అథాభిప్రేతమన్వీక్ష్య బ్రహ్మణో మధుసూదనః
విషణ్ణచేతసం తేన కల్పవ్యతికరామ్భసా

బ్రహ్మ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని, మధుసూదనుడు (మధుకైటబులను సంహరించినవాడు. బ్రహ్మకు ప్రసాదించిన వేదములను అపహరించిన రాక్షసుడు మధువు, వాడిని హయగ్రీవావతారములో సంహరించాడు)
ఈ స్తోత్రమంతా చేసి బడలిపోయి "స్వామిని నేను స్తోత్రం చేయగలనా" అని చాలా దిగులుపడి,

లోకసంస్థానవిజ్ఞాన ఆత్మనః పరిఖిద్యతః
తమాహాగాధయా వాచా కశ్మలం శమయన్నివ

ప్రపంచమును సృష్టించడానికి కావలసిన విజ్ఞ్యానం నాకెలా కలుగుతుంది అని పరితపిస్తున్న బ్రహ్మగారితో ఆయన యొక్క బాధను తొలగిస్తున్నట్లుగా గంభీరమైన వాకుతో ఇలా అన్నాడు


శ్రీభగవానువాచ
మా వేదగర్భ గాస్తన్ద్రీం సర్గ ఉద్యమమావహ
తన్మయాపాదితం హ్యగ్రే యన్మాం ప్రార్థయతే భవాన్

ఓ వేద గర్భా, నీవు విషాదాన్ని పొందకు, అలసటనీ సోమరితనాన్ని పొందకు. సృష్టి యందు ప్రయత్నం మొదలుపెట్టు. నీకేమేమి కావాలని ప్రార్థిస్తున్నావో, అవి అన్నీ నీకు ముందే ఇచ్చాను.
బడలిక చెందకు, సృష్టికి ఉపక్రమించు. ఇవాళా నీవు కొత్తగా సృష్టించక్కర్లేదు. నేను ముందే అండ సృష్టి చేసాను. వాటిని విడి విడిగా చేయి.

భూయస్త్వం తప ఆతిష్ఠ విద్యాం చైవ మదాశ్రయామ్
తాభ్యామన్తర్హృది బ్రహ్మన్లోకాన్ద్రక్ష్యస్యపావృతాన్

ఇచ్చినా, ఇచ్చినట్లు తెలియాలంటే మళ్ళీ తపసు చేయి. నన్ను గూర్చి విద్యను ఉపాసించు, నన్ను దర్శిస్తావు. లోకాలనీ నీకు దర్శనమవుతాయి.తపస్సు చేసి నీవు విద్యనూ జ్ఞ్యానమునూ సంపాదిస్తే ఈ తపో విద్యతో, నాలో ఉన్న అన్ని లోకములనూ చూడగలవు.

తత ఆత్మని లోకే చ భక్తియుక్తః సమాహితః
ద్రష్టాసి మాం తతం బ్రహ్మన్మయి లోకాంస్త్వమాత్మనః

అప్పుడు నా యందు, నాలోని లోకముల యందు భక్తి కలిగి, సావధానంతో (సమాహితః) ఉంటే, నాలో విస్తరించబడి ఉన్న జగత్తునూ, నన్నూ, చూస్తావు. తపసుతో నన్నూ, విద్యతో నాలోకాలను చూస్తావు.
అపుడు నీవు చేయవలసిన పని ఏమిటంటే, లోకాలను సృష్టిస్తున్నావు కదా అని నన్ను మరచిపోకు. నన్ను ధ్యానిస్తున్నావు గనుక లోకాన్ని మరచిపోకు. నీకు ఆత్మ అయి ఉన్న నా యందు, ఇవతల నీ చేత సృష్టింపబడే నా విభూతి అయిన  నా శరీరం యందు కూడా భక్తి గలవాడివైతే అప్పుడు నన్ను చూచిన వాడివవుతావు. పరబ్రహ్మమైన నన్ను, నాయందే  ఆధారపడి ఉన్న జీవులను వీరందరినీ నీవు చూస్తావు. అప్పుడు లోకములో సమస్త జీవులూ మన్షులూ కనిపిస్తారు నీకు. ఆ కనిపించిన వారిలో నేనున్నాను. అది గుర్తుంచుకో.

యదా తు సర్వభూతేషు దారుష్వగ్నిమివ స్థితమ్
ప్రతిచక్షీత మాం లోకో జహ్యాత్తర్హ్యేవ కశ్మలమ్

కర్రలో అగ్ని ఉన్నట్లు నేను ఉంటాను(కట్టెలో ఉన్న నిప్పులో కనపడే వికారాలన్నీ కట్టెవే గనీ నిప్పువి కాదు. కట్టె పొడుగ్గా ఉంటే మంట పొడుగ్గా సాగుతుంది. వంకరా పొట్టి పొడుగూ, ఈ అవస్థలన్నీ కట్టెవు. మనలో ఉన్న పరమాత్మకి మనలో ఉన్న బాల్య వృద్ధాపయం కౌమారం యవ్వనం ఇవేమీ అంటవు. శరీరానికి అవస్థలు తప్ప జీవుడికి, జీవుడిలో ఉన్న పరమాత్మకీ ఎటువంటి అవస్థలూ ఉండవు. ఆత్మకు ఏమీ అంటదు, అంటినట్టు కనపడుతుంది. ) . నన్ను ఒక్కడినే చూస్తే నీ పాపములు తొలగవు. నీవు చూసే సమస్త జీవులలో నేనున్నాను నీవు చూచిన నాడు నీ మాలిన్యం తొలగుతుంది. కాబట్టి అంతర్యామి తత్వాన్ని, వాసుదేవ తత్వాన్ని దర్శించాలి. నీవు చూసే ప్రతీ వస్తువులో అంతర్యామిగా నేనున్నానన్న భావన కలగాలి. ఈ ఇంద్రియములు, పంచమహాభూతములూ, మనసు, ఇవి లేని నన్ను దర్శించు. అలాగే వీటన్నిటితో కూడిన విశ్వములో నన్ను దర్శించు. ఇవి రెండు రకాలైన దర్శనాలు. ప్రకృతి సంబంధము లేని పరబ్రహ్మ దర్శనం. రెండవది స్థూల రూపమైన జగత్తులో అంతర్యామిగా ఉన్న భగవత్ దర్శనం. ఈ రెండూ చేస్తే నీకు స్వారాజ్యం (కర్మ యొక్క బంధములు తొలగుతాయి). స్వరాట్ అంటే కర్మ చేత గాక తనతట తానే జ్ఞ్యానముతో ప్రకాశించినవాడు , పరమాత్మ. పరమాత్మతో సమానమైన గుణం మన ఆత్మకు కూడా ఉంది. ఆత్మ కర్మ చేత మూతబడి పోయింది. తన రూపముతో తాను ప్రకాశించుట స్వారాజ్యం. ఇలా చేస్తే స్వారాజ్యం పొందుతాడు.
నీవు ఇందులో ఒక్కటే చూస్తే పని చేయలేవు. లోకాలను చూడాలి. లోకాలలో నన్ను చూడాలి. నాలో ఉన్న లోకాలు చూడాలి. ఇలా చూసిన నాడు ఆ లోకుల యొక్క దుఃఖం తొలగుతుంది.

యదా రహితమాత్మానం భూతేన్ద్రియగుణాశయైః
స్వరూపేణ మయోపేతం పశ్యన్స్వారాజ్యమృచ్ఛతి

పరమాత్మ యొక్క స్వారాజ్యం ఈ జగత్తంతా. అది పొందాలంటే,  ఆత్మకు పంచ్భూతాలతో గానీ, కర్మేంద్రియాలతో గానీ, సత్వాది గుణత్రయానితో గానీ, దేనితో సంబంధం లేదు అని తెలుసుకోవాలి. నా స్వరూపాన్ని తెలుసుకుని ప్రపంచమంతా నాలో ఉన్నది, ప్రపంచమంతా నేను ఉన్నానని, నాకేవీ ఇవి అంటవు అని తెలుసుకుంటాడో, ఇవేవీ లేకుండా ఈ జగత్తులో నేనుంటానని తెలుసుకుంటాడో వాడు స్వారాజ్యాన్ని పొందుతాడు

నానాకర్మవితానేన ప్రజా బహ్వీః సిసృక్షతః
నాత్మావసీదత్యస్మింస్తే వర్షీయాన్మదనుగ్రహః

ఈ విషాలమైన విస్తృతమైన జీవులని సృష్టిస్తావు నీవు. ఆ జీవులు నానా కర్మలు గలవి. నీవు ఇందులో చిక్కుబడవు. అనేకమైన కర్మ విస్తారములతో ఎంతో మంది జీవులను సృష్టించే నీవు శ్రమను పొందవు, అలసటను పొందవు. నీకు నా అనుగ్రహం చాలా ఉంది. అది వృద్ధి పొందుతుంది.  నా అనుగ్రహం ఉన్నవాడు విషాదాన్ని అలసటని పొందడు.

ఋషిమాద్యం న బధ్నాతి పాపీయాంస్త్వాం రజోగుణః
యన్మనో మయి నిర్బద్ధం ప్రజాః సంసృజతోऽపి తే

ప్రపంచాన్ని చూచిన మొట్టమొదటి జీవుడు బ్రహ్మ. నీవు మొదటి ఋషివి. (ఋషి అంటే ద్రష్ట. సామాన్యులు చూడలేని దాన్ని చూసేవారు ఋషులు). నీకు పాపిష్టి రజోగుణం అంటదు. ప్రజలను సృష్టిస్తున్నా నీ మనసు నా యందే లగ్నమయి ఉంటుంది కాబట్టి నీకు రజో గుణం అంటదు. మనమే పని చేస్తున్నా పరమాత్మ యందు మనసు నిలుపగలిగితే మనకు కూడా రజో గుణం అంటదు

జ్ఞాతోऽహం భవతా త్వద్య దుర్విజ్ఞేయోऽపి దేహినామ్
యన్మాం త్వం మన్యసేऽయుక్తం భూతేన్ద్రియగుణాత్మభిః

ఇంతవరకూ ఎవరికీ తెలియరాని నేను నీకు తెలిసాను.  నన్ను నీవు చూసావని ఎందుకు చెబుతున్నానంటే , నీవు చేసిన స్తోత్రములో నాకు 25 తత్వాలు (5 భూతాలు 10 ఇంద్రియాలు గుణాలూ) అంటవు అని చెప్పావు కాబట్టి, భూతేంద్రియ గుణాలతో సంబంధం లేని వాడిగా నన్ను తెలుసుకున్నావు

తుభ్యం మద్విచికిత్సాయామాత్మా మే దర్శితోऽబహిః
నాలేన సలిలే మూలం పుష్కరస్య విచిన్వతః

నీకు నన్ను చూపడానికి కారణం, వెయ్యి ఏళ్ళు నన్ను చూడాలని తపించావు. అందుకు నీ మనసులో సాక్షాత్కరించాను. నన్ను వెతకడానికి పద్మం యొక్క నాలములోకి వెళ్ళావు.

యచ్చకర్థాఙ్గ మత్స్తోత్రం మత్కథాభ్యుదయాఙ్కితమ్
యద్వా తపసి తే నిష్ఠా స ఏష మదనుగ్రహః

నన్ను స్తోత్రం చేసావు. ఆ స్తోత్రములో నా కథా, నా విజయం, నా గుణాలూ ఉన్నాయి. నా అనుగ్రహం వలన నీవు చేసిన ఈ రెండిటి వలనా (తపసు వలనా, స్తోత్రము వలనా) నేను సంతోషించాను

ప్రీతోऽహమస్తు భద్రం తే లోకానాం విజయేచ్ఛయా
యదస్తౌషీర్గుణమయం నిర్గుణం మానువర్ణయన్

నేను ఇచ్చిన దానితో నా సంకల్పంతో నా స్తోత్రం చేసి నన్ను సకలలోక అంతర్యామిగా తెలుసుకున్నావు. సృష్టి చేయాలన్న నీ సంకల్పానికి శుభం, మంగళం. నేను గుణమయున్ని(కళ్యాణ గుణములు కలవాడిని) గుణములు లేని వాడిని (ప్రాకృతిక గుణాలు లేని వాడిని)

య ఏతేన పుమాన్నిత్యం స్తుత్వా స్తోత్రేణ మాం భజేత్
తస్యాశు సమ్ప్రసీదేయం సర్వకామవరేశ్వరః

ఈ స్తోత్రంతో ఎవరు నన్ను పూజిస్తారో వాడికి నేను ప్రసన్నుడనవుతాను, అడిగిన వరాలు ఇస్తాను. అన్ని కోరికలూ తీరుస్తాను. ఇక్కడ అన్ని కోరికలూ అంటే సర్వకామ. సర్వకామ అని పరమాత్మకు పేరు. అంటే ఈ స్తోత్రం చేస్తే వారికి సర్వకామ స్వరూపుడైన నన్ను ప్రసాదిస్తాను. వాడికి నేను వశుడనై ఉంటాను.

పూర్తేన తపసా యజ్ఞైర్దానైర్యోగసమాధినా
రాద్ధం నిఃశ్రేయసం పుంసాం మత్ప్రీతిస్తత్త్వవిన్మతమ్

యజ్ఞ్య యాగాదులూ చేసి, తోటలూ దేవాలయాలు, చెరువులూ బావులు నిర్మించడం - ఇలా పూర్తములతో, దానములతో యోగములతో సమాధులతో, వీటన్నిటి వలన కలిగే ఉత్తమ శ్రేయస్సు ఒకటే. నేను సంతోషించుటే. నేను సంతోషించుటే దేనికైనా ఫలము. (పరమ శివుడు హాలాహలాన్ని తాగుతూ "ఇలా చేస్తే హరి సంతోషితాడు" అని అంటారు). ప్రపంచంలో చేసే అన్ని పనులకూ ఏకాంత ఫలం నా సంతోషమే అని తత్వము తెలిసిన వారి సిద్ధాంతం. అందుకే మనం భగవదాజ్ఞ్యతో భగవంతుని ప్రీతి కొరకు భగవంతుని కైంకర్యముగా పనులు చేస్తాము.

అహమాత్మాత్మనాం ధాతః ప్రేష్ఠః సన్ప్రేయసామపి
అతో మయి రతిం కుర్యాద్దేహాదిర్యత్కృతే ప్రియః

ఇదొక్కటే పరమ సిద్ధాంతం. అన్ని ఆత్మలకూ నేనే ఆత్మను. పని చేస్తే కలిగే ఆత్మ ప్రీతి నేనే. ప్రీతి కలవారందరిలో నేనే ఎక్కువ ప్రేమించబడుతున్నాను. కాబట్టి అందరూ నా మీదే ప్రీతి కలిగి ఉండాలి (ఉంటున్నారు కూడా). నా మీద ఇష్టమే ఆత్మ మీదా. ఆత్మ మీద ఇష్టమే శరీరం మీద చూపుతున్నారు లోకులు.

సర్వవేదమయేనేదమాత్మనాత్మాత్మయోనినా
ప్రజాః సృజ యథాపూర్వం యాశ్చ మయ్యనుశేరతే

ఇపుడు సర్వ వేదమయుడవైన నాలో ఉన్న నీవు, నీలో ఉన్న నన్ను చూచి, నీ మనసులో నన్ను తెలుసుకుని నీ బుద్ధితో నేను ఉన్న ప్రపంచాన్ని, నాలో ఉన్న ప్రపంచాన్ని సృష్టించు. (ఆత్మయోనిన - బ్రహ్మతో ఆత్మనా - మనసుతో ఆత్మ - ఈ జగత్తును. ఆత్మయోనినా ఆత్మనా ఆత్మ). సకల చరాచర జగత్తునూ నేనిచ్చిన జ్ఞ్యానముతో,  నాలో ఉన్న జగత్తును నీవు చూచి, సృష్టించు.

మైత్రేయ ఉవాచ
తస్మా ఏవం జగత్స్రష్ట్రే ప్రధానపురుషేశ్వరః
వ్యజ్యేదం స్వేన రూపేణ కఞ్జనాభస్తిరోదధే

ప్రధానపురుషేశ్వరః - ప్రకృతికీ జీవుడికీ, అచిత్తుకూ చిత్తుకూ ప్రధానం. ఈ పరమాత్మ తన స్వరూపముతో సకల చరాచర జగత్తునూ బ్రహ్మకు సాక్షాత్కరింపచేసాడు. అలా చేసి ఆ పద్మనాభుడు (కఞ్జనాభస్తిరోదధే) అంతర్ధానం చెందాడు. ఇలా అనేక వరములిచ్చి బ్రహ్మకు వరములిచ్చి స్వామి అంతర్ధానం చెందాడు. 

Thursday, January 10, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

                                                               ఓం నమో భగవతే వాసుదేవాయ
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఎనిమిదవ అధ్యాయం

మైత్రేయ ఉవాచ
సత్సేవనీయో బత పూరువంశో యల్లోకపాలో భగవత్ప్రధానః
బభూవిథేహాజితకీర్తిమాలాం పదే పదే నూతనయస్యభీక్ష్ణమ్

మీ పూరు వంశం సజ్జనులందరి చేతా సేవించదగినది  ఎందుకంటే లోలపాలకులైన (యముడు) మీరు పరమాత్మే ప్రధానంగా ఉండేవారు, అహంకార మమకార వర్జితులు మీరు. మీ వంశం ఎంత గొప్పది కాకుంటే మీ వంటివారు పుడతారు. ఎవరిచేతా గెలువబడైన (అజితుడైన) పరమాత్మ కీర్తి మాలను పదే పదే ప్రతీ క్షణం మాటి మాటికీ కొత్తగా చేస్తున్నావు. అందువలన నీవు పుట్టిన పూరు వంశం సజ్జనులందరి చేతా సేవించదగినది

సోऽహం నృణాం క్షుల్లసుఖాయ దుఃఖం మహద్గతానాం విరమాయ తస్య
ప్రవర్తయే భాగవతం పురాణం యదాహ సాక్షాద్భగవానృషిభ్యః

కొద్ది సుఖానికి ప్రయత్నించి పెద్ద దుఖాన్ని పొందుతునారు. అలాంటి వారి దుఃఖం తొలగించడానికి నీవడిగిన ప్రశ్నకు సమాధానం భాగవతం.

ఆసీనముర్వ్యాం భగవన్తమాద్యం సఙ్కర్షణం దేవమకుణ్ఠసత్త్వమ్
వివిత్సవస్తత్త్వమతః పరస్య కుమారముఖ్యా మునయోऽన్వపృచ్ఛన్

అన్నిటికన్నా కిందిలోకమైన పాతాళంలో ఉన్నవాడైన ఆదిశేషుడు (సంకర్షణుడు) శుద్ధ సత్వం కలవాడు. ఈయన వద్దకు సనకసనందాదులు వచ్చి ఒకరి వెంట ఒకరు అడిగారు

స్వమేవ ధిష్ణ్యం బహు మానయన్తం యద్వాసుదేవాభిధమామనన్తి
ప్రత్యగ్ధృతాక్షామ్బుజకోశమీషదున్మీలయన్తం విబుధోదయాయ

ఆ ఆదిశేషుడు తన మూలస్థానం (పర వాసుదేవ తత్వం) నిరంతరం( బహు మానయన్తం ) ధ్యానం చేస్తూ, ఏ నివాసాన్ని వాసుదేవా అంటారో, ఆ నివాసాన్ని ధ్యానం చేస్తూ, పరమాత్మను ధ్యానం చేస్తున్నందు వలన అంతర్దృష్టితో అర్థ నిమీలిత నేత్రంతో, త్రలకిందుగ పట్టుకున్న పద్మపు మొగ్గ వలే నేత్రములను లోపలికి ప్రసరింపచేస్తూ, జ్ఞ్యానుల సంతోషానికి కొరకు కొంచెం మళ్ళీ తెరుస్తూ ఉన్నాడు

స్వర్ధున్యుదార్ద్రైః స్వజటాకలాపైరుపస్పృశన్తశ్చరణోపధానమ్
పద్మం యదర్చన్త్యహిరాజకన్యాః సప్రేమ నానాబలిభిర్వరార్థాః

ఆకాశ గంగతో కొద్దిగా తడవబడిన జటలు కలవారు అయిన సనకాదులు , ఆ జటలతో ఆయన పాదప్రక్షాళణ చేస్తున్నారు. ఎంతో మంది సర్పరాజు భార్యలు తమకు కావల్సిన వరముల గురించి అర్చిస్తుంటారో అలాంటి పాదాలను స్పృశించారు

ముహుర్గృణన్తో వచసానురాగ స్ఖలత్పదేనాస్య కృతాని తజ్జ్ఞాః
కిరీటసాహస్రమణిప్రవేక ప్రద్యోతితోద్దామఫణాసహస్రమ్

ఆయన లోకరక్షణకు ఏమేమి చేసాడో తెలిసినవారు కాబట్టి (తజ్జ్ఞాః) ఆయనను హద్దులేనంతా భక్తితో ప్రేమతో స్తోత్రం చేస్తున్నారు. ఆ ప్రేమతో గొంతు పూడుక  పోయి భావావేశంతో పదములు జారుతూ వణుకుతూ తొట్రుపడగా, ఆయన చేసిన లోకోపకారములు తెలిసినవారు కాబట్టి కీర్తిస్తున్నారు.
ఆయన శిరస్సు మీద వేయి కిరీటాలు (పాముల కన్నా నాగములూ, నాగముల కన్నా మహానాగములు శ్రేష్టులు. మామూలు మహాసర్పానికే ఒక మణి ఉంటే ఆది శేషుని వేయి పడగలకూ వేయి మణులు), ఆ ఆదిశేషుని శిరస్సు మీద ఉన్న మణుల కాంతితో ఆయంకున్న వేయి కిరీటములూ ప్రకాశిస్తున్నాయి. దిక్కులన్నీ వ్యాపించే కాంతులు వేయి కిరీటములే కావు. ఆ వేయి కిరీటములకు కాంతిని పెంచేవి ఆయన శిరసు మీద ఉన్న మణి.

ప్రోక్తం కిలైతద్భగవత్తమేన నివృత్తిధర్మాభిరతాయ తేన
సనత్కుమారాయ స చాహ పృష్టః సాఙ్ఖ్యాయనాయాఙ్గ ధృతవ్రతాయ

వీరందరూ అడిగితే నివృత్తి ధర్మ పరివృత్తుడైన సనత్కుమారునికి ఈ భాగవతం వివరించారు. సంకర్షుని ద్వారా సనత్కుమారుడు భాగవతాన్ని విన్నాడు. ఆ సనత్కుమారున్ని సాంఖ్యాయన మహర్షి అడిగారు. ఆ పారమహంస ముఖ్యుడైన సాంఖ్యాయనుడు మా గురువు గారైన  పరాశరునికి చెప్పాడు.

సాఙ్ఖ్యాయనః పారమహంస్యముఖ్యో వివక్షమాణో భగవద్విభూతీః
జగాద సోऽస్మద్గురవేऽన్వితాయ పరాశరాయాథ బృహస్పతేశ్చ

భగవత విభూతులు చెప్పాలనుకున్న పారమహంస్య ముఖ్యుడు మా గురువుగారైన పరాశరునికి, బృహస్పతికీ చెప్పాడు. ఆ పరాశరుడు పరమదయాళువు కాబట్టి నాకు చెప్పాడు. ఈ పరాశరుడు వశిష్టుడికి మనుమడు (వశిష్టుడు - శక్తి - పరాశరుడు - వ్యాసుడు, ఒక రాక్షసుడు శక్తిని తినివేసాడు. ఆ విషయం తెలుసుకున్న పరాశరుడు రాక్షస వినాశానికి ఒక యజ్ఞ్యం చేసాడు. అప్పుడు పులస్త్య బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ వచ్చి వారించాడు. అప్పుడు పులస్త్యుడు సంతోషించి పురాణ కర్తవి అవ్వమని వరమిచ్చాడు. పురాణానికి ఆద్యం విష్ణు పురాణం), పులస్త్య బ్రహ్మ ఇచ్చిన వరము వలన మా గురువుగారు భాగవతాన్ని నాకు వివరించాడు. నేను నీకు దాన్నే చెప్పబోవుతున్నాను

ప్రోవాచ మహ్యం స దయాలురుక్తో మునిః పులస్త్యేన పురాణమాద్యమ్
సోऽహం తవైతత్కథయామి వత్స శ్రద్ధాలవే నిత్యమనువ్రతాయ

శ్రద్ధతో అనుసరిస్తూ ఉండే వాడికి

ఉదాప్లుతం విశ్వమిదం తదాసీద్యన్నిద్రయామీలితదృఙ్న్యమీలయత్
అహీన్ద్రతల్పేऽధిశయాన ఏకః కృతక్షణః స్వాత్మరతౌ నిరీహః

కాలం చేత ప్రేరేపించబడి పరమాత్మ సంకలించి ప్రళయం చేయాలనుకున్నపుడు లోకం మొత్తం నీటితో ముంచబడింది. అపుడు పరమాత్మ నిద్రపోయినట్లు కనులు మూసుకోగానే జగత్తంతా నీటితో నిండింది. ప్రళయకాలంలో కూడా పరమాత్మ శేష శయ్య మీద ఉన్నాడు. దీన్నే ప్రకృతి అంటాం. ప్రకృతి మహత్ తత్వములే ఆదిశేషుని రూపంలో సేవిస్తున్ ఉంటాయి. ఒక్కడే ఉండి ,కోరిక లేని వాడై కూడా మళ్ళి జగత్తుని తన సంకల్పంతో సృష్టించాలనుకున్నాడు.

సోऽన్తః శరీరేऽర్పితభూతసూక్ష్మః కాలాత్మికాం శక్తిముదీరయాణః
ఉవాస తస్మిన్సలిలే పదే స్వే యథానలో దారుణి రుద్ధవీర్యః

పంచ్భూతములూ తన్మాత్రములు మొదలుకొని ఉన్న 24 తత్వాలు అన్నీ పరమాత్మ గర్భంలోనే సూక్ష్మావస్థలో దాగి ఉన్నాయి. వీటిలో మొదట కాల శక్తిని ప్రేరేపించాడు. అన్ని తత్వాలలో స్పందన కలిగించేది కాలం. తన నివాసం అయిన జలంలోనే చాలా కాలం నివాసమున్నాడు. కట్టెలో తేజస్సు దాచి ఉంచుకున్న అగ్ని లాగ ఉన్నాడు

చతుర్యుగానాం చ సహస్రమప్సు స్వపన్స్వయోదీరితయా స్వశక్త్యా
కాలాఖ్యయాసాదితకర్మతన్త్రో లోకానపీతాన్దదృశే స్వదేహే

అలా నాలుగు యుగాలు వెయ్యి సార్లు తిరిగే వరకూ ఉన్నారు (అంటే బ్రహ్మకు ఒక దినం) . తరువాత తన చేత ప్రేరేపించబడిన కాలంతో తాను చేయవలసిన కర్మను సంకల్పం చేసుకుని తన దేహంలో ఉన్న అన్ని లోకాలనూ చూచాడు. సూక్ష్మావస్థలో ఉన్న అన్ని అర్థముల మీద తన దృష్టి ఉంచాడు.

తస్యార్థసూక్ష్మాభినివిష్టదృష్టేరన్తర్గతోऽర్థో రజసా తనీయాన్
గుణేన కాలానుగతేన విద్ధః సూష్యంస్తదాభిద్యత నాభిదేశాత్

తనలో దాగి ఉన్న అన్ని లోకాలను రజో గుణంతో కాలానుగుణమైన గుణంతో క్షోభింపచేసాడు
తన గర్భంలో ఉన్న అన్ని తత్వములనూ బయటకు తెప్పించాలన్న సంకల్పం వలన నాభిని భేదించుకుని ఒక పద్మం ఆవిర్భవించింది.

స పద్మకోశః సహసోదతిష్ఠత్కాలేన కర్మప్రతిబోధనేన
స్వరోచిషా తత్సలిలం విశాలం విద్యోతయన్నర్క ఇవాత్మయోనిః

కర్మగురించి కాలము జ్ఞ్యాపకం చేయగా తనలో ఉన్న భూత సూక్షములను బయటకు తేవాలని సంకల్పించి అంతర్దృష్టుడైన పరమాత్మ నాభి నుండి వేగంగా ఒక పద్మం ఆవిర్భవించింది. తన కాంతితో ఈ పద్మం చుట్టు వ్యాపించి ఉన్న జలమును ప్రకాశింపచేసింది. ఎలా ఐతే సూర్యుడు సకలలోకాలని ప్రకాశింపచేసాడో

తల్లోకపద్మం స ఉ ఏవ విష్ణుః ప్రావీవిశత్సర్వగుణావభాసమ్
తస్మిన్స్వయం వేదమయో విధాతా స్వయమ్భువం యం స్మ వదన్తి సోऽభూత్

ఆ పద్మంలోకి సకల తత్వాలూ ఆవిర్భవింప చేసేలాగ పరమాత్మ తానే ప్రవేశించాడు.
ఇలా ప్రవేశించిన ఆ పరమాత్మే వేద స్వరూపుడు. సకల జగత్తునీ సృష్టించేవాడు. ఆయనను స్వయంభూ (తనకు తానుగా పుట్టినవాడు) అంటారు. తన సృష్టికి తన సంకల్పమే కారణం.

తస్యాం స చామ్భోరుహకర్ణికాయామవస్థితో లోకమపశ్యమానః
పరిక్రమన్వ్యోమ్ని వివృత్తనేత్రశ్చత్వారి లేభేऽనుదిశం ముఖాని

ఎపుడైతే రూపం గుణం మారిందో తన స్వభావం కూడా మర్చుకున్నాడు. ఆ పద్మం యొక్క పుప్పొడిలో ఉండి ఏమీ కనపడక చుట్టు తిరిగాడు, అన్ని దిక్కులూ ఒకే సారి చూస్తే నాలుగు ముఖాలు వచ్చాయి (మొదలు ఆయనకూఇదు ముఖాలు వచ్చాయి ప్రతీ దిక్కుకూ ఒక ముఖం, పైకి ఒకటి, తరువాత అవి నాలుగయ్యాయి)

తస్మాద్యుగాన్తశ్వసనావఘూర్ణ జలోర్మిచక్రాత్సలిలాద్విరూఢమ్
ఉపాశ్రితః కఞ్జము లోకతత్త్వం నాత్మానమద్ధావిదదాదిదేవః
క ఏష యోऽసావహమబ్జపృష్ఠ ఏతత్కుతో వాబ్జమనన్యదప్సు
అస్తి హ్యధస్తాదిహ కిఞ్చనైతదధిష్ఠితం యత్ర సతా ను భావ్యమ్

వాయువు చేత చెల్లా చెదురుగా ఉన్న ఆ జలాన్ని, నీటినుండి ఆవిర్భవించిన తన స్వరూపాన్ని, పద్మాన్ని ఆశ్రయించిన బ్రహ్మగారు, తన గురించి తానూ స్పష్టంగా తెలుసుకోలేకపోయాడు, ఆయన ఆవిర్భవించడానికి కారణం తెలియలేక "నేను ఎవరు,  ఈ పద్మం ఎక్కడి నుంచి వచ్చింది ఈ నీరు ఏంటి, ఈ నీటి అడుగున ఏది ఉంది. ఏదో ఒకటి ఉండి ఉండాలి కదా?" అన్న ఆలోచనతో

స ఇత్థముద్వీక్ష్య తదబ్జనాల నాడీభిరన్తర్జలమావివేశ
నార్వాగ్గతస్తత్ఖరనాలనాల నాభిం విచిన్వంస్తదవిన్దతాజః

ఆ పద్మం కింద కాడ, అందులో రంధ్రం కనపడింది. ఆయన అందులో ప్రవేశించి, తిరిగి తిరిగి, వెతికి వెతికి దాని కింద ఏముందో తెలియలేకపోయాడు.

తమస్యపారే విదురాత్మసర్గం విచిన్వతోऽభూత్సుమహాంస్త్రిణేమిః
యో దేహభాజాం భయమీరయాణః పరిక్షిణోత్యాయురజస్య హేతిః

అలా వెతుకుతూ ఉంటే ఎక్కడ చూసినా అంతా చీకటే. తన సృష్టి ఎలా వచ్చిందో తెలుసుకోవడానికి వెతుకుతున్న స్వామి దగ్గరకు మూడు నేములు కలది (సత్వ రజ తమో గుణాలు గల ప్రకృతి) కనపడింది. ఈ ప్రకృతి (త్రినేమి) లేదా కాలం (కాలం కూడా త్రినేమి అంటారు; భూత భవిష్యత్ వర్దమాన). ఈ కాలం లేదా ప్రకృతి ప్రతీ ప్రాణికీ భయాన్ని ఇచ్చేది, ఆయువును తీసి పారేసేది, ఇది పరమాత్మ ఆయుధం (కాల చక్రం). ఆ సాక్షాత్కారం కలిగింది బ్రహ్మగారికి.

తతో నివృత్తోऽప్రతిలబ్ధకామః స్వధిష్ణ్యమాసాద్య పునః స దేవః
శనైర్జితశ్వాసనివృత్తచిత్తో న్యషీదదారూఢసమాధియోగః

వెతికి వెతికి కోరిక తీరిక పద్మంలోకే వచ్చి, ఒక్క సారి ప్రాణాయామ పరాయణుడై, ఇంద్రియాలను గెలిచినవాడై సమాధి యోగంలో ఒకసారి తపసులో ప్రవేశించాడు.

కాలేన సోऽజః పురుషాయుషాభి ప్రవృత్తయోగేన విరూఢబోధః
స్వయం తదన్తర్హృదయేऽవభాతమపశ్యతాపశ్యత యన్న పూర్వమ్

ఒక ఆయుష్షు కాలం తపస్సు చేస్తే అప్పుడు జ్ఞ్యానం కలిగింది. ఇలా ధ్యాన యోగంలో కనులు మూసుకున్న బ్రహ్మ హృదయంలో ఒక అద్భుత రూపం కనిపించింది. అంతర్ముఖుడైన బ్రహ్మ దానిని చూచాడు

మృణాలగౌరాయతశేషభోగ పర్యఙ్క ఏకం పురుషం శయానమ్
ఫణాతపత్రాయుతమూర్ధరత్న ద్యుభిర్హతధ్వాన్తయుగాన్తతోయే

పద్మం యొక్క నాడంలోపలి దారము వంటి తెల్లని వర్ణం (అప్పటికి ఉన్నది పద్మమే కాబట్టి పద్మాన్నే ఉపమానంగా వేసారు) కల ఆదిశేషుని మీద పడుకుని ఉన్నాడు. పడగలు గొడుగులు గా కలిగి, పడగలమీద మణుల కాంతిచే తొలగించబడిన చీకటితో ప్రళయకాల జలంలో ఆదిశేషుని మీద పడుకున్న స్వామిని చూచాడు.

ప్రేక్షాం క్షిపన్తం హరితోపలాద్రేః సన్ధ్యాభ్రనీవేరురురుక్మమూర్ధ్నః
రత్నోదధారౌషధిసౌమనస్య వనస్రజో వేణుభుజాఙ్ఘ్రిపాఙ్ఘ్రేః

సంధ్యాకాల మేఘం వంటి కొన కలిగిన బంగారు రంగు కలిగిన (ఉరు రుక్మ మూర్ధ్న) శిరసు కలిగి , అనేక రత్నముల కాంతిచే ప్రకాశించే పాదములు కలిగిన వాడాఇ,

ఆయామతో విస్తరతః స్వమాన దేహేన లోకత్రయసఙ్గ్రహేణ
విచిత్రదివ్యాభరణాంశుకానాం కృతశ్రియాపాశ్రితవేషదేహమ్

మూడులోకాల పొడవూ వెడల్పు గల ఆకారం, ఆ మూడు లోకాల వరకూ వ్యాపించిన దేహంకలవాడు, దివ్యాభరణములూ వస్త్రములూ, వాటి శొభచే శరీరం మీద కొత్త కాంతిపడుతూ

పుంసాం స్వకామాయ వివిక్తమార్గైరభ్యర్చతాం కామదుఘాఙ్ఘ్రిపద్మమ్
ప్రదర్శయన్తం కృపయా నఖేన్దు మయూఖభిన్నాఙ్గులిచారుపత్రమ్

ఈయన  పాదాలు తమ తమ మనసులలో ఉన్న కోరికలను తీర్చుకోవడానికి వేరు వేరు మార్గాలలో అందరిచేతా ఆశ్రయించబడే పాదాలు, అనంతమైన పాదాలు. దారులూ, కోరికలూ, ఆచరణ వేరు అయినా ఆశ్రయాన్నిచ్చే పాదాలు మాత్రం ఇవే. దయతో మనందరికీ చూపెడుతున్న పాదాల గోళ్ళు అనే చంద్రుని వెన్నెల చేత తన పాదపద్మములని అందరికీ చూపిస్తున్నారు

ముఖేన లోకార్తిహరస్మితేన పరిస్ఫురత్కుణ్డలమణ్డితేన
శోణాయితేనాధరబిమ్బభాసా ప్రత్యర్హయన్తం సునసేన సుభ్ర్వా

లోకుల బాధను తొలగించే చిరునవ్వు కాంతి గల పరమాత్మ ముఖం, ఆ కాంతికి తోడు కుండలముల కాంతితో కలిసి, పెదవుల కాంతితో ఎర్రబడిన ముఖం, చక్కని ముక్కు కనులూ,

కదమ్బకిఞ్జల్కపిశఙ్గవాససా స్వలఙ్కృతం మేఖలయా నితమ్బే
హారేణ చానన్తధనేన వత్స శ్రీవత్సవక్షఃస్థలవల్లభేన

పీతంబరం ధరించి బంగారు మొలతాడుతో , శ్రీవత్సమనే (శ్రీ - లక్ష్మికి వత్సం - ప్రీతికలిగించేది శ్రీవత్సం) పుట్టుమచ్చ గలిగిన వక్షస్థాలనికి ప్రీతి కలిగించే హారముతో

పరార్ధ్యకేయూరమణిప్రవేక పర్యస్తదోర్దణ్డసహస్రశాఖమ్
అవ్యక్తమూలం భువనాఙ్ఘ్రిపేన్ద్రమహీన్ద్రభోగైరధివీతవల్శమ్

భుజాభరణాలు (కేయూరాలు) , వాటిలో ఉండే మణుల యొక్క కాంతిచే విస్తరించబడిన వేయి బాహువులు కలిగిన వాడు, కనపడుతున్నాడు గానీ ఆయన మూల తత్వం తెలియనటువంటి, సకల లోకములనూ పాదములను పవిత్రం చేసే, అఖిల లోకపాలకుల పాలకత్వం నిలిపే పాదములు

చరాచరౌకో భగవన్మహీధ్రమహీన్ద్రబన్ధుం సలిలోపగూఢమ్
కిరీటసాహస్రహిరణ్యశృఙ్గమావిర్భవత్కౌస్తుభరత్నగర్భమ్

సకల భూమండలమునకు మూలమైన జలము, అందులో వేంచేసిన పద్మానికి బందువైన వాడు (మహీధ్రమహీన్ద్రబన్ధుం) నీటితో కప్పిపుచ్చబడ్డవాడు, వేయి శిరస్సులకూ ఆ కిరీటములు గలిగిన మణులకూ, ఆ కాంతులతో

నివీతమామ్నాయమధువ్రతశ్రియా స్వకీర్తిమయ్యా వనమాలయా హరిమ్
సూర్యేన్దువాయ్వగ్న్యగమం త్రిధామభిః పరిక్రమత్ప్రాధనికైర్దురాసదమ్

పరమాత్మ వక్షస్థలంలో ఉన్న వనమాలతో (తొమ్మిది రకముల పుష్పములతో ఒక చోట కూరిస్తే వనమాల, నవ విధ భక్తులతో సేవించగల జీవులే వనమాల . వనమాల జీవతత్వం) , సూర్య ఇంద్ర వాయు అగ్ని,ఇలాంటి వాటికి చేరరానిది. ప్రకృతి మహత్ అహంకార తత్వాలకు అందుబాటులో లేనిది

తర్హ్యేవ తన్నాభిసరఃసరోజమాత్మానమమ్భః శ్వసనం వియచ్చ
దదర్శ దేవో జగతో విధాతా నాతః పరం లోకవిసర్గదృష్టిః

నాభిపద్మంలో ఉన్న బ్రహ్మగారికి ఈయన నిశ్వాసమే ఆకాశంగా సాక్షాత్కరించడం కనప్డింది. అలాగే కాలతత్వం (చక్రం) ప్రకృతి తత్వం ( ఆది శేషుడు) వనమాల (జీవ తత్వం) బ్రహ్మకు సాక్షాత్కరించాయి. ప్రపంచమంతా తన శరీరంలో బ్రహ్మగారికి చూపించాడు. ఇంతకంటే లోకాలను సృష్టించడానికి కావల్సిన దృష్టి అవసరంలేదు. పరమాత్మలోనే అన్ని లోకాలూ చూచాడు. అంతకంటే వేరే లోకాలను చూడలేకపోయాడు

స కర్మబీజం రజసోపరక్తః ప్రజాః సిసృక్షన్నియదేవ దృష్ట్వా
అస్తౌద్విసర్గాభిముఖస్తమీడ్యమవ్యక్తవర్త్మన్యభివేశితాత్మా

రజోగుణముచే ఆక్రమించబడిన, కర్మ బీజమైన బ్రహ్మగారు, ఈయననే (పరమాత్మనే) చూచాడు. ఒక్క సారి ఈ దివ్యమంగళ విగ్రహం సాక్షాత్కరించగానే సృష్టి చేయాలనే కోరిక గలిగిన బ్రహ్మగారు, స్పష్ట పడని మార్గంలో బుద్ధి ఉంచిన వాడై (పరమాత్మ స్వరూపం పూర్తిగా తెలియనివాడై) తన మనసుని అక్కడే ఉంచి,  స్తోత్రం చేసాడు

                                 సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

Sunday, January 6, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం సప్తమోధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం సప్తమోధ్యాయం

సృష్టి అనేది లీల అనుకున్నా, లీల కూడా ఒక వినోదం కాబట్టి, విణొదం కూడా ఒక ఫలం కాబట్టి, పరమాత్మ ఫలం కోరినవాడైతే అవాప్తసమస్త కాముడెలా అవుతాడు. పరమాత్మ అంతటా వ్యాపించి ఉంటే వాటిలో ఉండే దోషం ఆయనకు అంటుతుందా? మన శరీరంలో ఉండే ఆయనకు, అందులో దోషాలు వస్తాయా? జీవుడు కర్మబద్ధుడు కాబట్టి కర్మవశాన వచ్చిన దేహంతో ఆ ఫలితాలు అనుభవిస్తాడు. పరమాత్మ కర్మవశ్యుడు కాడు. కర్మలే సుఖాన్ని దుఖాన్ని ఇస్తున్నాయా? ఆ ఇచ్చిన సుఖాలను శరీరం ద్వారానే అనుభవిస్తాము. అటువంటి అనుభవించే శరీరాన్ని ఇచ్చేది కర్మ. ఇపుడు ఏది అపురుషార్థం, ఏది పురుషార్థం. ఇందులో కర్మ జ్ఞ్యాన భక్తి ప్రపత్తి, ఇవి పురుషార్ధాలు. ఇందులో కర్మతోటి గానీ జ్ఞ్యానంతోటి గాని కలగబోయే ఫలితానికి కారణమైన శరీరాన్ని ఇచ్చే తత్వం ఉంది. శరీరం అనేక కష్టాలను సుఖాక్లనూ ఇస్తుందంటే శరీరం పురుషార్థమా అపురుషార్థమా? అది అపురుషార్థమే. అపురుషార్థమైన శరీరాన్ని కర్మ ఇస్తున్నపుడు, దానిలో పరమాత్మ ఉన్నప్పుడు ఆయనకు కూడా శరీరం ఉన్నట్లేనా? పరమాత్మ మనలాగ సుఖ దుఖాలను అనుభవించకున్నా సుఖదుఖాలను అనుభవించడానికి సాధనమైన శరీరం ఆయనకి కూడా లభిస్తుంది కాబట్టి పరమాత్మ కూడా అపురుషార్థాన్నే పొందుతున్నట్టే కద? మరి ఆయనకు సృష్టి ఎలా కుదురుతుంది?

ఈ ప్రశ్నలకు ఈ అధ్యాయంలో సమాధానం వస్తుంది
శ్రీశుక ఉవాచ
ఏవం బ్రువాణం మైత్రేయం ద్వైపాయనసుతో బుధః
ప్రీణయన్నివ భారత్యా విదురః ప్రత్యభాషత

మైత్రేయుని వాక్యాన్ని విన్న ద్వైపాయన సుతుడు (విదురుడు) తమ వాక్కుతో గురువుగారిని సంతోషింపచేస్తున్నట్లుగా ఇలా అడిగాడు

విదుర ఉవాచ
బ్రహ్మన్కథం భగవతశ్చిన్మాత్రస్యావికారిణ
లీలయా చాపి యుజ్యేరన్నిర్గుణస్య గుణాః క్రియాః

సృష్టి పరమాత్మ ఎందుకు చేయాలి? అది ఆటకోసం ఐతే ఆట వలన కలిగే వినోదం కోసం సృష్టించాడా. ఏదైనా ప్రయోజనం ఆశించి ఆడాడా. ఆయన పొందవలసినది ఏమీ లేదు అన్నారు కదా. అలాంటప్పుడు లీలకోసం సృష్టించడం ఎలా కుదురుతుంది. గుణములు లేని వారికి గుణములు గల సృష్టి చేయడం ఎలా సాధ్యం. కేవల జ్ఞ్యాన స్వరూపుడు, అవికారుడు అయిన పరమాత్మ, లీలతో అనుకున్నా గుణరహితుడైన పరమాత్మకు గుణసహితమైన క్రియలు ఎలా కుదురుతాయి.

క్రీడాయాముద్యమోऽర్భస్య కామశ్చిక్రీడిషాన్యతః
స్వతస్తృప్తస్య చ కథం నివృత్తస్య సదాన్యతః

క్రీడ అంటే అర్భకులు ఆడతారు కోరికవలన. లేకపోతే ఏదైనా అన్యమైన కోరికౌండి ఉండాలి. సహజముగా తృప్తుడైన పరమాత్మకు తృప్తి కలిగించడానికి ఏదైనా చేయాలా. ఆయన నిత్యతృప్తుడు. అలాంటి పరమాత్మ ఇతరులకంటే (ప్రకృతి మహత్ తత్వాలకు) వేరు అయిన వాడు. ఇలాంటి పరమాత్మకు వినోదించాలని కోరిక ఎందుకుంటుంది.

అస్రాక్షీద్భగవాన్విశ్వం గుణమయ్యాత్మమాయయా
తయా సంస్థాపయత్యేతద్భూయః ప్రత్యపిధాస్యతి

పరమాత్మ ప్రపంచాన్ని సృష్టించాడు అంటున్నాము. ఆయన నిర్గుణుడు. ప్రకృతి గుణమయి. పరమాత్మ మాయతో జగత్తుని సృష్టి చేసాడు. ఆ మాయతోనే జగత్తుని సృష్టించి రక్షించి లయం చేస్తున్నాడు.

దేశతః కాలతో యోऽసావవస్థాతః స్వతోऽన్యతః
అవిలుప్తావబోధాత్మా స యుజ్యేతాజయా కథమ్

గుణవత్తైన మాయతో పరమాత్మ ఈ మూడు పనులు చేస్తుంటే, పరమాత్మను మాయ ఆవేశించిందా? మాయతో పరమాత్మ కూడుకుని ఉన్నాడా? వికారం కలగడానికి కారణాలు దేశమూ (ప్రదేశం నుంచి) కాలము (ఉదా: ప్రాతః కాలంలో ప్రశాంతంగా ఉంటుంది) వ్యవస్థ (పిల్లవాడు ఒకలాగ, యువకుడు ఒక లాగ, లేదా కడుపు నిండుగా ఉన్నప్పుడు ఒకసారి, ఆకలిగా ఉన్నపుడు ఒకసారి, తినేప్పుడు ఒకసారి), స్వతః (మన స్వభావం), అన్యతః (పక్కవాడు తిడితే మనం తిట్టడం, పక్కవాడు పొగిడితే ఆనందించడం. ఎలాంటి మనసైన ఎదుటివారి బట్టి మారుతుంది), ఇలా ఐదు రకములుగా మనము ఈ ఐదింటితో మన జ్ఞ్యానాన్ని పోగొట్టుకుంటాము. కానీ పరమాత్మ ఇలాంటి వాటికి వేటికీ ఆయన జ్ఞ్యానం స్వరూపం సకోచింపదు. అలాంటి పరమాత్మ మాయతో కలిసి ఎలా ఉంటాడు.

భగవానేక ఏవైష సర్వక్షేత్రేష్వవస్థితః
అముష్య దుర్భగత్వం వా క్లేశో వా కర్మభిః కుతః

పరమాత్మలోపలా వెలుపలా అంతటా వ్యాపించి ఉన్నాడు, మన చేత ప్రతీ పనీ పరమాత్మే చేయిస్తున్నాడు. మరి ఆయనే చేయిస్తే మానవులకు పాపం ఎలా వస్తోంది. చేసేది ఆయనే ఐతే అజ్ఞ్యానం మానవులకు ఎలా వస్తోంది. అలాగే మనం పాపం చేస్తుంటే మనలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా అంటాలి కదా?

ఏతస్మిన్మే మనో విద్వన్ఖిద్యతేऽజ్ఞానసఙ్కటే
తన్నః పరాణుద విభో కశ్మలం మానసం మహత్

మీరు చెప్పిన విషయం విన్న నేను అజ్ఞ్యాన సంకటంలో పడ్డాను. దాని వలన నా మన్సు బాధ పడుతోంది. నా మనసుకి అంటిన ఈ బురదను మీరు తొలగించండి.
ఇది విదురుని ప్రశ్న అయినా, వాస్తవంగా ఇది మనందరి ప్రశ్న.

శ్రీశుక ఉవాచ
స ఇత్థం చోదితః క్షత్త్రా తత్త్వజిజ్ఞాసునా మునిః
ప్రత్యాహ భగవచ్చిత్తః స్మయన్నివ గతస్మయః

జిజ్ఞ్యాసతో అడిగిన ప్రశ్న విన్న మైత్రేయుడు ఏమాత్రం అహంకారంలేని వాడు (గతస్మయః) నవ్వుతున్నట్లుగా (స్మయన్నివ - స్మయ శబ్దానికి మూడు అర్థాలు ఉన్నాయి. అహంకారం అని, నవ్వు అని కూడా అర్థం), పరమాత్మ యందే మనసు లగ్నం చేసినవాడై.

మైత్రేయ ఉవాచ
సేయం భగవతో మాయా యన్నయేన విరుధ్యతే
ఈశ్వరస్య విముక్తస్య కార్పణ్యముత బన్ధనమ్

పరమాత్మ మాయ హేతువాదానికి అందదు. ప్రతీ శరీరం సుఖం దుఖం అనుభవించాలన్న నియమం లేదు. పరమాత్మ స్వీకరించిన శరీరాలలో సుఖ దుఖాలు ఉండవు. మరి మన శరీరంలో మనం పొందే సుఖ దుఖాలను పరమాత్మ అనుభవిస్తాడని చెప్పగలమా? చెరసాలలోనే ఖైత్దీ ఉంటాడు, అధికారీ ఉంటారు. అంతమాత్రాన అధికారి కూడా శిక్ష అనుభవిస్తున్నట్లు కాదు. ఈ శరీరంలో జీవాత్మకి ఏ దేహాలు వచ్చాయో ఆ జీవుడు ఇదివరకు చేసిన కర్మలకు తగిన ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు, ఆ జీవిలో మార్పు కలిగినపుడు దయ కలిగిన పరమాత్మ ఆ జీవుని కర్మ శేషాన్ని (సంచితాన్ని, ఆగామిని) తొలగించవచ్చు. ఆయన అంతర్యామిగా ఉన్నప్పుడు ఆయన అంతర్యామిగా ఉన్న శరీరంలో జీవుని కర్మ ఫలాన్ని తప్పించగల అధికారం పరమాత్మకు ఉంది.. అలా కర్మ ఫలితాన్నే తప్పించగల పరమాత్మకు కర్మ ఫలం అంటుతుంది అనడంలో అర్థము లేదు. దీనికి హేతువును చెప్పలేము.
విముక్తస్య ఈశ్వరస్య - ఆయన విముక్తుడు. ఆయనకు ఎటువంటి బంధమూ అంటదు. అలాంటి పరమాత్మకు దైన్యం బంధం బాధలూ ఉండవు.

యదర్థేన వినాముష్య పుంస ఆత్మవిపర్యయః
ప్రతీయత ఉపద్రష్టుః స్వశిరశ్ఛేదనాదికః

దేన్ని జ్ఞ్యానం, వివేకం, మన స్వరూపం అంటాము?శరీరం కంటే ఆత్మ వేరు. బాల్య కౌమార వార్దక్యాలన్న అవస్థలు శరీరానికి. ఆత్మకు కావు. ఈ శరీరంలో ఉన్న ఆత్మకు శరీరంలో ఉన్న భేదాలు లేనప్పుడు. ఆత్మలో ఉన్న పరమాత్మకు ఎలా దోషాలు అంటుతాయి?ఏ స్వరూప జ్ఞ్యానం లేని వలన " ఈ దేహమే నేను" అనుకుంటున్నామో, శరీరానికి ఉన్న అన్ని అవస్థలూ ఆతమకే ఉన్నాయని భ్రమిస్తున్నాము. తల నరికినట్లు కల వస్తే ఎలా ఐతే మనం అది కల అని గుర్తించక మనకే అయినట్లు భావిస్తామో అలాగే ఇది కూడా

యథా జలే చన్ద్రమసః కమ్పాదిస్తత్కృతో గుణః
దృశ్యతేऽసన్నపి ద్రష్టురాత్మనోऽనాత్మనో గుణః

మడుగులో రాయి వేస్తే అందులో ఉన్న చంద్రుడు కదిలినట్లు కనపడతాడు. మనం ఆ ప్రతిబింబం కదులుతోంది కాబట్టి అందులో ఉన్న చంద్రుడు కదులుతున్నాడనుకుంటాం. శరీరం బాధపడుతోంది కాబట్టి అందులో ఉన్న ఆత్మకూడా బాధ పడుతోంది అనుకుంటాము.
ఆత్మకాని శరీరానికి లభించే గుణములు ఆత్మకే ఉన్నట్లు కనపడుతున్నాయి. నిదురపోతున్నాపుడు నేను బాగా నిదురపోతున్నాను అనుకుంటారా ఎవరిన? ఉన్న 24 తత్వాలు విశ్రాంతి తీసుకున్నా ఆత్మ మాత్రం విశ్రాంతి లేకుండా సంచరిస్తూ ఉంటుంది. శరీరంలో ఉన్న అన్ని అవస్థలూ తనవే అన్నట్లు భావించి నిదుర లేవగానే మనసుతో "నేను బాగా నిదురపోయాను" అని అనిపించేట్లు చేస్తుంది. అందులో ఉన్న ఆత్మకే ఏమీ అంటనప్పుడు అందులో ఉన్న పరమాత్మకు ఎలా అంటుతాయి. అందుకే శరీరం ఉన్నంత మాత్రాన సుఖ దుఖాలు అనుభవించి తీరాలి అన్న నియమం లేదు

స వై నివృత్తిధర్మేణ వాసుదేవానుకమ్పయా
భగవద్భక్తియోగేన తిరోధత్తే శనైరిహ

ఈ శరీరంలో ఉండి ఈ సుఖదుఖాలు నావి కావు అన్న భావన ఎవరికి కలుగుతుంది? నివృత్తి ధర్మంతో కలుగుతుంది. శరీరన్ని ఎవరు ఇచ్చారో వారే ఆ శరీరంతో పని చేయించుకుంటారు. అలా ఫలితాన్ని ఆశిచకుండా చేసే వారు నివృత్తి ధర్మపరులు. అలా చేయడానికి పరమాత్మ కృప కావాలి. ఈ ఉపకరణంతో (శరీరంతో) ఏమి పొందిచాలనుకుంటాడో ఆయనే పొందిస్తాడు. అలాంటి జ్ఞ్యానం భగవంతుని మీద భక్తిగా మారుతుంది. ఈ సంసారంలో మనం చేసే ప్రతీ పనీ ఆయన కోసమే. అలాంటి భక్తితో మెల్ల మెల్లగా దేహాత్మాభిమానం కనుమరుగవుతుంది.

యదేన్ద్రియోపరామోऽథ ద్రష్ట్రాత్మని పరే హరౌ
విలీయన్తే తదా క్లేశాః సంసుప్తస్యేవ కృత్స్నశః

ఇంద్రియముల ప్రవృత్తే అన్నిటికీ కారణం. విషయములను చూచి అవి అనుభవిస్తే మనకు సుఖంగా ఉంటుంది అనే భావనే దుఖానికి కారణం. విషయముల యందు ఇంద్రియాలను ప్రవర్తింపచేయకుండా పరమాత్మ యందు ప్రవర్తింపచేస్తే ఇంక సుఃకం దుఃఖం ఉండదు, పరమాత్మ మాయా ఉండదు. శరీరాన్ని ఆత్మనీ కాకుండా అందులో ఉన్న ద్రష్ట (పరమాత్మ) వరకూ వెళ్ళినపుడు అన్ని కష్టములూ అందులోనే లీనమవుతాయి. ఎలా ఐతే నిదురపోయినపుడు ఎలా మానసిక బాధలు అనుభవానికి రావో

అశేషసఙ్క్లేశశమం విధత్తే గుణానువాదశ్రవణం మురారేః
కిం వా పునస్తచ్చరణారవిన్ద పరాగసేవారతిరాత్మలబ్ధా

నిద్ర ఎలా ఐతే దుఃఖాలని లేకుండా చేస్తుందో, మెలుకువలో కూడా అలా ఉండాలంటే పరమాత్మ గుణాను శ్రవణం ఒక్కటే మార్గం. కీర్తన చేస్తేనే కష్టాలు పోతే, అలాంటి పరమాత్మ పాదారవింద పరాగ సేవ యందు ప్రీతి ఉన్నవారికి బాధలెక్కడివి?

విదుర ఉవాచ
సఞ్ఛిన్నః సంశయో మహ్యం తవ సూక్తాసినా విభో
ఉభయత్రాపి భగవన్మనో మే సమ్ప్రధావతి

నా సంశయాన్ని సూక్తి అనే కత్తితో కోసేసావు. ఇపుడు నా మనసు రెండు వైపులకూ పోతోంది. పరమాత్మ శ్రవణమూ, పరమాత్మ పాద సేవనం మీదకూ పోతోంది.

సాధ్వేతద్వ్యాహృతం విద్వన్నాత్మమాయాయనం హరేః
ఆభాత్యపార్థం నిర్మూలం విశ్వమూలం న యద్బహిః

సృష్టి తత్వాన్ని బాగా వివరించారు. పరపంచం యొక్క రహస్యం ఎమిటంటే ప్రపంచాన్ని చూచిన వారందరికీ మొదలు కలిగేది అపార్థమే (ఉదా: మనిషి కోతి నుంచే వచ్చాడు. మరి అనంతకోటి జీవరాశులు ఎక్కడినుంచి వచ్చాయి?) ప్రపంచం నిర్మూలం అనిపిస్తుంది (నాస్తిక వాదుల ప్రకారం ఈ సృష్టి అంతా సహజంగా ఏర్పడింది). ప్రపంచం అవతల ఏముందో తెలీదు, లోపల ఏముందో తెలీదు. కారణం లేకుండా ఏ కార్యం పుట్టదన్న హేతువాదం ప్రపంచం సృష్టికి కూడా ఒక కారణం ఉండాలి అన్నదానితో ఒప్పుకోవాలి. మరి ఆ కారణం పరపంచానికి అవతల ఉందా? ప్రపంచానికి లోపల ఉందా? విత్తు నుండి పుట్టిన చెట్టు, చెట్టు వచ్చాక ఆ విత్తు కనపడదు. ప్రపంచానికి మూలం అవతల ఎక్కడో లేదు, ప్రపంచంలోనే ఉంది. చెట్టులో విత్తు కనపడలేదు కాబట్టి విత్తు నుండి చెట్టు రాలేదు అనగలమా?

యశ్చ మూఢతమో లోకే యశ్చ బుద్ధేః పరం గతః
తావుభౌ సుఖమేధేతే క్లిశ్యత్యన్తరితో జనః

ఈ  లోకంలో ఆనందంగా ఉండేవాడు అతి మూర్ఖుడు లేదా పరమ జ్ఞ్యాని. శరీరంలో ఆత్మ, అంతర్యామిగా పరమాత్మ ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఎవరికి ఫలితం కలుగుతోందో వాడు కర్త కాదు. కర్త అయిన వాడికి ఫలితం రావట్లేదు. పని చేసేది శరీరం. దానితో చేయించేది బుద్ధి. వాటిని కూర్చేది ఆత్మ. దానిలో ఉన్నది పరమాత్మ.

అర్థాభావం వినిశ్చిత్య ప్రతీతస్యాపి నాత్మనః
తాం చాపి యుష్మచ్చరణ సేవయాహం పరాణుదే

ఆత్మ కానిదాన్ని ఆత్మ అనుకునే అపార్థం మీ లాంటి మహానుభావుల పాదసేవతో తొలగించుకుంటాను.

యత్సేవయా భగవతః కూటస్థస్య మధుద్విషః
రతిరాసో భవేత్తీవ్రః పాదయోర్వ్యసనార్దనః

భగవంతుని పాదముల సేవను చేయాలనే కోరిక కలిగేది భాగవతోత్తముల పాదసేవ చేసినపుడే. అపుడే భగవంతుని పాదపద్మముల యందు ప్రీతి విచ్చుకుంటుంది. పెద్దలే మనకు బుద్ధినిచ్చేవారు
పరమాత్మ యందు కలిగే ప్రీతి అన్ని బాధలూ తొలగిచేది

దురాపా హ్యల్పతపసః సేవా వైకుణ్ఠవర్త్మసు
యత్రోపగీయతే నిత్యం దేవదేవో జనార్దనః

ఇది అందరికీ అందేది కాదు. కొద్ది పూజలు చేసే వారికి ఇది కలగదు. ఎంత భగవత్భక్తి కలిగితే అంత భాగవత భక్తి కలుగుతుంది. ఎంత భాగవత భక్తి కలిగితే అంత భగవత భక్తి లభిస్తుంది. మహాతపస్సుతోనే లభిస్తుంది. . నిరనతరం భగవంతుని కీర్తించే భక్తుల యందు భక్తి కలుగుట కష్టసాధ్యం

సృష్ట్వాగ్రే మహదాదీని సవికారాణ్యనుక్రమాత్
తేభ్యో విరాజముద్ధృత్య తమను ప్రావిశద్విభుః

స్వామి మొదలు ప్రకృతిని క్షోభింపచేసి తద్వారా వచ్చిన అంతటినీ సృష్టించాడు, అండం నుంచి విరాట్ పురుషున్నీ సృష్టించి, అందులో ఆయన ప్రవేశించాడు, ఆయనే ఆది పురుషుడు. అని చెప్పరు

యమాహురాద్యం పురుషం సహస్రాఙ్ఘ్ర్యూరుబాహుకమ్
యత్ర విశ్వ ఇమే లోకాః సవికాశం త ఆసతే

ఆ పరమాత్మ యందే ఈ చరాచర సృష్టి అంతా వికసించింది.

యస్మిన్దశవిధః ప్రాణః సేన్ద్రియార్థేన్ద్రియస్త్రివృత్
త్వయేరితో యతో వర్ణాస్తద్విభూతీర్వదస్వ నః

ఇక్కడే దశ ప్రాణ వాయువులూ, ఇంద్రియములూ విషయములూ, సత్వ రజ తమో గుణాలు, అన్నీ చెప్పారు. వాటి విభూతులని మాకు వివరించు

యత్ర పుత్రైశ్చ పౌత్రైశ్చ నప్తృభిః సహ గోత్రజైః
ప్రజా విచిత్రాకృతయ ఆసన్యాభిరిదం తతమ్

ఆయా వర్ణములు, వారి పుత్రులు పౌత్రులు వారి పుత్రులు గోత్రాలు,

ప్రజాపతీనాం స పతిశ్చక్లృపే కాన్ప్రజాపతీన్
సర్గాంశ్చైవానుసర్గాంశ్చ మనూన్మన్వన్తరాధిపాన్

ప్రజాపతులకు పతి అయిన బ్రహ్మ నవ ప్రజాపతులను ఎలా సృష్టించాడు. మనువులెందరూ, మన్వంతరములు ఏమిటీ,

ఏతేషామపి వేదాంశ్చ వంశానుచరితాని చ
ఉపర్యధశ్చ యే లోకా భూమేర్మిత్రాత్మజాసతే

ఆ వంశం యొక్క అనుచరితములూ ఉపర్లోకములూ అధోలోకములు వారికి మిత్రులూ (గ్రహములూ) వారి సంతానము, వీటినీ, వాటి సృష్టి,

తేషాం సంస్థాం ప్రమాణం చ భూర్లోకస్య చ వర్ణయ
తిర్యఙ్మానుషదేవానాం సరీసృపపతత్త్రిణామ్
వద నః సర్గసంవ్యూహం గార్భస్వేదద్విజోద్భిదామ్

పశు పక్ష మానవ దేవత కీటకముల , జంతుజాలముల, (జంతువులు నాలుగు రకాలు: జరాయుజ (మావి వలన), అండజములు (పక్షులు) స్వేదజములు ఉద్భిజ్జములు (లతలు వృక్షములు) ).

గుణావతారైర్విశ్వస్య సర్గస్థిత్యప్యయాశ్రయమ్
సృజతః శ్రీనివాసస్య వ్యాచక్ష్వోదారవిక్రమమ్

ప్రపంచం యొక్క సృష్టి రక్షణ లయమూ ఇవన్నీ వివరించు, ఎందుకంటే ఇదంతా పరమాత్మ కృపా విశేషం వలన ఏర్పడినది. సృష్టిలోనూ, సృష్టి నిర్మాణంలోనూ, రక్షణలోనూ ఉన్నదంతా స్వామి ఔదార్యమే

వర్ణాశ్రమవిభాగాంశ్చ రూపశీలస్వభావతః
ఋషీణాం జన్మకర్మాణి వేదస్య చ వికర్షణమ్

వర్ణములు ఆశ్రములూ రూపములూ శీలమూ స్వభావం, ఋషులు జన్మ కర్మలు

యజ్ఞస్య చ వితానాని యోగస్య చ పథః ప్రభో
నైష్కర్మ్యస్య చ సాఙ్ఖ్యస్య తన్త్రం వా భగవత్స్మృతమ్

యజ్ఞ్యయాగాదులూ

పాషణ్డపథవైషమ్యం ప్రతిలోమనివేశనమ్
జీవస్య గతయో యాశ్చ యావతీర్గుణకర్మజాః

పాషణ్డుల మార్గములూ, ఎన్ని కర్మలు ఉన్నాయో వాటినీ

ధర్మార్థకామమోక్షాణాం నిమిత్తాన్యవిరోధతః
వార్తాయా దణ్డనీతేశ్చ శ్రుతస్య చ విధిం పృథక్

ధర్మార్థ కామ మోక్షములు నిమిత్తము, వార్త లౌకిక వృత్తి,

శ్రాద్ధస్య చ విధిం బ్రహ్మన్పిత్ణాం సర్గమేవ చ
గ్రహనక్షత్రతారాణాం కాలావయవసంస్థితిమ్

శ్రాద్ధం, విధి, గ్రహములు, కాలము,

దానస్య తపసో వాపి యచ్చేష్టాపూర్తయోః ఫలమ్
ప్రవాసస్థస్య యో ధర్మో యశ్చ పుంస ఉతాపది

దానమటే ఏమిటి, తపసు, యజ్ఞ్య యాగాదులూ, నదీ తటాక నిర్మాణాలు వీటినీ, మానవ ధర్మాలు, ఆపద్ధార్మాలు, ప్రవాస ధర్మం, నివాస ధర్మాలు

యేన వా భగవాంస్తుష్యేద్ధర్మయోనిర్జనార్దనః
సమ్ప్రసీదతి వా యేషామేతదాఖ్యాహి మేऽనఘ

భగవంతుడు సంతోషించే ధర్మాలు చెప్పు, ఏమి చెప్తే ధర్మ స్వరూపుడైన పరమాత్మ సంతోషిస్తాడో అవి చెప్పు

అనువ్రతానాం శిష్యాణాం పుత్రాణాం చ ద్విజోత్తమ
అనాపృష్టమపి బ్రూయుర్గురవో దీనవత్సలాః

అనుసరించే వారికి, శిష్యులకు పుత్రులకు అడగకున్నా దీనవత్సలురైన గురువులు చెబుతారు.

తత్త్వానాం భగవంస్తేషాం కతిధా ప్రతిసఙ్క్రమః
తత్రేమం క ఉపాసీరన్క ఉ స్విదనుశేరతే

తత్వములెన్ని, సృష్టి ఎంత, ప్రళయములెంతా, ఎవరెవరు ఎవరెవరిని ఉపాసించారు, ఎవరెవరు ఎవరెవరిలో లీనమయ్యారు.

పురుషస్య చ సంస్థానం స్వరూపం వా పరస్య చ
జ్ఞానం చ నైగమం యత్తద్గురుశిష్యప్రయోజనమ్

జీవ పరమాత్మ ప్రపంచ స్వరూపం, గురుశిష్య ప్రయోజనమైన వైదిక జ్ఞ్యానాన్ని. జ్ఞ్యానులతోటి పండితులతోటి ఏవి నిర్దేశించబడ్డాయో

నిమిత్తాని చ తస్యేహ ప్రోక్తాన్యనఘసూరిభిః
స్వతో జ్ఞానం కుతః పుంసాం భక్తిర్వైరాగ్యమేవ వా

భక్తి జ్ఞ్యానాలు స్వయంగానే కలుగుతాయా? అందరికీ అనుకోకుండానే వస్తాయా? ఎవరిన బోధిస్తే కలుగుతాయా?

ఏతాన్మే పృచ్ఛతః ప్రశ్నాన్హరేః కర్మవివిత్సయా
బ్రూహి మేऽజ్ఞస్య మిత్రత్వాదజయా నష్టచక్షుషః

ఈ ప్రశ్నలు అడుగుతున్నది మాకోసం కాదు, భగవత్ తత్వాన్ని తెలుసుకోడానికి, పరమాత్మ కర్మను తెలుసుకోవడానికి. జ్ఞ్యామూ వివేకమూ (చక్షు) రెండూ లేని నాకు మిత్రులు, మిత్రాపుత్రులు కాబట్టి దయచేయండి

సర్వే వేదాశ్చ యజ్ఞాశ్చ తపో దానాని చానఘ
జీవాభయప్రదానస్య న కుర్వీరన్కలామపి

పధ్నాలుగు లోకాలలో ఎన్ని వేదములున్నాయో యజ్ఞ్యాలున్నాయో దానాలున్నాయో ఇవన్నీ ఒక్క జీవునికి అభయమివ్వడం అనేదానిలో చిన్న అంశానికి కూడా సరిపోవు. యజ్య్న దాన తప శాస్త్రాలు ఏవీ అభయానికి సాటిరావు

శ్రీశుక ఉవాచ
స ఇత్థమాపృష్టపురాణకల్పః కురుప్రధానేన మునిప్రధానః
ప్రవృద్ధహర్షో భగవత్కథాయాం సఞ్చోదితస్తం ప్రహసన్నివాహ

కురుప్రధానుడు (విదురుడు) మునిప్రధానుడు (మైత్రేయుని) అడిగితే కట్టలు తెంచుకున్న ఆనందంతో భగవత్ కధలను అడిగినందు వలన, అవి చెప్పే అవకాశం వచ్చినందుకు ఆనందించాడు.
విదురుడు అడిగినవి చెప్పాలంటే పురాణమే అవుతుంది. పురాణ లక్షణాలన్నీ అందులో . పరమాత్మ కథలు చెప్పమని అడగడం వలన పెరిగిన సంతోషం కలవాడై నవ్వుతున్నట్లుగా  ఇలా అన్నాడు

Saturday, January 5, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఆరవ అధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం ఆరవ అధ్యాయం

ఋషిరువాచ
ఇతి తాసాం స్వశక్తీనాం సతీనామసమేత్య సః
ప్రసుప్తలోకతన్త్రాణాం నిశామ్య గతిమీశ్వరః

కాలసఞ్జ్ఞాం తదా దేవీం బిభ్రచ్ఛక్తిమురుక్రమః
త్రయోవింశతి తత్త్వానాం గణం యుగపదావిశత్

సోऽనుప్రవిష్టో భగవాంశ్చేష్టారూపేణ తం గణమ్
భిన్నం సంయోజయామాస సుప్తం కర్మ ప్రబోధయన్

ప్రబుద్ధకర్మ దైవేన త్రయోవింశతికో గణః
ప్రేరితోऽజనయత్స్వాభిర్మాత్రాభిరధిపూరుషమ్

పరేణ విశతా స్వస్మిన్మాత్రయా విశ్వసృగ్గణః
చుక్షోభాన్యోన్యమాసాద్య యస్మిన్లోకాశ్చరాచరాః

హిరణ్మయః స పురుషః సహస్రపరివత్సరాన్
ఆణ్డకోశ ఉవాసాప్సు సర్వసత్త్వోపబృంహితః

జలములు రెండు రకాలు. ప్రకృతి  జలం, అండ జలం. ఈ అండజలం అండం సృష్టించిన తరువాత వచ్చి ఉండాలి. పుట్టిన బ్రహ్మగారు ఆ జలాన్ని తాగి సృష్టిస్తాడు. అండ సృష్టి కాగానే అండములో ఏర్పడినది జలము.
ఆపోవా ఇదమగ్ర అసీత్ - మొదలు జలమే ఉండెను.బ్రహ్మగారి కంటే ముందు కూడా ఉన్నది జలమే. 23 తత్వములు ఏర్పడ్డాయి. అవి అన్నీ అండముగా ఏర్పడ్డాయి. అందులో పరమాత్మ ప్రవేశించి పరస్పర చోదక శక్తిని ప్రవేశింపచేసినపుడు అవి అన్నీ కలిపి ఒక పురుషున్ని సృష్టి చేయడానికి ముందే అందులో జలం ఉంది. అలాంటి జలంలోనే స్వామి కొంతకాలం ఉన్నాడు. నారములలో ఉన్నడు కాబట్టి నారాయణుడు అంటారు

స వై విశ్వసృజాం గర్భో దేవకర్మాత్మశక్తిమాన్
విబభాజాత్మనాత్మానమేకధా దశధా త్రిధా

లోపల పురుషుడూ ఏర్పడ్డాడు, జలమూ ఏర్పడింది, దీని వలన ఈ గర్భము జ్ఞ్యానేంద్రియములు (దేవ) కర్మేంద్రియములు (కర్మ), ఆత్మ లేదా ఇంద్రియములు (దేవ) విషయములు ఆత్మ (దేవకర్మాత్మశక్తిమాన్). ఇలాంటి మూడు శక్తులకు తగిన రీతిగా విభజన చేయబడింది. తనను తాను ఎలా విభజించాడంటే - ఇంద్రియములు (10 దశద), సత్వ రజ తమ గుణాలు (త్రిధా) మనసు (ఏకధా). వీటిని పది ప్రాణములు అనొచ్చు, పది ఇంద్రియములూ అనొచ్చు, మూడు గుణములూ ,లేదా త్రివృత్ అనొచ్చు (అకార ఉకార మకారములు), ఏకమూ అంటే హృదయమూ అనొచ్చూ మనసూ అనొచ్చూ.

ఏష హ్యశేషసత్త్వానామాత్మాంశః పరమాత్మనః
ఆద్యోऽవతారో యత్రాసౌ భూతగ్రామో విభావ్యతే

ఈ పురుషుడే (విరాట్ పురుషుడు),  అఖిల ప్రాణులకూ ఇదే ఆత్మ (ఇక్కడినుంచే మనందరికీ చలనం కలుగుతుంది). ఇది పరమాత్మ యొక్క ఆత్మ భాగము. దీనినే మనం పరమాత్మ యొక్క మొదటి అవతారం అంటాము. ఈయననే బ్రహ్మ అంటాము, విరాట్ పురుషుడు అంటాము. ఈ అవతారమందే సకల చరాచర ప్రాణుల సమూహం ఆవిర్భవించబడుతుంది, ప్రేరేపించబడుతుంది, సృష్టించబడుతుంది. చేతనాచేతనముల స్వరూప స్వభావాలు ఇక్కడే నిక్షిప్తం చేయబడుతున్నాయి

సాధ్యాత్మః సాధిదైవశ్చ సాధిభూత ఇతి త్రిధా
విరాట్ప్రాణో దశవిధ ఏకధా హృదయేన చ

సాధ్యాత్మః  - భోక్తృవర్గం - అనుభవించేది సాధిదైవశ్చ - భోగ్యవర్గము - అనుభవించబడేది సాధిభూత - కరణములు (ఇంద్రియములు). శరీరేంద్రియ విషభేదాత్ అంటారు తర్కములో. శరీర ఇంద్రియ విషయములనే భోక్తృవర్గం, భోగ్యవర్గము, కరణములు.
మొదలు తాను అంతటా సంచరించాలి కాబట్టి దశవిధాలైన ప్రాణ వాయువును సృష్టించాడు. లోపల ఉండి మనచే పని చేయించే వాయువులు ఐదు. ఇంద్రియాలలో ఉండి పని చేయించే వాయువులు ఐదు. ప్రతీ కదలికా వాయువు వలననే జరుగుతుంది. వాక్ ద్వారంలో ఉండే వాయువు నాగము. కనులు తెరుచుట మూయుటలో కూర్మ వాయువు, తుమ్మేప్పుడు వచ్చే వాయువు క్రకరం ఆవలించినపుడు దేవదత్తము. చనిపోయిన తరువాత కూడా వదలని వాయువు ధనంజయ.
అలాగే హృదయాన్ని సృష్టించాడు.

స్మరన్విశ్వసృజామీశో విజ్ఞాపితమధోక్షజః
విరాజమతపత్స్వేన తేజసైషాం వివృత్తయే

23 తత్వముల అధిపతి ఈ విరాట్ పురుషుడు, పరమాత్మ, వాటి ప్రార్థనను బట్టి అనుగ్రహించాడు. వాటికి కావలసిన శక్తిని ప్రసాదించాడు. విరాట్ పురుషునిలో సంకల్పించే శక్తి కలిగింపచేసాడు. తక్కినవన్నీ తమ పనులు మానేసి తమ శక్తిని బుద్ధికిస్తేనే బుద్ధి పని చేస్తుంది. అలాగే ఇంద్రియములు తాము చేయవలసిన పనులు మానేసి ప్రవృత్తి నుంచి నివృత్తికి రావడమే తపస్సు. అన్ని ఇంద్రియాలు మూసుకుని ఉండటమే తపస్సు. పరమాత్మ విరాట్ పురుషునికి ఆలోచించగల శక్తిని ప్రసాదించాడు. 23 గణముల వివృత్తి (ప్రసరించుట) చేయుటకు ఆలోచింపచేసాడు.

అథ తస్యాభితప్తస్య కతిధాయతనాని హ
నిరభిద్యన్త దేవానాం తాని మే గదతః శృణు

ఎపుడైతే పరమాత్మ అనుగ్రహంతో ఇవన్నీ కలిసి ఆలోచించడం మొదలుపెట్టాయో, 23 గణములలో ఒక్కొక్క గణం ప్రవర్తించడం వలన కలిగిన మార్పు, ఏర్పడిన స్వరూపం, వాటిని చెబుతున్నాను విను

తస్యాగ్నిరాస్యం నిర్భిన్నం లోకపాలోऽవిశత్పదమ్
వాచా స్వాంశేన వక్తవ్యం యయాసౌ ప్రతిపద్యతే

మొదలు పని చేయాలన్న శక్తి కావాలి, ఆహారం తీసుకోవాలి. ఆకలవుతుందని అనాలి. ఈ రెంటికీ ప్రథానం ఆస్యం, నోరు ప్రథానం. ఈ నోరుకు అగ్ని ప్రథాన దేవత. దిక్పాలకుడు అగ్ని. మొదలు వాకు ఏర్పడింది, అందులో అగ్ని ప్రవేశించాడు. దాని వలన మాట్లాడే శక్తి ప్రవేశించింది

నిర్భిన్నం తాలు వరుణో లోకపాలోऽవిశద్ధరేః
జిహ్వయాంశేన చ రసం యయాసౌ ప్రతిపద్యతే

దవడల కింది భాగాన్ని తాఉ అంటారు. దీనికి అధిదేవత వరుణుడు. నిప్పు ఎక్కడ ఉంటే అక్కడ నీరు ఉంటుంది. అగ్ని నుండే నీరు పుట్టింది. వరుణాంశంతో రసమును జిహ్వ గ్రహిస్తుంది. జిహ్వ అనేది వరుణుని అంశము. ఆయన రసాన్ని జిహ్వతో స్వీకరిస్తాడు

నిర్భిన్నే అశ్వినౌ నాసే విష్ణోరావిశతాం పదమ్
ఘ్రాణేనాంశేన గన్ధస్య ప్రతిపత్తిర్యతో భవేత్

తరువాత ఈ మహాపురుషునికి నాసికా రంధ్రం ఏర్పడింది. అందులో అశ్వనీ దేవతలు ప్రవేశించారు. దాని తరువాత ఈ నాసిక లో ఘ్రాణ ఇంద్రియం ఆవిర్భవించింది. దీనితో గంధమును స్వీకరిస్తున్నాము.

నిర్భిన్నే అక్షిణీ త్వష్టా లోకపాలోऽవిశద్విభోః
చక్షుషాంశేన రూపాణాం ప్రతిపత్తిర్యతో భవేత్

తరువాత స్వామికి కన్నులు ఏర్పడ్డాయి. త్వష్ట అనే లోకపాలకుడు ప్రవేశించాడు. దానిలో చక్షు ఇంద్రియం ప్రవేశించింది

నిర్భిన్నాన్యస్య చర్మాణి లోకపాలోऽనిలోऽవిశత్
ప్రాణేనాంశేన సంస్పర్శం యేనాసౌ ప్రతిపద్యతే

తరువాత చర్మం ఏర్పడింది.ఇందులో వాయువు ప్రవేశించాడు,. ఈ వాయువులో ఉన్నది త్వక్ అనే ఇంద్రియం. ఈ ఇంద్రియం స్పర్శను గ్రహిస్తుంది. ఇది ప్రాణం (వాయువు). స్పర్శ జ్ఞ్యానం కలగాలంటే ప్రాణ వాయువు ఉండాలి.

కర్ణావస్య వినిర్భిన్నౌ ధిష్ణ్యం స్వం వివిశుర్దిశః
శ్రోత్రేణాంశేన శబ్దస్య సిద్ధిం యేన ప్రపద్యతే

దిక్కులనే దేవతలు అధిపతిగా కర్ణ రంధ్రాలు ఏర్పడ్డాయి, దాని ఇంద్రియం శ్రోత్రం. ఈ శ్రోత్రం శబ్దాన్ని గ్రహిస్తుంది

త్వచమస్య వినిర్భిన్నాం వివిశుర్ధిష్ణ్యమోషధీః
అంశేన రోమభిః కణ్డూం యైరసౌ ప్రతిపద్యతే

త్వక్ ఇంద్రియం (ఇది వేరు చర్మం వేరు). దురద వేస్తే తెలిసేది త్వక్ వలన. ఇందులో దేవత ఔషధీ. దీని వలన మనకు రోమములతో కండూయనం (దురద) తెలుస్తుంది. అవి లేకపోతే దురద కలిగినా, కలిగినట్లు తెలీదు.

మేఢ్రం తస్య వినిర్భిన్నం స్వధిష్ణ్యం క ఉపావిశత్
రేతసాంశేన యేనాసావానన్దం ప్రతిపద్యతే

జననీంద్రియానికి అధిపతి ప్రజాపతి. రేతస్సుతో ప్రజాపతి ఆనందములాంటిది పొందుతాడు

గుదం పుంసో వినిర్భిన్నం మిత్రో లోకేశ ఆవిశత్
పాయునాంశేన యేనాసౌ విసర్గం ప్రతిపద్యతే

మిత్రుడు అధిదేవతగా పాయు ఇంద్రియం విసర్జించడానికి ఉపయోగపడుతుంది

హస్తావస్య వినిర్భిన్నావిన్ద్రః స్వర్పతిరావిశత్
వార్తయాంశేన పురుషో యయా వృత్తిం ప్రపద్యతే

చేతులకి ఇంద్రుడు అధిదేవత, పాణి అనే ఇంద్రియం. బ్రతుకు తెరువుకి (వార్తయాంశేన ) ఈ చేతులు ఆధారం

పాదావస్య వినిర్భిన్నౌ లోకేశో విష్ణురావిశత్
గత్యా స్వాంశేన పురుషో యయా ప్రాప్యం ప్రపద్యతే

విష్ణువు పాదములకు అధిదేవత, పాదం అనేది ఇంద్రియం. చేరవలసిన చోటుకు చేరుస్తుంది. మనందరికి గమ్యాన్ని చేర్చేది పాదములు (అలాగే మనందరి గమ్యానికి చేర్చేది విష్ణువే)

బుద్ధిం చాస్య వినిర్భిన్నాం వాగీశో ధిష్ణ్యమావిశత్
బోధేనాంశేన బోద్ధవ్యమ్ప్రతిపత్తిర్యతో భవేత్

తరువాత బుద్ధి ఏర్పడింది. దానికి వాగీశుడు (బ్రహ్మ) అధిపతి. బోధన అనే అంశముతో తెలియవలసిన దాన్ని తెలుసుకుంటాము.

హృదయం చాస్య నిర్భిన్నం చన్ద్రమా ధిష్ణ్యమావిశత్
మనసాంశేన యేనాసౌ విక్రియాం ప్రతిపద్యతే

హృదయానికి చంద్రుడు అధిపతి.  (చంద్రమా మనసో జాతా). ఇందులో ఇంద్రియం పేరు మనసు. ఈ మనసు వికారం పొందుతుంది. దాని స్వభావమే వికారం పొందడం

ఆత్మానం చాస్య నిర్భిన్నమభిమానోऽవిశత్పదమ్
కర్మణాంశేన యేనాసౌ కర్తవ్యం ప్రతిపద్యతే

తరువాత అంతఃకరణం, (దీనినే అభిమానం అహంకారం అని కూడా అంటారు) అధిదేవత శంకరుడు, ఆయన అంతఃఅకరణ అధిస్టాత. ఈ అంతఃకరణం ఏ పని చేయాలో దాన్ని  నిశ్చయిస్తుంది. బుద్ధి ఆలోచిస్తుంది, మనసు సంకల్పిస్తుంది. ఆలోచించిన దాన్ని నిశ్చయించేది అంతఃకరణం

సత్త్వం చాస్య వినిర్భిన్నం మహాన్ధిష్ణ్యముపావిశత్
చిత్తేనాంశేన యేనాసౌ విజ్ఞానం ప్రతిపద్యతే

సత్వం (చిత్తం) లో కి ఆత్మాశ ప్రవేశిస్తే చిత్తమనే ఇంద్రియం ప్రవేశిస్తే విజ్ఞ్యానం ఏర్పడుతుంది. ప్రతీ దానిలో ఉన్న సూక్ష్మ పరిశీలనాత్మక బుద్ధిని చిత్తం అంటారు. పరిశీలించే పని చిత్తానిది. నిశ్చయించే పని అంతఃకరణానిది ఆలోచించే పని బుద్ధిది, మార్పు చెందే పని మనసుది. ఈ నాలుగూ వేరు.

శీర్ష్ణోऽస్య ద్యౌర్ధరా పద్భ్యాం ఖం నాభేరుదపద్యత
గుణానాం వృత్తయో యేషు ప్రతీయన్తే సురాదయః

ఈయన శిరస్సు నుండి ద్వి లోకం (అంతరిక్షం) పాదములనుండి భూమి, నాభి నుండి ఆకాశం. అంతరిక్షం భూమి ఆకాశం, ఈ మూడులోకాల (భూః భువః సువః - ద్విలోకం భూలోకం అంతరిక్షం),  ఈ మూడులోకాలూ మూడు గుణములు కలవారికి నిలయాలు. సత్వ గుణం ఉన్నవారు, దేవతలు ఆకాశంలో, రజోగుణం ఉన్న మానవాది జీవులు భూమి మీద, భూత ప్రేత పిశాచాలు, తమో గుణం కలవారు అంతరిక్షంలో.

ఆత్యన్తికేన సత్త్వేన దివం దేవాః ప్రపేదిరే
ధరాం రజఃస్వభావేన పణయో యే చ తానను

పూర్తి సత్వ గుణంతో దేవతలు ద్విలోకాన్ని చేరుతున్నారు. మానవులు (పణయులు - బేరంతో బ్రతికేవారు - వినిమయంతో బ్రతికేవారు), మానవులని అనుసరించే పశు పక్షాదులు భూమి మీద

తార్తీయేన స్వభావేన భగవన్నాభిమాశ్రితాః
ఉభయోరన్తరం వ్యోమ యే రుద్రపార్షదాం గణాః

మూడవ గుణం (తమో గుణం ) ఉన్నవారు పరమాత్మ యొక్క నాభిని ఆశ్రయించారు (ఖం) అంతరిక్షాన్ని ఆశ్రయించారు. ఈ భూమికీ ఆకాశానికి మధ్యనున్న దానిని అంతరిక్షం అంటాం, అక్కడ రుద్ర పార్షదులు ఉంటాయి.

ముఖతోऽవర్తత బ్రహ్మ పురుషస్య కురూద్వహ
యస్తూన్ముఖత్వాద్వర్ణానాం ముఖ్యోऽభూద్బ్రాహ్మణో గురుః

ముఖం యొక్క వ్యాపారం ప్రధానముగా కలవారు బ్రాహ్మణులు (చదువు చెప్పే వారు చదువుకొనేవారు) . బ్రాహ్మణుడు ముఖముతో (అధ్యాయంతో) బ్రతుకుతారు. అందుకు బ్రాహ్మణుడు "ముఖ్యుడు" అయ్యాడు

బాహుభ్యోऽవర్తత క్షత్రం క్షత్రియస్తదనువ్రతః
యో జాతస్త్రాయతే వర్ణాన్పౌరుషః కణ్టకక్షతాత్

క్షత్రియుడు అందరినీ పాలించేవాడు. బాహువులతో బ్రతికేవారు క్షత్రియులు. ఆపద నుండి కలిగిన గాయ్ము నుండి ఎవరు కాపాడతారో వారు క్షత్రియులు

విశోऽవర్తన్త తస్యోర్వోర్లోకవృత్తికరీర్విభోః
వైశ్యస్తదుద్భవో వార్తాం నృణాం యః సమవర్తయత్

పరమాత్మ ఊరువులు ధాన్యమునకూ ధనమునకూ మూలము, ప్రతీ చోటా ప్రవేశించేవారు వైశ్యులు. అందుకు పిక్కబలం ఉండాలి. అందుకే ఊరువునుంచి పుట్టారు అని అంటారు

పద్భ్యాం భగవతో జజ్ఞే శుశ్రూషా ధర్మసిద్ధయే
తస్యాం జాతః పురా శూద్రో యద్వృత్త్యా తుష్యతే హరిః

తక్కిన వారు వారి వారి పని సక్రమంగా చేయాలంటే వారికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు అందించగల వారు ఉండాలి. అందువలన ధర్మాన్ని కాపాడేవారు శూద్రులు. అందుకే వారు పుట్టింది పాదముల నుండి, అంటే గమనాగమన వ్యాపారంతోటే వారి పని ఉంటుంది. తక్కిన మూడు వర్ణాల సిద్ధికి కావల్సింది శూద్రులు.

ఏతే వర్ణాః స్వధర్మేణ యజన్తి స్వగురుం హరిమ్
శ్రద్ధయాత్మవిశుద్ధ్యర్థం యజ్జాతాః సహ వృత్తిభిః

ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకంటే పరమాత్మ శూద్ర వృత్తితోనే సంతోషిస్తాడు. విష్ణుపురాణం చివర శూద్ర సాధుః - అందరికంటే ఉత్తముడు శూద్రుడే అని వ్యాసుడు ప్రకటిస్తాడు, స్త్రీ సాధుః, కలిసాధుః, స్త్రీ, శూదురులు, కలి ఉత్తమం. యమ నియమాది నియమాలేమీ లేకుండా సేవ ద్వారా ముక్తి పొందేవాడు శూద్రుడు, భర్త సేవచే మోక్షం పొందేవారు స్త్రీలు, స్మరణ మాత్రంచే మోక్షం వచ్చే యుగం కలియుగం. ఈ నాలుగు వర్ణాలు తమ తమ ధర్మాలతో తమ అధిపతి అయిన పరమాత్మ ఆరాధిస్తారు. వికారం పొందే మనసు వికారం పొందకుండ పరిశుద్ధి పొందేందుకు  పరమాత్మ ఆరాధన శ్రద్ధగా చేస్తారు

ఏతత్క్షత్తర్భగవతో దైవకర్మాత్మరూపిణః
కః శ్రద్దధ్యాదుపాకర్తుం యోగమాయాబలోదయమ్

శరీర ఇంద్రియ విషయములు ( భోక్తు భోగ్యం భోక్త ) యొక్క విశ్వరూపం. సృష్టియొక్క రూపం. పరమాత్మ యొక్క అద్వితీయమైన యోగమాయా బలం ఎవరు తెలియగలరు, ఎవరు నమ్మగలరు.

తథాపి కీర్తయామ్యఙ్గ యథామతి యథాశ్రుతమ్
కీర్తిం హరేః స్వాం సత్కర్తుం గిరమన్యాభిధాసతీమ్

ఆ యోగమాయా బలాన్ని సంపూర్ణంగా ఎవరూ చెప్పలేరు. నేను కూడ ఎంత విన్నానో, విన్న దానిలో ఎంత గుర్తుందో అంత నీకు చెబుతున్నాను. ఈ మాత్రం చెప్పడానికి కారణం, నా వాక్కు ఆ కాసేపయిన వేరే విషయాల వైపుకు వెళ్ళకుండా ఉంటుందని చెబుతున్నాను. ఆ నాలుకకు కీర్తి ఇప్పిద్దామని చెబుతున్నాను. ఇతరమైన వాటిని చెప్పడంతో దుష్టమైన వాక్కును (గిరం) సన్మానించడానికి ఈ మాట చెబుతున్నాను. వేరే మాటలు చెప్తే అది అసత్తవుతుంది (అన్యాభిధాసతీమ్)

ఏకాన్తలాభం వచసో ను పుంసాం సుశ్లోకమౌలేర్గుణవాదమాహుః
శ్రుతేశ్చ విద్వద్భిరుపాకృతాయాం కథాసుధాయాముపసమ్ప్రయోగమ్

ప్రపంచంలో మానవుల వాక్కుకు ఉన్న ఒకే ఒక లాభం ఏమిటంటే పరమాత్మ గుణానుసంధానమే. అంటే మిగతావన్నీ నష్టమన్నమాట. మన చెవులకు లాభం, పండితులు చెప్పే కథా సుధలను గ్రోలుట చెవులకు లాభం, పలుకుట నోటికి లాభం

ఆత్మనోऽవసితో వత్స మహిమా కవినాదినా
సంవత్సరసహస్రాన్తే ధియా యోగవిపక్కయా

ఇలా అండములో ఆవిర్భవించిన బ్రహ్మ ఎంతో కాలం అక్కడున్న నీటిలోనే ఉండి, యోగంతో బుద్ధి పరిపక్వం చేసుకుని పరమాత్మ ప్రభావాన్ని తెలుసుకోలేమని తెలుసుకున్నాడు

అతో భగవతో మాయా మాయినామపి మోహినీ
యత్స్వయం చాత్మవర్త్మాత్మా న వేద కిముతాపరే

ప్రపంచంలో మహామాయావులని కూడా మోహం చేసేది పరమాత్మ మాయ. స్వయముగా తాను తన స్వరూపాని మనకు చెప్పడానికి, బ్రహ్మగారికే అర్థం కాలేదు. (పరమాత్మే బ్రహ్మ అయినా, మనందరికీ ప్రతినిధి అవడం వలన, తన మార్గం వ్యాపింపచేసే వాడైనా, పరమాత్మ మహిమ తెలియరాలేదు), ఇంక మిగతా వరి గురించి చెప్పేది ఏమి ఉంది.

యతోऽప్రాప్య న్యవర్తన్త వాచశ్చ మనసా సహ
అహం చాన్య ఇమే దేవాస్తస్మై భగవతే నమః

ఎక్కడిదాకా వాక్కూ మనసు వెళ్ళి, అందలేదని తిరిగి వస్తాయో, అందులో బ్రహ్మాది దేవతలు కూడా ఎక్కడిదాకా వెళ్ళి, తెలియక వెనక్కి వస్తారో, ఆ భగవంతునికి నమస్కారం. వేదములకూ వేదజ్ఞ్యులకూ, దేవతలకూ, వారి వాక్కులకూ మనసుకూ అందని పరమాత్మకు నమస్కారం

Thursday, January 3, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం అయిదవ అధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం అయిదవ అధ్యాయం

శ్రీశుక ఉవాచ
ద్వారి ద్యునద్యా ఋషభః కురూణాం మైత్రేయమాసీనమగాధబోధమ్
క్షత్తోపసృత్యాచ్యుతభావసిద్ధః పప్రచ్ఛ సౌశీల్యగుణాభితృప్తః

ఇలా వెళ్ళిన విదురుడు గంగా తీరములో ఇంతటి జ్ఞ్యానము అని చెప్పడానికి వీలు లేని మైత్రేయుని వద్దకు అచ్యుత భావముతో పరిశుద్దుడై సౌశీల్యమున్న (గొప్పవారు చిన్నవారు అన్న తేడా లేకుండా అందరినీ సమానంగా ప్రవర్తించడం) గురువుగారిని ఇలా అడిగాడు

విదుర ఉవాచ
సుఖాయ కర్మాణి కరోతి లోకో న తైః సుఖం వాన్యదుపారమం వా
విన్దేత భూయస్తత ఏవ దుఃఖం యదత్ర యుక్తం భగవాన్వదేన్నః

ఇది మనమందరమూ వేసుకోవాలసిన ప్రశ్న. ప్రపంచములో ప్రతీ ప్రాణీ ఎందుకు పని చేస్తుంది? సుఖం కోసం. కానీ వాళ్ళు చేసే పనుల వలన సుఖం కలుగుతున్నదా? పోనీ దుఖమైనా తొలగుతోందా (అన్యదుపారమం వా).
ఈ రెండూ లేకపోగా, ఆ  పనుల వలన మరికాస్త దుఃఖం కలుగుతోంది. ఇది న్యాయమేనా. దీనిలో ఏది యుక్తమో మీరు చెప్పండి. సుఃఖం కోసం పని చేస్తుండగా దుఃఖం ఎందుకు కలుగుతోంది.

జనస్య కృష్ణాద్విముఖస్య దైవాదధర్మశీలస్య సుదుఃఖితస్య
అనుగ్రహాయేహ చరన్తి నూనం భూతాని భవ్యాని జనార్దనస్య

లోకంలో దాదాపు అందరూ పరమాత్మకు విముఖంగా ఉంటారు (పట్టించుకోరు). అటువంటి వారు అధర్మశీలురవుతారు. దాని వలన నిరంతరమూ దుఃఖాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అటువంటివారిని అనుగ్రహించడానికే పరమాత్మ  భక్తులు భూమి మీద సంచరిస్తూ ఉంటారు.

తత్సాధువర్యాదిశ వర్త్మ శం నః సంరాధితో భగవాన్యేన పుంసామ్
హృది స్థితో యచ్ఛతి భక్తిపూతే జ్ఞానం సతత్త్వాధిగమం పురాణమ్

మాకు మంగళం కలిగించే మార్గం సూచించు. దేని చేత ఆరాధించబడిన పరమాత్మ భక్తిచేత పరిశుద్దమైన మనసులో నివసిస్తాడు. శ్రవణమా మననమా కీర్తనమా తపస్సా సమాధా? ఏమి చేసిన ముందు హృదయం పరిశుద్దమవ్వాలి. ఆ మురికి కడగబడడానికి భక్తి వచ్చి చేరాలి. అలాంటి భక్తి పూత చిత్తంలో పరమాత్మ చేరడానికి కావలసిన ఆరాధనా విధానాన్ని వివరించండి. పరమాత్మ హృదయంలో చేరి పరతత్వాన్ని పరమాత్మ తత్వాన్నీ జ్ఞ్యానాన్ని మన హృదయంలోనే ఉండి కలిగిస్తాడు.

కరోతి కర్మాణి కృతావతారో యాన్యాత్మతన్త్రో భగవాంస్త్ర్యధీశః
యథా ససర్జాగ్ర ఇదం నిరీహః సంస్థాప్య వృత్తిం జగతో విధత్తే

భగవానుడు మూటికి అధిపతి: సత్వ,రజ,తమ గుణాలు ఉన్న ప్రకృతికి అధిపతి. అవతారాలు స్వీకరించి అనేక కర్మలు ఆచరిస్తూ ఉంటాడు. మనం కూడా పనులు చేస్తాము. కానీ మన పనులు కర్మ ఆధీనం, పరమాత్మ స్వతంత్ర్యుడు. మనమింతకు ముందు ఏ కర్మ చేసామో, దాని వలన మనము ఆ రోజు ఏ ఫలితం అనుభవించాలో అలా అనుభవిస్తాము. భగవానుడు ఆత్మ తంత్రుడు.
ఇలాంటి పరమాత్మ సకల చరాచర జగత్తునూ ఏ మాత్రమూ కోరిక లేని వాడై సృష్టించాడు. మనం చేసే ప్రతీ పని వెనకా కోరిక ఉంటుంది. పరమాత్మ తనకోసం ఏమీ చేయలేదు. తాననుకుని ఏ పనీ చేయలేదు. ఆయన జగత్తునకు ప్రవృత్తిని, నడవడిని ఏర్పరుస్తాడు.

యథా పునః స్వే ఖ ఇదం నివేశ్య శేతే గుహాయాం స నివృత్తవృత్తిః
యోగేశ్వరాధీశ్వర ఏక ఏతదనుప్రవిష్టో బహుధా యథాసీత్

తాను సృష్టించిన జగత్తును తనలోనే ఉంచుకొని పడుకుంటాడు. ఇప్పుడు నివృత్త వృత్తిని అవలంబిస్తాడు. ఇలా సృష్టి స్థితి సంహారములలో పరమాత్మకు ఏ ఆశా ఉండవు. తాను సృష్టించిన ప్రకృతిలోకి ప్రవేశించి, దానిని బహురూపం చేస్తాడు. సూక్షంగా ఉన్నదానిని స్థూలంగా చేస్తాడు. కనపడని దాన్ని కనపడే దానిగా మారుస్తాడు.

క్రీడన్విధత్తే ద్విజగోసురాణాం క్షేమాయ కర్మాణ్యవతారభేదైః
మనో న తృప్యత్యపి శృణ్వతాం నః సుశ్లోకమౌలేశ్చరితామృతాని

బ్రాహ్మణులకీ గోవులకీ దేవతలకీ సుభం కలిగించడానికి స్వామి అవతరించి ఆయా కర్మలను చేస్తూ ఉంటాడు. ఎంతకాలం విన్నా పరమాత్మ కథలు వింటూ ఉంటే మనసుకు తృప్తి కలగదు.

యైస్తత్త్వభేదైరధిలోకనాథో లోకానలోకాన్సహ లోకపాలాన్
అచీక్లృపద్యత్ర హి సర్వసత్త్వ నికాయభేదోऽధికృతః ప్రతీతః

మహదహంకార, జ్ఞ్యాన కర్మేంద్రియ, పంచతన్మాత్రలు పంచ్భూతాలు, ఇలా 26 తత్వములతో, సత్వ రజ తమ గుణాలతో లోకాలను లోకపాలురను కల్పించాడు (అచీక్లృపద్). పరమాత్మ అన్ని ప్రాణుల శరీరాన్ని వేరు చేసి కడుపులో దాచుకోగలవాడు. ప్రాణులే కాకుండా వాటి కర్మలు కూడా దాచుకుంటాడు.

యేన ప్రజానాముత ఆత్మకర్మ రూపాభిధానాం చ భిదాం వ్యధత్త
నారాయణో విశ్వసృగాత్మయోనిరేతచ్చ నో వర్ణయ విప్రవర్య

నేనడిగిన ప్రశ్నకు వివర్ముగా సమాధానం చెప్పవలసింది. ప్రాణులకు ఒక కర్మ రూపమూ పేరూ ఉంటాయి, కర్మకూ పేరు ఉంటుంది, ఫలితానికీ పేరు ఉంటుంది. ఈ నామ రూప సంకల్పాలౌ సంకల్ప మాత్రంగా సృష్టిస్తున్నాడు. ఆ సృష్టి విధానాన్ని కూడా వివీరించవలసింది.

పరావరేషాం భగవన్వ్రతాని శ్రుతాని మే వ్యాసముఖాదభీక్ష్ణమ్
అతృప్నుమ క్షుల్లసుఖావహానాం తేషామృతే కృష్ణకథామృతౌఘాత్

వ్యాసభగవానుడు చెప్పగా విన్నాము గానీ అందులో మాకు క్షుద్ర సుఖాలు పొందడానికి ఏమి చేయాలో వాటి కోసం ప్రయత్నమే కనపడింది. ఆ కథలు విని ఇంక చాలు అనిపించింది. ఎంత విన్నా దేనితో తృప్తి కలగదో అని నీవు చెప్పు. అలా క్షుద్ర సుఖాలు కలిగించే వ్రతాలు చాలా విన్నాము. అవి మాకు వద్దు.

కస్తృప్నుయాత్తీర్థపదోऽభిధానాత్సత్రేషు వః సూరిభిరీడ్యమానాత్
యః కర్ణనాడీం పురుషస్య యాతో భవప్రదాం గేహరతిం ఛినత్తి

మహర్షులు ఏ పరమాత్మ యొక్క అమృతం వంటి కథలు చెబుతూ ఉంటారో. ఏ పరమాత్మ జీవుని యొక్క కర్ణ నాడి లోకి ప్రవేశించి, అంతవరకూ మనసుకూ, సంసారానికి ఉన్న సంబంధం పోతుంది. సంసారం మీది ప్రీతి భగవానుని కథలు వింటే పోతుంది.

మునిర్వివక్షుర్భగవద్గుణానాం సఖాపి తే భారతమాహ కృష్ణః
యస్మిన్నృణాం గ్రామ్యసుఖానువాదైర్మతిర్గృహీతా ను హరేః కథాయామ్

నీ సఖుడైన వ్యాసుడు పరమాత్మ గుణాలను చెప్పదలచుకునే భారతం చెప్పాడు. కానీ ఆ భారతం విన్న వారికి గ్రామ్య సుఖాలే అర్థమయ్యాయి

సా శ్రద్దధానస్య వివర్ధమానా విరక్తిమన్యత్ర కరోతి పుంసః
హరేః పదానుస్మృతినిర్వృతస్య సమస్తదుఃఖాప్యయమాశు ధత్తే

పరమాత్మ కథలయందు శ్రద్ధ ఉంటే తక్కిన వాటియందు విరక్తి కలుగుతుంది. అటువంటి కథలు చెప్పు.
పరమాత్మ పాదములయందు మనసు నిలిపినవారికి సకల దుఃఖములూ నశిస్తాయి.

తాఞ్ఛోచ్యశోచ్యానవిదోऽనుశోచే హరేః కథాయాం విముఖానఘేన
క్షిణోతి దేవోऽనిమిషస్తు యేషామాయుర్వృథావాదగతిస్మృతీనామ్

అజ్ఞ్యానులైన ప్రజలు, విచారించ దగిన వారి చేత కూడా విచారించదగిన వారు , అటువంటి వారి గురించి బాధపడుతున్నాను. పరమాత్మ కథలు వినడంలో వైముఖ్యం చూపుతారు. బుద్ధిమంతులు ఆరేళ్ళ వయసులోనే భాగవత ధర్మాలు ఆచరించాలి. లేని వారిని పరమాత్మ సంసారంలోకి నెట్టివేస్తాడు. అటువంటి వారు శరీరాన్ని వాక్కునూ మనసునూ అనవసరంగా ఖర్చు పెడతారు. పండితులెవ్వరూ వాదానికి వెళ్ళరు. దాని వలన కాల వ్యయం, గతి వృధా, స్మృతీ వృధా, ఆయువు కూడా వృధా,

తదస్య కౌషారవ శర్మదాతుర్హరేః కథామేవ కథాసు సారమ్
ఉద్ధృత్య పుష్పేభ్య ఇవార్తబన్ధో శివాయ నః కీర్తయ తీర్థకీర్తేః

మైత్రేయా (కౌషారవా), మాకు పరమాత్మ కథలయందే సుఃఖం కలుగుతుంది (శర్మ), అందుకు మాకు భాగవత కథా సారము చెప్పవలసింది, ఎలా అయితే మకరందములోని సారమును మాత్రమే తుమ్మెద గ్రోలుతుందో.

స విశ్వజన్మస్థితిసంయమార్థే కృతావతారః ప్రగృహీతశక్తిః
చకార కర్మాణ్యతిపూరుషాణి యానీశ్వరః కీర్తయ తాని మహ్యమ్

ఆ పరమాత్మ జగత్తు యొక్క సృష్టి స్థితీ ప్రళయములకోసం అవతరించాడు. అతిమానుషమైన కర్మలెన్నో చేసాడు. వాటిని మాత్రం నాకు చెప్పు.

శ్రీశుక ఉవాచ
స ఏవం భగవాన్పృష్టః క్షత్త్రా కౌషారవో మునిః
పుంసాం నిఃశ్రేయసార్థేన తమాహ బహుమానయన్

అందరికీ మోక్షం వచ్చే మార్గాన్ని చెప్పమని ఇంత బాగా విదురుడు అడిగిన తరువాత ఆయనను మెచ్చుకుంటూ మైత్రేయుడు

మైత్రేయ ఉవాచ
సాధు పృష్టం త్వయా సాధో లోకాన్సాధ్వనుగృహ్ణతా
కీర్తిం వితన్వతా లోకే ఆత్మనోऽధోక్షజాత్మనః

చాలా మంచి ప్రశ్న అడిగావు, దాని వలన లోకానికి మేలు జరుగుతుంది. పరమాత్మ యందు మనసు ఉంచినవారెంతటి ఉత్తమైన కీర్తిని పొందుతారో తెలియజేయుటకు, లోకులని అనుగ్రహించడానికి నీవు అడిగావు

నైతచ్చిత్రం త్వయి క్షత్తర్బాదరాయణవీర్యజే
గృహీతోऽనన్యభావేన యత్త్వయా హరిరీశ్వరః

వ్యాసుని వలన పుట్టిన నీలో ఇటువంటి ఉత్తమ బుద్ధి కలగడం ఆశ్చర్యం కాదు. అందువలనే నీవు పరమాత్మనే స్వీకరించి పెరిగావు చిన్నపటినుంచి

మాణ్డవ్యశాపాద్భగవాన్ప్రజాసంయమనో యమః
భ్రాతుః క్షేత్రే భుజిష్యాయాం జాతః సత్యవతీసుతాత్

సాక్షాత్ యమధర్మరాజు అంశ నీవు, వ్యాసుని వలన నీవు పుట్టావు

భవాన్భగవతో నిత్యం సమ్మతః సానుగస్య హ
యస్య జ్ఞానోపదేశాయ మాదిశద్భగవాన్వ్రజన్

పరమాత్మకూ, ఆయన  భక్తులకీ నీవు అత్యంత సమ్మతుడవు, కాబట్టే, నీకు ఉపదేశం చేయమని నాన్ను ఆదేశించాడు.

అథ తే భగవల్లీలా యోగమాయోరుబృంహితాః
విశ్వస్థిత్యుద్భవాన్తార్థా వర్ణయామ్యనుపూర్వశః

నీకు యోగమాయచేత విస్తరించబడిన, వృద్ధిపొంది, భగవానుని లీలలన్నీ, ప్రపంచం యొక్క సృష్టి స్థితి సంహారములూ వివరిస్తాను

భగవానేక ఆసేదమగ్ర ఆత్మాత్మనాం విభుః
ఆత్మేచ్ఛానుగతావాత్మా నానామత్యుపలక్షణః

ఈ సృష్టి విధానం మొత్తం భాగవతంలో ఐదు సార్లు వస్తుంది. ఆత్మావా ఇదమగ్ర ఆసీత్ (ఆత్మా వా ఇదమేక మేవాగ్ర, ఆసీత్) అనేది ఉపనిషత్ వాక్యం. సృష్టించాలన్న సంకల్పం కలిగినపుడు పరమాత్మ మాత్రమే ఉన్నాడు. అంతటా వ్యాపించి ఉండే వాడు, అంతటికీ వెళ్ళేవాడు, ప్రతీ వానిలోనూ ప్రవేశించి శాసించగలవాడు, అంతర్యామిగా ఉండేవాడు. ఆయన విభుడు (సర్వ వ్యాపి). ఆత్మ ఇచ్చా అనుమతౌ: తను సకల జగత్తునీ సృష్టించాలి అని సంకల్పించాడు. పరమాత్మ జరగవలసినదాన్నే సంకల్పిస్తాడు. ఆ సంకల్పం వికసించినపుడు. ఒకడుగా ఉన్న తాను పలువిధములుగా కనపడాలి.

స వా ఏష తదా ద్రష్టా నాపశ్యద్దృశ్యమేకరాట్
మేనేऽసన్తమివాత్మానం సుప్తశక్తిరసుప్తదృక్

ఈయన ఒకనిగా ప్రకాశించేవాడు. సృష్టికి ముందు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఆయనకన్న భిన్నమైనది ఏమీ లేదు. తానే ద్రష్ట, తానే దృశ్యం. చూడబడేది ఉంటేనే చూచే వాడిని ద్రష్ట అంటాము. చూడబడే వాడు ఉన్నాడంటే దృశ్యం ఉంది అని అర్థం. ఈ రెండూ ఉన్నాయి అంటే సృష్టి అయ్యింది అని అర్థం. ఇవి లేకపోతే స్థూల ఆకారమైన ప్రపంచం ఏర్పడలేదు అని అర్థం. పరమాత్మ మాత్రమే ఉన్నాడు. ప్రపంచం జీవుడు కనపడవు. అవి ఆయనలోనే ఉన్నాయి. పరమాత్మ సంకలించుకున్న తరువాత ప్రపంచం జీవుడు స్థూల రూపాన్ని పొందుతాయి.
జీవుడు ప్రకృతి అంతర్లీనంగా ఉన్నాయి. వాటిలో స్వామి ఉన్నాడు. ఈ విషయం తెలిసేది ఎవరికి? పరమాత్మకి మాత్రమే.
పరమాత్మ అసుప్తదృక్ - అసంకుచితమైన (నిదురించని) జ్ఞ్యానము కలవాడు. ఒకే బుద్ధి మనకు ఒక్కోసారి ఒకలాగ పని చేస్తుంది. మన బుద్ధికి సంకోచ వికాసాలు ఉన్నాయి. అవి కూడా మన పూర్వ జన్మలో కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ప్రళయకాలంలో అన్ని శక్తులూ నిద్రపోతూ ఉంటాయి,

సా వా ఏతస్య సంద్రష్టుః శక్తిః సదసదాత్మికా
మాయా నామ మహాభాగ యయేదం నిర్మమే విభుః

అలాంటి సమయంలో తనను తానే కనపడుకుండా ఉన్నాన అని ఆయంకే అనిపించే స్థితి నుంచి తన శక్తితో స్థూల సృష్టిస్తాడు. ఆ శక్తినే మాయా అంటారు. ప్రళయకాలంలో ఈ మాయ లేనట్లుగా ఉంటుంది. (సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్).

కాలవృత్త్యా తు మాయాయాం గుణమయ్యామధోక్షజః
పురుషేణాత్మభూతేన వీర్యమాధత్త వీర్యవాన్

ఈ మాయ (ప్రకృతి) గుణ మయి. సత్వ రజ తమో గుణాలతో కూడి ఉన్నది. ఇది పరమాత్మ సంకల్ప అనువృత్తితో తన శక్తిని ప్రకృతిలో నిక్షేపం చేసాడు. తన స్వరూపమే పురుషునిగా ఆవిర్భవిస్తుంది.

తతోऽభవన్మహత్తత్త్వమవ్యక్తాత్కాలచోదితాత్
విజ్ఞానాత్మాత్మదేహస్థం విశ్వం వ్యఞ్జంస్తమోనుదః

ఇలా ప్రకృతి తత్వంలో తన శక్తిని నిక్షేపం చేసి ఆ ప్రకృతిని క్షోభింప చేయడం వలన మహత్ తత్వం (కాలము చేత ప్రచోదన చేయబడి) ఆవిర్భవించింది. ఈ మహత్ తత్వం జ్ఞ్యాన స్వరూపము. అదే బుద్ధి. తెలియకుండా ఉండే జగత్తు తెలియడానికి అవకాశం ఏర్పడింది. కనపడకుండా ఉన్న జగత్తును కనిపించేలాగ చేసింది. ప్రకృతి మహత్ తత్వాన్ని ఆవిష్కరింపచేసింది. మహత్ తత్వం ఆవిర్భవించే వరకూ మనకేమీ కనపడదు. కనపడినపుడు సృష్టి జరిగింది అంటాము. కనపడనపుడు ప్రళయం అంటాము. ఈ రెండు స్థితులలోనూ మొత్తమూ పరమాత్మలోనే ఉంది. ఆయన కనపడాలి అనుకుంటే సృష్టి, దాచాలనుకుంటే ప్రళయం. చీకటిని తొలగించే పరమాత్మ (తమోనుదః) తన శరీరంలో ఉన్న ప్రపంచాన్ని వ్యక్తీకరించాడు (దీపం వెలిగిస్తే అంతకు ముందు ఉన్న వస్తువులు కనపడ్డట్టు).

సోऽప్యంశగుణకాలాత్మా భగవద్దృష్టిగోచరః
ఆత్మానం వ్యకరోదాత్మా విశ్వస్యాస్య సిసృక్షయా

పరమాత్మ సకల చరాచర సృష్టినీ కనిపించేట్టు చేయాలి అనుకున్నారు. ఆయన మూడు రూపాలలో ఉంటారు. 1. అంశ రూపంలో జీవుడిగా 2. గుణ రూపంలో ప్రకృతిలాగ 3. అవస్థ (సంకల్ప) రూపంలో కాలముగా కనపడతారు. తనను తానే ఈ ప్రపంచాన్ని (లేదా జీవాత్మనీ , ప్రకృతినీ) వికారం కలిగించాడు. ఒక తీరుగా ఉన్న దానిని ఇంకోలాగ చూపాడు. కనపడని దానిని కనపడేట్టుగా చేసాడు. అసత్తు గా ఉండేదాన్ని సత్తు గా చూపాడు

మహత్తత్త్వాద్వికుర్వాణాదహంతత్త్వం వ్యజాయత
కార్యకారణకర్త్రాత్మా భూతేన్ద్రియమనోమయః

ఈ మహత్ తత్వంలో కూడా పరమాత్మ వికారం కలిగింపచేస్తే అందులోంచి ఇంకో తత్వం పుట్టింది. అదే అహంకార తత్వం. పొయ్యిలో కట్టెలను మంట రావడానికి కదిలిస్తాము. అంటే ఇక్కడ కొత్తగా మంట కలిగించట్లేదు. అందులో దాగి ఉన్న మంటనే మనం ఆ కట్టెలోంచి తెప్పిస్తున్నాము. అలాగే  ప్రకృతిలో ఉన్న మహత్ తత్వాన్ని క్షోభింపచేసి కనపడేలా చేసాడు. ఈ అహంకారమే మూడు రకాలుగా ఉంటుంది. కార్యమని (శరీరము), కారణమని (ఇంద్రియ) కర్త(జీవుడు) అని, భూత ఇంద్రియ మనో మయములనీ అంటారు.

వైకారికస్తైజసశ్చ తామసశ్చేత్యహం త్రిధా
అహంతత్త్వాద్వికుర్వాణాన్మనో వైకారికాదభూత్
వైకారికాశ్చ యే దేవా అర్థాభివ్యఞ్జనం యతః

అహంకారం సాత్వికా (అందులోంచి మనసు, ఇంద్రియాధిష్టాన దేవతలు), రాజస ( అందులోంచి జ్ఞ్యానేంద్రియ కర్మేంద్రియ) తామస (అందులోంచి  పంచభూతాలు). దీన్నే వైకారికము (సాత్వికాహంకారం) తైజసం (రాజసాహంకారం) తామసం అంటారు. ఏ వికారమూ లేని అహంకార తత్వంలో పరమాత్మ వికారం వచ్చేట్లు చేసాడు. కాబట్టే దానిని వైకారికం అంటారు.అదే సాత్వికాహంకారం. సాత్వికాహంకారం వలన మనసు ఆవిర్భవించింది. దీన్ని బట్టే ఆయా ఇంద్రియ అధిష్టాన దేవతలు పుట్టారు. అందుకే వారిని వైకారికులు అంటారు. ఈ దేవతల వలనా, మనసు వలనా మనకు విషయములు (అర్థములు) తెలియబడుతున్నాయి. శబ్దాది విషయాలను గ్రహించేవి ఇంద్రియాలైనా వాటికి మనో సంబంధం లేకపోతే అవి గ్రహించబడవు. అందుకే ఇది ప్రథానం.

తైజసానీన్ద్రియాణ్యేవ జ్ఞానకర్మమయాని చ
తామసో భూతసూక్ష్మాదిర్యతః ఖం లిఙ్గమాత్మనః

రాజసాహంకారం నుంచి జ్ఞ్యాన కర్మ ఇంద్రియాలు పుడుతున్నాయి. తామసాహంకారం నుంచి పంచ తన్మాత్రలు పుడతాయి. తన్మాత్ర అంటే సూక్ష్మావస్థ. వీటినే భూతాది (దేని నుంచి పంచభూతములు పుడతాయో) అంటాము. భగవానునికి ఏది ప్రమాణమో (ఏది చిహ్నమో) అది పుడుతుంది (శబ్దం) . అదే శబ్ద తన్మాత్రం

కాలమాయాంశయోగేన భగవద్వీక్షితం నభః
నభసోऽనుసృతం స్పర్శం వికుర్వన్నిర్మమేऽనిలమ్

దీని నుంచీ (శబ్ద తన్మాత్రం), ప్రకృతి నుండి, కాలము నుండి ఆకాశం పుట్టింది. ఈ ఆకాశం నుండి స్పర్శ తన్మాత్ర, దాని నుండి వాయువు. వాయువు నుండి రూప తన్మాత్ర. రూప తన్మాత్ర నుండి అగ్ని. అగ్ని నుండి రస తన్మాత్ర. దాని నుండి గంధ తన్మాత్ర. గంధ తన్మాత్ర నుండి భూమి పుడుతుంది.
పంచ్భూతములను గుర్తించడానికి వాటి గుణములే ప్రథాన కారణాలు. వీటినే విషయములూ ప్రమాణములూ గుణములూ అంటాము. ఈ గుణములు ద్రవ్యముకు ఉంటాయి. గుణము లేకుండా ఏ ద్రవ్యమూ (పృధ్వీ, అప్, తేజ...) ఉండదు
ఈ పంచభూతములకు ఆది తామసాహంకారం. ఈ తన్మాత్రే వికారం చెంది వాయువును సృష్టించినది.

అనిలోऽపి వికుర్వాణో నభసోరుబలాన్వితః
ససర్జ రూపతన్మాత్రం జ్యోతిర్లోకస్య లోచనమ్

ఈ వాయువు కూడా వికారం చెంది రూప తన్మాత్రం పుట్టింది.
ఆ రూప తన్మాత్ర నుండి వచ్చేది అగ్ని. సకల ప్రపంచానికి ఇది నేత్రం. ఆ అగ్ని వికారం చెంది దాని మీద పరమాత్మ దృష్టి పడినపుడు రస తన్మాత్ర ఏర్పడింది. దాని నుంచి కాల మాయ అంశ (సంకల్పం) తోటి జలం ఏర్పడింది

అనిలేనాన్వితం జ్యోతిర్వికుర్వత్పరవీక్షితమ్
ఆధత్తామ్భో రసమయం కాలమాయాంశయోగతః
జ్యోతిషామ్భోऽనుసంసృష్టం వికుర్వద్బ్రహ్మవీక్షితమ్
మహీం గన్ధగుణామాధాత్కాలమాయాంశయోగతః

అగ్ని జలముల యొక్క కలయికతో ఏర్పడి, పరమాత్మ సంకల్పంతో వికారం చెంది గంధ తన్మాత్ర ఏర్పడింది, దానినుంచి కాల మాయ అంశల వలన భూమి ఏర్పడింది.

భూతానాం నభఆదీనాం యద్యద్భవ్యావరావరమ్
తేషాం పరానుసంసర్గాద్యథా సఙ్ఖ్యం గుణాన్విదుః

దేని నుండి పుడుతున్నదో దాని గుణాన్ని కూడా తీసుకుని పుడుతున్నది. శబ్దం గుణం గా కలిగిన ఆకాశం నుండి స్పర్శ పుట్టిందంటే వాయువులో స్పర్శా, శబ్దమూ రెండూ ఉన్నాయి. దేని నుంచి ఏది వస్తోందో దానిలో ఉన్న గుణాలను కూడా తీసుకుని వస్తున్నది (తేషాం పరానుసంసర్గాద్). ప్రథానం సగ భాగం, మిగతా నాలుగు కలిసి సగభాగం ఉంటాయి. దీన్నే పంచీకరణం అంటారు.

ఏతే దేవాః కలా విష్ణోః కాలమాయాంశలిఙ్గినః
నానాత్వాత్స్వక్రియానీశాః ప్రోచుః ప్రాఞ్జలయో విభుమ్

వీటినే దేవతలూ అంటారు (ఇంద్రియాధిష్టాన దేవతలు) , ఇవన్నీ పరమాత్మ అంశలే. ఈ తత్వములు చాలా ఉండి, తమ పని తాము చేసుకోగల శక్తి లేనందున, ఈ దేవతలందరూ చేతులు జోడించి పరమాత్మను స్తోత్రం చేస్తున్నారు.

దేవా ఊచుః
నమామ తే దేవ పదారవిన్దం ప్రపన్నతాపోపశమాతపత్రమ్
యన్మూలకేతా యతయోऽఞ్జసోరు సంసారదుఃఖం బహిరుత్క్షిపన్తి

దేవా! ఆశ్రయించినవారి తాపం తొలగించే నీ పాదపద్మములకు నమస్కరిస్తున్నాము. ఏ పాదాన్ని ఆశ్రయించిన యతులు గొప్పదైన సంసార మహాదుఃఖాన్ని అవతల విసిరివేస్తున్నారు, నీ దయ వలన.

ధాతర్యదస్మిన్భవ ఈశ జీవాస్తాపత్రయేణాభిహతా న శర్మ
ఆత్మన్లభన్తే భగవంస్తవాఙ్ఘ్రి చ్ఛాయాం సవిద్యామత ఆశ్రయేమ

స్వామీ, ఈ సంసారములో పుట్టిన జీవులు ఆధ్యాత్మిక ఆఇభౌతిక ఆదిదైవిక తాపములతో కొట్టబడి సుఖమునూ శుభమునూ పొందలేకపోతున్నారు.. నీ సంకల్పం లేకుండా శుభాన్ని సుఖాన్ని పొందలేము కాబట్టి నీ పదాలను ఆశ్రయిస్తున్నాము

మార్గన్తి యత్తే ముఖపద్మనీడైశ్ఛన్దఃసుపర్ణైరృషయో వివిక్తే
యస్యాఘమర్షోదసరిద్వరాయాః పదం పదం తీర్థపదః ప్రపన్నాః

నీ పాదపద్మాల చాయనుండే ఋషులు కూడా సకల వేదార్థాలు వెతుకుతారు.
మన పాపాన్ని తొలగించేది గంగ. ఈ గంగ పరమాత్మ పాదం నుండి పుట్టింది. అందుకే నీ పాదానికి తీర్థపదం (పరిశుద్దమైన పాదం) అని పేరు

యచ్ఛ్రద్ధయా శ్రుతవత్యా చ భక్త్యా సమ్మృజ్యమానే హృదయేऽవధాయ
జ్ఞానేన వైరాగ్యబలేన ధీరా వ్రజేమ తత్తేऽఙ్ఘ్రిసరోజపీఠమ్

అందుకు మనమందరమూ కలిసి శ్రద్ధతోటి, శాస్త్రజ్ఞ్యానంతో కూడిన భక్తితో ఈ విషయాన్ని హృదయంలో నిలుపుకుని, పరమాత్మ యందు జ్ఞ్యానమూ, వైరాగ్య బలముతో, ధీరత్వముతో (ఎన్ని కలిగినా వికారము కలగని స్థితి ధీరత్వం ) నీ పాద పద్మ పీఠమును ఇందుకే మేము ఆశ్రయిస్తున్నాము.

విశ్వస్య జన్మస్థితిసంయమార్థే కృతావతారస్య పదామ్బుజం తే
వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్ఛత్యభయం స్వపుంసామ్

సకల చరాచర సృష్టి స్థితి లయములను చేసే నీ పాదములను, ఏ పాదములను తలచుకుంటే మానవులకు అభయం కలుగుతుందో, అట్టి నీ పాదపద్మములను శరణు వేడుతున్నాము.

యత్సానుబన్ధేऽసతి దేహగేహే మమాహమిత్యూఢదురాగ్రహాణామ్
పుంసాం సుదూరం వసతోऽపి పుర్యాం భజేమ తత్తే భగవన్పదాబ్జమ్

శరీరంలో నేను అని, ఈ ఇల్లు నాది అని, పూర్వ సంస్కార వాసనలతో లేని శరీరం మీద లేని ఇంటి మీదా నేనూ నాదీ అనే భావన్ పాతుకుపోయి, అలాంటివారు ఎంతగా నీ దగ్గరకి రావాలనుకున్నా వారికీ నీకూ చాలా దూరము. శరీరములో ఉండే ఆత్మనే చూడని వారు ఆత్మలో ఉండే పరమాత్మను చూడజాలరు. అందుకే నీదగ్గరకి చేర్చే నీ పాదపద్మములను నిరంతర్మూ స్మరిస్తాము

తాన్వై హ్యసద్వృత్తిభిరక్షిభిర్యే పరాహృతాన్తర్మనసః పరేశ
అథో న పశ్యన్త్యురుగాయ నూనం యే తే పదన్యాసవిలాసలక్ష్యాః

మా ఇంద్రియములు అసత్వృత్తులు (మంచివాటి వెంట పడనివి),అవి ఎప్పుడు ఎదుటివారికే, శత్రువులకే సహాయం చేస్తాయి. ఇవి శత్రువులని ఆకర్షిస్తాయి. లోపల దాగి ఉన్న నిన్ను చూడలేకపోతున్నారు

పానేన తే దేవ కథాసుధాయాః ప్రవృద్ధభక్త్యా విశదాశయా యే
వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం యథాఞ్జసాన్వీయురకుణ్ఠధిష్ణ్యమ్

పరమాత్మా! నీ పాద న్యాసం వలన ఏర్పడే శోభ, మహిమను దగ్గర్లో ఉండి కూడా చూడలేకపోతున్నారు. ఇక్కడే ఉండి నీ కథలని మాటి మాటికీ గానం చేస్తే , వింటూ ఉంటే, భక్తి పెరుగుతుంది, దాని వలన మనసు పరిశుద్దమవుతుంది. అలాంటి వారు వైరాగ్యసారమైన జ్ఞ్యానమునూ తత్వమునూ తెలుసుకుని నీ లోకాన్ని వైకుంఠాన్ని చేరుతారు

తథాపరే చాత్మసమాధియోగ బలేన జిత్వా ప్రకృతిం బలిష్ఠామ్
త్వామేవ ధీరాః పురుషం విశన్తి తేషాం శ్రమః స్యాన్న తు సేవయా తే
తత్తే వయం లోకసిసృక్షయాద్య త్వయానుసృష్టాస్త్రిభిరాత్మభిః స్మ
సర్వే వియుక్తాః స్వవిహారతన్త్రం న శక్నుమస్తత్ప్రతిహర్తవే తే

మరికొందరు సమాధితోటి తపస్సుతోటి యోగముతో ప్రకృతిని జయించి కష్టపడి నిన్ను చేరతారు. కానీ వారికి శ్రమ ఎక్కువ తప్ప ఫలితం అంతగా ఉండదు. మేమందరమూ లోకాలను సృష్టించాలన్న నీ కోరిక చేత సృష్టించబడ్డాము. అందర కలిసాం గానీ నీవనుకున్నటువంటి సృష్టి చేయడానికి సమర్ధులం కాము.

యావద్బలిం తేऽజ హరామ కాలే యథా వయం చాన్నమదామ యత్ర
యథోభయేషాం త ఇమే హి లోకా బలిం హరన్తోऽన్నమదన్త్యనూహాః

మాకు నీవు శక్తినిస్తే మేము సృష్టి చేస్తాము. అన్నమదామ - మేము అన్నం తింటాము. నీవు మాకిచ్చినదానితో మేమూ తింటామూ, నీకూ పెడతాము. బలిం తేऽజ హరామ - నీకూ అన్నం పెడతాము. నీవు మాకించ్చినదే కొంత నీకు పెట్టి మేము కొంత తింటాము. ఏ ఏ సమయంలో ఏ ఏ పూజ నీకు చేయాలో అది చేస్తాము. మాలాగే ఈ లోకం కూడా నీకు పూజా చేయాలీ, తామూ తినాలి. భగవంతునికి పూజ చేసిన తరువాతే పరమాత్మకు పెట్టి మనం తినాలి. ఎలాంటి విఘ్నం లేకుండా నిన్ను ఆరాధిస్తారు. నీవిచ్చిన అన్ని భోగాలూ అనుభవిస్తారు.

త్వం నః సురాణామసి సాన్వయానాం కూటస్థ ఆద్యః పురుషః పురాణః
త్వం దేవ శక్త్యాం గుణకర్మయోనౌ రేతస్త్వజాయాం కవిమాదధేऽజః

నీవు సకల చరాచర ప్రపంచానికి నీవే కూటస్థుడవు (మొట్టమొదటి వాడవు), ఎలాంటి వికారమూ చెందని వాడవు, (నాశము లేదు, తరగదు, వికారమూ చెందడు, పెరుగదు, మారదు - వీటిని కూటస్థం అంటారు)
నీవు ఈ ప్రకృతి యందు నీ శక్తిని నిక్షేపింప చేసావు. నీ రేతస్సు వలన మేమందరం ఆవిర్భవించాము. పుట్టిన మేము ఏమీ చేయలేము

తతో వయం మత్ప్రముఖా యదర్థే బభూవిమాత్మన్కరవామ కిం తే
త్వం నః స్వచక్షుః పరిదేహి శక్త్యా దేవ క్రియార్థే యదనుగ్రహాణామ్

నీవు ఈ ప్రకృతి యందు నీ శక్తిని నిక్షేపింప చేసావు. నీ రేతస్సు వలన మేమందరం ఆవిర్భవించాము. పుట్టిన మేము ఏమీ చేయలేము . నీ కళ్ళని మాకిస్తే మేము చూస్తాము, నీవనుకున్నదానిని చేస్తాము. జ్ఞ్యానమునూ శక్తినీ మాకు ప్రసాదించు. అని ఇద్రియాధిష్టాన దేవతలు పరమాత్మను స్తోత్రం చ్

Wednesday, January 2, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం నాలుగవ అధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం నాలుగవ అధ్యాయం

ఉద్ధవ ఉవాచ
అథ తే తదనుజ్ఞాతా భుక్త్వా పీత్వా చ వారుణీమ్
తయా విభ్రంశితజ్ఞానా దురుక్తైర్మర్మ పస్పృశుః

వారిచే అనుజ్ఞ్య పొంది తిని, మద్యపానం బాగా చేసి, తద్వారా వారి జ్ఞ్యానం పోయి, వారు వీరు అన్న భేధం పోయి ఒకరినొకరు నిందించుకున్నారు

తేషాం మైరేయదోషేణ విషమీకృతచేతసామ్
నిమ్లోచతి రవావాసీద్వేణూనామివ మర్దనమ్

మద్యపానంతో వారి మనసంతా విషమయి పోయింది. సూర్యుడు అస్తమించిన తరువాత వెదురుబొంగుల పొదకు ఒరిపిడిలాగ జరిగింది

భగవాన్స్వాత్మమాయాయా గతిం తామవలోక్య సః
సరస్వతీముపస్పృశ్య వృక్షమూలముపావిశత్

పరమాత్మ ఆయన మాయను ఆయనే వీక్షించాడు. సరస్వతీ నదిలో స్నానం చేసి కూర్చున్నాడు

అహం చోక్తో భగవతా ప్రపన్నార్తిహరేణ హ
బదరీం త్వం ప్రయాహీతి స్వకులం సఞ్జిహీర్షుణా

అప్పుడు నాతో "నీవు బదరికాశ్రమం పో"మ్మని చెప్పాడు.

తథాపి తదభిప్రేతం జానన్నహమరిన్దమ
పృష్ఠతోऽన్వగమం భర్తుః పాదవిశ్లేషణాక్షమః
అలా చెప్పిన స్వామి మనసులో ఉన్న అభిప్రాయాన్ని అర్థం చేసుకున్న నేను ఆయన పాదాల ఎడబాటుని సహించలేక ఆయన వెంటనే వెళ్ళాను.
అద్రాక్షమేకమాసీనం విచిన్వన్దయితం పతిమ్
శ్రీనికేతం సరస్వత్యాం కృతకేతమకేతనమ్
ఒంటిగా కూర్చున్నాడు స్వామి. అలాంటి స్వామిని చూచాను. ఏ నివాసం లేనివాడు ఒక చెట్టు మూలని నివాసంగా ఉంచుకున్నాడు.
శ్యామావదాతం విరజం ప్రశాన్తారుణలోచనమ్
దోర్భిశ్చతుర్భిర్విదితం పీతకౌశామ్బరేణ చ

ఎలాంటి దోషం లేనివాడు, అరుణ వర్ణమైన కనుల అంచు గలవాడు, నాలుగు భుజాలతో చతుర్భుజునిగా పీతాంబరంతో ఉన్నాడు.

వామ ఊరావధిశ్రిత్య దక్షిణాఙ్ఘ్రిసరోరుహమ్
అపాశ్రితార్భకాశ్వత్థమకృశం త్యక్తపిప్పలమ్

కుడి పాదాన్ని ఎడమ తొడ మీద ఉంచుకున్నాడు. ఎప్పుడు అశ్వద్ధ వృక్షాన్ని ఆశ్రయించకుండా ఉండని వాడు, దాన్ని ఆశ్రయించకుండా దూరంగా ఉన్నాడు. ఆ అశ్వద్ధ వృక్షం (రావి చెట్టు) చిన్న మొక్కలాగ ఉన్నది.  దాని మూలంలో దక్షిణ పాదాన్ని వామ ఊరువు మీద అధిస్టింపచేసి, దాని ఆకులమీదకు మాత్రం పోనివ్వలేదు. (  ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షమ్ పరి షస్వజాతే |
  తయోర్ అన్యః పిప్పలం స్వాద్వ్ అత్త్య్ అనశ్నన్న్ అన్యో అభి చాకశీతి || 1-164-20 ఋగ్వేదము - మండలము 1 - సూక్తము 164: ఒకే రావి చెట్టు మీద రెండు పక్షులు ఉన్నాయి. రెండూ మిత్రులే, ఒకలాగే ఉంటాయి. ఒక పక్షి చెట్టు ఆకులను తింటూ ఉన్నది. రెండవది ఏమీ తినకుండా మొదటి దానికన్నా ఆనందముగా ఉంటుంది. ఆ రావి ఆకులు కర్మ ఫలములు. పరమాత్మ అన్ని ఫలములూ విడిచిపెట్టినవాడు)

తస్మిన్మహాభాగవతో ద్వైపాయనసుహృత్సఖా
లోకాననుచరన్సిద్ధ ఆససాద యదృచ్ఛయా

ఇలా కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని చాలించుకోబోతున్న తరుణంలో అన్ని దేశములనూ ప్రాంతములనూ సంచరిస్తూ వ్యాసభగవానుని సహాధ్యాయి, మిత్రుడు అయిన మైత్రేయుడు అక్కడికి వచ్చాడు

తస్యానురక్తస్య మునేర్ముకున్దః ప్రమోదభావానతకన్ధరస్య
ఆశృణ్వతో మామనురాగహాస సమీక్షయా విశ్రమయన్నువాచ

సాహటాంగపడి నమస్కరించి స్వామి పక్కన కూర్చున్నాడు. పక్కన కూర్చున్న మైత్రేయ్డు వినేట్లుగా నాతో మాట్లాడాడు.

శ్రీభగవానువాచ
వేదాహమన్తర్మనసీప్సితం తే దదామి యత్తద్దురవాపమన్యైః
సత్రే పురా విశ్వసృజాం వసూనాం మత్సిద్ధికామేన వసో త్వయేష్టః
స ఏష సాధో చరమో భవానామాసాదితస్తే మదనుగ్రహో యత్
యన్మాం నృలోకాన్రహ ఉత్సృజన్తం దిష్ట్యా దదృశ్వాన్విశదానువృత్త్యా

అష్టా వసువులలో ఉద్ధవుడు ఒకడు. కృష్ణుడు ఇలా అన్నాడు "నీ మనసులో ఏమున్నదో నాకు తెలుసు. దాన్ని సామాన్యంగా ఇతరులు పొందలేరు. దాన్ని నేను నీకు ఇస్తాను. పూర్వము వసువులూ ప్రజాపతులందరూ కలిసి ఒక యజ్ఞ్యం చేసారు. దానిలో నీవు ఒక్కడివి మాత్రం నన్ను పొందాలని చేసావు. నా దయ వలన నీ జన్మలలో ఇదే చివరిది అవుతుంది. భూలోకాన్ని వదిలిపెట్టి వెడుతున్న నన్ను చూచే భాగ్యం నీకు కలిగింది. అది నా అనుగ్రహం "

పురా మయా ప్రోక్తమజాయ నాభ్యే పద్మే నిషణ్ణాయ మమాదిసర్గే
జ్ఞానం పరం మన్మహిమావభాసం యత్సూరయో భాగవతం వదన్తి

నా మొదటి సృష్టిలో నా నాభి నుంచి పుట్టిన బ్రహ్మకు నా మహిమను తెలియజేసే జ్ఞ్యానముని చెప్పాను, దానినే అందరూ భాగవతమంటారు.

ఇత్యాదృతోక్తః పరమస్య పుంసః ప్రతిక్షణానుగ్రహభాజనోऽహమ్
స్నేహోత్థరోమా స్ఖలితాక్షరస్తం ముఞ్చఞ్ఛుచః ప్రాఞ్జలిరాబభాషే

ఇలా స్వామి చెబుతుంటే ప్రతీ క్షణం పరమాత్మ మీద ప్రేమతో పులకింతలు వచ్చి అక్షరాలు తడబడుతూ, కళ్ళనీరు రాగా, ఇలా నేను మాట్లాడాను

కో న్వీశ తే పాదసరోజభాజాం సుదుర్లభోऽర్థేషు చతుర్ష్వపీహ
తథాపి నాహం ప్రవృణోమి భూమన్భవత్పదామ్భోజనిషేవణోత్సుకః

నీ అనుగ్రహాన్ని పొందిన వాడికి ఏ పురుషార్థం పొందరానిది? నిజమైన నీ భక్తులు నిన్ను తప్ప ఇంకే పురుషార్థాన్ని కోరరు. నేను నీ పాద సేవ తప్ప ఏమీ కోరట్లేదు.

కర్మాణ్యనీహస్య భవోऽభవస్య తే దుర్గాశ్రయోऽథారిభయాత్పలాయనమ్
కాలాత్మనో యత్ప్రమదాయుతాశ్రమః స్వాత్మన్రతేః ఖిద్యతి ధీర్విదామిహ

దీన్నే విరోదాభాసం అంటారు. నీవన్ని పనులూ చేస్తున్నావు. మానవులు ఒక దాన్ని కోరి పనులు చేస్తారు. కానీ నీవు ఏ కోరిక లేకుండా పనులు చేస్తున్నావు. పుట్టుకలేని నీవు పుడుతున్నావు. శత్రుభయంతో దుర్గంలో దాక్కున్నావు. నీవే కాలుడవు. నీవు ఆత్మా రాముడవు. అయినా పదహారువేల మంది స్త్రీలతొ విహరించావు. పరమజ్ఞ్యానులకు కూడా ఇది తలచుకుంటే మనసు కలత చెందుతుంది

మన్త్రేషు మాం వా ఉపహూయ యత్త్వమకుణ్ఠితాఖణ్డసదాత్మబోధః
పృచ్ఛేః ప్రభో ముగ్ధ ఇవాప్రమత్తస్తన్నో మనో మోహయతీవ దేవ

రాజ్య కార్యములలో క్లిష్ట సమస్యలకు పరిష్కారానికి మంత్రాంగానికి నన్ను పిలిచి నీవడుగుతూ ఉంటే, నిరంతరమూ ఆత్మ తత్వజ్ఞ్యానాన్ని అందించే వాడివి నీవు, నీ అత్మస్వభావాన్ని నీవు మరచిపోవు, అలాంటి నీవు అడుగుతూ ఉంటే , అది చూసి నా మనసు మోహపడుతోంది

జ్ఞానం పరం స్వాత్మరహఃప్రకాశం ప్రోవాచ కస్మై భగవాన్సమగ్రమ్
అపి క్షమం నో గ్రహణాయ భర్తర్వదాఞ్జసా యద్వృజినం తరేమ

నీవు ఆత్మను ప్రకాశించే తత్వాన్ని, బ్రహ్మగారికి చెప్పినదాన్ని వినడానికి నాకు యోగ్యత ఉంటే, అది నేను అర్థం చేసుకోగలవాడినని అనుకుంటే, మీరు అనుగ్రహంతో చెబితే మేము పాపాన్ని తొలగించుకుంటాము.

ఇత్యావేదితహార్దాయ మహ్యం స భగవాన్పరః
ఆదిదేశారవిన్దాక్ష ఆత్మనః పరమాం స్థితిమ్

ఇలా ప్రార్థిస్తే నా ప్రార్థనను మన్నించి పరమాత్మ తన స్వస్వరూపాన్ని నాకు బోధించాడు

స ఏవమారాధితపాదతీర్థాదధీతతత్త్వాత్మవిబోధమార్గః
ప్రణమ్య పాదౌ పరివృత్య దేవమిహాగతోऽహం విరహాతురాత్మా

సోऽహం తద్దర్శనాహ్లాద వియోగార్తియుతః ప్రభో
గమిష్యే దయితం తస్య బదర్యాశ్రమమణ్డలమ్
యత్ర నారాయణో దేవో నరశ్చ భగవానృషిః
మృదు తీవ్రం తపో దీర్ఘం తేపాతే లోకభావనౌ

ఇలా పరమాత్మను చూడటం వలన కలిగే ఆనందాన్ని మరికొంతకాలం పొందే భాగ్యము లేక బాధపడుతున్న నేను నారాయణునికి బాగా ఇష్టమైన బదరికాశ్రమానికి వెళ్తాను. అక్కడ నర నారయణులనే ఋషులు (కలౌ నర నారయాణౌ) ఉంటారు. ఆయనకు చూడకుండా ఉండలేను కాబట్టి.

శ్రీశుక ఉవాచ
ఇత్యుద్ధవాదుపాకర్ణ్య సుహృదాం దుఃసహం వధమ్
జ్ఞానేనాశమయత్క్షత్తా శోకముత్పతితం బుధః

యాదవులంతా తమలో తాము కలహించుకున్నారు, కలహించుకొని వధింపబడ్డారు. వారి వధను వినడం వలన కలిగే దుఖాన్ని శమింపచేసుకున్నాడు.

స తం మహాభాగవతం వ్రజన్తం కౌరవర్షభః
విశ్రమ్భాదభ్యధత్తేదం ముఖ్యం కృష్ణపరిగ్రహే

ఉద్ధవుని మీద ప్రేమతో తెలుసుకోవలసిన విషయాన్ని త్వరగా తెలుసుకోవాలన్న ఆర్తితో కృష్ణుని పొందడానికి ఏది ప్రథాన సాధనమో దాన్ని వివరించమని విదురుడు ఉద్ధవుని కోరాడు.

విదుర ఉవాచ
జ్ఞానం పరం స్వాత్మరహఃప్రకాశం యదాహ యోగేశ్వర ఈశ్వరస్తే
వక్తుం భవాన్నోऽర్హతి యద్ధి విష్ణోర్భృత్యాః స్వభృత్యార్థకృతశ్చరన్తి

యోగేశ్వరుడూ ఈశ్వరుడూ అయిన కృష్ణ పరమాత్మ, జీవత్మ పరమాత్మల రహస్యాని తెలిపే ఏ జ్ఞ్యానాని బోధించాడో, దేన్ని భాగవతం అన్నాడో, అలాంటీ తత్వాన్ని నాకు చెప్పండి
విష్ణు భక్తులు, పరమాత్మ భక్తుల కార్యం చేయడంలోనే తృప్తి పొందుతారు కదా.

ఉద్ధవ ఉవాచ
నను తే తత్త్వసంరాధ్య ఋషిః కౌషారవోऽన్తికే
సాక్షాద్భగవతాదిష్టో మర్త్యలోకం జిహాసతా

పరమాత్మ భూలోకాన్ని విడిచిపెట్టేముందు నిన్నే గుర్తుచేసుకున్నాడు. పరమాత్మే మైత్రేయునికి "ఈ భాగవతం నీవు విదురునికి చెప్పవలసింది" అని ఆజ్ఞ్యాపించాడు.

శ్రీశుక ఉవాచ
ఇతి సహ విదురేణ విశ్వమూర్తేర్గుణకథయా సుధయా ప్లావితోరుతాపః
క్షణమివ పులినే యమస్వసుస్తాం సముషిత ఔపగవిర్నిశాం తతోऽగాత్

ఈ ప్రకారంగా విదురునితో కలిసి పరమాత్మ గుణాలను గానం చేయడం వలన ఆ కథామృతంతో తొలగించబడిన పెద్ద తాపమును తొలగించబడింది.
యముని చెల్లెలి తీరములో (యమునా తీరములో) విదురుడు ఆ రాత్రిని క్షణ కాలంలా గడిపాడు, భగవత్ కథా సుధలో మునిగి.

రాజోవాచ
నిధనముపగతేషు వృష్ణిభోజేష్వధిరథయూథపయూథపేషు ముఖ్యః
స తు కథమవశిష్ట ఉద్ధవో యద్ధరిరపి తత్యజ ఆకృతిం త్ర్యధీశః

ఉద్ధవుడొక్కడే యదువంశంలో ఎలా మిగిలాడు. స్వామి కూడా తన శరీరాన్ని వదిలి పెట్టాడు కదా.

శ్రీశుక ఉవాచ
బ్రహ్మశాపాపదేశేన కాలేనామోఘవాఞ్ఛితః
సంహృత్య స్వకులం స్ఫీతం త్యక్ష్యన్దేహమచిన్తయత్

పరమాత్మ బ్రాహ్మణ శాపమనే మిషతో మొత్తం యాదవ కులం నశింపచేసి తాను కూడా శరీరం విడిచిపెట్టదలచి ఇలా అనుకున్నాడు

అస్మాల్లోకాదుపరతే మయి జ్ఞానం మదాశ్రయమ్
అర్హత్యుద్ధవ ఏవాద్ధా సమ్ప్రత్యాత్మవతాం వరః

"అందరూ వెళ్ళిపోతే నాకు సంబంధించిన జ్ఞ్యానం ఎవరిని ఆశ్రయించి ఉండాలి" అని ఇప్పుడు ఉన్న జ్ఞ్యానంలో ఆత్మజ్ఞ్యానం కలిగిన ఉద్ధవుడే అందుకు అర్హుడు అని తలచాడు

నోద్ధవోऽణ్వపి మన్న్యూనో యద్గుణైర్నార్దితః ప్రభుః
అతో మద్వయునం లోకం గ్రాహయన్నిహ తిష్ఠతు

"నాకంటే కొద్దిగా కూడా తక్కువ గాని వాడు ఉద్ధవుడు ". ఎవరైతే ప్రకృతికి సంబంధించిన సత్వ రజ తమ గుణాలతో పీడించబడడో వాడు (ప్రకృతికి లొంగని వాడు.) భగవానునికి దగ్గర వాడు అవుతాడు. (బాధరాగానే డీలాపడనివాడు, ఆనందం రాగానే పొంగిపోనివాడు). అటువంటి వాడు ఉద్ధవుడు. అందుకే నాకు సంబంధించిన వైకుంఠలోక ప్రభావాన్ని ప్రాప్తి కామనను అడిగినవారికి బోధిస్తూ ఉద్ధవుడు ఇక్కడే ఉండు గాక అని సంకల్పించాడు

ఏవం త్రిలోకగురుణా సన్దిష్టః శబ్దయోనినా
బదర్యాశ్రమమాసాద్య హరిమీజే సమాధినా

అలా సంకల్పించుకుని ఉద్ధవున్ని అక్కడే ఉంచి నర నారయణున్ని సేవించమనని చెప్పాడు

విదురోऽప్యుద్ధవాచ్ఛ్రుత్వా కృష్ణస్య పరమాత్మనః
క్రీడయోపాత్తదేహస్య కర్మాణి శ్లాఘితాని చ

అలాగే సమాధిలో ఉండి పరమాత్మను ఆరాధించడం మొదలు పెట్టాడు

దేహన్యాసం చ తస్యైవం ధీరాణాం ధైర్యవర్ధనమ్
అన్యేషాం దుష్కరతరం పశూనాం విక్లవాత్మనామ్

విదురుడు కూడా ఉద్ధవుని వలన పరమాత్మ లీలలను విని, పరమాత్మ శరీరం వదిలిపెట్టినందుకు ఇంకా ధైర్యం పెంచుకున్నాడు. అజ్ఞ్యానులు, దీనమైన మనసు గలవారు (చిన్న కష్టానికే భయపడేవారు) పరమాత్మ శరీరం వదిలిపెట్టినందుకు భయపడతారు. అటువంటి వారికి శరీరం విడిచిపెట్టడం అనేది మనసుకు కూడా అందదు.

ఆత్మానం చ కురుశ్రేష్ఠ కృష్ణేన మనసేక్షితమ్
ధ్యాయన్గతే భాగవతే రురోద ప్రేమవిహ్వలః

"స్వామి నన్ను తలచుకున్నాడా, ఎంత అదృష్టం!" అని తలచుకుంటూ, ఉద్ధవుడు వెళ్ళిపోగానే, ప్రేమతో పిచ్చివాడిలా ఏడ్చాడు.

కాలిన్ద్యాః కతిభిః సిద్ధ అహోభిర్భరతర్షభ
ప్రాపద్యత స్వఃసరితం యత్ర మిత్రాసుతో మునిః

ఇలా కొంతసేపు రోదించి, ధైర్యాన్ని కూడగట్టుకుని, కొద్ది రోజులలో త్వరగా గంగా తీరానికి చేరుకున్నాడు, అక్కడ మిత్రా సుతుడైన మైత్రేయుడు ఉన్నాడు

Tuesday, January 1, 2013

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం మూడవ అధ్యాయం

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధం మూడవ అధ్యాయం

ఉద్ధవ ఉవాచ
తతః స ఆగత్య పురం స్వపిత్రోశ్చికీర్షయా శం బలదేవసంయుతః
నిపాత్య తుఙ్గాద్రిపుయూథనాథం హతం వ్యకర్షద్వ్యసుమోజసోర్వ్యామ్

రాసలీల తరువాత తన తల్లి తండ్రులకు శుభమూ మంగళమూ కలిగించాలన్న కోరికతో మధురా పురానికి వచ్చాడు. వచ్చినవాడు అప్పటికే చైంపోయిన వాడైన కంసుని లాగాడు.

సాన్దీపనేః సకృత్ప్రోక్తం బ్రహ్మాధీత్య సవిస్తరమ్
తస్మై ప్రాదాద్వరం పుత్రం మృతం పఞ్చజనోదరాత్

సాందీపని నుండి ఒక సారి చెప్పిన వేదాన్ని నేర్చున్నాడు. ఆ గురువుగారికి పంచజన్యుని ఉదరాన్నుంచి పాంచజన్యం సాధించి, వారి గురువుగారి కుమారున్ని కూడా తెచ్చాడు

సమాహుతా భీష్మకకన్యయా యే శ్రియః సవర్ణేన బుభూషయైషామ్
గాన్ధర్వవృత్త్యా మిషతాం స్వభాగం జహ్రే పదం మూర్ధ్ని దధత్సుపర్ణః

రుక్మిణిని పొందాలని వచ్చిన చాలా మంది రాజులందరూ చూస్తూ ఉండగా శత్రువుల శిరస్సు మీద పాదం ఉంచి ఆమెను గాంధర్వ విధిగా వివాహం చేసుకున్నాడు (వధువూ వరుడూ యొక్క సమ్మతంతో పంచభూతాల సాక్షిగా చేసుకునేది గాంధర్వం). ఆ విధంగా తన భాగం తాను తీసుకున్నాడు

కకుద్మినోऽవిద్ధనసో దమిత్వా స్వయంవరే నాగ్నజితీమువాహ
తద్భగ్నమానానపి గృధ్యతోऽజ్ఞాఞ్జఘ్నేऽక్షతః శస్త్రభృతః స్వశస్త్రైః

నాగ్నజితిని (నగ్నజిత్ కుమార్తే) కూడా వివాహం చేసుకున్నాడు, బలమైన ముకుతాడు వేయని కోడెలను జయించి స్వయంవరంలో వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకునాదమని చాలమంది వచ్చారు.ఆ ఆశతో అందరూ కలిసి కృష్ణుడి మీదకు దండెత్తి వచ్చారు. అస్త్రాలతో వచ్చిన వారిని తన ఆయుధములతో తాను కొట్టబడకుండా వారందరినీ సంహరించాడు.

ప్రియం ప్రభుర్గ్రామ్య ఇవ ప్రియాయా విధిత్సురార్చ్ఛద్ద్యుతరుం యదర్థే
వజ్ర్యాద్రవత్తం సగణో రుషాన్ధః క్రీడామృగో నూనమయం వధూనామ్

ఎలా అయితే పామరుడు ప్రియురాలికి విధేయుడై ఆమె చెప్పిన పనులు చేస్తాడో సత్యభామ కోసం స్వర్గంలో ఉన్న పారిజాత వృక్షాన్ని తీసుకున్నాడు. ఇంద్రుడు కోపముతో గుడ్డివాడై తన సైన్యంతో కలిసి యుద్ధానికి వచ్చాడు. త్రైలోక్యనాధుడైన ఇంద్రుడు కూడా తన భార్యకు వశుడే అని చూపడానికి స్వామి ఈ లీల చేసాడు. స్వామి ఏ పని చేసినా మనకి పాపం రాకుండా చేస్తాడు. పెద్దలు ఇంటికి వచ్చినపుడు వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవచేసి సత్కారం చేయాల్సిన బాధ్యత గృహస్తుది. అలా చేయని పాపం తప్పించడానికి స్వామి ఈ పని చేసాడని పెద్దల వ్యాఖ్యానం. ఈ లోకమంతా ఏరు దాటాక తెప్ప తగలేసే వారే అని చెప్పేందుకు కూడా ఈ లీల చేసి ఉండవచ్చు. లేక అందరూ భార్యా దాసులే అని చెప్పేందుకు కూడా ఈ లీలను అన్వయించుకోవచ్చు.

సుతం మృధే ఖం వపుషా గ్రసన్తం దృష్ట్వా సునాభోన్మథితం ధరిత్ర్యా
ఆమన్త్రితస్తత్తనయాయ శేషం దత్త్వా తదన్తఃపురమావివేశ

భూమి తన కుమారుడిని, ఆకాశాన్ని ఆవరించి "నేను ఇంత బాలాడ్యున్ని" అని గర్విస్తున్న నరకున్ని సంహరించినందుకు (నరకునికి కుజ అని పేరు. కు అంటే భూమి) ఆ నరకుని కొడుకుకు రాజ్యం ఇవ్వవలసిందని యాచిస్తే, అతని కుమారునికి మిగిలి ఉన్న రాజ్యం ఇచ్చి, తన మనువడి అభ్యర్థన మేరకు అంతఃపురానికి వేంచేసిన శ్రీకృష్ణుడు అక్కడ బంధించబడి ఉన్న పదుహారువేలమందీ

తత్రాహృతాస్తా నరదేవకన్యాః కుజేన దృష్ట్వా హరిమార్తబన్ధుమ్
ఉత్థాయ సద్యో జగృహుః ప్రహర్ష వ్రీడానురాగప్రహితావలోకైః

ఆసాం ముహూర్త ఏకస్మిన్నానాగారేషు యోషితామ్
సవిధం జగృహే పాణీననురూపః స్వమాయయా

తాస్వపత్యాన్యజనయదాత్మతుల్యాని సర్వతః
ఏకైకస్యాం దశ దశ ప్రకృతేర్విబుభూషయా

సంతోషంతో సిగ్గుతో ప్రేమతో స్వామిని భర్తగా స్వీకరించారు. అంతమందినీ అన్ని రూపాలలో ఒకే సమయానికే వివాహం చేసుకున్నాడు. ప్రతీ రూపానికి తగ్గట్టుగా ఒక అనురూపాని సృష్టించుకొని  వివాహం చేసుకున్నాడు. తన మాయతో పదిమంది పుత్రులని కన్నాడు

కాలమాగధశాల్వాదీననీకై రున్ధతః పురమ్
అజీఘనత్స్వయం దివ్యం స్వపుంసాం తేజ ఆదిశత్

కాలయవనుడు జరాసంధుడు వంటి రాక్షసులను వధించాడు

శమ్బరం ద్వివిదం బాణం మురం బల్వలమేవ చ
అన్యాంశ్చ దన్తవక్రాదీనవధీత్కాంశ్చ ఘాతయత్

కొందరిని చంపాడు కొందరిని చంపించాడు

అథ తే భ్రాతృపుత్రాణాం పక్షయోః పతితాన్నృపాన్
చచాల భూః కురుక్షేత్రం యేషామాపతతాం బలైః

అన్నదమ్ములూ, వారి పిల్లలూ కలిసి "నా రాజ్యం నా భూమి" అనుకున్న వారిని పరివారంతో కలిసి ధ్వంసం చేసాడు. ఆ సైన్య పదఘట్టాలకు భూమి కంపించింది.

స కర్ణదుఃశాసనసౌబలానాం కుమన్త్రపాకేన హతశ్రియాయుషమ్
సుయోధనం సానుచరం శయానం భగ్నోరుమూర్వ్యాం న ననన్ద పశ్యన్

దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునుల దురాలోచనను ఆమోదించడం వలన వారి సంపదా, ఆయుష్షు క్షీణమయ్యింది. దాని పరిణామమే దుర్యోధనుడు తొడలు విరిగి భూమి మీద పడి ఉన్నాడు. అలా పడి ఉన్నవాడిని చూసి కూడా శ్రీకృష్ణుడు సంతోషించలేదు.

కియాన్భువోऽయం క్షపితోరుభారో యద్ద్రోణభీష్మార్జునభీమమూలైః
అష్టాదశాక్షౌహిణికో మదంశైరాస్తే బలం దుర్విషహం యదూనామ్

ఇంత కష్టపడినా భూమి భారం పూర్తిగా తగ్గలేదని భావించాడు.

మిథో యదైషాం భవితా వివాదో మధ్వామదాతామ్రవిలోచనానామ్
నైషాం వధోపాయ ఇయానతోऽన్యో మయ్యుద్యతేऽన్తర్దధతే స్వయం స్మ

మిగిలిన వారిలో, వారిలో వారికే కలహం వచ్చేట్లు చేసాడు. తమలో తాము కొట్టుకోవాలంటే తమను తాము మరచిపోవాలి. మధుపానంతో కళ్ళతో బాటు మనసు కూడా ఎర్రబారింది. అంతకన్న వారిని వధించడానికి వేరొక ఉపాయం లేదు. ఆయన స్వలోకాని వెళ్ళే లోపే ఈ పని జరగాలనుకున్నాడు.

ఏవం సఞ్చిన్త్య భగవాన్స్వరాజ్యే స్థాప్య ధర్మజమ్
నన్దయామాస సుహృదః సాధూనాం వర్త్మ దర్శయన్

ఇలా ధర్మరాజుని రాజ్యంలో ఉంచి, సజ్జన మార్గాన్ని నిర్దేశిస్తూ మిత్రులకి ఆనందం కలిగిస్తూ, అభిమన్య వీర్య నిక్షేపమైన ఉత్తాగర్భాన్ని అశ్వద్దాం అస్త్రాన్నుంచి కాపాడాడు

ఉత్తరాయాం ధృతః పూరోర్వంశః సాధ్వభిమన్యునా
స వై ద్రౌణ్యస్త్రసమ్ప్లుష్టః పునర్భగవతా ధృతః

అయాజయద్ధర్మసుతమశ్వమేధైస్త్రిభిర్విభుః
సోऽపి క్ష్మామనుజై రక్షన్రేమే కృష్ణమనువ్రతః

ధర్మరాజుతో మూడు అశ్వమేధాలను చేయించాడు. కృష్ణున్ని అనుసరించి ధర్మరాజు ఆనందముగా ఉన్నాడు

భగవానపి విశ్వాత్మా లోకవేదపథానుగః
కామాన్సిషేవే ద్వార్వత్యామసక్తః సాఙ్ఖ్యమాస్థితః

భగవానుడైన కృష్ణుడు కూడా లోక మార్గాన్ని వేద మార్గాన్ని అనుసరించినవాడై ద్వారకా నగరములో సకల కామభోగాలను అసక్తుడై జ్ఞ్యానమార్గంలో ఉండి అనుభవించాడు

స్నిగ్ధస్మితావలోకేన వాచా పీయూషకల్పయా
చరిత్రేణానవద్యేన శ్రీనికేతేన చాత్మనా

స్నేహం తొణికిసలాడే చిరునవ్వుతో కూడిన చూపుతో, అమృతం వంటి వాక్కుతో, ఏ మాత్రం దోషానికి ఆస్కారం లేని నడవడితో అమ్మవారికి నివాసమైన శరీరంతో

ఇమం లోకమముం చైవ రమయన్సుతరాం యదూన్
రేమే క్షణదయా దత్త క్షణస్త్రీక్షణసౌహృదః

ఈ లోకాన్ని పై లోకాన్ని ఆనందింపచేస్తూ, యాదవులకు ఇంకా ఆనందం కల్గింపచేస్తూ , క్షణికమైన సుఖాన్నిచ్చేది (క్షణద, రాత్రికి కూడా క్షణదా అని పేరు) ఈయబడిన క్షణకాలమైన స్త్రీయొక్క చూపుచేత తెలియబడే ప్రేమకలవాడు. అందరిలో తాను ఒకడిగా విహరించాడు

తస్యైవం రమమాణస్య సంవత్సరగణాన్బహూన్
గృహమేధేషు యోగేషు విరాగః సమజాయత
దైవాధీనేషు కామేషు దైవాధీనః స్వయం పుమాన్
కో విశ్రమ్భేత యోగేన యోగేశ్వరమనువ్రతః

గృహస్తు ఆచరించిన కర్మలయందు విరక్తి పుట్టి, లోకంలో కోరికలు కలుగుట, వాటి యందు విరక్తి పొందుట అనేది దైవాదీనములే కాబట్టి, ఆయన కూడా దైవాధీనుడు కాబట్టి, ప్రపంచంలో యోగీశ్వరుడు తప్ప ఈ సంసారంలో విరక్తి ఎవరికీ కలగదు అని

పుర్యాం కదాచిత్క్రీడద్భిర్యదుభోజకుమారకైః
కోపితా మునయః శేపుర్భగవన్మతకోవిదాః

ఇలా విరక్తి పుట్టి పరమాత్మ వెళ్ళాలనుకుంటున్నందు వలన, ఆయన సంకల్పం వలన, మునులు ముసలం పుడుతుంది అని శపించారు.

తతః కతిపయైర్మాసైర్వృష్ణిభోజాన్ధకాదయః
యయుః ప్రభాసం సంహృష్టా రథైర్దేవవిమోహితాః

కొంతకాలం తరువాత ఒక గ్రహణ సమయంలో దైవం చేత మోహించబడి వృష్ణి బోజ అంధక యదు కులం వారందరూ ప్రభాస తీర్థానికి వెళ్ళారు

తత్ర స్నాత్వా పిత్న్దేవానృషీంశ్చైవ తదమ్భసా
తర్పయిత్వాథ విప్రేభ్యో గావో బహుగుణా దదుః

అక్కడ స్నానం చేసి దేవతలనూ పితృదేవతలకూ తర్పణం చేసి బ్రాహ్మణులకు దానం చేసి

హిరణ్యం రజతం శయ్యాం వాసాంస్యజినకమ్బలాన్
యానం రథానిభాన్కన్యా ధరాం వృత్తికరీమపి

బంగారమూ, శయనము, కన్యలు, భూములూ, అన్నమూ అన్నీ దానం చేసి

అన్నం చోరురసం తేభ్యో దత్త్వా భగవదర్పణమ్
గోవిప్రార్థాసవః శూరాః ప్రణేముర్భువి మూర్ధభిః

సాష్టాంగపడి వారికి తలలు వంచి నమస్కరించారు. ఇవన్నీ లాంఛనంగా చేసారు.  తరువాత వారు చేసుకోబోయే విందూ విహారాలకోసం చేసారు.